రష్యన్ మూలం “Pikovaya dama” by Alexander Pushkin(in 1833)
Translated to English as “The queen of Spades” by Mrs Sutherland Edwards (in 1892) and available in Project Gutenberg in the Public domain.
మనుషులందరి అంతరంగాల్లో రెండుపొరలు వుంటాయి. ఒకలాగ కోరుకుని ఇంకొకలాగ బతికేవారిలో ఈ పొరలమధ్య కొంత దూరం వుంటుంది. ఈ దూరం పెరిగేకొద్దీ లోలోపలి సంఘర్షణ పెరుగుతుంటుంది. కొన్ని బలమైన కోరికలనీ, ప్రలోభాలనీ అదుపు చేసుకుంటూ పైకి నీతులు చెప్తూ బతికేవాళ్ళలో ఒకొక్కసారి ఆత్మసంయమనం కోల్పోవటం కచ్చితంగా జరుగుతుంది.
జార్ చక్రవర్తుల పాలన. రష్యన్ ఇంపీరియల్ ఆర్మీ. రాత్రిపూట విధులు. అశ్వరక్షకుల గదులు. ప్రత్యేకించి నరుమోవ్ గదుల్లో ఆతిథ్యం.
పేకాట జోరుగా సాగింది. చలికాలపు రాత్రి గుర్తుపట్టలేనంత నిశ్శబ్దంగా కరిగిపోయింది. తెల్లవారి ఐదుగంటలు. అతిథులంతా భోజనానికి కూర్చున్నారు. ఆటలో గెలిచినవాళ్ళు వుల్లాసంగా కేరింతలుకొడుతూ తింటుంటే పోగొట్టుకున్నవాళ్ళు మాత్రం ఆకలిని మరిచి తమ ఖాళీ ప్లేట్లని చూస్తూ వుండిపోయారు. ఇంతలో షాంపేన్ వచ్చింది. ఒక్కసారిగా అందర్లో చైతన్యం వచ్చింది.
“ఆ< నీ ఆట ఎలా సాగింది?” నరుమోవ్ సురిన్‍ని అడిగాడు.
“కొత్తగా ఏముంది? ఎప్పట్లాగే. నేను నష్టజాతకుణ్ణి. దురదృష్టదేవత నా నెత్తిన తాండవిస్తూ వుంటుంది. ఎటువంటి ప్రలోభాలూ పడకుండా నిలకడగా ఆడినా సరే, గెలవటం మాత్రం వుండదు” నిరుత్సాహంగా అన్నాడు సురిన్.
“ఔను. ఒకసారి ఎరుపురాణీమీద కాయమని ఎవరెంత బలవంతపెట్టినా నువ్వు వినలేదు. నీమాటమీదే నిలబడ్డావు. నాకైతే నీ పట్టుదల చూసి ఆశ్చర్యం కలిగింది”
“సురిన్ సంగతి సరే, నీకు హెర్మాన్‍గురించి తెలీదేమో!” అతిథుల్లో ఒకరు అక్కడే వున్న ఒక యువ ఇంజనీరుని చూపిస్తూ అన్నాడు, ” తన జీవితం మొత్తమ్మీద ఒక్కసారి కూడా పేకముక్కల్ని చేతితో తాకి వుండడు. ఐనాసరే, మాతోపాటు రాత్రంతా కూర్చుని ఆట చూస్తాడు”
“నిజమే! పేకాట నాకు చాలా యిష్టం. అలాగని ఆడను. ఆటలో ఏదో వస్తుందని చేతిలో వున్నదాన్ని పోగొట్టుకోవటం నాకు నచ్చదు” హర్మాన్ కొంచెం మొహమాటంగా జవాబిచ్చాడు. నిజానికి అతడు రెండుపొరల మనిషి. ఆ పొరలకి మధ్య చాలా దూరం వుంటుంది. అతడిలో సంఘర్షణా అలాగే వుంటుంది. చాలా వింతైన మనిషి. ఉద్వేగపరుడు.
“వాడు జర్మన్. అందుకే పొదుపరి. అంతే” అన్నాడు టామ్‍స్కీ. “నేను మనుషులందరి స్వభావాలూ చెప్పగలుగుతానుగానీ, ఒక్క వ్యక్తి విషయంలో నా శక్తి చాలదు. ఆ వ్యక్తి… మా నాయనమ్మ… కౌంటెస్ అన్నా ఫెదతొవ్నా”
“అదేంటి?” అతిథులు కుతూహలం చూపారు.
“ఆవిడ ఎప్పుడూ బేంకుస్టేక్స్‌మీద పందెం కాయదు. అదే విచిత్రం” టామ్‍స్కీ కొనసాగించాడు.
“ఆవిడకి ఎనభయ్యేళ్ళుకదూ? అంత ముసలావిడ విషయంలో వింతేముంది?” నరుమోవ్ తేల్చిపారేసాడు.
“ఐతే నీకు అసలు విషయం తెలీదన్నమాట!”
“కారణంకూడా వుందీ? లేశమాత్రంకూడా అదేమిటో నాకు తెలీదు”
“ఐతే విను. అరవయ్యేళ్ళ కిందట ఆమె పారిస్ వెళ్ళింది. అక్కడ ఆమె సృష్టించిన సంచలనం అంతయింతా కాదు. మాస్కోనుంచీ వచ్చిన సౌందర్యాధిదేవత అని యువకులంతా వెంటపడేవారట. అక్కడ స్త్రీలంతా ఫారో ఆడేవారట. ఒకానొక సందర్భంలో మా నాయనమ్మ చాలా పెద్దమొత్తాన్ని డ్యూక్ ఆఫ్ ఆర్లియన్స్ చేతిలో ఓడిపోయింది. అవమానభారంతో ఇంటికి వచ్చింది. రాగానే మేకప్పంతా తీసి పారేసి, మా తాత … అప్పటికి బతికే వున్నాడు… ఆయనకి జరిగిన విషయం చెప్పి, మొత్తం డబ్బు చెల్లించమని అడిగింది. ఆయన భయస్తుడే, ఆవిడ ముందు పిల్లిలాంటివాడే… కానీ వప్పుకోలేదు. పైగా ఆమె గత ఆరునెలల్లో ఎంతెంత డబ్బు పేకాటలో పోగొట్టుకుందో లెక్కలు చెప్పాడు. అదంతా కలిపి యాభైవేల ఫ్రాంకులైంది. అంతేకాదు, తమ ఎస్టేట్స్, ఆస్తులు రష్యాలోనూ, సరతోవ్‍లోనూ వున్నాయిగానీ ఫ్రాన్స్‌లో కాదని గుర్తుచేసి, తనా డబ్బు కట్టేది లేదని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. దాంతో ఆవిడకి వళ్ళుమండి, ఆయన చెంప చెళ్ళుమనిపించి విసవిస వెళ్ళి వేరే గదిలో పడుకుంది. మర్నాటికి గొడవ సమసిపోతుందనుకుందిగానీ అలాగేం జరగలేదు. జీవితంలో మొదటిసారి ఆయనకి వివరణ యిచ్చుకోవటం మొదలుపెట్టింది. అప్పోసప్పో చేసేనా ఆ సొమ్ము చెల్లించాలనీ, అప్పులనేవి గొప్పవారికి కాక పేదవాళ్ళకి వుంటాయానీ నచ్చజెప్పబోయింది. ఐనా ప్రయోజనం లేకపోయింది. ఇంకేం చెయ్యాలో తోచక ఆమె తన పరిచయాలని వాడుకుని అప్పుచెయ్యాలనుకుంది. కౌంట్ జెర్మేన్‍కి తక్షణం రమ్మని కబురుచేసింది. ఆయన రాగానే తాతయ్య చేతుల్లో తనెంత బాధపడుతోందో, ఆయన తననెంత కష్టపెడుతున్నాదో చిలవలూపలవలూ చేసి చెప్పింది”
“కౌంట్ జెర్మేన్?!!!”
“ఔను. వినే వుంటావు. ఆయనగురించి రకరకాల కథలున్నాయి. కొన్నిటిని ఆయనే స్వయంగా చెప్పుకుంటాడు. తానొక యూదుయాత్రికుడిననీ, జీవనసౌందర్యాన్ని వెతుకుతున్నానననీ… ఇలాగే. కానీ జనం అనుకునేది ఆయనొక కాసనోవానో, గూడచారో కావచ్చునని. ఈ కథలన్నీ ఏవి ఎలా వున్నా, ఆయనొక సరదాయైన మనిషి. ఆయనతో పరిచయానికి జనం తహతహలాడతారు. నాయనమ్మ యీరోజుకీ ఆయనపట్ల గొప్ప గౌరవాన్ని చూపిస్తుంది. ఎవరేనా తక్కువచేసి మాట్లాడితే వూరుకోదు. ఆయన్ని డబ్బుసాయం చెయ్యమని అడిగింది నాయనమ్మ. ఆశలన్నీ ఆయనపైనే పెట్టుకున్నానని చెప్పింది. దానికి ఆయన చిరునవ్వు నవ్వి-
నీకు డబ్బివ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అది నిన్నింకా చిక్కుల్లో పడేస్తుంది. డబ్బు నువ్వు వూరికే తీసుకోవు, తీసుకున్న దగ్గర్నుంచీ ఎలా తీర్చాలా అన్న చింతలో పడిపోతావు. అదంతా ఎందుకు? నీకు పేకాటలో కొన్ని మెలకువలు చెప్తాను. వాటిని వాడుకుని నువ్వు పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవచ్చు- అన్నాడు.
నాయనమ్మ తలకొట్టుకుని – నీకెలా చెప్పేది, నాదగ్గర ఏమాత్రం సొమ్ములేదు మళ్ళీ ఆట మొదలుపెట్టడానికి-అంది.
-నామాటలు శ్రద్ధగా విను. నువ్వు గెలవటానికి డబ్బేమీ అక్కర్లేదు- అంటూ ఆమెకి ఒక రహస్యాన్ని చెప్పాడు” అని ఆగాడు టామ్‍స్కీ.
అక్కడున్నవాళ్ళంతా చెవులు రిక్కించారు. టామ్‍స్కీ పైపు వెలిగించుకుని, ఒక్కసారి గుండెనిండా పొగపీల్చుకుని వదిలి చెప్పాడు. “అదేరోజు సాయంత్రం నాయనమ్మ మళ్ళీ పేకాటకి వెళ్ళింది. ఆర్లియన్స్ డ్యూక్ ఎదురయాడు. డబ్బు వెంటనే చెల్లించలేకపోతున్నందుకు అతనికేదో కట్టుకథ చెప్పి ఆటలో కూర్చుంది. కౌంట్ జెర్మేన్ చెప్పినట్టే మూడు వరస ఆటల్లో ఆవిడ గెలిచింది. పోగొట్టుకున్న ప్రతి ఫ్రాంకూ తిరిగి సంపాదించుకుంది. అలా ఆడిన వెంటవెంటనే జయాపజయాలని నిర్ణయించే కార్డుని సోనికా అంటారట” టామ్‍స్కీ ముగించాడు.
“అదృష్టంకొద్దీ అలా జరిగి వుండచ్చు” అతిథుల్లో ఒకరు అన్నారు.
“కట్టుకథ” అన్నారు మరొకరు.
“ఆ కార్డులమీదే ముందే గుర్తుపెట్తుకుని వుంటారు” ఇంకొకరు అన్నారు.
“నాకు తెలిసి అలాంటిదేం లేదు” గంభీరంగా
“ఆవిడనుంచీ నువ్వా రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోకపోవటం వింతగా వుంది” అన్నాడు నరుమోవ్.
“అదేకదా? ఆవిడకి నలుగురు కొడుకులు. అందరూ గొప్ప ఆటగాళ్ళు. ఐనా కూడా ఏ ఒక్కరికీ ఆవిడ ఆ రహస్యాన్ని చెప్పలేదు. మా చిన్నాన్న కౌంట్ ఇవాన్ ఇల్యిచ్ ప్రమాణపూర్వకంగా ఆ విషయాన్ని నిర్ధారించి చెప్పాడు. దానిలో ఏం నష్టం వుందో నాకైతే తేలీడం లేదు. ఐతే ఒక విషయం. చప్లిట్జ్‌స్కీ తెలుసుకదా? కొన్ని మిలియన్ల రూబుళ్ళని పోగొట్టుకుని చివరికి దుర్భరమైన దారిద్ర్యంలో చచ్చిపోయాడు… అతడు వయసులో వుండగా జోరిచ్ అనేవాడి చేతిలో మూడులక్షల రూబుళ్ళు ఓడిపోయాడు. చాలా దు:ఖంలో పడిపోయాడు. మళ్ళీ ఇంకోసారి పేక ముట్టుకోననే ప్రమాణం చేయించుకుని అతనికిమాత్రం ఆ రహస్యాన్ని చెప్పిందట మా నాయనమ్మ… అతను పోగొట్టుకునదానికంటే ఎక్కువే గెలిచాడు” అన్నాడు టామ్‍స్కీ
“అబ్బో! తెల్లారిపోతోంది. ఇంక పడుక్కుందాం” అన్నాడు నరుమోవ్. అక్కడున్నవాళ్ళంతా తమతమ షాంపేన్ గ్లాసుల్ని ఖాళీ చేసి లేచారు. ఒక వ్యక్తి మస్తిష్కంలోమాత్రం వృద్ధ కౌంటెస్ గురించి టామ్‍స్కీ చెప్పిన విషయాలు నాటుకుపోయాయి.
నరుమోవ్ అశ్వరక్షకులందరికీ తన గదుల్లో ఆతిథ్యం ఇచ్చి రెండురోజులైంది.
మూడోరోజు వుదయం…
లిజవెతా ఇవనొవ్న ఎంబ్రాయిడరీ ఫ్రేం పట్టుకుని కిటికీ ముందు కూర్చుని వుంది. యధాలాపంగా బయటికి చూస్తే ఒక యువ ఇంజనీరు తనున్న కిటికీవైపే తదేకంగా చూస్తూ నిలబడి వుండటాన్ని చూసింది. వెంటనే తలొంచుకుని తనపనిలో లీనమైంది. కానీ మనసు ఆగలేదు. ఐదునిముషాలకి తలెత్తి చూసింది. అతనలాగే నిలబడి వున్నాడు. రహదారివెంట వచ్చిపోయేవాళ్ళని గమనించే అలవాటు లేని కారణాన మళ్ళీ తల దించుకుని పనిలో మునిగింది. అలా రెండుగంటలు గడిచాయి. భోజనానికి రమ్మని పిలుపు వచ్చింది. ఎంబ్రాయిడరీ ఆపి లేచింది. చూస్తే అతనక్కడే వున్నాడని అర్థమైంది. వింతగా అనిపించింది. భోజనమయాక కొంచెం ఇబ్బందిపడుతూ కిటికీదగ్గరకు వెళ్ళి చూస్తే ఈమాటు అతను లేదు. ఇంక ఆ విషయం మర్చిపోయింది.
రెండురోజులతర్వాత వృద్ధకౌంటెస్‍తో బయటికి వెళ్తూ, గుర్రపుబగ్గీలో ఎక్కబోతున్న సమయాన అతన్ని మళ్ళీ చూసింది. బగ్గీ తలుపుకి బాగా దగ్గరగా నిలబడి వున్నాడు. ముఖాన్ని సగందాకా వున్నిటోపీతో కప్పుకున్నాడు. టోపీ కిందనుంచీ అతడి కళ్ళు మెరుస్తున్నాయి. ఎందుకో తెలీదుగానీ లిజవెతాకి కంగారేసింది. బగ్గీలో కూర్చుంటూ సన్నగా వణికింది. తిరిగి వచ్చిన వెంటనే ఆమె కిటికీదగ్గరకి పరిగెత్తి చూసింది. అతడు ఎప్పట్లాగే, ఎప్పుడూ నిలబడ్డచోటే కిటికీకి కళ్ళప్పగించి నిలబడి వున్నాడు. ఆమెలో ఏదో తెలీని అలజడి. ఇదంతా కొత్తగా వుంది.
అది మొదలు, ఆ యువ ఆఫీసరు నిర్ణీతసమయానికి వచ్చి అక్కడ నిలబడకుండా ఒక్కరోజుకూడా గడవలేదు. వాళ్ళిద్దరిమధ్యా ఒక మౌనపరిచయం ఏర్పడింది. తన పని తను చేసుకుంటూనే అతనక్కడ వుండటాన్ని ఆస్వాదిస్తోంది. మధ్యమధ్యలో కళ్ళెత్తి అతన్ని చూస్తోంది. రోజురోజుకీ చూపుల వ్యవధికూడా పెరుగుతోంది. ఆ యువకుడు ఆమె తననలా చూడటాన్ని ఎంతో కృతజ్ఞతతో స్వీకరించాడు. వాళ్ళిదరి చూపులూ కలుసుకున్నప్పుడు ఆమె చెంపలు ఎర్రబడేవి. కొద్దిరోజులు గడిచేసరికి అతన్ని చూసి ఆమె పెదవులమీద నవ్వులుకూడా విరియటం మొదలయాయి.
హెర్మాన్ తండ్రి జర్మన్. కానీ రష్యాలో పౌరసత్వం తీసుకుని స్థిరపడ్డాడు. తండ్రినుంచీ హెర్మాన్‍కి కొద్దిమొత్తం సొమ్ము వారసత్వంగా వచ్చింది. అతడు స్వతంత్రంగానే బతకాలనుకుని ఆ డబ్బుని వాడకుండా కేవలం తన జీతంమీదే బతుకుతూ వస్తున్నాడు. జీతమేమీ పెద్దది కాదు. అందుకని ఎలాంటి విలాసాలకీ పోకుండా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. చాలా ముభావి, అతి పొదుపరి, పట్టుదలకలవాడూ కావటంచేత సహోద్యోగులెవరికీ అతన్ని విందులిమ్మని అడిగే అవకాశం రాలేదు. అతను చాలా ఆవేశపరుడు. మంచి వూహాశక్తిగలవాడు. కానీ ఎక్కడా తొణకడు. తనని తను నియంత్రించుకోగలడు. అందుకే చాలామంది యువకులు చేసే పొరపాట్లు చేయడు. ఈ పరస్పర విరుద్ధమైన మనస్తత్వంచేతనే ఆడాలని లోలోపల ఎంత కోరిక వున్నా, ఇప్పటిదాకా పేకముక్క ముట్టుకోలేదు.
దానికి అతడు చెప్పే కారణం ఒక్కటే, మబ్బుల్లో నీళ్ళని చూసి ముంతలో వున్నవి వంపుకోము కదాని. ఐనప్పటికీ వాళ్ళ ఆటనిమాత్రం ఎంతో వుత్సుకతతో చూస్తాడు.
టామ్‍స్కీ చెప్పిన మూడుముక్కల కథ అతనిమీద బలమైన ముద్ర వేసింది. ఆ రాత్రంతా అదే ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ మరునాడు సెయింట్ పీటర్స్‌బర్గ్ వీధుల్లో నడుస్తూ అనుకున్నాడు. “ఆ వృద్ధ కౌంటెస్ కనుక ఆ రహస్యాన్ని నాకు చెప్తే? కేవలం ఆ మూడు గెలుపుముక్కల పేర్లు చెప్తే? నేనెందుకు నా అదృష్టాన్ని పరీక్షించుకోకూడదు? ఆమెని పరిచయం చేసుకోవాలి. అభిమానాన్ని సంపాదించాలి. అప్పుడుకదా, అనుకున్నది జరిగేది? కౌంటెస్‍కి ఇప్పటికే ఎనభయ్యేడేళ్ళు. ఈ వారంలోనో, ఇంకా మాట్లాడితే రెండురోజుల్లోనో చనిపోవచ్చు. అప్పుడామె దగ్గరున్న రహస్యం ఏమౌతుంది? అది నిజమేనా? కాదు… పొదుపు, శ్రమ, తాగుడులాంటి వ్యసనానికి దూరంగా వుండటం ఈ మూడేకదా, మనిషిని గెలిపించే మూడుముక్కలు… వాటినే యింతకాలం నేను నమ్ముతూ వచ్చాను? నా డబ్బుని రెండు, మూడు, ఏడురెట్లేనా చేసుకోగలనని అనుకున్నాను? మరిదేమిటి, కొత్తగా ఆలోచిస్తున్నాను?”
ఇలా గజిబిజిగా ఆలోచనలు. అదే ధ్యాసలో నడిచినడిచి చివరికి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఒక ముఖ్య రహదారి చేరుకుని ఒక పురాతన భవంతిముందు ఆగాడు. ఇంటిముందంతా దేదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి. రహదారంతా గుర్రపుబగ్గీలతో, బండ్లతో క్రిక్కిరిసిపోయి వుంది. ఒకదానివెంట ఒకటి వచ్చి ఆ యింటిముందు ఆగుతున్నాయి. వాటిల్లోంచీ అనేక తరహా మనుషులు దిగుతున్నారు.
“ఎవరిల్లు ఇది”? ఒక మూలని నిల్చున్న గృహసంరక్షకుడిని అడిగాడు.
“కౌంటెస్ అన్నా ఫెదతొవ్నాది” అది జవాబు.
హెర్మాన్ ముందుకి కదిలాడు. మూడుముక్కల వింతకథ అతని మదిలో మళ్ళీ మెదిలింది. కౌంటెస్ గురించీ ఆమె దగ్గరున్న రహస్యాన్నిగురించీ ఆలోచిస్తూ అదే రహదారి వెంట ఆ యింటిముందునించీ అటూయిటూ తిరిగాడు. రాత్రి తన బస చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది. రాత్రంతా నిద్రలేదు. పొరపాట్న తెల్లారి చిన్న కునుకు పట్టినా కలలు, ఆ కలలనిండా పేకముక్కలు, ఆకుపచ్చటి ఆటబల్లలు, గుట్టలకొద్దీ బేంకునోట్లు, బంగారు నాణేలు. అతను ఒక ముక్క తర్వాత ఇంకొకదానిమీద నిరంతరాయంగా ఆడుతునే వున్నాడు, గెలుస్తునే వున్నాడు, జేబులనిండా డబ్బు నింపుకుంటునే వున్నాడు. కలతనిద్రతో వుదయం లేచేసరికి బాగా ఆలస్యమైంది. మెలకువ రాగానే అదంతా కలని గ్రహించి, కలలోని సంపదని తలుచుని నిట్టూర్చాడు. మళ్ళీ నగరవిహారానికి బయల్దేరాడు. ఏదో అజ్ఞాతశక్తి అతన్నిక్కడికి లాక్కొచ్చినట్టు కౌంటేస్ ఇంటిముందుకి చేరుకున్నాడు. అక్కడ ఆగి తలెత్తి పైకి చూస్తే ఒక కిటికీదగ్గర నల్లటి తలకట్టుగల వ్యక్తి ఎవరో వంగి ఏదో పని చేసుకుంటూ కనిపించింది. బహుశ: ఎంబ్రాయిడరీ చేసుకుంటుండవచ్చనుకున్నాడు. అతని వూహ నిజమే. ఆ వ్యక్తి తల పైకెత్తి చూసారు. చక్కటి ఛాయ, నల్లటి కళ్ళూగల వదనాన్ని అతను చూసాడు. అతని భవిష్యత్తుని నిర్ణయించిన క్షణం అది!
ఒక పథకం… ఒక స్వార్థం… ఒక నీతిబాహ్యత.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.