అముద్రిత రచన, మయూఖ 08.08.2021
“ఆకేసి… పప్పేసి… కూరేసి… అన్నం పెట్టి… నెయ్యేసి…” చేతూ చిన్ని అరచేతితో ఆడుతున్న కళ్యాణికి హఠాత్తుగా గుండెల్లో ఏదో కదిలినట్టై ఆ బాధకి కళ్ళలో పల్చటి కన్నీటిపొర నిలిచింది. భర్తకి దొరకకూడదని గమ్ముని లేచి అక్కడినుంచి వెళ్ళిపోయింది-
“అమ్మా అమ్మా “అని పిలుస్తున్నపిల్లవాడిని అలాగే వదిలేసి.
ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. రాఘవ చూడనిదీ కాదు.
“ఏమైందే?” ఎప్పుడూ అడిగినట్టే అడిగాడు.
“చిన్న పని. ఇప్పుడే వస్తా” లోపల్నుంచీ జవాబు.
“బాబుకన్నా నీకు పనెక్కువా?”
“వస్తున్నా… వస్తున్నా… మీరు కాస్త వాడిని పట్టుకోండి”
ఈలోగా చైతన్య అమ్మకోసం ఏడుపు అందుకోవడం, రాఘవ వాడిని ఎత్తుకోవడం జరిగాయి. లోపలికి తొంగి చూస్తే భార్య దేవుడి గూటిముందు నిలబడి కళ్ళు మూసుకుని దణ్ణం పెడుతూ వుంది. అతనికి గర్వమో సంతోషమో అలాంటిదే ఇంకేదో భావన కలిగి వుద్వేగంతో కొడుకుని గుండెకి హత్తుకుని గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు.
లేకలేక కలిగిన కొడుకు. పెళ్ళైన పదేళ్ళకి ఇద్దరాడపిల్లల తర్వాత పుట్టినవాడు. చైతన్యమీదే భార్యాభర్తల ప్రాణాలు. నిజానికి ఆమెకలాంటి ప్రేమ వుందో లేదో అతనికి తెలీదుగానీ ఆమె ప్రవర్తననిబట్టి అలా అనుకుంటాడు. మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పడు అతని మొహం వాడిపోయింది. పాప పుట్టిన వారంరోజులదాకా చూడటానికి వెళ్ళలేదు. వెళ్ళాక అంతా అలకలే. బారసాల ఎడమొహం పెడమొహంగానే నడిచింది . రెండోసారి పాప పుట్టాకైతే కళ్యాణి పైప్రాణాలు పైనే పోయాయి. నానా మాటలూ అన్నాడు.
“దేభ్యంలా రెండోసారికూడా ఆడపిల్లని కన్నదాన్ని నిన్నే చూస్తున్నాను. ఆడపిల్లో మగపిల్లాడో తెలుసుకునేందుకు టెస్టులు వుంటాయి. డాక్టర్లు చెప్పరు. నువ్వే… వాళ్ళ కాళ్ళమీద పడి మొగుడు ప్రాణం తీస్తాడని బతిమాలి తెలుసుకుని ఏ మందో మింగాలి. నీలాంటి చేతకానిదానికి పెళ్ళెందుకు? పిల్లలెందుకు?” అని అరిచాడతను అందరిముందూ. వంటరిగా యీ లోకంలోకి వచ్చిన ఒక పసిప్రాణి రాకకి ఆహ్వానంలేదు. ప్రాణాలు పణంగా పెట్టి కన్న స్త్రీకి లాలన లేదు. సరదా సంతోషాలు లేవు. విందులూ, వినోదాలూ అసలే లేవు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రాఘవలాంటి ఎందరో కబ్జా చేసారు. వారు నమ్మిందే సిద్ధాంతం. వారు చెప్పిందే వేదం. వారు అనుమతిస్తేనే ఆడపిల్లకి మనుగడ. ఆ పిల్ల తెల్లగా వుంటేనే అందం అని చెప్తారు… నల్లటివాళ్ళంతా వురేసుకోవాలని అర్థమయ్యేంత స్పష్టంగా. సగం బట్టలేసుకుని తిరిగితేనే సంస్కారం అని స్టైల్‍స్టేట్‍మెంటుకూడా వాళ్ళే ఇస్తారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధిచెందిన ఈరోజుల్లో ఆడ మగ ఎలా పుడతారో అతనికి తెలియనిదేమీ కాదు. పోతే మగపిల్లాడే పుట్టేలా వై క్రోమోజోముని ఆకర్షించవలసిన బాధ్యతకూడా స్త్రీదేనని అతని నమ్మకం. ఇంకా ఆ విషయం కనిపెట్టి శాస్త్రవేత్తలు చెప్పలేదు. అంతే. చదువుకున్న మూర్ఖుడనే వాస్తవం ఈ సందర్భంగా వాడినా అతని విషయంలో చాలా చిన్నది. ఇంకొకరకంగా చెప్పాలంటే కొడుకు కావాలనే అతని కోరిక ఎంత బలీయమైనదంటే అతనిలోని సర్వవిచక్షణనీ అది చంపేసింది. ఒకరికి డబ్బు పిచ్చి. లంచాలు, అక్రమాలు ఎన్నేనా చేసి పోగుచేస్తాడు. అప్పుడతని యుక్తాయుక్తజ్ఞానం పనిచెయ్యదు. ఇంకొకరిలో క్రౌర్యం వుంటుంది. అది అతన్ని ఆడిస్తుంది . అలాగే రాఘవ యొక్క ఈ కోరికకూడా.
“ఈసారేనా మగపిల్లాడు కాకపోతే నిన్నొదిలేసి రెండోపెళ్ళి చేసుకుంటాను. నా పంతం నీకు తెలుసుకదా? మాటంటే మాటే. నువ్వూ నీ ముగ్గురు కూతుళ్ళూ రోడ్డున పడి అడుక్కుతినాలి” మూడోసారి కళ్యాణి గర్భవతి అయినప్పుడతను కచ్చితంగా చెప్పేసాడు.
ఇదంతా గృహహింస కిందికి వస్తుంది. ఎప్పుడు? ఎవరేనా వచ్చి కన్నీరు తుడిచినప్పుడు. కానీ ఎవరికన్నీళ్ళు వాళ్ళు తుడుచుకోవలిసినప్పుడు కాదు. అప్పుడసలు అలాంటి ఆలోచనే రాదు. వరదలో కొట్టుకుపోతున్నప్పుడు ఎలాగో ఒకలాగ వడ్డుని పడాలని చూస్తారుగానీ ముందుముందు వరదల్లో కొట్టుకుపోకుండా పడవలు తయారుచెయ్యాలని కాదు.
అతని కోరిక బలంవల్లనే కావచ్చు, తనకి భవిష్యత్తుపట్ల కలిగిన భయమే కావచ్చు, కళ్యాణి మగపిల్లాడితోనే ఇల్లుచేరింది. ఆమెకి ప్రసవమైన రోజున ఆ హాస్పిటలు పేపరుకెక్కింది. ఎవరికో మగపిల్లాడు పుడితే నర్సు ఆ పిల్లాడిని మార్చేసి ఆడపిల్లని వుంచిందని. తనకలా కానందుకు సంతోషించి, ఆలస్యం చేస్తే తన కొడుకుని లాక్కుంటారనిపించి రాఘవ వెంటనే కళ్యాణిని డిశ్చార్జి చేయించి తీసుకొచ్చేసాడు.
అప్పటినుంచి పిల్లవాడికి రాజభోగమే. పై ఇద్దరు ఆడపిల్లలూ అతని కళ్ళకి కనే కనపడటం మానేసారు. ఇంట్లోకి సరుకుల లెక్కలొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తొచ్చేది. కళ్యాణి కళ్ళలోమాత్రం నీలినీడలు. సంతోపంగానే వున్నట్టుంటుంది. అంతలోనే కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్ళు జలజలా ఒక్కసారి రాలిపడి, ప్రవాహంలా పొంగి పొరలి, ఆమె మనసుని కడిగి తేలికపరచవు. లావాలా గుండెల్లో కుతకుతా వుడుకుతూ వుంటాయి. పైకి ప్రశాంతంగానూ ఎప్పుడో పగలబోయే అగ్నిపర్వతంలానూ వుంటుందామె. తెలియని అలజడితో వుక్కిరిబిక్కిరౌతుంటుంది.
****
కొడుకుని చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది రాఘవకి. చాలా చురుకైనవాడు. ఎలాంటి విషయాన్నైనా ఇలా చెప్తే అలా అందుకుంటాడు. వాడు ఎదుగుతుంటే శుక్లపక్షచంద్రుడు తన కళలని వృద్ధి చేసుకుంటున్నట్టే వుంది.
“ఎవరి పొలిక? ఈ వడ్డూ పొడవూ, తెలివితేటలూ మనిళ్ళలో ఎవరికీ లేవు” అని బంధువుల్లో ఎవరేనా అంటే-
“మా తాతగారిలాగే వుండేవారట. అమ్మ చెప్పింది” కళ్యాణి జవాబిచ్చేది. ఆ తాతగారు బతికిలేడు. ఆమె పుట్టినాటికే చనిపోయాడు. ఆ జవాబు చెప్పినప్పుడు ఆమె గొంతులో ముల్లులాంటిది కదిలేది. దు:ఖం అక్కడ గడ్డకట్టుకుపోయి వుండేది. ఆ బాధ వర్ణనాతీతం.
చేతూ మొహంలో కళా, ఆ చురుకూ చూస్తుంటే ఆశ్చర్యంగా వుండేది అందరికీ. “ఎంతేనా ఈ కాలం పిల్లలు పుట్టకముందు సగం, పుట్టాక మిగిలిన సగం తెలివితేటలూ చూపిస్తున్నారు” మెచ్చుకుని వదిలేసేవారు. చుట్టాల్లో ఆ వయసుపిల్లలందరికీ అతను రోల్‍మోడలు. వాళ్లు సాధించవలసిన స్టాండర్డు.
***
కాలం ఆగదు. నిరంతరాయంగా సాగుతునే వుంటుంది. అందులో ఎలాంటి మార్పు వుండదు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది సంవత్సరమే. సంవత్సరానికి మూడు వందల అరవయ్యైదు రోజులే. రోజుకి యిరపైనాలుగు గంటలే. ఎక్కడా ఏ మార్పూ లేదు. మారేదల్లా మనుషుల జీవితాలే. అదీ రాగద్వేషాలు, ఆకాంక్షలూ, ఆకాంక్షలూ మితిమీరినప్పుడు మార్పులూ అదే స్థాయిలో వుంటాయి.
కళ్యాణి పెద్ద కూతురు తనూజ. పద్దెనిమిదేళ్ళు నిండగానే వుద్యోగం వెతుక్కుని చేరిపోయింది.
’”నేనొక అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తున్నాను. అది ఎప్పుడేనా పగలవచ్చు. మీ నాన్న గురించి మీకు తెలుసుకదా? క్షమ తెలీని మనిషి. రేపేదైనా జరిగితే నాకూ చెల్లికి నువ్వే ఆసరా ఇవ్వాలి” అనేది కళ్యాణి ఆ పిల్లతో.
తనని ఒక్కసారేనా ప్రేమగా పిలవని…ఆడపిల్లలని ఇప్పటికీ యీసడించుకునే తండ్రి… ఆ తండ్రి గురించి తనూజకి తల్లి కొత్తగా చెప్పటానికేమీ లేదు. అలాంటి వ్యక్తికన్నా ఆవిడకి పెద్ద బాధ యింకేం వుంటుందనుకుంది. తన భవిష్యత్తుకోసం తను వుద్యోగంలో చేరాలనుకునేది. ఇప్పుడు తల్లికికూడా అవసరమని తెలిసింది. తల్లి అవసరమంటే చెల్లెలి బాధ్యతకూడా తనదే.
ఇంక పెద్దగా ఆలోచించలేదు. ఇంటరవ్వగానే ప్రయత్నాలన్నీ చేసి చిన్న వుద్యోగం సంపాదించుకోవటంలో సఫలమైంది. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు చెల్లెలికి తను బోధ చేసింది. ఆ పిల్లకూడా అక్క వెనుకే తనూ వుద్యోగం వెతుక్కుంది.
ఇద్దరాడపిల్లలూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువులు మానేసి చిన్నచిన్న వుద్యోగాల్లో చేరుతుంటే రాఘవకి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. చదువెందుకు మానటం అని మాటవరసకైనా అనలేదు. వాళ్ళ భారం తప్పినందుకు లోలోపల నిశ్చింతగా వూపిరి పీల్చుకున్నాడు. పైకి నిర్వికారంగా వుండిపోయాడు. కొడుకుని పెద్ద చదువులు చదివించడానికి దారి సుగమమైందనికూడా అనుకున్నాడు. అతడి చదువయ్యి, వుద్యోగంలో స్థిరపడేదాకా వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యననికూడా నిశ్చయించుకున్నాడు.
అప్పుడు చైతన్యకి పదమూడేళ్ళు.
***
క్రికెట్ ఆడుకోవటానికి వెళ్ళిన చైతన్య ఎవరితోనో మాట్లాడుతూ రావటం, ఆ వచ్చినవాళ్ళ గొంతు పెద్దవారి గొంతులా వినిపించటంతో ఎవరొచ్చారో చూద్దామని వంటింట్లోంచీ ఇవతలికి వచ్చింది కళ్యాణి. రావటమే నిర్ఘాంతబోయి నిలబడిపోయింది.
చైతన్య వచ్చినతని నోట్లోంచీ వూడిపడ్డట్టున్నాడు తప్ప తను చూడని తన తాతగారిలా పొరపాట్నకూడా లేడు. ఆ యిద్దరూ తండ్రీకొడుకుల్లా ఎప్పట్నుంచో తెలిసినవాళ్ళలా మాట్లాడుకుంటున్నారు. చైతన్య వీధిలో కొట్టిన ఫోర్లు, సిక్సులగురించి చెప్తుంటే అతను ఆహా అంటున్నాడు.
వాకిట్లోకి వచ్చి నిలబడ్డ కళ్యాణిని చూడగానే ఆ వాక్రవాహం ఆగిపోయింది.
“అమ్మ” అన్నాడు చైతన్య.
“కాదు” అన్నాడతను. చైతన్య ఆశ్చర్యంగా చూసాడతన్ని.
“అమ్మ కాదు, దొంగ. నిన్ను హాస్పిటల్‍నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చింది. అసలు అమ్మ ఇంట్లో వుంది నీకోసం ఏడుస్తోంది. నాతో వచ్చేసెయ్” అన్నాడు.
కళ్యాణి మొదట భయపడింది. కొద్ది కణాలే. తను భయపడ్డంతా జరిగిందనుకుంది. తర్వాత చిత్రంగా గుండెల్లో బరువు దిగినట్టనిపించింది. గొంతులో అడ్డంపడి కెలుకుతున్న ముల్లుని పెరికివేసినట్టు అనిపించింది. అప్పుడే ఆఫీసునించి వచ్చిన రాఘవ గేటు దగ్గర నిలబడి ఆ మాటలు విన్నాడు. ఒక్క క్షణం ఏమీ అర్ధమవ్వలేదు. ఆ తర్వాత అంతా అర్ధమైనట్టే అనిపించింది. కానీ గందరగోళంగా వుంది. అతని వెనకే నిలబడి వున్నారు ఇద్దరాడపిల్లలూ. వాళ్ళూ అప్పుడే వచ్చారు.
“ఆఫీసులో వున్నాన్నేను. సెలవైతే దొరికిందిగానీ రిలీవరు రాలేదు. ఇంట్లో నా భార్య ప్రసవానికి వుంది. ఆమెకి నిండా అనారోగ్యం. అసలు ప్రసవమై బతుకుతుందా లేదాని భయపడుతున్నాము. అప్పటికి ఒక కొడుకు. వాడు చాలంటే వినలేదు. అత్తగారూ, బావమరిదీ నేను లేకుండానే హాస్పిటలుకి తీసుకెళ్ళారు. మళ్ళీ కొడుకు పుట్టాడని బావమరిది స్వయంగా ఫోన్‍చేసి చెప్పాడు. ఇంతలోకే మళ్ళీ ఫోను. కాదుకాదు, ఆడపిల్లని. నేను వెంటనే ఆఫీసునించి వచ్చేసాను. స్పృహ లేకుండా మగతలో వుంది రక్తం ఎక్కించుకుంటున్న నా భార్య. పక్కనే వుయ్యాల్లో ఆడపిల్ల. ఆడా మగాని కాదు, మా పిల్లేనా అన్న అనుమానం… ఏదో జరిగిందన్న కోపం…” అంటున్నాడు వచ్చినతను. అక్కడున్నవాళ్ళందరికీ తెలియాలని. ముఖ్యంగా జరిగిందేమిటో కొడుక్కి అర్థమవ్వాలని.
ఇప్పుడు స్పష్టమైంది రాఘవకి. గందరగోళంలోంచీ బైటపడి మామూలు స్థితికి వచ్చాడు. మగపిల్లాడు కావాలన్న బలమైన కోరికచేత భార్యని తిట్టాడు. మరో పెళ్ళిచేసుకుంటానని బెదిరించాడు. ఎందుకు? డాక్టర్ని అడిగి ఆడో మగో తెలుసుని అబార్షన్ చేయించుకుంటుందనుకున్నాడు. ఇంతపని చేస్తుందనుకోలేదు. ఏం? వంశాభివృద్ధి కోరుకోకూడదా, తను? అదంత నేరమా? నిజమే. మరో పెళ్ళి చేసుకుంటే మాత్రం? ఆమెని వదిలేస్తాడా? వదిలేస్తే మనోవర్తి పడెయ్యకుండా వుంటాడా? తనేం రాక్షసుడా? ఇంత మోసం చేస్తుందా? ఎంత తెగింపు? భగభగ మండిపోయింది.
“డాక్టర్లనీ నర్సులనీ బెదిరించాం. పోలీసు కంప్లెయింటు ఇవ్వచ్చుగానీ, నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అప్పటికే విషయం అర్థమయ్యి పిల్లని దూరం నెట్టేసింది. ఆ పిల్లని అక్కడే వదిలేసి, అర్ధరాత్రివేళ ఎవరూ చూడకుండా ఇంటికొచ్చేసాం. మా పిల్లాడిని ఎత్తుకెళ్ళినవాళ్ళు బాగానే వున్నారుగానీ, మాకు మాత్రం నింద. ఆడపిల్ల పుట్టినందుకు ఇదంతా చేసామని. ఇక్కడ డెలివరీ అయిందంటే ఈ పరిసరాల్లోనే ఎక్కడో వుంటాడని ఒక నమ్మకం. అమ్మమ్మగారింట్లో ప్రసవానికి వస్తే ఎప్పుడో ఒకప్పుడు రాకపోతాడా అనుకుని నేను ట్రాన్స్‌ఫర్లూ ప్రమోషన్లూ వదులుకుని అప్పట్నుంచీ ఇక్కడే వుంటున్నాను. జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నాను… ఇప్పటికి దొరికాడు. చెప్పమ్మా, నువ్వు చేసిన పని బాగుందా?” అతని గొంతు స్థాయి పెరిగింది.
రాఘవ, భార్యని అసహ్యంగా చూసాడు.
కళ్యాణి రెండు చేతులూ ఎత్తి జోడించింది.
“నేను చేసింది తప్పే. కాదనను. ఇద్దరాడపిల్లలు నాకు. మూడోసారిగనుక మగపిల్లవాడు పుట్టకపోతే వదిలేస్తానన్నాడు నా భర్త. నేను పెద్దగా చదువుకోలేదు. ఉద్యోగం లేదు. నా పుట్టింటివాళ్ళు కలిగినవాళ్ళు కాదు. నన్ను, నా పిల్లల్నీ పోషించలేరు. మళ్ళీ ఆడపిల్ల పుడితే పుట్టిన పిల్లతో సహా అందరం ఏ విషమో తాగి చావ్వలిసినదే. ఆ విపత్తులోంచీ బయటపడటానికి నాకు తోచిన మార్గం అది. న్యాయం, ధర్మం ఇవేవీ అప్పుడు నాకు తోచలేదు. మీ కొడుకు మా ముగ్గురికీ ప్రాణభిక్ష పెట్టినవాడు. వాడిని రాజవైభవంగా పెంచానిక్కడ. తీసుకెళ్ళండి. క్షమించగలిగితే నన్ను క్షమించండి. లేకపోతే కేసు పెట్టండి” అంది.
అతను నిరసనగా చూసాడు. ” నా కొడుకుని ఎత్తుకుపోయి మీరు రాజాలా పెంచడం దేనికి? ఆడకూతురివి, మగవాడు మూర్ఖుడైతే నువ్వేం చేస్తావు? నీ మొహం చూసి వదిలేస్తున్నాను. మీకు సమస్యలేవైనా వుంటే మీ ఇంట్లో చూసుకోవాలిగానీ, ఇలా వూరిమీద పడితే ఎలా?” అని దులపరించి,
“విన్నావుకదరా? ఇది నీ యిల్లు కాదు, వీళ్ళు నీ అమ్మానాన్నలు కాదు. వట్టి దొంగలు. నిన్ను ఎత్తుకెళ్ళిన దొంగలు. నాతో రా” అని చైతన్యతో అంటే చైతన్య అతని చెయ్యి పట్టుకున్నాడు.
ఆ కొద్దిసేపట్లోనూ ఆ పిల్లవాడికి చాలా అర్థమైంది. ఇంతకాలం తనేదో దొంగలముఠాలో వున్నట్టూ, ఈ కొత్తవ్యక్తి… తన అసలు తండ్రి తనని రక్షించి తీసుకెళ్తున్నట్టూ అనిపించి, అందుకున్న ఆ చేతిని ఇంకెప్పటికీ విడవనన్నట్టు గట్టిగా తన చేతితో బిగించాడు.
అతను కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళూ పెంచిన తల్లిని తిరిగి చూడనుకూడా చూడలేదు. వాడికి అమ్మానాన్నలు లేకపోతేకదా, ఇంకొకరు దయాధర్మంగా పెంచడానికీ అందుకు కృతజ్ఙతగా వుండటానికీ.
తల్లి మోస్తున్న అగ్నిపర్వతమేదో అర్థమైంది, తండ్రి వెనుక నిలబడి వున్న ఆడపిల్లలిద్దరికీ.
“దేనికి నాన్నా, నీకు మగపిల్లవాడు? మనం నిత్యాగ్నిహోత్రులమా? చతుర్వేదులవాళ్ళమా, త్రివేదులవాళ్లమా? బిర్లా, అంబానీలమా? నీ వంశంలో ఏం వుందో చెప్పు నాన్నా? కనీసం మీ ముత్తాత పేరేంటో తెలుసా, నీకు? తాతయ్య తద్దినం పెట్టినప్పుడు అమ్మ గుర్తు చేస్తుంది… వదిలేస్తానన్నావట, అమ్మని. అలా ఎలా వదిలేస్తావు? పెళ్ళికి తీసుకున్న కట్నం, కానుకలూ తిరిగి ఇవ్వకుండా, ఆమె పోషణా, మా పోషణా, భవిష్యత్తూ గురించి ఏ వప్పందం చేసుకోకుండా అలా ఎలా వదిలేస్తావు? ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి వెళ్ళిపొమ్మంటే ఆమె ఆలోచించుకునేదేమో!” అంది పెద్దకూతురు తనూజ.
కూతురలా అడుగుతుందనుకోలేదు రాఘవ.
“మరి చెల్లెక్కడే?” అడిగింది రెండో కూతురు పావని.
రాఘవ తుళ్ళిపడ్డాడు. చేతూ తన కొడుకు కానప్పుడు తన మూడో కూతురెక్కడ మరి?
“చెప్పాడుకదా, ఆయన. హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయామని” అంది కళ్యాణి.
“అంటే?”
“అంటే ఏముంది? ఆయనకి అక్కర్లేని పిల్ల నాకు మాత్రం దేనికి? నా కాపురం కూల్చను? వదిలేసాను. ఎక్కడో బతుకుతూ వుంటుంది. హాస్పిటల్స్‌లో వదిలేసిన పిల్లల్ని అనాథాశ్రమాల్లో చేరుస్తారట” అంది కళ్యాణి. చురుక్కుమంది రాఘవకి. పిల్లలు తల్లిని వింతగా చూసారు.
ఆమెకి తెలుసు, తన కూతురెక్కడుందో. బాబు తల్లిదండ్రులు పాపని వదిలేసి వెళ్ళిపోయారని ఆయా చెప్తే తల్లి వెళ్ళి తీసుకొచ్చి దూరపు బంధువులకి పిల్లల్లేకపోతే పెంపకానికి యిచ్చింది. ఇదంతా గుట్టుగా జరిగిపోయింది.
గుండెలో బాధా వుంది, ఒక బాధ తీరిన సంతృప్తీ వుంది. బాధని పిల్లల్తో పంచుకుంటే చాలు. భర్తకి చెప్పాలనిపించలేదు. పాపకోసం పరితపించనీ, కొత్తగా తను పడే బాధేమీ వుండదు. చేతూ అతని యింటికి అతను చేరాడు. చాలు… నాటకం ముగిసినట్టే.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.