కనిపించని ఒకటో వంతెన by S Sridevi

  1. జుర్రేరు నదీలోయ by S Sridevi
  2. జ్వాలాపురంపిల్ల కోసం by S Sridevi
  3. సోన్‍లోయలో సరికొత్త చందమామ by S Sridevi
  4. కనిపించని ఒకటో వంతెన by S Sridevi

యాభైమూడురోజులపాటు ఎడతెరిపిలేకుండా బూడిద వర్షం కురిసింది. కొంచెంకొంచెంగా రాల్తూ మనుషుల్ని వుక్కిరిబిక్కిరి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ వుంది. అది వూపిరితిత్తుల్లోకి పోయి, రక్తం కక్కుకుంటూ చచ్చిపోయారు మనుషులు. జంతువులుకూడా. అన్నిరోజులు గడిచాక మబ్బులు కొంచెం తగ్గి ఆకాశం నిర్మలంగా వుంది. చల్లటి చలి. కనుచీకటి. ఎక్కడెక్కడో తలదాచుకున్నవాళ్ళంతా కలుగుల్లో దాక్కున్న ఎలుకల్లా నెమ్మదినెమ్మదిగా బయటికి వచ్చారు. నీటికోసం, తిండికోసం తపించిపోతూ సోన్ నదివైపు నడక సాగించారు. పైర్లూ చెట్లూ చాలామటుకూ చచ్చిపోయాయి.
ఆకాశంలోంచీ నీళ్ళుపడటం వాళ్ళకి తెలుసు. గింజలు భూమిలో పెడితే ఆ నీళ్ళకి అవి మొక్కలవటం, తిరిగి గింజలవడం తెలుసు. నెత్తిమీద ఆకాశంలో వేడిబంతి రోజూ కనిపించడం తెలుసు. ఆ నీళ్ళుపడ్డరోజు కనిపించకుండా పోవటం తెలుసు. చల్లబంతి సన్నటిగీతలాగా, సగం కొరికిన రొట్టేముక్కలాగా, ఇంకా అనేక రూపాల్లో కనిపిచడం తెలుసు. ఇప్పుడా రెండూ కనిపించడంలేదు. ఎవరెత్తుకుపోయారో తెలీడం లేదు. నీళ్ళకి బదులు ప్రాణాలు తీసే బూడిద పడ్డమేమిటో అర్థమవటం లేదు.
పిల్లా పెద్దా, ఆడా మగా అంతా నది వొడ్డున కూర్చుని పెద్దగా ఏడ్చారు. ఎలుగెత్తి అరిచారు. మనసులో ఏదో భయం.
“మావి మాకిచ్చెయ్! మాకీ నల్లవాన వొద్దు. మేమేం తప్పు చేసాము?” పెద్దపెద్ద కేకలు పెట్టారు. చాలాసేపు అలా ఏడ్చాక నెమ్మదిగా లేచారు. బూడిదకుప్పల్లో కూరుకుపోయిన ఇళ్ళని చూసుకున్నారు.
ఇకమీదట బతుకెలా? పెద్ద ప్రశ్న.
ఒక బృహత్తర నాగరీకత దిశగా ప్రయాణం అనేది పరిష్కారం.
ఎంత ఏడ్చినా ఏమీ జరగలేదు. నెమ్మదిగా లేచారు. భయంభయంగా చూస్తూ నదిలోని నీళ్ళు తాగారు. అడవులవైపు, గుహలవైపు నడిచిపోయారు.
దట్టమైన అడవి. వింధ్యపర్వత ప్రాంతం. అప్పటికే అక్కడ కొంతమంది వున్నారు. వాళ్ళు బూడిదవానలకి ముందునించే వున్నారు. వానలప్పుడు కొందరు వచ్చారు. వానలు ఆగాక కూడా వచ్చారు. ఇంకా వస్తునే వున్నారు. ఎందరొచ్చినా చోటున్నట్టే వుంది. ఐనా వాళ్ళకీ వీళ్ళకీ యుద్ధమైంది. పాతవాళ్ళూ, కొత్తవాళ్ళూ విల్లమ్ములు పెట్టి బాణాలేసుకున్నారు. రాతి ఆయుధాలతో కొట్టుకున్నారు. అటువైపు ఇద్దరూ ఇటువైపు ముగ్గురూ తీవ్రంగా గాయపడి చచ్చిపోయారు. తర్వాత సంధి చేసుకున్నారు. కలిసిపోయారు.
యుద్ధం దేనికోసం? అప్పటికింకా స్వార్థం లేదే? భయంతో చేసుకున్నారు. కొత్తవాళ్లని చూసి భయంతో పాతవాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు. కొత్తవాళ్ళు బతుకుపోరాటంలో తిరగబడ్డారు. అవి రాజ్యాలూ కావు, వాళ్ళు రాజులూ కారు. కానీ రాచరికానికి పునాది అక్కడ పడింది.
ఇప్పుడు అక్కడో పండుగలాగ సందడిసందడిగా వుంది. పిల్లలు ఆడుతున్నారు. ఆడవాళ్ళు పురి యిప్పిన నెమళ్లలా నాట్యం చేస్తున్నారు. యువకులు వాళ్ళని వోరకంట చూస్తున్నారు.
అదుగో, ఎర్రపూలు కొప్పులో పెట్టుకున్న పిల్ల… అప్పుడప్పుడే నూగుమీసాలొస్తున్న కుర్రవాడివంక చూస్తోంది. మరోపక్క చంద్రుడిని మింగినదొకతె ఒక రాతి తిన్నెమీద ఆపసోపాలు పడుతోంది. ఓ ముసలమ్మ రాతికత్తిని నూరుతోంది. ఇంకో ఆడది పొయ్యిమీద మాంసం కాలుస్తోంది. తిని, కొందరు ఆడవాళ్ళూ మగవాళ్ళూ కలిసి వేటకి బయల్దేరారు. అడవిలోకి వెళ్ళడం వేటాడుకుని తీసుకురావటం వాళ్ళపని. పళ్ళూ, కాయలూ, దుంపలూ తేవడం పిల్లల పని.
ఇప్పుడిక నేలమీద పంటలు పండవు. నేలంతా పరుచుకున్న బూడిద ఆ పని చెయ్యనివ్వదు. అడవులు తిండి పెట్టాయి. వేట తిండి పెట్టింది. ఎప్పట్లానే. అలవాటైన వ్యవసాయం వాళ్ళని పిలుస్తునే వుంది. అడవులమధ్యలో కాస్తంత జాగా వుంటే నాలుగు గింజలు చల్లి వస్తున్నారు. అవి మొలిచాయో లేదో రోజూ చూసుకుంటున్నారు.
భయం మొదలైంది. తమకి తెలీకుండా ఎవరో ఏదో చేసారన్న భయం… వాళ్లకి తమపైని కోపం వచ్చిందన్న నమ్మకం, వాళ్ళెవరో తెలీకపోవటం… దేవుడి సృష్టికి దారితీసాయి. ఆలోచన మొదలైంది. రెండుచేతులూ కలిసి వేలికొసలు ఆకాశంవైపుకి చూస్తుండగా గుండెని తాకడానికి ఇంకా కొంత వ్యవధి వుంది.


“భీమ్‍బేట్కా, జుర్రేరు, ఆదామ్‍ఘర్, ఇంకా అనేక గుహలు… ఇప్పుడు భారత వుపఖండమంతా ఒక జాతరలా నడుస్తోంది. అంతకిముందు మనుషులు గుహల్లో లేరని కాదు. ఇప్పుడు వచ్చి చేరినవాళ్ళు కోలాహలం చేస్తున్నారు. ఒక గొప్ప పండుగని తేబోతున్నారు. వాళ్లకీ వీళ్ళకీ గొడవలూ అవచ్చు. కానీ భీమ్‍బేట్కా గుహలు ఏడువందలున్నాయి. ఎందరేనా వుండచ్చు. ఎన్ని తెగలవాళ్ళేనా వుండచ్చు. చుట్టూ అడవులున్నాయి. వీళ్ళని పోషించాయి” అన్నాడు ఆర్కియాలజిస్టు.
“ఇదంతా ఎప్పుడు?” అడిగాడు పథికుడు.
“టోబా విస్ఫోటనం తర్వాత. అక్కడినుంచీ చారిత్రక కాలంలోకి రావటానికి దారివేసిన మొదటివంతెన ఇది. నింగిని కప్పేసిన బూడిదమేఘాలనీ, నేలనీ, చెట్టునీ, పుట్టనీ కప్పేసిన బూడిదరాసులనీ తప్పించుకుని ఎలా బతికేరు? ఎన్ని అగాథాలమీద ఎన్ని వంతెనలు కట్టి, ఎలక్ట్రానిక్స్, కృత్రిమమేథ, క్వాంటం ఫిజిక్స్‌దాకా మనల్ని చేర్చారు? ఎన్నో ప్రశ్నలు. జవాబులు వెతకాలి”