“బబ్లూ!” అంది ఆశ్చర్యంగా.
అతనూ ఆమెని అంతే ఆశ్చర్యంగా చూశాడు. అతను మరెవరో కాదు, శ్రీధర్ చెల్లెలి కొడుకు.
“నువ్వేంటి శాంతీ, ఇక్కడున్నావు?” అడిగాడు.
“మానస ఎవరనుకుంటున్నావు? కిరణ్మయిగారు మా అమ్మ” అని జవాబిచ్చింది శాంతి. అతని ముఖంలో రంగులు మారాయి. తమ పెళ్ళి జరగటానికిగల అవకాశాలని ఆక్షణంలోనే లెక్కవేసుకున్నాడు. తమ కుటుంబంలో ఇప్పటికే పుట్టినవాళ్లకీ ఇకముందు పుట్టబోయేవాళ్లకీకూడా కిరణ్మయితో వైరం ఉంది. ఆ వైరంకన్నాకూడా మానస ఎవరో తెలిస్తే తన తల్లి భావాలు ఎంతో దెబ్బతింటాయి. తెలియక ముందు ఆవిడ తన ఎంపికని ఎంతో మెచ్చుకుంది. ఇప్పుడింక ఇంత చిన్నవిషయంకూడా తెలుసుకోకుండా పైపై అందం చూసి ప్రేమలో పడిపోయాడు కొడుకని బాధపడి ఆవిడ పెంపకాన్ని ఆవిడే నిందించుకుంటుంది.
లోపల్నుంచీ వచ్చిన మానసతో అదే అన్నాడు. ఆమె హర్టైంది.
“మా అమ్మమాత్రం బాధపడదా, ఇలాంటి మాటలు విని? అంత చెయ్యకూడని పని చేసిందా ఆవిడ? ఈ విషయమ్మీద వుద్యమాలే జరిగాయని తరగతి పాఠాల్లో గొప్పగా చదువుకున్నాము. అన్నీ అప్పుడే మర్చిపోయావా? అంత విలువలేనివా, మన చదువులు? అదంత తప్పుపని కాదని నువ్వు మీవాళ్ళని కన్విన్స్ చెయ్యలేవా? నా తల్లిదండ్రులకి విలువలేనిచోట నేనెలా సంతోషంగా ఉంటాను? ఆవిడ విషయంలో ఏం జరిగిందో మీవాళ్ళేం చేసారో నాకు తెలుసు. ఇకపైనకూడా అలాగే జరగడం నాకిష్టం లేదు. సరే… మనిద్దరం ఒకరినొకరు మర్చిపోదాం” అనేసింది. కిరణ్మయి లోపలి నుంచి వచ్చేసరికి వినిపించిన మాటలివి.
ఏ ప్రయత్నం లేకుండా మానస ఏకపక్షంగా అలా నిర్ణయించడంతో అతను హర్టయ్యాడు. సంబంధం కలుసుకుందామని వచ్చి విభేదంతో వెళ్ళిపోయాడు. కిరణ్మయి, శాంతి తెల్లబోయి చూశారు.
“అదేమిటే? కనీసం కూర్చోబెట్టి మాట్లాడితే బావుండేదికదా? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం వేరే విషయం. ఇంటికొచ్చిన మనిషిని అలా పంపించేసావేమిటి?” అంది కిరణ్మయి, శాంతి చెప్తే విషయం తెలిసి.
“ఎంతకాలం పడతావమ్మా, ఇలాంటి మాటలు?”” అంది మానస.
“అన్నవాళ్లందరూ అర్థం చేసుకున్నారు కదా? అలా అంటున్నారంటే వాళ్లంతా లోలోపల సంఘర్షణ పడుతున్నట్టే” జవాబిచ్చింది కిరణ్మయి.
“నువ్వు చాలా మంచిదానివి. నీకున్నంత సహనం నాకు లేదు”” అంది మానస తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి.
విడిపోవడం మానస అన్నంత తేలికకాదని కొద్దిరోజులకే అర్థమైంది బబ్లూకి. మానస ఆమె తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చేస్తే సివిల్మ్యారేజ్ చేసుకోవచ్చు. తన తల్లి కొంతకాలానికి కాకపోతే కొంతకాలానికేనా ఆమెని స్వీకరిస్తుంది. ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఆవిడకి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ మానస అలా రాదు. ఆమె తల్లితండ్రులని తక్కువ చేస్తే ఊరుకోదు. ఈ విషయంలో తండ్రి సలహా తీసుకోవాలనుకున్నాడు. తన ప్రేమ గురించి చెప్పాడు. మానస ఎవరో చెప్పాడు.
“మానసని నేను చేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా?” అడిగాడు. ఆయన నాడి తెలిస్తే తల్లి నాడి పట్టుకోవచ్చు.
రామచంద్రరావు నవ్వి, “నువ్వు ఆ అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నప్పుడు అమ్మానాన్నల ఇష్టాయిష్టాలు ఎందుకు గుర్తొస్తున్నాయి?” తమాషాగా అడిగాడు.
“ప్రేమంటే… పెళ్లంటే ఎవరో ఒకరిని వదులుకోవడంకాదు నాన్నా! నాకు ఇద్దరూ కావాలి. మీరూ సంతోషంగా ఉండాలి, తనూ సంతోషంగా ఉండాలి” అన్నాడు.
“మారుతున్న కాలంతోపాటు మనమూ మారాలి. తప్పదు. కానీ సెంటిమెంట్స్లోనూ, సాంప్రదాయాలలోనూ బంధించబడి ఉన్న ఆడవాళ్ళు అంత తేలిగ్గా మారతారని నేననుకోను. అందులోనూ మీ అమ్మ… కిరణ్మయిగారి విషయంలో. ఆదర్శం బయట ఎక్కడేనా ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. మన ఇంట్లోనే ఉంటే కొరుకుడు పడదు. అది మనపట్ల జరిగిన ద్రోహంలా కనిపిస్తుంది”
తండ్రి జవాబు బబ్లూని నిరాశపరిచింది. వాళ్ల సంభాషణని తన గదిలోంచి విన్న వేదవతి ఇవతలికి వచ్చి తనంత తానుగా జవాబు చెప్పింది. అప్పటిదాకా ఆ విషయాలమీద వాళ్ళ కుటుంబంలో ఉన్న మౌనం బద్దలైంది.
“శ్రీధర్ మామయ్యకి పెళ్లి అనుకున్నారు. కిరణ్మయిని చూడటానికి నేనూ వెళ్ళాను. తెల్లగా నాజూగ్గా ఉన్న ఆమె మా అందరికీ చాలా నచ్చింది. మామయ్యకైతే మరీను. తననే చేసుకుంటానని పట్టుపట్టాడు. సరే, సంబంధం కుదిరిపోయింది. ఆమె పెళ్లయ్యాకకూడా పుట్టింట్లోనే ఉండి చదువుకుంటానంటే అప్పటికింకా వాడి చదువు అవలేదుకదాని దానికీ ఒప్పుకున్నారు. వాడి పెళ్ళి కబుర్లు ఇంకా పాతబడనే లేదు. ఇంతలో అనూహ్యంగా తోసుకొచ్చింది వాడి చావు. అప్పటికి ఆమె గర్భవతి… అలా అని ఆమె తల్లిదండ్రులు అన్నారు. పాపం పుణ్యం దేవుడికే తెలియాలి. అన్నయ్య పోయాక పుట్టింట్లోనే ఉంది. డెలివరీ అయ్యాక తీసుకొచ్చి పదోరోజు జరిపించారు అమ్మవాళ్ళు. ఆమె గాజులు చిట్లిన చప్పుడు… మెడలో సూత్రాలు తెంపిన చప్పుడు… ఆఖరికి తలలో పువ్వులు రాలుతున్న చప్పుడుకూడా ఆరోజు వినిపించినట్టు…. ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. వాటితోపాటు మిన్నంటిన రోదనలు. నా వయసుదో… నాకన్నా కొద్దిగా పెద్దదో చిన్నదో… ఆమెపట్ల చాలా రాక్షసంగా ప్రవర్తించారు పెద్దవాళ్లు. చక్కగా మెరిసేలా తోమి నిండా నూనె పోసి వెలిగించిన దీపపు సెమ్మెలాంటి ఆమె రూపం మసకబారటాన్ని నేను కళ్ళారా చూశాను. నాకు ఆమె పట్ల జాలే కలిగింది” అంది వేదవతి.
బబ్లూ మౌనంగా విన్నాడు. ఇలాంటి విషయాలు సాధారణంగా ఏ యింట్లోనూ చర్చలోకి రావు. నిశబ్దంగా జరిగిపోతాయి. ఆరోజుని జీలకర్ర నోట్లో వేసుకోవడం, పసుపుకొమ్ము మెడలో కట్టుకోవడం, అంచులేని తెల్లచీరలు ఆ స్త్రీమీదికి విసరడం ఇంకా ఎన్నో మోటుపనుల్లో కొన్ని మానేసినా ఇంకా చాలా పాటిస్తున్నారు. మూలాలు అలాగే వున్నాయి. వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారు. ఎందుకు ఇలా చెయ్యడం అనే ప్రశ్నకి ఎవరూ జవాబు చెప్పలేరు. ఎవరేనా చెప్పినా వాళ్ల భర్త క్షేమంకోసం అంటారు. ఇవన్నీ నిజంగా మగవాడి క్షేమంకోసమే జరిగే విషయాలైతే వాళ్ళు ఆడవాళ్ళకెందుకు వదిలిపెడతారు? తామే ఇంకాస్త పకడ్బందీగా చేసుకుంటారు. విద్యతోకూడిన వేదం తాము చదువుకుని, ఈ అర్థంపర్థంలేనివన్నీ ఆడవారికి వదిలిపెట్టారు. పరాయివాళ్ళ పాలనలో దేశమంతా అవిద్యతోటీ, మూర్ఖత్వంతోటీ కునారిల్లుతున్న రోజుల్లో ఏవో కారణాలకి పెట్టుకున్న సాంప్రదాయాలని ఇంకా పాటించడం నిజంగా ఆత్మహత్యాసదృశం.
“పగలూ రాత్రీ ఆమెను వితంతువుని చేసినప్పటి దృశ్యాలు కళ్లముందు కదిలేవి. ఎందుకు ఆమెని సాంప్రదాయంపేరిట అంత కౄరంగా శిక్షించడం? ఆడవాళ్ళపట్ల సమాజానికి ఎందుకు ఈ వివక్షత? ఎందుకింత కాఠిన్యం? నాలో తీవ్రమైన సంఘర్షణ. నా ప్రశ్నలకి ఎవరు జవాబు చెబుతారు? ఎవరినైనా అడిగితే ఇది సంప్రదాయం అంటారు. ఎక్కడినుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? మనం సృష్టించుకున్నదే కదా? ఎన్నోరోజులు ఈ ఆలోచనల్లో గడిపాను “
బబ్లూ తల్లికేసి నిశితంగా చూసాడు. ఇన్ని చెప్తున్న ఈమె మానసని కోడలిగా ఎందుకు వప్పుకోలేకపోతోంది? కిరణ్మయిని ఎందుకు అర్థంచేసుకోలేకపోతోంది? తండ్రి అన్నదే నిజమా? మనసులో కథల్లా వూహించుకుంటూ బయటికి సూక్తిముక్తావళిలా చెప్పి సంతృప్తిపడుతోందా, ఆవిడ? పిల్లలకి తమ తల్లిదండ్రుల సంస్కారంపట్ల అచంచలమైన నమ్మకం వుంటుంది. వాళ్ళే దాని పునాదుల్ని కదిలిస్తూ వుంటారు.
“ఇంతలో రుక్మిణి పెద్దమ్మ తండ్రి చనిపోయాడు. ఆయనకి మగపిల్లలు లేరు. పెద్దమ్మకొడుకు… పదిహేనేళ్లవాడికి ఇలాంటి సందర్భం ఎదురవుతుందనే ముందుచూపుతో ఎప్పుడు వడుగు చేశారు. ఇప్పుడు కర్మ చేయాల్సిన బాధ్యత వాడికి అప్పజెప్పారు. రకరకాల హెయిర్ స్టైల్స్‌తో పెంచుకునే వాడి జుట్టు తీయించేసారు. నిప్పు పట్టుకుని తాత పాడె వెంట స్మశానానికి పంపారు. చితికి నిప్పు పెట్టించారు. కపాలమోక్షం చూపించారు. మూడురోజుని శవం కాలిన బూడిదలోంచి అస్తికలు ఏర్పించారు. వాటిని కుండల్లో పెట్టిచ్చి దేశమంతా తిప్పారు. ఎంత రాక్షసక్రీడ ఇది! ఇంక ఆ చేసినమనిషిలోనూ, దాన్ని చేయించినవాళ్ళలోనూ సున్నితమైన భావాలు మిగిలి ఉంటాయా? నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికింది. ఈ క్రూరత్వం అనేది ఆడవాళ్ళ విషయంలో ఒకలాగా మగవాళ్ళ విషయంలో ఇంకొకలాగా చూపిస్తున్నాం. ఎవరికీ మినహాయింపు లేదు. మారాల్సింది మన సంస్కృతి, ఆచారాలు.”
“అమ్మా! ఇన్ని చెప్పగలిగిన నీకు కిరణ్మయిగారిమీద ఎందుకు కోపం? సరే, అవిడ ఏదో చేసింది. మానసని ఎందుకు కోడలిగా వప్పుకోలేకపోతున్నావు?” ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాడు.
“కిరణ్మయి క్షమార్హతని పోగొట్టుకుంది. ఆమెకి ఏదో ఒక దారి చూపించాలన్న ఆలోచన మా అమ్మానాన్నల్లోనూ మామయ్యల్లోనూ వుంది. ఆమె విషయంలో ఇంట్లో అందరికీ జాలి ఉంది. లేకేం? అది చూపించే అవకాశం తనే మాకు ఇవ్వలేదు. వాళ్లు మనోవర్తి అడగలేదు. అడగకుండా ఇచ్చి బంధం తెంచుకోవడం ఎందుకని ఇంట్లోవాళ్లు అనుకున్నారు. మాదగ్గరికే తీసుకొస్తే అమ్మ ఎలాగా పెద్దదయిపోయింది కాబట్టి ఇల్లు చూసుకుంటూ ఇంటిపెత్తనం చేసుకుంటూ ఉంటుందని కూడా భావించారు”
బబ్లూ మాట్లాడలేదు. మానవస్వభావంలో మౌలికంగా వుండే మూర్ఖత్వాన్ని తను చూస్తున్నాడన్న స్పృహ కలిగింది.
“ఇంతలో ఒక వార్త గుప్పుమనిపోయింది. అప్పటికింకా మావయ్య పోయి రెండేళ్లుకూడా అవలేదు. ఎవర్నో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారన్న వార్త బయటకు వచ్చింది. అతనితో ఆమె తిరుగుతోందనీ… పెద్దవాళ్ళే దగ్గరుండి ఆమెచేత ఆ తప్పు చేయిస్తున్నారనీ అనుకున్నారు. పెళ్లికిముందే అతనితో సంబంధం ఉందనీ, అందుకే పెళ్లయినా పుట్టింట్లోనే ఉండిపోయిందనీకూడా అనుకున్నారు. ఇంకా విషయం ముదరకముందే తీసుకొచ్చేద్దామని అమ్మవాళ్లు అనుకుంటుండగా కిరణ్మయి చెల్లెలి పెళ్లి శుభలేఖ వచ్చింది. అమ్మ నాన్న పెద్దన్నయ్య వెళ్లారు. కిరణ్మయి లేదు. రెండోయేడు, పెళ్లిపందిట్లోకి రాకూడదుగనుక బాధపడుతుందని కాలేజీవాళ్ళతో టూరుకి పంపించామని చెప్పారుగానీ అతనితో కలిపి బయటకు పంపేశారు. వాళ్ళకి అడ్డని శాంతిని … అప్పుడు దానికి రెండేళ్లు… వదిలేసి వెళ్ళిపోయింది. పెళ్లి జరుగుతూ ఉంటేనే ఆ విషయం బయట పడిపోయింది. అటు అమ్మావాళ్లూ కిరణ్మయిని తీసుకెళ్లే ప్రస్తావన తెస్తున్నారు, ఇటు వీళ్ళిద్దరూ కనకదుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారన్న ఫోన్ వచ్చింది. అంటే అంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిపోయిందనమాట. ఇంకొన్నిరోజులు ఆగి ఉంటే, అమ్మ వాళ్లకీ టైం ఇచ్చి ఉంటే వాళ్లే ఒప్పుకునేవాళ్లేమో… అయినా… సాంప్రదాయానికి కట్టుబడి ఉండే అమ్మ అలా ఎలా ఒప్పుకుంటుందిలే? అది ఊహించుకునే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుంది. మామయ్యకి చాల ద్రోహం చేసిందిరా ఆమె. అలాంటిదాని కూతుర్ని నువ్వు చేసుకుంటావా?” అంది వేదవతి.
బబ్లూ తల్లి చెప్పిందంతా నిశ్శబ్దంగా విన్నాడు.
పెళ్లికి ముందే మరొక మగవాడితో తిరిగి ఆ సంబంధాన్ని అలాగే ఉంచుకుని మరొకరిని చేసుకునేంత కుసంస్కారంగల తల్లికి పుట్టిన పిల్లలా, అలాంటి పెంపకంలో పెరిగిన క్రమశిక్షణలేని అమ్మాయిలా అనిపించలేదు మానస అతనికి ఎప్పుడూ. ఆమె ఒక నిండైన నది, వెన్నెల కిరణం, పెదాలమీది చిరునవ్వు… అంతే. అయితే తల్లికి జవాబు కావాలి. ఆవిడ అనుకుంటున్నవి నిజాలో కాదో రుజువవ్వాలి. ఆవిడ తప్పు అనుకుంటున్నది తప్పుకానే కాదని తెలియాలి. కిరణ్మయి తన జీవితాన్ని తను బాగుచేసుకుంటే ఆవిడ అహం దెబ్బతినటంలోని అసంబద్ధత అర్థమవ్వాలి. అలాంటివాటికి హేతుబద్ధమైన రుజువులేవీ ఉండవు. ఎదుటివ్యక్తిమీద నమ్మకం, గౌరవం ఉంటే వాటంతట అవే నిరూపించబడతాయి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.