Review by S Sridevi
“అపూర్వ రష్యన్ జానపదకథలు” అనిల్ బత్తులగారు అనువాదం చేసిన చిన్నపిల్లల కథల సంకలనం. రష్యన్ సాహిత్యం ముఖ్యంగా చిన్నపిల్లల కథలు మనకి కొత్త కాదు. USSR విడిపోకముందు విశాలంధ్ర దుకాణాల్లో పిల్లల పుస్తకాలు చాలా చవగ్గా దొరికేవి. అవి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుండేవి. తెలుగులోకి అనువదించినప్పుడు ఆ భాష తమాషాగా అనిపించేది.
అనిల్ బత్తులగారి పుస్తకం కథలతోపాటు చక్కటి బొమ్మలు, పాటలతో పిల్లలని బాగా అలరిస్తుంది. పిల్లలకథలే అయినప్పటికీ పెద్దవారుకూడా సంతోషంగా చదువుకోవచ్చు. ఇందులో టాల్‍స్టాయ్, పుష్కిన్, మాగ్జిమ్ గోర్కివంటి ప్రముఖరచయితలు రాసిన పన్నెండు కథలతోపాటు రచయితలెవరో తెలియని మరో ఎనిమిది కథలు వున్నాయి.
మానవసంబంధాలు చాలా తేలికైన మాటల్లో చూపెట్టారు. సవితిపిల్లలు, స్నేహితులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములమధ్య వుండే ద్వేషాలే కాకుండా ప్రేమలు, అనుబంధాలు చాలా చక్కగా వర్ణించారు. కథలన్నీ మానవసహజభావాలైన కుతూహలం, అసూయ, ద్వేషం, ఈర్ష్యలాంటి ఎన్నో భావాలకి అద్దం పడతాయి. అడవులు, మాట్లాడే జంతువులు, మంత్రగత్తెలు, వినోదాన్ని కలిగించి మరో వింత వూహాలోకానికి పాఠకులని తీసుకెళ్తాయి. అత్యాశకి ప్రతిఫలం, పరోపకారం, ఒకరికొకరు సాయం చేసుకోవటం, పెద్దవారు కొన్నిటిని వదులుకుని పిల్లలకి వసతులు, వనరులు సమకూర్చటంలాంటివి చూస్తే మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామకథలు గుర్తొస్తాయి.
లెక్కలకుందేలు కథ చిన్నపిల్లల్లో వుండే సహజకుతూహలానికి ఒక వుదాహరణగా కనిపిస్తుంది. అడవిలో తప్పిపోయిన పిల్లలు, పొరపాట్న సముద్రంలో పడిపోయిన బాబు – వీళ్ళంతా చతురతతో, సమయస్ఫూర్తితో ఎలా ప్రమాదాల్లోంచీ ఎలా బయటపడ్డారో కొన్ని కథలు చెప్తే, చీమ అంతరిక్షయాత్ర ఎలా చేసిందో, ఒక చిన్నబాబు బుజ్జి సూర్యుడిని ఎలా తయారుచేసాడో చెప్పే కథలు మరికొన్ని. రాళ్ళు కొట్టే మనిషి కథ చిన్నపిల్లలకి హాస్యాన్నిస్తే పెద్దవారికైతే కొంత తాత్త్వికస్పర్శని కలిగి వుంటుంది. మిగిలిన కథలన్నీకూడా ఆసక్తి కలిగించేవే.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.