ఊదాపచ్చనౌక – 6 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

ఆమోతో కలిసి అంతరిక్షంలో ప్రయోగాలు చెయ్యడంకూడా అబ్రహం, అన్నపూర్ణలాంటి అతికొద్దిమంది విషయంలో జరిగివుంటుంది. కానీ అతని ప్రయోగాల్లో భాగం కావడంమాత్రం కేవలం తన ఒక్కరి విషయంలోనే జరిగింది. అతని మనసు తను గెలవగలదో లేదో… అతని ప్రయోగాల్లో విజయాన్ని మాత్రం సాధించడానికి ఎంతేనా కృషి చెయ్యగలదు. అతను కోరుకున్న సహకారాన్ని ఇవ్వగలదు.
వ్యక్తులు భౌతికంగా పక్కపక్కనే వున్నా ఆంతరంగిక ప్రపంచాలు వేరే వుంటాయి. ఒకే ఆలోచన చేసినా ఆ ఆలోచన తాలూకూ ఆవర్తాలు వేరేగా వుంటాయి. ధన్య ఒకలా ఆలోచిస్తే ఆమో అదే విషయాన్ని మరోలా ఆలోచిస్తున్నాడు.
ఆమె మనసులో తనపట్ల అపోహలేవేనా వుంటే వాటిని తొలగించాలి. పద్మమాలిక తనని ఆకర్షిస్తున్న మృగతృష్ణే తప్ప తనకి జీవధార కాదని చెప్పాలి. ధన్యని ప్రేమిస్తున్నానని చెప్పాలి. అతనికి ఈ దూరం భరించడానికి దుస్సహంగా వుంది. తనిక్కడ అంతరిక్షంలోనూ ఆమె అక్కడ బాస్ కేంపస్‍లోనూ వున్నా కొంతవరకూ తట్టుకోవచ్చుగానీ పక్కనే వుండి సూటిగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుకోలేని ఈ స్థితిమాత్రం దుర్భరంగా వుంది.
ఇద్దరూ మరోసారి ఒకర్నొకరు చూసుకున్నారు. వెంటనే చూపులుకూడా మరల్చుకున్నారు.
“ఇక్కడ అసలు మీరేం చెస్తారు?””కుతూహలంగా అడిగింది ధన్య.
“అలా టెలిస్కోప్ ముందు కూర్చుని గమనించడమే”” నవ్వాడతను.
“మరి అన్నపూర్ణగారు? ఆవిడ ప్రయోగాలు పూర్తయాయా? కాకపోతే మరెలా?””
“తను తోకచుక్కల్ని పరిశోధిస్తుంది. ఇప్పటిదాకా చేసిన ప్రయోగాల ఫలితాలతో వెళ్ళింది. అవి పూర్తవడం వుండదు. మళ్ళీమళ్ళీ వస్తుండాలి. తను రిసెర్చిపేపర్స్ పబ్లిష్ చేసాక అవే ప్రయోగాలతో ఇంకెవరేనా ముందుకి వెళ్ళచ్చు. ఫినామినల్ అవి. కాబట్టి మరొకరు వాటిని వాడుకోవడంవలన ఆమెకి వచ్చే నష్టం ఏదీ వుండదు”
“అబ్రహం బాస్‍లో పొజిషన్ని వదులుకున్నాడు”” కొంచెం సంకోచిస్తూ చెప్పింది ధన్య. ఆ నిర్ణయాన్ని అతను తనని కలవకముందే తీసుకోవడంచేత రిలీఫ్‍గా వుంది. లేకపోతే ఆ నిర్ణయానికి కారణం తనేననిపించి జీవితాంతం బాధ వెంటాడేది. ఆమోతో తనకిగల మానసికమైన బంధాన్నికూడా కొంతవరకూ ప్రభావితం చేసేదేమో! ఏది ఏమైనా కాలం అనేది మనుషుల జీవితాలమీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
“తెలిసింది”” అన్నాడు ఆమో. అత్యున్నతస్థాయి ప్రయోగాలుకూడా నిర్వేదాన్ని కలిగిస్తాయనేది అతనికి ఆశ్చర్యం కలిగించింది.
ఊదాపచ్చనౌకమీద తను తీసిన ఫొటోలనీ రాసుకున్న నోట్స్‌నీ ఆమెముందు పెట్టాడు.
“బాస్ విశ్వాకి ఆ నౌక ఎంతదూరంలో వుందో నువ్వు కచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగితే నేను ఎల్‍ఎస్‍ టీని సెట్ చేసుకుంటాను””
“అదేంటి? యూఎఫ్‍ఓని పట్టుకుందుకు మన టెక్నాలజీ ఏమిటి?”
“లేజర్ స్క్రైబింగ్ టెక్నాలజీమీద ఆధారపడుతున్నాం. దానితో ఒక గ్రాఫీన్ ట్రిగ్గర్ గన్ ప్రత్యేకంగా ఇందుకోసం చేయించాను. రిమోట్‍తో పని చేస్తుంది. బటన్ నొక్కగానే సన్నటి గ్రాఫీన్ దారాలు లేజర్ బీమ్స్‌తో కలిసి బయల్దేరతాయి. అవొక కనిపించని మెష్‍లా యూఎఫ్‍ఓని చుట్టేస్తాయి. మనం వాటిని విత్‍డ్రా చేసుకున్నప్పుడు వాటితో చిక్కుపడిన యూఎఫ్‍ఓకూడా వచ్చేస్తుంది. మనం మెసేజి పంపగానే బాస్ క్రూ వస్తారు. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు”” ఆమో వివరించాడు.
ధన్యకేం అర్థం కాలేదు. ఇంత కష్టపడి సాధించినదాన్ని బాస్‍కి ఇచ్చేస్తే మరితని ప్రయోగాలు? అదే అడిగింది.
“అది కాలనౌక కాకపోతే”” కచ్చితంగా వుంది ఆమో జవాబు. ఆమె అలా అడిగినందుకు లోలోపల సంతోషం వేసింది.
అది కాలనౌక ఔతే… దాన్ని అతను బాస్‍కి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ధన్యకి తెలుసు. అతను కాలప్రవాహంలో ఏ దూరతీరానికో వెళ్ళిపోతాడు. మళ్ళీ వర్తమానంలోకి వస్తాడో రాడో! పద్మమాలికని వెతుక్కుని… ఆమెని పెళ్ళి చేసుకుని… ఆమె ముఖం మ్లానమైంది. అతను గమనించకుండా వుండాలని చూపులు కంప్యూటర్ స్క్రీన్ వైపుకి తిప్పింది. అతను మరోలా అర్థం చేసుకున్నాడు.
“ఇందులోని ఎథిక్స్‌గురించి ఆలోచించాలనుకోవటంలేదు ధన్యా! బాస్‍ని డిచ్‍చేస్తున్నానా, నా స్వంత ప్రయోగాలకి వాడుకుంటున్నానా అనే విషయాన్నిగురించి నాకు కొ౦త కన్సర్న్ వుంది. కానీ పద్మమాలిక నన్ను చాలా బాధపెడుతోంది. ఒక ఎండమావిలా నన్ను పరిగెత్తిస్తోంది. ఆ పజిల్ విడకపోతే నాకు మనశ్శాంతి లేదు. ఆ తర్వాత బాస్‍కి లొంగిపోతాను. ప్రిమియర్ నన్నేం చేసినా ఎలా౦టి క్రమశిక్షణ చర్య తీసుకున్నా నేను పట్టించుకోను”” అన్నాడు.
మరి తను? ఏమీ కానప్పుడు ఎందుకు ఇదంతా తనకి చెప్తున్నాడు? ఇది అత్యంత గోప్యనీయమైన విషయమేకదా? ఈ విషయం బయటికి తెలిస్తే అతని వుద్యోగమేకాదు, కెరీర్‍కూడా ముగిసిపోతుంది. అదేకాదు అతని ప్రయత్నాలు నెరవేరే దారికూడా మూసుకుపోతుంది. అలా౦టి విషయాన్ని ఏమీకాని తనకెందుకు చెప్పాడు? ఆమెకి చాలా అయోమయంగా వుంది. ఎలా అర్థంచేసుకోవాలో మరెలా అన్వయించుకోవాలో తెలియలేదు.
ఆమో ఆలోచనలు వేరు. అతనికి ధన్య పరాయిదనే భావన లేదు. పద్మమాలిక ఒక ప్రయోగంమాత్రమే. టైంహంట్‍తో ముడిపడివున్న ప్రయోగం.
ధన్యతో తన మనసు ఇప్పి చెప్పాలనుకున్నవాడు మళ్ళీ స౦దిగ్ధంలో పడి అగిపోయాడు. ఇది సందర్భం కాకపోవచ్చు. తన మనసు నిండా వున్న ప్రేమ అనే మాధ్యమంలోంచీ చూస్తుంటే ఆమెకూడా ప్రేమలో వున్నట్టే అనిపిస్తోంది. కానీ అది నిజంకాకపోతే? తన వూహ మాత్రమే అయితే? ఇలాంటి అనివార్యమైన ఏకాంతాన్ని తప్పుగా వాడుకుంటున్నాడని ఆమె అపోహపడితే? అలాంటి దురూహతోటే ఈ అవకాశాన్ని కల్పించాడనుకుంటే? ఈ స్పేస్‍లాబ్‍లోని జీవితాలు ఇలాంటి అనైతికతతో నిండి వుంటాయనే నిర్ణయానికి ఆమె వస్తే? ఆమో తల బలంగా విదిలించాడు. తను చెయ్యబోయినది ఎంత పెద్ద తప్పో అర్థమైందతనికి.
వాస్తవంగా అది పెద్ద తప్పే అయి వుండేది, ధన్యకి అతనిమీద ప్రేమ లేకపోతే. ప్రేమ వుందిగాబట్టి దాన్ని వ్యక్తపరచకపోవటం ఇప్పుడు తప్పై కూర్చుంది. ప్రేమ చాలా జటిలమైనది.
అక్కడితో ఇద్దరి భావోద్వేగాలూ చల్లబడ్డాయి. భావాలు మనసు లోలోపలి పొరల్లోకి ఇంకిపోయాయి. ఎక్కడో చిన్న పరిమళం ఒక సౌహార్ద్రతలా వ్యక్తమైంది తప్ప ప్రేమలా కాదు. ఇద్దరూ ప్రొఫెషనల్స్‌గా మారిపోయారు.
అతను వేసిన లెక్కలన్నీ ఆమె సరిచూసింది. కంప్యూటర్లోకి తనకి అనువైన పద్ధతిలో ఎక్కించింది. వాస్తవంగా ఆ వూదాపచ్చనౌక ఎదురైనప్పుడు వాటంతట అవే రీడింగ్సన్నీ అనుసంధానించుకుని సరిచేసుకునేలా ప్రోగ్రామింగ్ చేసుకుంది. ఊదాపచ్చ నౌక కనిపించే అతి తక్కువ సమయంలో ఇదంతా జరిగిపోవాలి. కేవలం ఒక బటన్ టచ్చిస్క్రీన్ చేస్తేనే అదంతా జరిగిపోయే అలాంటి ప్రోగ్రాంనే తయారు చేసింది. ఆమో చాలా ప్రశంసించాడు.
మొదటిసారికాబట్టి ఎంత శిక్షణ పొందినా ధన్య స్పేస్‍లాబ్‍లో అందర్లానే చాలా ఇబ్బంది పడింది. ఆమోకి తనొక సీనియర్ననే ఆధిక్యభావన ఎప్పుడూ ఎవరిపట్లా లేదు. తను సీనియర్, అన్నీ తెలిసినవాడూ కాబట్టని అన్ని బాధ్యతలూ జాగ్రత్తలూ తనే తీసుకునేవాడు. అతనితో కలిసి పనిచేసేవారికి భూమ్మీదైనా అంతరిక్షంలోనైనా నిశ్చింతగా వుంటుంది. ధన్య విషయంలో అతను ఇంకా జాగ్రత్త తీసుకున్నాడు. ఆమె అతని వుపిరి, ప్రాణం, సర్వం. ఆమె డైట్, నిద్ర, అన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు. ఆమె ఎంజాయ్ చేస్తోంది, ముడుచుకుపోతోంది కూడా. మరొకరికి చెందాల్సిన ప్రేమని తను ఆస్వదించలేక.
బాస్ విశ్వలో ప్రయోగాలకి స్పేస్‍సూట్ అవసరం లేదు. కానీ బయటి నౌకతో చేస్తున్నారు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. నౌకలోంచీ బైటికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. లేదా అవతలి నౌకని ఆకర్షించే క్రమంలో కుదుపులు వుండవచ్చు. అందుకని ఇద్దరూ స్పేస్ సూట్లు వేసుకునే వుంటున్నారు. ఆమో ఆలోచనన్లు అంతకిమించి సాగలేదు.
అతనికి మళ్ళీ ఆ కల రాలేదు. కలతో నిమిత్తం లేకుండానే ఒకరోజు…ధన్య వచ్చిన దాదాపు నెలరోజుల తర్వాత…
“ఆమో! అదేనా మీరు చెప్పినది?”” అని కంగారుగా పిలిచింది. అప్పటికి అతనడిగిన లెక్కలన్నీ వేసేసింది. ఆమె లెక్కల్తో వాస్తవదూరాలు ఆటోమెటిగ్గా కంప్యూటర్ పోల్చి సరిచూసుకుంటోంది, సరిగ్గా సరిపోతున్నాయి. ఆ క్షణంకోసమే చూస్తున్న ఆమో తటాలున స్పందించాడు. ఇద్దరూ సీట్ బెల్టులు బిగించుకున్నారు. దూరాన్ని ఫీడ్ చేసి గ్రాఫీన్‍మెష్‍ని ట్రిగ్గర్ చేసాడు. మెష్ వెళ్ళి యూఎఫ్‍ఓని అల్లుకోవడం తెలుస్తోంది.
ముందు చిన్న కుదుపు. తరువాత పెద్ద పేలుడుతో కూడిన ఇంకా పెద్ద కుదుపు. శబ్దం శూన్యంలో ప్రయాణించదు కాబట్టి పేలుడు వినిపించలేదు కానీ ఇద్దరూ అంత దూరానికి విసిరెయ్యబడ్డారు. అది అర్థమైంది.
ఏ పొరపాటు దీనికి కారణమైందో తెలియలేదు ఆమోకి. బాస్ విశ్వలోకి చీకటి ఎలా నిండింది? ఎక్కడికో విసిరెయ్యబడుతున్నట్టుగా వుంది…ఏం జరుగుతోంది?ఆమో వూహించిన కుదుపులు ఇవి కావు. ఒకపక్కనుంచీ క్రమంగా యూఎఫ్‍ఓ దగ్గిరౌతోంది. వేగం చాలా నియంత్రణలో వుంది. అప్పుడు గమనించాడతను… రెండోవైపుని వీళ్ళకి దూరంగా జెట్టిసన్ చేస్తూ దూరమౌతున్న వస్తువుని… దానిమీద బాస్ విశ్వ… అనే అక్షరాలని… రెండు గ్రహశకలాలు కొట్టుకున్నప్పుడు జనించిన వుష్ణకాంతిలో. అది బాస్ విశ్వ ఐతే మరి తామున్నది?
వాస్తవం అర్థమైంది అమోకి. మెదడు మొద్దుబారినట్టైంది. బాస్ విశ్వ నిలువునా రెండుగా చీలిపోయింది. ఒక సగంలో తామున్నారు. రెండో సగం రోదసిలో గింగిర్లు కొడుతోంది. ధన్య…ధన్య ఏమైంది? అతని గుండె చప్పుడు ఆమె. దాన్ని వెతుక్కున్నాడు.
“ధన్యా!”” పిలిచాడు.
ఆమెకేం వినిపించలేదు. ఆమెకి భయం వెయ్యట్లేదు. ఆమో పక్కనున్నాడని ధైర్యంగా వుంది. వున్నాడో లేదో కనిపించడంలేదు. కానీ వున్నాడనే నమ్ముతోంది. మరోలా అనుకోవడానికి ఆమె మనసు సిద్ధంగా లేదు.
ఆమోకి ఏడవాలనిపించింది. ధన్యని ఏం చేసాడు తను?


యూఎఫ్‍వోని పట్టుకునే క్రమంలో బాస్ విశ్వ రోదసిలోనే పేలిపోయింది. ఆ ప్రముఖశాస్త్రవేత్త ఆనందమోహన్- మనందరి ప్రియతమ ఆమో రోదసిలో కలిసిపోయాడు. అతనితోపాటుగా వున్న మరొక యువశాస్త్రవేత్త ధన్యాపార్థసారథికూడా అంతరిక్షంలో కలిసిపోయింది. వారి మృతికి ప్రిమియర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. బాస్ చెయిర్‍పర్సన్ శ్యాం తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు-
ఎక్కడ విన్నా, ఏ చానెల్లో చూసినా అదే వార్త. బాస్ విశ్వ శకలాలకోసం గాలింపు మొదలైంది.
ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని రేపింది. ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అంత చిన్నవయసులోనే అంతటి ప్రయోగాలని చేసి భూగ్రహవాసులకోసం అంతరిక్షపు హద్దులని విస్తరించిన ఆమో మరణం చాలా పెద్ద షాక్. ఐచ్ఛికంగానే అందరూ తమ దినచర్యల్ని మర్చిపోయి మానేసారు. ప్రపంచం చైతన్యాన్ని కోల్పోయింది కొంతసేపు. ప్రపంచంతోపాటుగా మనుషులు, మనుషులుచేసే ప్రయోగాలుకూడా. విశ్వ పేలిపోవటం బాస్‍కి పెద్ద దెబ్బ. కోలుకోవడానికీ, మళ్ళీ ప్రయోగాల బరిలోకి దిగడానికీ, ఆమో అంతటి శాస్త్రవేత్తలు ఆవిర్భవించడానికీ చాలా కాలమే పట్టవచ్చు.
శ్యాం అసలు తన స్పృహలోనే తను లేడు. టైంహంట్ వద్దన్నందుకు ఆమో కోపం, దాన్ని తను చల్లబరిచిన తీరు, అతను అసంతృప్తిని దాచుకున్న వైనం…
ఆమో, ధన్యలని ఒకరికొకరికి పరిచయం చెయ్యడం … వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం …అతన్ని చూడగానే ఆరాధనతో వెలిగిపోయిన ఆ అమ్మాయి అమాయకమైన ముఖం … అకారణంగా ఆమెని మృత్యుకుహ్వరంలోకి తనే తోసాడనిపించింది. ఆమోతో వున్నది స్నేహం, ప్రేమ, ఆరాధన. కానీ ధన్య? తనకే సంబంధం లేని వ్యక్తి. తనొక హంతకుడు… అతను చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసాడు.
దానికి తోడు అబ్రహం ఫోన్ చేసి శ్యాం మీద అరిచేసాడు. “”ఏం సాధించారు మీ ప్రయోగాలతో? మొదటి సీజన్లో కొందరు సైంటిస్టులని చంపారు. ఇప్పుడు వీళ్ళు. ఇప్పటికేనా ఆపుతారా ఎండమావులవె౦ట ప్రయోగాలపేరుతో అమాయకులైన మనుషుల్ని పరిగెత్తించి చంపడం? నేను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‍కి వెళ్తాను, ఈ ప్రయోగాలని ఆపమని. అన్ని దేశాలలో…”” అతనికి దు:ఖంతో మతిపోతోంది.
అతనికొక్కడికే రూఢిగా తెలుసు, ఆమె మనసు పొరల గులాబీరేకుల మధ్య దాగి వున్న ప్రేమ అనే పుప్పొడి. ఆ ప్రేమ ఫలించదని తనకి తెలుసు. వేచి వుందామనుకున్నాడు… ఓపిగ్గా. కానీ తనకా అవకాశం ఇవ్వలేదు. ఆమె ప్రేమ ఫలించేదోలేదోగానీ చివరిక్షణాలని మాత్రం మనసైనవాడితో పంచుకుంది. గుండెలమీద పిడికిలితో కొట్టుకున్నాడు. చేతికందినవన్నీ విసిరేసాడు. కన్నీళ్ళుమాత్రం ఆగలేదు.
అన్నపూర్ణ స్థాణువే అయింది. “”అదృష్టం. నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ధన్యాపార్థసారథి స్థానంలో నువ్వుండేదానివి. చాలా, ఇంక ప్రయోగాలు, చదువులు?”” అన్నాడు ఆమె భర్త. అతనిది కూడా ప్రేమే.
“అలా అనవద్దు. జీవితాన్ని పంచుకోవలిసిన ఇద్దరూ మృత్యువుని పంచుకున్నారు. నాకెందుకో అనిపించింది, వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని… అందుకే ఔటాఫ్ టర్న్‌లో అవకాశాన్ని పొంది, అతన్తో కలిసి వెళ్ళిపోయింది”” జవాబిచ్చింది అన్నపూర్ణ. ఆమె ఎందుకో అతనికి అర్థమవదు. ఇప్పుడూ అవలేదు.
ఆమో ధన్యల మరణం అనే విషాదాగ్నికి ఆహుతౌతున్న పెద్ద సమిధ సంధ్య. ఎలా చనిపోయాడు తన కొడుకు? తన మనసుకి అతి దగ్గిరగా వచ్చిన ధన్య? అంతరిక్షంలో పేలిపోయి…ఒక కీటకంలా… మాడి మసైపోయారా? మృత్యువు ముంచుకొస్తోందని వూహించనంత హఠాత్తుగా పంచభూతాల్లో కలిసిపోయారా? వస్తున్నది మృత్యువని తెలియని ఆ చివరిక్షణంలో వాళ్ళ ఆలోచనలేమిటో? సంధ్యకి దు:ఖం కలగటం లేదు. కన్నీళ్ళు రావటం లేదు. ఆలోచన… ఒకటే ఆలోచన…
పెద్ద చదువులు చదివి, ఏవేవో సాధించి, ఎంతో ఎత్తుకి వెళ్ళి మనుషులు సాధిస్తున్నదేమిటి? మృత్యుకౌగిలి. అకాల మృత్యువు. ఎందుకీ చదువులు? ఏం సాధించాలని? తన కొడుకేం సాధించాడు? అతనితో వెళ్ళిన అమ్మాయి… ఆమె ఏం సాధించింది? పెళ్ళి లేదు… పిల్లల్లేరు… జీవికి అవసరమైనవన్నిటినీ దూరంగా నెట్టేసి ఇద్దరూ ఏ దిగంతాల అవతలికి ఇంకా ఏం సాధించాలని వెళ్ళిపోయారు? వాళ్ళ ఆత్మలేనా వున్నాయా? అవీ నశించిపోయాయా? భూగోళపు ఎల్లలు దాటేసాయా?
రమేష్‍కి పిచ్చిపట్టేట్టు వుంది. ఏం ఆలోచించాలో ఎలా దు:ఖపడాలో అర్థం కాకుండా ఉంది. ఎవరి ఓదార్పులూ వారికి సాంత్వననివ్వటంలేదు. అసలు ఓదార్చాలని వచ్చినవాళ్ళకే కావాలి ఓదార్పు.


పేలిపోయిన విశ్వతోపాటుగా ఆమో, ధన్యకూడా పేలిపోయారనే అంతా నమ్మారు. మరో ప్రత్యామ్నాయపు ఆలోచన ఎవరికీ కనిపించలేదు. తప్పించుకున్నారా, వూదాపచ్చనౌకవాళ్ళు పట్టుకున్నారా అనే ప్రశ్నలు ఎవరికీ కలగలేదు. అలాంటి అవకాశాలు మిగిలి వున్నాయని ఎవరికీ అనిపించలేదు. బియ్యం, నీళ్ళూ , అగ్గిపెట్టే ఇచ్చినాకూడా ఐన్‍స్టీన్‍కి అన్నంవండాలనే ఆలోచన రాకపోవచ్చు. ఎందుకంటే అది అతని ఆలోచనాపరిధిలో లేనిది.
(రచయిత్రి మనవి: ఆర్కియోఆస్ట్రానమీ అనే ఒక సరికొత్త శాస్త్రవిభాగం, ఇంకా కొన్ని శాస్త్రీయ పద్ధతులద్వారా శ్రీరాముడి జన్మసంవత్సరాన్ని క్రీ.పూ. 7323గా గుర్తించారు. వేరే అనేక సిద్ధాంతాలున్నాయి. కథాసౌలభ్యంకోసం నేను క్రీ.పూ. 7323ని తీసుకున్నాను. అంటే రాముడు 9341సంవత్సరాల క్రితంవాడన్నమాట.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్త్యే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతుం తపోనిధిం అనే శ్లోకం ప్రకారం వేదవ్యాసుడు వశిష్ఠుడి మునిమనవడు. వశిష్ఠుడు దశరథుడి రాజగురువు. వ్యాసుడు భారతకాలంవాడు. దీన్నిబట్టి, రామాయణానికీ, భారతానికీ మధ్య ఎక్కువ కాలబేధం వుండటానికి లేదు. అలాగే మయుడు మండోదరి తండ్రి. ధర్మరాజుకి మయసభని నిర్మించి ఇచ్చాడు. జాంబవంతుడు రాముడి అనుచరుడు. కృష్ణుడికి కన్యనిచ్చినవాడు. ధర్మరాజు చేసిన రాజసూయయాగ సందర్భంలో సహదేవుడు విభీషణుడికి అభివాదాలు పంపాడు.
ద్వారక దాదాపుగా 9000 సంవత్సరాలక్రితం సముద్రంలో మునిగిపోయిందని పురావస్తుశాఖ చెప్తోంది. అంటే మహాభారతయుద్ధం ఈ దరిదాపుల జరిగి వుండాలి. ఒకటవ, రెండవ ప్రపంచ యుద్ధాలమాదిరిగా రామరావణయుద్ధం, మహాభారతయుద్ధం జరిగి వుండాలి. అపారమైన అస్త్రశస్త్రాలు వుపయోగించి యుద్ధం చేసుకుని, నాగరీకతనంతా కోల్పోయి వుండాలి మనం. ఇది నా వూహ మాత్రమే.
జోధ్‍పుర్‍కి పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో అపారమైన రేడియేషన్ విడుదలవుతోందని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. హరప్పా మొహంజదారో కంకాళాలు చేతులు పట్టుకుని పరుగులు పెడుతున్న భంగిమలో దొరికాయని, ఆ అస్తిపంజరాలలో అణుధార్మిక మూలకాల నిలువలు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయని వీటన్నిటికీ కారణం జోధ్‍పూర్ దగ్గర తొమ్మిదివేల మూడువందలసంవత్సరాల క్రితం అణుబాంబు ప్రయోగం జరిగిందని ఇంటర్నెట్లో ఒక సమాచారం ఉంది. దాన్ని ఖండిస్తూ మరొక ఆర్టికల్ కూడా ఉంది. అయితే కథకోసం నేను అ అణుశక్తిప్రయోగం జరిగినట్టు తీసుకున్నాను.)
చాలా నెమ్మదిగా ఏలియన్ నౌకని చేరుకుని అంతదూరంలో ఆగిపోయారు ఆమో, ధన్య. అది ఒక అస్పష్టమైన చీకటిముద్దలా కనిపిస్తోంది. లోపల లైట్లు వెలుగుతున్నాయి. కానీ ఆ వెలుతురు పరావర్తనం చెందకపోవడంతో ఎలాంటి దృశ్యాలనీ సృష్టించలేకపోతోంది. ఇద్దరూ మనసులో ఒకరికోసం ఇంకొకరు తపించిపోతున్నారు. కానీ ఒకరినొకరు తాకి చూసుకోలేకపోతున్నారు. రెండు అవరోధాలు. ఒకటి సీట్ బెల్టులు. రెండవది వాళ్ళు వేసుకున్న స్పేస్‍సూట్లు. అవి రెండూ లేకపోయినా భారరహిత స్థితికూడా అనుమతించదు.
క్రమంగా ఒక ఊదాపచ్చ ఆకృతి దగ్గిరకి వచ్చింది. ఒక కేబుల్ని వాళ్ళకిచ్చింది. పట్టుకున్నాక ఆ ఆకృతి వాళ్ళున్న సగం నౌకలోకి వచ్చి ఇద్దరి సీట్‍బెల్టులూ రిలీజ్ చేసింది. ఇద్దరూ విడుదలయారు. వాళ్ళు శూన్యంలో గిరికీలు కొట్టకుండా ఆ ఆకృతి వాళ్ళని ఏలియన్ నౌకవైపుకి తోసింది. పెద్దగా తెరిచివున్న నౌక బహిర్భాగం వాళ్ళని లోపలికి లాక్కుంది. ఆ ఆకృతికూడా రాగానే మూతపడింది. అప్పుడు చూసుకున్నారు ఆమో, ధన్యా ఒకరినొకరు. అది చూసుకోవడమేం కాదు, రెండోవారు తమ వెంటే వున్నారన్న భరోసాని కలిగించుకోవడం.
స్పేస్‍షిప్ బాహ్యకవచానికి ఒక యాంటెనా ఏర్పాటు వుంటుంది. అది తన పరిధిలోకి వచ్చిన శబ్దాలని, మనుషుల ఆలోచనలనీ పట్టుకుని డీకోడ్ చేసి లోపలికి పంపిస్తుంది. బాస్, ఇంకా ఇతర స్పేస్‍షిప్‍లలోని శాస్త్రవేత్తల శబ్దాలుకూడా కొన్ని రికార్డై వున్నాయి.
స్పేస్‍షిప్ లోపలిభాగంలోకి రాగానే ఆ ఆకృతి వాళ్ళకి వేరే యాంటినాలు కనెక్ట్ చేసింది. ఆలోచనలని ఎవరో కేప్చర్ చేస్తున్నట్టుగా … పుట్టిన ఆలోచనని పుట్టినట్టుగా తోడేస్తున్న భావన కలిగింది ఇద్దరికీ.