అంతా తలో విధంగానూ అంటున్నారు. వెరసి ఒక్కటే మాట.” మనకీ సంబంధం వద్దే వద్దు .ఇప్పటికైనా తెలిసింది. సంతోషం” అని .తర్వాత ఆడపెళ్ళివారి రాయబారాలు, ఆఖర్లో హంసరాయబారం.
భాస్కర్ తల బలంగా విదిల్చాడు. ఆలోచిస్తున్న కొద్దీ ఎడతెరిపి లేకుండా ఉంది .ఇంట్లోకి వెళ్ళాడు. తల్లి వంటింట్లో ఉంది. “రేపు నేను వెళ్లి జాయినైపోతానమ్మా!” అన్నాడు. “నీ ఇష్టం “అంది ఆవిడ ఉదాసీనంగా. వాళ్లిద్దరికీ మధ్య ఇంకా సత్సంబంధాలు పునరుద్ధరించబడలేదు.
ఒక్క కొడుకు, ఒక్క కూతురు తమకి. కొడుకు పెళ్లిమీద, కోడలిమీద ఎన్ని ఆశలు పెట్టుకుందో! ఎన్ని కలలు కన్నదో!ఆ పెళ్లి అపహాస్యమై నలుగుర్లో తలెత్తుకోలేకుండా అయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎందుకని అడుగుతున్నారు. కారణం కూడా చెప్పుకోలేని పరిస్థితి. అందుకే భాస్కర్ మీద అంత కోపం.
…
ఏదో జరుగుతుందని ఆశగా ఎదురుచూసిన ఈశ్వరరావు పోస్టులో వచ్చిన డివోర్స్ పేపర్లు చూసి ఖిన్నుడయ్యాడు.కమ్చీ దెబ్బతిన్నట్టు విలవిల లాడాడు. బంధం తెగకుండా ఉంటే ఎప్పటికైనా పునరుద్ధరించబడుతుందన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ ఇంక లేదు. పరస్పర అంగీకారం మీద విడిపోదామని ప్రతిపాదించాడు భాస్కర్ .అలా కాకపోతే మోసం చేసి పెళ్లి జరిపించారని కేసు పెడతానన్నాడు. ఒక వైపు పరువు… మరోవైపు శాంతి. ఏం చేయాలని తీసుకొచ్చాడు ఈ పిల్లని ?ఏంచేయబోతున్నాడు? ఆ రోజే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది .రావటం రావటమే ఉప్పెనలా వచ్చింది. అతనికి మరణ శాసనం రాసింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఈశ్వరరావు కర్మకి ఆగిపోయారు.
…
ఎవరూ ఊహించనిది ఈశ్వరరావు మరణం భాస్కర్ వాళ్లకి ఈ వార్త వెళ్లిందో లేదో శాంతి తెలీదు. అసలెవరూ అతని ప్రస్తావే చేయలేదు. ఈశ్వర్రావుకి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఇద్దరు కొడుకులు బెంగుళూరులో ఉంటారు. ఒకతను ముంబైలో ఉంటాడు. కూతురిది హైదరాబాదు.
తండ్రి చావుకి శాంతి పెళ్లి వ్యవహారమే కారణమని అనిపించింది వాళ్లకి. అదే తలుచుకుని ఏడుస్తున్న సావిత్రిని ఓదార్చడం ఎవరికీ సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది శాంతికి.
“ఆయన లేని ఇంట్లో నేను ఉండలేను. ఇల్లు అద్దెకిచ్చేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను” అంది సావిత్రి .
తిరుగుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి పోవడం ఆమెకు తీవ్ర దిగ్భ్రమని కలిగిస్తోంది.
ఆమె పెద్ద కొడుకు తల్లిని తనతో తీసుకెళ్లే ప్రస్తావన చేశాడుగానీ శాంతి విషయం ఏమీ అనలేదు. “దీనికి చదువుంటే నాతో తీసుకెళ్లి ఏదో ఒక దారి చూపించే వాడిని” అన్నాడు రెండో కొడుకు. “మేమిద్దరం ఆఫీసులకు వెళ్లిపోతామా, పిల్లలని చూసుకోవడానికి సరైన మనిషి దొరకడం లేదు. నమ్మకంగా ఎవరూ ఉండట్లేదు. నేను తీసుకెళ్తాననుకో… కానీ మరో ఏడాదో రెండేళ్లో మాకు అవసరం. ఆ తర్వాత ” మూడో కొడుకు కొంచెం ప్రలోభపడుతూ అన్నప్పుడు మాత్రం వర్ధనమ్మ ఏడ్చింది.
“అది మీ తోడబుట్టినది! స్వంత చెల్లెలు కాకపోయినా మీ పినతండ్రి కూతురు. దాని తండ్రి బతికి ఉంటే మీ అందరిలా మహారాణిలా ఉండేది” అని. ఎవరూ ఆవిడ మాటలు పట్టించుకోలేదు. ఉమ్మడి ఆస్తులు పంచుకోవడంకన్నా తండ్రి పోయిన దుఖంకన్నా పెద్ద సమస్య అయిపోయింది శాంతి విషయం. ఆస్తి బయటికి పోకుండా శాంతిని తెచ్చి ఇంట్లో పెట్టడం ఈశ్వరరావు చేసిన తెలివైనపనిగానే అనిపించినా దిక్కూమొక్కూలేని ఆ పిల్లకి అంత కట్నం ఇచ్చి పెద్ద సంబంధానికి వెళ్లకపోవలిసిందనిపించింది ఎవరికి వాళ్లకే. లోకువైన సంబంధం చేస్తే ఈ గొడవంతా ఉండేది కాదనుకున్నారు.
శాంతి వాళ్ళ మాటల్ని నిర్లిప్తంగా వింటోంది . చర్చలు అంతకంతకీ వేడినందుకుంటున్నాయిగానీ పరిష్కారం దొరకడంలేదు. కమలాకర్ దంపతులకు శాంతి తండ్రి వాటా ఆస్తంతా ఈశ్వర్రావే కలుపు కున్నాడని కోపం . ఆ మాటంటే ఈశ్వరరావు పిల్లలకీ, సావిత్రికీ కోపం.
” నేనూ, అదీ వండుకు తింటాం. ఓ గది ఏర్పాటు చేయండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఈ రూపేణా నన్ను పట్టి వేధిస్తోంది” అంది వర్ధనమ్మ.
“వద్దమ్మా! వయస్సులో ఉన్న పిల్లని పెట్టుకుని ఒక్కదానివీ వండుకుంటూ ఎన్నాళ్లు కాలక్షేపం చేస్తావు? నువ్వేమైనా శాశ్వతమా? నీ తర్వాత దాని సంగతి ఎవరు చూస్తారు? అదీకాక ఇన్నాళ్ళూ అంటే చిన్నది. ఇప్పుడింక ముందు ముందు ఎన్నో సమస్యలొస్తాయి. ఒక్కరోజుతోటి తీరే వ్యవహారం కాదు” అన్నాడు కమలాకర్.
“ఒకరోజో ఒకనెలో అంటే ఎవరైనా చూస్తారుగానీ బ్రతికున్నంతకాలం ఈ దరిద్రగొట్టుపెద్దమ్మని ఎవరు నెత్తిన పెట్టుకుంటారే? ఏదైనా ఆశ్రమంలో పడేద్దాం” అని బాహాటంగానే అంది ఈశ్వరరావు కూతురు.
” మిమ్మల్నెవరు పెట్టుకోమన్నారు? కమలాకరూ… నువ్వు చెప్పరా …కట్నం డబ్బు దానిదగ్గరే ఉంది. దాని తిండి అది తింటూ నాతోపాటే నీ దగ్గర ఉంటుంది ” అంది వర్ధనమ్మ.
వాళ్లకు అలాంటి ఉద్దేశం ఉంటే ఈ విషయం మీద అంత చర్చించుకోవలసిన అవసరం ఉండేది కాదు .కానీ అలాంటి ఆలోచన లేదు. శాంతిని ఈశ్వరరావు తీసుకు వచ్చాడు కాబట్టి బాధ్యత ఆయనదీ ఆయన పిల్లలదీ అన్న ధోరణిలో ఉన్నాడు కమలాకర్ .ఆయన, పిల్లలు శాంతి తండ్రి ఆస్తి ఎలా వాడుకున్నా ఎప్పుడూ కలగజేసుకోలేదు. తన చేతిలోది పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తల్లి అందరి ముందూ నిలదీసి అడిగే సరికి వెంటనే జవాబు తట్టలేదు.
భర్త ఎక్కువ శ్రమ పడనక్కర్లేకుండా అతని భార్య టక్కుమని అంది” అది మా ఇంట్లో ఉండక్కర్లేదు. భూమ్మీద పడిందో లేదో తండ్రిని మింగింది. పెళ్లయిందో లేదో పెదనాన్నని మింగింది. ఇంక ఇంట్లో మిగిలింది ఇద్దరు. రేప్పొద్దున్న ఆ భాస్కర్ మనసు మార్చుకుని కాపురానికి తీసుకెళ్తానని వస్తే ఇంకే ఉపద్రవం జరుగుతుందో! అమ్మా! తల్లీ! మీకూ మీ మనవరాలికీ నమస్కారం. నన్నేనా ఇలా పసుపు కుంకుమలతో ఉండనివ్వండి. మీ విషయం మీ ఇష్టం” రెండు చేతులూ ఎత్తి ఠపీమని నమస్కారం పెట్టింది. ” డైవర్స్ పేపర్లే పంపించిన పెద్దమనిషి మళ్లీ ఎందుకొస్తాడు?” ఈశ్వరరావు పెద్ద కొడుకు హేళనగా అన్నాడు.
” రాకపోతే మాత్రం? నాయనా! ఆస్తులు మీకూ, బాధ్యతలు మాకూనా?” కమలాకర్ భార్య అక్కసు వెళ్లగ్రక్కింది.
శాంతి వాళ్ల మాటల్ని నిర్లిప్తంగా వింటోంది . ఎక్కడ ఉండాలి తనిప్పుడు? వీళ్ళేం నిర్ణయించబోతున్నారు? ఎవరికీ తనని ఉంచుకోవాలని లేదు. భాస్కర్ తెగతెంపులు చేసుకున్నాడు .ఇంకెక్కడ తన తదుపరి మజిలీ?
చర్చలు అంతకంతకూ వేడిని అందుకుంటున్నాయికానీ ముగియడం లేదు. ఎవరూ శాంతికి దారి చూపించాలనుకోవటంలేదు. మనసు పొరల్లో దాగి దాగి ఉన్న దుగ్ధలని వెళ్ళబుచ్చుతున్నారు.
ఆఖరికి తనే అంది,” అంత ఆలోచన దేనికి పెద్దనాన్నా? ఎక్కడినుంచీ వచ్చానో అక్కడికే పంపించేయండి” అని .
ఒక్కసారి అందరూ మాట్లాడడం ఆపేశారు. వెంటనే సరేననడానికి అందరికీ అహం అడ్డొచ్చింది. “అలా వద్దు. అదీ నేనూ ఓ గదిలో ఉండి వండుకు తింటాం” అంది వర్ధనమ్మ వెంటనే.
“బామ్మాా ! అది చెప్పిందే సరైనదనిపిస్తోంది” అన్నాడు ఈశ్వర్రావు కొడుకు సాలోచనగా. “అదేంట్రా ,వయసులో ఉన్న పిల్లని… అందులోనూ పెళ్లయినదాన్ని అలాంటి ఇంట్లో ఎలా వదిలిపెడదాం? ఎలా బతుకుతోందో ఆ కిరణ్మయి? అసలే భాస్కర్ నిండా అనుమానాలతో ఉన్నాడు. వాళ్లు మళ్లీ కలుస్తారా అలా చేస్తే?” ఆవిడ గోలపెట్టింది.
” ఎవరే, దాని మొగుడు? విడాకులు ఇచ్చినవాడు మొగుడెలాగౌవుతాడు?” ఈశ్వర్రావు కొడుకు కసిరాడు. భాస్కర్ ప్రస్తావనతో శాంతి అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది. వర్ధనమ్మకి ఎలా నచ్చచెప్పాలో తెలియడంలేదు. ఆవిడకి శాంతిని తిరిగి తీసుకెళ్ళి తల్లి దగ్గర దింపడం అంటే అవమానంతో చచ్చిన చావులా అనిపిస్తోంది. కానీ ఎవరు వింటారు ఆవిడ మాట? శాంతిని తీసుకువచ్చినరోజు ఆవిడ వెంట భర్త, పెద్దకొడుకు ఉన్నారు. ఈరోజుని ఒక్కర్తీ మిగిలింది. పరిస్థితులు అనువుగా లేవు.
“… మంచి చేద్దామని ఆనాడు తీసుకువచ్చారు. చేయగలిగింది చేశాం . దాని రాత బాగుంటే ఇలా ఎందుకౌతుంది ? ఇందులో చిన్నతనమేం లేదు. తాతగారింట్లో వదిలేసి రా. తర్వాత సంగతి వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు ” తల్లి మొహంలో బాధను గమనించి కమలాకర్ నచ్చజెప్పాడు.
” అంతా కలిసి దాన్ని అన్యాయం చేస్తారా ?”ఏడ్చింది వర్ధనమ్మ.
“అన్యాయమేముందే? లక్షో లక్షన్నరో దాని పేరున పడేసారుగదే బామ్మా? దాని డబ్బు పెట్టుకుని అది దర్జాగా బతుకుతుంది” అన్నాడు ఈశ్వర్రావు పెద్దకొడుకు.
” అదేదో ఇక్కడే బతకనిస్తే బావుంటుందికదరా?” వర్ధనమ్మ బతిమాలింది.
” మళ్లీ అదే మాట!” అంతా ఏకమై విసుక్కున్నారు.
…
వచ్చినవాళ్లంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోయారు. సావిత్రి పెద్దకొడుకుతో వెళ్లిపోయింది. ఆ తర్వాత శాంతిని తీసుకుని బయలుదేరేదాకా వర్ధనమ్మని నిలవనీయకుండా పోరుపెట్టింది కమలాకర్ భార్య . కమలాకర్ ఇద్దర్నీ హైదరాబాద్ రైలు ఎక్కించాడు. హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న టౌన్ లో శాంతి తాతగారి ఇల్లుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.