రష్యన్ మూలం “Pikovaya dama” by Alexander Pushkin(in 1833)
Translated to English as “The queen of Spades” by Mrs Sutherland Edwards (in 1892) and available in Project Gutenberg in the Public domain.
ముసలి కౌంటెస్ అన్నా ఫెదతొవ్నా డ్రెస్సింగ్‍రూమ్‍లో అద్దం ముందు కూర్చుని వుంది. పెదవులకు అద్దుకునే రూజ్ వున్న భరిణెను పట్టుకుని ఒకరు, అందమైన తలపిన్నులతో ఇంకొకరు, ఎర్రటి రిబ్బన్లున్న పెట్టెను పట్టుకుని మరొకరు మొత్తం ముగ్గురు పరిచారికలు అక్కడ నిలబడి వున్నారు. వృద్ధురాలిలో వెనుకటి సౌందర్యం ఏమాత్రం లేకపోయినా అలంకరణ విషయంలో ఎక్కడా తగ్గదు. అరవై డెబ్భైయేళ్ళక్రితానికి ఏమాత్రం తగ్గకుండా దుస్తులు ధరిస్తుంది.
అదే గదిలో కిటికీ పక్కని చేతిలో ఎంబ్రాయిడరీ ఫ్రేంతో కూర్చునివుంది ఆవిడ సంరక్షణలో వున్న యువ లిజవెతా ఐవనోవ్న.
“శుభోదయం నాయనమ్మా!” ఒక యువ ఆఫీసరు గదిలోకి అడుగుపెట్టాడు. అతను యువరాజు పాల్ అలెగ్జాండ్రవిచ్. అతడే టామ్‍స్కీ. “ఒక విషయంలో మీ అనుమతి కావాలి” అన్నాడు.
“పాల్! ఏమది?”
“నా స్నేహితుడొకరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే అతన్ని పరిచయం చేసి శుక్రవారంనాడు బాల్‍రూమ్‍కి తీసుకొస్తాను”
“అతన్ని నేరుగా అక్కడికే తీసుకొచ్చి పరిచయంచెయ్యి. అదిసరే, నిన్నటి బాల్‍లో నువ్వెక్కడ వున్నావు?”
“ఆ< నిన్నంతా చాలా సరదాగా గడిచిపోయింది. ఐదింటిదాకా నాట్యం చేస్తునే వున్నాము. యెలెట్జ్‌కేయా ఎంత అందంగా వుంది!”
“కానీ మనవడా! ఆమెలో అంత అందం నీకేం కనిపించింది? వాళ్ళ నాయనమ్మ- యువరాణి డేరియా పెట్రొవ్నలా వుంటుంది. పెట్రోవ్న పెద్ద అందగత్తేం కాదు. ఐనా ఆమె యిప్పుడు చాలా ముసలిదైపోయి వుంటుందిలే”
“ముసలిదేమిటీ, చనిపోయి ఏడేళ్ళౌతేను?” టామ్‍స్కీ అనాలోచితంగా అనేసాడు. వెంటనే తలెత్తి అతన్ని వారిస్తున్నట్టుగా చూసింది లిజవెతా. అప్పుడు గుర్తొచ్చిందతనికి, వృద్ధురాలికి ఆమె సమకాలీనులు చనిపోయిన విషయాలేవీ చెప్పకూడదని. వెంతనే నాలిక కరుచుకున్నాడు. వృద్ధురాలు ఆ విషయాన్ని విని వుదాశీనంగా వుండిపోయింది.
“చనిపోయిందా? నాకా వార్త తెలీనే తెలీదు. మా యిద్దరినీ ఒకేసారి సామ్రాజ్ఞికి ప్రధానపరిచారికలుగా ఒకేసారి నియమించారు” అంది. అప్పటికి అది నూటఒకటోసారి ఆమె ఆ విషయాన్ని అతనికి చెప్పటం.
“పాల్, ఒక్కసారి ఇలా రా! కాస్త చెయ్యందివ్వు, లేవాలి… లియాంకా, నా ముక్కుపొడుండబ్బా ఎక్కడ?” అంటునే , తన ముగ్గురు పరిచారికలతో దుస్తులు, అలంకరణ పూర్తి చేసుకోవటానికి వెళ్ళింది. టామ్‍స్కీ, లిజవెతా వుండిపోయారు.
“కౌంటెస్‍కి పరిచయం చేస్తానన్నది ఎవర్ని?” లిజవెతా గుసగుసగా అడిగింది.
“నరుమోవ్. నీకుగానీ అతను తెలుసా?”
“ఉ<హు< ఎవరతను? సైనికుడా లేక మామూలు పౌరుడా?”
“సైనికుడే”
“ఇంజనీరా?”
“కాదు. అశ్వదళానికి చెందినవాడు. నీకలా ఎందుకనిపించింది?”
లిజవెతా నవ్విందిగానీ జవాబివ్వలేదు. టామ్‍స్కీ వృద్ధురాలికి తన మితృడిని పరిచయం చేయటానికి అనుమతి అడిగినప్పుడు ఆ మితృడు రోజూ కిటికీలోంచీ కనిపించే ఇంజనీరేననుకుంది లిజవెటా. ఆమె గుండె వడివడిగా కొట్టుకుంది. కానీ వచ్చేవాడు ఇంజనీరు కాదని తెలిసి తన తొందరపాటుతనానికి సిగ్గుపడింది. టామ్‍స్కీ పదేపదే అడిగినా అసలు విషయం మాత్రం చెప్పలేదు. అతను ఏ రహస్యాన్నీ దాచుకోలేడు.
“పాల్, నాకు కొత్తపుస్తకాలేవైనా కావాలి. చూడు, ఇప్పటి రాతలుమాత్రం కాదు” లోపల్నుంచీ వృద్ధురాలు కేకేసి చెప్పింది.
“ఎలాంటివి కావాలి నాయనమ్మా?”
“నాయకుడు, తల్లిదిగానీ తండ్రిదిగానీ గొంతు నొక్కకూడదు, నీటమునిగే చావులుండకూడదు… అలాంటి చావులంటే నాకు చాలా భయం”
“మీరు కోరుకున్నలాంటివి ఇప్పుడు ఎవరూ ఫ్రెంచిలో రాయట్లేదు. పోనీ రష్యన్ పుస్తకం పంపనా?’
“రష్యన్‍వికూడా వున్నాయా? ఎప్పుడూ చెప్పలేదేం? నాకొక నవల వెంటనే పంపించు”
“సరే నాయనమ్మా! నాకు కొద్దిగా పనుంది. వెళ్ళాలి. నమస్కారం…. లిజవెతా! నరుమోవ్ ఇంజనీరని ఎందుకనుకున్నావో చెప్పనే లేదు…” అంటూ ఆమె జవాబుకోసం వేచి చూడకుండానే అతను ఆ గదిలోంచీ వెళ్ళిపోయాడు. ఇప్పుడిక లిజవెతా ఐవనోవ్నా వంటరిగా మిగిలిపోయింది. తను చేస్తున్న ఎంబ్రాయిడరీ పని పక్కనిబెట్టి కిటికీలోంచీ బయటికి చూడసాగింది. కొద్దినిముషాలకి ఇంటికి ఒక మూలగా రహదారికి ఆవైపున ఒక యువ అధికారి కనిపించాదు. అతన్ని చూడగానే ఆమె వళ్ళు ఝల్లుమంది. చెంపలు ఎర్రబడ్డాయి. తలొంచుకుని గబగబ పనిలో తలదూర్చింది. సరిగ్గా అప్పుడే వృద్ధ కౌంటెస్ తయారై వచ్చింది.
“బండి పిలిపించు లిజవెతా! మనమలా బయటికి వెళ్దాం” అంది. లిజవెతా ఎంబ్రాయిడరీ ఆపి దారాలవీ జాగ్రత్తగా సర్దసాగింది
“నీ సమస్యేమిటి అమ్మాయీ? నామాట వినిపించలేదా? నీకేమైనా చెవుడా?” వృద్ధురాలు అరిచింది. “వెంటనే బండిని పిలిపించు”
“ఇప్పుడే పిలిపిస్తాను” అని జవాబిచ్చి లిజవెతా పక్కగదిలోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే టామ్‍స్కీనుంచీ కొన్ని పుస్తకాలని తీసుకుని సేవకుడొకడు వచ్చాడు. ఆమె మళ్ళీ వెనక్కి వచ్చి, పుస్తకాలు తీసుకుని “అతడికి ధన్యవాదాలు తెలియజెయ్యి” అంటూ అతన్ని పంపివేసింది.
“లిజవెతా! లిజవెతా! ఎక్కడికి పరుగులు తీస్తున్నావు?” మళ్ళీ కేకలు వేసింది వృద్ధ కౌంటెస్.
“దుస్తులు మార్చుకుని వస్తాను”
“ఇంకా చాలా సమయం వుందిగానీ, ఇలా రా! ఇక్కడ కూర్చుని ఈ పుస్తకం తెరిచి చదవటం మొదలుపెట్టు”
లిజవెతా పుస్తకం తెరిచి నాలుగు వాక్యాలు చదివిందో లేదో, “గట్టిగా చదువు. నీ సమస్యేమిటి అమ్మాయీ? గొంతేమైంది? నోరుగానీ పడిపోయిందా?… వుండు… కాళ్ళకిందికి ఆ బల్ల యివ్వు… ఇంకొంచెం దగ్గరకి… ఆ< చాలు…”
లిజవెతా మరో రెండు వాక్యాలు చదివింది. ముసలామె ఆవులించింది.
“ఇంక చాలు. పుస్తకం పక్కని పడెయ్… తలాతోకా లేకుండా వుంది. పాల్ యువరాజుకి తిప్పి పంపెయ్. కృతజ్ఞతలని మరోసారి చెప్పు… సరేగానీ బండి మాట ఏమైంది?”
“వచ్చింది” కిటికీలోంచీ రహదారివైపుకి చూసి చెప్పింది లిజవెతా.
“అదిసరే, నువ్వింకా తయారవ్వలేదేమి?” అంది వృద్ధురాలు, తనే ఆమెని ఆగమన్న విషయం వదిలేసి. “ఎక్కడికి వెళ్ళాలన్నా నీకోసం నేను ఎదురుచూడాల్సివస్తోంది. అది నాకెంత చికాకో నీకు తెలీదా అమ్మాయీ?”
లిజవెతా గబగబ తన గదిలోకి వెళ్ళింది. ఆమె ఇలా వెళ్ళిందోలేదో వృద్ధురాలు తన శక్తంతా వుపయోగించి గంట నొక్కడం మొదలుపెట్టింది. ఆమె ముగ్గురు పరిచారికలూ పరుగున వచ్చారు. మరోవైపునించీ బండివాడు కూడా వచ్చాడు. “అంతసేపట్నుంచీ గంట నొక్కుతుంటే వినపడలేదా?” పరిచారికలని అరిచి, “లిజవెతాకోసం నేనిక్కడ ఎదురుచూస్తున్నానని చెప్పండి. తక్షణం తనిక్కడుండాలి” అంది.
లిజవెతా రానే వచ్చింది, టోపీ పెట్టుకుని, బాహ్యదుస్తులు సర్దుకుంటూ.
“మొత్తానికీ వూడిపడ్డావన్నమాట” సాగదీసింది కౌంటెస్. “ఎవర్ని సమ్మోహపరచడానికీ, ఇంత అలంకరణ?” వెటకారంగా అని, “బయట వాతావరణం ఎలా వుంది? శీతగాలి వీస్తోందా?” అడిగింది.
“లేదు కౌంటెస్. వాతావరణం చాలా బావుంది” అన్నాడు బండివాడు.
“మూర్ఖుడా! నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా? కిటికీ తెరిచి చూడు. ఎంత చలీ యీదురుగాలో నీకే తెలుస్తుంది… లిజవెతా! మనం బయటికి వెళ్ళట్లేదు. నీ అలంకరణంతా దండగ…”
లిజవెతా మనసు చివుక్కుమంది. ఏమి బతుకు తనది! నిట్టూర్చింది.
వాస్తవానికి ఆమె చాలా దురదృష్టవంతురాలనే చెప్పాలి.
మరొకరిపైన ఆధారపడి బతకడం, వృద్ధురాలి నిరంతర సహచర్యంలో ఒక యువతి గడపడం ఎంత దుర్భరమో, ఎవరికేనా అర్థమౌతుందా? ముసలి కౌంటెస్ స్వభావరీత్యా చెడ్డదేమీ కాదు. కానీ చపలచిత్తం కలది. దురభిమాని, అహంభావి. ఆమె తన జీవితంలో పొందగలిగిన సరదా సంతోషాలన్నిటినీ అనుభవించింది. ఆమె ఆలోచనలన్నీ గతవైభవాలచుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఈరోజటి వాస్తవమేమిటని ఎప్పుడూ అనుకోదు. ఇప్పటికీ చక్కగా తయారై నాట్యశాలలకి వెళ్తుంది. ఒక మూలగా కూర్చుంటుంది. వృద్ధురాలని ఎవరూ ఆమెని వుపేక్షించరు. అక్కడికి వచ్చినవారందరూ అదొక సాంప్రదాయంలా చక్కగా ఆమెని కలిసి నమస్కరించి వెళ్తారు. ఆ తర్వాత పట్టించుకోకపోయినా అది చాలు ఆమెకి. సంతృప్తి… అందరూ తనని గుర్తించినందుకు. ఆమె పాతబడ్డా, అరిగిపోయినా, పారెయ్యలేనంత విలువైన నగ. ఎవరినీ గుర్తుపట్టలేకపోయినా నగరప్రముఖులందరినీ ఇంటికి పిలిచి విందు చేస్తుంది. వారికి చెయ్యవలసిన మర్యాదలన్నీ పాటిస్తుంది. ఆమె సేవకులంతా బలిసిపోతున్నారు. ముసలామెని ఎవరు ఎలా దోచుకున్నారో వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ తమ తెలివికి తామే సంతోషపడుతుంటారు. ప్రతిక్షణం వృద్ధురాలి సమక్షంలో మెసిలే లిజవెతా మాత్రం క్షణక్షణం ఒక అమరసైనికుడిలా చచ్చి బతుకుతుంటుంది.
ఆమె టీ చేస్తుంది, చక్కెర ఎక్కువ వేసిందని చివాట్లు తింటుంది. వృద్ధురాలికోసం పుస్తకాలు చదువుతుంది, రచయితలు రాసే తప్పులకి ఆమెదే బాధ్యత. వృద్ధురాలితో బయటికి వెళ్తుంది. వాతావరణం బాలేకపోయినా, నడిచే దారిలో గతుకులున్నా ఆమెదే తప్పు. వృద్ధురాలిని చూసుకుంటున్నందుకు ఆమెకి జీతం వుంది. కానీ అదెప్పుడూ ఆమెకి అందదు. అందర్లాగా చక్కగా అలంకరించుకోవాలని ఆమెకి వున్నా, ఏ కొంచెం నదురుగా కనిపించినా వృద్ధురాలు వోర్వదు.
లిజవెతా తిరిగే సమాజంలోకూడా ఆమెది దయనీయమైన పరిస్థితే. అందరికీ ఆమె ఎవరో తెలుసు. కానీ ఎవరూ ఆమెని పట్టించుకోరు. యువకుడెవరికేనా నాట్యభాగస్వామి దొరకనప్పుడే ఆమె బాల్‍వేదికని ఎక్కేది. దుస్తులు సరిచెయ్యవల్సినప్పుడు మాత్రమే ఆడవారు ఆమెని చెయ్యి పట్టుకుంటారు, తమతో రమ్మని. ఐతే లిజవెతాకి తన యీ పరిస్థితి క్షుణ్ణంగా తెలుసు. ఎంతకాలం యిలా? అనామకంగా? చెయ్యందించి, యిందులోంచీ బయటపడేసే వ్యక్తికోసం ఆమె కొంత అసహనంగా ఎదురుచూస్తోంది. ఆమె చుట్టూ వున్న యువకులెవరికీ ఆమె అవసరం లేదు. అలాగని అగౌరవపరచరు. వారు తిరిగే అమ్మాయిలు వేరు. అలంకరణ తొలగిస్తే ఆ అమ్మాయిల్లో ఎంతోమంది, లిజవెతా గొప్ప అందగత్తె కాకపోయినాకూడా, ఆమె కాలిగోటికి సరితూగరు. ఐనా వాళ్ళెవరూ తమ వెంటపడి తిరిగే యువకులని లెక్కేచెయ్యరు. అధికారం, డబ్బు తర్వాతే ఏదైనా. ఇదొక ఆట. ఆమెకి అవి లేవు. అందుకే ఆమె వంటరిది.
తన చిన్న గదిలో వంటరిగా కూర్చుని ఎన్నోసార్లు ఏడ్చింది. ఆ గదిలో ఏముంటాయి? చాలా చిన్న క్లుప్తమైన గది. ఒక తెర, బీరువా, అద్దం, మంచం, రాగి కొవ్వొత్తిగొట్టం… ఇంతే.
ఇంక ఈరోజుకి ప్రయాణం లేదని కౌంటెస్ చెప్పేసింది. లిజవెతా ఐవనొవ్నా గదిలోకి వెళ్ళి టోపీ, ఓవర్‍కోటు ఇలా తీయబోయిందో లేదో, కౌంటెస్ మళ్ళీ పిలిచింది. బగ్గీ సిద్ధం చేయించమంది. బగ్గీ వచ్చి భవంతిముందు ఆగింది. వీళ్ళింక అందులోకి ఎక్కబోతున్నారు. ఇద్దరు సహాయకులు వృద్ధకౌంటెస్‍ని బండి ఎక్కిస్తున్నారు. లిజవెతా ఆ ఇంజనీరు బండిచక్రం పక్కగా నిలబడి వుండటం చూసింది. అతనామె చేతిని పట్టుకున్నాడు. ఆమెకి మతిపోతోంది. ఒక్క తృటికాలంలో ఆ చేతివేళ్ళసందులో ఒక వుత్తరాన్ని పెట్టేసి కనుమరుగయాడు. ఆమె దాన్ని తన గ్లవ్‍లోకి తోసేసింది. దారంతా ఆమె అన్యమన్స్కంగానే వుంది. దార్లో కనిపించినవేవీ ఆమె దృష్టిని ఆకట్టుకోలేకపోయాయి. ఎవరి మాటలూ చెవిన పడలేదు. దారిపొడుగూతా వృద్ధ కౌంటెస్ ఏదో ఒకటి అడుగుతునే వుంటుంది. అదామె అలవాటు. ఇప్పుడుకూడా అలాగే అడిగసాగింది.”ఇప్పుడు మనకి కలిసిన ఆ వ్యక్తి ఎవరు? అదో, ఆ కనిపించే వంతెన పేరేమిటి? ఆ బోర్డుమీద ఏం రాసి వుంది?” ఇలా సాగుతుంది ఆ ప్రశ్నల పరంపర. ఎప్పుడూ వృద్ధురాలిని సంతృప్తిపరిచేలాంటి జవాబులిచ్చే లిజవెతా ఈసారి మాత్రం అతకనిపొతకని జవాబులిచ్చేసరికి ఆవిడకి కోపం వచ్చింది.
“నీ సమస్యేమిటి, అమ్మాయీ? ఎందుకంత పరధ్యాస? నేను అడిగింది వినిపించలేదా లేక అర్థం కాలేదా? భగవంతుని దయవలన నేనైతే బానే వున్నాను, స్పష్టంగానే అడిగాను” గద్దించింది. ఐనా లిజవెతా జవాబివ్వలేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.