ఊదాపచ్చనౌక 9 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

ఇదంతా మనసులో కదిలాక, అప్పుడు మౌనాన్ని వీడాడు మృత్యుంజయుడు.
“కాలంలో ప్రయాణించడానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి”” అన్నాడు ఆమోతో.
“మేమింకా కాలంలో ప్రయాణించే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. అది అసాధ్యమనే ఇప్పటికీ నమ్ముతున్నారు చాలామంది” అన్నాడు ఆమో.
“ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది నువ్వొక్కడివే నీకు మాత్రమే సంబంధించిన కాలంలో గతంలోకీ వర్తమానంలోకీ ప్రయాణించడం. అందులో మరొకరికి చోటుండదు”” అన్నాడు మృత్యుంజయుడు.
“అంటే?! మీవాళ్ళని మీరు కలుసుకోలేకపోయారా?”” ఆతృతగా అడిగింది ధన్య. అతనికీ, కుటుంబసభ్యులకీ మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గేప్ తొలగిపోవాలని ఎంతగానో కోరుకుంటోంది.
“ఆఖర్లో చెప్తాను”” అన్నాడతను అభావంగా. “”…రెండోది, యావత్తు భూమినీ వ్యతిరేకదిశలోకి తిప్పి గతంలోకీ , లేదా ఇప్పుడు భూమి తిరిగే వేగాన్ని పెంచి భవిష్యత్తులోకీ తీసుకెళ్ళటం. అది సాధ్యపడేది కాదు. అంత విరుద్ధపదార్ధాన్నిగానీ, శక్తినిగానీ మనం పోగుచెయ్యలేము. ఒకవేళ చెయ్యగలిగినా చాలా విధ్వంసం జరుగుతుంది. భూమి గతి మారుతుంది తప్ప మనిషి వ్యక్తిగతజీవితానికి సంబంధం వుండదు. కాలయానం అనేది వ్యక్తిగతంగా మాత్రమే చెయ్యగలుగుతాం. భూమిగతిని కాకుండా కాలనౌకని నియంత్రించడంద్వారా” “
ఆమో నిశ్చేష్ఠుడై వింటున్నాడు. రెండిటికీగల తేడా అర్థమయ్యీకానట్టుగా వుంది. ధన్యకి తన ప్రశ్నకి జవాబు దొరికీదొరకనట్టుగా వుంది.
“అలాకూడా కాలంలో ప్రయాణించడానికి కొన్ని సూత్రాలుంటాయి. చావుపుట్టుకల దగ్గిర అంటే డెత్‍స్టేషను, బర్త్‌స్టేషన్లలో ఎప్పుడూ నౌక ఆపకూడదు, దిగకూడదు. అక్కడ నువ్వు ఇరుక్కుంటే ఇంక బయటికి రాలేవు. నౌకని వాడుకునే సామర్ధ్యం నీలో వుండదుకదా?
ఏ ప్రదేశంలో కాలయానం చేస్తే ఆ ప్రదేశానికి సంబంధించిన భూతభవిష్యత్తుకాలాలలోకి మాత్రమే వెళ్ళగలం. అక్కడినుంచీ ఇంకెక్కడికేనా వెళ్ళాలంటే మామూలుగానే ప్రయాణించాలి”
సున్నా కేంద్రంగా xyz అక్షాలని గీస్తే x అక్షం పదార్ధానికీ, yఅక్షం కాలానికీ zఅక్షం స్పేస్‍కీ అంటే మనిషి వునికికీ సంబంధించినవౌతాయి. -y గతం. y భవిష్యత్తు. _x విరుద్ధపదార్ధం, x పదార్ధం, _z వునికిలేకపోవటం, z వునికి. _z అక్షంలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. పదార్ధం, విరుద్ధపదార్ధం y అక్షంమీద ఒకదాని వెనుక ఇంకొకటి నిలబడతాయి. పదార్ధం, విరుద్ధపదార్ధం ఒకదాన్నొకటి తాకినప్పుడు అవి పేలిపోతాయి. పదార్ధం అంటే నేను లేదా నా నౌక. విరుద్ధపదార్ధాన్ని విద్యుదయస్కాంత స్థూపంలో బంధించినా దానికి కొంత ప్రభావపరిధి వుంది. ఆ పరిధిలోకి వెళ్ళగానే నేను గతంలోకో భవిష్యత్తులోకో నెట్టివెయ్యబడటం జరుగుతోంది. అది నన్ను తాకనివ్వడంలేదు. కాబట్టి ఒక సయొధ్యపదార్ధాన్ని తయారుచేసుకున్నాను. ఈ వూదాపచ్చపదార్ధం అదే. అది పదార్ధానికీ విరుద్ధపదార్ధానికీ మధ్య సయోధ్యగా పనిచేస్తుంది. స్పేస్ ట్రావెల్లోకూడా వుపయోగపడుతోంది.
“నేను, స్తూపం Y అక్షంమీద వరుసగా నిలబడతాము. దాని ప్రభావ పరిధిలోనే నేను వుంటాను. దానికి వ్యతిరేకదిశలో నా కదలికలు వుంటాయి. నేను కదలడమనేది y,z లేదా -y,z పాయింట్లమీద జరుగుతుంది. కాలంలో నిట్టనిలువుగా పైకీ కిందకీ మాత్రమే వెళ్ళగలం. x అక్షంమీద పదార్ధం పరుచుకుని వుంటుంది. x1, x2… పాయింట్లమీద వుండేది నువ్వుకాదు. ఆ పాయింట్లమీదకి చేరుకుని y అక్షంమీద నువ్వు ప్రయాణం చెయ్యలేవు”” ఇంతవరకూ చెప్పి ఆగాడు మృత్యుంజయుడు. వాళ్ళకి ఎంతవరకూ అర్థమైందో అతనికి తెలీలేదు. సూత్రాలు చెప్పినంత తేలికకాదు వాటిని ఆచరణలోకి తేవడం. కానీ ఒక సినారియో వచ్చిందంటే అన్నీ వాటంతట అవే తమ స్థానాల్లోకి సర్దుకుంటాయి.
ఆమో తీవ్రమైన ఆలోచనలో వున్నాడు. మృత్యుంజయుడు మాటల్లో చెప్పిన విషయాలని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవి కంటికి కనిపించే భౌతికశాస్త్రవిషయాలు కాదు. నైరూప్య సూత్రాలు. ఒక స్థాయిలో సైన్సు ఆచరణలోనూ, అమలులోనూ వున్న సాధారణ భౌతికసూత్రాలకి అతీతంగా పనిచేస్తుంది. ఆ స్థితి ఇది. ఊహించడం వేరు. ఇలా జరగవచ్చు, అలా వుండచ్చు అని సిద్ధాంతాలు చెయ్యటం వేరు. అవి నిజంగా జరిగినప్పుడు విశ్లేషించడం వేరు.
ధన్య ఇవన్నీ ఆలోచిస్తున్నా, ఆమె మృత్యుంజయుడి కుటుంబాన్ని గురించిన ఆలోచనకూడా చేస్తోంది. ఆ విషయాలు ఆమె మనస్సుని కలచివేస్తున్నాయి.
చెప్పుకోవలసినవి ఎన్నో వున్నా, మాటలు కరువైనట్టు ముగ్గురి ఆలోచనలూ ఆగిపోయాయి. ఎవరికి వారే యాంటెన్నాలు తీసి పక్కని పెట్టి స్తబ్దుగా వుండిపోయారు. ఆమో తను కూర్చున్నచోటే వెనక్కి వొరిగి మృత్యుంజయుడు చెప్పిన విషయాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ నిద్రలోకి జారిపోయాడు. తదేకంగా అతన్ని చూస్తూ కూర్చున్న ధన్య కూడా మరికొద్దిసేపటికి నిద్రపోయింది. మృత్యుంజయుడు శూన్యంలోకి చూస్తూ వంటరిగా మిగిలాడు.


ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన ఆ విషాదం రెండు బిందువులదగ్గిర కేంద్రీకృతమైంది. అది అకస్మాత్తుగా, వురమని పిడుగులా, హెచ్చరికలేని తుఫానులా వచ్చిపడిన దు:ఖం. అది కేంద్రీకృతమైన రెండు బిందువులూ ఆమో ధన్యల కుటుంబాలు… ఇళ్ళు. పరామర్శలూ, ఓదార్పులూ వెల్లువెత్తుతున్నాయి. ప్రిమియర్ స్వయంగా వచ్చి పరామర్శించారు. శ్యాం కూడా. సెల్‍ఫోన్లు ఆగకుండా మోగుతున్నాయి. మెసేజిలతో మెమొరీ మొత్తం నిండిపోయింది. ఆమో ఇంటిముందు కార్లు అంత బారుకి ఆగి వున్నాయి. వచ్చినవాళ్ళంతా సంధ్యనీ రమేష్‍నీ చూసి ఏం మాట్లాడాలో తెలీక తెచ్చిన బొకేలూ, పువ్వులూ వాళ్ళ పక్కన వుంచి మౌనంగా నిలబడి వెళ్తున్నారు. ఇదేనా సైన్సంటే? అందర్లో విభ్రాంతి.
ఒకప్పుడెప్పుడో యూరిగగారిన్ అనే వ్యోమగామి రోదసిలో అడుగు పెట్టాక అప్పటిదాకా భూమ్మీదే వుండి ప్రయోగాలు చేస్తున్న ఖగోళశాస్త్రవేత్తల గమ్యం రోదసి అయింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిమీద అడుగుపెట్టాక ఆ గమ్యం మరింత విస్తరించింది. వ్యోమనౌకలు, కృత్రిమ వుపగ్రహాలు భూకక్ష్యలోకి వరుసకట్టాయి. ప్రయోగాలు అప్రతిహతంగా సాగాయి. ప్రమాదాలూ అలాగే వచ్చాయి. ఛాలెంజర్ వ్యోమనౌక భూమిని వదిలిపెట్టిన కొన్ని సెకన్లకే పేలిపోయింది. కల్పనా చావ్లా అనే వ్యోమగామి మరికొందరితో ప్రయాణిస్తున్న కొలంబియా వ్యోమనౌక పేలిపోయింది. బాస్ విశ్వ ప్రారంభదశలో కొందరు శాస్త్రవేత్తలు లుకేమియా బారిని పడ్డారు.
ఐతే ఇవన్నీ పాఠాలు. అంతే. గుణపాఠాలు కావు. ప్రయోగాలు ఆగవు. ఆపటం సాధ్యపడదు. మనిషి మేథ అలాంటిది. తెలిసింది చాలనుకోదు. ఇంకా ఇంకా ఏవో తెలుసుకోవాలనే జిజ్ఞాస అతన్ని విశ్రాంతిగానో సంతృప్తిగానో వుండనివ్వదు. ఈ ప్రమాదాలన్నీ మానవాళి తను చేస్తున్న ప్రయోగాలపట్లా, తనపట్లా అప్రమత్తతని పెంచే పాఠాలు. వాటినుంచీ విజ్ఞానశాస్త్రం ఇంకా ఎదిగింది. ఇప్పుడీ సంఘటన మరొక పాఠం. ఏమి నేర్పనున్నదో అంచనాలకి అందనిది.
ధన్య ఇంట్లోకూడా ఆమో ఇంట్లోలాగే వుంది. ధన్య తల్లి వుమ తెరలుతెరలుగా ముంచుకొస్తున్న దు:ఖంతో వుక్కిరిబిక్కిరైపోతోంది. ఆమె డాక్టరు. గైనకాలజిస్టు. ఎందరో జన్మించడాన్ని చూసింది. ఒకటీ అరా మరణాలనీ చూసింది. అది వృత్తిపరమైన వైఫల్యం కాకపోవచ్చు. ఐనా అందులో విషాదం వుంటుంది. కానీ దానికి గాఢత వుండదు. స్వంతకూతురి మరణం ఇది. తనలోని ఒక భాగం చచ్చిపోయినట్టే అనిపిస్తోంది ఆమెకి. గుండె మెలిపెట్టినంత బాధ. పార్థసారథి తనూ ఏడిస్తే భార్య తట్టుకోలేదని సంయమనం పాటిస్తున్నానన్న భ్రమలో వున్నాడుగానీ అతని కళ్ళూ ఈ నిముషాన్నో మరునిముషాన్నో వర్షించబోయే శ్రావణమేఘాల్లా వున్నాయి.
హఠాత్తుగా గుర్తొచ్చింది రమేష్‍కి, తన కొడుకుతోపాటు మరో అమ్మాయికూడా మరణించిందని, తమ దు:ఖంలో సహభాగస్థులు వున్నారని. అతనిలో ఒక అపరాధభావనకూడా చోటుచేసుకుంది. ఆమో ప్రయోగాలకోసమే, ఆమో ప్రయోగాలవల్లనే ఆమె చనిపోయిందని. మనసు కృంగిపోయింది. మొయ్యలేని బరువేదో మీదపడ్డట్టైంది.
శ్యాంకి ఫోన్ చేసాడు.
“ఆమోతోపాటుగా వెళ్ళిన అమ్మాయి … ధన్య. ఆమె తల్లిదండ్రుల వివరాలు ఇవ్వగలరా? వాళ్లెక్కడ వున్నారిప్పుడు?”” అని అడిగాడు.
ఎందుకని అడగలేదు శ్యాం. అర్థం చేసుకున్నాడు. అక్కడతను కంప్యూటర్లో చూసి చదువుతుంటే రమేష్ ఫోన్లో రికార్డైపోయింది. ధన్యవాదాలు చెప్పి పెట్టేసాడు రమేష్.
“పద”” అన్నాడు సంధ్యతో . ఇంత హఠాత్తుగా ఎక్కడికనిగానీ , ఏమిటనిగానీ ప్రశ్నించలేదామె. ఆమె అంతరంగంలోకూడా అలాంటి భావనేదో జనించి వుండచ్చు. అతనెందుకు ధన్య తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నాడో ఆలోచించి అర్థం చేసుకునే శక్తిలేకపోయిందిగానీ ఒక సహజచర్యలా ఆమె మనసు గ్రహించింది. దు:ఖానికీ ఒక భాష వుంటుంది.
ప్రిన్స్‌ని డాగ్‍కేర్‍లో వుంచమని మెయిడ్‍కి చెప్పి అతన్ని అనుసరించింది. అప్పటికప్పుడు వాళ్ళ పర్సనల్ డ్రోన్‍లో ధన్య తల్లిదండ్రులుండే చోటికి వెళ్ళిపోయారు. ఏరియల్ ట్ర్రాఫిక్‍ని పక్కకి తప్పించి వారికి నేరుగా వెళ్ళే మార్గాన్ని సుగమపరిచాడు డ్రోన్‍వే కంట్రోలర్.
ఒక దు:ఖం మరో దు:ఖాన్ని పరామర్శించింది. కన్నీటి కడలిలో రెండు మహానదులు కలిసినట్టైంది.
“ఎంతో అపురూపంగా పెంచుకున్నాం ధన్యని. పప్పా! ఎప్పటికైనా బాస్‍లో చేరాలి పర్మనెంట్ క్రూగా… అనేది. అదొక ఆశయమనుకుని ప్రోత్సహించాం. మాకు అందనంత దూరానికి వెళ్ళిపోయింది”” రమేష్ దగ్గిర బ్రేకయ్యాడు పార్థసారథి. అప్పటిదాకా వుగ్గబట్టుకున్న దు:ఖం ఒక్కసారి పెటిల్లుమని విరుచుకుపడింది. అతని గుండె, చాతీ ఎగిరెగిరిపడుతున్నాయి. ఉమ సరేసరి. ఆమెని ఎవరూ ఆపలేకపోతున్నారు. వాళ్ళకి ఆమోపట్ల ఎలాంటి ద్వేషభావం లేదు. ఆమోవల్లనే ఇదంతా జరిగిందన్న ఆలోచనే లేదు. వృత్తిలో పైకెదుగుతున్న పరిక్రమంలోనే కూతురు చనిపోయిందని వాళ్ళకి తెలుసు.
శ్యామ్‍కి ఫోన్ చేసింది సంధ్య. “”వాళ్ళిద్దరినీ ఆఖరిసారి చూసుకోవాలనుకుంటున్నాను. దయచేసి బాస్ విశ్వ ఆఖరిఫోటోలు పంపగలరా?”” అని అడిగింది.
వాస్తవానికి విశ్వలో తీసిన ఫోటోలు బయటికి రానివ్వరు. అవి పూర్తిగా బాస్ స్వంతం. ఎందుకంటే వాటిని జూమ్ చేసి, పిక్సెల్ పిక్సెల్‍గా స్కాన్ చేసి, శాస్త్రవేత్తల పరికరాలో వున్న వివరాలన్నీ సంగ్రహిస్తారని భయం. ప్రిమియర్ అనుమతి తప్పనిసరి. బాస్ విశ్వనుంచీ వచ్చిన ఆఖరి ఫోటోలని అనేక కోణాల్లోంచీ పరిశీలకులు పరిశీలిస్తున్నారు. సంధ్య అభ్యర్ధన తోసిపుచ్చలేనిది. ప్రిమియర్‍తో మాట్లాడాడు.
“అలాగే ఇవ్వు. ఇంకా ఏం మిగిలిందని బాస్ విశ్వాలో సమాచారం సంగ్రహించేందుకు? ఆమో ప్రయోగాలు ఎవరూ అందుకోలేనివి”” అని కొంత వైరాగ్యంగా మాట్లాడాడు ఆయన.
శ్యాం పంపించాడు. నలుగురూ వాటిని చూస్తూ రోజంతా గడిపారు. మళ్ళీ తిరిగొస్తానని చెప్పిన వ్యక్తి ఎలాంటి సంకేతం లేకుండా తిరిగి రాలేనిచోటికి వెళ్ళిపోవటంలోని విషాదం మాటల్లో చెప్పలేనిది. వాళ్ళ శైశవం, బాల్యం, చదువు … ఎన్ని జ్ఞాపకాలని! అవన్నీ ఆలయశిథిలాల్లా మిగిలాయి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయాక పెళ్ళిళ్ళు చేసి, పిల్లల్ని కంటే ఆ పిల్లల్తో ఆడుకోవాలని ఎన్ని కోరికలని! అన్నీ నీటిమీద రాసిన రాతల్లా చెరిగిపోయాయి. చూస్తూ చూస్తుంటే సంధ్యకి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళు చనిపోలేదేమో. విశ్వంలో ఎక్కడో తప్పిపోయారేమో, పట్టుదొరక్క గిరికీలు కొడుతున్నారేమోననిపించింది.
అవే మాటలు శ్యాంతో అంటే,” “ఆ అవకాశం లేదమ్మా! వాళ్ళిద్దరూ తమ సీట్లలో కూర్చుని సీట్ బెల్టులు కట్టుకుని వున్నారు. బాస్ విశ్వ ఎందుకు పేలిపోయిందో, శకలాలేనా దొరుకుతాయేమోనని గాలింపు జరుగుతోంది. ప్రపంచదేశాలన్నీ సహకరిస్తున్నాయి. ఆ యూఎఫ్‍వోలోని ఏలియన్స్ వాళ్ళని పట్టుకెళ్ళారా అని ఆలోచిస్తే ఆ అవకాశమే లేదనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు సీట్ బెల్టుల్తో వున్నారు, నౌక పేలిపోయింది. అన్నికోణాలూ ఆ ఒక్కచోటికే వచ్చి కలుస్తున్నాయి. ఆ ఏలియన్ నౌకకోసం కూడా ప్రయత్నిస్తున్నాం. అది దొరికితే మనకేవైనా వివరాలు తెలుస్తాయి. కానీ అదీ కనిపించడంలేదు” ” అన్నాడు.
సంధ్య నిరాశగా ఫోన్ పెట్టేసింది. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాల స్థాయిని మించిన ప్రమాదం ఇది. భూకక్ష్య దాటిన తరువాతి ప్రపంచం మనిషిది కాదు. వ్యోమనౌకలో వున్నంతవరకే అతని వునికి. అసంఖ్యాకంగా తిరిగే వుల్కలు, తోకచుక్కలు, ఇంకా అనేక ఖగోళపదార్ధాల నడుమ అతను తనుగా వుండటం అసాధ్యం. గిరికీలు కొడుతుంటే ఏవేనా వచ్చి కొట్టుకోవచ్చు. అదుపులేకుండా గిరికీలు కొడుతూ విశ్వపు ఏ లోతుల్లోకో జారిపోవచ్చు. అదీకాక, స్పేస్‍సూట్ డామేజైతే తొంభై సెకన్లు పట్టదు ప్రాణం పోవటానికి. విశ్వా పేలిపోయాక వాళ్ళు ఏ స్థితిని చేరుకున్నారో!


మృత్యుంజయుడు వంటరిగా నిలబడ్డాడు. యుగాలుగా అలవాటైన వంటరితనమే అయినా ఇప్పుడు ఇద్దరు మనుషులు దొరికాక దుర్లభంగా అనిపిస్తోంది. పంచుకోవడానికి బతికిన ఆ పాతికసంవత్సరాలేతప్ప, అంతరిక్షంలో వేలాడిన ఈ వేలయేళ్ళలో అనుభవాలేవీ పోగుచేసుకోలేదు.
కొన్ని పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకోగలిగే అవకాశం వుంటే అవి పొరపాట్లుగా వుండిపోతాయి. లేకపోతే కాలసర్పాలై కాటేస్తాయి. అతను చేసిన ఒక పొరపాటు అలాంటిది. అతన్ని ఈ సుదీర్ఘజీవితంలోకీ, వంటరితనంలోకీ నెట్టేసింది.
మృత్యుంజయుడి ప్రయోగాలకి కావల్సినవన్నీ సర్వవీక్షణుడు సమకూర్చాడు. విరుద్ధపదార్ధం వున్న లోహ స్థూపాన్ని ముట్టుకోవడానికి లేదు. ముందొక (ఇన్సులేషన్)సమన్వయపదార్ధాన్ని తయారుచెయ్యాలి. తయారుచేసాడు. విద్యుదయస్కాంత సమన్వయపదార్ధాన్ని కొద్ది మార్పులు చేస్తే అదొక వూదాపచ్చటి మెరుపుగల రబ్బరులాంటి పదార్ధం తయారైంది. దానితో కవచాలు తయారు చేసుకున్నాడు తల భాగానికి ఒక చిప్పలాంటి పరికరాన్నికూడా. అవి విరుద్ధపదార్ధానికి ఇన్సులేషన్‍గా బాగా పనిచేసాయి.
స్థూపంమీదికి ఒక వస్తువుని సమన్వయపదార్ధాన్ని కప్పి కొంత బలంతో విసిరితే దాని నెగటివ్ స్పిన్ అంతే బలంతో వెనక్కో ముందుకో నెడుతోంది…గతంలోకి, అక్కడినుంచీ ముందుకి. పక్కలకి అదేమీ పని చెయ్యటం లేదు. పక్కలకి అంటే X అక్షంమీద. ఇప్పుడు కాలగతిని మార్చకుండా స్తూపాన్ని గగననౌకలోకి చేర్చడం… x అక్షంమీద కాలం సున్నా. అంటే వర్తమానం. ఆ అక్షం మీద స్తూపాన్ని కదిలించాలి. x అక్షాన్ని పొడిగించి దానిమీదికి నౌక ద్వారాన్ని చేర్చితే సాధ్యపడింది. ఆశించిన ఫలితాలనివ్వడంతో ప్రయోగాలని ముమ్మరం చేసాడు. కేవలం ఒక ఆశ… తనవాళ్ళని కాపాడుకోవాలన్న ఆశ… అది మాత్రమే అతనిచేత ఈ అద్భుతాలన్నీ చేయిస్తోంది.
స్థూపాన్ని పైకీ కిందకీ జరపడంద్వారా కాలంలో ముందు వెనకలకి జరగచ్చని తెలిసింది. ఆ జరపడానికి, అలా జరపడంలో వుండే వేగానికి, ఎంత దూరానికి జరిపితే కాలంలో ఎంత ముందువెనుకలకి, ఎంత వేగంతో జరిపితే, కాలంలో ప్రయాణం ఎంత వేగంగా జరుగుతుంది ఈ విషయాలన్నిటిమీదా నియంత్రణ వుండాలి. అది నౌకని నడిపేవాడి చేతిలోనే వుండాలి. ఈ చర్యలన్నిటికీ మీటలు తయారయ్యాయి.
సృష్టి తన రహస్యాలని చెప్పే దారిని సూచిస్తుంది. ఆ దారిని మనం తెలుసుకుని పట్టుకోవాలి. అందులోకి అడుగుపెట్టగలిగితే గమ్యం చేరటం తేలికే. మృత్యుంజయుడు ఆ గమ్యాన్ని సాధించాడు. కానీ విజయకేతనం ఎగరెయ్యలేకపోయాడు. ఒక చిన్న పొరపాటు అతని జీవితగతిని మార్చివేసింది. అది నిజానికి పొరపాటుకూడా కాదు. ఒక అధిభౌతికసూత్రం తెలియకపోవటం.
మృత్యుంజయుడు నిర్మించిన గగననౌక రెండు విధాలుగా వుంటుంది. ఒక చిన్న గదిలో కాలయానానికి సంబంధించిన పరికరాలన్నీ వుంటాయి. అదొక్కటీ తప్ప మిగిలినదంతా వ్యోమనౌక. కాలనౌకభాగంలో అతడు అడుగు పెట్టగానే పరిస్థితంతా అతడికి అనుకూలంగా మారిపోయింది. రెండు అక్షాల మనిషిగా మారిపోయాడు. అప్పుడు సర్వవీక్షణుడు బంధించిన గొలుసులు వాటంతట అవే జారిపోయాయి. అతడింకా ప్రయోగాల స్థాయిలోనే వున్నాడని నమ్మాడు సర్వవీక్షణుడు. అలాగే నమ్మించాడు మృత్యుంజయుడు. అతడు చూస్తుండగానే గగననౌకతో గాల్లోకి ఎగిరిపోయాడు. తన పరికరాన్ని ప్రయోగించి ఫలితాలు సరిచూసుకునే అవకాశం లేదు. అలా చేస్తే సర్వవీక్షణుడికి చిక్కిపోయే ప్రమాదం వుంది. అందుకని నేరుగా తను రాజు దగ్గిరకి రాకముందు వుండిన రాజ్యానికి, వూరికి… వెళ్ళాడు. నౌకని ఒక రహస్యస్థలంలో ఆపుకుని తన ఇంటికి వెళ్ళాడు. అదిప్పుడు అతని ఇల్లు కాదు. ఇంకెవరో వుంటున్నారు.
మళ్ళీ నౌక దగ్గిరకి వెళ్ళాడు. తనక్కడే భార్యా పిల్లాడితో, తల్లిదండ్రులతో గడిపిన రోజులకి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఏమీ జరగనట్టే అతన్ని ఆహ్వానించారు.