ఏదెప్పుడెందుకిలా? by S Sridevi

కోటా వేంకటాచలంగారి “Indian Eras” ఆధారంగా రాసిన కథ.
MVR శాస్త్రిగారి వీడియో https://www.youtube.com/watch?v=rj05ao9rYhM&t=1s

ఏది?
ఎప్పుడు?
ఎందుకు?
ఇలా?
ఈ నాలుగు ప్రశ్నలకీ జవాబులు కావాలి.
రాత్రి పడుక్కుని పొద్దున్న లేచేసరికి అంతా మారిపోయింది. నేనొక ఏడువందలా ఎనభయ్యొక్క సంవత్సరాలముందు పుట్టానని అర్థమైంది. నేనొక్కణ్ణేకాదు, భారదేశంలో వున్న యావన్మంది విషయంలోనూ ఈ గందరగోళం వుత్పన్నమైందని అర్థమయ్యాక నాకు విస్మయం కలిగింది. చంద్రగుప్తమౌర్యుడిని గుప్తచంద్రగుప్తుడుగా రూపాంతరీకరించి, సముద్రగుప్తమహారాజుగారి ప్రియసతీమణి హెలీనా యువరాణీని ఆవిడకన్నా పన్నెండువందలయేళ్ళు పెద్దవాడైన ఆ ముసలిమహారాజుగారికి ముడిపెట్టేసారనీ, అలెగ్జాండరును విశ్వవిజేతగా భ్రమింపచేయడానికి ఆ వృద్ధచక్రవర్తిగారిని కాలనాళంలో కుదేసి బలవంతంగా లాక్కొచ్చి నిలబెట్టారనీ, ఆయనకి చోటివ్వడంకోసం గుప్తులని కాస్త జరిగి కూర్చోమన్నారనీ, కొంతమంది చక్రవర్తులని చరిత్రలో మీ అవసరం లేదని తీసి పక్కన పారేసారనీ ఇంకా అలాంటి లెక్కలేని అకృత్యాలు జరిగాయనీ తెలుసుకున్నాను.
మరీముఖ్యంగా హెలీనారాణీగారి గొంతు, “మీ దేశంలో పాతివ్రత్యానికి చాలా విలువ యిస్తారని విన్నాను. నా ప్రియాతిప్రియమైన భర్తనుంచీ నన్ను విడదీసి రెండుమూడు శతాబ్దాలుగా ఈ వృద్ధరాజుగారి పక్కని నిలబెట్టడం మర్యాదేనా?” అని నిలదీస్తున్నట్టు ఎక్కడో నాకు తెలీని భాషలో ఖంగుమంది.
ఇక ఈ లెక్కలన్నీ సరిచేసుకోక తప్పదని అర్థమైంది. పరిష్కారం ఏమిటని ఆలోచించగా, పరిష్కర్తగా విశ్వనాథసత్యనారాయణగారు స్ఫురించేరు. విష్ణుశర్మా, తిక్కన సోమయాజీ ఆయన కలల్లోకి విచ్చేసి ఇంగ్లీషు నేర్చుకున్నారు. నాకా ప్రయత్నం నచ్చింది. నేనుకూడా చరిత్రకారులనీ, చారిత్రకపురుషులనీ కలల్లోకి ఆహ్వానించి ఈ గందరగోళాన్ని తొలగించమని అడుగుతాను.
పగటికలలు చులకనైనవికాబట్టి, రాత్రి మంచిగాఢనిద్రవేళ వారిని ఆహ్వానించాలనుకున్నాను. ఐతే, ఆవేళప్పుడు నేను మాట్లాడుతూ సీరియస్‍గా అనేక విషయాలు చర్చిస్తూ వుంటాను. మా సంభాషణ, చర్చోపచర్చలు, వాదోపవాదాలు రోజులతరబడి జరగచ్చు. ఆ మాటలన్నీ విని కంగారుపడి నా భార్య నన్ను లేపేస్తే అంత ప్రయత్నం వృధా ఔతుంది. ఆ చరిత్రకారుడు అవమానపడి మళ్ళీ రాకపోవచ్చు. అదీకాక రోజూ అలా మాట్లాడుతుంటే అదేదో ప్రేలాపన అనుకుని డాక్టరు దగ్గిరకి రమ్మని నన్ను బలవంతం చేయచ్చు. ఆ డాక్టరుకూడా ఆరువందల ముప్పయ్యెనిమిది సంవత్సరాలకిందటి మనిషే ఐనప్పటికీ అతనికి ఆ విషయం సూచనాప్రాయంగాకూడా తెలీకపోవడంచేత నా మాటలు అర్థం కాక నా భార్య మాటలనే అనివార్యంగా నమ్మాలికాబట్టి, విని, నమ్మి నాకు వైద్యం మొదలుపెట్టినా-
అదేదీ చెయ్యకుండా గృహవైద్యం అంటే, ఆవిడ నా తలకి నిమ్మకాయరసం అవీ మర్దనాచేసి, పుచ్చకాయడిప్ప టోపీగా పెట్టి, పౌర్ణమికీ అమావస్యకీ పూజలు చేయించినా –
రెండూ కష్టమే.
అందుకని ఎలాంటి దాపరికాలూ లేకుండా, “రాత్రివేళ నాకు కలలూ అవీ వస్తుంటాయి. అందులోకి కొత్తకొత్త మనుషులొస్తుంటారు. మేము చాలా విషయాలు చర్చించుకోవాలి. నువ్వు పక్కనుంటే వాళ్ళు మొహమాటపడి నోరిప్పకపోతే కష్టం. అందుకని నువ్వు వేరేగదిలో పడుక్కో, ఇదయ్యేదాకా” అన్నాను.
ఆవిడ కాస్త వింతగా చూసి, “కలలోకి మనుషులు వచ్చివెళ్ళడమంటే మీ కలలు మనింటిలా వుంటాయా?” అడిగింది.
“ఇంకా మొదలవ్వందే ఎలా చెప్పను? వచ్చినవాళ్ళని మరీ నిలబెట్టైతే మాట్లాడలేను. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో తెలీదు. నాలుగైదు కుర్చీలు వేసి వుంచుకోవాలి. అందుకు గదిలాంటిదేదో వుండక తప్పదు. నా చిన్నప్పుడు మేం వున్న యింట్లో గదిలాంటిదైతే బావుణ్ణనిపిస్తోంది. కూర్చున్నా నిద్రొచ్చేది. మా నాన్న మొట్టికాయలేసి లేపేవాడు”
“అంటే మీ కలల్లో నేనుండనన్నమాట. కాఫీలూ, టీలూ సరఫరాచేసే డ్యూటీ నాకు లేనట్టేగా?”
“వచ్చినవాళ్ళకి ఏమీ యివ్వకపోతే బావుంటుందా?”
“మరీ మీ చిన్నప్పటి యిల్లంటున్నారు, ఎక్కడ ఏవేవి వున్నాయో నాకెలా తెలుస్తుంది? అదీకాక మీ అమ్మగారుండి, ఎవరీ పిల్ల, ఇక్కడేం పనని కోప్పడితేనో?”
“ఇల్లంటే అదేగానీ, మనిషిని యిలానే వుంటాను. లేకపోతే వచ్చినవన్నీ మర్చిపోతే, ఎలా మాట్లాడతాను?”
“సరేనైతే. ఏదైనా కావాలంటే పిలవండి. పక్కగదిలోనే వుంటాను. కేకేస్తే వస్తాను. ఆవిడెవరో హెలీనాయువరాణీ అన్నారీమధ్య, ఆవిడొస్తే నన్నూ కాస్త పిలిచి పరిచయం చేయండి. చాలా అందగత్తెట. ఎలా వుంటుందో చూడాలి. శ్రీహర్షవిక్రమాదిత్యుడి తల్లి శీలవతీదేవి. ఆవిడొచ్చినాసరే. కొడుకుని ఏ స్కూల్లో చదివించిందో, అతనంతటి మహరాజయ్యడని అడిగి తెలుసుకుంటాను. మరీ భూరాజ్యాలేలకపోయినా, వ్యాపారసామ్రాజ్యాలు ఏలచ్చుకదా, మన సుపుత్రుడూను? ఆవిడంతటిది ఆవిడ, నా అంతటిదాన్ని నేను. కష్టం సుఖం మాట్లాడుకుంటాం. బ్ర్రాహ్మల ఆడబడుచుకాబట్టి, అప్పటి రెసిపీలూ అవీ అడిగి తెలుసుకుంటాను. ఆడవాళ్ళు ఎవరొచ్చినాసరే, నన్నూ పిలిస్తే సంతోషిస్తాను” అంది.
తనంత తేలిగ్గా వప్పుకున్నందుకు సంతోషించి, ఆవిడ అడిగినదానికల్లా తలూపాను.
నామాటల్ని నవ్వులాటగా తీసుకుందనీ, తను నా కొడుకు నామీద పెట్టిన నిఘాచరి అనీ నాకింకా తెలీదు.


మంచిరోజు చూసుకుని, విశ్వనాథవారి ఫోటోకి దణ్ణం పెట్టుకుని నిద్రకి వుపక్రమించాను. విష్ణుశర్మా, తిక్కనా వాళ్లంతట వాళ్ళే వచ్చారుకాబట్టి, నేనూ ఎవర్నీ పిలవలేదు. ఐతే ఎవరో ఒకరు రావాలన్న బలమైన కొరిక వుందిగాబట్టి, ఒక పెద్దాయన పిలవకుండానే వచ్చేసాడు. పంచ, కంటెమెడ లాల్చీ, వుత్తరీయం, పొన్నకాయలాంటి గుండు, ముఖాన రూపాయకాసంత బొట్టుతో మంచి వర్చస్సు వున్న ఆయన్ని చూడగానే గుర్తుపట్టేసాను.
“ఏమిటలా చూస్తున్నావు? రమ్మని ఒకటే గొడవచేసి, ఇప్పుడు మాట్లాడవేం? గుర్తుపట్టలేదా? కోటావేంకటాచలంగారిని. ఇలా వుంటానని అనుకోలేదేమో, ఆశ్చర్యపోతున్నావు” అంటూ వచ్చి కూర్చున్నాడాయన. చాలా విచిత్రంగా, నేనే ఏర్పాట్లూ చెయ్యకుండానే అన్నీ అక్కడికక్కడే అమరివున్నాయి.
“కలల్లో కచేరీలకి మనం ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. కావలిసినవన్నీ వాటంతట అవే పుట్టుకొస్తాయి” అన్నారు వారికి అనువైన కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ. సభాప్రారంభ మర్యాదలన్నీ అయ్యాయి. మరీ పెద్దవారినీ, అంతటి పండితుడినీ, ప్రముఖ చరిత్రకారుడినీ, పేరుపెట్టి చెప్పడం బావుండదని, చరిత్రకారుడు అందామని నిశ్చయించుకున్నాను.
“ఇక విషయంలోకి వద్దామా? నీకేం తెలుసో చెప్పు” అన్నారు.
మహాభారతయుద్ధానికి సంబంధించిన నాలుగైదు విషయాలు చెప్పాను.
“నాలుగు ముఖ్యమైన విషయాలకి సంబంధించి నాలుగు యుగాలు మొదలయ్యాయి” అన్నాను. భారతయుద్ధం 3138లో పద్ధెనిమిదిరోజులపాటు జరిగింది. ఆ సంవత్సరంలోనే ఇంకొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ధర్మరాజుకి కురుసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. యుధిష్టిరశకం మొదలైంది. మగథరాజు జరాసంధుడు. వీళ్లది బార్హద్రథ వంశం. అతడిని భీముడు చంపాడు. జరాసంధుడి కొడుకు సహదేవుడు. భారతయుద్ధంలో అభిమన్యుడిచేతిలో చనిపోయాడు. అతడికొడుకు మార్జారి. సోమాపి అనే పేరుకూడా వుంది యితడికి. యుధిష్టిరుడితోపాటుగా మగథకి రాజుగా ఇతనికికూడా పట్టాభిషేకం జరిగింది. యుద్ధంలో ఉపపాండవులు, అభిమన్యుడు చనిపోయారు. కురువంశానికి వారసుడిగా ఉత్తరకి అభిమన్యుడు పుట్టాడు.
“ఇక్కడ ఇంకో తమాషా వుంది. బౌద్ధులు యుధిష్టిరుడు ఇంద్రప్రస్థానికి రాజైన సంవత్సరాన్ని యుధిష్టిరశకంగా చెప్తారు. మన లెక్కలప్రకారం ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజైంది 3176లో. శకసంవత్సరం 550 BCలో మొదలైంది. దీన్ని 57BCలో మొదలైన విక్రమశకంగా పొరపాటుపడి, 2684 BC గా లెక్కేసుకున్నారు. ఒక సంవత్సరం తేడా వస్తుంది. కొందరు పండితులు కలి 3101 BCలో మొదలైందని అనుకోవడంచేత ఈ తేడా. ఐనా ఇదేం తెలివి? శకనృపతికాలం అనుంటే శాలివాహనుడిని శకసంవత్సరానికి ఆపాదించడమేమిటి? శుద్ధ హిందూరాజుని పట్టుకుని శకుడనో, స్కిథియన్ అనో అనడానికి వాళ్ళలో కొంటెతనం వున్నా, మనకి బాధనిపించదూ?”
“గూగుల్‍లో చూస్తే భారతయుద్ధం 2528 BC జరిగినట్టుంటుంది” అన్నాను.
“అంటే?” అడిగారు.
“ఇప్పుడు సమాచారమంతా యంత్రాల్లో నిక్షిప్తం చేసుకుని వుంచుకుంటున్నాం. కంప్యూటరు అంటారు దాన్ని”
“అంతే దానంతట అదే సమాచారాన్ని సేకరించుకుంటుందా? దేన్నిబట్టి? గ్రంథాలవీ చదివి తెలుసుకుంటుందా? అలా ఎలా? నీకో విషయం తెలుసా? ఒక సంఘటన జరిగిందనుకో, దాని తాలూకు వ్యక్తులు అది జరిగిన ప్రదేశానికివెళ్లినా, తత్సంబంధమైన వస్తువులు చూసినా, జ్ఞాపకాలు మొదలౌతాయి. జ్ఞాపకాలంటే నిశ్చలంగా వున్న ఎలక్ట్రోమేగ్నటిక్ తరంగాలనుకో. వాటితో సంబంధం వున్న వ్యక్తులు వాటిని కదిపి జ్ఞాపకాలుగా గుర్తుతెచ్చుకొగలుగుతారు. సంఘటనతాలూకు వాస్తవాలని గుర్తించగలుగుతారు. అలాంటిదేదైనా జరగాలోయ్. సైన్సు చాలా అభివృద్ధి చెందిందటకదా? ఆ పని చెయ్యలేరంటావా?”
“అప్పుడవి వైయక్తికమౌతాయి. ఆధారానికి నిలబడవు. పుస్తకాలు చదివి చెప్పిన విషయాలనే వప్పుకోవట్లేదు. రాతిఫలకాలు, శాసనాలూ కావాలట”
“మరీ గూగుల్ ఏంటి?”
“మాలాంటివాళ్లం సమాచారం ఎక్కిస్తాం”
“ఓస్. అంతేనా? ఐతే విను. లౌకికాబ్దమని 3076 లో మొదలౌతుంది. చెప్పానుగా, విక్రమశకాన్నీ, శాలివాహన శకాన్నీ శకసంవత్సరం అనేసుకుంటున్నారని. అలా ఇందులోంచీ 550 సంవత్సరాలు తీసేసి, ఆ అంకెకి తెచ్చారు”
“ఈ శకసంవత్సరం ఏమిటి గురువుగారూ?” అడిగాను కుతూహలంగా.
“ఇంకా అక్కడిదాకా రాలేదుగా మనం?
“యుధిష్టిరశకం అయింది, తరువాతిది కలి. 3102 ఫిబ్రవరి 20న, అర్ధరాత్రిదాటక 2గం. 27ని. 30సెకన్లకి మొదలౌతుందని ఒక లెక్క. బుధుడు, శుక్రుడు, చంద్రుడు, అంగారకుడు, గురుడు, శని, సూర్యుడు అనే ఏడిటి కూటమి సరిగ్గా ఆ సమయానికి జరిగింది. ఇలాంటి సంఘటన 4,32,000 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందని లెక్కలువేసి, పదిసంఘటనలని కలిపి ఒక మహాయుగాన్ని నిర్మించారు” ఆయన వివరించారు.
“అదేరోజుని శీకృష్ణపరమాత్మ చనిపోయారు” గుర్తుచేసాక, నాకు పెద్ద సందేహం కలిగింది. “క్రీస్తు పుట్టేదాకా లెక్కలేసి 3102 సంవత్సరాలముందు కలియుగం మొదలైందని చెప్తున్నారు, బాగానే వుంది. తర్వాతి 2024 సంవత్సరాలూ ఎలా కలుపుతారు? రోమను కేలండరుకిగానీ, గ్రిగేరియన్ కేలండరుకిగానీ సరైన లెక్కలు లేవుకదా? తిథీ అవీ కలుస్తాయీ? అదీకాక, మనవి చాంద్రమాన సంవత్సరాలు, వీళ్లవి సూర్యమానసంవత్సరాలూ” అడిగాను.
“ఆఖర్లో మాట్లాడుకుందాం” అన్నారాయన.
“జయాభ్యుదయ యుధిష్టిరశకం అనేదొకటి 3101BC లో మొదలైంది. శ్రీకృషుడి నిర్యాణం తర్వాత ధర్మరాజు రాజ్యవిరమణ చేసి, పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసాడు. తర్వాత పాండవులు, ద్రౌపది హిమాలయాలదిశగా ప్రయాణం మొదలుపెట్టారు. జనమేజయుడి దానశాసనంలో ఈ యుగాన్నిగురంచి వుందట. వ్యాసుడు మహాభారతాన్ని జయం అనే పేరుతో రాసాడు. అది ముందుకి సాగడాన్ని గురించిన యుగం యిది. అధికారమార్పిడి జరిగింది”
ఆయన తలూపారు.
“మరో చిక్కు 3076BCలో మొదలైంది. సప్తర్షిశకం అనేది మొదలుపెట్టారు. అవడానికి ఇది కృత్తికానక్షత్రంతో మొదలైనా, పరీక్షిత్తు సమయానికి సప్తర్షిమండలం మఘానక్షత్రంలో వుంది. యుధిష్టిరుడు చనిపోయాడు. దీనికి అనేక పేర్లు. యుధిష్టిరకాల శకం, లోకకాల శకం, లౌకికాబ్దం, హఫ్త రిషిచర కాలం అనీ ఎవరికి తగ్గ పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఇది కశ్మీరు, కాంగ్రా, ఇంకా కొన్ని కొండప్రదేశాల్లో వుంది. దీన్ని పహాడీ శకమనీ, కచ్చాశకమనీకూడా అంటారట. సప్తర్షిమండలం ఒక్కో నక్షత్రంలో వందేసి సంవత్సరాలు వుండి తిరోగన దిశలో ప్రయాణం చేస్తుందని కనిపెట్టారు. ఈ యుగం 2700 సంవత్సరాలకి ఒకమాటు పునరావృతమౌతుంది” అన్నాను.
“దీనిగురించి సరిగ్గా తెలుసుకోకుండా లెక్కలు మార్చిపారేసారు”
“ఆర్యభట్టు ఒక పొడుపుకథ విసిరేడు. అదేమైనా యిప్పగలవా?”
“కలి 360లో తనకి 23 సంవత్సరాలని. అంటే 2765BCలో పుట్టినట్టు”
“తర్వాత వెయ్యేళ్లపాటు ప్రశాంతంగా బతికనిచ్చిన మనుషులకి అసలు పెద్దకష్టం యిప్పుడొచ్చింది. 1634 BCలో మహాపద్మానందుడు నందవంశాన్నీ, 1534BC లో ఆయనకి మురవలన పుట్టిన కొడుకు చంద్రగుప్తుడు మౌర్యవంశాన్నీ స్థాపించారు” అని ఆయన అంటూనే వున్నారు. ఎవరో వస్తున్నట్టు అలికిడైంది.
“రాజాధిరాజ… రాజమార్తాండ… శ్రీశ్రీశ్రీ చంద్రగుప్తమౌర్యమహారాజు వస్తున్నారొహో!” అన్న జయజయధ్వానాలమధ్య మహాఠీవీగా వున్నాయన వచ్చాడు. అప్పటిదాకా లేని సంహాసనంలాంటి కుర్చీ ఎక్కడినుంచీ వచ్చిందో, అక్కడుంది. అందులో ఆయన సుఖాసీనుడయ్యాక వందిమాగధుల హడావిడి తగ్గింది. అంతటి మహరాజు ఆయన ముఖం పెద్ద కళావంతంగా లేదు. ఏదో దిగులుపడుతున్నట్టుగా వుంది.
“ఆ పిల్లెవర్నో నాపక్కని నిలబెట్టేసి, చరిత్రలూ కథలూ కావ్యాలూ రాసేసారు. ఆవిడేమో తన భర్త ఎవరో సాండ్రక్రిప్టసట, ఆయన్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. సాండ్రక్రిప్టసెవరు? శకులని మనం తరిమితరిమి కొట్టాంకదా? మళ్ళీ ఈయనెవరు? వెతికిద్దామన్నా దొరకట్లేదు. మన గ్రంథాలలో అలాంటి వ్యక్తే లేడని మహాపండితులు ఏకఘోషని చెప్తున్నారు. నా భార్య, మహారాణీ దుర్ధరాదేవి చిన్నబుచ్చుకుని ఎప్పుడావిడ వెళ్ళిపోతుందా, తన స్థానం తనకి దొరుకుతుందా అని చూస్తోంది. మాకొడుకు బిందుసారుడిముందు మాకు చిన్నతనంకాదూ, పరాయిపిల్లని పక్కని నిలబెట్టుకుని చిత్రపటాలు వేయించుకోవడం? ఉద్దండచరిత్రకారులూ, పండితులూ వుండగా, నాకీ ఖర్మేమిటో అర్థం కావట్లేదు” అన్నాడు విషాదంగా.
“పాశ్చాత్యులు ఎంత చెప్పినా వినట్లేదు” అన్నారు చరిత్రకారులు చంద్రగుప్తులవారిని వినోదంగా చూస్తూ.
నారీ నారీ నడుమ మురారి. అసలు సమస్యకన్నా ఇది పెద్దది. నాకు నవ్వొచ్చింది. కానీ నవ్వలేదు. “ఎవరక్కడ? ఇతడు మమ్ముల పరిహసించుచున్నాడు, పరిహరించుడి” అంటాడని భయపడి.
“వాళ్లెవరు? పరస్థానీయులు, శకులు తెలిసినవారే”
“ఉత్తరకురుదేశాలకి పైభాగాన నివసించే జాతులవారు” వివరించాను.
“ఏదో ఒకటి చేసి, మమ్మల్నీ చికాకులోంచీ బైటపడెయ్యండి” అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్తూనే ఆయన సింహాసనం మాయమై మరోటి వచ్చింది. అంతా మాయలఫకీరు మాయలా అనిపించింది. ఇంకెవరో వస్తున్నారని అర్థమైంది.
“సాండ్రక్రిప్టస్! సాండ్రక్రిప్టస్!” అంటూ హడావిడిగా వచ్చిందొక యువతి. లోతుమెడ పొడవైన గౌను తొడుక్కుని పలచటి మేలిముసుగులాంటిదేదో తలమీంచీ ముఖం కనిపించకుండా కప్పుకుంది. అందగత్తే.
“అలెగ్జాండరు విశ్వవిజేత. అతడి తర్వాత నా తండ్రి సెల్యుకస్ నికేటర్ జగజ్జేత. అలాంటివాడిని వోడించిన నా భర్త మహాచక్రవర్తి. మీ చరిత్రకారులంతా కలిసి అతన్నేదో చేసారు. ఏం చేసారు? చెప్పండి. మధ్యలో ముసలిరాజుగారెవరు? బాలికా, బాలికా అంటూను” అంది కోపంగా. హెలీనాసుందరి అని అర్థమైంది. ఆవిడని పరిచయం చెయ్యమని నా భార్య అడగడం గుర్తొచ్చింది. పక్కగదిలోనే వుంటానందిగా, పిలిచాను. సెల్‍ఫోను తెచ్చుకుని వచ్చింది. కాస్త పరిచయానికే ఇద్దరూ ఆప్తులయ్యారు. హెలీనారాణీతో సెల్ఫీ తీసుకుంది.
“చిత్రపటమంటే ఇంత తేలికా? చిత్రకారుడు, రంగులు, కుంచెలు, రోజులతరబడి అతనిముందు కూర్చోవడం ఏమీ లేని చిత్రకళ” అని ఫొటో చూసి సంతోషపడింది. ప్రింటు తీయించి పంపిస్తానంది నా భార్య.
“పంపాలంటే అడ్రసు కావాలికదా? వైఫ్ ఆఫ్ అని ఎవరి పేరు రాస్తావు? ఇద్దరూ మగధనే పాలించినా మౌర్యుల రాజధాని గిరివ్రజం. గుప్తుల రాజధాని పాటలీపుత్రం” అన్నాను.
అన్నాక హెలీనాతో, “సముద్రగుప్తపత్నీ! హెలీనారాణీ! నీ భర్తెవరో తెలిసిన నీకు, మౌర్యచంద్రగుప్తుడు అలెగ్జాండరు సమకాలికులు కాదని తెలీదా? మీ చరిత్రల్లో ఎందుకలా తప్పు రాసుకున్నారు? అందుకే మౌర్యచంద్రగుప్తుడిని నీ పక్కన నిలబెట్టడం జరిగింది. అది సరిచేస్తే ఇది సరౌతుంది” అన్నాను.
“అబ్బో! నాకు చాలా పనుంది. సాండ్రక్రిప్టస్‍ని వెతకడానికి చారులని పంపమని నా తండ్రికి చెప్పాలి. అప్పుడింక ఈ వృద్ధరాజుని చరిత్రలోంచీ తీసెయ్యచ్చు” అని వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో, నా భార్యకూడా కనిపించలేదు. నేనూ చరిత్రకారులే మిగిలాం.
“అదయ్యా, వాళ్ళ లక్షణం. కిందపడ్డా గెలుపు వాళ్లదేనంటారు. పరిట్జరుతో అదే గొడవొచ్చింది. భారతయుద్ధానికీ, మౌర్యచంద్రగుప్తుడికీ మధ్యనున్న వ్యత్యాసం బాగానే లెక్కవేసాడుగానీ, ఆ యుద్ధంమాత్రం అప్పుడు జరగలేదంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరు చంద్రగుప్తుల తికమకలో 1207 సంవత్సరాల వ్యత్యాసాన్ని తెచ్చారా? శకయుగాన్నీ శాలివాహన,విక్రమ శకాలనీ కలగాపులగం చేసారా? క్రీస్తుకిముందు ఏ పద్ధెనిమిదివందల్లోనో జరిగిందంటాడు. కాదంటే మాది తెల్లతోలుకదా మేం చెప్పిందే వేదం అనే అహంభావం” అన్నారు.
“వాళ్లేవో అవకతవకలు చేసిపోయారు. మనం సరిదిద్దుకోవచ్చుకదా?” అన్నాను కోపంగా.
“అంతకుముందటి చరిత్రంతా తగలబెట్టేసుకుని, 1206నుంచీ విదేశీయులు మనని పాలించిన చరిత్రని తిథివారనక్షత్రాలతోసహా జాగ్రత్తగా రాసుకుని చదివి తరిస్తున్నాం. ఈ యుద్ధంలో మనం ఓడిపోయాం, ఆయుద్ధంలో మనం ఓడిపోయాం అని చదువుకుని, చదువుకుని చివరికి, వాళ్ళే మనమై, వాళ్ల గెలుపులనికూడా స్వంతం చేసుకునేంత అనివార్యత. మనం ఎక్కడినుంచో దండెత్తి వచ్చిన ఆర్యులం అని ఒక సిద్ధాంతం. మనకో మాతృభూమీ, దేశప్రేమా, సాటిప్రజలప్రేమా లేకుండా ఐపోయింది. ప్రతివాడూ పక్కవాడిని నువ్వీ దేశస్తుడివికాదని అనుమానించే పరిస్థితి దాపురించింది” ఆయన గొంతులో అంతులేని ఆవేదన ధ్వనించింది.
“దీనికి కొంత మనమూ కారణం అనుకోక తప్పదు. ఈ రాజులంతా తనకి తను విక్రమాదిత్యుడనో, అశోకాదిత్యుడనో బిరుదులు తగిలించేసుకోవడంతో ఎవరు ఎవరో తెలీని కొంత తికమకలో కొందరిని చరిత్రలోంచీ వెళ్లగొట్టేసారు. నేనూ ఒక పొరపాటు చేసినట్టే వున్నాను. నువ్వు పసిగట్టేవో లేదో!” అన్నారు.
తలూపాను. ఆయన సంతోషించారు. అదీ వారి గొప్పతనం. చేతులు జోడించాను.
“అదీకాక మనకి ఎప్పట్నుంచో రాచరికవ్యవస్థ వుంది. లెక్కలేనంతమంది రాజులు చిన్నచిన్న భాగాలుగా చేసుకుని ఈ భూభాగాన్ని పాలించారు. వాళ్ళని అదుపుచెయ్యడానికి చక్రవర్తులుండేవాళ్ళు. వెయ్యేళ్లకిందటో రెండువేలేళ్లకిందటో మొదలైన రాజ్యాలు కావుగా, మనవి? ఈ రాజ్యాలలో జరిగిన చిన్నాపెద్దాసంఘటనలని ఆస్థానీకులు, కవులు ఏదో ఒకరూపంలో నిక్షిప్తపరిచారు. వాటన్నిటినీ అందమైన కదంబమాల అల్లినట్టు సమన్వయపరిచాలి. చూడూ, కాలం అనేది ఎక్కడినుంచో, ఎక్కడికో సాగే తిన్ననైన రహదారిలాంటిది. కొన్ని చారిత్రక సంఘటనలు జరిగినప్పుడు దాన్నొక శకం అనో, యుగం అనో అంటాం. అలాగే ఎవరో ఒకరాజు పేరెన్నికగన్న పనులు చేస్తాడు. అవి యుద్ధాలవచ్చు, ప్రజోపయోగానికి సంబంధించిన కార్యాలవచ్చు. వారిని శకకర్తలనో యుగకర్తలనో పిలుస్తాం. మనకి చాలా యుగాలున్నాయిగానీ చరిత్రగతిని మార్చేవి ముఖ్యంగా పదకొండు. చరిత్రలో జరిగే సంఘటనలు రహదారిమీది మైలురాళ్లవంటివి. వాటిని అటువిటూ, ఇటువటూ మార్చేసినంతమాత్రాన రహదారి పొడవు తగ్గదు. ఎవరో ఒకరు పూనుకుని వాటిని మళ్ళీ యథాస్థానంలో పెడతారు. వాళ్లని ఆ సంఘటనలో ఇమిడివున్న నిద్రాణశక్తితరంగాలు తాకుతాయి. మెదడుని జాగృతం చేస్తాయి. ఆధారాలదగ్గిరకి పురికొల్పుతాయి. వాటిని తెచ్చి నిలబెట్టి, సవరణ చేస్తారు. నేను, నువ్వు, మనలాంటి ఎందరో ఈ ప్రయత్నాలమీద వున్నారు” అన్నారు.
తర్వాత మేము మాళ్వగణశకంగురించి మాట్లాడుకున్నాం.
అవంతి, మాళ్వ రాజ్యాలని జంటగా చెప్తుంటారు. అవంతి రాజధాని ఉజ్జయిని, మాళ్వ రాజధాని ధారానగరం. మాళ్వరాజ్యం మహాభరతయుద్ధానికిముందు స్వతంత్రరాజ్యం. యుద్ధంతర్వాత అది కురుసామ్రాజ్యానికి సామంత రాజ్యంగా మారింది. అలా కొన్ని శతాబ్దాలు గడిచాక మహాపద్మానందుడు మగథకి రాజై, అనేక రాజ్యాలమీద దండయాత్రలు చేసి, క్షత్రియరాజులని చంపి, అక్షత్రియులని రాజులని చేసాడు. కొన్నిరాజ్యాలు అవ్యవస్థితమయ్యాయి. వాటిల్లో మాళ్వ ఒకటి. 850BCలో ధున్జి అనే బ్రాహ్మణుడు మాళ్వప్రజలని ఏకత్రితం చేసి రాజ్యస్థాపన చేసాడు. మగథకి సామంతరాజ్యంగా పాలన సాగించాడు. మగథలో రాచరికం మారింది మౌర్యులు, శుంగులు, కణ్వులు పాలించాక శాతవాహనుల పాలన వచ్చింది. అదను చూసుకుని 730 BCలో మాళ్వపాలకులు స్వతంత్రం ప్రకటించారు. శ్రీశాతకర్ణి అప్పటి మగథ చక్రవర్తి. అతడేమీ చేతులుకట్టుకుని కూర్చోలేదు. యుద్ధం చేసాడు. ఓడి వుండడు. ఎందుకంటే తర్వాతకూడా శాతవాహన వంశం మగథలో కొనసాగింది. ఏం జరిగితనేం, శాతవాహనచక్రవర్తి మాళ్వరాజ్యపు స్వాతంత్ర్యాన్ని గుర్తించాడు. ఇది జరిగింది 725BCలో. అప్పటినుంచీ మాళ్వగణశకం మొదలైంది. ధున్జి వంశీకులు ఐదుగురు 387సంవత్సరాలపాటు అంటే 463BCవరకు పాలించారు. ఆఖరిరాజు నిస్సంతుగా మరణించగా, మాళ్వగణాలలో ఒకటైన పన్వర్‍ అనే రాజపుత్రతెగకి చెందిన అడబ్ పన్వర్ సింహాసనం ఎక్కాడు. పన్వర్ వంశస్థులు 1058 సంవత్సరాలు పాలించారు.
“ఇక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయని నా భావన” అన్నాను.
ఆయన చెప్పమన్నట్టు చూసారు.
“ధున్జీవంశంవాళ్ళు 387సంవత్సరాలపాటు అంటే 850BC నుంచి 463BCవరకు పాలించారు. వారివంశంలో ఆఖరిరాజుకి సంతానం లేకపోతే అటుతర్వాత పన్వర్ వంశస్థులు 1058 సంవత్సరాలు పాలించారు. ఆఖరి పన్వర్‍కి కొడుకుల్లేకపోతే కూతురు శీలవతికి పుట్టిన కొడుకుల్లో భర్తృహరి కొంతకాలం, శ్రీహర్షుడు కొంతకాలం పాలించినట్టు, శ్రీహర్షుడు దేశంలో తిష్టవేసిన శకులందరినీ తరిమేసినందున ఆయన పేరిట 457BCనుంచీ శ్రీహర్షశకం మొదలుపెట్టినట్టు చెప్పారు. శ్రీహర్షుడు ఈలెక్కల్లో ఇమడట్లేదు చూడండి” అన్నాను. “ధున్జీకాలంనుంచీ 1058 సంవత్సరాలు లెక్కవేస్తే శ్రీహర్షుడు 208 CEలోకి వస్తాడు. అలాకాకుండా పన్వర్ వంశస్తులే అన్నిసంవత్సరాలూ పాలించారంటే శ్రీహర్షుడికాలం ఇంకా ముందుకి 595 CE వెళ్తుంది. ఇతడే శ్రీహర్షవిక్రమాదిత్యుడన్నట్టుగా, 606ADలో ఇతని శకం మొదలైనట్టుగా ఆధునిక చరిత్రకారులు చూపిస్తారు. అలాంటి శకం ఏమీ లేదు. ఇతడు శీలాదిత్యుడనే బిరుదు వహించాడు. వాస్తవానికి పుష్పభూతి వంశానికి చెందిన మరో శ్రీహర్షుడున్నాడు. అతడు యుగకర్త. మీరు చెప్పిన కథ అతనికి కొంతవరకూ వర్తిస్తుంది” వివరించాను.
ఆయన సాలోచనగా చూసారు.
“ఒకటో ప్రతాపశీలుడు 520-470BC లో స్థానేశ్వర్ రాజధానిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పాలించేవారు. ఇతడికి ప్రభాకరవర్ధనుడనే పేరుకూడా వుంది. వీళ్ళు కన్యాకుబ్జ రాజులకి సామంతులు. శకులతో తరుచు యుద్ధాలు చేస్తూ వుండేవాడు. ప్రభాకరవర్ధనుడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ. ఈ హర్షవర్ధనుడే శ్రీహర్ష విక్రమాదిత్యుడు. కనౌజ్‍ని జయించాడు. రాజ్యవిస్తరణ చేసి, శకులని రాజ్యంలోంచీ వెళ్లగొట్టాడు. అతడిపేరుమీద శ్రీహర్షశకం మొదలైంది” అన్నాను.
ఆయన అంతగా నమ్మినట్టుగా లేరు. నేను చెప్పింది KM ఫణిక్కర్ మహాశయుడు రాసిన మోనోగ్రాఫ్‍లోనిది.
“ఆ తర్వాతిదీ అసలుదీ సైరస్ శకం. దీన్ని శకకాలం అనీ, శకనృపకాలం అనీ పిలుస్తారు. ఇది 550BCలో మొదలైంది. దీన్ని 78ADలో మొదలైన శాలివాహనశకంతో కలిపేసారు. 628సంవత్సరాలకాలం ముందుకి జరిగేసాం. అసలీ సైరస్‍శకం మనం జరుపుకోవడమేమిటి? అది చూసి పుష్యమిత్రశుంగుడు అప్పటి రాజనీ ఆయన్ని సైరస్ ఓడించేసాడనీ కథలు రాసేసుకున్నారు. ప్రతివాళ్ళూ మనని ఓడించెయ్యడమేనా?” అన్నాను కోపంగా.
ఆయన నవ్వారు.
“పర్షియాకి వెనుకట పరస్థానం, శకస్థానం అనే పేర్లు. అన్షాన్ రాజైన ఒకటో కేంబిసెస్ కొడుకు సైరస్ ద గ్రేట్. వీరు మీదియన్ రాజ్యానికి సామంతులు. మీదియన్ చక్రవర్తి అస్త్యేజెస్ కూతురు – కేంబిసెస్ భార్య, సైరస్ తల్లి. తండ్రి చనిపోయాక సైరస్ అన్షాన్ సింహాసనం ఎక్కాడు. అతని తాత, మీదియన్ చక్రవర్తికి తన వారసులెవరో తనని చంపబోతున్నారనే కల వస్తే అది సైరసే అనుకుని, అతనిమీదికి హెర్పాగస్ అనే సేనానిని సైన్యంతో పంపిస్తాడు. హెర్పాగస్ సైరస్‍తో చేతులు కలుపుతాడు. సైరస్ తాతగారిని ఓడించి, ఖైదుచేసి, మీదియన్ రాజధాని ఎక్బటానాని ఆక్రమించుకుని, ఆయన కూతురిని అంటే పినతల్లిని పెళ్ళిచేసుకుని, పర్షియన్ సామ్రాజ్యానికి పునాదివేస్తాడు. అది ప్రపంచరాజకీయాల్లో ఒక క్రియాశీలమైన సంఘటన. అలా సైరస్ శకకర్త అయ్యాడు. వాళ్ళు పంజాబు, కశ్మీరుల్లో కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకోవడంతో మనదగ్గిరకూడా సైరస్‍శకం అమలులోకి వచ్చింది. సాహిత్యంద్వారా ప్రాచుర్యానికి వచ్చింది ” అన్నారు.
ఇంతలో బైట కాస్త హడావిడి, బరువైన అడుగుల చప్పుడు వినిపించింది. సైరస్ ద గ్రేట్. చెయ్యెత్తు మనిషి. సముచిత ఆసనం వచ్చి వాలింది. అతను అందులో ఆయన ఆశీనుడయ్యాడు.
“ఏమయ్యా, సైరస్ మహాశయా! మీలో మీరు చేసుకున్న కొన్ని యుద్ధాల్లో మా సాయం తీసుకున్నారని జెనోఫెన్ సైరోపీడియాలో రాస్తే, తమరేంటి, భారతదేశాన్ని జయించినట్టు చెప్పుకున్నారు?” నిలదీసారు చరిత్రకారులు.
“మాకు భారతదేశమంటే సింధుదేశమే. అదెప్పుడేనా దాటనిచ్చారూ? గాంధారంలోనే అడ్డుకునేవారు. లోపల ఏం వుందో తెలీక మేము ఎన్నో వూహాగానాలు చేసుకునేవాళ్లం. పర్షియను సామ్రాజ్యాన్ని స్థాపించాక దాన్ని నిలబెట్టుకోవడానికే నా జీవితకాలంతా సరిపోయింది. నా కొడుకు ఒకటో డేరియస్ గాంధారరాజు పుక్కుసత్తిని ఓడించి పంజాబులోనూ, కాశ్మీరు చుట్టుపక్కలా కొన్ని సత్రపులు పట్టుకోగలిగాడు. మళ్ళీ మీ రాజెవరో సిరస్‍ట, ఆయనొచ్చి అంతా ఖాళీ చేయించేసాడు. ఆఖరికి మేం వచ్చి మీకు నాగరికత నేర్పించామని మరెవరో మీకు పాఠాలు నేర్పించారు” అన్నాడు సైరస్ మహాశయుడు పెద్దగా నవ్వుతూ. నాకూ నవ్వొచ్చింది. పాశ్చాత్యుల చరిత్రనాటకాలకి. భీముడి సంభాషణలు విభీషణుడికీ, హిరణ్యకశ్యపుడి డైలాగులు ధర్మరాజుకీ పెట్టేసినట్టు కలగాపులగం చేసేసారు.
“పుక్కుసత్తీ, సిరసూ కారు సైరస్ గొప్పవాడా! పుష్కరశక్తీ, శ్రీహర్షుడూను. ఇంకానయం. సిరహ్ నువ్వేననలేదు” అన్నారాయన.
సైరస్ అదృశ్యమయ్యాడు.
తర్వాతిది గుప్తులయుగం. 327 BCలో మొదలైంది. 82BC లో ముగిసింది. 57BC లో విక్రమశకం, 78ADలో శాలివాహనశకం మొదలయ్యాయి.
“సైరస్ శకాన్నే మనం శాలివాహన శకం అని, శకసంవత్సరం అని చెప్పి, క్రీస్తుశకానికి 78సంవత్సరాలు తగ్గించి చెప్పుకుంటున్నాం. కలియుగం మొదలై ఇప్పటికి 5125 సంవత్సరాలు గడిచాయి. ఇవి సౌర సంవత్సరాలా, చాంద్రమాన సంవత్సరాలా అనే విషయాన్ని కాసేపు పక్కనపెట్టి మన పంచాంగం ప్రకారం లెక్కేసిన చాంద్రమాన సంవత్సరాలే అనుకుందాం.
60 సౌరమాసాలు రెండు అధికమాసాలతో కలిపి 62 చాంద్రమాసాలకి సమానం. ముప్పయ్యేళ్ళకి ఒకమాటు వచ్చే క్షయమాసాన్ని లెక్కలోకి తీసుకుంటే ఒక చాంద్రమాసం 0.97035 సౌరమాసానికి సమానమౌతుంది. 5126 చాంద్రమాన సంవత్సరాలు దాదాపు 4973 సౌరసంవత్సరాలౌతాయి. 628 సంవత్సరాలు శకకాలానికీ, శాలివాహన శకానికి మధ్యని తప్పాయి. అంటే ఇప్పుడు నడుస్తున్నది కలినుంచీ 4345 సౌరమాన సంవత్సరం- 1243 CE. ఇక్కడ నాకు కొన్ని సందేహాలున్నాయి.
3102 సంవత్సరాలు చాంద్రమానంలో లెక్కేసి, 1 CE నుంచీ సౌరమానసంవత్సరాలు కలపడం సరైనదేనా? పాశ్చాత్య కేలండరు రోమనునుంచీ జూలియనుకీ అట్నుంచీ గ్రెగేరియనుకీ మారే క్రమంలో అనేక గందరగోళాలు జరిగాయి. 45BCE సంవత్సరానికి 445రోజులు. అలాగే 1582CE అక్టోబరులో పదిరోజులూ, 1752 CE సెప్టెంబరులో పన్నెండురోజులూ లుప్తమయ్యాయి. 1750, 1751 సంవత్సరాల్లో జరిగిన గందరగోళం, రోజులు, నెలలు కలుపుకోవడం, తీసెయ్యడం ఇదంతా చూస్తే అసలుకి మన లెక్కలు సరిగ్గా లేవనిపిస్తోంది ఇంతకీ నేనెప్పుడు పుట్టాను?” అన్నాను. చెప్పలేని బాధ కలిగింది.
“ఒక్కక్షణంకూడా తేడా రాకుండా నా జాతకం రాయించానన్నాడు మా నాన్న ఎంతో గర్వంగా. ఆ జాతకానికి నప్పే పిల్లని వెతుక్కుని ముహూర్తం వెతుక్కుని పెళ్ళి చేసుకున్నాను. కానీ, ఆ జాతకం నాది కాదు. ఎప్పుడో పుట్టబోయే మనిషిది. ఫలానాపలానా కారణాలూ, కుట్రలవలన నేను పుట్టిన తేదీ 781 సంవత్సరాలు జరపమన్నా ప్రభుత్వంవారు వెనక్కి జరపరు. ఓయి దేవుడా! నీకు సంకల్పంకూడా అలానే చదువుతున్నాను. నేనేకాదు, దేశంలో పుట్టిన యావన్మందీ అలానే పూజలు చేస్తున్నారు. ఎవ్వరు వాళ్ళని వాళ్ళు దేవుడికి సమర్పించుకోకుండా ఎప్పుడో ఎక్కడో పుట్టబోయేవాడి పేర అర్చనలు చేస్తున్నారు. ఇదెక్కడి చిత్రం? ” అన్నాను.
ఆయన కొద్దిసేపు తదేకంగా నన్ను చూసి, “భక్తిహీనం, మంత్రహీనం, క్రియాహీనంతోపాటు తిథిహీనం అనికూడా చెప్పుకుని సరిపెట్టుకోవాలి” అన్నారు. ఆ తర్వాత నాకు మెలకువ వచ్చేసింది.


ఒకవారంరోజులపాటు ఈ చర్చలన్నీ జరిగాయి. అంటే అన్నీరోజులూ ఏకధాటిగా నిద్రపోయానని కాదు. వాళ్ల వీలునిబట్టి మధ్యమధ్యలో వచ్చి వెళ్ళేవారు. అందుకూ ఆలశ్యం. లేకపోతే ఒక్కరాత్రిలో ఐపోయేది. ఏమీ మిగల్లేదని తేల్చుకోవడానికి అన్నిరోజులెందుకు?
“అయ్యాయా, మీ ఏకాంతశయనాలూ, కలలూనూ?” అడిగింది నా భార్య.
“నీ ఫోను ఒకసారి యివ్వు” అడిగాను.
“దేనికి?” అని అడుగుతునే యిచ్చింది.
“హెలీనాతో ఫోటో తీసుకున్నావుకదా, వుందేమో చూద్దామని” అన్నాను వేళాకోళంగా.
“మతిమరుపు మహాశయా! గుర్తుపెట్టుకుని పిలిచారూ? కలలోవి యిలలోకి వస్తాయీ? ” అడిగింది తనూ పరిహాసంగా.
మనసుని మభ్యపెట్టుకునేందుకు పరిహాసాలే మిగిలాయి.
నిఘాచరి సమాచారం అందుకుని నా కొడుకు ఫోన్ చేసి మాట్లాడాడు.
“ఈ వారంరోజులూ మీరు రాసుకున్న నోట్సులన్నీ చదివాను నాన్నా! అమ్మ ఫోటోలు తీసి పంపించింది. అసలేమీ అర్థం కాలేదు. ఏం బాధపడకండి. ఇప్పటికిదిలాగింతే”
“ఇప్పటికి ఇది ఇలాగ ఇంతే” అనేది జవాబు నా నాలుగు ప్రశ్నలకీ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *