హోప్ ఎవెరిథింగ్ ఈజ్ ఫైన్ by Manas Krishna Kant

గోళ్ళు అప్రయత్నంగా నోటి దగ్గరకు చేరాయి. ఎంతో ప్రశాంతంగా ఇన్ని సంవత్సరాలు ఉన్న నేను ఒక్కసారిగా ఎందుకు కంగారుపడుతున్నాను? స్మార్ట్‌ఫోన్‍ను చేతిలోకి తీసుకున్నాను, ఎప్పుడూ ఇదే టైమ్‍కి రావాల్సిన మెసేజ్ ఇంకా రాలేదు. ఎందుకు? ఏ సంవత్సరమూ మిస్ కాలేదు, మరిప్పుడు ఎందుకు మిస్ అయింది? ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలా? గతంలో వచ్చిన అన్ని మెసేజ్‍లూ చూసుకున్నా. సెల్‍ఫోన్‍లు వచ్చాక వచ్చినవి అన్నీ అదే తేదీ, అదే టైమ్‍కి ఉన్నాయి. అంతకుముందువి అందమైన గ్రీటింగ్ కార్డ్స్. అవన్నీ ఫోటో తీసి పెట్టుకున్నా. ఎందుకనేదానికి నాదగ్గిర జవాబు లేదు. ఒకటికాదు, రెండుకాదు ముప్ఫైసంవత్సరాలవి. ఇన్నేళ్ళూ క్రమం తప్పకుండా వచ్చిన మెసేజెస్‍ను నేను ఇగ్నోర్ చేసాను. కొన్ని పోస్టుకార్డులు, ఫోటో తీసి పెట్టుకున్నవి, ఇంకొన్ని రిప్లయ్‍కూడా చేయలేదు. స్క్రీన్‍మీద చూస్తే అన్నీ అటువైపునుంచి ఉన్న మెసేజ్‍లే. అవికూడా అన్నీ ఒకటే సందేశాన్ని కలిగి ఉన్నాయి. “Happy Birthday to you. Hope everything is fine” అని.
కళ్ళు మూసుకున్నాను, స్క్రీన్‍ని చూడలేకకాదు, ఆ మెసేజ్‍లు మదిలో రేపిన అలజడివల్ల వచ్చే కన్నీళ్ళను ఆపడానికి. ఆలోచనలు రివ్వున గతంలోకి దూసుకెళ్ళాయి. వాటితోపాటు నా వయస్సునికూడా లాక్కెళ్ళాయి.


అదే మొదటిసారి తనని చూడడం, ఆరోజే ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన మానాన్న నన్ను కొత్తస్కూల్లో దించి తన ఆఫీస్‍కి వెళ్ళిపోయారు. బెరుగ్గా ఒకమూల కూర్చున్నా చివరిబెంచీలో, నాతో ఎవరూ మాట్లాడడంలేదు, నేను కూడా అదే బాగుందనుకుని ఆలోచనల్లో మునిగిపోయా. అంతలో వచ్చిన క్లాస్‍టీచర్ రిపోర్టుకార్డులు ఇస్తోంది. నాకు సంబంధంలేదుకదా, తరువాతి ఎగ్జామ్‍వరకూ అనుకుని పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడే చూశాను తనని. క్లాస్ ఫస్ట్‌ర్యాంక్ అనుకుంటా, రిపోర్ట్‌కార్డు టీచరు దగ్గరనుంచి తెచ్చుకుంటున్నప్పుడు ముఖంలో కనిపించిన గర్వంవల్ల అనిపించింది నాకు. పొడుగ్గా, తెల్లగా, సన్నగా ఉన్నాడు. కళ్ళకి అద్దాలు, ఎక్కువ చదవడంవల్లేమో మరి అనుకున్నాను.
ఇంకొక నాలుగునెలలే ఆ స్కూల్లో నాకు. క్లాసుటెస్టుల్లోనూ, యూనిట్స్‌లోనూ, అన్ని ఎగ్జామ్స్‌లోనూ తనే ఫస్ట్. ఎప్పుడూ పుస్తకాలూ, చదువూ వేరే ప్రపంచం లేదేమో అనుకున్నా. నేను మాత్రం చదువుతోపాటూ, కల్చరల్ ఏక్టివిటీస్, ఆటల్లోకూడా చురుగ్గా పాల్గొనేదాన్ని, స్నేహితులూ, స్నేహితురాళ్ళూకూడా ఎక్కువే ఏర్పడ్డారు ఆ కొద్దికాలంలోనే. టెన్త్ ఫైనల్‍పరీక్షలు అయిపోయాయి, ఫలితాలకోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఆ సెలవురోజుల్లో ఒకరోజు నా రూమ్ కిటికీసందులోంచి చిన్నకాగితం లోపలికి వచ్చింది. అది ఒక లెటర్ అనీ, రాసింది తనే అనీ కింద పేరు చూశాక అర్థమయింది.
ఇంటర్లో జాయినవడానికి వేరే ఊరు వెళ్తున్నట్టూ, తనకి నేనంటే ఇష్టం ఉన్నట్టూ, కానీ టెన్త్ అవ్వడం మూలానా, చదువుని నిర్లక్ష్యం చేయలేకా ఇన్నిరోజులూ మాట్లాడడం కుదరలేదని రాశాడు. నాకు ఉత్తరం చదివి ఉద్విగ్నత కలగలేదు, ఎందుకంటే తనమీద నాకు ఎప్పుడూ ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు అప్పటివరకూ. లెటర్లో తనకు రాయాల్సిన ఎడ్రస్‍కూడా హైలెట్ చేశాడు. పాపం అనిపించింది. అయినా ఆ లెటర్‍ని చించి చెత్తబుట్టలో పడేశా.
రెండుసంవత్సరాలు ఎలా గడిచాయో తెలియలేదు. ఇంటర్ అయిపోయింది. మా నాన్నకి మళ్ళీ ట్రాన్స్‌ఫర్‍కూడా అయింది. కానీ, నాకు ఇంజినీరింగ్‍లో సీట్ వచ్చింది వేరే ఊళ్ళో. నేను ఇక్కడే హాస్టల్లో చేరతానని చెప్పాను, వేరేచోట చేరనని మొండికేశా. ఎప్పుడూ గొడవచేయని నేను ఎందుకంతలా రార్థాంతం చేశానో అర్థం కాలేదు మావాళ్ళకి. నేను అడిగిన కాలేజీలోనే చేర్పించారు. ఇంటర్లో నాది కో-ఎడ్యుకేషన్ కాలేజ్. అక్కడ పరిచయమయ్యాడు శ్రీను. చలాకీ అయినవాడు, ఆటల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. వాడిచుట్టూ ఒక బ్యాచ్‍కూడా ఉండేది. అమ్మాయిలందరూ ఎప్పుడూ వాడి గురించే మాట్లాడుకునేవాళ్ళు. వాడు ఒకసారి వాలెంటైన్స్‌డేకి వచ్చి నన్ను లవ్‍చేస్తున్నానని చెప్పాడు. అమ్మాయిలందరూ గొప్పగా మాట్లాడుకునేవాడు నాకు వచ్చి ప్రపోజ్ చేశాడని, ‘ఒకే’ చెప్పాను.
ఇంటర్లో అత్తెసరుమార్కులవడంతో, పేరు తెలియని ఇంజినీరింగ్ కాలేజీలో సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇద్దరమూ దాన్లో జాయిన్ అయ్యాం. మొదటి సంవత్సరం బాగానే గడిచింది. కానీ, రెండోసంవత్సరంనుంచి శ్రీను ప్రవర్తనలో మార్పు వచ్చింది. మనుపటిలానే గ్యాంగ్ తయారయింది. అమ్మాయిల్ని ఏడిపించడం, ర్యాగింగ్‍లు చేయడం మొదలైంది. జూనియర్లని బెదిరించడం, అమ్మాయిలతో అసభ్యప్రవర్తన ఎక్కువైంది. టీనేజీ ప్రేమకు సరైన శుభం కార్డు పడింది. బ్రేకప్ వాడికి బాగానే వర్క్ అవుట్ అయింది, నేను కోలుకోవడానికిమాత్రం ఒకటిన్నర సంవత్సరం, అయిదు బ్యాక్‍లాగ్ సబ్జెక్టులు అవసరమయ్యాయి. ఈ టైమ్‍లోనే అమ్మవాళ్ళు భయపడి సెల్‍ఫోన్ కొనిచ్చారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు నాతో మాట్లాడే అవకాశం ఉంటుందని.
బ్రేకప్‍నుంచి కోలుకున్నతర్వాత మొదటి బర్త్‌డేకి ఒక మెసేజ్ వచ్చింది. “Happy Birthday to you. Hope everything is fine” అని.
రెండో మెసేజ్‍కూడా సేమ్ నెంబర్‍నుంచి – పేరును తెలియజేస్తూ.
టెన్త్ అయాక రాసిన లెటర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అతనినుంచి ఈ మెసేజ్. తనకి మంచి కాలేజీలో సీటు వచ్చింది, ఇంటర్ తర్వాత పేపర్లో చూసి తెలుసుకోవడమేతప్ప తర్వాత పెద్దగా ఎక్కడా వినపడలేదు, కనబడలేదు తను. నన్ను మరచిపోకుండా ఇంకా ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాడా? నేనంటే ఇష్టం ఉంటే మరి ఇంటర్ తర్వాతకానీ, ఇంజినీరింగ్‍లో చేరిన తర్వాతగానీ ఎందుకు చెప్పలేదు? కలవాలని ఎందుకనుకోలేదు? ఒకవేళ ఇష్టమే లేకపోతే ఇప్పుడెందుకు మరి మెసేజ్ చేసినట్టు? లేదా నేను ఇంటర్‍నుంచి ఇప్పటివరకూ ఒక రిలేషన్‍షిప్‍లో ఉన్నానని అతనికి తెలిసే దూరంగా ఉన్నాడా? ఇప్పుడు అవకాశం దొరికిందని, వల్నరబుల్‍గా ఉంటానని మెసేజ్ చేశాడా? లేదా నిజంగానే నామీద కన్సర్న్‌తోనే చేశాడా?
నేనిప్పుడున్న మానసికస్థితిలో మగాళ్ళనేకాదు మనుషుల్నే నమ్మలేకుండా ఉన్నాను. ఇంకొకరికి రిప్లయ్ చేసేందుకు మనసు సిద్ధంగా లేదు, కానీ కొంచెం స్వాంతన కలిగింది. చాలా పెద్ద రిజక్షన్ తర్వాత, ఒక అబ్బాయి మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు. ఎప్పుడూ రిజక్షన్‍కి గురికాని నేను, ఒకసారి దాన్ని రుచిచూశాక ఇంతలా దిగజారిపోయానా? లేదా నేను మొదటినుంచీ ఇంతేనా? నన్ను నేను ఎక్కువనుకోవడంవలన చిన్నదెబ్బయినా గట్టిగా తగిలినట్టనిపిస్తోందా? ఇదంతా బ్రేకప్ అయిన కొత్తలో ఎదుకనిపించలేదు? నా మోరల్స్‌ని నేను ఎందుకు ఇప్పుడు క్వశ్చన్ చేసుకుంటున్నాను? మనసు మళ్ళుతోందా? గాయపడిన మనసు ఓదార్పును కోరుకుంటుందా? నామీద ఎవరూ జాలిపడకూడదు అనుకునే నేను ఓదార్పును నిజంగా కోరుకుంటానా? లేదా అహం సంతృప్తిపడిందా ఒక మగాడి మెసేజ్ చూసి? ఏం జరుగుతుంది నా మెదడులో? ఎందుకు స్ట్రెయిట్‍గా ఆలోచించలేకపోతున్నా? ఒక్క మెసేజ్ నన్ను, నా అస్థిత్వాన్ని, విలువల్ని ప్రశ్నించుకునేలా చేసిందా? లేదంటే నాక్కూడా అతనిమీద ఏమన్నా ఆశ ఉందా? అయినా ఇప్పుడు నన్ను అతనికి రిప్లయ్ ఇవ్వకుండా ఉండేందుకు అడ్డుపడుతున్నదేమిటి? తిన్న దెబ్బనుంచి కోలుకోలేకపోతున్న చిన్నగుండెయేనా? లేదా అనాదిగా నేను కాపాడుకుంటూ వస్తున్న అర్థంపర్థంలేని అహంకారమా? అసలు నాకు అలాంటి అబ్బాయిలెందుకు నచ్చరు? పద్ధతిగా, తమపని తాము చేసుకునిపోతూ, అందరితో మంచిగా ఉంటూ, అమ్మాయిలని గౌరవిస్తూ ఉండేవాళ్ళు ఎందుకు నాకు నచ్చరు? బహుశా అందుకే ఈ మెసేజ్‍ని ఇగ్నోర్ చేయడానికి నిశ్చయించుకున్నానేమో. ఏదైతే అది అయింది అని ఫోన్ పక్కన పడేసి ఒకటిన్నర సంవత్సరంగా అలవాటయిన ఏడుపును ముఖానికి అంటించుకుని అరగంట తలగడని ముఖాన్ని కనబడకుండా అడ్డుపెట్టుకుని పడుకుండిపోయా.
కళ్ళుమూసి తెరిచేలోగా మిగిలిన ఇంజినీరింగ్‍కోర్సు‌కూడా అయిపోయింది. ఏం పూనిందో, ఏమో ఆఖరి ఆరునెలల్లో అన్ని సబ్జెక్టులూ క్లియర్ చేయడమేగాక, ఫైనలియర్ సబ్జెక్టుల్లో క్లాసుఫస్టుకూడా తెచ్చుకున్నా. క్యాంపస్ ప్లేస్‍మెంట్స్‌లోకూడా చాలావాటిలో సెలక్ట్ అయ్యా. ఒకసారి దెబ్బతగిలితేతప్ప మనం ఎంత స్ట్రాంగో, రెసిలియంటో తెలియదేమో. నామీద నాకు సరికొత్త నమ్మకం కలిగింది. కార్పొరేట్ ప్రయాణం మొదలైంది. చాలా అంకెల్లో జీతం, ఆకాశం అంచులమీద జీవితం. అమ్మా, నాన్నకూడా నా స్వేచ్ఛకి అడ్డుపెట్టలేదు, బహుశా పెట్టాలనుకోలేదేమో, నా కమ్ బ్యాక్ చూసి. స్వేచ్ఛతోపాటు స్నేహాలూ వచ్చిపడ్డాయి.
ఒకప్పుడు తెలియక తీసుకున్న నిర్ణయాలవల్ల పిచ్చిని ప్రేమనుకుని ప్రాణాలమీదకు తెచ్చుకున్నా. ఈసారి అన్ని తెలిసే తీసుకున్నా నిర్ణయం. లివిన్ అంటారంట దీన్ని ఈ నగరంలో. మొదట్లో బాగా అనిపించింది. నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్‌లాగా. తర్వాత తర్వాత బోర్ కొట్టింది. కొన్నినెలలతర్వాత భయం వేసింది. ఎవరైనా ఎక్కువరోజులు ఉంటే ఓనర్‍షిప్‍ని ప్రకటించాలనుకుంటారో, లేదంటే తెలియకుండానే టేకిట్ ఫర్ గ్రాంటెడ్ ఫీలింగ్ కలుగుతుందో తెలియదు కానీ, రిసీవింగ్ ఎండ్‍లో ఉండేవారికిమాత్రం అది ఒక భయానకమైన అనుభవం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అయినా, ఇలాంటివన్నీ నాకే ఎందుకు ఎదురవుతాయి? ఇలాంటి వాళ్ళందరూ నాకే ఎందుకు దొరుకుతారో? నేనే కావాలని టాక్సిక్ మాస్క్యులినిటీకి ఎట్రాక్ట్ అవుతానా? నా టెండెన్సీనే అదా? లేదా నేనే ఎక్కువ ఫెమినైన్‍గా ఫీలవుతూ వాళ్ళకి నామీద అధికారాన్ని కట్టబెడుతున్నానా? మాసోచిస్టిక్ బిహేవియర్ ఎందుకు నాలో కలిగింది? నేను నార్మల్‍గానే ఉన్నానా? లేదంటే ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ ఉందా నాకు? ఇలా ఎన్నో ప్రశ్నలు వేధించసాగాయి.
నేను సుఖంగా ఉంటున్నానేమోకానీ, సంతోషంగానైతే లేను అనిపించింది. ఆ సమయంలో దానినుండి త్వరగా బయటపడాలని తపనపడడంతోపాటు, తీవ్రప్రయత్నాలు చేశా. చివరికి ఉద్యోగం మారిపోయి, తక్కువ జీతానికైనాసరే ప్రశాంతత లభించే ఒక చిన్న స్టార్ట్-అప్‍లో చేరా. జీవితం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు.
ఇంతలో నా బర్త్ డే మళ్ళీ వచ్చింది. దానితో పాటూ ‘‘అతని’’ అదే మెసేజ్ “Happy Birthday to you. Hope everything is fine” కూడా అదే టైమ్‍కి. అతనేమన్నా నన్ను, నాకు తెలియకుండా ఫాలో అవుతున్నాడా? స్టాకింగ్ చేస్తున్నాడా? స్పైయింగా? నేను రిలేషన్‍షిప్‍లో లేనప్పుడు చేస్తున్నాడా లేదా బాధలో ఉన్నప్పుడా? అవకాశవాదా? ఆశావాదా? కేవలం ఒక అలౌకిక శాశ్వతస్వాప్నికుడా? ఎందుకిలా? నేనంటే ఏ భావం ఉంది అతనికి? కేవలం శారీరకమైన వాంఛ అయితే కాదని తెలుస్తుంది? మరి ఏం కావాలి?
నేను ఒక పురుషుడినుంచి కోరుకుంటున్నదీ, అతను ఒక స్త్రీనుంచి కోరుకుంటున్నదీ ఒకటేనా? అసలు నేను పురుషుడినుంచి ఏమి కోరుకుంటున్నానో నాకే పూర్తి అవగాహన లేదు. సినిమాలూ, మీడియా ప్రభావంవలన నేను అలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నానా? లేదా వాటివలన, పీర్ ప్రెజర్‍వల మగాళ్ళుకూడా అలా ఉండాలని అనుకుంటున్నారా? మీడియా ఎథిక్స్ లేకపోవడంవలన విశృంఖలత్వాన్ని చూపించి, మీడియా దాన్నే స్వేచ్ఛగా అభివర్ణిస్తోందా? రెండోదెబ్బ ఇంకా గట్టిగా తగలడంవలన మెచ్యూరిటీ వచ్చి ఇలా ఫెమినిజం, జర్నలిజం, ఎథిక్స్, రెస్పాన్సిబిలిటీస్‍గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా?
ఎప్పుడూ తన మెసేజ్ వచ్చినప్పుడే నాలో ఈ ఆలోచనల తేనెతుట్ట ఎందుకు‘ కదులుతుంది? అసలు అతనికి నాపై ఎలాంటి అభిప్రాయం ఉంది? తెలుసుకోవాలి. అతడిని కలవాలి. ఆ మెసేజ్ వచ్చిన నంబరుకి కాల్ చేసి టైమ్, ప్లేస్ చెప్పి వచ్చి కలవమన్నాను. నేను పిలిస్తే ఎందుకు రాడన్న అహంతోనా? అతనంటే నాకున్నది ఒక చులకన భావమేనా? లేదంటే నామాట కాదనకుండా వస్తాడనే నమ్మకమా? అతనికి నామీద కోరిక ఉందేమో అని నా రెస్టయిల్ మెదడులో మెదిలిన ఆలోచనవల్లనా? ఏదైతేనం అతను, నేను పని చేస్తున్న ఊళ్లోనే ఉండడంవలన అనుకున్న టైమ్, ప్లేస్ అనువుగా ఉన్నాయి.
పదోతరగతితర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడం ముఖాముఖిగా. పోల్చుకోలేకపోయా. బలిష్టంగా, పొడుగ్గా ఉన్నాడు, ఆరోగ్యంగాకూడానూ. అనుకోకుండా నా బుర్ర, కంపేరిజన్ మొదలుపెట్టింది. నా మొదటి, రెండవ రిలేషన్‍షిప్‍లలో ఉన్న వాళ్ళతో. స్మోకింగ్, డ్రింకింగ్ చేయడంవల్లనేమో వాళ్లిద్దరూ ఇతనికంటే పెద్దవాళ్ళలానూ, అసహ్యంగానూ కనిపించారు. లేదంటే సాధారణంగా బ్రేకప్ జరిగిన తర్వాత వాళ్ళను తలచుకుంటే కలిగే జుగుప్స మూలానా??
స్మార్ట్‌గా ఉన్నాడు, గౌరవంగాకూడా ఉన్నాయి ఇతని మాటలు. ఎక్కడా అశ్లీలతా, అసభ్యతా లేవు. నాకు అభద్రతకూడా కలగలేదు ఇతని దగ్గర. చాలా సహజంగా అనిపించింది ఇతని కంపెనీ. రెండుమూడుసార్లు కలుసుకున్నాం సాయంత్రాలు అలా బీచ్‍లోనూ, కాఫీహౌస్‍లోనూ. ప్రేమ భావమూ, కోరికా అయితే కలుగలేదు అతణ్ణి చూస్తే. గౌరవమూ, భద్రతా భావాలైతే కలిగాయి. కానీ నాకు కావాల్సింది కేవలం భద్రతా? అయినా అతను ఏ విషయమూ చెప్పకుండానే, నేను ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను? వయస్సు దాటిపోతుందని భయపడుతున్నానా? సమాజం నన్ను ఏమంటుందో అని ఇప్పుడు ఆలోచిస్తున్నానా? సరదాలన్నీ తీరిపోయాయి, ఇంకచాలు ఇఫ్పుడు సేఫ్‍గా సెటిలయిపోయినవాడిని చూసుకొని బిందాస్‍గా ఉందామనుకుంటున్నానా? అయినా దాన్లో తప్పేముంది? తనుమాత్రం ఇన్ని సంవత్సరాలలో వేరెవరినీ ప్రేమించలేదా? ఇంకా ఏమీ… ఛఛ ఏమి ఆలోచిస్తున్నాను నేను? ఎందుకిలా? నేను నా క్యారక్టర్‍ని, బిహేవియర్‍ని జస్టిఫై చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నానా? ఎంతలా నా అహం నన్ను ఇలా ఆలోచించే స్థితికి దిగజార్చింది!
అతను చెప్పిన మాటకి ఆనందంగాకాక గర్వంగా అనిపించింది. అహం చల్లబడినట్టయింది. నేనంటే చాలా ఇష్టం అన్నాడు, నాకు ఇష్టమైతే పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. కానీ, వాళ్ళింట్లో ఒప్పించడానికి కొంచెం టైమ్ కావాలన్నాడు, నేను ఇంకా ఏం చెప్పకముందే. అయితే, నేను అతనికి నా ముందు రిలేషన్‍షిప్స్‌గురించి ఏదీ దాచకుండా చెబుదామనుకున్నా. ఒకరోజు కలసినప్పుడు ఇంక ఆలస్యం చేయకూడదని చెప్పేశా. అతని ముఖంలో ఒక బాధతోకూడిన దిగ్భ్రాంతివలన కలిగిన నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపింది. చాలాసేపటివరకు మాట్లాడలేదు, తనకెంతో ఇష్టమైన కాఫీనికూడా ముట్టుకోలేదు, కనీసం నా కళ్ళలోకికూడా చూడలేదు. పిడుగుపడిన చెట్టు మండినట్టు మండిందేమో గుండె, గటగటా గ్లాసుడు నీళ్ళుమాత్రం తాగాడు.
కొంచెంసేపు తర్వాత తేరుకుని ‘‘ఇన్ని సంవత్సరాలూ, నిన్ను తప్ప వేరెవ్వరినీ నేను కనీసం ఊహించుకోలేదు, అలా అని నువ్వు తప్పు చేశావని అనడం లేదు, కానీ దీన్ని నేను ప్రాసెస్ చేసుకుని, డైజెస్ట్ చేసుకోవడానికన్నా టైమ్ కావాలి. ఇదంతా అయ్యాక మా ఇంట్లోవాళ్ళనికూడా ఒప్పించాలి. ఫర్ దట్ ఐ నీడ్ సమ్ టైమ్’’ అని చెప్పాడు.
ఈసారి దెబ్బ నాకు తగిలింది, అసలు ‘నో’ని ఆన్సర్‍గా తీసుకోవడానికి సిద్ధంగా లేని నేను, అతనికి ఒక అవకాశమిచ్చిన నేను, ఇక అక్కడ ఉండదలచుకోలేదు.
“సరే అయితే” అని చెప్పి చప్పున వెళ్ళిపోయా.
ముందు రెండుసార్లకంటే, ఈసారి బాధ ఎక్కువగా ఉంది. ఎందుకు? ఇక్కడ ఏమీ జరగలేదు, నేను మోసపోలేదు. నెలరోజుల్లో కనీసం ఆరేడుసార్లుకూడా కలుసుకోలేదు. ఎందుకు మరి ఇంత బాధ? ప్రేమించానా? లేదంటే మామూలుగా కనీసం నేను కన్సిడర్ చేయనివాడిచేత ‘నో’ అనిపించుకోవడంవలనా? అసలు అతను ‘నో’ అన్నాడా? నన్ను జడ్జ్ చేశాడనా? ఎందుకీ బాధ? లేదంటే జీవితంలో స్థిరపడినవాడినీ, సంఘంలో స్టేటస్‍నీ కోల్పోయాననా? ఎందుకు ఈ విపరీతమైన బాధ? ఇంత బాధ పోవాలంటే, నాకు అంతకంటే బాగా స్థిరపడినవాడితో పెళ్ళికావాలి.
అంతే, అమ్మ నాన్నలకి అల్టిమేటమిచ్చిన నెలరోజుల్లో అయిపోయింది పెళ్ళి. అప్పటినుంచీ స్టార్ట్ అయింది ఒక ట్రాజెడీ. తొందరపడి నిర్ణయం తీసుకుని చేసుకున్నదానికి ఫలితం అనుభవించక తప్పదుకదా? కానీ, ముందు రెండు రిలేషన్‍షిప్‍లూ, ఎటువంటి శృంఖలాలూ లేకుండా, ఏ బాదరబందీ లేకుండా గడిచాయి, ఇది పెళ్ళికదా, తద్వారా వచ్చిన సంబంధబాంధవ్యాలూ, చుట్టరికాలూమాత్రమే కాకుండా సాధారణంగానే మగాడిలో ఉండే పురుషాహంకారం, మొగుడయ్యేసరికి పతాకస్థాయికి చేరుకుని, భరించే స్థాయి దాటి, భరణంకోసం కోర్టుకెక్కే దశకి వచ్చింది. కోపిష్టి, అనుమానపు మొగుడితో వేగలేక, మూడేళ్ళుకూడా ముగియకుండానే మంగళంపాడేయాల్సి వచ్చింది పెళ్ళికి. పిల్లలు వద్దనుకోవడంవరకే మా ఆలోచనలు కలిశాయి. కనీసం అదన్నా ఇప్పుడు పనికొచ్చింది అనుకొని ఇక ఎటువంటి మగాడు వద్దూ, మొగుడూ వద్దనుకొని ఉద్యోగానికే అంకితమయ్యా.
ఆయేడు పుట్టినరోజుకికూడా ఎప్పటిలానే, అదే టైంకి మెసేజ్ “Happy Birthday to you. Hope everything is fine” అని. అదే నంబరునుంచి, స్మార్ట్‌ఫోన్ యుగంకదా, ఇంగ్లీషు అక్షరాతోపాటూ, ఒక నవ్వుతున్న ఎమోజీకూడా వచ్చింది ఈసారి. ఎప్పటిలాగేనే ఇప్పుడూ ఆ మెసేజ్‍ని ఇగ్నోర్ చేసేశా, రిప్లయ్ ఇవ్వకుండానే.
అలా అన్ని సంవత్సరాలూ ఆగకుండా వచ్చిన మెసేజ్ ఈ సంవత్సరం రాకపోయేసరికి వింతగా తోచింది మొదట. ముప్ఫై మెసేజ్‍లు ఉన్నాయి అటునుండి వచ్చినవి. ఒక్కసారికూడా రిప్లయ్ ఇవ్వలేదు. పదోతరగతిలో రాసిన ఉత్తరానికీ ఇవ్వలేదు, పెళ్ళి చేసుకోవడానికి టైమ్ అడిగినప్పుడూ ఇవ్వలేదు. సంవత్సరం, సంవత్సరమూ పంపే బర్త్‌డే విషెస్‍‍కికూడా ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలూ. ఎందుకు? తీరని కసా? రిజక్ట్ చేసినందుకు ఇది అతినికి వేసిన శిక్షా? నేను అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలకీ, తొందరపడి తగలబెట్టుకున్న జీవితానికీ ఇది సాక్ష్యమా? అసలు అహం అడ్డయితే మిగతావాళ్ళని ఎందుకు జీవితంలోకి ఆహ్వానించినట్టు? ఎందుకు రిప్లయ్ ఇవ్వలేదు నేను ఇన్ని సంవత్సరాలూ? వయసు వేడిలో తెలియలేదా తోడుయొక్క అవసరం? మలివయసులో జ్ఞాపకాలను నెమరువేసుకునే సమయంలో రుచులన్నీ చేదుగా తెలుస్తున్నప్పుడే తెలిసొచ్చిందా అతని అవసరం? అందుకేనా, మెసేజ్ రాకపోయేసరికి భయం వేసింది? ఇన్నిసంవత్సరాలూ రిప్లయ్ చేయకపోయినా పంపిస్తుండడంవలన అతణ్ణి చులకనగా చూసానా? మరిప్పుడు అతని ఆలోచనలు బరువెందుకు అనిపిస్తున్నాయి?
నా మనసులో ఏదోమూలన అతని పైన ప్రేమ ఉన్నదా? కానీ, ఆ ప్రేమ శారీరకమైనది కాదా? ప్రేమకు శరీరంతో సంబంధం లేదా? మరి అలాంటి ప్రేమను వ్యక్తపరిచేందుకు మార్గం ఏది? ఇలా ఆలోచనలు అనంతానంతాల్లోకి పోయి తిరిగి వస్తూ, కపాలంలో గోడలకి కొట్టుకుంటూ బౌన్స్ అవుతూ తలనొప్పి రూపంలో నన్ను సతాయిస్తున్నాయి. ఇవన్నీ ఆలోచించేందుకు సమయం లేదు నాకిప్పుడు, వయసు ఐదుపదులు దాటేసింది. ఇప్పుడింక ప్రణాళికలూ, ప్రహేళికలతో పని లేదు నాకు, అహంతోనూ, ఇహంతోనూకూడా. నాకెలాంటి తీయని జ్ఞాపకాలు లేవు, ఉన్న తీపంతా ఈ ముప్ఫై మెసేజులే. కానీ అతనికి ఈ తీపైనా ఉందో లేదో అని చటుక్కున ఏదో స్ఫురించినదానిలాగా అతని మెసేజ్ రిప్లయ్‍బాక్స్‌లో టైప్ చేయడం ప్రారంభించాను. “Hope everything is fine” అని. ఒక్కసారి తృప్తిగా చూసుకొని సెండ్ బటన్ నొక్కాను, యిన్ని సంవత్సరాల తర్వాత, అహాన్నీ ఇహాన్నీ విడిచిపెట్టేస్తూ.
అతని నెంబరు నుంచి కాల్. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది.