గతజలం, సేతుబంధనం by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

అప్పుడే ఇంట్లో పని ముగించుకుని పెరట్లోకి వచ్చి కూర్చుంది యశోద. ఆరోజు ఆదివారం కావటంతో అంతా ఇంట్లోనే వున్నారు. ఆవిడకి పెద్దగా వ్యాపకాలేవీ వుండవు. ఇంట్లో ఐదుగురు సభ్యులు. తను, కొడుకు, కోడలు, వాళ్ళ ఇద్దరు పిల్లలు. అందరూ బైటికి వెళ్ళే హడావిడి వుంటుంది. అందుకని పొద్దుటి వంట తనే చేస్తుంది. సాయంత్రం మాత్రం ఆఫీసునించీ ఇంటికొచ్చాక కోడలు రాధ చేసుకుంటుంది. అదేనా చెయ్యలేక కాదు. పూర్తిగా అలవాటైపోతుందని. అంతా వెళ్ళిపోయాక ఇల్లంతా అద్దంలా సర్దుతుంది. బాత్రూముల్లో నల్లాలతోసైతం మెరిసేలా కడుగుతుంది. అత్తాకోడళ్ళకి ఒకరిమిద ఒకరికి ఫిర్యాదులేమీ లేవు. అలాగని అరమరికల్లేని అనుబంధమూ లేదు.

         “నానమ్మా!  నువ్వు చదువుకోలేదా?” ప్రభ యశోదని అడిగింది. పధ్నాలుగేళ్ళుంటాయి ఆ పిల్లకి. అన్నీ తెలుసుకోవాలనే సహజమైన కుతూహలం.

         నానమ్మ ఎప్పుడూ పనిచేస్తుంటుందని ఒకసారెప్పుడో అమ్మమ్మదగ్గర అంటే –

         “ఆవిడ చదువుకోలేదులేవే. అందుకే అలా పుణుక్కుంటూ వుంటుంది. లేకపోతే టీవీ పెట్టుకుని ఆ పిచ్చి సీరియల్సన్నీ చూస్తుంది. టైంపాస్ కావాలిగా?” అంది. అప్పట్నుంచీ అసలు చదువుకోకపోవటమంటే ఏమిటో తెలుసుకోవాలని ఆపిల్లకి కోరిక. ఇప్పుడు అడిగేసింది.

         “లేదమ్మా! ఆడపిల్లలంటే మా నాన్నకి ఇష్టం వుండేది కాదు. అందుకని నన్ను చదివించలేదు” ఆవిడ గొంతులో నిర్లిప్తత.

         “అసలు స్కూలుకే వెళ్లలేదా?” ప్రభ గొంతులో ఆశ్చర్యం.

         “ఐదో ఆరో చదివాక పెద్దపిల్లనయానని మానిపించేసారు”

         “స్కూలు మానెయ్యమంటే బాధెయ్యలేదా? ఏడుపు రాలేదా?”

         “ఆవిణ్ణి చదివించి వుంటే కలెక్టరో డాక్టరో అయేదేమో!” లోపల గదిలో కూర్చుని ఆ మాటలు విన్న రాధ భర్త సురేంద్రతో పరిహాసం‍గా అంది. అతనక్కడే కూర్చుని సెల్‍లో ఏదో చూస్తున్నాడు. భార్య మాట విన్నాడుగానీ జవాబు ఇవ్వలేదు.  జీవితంలో జరిగిన పొరపాట్లు చాలా వున్నాయి. వాటిని తవ్వి చూసుకోవడం అతనికి నచ్చదు.

         “నిన్నే , నానమ్మా! చదువుకోవద్దంటే నువ్వు ఏడ్చి గొడవ చెయ్యలేదా? మా నాన్న నేనడిగింది కాదంటే అసలే వూరుకోను తెలుసా?” ప్రభ మళ్ళీ అడిగింది.

         పదేళ్ళమ్మాయిని స్కూలు మానెయ్యమనటమేంటో అసలలా ఎందుకు చేసారో అర్థం కాలేదు.

         “మారోజుల్లో నాన్నకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు. ఆయనకి భయపడేవాళ్ళం. ఎదురుపడి మాట్లాడ్డానికి కూడా భయమే.”

         “ఎందుకలా?”

         దానికి జవాబు లేదు యశోద దగ్గర.  నిజమే. ఎందుకలా భయపడేవాళ్ళు ఆయన్ని చూసి తామంతా? ఏదైనా కావలిస్తే తల్లికి చెప్పేవారు. ఆవిడ చెప్పినా ఆయన వినటం, తమకి కావల్సింది దొరకటం వుండేది కాదు. అందులోనూ ఆడపిల్లలకి. తాము ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలూ.

         “చదువాపేసి మరో ఏడాదికల్లా పెళ్లి చేసి పంపించేసారు”

         “అంత చిన్నప్పుడు పెళ్లా?!” అపనమ్మకంగా అడిగింది ప్రభ.

         “ఔనే! అప్పుడు అలాగే చేసేవారు” అదే నిర్లిప్తత.

         “పోనీ ఇప్పుడు చదివించండి. ఏ  స్టాన్‍ఫర్డ్ యూనివర్సిటీలోనో  తేలతారేమో ” అదే పరిహాసం రాధ గొంతులో. అది పూర్తిగా పరిహాసంకూడా కాదు. చదువుకోనివారిపట్ల వుండే చులకనభావం. సెల్ సోఫాలో పడేసి దిగ్గున తలతిప్పి భార్యకేసి చూసాడు  సురేంద్ర.

         “ఆవిడ చదువుకుని వుంటే  ఏమయేదో నాకు తెలీదుగానీ, నేను సరిగా చదువుకుని వుంటే నా జీవితం మాత్రం ఇలా వుండేదికాదు” అన్నాడు కొంచెం ఆవేశంగా.

         “ఇప్పుడు మీకేమైంది? బాగానే వున్నారుగా?” అడిగింది రాధ.

         “నేను బీటెక్ పూర్తి చేసేసరికి నాన్న పోయారు”

         “ఔనటగా? అత్తయ్య చెప్పారు”

         “బోల్డన్ని బేక్‍లాగ్‍లు. ఫ్రెండ్స్,  తిరుగుళ్ళు.  డిగ్రీ అవలేదు”

         “ఇంట్లో అడిగేవాళ్ళు కాదా?”

         “ఎవరడుగుతారు? నాన్నకి పొద్దుగూకులు వుద్యోగం,  ఓటీలు… ఎప్పుడు ఆఫీసుకి వెళ్లేవాడో ఎప్పుడు తిరిగొచ్చేవాడో తెలీదు. ఇక అమ్మ… చదువులేనిదని ఆమె మాట వినేవాడిని కాదు. ఇంట్లోకూడా చదువుకోలేదని ఆవిడకి ఎవరూ విలువిచ్చేవారు కాదు. అంటే వాళ్ళంతా పండితులని కాదు. ఒకళ్ళమీద ముద్ర పడుతుంది చూడు, ఇంక మళ్ళీ చెరుపుకోలేనట్టు. అలా. చిన్నప్పుడే పెళ్ళైంది. అత్తగారింటికి వచ్చింది. ఏమీ తెలిసేది కాదు. పుట్టింట్లోనే అన్నీ నేర్పి పంపించేంత వయసు లేదు. తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ… ఆ ప్రాసెస్‍లో అలా అనిపించుకుంది”

         “…”

         “నాన్న సర్వీసులో వుండగా పోయారు. కంపాషనేట్ గ్రౌండ్స్‌లో వుద్యోగం ఇచ్చారు. అమ్మకి  చదువు లేదు. అటెండరు పోస్ట్ ఇస్తామంటే తను వెళ్లలేదు. పెన్షనుమాత్రం తీసుకుంది. క్లరికల్ పోస్ట్‌లో నేను చేరాను. అదే పని. నాన్నలాగే ఇరుక్కుపోయాను. నాతో చదివినవాళ్ళంతా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనూ, మార్కెటింగ్‍లోనూ చేస్తుంటే నేనిక్కడ ఇలా…” అతని గొంతులో బాధ వుంది.

         ఇప్పుడున్న జీవితం బాగానే వుంది.  నెల తిరిగేసరికి జీతం, ఏడాదికోసారి బోనస్. హైర్ అండ్  ఫైర్ లాంటి టెన్షన్సేం వుండవు.  ఐనా ఎక్కడో అసంతృప్తి.  తోటివారు తమకి భిన్నంగా బతుకుతుంటే, తన పరిధిలోకి ఆ అవకాశం రాకపోవటంవలన. అది గొప్పదా, కాదా అనికాదు దొరికిందా, లేదా అనేది ముఖ్యం.

         “గవర్నమెంటు వుద్యోగం చెయ్యలేదని నా ఫ్రెండ్సెవర్లోనూ రిగ్రెట్స్ లేవు. వాళ్ళ వుద్యోగాలు వాళ్ళకి సంతృప్తిగానే వున్నాయి. పోతే ఇంకాస్త ఎక్కువ పేకేజి, ఫారిన్ అవకాశాలు… ఇవి వాళ్ళ సమస్యలు. అందుకే నేను వాళ్ళకంటే తక్కువగా వున్నానని అనుకుంటాను. వాళ్ళతో ఫ్రీగా కలవలేను” అన్నాడు.

         రాధ మాట్లాడలేదు. చిన్న ఆలోచన.

         ఇప్పటికీ ఆడపిల్లల చదువుకి మొదటి వ్యతిరేకత ఇంట్లోంచే వస్తుంది. ఇద్దరు పిల్లల్ని చదివించే స్తోమత లేకపోతే తండ్రి కూతుర్ని పోటీలోంచీ తప్పిస్తాడు. ఇద్దరూ ఆడపిల్లలైతే మీ పెళ్ళికోసం దాస్తున్నానంటాడు. ఇప్పుడు చాలావరకూ ఈ పరిస్థితులు మారాయి. ఐనా కూడా పోటీ అంటూ వస్తే అందరూ గెలిపించేది మగపిల్లవాడినే.

           అత్తగారు చదువుకోకపోవటంవలన ఏమీ కోల్పోయి వుండదు. చదువుకోనిదని అందరూ అనుకోవటంవలన నష్టపోయింది. తనుకూడా తక్కువగానే చూస్తోందికద?  తన తల్లితో పోల్చి ఇంకా తక్కువ చేస్తుంది. తనూ కొంచెం మారాలేమో!

         “నానమ్మా! ఇప్పుడు చదువుకోవచ్చుగా, నువ్వు? వద్దనటానికి మీ నాన్న లేరు. మా తాతయ్య లేరు. నాన్నేమీ వద్దనడు” అడిగింది ప్రభ.

         యశోద నవ్వింది. ” ఇప్పుడు చదువుకుని ఏం చెయ్యనే? చదువుకోవాలన్న తపన వున్న రోజులు గడిచిపోయాయి. చదువులేనిదాన్నని ముద్ర వేసి అవమానించిన రోజులూ గడిచిపోయాయి. చేతికి వచ్చిన వుద్యోగంలో చేరలేకపోయాను. ఇంక దేనికమ్మా, చదువు? ఈ వయసులో? మీ అమ్మకి ఒక పని సాయం చేస్తే అది సుఖపడుతుంది” అంది.

         “మా అమ్మమ్మ పక్కని కూర్చుని నువ్వూ పేపరు చదవచ్చు”

         “మీ అమ్మమ్మ పెట్టి పుట్టింది. అదృష్టవంతురాలు. మనసెరిగిన తండ్రికి పుట్టింది” అంది మనస్ఫూర్తిగా.

         కోరిక వుంటే అది తీరలేదన్న బాధ వుంటుంది. తీరితే ఇంకాస్త పెద్దది పుట్టుకొస్తుంది. అదొక జీవచైతన్యం. అలాంటిది యశోదలో పెద్దగా లేదు. అందుకని బాధా లేదు.

         “అమ్మ సంతృప్త జీవి. జరిగిపోయినవి మార్చలేం. జరిగేవాటిల్లో తప్పులు వుండకుండా చూసుకుందాం… నేను చేసినలాంటివి. నువ్వు అమ్మని ఎప్పుడూ చులకన చెయ్యకు. అలాంటి భావం కలిగినప్పుడు ఆవిడ ఆఖర్లో అన్న మాటలు గుర్తు తెచ్చుకో” అన్నాడు సురేంద్ర. 

         తలదించుకుంది రాధ. తాత చదివించాడుగాబట్టి తన తల్లి చదువుకోగలిగింది. చదివించనంటే ఆవిడా ఏమీ చెయ్యగలిగేది కాదేమో! అంత చిన్న వయసులో తండ్రిని ఎదిరించే తెలివి ఏ పిల్లలకుంటుంది? ఏ తల్లేనా వినని భర్తతో ఎంతకని పోరాడగలదు? ఎలాగో పిల్లల్ని వడ్డుని పడేసి తనూ గట్టెక్కాలనుకుంటుందిగానీ? ఆ వొడ్డూ, గట్టూ డొంకైనా సరే. కూతురు చిన్నగా మొదలుపెట్టిన సంభాషణ తనలో పేరుకుపోయిన మౌఢ్యాన్ని కరిగించింది. చదువంటే ఇదే కదూ?  ఇలాంటి చదువు ఏ స్కూళ్ళలోనూ చెప్పరు.   లేచి వెళ్ళి అత్తగారిపక్కన కూర్చుంది, ఆవిడతో మాట కలుపుతూ. 

2 thoughts on “గతజలం, సేతుబంధనం by S Sridevi”

  1. Savitri Ramanarao

    చాలా చక్కగా నడిపారు కథని. అప్పట్లో కుటుంబాలలో ఈ రకమైన పరిస్థితులే ఉండేవి. స్త్రీ వికాసాన్ని అడ్డుకుని ఆమె ని అవమానించడం అనేది సర్వసాధారణం గా జరిగి పోయేది.ఆడిపిల్లవి చడువెందుకూ ఉద్యోగాలు చేయాలా,ఊళ్ళు ఏలా లా అనే మాట అలా పుట్టిందే. అవకాశాలు లేకపోయిన రోజులనుండి ఎన్నో సవాళ్లు అధిగమించి నేడు అన్ని రంగాల్లో దూసుకు పోతున్న నేటి తరం స్త్రీ తామున్న కాలం నేపధ్యం గత తరాలను విశ్లేషించి కించ పరచటం ఈ రోజు ఇంటింటి రామాయణం అయి పోయింది. అది ఆ పాత తరం స్త్రీ లని మరింత ఆత్మ న్యూనత గురి చేస్తోంది..
    కానీ ఈ అవగాహన ఈ తరం కి కల్పించటం కష్టమే. వాళ్ళు తెరకు అతుక్కుని వాళ్ళ గురించి తప్ప మరో విషయం ఆలోచించగలిగే సామర్ధ్యం పెంపొందించుకోరు.

    మీ కధ చాలా బావుంది. అభినందనలు

  2. P. Jhansikumari

    మార్పు చక్కగా చూపించారు. అమ్మాయిలును అర్ధం చేసుకోవటం, చులకనగా చూడటం పితృస్వామ్య వ్యవస్థ లో పరిపాటి. దానిని ఇవతలకు లాగి ఒక చిన్న పిల్ల తో సంభాషించేట్లు చేసి మార్పు వైపు రాయడం బాగుంది. అలాగే పిల్లలు రక రకాల ప్రశ్నలు వేస్తారు వాటికీ ఓపికగా ఆన్సర్స్ యివ్వాలి అనేది కూడా ఇందులో ఉంది. ఎవరికి వారు అవలోకనం చేసుకొని మారటం యివన్నీ చాలా బాగా రాసిన మీకు అభినందనలు.

Comments are closed.