ఝరి 110 by S Sridevi

రాణాకన్నా శశిధర్ విషయం ఎక్కువ బాధపెడుతోంది మాధవ్‍ని. ఎంత కుసంస్కారి అతడు! తమకి తెలీకుండా తమ ప్రోపర్టీ వాడుకునే తెగింపు ఎక్కడిది? సమీరకి తెలుసా? దాని ప్రవర్తనలో నటన కనిపించలేదు. నిస్సహాయత తప్ప. ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకి వెళ్తుందా? ఎక్కడికి? వాసుకి ఎలా చెప్పి జాగ్రత్తపడమనాలి? ఇలా జరిగిందని చెప్తే అతన్ని నాలుగు తన్ని వచ్చినా రాగలడు. తర్వాత ఇంకా పెద్దగొడవలౌతాయి. అసలే కళ్ళలో నీళ్ళూ, పెదాలమీద వెలవెలబోతున్న నవ్వూతో సమీర చిక్కుకుని వుంది అక్కడ.
మయూకి ఫోన్‍చేసి మాట్లాడాడు.
“అరేయ్, వీకెండ్స్‌కి అక్కడికీ యిక్కడికీ తిరక్క చక్కగా మీయింటికెళ్ళు. పెద్దాడివయ్యావు. బాధ్యతలు తీసుకోవాలి. అమ్మానాన్నలకి సమస్యలేవైనా వుంటే అడిగి తెలుసుకో” అన్నాడు. ఫోటోలతర్వాత జరిగిన విషయాలు పిల్లలకి తెలీవు. అనవసరంగా వాళ్ళని కంగారుపెట్టడం దేనికనుకున్నారు వాసు, గీత. చెప్పే విషయాలుకూడా కావని కాస్త సంకోచం. మేం పెద్దవాళ్ళమనే అహంకూడా.
“కొత్తగా ఏం జరిగింది?” ఆతృతగా అడిగాడు మయూ.
“చాలానే జరుగుతున్నాయిలే! పెద్దవాళ్లం అన్నీ చూసుకుంటున్నాం. మీ అమ్మ వుందిగా, ఆవిడ ఒక్కర్తీ చాలు. అల్ట్రా సూపర్ వుమన్. ఐనాకూడా వాళ్ళెలా వున్నారో ఏం జరుగుతోందో అడిగి తెలుసుకుంటూ వుండు. పిల్లాడివని ఏవీ చెప్పరు. పెద్దయ్యానని కాస్త దబాయించు” అని వాసుమీద ఆఫీసులో కంప్లెయింటు యిచ్చిన విషయం, ఫామ్‍హౌసులో జరిగిన గొడవ, వాళ్ళు ఇల్లు మారిన విషయం క్లుప్తంగా చెప్పాడు.
మయూ నిశ్చేష్ఠుడయ్యాడు.
“నాకివన్నీ తెలీవు. నేను, విహీమీద ఫోకస్ పెట్టాను. ఆ ఫోటోలకి వాడు బాగా డిస్టర్బయాడు. నేను నాఫ్రెండ్సు కలిసో విడివిడిగానో వాడిదగ్గిరకి వెళ్తున్నాం. ఇప్పుడు దార్లోపడ్డాడులే” అని, “అసలిదంతా ఎవరు చేస్తున్నారు బాబాయ్? ఆమేనా? ఏం కావాలట ఆమెకి?” కోపంగా అడిగాడు. ఫోటోలు పిల్లలకికూడా చేరాయని తెలిసి మాధవ్ తెల్లబోయాడు. పిల్లలకి అలాంటి ఫోటోలు పంపించిన వీణని ఏం చెయ్యాలో తోచలేదు. తండ్రినిగురించి ఏమనుకుని వుంటారు, అవి చూసి? వాసు ఎలా ఫేస్ చేసాడు వీళ్లని? వీణనీ, దాన్ని సమర్ధిస్తున్న అత్తా,మామయ్యలనీ ఏం చెయ్యాలి? అతని రక్తం వుడుకెత్తింది. నిగ్రహించుకున్నాడు. తను బైటపడితే వీడిది అసలే దుడుకురక్తం.
“అదొక్కర్తీ యివన్నీ చెయ్యలేదుగానీ, ఎవరో వున్నారు దానికి తోడుగా. ఇలాంటి చెత్తపనులు చేసేవాళ్ళెవరా అని ఆలోచిస్తున్నాం. రాణా పేరొకటి బైటికొచ్చింది” అన్నాడు.
“అతనికేం కావాలట? ఆమేమైనా అతని ఫ్రెండా?” కొంచెం రూడ్‍గా అడిగాడు మయూ.
ఫ్రెండా అన్నమాట మాధవ్‍కి అర్థంకాక కాదు. పిల్లలని అనుకోవడమేగానీ తమకన్నా వందడుగుల దూరానికి ఆలోచిస్తున్నారు. తనకి రాలేదు యిలాంటి ఆలోచన. ఎవరికి వారే విడిగా అదనుచూసి వాసుని దెబ్బకొట్టారని అనుకుంటున్నాడుగానీ, ఒకరిమాటమీద ఇంకొకరు చేయొచ్చన్న ఆలోచన రాలేదు.
“విహీ గొడవేంట్రా?” మాటమార్చి అడిగాడు. కొంచెం సంకోచించాడు మయూ. అబద్ధాలు చెప్పడం నేర్చుకోలేదు. లౌక్యంగా మాటదాటెయ్యడంకూడా రాదు. తల్లిదండ్రులకి తగ్గ బిడ్డ అతను.
“అమ్మ ఎవరికీ చెప్పద్దంది” సంకోచిస్తూ అన్నాడు.
“నాకు చెప్పచ్చులేవోయ్”
“ఫ్రెండ్సుమధ్య వున్నప్పుడు ఆ ఫొటోలు వచ్చాయట బాబాయ్ వాడికి. రాంగ్ హేండ్స్ వాడిని అందుకున్నారు. ఒకటిరెండుసార్లు డ్రింక్ చేసాడు. వెంటనే మా ఫ్రెండ్సందరం అలర్టయ్యి, వాడిని ఆ సర్కిల్లోంచీ ఇవతలికి లాగాం. ఇప్పుడు బానే వున్నాడు. అమ్మ చాలా ఏడ్చింది వాడిగురించి ” అన్నాడు. చివరిమాటలు అంటున్నప్పుడు అతని గొంతు వణికింది.
మాధవ్ నిర్విణ్ణుడయాడు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పిల్లలు చెయ్యిజారడానికి పెద్ద బాధలక్కర్లేదు. చిన్న కారణమో, కుతూహలమో చాలు.
“అమ్మ ఏడ్చిందీ అంటే నాన్న పైకి ఏడవలేకపోయారని. వాడి విషయం తెలిసి ఇద్దరూ తట్టుకోలేకపోయారు బాబాయ్! ఆమెని మనం ఏమీ చెయ్యలేమా? నాకు పల్లవీ అర్చనలతో వున్న చనువు వీణతో లేదు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చైనీస్ చెకరవీ ఆడుకున్న వేగ్ మెమరీస్ ఒకటో రెండో వున్నాయి. అప్పటికే తను పెద్దది. తర్వాత పెళ్ళైపోయింది. ఇంక మళ్ళీ చూడలేదు. ఆమె మేరేజి ఫెయిలైందని అమ్మ చాలా బాధపడేది. అలాంటి కన్సర్న్ ఆమెకి అమ్మపట్ల లేదా? ఆమెకి కాకపోయినా కనీసం ఆమె తల్లిదండ్రులకి? తాతయ్యకి స్వంతతమ్ముడే కదా, ఆయన? రేట్ కార్డు పెట్టి, ఆమె ఫోటో, ఫోన్ నెంబరు ఇంటర్నెట్లో పెట్టేద్దామన్నాడు సేతు. తప్పనిపించింది. ఆపాను. అమ్మా, నాన్నా యిద్దరికీ అలాంటి పని నచ్చదు” అన్నాడు మయూ. పిల్లలకి రకరకాల వుద్వేగాలని పంచుకోవడానికి వేరువేరు ఔట్‍లెట్లు కావాలి. తల్లిదండ్రులకి చెప్పలేనివి మాధవ్‍తో బాగా పంచుకుంటాడు మయూ. విహీకి అమ్మమ్మ, కృష్ణలతో అనుబంధం.
“అరేయ్, తొందరపడకండి. యూయస్ వెళ్ళినవాళ్ళు ప్రయాణాలు ముందుకి జరుపుకుని వెనక్కి వస్తున్నారు. ఏదో ఒకటి మేం చేస్తాం. దాన్నలా వదిలిపెట్టం. వాళ్ళిప్పుడు బెంగుళూరు వెళ్ళిపోయారు. ఇక్కడ లేరు. మీ నాన్నమీద ఆఫీసులో యిచ్చింది రొటీన్ అనుకుంటాను. ఎవరో సన్యాసిరావనే విజిల్‍బ్లోయెర్ ఇచ్చాడు” అన్నాడు.
“అతను మానాన్నమీదే ఎందుకిచ్చాడు? ఇంకా అలా డబ్బున్నవాళ్ళు చాలామంది వుంటారు, ఈయనే ఎందుకు? దీని వెనకకూడా ఏదో వుంది బాబాయ్. హౌ సేఫ్ ఈజ్ మై డాడ్? ” అన్నాడు మయూ.
మాధవ్ దగ్గిర జవాబు లేదు. ఆ ప్రశ్నలు అతని మనసులోనూ కదుల్తున్నాయి.
“మాకసలు ఎంత వుంటుంది బాబాయ్? నాకు తెలీదు. సేతూవాళ్ళేమో డౌన్ టూ యర్త్ అన్నట్టు చూస్తారు మమ్మల్ని. అమ్మానాన్నల జాబ్స్‌నిబట్టి మిడిల్‍క్లాసో అప్పర్‍మిడిల్‍క్లాసో అనుకుంటారు మిగతావాళ్ళు” అన్నాడు.
“మీ నాన్న నీకెప్పుడూ చెప్పలేదురా?” ఆశ్చర్యపోయాడు మాధవ్.
“నాన్న నాకు కొద్దిగా పాకెట్‍మనీ యిచ్చేవారు. అందులో మిగిలిందీ, మీరంతా అకేషన్స్‌లో నాకిచ్చింది చాలా పోగుపడేది. పద్ధెనిమిది నిండినప్పట్నుంచీ నేనుకూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే జాబ్‍కూడా చేస్తున్నాను. నాదగ్గిరే చెప్పుకోదగ్గంత అమౌంటుంది. నాన్న ఎప్పుడో జాబ్‍లో చేరారు. అప్పట్నుంచీ దాస్తున్నారుకదా, ఎంత వుండివుంటుందో నా వూహకి అందట్లేదు” అడిగాడు.
“లేండు, సైట్లు నీకు తెలుసుకదరా? మిగతా వివరాలు ఎప్పుడో వాడే చెప్తాడు మయూ! నీకేమైనా బిజినెస్ ప్లాన్సున్నాయా?” అడిగాడు మాధవ్.
“ఇంకొంచెం సంపాదించుకున్నాక ఆలోచిస్తాను. ముందైతే ఇంకా చదవాలి. ఎమ్మెస్ చెయ్యాలా, ఎంబియ్యే చెయ్యాలా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాను. కంపెనీనుంచీ యూయస్ పంపే ప్రపోజల్ వుంది. విహీమాత్రం కాట్‍కి తయారౌతున్నాడు. బిజినెసంటే నమ్మకమైన పార్ట్నర్స్, సపోర్టుసిస్టం కావాలి. సేతు, శివుడు నమ్మకమైనవాళ్ళేగానీ, వాళ్ళకి జాబ్, కెరీర్ ముఖ్యం. ప్రయోగాలు చెయ్యలేరు. బిజినెస్ క్లిక్ కాకపోయినా నేను పెద్దగా నష్టపోను. వాళ్ళకి కెరీర్ దెబ్బతింటుంది. హరిచందన్ అనీ మరో ఫ్రెండు. వాళ్ళ ఫాదర్ పెద్ద పోజిషన్లో వున్నారు. వాడు సివిల్స్ యాస్పిరెంట్. నన్నూ రాయమంటున్నాడు. నాకు ఆసక్తి లేదు. కాబట్టి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేను” అన్నాడు మయూ.
అతని స్పష్టత నచ్చింది మాధవ్‍కి.
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ వారాంతంలో అవంతీపురం వెళ్తానని చెప్పి పెట్టేసాడు మయూ. ఎవరితో మాట్లాడాలో వాళ్లకే ఫోన్ చేసి మాట్లాడతాడు. అతని కాల్ పదినిముషాలలోపే. అమ్మకి ఫోన్ చేసి, నాన్నకివ్వు, నాన్నకి పోన్ చేసి అమ్మకివ్వు అని అడగడం వుండదు. ఎదురుగా వున్న మనిషితో ఎలా మాట్లాడతాడో అంత క్లుప్తంగా సూటిగా చెప్తాడు. వారం మొత్తం ప్లాన్ చేసుకుని రోజుకి ఇద్దరితోనో ముగ్గురితోనో మాట్లాడతాడు. ఎవరితోనైనా నిముషమో రెండునిముషాలో అంతే. ముఖ్యమైనవే మాట్లాడతాడు.
అనుకున్నట్టే తనకీ విహీకీ సాయంత్రం ఫ్లైట్స్‌కి టికెట్స్ బుక్ చేసాడు. వస్తున్నట్టు తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పాడు. ఎవరికి వాళ్ళు బయల్దేరి, గంటతేడాలో హైదరాబాద్ చేరారు. గీత, వాసు వచ్చి, పిల్లలిద్దర్నీ పిక్ చేసుకున్నారు. ఇల్లు చేరేసరికి పదకొండైంది.
“మేమే వద్దామనుకుంటున్నాం” అంది గీత. విహీలో మార్పు కనిపిస్తోంది. మొదట్లోలాగే శుభ్రంగా వున్నాడు. చూడగానే తండ్రిని హగ్ చేసుకున్నాడు. మయూ డ్రైవ్‍చేస్తుంటే నేను చేస్తానని పోటీకి వెళ్ళకుండా వెనకసీట్లో కూర్చుని తల్లికి అతుక్కుపోయి మాట్లాడాడు. వీడు ఆ దురలవాట్లోంచీ బైటపడ్డట్టేనా? గీత గుండె దడదడలాడుతోంది. కొడుకు ముఖంలోకి పరికించి చూసుకుంది.
రాత్రి చాలాసేపటిదాకా మాట్లాడుకుంటునే వున్నారు. మాధవ్‍తో మాట్లాడినంత స్వేచ్ఛగా తండ్రితో ఆ విషయాలు మాట్లాడలేకపోయాడు మయూ. వాసు వ్యక్తిగత స్పేస్‍లోకి అంత తేలిగ్గా అడుగుపెట్టలేకపోయాడు. తల్లిద్వారా రాబట్టాలనుకున్నాడు. మాటలమధ్యలోనే విహీ గుడ్‍నైట్ చెప్పేసి, మంచం ఎక్కేసాడు.
“నువ్వూ రా! మాట్లాడుకుంటూ పడుక్కుందాం. చాలా చెప్పాలి నీకు” అని తల్లి చెయ్యిపట్టుకుని లాక్కెళ్ళాడు. ఆ నిద్రమత్తులోనే మరికాసిని కబుర్లుచెప్పాడు.
వాసు మయూతో చాలా విషయాలు చర్చించాడు. ఆర్థిక విషయాలన్నీ వివరించాడు.
“మామ్మ ఇంటిఖర్చులన్నీ తను పెట్టుకుని దాపరికాలు నాకు వదిలేసింది. నేను సంపాదించుకున్నది నాకు నచ్చినట్టు దాచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఖర్చుపెట్టినా ఎవరూ వద్దనేవారు కాదు. నీకుకూడా అలాంటి స్వేచ్ఛ యిస్తున్నాను. దాచటంలోనూ, పైసకి పైస పుట్టించడంలోనూ నేను చాలా ఎంజాయ్ చేసాను. ఇంటితోసహా అన్నీ అమరివున్నాయికాబట్టి మేం ఖర్చులవైపు పెద్దగా చూడలేదు. అమ్మకీ నాకూ పెద్దగా కోరికల్లేవు. ఇప్పుడింక ఆలోచన. రిటైర్‍మెంటు తీసేసుకుని, విస్తృతంగా తిరుగుతూ, ఏదేనా యురోపియన్ దేశంలో రిటైర్‍మెంటు వీసామీద సెటిలైపోవాలని. దానికి రెండు ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి. ఒకటి పిల్లలు. వాళ్ళని మేం యిష్టంగా తెచ్చుకున్నాంకాబట్టి వదులుకోలేకపోతున్నాం. వాళ్ళు హర్టవ్వకుండా, ఇప్పుడున్నట్టే చదువు సాగేలా ఏదేనా ఆలోచన చెప్పగలవా? ఎవరికేనా ఆ బాధ్యత అప్పజెప్పాలన్నా ఆ అభినివేశం మాది, వాళ్లది కాదు. వాళ్లని మాఅంత ప్రేమగా చూసుకుంటారా అని భయం. రెండవది, ప్రోపర్టీస్. అన్నీ చాలా విలువైనవి. పెట్టింది చాలా తక్కువేగానీ, ఇప్పుడవి కోట్లలో చేస్తాయి. నువ్వు వీటిని చూసుకోగలవా? అమ్మాలంటే బ్లాక్, వైట్ సమస్య వస్తోంది. దాన్నెలా టాకిల్ చెయ్యాలో నాకు తెలీదు. నాకు అనుభవం లేదు. ప్రహీతో మాట్లాడు. వాడేమైనా సలహా యిస్తాడేమో!” అన్నాడు.
ఈ కొద్దిరోజుల్లో చాలా మార్పొచ్చింది వాసులో. వీణ సృష్టించిన సమస్యకి గీత చూపించిన పరిష్కారం అతన్ని చాలా కలవరపెట్టింది. ఒక్కో సమస్య ఎదురౌతున్నకొద్దీ అలాంటి పరిష్కారాలు ఇంకేం వెతుక్కొస్తుందోనన్న హడలు మొదలైంది. అందుకే అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన బలంగా కలుగుతోంది. తండ్రిని తదేకంగా చూసాడు మయూ.
“అప్పుడే పెద్దైపోయారనుకుంటున్నారా నాన్నా? ఇంకా చాలాటైముంది” అన్నాడు ప్రేమగా.
వీళ్ళ పెళ్ళిళ్ళగురించిన తన ఆలోచనలుకూడా చెప్పాడు వాసు.
“మాకు కట్నాలిచ్చి పెళ్ళిచేసేద్దామనుకుంటున్నారా?” అని పెద్దగా నవ్వాడు మయూ. “ఇద్దరం ఒకింట్లో అమ్మాయిల్నే చేసుకుంటే బావుంటుందన్న మీ ఆలోచన బావుందిగానీ, అందుకింకా చాలా టైముంది. నేను ముగ్గుర్ని టేమ్ చెయ్యాల్సి వుంటుంది. నేర్చుకోవాలి” అన్నాడు నవ్వుతూనే.
“ఇంక పడుక్కోరా, అబ్బాకొడుకులు?” మయూ నవ్వుకి కొంచెం మెలకువ వచ్చి గీత కేకేసాక ఇద్దరూ లేచి నిద్రకి వుపక్రమించారు.
మర్నాడు పొద్దున్న మామూలుగా ఫ్రిజి తెరిచిన విహీకి అందులో జానీవాకర్ బాటిల్ కనిపించింది. చిన్నబుచ్చుకుని అలిగి వెళ్ళి గదిలో మళ్ళీ ముసుగేసుకుని మరీ పడుక్కున్నాడు. దాన్ని తెప్పించేముందు గీత వాసుతో దెబ్బలాడింది.
“వాడు మర్చిపోయినదాన్ని మళ్ళీ గుర్తుచెయ్యడం దేనికి? మయూవాళ్ళూ వాడిని ఆ సర్కిల్లోంచీ బైటికి తీసుకొచ్చారట” అంది నమ్మకంగా.
“వాడికి ప్రామిస్ చేసాను గీతూ! పెద్దవాళ్లం మనమే ఇచ్చినమాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకి విలువలేం తెలుస్తాయి? వాడెలా రియాక్టౌతాడో చూద్దాం. మళ్ళీ దారితప్పడని మనకీ ధైర్యంగా వుంటుంది” అని ఎంతో నచ్చజెప్పాడు.
గీత చూసి వెనకే వెళ్ళి ఎంత బతిమాలినా ముసుగుతియ్యలేదు.
“ఒకసారి తప్పుచేస్తే ఎప్పుడూ చేస్తారా? నన్ను మీరు నమ్మలేదు” అన్నాడు కోపంగా. వాసుకూడా వెళ్ళి బతిమాలాడు.
“నువ్వు మారిపోయావని మయూ ఎప్పుడో చెప్పాడు. నాకు తెలుసు. నీ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకున్నట్టు నేనూ నిలబెట్టుకోవాలికదా? లేకపోతే నాన్నంతా అబద్దాలు చెప్తాడనుకోవా? ఎవరికేనా గిఫ్ట్ చేద్దామా దాన్ని?” ఎన్నోరకాలుగా నచ్చజెప్పాక, ఎన్నో కోరికలు కోరుకుని, అవన్నీ కొనిస్తానని వాసు హామీయిచ్చాక అప్పుడు శాంతించి మంచం దిగాడు. తేలిగ్గా నిశ్వసించారు భార్యాభర్తలిద్దరూ. కొడుకు తనమీద చూపించిన అథార్టీకి వాసుకి నవ్వొచ్చింది. ఇలాంటివి ఎన్నో మిస్సయ్యాడు తను.
“మీరలా వప్పేసుకోకండి నాన్నా! వాడు సిటీ అంతా కొనెయ్యమంటాడు. స్టైల్సెక్కువయ్యాయి సారుకి” అన్నాడు మయూ.
సమస్యలు ఒకొక్కటీ వువ్వెత్తుని కెరటాల్లా విరుచుకుపడి నెమ్మదిగా తిరోగమిస్తున్నాయి. లేకపోతే యిదో పెద్దబెంగగా వుండేది. తాగటం అలవాటున్న యిళ్ళలో అది పెద్దసమస్యకాదు. కొత్తగా మొదలైన యిళ్ళలోనే దాన్ని ఎలా మేనేజి చెయ్యాలో తెలీక యిబ్బందిపడతారు.
కొడుకులిద్దర్నీ రామస్వామికి చూపించి పరిచయం చేసాడు వాసు.
టిఫెన్ చేసి తయారైపోయి పాతఫ్రెండ్సుని కలవటానికి వెళ్ళిపోయాడు విహీ. తనని ఎక్కడ కలవాలో చెప్పి పంపాడు మయూ. లక్ష్మితో వీళ్ళకి మాటలు ఆగిపోయాయని తెలీదు యిద్దరికీ.
“ఇక్కడేమిటో హోటల్లో వున్నట్టుంది. మనింటికి వెళ్ళి చూసి వస్తాను” అన్నాడు మయూ.
“తాళాలు మామ్మకి పంపేసాను. ఇంక ఆ యింటితో మనకి సంబంధం లేదు!” అన్నాడు వాసు.
“అదేంటి?!” తెల్లబోయాడతను.
“అదంతే” కోపంగా అనేసి వెళ్ళిపోయాడు వాసు.
“ఈయనకి మామ్మమీదకూడా కోపం వస్తుందా? ఎప్పుడూ నేను చూడలేదు” ఆశ్చర్యంగా అడిగాడు మయూ.
గీతకి కొన్ని సంఘటనలు చెప్పక తప్పలేదు. “ఆవిడకి దేనికి కోపం వచ్చిందో తెలీదు. జరిగే ప్రతిసంఘటనకీ అనేక కోణాలుంటాయి. వీణ ఆవిడకి తమ్ముడికూతురు. నాకన్నా దగ్గిరనుకుంటోంది. ఎవరు ఏ ఆలోచనతో చూస్తే అవలా అర్థమౌతాయి. ఎవరు ఎలా ప్రభావితం చెయ్యగలిగితే వాళ్ళ కోణంలోంచీ కనిపిస్తాయి. ఇక్కడ జరుగుతున్నవి చూసి, బాగా బీపీ పెంచేసుకుంటుంటే మాధవ్ తీసుకెళ్ళిపోయాడు. వీటన్నిటితో మీకిద్దరికీ సంబంధం లేదు. ఆవిడ మీకు మామ్మ. ఫోన్ చేస్తే పలకండి. ఏదైనా చెప్తే వినండి. కోపం తెచ్చుకోవడం, ఎదురుసమాధానం యివ్వడం చెయ్యద్దు” అంది.
తల్లి పూర్తిగా చెప్పట్లేదని గ్రహించాడు మయూ.”నీకన్నా ఆమె దగ్గిరనుకుంటోందా, మామ్మ?” నమ్మలేనట్టు అడిగాడు.
“కావచ్చురా! మేనకోడళ్లుగా మా నలుగుర్లో నాకన్నా అదంటే ఎక్కువ యిష్టమేమో! ఆపైన జాలికూడా. కానివ్వు”
“ఈకలు భలే పీకిపారేస్తావు నువ్వు” పకపక నవ్వాడు.
“అమ్మమ్మ వస్తోంది. కృష్ణకూడా వస్తాడట. అందరూ వున్నారు. మాట్లాడతారు. ఆవిడ బాధేంటో అడిగి తెలుసుకుంటారు. గొడవలు సద్దుమణిగాకకూడా స్పర్థలు మిగిలిపోతే కష్టం. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మనట్లేదు. అందరం తలదూర్చితే ఇంకాస్త దూరాలు పెరుగుతాయి. మీకంటూ ఎవరూ వుండరు. పిల్లలు, పిల్లల్లానే వుండండి”
“అత్త?”
“తులసీ సాగించుకుంది. నీలిమ, మాధవ్ ఏం చెప్పారో మరి, తప్పు గ్రహించి యింటికి వచ్చింది”
ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు.
“నాకిదంతా నచ్చట్లేదు మయూ! ఏడవటాలూ, బాధపడటాలూ, కోపాలూ, కక్షసాధించటాలూ ఇవన్నీ అవసరమా? మేమిద్దరం అలా పెరగలేదు, బతకలేదు. ఎప్పటెప్పటి విషయాలో బైటికి వస్తున్నాయి. మాపెళ్ళి జరిగి పాతికేళ్ళౌతోంది. ఇంకో పదేళ్ళో పాతికేళ్ళో గడిస్తే దాటేపోతాం. ఇప్పటికీ అప్పుడు జరిగిన ఒక్క సంఘటనగానీ, నేనన్న ఒక్కమాటగానీ ఎవరూ మర్చిపోలేదు. మనసులో ఏదో వుంచుకుని పైకి దాన్ని చెప్పలేనప్పుడు ఈ గుంజాటనలన్నీ మొదలౌతాయి. ఎవరికేం కావాలో స్పష్టంగా చెప్తే సాధ్యాసాధ్యాలు చూసుకుని ఏది యివ్వాలో అది యిస్తాం” అంది.
“సాధ్యపడనివి కోరుకుంటున్నప్పుడు ఇలానే వుంటుందిలేమ్మా! ఇద్దరూ రిటైర్మెంటు తీసుకోండి. ఈమధ్యలోంచీ వెళ్ళిపొండి. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, తన్నుకునేవాళ్ళు తన్నుకుంటారు. నాన్న రాత్రి యివే విషయాలు మాట్లాడారు. తమ్ముళ్ళ విషయానికొస్తే పూజారమ్మలు చాలామందే వున్నారు. ఏ గుడికి వీళ్లని కలిపినా చక్కగా అన్నం వండి పెడతారు. ఇక్కడ నా ఫ్రెండ్సు సర్కిల్ వుంది. చాలామంది ఇక్కడే జాబ్స్ చేస్తున్నారు. స్టడీ రూం ఏర్పాటు చేసి మేం చూసుకుంటాం. అందరినీ పైకి తెచ్చే బాధ్యత నాది. అమ్మా! ప్రతీసమస్యకీ పరిష్కారం వుంటుంది. దీనిగురించి ఇంకా పక్కాగా ప్లాన్ చేస్తాను. ప్రాపర్టీస్ విషయంలో ప్రహ్లాద్ బాబాయిని కలిసి సలహా తీసుకుంటాను” అన్నాడు మయూ.
ఆ ట్రిప్‍లో ముగ్గురిని కలిసాడు మయూ. సాయంత్రం అంతా కలిసి బైటికి వెళ్ళి విహీ అడిగినవన్నీ కొనిచ్చి, తినేసి వచ్చారు.
మరుసటిరోజు పిల్లలందరితో కలిసి ఫామ్‍హౌసుకి వెళ్ళాలనుకున్నారు. రామస్వామినీ, మజులనీకూడా ఆహ్వానించారు.
“కుటుంబంతో వెళ్తున్నట్టున్నారు. మేం దేనికి?” ఆయన మొహమాటపడ్డాడు. కానీ మనసులోలోపల ఎక్కడో ఇంకా వాసు ప్రవర్తనపట్ల అపనమ్మకం మిగిలి వుంది. పైకి కనిపించే ఈ మనిషి నిజమేనా? లోపల ఇంకెవరేనా వున్నారా? అనే శోధన ఆపలేదు. ఆయనకి అది అవసరమా? కాదు. కానీ సాయంచేసినందుకు తనని తను జసిఫై చేసుకోవాలి. ఆ సాయంకూడా సందర్భానుసారంగా చేసి వుండచ్చు. ఆ సందర్భానికి ఫోటోలు, ఒకమ్మాయి, వాసు వ్యక్తిత్వం ముడిపడి వున్నాయి. సాయపడింది ఆఫీసులో తలెత్తిన సమస్యకో, ట్రాన్స్ఫరు విషయంలోనో మరిదేనికో కాదు.
“మా ఫామిలీ పుష్పకవిమానంలాంటిది. మీరూ ఎక్కెయ్యండి” నవ్వాడు వాసు. ఈమధ్యకాలంలో అతనంత హాయిగా నవ్వింది అదే మొదటిసారి. “పిల్లలంతా వస్తున్నారు. అందరం కలిసి వెళ్ళి చాలాకాలమైంది. రండి. సరదాగా గడపచ్చు” అన్నాడు.
ఆయన తలూపాడు.
సగం వంట గీత యింట్లో చేసింది. ఇంకోసగంలో పిల్లలు తలో ఐటెమ్ చేయించి తెచ్చారు. అన్నీ కారు డిక్కీల్లో సర్దుకుని పదముగ్గురు పిల్లలు, మయూవిహీలు, నలుగురు పెద్దవాళ్ళూ రెండు కార్లలోనూ ఆటోల్లోనూ బయల్దేరారు. సాయంత్రానికి తిరిగొచ్చేసేదేకాబట్టి ఎక్కువ వస్తువులు తెచ్చుకోవద్దంది గీత.
కొత్త కేర్‍టేకర్ని పెద్దమేనత్త వూళ్ళోంచీ తీసుకొచ్చి పెట్టాడు వాసు. పూర్తిగా అతన్ని నమ్మకూడదనేది పెద్దగుణపాఠం. ఎకరం స్థలంలో రకరకాల చెట్లూ మొక్కలమధ్య వున్న టూ బెడ్‍రూమ్ డూప్లెక్స్ విల్లా. బైట ఆవరణలో రెండు వుయ్యాలలు, జిమ్ బార్స్, లోపల గోడలనిండా పిల్లలకోసం రకరకాల ఛార్టులు వున్నాయి. ఒక స్కూల్లా అనిపించింది. వాసు మాటలమీద అప్పటికి నమ్మకానికొచ్చాడు రామస్వామి.
“ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్ అనుకోకుండా యూయస్ వెళ్తూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. పూర్తిగా వైట్‍లోనే కావాలన్నాడు. అతనికి వెళ్ళే తొందర. పెద్దగా కోట్ చెయ్యలేదు. నాదాకా వచ్చింది. మాఇంట్లో అంతా మగపిల్లలు. బావుంటుందని తీసుకున్నాను. ఫర్నిచర్‍తోసహా యిచ్చేసి వెళ్ళిపోయాడు. ధర బాగా పెరిగింది. వీటన్నిటినీ చూసి నన్ను అంచనావెయ్యకండి. దేనిమీదేనా నేను పెట్టింది చాలా తక్కువ. ఇన్ఫ్లేట్ అయింది ఎక్కువ. క్లర్క్ జీతానికి తగ్గట్టే పెట్టాను. ఐటీ ఇండస్ట్రీవలన బాగా మార్పొచ్చింది. అతనూ ఇన్వెస్ట్‌మెంటుకోసమే తీసుకున్నాడు. లాభంమాత్రం నా ఖాతాలోకి వచ్చింది” అన్నాడు వాసు.
రామస్వామి తలూపాడు. నిజమే. స్థలాలమీద పెట్టినవాళ్లంతా బాగా లాభం పొందారు. సిటీ డెవలప్ కావడం, కొత్తవిమానాశ్రయం, ఔటర్ రింగ్‍రోడ్డు, ఐటీ ఇవన్నీ సామాన్యులని కోటీశ్వరులని చేసాయి. మనీమేనేజిమెంటు తెలిసినవాళ్ళు బాగా పైకొచ్చారు. లేనివాళ్ళు నామరూపాలుకూడా లేకుండా కనుమరుగయ్యారు. తనకి తెలిసినవాళ్ళలోనే రెండురకాలవాళ్ళూ వున్నారు.
“డబ్బులేదని మీరనుకుంటే సరిపోదు వాసుదేవ్! ఎంతకి కొన్నారని ఎవరూ చూడరు. ఇప్పుడు వాటి విలువ ఎంతని చూసి, మిమ్ముల అంచనా వేస్తారు. ఎవరో ఆ అంచనాకి వచ్చే మామూలుగా ఆఫీసులో ఫార్మాలిటీకి యిచ్చే ప్రోపర్టీ రిటర్న్స్‌ని బహిర్గతంచేయించారు. కంఫ్లెయింటు యిచ్చినతని పేరు సన్యాసిరావు. మురళీధర్ అనే వ్యక్తి మీ వివరాలు ఇచ్చి, చేయించాడు. మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా శశిధర్‍తో. అతనికి పొలిటికల్‍వాళ్లతో సంబంధాలున్నాయి. మీకు తెలీకుండా అతనిక్కడికి చాలాసార్లు వచ్చాడట. దీనిమీద కన్నేసాడేమో తెలీదు. మామగారిద్వారా అతనికి సంభవించిన నష్టం కనీసం ముప్పైనలభై లక్షలు. దాన్ని మీయిల్లు డెవలప్‍మెంటుకి ఇవ్వకపోవడంతో ముడిపెట్టుకునే అవకాశం వుంది. అలాగే ఆ ఫోటోల్లో అమ్మాయి తల్లిదండ్రులుకూడా ఏదో అశిస్తున్నారు. సమస్య ఎదురైనప్పుడు మీ కళ్లడాక్టరుతమ్ముడి మామగారు చేతిలో పలుకుబడి వుండీ సాయంచెయ్యలేదు. రణధీర్ కొంచెం రౌడీమనిషని మీరే చెప్పారు. మీరనుకున్నంత సాఫీగా లేవు మీ సంబంధాలు. కొన్ని రప్చర్స్ జరిగాయి. అంటే వాటి గుర్తులు లీలామాత్రంగానేనా వుంటాయి. అక్కచెల్లెళ్ళు ముగ్గురినీ మీ తమ్ముడూ ఇంకో యిద్దరు కజిన్స్ చేసుకున్నారు. అంటే ఎవరింట్లో ఏ సమస్య వచ్చినా ముగ్గురూ రియాక్టైపోతారు. ట్రిపుల్ ఎఫెక్టు. ఎప్పటికీ గీతగారిని వెంటపెట్టుకుని తిరగడం కాదు. ఒకరిద్దరు బలమైన మనుషుల్ని మీతో వుంచుకోవడం మంచిది. కనీసం కొంతకాలం. అలా కాకపోతే పోలీస్ ప్రొటెక్షన్ అడగండి. మీ కుటుంబవిషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. మీ పిల్లలుకూడా చాలా సాఫ్ట్‌గా వున్నారు. అలా వుంటే కుదరదు. మనకున్నది మనం జాగ్రత్తగా చూసుకోవడానికేనా గట్టిగా వుండాలి” అన్నాడు.
అతను చెప్పిన విషయాలు వాసుని ఆలోచనలో పడేసాయి. జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనిపించింది. తర్వాత ఇతరమైన అనేక విషయాలు మాట్లాడుకోసాగారు. ప్రపంచంలో వున్న విషయాలన్నిటికీ రూట్‍మేప్ వేసుకుని వీళ్ళు సంచారం చేస్తుంటే గీత పిల్లలమధ్య తిరుగుతూ, మధ్యలో మంజులనికూడా కలుపుకుంటోంది. ఆమెని చూస్తే మంజులకి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఇద్దరిదీ దాదాపు ఒకటే వయసు. తనిలా ఎందుకు లేదు, ఏవీ నేర్చుకోకుండా ఏవి అడ్డుపడ్డాయని ఆలోచిస్తుంది.
పిల్లల ఆటలూ, పాటలతో సాయంత్రందాకా టైమెలాగడిచిందోకూడా తెలీలేదు.
పిల్లల్ని ఎక్కడివాళ్లనక్కడికి చేర్చి ఇళ్ళు చేరేసరికి రాత్రి పదైంది. భోజనాలు అక్కడే అయాయికాబట్టి గుడ్‍నైట్ చెప్పుకుని విడిపోయారు. పిల్లలముందు అనద్దని రామస్వామి చెప్పిన విషయాలు గీతకి యింకా చెప్పలేదు వాసు. పక్కరోజు విహీ, మయూ ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయారు.
“ఆవిడకోసారి ఫోన్ చెయ్యి గీతూ! ఎలా వుందో తెలుస్తుంది” అన్నాడు వాసు.
“నువ్వు మాట్లాడతావా?” అడిగింది గీత.
“ఉ<హు< నువ్వే మాట్లాడి, యిల్లు చూపించు”
గీత కాల్ చేసింది.
“కొత్తింట్లోకి వచ్చాం. మళ్ళీ నీకు చెప్పలేదంటావని చెప్తున్నాను” అంది కాస్త గీరగా.
“ఎవరి చెవులు ఎవరు కొరుక్కుని లంకంత స్వంతిల్లు వదిలేసి, అదింట్లో దిగారో? మధ్యలో నాకెందుకు చెప్పడం?” అడిగింది లక్ష్మి అంతకంటే దర్పంగా. వాసుకి ఆవిడ కనిపించేలా ఫోను కొద్దిగా తిప్పి పట్టుకుంది గీత. ఒకటి రెండు ఫ్రేమ్స్‌లో అతనూ ఆవిడకి కనిపించాడు.
“వాడికి సదుపాయంగా వుందా?” ఆరాతీసింది లక్ష్మి.
“సదుపాయంగా వుండాల్సింది నాకుగానీ అవతారపురుషుడికి కాదు. వండేదీ, పెట్టేదీ నేను”
“నీకు సదుపాయాలెందుకు? నాలుగు స్విచ్చిలు వంటకీ, వాడి భుజం నిద్రకీ వుంటే చాలు”
ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నాక,
“వాడికోసారి యివ్వు. అడిగితేగానీ మాట్లాడటనా? గొడవలన్నీ అయ్యాయిగా?” అడిగింది లక్ష్మి.
“అడిగినా మాట్లాడట్ట. అదుగో, లేచి వెళ్ళిపోతున్నాడు” అని చూపించింది గీత.
“ఐదేళ్ళే కొడుకైనవాడికి అంతకన్నా ప్రేమేం వుంటుంది? వాడిప్పుడు నాకేమౌతాడట? చుట్టరికం ఏమన్నా కనిపెట్టావా?”
“నేను అన్నకూతుర్నీ, అది తమ్ముడికూతురూ ఐనప్పుడు అన్నకూతురిమొగుడనుకో” అంది. లక్ష్మికి చురుక్కుమంది. ఫోన్ పెట్టేసింది.
గీతకి దు:ఖం ముంచుకొచ్చింది. నాలుగురోజులు అమ్మని చూడకుండా వుండలేడు, తను లేకుండామాత్రం జీవితమంతా గడిపేద్దామనుకున్నాడు. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. మళ్ళీ వాసు వచ్చేస్తాడని సర్దుకుని ముఖం కడుక్కుని వచ్చి ఏమీ జరగనట్టు కూర్చుంది.
లక్ష్మికూడా ఫోన్ పెట్టేసి దిగులుగా కూర్చుంది. వాసు తిరస్కారం మనసుని మెలిపెడుతోంది. ఎన్నెన్ని జరిగినా ఎప్పుడూ ఇలా చెయ్యలేదు. ఇప్పుడుమాత్రం చాలాకోపం వచ్చింది వాడికి. అది తెలియజెప్పాలనే పనిగట్టుకుని ఫోన్ చేయించి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
“ఏమైంది, ఎవరు ఫోన్లో?” అడిగింది నీలిమ.
“నాయింట్లో గౌరవంగా పెద్దతనం వెళ్ళిపోతుందని ఆశపడ్డాను. వాడింక నన్ను పట్టించుకోడు. నేను మంచంపట్టేస్తే నువ్వు చూసుకుంటావా నీలిమా?” అడిగింది.
“ఇప్పుడు అర్జెంటుగా మంచంపట్టాలని నిర్ణయించుకున్నారా?” అడిగింది ఆమె.
“కొత్తగా ఏమైంది?” అన్నాడు మాధవ్.
“గీత ఫోన్ చేసింది. వాసు అక్కడే వున్నాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు” అంది.
“వాడే చెయ్యమనుంటాడు. లేకపోతే వదిన చెయ్యదు”
ఆవిడ మాట్లాడలేదు.
“చిన్నప్పుడు వాడిని చిన్నా కన్నా అనేమైనా ముద్దుచేసేదానివేమో గుర్తుతెచ్చుకో. మళ్ళీ మొదలుపెట్టు” మాధవ్ పకపక నవ్వాడు.
“తాటిచెట్టంత వుంటాడు. వాడినేంటి ముద్దుచేసేది? అప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇంత వండి పెట్టడంతో సరి. మగపిల్లల అల్లర్లన్నీ రవి చూసుకునేవాడు. సుధీర్‍తో ఎక్కువగా తిరిగేవాడుకదూ, వాళ్ళు మంచీచెడూ చెప్పేవారు”
“అందుకేనా, పెళ్ళి తప్పిద్దామని చూసారు వాళ్ళు?” చురుగ్గా అడిగాడు మాధవ్.
లక్ష్మి తలదించుకుంది.
“అప్పుడు సుధీర్, ఇప్పుడు వీణ. బాధపడడా అమ్మా? వాడికి గీతంటే ఎంత ప్రాణమో తెలీదా, నీకు? అవన్నీ మనసులో వుండవా? మనం ఒకరి తిండి తినలేదు. నాన్న చక్కగా సంపాదించి పెడితే ఏ కష్టంలేకుండా తిన్నాం. గీతనాన్న మా మంచిచెడ్డలు చూసుకున్నాడు. మధ్యలో వీళ్లంతా ఎవరు, మనం వాళ్ళకేంకానివాళ్ళు?”
“మామ్మ పెళ్ళిమాట ఎత్తగానే గీతని చేసుకుంటానన్నాడు. మామయ్యకూతురుకదాని అన్నాడన్న ఆలోచనే. అక్కడికీ చెప్పాను, వాళ్ళు వప్పుకోకపోతే బాధపడకూడదని. సరేనన్నాడు”
“ఎప్పుడేనా నీమాటకి ఎదురుచెప్పాడా?”
“గీతనీ, వీణనీ పక్కపక్కని చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది. ఇద్దరూ నా అన్నదమ్ములుపిల్లలే. ఇదేమో విరబూసిన పూతోటలా వుండేది. అది ఏడుపుమొహం, ఈడుపుకాళ్ళూ వేసుకుని తిరిగేది.
రాత్రంతా నిద్రపట్టదు, నిద్రమాత్రలు వేసుకున్నా అంతే- అంటే దాన్ని చూసి మనసు మెలిపెట్టినట్టయేది.
పసిపిల్లకి యిదేంఖర్మరా, భగవంతుడా- అని ఏడుపొచ్చేది.
వాళ్ళిద్దరూ నవ్వుతూ సరదాగా తిరుగుతుంటే అలాంటివేం చూడక ఇది తెల్లబోయేది. వాళ్లలా ఎందుకుంటారు, ఇలా ఎందుకు చేస్తారని రకరకాల ప్రశ్నలు వేసేది. నేనుమాత్రం ఏం చెప్తాను? గీతని చూసి మరీ వింత. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందని అడిగేది.
నువ్వూ నేర్చుకోవే. దాన్నడిగితే నేర్పుతుంది. ఎవర్నేనా పెట్టేనా నేర్పిస్తుంది- అన్నాను. ఒకసారికాదు, చాలాసార్లు చెప్పాను.
అక్కకి నేనంటే యిష్టం లేదు- అనేది.
బావ నాతో ఎందుకు మాట్లాడడు- అనడిగేది.
రాము చెయ్యిపట్టుకుని కుసుమా, సుమతీ తిరిగేవాళ్ళు. అలానే ఇదీ వాడితో మాట్లాడాలని సరదాపడుతోందనుకున్నాను. చిన్నపిల్ల, మరో ఆలోచన వుందనుకోలేదు. అందరికీ అన్నీ చేస్తుంది గీత. ఎక్కడెక్కడి పిల్లల్నో తెచ్చుకుని వొళ్ళోకెక్కించుకుని సానపడుతోంది. దీని విషయంలో మాట్లాడకుండా వూరుకుంది. ఇద్దరూ దాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. దీనికంత పెద్ద కష్టం వస్తే పట్టనట్టు ఇద్దరూ హాస్యాలూ, పరిహాసాలూ చేసుకుంటూ తిరుగుతుంటే అసహ్యంకూడా కలిగింది మాధవ్!
అలాగని వాళ్ళెప్పుడూ అసభ్యంగాలేరు. వాళ్ళమాటల్లో మనంకూడా మాటకలపచ్చు. వాళ్ళమధ్య దీన్ని కాసేపు కూర్చోబెట్టుకోగలరుగానీ, దీనికోసం తమ సరదాలూ సంతోషాలూ ఎందుకు మానుకుంటారు? ఆటల్లో, పాటల్లో, మాటల్లో దీన్నీ కలుపుకుంటూ వెళ్ళాలనే చూసారు. ఏదీ తెలీని మొద్దు అది. చదువేనా ఎలా వచ్చిందో! గీతని చూసి వీణ అసూయపడుతోందనుకోలేదు. వాళ్ళ పడగ్గదిలోకికూడా యిది తొంగిచూస్తోందన్న ఆలోచన రాలేదు. మీకందరికీ అర్థమైన విషయాలు నేను గ్రహించలేకపోయాను. వీణమీద మమకారం అడ్డొచ్చింది” అంది లక్ష్మి.
“గీత దాన్ని ఎందుకు యిష్టపడాలి? వాళ్ళేమైనా తనని ప్రేమగా చూసారా? మా అందర్నీ చూసినట్టు తనని చూసేదికాదు” పదునుగా అడిగాడు మాధవ్.
“మహతి నిస్సహాయస్థితిలో మాయింటికి వచ్చింది. సాయం అడిగింది. చెయ్యగలిగింది చేసాం. మా చెల్లెలిని మీతో తీసుకెళ్ళమని మేమిద్దరం అడిగాము. యమునది మరో పరిస్థితి. కానీ వీణకి చదువుంది, అన్న, తల్లిదండ్రులు, బంధువులున్నారు. మీరలా ఎలా అనుకున్నారు?” అడిగింది నీలిమ. అదే విషయాన్ని మరికొద్దిరోజులు గడిచాక ఇంకా స్పష్టంగా కొట్టినట్టు చెప్పింది సంధ్య.
“వాళ్లంతట వాళ్ళే ఫోన్ చేసారుకదమ్మా, నెమ్మదిగా కోపం తగ్గుతుందిలే. వెళ్ళి చూసి వద్దువుగాని” మాధవ్ వోదార్చాడు.
లక్ష్మిని వంటరిగా వదిలేసి ఎవరిపనిమీద వాళ్ళు వెళ్ళిపోయారు.
చాలా విషయాలు చెప్పలేదు ఆవిడ. చెప్పలేకపోయింది. ఎప్పుడూ యింటి బాధ్యతల్లో తలదూర్చని తమ్ముడు, కాస్త గర్వం అహంభావం వున్నాయనిపించే మరదలు వెతుక్కుంటూ రావడంతో తనకి తను ఆపాదించుకున్న గొప్పతనం, పిల్ల విషయంలో తన సాయం ఆశిస్తున్నారన్న అపోహ- వీణ పూనాలో యిరుక్కుపోయి వున్నప్పుడు సాయంచేస్తామని ముందుకి వస్తేనే లీల పడనివ్వలేదన్న వాస్తవాన్ని కప్పెట్టేసాయి. ఏళ్ళతరబడి నిశీధి వంతరితనాన్ని అనుభవిస్తున్న తనకి ఒక మాటతోడనిపించింది వీణ. ఎడారిలో దాహార్తితో వున్నవాడికి నీటిచుక్కలా అనిపించింది. విస్తారమైన నిశబ్దంమధ్య చిన్నసవ్వడిలా అనిపించింది. అది చెప్పినవన్నీ వింది. అడిగినవన్నీ చెప్పింది. జీవితంలో దారుణంగా దెబ్బ తిని మనుషులమీద నమ్మకంపోయి మనసు వికలమై వున్న పిల్ల చూపించిన కోణంలోకి తలతిప్పింది. తన పుట్టింటి యింటిపేరు, గోత్రం మోసిన పిల్ల పరాయిమగవాడితో తప్పుగా ప్రవర్తిస్తోందని వూహించలేకపోయింది. గీత వుక్కుపిడికిట్లో యిరుక్కుని వాసు గిజగిజలాడుతున్నాడనే విత్తనం తనలో మొదలైన అసూయలో పడేసి మొలకెత్తించింది.
“నా పిల్లలు అలాంటివాళ్ళు కాదు” అని గట్టిగా చెప్పడానికి ఆ తోడు తనని వదిలేసి వెళ్ళిపోతుందని భయం. ఏదో చెప్తోంది, తను జనాంతికంగా వింటోందనుకుంది. నెమ్మదిగా మంచిదార్లోకి తేవచ్చనుకుంది. కానీ మాటకి ప్రాణం వుంటుంది. చెప్పే మనిషిలోంచీ సంకల్పశక్తిని తనతో తెచ్చుకుని వినే మనిషిలో నిక్షేపిస్తుంది. వీణ మారడంకాదు, తనే మారింది. అప్పటిదాకా సాదాగా కనిపించిన విషయాలన్నీ తలకిందులుగా మారిపోయాయి. విలువలన్నీ మారిపోయి కనిపించడం కొత్తగా అనిపించింది.
గీత పొరపాట్న చెయ్యికాల్చుకుంటే బర్నాల్ రాసి రాత్రంతా ఆ చేతిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండిపోయిన మనిషిని మర్చిపోయింది. ఇద్దరి అల్లరీ ఆటపాటలూ మర్చిపోయింది. విహీని దింపకుండా ఎత్తుకుని తిరిగిన ఆ నాన్నని మర్చిపోయింది. పూర్తిగా తన పోలికలతో అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తున్న మయూని సంభ్రమంగా చూసే తండ్రిని మర్చిపోయింది.అవన్నీ తెరదించేసినట్టు మరుగుకి వెళ్ళిపోయాయి. నిట్టూర్చింది. మరోసారి గీతతో మాట్లాడాలని మనసు తపించింది. వాసు తిరస్కారం గుర్తొచ్చి ఫోన్‍మీదికి వెళ్ళిన చెయ్యి వెనక్కి తీసుకుంది.
మరికొన్ని సంఘటనలు చకచక జరిగిపోయాయి.
లీలావాళ్ళూ బెంగుళూర్లో వున్నారు. అమెరికానుంచీ వచ్చినప్పట్నుంచీకూడా లీల కోడల్ని కలుపుకోలేదు. పిల్ల తల్లైనదాన్ని కోడలిగా వప్పుకోలేకపోయింది. తల్లి మాటలుకూడా ఆవిడమీద పనిచేసాయి.
తమకి స్వంతంగా ఫ్లాట్ వుండగా అద్దెదాంట్లో వుండనంది అలేఖ్య. స్వంతఫ్లాట్‍లో తనుండి, పక్కది అద్దెకి తీసుకుని అమ్మానాన్నలనీ వీణనీ వుంచాడు సంతోష్. భర్తమీద తనకిగల అధికారాన్ని అత్తగారికీ, ఆడబడుచుకీ స్పష్టంగా చూపించుకుంది ఆ అమ్మాయి. మొదటిభర్తపట్ల ఆమెకి ప్రేమ వుంది. అప్పుడూ జరిగింది పెళ్ళే. చేసుకున్నది యిష్టంతోనే. కానీ పెళ్ళైన రెండేళ్లకే చనిపోయిన అతనికోసం దు:ఖపడుతూ అన్నీ పోగొట్టుకున్నట్టు బతకాలని ఆమెని ఎవరూ నిర్బంధించలేదు. తల్లిదండ్రులు రెండోపెళ్ళికి ప్రోత్సహించారు. అత్తమామలు పాప పేరిట కొంత సొమ్ము డిపాజిట్ చేసి, వాళ్ళ జీవితాలు వాళ్ళవని వదిలేసారు. సమాజం మారింది. ఎవరూ దు:ఖాలని జీవితకాలపు బాధ్యతలుగా మార్చుకుందుకు సిద్ధంగా లేరు. అలా వుండాలనుకున్న స్త్రీది వంటరిపోరాటం ఔతోంది.
సంతోష్ పాపని చాలా ప్రేమగా చూస్తాడు. మంచివాడు. సంస్కారవంతుడు. అలేఖ్యకి ఒకమంచి తోడు. ఇద్దరి జీవితం సాఫీగా సాగిపోతోంది.
ఇంట్లో పరిస్థితులన్నీ పెళ్ళికిముందే ఎలాంటి దాపరికం లేకుండా చెప్పాడతను. ఇండియా రావలిసిన అవసరంగానీ. అత్తమామలతో కలిసి వుండే పరిస్థితులుగానీ వస్తాయని వూహించలేదు. ఇక్కడ వీణ పెడుతున్న మంటలు చూసి పరిగెత్తుకువచ్చాడు సంతోష్. అతనివాళ్ళని ఒకసారి చూసి పరిచయం చేసుకుంటే బాధ్యత తీరిపోతుందని ఆమెకూడా వచ్చింది. అత్తగారికి తమ పెళ్ళి యిష్టం లేదు. అయిష్టాన్ని బాహాటంగా చూపిస్తోంది. మామగారిది యిష్టమో అయిష్టమో తెలీదు. వీణని చూసింది. ఆమెది నీతితక్కువతనంతప్ప సైకిక్‍గా సమస్యేమీ లేదని చెప్పాడు డాక్టరు. ఇంచుమించుగా తామిద్దరిదీ ఒక వయసే. చేజేతులారా జీవితాన్ని పాడుచేసుకుంటోంది. చెప్పినా వినట్లేదు. తాము ఇక్కడుండి చేసేదేమీ లేదని అర్థమైంది. వెనక్కి వెళ్ళిపోవడానికి సంతోష్‍కి చెప్పి వప్పించాలనుకుంది.
రామస్వామి చెప్పిన మురళీధర్ లీల తమ్ముడు. అతన్ని యింట్లో బాబీ అని పిలుస్తారు. అందుచేత వాసుకి ఆ పేరు తెలీదు. అతను అక్కగారితో ఫోన్లో మాట్లాడాడు.
“వాసుదేవ్‍గురించి చాలా సమాచారం సేకరించానక్కా! అమ్మ చెప్పినదాన్నిబట్టి అతని తప్పేమైనా వుందా, డబ్బుకి ప్రలోభపడో, తప్పొప్పుకునో లొంగి దార్లోకి వస్తాడా, రెండోపెళ్ళి ఎందరు చేసుకోవట్లేదు, వీణకి ఓ దారి దొరుకుతుందని చిన్నప్రయత్నం చేసి చూసాను. అదికూడా తప్పే. చాలామంచిమనిషి అతను. ఎవర్నడిగినా అదే చెప్పారు. పూర్తిగా ఫామిలీసెంటర్డ్. మీ పెళ్ళిలోనూ, ఏవో పంక్షన్లలోనూ చూడటమేతప్ప అతనితో నాకు పెద్దగా పరిచయం లేదు. అతని సర్కిల్ వేరు. వీణ ఎక్కడో పొరపాటుపడింది. అలాంటివాడుకాదు. ఆ ఫోటోలవీ అలా తయారుచెయ్యడం తప్పు. మనవైపునించీ ఏ చిన్నకదలిక వచ్చినా దాన్ని మళ్ళీ ఆ వూబిలోకి తోసేసి వదిలించుకోవడానికి సిద్ధంగా వున్నారు. అందుకే కేసు పెట్టలేదనుకుంటాను. దాన్ని మరోసారి ఎలాంటి పిచ్చిపనులూ చెయ్యద్దను. ఇంటి పరువు తియ్యద్దను” అన్నాడు.’
తమ్ముడి మాటలకి లీల చిన్నబోయింది. తప్పంతా కూతురిదే అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పక్కనే వుండి అంతా విన్న వీణ అంది.
“ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంత పెద్ద ఎంక్వైరీలెందుకు? నన్నడిగితే నేనే చెప్పేదాన్ని. సాధించుకొస్తాడనుకున్నాను. వాళ్ళిల్లు నాకు నచ్చింది. బావుంది. ఆ మనిషి నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతాడు. అక్కడే వుండిపోతే బావుణ్ణనిపించి ఏవో ప్రయత్నాలు చేసాను. ముందా ముసలిదానికి గీతమీద బాగా ఎక్కించాను. గీతని యింట్లోంచీ వెళ్లగొడితే అతన్ని లొగదీసుకోవచ్చనుకున్నాను. అది మహారాక్షసి. మాకిద్దరికీ మధ్య గోడ కట్టేసింది”
“వీణా! వాళ్ళు మన బంధువులమ్మా! ముసలిదేమిటి? అత్తకదా? నిన్నెంతో ప్రేమగా చూసేది. గీతెవరు? అక్కకాదా? దానిగురించి అలా ఆలోచించచ్చా? ” తెలతెలబోతూ అడిగింది లీల.
“తప్పూ వప్పూ అనేవేవీ లేవు. ఉండవు. అవి చేతకానివాళ్ళు చెప్పుకునే మాటలు. నన్ను దిగజార్చినవాడెవడు? అతికష్టమ్మీద అక్కడినుంచీ తప్పించుకుని పారిపోతే నన్నింట్లోకి రానివ్వద్దన్నది ఎవరు? చచ్చిపొమ్మని విషం డబ్బా నా కళ్లెదురుగా పెట్టిందెవరు?
నీకోసం పెళ్ళికూడా మానేస్తానే- అన్నది మర్చిపోయి దాన్నెవర్తినో యింట్లో తెచ్చిపెట్టినవాడెవరు?
మీరంతా నా బంధువులూ, స్వంతవాళ్ళేకదా? ఎవ్వరివల్లా నాకు పిసరంత సంతోషంగానీ, వుపయోగంగానీ లేదు. ఏడుపుమొహాలేసుకుని తిరుగుతున్నారు. మీ మొహాలు చూడాలంటే విసుగుపుడుతోంది. అందరూ చచ్చిపొండి! లేకపోతే ఎప్పుడో నేనే చంపేస్తాను” అని అక్కడున్న ఫ్లవర్‍వేజ్ నేలకి బలంగా విసిరికొట్టి లేచింది వీణ. విరిగేవేవీ కొనడం మానేసింది లీల. కాబట్టి తియ్యడానికి తొందరలేదు. ఈమధ్య పైకికూడా విసిరికొడుతోంది. అది ఎవరి నెత్తిన పడుతుందోననే భయం కొత్తగా మొదలైంది.
ఆరోజు రాత్రి లీల నిద్రపోలేదు. కూతురి మనస్తత్వం భయపెడుతోంది. ముందుముందు దాని బతుకేమౌతుంది? తమ కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా లక్ష్మి యింటిదారిపడతారు. అది రెండు ప్రేమలకూడలి. పెద్దాయన ప్రతినిధిగా ఆయన కూతురు అక్కడ నిలిచివుంది. ఎన్నో యేళ్ళ శోషణతర్వాత అలాగే తామూ వెళ్ళారు. అక్కడ వూరట దొరుకుతుందని. అంతకిమించిన ఆలోచనలేవీ తమకి లేవు. అసూయ, ద్వేషం, నిస్సహాయత ఎన్నేనా వుండచ్చు, పచ్చగా కాపురం చేసుకుంటున్న పిల్లలమధ్య చిచ్చుపెట్టాలని అనుకోలేదు. హోటల్లో కలిసినప్పుడు వాళ్ళని తమతో బలవంతంగా తీసుకురావడం తప్పు. వీణ ఆలోచనలు ఈదారిపడతాయనుకోలేదు. చక్కగా చదువుకున్న పిల్ల బైటిప్రపంచాన్ని వదిలేసి, నాలుగ్గోడలమధ్య ద్వేషాలూ, పగలూ రగుల్చుకుంటూ బతుకుతోంది. తల్లి చేసింది తప్పు, తను చేసిందీ తప్పే. దాన్ని దయగా చూడలేదు. కఠినంగా ప్రవర్తించింది. అలాంటి జీవితంలోంచీ బైటపడిన పిల్లపట్ల వెరుపు. దాన్ని చూడాలన్నా, ముట్టుకోవాలన్నా ఆ పరాయిమగవాళ్ళు గుర్తొచ్చి వళ్ళుజలదరించేది. వయసులో పెద్దది, కన్నతల్లే అణచుకోలేని భావాలని పిల్ల ఎలా సహిస్తుందని ఆలోచించలేదు. ఉద్యోగంకూడా చెయ్యనివ్వలేదు. సంతోష్‍తోపాటు తనుకూడా ధైర్యం చెప్పి, ప్రోత్సహిస్తే చెయ్యగలిగేదేమో! సంతోష్ పనిచేసేచోటికి తామంతా వెళ్ళిపోయి వుంటే వేరేవిధంగా వుండేదేమో! ప్రపంచాన్ని చూడటానికి తనూ భయపడింది. డబ్బుందన్న గర్వం కొంత. అవమానం ఇంకొంత. కొడుకు జీవితమేనా బావుందాలనే స్వార్థం మరికొంత. దాని కడుపులో పడ్డ శిశువు. తండ్రెవరో తెలీని అవ్యక్తరూపం. పుట్టనిస్తే బావుండేదేమో! పుట్టాలని వీణా కోరుకుందేమో! ఆవిడ మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళుతిరుగుతున్నాయి. కొన్ని నిర్ణయాల దిశగా తోసుకెళ్ళాయి.
సంతోష్‍కి చెయ్యాలని ఫోన్ తీసుకుంది లీల. మళ్ళీ మానేసి, తనే లేచి వెళ్ళింది. డోర్‍బెల్ నొక్కితే నిద్రలోంచీ లేచి వచ్చి తీసాడు. తల్లిని చూసి అశ్చర్యపోయాడు. చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు.
“మంచినీళ్ళేనా జూసేనా తాగుతావా? కాఫీ?” అడిగాడు.
“ఈవేళప్పుడేంటి? కూర్చోరా! నీతో మాట్లాడాలి. తనేది? పడుక్కుందా? ఒక్కసారి లేపు. తనతోటీ మాట్లాడతాను” అంది.
అతను మరింత ఆశ్చర్యపోయి అలేఖ్యని లేపి తీసుకొచ్చాడు. ఆమెకికూడా అలానే వుంది. వచ్చి కూర్చుంది.
“అంతదూరంనుంచీ సంతోష్ చుట్టరికం పట్టుకుని మాకు సాయపడాలని వచ్చావు. చాలా మంచిపిల్లవి. పాతతరందాన్ని అంత తొందరగా మార్పుని వప్పుకోలేకపోయాను. నాకు నీమీద కోపమేం లేదు. పిల్లని చక్కగా పెంచుకోండి. అది నాకు మనవరాలే. ఎత్తుకుని తిప్పకపోయినా నేను దానికి మామ్మనే. పిలిపించు, పలుకుతాను” అని మూడువరసల గొలుసొకటి, చిన్నగొలుసొకటి చేతిలో పెట్టింది.
“అయ్యో! ఇవన్నీ దేనికి? మీరు నన్నొప్పుకున్నారు, అది చాలు” అంది అలేఖ్య మనసులో అంత గౌరవం కలగకపోయినా. లీల తిరస్కారాన్ని మర్చిపోవడానికి టైం పడుతుంది.
“సంతోష్! వీణపట్ల నా ప్రవర్తన తప్పు. ఇప్పుడు నేను మార్చుకున్నా అది దాన్ని వప్పుకునే స్థితిలో లేదు. వాసుకీ గీతకీ చాలా ద్రోహం చేసాం. నీకు సాధ్యపడితే ఒకమాటు వాళ్ళని కలిసి క్షమార్పణ అడుగు. మనవైపునించీ వాళ్ళకి ఇంకే ఆపదా రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ పరిస్థితులు మరీ చెయ్యిజారితే ముగ్గురం ఇంత విషం తీసుకుంటాం. నువ్వూ నీ భార్యా ఇక్కడినుంచీ వెళ్ళిపొండి. ఇక్కడ నీకు యింకేమీ లేదు” అంది. తమ్ముడు పెట్టించిన కేసుగురించి చెప్పలేకపోయింది.
“అమ్మా! ఏమైంది? ఈమాటలేమిటి?” ఆందోళనగా అడిగాడతను.
“వాసుది ఎంతోకొంత తప్పుంటేనే వీణ అలా చేసి వుంటుందన్న నమ్మకం, అందులోంచీ పుట్టుకొచ్చిన వుక్రోషం నాలో ఒక జీవశక్తిలా నిండి నన్ను నడిపించాయి. అతని తప్పేం లేదట. వీణే చెప్పింది. గీతమీద అత్తకి ఎక్కించి, అతన్ని తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించానని తనకి తనే చెప్పింది. అయ్యో! ఇలాంటి పిల్లని కన్నానేమిటనిపిస్తోంది. ఈ దు:ఖం తట్టుకోలేకపోతున్నాను. పూనా వెళ్తారన్న భయం వాళ్ళు పెట్టకపోతే అది ఆ భార్యాభర్తలని విడగొట్టి, విధ్వంసం చేసేది. లేదా వాసు చేతిలో చావనేనా చచ్చేది. వాడి కోపం నాకు తెలుసు. నామీదకే చెయ్యెత్తిన మనిషి వాడు. మాధవ్ అన్నది నిజం. ఇద్దర్లో ఒకరు జైల్లో కూర్చునేవారు. ఐనా ఈక్షణాన బాధతప్ప కోపంరావట్లేదు. కూతురన్న మమకారం చంపుకోలేకపోతున్నాను. ప్రేమించడానికి యిక్కడేమీ దొరక్క నువ్వీ తల్లీపిల్లలని ఆలంబన చేసుకున్నావు. దానికి అలాంటి ఆలంబన దొరక్క తపించిపోతోంది.
సరైన వయసులో పెళ్ళిళ్ళు చేసుకోక, పగలంతా ఏవో వ్యాపకాలతో గడిపేసినా రాత్రయేసరికి వంటరితనం ఆవహించి, అపరిచితులనికూడా జీవితాల్లోకి ఆహ్వానించేస్తున్నారు యిప్పటి పిల్లలు. తాత్కాలిక సంబంధాలతో గడిపేస్తున్నారు. ఇదీ అంతేనా? సంతోష్! దీన్ని నేనేం చెయ్యను? దాని బతుకు దానిదని వదిలెయ్యనా? దురదృష్టవశాత్తూ, ఇలా దెబ్బతిన్నవాళ్ళని ఇముడ్చుకోగలిగే వ్యవస్థ మనకి లేదు. చిన్నపిల్ల కాదు. ఏం చెయ్యనురా?” అడిగింది. దు:ఖం ఆగట్లేదు. పమిటకొంగంతా తడిసిపోయింది.
సంతోష్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి పక్కని కూర్చుని గ్లాసుపట్టుకుని తాగించాడు.
ఏడుస్తోంది లీల.
“మామూలుగా బతికిన జీవితాలు ఎందుకిలా మారిపోయాయిరా? ఎంతమంది ఆడవాళ్ళు అత్తమామల పొడకిట్టకుండా స్వతంత్రంగా బతకలేదు? ఎంతమంది స్వార్థపరులు బాధ్యతలు తప్పించుకుని తిరగలేదు? నా లెక్కలు నేను పెట్టుకుంటూ నిక్కచ్చిగానే బతికాను. ఒకరి సొమ్ము తినలేదు” అంది.
“అమ్మా! ప్రశ్నలూ నువ్వే అడిగి జవాబులూ నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వు చేసినవాటిని నువ్వే సమర్ధించుకుంటున్నావు. ఇంక కొత్త ఆలోచనకి చోటెక్కడిది? అలేఖ్యనీ పాపనీ వెనక్కి పంపించేస్తాను. నేను ఇంకొంతకాలం వుంటాను. మనింట్లో సమస్యని వూరిమీదికి వదిలినంతమాత్రాన పరిష్కారం అవదు. వీణ సాయం దొరికే అన్నిదారులూ మూసేసుకుంది. అది వచ్చినకొత్తలో ఫోటోలూ వీడియోలూ వచ్చేవి. క్రమంగా ఆగిపోయాయి. అందరూ మర్చిపోయేవారు. వాటికి మళ్ళీ జీవంపోసింది. వాసుని అనవసరంగా లాగింది. దీని వయసేంటి? అతని వయసేమిటి, స్థాయేమిటి?
ఎక్కడెక్కడో ఎదురుపడుతున్నాయట ఫోటోలు. మొన్నేదో పోలీసుకేసైంది. అక్కడ అవి కనిపిస్తే పాతికవేలిచ్చి తీయించాడట. అతన్ని డీఫేమ్ చెయ్యడానికి ఎవరో పంపించారని తెలిసింది. వాళ్ళకి ఇంతకన్నా పరువుతక్కువ మరేదీ వుండదుకదా? మనగురించి కాదు, వాళ్ళగురించి ఆలోచించాలి. ఇంత జరిగినా,
కాల్‍గర్లనుకుంటున్నారు దాన్ని. ఇవతలికొస్తే ఎవరేనా ఎత్తుకుపోయినా ఎత్తుకుపోతారు. జాగ్రత్తగా వుండండి- అని మెసేజి పెట్టింది అక్క. అదమ్మా, అక్కంటే! ఏ విషయానికి ఆ విషయాన్ని విడగొట్టుకుని ఎక్కడ ఏ భావం చూపించాలో దాన్ని చూపించగలదు. అంతా అందుకే తనని ఇష్టపడతారు.
ఇక మా ఆలోచన. యూరప్‍టూరో, వరల్డ్‌టూరో చేసి రండి. పరిచయాలు పెంచుకోండి. దానికి దేనిమీదేనా ఆసక్తి పుడుతుందేమో చూడండి ట్రావెల్ గ్రూప్సుంటాయి. వాళ్ళతో కలపచ్చు” అన్నాడు. లీల ఏమీ జవాబివ్వలేదు.
కన్న యిద్దరు పిల్లలకీ చక్కటి పెళ్ళిళ్ళు చేసి, మనవలని చూసుకుంటూ బతకాలన్న అతిచిన్న కోరిక తీరక మనసులో ఏర్పడిన శూన్యం క్రమంగా విస్తరించసాగింది.
“ఇంక పడుక్కోమ్మా! ఇక్కడ పడుకుంటావా?” అడిగాడు సంతోష్.
“లేదురా! అదలా రాత్రిని కొలుస్తూ వుంటుంది. దాన్ని చూస్తూ నేనుండాలి. లేకపోతే ఏ పిచ్చిపనులు చేస్తుందో తెలీదు”లేచింది లీల. తల్లిని చూస్తుంటే బాధేసిందతనికి. పరిస్థితులు ఈ మలుపులోకి రాకుండా ఆపాలని తను చేసిన ప్రయత్నాలన్నిటినీ నిలవరించిన ఫలితం యిది.


ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు కమలాక్షి అన్నగారింట్లో బెంగుళూర్లో వుంది. ముందు తోటికోడలి కూతురి డెలివరీకి సాయంగా వైజాగ్ వెళ్ళి, అట్నుంచీ పెద్దవదినగారికి పక్షవాతం వస్తే చూసుకోవడానికని ఇక్కడికొచ్చి వుండిపోయింది. నీలిమ గీతతో గొడవపడి పుట్టింటికి వచ్చేసినప్పుడు రాయబారం వెళ్ళినవాడు ఈ మేనమామే. ఇంకో రెండుమూడురోజుల్లో అవంతీపురం తిరిగొస్తుందనగా నీలిమ అన్నీ చెప్పింది.
గీతకి యింట్లోవాళ్ళే అంత ద్రోహం తలపెట్టారంటే నమ్మలేకపోయింది ఆవిడ.
ఇంతకుముందు జరిగిన గొడవలు అన్నిళ్ళలోనూ వుండేవే. గీత పినతండ్రికి అదేం బుద్ధి? స్వంతకూతురిమీద ఎంత ప్రేమేనా వుండనీ, ఆ పిల్లకి ఎంత పెద్ద కష్టమైనా రానీ, అన్నకూతురి కాపురంలో చిచ్చుపెట్టడమేమిటి? భగవంతుడా! ఇలాంటివికూడా జరుగుతాయా? వీణని తను ఎక్కువసార్లు చూడలేదు. వీళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళలో ఆఖరాయన పిల్లలతో కలిపి చెప్పుకుంటారు ఆ పిల్లని. వేలెడంత గుంట అక్కభర్తకి వలవిసరడమేంటి? పొరపాట్నకూడా ఒక్క పొల్లుమాటేనా మాట్లాడని మనిషి వాసు. అతనుతప్ప మరోలోకం లేదు గీతకి. ఇద్దర్నీ చూస్తే మనసుకి చక్కగా అనిపించేది. ఎప్పుడో పాతకాలంలోనూ, కథలూ కావ్యాల్లోనూ అంత అన్యోన్యమైన జంట వుండేవారట. వాళ్లకిలాంటి కష్టం రావడమేంటి? తల్లడిల్లిపోయింది.
బంధుత్వాలూ, బాంధవ్యాలూ, మమకారాలూ అన్నీ మిథ్యనిపించాయి ఆవిడకి ఆక్షణాన. వైభవంగా నడిపించుకున్న యింటిని వదిలేసి ఇద్దరూ ఫ్లాట్‍లో వుంటున్నారన్న విషయం బాధ కలిగించింది. ఎంతమందికి ఆశ్రయం యిచ్చారు, ఎన్ని యిళ్ళని నిలబెట్టారు! కొన్ని చెప్తే విన్నవి, కొన్ని కళ్ళతో చూసినవి. అందరూ తలో రాయీ విసిరారు వాళ్ళమీద. తనింట్లోనే జరిగింది. ఎవరికివాళ్ళు కుదుటపడ్డాక, తండ్రి పోయాక, చేసినవాటికి కూతుళ్ళకి కాస్త పశ్చాత్తాపం, చేయించుకున్నవాటికి కృతజ్ఞతా మొదలయ్యాయి.
వాసునీ, గీతనీ అన్నమాటలకి నీలిమ కాపురం నిలబడుతుందనుకోలేదు.
అది తమ్ముడి జీవితం- అని గిరిగీసుకుని దూరంగా నిలబడి, నిర్ణయం అతనికి వదిలిపెట్టి, అన్యాపదేశంగా చెల్లెలిచేత బుద్ధులు చెప్పించి, వాళ్ళిద్దరినీ విడిపోకుండా చూసారు. తర్వాతిది మానస యింట్లో. ఆరోజుని వాళ్ళు ఆశ్రయం యివ్వకపోతే పరిస్థితులు మరెలా వుండేవో! మాధురికూడా ఎంతో కొంత నేర్చుకుని కుదురుతెచ్చుకుంది.
కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయావిడకి.
“దాని మానాన్న దాన్ని వదిలిపెట్టి వీళ్ళు బాధపడటమేంటి నీలూ? మీ అత్తగారు తమ్ముడినీ మరదలినీ వదిలేసి వీళ్లతో దెబ్బలాడటం వింతగా వుంది. దాన్నేమైనా గీతకి సవితిగా తెచ్చి పెడదామనుకుంటోందా? నలుగురి చేతుల్లో నలిగిన పిల్లకూడాను? మతిగానీ పోయిందా పెద్దతనంలో ఆవిడకి? బంధుప్రీతికికూడా హద్దుండాలి” అంది.
నీలిమ నవ్వింది.”అలాంటిదేం లేదులే. నేనూ అలానే అనుకుని హడిలిచచ్చిపోయాను. పెద్దకొడుకు శ్రీరామచంద్రుడు ఆవిడకి. ఆ రాముడేమైనా ఆవిడ గీసిన హద్దురేఖలు దాటాడేమోనని భయపడింది. గీత తింగరిమాటలు తెలుసుగా,
ఐదేళ్ళే నీకతను కొడుకు. ఆ తర్వాత నేను పుట్టేసాను, అప్పట్నుంచీ నా భర్తే- అందట. అత్తాకోడళ్లమధ్య ఆ యుద్ధం ఒకటి నడుస్తోంది.
నీ యిల్లూ, నువ్వూ నాకక్కర్లేదని వెళ్ళిపోయారు. అన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది. చిన్నవిషయం కాదు. అతను బాగా హర్టయాడు ఈవిడ ప్రవర్తనతో” అంది. అంటూ ఇంకొన్ని విషయాలు చెప్పింది.
“నాకా వీణ అడ్రెసూ, అవో రెండు ఫోటోలూ పంపు. బెంగుళూర్లోనే వున్నానుగా, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‍కి ఫోటోలు చూపించి, వాళ్లకి యిల్లెక్కడా పుట్టకుండా చేస్తాను. ముందైతే వున్న యిల్లు ఖాళీ చేయిస్తాను” అంది కోపంగా.
“నీకెందుకు?” అని నీలిమ ఆపబోయినా వినలేదు. వీణకి ఏదో ఒకలా బుద్ధిచెప్పాలన్న కోరిక ఆమెకీ వుందికాబట్టి పెద్దగా తర్కించకుండా తల్లి అడిగివినవి పంపించింది. తీరా చూస్తే ఆవిడున్న అపార్టుమెంటులోనే సంతోష్‍వాళ్ళూ వుండేది. టవర్లు వేరు. లీల, కమలాక్షీ ఇప్పటిదాకా ఎదురుపడలేదు. ఎదురుపడితే పోల్చుకునేవారు. అన్నగారికి చెప్పింది. ఆయనకీ నచ్చలేదు.
“నువ్వెళ్ళాక నేను చూసుకుంటాను. మళ్ళీ వాళ్ళు నిన్ను గుర్తుపడితే బావుండదు” అన్నాడు. అలాగే ఆవిడ అవంతీపురం వచ్చేసాక అసోసియేషన్ ప్రెసిడెంటుతోటీ, సెక్రెటరీతోటీ మాట్లాడాడు. మాత్లాడుతుంటే ఇంకో ముగ్గురునలుగురు అక్కడికి చేరారు. ఫోటోలు చూపించి,
“ఈ అమ్మాయి తల్లిదండ్రులతో నాలుగొందల ఐదులో వుంటుంది. అలాంటివాళ్ళు ఇక్కడుండటం మర్యాదకాదు. ఓనర్స్‌తో మాట్లాడి వెంటనే ఖాళీచేయించండి. ఆమె అన్నది పక్కఫ్లాట్. చెల్లెలిని ఇంట్లో వుంచుకోవడానికి అతనికే యిష్టంలేనట్టుంది. అతన్ని పిలిచి మాట్లాడండి” అని గొడవచేసారు. అది చిలికిచిలికి ఇంకాస్త పెద్దదైంది. అంతా చదువుకున్నవాళ్ళేగానీ, అదుగో తోకంటే ఇదుగో పులని భయపడే మనుషులు. ఏదెలా వస్తుందోననే, ఏదో జరుగుతుందనే అభద్రతాభావం నరనరాన్న నింపుకుని బిట్సూబైట్సూ కాని ప్రపంచాన్ని చూస్తే కంగారు. అప్పటికప్పుడు సంతోష్‍ని పిలిచి మాట్లాడేదాకా ఆగలేదు.
ఒక్కమాటకూడా తిరిగి చెప్పలేదు అతను. తలదించుకుని విని, తలూపి వచ్చేసాడు. ఆఫీసునించీ తనింటిదాకా వేసిన ప్రతిఅడుగులో, అవమానపు ప్రతిజ్వాలలో తనలో తనకి వాసు కనిపించాడు.
“ఎలా వున్నావురా వాసూ?” అతని మనసు ఆక్రోశించింది.
“మీరు వెంటనే ఇక్కడ ఖాళీచేసి హైద్రాబాద్‍లో మనింటికి వెళ్ళిపోండమ్మా! ఫ్లాటు ఇంకా ఖాళీగానే వుందికదా? అలేఖ్యని వెనక్కి పంపించి నేనొస్తాను. మీ ఫారిన్‍టూరుకి ఏర్పాట్లు చేసాక నేనూ వెళ్ళిపోతాను” అన్నాడు.
“ఏం జరిగిందిరా?” పాలిపోయిన అతని ముఖంచూస్తూ అనుమానంగా అడిగింది.
“తిని కూర్చుని తిన్నదరక్క పరువుతీసుకుంటే యిలానే వుంటుంది. కింద గొడవైంది. చెల్లిని ఇక్కడ వుంచద్దన్నారు”
“సంతోష్!!” తెల్లబోయింది.
“పాపకి తండ్రిలేని లోటు తీరుస్తానని ప్రమాణం చేసి అలేఖ్యని పెళ్ళిచేసుకున్నాను. మనకి చెందని పిల్లకి ఇలాంటి అవమానకరమైన వాతావరణంలో పెరగాల్సిన అవసరం లేదు. పెద్దపెద్ద తప్పులూ, పొరపాట్లూ జరుగుతాయి. వాటిలోంచీ బైటపడటానికి ప్రయత్నంచేస్తారు ఎవరేనా. బైటిప్రపంచానికి వున్న దారులన్నీ మూసేసుకుంటూ, చీకట్లో కూర్చుంది చెల్లి. నిన్న నువ్వన్నావే, దానిమీద మమకారం చావట్లేదని, నాకూ అలానే వుంది. సర్వైవల్ గిల్ట్ అంటారు. ఒకతల్లి బిడ్డలం యిద్దరం. నేను బావున్నాను, దానికంత పెద్దకష్టం వచ్చిందన్న బాధ నన్ను నిలువునా కుదిపేస్తూ వుంటుంది. నేను సుఖంగా లేను. సుఖాన్ని యింకా వెతుక్కుంటున్నాను. కొంత ఆలస్యంగానేనా మీరు గీతని కలిసారని సంతోషపడ్డాను. అక్కలు, వదినలు అందరూ కలిస్తే దానిమొహంలో నవ్వు వెలుగుతుందనుకున్నాను. అలాంటిదేం జరగట్లేదు. చాలా అవమానంగా వుంది. మన బురద వాసుకి అంటించాం. బావ కాళ్లమీదపడి క్షమార్పణ చెప్పినా మనం చేసినదానికి నిష్కృతి లేదు” అన్నాడు చేతుల్లో ముఖం కప్పుకుని.
అలాగే మ్రాన్పడి కూర్చుండిపోయింది లీల.
వెంటనే మార్పులన్నీ జరిగిపోయాయి. అలేఖ్య వెనక్కి వెళ్ళిపోదామనుకుంటున్నదేకాబటి పెద్దగా తటపటాయించలేదు. ఆమె యూయస్ బోర్న్. గ్రీన్‍కార్డు హోల్డరు. తనలాంటివాళ్లని ఎగిరిగంతేసి చేసుకుంటారు ఇండియన్స్. నిలదొక్కుకున్నాక మోసంకూడా చేస్తారు. సంతోష్ సిన్సియారిటీ నచ్చి చేసుకుంది. ఇప్పుడేనా తనని వదిలేస్తాడన్న భయం లేదామెకి. వీళ్లని హైదరాబాద్‍కి మార్చాక వాసు, గీతలని కలవాలనుకుని వస్తానని మెసేజి పెడితే,
“దేనికిరా? మీతో అనవసరం తలనొప్పి మాకు. పరువుతీసి బజార్న పెట్టారు. తలెత్తుకోలేకపోతున్నాం. పెళ్ళిచేసుకున్నావు, సంతోషం. మా ఆశీస్సులు నీకెప్పుడూ వుంటాయి” అన్నాడు వాసు. సంతోష్ చిన్నబుచ్చుకున్నాడు. అలా అనడంలో వాసు తప్పేంలేదని మనసు సరిపెట్టుకున్నాడు.
రాణాతో స్నేహం మొదలుపెట్టింది వీణ. మొదటిసారి యిద్దరూ కాఫీషాప్‍లో కలుసుకున్నారు. ఎన్నోయేళ్ల తర్వాత చాలా మారిపోయి కనిపిస్తున్న వీణని చూసి బాధపడ్డాడు. ఫోన్లో మాట్లాడుకోవడం వేరు, ఇలా కలిసి మాట్లాడుకోవడం వేరు.
“ఇంకా జరిగినవన్నీ మర్చిపోలేదా వీణా? జాబేదైనా చేస్తున్నావా? అంత తోచకపోతే మాయింటికి రావచ్చుకదే? అమ్మ, అక్క వున్నారు. ఈ అక్కకూడా మంచిదే” అన్నాడు.
“పాతచీరలు అద్దెకిచ్చే బిజినెస్ చేస్తుందటకదా? నువ్వెలా వప్పుకున్నావు అందుకు?” ఠపీమని అడిగింది. గతుక్కుమన్నాడతను. ముఖంలో రంగులు మారాయి. వాసుమీద మనసుపడ్డ వీణని తను కొంచెం గ్రూమ్ చేసి గీతకి వ్యతిరేకంగా వాడుకోవాలనుకున్నాడుగానీ, ఆమెతో జాగ్రత్తగా వుండాలనేది అర్థమైంది. అలాంటి చెత్త బిజినెస్ చేస్తున్నందుకు యమునమీద బాగా కోపంకూడా వచ్చింది. ఇంటికెళ్ళేసరికి ఆ కోపం తగ్గకపోతే చితక్కొట్టేస్తాడు.
“నీకూ వాసూవాళ్ళకీ గొడవలేంటి? కొట్టుకోబోయారంటకదా?” అతన్ని మాట్లాడనివ్వకుండా వెంటనే తనే అడిగింది. తెలుసు. ఐనా ఏం చెప్తాడోనని.
“ఎప్పటిమాటో అది. ఇప్పుడలాంటివేం లేవు” అన్నాడు.
“ఒట్టి గేస్” అంది వీణ నవ్వి. పల్లవి గుర్తొచ్చింది. ఎవరేనా అబద్ధం చెప్తున్నారనిపిస్తే అలానే అనేది. అతనూ నవ్వాడు.
“నీకున్నవి చాలవా? మా గొడవలు నీకెందుకుగానీ, సినిమాకెళ్దామా?” అడిగాడు మాటమార్చి. కాఫీతాగి ఇద్దరూ సినిమాకి బయల్దేరారు. ఏదో మామూలు సిన్మా. పెద్దగా రష్ లేదు. వెళ్ళి కూర్చోవాలనేతప్ప యిద్దరికీ సినిమామీద అసక్తి లేదు. చాలా సమాచారం మార్పిడి చేసుకున్నారు. వాళ్ళు థియేటర్లోంచీ వస్తుంటే సంధ్య యిద్దర్నీ చూసింది. వళ్ళూ పై తెలీని కోపంతో వణికిపోయింది. వీణ యింటికి చేరేసరికి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె ఆవిడ్ని చూసి పట్టనట్టు గదిలోకి వెళ్ళిపోయింది. తిట్లదండకం అందుకుంది సంధ్య.
“ఏమే, వాసు లొంగట్లేదని నా కొడుకు వెంటపడ్డావా? వాడెంత శ్రీరామచంద్రుడో వీడూ అంతే. సిగ్గులేదా నీకు? ఎవరింట్లో పుట్టావో తెలుసా నువ్వు? అవంతీపురం విజ్జెమ్మగారి మనవరాలివన్న విషయం మర్చిపోయావా? ఏమీ లేకపోయినా తొమ్మండుగురు పిల్లల్ని పెంచి పెద్దచేసిందావిడ. అన్నీ వుండి నువ్వు రికామీగా తిరుగుతున్నావు. నీ బతుకు తగలడిందని మిగతావాళ్ళ బతుకుల్లో నిప్పులుపోస్తున్నావా?” నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టింది. పరాయిఆడదానివల్ల తన జీవితం నాశనమైంది. యమునమీద జాలితప్ప పెద్ద ప్రేమేం లేకపోయినా, తనకి జరిగిన అనుభవం సాటి ఆడపిల్లకి జరగకూడదన్న ఆక్రోశాన్ని ఎన్నో యేళ్ళనుంచీ అనుభవిస్తున్న క్షోభతో కలగలిపి అనరానివీ చెప్పుకోలేనివీ, మాటలన్నీ వెళ్లగ్రక్కింది. తన జీవితంలో వున్న బైటిస్త్రీని మనసులో ధారణచేసి ఆ కోపమంతా వీణమీద వెళ్లగ్రక్కింది.
“అప్రయోజకుణ్ణే కట్టుకుంది యమున. ఐతేనేం, తను ప్రయోజకురాలై వాడినీ పిల్లలనీ నిలబెట్టుకుంది. ఇన్నాళ్లకి వాడికి కుదురొచ్చి భార్యని తెచ్చుకుని కాపురం పెట్టాడు. వాడి జీవితం నాశనం చేద్దామనుకుంటున్నావా?” అరిచింది.
“సంధ్యా! ఏం జరిగిందే? చూడు, నీకసలే బీపీ వుంది. అరిస్తే ఇంకాస్త పెరుగుతుంది” అన్నాడు శేఖర్ అక్కని భుజంచుట్టూ చెయ్యేసి పొదువుకుని సోఫాలో కూర్చోబెడుతూ. అప్పటికే జరిగిందేమిటో అర్థమైంది. లీలకైతే తల వంగిపోయింది. తను కూతురికి యివ్వబోయిన స్వేచ్ఛకి ఫలితం ఎలా వుంటుందో కనిపించింది.
“దాన్ని అదుపులో పెట్టండిరా! ఖర్మకాలినవాళ్లంతా ఎలా బతుకుతారో అలా బతకాలని నేర్పండి. నీ కూతురు నీకు ముద్దైనట్టు మా పిల్లలు మాకూ ముద్దేకదా? గీతేం ద్రోహం చేసిందిరా, మీకు? కాపురాలు చిటికెలపందిర్లలాంటివి. చిటికేస్తే కూలిపోతాయి. నాన్నా! కాపురాలు కూలిపోతే, భర్తలు వదిలిపెట్టేస్తే ఆడవాళ్ళు బతకలేరురా! పదేళ్ళో పాతికేళ్ళో కాపురాలు చేసి, పిల్లల్ని కని, ఆ కట్టుకున్నవాడికే అంకితమైపోయిన ఆడమనుషులు వాడు కాదంటే ఎక్కడికిపోతారు? ఎలా బతుకుతారు? నీ కూతుర్ని కళ్ళెదురుగా చూస్తున్నావు. భర్త దానికి ద్రోహంచేసాడు. దాని వెనకటి జీవితం తెచ్చివ్వగలవా? లేదుకదూ?” నచ్చజెప్తున్నట్టు అని మళ్ళీ గొంతుపెంచింది.
“వదినా! ఇది సంసారుల యిల్లు. ఇలా అరిస్తే చుట్టుపక్కలవాళ్ళకి వినిపిస్తే పరువుపోతుంది. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను” అంది లీల కన్నీళ్ళతో. వీణ విసురుగా ఇవతలికి వచ్చింది.
“ఏంటి తెగ అరుస్తున్నావు? వాళ్ళకి జవాబు చెప్పడం రాక నిన్ను చూసి భయపడుతున్నారు. నా స్థాయెంత? వాడి స్థాయెంత? పాతచీరలు అద్దెకిచ్చుకుని బతుకుతున్నారు. టైంపాస్ కావట్లేదని యింత కాఫీ పోయించి సినిమాకి తీసుకెళ్ళాను. తాగించిన కాఫీ కప్పు ధరెంతో తెలుసా? ఎప్పుడేనా తాగాడా అలాంటిది? నోరుమూసుకుని వెళ్ళు” అంది విసురుగా.
సంధ్య చెయ్యెత్తింది. వీణకూడా ఎత్తింది. ఆ చెయ్యలాగే గాల్లో పట్టుకుని ఆ చెంపా యీచెంపా వాయించేసి,
“జాగ్రత్త. ఒళ్ళు దగ్గిరపెట్టుకుని బతుకు. ఇంకోసారి రోడ్డుమీద ఎక్కడేనా రాణాతో కనిపించావంటే నీకు ఇదే సత్కారం” అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. లీల నిర్ఘాంతపోయి చూస్తుంటే,
“వీళ్ళా నాన్నా, నీ అక్కలు?” అసహ్యంగా చూసి అక్కడినుంచీ వెళ్ళిపోయింది వీణ.
“వీణా! ఈ గొడవలన్నీ భరించలేను. ఏదేనా జాబ్ వెతుక్కుని వెళ్ళిపో. నీకు తోచినట్టు బతుకు” అంది లీల కూతురిని బెదిరించాలని.
“నాకా అవసరం లేదు. దీన్ని నాకు విల్లు రాసిచ్చాడు నాన్న. సంతోష్ విట్‍నెస్ పెట్టాడు. వాడిక్కడ వున్నప్పుడే నాపేర్న రిజిస్టరు చెయ్యండి. నాయింట్లో పడి మీరే తింటున్నారు. నాకు రక్షణ యివ్వలేకపోతున్నారు. ఇంటికొచ్చి ఆవిడ అంత న్యూసెన్స్ చేస్తుంటే సెక్యూరిటీని ఎందుకు పిలవలేదు? ఇది రెండోసారి. అప్పుడంటే మాత్రలమత్తులో వున్నాను” అంది.
భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. కూతురిమీది ప్రేమతో ఆమెకి ఓదార్పు, ధైర్యం వుందాలని శేఖర్ చేసినపని యిలా ఎదురుతిరిగింది. చక్కగా చదువుకుని, వుద్యోగం సంపాదించుకుని, తల్లిదండ్రులు చెప్పారని వుద్యోగం వదిలిపెట్టి పెళ్ళిచేసుకుని, జీవితాన్ని భ్రష్టుపట్టించుకుని తిరిగొచ్చిన తొలిమూడు నాలుగేళ్ళ నిరాదరణ, వాసు చేతిలో ఎదురుదెబ్బ తర్వాతి మార్పు ఇది.
లీల రాత్రంతా ఏడుస్తునే వుంది.
వీణ తన బేంకు అకౌంటు చూసుకుంది. వాసుతో వ్యవహారానికి చాలా ఖర్చుపెట్టింది. మార్ఫింగ్ సాఫ్ట్‌వేర్ కొంది, ఫోటోలు విడిగా ఎన్క్రిప్ట్ చేయించడానికి సాఫ్ట్‌వేర్ లేబ్‍కి పంపింది. ఆ లేబ్ నడిపే సాఫ్ట్‌వేర్ కంపెనీ బోగస్‍ది. వాళ్ళు డబ్బుకావాలనీ లేకపోతే వాటిని సర్కులేట్ చేస్తామనీ బెదిరిస్తున్నారు. చాలా డబ్బే యిచ్చింది వాళ్ళకి. ఇంకా అడుగుతున్నారు. ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి? అలాంటివి చాలా చూసిందికాబట్టి తనకేం సిగ్గులేదు. ఇప్పటిదాకా ఇంట్లోయింట్లోనే కాబట్టి వాసు వూరుకున్నట్టున్నాడు. ఇంకేదైనా జరిగితే పూనా వెళ్ళి వాళ్ళని వెంటబెట్టుకుని వస్తాడు. వీళ్ళని అతనికే అంటగడితే? ఏదో ఒకటి చేస్తాడు. సమస్య వదిలిపోతుంది. ఆలోచన రావడం ఆలస్యం,
ఫోటోల్లో నేనొక్కదాన్నే లేను. మరొకతనుకూడా వున్నాడు. అతనికి చాలా డబ్బుంది. అతన్ని చూసుకోండి. ఇంక నాదగ్గిర లేదు- అని వాసు ఫోన్‍నెంబరుతోపాటు మెసేజి చేసింది.
శేఖర్ యింట్లో జరిగిన విషయాన్నీ వూరూవాడా వినిపించేట్టు అన్నిళ్ళలోనూ ప్రచారంచేసింది సంధ్య. రాణాలాంటివాడిని కొడుకని వెనకేసుకొచ్చిన చెల్లెలిని చూసి, లక్ష్మి తెలతెలబోయింది.
రాణా దగ్గిర తీసుకున్న అడ్రెసు వెతుక్కుంటూ ఒక సాయంత్రంవేళ వాసు యింటికి బయల్దేరింది వీణ. వాసు రామస్వామితో బైటికి వెళ్ళాడు. గీత యింట్లోనే వుండి పుస్తకం చదువుకుంటోంది. ఇంటర్‍కం మోగింది.
“అమ్మా! మీకోసం ఎవరో మేడం వచ్చారు. పేరడిగితే చెప్పట్లేదు. విజిటర్స్ బుక్‍లోకూడా రాయరట” సెక్యూరిటీ చెప్పాడు. గీత కొద్దిగా గెస్ చేసి, కిందికి వచ్చింది. గేటవతల సెక్యూరిటీతో ఘర్షణపడుతున్న వీణని చూసింది. ఎందుకొచ్చింది యిది? వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తునే ముందుకి వెళ్ళింది.