ఝరి 209 by S Sridevi

“ఫామ్‍హౌస్‍లో పార్టీలవీ ఎవరికోసం యిస్తున్నాడు? అసలక్కడేం జరుగుతోంది?”
“మాల్‍వేర్‍తో నువ్వూ మాట్లాడావా?”
తులసి చిన్నగా నవ్వింది.
“వీణ అన్నమాటలన్నీ సింపుల్‍గా బుర్రలోంచీ చెరిపెయ్. ఏదీ జరిగినట్టనిపించదు. నీకే అన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. అదితప్ప ఇంకెవరేనా నీకు ఇలాంటి విషయాలు చెప్పారా? సుధీర్, సుమతి? ప్రహ్లాద్? వల్లి? ఎవరూ లేదుకదా? ఎంత గౌరవంగా బతికామే మనం? వాసు? ఎంత హుందాయైన మనిషి వాడు?”
“సరేగానీ, సామ్ విషయంలో నువ్వు చెప్పింది నిజమేనా?” అడిగాడు.

నిజమేనన్నట్టు తలూపింది. ఆ విషయాలు మాట్లాడుతుంటే శ్రీధర్ వచ్చాడు. ఆరోజుకి అక్కడే వుండి, మళ్ళీ వెనక్కొచ్చి నేరుగా సమీర యింటికి వెళ్ళాడు మాధవ్. కాలేజికి వెళ్ళి, ఆమెతో కలిసి యింటికొచ్చాడు.
కాలేజి వెయిటింగ్‍రూమ్‍లో తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్న ఈ అతిథిని చూసి చాలా సంతోషపడింది. అప్పుడు వాసు, ఇప్పుడు ఇతను. మధ్యలో మారిపోయిన పరిస్థితులు. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. కళ్లలో నీళ్ళు చిప్పిలాయి.
“ఎలా వున్నావురా?” దగ్గరకొచ్చి చేతులుపట్టుకుని వూపేస్తూ అడిగింది.
“అందరూ బానే వున్నాం సామ్! నువ్వేంటే యిలా చిక్కిపోయావు? ఇదివరకట్లా లేవు” అన్నాడు ప్రేమగా.
“కొద్దిగా బీపీ షుగరూ కనిపించాయిరా!” అంది.
“మా అందరికన్నా చిన్నదానివి, నీకు బీపీ షుగరేంటి?” ఆందోళనగా అడిగాడు.
“నాన్న పోయినప్పుడు చాలా టెన్షనుపడ్డాంకదా, అప్పుడు మొదలైనట్టుంది”
“ఉ<హు< అప్పుడు నీకంత వయసూలేదు, తట్టుకునే శక్తీ వుంది”
“పోనీ వయసుతో వచ్చిందనుకో”
“నాతో వచ్చేస్తావా? అక్కడికొచ్చాక తీరిగ్గా కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవచ్చు”
ఆమె గలగల నవ్వింది. “వివాహవిమోచనయజ్ఞం చేస్తున్నారేంటి, మీయింట్లో మా అక్కచెల్లెళ్లకోసం?” అడిగింది. “మహీ ఎలా వుంది? ఎక్కడికీ రాదు. ఫోన్‍కూడా చెయ్యదు. అంతదూరం వెళ్ళి చూడటానికి కుదరట్లేదు. దాని కూతురేం చదువుతోంది?”
జవాబులు చెప్పాడు.
“గీతా, వాసూ వెళ్ళి చూసి వస్తారు. మేఘనని వెంటపెట్టుకుని వచ్చి, నాలుగురోజులు వుంచుకుని పంపిస్తారు. అది సరదాపడి వస్తుందిగానీ, తల్లిని వదిలిపెట్టి వుండలేదు. ఎక్కువరోజులు వుంచడానికి మహీకీ భయమే. బావ దృష్టికి వెళ్తుందేమో, అతనొచ్చి తీసుకెళ్తానంటే వీళ్ళు పంపిస్తారేమోనని”
“అతనింకా బావేనా?’
“అలానే పరిచయమయ్యాడుకదే?”
“కొట్టబోయావటకదా?”
“అప్పుడలానే వుండేది. అందర్నీ నాలుగు తన్నేనా దార్లో పెట్టాలనుండేది”
“అదృష్టవంతులంరా, మేము” సమీర నవ్వింది.
“లేదేమో సామ్! మగపిల్లలం చాలా స్వార్థంగా బతుకుతున్నాం. భార్యాపిల్లల్తో మా సౌఖ్యం మేం చూసుకుని అక్కచెల్లెళ్ళని వాళ్ళ ఖర్మానికి వదిలేసాం”
“అదేం లేదు. దేన్నేనా పట్టుకున్నంతసేపే గుంజాటన. వదిలేసాక ఎందుకుంటుంది?
“అదేంటమ్మా?”
“నీకు ఏం తెలుసో, ఎంతవరకూ తెలుసో నాకు తెలీదు. నేను పెద్దగా ఏవీ దాచాలనుకోవట్లేదు. వాసు వచ్చి అడిగినప్పుడు వాడిదగ్గర దాచాను. అప్పటికింకా నేను పట్టుకునే వున్నాను. ఇప్పుడింక ఎవరడిగినా ఓపెన్‍గా చెప్పేస్తున్నాను. నాకు మాయింట్లో మరోకొడుకు స్థానం యిచ్చారు. పిల్లలకీ నాకూ సరిపడ్డ ఆస్థి ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్నాను. జీతం వస్తుంది. అతన్నిగురించి పట్టించుకోను. నాస్థానం నిలబెట్టేది అతనైనప్పుడుకదా, నేను పట్టుకుని వేలాడటం?” అంది చురుగ్గా.
“చాలా పాఠాలు నేర్పిస్తున్నారే, మీరందరూ” అన్నాడు మాధవ్.
“అతన్నొదిలేసి వచ్చెయ్యమన్నాడు వసంత్. పుట్టి పెరిగిన యింటిని వదిలి, మరోచోటికి వచ్చి, ఆ యింటికి అలవాటుపడి, అందులో సౌకర్యంగా బతకడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాక, అతని తప్పుల కారణంగా నేనెందుకు బైటికి వెళ్ళాలి? తనే యింట్లో తలొంచుకు తిరుగుతున్నాడు. వెళ్లిపొమ్మని అడిగాడు. ఇంట్లో నువ్వెంతో నేనూ అంతే. ఎందుకెళ్ళాలని ఎదురు అడిగాను. మా అత్తగారు నావైపు నిలబడింది” అంది.
“ఇంకా?” అడగలేక అడిగాడు.
“నేనే రెండుసార్లు కొట్టబోయాను” అంది.
“ఒసేయ్, రుద్రమదేవీ!” అన్నాడు నిర్ఘాంతపోయి. నవ్వేసింది.
“మాకున్న కిరీటాలన్నీ తీసి పారేస్తున్నారే, మీ ఆడపటాలం. అక్కడేమో గీత. ఏదొచ్చినా అందర్నీ పక్కకి తోసేసి నడుంబిగించి రంగంలోకి దిగిపోతుంది” అన్నాడు.
గీత ప్రస్తావన రాగానే సమీర ముఖం మ్లానమైంది. వాళ్ళగురించి అడగాలన్నా మాట్లాడాలన్నా చిన్నతనంగా అనిపించింది. మాధవ్ కనిపెట్టాడు. జరిగినదాంట్లో శశిధర్ జోక్యం ఎంతోకొంత వున్నట్టేనని గ్రహించాడు. అతనికేకాదు, సమీరకీ తెలీనిది చాలా వుంది. కేర్‍టేకర్‍నీ, అతని కొడుకునీ ఇద్దర్నీ శశిధర్ యిచ్చిన డబ్బుతో మేనేజిచేసాడు రాణా. తండ్రిని వాళ్ల వూరికి పంపించాడు. కొడుకుని చేతిలో పెట్టుకుని ఆడించాడు. వాసూ గీతా పట్టించుకోకుండా వుండి, ఫాం‍హౌసు రాణా ప్రాపకంలోకి వెళ్లాక శశిధర్ కనీసం పాతికసార్లు దాన్ని వాడుకుని వుంటాడు. మూడునాలుగుసార్లు పార్టీలిచ్చాడు. ఆ పరిసరాలూ, వాతావరణం బాగా నచ్చాయతనికి. ఏదేనా పొలిటికల్ ప్రెజర్ వుపయోగించుకుని ఆక్రమించుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచనకూడా వచ్చింది. ఆఖరిసారి పార్టీ జరిగినప్పుడు గొడవ శృతిమించిపోయింది. పొరుగతను నాలుగురోజుల శెలవులకని కుటుంబంతో వచ్చి వున్నాడు. వాసు అతనికి చాలాకాలంగా తెలుసు. గీత, వాసు పిల్లలని తీసుకుని రావటంకూడా చూసాడు. వాళ్ళకీ వీళ్ళకీ ఫెన్సింగ్ అడ్డం. వాళ్ళు అమ్మేసారని భావించి అతను పోలీసులకి ఫోన్‍చేసి చెప్పాడు.
“అంతా సవ్యంగా జరిగిపోతోందనుకుంటే ఎవడో కంప్లెయింటు యిచ్చాడు. వాసుదేవ్‍ని పోలీసులు పిలిపించి కస్టడీలోకి తీసుకున్నారు. సామ్‍కి తెలిసిందంటే చాలా గొడవచేస్తుంది!ఆఫ్ట్రాల్ ఒక గుమస్తా. అతనికి యిన్ని హంగులు. సొంతిల్లు, పొలం, యిళ్ళస్థలాలు, డబ్బు. చాలా సంపాదించాడట. స్టేట్‍గవర్నమెంటు ఆఫీసులన్నీ గగ్గోలెత్తిపోతున్నాయి అతని డబ్బులెక్కల్తో. ఎవడో పూనుకుని సారువారిని సస్పెండ్‍చేయిస్తే సస్పెండు చేసినవాడినే లేబట్టి బైటపడ్డాడు” అన్నదగ్గిర గింజుకున్నాడు శశిధర్ చాలాసేపు.
“కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది వాళ్లకీ ఫామ్‍హౌస్. డబ్బుంది, చవగ్గా దొరికిందని కొనేసుకున్నట్టున్నాడు. వారానికీ రెండువారాలకీ పిల్లమూకని తీసుకుని వెళ్తారట. ఇలాంటి ఫామ్‍హౌస్ మనచేతిలో వుంటే ఎన్ని పనులౌతాయి? వాళ్ళు దేనికీ కలిసిరారు, పిల్లల చదువు విషయంలో చూసాంకదా? అది రాణా చేతిలోకి వచ్చాక ఖాళీగా వుందని నేనే వాడుకున్నాను. ఇప్పుడేం చేద్దాం?” అన్నని అడిగాడు శశిధర్.
“నీకెందుకురా, శశీ టెన్షను? ముందు రాణా పేరు బైటికొస్తుంది. అతన్ని బెదిరిస్తే మీ పెద్దత్తగారి పేరుచెప్తాడు. తల్లీకొడుకులు ఇతని సాయంతో చేస్తున్నారని మనవాళ్లతో చెప్పిస్తే సరి. వాళ్ల తిప్పలు వాళ్ళు పడతారు” అన్నాడు.
“అలావద్దు. బావుండదు. వాసుదేవ్ ఒక్కడే ఐతే నువ్వన్నట్టు యాగీచెయ్యచ్చు. అందులోనూ ఫోటోల వ్యవహారంకూడా వుందిగాబట్టి నమ్మేవాళ్ళు నమ్ముతారు. పెద్దావిడ పేరు బైటికొస్తే ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోరు. నాపేరు బైటికొస్తుంది. ఏదో ఒకటిచేసి మనమే అతన్ని బైటపడేస్తేసరి. పరిస్థితి తెలుసుకోవడానికి రాణాని వాళ్ళింటికి వెళ్లమంటాను” అన్నాడు శశిధర్.
“వాళ్లకీ వీళ్ళకీ పడదేమో?”
“ఇలాంటప్పుడుకూడానా? కాళ్ళుపట్టుకుని సాయం చేయించుకుంటారు. మిగతావాళ్లందరికీ పెద్దపొజిషన్సూ, దండిగా డబ్బూ వున్నాయిగానీ యిలాంటి తెలివితేటలు లేవు. మా బావమరిదిని చూసావుకదా? అలానే. ఆ తెలివే వుంటే ఆ ఫామ్‍హౌసు అలా ఖాళీగా పడుండదు” అన్నాడు శశిధర్.
అతను చెప్తే రాణా వాసు యింటికి వెళ్లడం, గీత అతన్ని వెళ్లగొట్టడం జరిగాయి. మాధవరావు కలగజేసుకుని వ్యవహారం పరిష్కరించాడు. అదికూడా అవమానంగా అనిపించింది శశిధర్‍కి. వాసుని చులకనగా వూహించుకున్న మనిషికి తలతిరిగి చేతికొచ్చింది మొత్తం వ్యవహారం అయేసరికి. అదే ఎక్కువనుకుంటే ఆరోజే నర్మదతో కలిసి గీతకి కనిపించడం మరోటి. ఆ గింజులాటలో సమీరదగ్గిర కొద్దిగా తొణికాడు.
గొడవంతా జరిగాక సూచనగా ఆమెకి తెలిసింది. ఆమె ఇంకొంచం గుంజింది.
“సిగ్గనిపించలేదా, మీకు? వాళ్ళ ప్రాపర్టీలోకి ట్రెస్‍పాస్ చెయ్యడానికి? చదువుకున్నారుకదా?” అడిగింది అసహ్యంగా.
“రాణా చూసుకుంటున్నాడని వెళ్ళాను” అన్నాడతను సమర్ధించుకుంటూ.
“వాడెవరు వాళ్ళ ప్రాపర్టీ చూడటానికి? వాసు కొనుక్కున్నదానిమీద ఆమ్మకేం అధికారం వుంటుంది, చూడమని చెప్పడానికి? శశీ! మనకి నచ్చినవీ, మనని ఆకర్షించేవీ ఎన్నో వుంటాయి. వాటికోసం దిగజారకూడదు. మగవాడి అసమర్ధతేనా భరించవచ్చుగానీ లేకీతనాన్ని భరించడం కష్టం” అంది. అతనికి బాగా కోపంవచ్చింది. అప్పట్నుంచీ యిప్పటిదాకా ఇద్దరికీ మాటల్లేవు.
ఏం జరిగిందో కచ్చితంగా ఆమెకి తెలీకపోయినా, వాసుకి తెలీకుండా వాళ్ళ ప్రోపర్టీలోకి శశిధర్ వెళ్ళాడనేది నిర్వివాదాంశం. అడిగి, సరదాగా నాలుగురోజులు వెళ్లి వుంటామంటే వద్దంటాడా, వాడు? అందర్నీ పిలుస్తునే వుంటాడు. వెళ్ళినవాళ్ళు వెళ్తారు. తాగడం, తినడం వాళ్ళకి నచ్చవు. పిల్లలకోసం కొన్నారు. భార్యాభర్తలిద్దరికీ ఆటలు ముఖ్యం. ఎవరి పద్ధతులు, అవసరాలు వాళ్ళవి. వీళ్ళ లెవెలు కాదు వాళ్లదని శశిధర్‍కి చులకన. చాలా చికాకనిపించింది అతను చేసిన పనికి. తృటికాలంలో ఈ ఆలోచనలన్నీ కదిలాయి. వెంటనే సర్దుకుంది.
“ఇంటికెళ్దాం. పద. నాకింక క్లాసులేం లేవు” అంది మాధవ్‍తో. ఇద్దరూ కారెక్కారు.
“ఇన్స్టిట్యూట్ ఎలా నడుస్తోంది?” అడిగాడు.
“ప్రస్తుతానికి బానే నడుస్తోంది. సేవకోసంకాదుకదూ, పెట్టింది? కమర్షియల్ టాక్టిక్స్ వాడతారు. నా బాధ్యతల్లా చదువుచెప్పడమే. మిగతాదంతా వాళ్ళిద్దరు అన్నదమ్ములూ చూసుకుంటారు. ఇంకా వేరే వ్యాపారాలున్నాయి మాకు. డబ్బు పుష్కలంగా వస్తుంది” అంది. “వాళ్ళిద్దరూ ఎలా వున్నారు? జరుగుతున్న గొడవలు కొద్దికొద్దిగా తెలుసు మాధవ్! జాగ్రత్తగా వుండమను. ఎవరిదో లెన్స్‌కింద వున్నాడు వాసు. నీతో కొన్నాళ్ళు తీసుకెళ్ళకూడదూ?” అడిగింది తల అతనివేపు తిప్పకుండా పూర్తిగా దించుకుని, స్టీరింగ్‍కేసి చూస్తూ.
“ఇంక ఆ జాబ్స్ వదిలెయ్యమని అన్నాను. పిల్లలున్నారుకదా, ఆలోచిస్తున్నాడు”
చిన్నగా నవ్వింది. “బీదార్పులు అరవద్దను. ఉద్యోగాల్లేకపోతే చదువులు చెప్పించలేరటనా? ఏవో ఏర్పాట్లు చేసే వుంటాడు” అంది. “ఆ ఫోటోల గొడవ ఐనట్టేనా మాధవ్?” కారు స్లోచేస్తూ అడిగింది. తలడ్డంగా వూపాడు. హోటల్లో గీత ఏడ్చిన ఏడుపు గుర్తొచ్చిందతనికి. చిన్నబుచ్చుకుని తిరుగుతూ బలవంతంగా నవ్వుతున్న వాసు రూపం కళ్ళముందు కదిలింది. గుండె పెకిలించినట్టైంది.
“ఎక్కడెక్కడో తిరుగుతున్నాయవి. ఎవరికీ ఎదురుపడలేకపోతున్నాడు వాడు. అందరూ దులిపేసుకుని తిరగలేరు. వాడు మరీ సెన్సిటివ్. అది చాలదన్నట్టు ఆఫీసులో గొడవలు. ఫామ్‍హౌసులో గొడవ. చిరాకుపడుతున్నాడు. ప్రస్తుతం వాళ్ళు మాయింట్లో వుండట్లేదు సామ్! బైట వుంటున్నారు”
“ఆమ్మకీ తులసికీ ఏమైందిరా? ఈ టైములో వాళ్లకి తోడుగా వుండాల్సింది?”
“ఆ ఫోటోలు. వాడితో ఎదురుపడి మాట్లాడటానికి సంకోచం. ఇంకా ఏవేవో కారణాలు”
“అంత అసహ్యంగా ఎలా చేసిందిరా వీణ? ప్రపోజ్ చెయ్యడం వేరు. ఇష్టమైతే వప్పుకుంటాడు, లేకపోతే లేదు. బ్లాక్‍మెయిల్ చెయ్యడమేంటి? తను చిన్నపిల్లైతే కాదు. వాసు వెంట పడిందేంటి? గీత ఎలా వూరుకుంటోంది?”
కారు ఆపేసింది.
“మళ్ళీ చిన్నపిల్లలమైపోతే బావుణ్ణనిపిస్తోందిరా!” స్టీరింగుమీద తలానించి ఏడవటం మొదలుపెట్టింది. గుండె పిండేసినట్టైనా మాధవ్ ఏడవనిచ్చాడు. సీట్లో వెనక్కి వొరిగి కళ్ళుమూసుకున్నాడు. చిన్నప్పుడు వూహించుకున్నట్టో, యౌవనంలో కలలు కన్నట్టో లేదు జీవితం. సంతోషంగానే వున్నారు ఎవరికి వారు. తోటివాళ్ళ దు:ఖం చూస్తేమాత్రం మనసులు కలతబారుతున్నాయి. అందుకే గట్టి నిర్ణయం. ఎంత పెద్దసమస్యేనా అవసరంలేకుండా ఫోన్లలో చెప్పుకోవద్దని. ఇన్ని కుటుంబాలయాక ఏవో సమస్యలు తలెత్తుతునే వుంటాయి. ఎన్నింటినని భరించగలరు మనుషులు?
ఐదునిముషాలయ్యాక నెమ్మదిగా సర్దుకుంది సమీర. నేప్‍కిన్‍తో ముఖం గట్టిగా తుడుచుకుని, కొద్దిగా నీళ్ళు తాగింది. తెరిపినపడింది. తలమీద ప్రేమగా చేత్తో తట్టాడు.
“నేనున్నానని ధైర్యం చెప్పే మనిషిదగ్గిర ఏడవడం బావుంటుంది మాధవ్! వచ్చెయ్యనా, నీతో?” అంది నవ్వి.
“ఐందా, ఏడవడం? బాధని భరిస్తూనో వుగ్గబట్టుకునో బతకక్కర్లేదు సామ్! ఆరోగ్యం పాడౌతుంది. అప్పుడే బీపీ షుగరూ అంటున్నావు. నువ్వే నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తాను. నువ్వేదడిగినా చేస్తాను. నా ఒక్కడివల్లా కానిదైతే అందరినీ కూడగడతాను. మహీ విషయంలో వున్నంత జోష్ యిప్పుడు వుండకపోవచ్చు. ఐనా ఎవరం తప్పించుకోం. అందరం నిలబడతాం” అన్నాడు.
“వాసుగురించి వినగానే ఒక్కసారి ఏదో పోగొట్టుకున్నట్టనిపించింది. సున్నితత్వం, సిగ్గూ, బిడియంలాంటివన్నీ మన జీవితాల్లోంచీ చెరిగిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అలా మోడెస్ట్‌గా బతికిన తరం, మనతరానికి కాలం చెల్లినట్టే. వాళ్ల పెళ్లప్పటికి మేమంతా పది పదిహేనేళ్ల పిల్లలం. ఇద్దర్నీ కుతూహలంగా చూసేవాళ్లం. పెళ్ళికిముందు ఎలా వుండేవారో అలానే వుండటానికి ప్రయత్నించేవారు. తర్వాత సుమతి పెళ్ళి. బావ మా ఆరుగురినీ ప్రత్యేకమైన ప్రేమతో చూసేవాడు. మేం వెళ్ళేసరికి చాక్లెట్‍బార్ తీసిచ్చేవాడు. అంటే మేం పిల్లలం, అల్లరిమాత్రమే చెయ్యాలని. వాళ్ళూ అంతే. అందరి ఎదుటా ఒకరినొకరు ముట్టుకోవడం, సరసాలాడుకోవడం చేసేవారు కాదు. హుందాగా వుండేవారు. అమ్మానాన్నల తర్వాత ఈ ఇద్దరు జంటలే పెద్దవాళ్ళన్న ఫీలింగ్ ఇప్పటికీ పోదు. ఇక మీ అందరికీ ఔతుంటే మేమూ పెద్దయాం. హాస్యాలూ అవీ మొదలయ్యాయి. ఆ ఫోటోలు చూసేసరికి పెద్దషాక్. వీణపడ్డ బాధకన్నా, వాసుకి కలిగిన అవమానం కనిపించింది. అది అలా ఎలా చేసింది? వాసంటే మాకందరికీ చాలా గౌరవం. చెయ్యెత్తుని వాడు పక్కని నిలబడితే కొండంత అండలా అనిపించేది. ఎలారా? వాడిని వోదార్చేది?”
“గీతకన్నా పెద్ద ఓదార్పు వాడికి ఇంకేం వుంటుందమ్మా?”
“దాన్నెవరు ఓదార్చాలి మాధవ్? దాని దు:ఖంకూడా మామూలుగా వుండదు. మనసునిండా చిక్కబడిపోయి దట్టమైన మేఘాల్లా కళ్లమీద కమ్ముకుని, ఏ జడివానో పడుతున్నట్టుంటుందట అది ఏడిస్తే. క్రూడ్ ఫీలింగ్స్ దానివన్నీ. ఒట్టి కచ్చాది విత్ నో సింగిల్ ట్రేస్ ఆఫ్ రిఫైన్‍మెంట్”
“నీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాడు.
“అంటే మా వదినా మరదళ్లం దెబ్బలాడుకోవడం తప్ప మాట్లాడుకోవడం వుండదనా? చాలా మారిపోయారులే ముగ్గురూను”
“గాడిదకూసినా వూరుకోదనేది చిన్నప్పుడు వాళ్ళమ్మ”
“పెళ్ళిసారెలో గాడిదల్నిచ్చి పంపలేదా ఆవిడ?”
“మేమే అడగడం మర్చిపోయాం”
“నాగురించి టెన్షనేం లేదురా! టైమొచ్చినప్పుడు నేనే మీఅందరి సాయం తీసుకుంటాను. బాధంటావా, అందర్లాగా వుండలేకపోతున్నందుకు వుంటుంది. నాలాంటి ఎంతోమందికన్నా నేను లక్షరెట్లు నయమనే సంతోషంతో దాన్ని కాంపన్సేట్ చేస్తాను. ప్రతి లాభానికీ, నష్టానికీ కౌంటర్‍బేలన్స్ లేకుండా వుండదు. కొన్నిసార్లు అవి అక్కడికక్కడే తూగేస్తాయి” అంది.
కారు కదిలింది. పిల్లలగురించీ వాళ్ల చదువులగురించీ మాట్లాడుకున్నారు.
ఇల్లు చేరారు.
“వాసు గుర్తున్నాడుకదా, వాడికి తమ్ముడు మాధవ్. ఆమ్మ చిన్నకొడుకు” అని పరిచయం చేసింది అత్తగారికి. సమీర సంతోషంగా వుండటాన్ని ఎంతోకాలంతర్వాత చూసిందావిడ. మాటల్లో చాలాసమయం గడిచింది. తినడాలూ తాగటాలూ అయ్యాయి. సమీర తోటికోడలుకూడా వీళ్ళ సంభాషణలో కలిసింది. శశిధర్ వచ్చాడు. మాధవ్‍ని చూసి కాస్త కంగారుపడ్డాడు. సర్దుకుని పలకరించాడు. కాసేపు మాట్లాడాక వెళ్తానని లేచాడు మాధవ్. అతన్ని సాగనంపి వచ్చింది.
“దేనికొచ్చాడు?” అడిగాడు శశిధర్.
“ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఐనా తమరెందుకు కంగారుపడుతున్నారు? ఎవరికి ఎక్కడ ఎవర్తో కనిపించారు?” హేళనగా అడిగింది సమీర.
“ఎక్కడేనా తిరుగుతాను. నాయిష్టం. వాళ్ళేమైనా యీ సిటీని కొనుక్కున్నారా?”
“అదేం లేదు. బెంజికారు రోడ్డుమీద తిరిగితే ఎవరు పట్టించుకోరు. అది బురదదారుల్లోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతారు. మీరింకా సమీరమొగుడే, నా బెంజికారే” అంది.
“ఆ కిరీటం దేనికి నాకు?”’
రాత్రి భోజనం చేస్తున్నప్పుడు గమనించాడు. మూడుపుల్కాలు, పప్పు, పచ్చికూరలే తిందామె.
“అదేం తిండి? అవసరంలేని వ్యవహారాలు తలకెత్తుకోవడం దేనికి? అడ్డమైనవాళ్లనీ బంధువులనుకుని బాధపడటం దేనికి? వొంటిమీదికి తెచ్చుకోవడం దేనికి? మా వదిన్ని చూడు, అన్నీ అన్నయ్యకి వదిలేసి ఎంత నిరంధిగా వుందో?” అడిగాడు. అతను దేనికలా అన్నాడో ఆమెకి తెలుసు.
“ఇంకొక ఐదారేళ్ళు ఓపికపట్టండి. పిల్లల చదువయ్యాక వాళ్ళతోపాటు నేనూ వెళ్ళిపోతాను. వెళ్తూవెళ్తూ మీది మీకు అప్పజెప్పేసి వెళ్తాను”
“ఎక్కడికెళ్తావు?”
“బైటికి. వాళ్లతోపాటు చదువుకోవడానికి. అప్పుడింక మీకు అన్ని సంకెళ్ళూ తెగిపోతాయి”
“సామ్!” ఆశ్చర్యంగా చూసాడు. ఇద్దరూ కలిసి వాళ్ల బెడ్‍రూమ్‍లోకి నడిచారు.
అదికూడా చాలారోజులకిందట స్పష్టంగా చెప్పేసింది.
“ప్రేమపూరితమైన స్పర్శకోసం నేనుకూడా తపిస్తూ వుంటాను. ఎవరేనా దగ్గరికి తీసుకోవాలనీ, నుదుటిమీదో, చెంపమీదో, పెదవులమీదో చిన్న ముద్దు పెట్టాలనీ ఆశపడతాను. మనిద్దరిమధ్యా ప్రేమలూ, అభిమానాలూ చచ్చిపోయినా, ప్రేమకి మనిద్దరం చెప్పుకునే అర్థాలు వేరైనా, కనీసం ఆ హ్యూమన్‍టచ్చి కోరుకునే హక్కు నాకుంది. అందుకోసం ఎవరిదగ్గరకో వెళ్ళి నా విలువ తగ్గించులేకోను. కాబట్టి వారానికో పదిరోజులకో దర్శనం యిస్తే సంతోషం. భార్యాభర్తలమన్న నమ్మకం నాకూ వుంటుంది” అంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పలేక వీణ తను యిబ్బందిపడి, అందర్నీ యిబ్బందుల్లో పడేసింది. వీణ తనని తను ఆబ్జెక్టిఫై చేసుకుంటే సమీర శశిధర్ని చేసింది.
సమీర మొదట్లో అతన్ని సాధించి అదుపులో వుంచుకునేది. అతను గిజగిజలాడేవాడు. క్రమంగా ఆమెకే అర్థమైంది. ఒకమనిషిని అలా హోల్డ్‌చెయ్యడం కష్టమని. ఇద్దరూ దానికి అలవాటుపడలేకపోయారు. క్రమంగా ఒకరినొకరు ఆ వుచ్చులోంచీ విడుదలచేసుకున్నారు.
“నీ భార్యకి బాగా గర్వం. మన అమ్మానాన్నలు బాగా కొమ్ములిచ్చారు. అత్తారింట్లో ఎవరూ చెయ్యనిపని వాళ్ళు చేసారు. అది అలుసైపోయింది ఆమెకి. ఆడదాన్ని అలా వదిలెయ్యకూడదు. వినకపోతే నాలుగు తన్నేనా దార్లోపెట్టుకోవాలి. వసంత్‍తప్ప మిగతావాళ్లంతా తనకి కజిన్సే. వాళ్ళంతా తనకి మద్దతు వస్తారనుకుంటోంది. అలాంటిదేం వుండదు. రాణా ఎంత చేస్తున్నాడో నీకు తెలీదా? వాళ్ళు గొడవకి వస్తే మనమేనా తగ్గేది? అది వేరే విషయం” అని సలహాయిచ్చాడు బాగా చదువుకున్న అతని అన్న. తను పద్ధతిగా బతుకుతూ, భార్యని చక్కగా చూసుకుంటూ, సుఖంగా కాపురంచేసుకుంటూ, తనవరకూ బావుండి, తమ్ముడికిమాత్రం ఆ సలహా యిచ్చాడు. తప్పొప్పులు చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. శశిధర్ అన్న సలహా పాటించలేదు. సమీర రిటాలియేషన్ ఏ స్థాయిలో వుంటుందో తెలుసు అతనికి. అందుకే తగు జాగ్రత్తలో వుంటాడు.
సమీర యింటినుంచీ వాసు ఫ్లాట్‍కి వెళ్ళి, ఆ రాత్రికి రైలెక్కాడు మాధవ్. నాలుగురోజులతర్వాత అంతాకలిసి తిరిగొచ్చారు. మాధవ్‍ద్వారా అన్నీ తెలిసాయి. ఎవరికి వాళ్ళకే ఇదో పెద్దకుదుపు. తమలో ఒకరికి సమస్య ఎదురైనప్పుడు నిస్సహాయంగా వుండిపోయామన్న బాధ అందర్లోనూ కలిగింది. తాము చెయ్యలేనిది గీత చెయ్యడం విస్మయాన్ని కలిగించింది. త్రిమూర్తులి కుటుంబంతో రామారావుకి వున్న అనుబంధం తెలుసు. ఏవో సంప్రదింపులకీ, సరదాలకీ, వేడుకలకీ కలుసుకుంటారని అనుకోవడంతప్ప, ఇలాంటి సమస్యకి ఎదురొడ్డి నిలబడతారనుకోలేదు.
కష్టాలూ, వుత్పాతాలూ ఎవరూ ముందుగా వూహించరు. కానీ ఏవెప్పుడు ఎలా వచ్చిపడ్డా బైటపడేసే నెట్‍వర్క్ వుండటం అవసరం. డబ్బుసంపాదించడం ఒక్కటే కాదు, దాన్ని మించిన అవసరాలుంటాయని ఒకొక్కరికీ గ్రహింపుకి వచ్చింది.
“ఏ నిముషంలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురౌతాయో తెలీదు. అందులోనూ పిల్లలని ఎక్కడెక్కడికో పంపించి చదివిస్తున్నాం, ఉద్యోగాల్లో పెడుతున్నాం” అంది మాధురి భయంగా. “ప్రతీదీ వీళ్లకే జరుగుతోందేమిటి? ఎవరికేనా చెప్పుకునేలాకూడా లేవు వీళ్ళు పడుతున్న బాధలు. ఆవిడేమో పూజలూ, నోములూ చెయ్యదు. రాహుశాంతీ, శనిపూజా చేయించుకుంటే దోషాలుంటే పోతాయి” అంది. ఆ పూజలేవో చేయించమని మాధవ్‍కి పురమాయించింది.
వాసు ఫ్లాట్‍కి వెళ్ళారు. మాధురి క్రితంసారి కలిసినప్పట్లా ఫస్ చెయ్యలేదు. స్వంతిల్లు వదిలేసి అద్దెయింట్లో వున్న ఇద్దర్నీ చూస్తుంటే చెప్పలేని బాధకలిగింది. గీత దు:ఖాన్ని రెండుసార్లు అతిదగ్గరగా చూసిన నీలిమకి ఆమె కళ్లమీది నీలినీడలు పొడగడుతున్నాయి.
“అక్కా! ఓర్చుకోండి. రోజులెప్పుడూ ఒక్కలా వుండవు. మారిపోతాయి” అంది ఓదార్పుగా.
“ఒకమాటు ఆయన్తో సిట్టింగ్ వేసుకోమంటావా వాసూ? అందరం కూర్చుని ఓపెన్‍గా మాట్లాడి వీణ చేస్తున్నవేమిటో, అవి దేనికి దారితీస్తున్నాయో అర్థమయ్యేలా చెప్తాం” అన్నాడు వసంత్.
“అవసరం లేదు. వాళ్ళ పిల్ల విషయంలో వాళ్ళు క్లారిటీగానే వున్నారు. దేనికేనా తెగిస్తున్నారు” అంది గీత.
“వదిలెయ్ గీతా, ఆవిషయం. మన విషయంలో నాకూ క్లారిటీ వుంది. ఇది నా జీవితం. పధ్నాలుగేళ్ళ వయసునించీ నేనే నడిపించుకుంటున్నాను. ఏది జరిగినా నాకు నచ్చినట్టే జరగాలి” అన్నాడు వాసు. ఆమె తలతిప్పి అతనికేసి చురుగ్గా చూసింది.
“గీతకి నచ్చినట్టే- అని కరిజెండమ్ ఇస్తున్నానులేమ్మా!” అన్నాడు ఆమె చూపు చూసి.
అప్పటికప్పుడు మాట్లాడి నిర్ణయించేవి కాదని ఆ విషయం వదిలిపెట్టి, మామూలు సంభాషణలో పడ్డారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ జీవితాలు దొర్లించెయ్యన్న నమకం వమ్మైన క్షణాలవి.
మాధవ్, నీలిమ వాసుయింట్లో రెండురోజులుండి, తులసి ఇంటికి వెళ్ళారు. మగవాళ్ళు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే వదినామరదళ్ళు లోపలిగదిలో చేరారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాక,
“ఆరోజు గీతకి తోడుగా నువ్వెందుకు వెళ్ళలేదు తులసీ?” సూటిగా అడిగింది నీలిమ. జవాబుకోసం చూడకుండా తనే మళ్ళీ అంది.
“మీ పెద్దన్నయ్యగురించి ఒకప్పుడు నాకు చాలా గొప్పగా చెప్పావు. ఇప్పుడేమైంది? మీ అమ్మకూడా గీత అన్నకూతురైతే వీణ తమ్ముడి కూతురందట. అదేం పోలిక? గీత స్వంతకోడలు, వీణ మేనకోడలు. తేడా లేదూ? ఆ పిల్లకూడా యింటిమనిషిలా అనుకోలేదు. ఒక కమోడిటీలాగా తన అందుబాటుతనాన్ని మీ అన్నకి చెప్పుకుంది. అతను వద్దన్నారు. ఏమీ జరగకుండా యింటిపరువు బజార్న పెట్టుకోవడం అవసరమా? తప్పైనా వొప్పైనా మన మనిషిని సమర్ధించకుండా ఎవర్ని, దేనికి సాధిస్తున్నారు మీ అమ్మాకూతుళ్ళు? ఒకవేళ మీ అన్న తప్పు వుందే అనుకుందాం. ఐతే? గీతని వెళ్లగొట్టేసి, వీణని తెచ్చుకుని మీ పెద్దొదిన అని నువ్వూ, మా పెద్దతోటికోడలని నేనూ చెప్పుకుంటూ తిరుగుతామా? లేదుకదా? దాన్ని వెళ్లగొట్టి అతన్ని తిట్టో దెబ్బలాడో దార్లో పెడతాం. ఇలాంటి వ్యవహారాల్లో అంతే చేస్తారు. గీత అదే చేసింది” అని. మాధవ్ సున్నితంగా చెప్పాడు. నీలిమ తనపద్ధతిలో చెప్పడం మొదలుపెట్టింది.
“నేనిలా అంటే నీకు కోపం రావచ్చు. కానీ మా అక్కాచెల్లెళ్లం అలాగే ఆలోచిస్తాం. వీణ బుర్ర చెడిపోయింది. ఉద్యోగం సద్యోగం చెయ్యకుండా బలాదూరుగా బతికేద్దామనుకుంది. అంతదాకా తనిష్టం. మీయింటిమీదా, పచ్చగా కాపురం చేసుకుంటున్న గీతమీదా వాళ్ళ కళ్ళుపడ్డాయి. మీయిళ్లలో సగంమంది ఆవిడ్ని చూసి కళ్లలో నిప్పులుపోసుకుంటారు. ఇంకోసగంమంది మెరమెచ్చులకబుర్లు చెప్తారు. మొదట్లో నేనూ అంతే. ఎవరు చెప్పినవైతేనేం, చెప్పుడుమాటలు విన్నాను. అసూయపడ్డాను. దానివలన జరిగే నష్టం ఎలా వుంటుందో నాకన్నా బాగా తెలిసినవాళ్ళు యింకెవరూ వుండరు. ఎన్ని విద్యలొస్తేనేం మీ పెద్దొదినకి? మయూతో మయూలాగా, విహీతో విహీలాగా వుండగలదుగానీ మనతో మనలా వుండలేదు. అంత తెలివితక్కువది. లేకపోతే ఐదేళ్ళపాటు నన్ను కూర్చోబెట్టి వండిపెడుతుందా? మీ అన్నయ్య కంచుకోటలా నిలబడకపోతే ఆమెని అప్పడం నమిలినట్టు నమిలేసేవారు మీవాళ్లంతా. మొన్నటిరోజున సుమంత్ మామగారిని సాయంచెయ్యమని అడిగితే మొండిచెయ్యి చూపించాడట. లత మీ అందరితో రాసుకునిపూసుకుని తిరుగుతుందికదా? కూతురికోసం ఆపాటి చెయ్యలేడా? ఇంకెందుకు ఆ రాసుకుపూసుకోవడాలు? మీ వదినే త్రిమూర్తులుగారి మనవడికి చెప్పుకుని పనికానిచ్చుకుంది. శ్రీధర్ మిగతాది పూర్తిచేసారు. రాణా మీకేం చుట్టం? వాళ్ళమ్మ ఆవిడ్ని ఎన్నిమాటలందో నాచెవుల్తో నేను విన్నాను. అతన్ని మీ పెద్దన్న కొట్టారు. మాధవ్ పోలీస్ కంప్లెయింటు యిచ్చాడు. అవన్నీ అతని మనసులో వుండవా? అతన్నెలా నమ్మారు తులసీ?”
“వాడు మారిపోయాడు వదినా! ఇదివరకట్లా లేడు” అంది తులసి.
“ఆ<హా<! ఏం మారాడో?”
“మాధవ్‍తో అనవుకదా?” సంకోచంగా అడిగింది తులసి.
“అననులే, చెప్పు. ఒకవేళ సీరియస్ విషయమైతే నాకే తెలిసిందని చెప్తాను. నీ పేరు రానివ్వను”
“ఆ ఫోటోలేంటి? చాలా భయంగా అనిపించింది. వణుకొస్తోంది అవి గుర్తొస్తే. మీరంతా అన్నట్టు వాసు విషయంలో ఫేకే ఐనా అవైతే నిజమేకదా? వీణ అంత టార్చర్ పడిందా? నోటితో చెప్పుకోవడం వేరు, కళ్లతో ఆధారాలు చూడటం వేరు. సాటిమనిషిని, కట్టుకున్న భార్యని, తనకన్నా వయసులో చిన్నదాన్ని అలా ఎలా చేసాడు వాడు? ఎవర్నడగను? శ్రీకి చెప్పాలంటే సంకోచం. అది చిన్నపిల్ల వదినా! నాకన్నా ఐదారేళ్ళు చిన్నది. పరాయిది కాదు. మామయ్య కూతురు. మాలో ఒకరు. అది వున్న పరిస్థితికి వికెడ్‍గా ప్రవర్తించడంలో వింతేం లేదు. కానీ దాన్ని దగ్గిరకి తీసి ఓదార్చే బాధ్యత మనకెవరికీ లేదా? వదిన అంత రూడ్‍గా ఎలా ప్రవర్తించింది? వాసు? మంచిగా చెప్పచ్చుకదా? వీళ్ల మంచితనాలు అన్నీ బావున్నవాళ్లతోనేనా?”
“వీణకి అమ్మానాన్నలున్నారు. వాళ్ళు మననేం అడగలేదు. మనకి దేనికి? అంత ప్రేమ వుంటే నువ్వే పిలిచి మీయింట్లో పెట్టుకుని, సంబంధం చూసి చెయ్యి. గీతే ఎందుకు?”
“సమీరభర్తని మన ఫామ్‍హౌసు వాడుకొమ్మన్నాడట వాసు. నాకు షాగ్గా అనిపించింది. అతను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అలా ఎలా అన్నాడు వాసు? వీడుకూడా వీణని వెంట తిప్పుకోవాలనుకున్నాడా? అన్నయ్యా వదినా ఇద్దరూ చాలా మారిపోయారు! వాసుని నిలదీసినా వప్పుకుంటాడా? వాడికి శ్రీధరే పెద్దసపోర్టు. అందరూ అందరే. మగవాళ్ళుకదూ?”
నీలిమ తెల్లబోయి చూసింది.
“ఎవరు పుట్టిస్తున్నారు తులసీ, ఇవన్నీ? శశిధర్ మన ఫామ్‍హౌసు వాడుకోవడమేంటి? మీ పెద్దన్న చెప్పడమేంటి? ఎవరు చెప్పారు నీతో?” తీక్ష్ణంగా వుంది ఆమె గొంతు.
“నాకేం తెలీడంలేదు వదినా! శ్రీకి చెప్పాలని చూసినా అస్సలు వినట్లేదు. పైగా పిచ్చికబుర్లు చెప్పద్దని నన్ను తిడుతున్నారు” తులసి గొంతులో సన్నటి వణుకు. “వాసుకేమైంది? ఎవరేనా డబ్బెక్కువైతే యిళ్ళస్థలాలవీ కొనుక్కుంటారు. ఫామ్‍హౌసంటే వ్యవసాయభూమి. దాన్ని ఇంక దేనికీ వాడకూడదు. అందుమీద డబ్బెందుకు పోసాడు? ఫామ్‍హౌసులో ఏం చేస్తున్నారు? వాళ్లకి దేనికి? వాడిదగ్గిర అంతంత డబ్బెక్కడినుంచీ వచ్చింది? అంతమంది పిల్లలకి చదువులు, అంతంత ఖర్చులూ ఏంటి? తాగుడు, పేకాట ఇలా రకరకాల దారుల్లో మగవాళ్ళు చెడిపోతారు. మా యింట్లో అద్దెలకుండేవాళ్లవి రకరకాల కథలు వింటున్నాను. నాకేం అర్థంకావట్లేదు. వాసు చాలా మంచివాడు. వాడు చెడుదార్లలో వెళ్తుంటే ఎవరికీ చెప్పకుండా వదిన ఎందుకు దాస్తోంది? డబ్బొస్తోందనా?”
“ఇవన్నీ రాణా చెప్పాడా? వీణా? మాధవ్‍కి చెప్పద్దా? నీపక్కని కూర్చుని ఈ సోదంతా విని, నమ్మాలా? నమ్మి? వాళ్ళేమైనా చిన్నపిల్లలా తులసీ? ఏం చెయ్యాలో, చెయ్యకూడదో తెలీదా?”
“మూడుసార్లు పార్టీ యిచ్చారట. మూడోసారి గొడవైతే, వాసుని యిరికించి అతను తప్పుకున్నాడు”
రెండుచేతులూ ఎత్తి దణ్నం పెట్టేసింది నీలిమ.
“అమ్మా! తల్లీ! వాళ్ళిద్దరూ కలిసి మీ యిద్దరి బుర్రలూ తినేసారు. మీఅమ్మా నువ్వూ రోజూ ఇవే మాట్లాడుకుంటున్నారా? ఆవిడక్కడ బీపీ పెంచేసుకుని తిప్పలుపడుతోంది. కొత్తగా ఎక్కడ నేర్చుకుందో కాల్‍హిస్టరీ తీసేస్తోంది. ఎవరితో మాట్లాడుతోందో తెలీక తల బద్దలుకొట్టుకుంటున్నాం. రాణా విషయంకూడా ఆరోజు మీ వదిన చెప్పాకే తెలిసింది. నువ్వనుకున్నవేవీ జరగలేదు తులసీ! ఇంటా బైటా గొడవల్లో పడి వీళ్ళు దేన్నీ పట్టించుకోవడం మానేసారు. వాచ్‍మేన్ డబ్బుకి కక్కుర్తిపడి ఏవో వేషాలేసాడు. రాణా చెయ్యి వుంటే వుండచ్చు. అది మనకి చుట్టుకుంది. ఆ వాచ్‍మేన్ని తీసేసారు. ఇంకొకతనికోసం వెతుకుతున్నారు. సరా? నువ్వు చదివిన పుస్తకాలూ తెలీవీ ఏమయ్యాయి తులసీ? అన్నీ వదిలేసి టీవీ సీరియల్స్ చూసుకుంటూ బతికేస్తున్నావా? ఈ గొడవయ్యాక రాణాతో మాట్లాడావా అసలు?” అడిగింది నీలిమ. లేదన్నట్టు తలూపింది.
“నువ్వు చెయ్యి. నేను పక్కనున్నట్టు చెప్పకు. ఏం చెప్తాడో విను” అంది నీలిమ.
తులసి ఫోన్ చేసింది. రెండుసార్లు ఆడియోకాల్ చేసినా ఎత్తలేదు. మూడోసారి అతనే వీడియోకాల్ చేసాడు.
“అరేయ్, నిజంగా చెప్పు. వాసుని నువ్వు యిరికించావుకదూ?” అడిగింది.
అతను గట్టిగా నవ్వాడు. “నిన్నటిదాకా నేనూ నువ్వూ మంచి ఫ్రెండ్సుమి. ఎన్నోవిషయాలు చెప్పుకున్నాం. ఉన్నట్టుండి ఏమైందే తులసీ? నీపక్కని ఎవరున్నారమ్మా? ఒక్కమాటు ఫోన్ తిప్పు” అన్నాడు. నీలిమ హెచ్చరిక మర్చిపోయి, ఫోన్ ఆమెవైపు తిప్పింది తులసి. నీలిమ నుదురుకొట్టుకుంది. రాణా నవ్వాపలేదు.
“నాటకం మొదలుపెట్టేముందు రిహార్సల్స్ బాగా చేయించాలి మరదలమ్మా! ఇదసలే తెలివితక్కువది. నాలాగే చిన్నప్పుడు చదువు ఎగ్గొట్టేది” అన్నాడు నవ్వుతూనే. నీలిమ మొహం ఎర్రబడింది.
“వాసుమీద కక్ష తీర్చుకోవడానికి బంపర్ అఫర్ యిచ్చారే తులసీ, నువ్వూ ఆమ్మాను. వాడుకున్నాను. ఎప్పుడూ ఏదో ఒక గొడవకావటం, మీ వదినగారు ఎగెయ్యడం, వాడు నన్ను చితక్కొట్టెయ్యడం. అబ్బా, అబ్బా ఎన్నిసార్లే? లెక్కేసుకున్నారే ఎప్పుడేనా?” అడిగాడు. “వాడు డబ్బెక్కువై యిరుక్కున్నదేగానీ నేను యిరికించిందేం లేదు. ఫామ్‍హౌస్ దేనికే వాడికి, వాళ్ళిద్దరూ చెమ్మచెక్కో, దాగుడుమూతలో ఆడుకోవడానికి కాకపోతే? ఏం వెలగబెడుతున్నాడో చూడమని పెత్తనం నాచేతికిచ్చింది ఆమ్మ. ఖాళీగా వుందని శశిధర్ దేనికి వాడుకోవాలో దానికి వాడుకున్నాడు. అక్కడ జరిగిన మూడుపార్టీలూ వాళ్ళిచ్చినవే. రెండు బానే జరిగాయి. మూడోసారి కాస్త గడబిడైంది. కేసౌతుందనుకోలేదు. వెంటనే కంగారుపడి సారువారిని విడిపించడానికి ఏర్పాట్లన్నీ చేసాడు. మీ యింటికి వెళ్తే ఆ తిక్కమేళం నన్ను వెళ్లగొట్టింది. అంతకన్నా ఏం లేదు!”
“నేను మరదలినైతే ఆవిడ మీ వదినగారు. మర్యాదిచ్చి మాట్లాడండి” కటువుగా అంది నీలిమ. రాణా కొంచెం ఆశ్చర్యంగా చూసి, సర్దుకున్నాడు.
“శశి నీకు బావకదరా? సమీర నీ చెల్లెలు. అతన్ని నువ్వెలా ఎంకరేజ్ చేసావు రాణా?” దిగ్భ్రాంతిగా అడిగింది తులసి.
“చెల్లెలా? ఎప్పుడేనా నేను మీకు అన్నలా కనిపించానంటే తులసీ? చిన్నప్పుడెప్పుడో కట్టిన రాఖీలుతప్ప ఏరోజైనా ఇంటికి పిలిచి మర్యాద చేసారే? సిగ్గుండాలి ఆమాట అనడానికి. అన్న చిటికెస్తే మాస్… అన్న నడిచొస్తే మాస్ అని పాడుకుంటూ తిరుగుతారుకదా? వాడు, మీ అన్న. నేను కాదు”
“రాణా! తప్పుకదరా?”
“తప్పేం తప్పే? శశిధర్‍కి రావలిసిన ఆస్థంతా తనపేర్న పెట్టించుకుని కూర్చుందట సమీర. అది తప్పుకాదా? అతనికి ఎంత మండిపోతుందే? యమునని నాకు ఎగ్నెస్టుగా సెట్‍చేసింది మీరంతాకాదా? అదిప్పుడు నామాట వినట్లేదు. నేనెవరికి చెప్పుకోను? ఐనా మగవాళ్ళ విషయాలు నీకెందుకు? ముగింపు కార్డు వేసేసాంకదా? ఎవరెవరు ఎలా తన్నుకుంటారో తన్నుకోండి. ఎలా తన్నుకోవాలో తెలీకపోతే కాంబినేషన్లు చెప్తాను. వాసు వెర్సస్ శశి, సమీరా వెర్సస్ వాసు, తులసీ వెర్సస్ శశి, ఇంకా చాలా వున్నాయి. మధ్యలో మీ పెద్దొదినగారుంది. ఎవరు ఎవర్తో దెబ్బలాడాలో మీరే నిర్ణయించుకోండి. లేదంటే అవన్నీ వాళ్ళకి వదిలేసి, నువ్వు తప్పుకో. పదిరూపాయలు నీ అకౌంటుకి పంపిస్తాను, రెండు లాలీపాప్‍లు కొనుక్కుని తింటూ టీవీ చూసుకో” అన్నాడు.
“పోరా! పెద్దొదినే నీకు సరి! వాళ్ల చేతుల్లో నీకుందిగానీ” కోపంగా పెట్టేసింది తులసి.
“వీడు వెధవని తెలుసుగానీ, ఇంత పెద్దవెధవని తెలీదు” అంది నీలిమతో.
“అర్థమైందికదా? ఇంట్లోవాళ్ళని మానేసి, బైటివాళ్లని మనవాళ్ళనుకుంటే యిలానే వుంటుంది. ఆవిడగాబట్టి మీ అందరితో నెగ్గుకొస్తోంది” అంది.
సాయంత్రందాకా వుండి తిరిగి వెళ్ళిపోయారు నీలిమా, మాధవ్. అదేరోజు రాత్రి రైలెక్కారు.
“అరేయ్, మీ అమ్మనిగానీ, చెల్లెల్నిగానీ ఇక్కడికి తీసుకొచ్చావంటే వూరుకోను” మాధవ్‍ని గట్టిగా బెదిరించి పంపించాడు వాసు.
“బ్రెయిన్‍వాష్ అయిందిలెండి” అంది నీలిమ.
ఆరాత్రి నిద్రపట్టలేదు తులసికి. ఒక్కసారి మత్తులోంచీ మెలకువ వచ్చినట్టుంది. వీణతో తను మాట్లాడలేదు. ఎవరితోటీ మాట్లాడనందట. భయపడుతోందని అమ్మ చెప్పింది. జాలేసింది. అందరికీ చేసినట్టే దానికీ అంతా కలిసి సాయంచేస్తారని అనుకుంది. వాళ్ళకి సాయం అక్కర్లేదు. ఏం కావాలో ముందే నిర్ణయించుకుని వచ్చారు. దానికి సరిపడ్డ కట్టుకథలన్నీ తయారుచేసుకుంది. అమ్మకి ఈ పిల్లల్లో ఎవరన్నా ప్రేమ. అందరినీ యింటికి పిలిపించుకుని ముద్దుచేసేది. దాదాపుగా అన్నిళ్ళవాళ్ళకీ తమ యిల్లే మీటింగ్‍పాయింటు. మొదటిబేచి పదకొండుమంది, తర్వాతివాళ్ళు తామైదుగురు, ఆఖర్న ముగ్గురు. వీణ రావడం తక్కువేగానీ అదన్నా అమ్మకి ముద్దే. అసలే పెళ్ళిలో మోసపోయిందనుకుంటే అది దిగజారిపోయి ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయింది. వాసుమీది నమ్మకం చెదిరింది. పెద్దకొడుకుకదూ, వాడినేమీ అనదు. అనే విషయాలుకూడా కాదు. ఆవిడ ఆక్రోశాన్ని గీతమీద చూపించింది.
రాణామీదా ఆవిడకి ప్రేమే వుండేది. దారితప్పుతున్నాడని బాధపడేది. మాధవ్‍తో కలిసి తిరిగేవాడు. తమింటికి వచ్చేవాడు. అదంతా ఎప్పటిమాట! దశాబ్దాలు గడిచాయి. వాసుమీది నమ్మకం చెదరగానే వాడిని చేరదీసింది. వాసుమీది నమ్మకం అంటే ఆ గ్రూపులో తక్కినవాళ్లందరిమీదా.
రాణా మాటలు గుర్తొచ్చి దిగ్భ్రమ కలిగించాయి. ఎంత దుర్మార్గుడు! శశిధర్‍ని వెంట వుండి ప్రోత్సహిస్తున్నాడు. తాము చెల్లెళ్ళు కాదట. సామ్ కానప్పుడు తనూ కాదు. నమ్మింది. వాడు చెప్పినవన్నీ నమ్మింది. పిచ్చిదాన్ని చేసి ఆడించాడు. కథలూ కబుర్లూ గోడకట్టినట్టు చెప్పాడు. తెల్లారేదాకా ఆలోచిస్తునే వుంది. కలతనిద్రపోయింది. తెల్లారేసరికి మళ్ళీ మెలకువ వచ్చేసింది.
శ్రీధర్ గమనించాడు.
“ఏమిటంత ఆలోచన? మీ వదినేం చెప్పింది?” అడిగాడు.
“సమీర విషయం మీకు తెలుసా?” అడిగింది.
“తెలుసు తులసీ! నర్మద అనే ఆమెతో తిరుగుతున్నాడు. వేరే పరిచయాలుకూడా వున్నాయి. ఈ రెండుమూడు నెలలూ అతను ఫామ్‍హౌసుని బాగా వాడుకున్నాడు. ఎంత చెత్త చెయ్యాలో అంతా చేసాడు. కల్చర్‍లెస్ బ్రూట్. వాసుని ఇంటికి పంపించి నేనక్కడికి వెళ్ళి మనిషితో మొత్తం క్లీన్ చేయించి తాళం వేసి వచ్చాను. ఎవరం పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? ఏమైపోతాడతను? మాధవ్ ఇక్కడ లేడు. వాళ్ళు దాన్నో దేవాలయంలా చూసుకుంటున్నారు. జరిగింది తెలిస్తే కోపం తెచ్చుకుని రాణామీదికో శశిధర్‍మీదికో వెళ్లి కొట్టి వచ్చినా రాగలడు. అంత కోపంమీద వున్నాడు. మళ్ళీ అదో గొడవ”
“నేను చెప్తే మీరు నమ్మలేదు”
“నువ్వు నిజం చెప్పలేదు. వాసు ఇదంతా చేయించాడన్నావు”
తలదించుకుంది.
“శశిధర్‍ని మీరేం మందలించలేరా?”
“మీరిద్దరూ కజిన్స్ అంతే తులసీ! మా రిలేషన్ ఇంకా దూరం. మాయిద్దరికీమధ్య పెద్దగా స్నేహంకూడా లేదు. పర్సనల్ విషయాల్లో ఎలా కల్పించుకుంటాం? సామ్ అమ్మో, అన్నో చూసుకోవాలి. పంచాయితీ పెడితే, రమ్మంటే వెళ్తాను. తప్పించుకోను. ఆమెదికూడా తప్పుంది. బాగా తిరగబడుతుందట. చెయ్యెత్తితే తిరిగి చెయ్యెత్తుతోందట. శశిధర్ అన్న చెప్పాడు. అతను కొంచెం ఎక్కువ పరిచయం. నువ్వైతే ఏదీ తెలీనట్టు, వీలైనంత దూరంగా వుండు. ఎప్పుడో హఠాత్తుగా బాధపుట్టుకొచ్చి వాళ్ళింటికి పరిగెత్తకు. నాకతనిమీద పూర్తిగా గౌరవం పోయింది” అన్నాడు.
“రాణా శశిధర్‍ని సమర్ధిస్తున్నాడు”
“వాడొక లోఫర్. అందుకే వాసు దగ్గిరకి రానివ్వడు. సుమతికేమో తమ్ముడని ప్రేమ. దార్లో పెట్టాలని చూస్తుంది. డబ్బుకి గడ్డితింటాడు అనేది అతని విషయంలో చిన్నమాట. పెద్దవాళ్ళదగ్గిర ఈ వెధవ్వేషాలు దాస్తాడు. నంగిరినంగిరిగా వుంటాడు. అందుకే మీఅమ్మ వాడి బుట్టలో పడింది, నిన్నూ పడేసింది. నిదానంగా ఆలోచించు తులసీ! ఏం చెప్పారని కాకుండా చెప్పిందెవరు అనేదికూడా చూడాలి. నిజాని చుట్టూ ఆవరించుకుని వుండే కోణాలు కనిపిస్తాయి. పొరపాటు, తప్పు, నేరం అనే మూడుస్థాయుల్లో కనిపిస్తుంది” అని, “చిన్నప్పుడు బాగా చదువుకోవాలమ్మా! ఇలాంటివన్నీ తెలిసేవి” అన్నాడు నవ్వుతూ.
“ఊ< సరిగ్గా చదువుకుని వుంటే నాకు పెళ్ళీడు వచ్చేసరికి మీకు ముప్పైలు దాటేవి. మా అన్నలెందుకు యిస్తారు?” దెప్పింది.
అతను పెద్దగా నవ్వాడు. “నిన్ను కాలేజిలో కలవటానికి నేనో నాలుగేళ్ళు ఆలస్యంగా పుట్టేవాడిని. నువ్వు చదువుకోకపోవడంవల్లే నా వయసు పెరిగిపోయింది” అన్నాడు.
అతను ఆఫీసుకి వెళ్ళాక, వచ్చాక, రాత్రి నిద్రపోయాకాకూడా ఆలోచిస్తునే వుంది తులసి. వాసుతో మాట్లాడాలన్న ఆలోచన యింకా రాలేదు. తల్లికికూడా చెయ్యలేదు. ఒక్కర్తీ ఆలోచనల్లో కొట్టుకుపోయింది.
రెండురోజులు ఎడతెగని ఆలోచన చేసింది తులసి. వాసుతో మాట్లాడతావా, వాళ్ళింటికి వెళ్తావా అనేమీ అడగలేదు శ్రీధర్. వ్యవధి యిచ్చి వదిలేసాడు. మూడోరోజు అర్ధరాత్రి మనాది ఆపుకోలేక కాల్ చేసి, వెంటనే కట్ చేసింది. అలా మూడు మిస్స్‌డ్‍కాల్స్. తెల్లారి లేచి వాసు చూసుకున్నాడు. కళ్ళలో సంభ్రమం. తనూ మిస్స్‌డ్ కాల్ యిచ్చాడు. ఇద్దరూ నాలుగైదుసార్లు యిచ్చుకున్నాక వుక్రోషం పట్టలేక గీతకి చేసింది. ఆమె ఆశ్చర్యపడుతూ వాసుకేసి చూసింది. ఎత్తమన్నట్టు సౌంజ్ఞ చేసాడు.
“ఏం? నాతో మాట్లాడ్డటనా?” రోషంగా అడిగింది.
“నన్నడిగితే ఎలానే?” అంది గీత అతనికి ఫోనిచ్చి.
“ఇంటికి రానా? నిన్ను చూడాలనుంది” అడిగింది తులసి.
“విహీగాడు నన్ను తప్పించుకుని తిరుగుతుంటే నలుగురు పిల్లల్ని వెళ్ళి కాళ్ళూచేతులూ కట్టేసి తీసుకురమ్మన్నాను. నువ్వేదో పెద్దయ్యావనుకున్నాను. నిన్నూ అలానే రప్పించాల్సింది” అన్నాడు.
“పోరా! పెద్దదాన్నయ్యాననుకుని తప్పూ వొప్పూ చెప్పకుండా వదిలేసావా?” కన్నీళ్లతో అడిగింది.
“చిన్నప్పుడు బాగా చదువుకొమ్మని చెప్పింది అందుకే. నీకే అన్నీ తెలిసేవి” అన్నాడతను నవ్వుతూ.
మర్నాడు ఆదివారం. శ్రీధర్‍తో కలిసి వచ్చింది. నీలిమని అప్పటికే మంజులకి చూపించింది గీత. ఇప్పుడు తులసినీ పరిచయం చేసింది. ఇద్దరిముందూ తీసికట్టుగా కనిపించింది గీత.
మేనరికం అని చేసేసినట్టున్నారు. అతను బైటి ప్రలోభాల్లో పడకపోతే ఆశ్చర్యపోవాలికానీ, పడితే కాదు- అనిపించింది ఆవిడకి.
తిరిగొచ్చి మాధవ్ చెప్పిన విషయాలన్నీ వింది లక్ష్మి. అతనిచ్చిన కాగితాలూ, తాళాలూ తీసుకుంది. తన పెట్టెలో పెట్టుకుంది.
“వాటా అక్కర్లేదటనా? నేనిస్తానన్నానా? ఐదేళ్ళేట వాసు నాకు కొడుకు. ఆతర్వాత ఆవిడగారు పుట్టేసిందట, దాని మొగుడైపోయాడట. ఐదేళ్లపాటే కొడుకైనవాడికి ఆస్థులెవరిస్తారు?” అంది.
“అప్పుడేమో డెవలప్‍మెంటుకి యివ్వమంటే ఇవ్వనివ్వలేదు.
మూడోతరం కోడల్ని నేను, నాలుగోతరంకూడా ఇక్కడే మెట్టాలి- అందిగా? ఇప్పుడేమైందో?” ఎద్దేవాగా అడిగింది.
ఆవిడ్ని వినోదంగా చూసింది నీలిమ.
“పిల్లలనేం చేసారు? అంతమందినీ ఒక్క ఫ్లాట్‍లో వుండనిస్తారా?” ఆరా తీసింది. రామారావు యిల్లు వాడుకుంటున్నారని తెలిసి తెల్లబోయింది.
“మనిల్లు అందుకుకూడా పనికిరాలేదా? నాతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్టేనా?” నమ్మలేనట్టు అడిగింది చివరికి. కమ్చీదెబ్బ తిన్నట్టు విలవిల్లాడిపోయింది. ఇన్నిరోజులూ ఆవిడున్నది ఆలోచనల్లో. ఇప్పుడు జరిగింది వాస్తవంలో. అక్కడినుంచీ యిక్కడికి రావటానికి చాలా కష్టమైంది.
“ఏదో కోపంలేమ్మా! తగ్గాక వాళ్ళే తిరిగొస్తారు” మాధవ్ సర్దిచెప్పాడు.
నీలిమ వంట చేస్తానని లేచింది. మాధవ్‍కూడా తన పనులు చూసుకోవడానికి వెళ్ళాడు. వంటై నీలిమ భోజనానికి పిలిచేసరికి తనకి ఆకలి లేదంది లక్ష్మి.
“అదేంటి? ఉన్నట్టుండి ఆకలెందుకు లేదు? ఈ వారంరోజులూ ఏం తిన్నారో! మాతో రమ్మంటే వచ్చారుకాదు. నోరంతా చచ్చిపోయి వుంటుంది. పదండి. ఎంతైతే అంతే తిందురుగాని” అంది నీలిమ. వెళ్ళి మాధవ్‍ని పిలుచుకొచ్చింది.
“ఇంట్లో వాటా వద్దన్నాడా వాడు? ఇల్లూ, అమ్మాకూడా వద్దన్నాడా?” ఇంకా జీర్ణించుకోలేక దిగ్భ్రమగా అడిగింది లక్ష్మి.
“ఆరోజు నాకేంటో వళ్ళు తెలీని కోపం వచ్చేసింది. ముందురోజు నట్టింట్లో నిలువెత్తు మనిషిని వాటేసుకుంది వీణ. వాడు దాన్ని కోప్పడుతున్నాడు. నన్ను చూసి అలా చేసాడా? ఇద్దరికీమధ్య ఏదేనా జరిగిందా? తర్వాత ఫోటోలు చూసాను. వీణ మాటలు విన్నాను. దెబ్బతిన్నపిల్ల, దిగజారిపోయి వుంటుందనుకోలేదు. అసలే దురదృష్టం వెంటాడుతున్నదాన్ని వీళ్ళు ఆటాడుకుంటున్నారనిపించింది. ప్రపంచం తలకిందులై కనిపించింది. ఆ పరిస్థితిలోంచీ ఎలా బైటపడతారో తెలీని గందరగోళంలో ఏవేవో అనేసాను.గీతదే తప్పని నాకు తోచిన మాటలన్నీ అన్నాను. మీరిద్దరే కూర్చుని మాట్లాడుకోకూడదని ఒక్క మందలింపు మాట అన్నందుకు ఆరేళ్ళు వాడితో మాట్లాడలేదు. పధ్నాలుగేళ్లపిల్లప్పుడే అంత రోషం. ఇప్పుడన్నమాటలకి అదింక జన్మలో నామొహం చూడదు. వాడికి విడాకులిచ్చి వెళ్ళిపోతానన్నది అందుకేనేమో! తప్పు చేసాను మాధవ్! వీణని రానివ్వద్దని వాళ్ళు చెప్పినప్పుడు ఆపెయ్యాల్సింది. గీత అందంటే కచ్చితంగా ఏదో జరిగిందనే. వాడూ చిరాకుపడ్డాడు. దానిమాట విని వుంటే ఇంతదాకా వచ్చేదికాదు. ఏ పొరపాటేనా మొదలై వుంటే అది అక్కడే ఆగిపోయేది. నేనే మామయ్యావాళ్ళింటికి వెళ్ళొస్తే సరిపోయేది. అది నాయిల్లనే పంతం సాగించుకున్నాను. నాది నాకు విసిరికొట్టింది. వాడిని తీసుకుని వెళ్ళిపోయింది” అంది.
తల్లికేసి వింతగా చూసాడు. “అంతగా ఏమన్నావమ్మా? ఆరోజేకదూ నీకు బీపీ మొదలైంది? అర్థం చేసుకుంటుందిలే” అన్నాడు మాధవ్.
“లేదురా! వాసుది తప్పో వొప్పో, గీతకీ సమస్యలన్నీ తెచ్చిపెట్టింది నేను. పైనుంచీ అన్నిటికీ కారణమని దాన్నే తిట్టాను. ఆ ఫోటోల అప్రతిష్ఠ, ఆఫీసులో కేసులు, ఇప్పుడీ పోలీసుకేసు ఇవన్నీ వాళ్ళకి చుట్టుకునేవి కాదు.
తాటిచెట్లంత ఎదిగారు ఒక్కొక్కళ్ళూను, పెద్దపెద్ద పొజిషన్స్‌లో వున్నారు. మీరెవరూ ఏమీ చెయ్యలేకపోయారా? త్రిమూర్తులి యింటిదాకా వ్యవహారాన్ని ఎందుకు తీసుకెళ్ళారు? వాళ్ళు రాముకి చెప్పకుండా వుంటారా? యశోద రోజూ ఫోన్ చేస్తోంది. ఏం చెప్పాలో తెలీక తనతో ఫోను తప్పిస్తున్నాను. రవి వూరుకుంటాడా? ఇంకో నెలకో రెణ్నెల్లకో అంతా దిగుతారు. ఏం జరుగుతుంది మాధవ్? అందరిముందూ వాసుని దోషిలా నిలబెడతారా? ఈ వయసులో వాడిలాంటి పనెందుకు చేసాడు? మీ నాన్న యింట్లోంచీ వెళ్ళిపోతే దొంగని వెతికి పట్టుకున్నట్టు పట్టుకొచ్చి నాముందు నిలబెట్టారు. అందరం తిట్టాం. అప్పటిదాకా ఆయన మంచివాడే. ఆ మంచితనం ఒక్కపనితో గంగలో కలిసిపోయింది. ఇప్పుడు వీడి పరిస్థితీ అంతేనా?
ఈ ఆలోచనల్లో నేను చిక్కుబడిపోయాను. ఎక్కడికో కొట్టుకుపోతున్నాను. నిజమేదో అబద్ధమేదో తెలీడంలేదు. మాధవ్! వీటిల్లోంచీ నన్ను బైటపడెయ్యలేవా?” అడిగింది.
“అమ్మా! చూడు, మేం ముగ్గురం. అందరికీ చక్కగా పెళ్ళిళ్లయ్యాయి. హాయిగా వున్నాం. ఆరుగురు మనవలు. పిల్లలు పుట్టలేదని భయపడ్డ నాకుకూడా పుట్టేసారు. ప్రేమగా చూసుకునే కోడళ్ళు, కొడుకులాంటి అల్లుడు. సంతోషమైన జీవితం నీది. మన తెలివితక్కువవల్ల తాత్కాలికంగా ఏవో సమస్యలు తలెత్తాయి. అవి తీరిపోయాయి. అంత పెద్దింట్లో యిద్దరే ఎందుకని వాసు, గీత ఇల్లు మారారు. వీణ, రాణా నువ్వు పెంచి పోషించుకుంటున్న భ్రమలు. వాటిచుట్టూ నీ ఆలోచనలని తిప్పుతున్నావు. నువ్వు పెద్దదానివి. అమ్మవి. ఇలా చెయ్యి, అలా చెయ్యకు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్లతో మాట్లాడకని శాశించి నీకు చెప్పలేం. చదువుకున్నావు, నువ్వే గుర్తించాలి.
రాణా వుత్తివెధవన్న విషయం నువ్వు వప్పుకుంటే మంచిది. నేను చిన్నప్పుడు వాడిని వెంటేసుకుని తిరిగేవాడిని. ఇప్పుడలా చెయ్యలేను. పరువుతక్కువ. వాడుకూడా నన్ను చూస్తే అసూయపడతాడు. ఇవన్నీ మేం గడిపిన జీవితాల పర్యవసానాలు. వాడికి ఇంకో చెత్తవెధవ తోడయ్యాడు. శశిధర్. మన కుటుంబం పెద్దదైంది. ఇంక ఎవరింటి చుట్టరికాలు వాళ్ళవరకే పరిమితం చేసుకుంటే చనువులు తగ్గి, ఎవరికివాళ్ళు హద్దుల్లో వుంటారు. లేకపోతే కంటికి నచ్చినవన్నీ వాళ్ళకే వుండాలనుకుంటారు. వీణ అదే చేసింది.
వీణకి అమ్మానాన్నలున్నారు. మనింటిపిల్లని అనడానికి సంకోచించి మర్యాదగా చెప్తుంటే నువ్వు గ్రహించట్లేదు. అది వాసుని ట్రాప్ చెయ్యాలని చూసింది. వాడిని లొంగదీసుకుంటే మనింట్లో మహారాణీగా వెలిగిపోతాననుకుంది. అందరూ చూసేలా వెధవ్వేషాలేస్తే గీతకి కోపంవచ్చి వెళ్ళిపోతుందని ఆలోచించింది. ఒక్కనిముషం ఆలోచిస్తే నీకే అర్థమౌతుంది. దానికి అవన్నీ జరక్కుండా వుండి, మహీలాగే మామూలు విడాకులైతే వాసు వాళ్ళ కంటికి ఆనేవాడా? లేదు. పెళ్ళిళ్లమార్కెట్లోకి మరోసారి అడుగుపెట్టేవాళ్ళు. అత్తనీ మామయ్యనీ వీణ టార్చర్ పెడుతోంది. అందులోంచీ తప్పించుకోవడానికి వాసుని వుపకరణంగా ఎంచుకున్నారు. వాడి యిష్టాయిష్టాలు, ఫీలింగ్స్ ఇవేం వాళ్ళకి అక్కర్లేదు. ఏదో ఒకలా దాన్ని వదుల్చుకోగలిగితే చాలు. గీత విడాకులిస్తానన్నది వాసుమీద కేసు పెడతారని భయపడి. అందరం ఆ విషయాన్ని నవ్వులాటగా తీసుకున్నాం. నువ్వూ మర్చిపోవడం మంచిది. మరోసారి గుర్తుచెయ్యకు వాళ్ళకి.
వాడు జీతంతప్ప మరొక్క పైసకూడా సంపాదించడు. ఉద్యోగంలో చేరినప్పట్నుంచీ చేసిన దాపరికాల్లోంచీ వాడికి డబ్బు పుడుతుంది. ఫామ్‍హౌసులో పేకాటలూ అవీ ఆడించడు. దాన్ని ఎవరికీ అద్దెలకివ్వడు. నీకు డ్రైవింగ్ వచ్చు. పెట్రోలు పోయించుకోవడానికి డబ్బుంది. నిన్ను ఆపేవాళ్ళు లేరు. ఇలాంటి విషయం నీతో చెప్పినప్పుడు నాలుగైదుసార్లు సడెన్ విజిట్ ఎందుకు చెయ్యలేదు? కన్నకొడుకుని అనుమానించడమేంటి? రాణామీద ఆధారపడటమేంటి?
వాసు విలువ తగ్గించకు. నాకు నచ్చదు. జరుగుతున్నవాటికి తెల్లబోతున్నాడు. వాడిది చాలా చిన్నపరిధి. ఒక్కసారి అందులోంచీ లాక్కొచ్చేసారు. గాఢనిద్రలోంచీ హఠాత్తుగా మెలకువ వచ్చినవాడిలా కంగారుపడుతున్నాడు. మేం పెద్దపెద్ద పొజిషన్స్‌లో వున్నమాట నిజమే. ఈ పోలీసుకేసులవీ మనకి కొత్త. ఇప్పుడందరం జాగ్రత్తపడుతున్నాం” అన్నాడు మాధవ్.
చాలాసేపు పట్టింది లక్ష్మికి మాధవ్ మాటలు గ్రహించి అర్థంచేసుకోవడానికి. గుండెల్లో ఎన్నో ముళ్ళు దిగబడ్డాయి. గాయాలు చేసాయి. గాయాలన్నీ మనుష్యీకరణ చెంది, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాయి. గీతని చూసి తను స్వల్పంగా అసూయపడ్డ మాట నిజం. కానీ గీతలా తను ప్రవర్తించలేదు. ఒక అబద్ధం దగ్గిరకి రాగానే దాని నిగ్గుతేల్చకుండా బెంబెలెత్తిపోయింది. ఫామ్‍హౌసుకి వెళ్ళి చూసి తేల్చుకోవాలన్న ఆలోచన తనకి రాలేదు. గీతకైతే వచ్చేది. చేతకాని మమకారం తనది. వీణని చూసి బాధపడి, దు:ఖపడి, ఏదో అయి, తనని తను కళ్ళూ చెవులూ మెదడుతోసహా అప్పజెప్పేసింది. గీతకీ వీణంటే అపారమైన ప్రేమ వుంది. అందరితో చర్చించి దానికేదైనా చేసేది. రాణామీద ఎంత కోపం వున్నా, యమునని నిలబెట్టినట్టు.
బలవంతంగా లేవదీసి భోజనంముందు కూర్చోబెట్టాడు మాధవ్.
“కొత్తిల్లు బావుందా నీలిమా? సదుపాయంగా వుందా? అన్ని సర్దుకుందా? పనావిడ దొరికిందా? ఆఫీసుకెళ్తోందా?” అన్నం కలుపుకునే ముందు ఆరాటంగా అడిగింది.
“నన్నలా ఎప్పుడేనా అడిగారూ?” దెప్పింది నీలిమ వాతావరణాన్ని కాస్త తేలికపరచాలని.
“నీకేమే? మీ అమ్మ అన్నీ వెనకుండి చక్కబెట్టేది”
“ఆవిడకిమాత్రం లేరా?”
రాణాకన్నా శశిధర్ విషయం ఎక్కువ బాధపెడుతోంది మాధవ్‍ని. ఎంత కుసంస్కారి అతడు! తమకి తెలీకుండా తమ ప్రోపర్టీ వాడుకునే తెగింపు ఎక్కడిది? సమీరకి తెలుసా? దాని ప్రవర్తనలో నటన కనిపించలేదు. నిస్సహాయత తప్ప. ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకి వెళ్తుందా? ఎక్కడికి? వాసుకి ఎలా చెప్పి జాగ్రత్తపడమనాలి? అర్థం కావట్లేదతనికి.