స్నేహితుడు by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“చిన్నమ్మాయిని చూడటానికి వెళ్లి పెద్దమ్మాయిని చేసుకుంటానంటే బావుండదురా! కాదంటే నచ్చలేదని చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం” అంది వైదేహి కొడుకుతో.
“నీలిమని నువ్వు మర్చిపోయావామ్మా? స్కూల్లో నాకు బెస్టు ఫ్రెండు. మనింటికికూడా నాలుగైదుసార్లు వచ్చింది” తల్లి మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు సూర్య.
సూర్య స్నేహితులంతా వైదేహికి గుర్తే. చామనఛాయలో బొద్దుగా ఉండి, అతనితో తమింటికి వచ్చిన నీలిమని ఆమె మర్చిపోలేదు. నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్లి ఓదార్చింది కూడా. కానీ ఎలా? ముందురోజు పెళ్లిచూపులకి వెళ్లారు. అక్కడ పెళ్లికూతురి అక్కగా కనిపించింది నీలిమ.
“మా పెద్దమ్మాయి నీలిమ. ఎమ్మెస్సీ పాసైంది. లెక్చరరు. ఇప్పుడే పెళ్లిచేసుకోనంటోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తనకోసం ఆపడమెందుకని కావ్యకి చేసేస్తున్నాం” అని పరిచయం చేశాడు రాజశేఖరం పెళ్లికూతురి పినతండ్రి,
“గుర్తుపట్టావా?” ఆప్యాయంగా అడిగాడు సూర్య. బదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ.
“మీకు మా నీలిమ తెలుసా?” అడిగాడు రాజశేఖరం.
“ఇద్దరం టెంత్‍దాకా కలిసి చదువుకున్నాం” జవాబిచ్చాడు సూర్య. “ఏమ్మా, నీలిమా! బావున్నావా?” అని వైదేహి కూడా పలకరించింది.
ఇంటికి తిరిగొచ్చినప్పట్నుంచీ సూర్య ఈ పాట పాడుతున్నాడు. అక్కడ వాళ్లద్దరూ ఇవేం మాట్లాడుకోలేదు. అదొక్కటే అదృష్టం. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. లేకపోతే అక్కడే అభాసయ్యేదనిపించింది వైదేహికి ఇప్పుడు.
“నీ క్లాస్‍మేట్ అంటున్నావు, వరహీనమవుతుందేమో?” వైదేహి మరో అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు సూర్య ఈరోజుల్లో అలాంటివేమీ పట్టించుకోకూడదని. భర్తకన్నా భార్య పెద్దదైన వుదాహరణలు మూడు చూపించాడు.
“అసలు పెళ్లి చేసుకోనందట” అంది.
“అంటే అలా వదిలిపెట్టెయ్యటమేనా? ఎందుకు చేసుకోనందో తెలుసుకుని నచ్చచెప్పే బాధ్యత రాజశేఖరంగారికి లేదా?”
“అడిగారేమో! ఎవర్నేనా ప్రేమించి భంగపడిందేమో!”
“అలాంటిదేదీ ఉండదమ్మా! తనలో అలాంటి మెచ్యూరిటీ కనిపించలేదు. ఆ పదిహేనేళ్లప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.”
“ఆ అమ్మాయి పెళ్లిచేసుకోవటం, చేసుకోకపోవటం… అవన్నీ వాళ్ల కుటుంబవ్యవహారాలు, ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో. లేకపోతే ఊరుకో. అంతేగానీ ఇలాంటి వేషాలేస్తే మర్యాదగా ఉండదు” అప్పటిదాకా… మౌనశ్రోతగా వాళ్ల సంభాషణ వింటున్న మూర్తి కలగజేసుకుని కచ్చితంగా అన్నాడు.
“తను నా ఫ్రెండు నాన్నా! తనకి సహాయం కావాలి. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఏమీ చెయ్యకుండా ఎలా ఉంటాను? కొన్నికొన్ని బావుండనివే కొందరికి ఉపకరిస్తాయి. నేను నీలిమనే చేసుకుంటాను. ఎవర్నీ నొప్పించకుండా… అందర్నీ ఒప్పించే చేసుకుంటాను” అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య.
ఎదిగిన కొడుక్కి అంతకంటే ఏం చెప్పగలరు? ఎలాంటి అపఖ్యాతి వస్తుందోననిపించినా భార్యాభర్తలిద్దరూ మౌనం వహించారు.


నేరుగా నీలిమ పనిచేస్తున్న కాలేజికి వెళ్లాడు సూర్య. అప్పుడే క్లాసు పూర్తయి వెయిటింగ్‍రూంలోకి వెళ్లబోతోంది ఆమె. సూర్య ఎదురొచ్చాడు. అతన్ని చూసి తెల్లబోయింది.
“నిన్న మాట్లాడలేదేం? అందుకే ఈవేళ వచ్చాను” అన్నాడు.
“బావుండదని” పొడిగా జవాబిచ్చింది.
చిన్నప్పటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రతలో ఆమె ఉందని అతనికి అర్థమైంది
“మాట్లాడాలని వచ్చాను. ఫ్రీయేనా?” జేబులోంచీ సెల్ తీసి టైం చూసి, “వంటిగంటవుతోంది. బైట లంచి చేద్దామా?” అడిగాడు.
ఆమె తలూపింది. ఇద్దరూ బైటికి నడిచారు. హోటల్ అవంతీస్ ఇన్‍కి వెళ్ళారు. రావటమైతే వచ్చిందిగానీ నీలిమకి చాలా ఇబ్బందిగా ఉంది. చెల్లెలికి ప్రపోజ్ చేయబడ్డ వ్యక్తితో ఇలా రావటం… కానీ అతనంటే ఉన్న అభిమానం దాన్ని అధిగమించింది.
లంచి ఆర్డరిచ్చాక అది వచ్చేదాకా కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు.
“మీ అమ్మ చనిపోయాక మీరు ఆ ఊర్నించి వెళ్లిపోయారు. సెలవులుకదా, నేనప్పుడు మా తాతగారి ఊరు వెళ్లాను. తిరిగొచ్చేసరికి మీరు లేరు. అలా జరుగుతుందని కొంచెం కూడా ఊహించలేదు. చాలారోజులపాటు నువ్వు గుర్తొచ్చి దిగులేసేది. మళ్లీ కలుసుకుంటామనుకోలేదు” అన్నాడు అతను.
తల్లి ప్రస్తావన రావటంతో నీలిమ ముఖం విషాదంగా మారింది. ఆమెకి పదిహేనేళ్లప్పుడు జరిగిందా సంఘటన. పెళ్లికి వెళ్లొస్తుంటే కారుకి ఏక్సిడెంటై నీలిమ తల్లీ, చెల్లీ అక్కడికక్కడే చనిపోయారు. ఆమే, తండ్రీ మిగిలారు. చాలా పెద్ద ట్రాజడీ అది. నీలిమ చదివే స్కూలు పిల్లలూ, టీచర్లూ అందరూ వచ్చి ఓదార్చి వెళ్లారు. సూర్య వైదేహిని తీసుకొచ్చాడు. దగ్గరకి తీసుకుని ఎన్నోవిధాల ధైర్యం చెప్పింది నీలిమకి ఆవిడ .
నెలరోజులు అసలు స్కూలుకే వెళ్లలేదు నీలిమ. దిగులు, బెంగ ఆమెని తినేసేవి. చదువుతున్నది. టెన్త్ క్లాసు. పబ్లిక్ ఎగ్జామ్స్. నోట్సన్నీ రాసిపెట్టే వాడు సూర్య. వెంటబెట్టుకుని స్కూలుకి తీసుకెళ్లేవాడు. ఏడుస్తుంటే ఓదార్చేవాడు. టిఫిన్ బాక్సులో అన్నం తీసుకొచ్చి బలవంతంగా తినిపించేవాడు. ఆమెకి మళ్లీ ఊపిరిపోసింది అతని స్నేహమే. ఎలాంటి ఆకాంక్షలు. కోరికలూ ఎరగని స్నేహం. అదే సంవత్సరం నీలిమ తండ్రి ఆ ఊర్నించీ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోయాడు. అవన్నీ లిప్తలో గుర్తొచ్చాయి. ఆ తర్వాత జరిగినవి కూడా.
వేరే ఊరెళ్లాక నీలిమ తండ్రి రాజశేఖరం మళ్లీ పెళ్లిచేసుకున్నాడు. సరళ ఆమె పేరు. అప్పటిదాకా నీలిమకి ఆయనతో ఉన్న అనుబంధమేదో పల్చబడ్డట్లైంది. అప్పటిదాకా లేని దూరం, సంకోచం మొదలయ్యాయి ఆయన దగ్గర. కావ్య రాక ఆ దూరాన్ని మరింత పెంచింది. కావ్య సరళ అక్క కూతురు. తనకి పిల్లలు పుట్టరని తెచ్చి దగ్గరుంచుకుంది. నీలిమకన్నా రెండేళ్లు చిన్నది. ఆమెనే ముందురోజు సూర్య వెళ్లి చూసింది.
“పెళ్ళెందుకు చేసుకోలేదు నీలిమా, నువ్వు?” ఉన్నట్టుండి అడిగాడు సూర్య. “మన ఫ్రెండ్సందరికీ పెళ్లిళ్లయ్యాయి. నువ్వూ నేనూ మిగిలాం. నీకు చెయ్యకుండా కావ్యకి చెయ్యటమేమిటి? అసలెవరీ కావ్య? మీ చెల్లి అప్పుడే పోయిందిగా?” మామూలుగా ఉన్నట్టుండటానికి ప్రయత్నించాడు. అతని కన్సర్న్… తన గురించి పట్టించుకునేవాళ్లు వున్నారన్న ఆలోచన… ఆమె మనసును కుదిపాయి.
“నలుగురు వున్న కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు చనిపోయాక మిగిలిన ఇద్దర్నే కుటుంబం అనుకోలేక మళ్లీ పెళ్లి చేసుకున్నారు నాన్న. ఇంట్లో కేంద్రబిందువు పిన్ని అయింది. సహజమే. నాకూ ఆవిడకి చనువు ఏర్పడ లేదు. అదికూడా సహజమేననుకుంటా. కావ్య పిన్ని అక్కకూతురు. పిన్ని చుట్టే తిరిగేది. నాన్న ఆఫీసునించి రాగానే పిన్ని ఎదురెళ్లేది. పిన్ని వెంటే కావ్య కూడా వెళ్లేది… అమ్మ ఉన్నరోజుల్లో నేను ఎదురెళ్లినట్టే. ఆయన చేతిలోవి అందుకునేది. తనకి నచ్చినవి తీసుకుని మిగతావి వదిలిపెట్టేది. ఆ మధ్యలోకి ఎలా చొరబడాలో అర్థంకాక అలాగే ఉండిపోయాను. నాన్న నాకు ఇంకా ఇంకా దూరం జరిగారు” అంది తన మనసు తెరుస్తూ.
సూర్యకి బాధనిపించింది. ఆమె మౌనంగా ఇన్నాళ్లు అనుభవించిన బాధని అతను ఇప్పుడనుభవించాడు. బాంధవ్యాలు పరాయీకరణ కావటంలోని విషాదం అర్థమైంది.
“మరి పెళ్ళెందుకు వద్దన్నావు? చేసుకుంటే నీ ఇల్లు నీకు ఏర్పడేదికదా? స్వతంత్రంగా, సంతోషంగా ఉండేదానివి?” ఆర్తిగా అడిగాడు. ఇబ్బందిగా చూసి తల దించుకుంది. ఇంట్లో ఎన్నో వ్యవహారాలు.. అవన్నీ ఇతనికి చెప్పాలా? మనసు లోలోపలికి ముడుచుకుపోతున్న భావన. తల్లి పోయిన కొత్తరోజులూ, అతని అభిమానం గుర్తొచ్చాయి. అతని దగ్గర దాపరికమేమిటి? అని మళ్ళీ వెంటనే అనిపించింది.
“పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది. అందులోంచీ వచ్చే డబ్బునీ దాంతో కొనగలిగే వస్తువులనీ గురించి తప్ప పెరిగిపోతున్న అప్పుగురించీ నెలనెలకీ పెరిగిపోతున్న ఇన్స్టాల్‍మెంట్స్ గురించి ఆలోచించదు. నాన్న చెప్పబోతే కోపం. నాన్నది రెండోపెళ్లనీ, ఆయనకింక పిల్లలు పుట్టరనీ తెలిసే చేసుకుంది. పెళ్లప్పటికి ఆవిడ వయసూ తక్కువ కాదు. కానీ ఆ రెండు విషయాలతో ఆయన్ని గుచ్చి గుచ్చి బాధపెడుతుంది … ” నీలిమ గొంతులో తీవ్రమైన బాధ.
“క్రెడిట్‍కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది. నా జీతం ఇంట్లోనే ఇస్తాను. ఇద్దరి జీతాలూ కలిపినా చాలదు. అవికాక పర్సనల్ లోన్స్. ఇంకా చాలక బైట కూడా అప్పులు చేస్తున్నారు నాన్న. ఈ వత్తిడి తట్టుకోలేక బాగా స్మోక్ చేస్తున్నారు. నాకేమిటో భయంగా ఉంటుంది. ఆయన ఏ క్షణానేనా సూసైడ్ చేసుకుంటారేమోననిపిస్తుంది. ఆ టెండెన్సీ అలా అనిపిస్తుంది. ఇల్లమ్మేసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు”
“మరి నీ విషయం?”
“ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళెలా చేసుకోను?”
తదేకంగా చూశాడు సూర్య ఆమెని. ఎంత అమాయకత్వం? తనింట్లోనే తనకి జరుగుతున్న అన్యాయాన్నిసైతం గుర్తించలేనంత అమాయకత్వం. దానికి తోడు తండ్రిపట్ల అవధుల్లేని ప్రేమకూడా. ఎలాంటి తండ్రి అతను! కన్నకూతుర్ని ఆక్టోపస్‍లా పీల్చేస్తూ పెంపుడుకూతురికోసం త్యాగాలు చేస్తున్నాడు! నిరసనగా అనుకున్నాడు.
“మనిద్దరం పెళ్లి చేసుకుందామా?” మెల్లిగా అడిగాడు.
నీలిమ ముఖం కోపంతో ఎర్రబడింది.
“ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యని చూసుకోవటానికి వచ్చి ఇదేంటి? వద్దు. తను హర్టౌతుంది. అసహ్యంగా ఉంటుంది” అంది.
“నేను మేనేజి చేస్తానుగా?”
“వద్దు సూర్యా! మన స్నేహం స్నేహంలా ఇలాగే ఉండిపోనీ. నాన్నా, పిన్నీ ఇద్దరూ బాధపడతారు”
“సరే, ఎంతకాలం ఇలా ఉంటావు? ఎప్పటికి తీరతాయి నీ సమస్యలు?”
నీలిమ తలదించుకుంది.
“నీలిమా! మనం సింపుల్‍గా రిజిస్టరు మేరేజి చేసుకుందాం. ఇద్దరం కలిసి ఐతే మీనాన్న సమస్యలు తీర్చగలం.”
“అదేదో కావ్యని చేసుకుని కూడా చెయ్యచ్చు” పదునుగా ఉంది నీలిమ గొంతు.
“నువ్వు తప్ప వాళ్లెవరూ నాకేమీ కారు” స్థిరంగా ఉంది సూర్య జవాబు.
చాలాసేపటిదాకా నీలిమ ఏమీ మాట్లాడలేదు. ప్లేట్‍లో ఉన్న పదార్ధాలని కెలుకుతూ ఉండిపోయింది. తనకి పెళ్లి పట్ల విముఖతేమీ లేదు. సూర్య అంటే అయిష్టం కూడా లేదు. సూర్యని చేసుకుంటే తండ్రి సమస్యల్లోంచీ బైటపడతాడా? ఎలా? ఎవరో ఒకరి సపోర్టు కావాలనిపిస్తోంది తనకి. తండ్రికి కూడా అలాగే అనిపిస్తుందేమో! ఒక సమస్యని అందులోనే ఉంటూ విశ్లేషించడం వేరు. దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించటం వేరు. ఈ రెండు దృక్పథాలూ కలిసేచోట ఆ సమస్యకి పరిష్కారం ఉంటుందేమో! జవాబివ్వలేకపోయింది.
“నేను మీ నాన్నగారితో మాట్లాడతాను”అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకుని.


“సర్! మీతో పర్సనల్‍ గా మాట్లాడాలి ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి”
సూర్య ఫోన్ చేసి అడిగితే ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి, “ఇంటికి వచ్చెయ్యండి” అన్నాడు మామూలుగా.
“ఎక్కడేనా బయట. పార్కుకి రాగలరా? గాంధీ బొమ్మ దగ్గర ఎదురుచూస్తుంటాను” సూర్య సూచించాడు.
“అలాగే. అరగంటలో అక్కడుంటాను” అతనికి జవాబిచ్చి బయల్దేరాడు రాజశేఖరం. మనసు నిండా ఎన్నో సందేహాలు. అక్కడికి చేరేసరికి సూర్య ఎదురుచూస్తున్నాడు. “రండి” ముందుకి దారితీశాడు. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నారు.
రాజశేఖరానికి వింతగా ఉంది. ఇలా పార్కులో కూర్చుని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగిలున్నాయా? ఎవర్ని పలకరించినా అవంతీస్ ఇన్‍లో వెయిట్ చేస్తాను. రత్నాలో లంచి తీసుకుంటూ మాట్లాడుకుందాం అనేవాళ్లే. మసకచీకటి వాతావరణంలో మనసంతా ముసురుపట్టినట్టు వుంటుది తప్ప ఆలోచనలు చురుగ్గా కదలవు. ఇక్కడేమిటో ప్రశాంతంగా ఉన్నట్టనిపించింది.
సూర్య ఇద్దరికీ రెండు కొబ్బరిబోండాలు తీసుకొచ్చాడు. తనొకటి తీసుకుని ఆయనకొకటి ఇస్తూ, “మీరు నన్ను గుర్తుపట్టలేదు. నీలిమకోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు” అన్నాడు.
రాజశేఖరానికి నిజంగానే గుర్తురాలేదు. అవి చీకటిరోజులు. ఎవరు ఎవర్ని ఓదార్చారో… ఎలా ఆ దుఃఖంలోంచీ బైటపడ్డారో ఇప్పటికీ ఆశ్చర్యమే. కానీ ఆ దుఃఖపు కెరటాలు తననొక ఒడ్డుకీ నీలిమనింకొక ఒడ్డుకీ చేర్చినట్టు అప్పుడప్పుడనిపిస్తుంది. ఈమధ్య తామిద్దరి మధ్య దూరం మరీ పెరిగిపోయినట్టుగా ఉంది.
ఆయన ఆలోచనలు చదివినట్టు సూర్య చిన్నగా నవ్వాడు. అందులో స్వల్పంగా వ్యంగ్యం అర్థమైంది. రాజశేఖరానికి ఇబ్బందిగా కదిలాడు.
“నిన్న తనని కలిసి మాట్లాడాను. మీ ఇంటి పరిస్థితులు చెప్పింది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం నలుగురు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిలం. అందరం హేపీగా ఉన్నాం. నీలిమ ఒక్కర్తే ఇలా…తల్లి లేకపోవటం బాధే. కానీ…” ఆగిపోయాడు సూర్య.
“తనకి మా ఇంట్లో ఏ లోటూ లేదు. అందరూ మంచిగానే చూసుకుంటారు. అసలు తనకి సమస్యలేవైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా?”
“తన ప్రాబ్లమల్లా మీరే. చేసిన అప్పుల వత్తిడిలో ఏ క్షణాన పేపర్లో న్యూస్‍గా మారిపోతారానని భయపడుతోంది” నిదానంగా అన్నాడు సూర్య. రాజశేఖరం ముఖం పాలిపోయింది. చెమటలుపట్టాయి. జేబులోంచీ కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు.
సూర్య కేంటిన్‍కి వెళ్లి వాటర్‍బాటిల్ కొనుక్కొచ్చి మూత తీసి ఇచ్చాడు. అందుకుని గటగటా తాగేశాడు రాజశేఖర్.
“రిలాక్స్‌డ్‍గా నా మాటలు వినండి. నీలిమని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లోనైతే తను ఒప్పుకోదు. అందుచేత కొంత ఓపెన్‍గా మాట్లాడాలనుకుంటున్నాను. మీ సమస్యలు నేను కొంతవరకూ పరిష్కరించగలను” అన్నాడు సూర్య.
“…”
“నాకు కట్నం అక్కర్లేదు. పెళ్ళికూడా సింపుల్‍గా చెయ్యండి. ఇల్లమ్మేద్దామనుకుంటున్నారు కదా? అమ్మితే ముప్పైలక్షలదాకా వస్తుందని చెప్పింది నీలిమ, ముందు అప్పులన్నీ తీర్చెయ్యండి. మిగిలినదాంట్లోంచీ ఐదులక్షలు సింగిల్ బెడ్‍రూం ఫ్లాట్‍కి అడ్వాన్సివ్వండి. మిగతాది లోన్ తీసుకోవచ్చు. ఎన్ని ఖర్చులున్నా స్వంతి యిల్లనేది ఉండాలి. ఇంకా మిగిలింది నీలిమకి, కావ్యకీ చెరిసగం ఇవ్వండి. నీలిమకి ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదుగానీ, తను హర్టౌతుంది. కనీసం కావ్యతో సమానంగానేనా తనని చూడలేదని”
అతని మాటలకి రాజశేఖరం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు.
“ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు. ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఒకలా బండిని నెట్టుకెళ్లిపోతున్న మీరు, ఒకరోజుని తనకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పడానికి మీదగ్గర ఏదీ ఉండదు… నేను నీలిమని మాత్రమే చేసుకుంటాను. కావ్యని కాదు… వెళ్తాను. ఆలోచించుకుని చెప్పండి ఏ విషయం” సూర్య వెళ్లిపోయాడు.
రాజశేఖరం అలాగే కూర్చుండిపోయాడు. తనున్న పరిస్థితులు, వాటికి దారితీసిన తన నిస్సహాయత, వాటిచాటున నీలిమని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న తన స్వార్థం.. కళ్లకి కట్టినట్టు కనపడుతున్నాయి.
మొదటిభార్య పోయాక వంటరితనం తట్టుకోలేక, చిన్నపిల్ల, నీలిమకేం అర్థమౌతుంది తన దు:ఖం అని రెండో పెళ్ళి చేసుకున్నాడు. సరళ చెడ్డది కాదు. ఏదో ఒక సంబంధం అని చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది. అందులోంచీ పుట్టుకొచ్చిన అసంతృప్తి. అసహనం. దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్థకమైన ఖర్చులు.. వృధా అవుతున్న నీలిమ జీతం… దాటిపోతున్న ఆమె పెళ్ళీడు… నిజమే ఈ వత్తి డిని తట్టుకోలేకపోతున్నాడు తను! కృంగిపోతున్నాడు. చచ్చిపోవాలనే కోరిక తరచుగా కలుగుతోంది. ఎన్నోసార్లు బలంగా అనిపించిందలా. ఎవరూ గుర్తించనిది తన కూతురు గుర్తించింది. ఎంత ప్రేను దానికి? తనేం చేశాడనీ? దానివైపు నించీ సూర్య ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు!
నిజమే! అతను చెప్పినట్టు చేస్తే అప్పుల్లోంచీ విముక్తి తనకి. మిగిలిన డబ్బులోంచీ సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి. పదిపదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకి పెళ్లి చేయాలన్నది సరళ కోరిక. అది అవసరం కాదు, కేవలం కోరికే. అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో! రెండోపెళ్లివాడికిచ్చి తన గొంతు కోశారనీ ఏ సరదా తీరలేదని ఏడుస్తుంది. ఏడవనీ… ఇప్పుడొకలాంటి వత్తిడి, అప్పుడింకొకలా. కానీ జీవితాలు నిలబడతాయి. నీలిమకన్నా కావ్య ఎక్కువ కాదు తనకి. ఇప్పటికే నీలిమ జీతం లెక్కలేకుండా వాడుకున్నాడు. తను. ఎంతో అన్యాయం జరిగింది నీలిమకి. తను చేసిన
తప్పు సరిదిద్దుకోవటానికి వచ్చిన అవకాశం సూర్య.
గుండెలనిండా శ్వాస తీసుకుని లేచి నిలబడ్డాడు. ఏదో కొత్తశక్తి వచ్చినట్టనిపించింది. తను చర్చిస్తే ఇవన్నీ నీలిమ తనతోటే మాట్లాడేదేమో నేరుగా! తామిద్దరి మధ్యనీ అడ్డుగోడలు ఏర్పడిపోయాయి. సూర్యవలన మళ్లీ నీలిమ కనిపిస్తోంది.


“ఏమిటి, ఐదులక్షలతో కావ్య పెళ్లా? మీకేమైనా మతుండే మాట్లాడుతున్నారా? దానికి మంచి చేస్తామని తీసుకొచ్చాం. ఇదేనా? మా అక్కయ్య అసలు ఊరుకోదు. దానికొచ్చిన సంబంధం కాస్తా ఈవిడగారు ఎగరేసుకుపోయింది. కట్నం అక్కర్లేదన్నాడేమో అతడు? మళ్లీ సగం డబ్బు దేనికట?” అసహనంగా అరిచింది సరళ.
“చూడు, కావ్యకేదో చేద్దామని తీసుకొచ్చానంటున్నావు. దాని చదువు గురించి ఎప్పుడేనా పట్టించుకున్నావా? బాగుపడేదైతే, చదువుకుని అదీ నీలిమలాగా జాబ్ చేసేది. ఎవరో ఒకరు ముందుకొచ్చి చేసుకునేవారు. నీలిమకిలాగే మనకి తోచినది ఇచ్చి పంపేవాళ్లం. కానీ నువ్వేం చేశావు? చదువుకోవలసిన పిల్లని చెలికత్తెలాగా నీవెంట తిప్పుకున్నావు” అన్నాడు రాజశేఖరం.
వత్తిళ్లు తగ్గాక అతన్లో వివేచన పెరిగింది. ఇదివరకూ అతని ఆలోచనలన్నీ ఎక్కడినుంచీ డబ్బు పుట్టిద్దామా అనే విషయం చుట్టే పరిభ్రమించేవి. మరో ఆలోచన వుండేది కాదు. కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అతనైతే వివరించి చెప్పగలిగాడు కానీ సరళే అర్థం చేసుకోలేకపోయింది.
“అంటే మీ కూతురు రాకుమారీ, నా కూతురు చెలికత్తేనా?” మండిపడింది.
“పిన్నీ, బాబాయ్ చెప్పినదాంట్లో తప్పే ముంది? ఎందుకు, అనవసరంగా గొడవ? ముందు నీలిమ పెళ్లవ్వనివ్వండి” కావ్య సర్దిచెప్పింది. ఆమె మనసులో లోలోపలెక్కడో చిన్న గాయం. ఏనుగు చచ్చినా వెయ్యే అనిపించినలాంటి భావం. ఇంట్లో నీలిమని కొంచెం చులకనగానే చూస్తారు. కనీకనిపించని అసూయ. ఆమె స్థానంలోకి తను వచ్చినా, ఆమె హుందాగా పక్కకి తప్పుకున్నా విలువ తగ్గకపోవటం ఏదో గుణపాఠం నేర్పినట్టైంది.
“మీ అమ్మకి నేను మొహం ఎలా చూపించనే? మాఇంట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నీపెళ్లి జరిపిస్తానన్నాను. అందర్లో ఎలా తలెత్తుకు తిరగను?” సరళ ఏడ్చింది.
రాజశేఖరం మెత్తబడ్డాడు. “ఏడుపెందుకు? నీలిమ పెళ్లయిపోతే కొంచెం కూడదీసుకుని దీని పెళ్లి చెయ్యకూడదా? ఇంకా నాకు నాలుగేళ్ల సర్వీసుంది కదా? ఐనా పెళ్లెలా చేశామని కాదు, పెళ్లికొడుకెలాంటివాడనేది ముఖ్యం”” అన్నాడు ఓదార్పుగా.


సింపుల్‍గా రిజిస్టరు మేరేజి చేసుకుంటానన్నాడు సూర్య.
“అదేంటిరా? కట్నకానుకల్లేవు. పెళ్లేనా ఘనంగా చేయకపోతే ఎలా?” అంది వైదేహి.
“అమ్మా! ప్రస్తుతం వాళ్లున్న పరిస్థితిలో డబ్బు ఖర్చుపెట్టలేరు. గ్రాండ్‍గా చేసుకోవాలనేది మన సరదా. మన సరదాకోసం వాళ్లని ఖర్చుపెట్టమనడం సరైనది కాదు. మనం రిసెప్షను ఎరేంజి చేద్దాం” మెత్తగా అన్నాడు.
“నువ్వేది చెప్తే విన్నావుగనుక?” నిరసనగా అంది వైదేహి. మనసులో నీలిమపట్ల కొంచెం కోపం ఉండిపోయింది. కానీ పెళ్లి చేసుకుని వచ్చి బేలగా తన చేతులు పట్టుకుని “మీ అందరి మనసూ కష్టపెట్టాను. అటు మాయింట్లోకూడా బాధపడేవుంటారు. నన్ను క్షమించండి” అంటుంటే మనసు కరిగిపోయింది. తల్లిని పోగొట్టుకుని తన వళ్లో పడి ఏడ్చిన ఆ పదిహేనేళ్ల అమ్మాయి గుర్తొచ్చింది. కొడుక్కీ అంతేగా అనిపించింది. అకారణంగా కొందరి జీవితాల్లో అపశృతులు దొర్లుతుంటాయి. వాటిని సరిచెయ్యగలిగే అవకాశం ఉన్నవాళ్లు ఆ పని చెయ్యకపోతే ఎలా? అని అతన్ని కూడా క్షమించేసింది.
ఆ నెల జీతం తీసుకెళ్లి మూర్తికిచ్చింది నీలిమ.
“పెళ్లికి ముందు మా నాన్నకి ఇచ్చేదాన్నండీ!” అంది. ఆయనకి చాలా సంతోషం కలిగింది. నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు, తన పెద్దరికానికి విలువనిచ్చినందుకు. నువ్వెంత నీ లెక్కెంత, నీకొడుకు నాపక్షాన వున్నాడు అన్నట్టు ఉంటే ఎంతటివాళ్లకేనా బాధగా ఉంటుంది. “నాకెందుకమ్మా? నువ్వూ సూర్యా కలిసి దాచుకోండి” అన్నాడు ప్రేమగా. తర్వాత భార్యకి చెప్పాడు గర్వంగా.
“సూర్యా ఫ్రెండు…” అంటుంటే వైదేహి ఆపి “ఫ్రెండెవరండీ?” అనడిగింది.
“వాళ్లిద్దరూ ఫ్రెండ్సు కాదూ?” అని నవ్వి, విషయం చెప్పాడు.
“మంచిపిల్లే” సంతృప్తిగా అందామె. అని, “వాళ్లిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు. ఫ్రెండ్షిప్ తర్వాతి ప్రకరణంలోకి అడుగుపెట్టారు. తాడూ బొంగరంలా ఒకళ్ళనొకళ్ళు చుట్టుకుని తిరుగుతున్నారు” అంది.


“బావా!!”
“చెప్పు కావ్యా!!…
“నువ్వు నీలిమని ప్రేమించావా? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు”
సూర్య నవ్వాడు. “అలా ప్రేమించి ఉంటే తనొక్కదాన్నిగురించే ఆలోచించేవాడిని. తన సమస్యల గురించి ఆలోచించేవాడిని కాదు. అన్నిటికీమించి నీతో పెళ్లిచూపులకి వచ్చేవాడిని కాను. మామధ్య ఉన్నది స్నేహమే” అన్నాడు.
(16/11/2006 ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక )