అంతరాత్మ సాక్షి – 4 Translation by S Sridevi

  1. అంతరాత్మ సాక్షి – 1 Translation by S Sridevi
  2. అంతరాత్మ సాక్షి – 2 Translation by S Sridevi
  3. అంతరాత్మ సాక్షి – 3 Translation by S Sridevi
  4. అంతరాత్మ సాక్షి – 4 Translation by S Sridevi

రష్యన్ మూలం “Pikovaya dama” by Alexander Pushkin(in 1833)
Translated to English as “The queen of Spades” by Mrs Sutherland Edwards (in 1892) and available in Project Gutenberg in the Public domain.

అతనలా నిలదీస్తుంటే కౌంటెస్‍కి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే మొదట్లోలాగా బిగుసుకుపోయింది. హెర్మాన్‍కికూడా అర్థమైంది.
“దయచేసి చెప్పండి” హెర్మాన్ మళ్ళీ అడిగాడు. ఆమె మాట్లాడలేదు.
“ఎవరికోసం మీరీ రహస్యాన్ని దాస్తున్నారు? మీ మనుమలకోసమా? వాళ్ళంతా యిప్పటికే చాలా ధనవంతులు. ఇప్పుడు కొత్తగా ఆ రహస్యం తెలుసుకుని సంపాదించవలసినంత అవసరం వాళ్ళకి లేదు. మీకుకూడా. మీకెవరికీ డబ్బు విలువే తెలీదు. ఒక పిసినారివాడికి ఎంత డబ్బున్నా నిరుపయోగమే. వారసత్వపు ఆస్తులు నిలబెట్టుకోలేని అసమర్ధుడికి ఎంత వున్నా, కోరిన కోరికలన్నీ తీర్చే భూతం వున్నా దండగే. నేను వీటిలో ఏ కోవకీ చెందను. నాకు డబ్బు విలువ బాగా తెలుసు. మీరు చెప్పే రహస్యం వృధా అవదు… చెప్పండి” ఎంతో ఆదుర్దాగా జవాబుకోసం చూసాడు. ఆమె నోరిప్పలేదు. అతను మోకాళ్ళమీద కూలబడ్డాడు.
“మీ హృదయంలో ప్రేమనేది వుంటే, దానియొక్క గురుతులు ఇప్పటికీ మిమ్మల్ని పులకింపజేస్తుంటే, మీ కడుపున పుట్టిన శిశువుయొక్క మొదటిరోదన విని మీరు చిరునవ్వు నవ్వి వుంటే… అలాంటి మానవియమైన భావనలు మీ గుండెలో ఎప్పుడైనా కదిలి వుంటే… ఒక తల్లిగా, భార్యగా, ప్రేయసిగా ప్రేమ అనేదాన్ని అనుభవించి వుంటే దయచేసి నా ప్రార్థనని అర్థం చేసుకోండి. ఆ రహస్యాన్ని నాకుచెప్పండి. ముందే చెప్పినట్టు అది మీకు వుపయోగపడదు… బహుశ: ఆ రహస్యం పాపకర్మలతోముడిపడి, దాన్ని బయటికి చెప్పటం దేవుని చేరుకునే మీదారిలో ఆటంకంగా నిలుస్తుందేమో, సైతానుది పైచేయౌతుందేమోననికూడా మీరు కంగారుపడవద్దు. మీకా భయం వద్దు. మీ పాపాలభారాన్ని నేను మోయటానికి సిద్ధంగా వున్నాను. దయచేసి చెప్పండి. నా ఒక్కడి సంతోషమేకాదు, నా పిల్లలు మనవలు, మునివలు… వీళ్ళందరి సంతోషం మీచేతుల్లో వుంది. యావత్తు వంశమే మీకు రుణపడి వుంటుంది. మా తలరాతల్ని మార్చివేసిన గొప్పవ్యక్తిగా మిమ్మల్ని గుర్తుంచుకుంటాం” అన్ని అస్త్రాలూ ప్రయోగించాడు.
కౌంటెస్ నోరు తెరవలేదు.
హెర్మాన్ లేచి నిలబడ్డాడు. అతని సహనం నశించింది.
“ఓసి ముసలీ! నువ్వెందుకు చెప్పవో నేను చూస్తాను” ఆగ్రహంగా అంటూ జేబులోంచీ తుపాకీ తీసాడు. తుపాకీ చూడగానే వృద్ధురాలు మరోమాటు తీవ్రభయాందోళనలకి గురైంది. తనని కాపాడుకోవటానికన్నట్టు రెండుచేతులూ అడ్డుపెట్టుకుంది. మరునిముషంలో వెనక్కి వొరిగిపోయింది. ఆమెలో చలనం ఆగిపోయింది.
“నీ నాటకాలు కట్టిపెట్టు. నా దగ్గర కాదు” అన్నాడు హర్మాన్, ఆమె చేతిని గట్టిగా పట్టుకుని. “ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పు. ఆ మూడుముక్కలూ ఏమిటి? చెప్తావా, చెప్పవా?”
వృద్ధురాలు కుర్చీలో వెనక్కి వొరిగిపోయింది.


లిజవెత ఐవనోవ్న తనగదిలో కూర్చుని వుంది. ఇంకా బట్టలు మార్చుకోలేదు. దీర్ఘాలోచనలో నిమగ్నమై వుంది. ఆమె పరిస్థితి ఎప్పటిలాగే. బాల్‍నుంచీ తిరిగొచ్చాక దుస్తులు మార్చుకోవటంలో సాయపడతానని పరిచారిక కొంత అయిష్టంగా అంది. ఆమెని వద్దని చెప్పి పంపేసి, హడావిడిగా గదిలోకి వచ్చింది. హెర్మాన్ అక్కడ తనకోసం ఎదురుచూస్తుంటాడని అనుకుంది. అతనలా అక్కడ వుండాలనీ వుంది, వద్దనీ వుంది. ద్వైదీభావం. అతనా గదిలో లేకపోవటం కొంత సాంత్వననిచ్చింది. ఇంత కొద్దికాలంలోనే అతనంత పరిచయం పెంచుకుని, కలవటానికి తనని వప్పించడం ఇంకా ఆశ్చర్యంగానే వుంది. అసలతనిగురించి తనకేం తెలుసని? పేరేనా అతనుగా వుత్తరాల్లో రాసిందే తప్ప, నిజమో కాదో తెలీదు. అతని గొంతు ఎప్పుడూ వినలేదు. ఈరోజు బాల్‍లో విన్నదితప్ప అతనిగురించి ఎవరూ మాట్లాడుకోగా చూడలేదు.
ఇంకా వింతగా ఆ బాల్‍లో టామ్‍స్కీ, ఎలెత్జ్‌కేయ పౌలైన్ యువరాణి విషయంలో చిరాకుపడ్డాడు. అంతకుముందు అతనితో ఎంతో సరదాగా గడిపినదే ఐనా, ఈరోజెందుకో అతన్ని దూరం పెట్టేసింది. అతనిపట్ల ఆసక్తి చూపలేదు. దాంతో కోపం వచ్చిన టామ్‍స్కీ లిజవెతతో కలిసి మెౙెకె నాట్యం మొదలుపెట్టాడు. అది నిరంతరాయంగా కొన్నిగంటలపాటు సాగింది. నాట్యం చేస్తున్నంతసేపూ ఆమెనతను ఇంజనీర్లపట్ల పక్షపాతం వుందని సాధిస్తునే వున్నాడు. ఆమె అనుకుంటున్నదానికన్నా తనకి ఎక్కువే తెలుసనికూడా చెప్పాడు. తన రహస్యం అతనికి తెలిసిపోయిందనుకుంది లిజవెత.
“నీకెలా తెలుసు ఇవన్నీ? ఎవరు చెప్పారు?” చిన్నగా నవ్వి అడిగింది.
“నీక్కూడా తెలిసిన ఒక ప్రముఖవ్యక్తి స్నేహితునిద్వారా”
“ఆ ప్రముఖవ్యక్తి ఎవరట?”
“హెర్మాన్!!!”
లిజవెత నివ్వెరబోయింది. ఏమీ జవాబివ్వలేదు.
“హెర్మాన్ చాలా అందంగా వుంటాడు. నెపోలియన్‍లాంటి సుందరమైన రూపం వుంది కానీ ఫాస్ట్‌లోని మెఫిస్టొఫిలెస్ దయ్యంలాంటి మనస్తత్వం. కనీసం మూడు నేరాలకేనా అతను తన అంతరాత్మకి జవాబిచ్చుకోవలసివుంటుంది… అయ్యయ్యో! అలా పాలిపోయిందేమిటి నీ ముఖం లిజవెతా!”
“కొద్దిగా తలనెప్పిగా వుంది. అదిసరే, ఈ హెర్మాన్ స్నేహితుడు… సరే పేరేదైతే ఏమిటిలే, నీతో ఏం చెప్పాడు?”
“హెర్మాన్‍ నీ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడట. నీగురించీ ఏం చెప్పినా చాలా శ్రద్ధగా వింటాడట”
“హెర్మాన్ నన్నెక్కడ చూసాడట?”
“బహుశ: చర్చిలో. లేదా ఏదేనా పెరేడ్ జరిగినప్పుడు. ఎవరికి తెలుసు? అదీ కాకపోతే నీగదిలో, నువ్వు నిద్రపోతుండగా. అతనికి సాధ్యపడనిదంటూ ఏదీ వుండదు.”
సంభాషణ ఇంకా కొనసాగేదేగానీ ముగ్గురు యువతులు అక్కడికి రావటంతో ఆగిపోయింది. వాళ్ళతన్ని నాట్యానికి రమ్మని కవ్వించి తీసుకెళ్ళారు. ప్రిన్సెస్ పౌలిన్ ఇప్పుడు అతని భాగస్వామి. నాట్యంలోని కదలికలు, సాన్నిహిత్యం అంతకుముందు అతనిపట్ల చూపించిన వుదాశీనతని ఆమెలోంచీ తొలగింవేసాయి. నాట్యం అయాక ఆమెని గౌరవంగా కుర్చీదగ్గరికి చేర్చాడు టామ్‍స్కీ.
ఇదంతా తలలో తిరుగుతుండగా, వర్తమానంలో హెర్మాన్ ఆమె ముందుకి వచ్చి నిలబడ్డాడు. నెపోలియన్‍లాంటి రూపం… టామ్‍స్కీ మాటలు గుర్తొచ్చాయి. ఆమె బిత్తరబోయింది.
“అసలెందుకు వచ్చారు? మిమ్మల్నిక్కడినుంచీ బయటికెలా పంపను? ” మాటలు పేర్చుకుంటూ అడిగింది. “మిమ్మల్ని రహస్యమెట్లమార్గం ద్వారా పంపించాలనుకున్నాను. అక్కడికికూడా కౌంటేస్ పడగ్గదిలోంచే వెళ్ళాలి. ఇప్పుడెలా?”
“నువ్వు రావొద్దు. నేనొక్కడినే వెళ్తాను”
లిజవెతా లేచింది. తన బల్లసొరుగులోంచీ తాళంచెవి తీసి అతనికి యిచ్చి ఎలా వెళ్ళాలో చెప్పింది. హెర్మాన్‍కి ఒక్క క్షణం తప్పు చేసిన మళ్ళీ భావన కలిగింది. ఐతే అలాంటివాటిని అతను అవలీలగా జయించగలడు. ఇంతకుముందే అనుభవమైందికూడా. చల్లగా మంచులా వుండి చెమటతో తడిసిపోయిన చేతిని తనచేతితో నొక్కి వదిలేసి, తల వంచి అభివాదం చేసి వెళ్ళిపోయాడు.
మెట్లు దిగి, మరోసారి కౌంటెస్ పడగ్గది లోపలికి ప్రవేశించాడు. చనిపోయిన వృద్ధురాలు భయంతో బిగదీసుకుపోయినట్టు కూర్చున్న భంగిమలో వుంది. ఆమె ముఖంలో ప్రగాఢమైన ప్రశాంతత. హెర్మాన్ ఆమె ముందు ఆగి తదేకంగా అలాగే చూస్తూ వుండిపోయాడు. జరిగిన వాస్తవాన్ని గుర్తించడానికి మనసు నిరాకరించింది. అతికష్టమ్మీద అక్కడినుంచీ కదిలి కేబినెట్‍లోకి, తర్వాత పరదా అవతలకి, నెమ్మదిగా మెట్లమీదికి. వింత భావోద్వేగాలు అతన్ని ముంచెత్తాయి. “ఈ మెట్లమీదుగా… ఇదే గదిలోంచీ ఇదే సమయానికి ఈ వృద్ధురాలు ఒక అరవయ్యేళ్ళక్రితం అత్యంత విలాసంగా తన భర్తతో కలిసి, అతడి చేతిని తన చేత్తో పట్టుకుని దిగి వుంటుంది. అతడు ఎన్నోఏళ్ళుగా ఈమెకోసం తన సమాధిలో ఎదురుచూస్తూ వుండచ్చు. ఈ వృద్ధురాలిగుండె ఈరోజున ఆగింది” అనుకున్నాడు విషాదంగా.
మెట్లు దిగడం అయింది. మెట్ల చివర ఒక తలుపు కనిపించింది. అందులోంచీ వెళ్తే ఒక వసారా. దాన్ని దాటగానే రహదారి.


ఆ విషాదకర సంఘటన జరిగి మూడురోజులైంది. ఉదయం సరిగ్గా తొమ్మిదింటికి కౌంటెస్ అంత్యక్రియలు చూడటానికి కాన్వెంటుకు వెళ్ళాడు హెర్మాన్. పెద్దగా పశ్చాతాపం అంటూ ఏమీలేదుగానీ అంతరాత్మకి ఎక్కడో అనిపిస్తోంది, వృద్ధురాలిని తనే హత్యచేసాడని. అతనికి మత విశ్వాసాలకన్నా మూఢనమ్మకాలెక్కువ. ఇక్కడికి గనుక వచ్చి మృతురాలిని క్షమాపణ అడక్కపోతే, ఆవిడ దయ్యమై తనను పట్టుకుంటుందన్న భయం జాస్తి.
అంత్యక్రియలకు వచ్చినవారితో చర్చి క్రిక్కిరిసిపోయి వుంది. అతికష్టమ్మీద హెర్మాన్ కాఫిన్ దగ్గరకి వెళ్ళగలిగాడు. శవపేటిక ఒక ఎత్తైన వేదికమీద వుంది. తెల్లటి శాటిన్ దుస్తుల్లో, తలకి చక్కటి లేసుటోపీతో రెండుచేతులూ చాతీమీద క్రాస్‍గా పెట్టుకుని వృద్ధురాలు అందులో పడుకుని వుంది. వేదిక చుట్టూ బంధువులు – పిల్లలు, మనుమలు మరియు మనవరాళ్ళు తీవ్రశోకసూచనగా తలొంచుకుని నిలబడి ఉన్నారు. అధికారలాంఛనాలు ధరించి నల్లటిదుస్తుల్లో చేతుల్లో కొవ్వొత్తులతో సేవకులు నిలబడి ఉన్నారు.
ఎవరూ పెద్దగా ఏడవటంలేదు.
వాస్తవానికి కౌంటెస్ మృతి ఎవరికీ పెద్దగా ఆశ్చర్యంగానీ దు:ఖాన్నిగానీ కలిగించలేదు. పైకిమాత్రం అంతా అదొక సాంప్రదాయంగా సాగుతోంది. సన్నిహితులు ఆమెని ఒక వ్యక్తిగా లెక్కించడం ఎప్పుడో మానేసారు. ఆమెని వదిలిపెట్టి ప్రపంచం ఎప్పుడో ముందుకి సాగిపోయింది. మతబోధకుడు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. క్లుప్తంగానే ఐనా, గట్టిపదాలతో ఆమె గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నాడు. ” ఎన్నో దశాబ్దాలు నైతికవర్తనంతో గడిపి సునాయసమైన మరణాన్ని పొందింది. చర్చియొక్క పిలుపుకోసం ప్రశాంతమనస్సుతో ఎదురుచూస్తున్న ఆమె హృదయఘోషను మృత్యుదేవత వినిపించుకుని ఆమెను కనికరించాడు” అని వుపన్యాసాన్ని ముగించాడు.
గాఢమైన నిశబ్దత మధ్య అంతిమకార్యక్రమాలు జరిగాయి. వచ్చినవాళ్ళంతా ఒకొక్కరే వెళ్ళి ఆఖరిచూపు చూసుకున్నారు. చివర్లో వృద్ధురాలి సమవయస్కురాలైన ఒక స్త్రీ ఇద్దరు పిల్లలసాయంతో వచ్చింది. వంగి అభివాదం చెయ్యలేక నెమ్మదిగా వృద్ధురాలి చేతిని తన చేత్తో పట్టుకుని ముద్దుపెట్టుకుని, రెండు కన్నీటిబొట్లతోపాటు వదిలిపెట్టింది. సమవయస్కులమధ్యమాత్రమే అనుబంధాల, అనుబంధాల పంపకాల లోతు పరుచుని వుంటుంది.
అందరూ అయాక ఆఖరుగా హెర్మాన్ నెమ్మదిగా శవపేటికవద్దకు వెళ్ళాడు. మోకాళ్ళమీద మోకరిల్లాడు. చాలాసేపు అలాగే వుండిపోయాడు. నెమ్మదిగా లేచి శవపేటికలోకి తొంగిచూసాడు. చనిపోయిన స్త్రీ పెదవులమీద ఎగతాళితోకూడిన చిరునవ్వు కనిపించిందతనికి. ఒక కన్ను సగం తెరిచి తనకేసి చూసినట్టుకూడా అనిపించింది. చక్షుభ్రాంతి. అతను తట్టుకోలేకపోయాడు. లేచి వెనక్కి వచ్చేసాడు. మెట్టు సరిగా చూసుకోక కిందపడిపోయాడు. చుట్టూ వున్నవారు అతన్ని లేవదీసారు. అదేసమయానికి లెజవెతా స్పృహతప్పి పడిపోయింది. ఆమెను పక్కకి తీసుకెళ్ళారు. ఈ రెండు సంఘటనలతో అక్కడి విషాదంలోని గాఢత కొంచెం తగ్గినట్టనిపించింది. అది గుర్తించి మళ్ళీ వెంటనే అందరూ విషాదాన్ని ముఖాలకు పూసుకున్నారు.
“అతనెవరు?” హెర్మాన్‍గురించి గుసగుసలు సాగాయి.
“వృద్ధురాలి పెంపుడుకొడుకు కావచ్చు” అన్నాడు వృద్ధురాలి బంధువొకడు.


ఆరోజంతా హెర్మాన్ విచిత్రమైన వుత్సాహంలో కొట్టుకుపోయాడు. ఎప్పుడూ వెళ్ళని కొత్త రెస్టరెంటులో భోజనం చేసాడు. పీకలదాకా తాగాడు. మనసులో వున్న అలజడి తగ్గుతుందనుకుంటే దానికి భిన్నంగా అతని ఉల్లాసం మరింత పెరిగింది. ఇంటికి వచ్చాడు. బట్టలేనా మార్చుకోకుండా అలాగే పడి నిద్రపోయాడు. గాఢనిద్రలో కూరుకుపోయాడు. తెల్లారి పావుతక్కువ మూడింటికి మెలకువ వచ్చింది. తాగినమత్తూ, నిద్రమత్తూ పూర్తిగా ఎగిరిపోయాయి. వృద్ధ కౌంటెస్ అంత్యక్రియలు గుర్తొచ్చాయి. అతడి అంతరంగంలోని రెండుపొరల మధ్య సంఘర్షణ మొదలైంది. తీవ్రతరమైంది. ఆమె మృతికి తనే కారకుడు. అమాయక యువతి లిజవెతానికూడా మోసం చేసాడు. అవసరానికి వాడుకున్నాడు. ఇవన్నీ అపరాథాలని లోపలిపొర ఘోషిస్తూ వుంటే బయటిపొరలోని ప్రలోభాలు దాని నోరుమూసేసాయి. అదింక అతని మనసుతో ఆడుకోవటం మొదలుపెట్టింది.
అదేసమయానికి బాటవెంట వెళ్తున్నవారెవరో ఆగి, తనింటి కిటికీలోంచీ తొంగిచూసినట్టనిపించింది. పట్టించుకోలేదు. ముందువసారా తలుపు చప్పుడైంది. తన సేవకుడే తప్పతాగి, ఏదో వెధవపని చేసి వచ్చివుంటాడనుకున్నాడు. కానీ అడుగులచప్పుడు కొత్తగా వుంది. తన సేవకుడిది కాదు. మెత్తటి చప్పుడది. ఒక స్త్రీ. తెల్లటిబట్టల్లో వున్న ఆ స్త్రీని దూరాన్నించీ చూసి అతను తన చిన్నప్పటి దాది అనుకున్నాడు. వెంటనే సందేహం. ఇంతరాత్రివేళ ఎందుకు వస్తుందని. ఆ స్త్రీ నేలమీద జారుతున్నంత వేగంగా అతని దగ్గరకు వచ్చి నిలబడింది.
ఆమె… వృద్ధ కౌంటెస్!!!
అతను దిగ్భ్రాంతుడయాడు.
“నా అభీష్టానికి విరుద్ధంగా నీ దగ్గరకి వచ్చాను” స్థిరంగా అంది. ” నీవు అడిగిన రహస్యం చెప్తాను. పేకాటలో నిన్ను గెలిపించే ఆ మూడుముక్కలూ మూడు, ఏడు, ఆసు. ఐతే నావి మూడు షరతులు. మొదటిది, రోజుకి ఒకముక్క మాత్రమే ఆడాలి. రెండవది, మొత్తం మూడుముక్కలూ ఐపోయాక ఇంక జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోకూడదు. మూడు, లిజవెత ఐవనోవ్నాని పెళ్ళిచేసుకోవాలి” ఈమాటలు అనేసి, కౌంటెస్ గిర్రున వెనక్కి తిరిగి వచ్చినంత వేగంగా గాల్లో తేలుతున్నట్టు వెళ్ళిపోయింది. వీధితలుపు తెరుచుకుని మళ్ళీ మూసుకోవటం వినిపించింది. కిటికీలోంచీ తననెవరో చూడటాన్ని మళ్ళీ గమనించాడు హెర్మాన్.
చాలాసేపటిదాకా అసలేం జరిగిందో అర్థమవ్వలేదు. అలాగే కొయ్యబారినట్టు కూర్చుని వుండిపోయాడు. నెమ్మదిగా లేచి పక్కగదిలోకి వెళ్ళాడు. సేవకుడు తప్పతాగేసి నేలమీద పడి నిద్రపోతున్నాడు. అతికష్టమ్మీద అతన్ని లేపి వృద్ధకౌంటెస్ రాకగురించి అడిగితే అసలేమీ చెప్పలేకపోయాడు. వీధితలుపు చూస్తే లోపల్నుంచీ గొళ్ళెంపెట్టి వుంది. తనగదిలోకి వెళ్ళి కొవ్వొత్తి వెలిగించుకుని ఆ వెలుతుర్లో జరిగినదంతా రాసుకున్నాడు. లోపలి పొర అతని మనసుమీద పూర్తి పట్టు సాధించింది.


భౌతికప్రపంచంలో రెండు వస్తువులు ఏకకాలమందు ఒకే స్థానాన్ని ఎలా ఆక్రమించలేవో, నైతికప్రపంచంలో రెండు స్థిరమైన, వ్యతిరేకమైన ఆలోచనలు ఒక మనసులో కలిసి ఉండలేవు.
మూడు, ఏడు, ఆసు… ఈ మూడు అంకెలు అతని మనసులోంచీ కౌంటెస్ మృతి తాలూకా ఆలోచనలనీ, అపరాథభావాన్నీ తుడిచేసాయి. కళ్ళుమూసినా తెరిచినా అవే అంకెలు అతన్ని వెంటాడుతున్నాయి. ఒక జపంలా అతని పెదాలు పదేపదే ఆ పదాలని పలుకుతున్నాయి. మనసునిండా ఒకటే ఆలోచన. ఎంతో కష్టపడి తెలుసుకున్న ఈ రహస్యాన్ని వుపయోగించుకుని ఏవిధంగా లాభపడాలని. సెలవుపెట్టి విదేశాలకి వెళ్ళాలని అనుకున్నాడు. పారిస్ వెళ్ళి అక్కడి జూదగృహాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అవేవీ చెయ్యకుండానే అతనికి కలిసివచ్చింది.
పేకాటలో జీవితమంతా గడిపి, అపారసంపదని పోగుచేసుకున్న ప్రఖ్యాత జూదగాడు చెకలిన్‍స్కీ అధ్యక్షతన నడుస్తున్న ధనికజూదరుల సంఘం ఒకటి మాస్కోలోనే వుందని తెలిసింది. అతడిగురించిన ఎన్నో విశేషాలు ప్రాచుర్యంలో వున్నాయి. అతను గెలిచినవాటికి ప్రామిసరీనోట్లైనా తీసుకుంటాడట. పోగొట్టుకున్నదాన్ని మాత్రం డబ్బులోనే చెల్లిస్తాడట. ఓటమి అరుదు.
పేకాటలో అతని సుదీర్ఘమైన అనుభవం తోటిజూదరుల నమ్మకాన్నీ, పేకాటకి అనువైన అతని యిల్లు, రుచికరమైన వంటలు చేసిపెట్టే అతని వంటవాడు, అతని పద్ధతులు… ఇవన్నీ సాటివాళ్ళలో గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. అటువంటి వ్యక్తి సెంట్ పీటర్స్‌బర్గ్‌కి వచ్చి బస చేసి వున్నాడన్న వార్త అగ్గినిప్పులా అంటుకుంది. ఇంకేముంది, రాజధాని నగరంలోని యువకులంతా తమ నృత్యగానవిలాసాలన్నీ వదిలిపెట్టి అతని బసకి పరుగులు తీసారు. హెర్మాన్‍కి కూడా ఆ సెగ సోకింది. తన యావదాస్తినీ డబ్బుగా మార్చుకుని బయల్దేరాడు. నరుమోవ్ హెర్మాన్‍ను అక్కడికి తీసుకెళ్ళాడు.
విలాసవంతమైన అనేక గదులని దాటుకుంటూ అక్కడికి చేరుకున్నారు. చెకలిన్‍స్కీ బస క్రిక్కిరిసిపోయి వుంది. జనరల్స్, ప్రైవీకౌన్సిల్స్‌ నలుగురేసి చేరి విస్ట్ ఆడుతున్నారు. యువకులు ఐస్‍క్రీమ్ తింటూ పొగగొట్టాలను పీలుస్తూ వెల్వెట్‍గలేబులున్న సోఫాల్లో నిర్లక్ష్యంగా కూర్చుని వున్నారు.
డ్రాయింగ్-రూమ్‍లో ఒక పొడవైన బల్ల మొదట్లో చెకలిన్‍స్కీ కూర్చుని వున్నాడు. ఇరవైమందిదాకా ఆడటానికి వచ్చి వున్నారు. వచ్చినవాళ్ళంతా బల్ల చుట్టూ చేరి ఆడుతున్నారు. చెకలిన్‍స్కీ వారి డబ్బు లావాదేవీలు చూస్తున్నాడు. అతడు దాదాపు అరవై సంవత్సరాల వయస్సుగల హుందాయైన వ్యక్తి. జుత్తు వెండివలె మెరుస్తోంది. ఎర్రగా వున్న ముఖం అతడి మంచిస్వభావానికి ప్రతిబింబంలా వుంది. కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. పెదాలమీద చెక్కుచెదరని చిరునవ్వు. నరుమోవ్ హెర్మాన్‌ని అతనికి పరిచయం చేశాడు. చెకలిన్‍స్కీ ఇద్దరితోటీ చేతులు కలిపి కూర్చొమ్మని అభ్యర్ధించి, మళ్ళీ ఆటలో పడ్డాడు.
ఆట కొంతసేపు నిర్విఘ్నంగా సాగింది. బల్లమీద ముప్పైకి పైగా ముక్కలు వున్నాయి. ముక్క వేసినప్పుడల్లా తమ ముక్కలు సర్దుకోవడానికీ, ఎంతెంత పోగొట్టుకున్నారో గుర్తుతెచ్చుకుని లెక్కవేసుకోవటానికీ ఆటగాళ్ళకి కొంత వ్యవధి ఇస్తున్నాడు చెకలిన్‍స్కీ. వాళ్ళు అడిగిన సమాచారం ఇవ్వటంతోపాటు వంకరపోయిన ముక్కల కొనలుకూడా సరిచేస్తున్నాడు. ఎట్టకేలకి ఆట పూర్తైంది. చెకలిన్‍స్కీ మరో ఆటకోసం ముక్కలన్నీ కలపబోతున్నాడు.
“నాకూ ఒక అవకాశమిస్తారా?” బేంకునోటు రాస్తోన్న ఒక పెద్దమనిషి వెనుకనుంచీ హెర్మాన్ అడిగాడు.
చెకలిన్‍స్కీ చిరునవ్వు నవ్వి, నిశబ్దంగా సమ్మతిని తెలిపాడు. నరుమోవ్ పెద్దగా నవ్వాడు. ఆటకి దూరంగా వుండాలని ఎంతోకాలంగా పాటిస్తూ వస్తున్న నియమాన్ని పక్కన పెట్టినందుకు హెర్మాన్‍కి అభినందనలు తెలిపాడు. అంతేకాదు, ఇదో శుభారంభం కావాలని కూడా అన్నాడు.
“పందెం” అన్నాడు హెర్మాన్. తన ముక్క వెనుక సుద్దముక్కతో ఒక అంకె రాసి చూపించాడు.
చెకలిన్‍స్కీ కళ్ళు చికిలించాడు. అతనిలో అపనమ్మకం. “నేను సరిగా చూడలేకపోతున్నాను. దయచేసి ఒకసారి చెప్తారా?” అని అడిగాడు.
“నల్భయ్యేడువేల రూబుళ్ళు” హెర్మాన్ జవాబిచ్చాడు.
ఆ మాటలకి అక్కడున్న అందరూ ఒక్కమాటు తల తిప్పి చూసారు. అందరి కళ్ళూ హెర్మాన్‍మీద నిలిచాయి.”వీడికి మతిగానీ పోయిందా?!” అనుకున్నాడు నరుమోవ్.
“ఒక్క విషయం చెప్పనివ్వండి” ఎంతమాత్రం చెక్కుచెదారని చిరునవ్వుతో అన్నాడు చెకలిన్‍స్కీ. “మీరు చాలా పెద్దమొత్తంలో పందెం కాస్తున్నారు. ఇప్పటివరకూ రెండువందల డెబ్భయ్యైదు రూబుళ్ళనిమించి ఎవరూ కాయలేదు” అన్నాడు.
“కావచ్చు. ఇంతకీ నా పందాన్ని వప్పుకుంటున్నారా, లేదా?” సూటిగా అడిగాడు హెర్మాన్.
చెకలిన్‍స్కీ వప్పుకుంటూ తలూపాడు. చాలా మృదువుగా, మర్యాదభంగం కాకుండా అన్నాడు. “నాకు నా మితృలమీద చాలా నమ్మకం వున్నమాట నిజమే. కానీ మీరు కాస్తున్నది చాలా పెద్దమొత్తం. మీ మాటమీద నాకెంత నమ్మకం వున్నప్పటికీ కూడా మీరు డబ్బుని తీసి, మీ పేకముక్కమీద వుంచితే లెక్కపెట్టుకోవటానికి అనువుగా వుంటుందని నా కోరిక”
హెర్మాన్ జేబులోంచీ బేంకునోటు తీసి చెకలిన్‍స్కీకి ఇచ్చాడు. అతడు దాన్ని అందుకుని పైపైన చూసి సంతృప్తి చెంది హెర్మాన్ ముక్కమీద పెట్టాడు. ఆట మొదలైంది. కుడివైపున తొమ్మిది, ఎడమవైపుని మూడు పెట్టాడు చెకలిన్‍స్కీ.
“ఓహ్! నేను గెలిచాను” అన్నాడు హెర్మాన్ తన ముక్క చూపిస్తూ.
ఒక్కసారిగా అక్కడంతా ఆశ్చర్యంతో కూడిన కలకలం మొదలైంది. చెకలిన్‍స్కీ ముఖం ఒక్క క్షణంపాటు కళతప్పింది. వెంటనే సర్దుకున్నాడు. మళ్ళీ పెదాలమీదికి నవ్వుని తెచ్చుకున్నాడు.
“ముగిద్దామా?” అడిగాడు హెర్మాన్.
చెకలిన్‍స్కీ జేబుల్లోంచీ అనేక బేంకునోట్లు తీసి ఇచ్చాడు. హెర్మాన్ వాటిని తీసుకుని బల్లముందునించీ వెళ్ళిపోయాడు. నరుమోవ్ ఇంకా ఆశ్చర్యంలోంచీ తేరుకోలేకపోతున్నాడు. హెర్మాన్ ఒక గ్లాసు నిమ్మరసం తాగి, అక్కడినుంచీ నేరుగా బస చేరుకున్నాడు.
మరుసటిరోజు సాయంత్రం అతడు మళ్ళీ చెకలిన్‍స్కీ బసకి వెళ్ళాడు. ఆట సాగుతోంది. పేకాటబల్ల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే బేంకునోట్లు రాస్తున్న వాళ్ళు వెంటనే సర్దుకుని అతనికి చోటిచ్చారు. చెకలిన్‍స్కీ అతన్ని గౌరవసూచకమైన అభివాదంతో ఆహ్వానించాడు. తరువాతి ఆట మొదలయేదాకా హెర్మాన్ వేచి వున్నాడు. తరువాత ఒక ముక్క తీసుకుని, ముందురోజు గెలిచినదానితో కలిపి మళ్ళీ నలభయ్యేడువేల రూబుళ్ళు దానిమీద వుంచాడు. చెకలిన్‍స్కీ ఆట మొదలుపెట్టాడు. కుడివైపుని జాకీ, ఎడమవైపున ఏడూ వచ్చాయి. హెర్మాన్ తన దగ్గరున్న ఏడు చూపించాడు. అంతటా దిగ్భ్రాంతి. చెకలిన్‍స్కీకి మతిపోయినట్టైంది. ఐనా సంయమనం కోల్పోకుండా తొంభైనాలుగు రూబుళ్ళు తీసి యిచ్చాడు. హెర్మాన్ వీలైనంత నిదానంగా డబ్బంతా జేబుల్లో నింపుకుని వెళ్ళిపోయాడు.
మళ్ళీ మూడోరోజు సాయంత్రం పేకాట బల్లదగ్గిర ప్రత్యక్షమయాడు హెర్మాన్. అతనొస్తాడని అందరూ అనుకుంటున్నదే. అక్కడున్న కౌన్సిలర్లు, ప్రైవీకౌన్సిల్స్ వాళ్ల ఆట వదిలిపెట్టి, ఈ అసాధారణమైన ఆటవైపు తిరిగారు. మొదటిరోజు సోఫాల్లో బద్ధకంగా కూర్చుని వున్న యువ అధికారులు ఆట చూడటానికి లేచి వచ్చారు. అప్పటికే కొన్నిమొత్తాలని పోగొట్టుకుని బేంకునోట్లు రాస్తున్నవాళ్ళు చేస్తున్న పని తాత్కాలికంగా ఆపేసారు. పనివాళ్ళతో సైతం అంతా అక్కడే గుమిగూడారు. చెకలిన్‍స్కీ ముఖం కొంత కళ తగ్గి వున్నా, పెదాలమీది చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. ముక్కలు కలిపాడు. హెర్మాన్ ఒక ముక్క తీసుకున్నాడు. దానిమీద బేంకునోట్లని గుట్టగా పోసాడు. అందరికీ అదొక మల్లయుద్ధంలా అనిపిస్తోంది తప్ప పేకాటలా కాదు. ఉత్కంఠతో కూడిన నిశబ్దం అక్కడ నిండిపోయింది.
చెకలిన్‍స్కీ ఆట మొదలుపెట్టాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కుడివైపుకి రాణి, ఎడమవైపుకి ఆసు.
“ఆసు గెలిచింది” అన్నాడు హెర్మాన్.
“లేదు. మీ రాణీ ఓడిపోయింది” మర్యాదపూర్వకంగా చెప్పాడు చెకలిన్‍స్కీ.
హెర్మాన్ నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళముందు ఆసుకి బదులుగా ఇస్పేటు రాణీ వుంది. తన కళ్లని తనే నమ్మలేకపోతున్నాదు అసలేం జరిగిందో, అలాంటి పొరపాటు తనెలా చేసాడో అర్థమవలేదు. మరోమాటు ముక్కలకేసి చూసాడు. రాణీ ఓ కన్ను సగం మూసి తనకేసి చూసి నవ్వుతున్నట్టనిపించింది. ఆ బొమ్మలో ప్రస్ఫుటమైన పోలికలు…
“వృద్ధ కౌంటెస్…” భయంతో కొయ్యబారిపోయాడు.
చెకలిన్‍స్కీ పేకముక్కలని తీసుకుని మళ్ళీ కలపడం మొదలుపెట్టాడు. హెర్మాన్ కొద్దిసేపు అలాగే వుండి నెమ్మదిగా అక్కడినుంచీ కదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే చిన్న కలకలం…
“బ్రహ్మాండంగా ఆడాడు…” ఎవరిదో గొంతు.
ఆట మళ్ళీ యథాప్రకారం కొనసాగింది.


హెర్మాన్‍కి మతిస్థిరం తప్పింది. అతనిప్పుడు ఒబుఖోవ్ ఆసుపత్రిలో పదిహేడవ నెంబరు గదికి పరిమితమై వున్నాడు. ఎవరు ఏమడిగినా జవాబు చెప్పడుగానీ అతని పెదవులు మాత్రం నిరంతరాయంగా “మూడు, ఏడు, ఆసు” అని అంటుంటాయి.
లిజవెత ఐవనోవ్న మృతురాలి వంటవాడి కొడుకుని పెళ్ళి చేసుకుంది. అతను చాలా మంచిమనిషి. పెద్దజీతం మీద ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. లిజవెతా తన బంధువుల్లో కడుపేదవారైన ఒకరిని పోషిస్తోందికూడా.
టామ్‍స్కీ కేప్టెన్‍గా పదోన్నతి పొందాదు. పౌలీన్ రాకుమారిని పెళ్ళిచేసుకున్నాడు

(అయిపోయింది )