రచయిత తెనాలిలో జన్మించారు. చెన్నైలో మరణీంచారు. వీరి జీవితకాలం 28.10.1909 – 17.8.1980. ముప్పైకి పైగా నవలలు, వందలసంఖ్యలో కథలు, సైన్సు, చరిత్ర, సంస్కృతివంటి అనేక విషయాలపై వ్యాసాలు రచించారు. వీరు అరసం, విరసం సభ్యులు.
ఈ నవల ఆంధ్రజ్యోతి మాసపత్రికలో సెప్టెంబరు 1950 నుండి నవంబరు 1951 వరకు ప్రచురించబడింది. దీనిని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఐదవముద్రణగా 1998లో ప్రచురించింది. దీనికి భూమిక కేతు విశ్వనాథరెడ్డిగారు రాసారు. దీని అప్పటి వెల 40 రూపాయలు.
భారతీయసమాజంలోని అత్యంత కీలకమైన మార్పులన్నీ రచయిత జీవితకాలంలో జరిగాయి. రెండు ప్రపంచయుద్ధాలు, స్వతంత్రపోరాటాలు, స్వతంత్రం రావటం, ఇంకా యితర యుద్ధాలు, సామాజిక మార్పులు ఇవన్నీ వీరి రచనల్లో ప్రతిబింబిస్తాయి. సమాజం ఒక్కరోజులోనో, ఒక్క సంఘటనతోనో నిర్మితమయ్యేది కాదు. నిన్న ఎలా వున్నామో తెలిస్తేనే ఈరోజు ఇలా వున్నందుకు కారణాలు అర్థమౌతాయి. అప్పుడు మాత్రమే సంస్కరణ, అభివృద్ధి సాధ్యపడతాయి.
“చదువు” నవల 1915 నుంచీ ఇరవై సంవత్సరాలపాటు సాగే సుందరం అనే వ్యక్తి బాల్యం మొదలుకుని నవయువకుడిగా ఎదిగే క్రమాన్ని చూపిస్తుంది. అతని అక్షరాభ్యాసంతో మొదలై కొడుకు అక్షరాభ్యాసంతో పూర్తౌతుంది. అప్పటి విద్యావ్యవస్థ, పిల్లలని మాస్టర్లు చదివించే పద్ధతులు, వాళ్ళకి వేసే శిక్షలు, కౌటుంబికపరిస్థితులు, సాంఘికదురాచారాలు, దేశంలోపలా బయటా వున్న రాజకీయ పరిస్థితులు- వీటన్నిటి చిత్రణా ఈ నవలలో అంతర్భాగంగా వుంటుంది. ఇవన్నీ కలిసి, ఎటువంటి దిగువ మధ్యతరగతి మూసబొమ్మల్ని తయారుచేస్తాయో నవలలో స్పష్టమైన చిత్రణ వుంది. పిల్లలు ఎదుగుతున్నకొద్దీ కుటుంబసభ్యులకి సహాయపడుతూ, ఎంతోకొంత తనది తను సంపాదించుకోగలగాలి. వృత్తివిద్య స్థానంలో బలపడిన ఆధునిక చదువు పిల్లలకి ఎలాంటి ఆర్ధికభద్రతనీ ఇవ్వకపోగా, పదిహేనేళ్ళో ఇరవయ్యేళ్ళో చదువుతూ గడిపినవారికి ఎవరో ఒకరు వుద్యోగం ఇవ్వకపోతే ఆ జీవితం నిరర్ధకమే. అలాంటి నిరర్ధకత సుందరం జీవితంలో చోటుచేసుకుంటుంది.
సీతమ్మ, శ్రీమన్నారాయణ దంపతులకి మొదటి సంతానం సుందరం. అతనికి జానకి అనే చెల్లి. అతడికి ఐదోయేట సాంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం జరుగుతుంది. చదువుమీద పెద్దగా అవగాహన లేని సమాజం అప్పుడున్నది. పిల్లలు అల్లరి చేస్తే బళ్ళో పడేస్తే సరి అని బెదిరించే పెద్దవాళ్ళు చుట్టూ వున్నరోజుల్లోకూడా సుందరానికి చదువంటే చాలా ఆసక్తి. అతడు సూక్ష్మగ్రాహి. తెలివైనవాడు. చురుకైనవాడు. తల్లి ఆ ఆసక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. కొడుక్కి అక్షరాలు తనే నేర్పించి, విద్యాభవిష్యత్తుకి పునాది వేస్తుంది. సుందరానికి తల్లితో గొప్ప అనుబంధం వుంటుంది. పిల్లలు చిన్నగా వున్నప్పుడే శ్రీమన్నారాయణ చనిపోతాడు. అతను ఆర్భాటంగా బతికిన మనిషి. అతను పోయాక డబ్బేమీ మిగలదుగానీ కుటుంబానికి కొద్దిగా పొలం, ఒక యిల్లూ వుంటాయి. ఇంటి అద్దెమీదా, పొలం ఐవేజుమీదా ఆధారపడి వాళ్ళ జీవిక వెళ్ళాలి. సుందరానికి కుటుంబ ఆర్ధికపరిస్థితులపట్ల ఎలాంటి అవగాహనగానీ, తల్లి యింటిని ఎలా నడుపుతోందన్న ఆలోచనగానీ వుండవు. తను, తన చదువు, చిన్నచిన్న సరదాలే తప్ప తల్లిగురించిన సానుభూతికూడా వుండదు. పెరుగుతున్నకొద్దీ ఆవిడతో అనుబంధంకూడా పల్చబడుతుంది. అతని చదువుకోసం అప్పుచేస్తుంటుంది ఆవిడ. అదతనికి పట్టదు.
శేషగిరి సుందరం మేనమామ. అతడికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అభ్యుదయభావాలుగలిగినప్పటికీ సంఘంలో వప్పుకోరని కూతురికి బాల్యవివాహం చేస్తాడు. మంచి ప్రభుత్వోద్యోగం చేస్తూ, పిల్లలని చక్కగా పెంచుకుంటున్నవాడల్లా వుద్యోగం వదిలేసి స్వతంత్రపోరాటంలోకి దిగి దెబ్బతింటాడు. స్వతంత్రపోరాటం ఒక వుద్యమస్థాయినుంచీ దిగజారి, వట్టి తతంగంగామారిపోతుంది. పిల్లల చదువులు పాడౌతాయి. శేషగిరి రెండోకొడుకు నరుసు నాటకాల్లో నటించి సంపాదించిన డబ్బే వాళ్ళ కుటుంబానికి ఆధారం. ఇతనికి జానకినిచ్చి వివాహం చేస్తారు. సుందరం బాగా చదువుతుంటాడు. చదువుకుంటున్న ఇతనికి మిగిలినవారిని చూసి కొంచెం చిన్నచూపు. అతను నేర్చిన చదువు అతనికి ప్రపంచజ్ఞానాన్ని యివ్వదు. పైగా అతన్నొక వూహాప్రపంచంలో నిలిపి వుంచుతుంది. ఎన్నో ఆదర్శాలు, అభ్యుదయభావాలు వుంటాయి. కానీ వాటిని ఆచరించే ధైర్యం లేదు. నాగేశ్వర్రావు అనే బాల్యమితృడు స్కూల్‍ఫైనలు అవ్వగానే వుద్యోగంలో చేరిపోతాడు. అంత చిన్న వుద్యోగంలో చేరినందుకు జాలిపడతాడు.
సుందరానికి రెండుసంబంధాలు వస్తాయి. ఒకటి డబ్బున్న సంబంధం. సుందరం భవిష్యత్తు ఎలామ్టి వడిదుడుకులూ లేకుండా సాగిపోయేలాంటి సంబంధం. రెండోది శేషగిరి స్నేహితుడైన పార్వతీశం సంబంధం. రెండో సంబంధాన్ని సుందరం యిష్టపడతాడు. అలాగే లక్ష్మితో అతనికి పెళ్ళౌతుంది. బాల్యవివాహం. పార్వతీశంకూడా శేషగిరిలాగా బతికి చెడినమనిషి. ఐతే సీతమ్మ ఐదువందల కట్నానికి పట్టుబట్టీ తీసుకుని, ఆ డబ్బు పెట్టి కోడలికి నగలు చేయిస్తుంది. కట్నంగురించి పట్టుబట్టినందుకు తల్లిపట్ల సుందరానికి చులకనభావం కలుగుతుంది. అత్తవారింట్లో వుండి సుందరం చదువుకునేందుకు ఏర్పాటౌతుంది. అక్కడ చదువయ్యాక కాశీలో చదవటానికి వెళ్తాడు. మొదటి సంవత్సరం చదువయ్యేసరికి భయంకరమైన డిప్రెషను మొదలౌతుంది. ఇంక ఎటూ అప్పు పుట్టే మార్గం వుండదు. అతని చదువు ఆగిపోతుంది. ఉద్యోగం రాదు. ఇల్లూ, పొలం అప్పులకి చెల్లిపోతాయి. ఉన్నవి అమ్ముకుని తిని బతుకుతుంటారు.
సరళమైన భాషలో సూటిగా రాసిన ఈ నవలలోని వస్తువు ఇప్పటికీ సజీవంగానే వుంది.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.