కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao

  1. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  2. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  3. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  4. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  5. బలిపశువు by Pathy Muralidhara Sharma
  6. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  7. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  8. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  9. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  10. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  11. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  12. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  13. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  14. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  15. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  16. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  17. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

ఆరోజుకు లంచ్‍టైంలో తల్లీకొడుకుల యుద్ధం ముగిసింది. అలసటగా సరిత చింటూని శుభ్రం చేసి మంచినీళ్లు పట్టి “కాసేపు పడుకో” అని మళ్ళీ అటూ ,ఇటూ పరిగెడుతున్న వాడి వెనకపడింది.

ఇది రోజూ ముప్పూటలా జరిగే భాగోతమే. నాలుగేళ్ళ చింటూ  ఏమీ తినడు. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్‍తోపాటు మోడరేట్ అటిజం ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ట్రైనింగ్ సెషన్స్‌కి తీసుకువెళ్ళేది సరిత. కానీ ఈ కరోనావల్ల లాక్‍డౌన్ పెట్టటంతో ఆ ట్రైనింగ్ ఆగి పోయింది.

చింటూ ఏది ముట్టుకోడు. తినడు. చాలా తక్కువ పదార్ధాలు మాత్రమే తింటాడు. ఆహారం మెత్తగా జారుగా చేసి పెట్టాలి. ఏదీ చేతితో తీసుకు తినడు. వాళ్ళమ్మతప్ప ఎవరూ పెట్టినా తినడు. వాడిని హై చైర్‍లో కూచోబెట్టి బెల్ట్ పెట్టేసి ముందో సెల్‍లో రైమ్స్ వీడియో పెట్టాలి. ఆ వీడియో ఆపితే వూరుకోడు. వాడు  ఏడుస్తూ తిననని మారాము చెయ్యటం. సరిత నానాగోల చేసి ఫోర్స్ ఫీడ్ చెయ్యటం. ఇది నిత్య ప్రహసనం. వాడు ఫుడ్ స్ట్రెస్  డెవలప్ చేసుకున్నాడని నా అనుమానం.

పాపం సరితని చూస్తే జాలి వేస్తుంది. వాడికి తినిపించే టైం అయింది అంటూనూ  వాడు తినడు అంటూనూ ఎంతో వత్తిడికి గురి అవుతుంది. 

చింటూ ఓ పట్టాన పడుకోడు. చాలా రెస్ట్‌లెస్‍గా తిరుగుతూ,గెంతుతూ ఉంటాడు. వాడు తెలివేసి  ఉంటే ఎక్కడ పడిపోతాడో ఏ దెబ్బ తగిలించుకుంటాడో అని భయం. వాడి కూడా ఎవరో ఒకరు ఉండి తీరాల్సిందే. ఇక పిలిస్తే పలకడు. అన్నీ మాట్లాడటం వచ్చినా మాట్లాడడు. తనకి నచ్చిన ఒకే బొమ్మ పట్టుకుని ఓ మూలకి వెళిపోయి తన లోకంలో తాను ఉంటాడు. ఏదో ఒకే రైమ్ రిపీట్ చేస్తూ ఉంటాడు. 

ఈ సమస్యల వలన  చింటూ విషయం లో సరిత కి చాలా ఆందోళన పెరిగిపోయి విపరీతమైన అసిడిటీ. నిద్ర పట్టదు. ఎంతో అందంగా , చలాకీగా వుండే సరిత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చాలా బలహీనంగా అయిపోయి, విపరీతమైన రక్తహీనతతో డిప్రెషన్‍తో బాధపడుతోంది. ఆపైన ఈ కరోనావల్ల ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి రావటం లేదేమో సరితపై మరింత పని భారం పడింది.  అవన్నీ చేయలేక ,ఈ పిల్లాడితో పడలేక ఇంట్లోవాళ్ళు ఎంత సాయంచేస్తున్నా వాళ్ళమీద చిరాకుపడిపోతుంది. అసహనంగా అరుస్తుంది. శక్తిహీనతకు లోనయి ఏడుస్తోంది.

ఈరోజుకూడా ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను “వాడు అంతలా ఏడుస్తుంటే కాసేపు నువ్వు ఆగవచ్చుకదా? వాడిని కొంచెం సముదాయించి కాస్త స్థిమిత పడ్డాక తినిపించవచ్చు” అని అన్నాను.

నా మీద ఛర్రున లేచింది. “నీకు తెలియదు మమ్మీ.ఏమి చేసినా ఎలా చేసినా తిండి తినడు. నిద్దర పోడు. గంట యింది. రెండు ముద్దలు తినలేదు. వాడే మాత్రం  వినే రకం అయిన నేను ఎందుకిలా అరుస్తాను. నీకేం పోయింది, ఒడ్డున కూచుని తమాషా చూస్తూ ఎన్ని కబుర్లు అయినా చెబుతావు. వాడి చేత ఒక్క ముద్ద తినిపించి  చూడు,  నేను ఎందుకిలా తయారయానో అర్ధం అవుతుంది. నాలుగురోజులొచ్చి కథలు చెప్పి వెళిపోతావు. ఏనాడు నట్టింట్లో నిలబడి నాలుగూ చూసావు? పిల్లలని పట్టించుకున్నావు? మా చిన్నప్పుడు నీఉద్యోగం, చదువులు  అంటూ వీళ్ళమీదా వాళ్ళమీదా మమ్మల్ని వదిలేసి వెళి పోయావు. ఇప్పుడు రిటైర్ ఆయాకా నీ కథలు ,కాకరకాయలు అంటూ కాలక్షేపం చేస్తున్నావు. మేమెలా పోయినా నీకక్కరలేదు. నీ మట్టుకు నువ్వు ఒక్కదానివి ఉంటానంటావు…”అంటూ ఆపకుండా రోజూ తాను  పడుతున్నఇబ్బందులు ,

చింటూ పెట్టే తిప్పలూ ఏకరువు పెడుతోంది సరిత.

ఆ  వాక్ప్రవాహాన్ని  నేను ఆపలేను అని నాకు తెలుసు. అందుకే అక్కడినుండి లేచి వీధివైపు బాల్కనీలోకి వెళిపోయాను. 

చింటూకి ఈ సమస్య ఉందని తెలిసినదగ్గరనుండి నేను ఆటిజం, అస్పెర్జర్ సిండ్రోమ్, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్‍గురించి నెట్‍లో చదువు‍తున్నాను. అలాటి పిల్లలున్న తల్లిదండ్రుల సపోర్ట్ గ్రూప్‍లో చేరి వాళ్ళ సమస్యలు, వాటిని పరిష్కరించే విధి ,విధానాలు ఆకళింపు చేసుకుంటున్నా. ఎలా సరితకి ,ఆ బిడ్డకి సహాయం చేయగలనా అని  ఆలోచిస్తున్నాను. 

కానీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‍లో ఉన్న సరిత అసలు ఏదీ వినదు. పైగా నువ్వు అవన్నీ చూసి నాకు చెప్పకు  అని చిరాకు పడుతుంది. భయానికి ,మరింత ఆందోళనకి గురి అవుతుందని తన తత్వం బాగా తెలిసిన నేను తనకి  ఏమీ చెప్పను.

మా లంచ్ అయ్యాక  మిగిలిన పదార్ధాలు సర్దేసి అప్పటికి సింకులో పడిన గిన్నెలన్నీ కడిగి మౌనంగా బెడ్‍రూమ్‍లోకి వెళ్ళిపోయాను. అప్పటికి మూడు గంటల యింది.

మళ్ళీ సరితా, చింటూలమీదుకే వెళ్ళింది మనసు. నిజానికి చింటూ మైల్ స్టోన్స్ లేట్ అయాయి. అలా కొందరి పిల్లలకి అవుతుందని సరిపెట్టుకున్నాం. రెండేళ్ళు అయినా వాడు పిలిస్తే స్పందించడం లేదు. డాక్టర్, చింటూని జాయిన్ చేసిన ప్లే స్కూల్లో టీచర్, చెప్పేరు చింటూలో ఆటిజం లక్షణాలు కనబడుతున్నాయి అని. సరిత అలా చెప్పిన వాళ్ళమీద కోపం తెచ్చుకుని వాడికేమీ లేదు అంది. పరీక్ష చేయిద్దాం  అంటే  నాతోకూడా  ఎప్పుడూ గొడవ పడేది. మొత్తానికి ఇన్నాళ్ళకి పరీక్షలు చేయించడం సమస్య నిర్ధారించటం జరిగింది. ఇప్పుడు తాను దాన్ని జీర్ణించు కోలేకపోతోంది. నాకు చాలా బాధగానే ఉంది ఈ పరిస్థితికి. కానీ ఏమీ చేయగలను? ముందు సరితలో కొంత నెమ్మది వస్తే తప్ప తనతో  నేను మాట్లాడగలిసే వీలు లేదు. పెద్ద దిగులు  మేఘం ఎదో నన్ను చుట్టేసిన భావనకు లోనయి కనీసం సెల్‍కూడా చూడకుండా పక్కకు తిరిగి పడుక్కున్నాను కళ్ళనుండి కన్నీళ్లు ధారలు కడుతుంటే.

“మమ్మీ ! లే టీ తాగు!” అన్న సరిత పిలుపుకు కళ్ళు తెరిచి లేచి వాచ్‍వైపు చూస్తే టైం అయిదు అయింది.

టీ కప్పు అందుకున్నాను మౌనంగా.

“మమ్మీ ! నామీద కోపం వచ్చిందా!” అంది.

“లేదు ” అన్నాను ముభావంగానే.

“మమ్మీ ! సారీ ! నేను ఇందాక చాలా చెత్తగా మాట్లాడాను. అలా మాట్లాడటం  తప్పు. నువు మాకెంత చేసావో. ఎన్ని కష్ట,నిష్ఠూరాలకోర్చి మమ్మల్ని పెంచావో నాకు తెలుసు అమ్మా. ఇందాక నాకు బుర్ర పనిచేయలేదు ఆ కోపంలో ,చిరాకులో అడ్డదిడ్డంగా మాట్లాడాను. ఇంకెప్పుడూ అలా చేయను.” అంది కళ్ళలో నీళ్ళు  చెక్కిళ్ళ మీంచి జారి పోతుంటే…

నాకు మనసు  ద్రవించి పోయింది. “ఛ! నీమీద నాకు కోపం ఏమిటమ్మా? ఏమీ లేదు. నేను నీకెలా ,ఏమి చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఊరుకో ఏడవకు” అన్నాను. 

ఒక్కసారి నా ఒళ్ళో తలవాల్చి “నేనేం పాపం చేసాను మమ్మీ, నా బిడ్డకిలా అయింది?” అని  ఒక్కసారి వెక్కివెక్కి ఏడవటం మొదలు పెట్టింది. 

తన వెన్ను నిమురుతూ ” సర్దుకో అమ్మా! అన్నీ చక్కబడతాయి. ముందు నువ్వు కాస్త సర్దుకుంటే ఏమి చేయాలి అనేది ఆలోచించగలుగుతాం” అన్నా.

తాను కాస్త కుదుటబడి  “భగవంతుడు నాకెందు కింత శిక్ష వేసాడు?” అంది జాలిగా.

దానికి నేను “చూడు. భగవంతుడు మనకి సుఖాలు ఇచ్చినపుడు నాకివి ఎందుకిచ్చావు అని మనం అడగలేదు.ఇప్పుడీ కష్టంవచ్చినందుకుమాత్రం ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నావు. పైగా నాకే ఎందుకిచ్చావు అంటున్నావు. కానీ నీకేకాదు ఇలాటి సమస్య చాలామందికి ఉంది. వాళ్ళ అనుభవాలు ఏమిటి? ఈ సమస్యని వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు అనేది మనకి నెట్‍లో సపోర్ట్ గ్రూప్స్‌లోను ,కమ్యూనిటీస్‍లోనూ దొరుకుతాయి. అవి చదివి ఆ బిడ్డల మనస్థితిని, పరిష్కారమార్గాల్ని అర్ధం చేసుకునే వీలు ఉంది. నేను ప్రస్తుతం అవి స్టడీ చేస్తున్నాను. ఊరికే ఆందోళన,భయం పడటం వలన ఉపయోగం ఉండదు. కొంచెం స్థిమితపడి మనకి పనికి వచ్చే అంశాల సేకరణకి, ఆచరణకి ప్రయత్నిద్దాం అనేది నా ఆలోచన. దానికి నువు కాస్త సహకరించే ప్రయత్నం చేయమ్మా. పెద్ద అంచనాలు వద్దు కానీ చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని ఇద్దరం కలిసి పని చేస్తే పరిస్థితి చక్కబడుతుంది అని నా అభిప్రాయం.” అన్నాను అనునయంగా.

“మమ్మీ! వీడికి బాగవుతుంది అంటావా?” అంది మళ్ళీ నీరసంగా.

“సానుకూలదృక్పధంతో చేయవలసింది చేయటమే! కర్మలను శక్తివంచన లేకుండా ఆచరించు. ఫలితాలను ఆ పైవాడికి వదిలేయ్! అదే కదా గీతలో చెప్పింది. చేదాం  ముందు. తరవాత భగవంతుడి దయ. ఆయనపై విశ్వాసం ఉంచుకుని కర్తవ్యం నిర్వర్తించు ముందు. అదే బాగవుతుంది. ఏమి కోల్పోయినా ధైర్యం ఎప్పుడూ కోల్పోకూడదు. ఇంత బేల వై పోతే ఎలా సరితా?  బీ బ్రేవ్! ” అన్నాను. 

“ఈ లాక్‍డౌన్ అయిపోయాక నువు వెళిపోతావా?” అంది దీనంగా.

“నువు వెళ్ళమనేవరకూ నేను ఎక్కడికీ వెళ్ళనుగాని లేచి వెళ్ళి ముఖం కడుక్కుని కాస్త రిఫ్రెష్ అవు. సంధ్యవేళ  కళ్ళనీళ్లు పెట్టకు. అంతా శుభమే జరుగుతుంది ” అన్నాను.

మెల్లిగా తల ఊపి లేచి వెళ్ళింది.

“వెర్రిపిల్ల! ఆందోళనతో చిక్కి మరీ శల్యమయిపోయింది . ఎలా ,ఎప్పుడు తేరుకుంటుందో. ఈశ్వరా! నా బిడ్డకీ కష్టం తొలగించు తండ్రీ! ” అని మనసులోనే  ఆ పరమేశ్వరుడిని వేడుకున్నాను.

1 thought on “కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao”

  1. Kusinerla Nandu

    మా మేనమామ పిల్లలు ఇద్దరికీ ఈ సమస్య ఉంది అమ్మా….
    ఆవిధంగా ఆపిల్లలతో వేగిన అనుభవం ఉంది.
    నాకంటే రెండేళ్ళు చిన్న అంతే….

    మెదడు పనితీరు నాలుగేళ్ళ వద్దే ఆగిపోయింది.

    వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఎపుడైనా బోయిన్ పల్లిలో institute కి పోయినపుడు మిగితాపిల్లలను , తల్లిదండ్రుల ఆంధోళనను చూసి బాధ అనిపించేది.

    మీ కథ చాన బాగుంది….🙏

Comments are closed.