అధిరోహణం by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“కాలికి యీ కడియం యేమిటి?”
“చిన్నప్పుడు మా బామ్మ వేయించింది”
“పెద్దయాక యిప్పుడు కూడా ఎందుకు?”
“అది నీకేం అడ్డొచ్చింది?”
నా కాలికి వుండే సన్నటి తీగలాంటి వెండికడియాన్ని గురించి ఫ్రెండ్సు, నా భార్య, ఆఖరిగా నా పిల్లలు…ఎందరు అడిగారో! ఎవరికీ నేను కారణం చెప్పలేదు… నాకు తెలిసినా. అదొక అనుభవం కూడా కాదు, అనుభూతి. నా ఒక్కడికే పరిపూర్ణంగా అనుభవంలోకి వచ్చిన అనుభూతి. ఆ కడియాన్ని వేయించిన వ్యక్తి నన్నింకా అంటిపెట్టుకునే వున్నట్టు అనిపిస్తుంది. ఆ కడియాన్ని తీసెయ్యాలని కూడా నాకెప్పుడూ అనిపించలేదు. నేను వేసుకునే ఫాంటు, షర్టు… తిరిగే కారు యిన్నిటిమధ్య నా నాగరీకతకి మచ్చని ఎప్పుడూ అనిపించలేదు.
“మాంత్రికుడి ప్రాణాలు చిలకలో వున్నట్టు, మీ ప్రాణాలుగానీ యిందులో వున్నాయేమిటి పాపం?” అని తన కుతూహలాన్ని పరిహాసానికి పరివర్తించింది, నా భార్య విద్య,
“వెనుకటితరంవాళ్ళకి పిల్లల్ని కాపాడుకోవడం చాలా బాగా తెలుసుననే విషయానికి నిదర్శనం యీ కడియం” అనే ఒక చిన్న క్లూ వదిలిపెట్టి వూరుకున్నాను.
మొదట్లో నా చుట్టూ వున్నవారిలో పరిహాసాన్నీ తర్వాత కుతూహలాన్నీ కలిగించిన ఆ కడియం క్రమేపీ నా వ్యక్తిత్వంలో భాగంగా యిమిడిపోయింది. ఏ వ్యక్తీ మరో వ్యక్తికి సంపూర్ణంగా అర్ధంకానట్టే, నాలోనూ ఎదుటివారికి అర్ధమవని భాగం కొంత వున్నది. ఆ అర్ధంకాని భాగంలో వుపభాగంగా అది వుండిపోయింది. అదలా వుండిపోయాక వున్నట్టుండి దాని ప్రస్తావన మళ్ళీ వచ్చింది రాఘవరాజు కొడుకు మోహనచంద్ర వలన. రాఘవరాజు నా క్లోజుఫ్రెండు.
“మోహన్‍గాడు నువాక్రాన్ తాగేసాడు. హాస్పిటల్లో చేర్చాం. నువ్వు వెంటనే రా. స్టమక్‍వాష్ చేస్తున్నారు డాక్టర్లు. కండిషన్ చాలా క్రిటికల్‍గా వుందట” రాత్రి రెండుగంటలవేళ రాఘవరాజు దగ్గర్నుంచీ ఫోనొచ్చింది. నా నిద్రమత్తంతా ఎగిరిపోయింది. లేచి గబగబ డ్రెస్ మార్చుకుంటుంటే విద్య అంది.
“హాస్పిటల్లో చేర్చామంటున్నారు. చెయ్యాల్సిదేదో చెయ్యటానికి డాక్టర్లు వున్నారు. ఇంకా మీరెందుకు? ఉదయం వెళ్ళకూడదా?” అని.
“ధైర్యం చెప్పడానికి. నువ్వూ వస్తావా?” అడిగాను.
“ఎలా, పిల్లల్నొదిలేసి?”
నేనింకేం తర్కించలేదు. సంకల్పం వుంటే ఏదైనా సాధ్యపడుతుంది. వద్దనుకుంటే సాకులు దొరుకుతాయి. నేను వెళ్ళాలనుకున్నాను. చీకటి నాకు అడ్డంకాదు. తను వద్దనుకుంది. పిల్లలూ, వాళ్ళ నిద్రా, రాత్రీ అన్నీ ఆటంకాలే.


నేను వెళ్ళేసరికి రాఘవరాజు ఆపరేషన్ థియేటరు ముందు విజిటర్స్ లాంజిలో వున్న ఒక కుర్చీలో రెండుచేతుల్లో ముఖం దాచుకుని కూర్చుని వున్నాడు. పక్కనే గచ్చుమీద కూర్చుని అతని వొళ్ళో చేతులుంచుకుని, వాటిలో ముఖం దాచుకుని శబ్దం నిగ్రహించుకుంటూ ఏడుస్తోంది అతని భార్య నీలమణి. ఆపరేషన్ థియేటరు ముందు ఎర్రటి బల్బు వెలుగుతోంది.
నా అడుగుల శబ్దం విని దిగ్గున తలెత్తి చూసారు యిద్దరూ. నీలమణి భర్తకి దూరం జరిగింది. రాఘవరాజు చప్పున లేచి నా దగ్గరగా వచ్చి చెయ్యి అందుకున్నాడు.
“ఒక సంతానంతో సరిపెట్టుకుని ప్రాణాలన్నీ వాడిమీద నిలుపుకుంటే వాడింత పని చేసాడు”
“ఎందుకింత పని చేసాడు? అసలేం జరిగింది?” అడిగాను. ఆ నిశ్శబ్దంలో నాగొంతు భీకరంగా వినిపించింది. ఇద్దరం కారిడార్లోకి నడిచి వచ్చి, అక్కడనుంచి వెళ్ళి చెట్టు దగ్గర నిలబడ్డాం.
“ఏమీ అనలేదురా! మా నాన్న నన్ను కొట్టిన దెబ్బల్లో మచ్చుకి ఒక్కటి కూడా వాడిని కొట్టలేదురా! నా శక్తికి కొంచెం మించినవే అయినా వాడు
అడిగినవేవీ కాదనలేదు… ఎక్స్‌కర్షన్‍కి వెళ్తానన్నాడు. వద్దన్నాను. అంతే! ఈ పని చేసి కూర్చున్నాడు” చీకట్లో ఏడుస్తున్నట్టు తన గొంతు తెలుపుతోంది. చాలా భారంగా వుంది.
“ఎందుకు వద్దన్నావు?” మామూలుగా అడిగాను.
“సరైన కేర్ తీసుకోరని”
“నీకలాంటి అనుమానం ఎందుకొచ్చింది?”
“ఇంతకుముందు రెండుమూడు సంఘటనలు అలాంటివి జరిగాయి. సరైన ఆర్గనైజేషన్ లేదు వీళ్ల స్కూల్లో. పిల్లలందర్నీ వూదరగొట్టి బయలుదేరదీసే ముందుండే వుత్సాహం తర్వాత చూపించరు. ఒకసారి ఓషన్‍పార్కుకి తీసుకెళ్ళి ఒకమ్మాయిని మర్చిపోయి వచ్చారు. సగందార్లోగానీ గుర్తించలేదు.”
“…”
“కాలేశ్వరం సంగతి నీకు తెలిసినదేగా? ఇద్దరు పిల్లలూ టీచరూ గోదావర్లో మునిగిపోయారు. ఇప్పుడెళ్ళేది ముంబాయికి. నాకేమిటో అంత దూరం అలాంటి ప్లేస్‍కి మనం లేకుండా పంపించడం యిష్టం లేకపోయింది.”
“ఇవన్నీ వాడికి తెలీవా?”
“తెలిసినా టీచర్లు ఎగేస్తుంటే వీళ్ళేం చేస్తారు?”
నేను సుదీర్ఘంగా నిశ్వసించాను. మనిషికి వృత్తి, ప్రవృత్తి అనేవి రెండుంటాయి. ప్రవృత్తిని అనుసరించి వృత్తి వుంటే ఆ వ్యక్తి మనిషిగానూ, కెరీర్‍పరంగానూ కూడా సఫలమౌతాడు. పిల్లలపట్ల ప్రేమగలవాడు టీచరౌతే మానవసంబంధాలను మనసనే ప్రమిదలో వత్తిగావేసి వెలిగిస్తాడు. భూతదయగలవాడు డాక్టరౌతే ప్రజాసేవచేస్తాడు. డబ్బూ సంపాదిస్తాడుగానీ అది సెకండరీ. డబ్బుసంపాదన, మెటీరియలిజమే ప్రవృత్తిగాగలవాడు డాక్టరైనా, యింజనీరైనా, టీచరైనా ఒకటే. డాక్టరౌతే స్టార్ హాస్పిటల్ కట్టించడంలో వుండే చొరవ హిపోక్రేట్స్ వోత్ మీద వుండదు. ఇప్పటి స్కూల్స్‌లో పిల్లలు మేనేజిమెంటుకి డబ్బుసాధనాలుగా, ప్రచారమార్గాలుగా కనిపిస్తున్నారు. ఇప్పుడీ ఎక్స్‌కర్షన్లో స్కూలు బేనర్లు కట్టిన బస్‍లో ముంబై వీధుల్లో తిరగటం ముఖ్యంగానీ, తద్వారా విజ్ఞానాన్నివ్వటంగానీ, తల్లిదండ్రుల యిష్టానిష్టాలని మన్నించమని చెప్పటంగానీ కాదు. ఇద్దరం చీకట్లో చాలాసేపు నిలబడ్డాం. దూరంగా నీలమణి. ఒక్కర్తే. విద్య నాతో రాని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
ఆరుగంటల నిర్విరామ కృషి తర్వాత మోహనచంద్ర బతికి బైటపడ్డాడు. ఆ తర్వాత కొన్నిగంటలపాటు వాడు నిద్రపోకుండా కాపలాకాయడం మాకు అసిధారావ్రతమైంది. నేనూ, రాఘవరాజూ, నీలమణీ వంతులు వేసుకుని వాడిని రెక్కలు పట్టుకుని కూర్చోబెట్టాము. తెల్లవారగానే విద్య వచ్చింది. కేరీబేగ్స్‌నిండా పళ్ళు, బ్రెడ్డు, బిస్కెట్ పేకెట్స్ యింకా ఏవేవో తీసుకుని ఆర్భాటంగా వచ్చి, కొద్దిసేపు వుండి, పిల్లల్ని స్కూలుకి తయారుచెయ్యాలని వెళ్ళిపోయింది. నా గుండెలోని ఏదో ఒక తంత్రి తెగినట్టు మూగపోయాను. ఆ మూగతనం ఒక నిస్సహాయతలా నన్నావరించింది. అదొక డొల్లతనం. దాని చుట్టూ నేను నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాను. అది విస్తరిస్తోంది. విస్తరించి విస్తరించి, నేనంటూ ఏమీ మిగలకుండా చేస్తుందని భయం వేసింది. ఒకరి ప్రాథమ్యాలు మరొకరికేమీ కాకపోవటంలోని బాధ యిది.
వారానికి డిశ్చార్జి చేసారు మోహనచంద్రని.
“ఎందుకురా, అలా చేసావు?” అడిగాను వాడి అంతరంగం తెలుసుకోవాలని.
అన్నివేళలూ మనవికాదు. సమయానికి తండ్రి చూసాడుగాబట్టి వీడిలా యీరోజుని నాతో మాట్లాడగలుగుతున్నాడు. లేకపోతే? ఒకసారి యిలాంటి ప్రయత్నం చేసినవాడు మళ్ళీమళ్ళీ చెయ్యడనే నమ్మకం ఏమిటి? వాడి మనసులోని ఆ కోరికని సమూలంగా పెరికి వెయ్యాలనుకున్నాను. అదొక్కటే కాదు, జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తి ప్రాధమ్యాలనిగానీ, బ్రతుకువిలువనిగానీ యింకదేన్నీగానీ పట్టించుకోకుండా బతికేస్తున్న యిప్పటి జీవనశైలితో పోరాటం చెయ్యాలని కూడా అనిపించింది అంతగా బాధపెట్టింది విద్య ప్రవర్తన.
నేనలా అడగ్గానే మోహనచంద్ర నేలచూపులు చూసాడు. వాడి చూపులు షూ, సాక్స్ లేని నా కాలు, దాని కున్న కడియం చేత ఆకర్షించబడ్డాయి.
“కాలికి… అదేంటంకుల్?” చప్పుని అడిగాడు తన సంకోచం మర్చిపోయి.
“చెప్తాను. ఎవరికీ యింతదాకా చెప్పలేదుగానీ నీకుమాత్రం తప్పక చెప్పాల్సిన విషయం. మరైతే ముందు నేనడిగిన దానికి చెప్పు” అన్నాను.
“ఎక్స్‌కర్షన్‍కి వెళ్తానంటే నాన్న వద్దన్నారు.”
“ఎందుకు? నువ్వేది అడిగినా నాన్న వప్పుకోడా?”
తండ్రిని గురించి అలా అన్నందుకు వాడికి బాధ కలిగినట్టుంది, తల అడ్డంగా వూపాడు.
“అలా ఎన్నిసార్లు వద్దన్నాడు?”
“కూల్‍డ్రింక్సు, చాక్లెట్లు ముట్టుకోనివ్వరు”
“ఎందుకు?”
“నాకు ఇస్నోఫీలియాకదా?”
“ఇంకా?”
“ఫ్రెండ్సుతో పిక్చర్స్‌కీ పిక్నిక్స్‌కీ వద్దంటారు”
“మరి?”
“క్లాసంతా ఎక్స్‌కర్షన్‍కి వెళ్తున్నప్పుడు నన్నొక్కడినీ వద్దంటే ఎలా అంకుల్?”
దీనంగా ముఖం పెట్టి అడిగాడు. చిన్నపిల్లలకి చాలా పెద్దపెద్ద సమస్యలుంటాయి. ముఖ్యంగా వాళ్ళు అప్పుడప్పుడే బైటిప్రపంచంలో అడుగుపెడ్తారు. అందరితోటీ పోటీపడ్తూ వుంటారు. అన్నిట్లోనూ వంతుకుపోతారు. వాళ్ళ యీ పోటీతత్వానికి అడ్డుకట్టవేసే తల్లిదండ్రులు
వాళ్ళకి చాలా పెద్ద సమస్య.
“ఎందుకు వద్దన్నాడు? డబ్బు ఖర్చనా?”
” ఉ<హు< ఆ డబ్బులు పెట్టి మ్యూజిక్ సిస్టం కొనిస్తానన్నారు”
“…”
“మా స్కూల్లో ఆర్గనైజేషన్ బావుండదట”
“…”
“ఏదో జరుగుతుందని భయం”
“…”
“జరిగేదెలాగైనా జరుగుతుంది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా”
నేను వాడి ముఖంలోకి చూసాను. అమాయకమైన పసివదనం! ప్రపంచంలో చెడు వుందీ అంటే దానికి తనొక్కడూ మినహాయింపు అనుకునే అనుభవరాహిత్యమైన వయసు.
“అలా ఎందుకనుకోవాలి? నాన్నకి యిష్టంలేదని మానెయ్యచ్చుగా?” అడిగాను.
“ఫ్రెండ్సు నవ్వుతారు”
పిల్లలు బైటి ప్రపంచంలోకి శలభాల్లా ఆకర్షింపబడుతున్నారు. చదువుకున్నా పేరెంట్సు పిల్లలకి వాళ్ళ వయసుకి మించిన విషయాలని బోధపర్చలేక అలాగని వాళ్ళని మూర్ఖంగా శాశించలేక, శాశించినా వింటారన్న నమ్మకం లేక నిస్సహాయంగా వదిలేస్తున్నారు. ఏ విలువలూ తెలీనివారు, ఎంతో అపురూపంగా జీవితపు విలువల్తో పెరిగిన రాఘవరాజులాంటివాళ్ళు తమ పిల్లల్ని ఒకేచోట చదివిస్తున్నారు. ఈ చదివించడం రైళ్ళలో థర్డ్‌క్లాస్ కంపార్ట్మెంటు తీసెయ్యడంలాంటిది. సెకండ్‍క్లాస్ పాసెంజరు ఫస్టుక్లాసుకి ఎగబాకలేడు. థర్డ్‌క్లాస్‍వాడికి సెకండ్‍క్లాస్ తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదు. లేబర్ కల్చర్ దాడికి మిడిల్ క్లాస్ కల్చర్ ధ్వంసమౌతోంది. ఫస్టుక్లాసువాడు సెక్యూర్డ్‌గానే వుంటున్నాడు.కొడుకునీ అలాగే పెంచుకుందామనుకుంటాడు. కానీ వాడిలోని విలువలు బైటి ప్రభావానికి కొట్టుకుపోతున్నాయి. తండ్రి మాట కన్నా ఫ్రెండ్సుముందు ప్రిస్టేజి ఎక్కువైంది. స్వంత ప్రాణంకన్నా ప్రిస్టేజి ఎక్కువైంది. పదోతరగతి పిల్లవాడు… ప్రిస్టేజి!
నా కాలికడియం గురించి చెప్పాను. “నాకు యీతరాదు. ఫ్రెండ్స్ టీజ్ చేస్తుంటే చెరువులోకి దూకాను. ప్రాణాలు పోవడానికి సరిగ్గా క్షణమో, అరక్షణమో వుందనగా ఎవరో వచ్చి నన్ను బైటపడేసారు. వెంకటేశ్వరుడే ఆ వ్యక్తి రూపాన వచ్చి కాపాడాడంది మా బామ్మ. ఆయనపేరిట యీ కడియం వేయించింది. చనిపోయేదాకా రెండోపూట భోజనం మానేస్తానని మొక్కుకుంది”
“మీరు నమ్మారా?”
“నాకోసం మా బామ్మ పడిన తపనని నమ్మాను”
వాడు ఆలోచనలో పడ్డాడు.
“తర్వాత నేనెప్పుడూ యీత మాటెత్తలేదు. నీళ్ళు చూడగానే ఆవిడ పదేళ్ళపాటు అర్ధాకలితో వుండటం గుర్తొస్తుంది.”
“మీరు ప్రయత్నించి వుంటే గొప్ప యీతగాడయేవారేమో!”
“ప్రయత్నించినంత మాత్రాన ప్రతీదీ వస్తుందని నేను నమ్మను. ప్రతివ్యక్తికీ యిన్హరెంటుగా కొంత స్కిల్ వుంటుంది. అది ఆసక్తి రూపంలో బైటపడుతుంది. అప్పుడే మన కృషి ఫలిస్తుంది. ఐతే ఒక్క విషయం చెప్పగలను. రేపెప్పుడేనా ఏదేనా విపత్కర పరిస్థితి ఎదురై ఏ నడిసముద్రంలోనో చిక్కుకుపోతే ఆ కడియంద్వారా నాకు దేవుడి అండ వుందనే ధైర్యంతో యీత రాకపోయినా కాళ్ళూచేతులు కదిపి ఎలాగో ఒకలా బ్రతికే ప్రయత్నం చేస్తాను. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచని పట్టుకుని అదే తనని వడ్డుకి లాక్కెళ్తోందనుకుంటూ
యీదుకెళ్ళినట్టు”
“మీరు గమ్మత్తుగా మాట్లాడుతున్నారు”
నేను కొద్దిసేపు వూరుకుని అడిగాను. “కాళేశ్వరంలో చనిపోయిన పిల్లలు మీకు తెలుసా?”
వాడు తలూపాడు.
“ఇప్పుడుగానీ బ్రతికుంటే నీ అంత అయేవారు. నీ పక్క బెంచీలో కూర్చుని నీతో మాట్లాడుతుండేవారేమో!””
“కావచ్చునంకుల్”
“నువ్వెప్పుడేనా అలా ఆలోచించావా?”
“లేదు”
“మీకసలు వాళ్ళెప్పుడేనా గుర్తొస్తారా?”
“లేదంకుల్. కొన్నాళ్ళు స్కూల్లో కమ్మెమరేషన్ చేసారు. కొందరు పిల్లల తల్లిదండ్రులు వద్దనేసరికి మానేసారు”
“కానీ వాళ్ళ పేరెంట్సు వాళ్ళని తలుచుకుని రోజూ ఏడుస్తూ వుంటారు. వాళ్ళ డేటాఫ్ బర్త్, డేటాఫ్ డెత్ అన్నీ గుర్తే వాళ్ళకి… మీ అమ్మ ఆఫీసుకి కార్లో వెళ్తుంది. బెల్లుకొడితే ఎటెండరొచ్చి నిలబడ్తాడు. ఇంట్లో మార్బుల్ ఫ్లోరింగే అయినా సోఫాల్లో తప్పించి కింద కూర్చోరు మీరు. నువ్వు హాస్పిటల్లో చేరినరోజు ఎక్కడ కూర్చుందో తెలుసా? కారిడార్లో గచ్చుమీద కూర్చుని ఏడ్చింది”
తల్లి నేలమీద కూర్చుని ఏడవటమనేది వాడు వూహించని విషయం. బ్రేకయ్యాడు. ఎక్కడో ఆలోచన అనేది మొదలైంది.


విద్య ప్రెండు పెళ్ళి చెన్నైలో.
“వెళ్దాం” అంది వుత్సాహంగా. అందులో వద్దనడానికి నాకేమీ కనిపించలేదు.
ఫ్రెండ్సు, పార్టీలు, అంత్యాక్షరీలు, హడావిడీ… వీటన్నిటిమధ్యలో విద్యలో ఓ కొత్త పార్శ్వాన్ని చూసాను. నా ప్రాణ స్నేహితుడి కష్టంలో అంటీముట్టనట్టు వుండిపోయిన విద్య, స్నేహితురాలి పెళ్ళివేడుకల్లోనూ, కోలాహలంలోనూ అంతర్భాగంగా కలిసిపోయింది. తను రాఘవరాజు విషయంలో స్పందించాలని ఆశించడం తప్పా లేక సంతోషానికేగానీ కష్టాలకి స్పందించలేకపోవటం ఆమె లోపమా అనేది అర్ధమవలేదు.
పెళ్ళైంది. తిరిగొచ్చేసాము. ఆ సమయానికి రాఘవరాజు, నీలమణి కొడుకుతో తిరుపతి వెళ్ళారట. కాలినడకని దర్శనం చేసుకుని వచ్చారు.
మోహనచంద్రలో స్పష్టమైన మార్పుని చూసాను. తల్లిదండ్రుల్తో అనుబంధాన్ని పెంచుకుంటున్నాడు.
“మేం వాడిని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్నయ్యగారూ! కానీ వాడికా విషయం తెలిసేదెలా? అర్ధమయేదెలా? మేమిలా ఆఫీసులకి వెళ్ళి సంపాదించినది అనుభవించడం మాత్రమే తన బాధ్యత అనుకుంటున్నాడు. ఆ అనుభవించడం కూడా పూర్తిగా తన వ్యక్తిగతమనుకుంటున్నాడు. వాడి పరిధి చాలా చిన్నదిగా వుంది. అందులోకి మేంకూడా చొరబడే ప్రయత్నం చేస్తున్నాం”అంది నీలమణి.
“రాఘవరాజుగారి కొడుకలా ఎందుకు చేసాడు?” అని అడిగింది విద్య చాలారోజులతర్వాత గుర్తొచ్చి…ఎందుకో. “మనకి పిల్లల్ని పెంచటం సరిగ్గా రావట్లేదనిపిస్తోంది. పెద్దవాడికి ఎప్పుడూ టీవీ, కంప్యూటరు. ఆ రెండూ ఒక్కక్షణం కూడా వదలడు. చిన్నవాడికి క్రికెట్ తప్ప యింకేదీ అక్కర్లేదు. ఎలా వీళ్ళు పైకొచ్చేది? కోప్పడదామంటే యిదో భయం” అంది దిగులుగా.
రాఘవరాజు సమస్య కనీసం యిప్పటికేనా తనని కదిల్చినందుకు సంతోషం కలిగింది. “మీరోసారి అన్నారు గుర్తుందా? అప్పటివాళ్ళకి పిల్లల్ని కాపాడుకోవటం బాగా వచ్చునని… అది నిజం. ఇప్పటికీ నాకు అమ్మ, నాన్న గుర్తొస్తే చాలు, రెక్కలు కట్టుకుని వెళ్ళి వాళ్ళదగ్గర వాలిపోవాలనిపిస్తుంది. కానీ వీళ్ళేంటి? మనని లెక్కే చెయ్యరు. ఏదేనా అవసరం వస్తే తప్ప మనం గుర్తే రాము. ఎందుకని వాళ్ళని హోల్డ్ చెయ్యలేకపోతున్నాం?” అంది తనే మళ్ళీ. కళ్ళలో నీళ్ళు నిలిచాయి తనకి.
“ఇప్పుడేమైంది?”లాలనగా అడిగాను.
“నీలమణిని మొన్నీమధ్య బజార్లో చూసాను. చాలా మారిపోయింది. అప్పటి దర్పం లేనే లేదు. అసలు వాడెందుకలా చేసాడో! తల్లీతండ్రీ సంపాదించి అన్నీ అమర్చుతున్నప్పుడు సుఖంగా తిని చదువుకోక?” విద్య మాటల్లో సందిగ్ధం వుంది.
“నిజమే! వాడికి చేతినిండా డబ్బుంది. ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌కి పుట్టాడు. బార్న్ ఎగ్జిక్యూటివ్. వాడొకటి చెయ్యాలనుకున్నాడు. వాళ్ళు వప్పుకోలేదు. ప్రిస్టేజ్ దెబ్బతినిపోయిందనుకున్నాడు”
“అంటే పేరెంట్సుగా పిల్లలకి మనం ఏం చెప్పకూడదా?”
“వాళ్ళమీద ఆ హోల్డ్ మనకి వుందా?”
కమ్చీదెబ్బ తిన్నట్టు విలవిల్లాడింది. “మీ బామ్మగారిలా దేవుడి కడియాలు వేయిస్తేనూ వుపవాసాలు చేస్తేనే ప్రేమ వున్నట్టా?”రోషంగా అడిగింది.
“నీకివన్నీ ఎలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాను.
“మీ అమ్మగారు ఎప్పుడో చెప్పారు”
“మరి నన్నెందుకు అడిగేదానివి?”
“మీ అంతరంగం తెరవాలని”
చకితుడినయాను.
“చెప్పండి. నాకేం తోచటంలేదు. పిల్లల్ని మనం వెనకటివాళ్ళలా ఎందుకు హోల్డ్ చెయ్యలేకపోతున్నాం? వాళ్ళకోసం ఎన్నో కష్టాలుపడుతూ, ఎన్నో త్యాగాలు చేస్తూకూడా?” అంది.
“అన్నీ అమరిన జీవితం అఖండమైన సరళరేఖ వెంబడి చేసే ప్రయాణంలాంటిది, గమ్యం ఎక్కడో వుంటుంది. కనిపించదు. గమ్యం ఒక శిఖరం అయితే కళ్ళెదురుగానే వుండి ప్రతిక్షణం ప్రలోభపెడుతుంది. పిల్లలకి కొన్ని కష్టాలుండాలి. అప్పుడే వాళ్ళు అనుభవించే సుఖాల విలువ తెలుస్తుంది. వాళ్ళకి కొన్ని బంధాలుండాలి. అవి వాళ్ళని పట్టి వుంచాలి. ఎగుడుదిగుళ్ళ ప్రయాణంలో ఎదురుగా కనిపించే గమ్యం వాళ్ళలో వుత్సాహాన్ని నింపుతుంది”అన్నాను.
“కానీ వాళ్ళని హోల్డ్ చెయ్యాలంటే?”
మళ్ళీ అదే ప్రశ్న. ఇంకా అర్ధంకాలేదా, నీలమణిని చూసాక కూడా?… ఇండివిడ్యువల్ ఫ్రైడ్ కొంత తగ్గించుకుని ఎగ్జిక్యూటివ్‍గా కాక మనిషిగా మారాలి… అది నేను చెప్పలేదు. ఎవరికి వారు తెలుసుకోవలసిన విషయం. అదే ప్రతివారికీ విజయశిఖరం.
(ఆటా కథల పోటీ 2004లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ, ఆంధ్రభూమి 26, డిసెంబర్ 2004 ప్రచురితం)