ఝరి 200 by S Sridevi

  1. ఝరి 200 by S Sridevi
  2. ఝరి 202 by S Sridevi
  3. ఝరి 203 by S Sridevi

మయూ ఎలాంటి కోచింగ్ లేకుండా సీటు తెచ్చుకోవడం ఫేకల్టీగా తనకి పెద్ద థ్రిల్. వాసు కొడుకు. అతని రెప్లికా. గీత గారాబాల వెన్నముద్ద. ఇద్దరూ వాడిని పెద్దగా ఎత్తుకుని తిరిగింది చూడలేదు. కానీ కళ్ళు మెరుస్తుంటాయి వాడిగురించి చెప్తుంటే. వాడంటే చాలా ముద్దు తమందరికీకూడా. తరువాతితరంలో మొదటివాడని. చిన్నప్పుడంతా గీతకొడుకునని చెప్పుకుని తిరిగాడట. కాస్త పెద్దయాక, నిన్ను మీ అమ్మ మింగేసి మళ్ళీ బైటికి తీసిందని పల్లవి చెప్తే అది నమ్మేవాడట. ఇంట్లో వంటంతా నేనే చేస్తున్నానన్నాడు గొప్పగా.
“ఏమిటే?” అని గీతనడిగితే విరగబడి నవ్వి,
“ఎలక్ట్రిక్ కుక్కర్లు కొన్నాను. అన్నానికీ, పులుసుకీ వాటిల్లో వేసి పెడితే వీడు స్విచ్చిలు వేస్తాడు. వండేస్తున్నాననుకుంటాడు” అంది.
ఈ సరదామాటలన్నీ వదిలేసి, లేనిపోని గొడవలు దేనికో?
ఇప్పట్నుంచీ వదిలిపెట్టి వుండలేమంది గీత. ఏ అమ్మానాన్నలకేనా అంతే. వాళ్ల ప్రేమకి సరితూగే ప్రతిఫలమిచ్చాడు వాడు. హాస్టల్లో వుండే పిల్లల్ని చూస్తుంటే తనకే దిగులేస్తుంది. బెంగపెట్టుకుంటారు, యేడుస్తుంటారు, సరిగ్గా తినరు. స్నానాలు సరిగ్గా చెయ్యలేరు, బట్టలు వుతుక్కోలేరు. ఐనా చదువు, చదువని రాపాడటమే. ఎందరికి సీట్లొస్తున్నాయి? తమ కాలేజిలో ఒకళ్లకో ఇద్దరికో వస్తే అదో పెద్ద సంచలనం.
“ఓమాటు ఆ పిల్లలిద్దర్నీ తీసుకురా సమీరా! ఎలా చదివారో స్టడీప్లానేంటో అడుగుదాం” అంది అత్తగారుకూడా ముచ్చటపడి. కొడుక్కిలాగే ఆవిడకీ భర్తకీకూడా వాళ్ళ కాలేజి పేరు వేసుకోనివ్వలేదని కాస్త కోపం వున్నా వాళ్లు బైటపడలేదు. ఆవిడ అడిగిందని సమీర వాసుకీ గీతకీ ఫోన్ చేసి ఆహ్వానించింది. లక్ష్మికి ప్రత్యేకంగా చెప్పింది. ముగ్గురు పిల్లల్నీ తీసుకుని వెళ్ళారు. మొత్తం సమీర కుటుంబం అంతా యింట్లోనే వుండి వాళ్లని రిసీవ్‍చేసుకున్నారు.
లక్ష్మి చదువుకున్నది, చదువుకున్నట్టే మాట్లాడింది. ఇల్లూ, పిల్లలూ, వంటలూ, పనులూ కాకుండా ఇతరవిషయాలు చాలా దొర్లాయి వాళ్ల సంభాషణలో. పుస్తకాలూ, ఆటలగురించీ మాట్లాడింది. ఇంతకాలం వీళ్లతో పరిచయం పెంచుకోనందుకు కాస్త బాధపడింది సమీర అత్తగారు. వాసు, గీతల్లో ఆకర్షణ కనిపించింది. గవర్నమెంటు వుద్యోగాలూ, డబ్బూ వున్నాయి. చాలెంజిలు తీసుకోకుండా సజావైన మార్గంలో సులువుగా వెళ్ళిపోతున్నారు. భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమా, గౌరవం వున్నాయి. పెద్దావిడకి గౌరవం యిస్తున్నారు. మయూనీ, వెంకటలక్ష్మి మనవడు- వాడికి యిప్పుడో పరిచయం, పేరు కావాలిగాబట్టి సేతు- సేతునీ చూసి చాలా సరదాపడింది. విహీకూడా నచ్చాడు. వాళ్ళ చదువుకి సంబంధించి ఎన్నో ప్రశ్నలడిగింది. ఆవిడకి తమ కాలేజి పరిధులు తెలుసు. వాసు, గీతలనుంచీ వాళ్ళ పిల్లలగురించి పెద్దగా ఆశించలేదు. రెసిడెన్షియల్లో వెయ్యాలనుకుంటే వాళ్ళ ఎంపికలో తమ కాలేజి వుండదు. వాళ్ళేకాదు, తమింటి పిల్లలకికూడా ఎంపికకూడా ఇది కాదు.
“భలే వున్నారు అందరూను. మీవాళ్లందరిలోకీ కాస్త భిన్నంగా వున్నారు. భార్యాభర్తలిద్దరూ మంచి తెలివిగా, చురుగ్గా వున్నారు. తగ్గట్టే పిల్లలూను” అంది ఆవిడ.
“అన్నయ్య, వదిన ఇద్దరూ బాగా గారాబంగా పెరిగారు. అటూయిటూ చాలామంది పెద్దవాళ్ళుండేవాళ్ళు. అంతా వీళ్ళిద్దరినీ ప్రేమగా చూసుకునేవారు” అని సమీర వాసుగురించి ప్రశంసగా మరో రెండుమాటలనేసరికి శశిధర్ ముఖం ఎర్రబడిపోయింది.
“ఎంత తెలివీ డబ్బూ వున్నా ఆఫీసరుముందు చేతులుకట్టుకుని నిలబడి యస్ బాస్ అనే వుద్యోగాలే ఇద్దరివీ” అన్నాడు హేళనగా.
“ఎవరి వుద్యోగాలు అల్టిమేట్? ఎంత పెద్ద వుద్యోగం చేసినా, పైన యింకెవరో వుంటారు. శశీ! వాళ్ళు కెరీర్ కాంప్రమైజ్ అయ్యారు. ప్రమోషన్లుకూడా తీసుకోవట్లేదు” అంది సమీర.
“ఏం ప్రమోషన్లొస్తాయి? చిన్నగుమస్తా పెద్దగుమస్తా ఔతాడు. అంతేకదా? అమ్మా! నాలుగు పుస్తకాలు చదివి, పాష్‍గా స్టైలిష్‍గా కనిపించేసరికి వీళ్లంతా తమ స్టేచర్లు మర్చిపోయి అన్న చిటికేస్తే మాస్, అన్న అడుగేస్తే మాస్ లెవెల్లో ఆయన చుట్టూ తిరుగుతుంటారు” తల్లిని సంభాషణలో కలిపాడు.
“అందరిళ్లలోలా కాకుండా వీళ్ళింట్లో అంతా ఏకకుటుంబంలా వుంటారు. అందర్లోకీ ఇతను పెద్దవాడుకదా, అందుకు కాస్త అభిమానం వుంటుంది” సర్దిచెప్పిందావిడ.
“వాసు మాధవ్‍కన్నా తెలివైనవాడు. సుధీర్‍కీ వాడికీ చదువులో పోటీ వుండేది. అనుకోకుండా వాళ్లింటి పరిస్థితుల్లో మార్పొచ్చింది. ఆమ్మని వదిలిపెట్టి వుండలేక వచ్చిన వుద్యోగంలో చేరిపోయాడు. కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌కూడా రాయలేదు” చురుగ్గా జవాబిచ్చింది సమీర.
“ఫెయిల్యూర్సంతా అలానే చెప్పుకుంటారు” ఎద్దేవాగా అన్నాడు. చివుక్కుమంది ఆమెకి.
ఏమిటితను? వాసుని చూస్తే ఎందుకిలా చిరాకుపడుతున్నాడు? పెద్దపెద్ద వుద్యోగాలూ హోదాలూ సమాజంలో తిరగడానికి కావాలేమోగానీ, యింట్లో మనుషులమధ్యని దేనికి? ఇప్పటిదాకా ఎవరూ వాళ్లనలా అనలేదు. తక్కువగా చూసింది లేదు. సుధీర్ అమెరికానుంచీ వచ్చి, వీడిని అతుక్కుపోయి తిరిగాడు. జో, శ్రీధర్ అందరూ గౌరవిస్తారు. ఇంటిగొడవ ఎలా వున్నా, తన తండ్రికూడా యిష్టపడేవాడు వాసుని. ఏం తక్కువ వాడికి? అందరూ అసూయపడాల్సిన జీవితం. చక్కటి యిల్లు, ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్య, చుట్టూ ప్రాణం పెట్టే మనుషులు, టైమ్ టు టైమ్ వుద్యోగం. ఏదో ఒకటి కుదరడానికే అందరికీ మహాయజ్ఞమౌతుంది. అన్నీ కలిసొచ్చాయి వాడికి. నిజానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు తమలో ఎవరూ ఎంజాయ్ చెయ్యట్లేదు. ఎవరి స్ట్రెస్ వాళ్లకే వుంది. పుస్తకాలు ఎవరు చదవగలుగుతున్నారు? నచ్చినట్టు ఎవరు వుండగలుగుతున్నారు? వాసుని యింకొక్కమాట అన్నా భరించే స్థితిలో లేదు సమీర. అందుకే వాదన ఆపేసింది.
తర్వాత తోటికోడలు చెప్పింది.
“అన్నదమ్ములిద్దరూ ఒక్కలాంటివాళ్ళే సామ్! ఎవర్నీ వీళ్లముందు పొగడకూడదు. మూసేసాక మా తలుపుల వెనక కేవలం సరదాలూ, సరసాలూ మాత్రమే వుంటాయనుకుంటున్నావా? అదేం లేదు. మీ అన్నలా చేసాడు, మీ నాన్న యిలా అన్నాడు, మీ అమ్మకేం తెలీదు యిలాంటివే నడుస్తాయి. మనవాళ్లని మనం గొప్పనుకుంటేకూడా భరించలేరు. వాసు, గీత నీ స్వంత అన్నావదినలు కారు. వాళ్లగురించి మీరు వాదించుకోవడం, మాటలనుకోవడం దేనికి? ఇదివరకట్లా నీతో లాక్కెళ్ళి శశిని కూర్చోబెట్టడానికి మీ నాన్నకూడా లేరు. నాన్నే లేకపోయాక అన్నదమ్ములు ఎంతవరకూ మనకోసం నిలబడతారు? వదిలేసెయ్. నీకున్నది యిదొక్కటే బంధం. నువ్వూ, శశీ, పిల్లలూ అనే చిన్న గిరిగీసుకుంటేనే సుఖంగా వుండగలుగుతావు” అంది.
సమీరకి జీవితం ఇదివరకట్లా లేదని, వుండబోదని అర్థమౌతోంది.


మయూ, సేతుల కౌన్సిలింగ్ అయింది. ఎవరి కాలేజిలో వాళ్లని చేర్పించారు. సేతు తల్లి ఖర్చంతా పూర్తిగా వీళ్లమీదే వదిలిపెట్టలేదు. కష్టపడి దాచుకున్న డబ్బు తీసి యిచ్చింది. ఆఖర్లో ఆవిడ భర్త తనూ వున్నానని తయారయ్యాడు. అతనైతే భార్యని వదిలిపెట్టాడుగానీ, చట్టపరమైన బంధం యింకా ఇద్దరిమధ్యా వుంది. ఫార్మాలిటీసన్నీ అతనితోనే చేయించాల్సి వచ్చింది.
“ఎప్పుడేనా నన్ను చూడటానికి వస్తారా? నాతో ఫోన్లో మాట్లాడతారా?” వాసునీ గీతనీ పట్టుకుని ఏడుస్తూ అడిగాడు ఆ పిల్లాడు. వయసుని మించి ఎదిగాడు వాడు. వాళ్ల తనకేమీ కారని తెలుసు. కేవలం వాళ్ల సంకల్పం, సాయంతోనే తను ఇంతదాకా రాగలిగాడని తెలుసు. బంధాలూ, బాధ్యతలూ అన్నీ గ్రహించాడు. ఎలుకలూ, బొద్దింకలూ, చీమలూ తిరుగుతుండే తమ యింటికీ, రాజమహలులాంటి మయూ యింటికీ తేడాని మనసులో నిలుపుకున్నాడు. అలాంటిచోట కూర్చుని ప్రశాంతంగా చదువుకోగలిగే అవకాశం దొరికినందుకు ప్రస్ఫుటంగా కాకపోయినా కృతజ్ఞత వుంది. తల్లి నేర్పింది.
వాసు, గీత ఎంతో ఓదార్చారు వాడిని.
సేతు తల్లిదండ్రులిద్దరూ వాసూగీతల కాళ్లముందు కూలబడ్డారు.
“మాతోపాటు వంటలు చేసుకుంటూ బతకాల్సిన పిల్లాడిని ఎంత పైకి తెచ్చారయ్యా? ఇలాంటి చదువులుంటాయనికూడా మాకు తెలీదు” అన్నారు. అవకాశాలు వుంటాయి. అవి వున్నాయని తెలిస్తే ప్రయత్నాలు మొదలుపెట్టచ్చు. ఉన్నాయనికూడా తెలీకుండా కొందరూ, తెలిసినా అందుకోలేక కొందరూ సామాన్యంగా మిగిలిపోతున్నారు.
ఖర్చు బాగానే వచ్చింది. ఇంకా కంప్యూటర్లు, పుస్తకాలు చాలా వుంటుంది. ఎవరెవరికి ఎక్కడినుంచీ తీసి పెట్టాలనే కచ్చితమైన ప్లానింగ్ వుంది వాసు దగ్గర. మ్యుచువల్ ఫండ్‍లలో వున్న పెద్దమొత్తాలన్నీ అప్పటికే చాలావరకూ పుల్ చేసి ఫిక్స్ చేసాడు. పెట్టి చాలాకాలమైందనీ, డివిడెండ్ బాగా వచ్చిందనీ అతను తీసేసాడు, ఆ వెంటనే మొదలైన మార్కెట్ క్రాష్ అతన్ని మరోసారి నక్కతోక తొక్కిన అదృష్టవంతుడిని చేసింది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. డబ్బు యథాతథంగా తప్ప మరే రూపంలో వున్నా విపరీతంగా పెరుగుతోంది.
మయూకోసం బాగా బెంగపెట్టుకున్నారు వాసూ గీతలు. ఇల్లంతా వెల్తిగా అనిపిస్తోంది. కాలుకాలిన పిల్లుల్లా వాడి వస్తువుల చుట్టూ తిరుగుతున్నారు. గీతైతే తిండికూడా మానేసి కళ్లమ్మట నీళ్ళు పెట్టుకుంటోంది.
“కొడుకన్నమాటేగానీ, వాడిని ఎప్పుడేనా వాడిని ఎత్తుకుని తిరిగారే, మీరిద్దరూను, అంత బెంగపెట్టేసుకోవడానికి?” కోప్పడింది లక్ష్మి.
“నన్నెక్కడ ఎత్తుకోనిచ్చారు? మీలో మీరే పోటీలుపడ్డారు” అంది గీత.


విజ్జెమ్మ పోయినప్పుడు సంధ్యకి మాటిచ్చినట్టు రాణాని పిలుచుకుంది సుమతి.
“మనకీ సుమంత్‍వాళ్ళకీ కలిపి నాలుగు కార్లున్నాయి. దేనికోదానికి పనికొస్తాడు. రాణాని పెట్టుకుందాం. మన కళ్లఎదుట వుంటే వాడూ అదుపులో వుంటాడు. పిన్నికీ నిమ్మళంగా వుంటుంది” అంది జోతో. అతను తలూపాడు. ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు. అలా రాణా వాళ్లమధ్య చేరాడు.
తనచేతిలో తిన్న దెబ్బకీ, మాధవ్ యిచ్చిన కంప్లెయింటుకీ భయపడి రాణా ఇంక తన జోలికి రాడనుకుంది గీత. అతనికి దెబ్బలూ కొత్త కాదు, పోలీసు కేసులూ కొత్తకాదు. మాధవ్ పోలీసుల్ని అడిగిందికూడా అతన్నోమాటు పిలిచి బెదిరించమని. తనకన్నా వాళ్ళైతే వింటాడని. వాళ్ళు బెదిరించి, సమస్యేదైనా వుంటే కంప్లెయింటు చెయ్యమని వదిలేసారు. ఈ రెండిటి కోపం మనసులో పెట్టుకుని తిరుగుతున్నాడు. సుమతికి దగ్గరగా వుంటే గీతని మరోసారి కలిసే అవకాశం రావచ్చని చూస్తున్నాడు. కనీసం ఆమె విషయాలు ఒకటో రెండో తెలుస్తాయని ఆశ.
“తమ్ముడు, పిన్నికొడుకు. పెద్దగా చదువు రాలేదు” అని రాణాగురించి చెప్పుకోవడానికి సుమతికి ఎలాంటి అభ్యంతరం లేదు. లతకిమాత్రం రాణామీద గౌరవం లేదు. ఆమె పెద్దగా ప్రాక్టీసుచెయ్యదు. రెండు పెద్దహాస్పిటల్స్‌లో గంటారెండుగంటలు చూసి లెక్కగా పేమెంటు తీసుకుంటుంది. తండ్రి ఇండస్ట్రీస్‍లో ఆమెకి ఆసక్తి. ఒక్కర్తే సంతానం కావడంతో ఆమెకి ఆ బాధ్యతలు తప్పవు. వాళ్ళ లేడీస్టాఫ్‍కి డాక్టరు ఆమే. ఫ్రీగా చూస్తుంది. చదువొస్తోందనీ, స్టేటస్‍కోసం, చదివించారు. చదివిన చదువు మర్చిపోకూడదని ఆమె ఇవన్నీ చేస్తుంది. జో, సుమంత్‍ ఎవరి ప్రాక్టీసుతో వాళ్ళు బిజీ. సుమంత్‍కి ప్రాక్టీసుతోపాటు అనేక వ్యవహారాలు. వదినామరదళ్ళిద్దరూ కలిసి తిరుగుతారు. ఇద్దరే యూయస్‍కూడా వెళ్ళొచ్చారు రెండుసార్లు. అక్కడ రమతో కలిసి లేడీస్ డే ఔట్ అని తిరిగారు. అప్పటికి గీతతో ఇంకా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది సుమతికి. శాంతిపతాకం ఎగరలేదు. మహతికీ రవళికీ పెళ్ళిళ్ళై వెళ్లిపోయారు. బాగా వంటరిగా అనిపించేది ఆమెకి. లతకి చేరువైపోయింది. సమస్యలు సృష్టించని ఆడబడుచుకాబట్టి లతకీ నచ్చింది.
“నాకు సాంప్రదాయం ప్రకారం పెట్టేవేవో పెట్టండి. తీసుకుంటాను. మిగతాఖర్చులు ఎవరివి వాళ్ళే పెట్టుకుందాం. ప్రతీదీ నువ్వో వదినో పెట్టాలని నేను అనుకోను, నాకు బావోదు. సుధీర్, సుమంత్‍లు వాళ్ళంతటివాళ్ళు వాళ్ళు, నా అంతటిదాన్ని నేను” మొదట్లోనే చెప్పింది సుమతి లతకి. కామన్ ఫండ్ పెట్టుకున్నారు. కలిసి వెళ్ళినప్పుడు దాంట్లోంచీ ఖర్చుపెట్టుకుంటారు. తిరిగి జమచేసేస్తారు.
రాణా లతనికూడా పేరుపెట్టి మిగతావాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడబోతే,
“నీ చుట్టరికాలన్నీ సుమంత్‍దగ్గిర, ఇంట్లో. నన్నలా పిలవద్దు. మేడం అను” చెప్పింది. ఆమె చూపుల్తోటే దూరాన్ని నిర్దేశిస్తుంది.
సుమంత్‍తో బైటికి వెళ్తున్నప్పుడు వెనకట్లాగే అరేయ్ అని ఏదో చెప్తుంటే, “అలా అనకురా! అందర్లో బావోదు” అన్నాడతను.
రాణాకి వళ్ళుమండి, “సార్ అననా?” అన్నాడు. పూర్తిగా వినకుండానే నీయిష్టం అనేసాడతను. కారు రెడీగా వుందా లేదా అన్నదేతప్ప ఎవరు డ్రైవ్ చేస్తున్నాడోకూడా పట్టించుకోడు జో. అప్పుడప్పుడు వీళ్ళకి వాసు దార్లో ఎక్కడో కలుస్తాడు. బైకో, కారో ఎక్కడో ఆపుకుని వేరే పనులమీద దూరం వచ్చేస్తాడు. అంతటి బిజీమనుషులూ కారాపి ఎక్కించుకుని, అతనికి కావలిసినచోట దించుతారు. వాళ్ళతనికి అంత గౌరవం ఎందుకిస్తారో రాణాకి అర్థం కాదు. అది గౌరవం కాదు, అభిమానం, ప్రేమ. సుధీర్‍తో రివర్‍సైడు సంఘటనతర్వాత జోకికూడా మొదలైంది. అతన్ని కూర్చోబెట్టి తను డ్రైవ్ చెయ్యడం రాణాకి మరో వళ్ళుమంట.
అలాంటిదే మరోటి జరిగింది. రాణా ఆశించినదే. లత, సుమతి షాపింగ్ చేసి వస్తుంటే దార్లో గీత కనిపించింది.
“ఏయ్, ఆపాపురా!” అంది సుమతి.
“ఇదేమైనా ఆర్టీసీ బస్సా, ఎక్కడంటే అక్కడ ఆపడానికి?” అన్నాడతను ట్రాఫిక్ చూస్తూ. కష్టమ్మీద కారు వెనక్కి నడిపించి గీత ముందు ఆపాడు.
“ఎక్కవే” అంది సుమతి లోపల్నుంచీ డోర్ తెరిచి. ఆమె ఎక్కి కుర్చుంది. రాణా రేర్ మిర్రర్లో ఆమె కనిపించేలా చూసుకున్నాడు. లత గమనించింది. అతనికి కోపం ముంచుకొస్తోంది. ఎలా కొట్టేసింది తనని? ఎక్కడిది అంత ధైర్యం? ఇదివరకూ వాసుకి చెప్పేదేమో, వాడు తనూ చూసుకునేవారు. ఇప్పుడలా కాదు, తెగబడి తనే కొట్టేసింది. అలా కొట్టమని ఎవరు చెప్పారు? వాసు చెప్పాడా? పోలీస్ కంప్లెయింటివ్వమని మాధవ్‍కి ఇదే చెప్పిందా? చెప్పే వుంటుంది. లేకపోతే వాడికంత బుర్ర, తెగింపూ వుండవు. ఎక్కడో రాజస్థాన్లో వుండేవాడికి ఇక్కడ జరిగే విషయాలెందుకు? తనదారిని తను వెళ్లక? లోలోపల కుతకుత వుడుకుతున్నాడు.
సుమతికి వీళ్ళ గొడవలెవీ తెలీవు. వాసుగానీ, గీతగానీ బయటపడరు. చెప్తే రాణాయే చెప్పాలి. చెప్తాడు. కొడితే కొట్టారనీ, తిడితే తిట్టారనీ చెప్తాడు తప్ప, తనేం చేస్తే అది ప్రతిచర్యగా వచ్చిందో సరిగ్గా చెప్పడు.
“ఇక్కడున్నావేంటే? ఒక్కదానివీ ఏం చేస్తున్నావు?” అడిగింది.
“పిల్లలకి నోట్‍బుక్స్, మిగతా స్టేషనరీ ఒకేసారి కొంటాం. నన్నాపని చూసుకొమ్మని వాసు ప్లీడరుదగ్గిరకి వెళ్ళాడు. కొనేసి, పేక్ చేయించి పెట్టాను. తనొస్తాడని నిలబడ్డాను” అంది గీత.
“అవంతీస్ ఇన్‍లో కుర్చుందాం. వాడిని అక్కడికే వచ్చెయ్యమను. చాలారోజులైంది మనం కలిసి” అంది సుమతి. గీత అతనికి ఫోన్ చేసింది. వస్తానన్నాడు.
“ప్లీడరుదగ్గిరకెందుకు?” అడిగింది సుమతి ఆరాగా.
“ఫామ్‍హౌసు కొందామనుకుంటున్నాం. అందరూ మగపిల్లలుకదా? మరీ కాళ్ళూచేతులూ కట్టేసినట్టు ఇంట్లో పడేసి చదివిస్తున్నాం. శనాదివారాల్లో అక్కడికెళ్ళి వుంటే బావుంటుందని ఆలోచన” అంది గీత.
“ఎక్కడ కొంటున్నారు?” కుతూహలంగా అడిగింది లత. చెప్పింది. కొద్దిసేపు ఆ విషయాలమీద మాట్లాడుకున్నారు.
“చాలామంది పిల్లలే ఐనట్టున్నారు, ఇంత ఖర్చు ఎందుకు ఎత్తుకున్నారు గీతూ?” అడిగింది సుమతి.
“ఖర్చేముంది? చాలా చురుకైన పిల్లలు. దగ్గిరకి తీసి ఇంత తిండిపెట్టి ప్రేమగా చెప్తే చదువుకుంటున్నారు సుమతీ! మాకున్నవేనా మేమేం చెమటోడ్చి సంపాదించినవి కాదు. పాతికవేలకీ యాభైవేలకీ కొన్న భూములు లక్షల్లో పలుకుతున్నాయి. ఖర్చుపెట్టడానికి అదే ధైర్యం. కొన్నాళ్ళు మనింట్లో వుంటారు, మన తోటలో తిరుగుతారు. అంతే. ఆతర్వాత మనవి మనకేకదా? ఈ కాస్తకాలంలో మయూ విహీలకి స్నేహాన్నీ సంతోషాన్నీ పంచిస్తారు. మా పిల్లలని పెంచినట్టే వాళ్లనీ పెంచుతున్నాం. మనం చిన్నప్పుడు పెరిగినట్టే వాళ్ళూ స్నేహితులమధ్య పెరుగుతున్నారు” అంది.
“ఇలా ఎవరూ ఆలోచించరు. చేతిలోకి వచ్చిన ప్రతి రూపాయీ తమదే అనుకునేవాళ్లని చూసాను” అంది లత.
“అంతా మనదెందుకౌతుంది లతా? ఎవరెవరికి ఏది ప్రాప్తం వుంటే అది వారికి చేరుతుంది. మధ్యలో మన చెయ్యి వుంటుంది. అదలా వున్న క్షణాన మనదనిపిస్తుంది” అంది గీత. లతకెందుకో ఆమె కాస్త దిగులుగా వుందనిపించింది. సుమతికి ఆ వేదాంతం నచ్చలేదు.
“వేదాంతం మాట్లాడక నోరుముసుక్కూర్చో. మాట్లాడాల్సినవాళ్ళు నీపైని చాలామంది వున్నారు. నువ్వు లాస్టులో చెప్పచ్చు” అంది.
“ఓయబ్బో!” అంది గీత.
అవంతీస్ ఇన్ చేరారు. రెస్టరెంట్ చిన్నదేగానీ యంబియెన్స్, ఆహారం బావుంటాయి. చాలాదూరాన్నించీ వస్తారు ఇక్కడ తినడానికి. సమీరా, శశిధర్ అక్కడ కనిపించారు. వాళ్ళూ అప్పుడే వచ్చారు. అతన్ని పలకరించి,
“ఏంటే, మీరిక్కడ?” అడిగింది గీత.
“పల్లీలమ్ముకుందామని వచ్చాం” అంది సమీర. “మరి మీరు?”
“ఆ విషయం న్యూస్‍లో చెప్తే విని, కొనుక్కోవడానికొచ్చాం” తటాలున జవాబిచ్చింది గీత.
“ఎక్కడా తగ్గవేం? ఉన్నపళంగా జవాబులు పుట్టుకొచ్చేస్తాయి” అంది సమీర.
“తగ్గడమే! గీతే?” అంది సుమతి. అంతా నవ్వారు.
“చాలాకాలానికి కలిసారు. ఇంకొన్నాళ్లైతే మీరు కనిపించినా ఎక్కడో చూసినట్టుందని ఆలోచించుకునేలా వున్నాం. ఎప్పుడేనా వస్తుండండి. మేం రాలేదని అనుకోవద్దు. మేమంతా చెడతిరిగేసాం. అలిసిపోయాం. ఇక మీవంతు” అంది శశిధర్‍తో అభిమానంగా. అతను వస్తామన్నట్టు తలూపాడు. వీళ్ళింటికి వెళ్లడానికి అతనికేం అభ్యంతరం లేదు. గీతకూడా అతనికి ఓకే. వాసే. కొరుకుడు పడట్లేదు.
రాణా శశిధర్ని పలకరించాడు. అప్పటికే వాళ్ళిద్దరి స్నేహానికీ పునాదిపడింది.
“మీకెంత? గంట పడుతుందా? నేను వేరేపని చూసుకుని వస్తాను” అన్నాడు రాణా అతనితో మాట్లాడాక.
“అర్జెంటేముంది? నువ్వూ వుండు. వాసుకూడా వస్తున్నాడు. ఇందరం కలిసి చాలారోజులైంది” అంది సుమతి. వీడెందుకు తమ మధ్యని? దీనికేం తెలీదు. గీతకి చిరచిరలాడింది. వాసు వస్తున్నాడనగానే శశిధర్ ముఖంలో కొద్దిగా రంగులు మారాయి. అది తెలిసింది సమీరకొక్కదానికే.
“వాడొస్తే నేనెందుకు వుండటం? ఆహ్వానగీతం పాడటం ఏమైనా వుందా? గొంతు కలపాలా? నాకు వేరే పనుంది” అన్నాడు రాణా కోపంగా. శశిధర్ నవ్వాడు.
“అందరం కలిసాంకదా, వుండండి” అన్నాడు అతనుకూడా. వాసుని ఎంటర్టేన్ చేసే బాధ్యతనుంచీ తప్పుకొవాలని. రాణా ఇంక మాట్లాడకుండా కారు పార్కుచెయ్యడనికి వెళ్ళాడు. శశిధర్ వాలేపార్కింగుకి ఇచ్చాడు. అంతా కలిసి లోపలికి నడిచారు.
“ఇంకా మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదే? అప్పట్నుంచీ గొడవ అలానే మెంటేన్ చేస్తున్నారా? పాతికేళ్ళవలేదూ?” గీతని అడిగింది సుమతి ఆశ్చర్యంగా.
“ప్రత్యేకంగా మేమిద్దరం మాట్లాడుకోవడానికేముంటుంది? యముననీ పిల్లల్నీ తీసుకుని మాయింటికి రమ్మను. వద్దన్నదెవరు?” అంది గీత.
“ఎన్నోసార్లు నేనూ అడిగాను వాళ్లని తీసుకురమ్మని. ఏవేవో కబుర్లు చెప్పి దాటేసాడు” అంది సుమతి.
కాసేపటికి వాసు, రాణా కలిసి వచ్చారు. బలికి పశువుని తీసుకొస్తున్నట్టనిపించింది గీతకి వాళ్ళిద్దరినీ చూస్తే. శశిధర్‍ వున్నాడని నవ్వాపుకుందుకు కష్టపడింది. వాసు రాగానే మరోవిడత పలకరింపులయ్యాయి. అందరికీ ఏమేం యిష్టమో అడిగి ఫుడ్ ఆర్డరు చేసారు, లత, గీత కలిసి.
“మయూ ఎలా వున్నాడురా?” అడిగింది సుమతి.
“బానే వున్నాడు. ఎడ్జస్టయాడు. రేగింగ్ పెద్దగా లేదన్నాడు. ఉందేమో, మాకు చెప్పలేదు” అన్నాడు వాసు. “సుమా! చాలా మిస్సౌతున్నాం వాడిని. ఆఫీసునించీ వచ్చేసరికి ఏమూలనుంచో వూడిపడేవాడు. టీ చేసివ్వడం వచ్చింది. అదో ఆట వాడికి. చేసిచ్చేవాడు. వాడికీ తాగాలని కుతూహలం. చిన్నగ్లాసులో ఒక్కగుక్క పోసిస్తేనో, ఆఖర్న మిగిల్చి యిస్తేనో అమృతమేదో దొరికినట్టు సంతోషం. బైట జరిగినవేవో చెప్పేవాడు. చదివిందేదో తీసుకొచ్చి చూపించేవాడు. నాతో గ్రౌండుకి తయారైపోయేవాడు. క్రికెట్‍బేటు తెచ్చుకుని వచ్చి నిలబడేవాడు. డిమాండు. అడగ్గానే ఆడాలి. ఆటలు, పాటలు, డాన్సులు, అల్లరి. ఇల్లంతా వాడే అన్నట్టుండేవాడు. వాడు వెళ్లాక వెల్తి తెలుస్తోంది. వాడు ఎవరిళ్ళకేనా వెళ్ళినప్పుడు ఎప్పుడూ అలా అనిపించలేదు. మళ్ళీ వచ్చేస్తాడని వాడి వస్తువులు ఎక్కడివక్కడ అలానే వుంచేవాళ్ళం. ఇప్పుడలా కాదు, అన్నీ తీసి, లోపల జాగ్రత్తగా దాచిపెట్టాం. స్టిక్కర్లు, క్రికెటర్ల బొమ్మలు, ఏవేవో కలెక్షను. ఏదీ పారెయ్యాలనిపించలేదు. సెలవుల్లో వచ్చి వెతుక్కుంటాడేమో! ఇప్పటి ఫీలింగ్ చాలా కొత్తగా, గమ్మత్తుగా వుంది. గీతైతే బెంగపెట్టేసుకుంది” అన్నాడు. అతని మాటల్లో దు:ఖం వ్యక్తమైంది.
“మాదగ్గిర హాస్టల్లో చూస్తుంటాను, నెలకొకసారి తల్లిదండ్రులని కలవనిస్తాం. వాళ్ళు యేడుపు, వీళ్ళు యేడుపు. కొంతకాలానికి అలవాటైపోతుంది. పిల్లలు ఎప్పటికీ చిన్నవాళ్ళుగానే వుండిపోరు. చదువుకుని పైకి రావాలంటే దూరం వెళ్లక తప్పదురా! మీరు మరీ అటాచ్‍మెంట్సు పెంచుకున్నారు. పిల్లలు టెంత్‍కి వచ్చినదగ్గర్నుంచీ అవన్నీ వదిలెయ్యాలి” అంది సమీర.
“మనందరికీ అన్నీ వున్నాయి. కలిసి తిరిగాం, పెరిగాం, పెద్దయాం. కానీ ఏదో కోల్పోయినట్టనిపించట్లేదా? ఇది మరోరకం. ఇప్పటిదాకా వాడికి సంబంధించిన ప్రతీవిషయం నాకు తెలుసు. ప్రతీదీ చెప్పేవాడు. ఇప్పుడింక నాకు ప్రత్యక్షంగా ఏవీ తెలీవు. వాడు చెప్పాలి. చెప్పడంలో కొన్ని మిస్సవచ్చు. కొన్నిటిలో ప్రాధాన్యత కనిపించక చెప్పేదేంటనిపించవచ్చు. స్వంతనిర్ణయాలు మొదలౌతాయి. క్రమంగా దూరం పెరిగిపోతుంది. వాడు నాకు అర్థం కాకుండా వుండే కొన్ని అంశాలు మొదలౌతాయి. పండు పక్వానికి వచ్చి చెట్టునించీ వేరవడమా? బలవంతంగా కోసి, పండెయ్యడమా? అర్థం కావట్లేదు. పగలేమీ అనిపించదు. రాత్రవగానే ఆలోచనలు మొదలౌతాయి. అమ్మానాన్నలం కమ్మగా వండుకుని తిని, వెచ్చగా పడుక్కుంటాం. వాడు తిన్నాడా? తినలేదా? పడుక్కున్నాడా? ఇంకా మేలుకునే వున్నాడా? ఇక్కడున్నట్టే వుంటున్నాడా? అలవాట్లు మారాయా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో భయాలు చుట్టుముడతాయి. అమ్మగా వుండటం ఇంత బాధనిస్తుందా?” అంది గీత. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
“భలేవున్నారు మీరిద్దరూ. మాపిల్లలిద్దరూ చేసే అల్లరి భరించలేక, ఎప్పుడెప్పుడు పెద్దౌతారా, హాస్టల్లో పడేద్దామా అని చూస్తుంటాను. మాయింట్లో అంతా కలిపి ఏడుగురు. ఇల్లుపీకి పందిరేస్తారు” అన్నాడు శశిధర్.
“ఇప్పుడలానే అనిపిస్తుంది. తీరా పంపించేప్పుడుంటుంది” అంది గీత.
“తమ్ముడు ట్రాన్స్ఫర్‍మీద ముంబై వెళ్ళినప్పుడు అనుభవించాం. మా అమ్మ బోల్డ్‌గా వుందిగానీ మావల్ల అయేదికాదు. ఇది ఇంకా ఇంటెన్స్‌గా వుంది” అన్నాడు వాసు.
“ఛస్, వీళ్ళకిద్దరికే ఓ కొడుకున్నాడు, వాడొక్కడే బైటికెళ్ళి చదువుకుంటున్నట్టు. ఒక్కో కాలేజిముందు నిలబడి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పిల్లలు చదువుతున్నారో! వాళ్ళూ ఎక్కడెక్కడినుంచో వచ్చుంటారు” అన్నాడు రాణా వూరుకోలేక.
అంతా తెల్లబోయారు.
“అలా అనేసావేంట్రా? ఎవరి పిల్లలు వాళ్లకి ముద్దు. మన పిల్లల్లో యిల్లొదిలిపెట్టి వెళ్లింది ఇప్పటికి వీడొక్కడే. అన్నీ గీతనుంచే మొదలౌతున్నాయి. దాన్ని చూసి మేం నేర్చుకోవడమౌతోంది” అంది సుమతి.
“మీపిల్లలేం చదువుతున్నారు రాణా?” అడిగింది లత.
“వాళ్ళింకా చిన్నవాళ్ళే. వీళ్ళ చిన్నాడి వయసు” చెప్పాడు.
“చదువుకి ప్లాన్ చేస్తున్నావా?”
“మేం మీఅంత గొప్పవాళ్లం కాదు”
“పిల్లలని చదివించుకోవడానికి గొప్పా బీదా ఏమీ వుండదు. అదో బాధ్యత అంతే. వాళ్లని తీసుకొచ్చి చూపించమంటే ఇప్పటిదాకా తీసుకురాలేదు. తీసుకొచ్చి మామధ్యని పడేస్తే చదువుసంగతి అందరం కలిసి చూసుకుంటాం” అంది సుమతి.
“అందరం చూసుకోవడం దేనికి? రాజావారేం చేస్తారో? ఇప్పట్నుంచీ సంపాదించమను” అన్నాడు వాసు తమాషాగా.
“నా భార్యకి వుద్యోగం లేదు. మా మామ నాకే ఆస్తులూ రాసివ్వలేదు. నా బావమరిది అమెరికాలో లేడు” అన్నాడు రాణా.
“ఎంత కుళ్ళుకుపోతున్నావురా? చిన్నప్పట్నుంచీ కుళ్ళుపుచ్చకాయవే నువ్వు” అంది సుమతి నవ్వుతూ.
“పోవే, ఇక్కడున్నవాళ్లందరివీ కడుపునిండిన బేరాలే”
“అలాంటి పిల్లనే వెతుక్కుని చేసుకోకపోయావురా?” అంది సమీర.
“నాకెందుకిస్తారే?” అన్నాడు. అంతా నవ్వేసారు.
“సంధ్యగారి పెంపకం మరి. ఒకటోమాటకీ, రెండోమాటకీ పొంతన వుండదు” అన్నాడు వాసు. రాణా ముఖం ఎర్రబడింది. లత సంభాషణ దిశ మార్చింది.
“ఇంత ఆలోచించరు గీతా! పాకడం నేర్చుకుని అమ్మవొడిలోంచీ ఇవతలికి రావడంతోనే పిల్లల ఇండివిడ్యువాలిటీ మొదలౌతుంది. ఎంతకాలం అమ్మానాన్నల చాటుని బతుకుతారు? ప్రపంచం ఎలా వుంటుందో తెలియాలికదా? వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు చెయ్యాలి. రేగింగ్ అంటారా బావగారూ, నేనూ ఫేస్ చేసాను. మనింట్లోకూడా ప్రొఫెషనల్ కోర్సులు చదివినవాళ్లెవరూ తప్పించుకోగలిగి వుండరు. అదో వికృతచేష్ట. సమాజంలోని చెడుతో మనకి మొదటి పరిచయం అనుకోండి” అంది. దొంగకి తేలుకుట్టినట్టు వులిక్కిపడ్డాడు శశిధర్. రేగింగ్ చెయ్యడంలో అతను ముందుండేవాడు.
“ఏడిపించడమంటే యేం చేస్తారు లతా? మాలో చాలామందివి రాజావారి కాలేజీ చదువులు. మావెనక వీళ్లంతా వుండేవాళ్లు. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనేవాళ్లు కాదు. కృష్ణకూడా ఎప్పుడూ చెప్పలేదు” అంది గీత.
“అవన్నీ పెద్దవాళ్ల విషయాలమ్మా! ” అంది సమీర వేళాకోళంగా.
“నువ్వుకూడా వీళ్లకి తోడయ్యావులేవే” అంది గీత కోపంగా.
“అంత ఏమీ వుండదు. బాగా స్ట్రిక్ట్ చేసారు. స్టుడెంట్స్‌లోకూడా యాంటీరేగింగ్ బేచిలు తయారయ్యాయి. మయూ ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆలోచించచ్చు. రెండోవాడు ఎలా వున్నాడు?” సేతుగురించి అడిగింది లత. జరిగేవి జరుగుతాయి, చెప్పి వీళ్లని భయపెట్టడం దేనికని.
“డబల్ ధమాకా మాకు” నీరసంగా అంది గీత. “ఒకడిని కని, ఇద్దరికోసం బెంగపడుతున్నాను. మనవాడు బోల్డ్‌గా వున్నాడు. వీడైతే ఏకంగా ఏడుపే, వచ్చేస్తానని. వాళ్లమ్మని పంపించాం. మేం మరోసారి వస్తామని చెప్పాం. అందరం కట్టకట్టుకుని ఒక్కసారే వెళ్లడం దేనికని”
“మయూ పుట్టినప్పుడే’ఎవర్నో తీసుకొచ్చి పెంచుకున్నావటకద గీతా?” నవ్వుతూ అడిగింది లత.
“సుమంత్ చెప్పాడా?” అడిగింది గీత. లత తలూపింది. “అందుకే నువ్వంటే యిష్టం పెరిగిపోయింది నాకు. భయపడేంత ఏమీ వుండదు” అంది ప్రేమగా.
“పైసా ఖర్చులేకుండా కొడుకు ఇంజనీరింగ్ సీటు తెచ్చుకుంటే అక్కగారికి తెలీడం లేదు. బావా! మాకసలు బ్రహ్మాండమైన పార్టీ యివ్వాలి” అన్నాడు శశిధర్. అతనికి కావలిసింది వేరు. వాసుని తట్టిచూసాడు. వాసుకి అర్థమైంది. కానట్టు వూరుకున్నాడు.
“మీరు అడగడం, మేం కాదనడమూనా? ఇక్కడ ఐస్‍క్రీమ్ చాలా బావుంటుంది” అన్నాడు.
“వసంత్‍ యింటికి వెళ్ళాను. ఎందుకు చేసాడురా, అలా? వాడినేం అడగలేదులే. పిన్నినీ, వాడినీ చూస్తుంటే యేడుపొచ్చింది. గీత యిందాకా అన్నట్టు అందరికీ అన్నీ వున్నా సంతోషంగా లేము వాసూ! మన జీవితాలు కలగలిసిపోయాయి. మనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కళ్ళుచెమ్మగిల్లుతునే వున్నాయి. వాడు కొంచెం కోలుకున్నట్టే కనిపించాడు. పిన్నికూడా మారింది. మారక ఏం చేస్తుంది? కనీసం ఆవిడగురించేనా ఆలోచించలేదేమిట్రా బాబాయ్? ఆ డబ్బు యింక రానట్టేనా? వీణ సంగతేమిట్రా? వాళ్లగురించి ఏమైనా తెలిసిందా?” అడిగింది సుమతి.
“రాణా ఎవరో రియలెస్టేట్ బ్రోకరు నెంబరిచ్చాడు. నేను, వసంత్, మరో నలుగురం వెళ్లి అతన్ని కలిసాం. ఉపయోగం లేకపోయింది. అగ్రిమెంటు కాగితం లేకపోవడం వాళ్ళకొక పెద్ద అవకాశం” అన్నాడు వాసు. చాలా చర్చ నడిచింది. వీణ ఇంకా శేషప్రశ్న. ఆఖర్న వాసు కొనబోయే ఫామ్‍హౌసు గుర్తొచ్చింది సుమతికి. దానిగురించికూడా మాట్లాడుకున్నాక వెళ్లడానికి లేచారు. బిల్లు వాసు యిచ్చాడు.
ఎప్పుడూ లేదిలా. ఇన్ని సమస్యలూ, దు:ఖాలూ అపరిష్కృతంగా వుండటం. మనసులు బరువెక్కి యింటికి వెళ్లడం. మయూ ఆలోచనలతో గీతకి మరీ దిగులుగా వుంది. అవి తప్పించుకోవడానికే వ్యాపకాలు కల్పించుకుని తిరుగుతుంటే యిక్కడ మళ్ళీ తట్టిలేపినట్టైంది. బైటికొచ్చారు. కొద్దిగా వర్షం పడ్డట్టుంది. తడితడిగా వుంది నేల. వాసు పక్కని నడుస్తూ, చూసుకోకుండా తడిలో కాలేసి జారబోయింది గీత. చెప్పులోంచీ పాదం ఇవతలికొచ్చి, మెలికపడింది. వెనక్కి పడబోతుంటే చప్పుని పట్టుకున్నాడతను.
“ఆ పర్సనాలిటీ యేంటి, దాన్నా పట్టుకోవడమేంటి? నేనింకా అమితాబ్, జయాబాధురీ లెవెల్లో వూహించుకుని పాటేమైనా గుర్తొస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఏమే, రెక్క వుందా, వూడిపోయిందా?” అంది సుమతి పకపక నవ్వి.
గీత ముఖం ఎర్రబడింది. “పోవే!” అంది కోపంగా.
“ఇది గీతలాగే జారిపడిందికదమ్మా? ముందే చెప్పి, గ్రేస్‍ఫుల్‍గా పడుంటే స్టిల్ ఆలోచించేవాడిని” అన్నాడు వాసు. “జాగ్రత్తగా నడవాలికదా? నొప్పెడుతోందా?” అన్నాడు గీతతో, ఆమె వంగుని కాలు చూసుకుంటుంటే.
“బెణికిందా?” అడిగింది లత.
“లేదు” అంది గీత.
“అరేయ్, అందరం కళ్ళుమూసుకుని నిలబడతాంగానీ, ఎయ్ర్‍లిఫ్టిచ్చెయ్” అంది సుమతి. మొదట వాసుకి అర్థమవ్వలేదు. తర్వాత పెద్దగా నవ్వుతూ,”బావ నిన్ను బాగా చెడగొట్టేసాడే” అని, “ఇలా మాకర్థం కాకుండా కోడ్‍భాషలో మాట్లాడుకుంటూ చిన్నప్పుడు మావెనక తిరిగేవాళ్ళా, మీ నలుగురూను?” అన్నాడు.
వెళ్తున్నామని చెప్పేసి ఇద్దరూ కదిలిపోయారు.
“మరేం కంగారుపడకండి. అందరం కలిస్తే యిలానే మాట్లాడుకుంటాం. సుధీర్ ఇక్కడ లేని లోటు నాకు వాసుతో తీరుతుంది. ఇద్దరూ ఒకే బంధానికి చెరోపార్శ్వం. మనవాళ్లమధ్యనేకదా, సరదాగా వుండేది? హద్దులు చెరిగిపోయేది? బైటికెళ్తే డిగ్నిటీ, ఆచితూచి మాట్లాడటం తప్పదు” అంది సుమతి శశిధర్‍తో. అతను వినోదంగా చూస్తుంటే.
“దీన్ని రుద్రమదేవి అనేవాళ్లం. అదో ఐఫిల్ టవరు. మరొకర్తి అవంతీపురం రాకుమారి, మరీ నాజూగ్గా వుంటుంది. ముగ్గురూ నాకు చిట్టిచెల్లెళ్ళు. గుర్తుచేసుకునేవాళ్ళు వున్నంతవరకూ ఈ సరదాలు నడుస్తాయి. మాపెళ్లప్పటికి వీళ్లంతా చిన్నవాళ్ళు. మావారికి ఈ ముగ్గురూ, పల్లవీవాళ్ళు ముగ్గురూ అంటే చాలా యిష్టం. ఎప్పుడూ చాక్లెట్లు కొని దగ్గరపెట్టుకునేవారు, వీళ్లకివ్వడానికి. ఎవరికీ ఇంత పెద్దపెద్ద కుటుంబాలుండవు. కజిన్స్‌మధ్య ఇంతంత స్నేహాలుండవు. చాలా ఎంజాయ్ చేస్తారు తను. మీరుకూడా వచ్చి వెళ్తుండండి. బైటిమనిషిలా వుండకండి” అంది.
లతకూడా చెప్పింది.
రెండుకార్లూ పార్కింగ్‍లోంచీ తెచ్చుకుని చెరోదారీ పట్టారు.
“అన్న నడిచొస్తే మాస్, అన్న చిటికేస్తే మాస్…” అన్నాడు శశిధర్ కార్లో కూర్చున్నాక పెద్దగా నవ్వుతూ. సమీర తనూ నవ్వింది. అక్కడితో ఆగిపోతే బావుండేది. “… ఒకావిడ డాక్టరు, మరొకావిడ పేరున్న డాక్టరు భార్య. ఎక్స్ట్రా ఆర్టిస్టుల్లా వున్నారు” అన్నాడు కొనసాగింపుగా. సమీర ముఖంలో నవ్వు ఎగిరిపోయింది.
“ఇంకా లాలిపాప్‍లు, ఐస్క్రీమ్‍లూ తింటుంటాడా ఆయన? ఇప్పుడైతే నిలువుగానే పెరిగాడు. అప్పుడింక అడ్డంగాకూడా పెరుగుతాడు” అన్నాడు ఎద్దేవాగా.
“వాడు టీటోట్లర్” చెప్పిందామె.
“ఆహా! ఆయనో అమితాబ్ బచ్చన్, ఆవిడో జయాబాధురీ. కోతుల్ని ఆడించేవాడు అలానే పేర్లుపెడతాడు” అన్నాడు. చివుక్కుమంది సమీరకి.
“బావ పేరు పట్టుకుని సుమతిని ఏడిపిస్తాం. లతకీ, సుమంత్‍కీ మరో ఎపిసోడుంది. వల్లిని సుమంత్ చాలా బనాయిస్తాడు” అంది. ఐనా అతను అనాలనుకున్నవన్నీ అనేసాకే ఆగాడు. లోలోపల కుతకుతలాడిపోతోంది. వాసు, అంత వొడ్డూపొడుగూ వున్న మనిషి తాగకుండా, తినకుండా, తిరక్కుండా వుంటాడంటే నమ్మలేకపోతున్నాడు. తను అన్నాకకూడా ఐస్క్రీమ్‍తో అతను సరిపెట్టడం అవమానంగా అనిపించింది.
ఇంకోసారెప్పుడేనా కలుద్దాం- అనాలి. కానీ తుంచేసాడు.
వాసు వ్యక్తిగత జీవితంలోని అత్యంత గోప్యమైన అంశాలు శోధించి తెలుసుకోవాలనే ఒకానొక కసి మొదలైంది. ఎందుకు అనే ప్రశ్నకి జవాబుల్లో మొదటిది అతను ఆపాదించుకున్న కారణం, రెండవది ఈ కుటుంబంలో వాసుకి వున్న స్థానం పుట్టించిన అసూయ. చుట్టూ కొన్ని అందమైన సంఘటనలు జరిగినప్పుడు అవి మనకెందుకు జరగలేదనిపిస్తుంది. వాసు, గీతల జీవితాల్లోని ఆ అంశం అతన్ని ఆకర్షిస్తోంది. దాన్ని ధ్వంసం చెయ్యాలన్న ఆలోచన నిలవనివ్వడంలేదు.
సమీర పెద్ద వుత్సాహంగా లేకపోవడం వసంత్ అన్న మాటల నేపథ్యంలో వాసునీ, గీతనీ కలవరపరిచింది.
“వసంత్, పిన్నీ వుండగా మనం కలగజేసుకోవడం బావుండదు గీతూ! ఐనా రేపోమాటు మామూలుగా దాన్ని చూసొస్తాను” అన్నాడు.
అన్నట్టుగానే మరుసటిరోజు సమీర కాలేజికి వెళ్ళాడు. విజిటర్స్‌రూంలో కూర్చుని కబురుపెడితే వచ్చిందామె. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకొచ్చాడో చూచాయగా గ్రహించింది. పక్కకి వెళ్ళి కూర్చున్నారు. రూంలో ఎవరూ లేరు.
“ఊ< తాగుతాడు, అమ్మాయిల్తో తిరుగుతాడు. ఇంకా?” సూటిగా అడిగాడు వాసు. ఆమె ముఖం పాలిపోయింది. తనని తను కూడదీసుకోవడానికి కొంచెం టైం పట్టింది.
“వసంత్ చెప్పాడా? ఒకసారెప్పుడో నన్ను పట్టించుకోవట్లేదని కోపంతో నాన్నకి చెప్పాను. అంతే. అలాంటిదేంలేదురా! నువ్వేవేవో వూహించుకోకు. సోషల్‍డ్రింకింగ్ చేస్తారు. ఎప్పుడేనా. అంతే. సుమంత్ చెయ్యడూ? అలాగే. నిన్నకూడా బావగారివని సరదాగా అన్నారు. తేడావస్తే వాళ్ల తల్లిదండ్రులు వూరుకోరు. చాలా స్ట్రిక్టు” అంది.
“నువ్వు డల్‍గా కనిపించావని అక్కడినుంచీ వచ్చేసాక గీత చాలా బాధపడింది”
“నాన్న పోయారుకదరా?”
“అదే అయితే సరే సామ్! అంటే దిగులుపడుతూ కూర్చోమని కాదు. పోయింది ఆయనొక్కరే. నిన్ను యిష్టపడేవాళ్లం మిగిలిన అందరం వున్నాం. సమస్యేదైనా వుంటేమాత్రం వసంత్‍కో పిన్నికో చెప్పు. వాళ్ళ పక్కన నిలబడి నేను మాట్లాడతాను” అన్నాడు ప్రేమగా.
“నువ్వు పైవాడివికాదురా వాసూ! ఏదేనా వుంటే వసంత్‍కన్నా ముందు నీకే చెప్పేదాన్ని. మనింట్లోలా వుండదుకదరా, అన్నిచోట్లాను? ఎవరింటి పద్దతులు వాళ్ళవి. వెనకనుంచీ పెద్దవాళ్ళు చూసుకుంటారు. కాలేజి నడవాలంటే మాకు చాలామందితో పరిచయాలుంటాయి. పార్టీలూ అవీ కామన్” అంది. అతను మరికొద్దిసేపు మాట్లాడి ఆమె అత్తమామల్నికూడా కలిసి వెళ్ళిపోయాడు.
“ఎందుకొచ్చాడు సమీరా, అతను? నిన్న హోటల్లో కలిసారుకదా?” అడిగింది సమీర అత్తగారు లంచి చేస్తున్నప్పుడు.
“ఏదో పనిమీద యిటుగా వెళ్తూ వచ్చాడు” అంది సమీర.
“శశికి అతనెందుకో నచ్చలేదు. అలాంటప్పుడు రాకపోకలెందుకు? మీరేం స్వంత అన్నాచెల్లెళ్ళు కారు. అతను కలుపుకుని వెళ్ళే మనిషీ కాదు. మీ నాన్నతో కలిసి ఆ యిల్లు డెవలప్ చేసుకుంటే మీరందరూ ఒకచోట తీసుకునేవారుకదా? అక్కడ ఉండటం వుండకపోవటంవేరే విషయం. తనిల్లు తనదనుకున్నాడు. స్వంతతమ్ముడినికూడా దూరంపెట్టాడు. తన కొడుకుని కాకపోయినా బైటిపిల్లల్నేనా మన కాలేజికి పంపిస్తాడా, కాలేజికి మంచి ప్రమోషనౌతుందంటే అదీలేదు. ఐనవాళ్ళే ముందుకి రానప్పుడు బైటివాళ్ళెలా వస్తారు? కనీసం పిల్లలిద్దరూ మన కాలేజిలో చదివినట్టు వేసుకున్నా కొంత పేరొచ్చేది. ముందరికాళ్లకి బంధం వేసినట్టు చేసాడు. దేనికీ కలిసిరానప్పుడు వుత్తుత్తి ప్రేమలూ, రాకపోకలూ దేనికి? అవన్నీ వదిలేసెయ్, ఎవరిష్టం వాళ్లది. కాదనలేం. వాళ్ళిద్దరు భార్యాభర్తలూ ఒకమాటమీద వున్నారు, పైకొచ్చారు, ఒక వెలుగు వెలుగుతున్నారు. నువ్వూ, శశీకూడా అలానే వుంటే మాకు బావుంటుంది” అంది.
సమీర తలూపింది.
స్వంతతోబుట్టువు వసంత్ తనకేమీ పెద్దగా పెట్టలేదు. పెట్టిందల్లా తండ్రే. మిగిలినవాళ్లంతాకూడా శుభకార్యాల్లో వాళ్ళ అక్కచెల్లెళ్లతో సమానంగా మంగళహారతికట్నాలిస్తారు. అంతకన్నా పెట్టరు. వాసునుంచీ ఎందుకింత ఆశిస్తున్నారు? ఏమీ కానివాళ్ళుకూడా? బైటివాళ్ళు ప్రతిపాదనలు తెస్తే వీళ్ళెవరేనా వింటారా? రేపు తమ పిల్లల్ని ఇక్కడే వుంచి చదివిస్తారా? అప్పుడే గుంటూరా, విజయవాడా అనే ఆలోచనలు చేస్తున్నారు బావగారు వాళ్ళ పిల్లలగురించి. తాము చెయ్యనిది, చెయ్యలేనిది, కరెక్ట్ కాదనిపించేది ఇతరులని చెయ్యమని ఎలా అడుగుతారు? విచిత్రంగా అనిపించింది. ఈ కుటుంబంతో వున్న లింకు తనొక్కర్తే. అవసరం లేకుండా బాధపెట్టడంకన్నా తుంచేస్తే సరిపోతుందనుకుంది. గుండెని మెలిపెట్టినంత బాధ కలిగింది.
వాసు వచ్చాడన్న విషయం తెలిసి రాత్రి శశిధర్ కొద్దిగా గొడవచేసాడు. అతనిగురించి వల్గర్‍గా మాట్లాడాడు. తనెలాంటివాడో, తోటివాడుకూడా అలానే వుండితీరతారన్న సిద్ధాంతం కొందరికి వుంటుంది. శశిధర్ అలాంటివాడు. ఆమె మనసుకి ఇంకాస్త లోతైన గాయమైంది.
శశిధర్ మనోరూపలావణ్యవిలాసం కొద్దికొద్దిగా బైటపడుతోంది. సర్దుకుని యిక్కడే వున్నా, దెబ్బలాడి బైటికెళ్ళినా తనకి స్వంతంగా కొత్తజీవితం ఏదీ రాదు. ఇద్దరు పిల్లలుండగా మళ్ళీ పెళ్ళిచేసుకునే ఆలోచన తనకి లేదు. అలాంటప్పుడు ఇక్కడున్నా, బైటికెళ్ళినా సపోర్టుసిస్టమ్‍మీదే బతకాలి. ఇక్కడైతే అత్తమామలు చూసుకుంటున్నారు. పిల్లలకి అన్నివిధాలైన ప్రేమా దొరుకుతోంది. తేడా వస్తే అతన్ని నిలదీయగల సంస్కారం వుంది వాళ్లకి. ఆమె తనవైపునించీ ఆలోచించుకుని వూరుకుంది. వాసు విషయంలో శశిధర్ ముందుకెళ్తున్నాడన్న విషయం తెలుసుకోలేదు.


అవంతీస్‍ ఇన్‍ సంఘటన తర్వాత రాణా ఆలోచనల్లో మార్పొచ్చింది. చాలాకాలంతర్వాత అందరితో సమానంగా కూర్చున్నాడు. అక్కడికొచ్చిన అందరిదగ్గిరా డబ్బుంది. పిల్లలమీద ఎంతంటే అంతా ఖర్చుపెట్టగలరు. ఇప్పటిదాకా తనెప్పుడూ పిల్లలగురించి ఆలోచించలేదు. వాళ్ళ బాగోగులు యమునకే వదిలేసాడు. ఇంటిఖర్చులు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడింక వాళ్ళగురించి ఆలోచించాలా? వాళ్ళు తనకే పుడితే సరే, కాకపోతే? పెళ్ళికి ముదే తనకి లొంగిన మనిషికి యింకెన్ని పరిచయాలుండేవో! ఇప్పటికీ వున్నాయేమో! అందుకే తను వెళ్లకపోయినా పట్టించుకోవట్లేదు! అతనికి గుండెలో మండినట్టైంది.
యమునని పెళ్ళిచేసుకున్నాడు. భార్యగా నలుగుర్లో పరిచయం చేసాడు. ఆ పిల్లలు తన పిల్లలనే అంతా నమ్ముతున్నారు. కాదని యిప్పుడంటే వీళ్లంతా వూరుకోరు. సుమతితో చూచాయగా అంటే కొట్టిపారేసింది. ఏమో! సుమతే నిజమేమో! కావచ్చు.
నలభైకి అటూ యిటూ నిలబడి వున్నారు తనూ, గీతా. ఇరవయ్యేళ్ళు కాపురం చేసి, ఇద్దరు పిల్లల్ని కని, కొడుక్కోసం బెంగపెట్టుకుని ఏడుస్తుంటే అసహ్యంగా వుంది. వాసుకికూడా వాడు కొడుకేకాబట్టి ఓదార్చుతాడు. దాని పధ్నాలుగేళ్ల వయసప్పట్నుంచీ తన దార్లోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. ప్రేమేమీ కాదు. చిన్నప్పట్నుంచీ వాసు చెయ్యిపట్టుకుని తిరిగేదని కోపం, పంతం. మిగతావాళ్లతో వున్నట్టు తనతో వుండేదికాదని అసూయ. జడపట్టుకుని గుంజినప్పుడుగానీ, వాళ్ళింటికి వెళ్ళి బెదిరించినప్పుడుగానీ ఒక్కమాటకూడా బైటికి రాలేదు. చెప్తే, గొడవైతే వాసు చేసుకోడని వాళ్ళింట్లో దాచిపెట్టినట్టున్నారు. పెళ్లయాకకూడా వెంటపడ్డాడు తను. వాసుకి దానిమీద అనుమానం తెప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేసాడు. గొడవపడి వదిలేస్తాడని ఆశపడ్డాడు. తనన్నమాటలు ఒక్కటీ వాడికి చెప్పకుండా మేనేజి చేసుకుంది. చాలా తెలివైనది. దాన్ని భూమ్మీద పెడితే పంటలూ, ఆకాశంలో పెడితే వానలూ వుండవు.
ఇప్పుడేంటి?
అప్పుడది వాసుగాడి కోతి. ఇప్పుడు డబ్బున్న కోతి. చాలా కొన్నాడట దాని పేరుమీద. నెల తిరిగేసరికి వచ్చిపడే జీతం, రిటైరైతే వచ్చే పెన్షను, ఈ ఆస్తి. తన చేతికి రావాలి.


కొలీగ్ గృహప్రవేశం వేడుకకి ఆఫీసువాళ్లతో కలిసి వచ్చింది గీత. ఆఫీసు యింటికి దగ్గర కావడంతో వాసు దింపుతాడు. లోకల్ ట్రెయినూ, బస్సులూ అలవాటవ్వలేదు. అతనికి కుదరనప్పుడు ఆటోలో వెళ్ళి వస్తుంది. కారు తెచ్చుకుంటే మరో సమస్య. ఆఫీసరుని ఎక్కించుకోవాలి. ఆయనతోపాటు ఇంకొకళ్ళిద్దరు ఎక్కేస్తారు. స్టీరింగుకూడా తీసేసుకుంటారు. ఆమెకి నచ్చదు. ఫంక్షనయ్యాక అంతా ఎటువాళ్లటు డిస్పర్సయ్యారు. ఆటోకోసం చూస్తోంది. శశిధర్ ఆమెని చూసాడు. అంత దూరప్రదేశంలో ఆమెని చూసి అతనికి కొద్దిగా ఆశ్చర్యం కలిగింది.
“ఎక్కండి” అన్నాడు ఆమెముందు కారాపి.
“కొలీగ్ యింట్లో ఫంక్షనుకి వచ్చాను. ఆటోకోసం చూస్తున్నాను. వెళ్ళగలను. మీకెందుకు శ్రమ? ” అతని ఆశ్చర్యానికి వివరణ యిస్తూ మొహమాటంగా అంది.
“శ్రమేముంది? ఇంటికేగా? నేనూ అటే వెళ్తున్నాను రండి” అంటే ఎక్కి కూర్చుంది. జో, శ్రీధర్‍లతో స్వంతవాళ్లన్న చనువుంది. వల్లి భర్తని చూస్తే కృష్ణనీ, సంతోష్‍నీ చూసినట్టుంటుంది. ఇతనితో సమీరభర్తన్న దూరంమాత్రమే వుంది. సమీరతోకూడా దూరం మొదలైంది.
జయబాధురీకోతి. డబ్బున్న కోతి. శశిధర్ పెదాలమీద వినోదంతోకూడిన సన్నటి చిరునవ్వు కదిలింది. మనుషుల మనసుల్లో రకరకాల భావాలు కదులుతుంటాయి. ఒక్కోమనిషీ ఒక్కో భావప్రపంచం. ఒకరి ప్రపంచం మరొకరికి తెలీదు. కొన్ని వేల, లక్షల, కోట్ల మనుషులు భిన్నభిన్న ప్రపంచాలని తమలో మోస్తూ పక్కపక్కని తిరుగుతుంటారు. ఈ అపరిచితత్వం మనిషికి లాభాన్నీ నష్టాన్నీకూడా ఇస్తుంది.
ఫార్మాలిటీకి ఒకటిరెండు మాటలు నడిచాయి.
సగందూరం వెళ్ళాక రాణా కనిపించాడు. వెంటనే కారాపి, దిగేసి,
“బావా! నాకిక్కడ కొంచెం పనుంది. అది చూసుకుని యింటికెళ్ళిపోతాను. అక్కగారిని వాళ్ళింట్లో దింపి, కారు కాలేజిలో యివ్వు” అని, గీతకి చెయ్యూపేసి, అక్కడ తనకోసం ఎదురుచూస్తున్న ఫ్రెండు బైకు ఎక్కి వెళ్ళిపోయాడు. గీత లేకపోతే రాణా ఆ బైక్‍మీద వెళ్లాలి. ఆ ఫ్రెండీ కార్లోకి రావాలి. రాణా కారెక్కి కూర్చున్నాడు. కారు కదిలింది. అంతా గీత అర్థంచేసుకోవడానికి పట్టే సమయంలో సగంకూడా తీసుకోలేదు. రాణాతో శశిధర్‍కి అంత చనువెలాగో తెలీలేదు ఆమెకి.
“కారాపు రాణా! దిగుతాను. నేను వెళ్లగలను” అంది గీత.
“ఇంటికేగా? నేను తీసుకెళ్తాను. కుట్రేం లేదు యిందులో. అతనంతే. చాలామంది ఫ్రెండ్సున్నారు. ఇంటికెళ్ళేలోపు నాలుగు బైకులు మారతాడు, స్టీరింగు నాలుగుచేతులు మారుతుంది. సమీరైతే అనుకున్నచోట దింపేదాకా అతన్ని కదలనివ్వదు” అన్నాడు. కారు ఆపడని అర్థమైంది. వేగంకూడా పెంచాడు. మరోసారి తన్నులు తినడానికి సిద్ధమయ్యాడనుకుంది గీత. రెండుసార్లు బలమైన దెబ్బలు కొట్టగలిగినందుకు ధైర్యంగానే వుంది.
అతనూ సభ్యతగానే మాట్లాడాడు. “ఏదీ మర్చిపోలేదు గీతా! నువ్వు నన్ను కొట్టిన మొదటి చెంపదెబ్బదగ్గిర్నుంచీ మీనాన్న చేసిన అన్యాయందాకా. ఆతర్వాత జరిగినవాటిగురించి మరోసారి మాట్లాడుకుందాం. మాలో ఎవరికీ ఏమీలేదు గీతా! ఎవడు బాగుపడ్డా, నీ జీతంతోనే బాగుపడేవాడు. మొదటి పునాది అదే అయేది. నాకు చదువుమీద ఇంట్రెస్టు లేదు. స్పోర్ట్స్‌లో వుండేవాడిని. నిన్ను చేసుకునుంటే నాదార్లో నేను ముందుకి వెళ్ళేవాడిని. అంత వెంటనే సంపాదించాల్సిన అవసరం నాకుండేది కాదు. మానాన్న, నా ఫ్రెండ్సు అదే చెప్పారు. మీనాన్న నన్నడిగి వుంటే నా యాంబిషన్స్ చెప్పేవాడిని. ఆయన్ని వప్పించేవాడిని. నాకు అవకాశం యివ్వలేదు. నా లైఫ్ నాశనమైంది. వాసుని వదిలేసి, నాదగ్గిరకి వచ్చెయ్యడం ఒక్కటే దీనికి పరిష్కారం. నువ్వు విడాకులిచ్చి వచ్చావా, లేచొచ్చావా అనేది ఎవరూ అడగరు. డబ్బుంటే చాలు, గౌరవం యిచ్చే మనుషులు నాచుట్టూ వున్నారు” అన్నాడు
ఆమె ముఖం ఎర్రబడింది. పిడికిలి బిగుసుకుంది. ఇలా యిరికించినందుకు శశిధర్ని తిట్టుకుంది. కాకపోయినా ఎక్కడో ఒకచోట తారసపడతాడు. వాసు, మాధవ్‍ల భయం వుందికాబట్టి ఇంటికి రాడు. సాహసించి వచ్చినా తనూ వదిలిపెట్టట్లేదు. ఇలా ఎక్కడో ఎప్పుడో ఒకసారి వంటరిగా దొరుకుతోంది. మనసులో వున్న కల్మషమో, బతుకులోని చేతకానితనంతో వచ్చిన వుక్రోషమో వెళ్లగక్కుతున్నాడు.
రాణా ప్రవర్తనతో వాసు ఎలా రియాక్టౌతాడో, అతనికీ తనకీ మధ్య గొడవలొస్తాయేమోననే భయం చాలా వుండేది మొదట్లో. కథలూ, సినిమాల పరిజ్ఞానంతో భయపడిపోతూ చాలా ఏడ్చేది. తనకి చెప్పీ చెప్పకా పెళ్లయాక రెండుసార్లు కొట్టాడు వాసు. ఆక్షేపణ మరోవైపునించీ వచ్చింది.
“ఈ కొట్టుకోవడాలేంటి? వీడు కొడితే వాడు పడి వూరుకుంటాడా? నలుగురు ఫ్రెండ్సుని వెంటేసుకుని వస్తాడు. నాకొడుకుని వీధిరౌడీని చేస్తావా? రాణా ఎదురుపడితే పక్కకి తప్పుకో. పదిమందిమధ్యని వెళ్ళికూర్చో. నాయురాల్లా వెళ్ళి వాడితో నువ్వు దెబ్బలాడి, వాసుని రెచ్చగొట్టకు. రవితో చెప్పిస్తానులే, వాడికి. ఇదివరకట్లా చిన్నపిల్లవి కావు. పెళ్లైందన్న విషయం మర్చిపోకు” అని కోప్పడింది అత్త. పెళ్ళికిముందు వాళ్లిద్దరూ కొట్టుకున్నదే ఆవిడకి నచ్చలేదు. ఇక సమస్య పూర్తిగా తనదైంది. ఈ బురదపాము బుసలు తననేం చెయ్యవనికూడా అర్థమైంది.
అతనికేసి సునిశితంగా చూసింది గీత. జాలి, దు:ఖంలాంటి భావాలేవో కలిగాయి. కొద్దిసేపటికి అవికూడా తగ్గాయి. బేగ్‍లోంచీ ఫోన్ తీసింది.
“శశిధర్ కార్లో బయల్దేరాను. నువ్వు ఎదురొచ్చి మధ్యలో నన్ను దింపుకో” అని వాసుకి మెసేజి చేసింది. అతను వెంటనే మీటింగ్ పాయింటు చెప్పాడు. సుమతికి ఫోన్ చేసింది.
“శనివారంగానీ, ఆదివారంగానీ ఎక్కడేనా కలుద్దామా? రాగలవా? లతనికూడా తీసుకురా! ఒక బిజినెస్ ప్లాన్ వుంది. మాట్లాడదాం” అంది. ఆమె చెప్పింది విన్నాక ఫోన్ కట్‍చేసి,
“ఆదివారం నీ భార్యని తీసుకుని అవంతీస్ ఇన్‍కి రా! ఒక బిజినెస్ ప్లాన్‍చేసాను” అంది రాణాతో. అతనికి గందరగోళంగా అనిపించింది. తను విడాకులు తీసుకొమ్మంటే బిజినెస్ అంటోంది, సుమతినీ, లతనీ రమ్మంటోంది, యమునని తీసుకురమ్మంటోంది, ఏం చెయ్యబోతోంది? ఎక్కడేనా యిరికిస్తుందా? కొంచెం భయం వేసింది.
“ఏం బిజినెస్? యమునెందుకు?” అన్నాడు.
“యమునచేత బిజినెస్ పెట్టించాలనుకుంటున్నాను. తనని తీసుకురా. నీకేమన్నా భయాలూ, సందేహాలూ వుంటే నువ్వు రాకుండా తనొక్కదాన్నీ పంపించు” అంది.
“రాకపోతే?”
“ఇంకెవర్నేనా వెతుకుతాను. నీకే నష్టం” అని, “ఇక్కడాపు. వాసు వచ్చేసాడు” అంది.
తన ప్రతిపాదనగురించి మరోసారి గుర్తుచేసే సాహసంచెయ్యలేకపోయాడు. కారాపాడు. దిగేసింది.


వాసు యింటినుంచీ వచ్చేసాడు రాణా. కారు శశిధర్ చెప్పినట్టు వాళ్ళ కాలేజిలో పెట్టి యింటికెళ్ళాడు. ఎప్పుడోగానీ వెళ్లడు. ఇల్లనేమీ లేదు. దిగువమధ్యతరగతి లొకాలిటీలో చిన్నగది, వరండాతో యిల్లు. ఆమె జీతంతో అంతకన్నా పెట్టలేదు. వచ్చినప్పుడు చేతిలో వున్నదేదో యిచ్చివెళ్తాడు. అంతకన్నా బాధ్యత తీసుకోడు.
యమున వరండాలో కూర్చుని బట్టలు వుతుకుతోంది. కొడుకు యింట్లో లేడు. కూతురు, కొడుక్కికవల తల్లి వుతికిచ్చిన బట్టలు ఆరేస్తోంది. చేతిలో తడిబట్టలు పట్టుకునే వచ్చి తండ్రికి కనిపించింది. దగ్గిరకి పిలిచాడు. వచ్చి నిల్చుంది. ఏం మాట్లాడుకోవాలో యిద్దరికీ అర్థంకాలేదు.
“ఎలా చదువుతున్నావే?” అడిగాడు. ఆ అమ్మాయికి ఆ ప్రశ్న నచ్చలేదు. బాగానే చదువుతున్నానన్నట్టు తలూపి వెళ్ళిపోయింది.
“వాడేడి?”’ కొడుకుగురించి అడిగాడు.
“తెలీదు”
అతనికి నచ్చని జవాబు.
యమున కూతురికి పని అప్పగించి వచ్చింది.
“చూడు, గీతా సుమతీవాళ్ళూ నీచేత ఏదో వ్యాపారం పెట్టిస్తారట. ఏం వ్యాపారమో మరి! నిన్ను తీసుకురమ్మన్నారు. ఆదివారం వెళ్లాలి. మాట్లాడేటప్పుడు నన్నుండనిస్తారో, లేదో! వాళ్లన్న ప్రతిదానికీ తలూపక, నన్నడిగి చెప్తానను. వాళ్ల వ్యవహారాలన్నీ మొగాళ్లు అలానే చూసుకుంటారు” అన్నాడు రాణా ఆమెతో. పెద్ద కెరటమేదో బలంగా కొట్టినట్టైంది యమునకి.
“గీత తెలుసు. రెండో ఆవిడెవరు?” అడిగింది.
“మా ఆమ్మల్లో పెద్దావిడ కూతురు. వాళ్లదగ్గిరే నేనిప్పుడు చేస్తున్నది” అన్నాడు.
తనని వాళ్లంతా మర్చిపోయారనే అనుకుంది. ఇంకా గుర్తుంచుకుని, ఏదో చేద్దామనుకుంటున్నారంటే, అందులోనూ గీత అనుకుందంటే ఇంక తిరుగుండదు. ఆమెకి దు:ఖం ఆగలేదు. ఏడుస్తూ కూర్చుంది.
“ఏడవడం దేనికి? ఇష్టమైతే వెళ్ళి చేస్తావు, లేకపోతే లేదు” అడిగాడు వింతగా.
“నేనింకా బతికున్నానని మీయింట్లో గుర్తున్నందుకు” అంది. “మీవాళ్లంతా బాగా డబ్బున్నవాళ్ళు. పెద్దచదువులు చదివారు. బంగళాల్లో వుంటారు, కార్లలో తిరుగుతారు. గీతన్నావిడ యిల్లు చూసానుగా, వాళ్ల వంటిల్లే లంకంత వుంది. మీకు పెళ్ళైందనీ, నేనొకదాన్ని వున్నాననీ మర్చిపోవడం అటుంచి నాగురించి తెలీనివాళ్ళే ఎక్కువేమో! మీ చిన్నప్పుడెప్పుడో వాళ్లతో భుజాలమీద చేతులేసుకుని తిరిగారేమో! ఇప్పుడుమాత్రం మీరు ఆ లెవల్ మనిషికాదు. వాళ్లమధ్య తిరగడం మానేసి యిక్కడికొచ్చి, యింటిపట్టుని వుండి ఏదేనా చేసుకుంటే బావుంటుంది. ఎవరి జీవితాలు వాళ్లవి. ఎవరికి వాళ్ళు సంపాదించుకుని భార్యాపిల్లల్ని పోషించుకుంటున్నారు.
అందరిముందూ నా మెడలో తాళికట్టారు. పిల్లలు మీకు పుట్టలేదని అనడం ఏమంత సరైన మాట? నాకు మీరు తప్ప ఎవరు తెలుసు? మీరు మొదటిసారి పలకరించగానే ఎంత కంగారుపడిపోయానో మర్చిపోయారా? రెండేళ్ళు నాకోసం తిరిగారు. మీతో సినిమాకి రావడానికే ఏడాదిపట్టింది. మిమ్మల్నెప్పుడూ అవి కొనివ్వు, యివికొనివ్వని అడగలేదు. ప్రేమగా నాలుగు మాటలు చెప్పేసరికే పరవశించిపోయాను. మీరనుకునేలాంటి ఆడవాళ్ళు అడుగుతారేమో! మరోసారి నన్నలా అనకండి. నాకు బావుండదు. అంత యిష్టంలేకుండా ఇక్కడికి రావద్దు. పుస్తె తీసిచ్చెయ్యమంటే ఎప్పుడో ఇచ్చేసేదాన్ని. అది నా మెడలో వున్నందున నాకు పెద్దగౌరవం ఏమీ రాలేదు. నాన్న ఎప్పుడూ రాడేంటని పిల్లలు అడుగుతారు.
అతనంత బావుంటాడు, పెద్దింటివాడిలా వున్నాడు, నిన్ను చేసుకోవడమేంటి? రెండోపెళ్ళా? అదేనా ఏం చూసి? అందుకే యిక్కడుండడా- అని చుట్టూ వున్నవాళ్ళు గుచ్చిగుచ్చి ప్రశ్నలేసి, వేధిస్తారు.
మీరా పెళ్ళే చేసుకోకుండా వుంటే ఇంటిల్లిపాదిమీ ఇంత విషం తాగి చచ్చేవాళ్లం. పెళ్ళిచేసుకున్నారుకాబట్టే మీ భార్యనని నా ప్రాణం నిలబెట్టారు మీవాళ్ళు. ఈ పిల్లలిద్దరికీ ఒకదారి చూపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. కనమని వాళ్లడగలేదు, కనమంటారా అని నేనడగలేదు. ఏ జన్మరుణానుబంధమో, నేను సాధకంగా భూమ్మీద పడ్డారు. ఏదో నడిచిపోతోంది జీవితం. ఇప్పుడు వాళ్లందరిమధ్యకీ నేను రావాలా? నాతో అన్న చెత్తమాటలు వాళ్ళదగ్గిరా అనే వుంటారు? తలెత్తుకుని మాట్లాడే పరిస్థితి వుందా, నాకు?” అంది.
“ఎప్పుడో అన్నవీ, అనుకున్నవీ యిప్పుడెందుకు? నేను ఔనన్నా, కాదన్నా వాళ్ళు నా పిల్లలనే అంతా అంటారు. అలా అనుకోవడమే వాళ్ళకి మర్యాద. పిల్లల చదువుల విషయం వచ్చింది. ఎవరి పిల్లలని వాళ్ళు అందలాలకెక్కించుకుంటున్నారు. ఇంజనీర్లనీ డాక్టర్లనీ చేసుకుంటున్నారు. వీళ్ళకీ ఏదో దారి చూపించాలి. గీతావాళ్ళూ లేని పిల్లలెంతోమందిని చదివిస్తున్నారు. వీళ్లనీ చదివించచ్చు. కానీ వాళ్ళకలామ్టి ఆలోచన లేదు”
“సిగ్గుగా లేదా, అలా ఆశించడానికి? అలా ఆశించడానికి అలవాటుపడిపోయారా?”
“నిన్ను కట్టుకున్నప్పుడే అవన్నీ వదిలేసానుగానీ, నీకోదారి చూపిస్తామని వాళ్లంటున్నారు, ఇష్టమైతే రా”
“తప్పేదేముంది?”
ఆరోజంతా ఆమె ఏడుస్తునే వుంది.
పదమూడేళ్ళు విహీకి. యమున అనుభవించిన క్షోభా, దు:ఖం వయసుకూడా పదమూడేళ్ళే. ప్రేమించానన్నాడు. అతని వొడ్డూ, పొడవూ, ముట్టుకుంటే మాసిపోయేలా, నీటిచుక్కపడితే జారిపోయేలా వుండే వొళ్ళూ చూసి ప్రలోభపడింది. లొంగదీసుకున్నాడు. తీరా మూడోనెలని బైటపడ్డాక తప్పుకోబోయాడు. పెద్దగొడవలమధ్య తమ పెళ్లైంది. పెళ్ళికి అతనివైపునించీ పెద్దగా ఎవరూ రాలేదు. తల్లీ, తండ్రీ, అన్నదమ్ములట-వాళ్ళూ వచ్చారు. మరొకాయన చిన్నమేనమామ, ఆయన భార్య- వాళ్ళొచ్చారు. చాలా పెద్దకుటుంబం వాళ్లది. అందరూ వస్తే పందిరేసి, పెళ్ళిచేసి, భోజనం పెట్టే తాహతు తన తండ్రికి లేదు. తల్లి అనారోగ్యం మనిషి. అవసరం తోసుకొచ్చింది. ఇప్పుడు ఆపితే చెయ్యిజారిపోతాడేమోనని భయం. అందుకని క్లుప్తంగా ఐందనిపించారు.
కొడుకు చేసినపనికి తప్పనిసరై వప్పుకున్నారుగానీ, అతని తల్లిదండ్రులకి పెళ్ళి ఏమాత్రం యిష్టం లేదు. అన్నదమ్ములమని నిలబడ్డవాళ్ళు అతని పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలట. పెళ్ళయాక బంధువులంతా తలోరోజూ పిలుచుకెళ్ళి భోజనంపెట్టి, బట్టలు పెట్టి పంపించారు. ఆ చీరల్లోంచే కొన్నిటిని దాచుకుని దాచుకుని ఈరోజుకీ కడుతోంది. అందర్లోకీ చదువూ సంపాదనా లేనిది యితనే. మాట వినడు. మూర్ఖత్వం, మొండితనం. ఈ చందానికి అనుమానం తోబుట్టువు.
కొద్దిరోజులు అత్తగారింట్లో వుంది. ఆవిడకే నిలవడానికి కాళ్లకింద నేలలేదు. మామగారు ఎవరితోనో వుంటాడు. ఐనా యిద్దరూ కలిసి సాధించేసారు. ఒకవైపు కలతలతో కాపురం, మరోవైపు ప్రెగ్నెన్సీలో సమస్యలు. తండ్రిని పిలిపించి, కొంచెం డబ్బు చేతిలో పెట్టి, పుట్టింటికి పంపించేసారు. అక్కడితో పెళ్ళీ ముచ్చటా తీరాయి. ప్రాణంకూడా గాల్లో పెట్టిన దీపంలా ఆడటం మొదలుపెట్టింది. భూమ్మీద నూకలు చెల్లాయనుకుంటున్న తరుణాన గీతన్నావిడ ముందుపడి, అందర్నీ కూడదీసి, వైద్యానికి ఏర్పాట్లు చేసింది. పిల్లలు పుట్టిన నెలకి వాళ్లని ఆవిడకి చూపించడానికి వెళ్లింది.
చదువుకుని, వుద్యోగం చేస్తూ అంత పెద్దయింటికి మహరాణీ అయుండికూడా గుండెనిండా జాలి వున్న ఆమెని చూస్తే తనకి వొళ్ళు పులకరించింది. చిన్నదే. తన వయసేనేమో! ఆమెకికూడా నిండునెలలు తను వెళ్ళినప్పటికి. భారంగా తిరుగుతోంది. ఐనా భోజనానికి ఏర్పాట్లు చూసింది. ఇంకొకామె తోటికోడలట. తలనొప్పని లోపలికి వెళ్ళిపోయింది. అత్తగారు, నాయనమ్మ ఎంత ప్రేమ చూపించుకున్నారో, గీతమీద. భర్తకైతే ఆమెంటే ప్రాణంట. అరోకొరో విషయాలు అత్తగారు చెప్తే తెలిసాయి. కొడుకు పుట్టాడట. ఇంకా పుట్టకుండానే తన పిల్లలకి పెద్దావిడచేత పాలడబ్బాలు పంపించాడు వాడు. ఎలా వున్నాడో ఆ రాజకుమారుడు? ఇప్పుడు మళ్ళీ ఆమే ముందుకొచ్చి వ్యాపారం పెట్టిస్తుందా? ఏం వ్యాపారం? రాణా యిప్పటికి చాలా చేసాడు. అన్నీ దివాలా తీసాయి. అందుకే యిక తనచేత చేయిద్దామన్న ఆలోచన వచ్చి వుంటుంది.
పుట్టినప్పట్నుంచీ దుర్భరమైన లేమి తమింట్లో. తండ్రి వూరు చివరుండే దేవాలయంలో పూజారి. సోమవారాలూ, కార్తీకమాసం, చావులప్పుడూ తప్ప శివాలయానికి వచ్చేవాళ్ళెవరు? వాళ్ళూ వీళ్ళు దయతలిచి కొలిచిన బియ్యం, యిచ్చిన నాలుగు డబ్బులతో సగం జీవితం వెళ్ళింది. తను కాస్త పెద్దయ్యాక ఒక స్నేహితురాలి సహాయంతో బట్టల దుకాణంలో చెయ్యడం మొదలుపెట్టింది. వందనోటు కళ్లచూడటం అప్పుడే. ఏమార్పూ లేని జీవితం, అందులోకి అతను విసిరిన ప్రలోభపు వల. చిక్కుకుంది, అతన్నీ అందులోకి లాగింది. అతను విడదీసుకుని వెళ్ళిపోయాడు. భార్య అక్కర్లేదు. డబ్బు పడేస్తే తీరిపోయే అవసరాలతో ఆ స్థానాన్ని నింపుకున్నాడు. పిల్లలు తనకి పుట్టలేదనేసి, ఆ బాధ్యతా వదిలించుకున్నాడు. మిగిలింది తనకి వంటరిపోరాటం.
ఆమెకి దు:ఖం ఆగలేదు.


రెంట్ ఎ శారీ.
ఆదివారంనాడు యమునని తీసుకుని రాణా వెళ్ళేసరికి గ్రౌండువర్కంతా చేసుకుని కూర్చున్నారు గీత, సుమతి. లత మీటింగ్సేవో వుండి రాలేకపోయింది. అప్పటికప్పుడు రాలేకపోయినా తర్వాత సలహాలూ, మార్పులూ చేర్పులూ చెప్పింది. ముఖ్యంగా డబ్బు చెయ్యిజారిపోకుండా వుండే జాగ్రత్తలన్నీ చెప్పింది. షాపుమీద పెట్టిన పెట్టుబడి ఛారిటీ కాదు. వాయిదాల్లో తిరిగివ్వాలి. ఖర్చులన్నీ పోను మిగిలే లాభంలో కొంతశాతం సుమతికి పంపాలి. ఈ రెండు విషయాలూ యమునకి అర్థమయ్యేలా చెప్పింది. ఆమె రాణాని ఎంతదూరాన్న వుంచుతుందో, యముననికూడా అంతే దూరాన్న నిలబెట్టి చెప్పింది.
ఇంట్లో పాతికమందిదాకా ఆడవాళ్లున్నారు. ఒకొక్కళ్లదగ్గిర మేట్లేసుకుని పోయి వున్న చీరల్లోంచీ నాలుగైదు, పదిపాతిక చీరలు తీసివ్వడం ఎవరికీ కష్టమవ్వలేదు. వల్లి, అర్చన, పల్లవీవాళ్ళ జోక్యంతో వాళ్ళ ఫ్రెండ్సుకూడా చీరలిచ్చారు. కొంతమంది కస్టమర్లూ దొరికారు. కొన్ని చీరలకి డబ్బిచ్చింది యమున. లక్ష్మీవాళ్ళూకూడా పెద్దపెద్ద జరీచీరలు తీసిచ్చారు. అంతంత బరువ్వి ఇంక కట్టుకోలేమని. కొన్నిటిని యథాతథంగానూ మరికొన్నిటిని కొత్తగా వర్కదీ చేయించీ అందంగా షోకేసుల్లో పెట్టింది యమున. వర్కు చేయించడానికి కొన్ని కొత్తవికూడా కొంది. ముంబై వెళ్ళి వర్కు చేసిన రెడీమేడ్ బ్లౌజులు లాటులో కొనుక్కొచ్చింది. మిక్స్ అండ్ మేచికి అనుగుణంగా సర్దిపెట్టుకుంది. ఒకకొస పట్టుకుని లాగితే కుట్టు వూడొచ్చేలాంటి మినీకుట్టు మిషన్ జాకెట్లు రీసైజ్ చెయ్యడానికి పెట్టుకుంది. ఆమెకి టైలరింగ్ షాపుల్లోనూ, బట్టలకొట్లలోనూ చేసిన అనుభవం వుంది. దాన్ని బాగా వాడుకుంది. చేతికిందికి మనుషుల్నికూడా పాతస్నేహితులనుంచే తెచ్చుకుంది.
షాపు రిజిస్ట్రేషన్‍లాంటి ఫార్మాలిటీసన్నీ త్రిమూర్తులి ఫామిలీ లాయరు శ్యామ్మోహన్‍ద్వారా చేయించింది గీత. ఎక్కడా రాణా ప్రమేయం లేదు. అతన్ని పక్కకి నెట్టేసి, వ్యవహారాలన్నీ చురుగ్గా సాగిపోతున్నాయి. అతను తెల్లబోతున్నాడు. యమునతో దెబ్బలాడాలన్నా ఆమె ఎక్కడా దొరకట్లేదు. కాళ్లకి చక్రాలు కట్టుకున్నట్టు తిరిగి చేసుకుంటోంది. ఇదంతా వద్దు, మానెయ్యమందామంటే ఆమె వినేలా లేదు. తనకా అధికారం లేదన్న విషయం అర్థంచేసుకోలేకపోతున్నాడు.
ఒకేఒక్కసారి గీత అతనికి ఎదురుపడింది. మొహంలోకి చూడటానికి హడిలిపోయాడు. రాక్షసీ, బ్రహ్మరాక్షసీ అన్నిళ్ళలోనూ అగ్గి ముట్టించి వదిలిపెట్టింది. పెట్టుబడేమీ పెట్టకుండా పెట్టెల్లోని చీరలని సంపాదించుకు రమ్మని పురమాయించింది. వాసు జుట్టులోంచీ పుట్టుకొచ్చింది. వీళ్ల గేదెలు వాటి తిండికి అవి సంపాదించుకుని వీళ్ళకికూడా నాలుగు డబ్బులు తెచ్చిపెడుతున్నాయట. ఇప్పుడు చీరల వంతు. యమునకి అప్పుడే తెగింపు వచ్చేసింది. తను ఆమెని పట్టించుకోకపోవడం కాదు, యమున చుట్టూ తనే తిరగాల్సి వస్తోంది. ఆమెని ఇంకెంత దూరానికి విసిరేస్తుందో ఇది! అసలే గీతంటే యమునకి నెత్తిమీది దేవత. తననింక లెక్కచేస్తుందో లేదో!
అతని ఆలోచనలు చదివినట్టు కళ్ళెగరేసి నవ్వింది గీత.
యమునని అతను ప్రేమించనప్పుడు, అవసరానికి వాడుకుని వదిలెయ్యాలనుకున్నప్పుడు, పిల్లలు తనకి పుట్టనే లేదనుకున్నప్పుడు ఆమె అతన్నెందుకు లెక్కచెయ్యాలి? లెక్కచెయ్యకపోతే బాధెందుకు? భయం ఎందుకు?
“పోతే మాకొక పదిచీరలే పోతాయి. ఆ నష్టం ఒక లెక్కలోది కాదు. నీకుమాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. జాగ్రత్తగా చేసుకో. గీతకి సడెన్‍గా వచ్చింది యీ ఆలోచన. ఎవరికివాళ్లం యిన్నేసి చీరలని చికాకుపడుతున్నాం, అలాగని కొనడం మానట్లేదు. ఇలా ఆలోచించడంమాత్రం గీతకే వస్తుంది. డబ్బు దగ్గిర ఎవరినీ నమ్మకు. ఆఖరికి రాణానికూడా. కేష్‍దగ్గిర నువ్వు కూర్చుని, చీరలు చూపించడానికి ఎవర్నేనా పెట్టుకో. వాడికి బాధ్యత తెలీదు. మా పందొమ్మిదిమందిలో వాడొక్కడే యిలా. ఇప్పటికి చాలాసార్లు వ్యాపారాల్లోకి దిగి, నిండా మునిగాడు. నీమీద నమ్మకంతో మొదలుపెట్టిస్తున్నాం. పెట్టుబడి అప్పులు తీర్చాలి, పిల్లల చదువులకి దాచాలి. ఇప్పుడు మా పిల్లలంతా కలిసి పాతికమందికి పైని. వాళ్లతో సమానంగా మీపిల్లలూ పెరగాలి” అని దగ్గర కూర్చోబెట్టుకుని చాలా చెప్పింది సుమతి. సుధీర్, వాసుల తర్వాత పెద్దది ఆమే. మిగతావాళ్లకి అక్కలాగే బాధ్యతగా వుండేది. ఇప్పుడూ అదే బాధ్యత చూపించింది.
తులసి, మాధురి, మానస, సమీరలు యమునకి పరిచయమయ్యారు. అందరూ మర్యాదగానే మాట్లాడినా అంతరాలు తెలుస్తున్నాయి.
రాణా పిల్లలిద్దరినీ సమీరకి అప్పగించింది సుమతి. వాళ్ళ హాస్టల్లో పెట్టుకుని పదో తరగతిదాకా స్కూలుకి పంపడానికీ, అదయ్యాక ఇంటర్లో వాళ్ళదగ్గిరే చేర్చుకోవడానికీ. షాపు అందుకున్నాక వెనక్కి తీసుకుంటానని ఫీజులవీ తనే కట్టింది.
“కోపం తగ్గిందా గీతూ?” అడిగాడు వాసు, హడావిడంతా చల్లారాక.
“ఒళ్ళింకా మండుతోంది” అందామె.
“అల్లరి యింక చాలు. రాణా చచ్చి వూరుకుంటాడు. ఇప్పటికే సగం చచ్చాడు. ఏడుపొక్కటే తక్కువ. ఇలాకూడా ఎవర్నేనా ఏడిపించవచ్చని తెలుసుకున్నాను” అన్నాడు పెద్దగా నవ్వి.
“యమున తెలివైనదే. పర్వాలేదు. ఆమె దార్లోకి వాడు వెళ్ళాల్సిందే. లేకపోతే ఎవరిదారి వాళ్లది” అంది గీత.
“ఆ షాపేదో రాణా పేరుమీద పెడితే బావుండేదికదే? సంధ్యకూడా అదే అంది” అంది లక్ష్మి మరో సందర్భంలో ఆక్షేపణగా.
“మరోసారి మునిగేవాడు. తల్లికీ, పిల్లలకీ మరో ఆశ మిగలకుండా” ఠపీమని అంది గీత.
“మగవాడు రికామీగా తిరుగుతుంటే ఇది సంపాదించి ఇంటిని పోషిస్తుందా? అసలే వాళ్ల కాపురం అంతంత మాత్రం. ఇప్పుడింక అసలే వాడిని లెక్కచెయ్యదు” కోపం వచ్చిందావిడకి. ఆవిడకి అకారణంగా వస్తున్న కోపాల్లో యిదొకటి.
“వాడిని సంపాదించద్దని ఎవరన్నారు? ఇద్దరూ తెచ్చుకుంటే మంచిదేగా?” అంది గీత.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *