అర్హత by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“సమీరా!”

          పీఎఫ్‍లోంచీ డ్రా  చేసి, హడావిడిగా బేగ్‍లో పెట్టిన డబ్బుని సీట్లో కూర్చుని స్థిమితపడ్డాక మరోసారి లెక్కపెట్టుకుంటున్న సమీర తలెత్తి చూపింది . టేబుల్‍కి అవతలి అంచుని నిలబడి వేదమూర్తి ఏదో అడగడానికి సంశయిస్తున్నట్టు నిలబడ్డాడు.       ఏమిటన్నట్టు కళ్ళతోటే ప్రశ్నించింది.

          “మా అబ్బాయి ఫీజు… మీరు .. మీరేమీ అనుకోకపోతే ఐదువందలు … అప్పుగానే… ఇస్తే… శాలరీ రాగానే యిచ్చేస్తాను. మా మిసెస్ వంట్లో బాగుండకపోవడంతో యీ నెల .. బడ్జెట్ తలకిందులైంది… ప్లీజ్ ” మాటకి మాట అతుక్కోకుండా అతను చెప్తున్నదంతా అర్ధమై చిరాకేసింది.

          “సారీ! నేను వేరే పనికోసం ఈ డబ్బు తీశాను. చాలా అవసరం” క్లుప్తంగా అనేసి అతని రియాక్షను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.     అందమైన పేరూ, అందమైన వొళ్ళూ ఆమె ఎసెట్స్. మగవాళ్ళంతా పనిపాటలు మానుకుని తనలాంటి అమ్మాయి కోసం బీటేస్తుంటారనీ కలలుగంటారనీ గట్టినమ్మకం ఆమెకి. మగవాళ్ళు స్త్రీ శరీరసౌందర్యానికన్నా విలువిచ్చేవి ఇంకా వుంటాయనీ, అందం అనే మాటకి స్త్రీ ఒకలాగా పురుషుడు మరొకలాగా అర్ధాలు ఆపాదించుకుంటారనీ ఆమెకి తెలీదు. అంతేకాదు, ఆమెకి తెలీనిని చాలా వున్నాయి.

          ప్రేమ అనేది సినిమాల్లో మాత్రమే బహిరంగంగా ప్రకటింపబడుతుందనీ, వాస్తవంలో అది మన జీవితాల్లో అంతర్వాహినిగా వుండి బంధాలని బలపరుస్తుందనీ…      దేవుడు సృష్టించిన అందంకన్నా మనిషికి తనే సృష్టించుకున్న డబ్బు చాలా ముఖ్యమైనదనీ… యిలా చాలా తెలీవు.

          ఇవేవీ తెలీని సమీర వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. టీనేజి లవ్‍స్టోరీస్ చూసి ఆశ్చర్యపడుతుంది. వాళ్ళ కార్లూ, సొఫిస్టికసి చూసి తనకీ అలాంటి జీవితం అమిరి వుంటే బావుండేదనుకుంటుంది. ఓవైపు ప్రేమగ్రంధాలు నడుపుతూనే మరో వైపు టెడ్డీబేర్ బొమ్మల్తో ఆడుకోవడం చూసి సంభ్రమపడుతుంది. మనసు ఆపుకోలేక తనూ రెండు బొమ్మలు కొనుక్కుందిగానీ, తల్లి కోప్పడుతుందని బట్టల అడుగుని దాచేసింది. అన్నిటికీమించి తన అందానికి దాసోహమంటూ ఏ రాకుమారుడో వస్తాడని ఆశపడుంది.

          ఉత్తమ్‍తో ఆమె పరిచయం సినిమాటిగ్గానే జరిగింది.

          ఆరోజు…

          రోడ్డుమీద పరాకుగా నడుస్తోంది. వెనుకనుంచీ కారు హారెన్ మోగినా వినపడలేదు. దాదాపు రాచుకుంటున్నట్టు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. ఎర్రటి మారుతీ. 

          “ఏ అమ్మాయ్! చూసుకుని నడవక్కర్లేదా?” రఫ్‍గా అడిగాడు డ్రైవరు.

          తుళ్లిపడింది సమీర.

          తర్వాత వెనకసీట్లోంచి బైటికి తొంగిచూసిన వ్యక్తిని చూసి సమీర షాకైంది. చాలా అందంగా వున్నాడు. అతనూ అంతే! అలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టు విభ్రాంతి !  తర్వాత పెదాలమీద మందహాసం. వెనక్కి జరిగి, కారు కదిలిపోయేదాకా అలాగే నిలబడింది.

          ఆఫీసుకి చేరుకోగానే ఫోనొచ్చింది. తండ్రి దగ్గర్నుంచేమోననుకుని రీసీవర్ ఎత్తితే కాదు.

          “హలో! ఉత్తమ్ దిస్ సైడ్” మెత్తటి హస్కీ వాయిస్. ఎందుకో మారుతీ కారతను గుర్తొచ్చాడు సమీరకి. అతనేనేమోననిపించింది.

          “మీ పేరు?”

          “సమీర” అతన్నే దృష్టిలో వుంచుకుని అంది.

          “చాలా బాగుంది. ఆ బిల్డింగ్‍లో ఏం చేస్తుంటారు? క్లర్కా?”

          “ఊ … మీరు ?” సందిగ్ధంగా అడిగింది.

          “ఇప్పుడే కలుసుకున్నాం. అప్పుడే మర్చిపోయారా?” అతని గొంతులో కవ్వింత.

          అతనే. మారుతీకారతను. “ఓహ్! సారీ!” అంది సమీర.

          “సాయంత్రం అదే స్పాట్లో మీకోసం చేస్తుంటాను ” అతను రిసీవర్ క్రెడిల్ చేపేశాడు . తెలివిగల మరో అమ్మాయైతే ఒక అపరిచితుడికి అలాంటి అవకాశం యిచ్చేది కాదు . ఇచ్చింది కాబట్టే ఆమె సమీరైంది .

          ఒక్క సాయంత్రం కాదు, నాలుగైదు సాయంత్రాలు అతనితో షికార్లు  తిరిగింది. కార్లో అతని పక్కని కూర్చోవటం, అతన్ని ఆవరించుకుని వుండే ఖరీదైన వాతావరణం… అన్నీ కలిసి ఆమెని కలలప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి.

          రోజూ వుత్తమ్‍తో కలిసి తిరగడం ఆమెకి చాలా థ్రిల్లింగ్‍గా వుంది.  అందులో కొంత యిబ్బంది. డ్రెసెస్ మెయింటేన్ చెయ్యాలి. ఆమెకి చీరలు, డ్రెస్‍లూ కలిపి పాతికదాకా వున్నాయి. అందులోంచీ ఖరీదైనవిమాత్రమే వాడుతోందిప్పుడు. అలాంటివి పదో పన్నెండో మాత్రమే తేలాయి. రోజువారీ వాడకానికి ఆవిడవి ఖరీదైన చీరలు ఇవ్వటానికి తల్లి వప్పుకోవటం లేదు. నాలుగు చీరలు తీసుకోవాలని పీఎఫ్‍లోంచీ డ్రా చేసింది సమీర. ఇంట్లో చెప్పలేదు. ఇప్పుడు యుత్తమ్‍తో కలిసి షాపింగ్ చెయ్యబోతోంది. బహుశ: బిల్ అతనే చెల్లిస్తాడేమో! కానీ తన దగ్గరకూడా డబ్బుండాలికద!                    ఎప్పట్లాగే బస్టాప్ దగ్గిర నిల్చుంది. అనుకున్న టైముకి కారొచ్చి ఆమె ముందు ఆగింది. డోరు తెరుచుకోవడం, ఆమె అందులో ఎక్కడం అన్నీ తృటిలో జరిగిపోయాయి. ముందుగా షాపింగ్‍కు వెళ్ళారు. సమీర అశించినట్టు బిల్లు అతనే పే చేశాడు. తర్వాత స్టార్‍హోటల్లో ట్రీట్ యిచ్చాడు.

          “అకేషన్?” అడిగింది సమీర.

          “ప్రత్యేకంగా ఏమీ లేదు” నవ్వేడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. “విహేవ్ కమ్ ఫార్ లాంగ్. రాత్రికి యిక్కడే రూమ్ బుక్ చెయ్యనా?”

          అతని వుద్దేశ్యం అర్థమయ్యీ కానట్టు… అదేం లేదు, స్పష్టంగానే అర్ధమైంది సమీరకి. ముఖంలోకి చివ్వునుని రక్తం చిమ్మింది. తను ప్రేమ అనుకుంటున్నదాన్ని, యితనేమిటిలా మొరటుగా అడుగుతున్నాడు? “పెళ్ళికాకుండా నాకిలాంటివి నచ్చవు” అంతే  నెమ్మదిగా అంది.

          “పెళ్ళి. యూమీన్ మేరేజ్… నాతో…”

          అతను చిన్నగా నవ్వాడు. మొహంలో అదోలాంటి కపటత్వం. తర్వాత భుజాలు ఎగరేశాడు. అదోలాంటి నిర్లక్ష్యం. సమీరకవేం అర్ధం కాలేదు.

          లేచి నిల్చున్నాడు. ” ఓకే ఇక వెళ్దాం. రేపు కలుద్దాం” అన్నాడు.

          రేపు, రేపేం చెప్తాడతను? తల్లిదండ్రులని అడిగి జవాబు చెప్తాడా? పెళ్ళి చేసుకుందామంటాడా? లేక వద్దంటాడా, యింతదూరం వచ్చేక? ఎంతదూరం? అతనే అన్నాడుగా, చాలాదూరం వచ్చేమని? ఆరాత్రి సమీరకి చాలాసేపు నిద్రపట్టలేదు. అతి ప్రయాసమీద నిద్రపోతే ఎన్నో కలలు… ఆకాశంలో తేలుస్తూ, నీటి అలలమీద వూగిస్తూ… చాలా అందమైన కలలు.

****

          ఎప్పటిలాగే బస్‍స్టాప్‍లో వచ్చి నిలబడింది సమీర. కారు వచ్చి ఆమె ముందు ఆగడం, ముందు డోర్ తెరుచుకోవడం, ఆమె ఎక్కడం, తలుపు మూసుకోవడం అన్ని ఎప్పట్లాగే జరిగిపోయాయి. సీట్లో సర్దుకుంటూ తల తిప్పి చూసి తెల్లబోయింది . డ్రైవింగ్ సీట్లో వున్నది ఉత్తమ్ కాదు. ఒడ్డూ , పొడుగూ , రంగూ పోలికల్తో సహా ఉత్తమ లాగే వున్నాడు . వయసు మాత్రం యాభైకి పైనే వుంటుంది.

          సమీరని చూసి చిన్నగా నవ్వి ” నేను ఉత్తమ్ తండ్రిని, పేరు సంజయ్” అన్నాడు పరిచయం చేసుకుంటూ.

          ఆమె గౌరవంగా నమస్కరించింది. కారు రోడ్డుమీద స్మూత్‍గా వెళుతోంది. తను ఉత్తమ్‍తో పెళ్ళి గురించి అన్నమాటకి యింత యింపాక్ట్ … అతను తండ్రిని పంపించి మాట్లాడించడం… ఎంతో సంతోషం కలిగింది .

          “నాకు నలుగురు కొడుకులు, యిద్దరు కూతుళ్ళు. ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యల్లో సహా జిడ్డాలో వుంటారు. ఒక కొడుకూ యిద్దరు కూతుళ్ళూ స్టేట్స్‌లో సెటిలయ్యారు. మిగిలింది ఉత్తమ్ ఒక్కడే, నా భార్యపోయి ఏడాదైంది”

          తను ఆయనకి కాబోయే కోడలుగాబట్టి యివన్నీ చెప్తున్నాడన్న భావనతో చాలా శ్రద్ధగా వింది సమీర.

          “నా భార్యకి పిల్లలంటే చాలా యిష్టం. మా మనవలంతా మాదగ్గరే వుంటారు. ఉత్తమ్‍కి కూడా చేసేస్తే ఆఖరి బాధ్యత తీరిపోతుంది. బిజినెస్ వాడికి అప్పగించేసి పిల్లల్లో సరదాగా గడపాలని నా కోరిక”

          “…” సమీర ముఖంలో చిరుసిగ్గు కదలాడింది.

          “వాడిక్కూడా కుదిరిపోయింది. అమ్మాయి గ్రీన్‍కార్డుహోల్డరు… డాక్టరు… వీడక్కడికి వెళ్ళాలనుకుంటే బిజినెస్ వైండప్ చేసేస్తాను. ఆమె యిక్కడికొస్తే…”

          సమీర వులిక్కిపడింది. ఆమె చెవులపడ్డ ఆ ఆఖరిమాటలు మెదడులో చేరి గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. అదామె ముఖంలో ప్రతిబింబించింది.

          “నీకు కార్లలో తిరగడమన్నా ఖరీదైన బట్టలు కట్టుకోవడమన్నా చాలా యిష్టంలా వుంది. ఇష్టం ఒక్కటే దేనికీ అర్హత కాదు. నన్ను చేసుకో. నా మనవలకి కేర్‍టేకర్‍గా వుండచ్చు. నువ్వు చాలా అందమైనదానివి. మాయింట్లో షోపీస్‍లా వుంటావు. నాక్కూడా మంచి కంపెనీ ఔతావు. నీ సరదాలూ తీరుతాయి”

          ఒక్క కుదుపుతో కారు కూడా ఆగింది.  సమీర నోటిమాట మరచిపోయి, చెవులప్పగించి వింటున్నదల్లా ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చింది. విండోలోంచీ బైటికి చూస్తే బయల్దేరినచోటికే వచ్చినట్టు అర్థమైంది. డోర్ తెరుచుకుని దిగింది. దిగేముందు బేగ్‍లోంచీ ముందురోజు డ్రా చేసిన డబ్బు తీసి డాష్‍బోర్డుమీద పెట్టి, “నిన్నటి చీరల బిల్లు” అంది క్లుప్తంగా.

          సంజయ్ దాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు.

          “నీకిష్టమైతే ఈ నెంబరుకి చెయ్యి. ఉత్తమ్‍ని కలిసే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే వాడే నాకీ సలహా యిచ్చినది” విజిటింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టాడు.

          కారు కదిలిపోయింది. సమీర చేతిలో వున్న సంజయ్ కార్డు కింద పడిపోయింది. కారు వెళ్ళినవైపు చూస్తూ నిలబడింది.

          తలలో ఏవో భాగాలు పెళపెళ విరిగి కూలిపోతున్న భావన. చెవుల్లో హోరు. కళ్ళముందు నల్లటి వలయాలు తిరిగాయి. అవమానంతో ఆమె మనసు భగ్గుమంది. ఆ మంటల్లో ఆమె కలలల్ సౌధాలన్నీ మాడి మసైపోయాయి. వాటిమీద అధిష్ఠించి కూర్చున్న ఆమె వాస్తవంలో పడింది.          ఎంత తెలివితక్కువగా ఉత్తమ్ వెంటపడింది! అతనెవరని? తనకి ఏమౌతాడని? అతన్ని అందుకునే అర్హత తనకి వుందా?

          వేదమూర్తి గుర్తొచ్చాడు ఆమెకి. తనతోటి వుద్యోగి, తండ్రి వయసువాడు… పిల్లవాడి ఫీజుకోసం ఐదువందలు అప్పడిగితే లేదంది తను. అటువంటిది ఎన్నో మెట్లు పైన వున్న ఉత్తమ్ దిగివచ్చి అతని సుఖసంతోషాల్లో వాటా యిస్తాడని ఎలా అనుకుంది? ఇంత సింపుల్ లాజిక్ తనకెలా తట్టలేదు?

          విలాసాలపట్ల యిష్టం ఒక్కటే ఉత్తమ్‍ని చేసుకోవటానికి అర్హతకాదన్నాడు సంజయ్. నిజమే! ఉత్తమ్‍ని తనేం ప్రేమించలేదు. పట్టుమని పదిరోజుల పరిచయంలో ప్రేమ ఎలా పుడుతుంది? పుట్టినా అది పెళ్ళికి ఎలా దారితీస్తుంది? అతన్ని చేసుకుంటే తనకి అందుబాటులోకి వచ్చే సుఖాలమీదే తనకి ధ్యాస. అతనికి తన అందంమీద. డబ్బుతో కొందామని చూసాడు. సాధ్యపడలేదు. ఎంత దూరంలో వుంచాలో అంతలో పెట్టాడు. డబ్బే తనకి ప్రధానమైనప్పుడు అతనైనా అతని తండ్రైనా ఒకటే.

          తల బలంగా విదిల్చింది.

(ఆంధ్రభూమి , 14 జనవరి 1999)