ఝరి 208 by S Sridevi

గీత ముందుగా పూజారిగారింటికి వెళ్ళింది. వాళ్లింట్లోనే ప్రస్తుతానికి పిల్లల భోజనాలు, చదువులు. ట్యూటరు అక్కడికే వెళ్ళి చదువు చెప్తున్నాడు. ఎక్కువసేపు కాలు నిలవలేదు. ఆవిడ్ని పలకరించి, పిల్లల్ని చూసుకుని బైటపడింది. ఇంకెక్కడికి వెళ్ళాలో తోచలేదు. చీరల షోరూమ్ కనిపిస్తే అందులోకి అడుగుపెట్టింది. అక్కడ శశిధర్ కనిపించాడు. అతనివెంట ఒకమ్మాయి వుంది. చిన్నది, చాలా అందంగా వుందిగానీ ముఖం అంత సౌమ్యంగా లేదు. ఇద్దరూ కలిసి చీరలు చూస్తున్నారు. గీతనిచూసి అతను తడబడ్డాడు. చెయ్యి తీసేసి దూరం జరిగాడు. గీత చూడకపోతే వెళ్లిపోయి బైటా నిలబడదామనుకున్నాడు. కానీ చూసింది, పలకరించింది.
“చాలారోజులైంది తమ్ముడూ, మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో మాయింటికి వచ్చారు, మళ్ళీ రాలేదు, మమ్మల్నీ యింకోసారి రమ్మనలేదు. సామ్ ఎలా వుంది? మీ అమ్మానాన్నా? ” అడిగింది ఓకంట ఆ అమ్మాయిని చూస్తునే. అతని తండ్రికి పక్షవాతం వచ్చింది. లక్ష్మితో కలిసి వెళ్ళి చూసొచ్చింది. వాసు, వసంత్ విడిగా వెళ్ళారు. అదెప్పటిమాటో. మళ్ళీ కలవలేదు.
“అంతా బానే వున్నారు. సమీరని చూడటానికి మీరే రావచ్చుగా? తమ్ముడింటికి రావడానికి పిలుపు కావాలంటారా?” అన్నాడతను నవ్వడానికి విఫలప్రయత్నం చేస్తూ. “మాకు బాగా కావలిసిన అమ్మాయి. నర్మద అనీ, బీటెక్ చదివింది. జాబ్‍కోసం చూస్తోంది. చీరలు కొనుక్కుంటానంటే తీసుకొచ్చాను” ఇక తప్పదన్నట్టు పరిచయం చేసాడు. చురుగ్గా చూసింది గీత. అతను గతుక్కుమన్నాడు.
ఇదెక్కడి గొడవరా, బాబూ! ఈవిడ దగ్గర యిరుక్కున్నాను. పొద్దున్న పోలీసుకేసులోంచీ అతను బైటికొస్తే సాయంత్రానికల్లా చీరలు కొనుక్కోవడానికి బయల్దేరిందేమిటి? చిరచిర్లాడాడు.
“అక్కగారు ఒక్కరే వచ్చారు, మీ శ్రీవారేరి?” అడిగాడు రానున్న ప్రమాదాన్ని అంచనావెయ్యడానికి. ముందురాత్రినుంచీ జరిగింది తెలీనట్టు. రాణా అతనికి పూర్తి అప్డేట్స్ ఇచ్చాకకూడా. గీత జవాబుకోసం ఎదురుచూడకుండా, “అడిగానని చెప్పండి. వీలు చూసుకుని రండి ఒకసారి” అనేసి, “మీరు నిదానంగా తీసుకోండి. మేం వెళ్తాం. నాకు కొంచెం పనుంది” అన్నాడు సెలక్షన్ ముగించి, గబగబ కౌంటరువైపు నడుస్తూ.
అసలే కోతి. మూతి బిగించి బయల్దేరింది. గుడ్లుకూడా మిటకరిస్తోంది. కోతిపుంగవుడు ఎక్కడో! అవంతీస్ ఇన్ సంఘటన గుర్తుతెచ్చుకున్నాడు. సుమతి పరిహాసం గుర్తొచ్చింది. మరింత వొళ్ళుమండింది. నర్మద విషయం సమీరకి చెప్తుందేమో! వీళ్ళ సైన్యం అందరినీ తీసుకుని యుద్ధానికొస్తుందా? ఏడాదినుంచీ స్మూత్‍గా సాగిపోతోంది వ్యవహారం. ఇప్పుడింక లేనిపోని తలనొప్పి. చిరచిర్లాడాడు.
అతని కోపం, తడబాటూ, తనని తప్పించుకుని వెళ్ళిపోవాలన్న ఆత్రం గమనించింది గీత. బిల్లు కట్టాక నర్మద చీరల కవరు పట్టుకుని షాపుముందు నిలబడితే శశిధర్ కారు తీసుకుని వచ్చాడు. తనే లోపల్నుంచీ డోర్ తీసాడు. చేతిలోని కవరు అందుకున్నాడు. ఫ్రంట్‍సీట్లో అతనిపక్కని ఎక్కికూర్చుంది. కారు టర్న్‌చెయ్యబోతూ తలతిప్పి చూసాడు. అటే చూస్తున్న గీత చూపులు కలిసాయి. వెంటనే తలతిప్పుకుంది. కోపం, దు:ఖం ముంచెత్తాయి ఆమెని.
సమీర కార్లో, సమీర భర్తపక్కని మరో అమ్మాయి. ఎవరీ నర్మద? ఇద్దరికీ అంత చనువేంటి? భుజమ్మీద చెయ్యేస్తూ, భుజమ్మీద చీర పరుచుకుంటే నాణ్యత, అందం పరిశీలిస్తూ ఆమెకి యితను చీరలు కొనడమేంటి? సమీరకి తెలుసా, ఈ అమ్మాయి? తెలిస్తే అది రావాలిగానీ, అతన్ని పంపడమేంటి? మామూలుగానైతే తప్పు లేదు. కానీ అతని ప్రవర్తన సహజంగా లేదు. వీణ గుర్తొచ్చింది. ఈ చిన్నచిన్నపిల్లలంతా పెళ్ళిళ్ళైన మగవాళ్ళ వెంటపడుతున్నారెందుకు? పిడికిళ్ళు బిగుసుకున్నాయి. సరిగ్గా అప్పుడే వాసు ఫోనొచ్చింది. అవంతీస్ ఇన్‍కి రమ్మని. అతనికి జవాబు చెప్పి పెట్టేసింది.
అంతసేపు కూర్చుని, కొనకపోతే బావుండదని, కంటికి కనిపించిన చీరొకటి బిల్‍చేయించుకుని ఇవతలికి వచ్చింది. కోపం చల్లారట్లేదు. వాసు ఫోను ఆమె కోపానికి చిన్నబ్రేక్. చీర కొనడం అవగానే మళ్ళీ కొనసాగింది. చూసుకోకుండా మెట్టుందనుకుని లేనిచోట అడుగేసి, పడబోయి, రెయిలింగ్ గట్టిగా పట్టుకుని ఆపుకుంది. రెయిలింగ్‍కి ఆనుకుని వున్న గోడ రాచుకుని మోచెయ్యి మంటపుట్టింది. రెండోచేత్తో తడిమి చూసుకుంటే కొంచెం రక్తం అంటింది.
“అయ్యో! చూసుకుని నడవండి మేడం! దెబ్బేమైనా తగిలిందా? సాయం కావాలా?” పక్కనుంచీ వెళ్తున్నవాళ్ల పరామర్శ.
ఏంటి చూసుకునేది? ఒళ్ళు భగభగమంటుంటే ఇవన్నీ కనిపిస్తాయా? పార్కింగ్‍లోచీ కారు తెచ్చుకుని, మండుతున్న చేతిని మిర్రర్లో చూసుకుని, వాటర్‍బాటిల్లో నీళ్ళు పెట్టి కడిగితే ఎర్రగా వచ్చాయి. టిష్యూతో తడి అద్ది, బోరిక్ పౌడర్ చల్లి,
నీకిది చాల్లే- అని దెబ్బకి చెప్పి, బేండెయిడ్ అతికించి, అవంతీస్ ఇన్‍వైపుకి వురికించింది.
గీత వెళ్ళేసరి వాసు, వాళ్ళ యూనియన్ సెక్రెటరీ- పేరు రామస్వామి, ఆయన భార్య మంజులా వచ్చి వున్నారు. గీతని చూడగానే వాసుకి రిలీఫ్‍గా అనిపించింది. అప్పటిదాకా కాస్త టెన్స్‌గానే వున్నాడు. కొంతకాలంగా మొదలైన వరస దు:ఖాలని అడుక్కి నెట్టి, ఆ ముందటిరోజుల్లో నవ్విన నవ్వొకదాన్ని దొరికించుకుని పెదాలకి అతికించుకుంది గీత. పరిచయాలయ్యాయి. మాటలు సాగుతున్నాయి. ఇంటలెక్చువల్ టాక్‍లా నడుస్తోంది సంభాషణ. మంజుల అందుకోలేకపోతోంది. కానీ నచ్చింది. రామస్వామి ఆలోచిస్తున్నాడు. అతనికి ఒకే సొసైటీలో రెండు ఫ్లాట్స్ వున్నాయి. ఒకదాంట్లో వీళ్ళుండి, మరోటి అద్దెకి యిస్తారు. రెండోది ప్రస్తుతం ఖాళీగా వుంది. వీళ్ళకి యివ్వచ్చా, యివ్వకూడదా, వీణగురించి వాసు చెప్పినవన్నీ నిజాలేనా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. డిన్నరయాక వాళ్ళు వెళ్లిపోయారు.
“మనం ఈరోజు బైట వుందాం గీతూ! పక్కనే అవంతీస్ పారడైజ్‍లో రూం బుక్‍చేసాను. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. రేపు ఆదివారమేకాబట్టి, నెమ్మదిగా వెళ్లచ్చు” అన్నాడు వాసు వాళ్లని పంపించాక.
“ముందే చెప్పద్దా? బట్టలు తెచ్చేదాన్ని” అంది గీత.
“వెళ్ళి తెచ్చుకుని, తాళాలవీ చూసుకుని వచ్చేద్దాం” అన్నాడు. తలూపింది.
“చేతికేమైందే?” పమిటకొంగు వెనకనుంచీ గమనించి అడిగాడు.
“కాలు స్లిప్పైంది”
“కాలు స్లిప్పైతే చేతికెందుకు తగుల్తుంది గీతా? పడ్డావా?”
“లేదు. చేతిమీద బేలన్స్ చేసుకున్నాను. గోడ రాసుకుంది” అంది. ఒక్కదాన్నీ బైటికి వెళ్లమన్నందుకు, ఆమె పడబోతే చెయ్యందించడానికి తను పక్కని లేనందుకు అతనికి బాధనిపించింది. తమకింక వంటరిపోరాటాలుకూడా మొదలయ్యాయా? చప్పుని ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
“జాగ్రత్తగా వుండాలికదే? ఒక్కదానివీ వున్నప్పుడు ఇలా దెబ్బలూ అవీ తగిలించుకుంటే ఎలా?” అన్నాడు. ఇంట్లో వుండగా ఆమె ఏమేం చేయబోయిందో తెలిస్తే అతనికి గుండె ఆగినంత పనయ్యేది.
“ఒక విషయం చెప్పాలి నీకు. ఇప్పుడు కాదులే, నెమ్మదిగా చెప్తాను” అంది. ఇద్దరూ ఇంటికెళ్ళారు.
లోపలికి అడుగుపెడుతుంటే దిగులుగా అనిపించింది ఇద్దరికీ. మనుషుల్లాగే యిళ్ళుకూడా క్రమంగా జీవచైతన్యాన్ని పోగొట్టుకుని వంటరితనపు గూళ్లలా మారిపోయి, చచ్చిపోతాయి. వాటిల్లో వుండలేక వదిలిపెట్టేసి వెళ్లిపోతుంటారు. లేదా పడగొట్టేస్తారు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన యిల్లుకూడా అలానే అనిపించింది వాసుకి. ఇంక తనకి దీంతో రుణం తీరిపోయింది. ఆవిడ ఒక్కర్తీ వుండలేదు. అమ్మేస్తుందేమో! కొనుక్కున్నవాళ్ళు పడగొట్టేస్తారు. అప్పుడింక పాత జ్ఞాపకాలూ, నవ్వులూ, కన్నీళ్ళూ అన్నీ ఆ శిథిలాల్లో కలిసిపోయి, వునికిలో లేకుండా పోతాయి. కొత్తనవ్వులు కొత్తఅల్లర్లు మొలుస్తాయి. తన తండ్రిపేరు అందరూ మర్చిపోయారు. అప్పటివాళ్లెవరూ యిప్పుడు లేరు. చుట్టుపక్కలవాళ్లు చాలామంది యిళ్ళు డెవలప్‍మెంటుకి యిచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. తన తల్లికి ఫామిలీ పెన్షన్ వస్తుంది. అది వున్నంతకాలం ఆఫీసు రికార్డుల్లో ఆయన పేరుంటుంది. ఆతర్వాత పెన్షను ఫైలు మూసేస్తారు. అక్కడితో ఆయన చరిత్రకి భరతవాక్యం పలికినట్టే. తమ జీవితాలూ అంతే. ఇంకో పదేళ్ళో పాతికేళ్ళో. షట్‍డౌనైపోతాయి. మయూ విహీల తరం నడుస్తుంది. ఇదొక ప్రవాహం. అసంఖ్యాకమైన జనప్రవాహం. కుటుంబాల ప్రవాహం. వైయక్తికమైన అనుభవాల ప్రవాహం.
ఆరాటంగా వాసు ఇల్లంతా తిరుగుతుంటే గీత ఒక చిన్నబేగ్‍లో మర్నాటికి కావల్సినవి తీసుకొచ్చింది.
“ఇళ్ళూ, మనుషులూ, సమాజం అన్నీ చచ్చిపోతున్నాయి బావా! ఇళ్ళు తిరగడానికి మనుషుల్లేకా, మనుషులు విలువలు వదిలేసీ, సమాజం విలువల్లేని మనుషుల్తో వుక్కిరిబిక్కిరౌతూనూ చచ్చిపోతున్నాయి. మన చిన్నప్పటికీ యిప్పటికీ చాలా మారిపోయాయి రోజులు. అప్పుడంతా సంతోషమే వుండేది. ఇప్పుడదేంటో, మనని వెతుక్కుంటూ దు:ఖం వెంట తిరుగుతోంది” అంది అతని మనసు చదివినట్టు.
“దు:ఖమేం లేదమ్మా! సంతోషాన్ని వెతుక్కుంటూ మనమే తిరుగుదాం. ఇక్కడ పూర్తి సంతోషాన్ని అనుభవించాం. కొత్తచోట కొత్తగా వెతుక్కుందాం. మనకేం తక్కువ గీతూ?” అన్నాడు.
గేటుకి తాళం వేసి, కార్లో కూర్చున్నాక శశిధర్ కలిసిన విషయం చెప్పింది.
“ఎందుకిలా చేస్తున్నాడు? సమీరకేం తక్కువ? అదెందుకు వూరుకుంటోంది?” వుక్రోషంగా అడిగింది.
“ఇంక మనకీ విషయాలు వద్దులే! ఎవరివాళ్ళు వాళ్ళకే వున్నారు. మనం చెప్పినా ఎవరూ వినరు” అన్నాడు.
“పెద్దవడమంటే ఇదేనా?” బాధపడింది. “ఎన్నో సమస్యలని మనందరం కలిసి పరిష్కరించుకున్నాం. ఇప్పుడేంటిలా? ఎవరికివాళ్ళం విడిపోయి బతుకుతున్నాం?” అంది.
“అప్పటి సమస్యలు చిన్నవి, పరిష్కారానికి అందేవి. ఇప్పుడలా కాదు” అన్నాడు.
శశిధర్ తండ్రికి పెరాలిసిస్ వచ్చింది. అంతకిముందొకసారి హార్ట్‌అటాకొచ్చింది. ఇక పోతాననిపించి, పోయాక పిల్లలు గొడవలు పడతారేమోనని ఎవరిది వాళ్లకి పంచిచ్చేసాడు. ఇతని వాటాకి రావల్సినవి తల్లీపిల్లలకీ అని లెక్కేసి నాలుగింట మూడొంతులు సమీర పేరిట పెట్టాడు. తండ్రికి ఎదురుచెప్పలేక అప్పటికి వూరుకున్నా, సమీరచేత కాలేజికి సంబంధించిన కాగితాలు వేటిమీదో సంతకాలు పెట్టించుకున్నారు శశిధర్, అతని అన్నా కలిసి. ఇద్దరూ కలిసి ఆమెని సాధిస్తున్నారు. పెద్దతని భార్యకూడా వాళ్ళకి వంతపాడుతోంది. వాళ్ళ తల్లిమాట చెల్లట్లేదు. అదంతా చెప్పి,
“అప్పటికే ఆస్థివిషయంలో శశిధర్‍కి కోపంవచ్చింది. మళ్ళీ గొడవెందుకని పెట్టేసింది. అక్కడే వున్నా, ఇవతలికి వచ్చినా, ఆస్థి వద్దనుకున్నాకూడా ఆ లిటిగేషన్నిమాత్రం వదిలించుకోలేదు. ఇప్పుడు భార్యాభర్తలమధ్య సరైన సంబంధాలు లేవు. ఎవరిగదిలో వాళ్ళుంటారట. వసంత్ చెప్పాడు.
అరేయ్, ఏం చెయ్యడానికీ మనకి స్వతంత్రం వుండదు. చూసీ చూడనట్టు వదిలేస్తే అతనూ తేలుకుట్టిన దొంగలా వుంటాడు. తెలిసినట్టు బైటపడ్డామనుకో, తెగబడిపోతాడు. సామ్ వాడిని వదిలేసింది. పిల్లలని నెమ్మదిగా బైటికి పంపించి, లాయరు సలహాతీసుకుని, ఆ లిటిగేషనేంటో విడిపించుకుని, తనూ వెళ్ళిపోదామని సమీర ఆలోచన. ఆర్నెల్లక్కడా ఆర్నెల్లిక్కడా అని కాకుండా, వాళ్లతోపాటు ఏకంగా ఎమ్మెస్ చెయ్యడానికే వెళ్ళాలని ఆలోచిస్తోందట సమీర. ఆ మూర్ఖుడు దాన్ని వెళ్లనిస్తాడా, లేదా అన్నది చూడాలి. అప్పుడు, దానికి మనమేదైనా చెయ్యగలిగితే చెయ్యాలి-అని.
అప్పటిదాకా ఏం చెయ్యలేం” అన్నాడు వాసు.
పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి. అన్నీ చూసుకుని, ఇద్దరికీ యిష్టమయ్యాకే చేసారు. సంతోషంగా తిరిగారు. కాపురం చేసారు. ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఇష్టమో, కష్టమో, ఆతర్వాత వుండాల్సింది నిబద్ధత. ఎందుకు లేకపోయింది అతనికి? ఇంట్లో మనిషిలా కలిసిపోయిన భార్యదగ్గిర కాకుండా బైటి వ్యక్తిదగ్గర నమ్మకం ఎలా దొరుకుతుంది? ఎవరా నర్మద? పెళ్లైనవాడి వెంట ఎందుకు తిరుగుతోంది? తనింట్లో వాసుకోసం పెద్దయుద్ధమే జరుగుతోంది. తనూ సమీరలాగ ఓడిపోవాలా?
ఉహు< వాసు గెలిపిస్తాడు.
ఏదో పాటందుకుంది. కాస్త హుషారొచ్చింది. వాసు కారు వేగం పెంచాడు. డిన్నరైపోయింది, ఫ్రెషై పడకకి వుపక్రమించారు. అతను పక్కనున్నాడుకాబట్టి గీతకి తేలిగ్గా నిద్రొచ్చేసింది. అతనికలా కాదు. ఒక్కరోజులో మారిపోయిన జీవితం భయపెడుతోంది. ఎటువంటి నేరచరిత్రా లేని తనకి ఒకరోజు పోలీసు కస్టడీలో వుండటమనేది చిన్నవిషయం కాదు. వెంటనే బైటికి తీసుకురాగలిగారు. అదే కస్టడీ నలభయ్యెనిమిది గంటలైతే మళ్ళీ సస్పెన్షను, కన్విక్షనా, ఎక్విటలా అనేదానిమీద వుద్యోగం నిలబడి వుండేది. ఎలా బైటపడాలి యిందులోంచీ? తనకి అవసరంలేని, సంబంధంలేని ఈ చికాకుల్లోంచీ? తర్వాతేం జరగబోతోంది? ఎవరు పరిష్కారం చూపిస్తారు? వీణకేం కావాలి? రాణాకి? అమ్మకి? తులసికి?
ఇప్పుడు త్రిమూర్తులి ఇంటి వ్యవహారాలు మాధవరావు చూస్తున్నట్టున్నాడు. తనకి అతనితో పెద్దగా చనువులేదు. గీతద్వారా ఆ యింటి పరిచయాలే. త్రిమూర్తులినిమాత్రం పెళ్ళికి ముందు నాలుగైదుసార్లు మేనమామతో వెళ్లినప్పుడు చూసాడు. సుమంత్‍వల్ల పనవలేదు. గీతవల్ల అయింది. ఎవరో చేస్తారు, చూసుకుంటారని వదిలిపెట్టదు. చెయ్యిదాటిన పరిస్థితినికూడా వెనక్కితీసుకొస్తుంది. కానీ ఎంతవరకూ? నిజానికి ఇవన్నీ చెయ్యడం తనకి రాదు. ఎవరినేనా సలహా అడగాలి.
“నిద్రపట్టలేదా?” అతను అశాంతిగా కదులుతుంటే మెలకువ వచ్చి అడిగింది గీత.
“నువ్వు లేచావేం? పడుక్కో” అన్నాడు, మరింత దగ్గరికి జరిగి. ఆమెకూడా దగ్గిరకి జరిగింది. చిరపరిచితమైన ఆ స్పర్శ అపరిమితమైన వోదార్పునిచ్చింది. క్రమంగా ఆలోచనలు ఒకదార్లోకి వచ్చాయి. ఇద్దరికీ వాలంటరీ రిటైర్‍మెంటు తీసుకునేంత సర్వీసైంది. రిటైరైపోయి, అందరికీ దూరంగా వెళ్ళిపోవటమే. తామెక్కడున్నారో మయూవిహీలకి తెలిస్తే చాలు. మిగిలిన పదమూడుమంది పిల్లల విషయం ఆలోచించాలి. మధ్యలో వదిలేసే బాధ్యత కాదది. గీత ఒక ధ్యేయంగా ఎత్తుకున్నది. అదొక్క ముడీ విడితే తనీ మనుషులమధ్యనుంచీ స్వేచ్ఛపొందినట్టే. ఈ ఆలోచనలతో వాసు మనసుకి నిశ్చింత వచ్చింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు లేచేసరికి బాగా ఆలస్యమైంది.
తయారై బ్రెక్‍ఫాస్ట్‌కి వచ్చారు. బఫే నడుస్తోంది. ఇద్దరూ చెరో ప్లేట్లోనూ పెట్టుకుని వచ్చారు. ఇడ్లీలో చిన్నముక్క తుంపి చట్నీలో ముంచి, గీత నోటికి అందించాడు వాసు.
“ఇదేంటి కొత్తగా?” కాస్త ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ అడిగింది.
“నాకు నీమీద ప్రేమ వుందని ఎవరికీ తెలీడంలేదట గీతా! ఇకనుంచీ నీకిలా తినిపిస్తుంటాను, నీ నడుంమీద చెయ్యేసి నడుస్తాను. ఏదో ఫ్రెండ్స్‌లా చేతులుపట్టుకుని నడవడం కాదు. ఇంకా చాలా చేస్తాను” అన్నాడు.
“అప్పుడుగానీ మనమీద పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టరు” అంది.
“ఇద్దర్నీ ఒకటే సెల్‍లో వేస్తారు. నేను చేసేవి ఆపక్కర్లేదు”
“అరవయ్యేళ్ళకి అన్నంభొట్లు అటకెక్కాడట”
“ఔనట. ఆ వెధవ నాకూ చెప్పాడు. ఎక్కాక దిగలేకపోతే వాళ్ళావిడ చెయ్యందించి దింపిందట”
నవ్వేసింది.
“సంతోషంగా వుందాం గీతా! జరిగేవి జరుగుతుంటాయి. తప్పదుకాబట్టి వాటికి కొద్దిగా చోటిచ్చి ఎక్కడో ఒకమూలకి సర్దేద్దాం” అన్నాడు. అది ఆమెకి చెప్తున్నట్టు కాకుండా తనకి తను నచ్చజెప్పుకుంటున్నట్టుంది.
ఇద్దరూ ఇవతలికొచ్చారు. రివర్‍సైడు వెళ్ళారు. ప్రశాంతంగా వుంది నదీతీరం. ఎవరో ఒకరిద్దరు మనుషులున్నారు. ఒకప్పుడు చాలా పడవలుండేవి. ఒకటే కనిపించింది. పడవతను ఎక్కడో చెట్టుకింద కూర్చుని బీడీ కాల్చుకుంటుంటే అతన్ని వెతుక్కొచ్చి పడవెక్కారు. గంటసేపు తిరిగాక, పైబట్టలు తీసేసి వాసు నీళ్లలోకి దిగాడు. అరగంట యీతకొట్టి వచ్చాక అతనికి మనసులో దిగులంతా పోయి ఉల్లాసంగా అనిపించింది.
“చాలా బావుంది గీతా! ప్యూర్ బ్లిస్. ఇలాంటి చిన్నచిన్న సంతోషాలని దూరం చేసుకుంటున్నాం. పెద్దపెద్ద దిగుళ్ళన్నిటినీ మనసుకి ఎత్తుకుంటున్నాం. ఈసారి బైటికి వచ్చేటప్పుడు నువ్వుకూడా డ్రెస్సేదైనా తెచ్చుకో. ఈ సంతోషాలు చాలు మనకి. నదిని వదిలేసారు, గ్రౌండుని వదిలేసారు, సూర్యోదయాలు, చంద్రోదయాలు అన్నిటినీ వదిలేసి ఎదుటివాడి బాధలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. లోపల్నుంచీ వచ్చే సంతోషం ఈ పైపై దు:ఖాలన్నిటినీ దూరంగా తోసెయ్యాలి” అన్నాడు. ఆమె పక్కని కూలబడి, రెండుచేతులూ వెనక్కి చాపి, వాటిమీద ఆనుకుంటూ. గొంతులో సన్నటి వొణుకు. గాంభీర్యం తగ్గింది. అతను దూరంగా నెట్టెయ్యాలనుకున్న బాధేంటో గీతకి తెలుసు. తల్లిమీది బెంగ, చెల్లిమీది బెంగ, వాటిని కోపంగా మార్చుకుని అనుభవిస్తున్న దు:ఖం, జరుగుతున్న సంఘటనలు, అవి తన ప్రమేయంలేకుండానే జరుగుతున్నాయని వప్పించలేనితనం.
“ప్యూర్ బ్లిస్ ఇలా వుంటుందా? కోపంగా, నిస్సహాయంగా? ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీవాడు ఏడుస్తాడు” అంది. తనూ నవ్వి లేచాడు.
పడవతనికి డబ్బులిస్తుంటే అతను గీతని తేరిపార చూసి, “అమ్మా! మిమ్మల్ని చిన్నప్పుడు చూసినట్టనిపిస్తోంది” అన్నాడు.
ఆమె నవ్వి, “నేను గుర్తుపట్టాను. గీత నాపేరు. మాక్లాసులో ఆఖరిబెంచీలో కూర్చునేవాడివి. ఏడుదాకా వచ్చినట్టున్నావుకదా? మీ నాన్న బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టేవాడు. నువ్వీ పనికి దిగావేం?” అంది. అవంతీపురం పరిచయాలు. వీళ్ల తరంవరకూ అందరిదీ ఒకటే స్కూలు. అతనేవో చెప్పాడు. వింది. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడట. బహుశ: తమ పిల్లలతో కలిసి అదే కంపెనీలో చేస్తాడేమో! మనుషులమధ్య తేడాలు తొలగిపొవడమంటే ఇదే. ఉంటుంది. ఆ తేడాలని చెరిపేసే పరిక్రమంలో విస్తారమైన శోషణ. తప్పదు.
డబ్బులు వద్దన్నాడు. బలవంతంగా యిచ్చాడు వాసు. ఎప్పుడెనా యింటికొచ్చి వెళ్లమని చెప్పాలనుకుని ఆగాడు. ఇప్పుడు తనకే యిల్లు లేదని. ముందుకి నడిచారు.
అక్కడో చిన్నశివాలయం. వాళ్ళ పిల్లాడినే గీత తీసుకొచ్చింది. మయూ, సేతులతర్వాత బీటెక్ పూర్తిచేసి, వుద్యోగంలో చేరి, తల్లిదండ్రులని తనతో తీసుకెళ్ళిపోయాడు. పిల్లలకి చదువులతోపాటు బాధ్యతకూడా నేర్పింది. రోజంతా స్కూల్లోనూ, తమింట్లోనూ వున్నా, రాత్రయేసరికి యింటికి పంపించేసేది. తల్లిదండ్రులతో వున్న అనుబంధం తెగకుండా చూసుకునేది. గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకున్నారు. ఎవరో కొత్తపూజారి. ఇతన్ని పెట్టి వెళ్ళినట్టున్నాడు శివుడి తండ్రి. అభిషేకం చేస్తానన్నాడు. టిఫెన్ చేసి వచ్చామని వద్దంది గీత. తీర్థం యిచ్చి, చిన్న పటికబెల్లంముక్క చేతిలో పెట్టాడు. నూటపదహార్లు పళ్ళెంలో వెయ్యబోతే, వారించాడు.
“మీరు అభిషేకం చేయించుకున్నప్పుడు ఇవ్వండి” అన్నాడు. కాలేజిలో చదువుకుంటున్నాడట. ఈ బాధ్యత శివుడితండ్రి దగ్గర్నుంచీ ఐచ్ఛికంగా తీసుకున్నానని చెప్పాడు.
“దేవుడు, భక్తి ఈదేశపు అవసరం. ఇన్నికోట్ల జనంకోసం కోట్లకొలదీ విలాసవస్తువులని తయారుచెయ్యడానికి ప్రకృతి అనుమతించదు. ప్రత్యామ్నాయ సంతోషమార్గాలివి. దేవుడున్నాడని నమ్మడం, గుడికెళ్ళడం, దణ్నంపెట్టుకుని రావడం, కీర్తనలు పాడటం, భజనలు చెయ్యడం వీటన్నిటిలోకూడా మనిషి ఆనందాన్ని పొందగలడు. మీలాంటి పెద్దవాళ్ళు అర్థంచేసుకుని, ఈ ప్రత్యామ్నాయ సంతోషవనరులని జాగ్రత్తగా కాపాడాలి” అన్నాడు. అతని ఫోన్ నెంబరు అడిగితీసుకుంది గీత. చాలామంది ఫోన్‍నెంబర్లు దగ్గిర పెట్టుకుంటుంది. ఒక్కో పండగకీ ఒకొక్కరిని పిలిచి తాంబూలం, దక్షిణా యిచ్చి పంపిస్తుంది. పండుగని పనిగట్టుకుని బట్టలు కొనుక్కోదు. దాపరికం చీరల్లోంచీ తీసుకుని కట్టుకుంటుంది.
“నాకు పేదరికం అంటే ఎలా వుంటుందో తెలుసు వాసూ! రేపటికెలాగా అని ఆలోచిస్తూ రాత్రికి పడుక్కుని, తెల్లారి లేవగానే పప్పుకీ వుప్పుకీ వెతుక్కుంటూ బతకడం, రేషనుకార్డూ, సంచీ పట్టుకుని క్యూలో నిలబడి బియ్యం, పంచదారా, కిరసనాయిలూ తెచ్చుకోవడం, ఇంట్లోవాళ్ళు కాఫీలో బెల్లం వేసుకుని, ఇంటికి వచ్చినవాళ్లకి పంచదార వేసిచ్చి మర్యాద నిలబెట్టుకోవడం, ఇంకా చాలా వుంటాయి. అలాగని మేం ఎప్పుడూ అవమానపడలేదు. ఎక్కడికేనా పంపేముందు అమ్మ నాకు కడుపునిండా అన్నం పెట్టి పంపించేది.
ఎక్కడా ఏవీ అడక్కూడదు, తినకూడదు. ఇవ్వగానే తీసేసుకోవద్దు. ఒకటిరెండుసార్లు వద్దన్నాక అప్పుడు తీసుకోవాలి. వాళ్ళ బొమ్మలూ, వస్తువులూ పాడుచెయ్యకూడదు- అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించేది.
ఉద్యోగంలో చేరితే నాన్నకి ఆసరా ఔతుందని చేరాను” ఒకే ఒక్కసారి వాసుతో అంది గీత.
అతను బాధపడితే,
“నువ్వు బాధపడాలని కాదు, చెప్పింది. నాకిలా చెయ్యడం యిష్టమని తెలియాలని” అంది.
కార్లో కూర్చుని కదలబోతుంటే ఫోను. వాసు పేనెల్ సెక్రెటరీ రామస్వామిదగ్గర్నుంచీ.
“మీరు ఇంటికోసం సీరియస్‍గా అనుకుంటుంటే మా ఫ్లాట్ వుంది. నిన్ననే చెప్పాల్సింది, చాలామంది పిల్లలని ఆగాను. అందరు పిల్లలనైతే సొసైటీ అనుమతించదు. కనీసం ఇంకో ఫ్లాటేనా తీసుకోవాలి. పిల్లలు రాత్రికి వుండరు, స్నానాలవీ చెయ్యరుకాబట్టి మేనేజ్ చెయ్యచ్చు” అన్నాడు. ఆయన యిప్పటిదాకా వాసు గురించీ, అతని కుటుంబనేపథ్యం గురించీ బాగా వాకబుచేసి, అతన్తో ఎలాంటి సమస్యా వుండదన్న భరోసా వచ్చాక చెప్పాడు.
సాయంత్రానికి ఆలోచించుకుని చెప్తానన్నాడు వాసు.
“పిల్లలకోసం అమ్మావాళ్ళిల్లు వాడుకోవచ్చు. మనస్థలంవైపుకి ఒకగది వుంటుంది. అది తీసుకుందాం. ఆ గేటు వాడుకుంటే వాళ్లకీ యిబ్బంది వుండదు. అమ్మా కాదనదు” అంది గీత. వెంటనే యశోదకి ఫోన్ చేసింది. ఆవిడకూడా వీళ్లతో మాట్లాడాలని ఎదురుచూస్తోంది.
“ఇల్లొదిలేసి ఎక్కడుంటారే? పుట్టాక పెరిగాక ఎప్పుడూ మీరు అద్దిళ్లలో వుండలేదు. ఎలా సర్దుకుంటారు? పిల్లలనేం చేస్తారు? అందరికీ కలిపి యిల్లెవరిస్తారు? మేం అక్కడుండేది ఆర్నెల్లు. మీరు మాయింట్లోనే వుండచ్చుకదా? ఆ కొద్దిరోజులూ అందరం కలిసి వుందాం” అంది యశోద కూతురు చెప్పింది విని.
వాసుకి ఫోనిచ్చింది గీత.
“వద్దత్తా! అపార్టుమెంటైతే సెక్యూరిటీ వుంటుంది. ఇక్కడికొచ్చాక నీకు విషయాలన్నీ నేనే చెప్తాలే. ఎవరెవరో చెప్పినవన్నీ విని, అక్కడుండి ఏవేవో వూహించుకుని కంగారుపడకు. కొంచెం గొడవల్లో వున్నాం. మాకా గది ఒక్కటీ యిచ్చేస్తే వీళ్ళు స్టడీరూంగా వాడుకుంటారు” అన్నాడు.
“ఏం గొడవలు వాసూ? గతకొంతకాలంగా లక్ష్మి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఫోన్ చేస్తే పలకరించి, మాధవ్‍కో నీలిమకో ఇచ్చేస్తోంది. ఎవరూ దగ్గిర లేకపోతే తలనొప్పనీ, మళ్ళీ మాట్లాడతాననీ పెట్టేస్తోంది. ఏం జరిగిందని యిందాకే మాధవ్‍ని నిలదీస్తే కొన్నికొన్ని విషయాలు చెప్పాడు. సమస్యలేవేనా వచ్చినప్పుడు మాదాకా రానివ్వకుండా మీలో మీరు సర్దుబాటు చేసుకోవాలనుకోవడం, ఎక్కడో దూరంగా వున్నవాళ్లకి అన్నీ పూసగుచ్చినట్టు చెప్పి, కంగారుపెట్టద్దనుకోవడం మంచిదే. కానీ యింత జరిగాకకూడా మాకు చెప్పకపోతే ఎలా? పసివయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారని తమ్ముళ్ళంటే ఈ అక్కచెల్లెళ్ళందరికీ ప్రాణం. అన్నగారికేమో బాధ్యతలూ, తమ్ముళ్ళకేమో ముద్దుముచ్చట్లు. సరే, అవన్నీ గడిచిపోయిన రోజులు. ఇప్పుడు మీ అమ్మకోపం దేనికి?” అంది.
“ఏవో అపార్థాల్లే అత్తా! మానాన్న యింట్లోంచీ వెళ్ళిపోయినరోజులు మళ్ళీ వచ్చినట్టనిపిస్తోంది. మీరెప్పుడొస్తున్నారు? మాకూ ఇక్కడెవరూ లేక తోచట్లేదు” అన్నాడు.
“అపార్థాలేమీ లేవు. అన్నీ స్పష్టంగానే తెలుస్తున్నాయి. ఇప్పుడా పిల్లని తీసుకొచ్చి నీకు అంటగడదామని చూస్తున్నారు. శేఖర్‍కి అలాంటి ఆలోచన వచ్చినా లక్ష్మి తప్పని చెప్పాలికదా?” కోపంగా అడిగింది.
ఆవిడ చెప్పిన విషయానికి అతను తెల్లబోయాడు. తల్లేదో తనగురించి అపోహపడుతోందనుకున్నాడుగానీ, ఆవిడ ఆలోచన ఇదని తెలీదు. గీతతోకూడా అందా? అందుకే ఇది విడాకులిస్తానందా? దీనికి కోపం, పౌరుషం ఎక్కువ. తనకెందుకు చెప్పలేదు? తనదగ్గిర దాచడం ఎప్పట్నుంచీ మొదలుపెట్టింది? అడిగినా చెప్పదు. ఎవరిమీదా నెపం వెయ్యదు. చిన్నప్పట్నుంచీ వాళ్ళింట్లో యిచ్చిన ట్రెయినింగ్.
“అత్తా! కోపం తగ్గించుకుని నేను చెప్పేది విను. మీరంతా ఏమేం అనుకుంటున్నారో, నీకెవరు ఏం చెప్పారో నాకు తెలీదు. నేనూ, గీతామాత్రం అలాంటివేవీ అనుకోవట్లేదు. అమ్మ ఆలోచనేమిటో నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది. ఆవిడ నిజమని అనుకుంటున్నవాటివలన అలాంటి అభిప్రాయానికి వచ్చిందేమో నాకు తెలీదు. బహుశ: నువ్వనుకుంటున్నది నిజం కాకపోవచ్చు. ఆ గొడవ జరిగినప్పట్నుంచీ నాతో మాట్లాడటం మానేసింది. వాళ్లనిమాత్రం పిచ్చిదాన్లా నమ్ముతోంది. పెళ్లనేది ఇద్దరు వ్యక్తుల ఇంటర్‍పర్సనల్ స్పేస్. పదిమంది నడిచే రహదారి కాదు, ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు వస్తారనుకోవడానికి. ఆ పిల్ల నాకేం కాదు. దాన్ని వుద్ధరించాల్సిన అవసరం నాకు లేదు” అన్నాడు.
“వాసూ! ఇంత జరుగుతుంటే అనకుండా వుండలేకపోతున్నాను. ఇంతమందిమధ్యలో గీతని యివ్వడానికి నేను చాలా భయపడ్డాను. ఎవరింటికి యిస్తే ఎవరికి కోపాలొస్తాయోనని. అన్నట్టుగానే ప్రమీల కోపమంతా పిల్లమీద చూపించుకుంది. అదన్నమాటలో తప్పేం వుంది? మనసులో మాట తండ్రికి చెప్పుకుంది. అందరికీ ఏం చెప్పాలో అది చెప్పింది. లేకపోతే ప్రేమించానని డప్పేసుకుంటుందా? అలా పెంచలేదు మేం దాన్ని. చిన్నపిల్లనికూడా చూడకుండా సాధించి పొడుం చేసారు. ఇక మీ అమ్మ! మాయింటికొచ్చి అడిగిమరీ అన్నకూతుర్ని యిప్పించుకుంది నీకు. మాధవ్ పెళ్ళయ్యాక ఏం జరిగింది? చిన్నకోడల్ని అడుగు కదపనివ్వకుండా కూర్చోబెట్టి ఇంటెడుపనీ దీనిచేత చేయించేది. నీలిమ అందగత్తెనా? మీవి చిన్నవుద్యోగాలనా? ఇది నోరు లేనిదనా? అన్నీ చేయించుకుని నానామాటలూ అని పోయింది ఆ పిల్ల. అక్కగారంత సౌడభ్యం వెలగబెట్టిందా, మళ్ళీ వసంత్‍భార్యని వెంటబెట్టుకుని వచ్చింది లక్ష్మి. ఇక్కడ నీలిమ లేనే లేదు, ఇంకో అక్క వుంది ఆ పిల్లకి. ఇక్కడికెందుకు తీసుకురావడం? హడిలిపోయాను నేనైతే. మళ్ళీ ఏం గొడవలొస్తాయోనని”
తనింట్లో జరిగిన సంఘటనలకి గీత పుట్టింటికోణం ఒకటి వుంటుందని అనుకోలేదేమో చాలా ఆశ్చర్యం కలిగింది వాసుకి.
“ఏం తక్కువ గీతకి? నీతో సమానంగా అదీ తెచ్చుకుంటోంది. పిల్లల్ని కని ప్రయోజకులని చేసింది. నీకు మీయింట్లో వాటాయిచ్చినట్టు దానికి మాయింట్లో యిచ్చాం. ఇంకేం కావాలి? ఈ వయసులో యివేం గొడవలు? అసహ్యంగా?” ఆవేశంగా నిలదీసింది. అనడం పూర్తయేసరికి ఆవేశం దు:ఖంగా మారింది. గొంతు రుద్ధమైంది. ఏడుస్తూ వుండిపోయింది.
“నువ్వేంటి గొడవ? ఏడవడం దేనికి? నాన్న అక్కడే వున్నారా? ఆయనకి బీపీ ఎక్కించేస్తావా? చెడిపోయానని గట్టిగా నమ్మి, అన్నీ చెడ్డపనులు చేస్తోందది. ఉద్యోగం, సద్యోగం ఏదీ చెయ్యదట. ఇలా కొంపలు కూలుస్తూ తిరుగుతుందట. దానికోసం మీరు దెబ్బలాడుకోండి, బీపీలు పెంచుకోండి, చుట్టూ వున్నవాళ్లని కంగారెత్తించండి. మేం దాన్ని వదిలేసి ఇంకో రెండుమెట్లెక్కేసాం. మరోరెండు కేసులౌతే వాటిల్లోంచీకూడా బైటపడ్డాం” అంది గీత ఫోన్లోకి వంగి.
“బాధపడటం దేనికి? నామీద నమ్మకంలేదా? నన్నంత చెడ్డవాణ్ణనుకుంటున్నావా? అందుకే నువ్వొచ్చాక నిదానంగా చెప్తానన్నది. అమ్మకి దూరంగా వుండాలనుకుంటున్నాను. ఆవిడ నాకు చాలా సమస్యలు తెస్తోంది. రాణాకి ఏం చెప్పిందో, వాడు ఫామ్‍హౌసులో వేలుదూర్చాడు. నిన్నంతా పోలీస్‍కేసూ, హడావిడీ. రాత్రి గీత ఒక్కర్తే యింట్లో వుంది. అంతింట్లో మేమిద్దరమే వుండటం ప్రస్తుతం అంత సేఫ్ కాదనిపించింది. ఇప్పుడుకూడా మేం హోటల్లో వున్నాం. మరీ చిన్నపిల్లలంకాదుకదా, భయపడద్దు. అసంబద్ధమైన ఆలోచనల్ని నమ్మద్దు. మేమిద్దరం చెప్పేదే నిజం” నచ్చజెప్పాడు వాసు. తల్లికీ యశోదకీ పెద్దతేడా వుండదు అతనికి. ఆవిడకూడా గీతకి పెళ్ళయాక అతన్ని ఎదిగొచ్చిన పెద్దకొడుకనుకుంది. ఆవిడ వంటచేస్తుంటే వెళ్ళి వంటింటి గట్టుమీద కూర్చుని గీతతో సమానంగా కబుర్లుచెప్పేవాడు.పుస్తకాలు అందర్నీ కలిపి కదంబమాలగా అల్లేసాయి. చదువుతారు, చర్చించుకుంటారు. నువ్వు అల్లుడివి, అలా వుండకూడదని విజ్జెమ్మకూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇద్దరికీ మధ్య కోపాలూ, అలకలూ వుండవు. ఆవిడో మాటన్నా అతను పట్టించుకోడు. అనే సందర్భంకూడా ఎప్పుడూ రాలేదు. ఇప్పుడేనా ఏం జరిగిందో సరిగ్గా తెలీక ఆందోళనపడింది. కూతురికి ఈ వయసులో యిలాంటి సమస్య రావడం చాలా బాధపెట్టింది. వాసుతో మాట్లాడాక స్థిమితపడింది. ఇల్లు వాడుకోవడానికి అడగడం దేనికని తేల్చింది.
ఫోన్ పెట్టేసాక వూపిరిపీల్చుకున్నారు గీత, వాసు.
“అమ్మయ్య! ఈవిడకూడా తిట్టేసింది” అన్నాడు వాసు.
“పెద్దదైపోయింది?” అంది గీత దిగులుగా.
“అమ్మ ఈ పిచ్చిమాటలన్నీ నీతోకూడా అందా?” అడిగాడు. గీత తలడ్డంగా వూపింది. ఆవిడ తనతో అన్నమాటలు వేరు. అవి యితనికి యిప్పుడే చెప్పదు.
“మరి విడాకుల ఆలోచనెందుకొచ్చింది నీకు? కొడతానే గీతా, నిన్ను. ఇప్పటిదాకా నాచేతిలో దెబ్బలు తినలేదు నువ్వు” అన్నాడు కోపంగా.
“నువ్వుకూడా పెద్దైపోతున్నావు” అంది.
అతను వురిమిచూసాడు. ఆమె విరగబడి నవ్వేసింది. కారు ముందుకి వురికింది.
“సాయంత్రందాకా ఎందుకు? ఫ్లాట్ యిప్పుడే చూసేసి, యింటికెళ్దాం” అంది. అతను తలూపాడు. అతని ఫోన్లోంచీ రామస్వామికి మెసేజిపెట్టి, రమ్మన్న రిప్లై చూసి, అతనికి చెప్పింది. ఇద్దరూ వెళ్ళి ఫ్లాట్ చూసుకుని, అద్దె మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చి, అట్నుంచీ మాధవరావుని కలిసి థేంక్స్ చెప్పి, త్రిమూర్తులిని చూసి, యింటికొచ్చారు.
“రెండుస్వంతిళ్ళు ఖాళీగా పెట్టుకుని అద్దెకి వస్తున్నారా!?” ఆశ్చర్యపోయింది మంజుల.
“పైలాపచ్చీస్ జమీందారటలే. మూడు వుద్యోగాలూ, ఆరు ఆస్తులూ. నువ్వు పెద్దగా కలగజేసుకుని మాట్లాడకు. కొన్నాళ్ళు పోనివ్వు” అన్నాడాయన.
తీసుకెళ్ళాలనుకున్న సామాన్లన్నీ ఒకచోట చేర్చారు వాసు, గీత. సగం సర్దటం అయేసరికే ఆమెకి కళ్లమ్మట నీళ్ళొచ్చేసాయి.
“ఇక్కడ సంతోషం నిండుకుంది. కొత్తచోట వెతుక్కుంటూ వెళ్తున్నాం. దేనికి బాధ?” అన్నాడు వాసు ఓదార్పుగా. అతనికీ బాధగానే వుందిగానీ, దాని మౌలికస్వరూపం వేరు. అవమానం భగ్గుమనిపిస్తోంది వుండుండి. సర్దడం అయాక మళ్ళీ హోటల్‍కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఓ కొలిక్కొస్తే పిల్లలదగ్గిరకి వెళ్ళిరావాలి. ముఖ్యంగా విహీ ఎలా వున్నాడో, ప్రత్యక్షంగా చూస్తేగానీ ఇద్దరికీ మనసు నెమ్మదించేలా లేదు. అదయ్యాక ఇక్కడి పిల్లలమీద శ్రద్ధపెట్టాలి. ఎవరికివారే మనసుని రాబోయే కార్యక్రమాల ఆలోచనలతో నింపుకున్నారు.
ఫంక్షన్నుంచీ వచ్చాక లత, సుమంత్, సుమతి, జో వచ్చారు. వస్తున్నామని ఫోన్‍చేస్తే హోటల్‍రూమ్‍కే రమ్మన్నాడు వాసు.
“బావగారూ! క్షమించండి. మా నాన్న అలా చేస్తారని అనుకోలేదు. ఇంతకాలం స్వంతకొడుకులా వెంట వుండి అన్నీ చూసుకున్నారు సుమంత్. మాకు అవసరం వచ్చినప్పుడు ఆయన సాయం చెయ్యరన్న చిన్న అనుమానంకూడా కలగలేదు నాకు. సుమంత్ నాకు చెప్పినా నా ఫ్రెండ్సెవరిద్వారానేనా ప్రయత్నం చేసేదాన్ని. ఫంక్షన్ హడావిడిలో నేనున్నాను. అక్కడ గడబిడ ఎందుకని ఈయన మాట్లాడకుండా వుండిపోయారు” అంది లత రాగానే రెండుచేతులూ జోడించి. ఈ కుటుంబం తనకి ఎంతో సంతోషాన్నిచ్చింది. తోబుట్టువులు లేని లోటు తీర్చింది. వాసు అంటే సుమంత్‍కి ఎంత ప్రాణమో తనకి తెలుసు. అక్కాతమ్ముళ్ళిద్దరూ సుధీర్‍కి మారుగా అతన్ననుకుంటారు. అలాంటివ్యక్తికి ఆపత్కాలంలో తోడుగా వుండకపోవడం చాలా బాధపెట్టిందామెని. అక్కడినుంచీ రాగానే తండ్రితో గొడవపెట్టుకుంది.
సుమంత్ తలొంచుకుని కూర్చున్నాడు. మామగారి దెబ్బలోంచీ అతనింకా కోలుకోలేదు.
“ఐపోయిందికదమ్మా! గీత చక్కబెట్టేసింది. శ్రీధర్‍కూడా సాయంచేసాడు. నువ్వు మనసు కష్టపెట్టుకోకు. ఆయన చెప్పిందికూడా నిజమే. ఉన్నపళంగా సాయానికి ఎవరు అందుబాటులో వూంటారు?” అన్నాడు వాసు.
“ఏంట్రా, వాసూ, ఇది? ఇలా జరుగుతోందేమిటి? ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? ఎలా తెలుసుకోవడం? రాణా ఒక్కడికీ యింత తెలివి లేదు. వాడి వెనక ఎవరో వుండి చేయించారు. వాడిని పిలిపించి దులుపుతాను. వదిలిపెట్టను. యమునకి ఎంత చేసాంరా?” సుమతి తల్లడిల్లిపోయింది. “అసలు ఇలాంటివి జరుగుతాయని ఎవరనుకుంటారు, ముందుగా అందర్నీ సిద్ధంచేసి పెట్టుకోవడానికి? హోటల్లో ఉండటమేంటి? మాయింటికి వచ్చెయ్యండి. అక్కడుండి కాస్త సర్దుకున్నాక వెళ్లచ్చు. లేకపోతే అమ్మావాళ్ళ ఫ్లాట్ ఖాళీగానే వుంది. అందులో వుండండి” అంది.
“ఔను బావా! మాతో రండి. అంత పెద్ద యింట్లో మీరిద్దరే వుండటం అంత సేఫ్ కాదు” అన్నాడు జోకూడా.
ఇల్లు చూసుకున్న విషయం చెప్పాడు వాసు.
అనుకున్నట్టే మూడోరోజుని మాధవ్ బయల్దేరి వచ్చాడు. లక్ష్మి రానంది. మాధవ్ వుండే అపార్టుమెంట్లో ఒక ఫ్లాట్ సీనియర్ సిటిజెన్స్‌కి కేటాయించారు. పిల్లలు వూళ్ళకి వెళ్ళి, పెద్దవాళ్ళకి వెంటవెళ్ళే పరిస్థితి లేనప్పుడు అందులో వుండచ్చు. తిండిదగ్గర్నుంచీ మొత్తం బాధ్యతంతా సొసైటీ తీసుకుంటుంది. రోజుకింతని తీసుకుంటారు. పదిరోజులదాకా వుంచుకుంటారు. అందులో వుంటానంది లక్ష్మి.
“ఎందుకు? వాళ్ళని చూడటానికి భయపడుతున్నావా?” అడిగాడు మాధవ్. “రామ్మా! వాడికోపం ఎంతసేపుంటుంది? నిన్ను చూడగానే మర్చిపోతాడు” అన్నాడు నచ్చజెప్తున్నట్టు. ఐనా ఆవిడ వెళ్ళలేదు. అతనొక్కడే వచ్చాడు. వచ్చేసరికి యింట్లోనే వున్నారు వాసు, గీత. సామన్లన్నీ సర్దేసి వున్నాయి. మంచిది చూసుకుని కొత్తింట్లో పాలుపొంగించి దిగుదామనుకుంటున్నారు.
“ఏంట్రా వాసూ ఇది?” తెల్లబోయాడు.
“ఫ్లాట్ తీసుకున్నాం. నీకోసమే చూస్తున్నాను. ఇంటితాళాలూ, కాగితాలూ యిచ్చేస్తాను. నీతో తీసుకెళ్ళు. ఆవిడకి యిచ్చెయ్. ఇంటిమీద నాకింక ఎలాంటి హక్కూ వద్దు. స్టాంపుపేపరు రాయించి పిల్లలచేతకూడా సంతకాలు పెట్టించి పంపుతాను. మీయిద్దరి వాటాలూ కొన్నాను, అవికూడా తిరిగిచ్చేస్తున్నాను. ఆవిడకి తోచినట్టు చేసుకొమ్మను. మాడబ్బు మాకు తిరిగిచ్చేస్తే చాలు. మా వస్తువులు మేం తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఏ కేసులోనో యిరికించకుండా ఇన్వెంటరీకూడా తీసుకెళ్ళి యివ్వు” అన్నాడు వాసు.
“ఆ కోపమేంటి? ఇల్లొదిలేసి యీ వెళ్లడమేంటి? అద్దింట్లో వుండే ఖర్మేంట్రా, నీకు? పోనీ మాయింట్లో వుంటావా? పైనంతా ఖాళీ చేయిస్తాను” అన్నాడు మాధవ్.
“నాది కోపమా? ఆరోజు రాత్రి గీత ఒక్కర్తే ఇంట్లో వుంది. ఇరుగూపొరుగూ ఎవ్వరూ లేరు. ఎప్పుడేనా అలా జరిగిందా మాధవ్? తగ్గట్టు రాణా యింటికొచ్చాడట. వెంటనే వెళ్ళిపోయాడు. సంతోషం. లేకపోతే? వదిలేసారు. నేనో పెద్దదుర్మార్గుణ్ణని వెలివేసినట్టు వదిలిపెట్టారు. శ్రీతో తులసి ఎందుకు రాలేదు? వదినతో మాట్లాడటం యిష్టంలేకపోతే తనగదిలో తను తలుపేసుకుని పడుక్కోవచ్చు. దానిది కోపంకాదా? వద్దురా! నేను అందరికీ దూరంగా వుండాలనుకుంటున్నాను. ఏ బంధాలూ, బంధుత్వాలూ శాశ్వతం కాదు. నమ్మకం, గౌరవంకూడా తాత్కాలికమైనవే. అలా ఓ చిన్నగాలి వీచేసరికి కొట్టుకుపోతాయి. మాకిప్పుడు కావల్సింది సెక్యూరిటీ, సపోర్టుసిస్టం” అన్నాడు. మాధవ్ ఎన్నివిధాల చెప్పినా వినలేదు. చేసేదేంలేక అతనితో తనూ వెళ్ళి యిల్లుచూసి, రామస్వామిని పరిచయంచేసుకుని వచ్చాడు. అన్నకోసం మాధవ్ తపనపడుతుంటే ఆయనకి వింతగా అనిపించింది. ఇంకా మనుషుల్లో యింతంత ప్రేమలున్నాయా అని.
మంచం, సోఫాసెట్టు తమింట్లోంచీ తెప్పించింది గీత. ఇంకొన్ని బయటికెళ్ళి కొన్నారు. వాళ్ళు హడావిడిపడుతుంటే మాధవ్‍కి కళ్లలో నీరూరింది. తట్టుకోలేకపోయాడు. తను యింట్లోంచీ వేరుపడ్డప్పుడు వీళ్ళిద్దరూకూడా ఇలానే బాధపడ్డారు.
పెద్దగా సామానేదీ లేకపోవడంతో సర్దడం తొందరగానే అయింది. ఆర్ట్‌పీసెసన్నీ తర్వాత సర్దుకోవచ్చని పక్కని పెట్టారు.
“ఆదివారం సర్దేద్దాం గీతా!” అన్నాడు వాసు, ఆమె హర్టౌతుందని. తలూపింది.
పాలుపొంగించిన పరమాన్నం తినేసి, భోజనాలకి బైటికి వెళ్ళారు. అట్నుంచీ మాధవ్ తులసిదగ్గిరకి బయల్దేరాడు.
“రాముడిసేవలో లక్ష్మణుడు చేరిపోయాడా? లేటయ్యావేం? ఎప్పుడొచ్చావురా?”అడిగింది తులసి వ్యంగ్యంగా. అతను చకితుడయ్యాడు. సరిగ్గా ఇదే డైలాగ్ వీణకూడా అంది. ఒకయింటి మనుషులు, అవే చేతుల పెంపకాలు. ఎక్కడినుంచో కొన్నిమాటలు అటూయిటూ దొర్లుకుంటూ వచ్చి మనసులో పడిపోతాయి. వాసుకోసం తనేదైనా చేస్తే అలానే అడుగుతారు. మళ్ళీ సుధీర్ విషయంలో సుమంత్‍ని అడగరు.
మంచినీళ్ళూ, కాఫీ తెచ్చిచ్చింది. శ్రీధర్ లేడు. బైటికి వెళ్ళాడట.
“అరగంటలో వచ్చేస్తానన్నారు” అంది.
“అమ్మెలా వుంది? నీతో రాలేదా? ఒక్కర్తీ ఎలా వుంటుంది? తీసుకొచ్చి నాదగ్గిరేనా వదిలిపెట్టాల్సింది”
“వాసు ఇంత శతృవెలా అయాడే?” సూటిగా అడిగాడు మాధవ్. “వాడికి చాలా కోపంవచ్చింది. బైట ఫ్లాట్ తీసుకుని వుంటున్నారు. వాడినంత బాధపెట్టడం తప్పుకదా, తులసీ?”
తలదించుకుంది. శ్రీధర్‍తో వాదించినంత మొండిగా మాధవ్‍తో అనలేకపోయింది.
“అమ్మ చాలా బాధపడుతోందిరా! వాసు కొత్తగా అనిపిస్తున్నాడు”
“నాకైతే ఈ పరిస్థితులు కొత్తగా అనిపిస్తున్నాయి, వాసుకాదు. ఎవరు వాడిని టార్గెట్ చేస్తున్నారో తెలీడం లేదు. అది తెలిస్తేగానీ వాడు సేఫ్‍గా వుండడు”
“వాళ్ళు చేస్తున్న తప్పులవల్లకాదా?”
“నీదగ్గిరేవైనా ఆధారాలున్నాయా?”
“లేవు. పోలిక చెప్తాను. శశిధర్ ఒకమ్మాయితో తిరుగుతున్నాడు. సమీర అతన్తో దెబ్బలాడి అక్కడితో వదిలేసింది. గీతది ఏటికి ఎదురీదే మనస్తత్వం. వదిలిపెట్టదు. వాసు ఆవిడకి హక్కుభుక్తం. చూసీచూడనట్టు వూరుకుంటే సరిపోయేదేమో! వీణతో చాలారూడ్‍గా ప్రవర్తించిందట. శేఖర్‍మామయ్యావాళ్ళగురించీ, వాళ్ళ సర్కిల్‍గురించీ మనకి తెలుసు. మొరటుమనుషులు. అసలే దెబ్బతిని వున్నపిల్లతో అలా ప్రవర్తించినందుకు వాళ్ళకి కోపంరాదా? వాసే వెళ్ళి సర్దిచెప్పి రాకుండా వదిన కొంగువెనకాల ఎందుకు దాక్కున్నాడు?”
“దాన్ని జుట్టుపట్టుకుని నలుగుర్లోకీ లాక్కొచ్చి చెప్పుతో కొట్టద్దా అన్నారు నీలిమా, మాధురీ”
“అదేంట్రా?” తెలతెలబోయింది.
“ఎవరి ఆలోచనవాళ్లది. ఎవరు చెప్పినట్టు చెయ్యాలి? లేకపోతే సామ్‍లా నీఖర్మ నీదని గాలికి వదిలెయ్యాలా? ఇక్కడే మూడు భిన్నమైన మార్గాలు కనిపిస్తున్నాయి. వదినావాళ్ళూ అనుసరించింది నాలుగోది. అమ్మకి మరో ఆలోచన వుంది. వాసుకి దాన్ని చావచితక్కొట్టాలనుంది. యశోదత్త వాళ్ళింటికి వెళ్ళిపోయి అమీతుమీ తేల్చుకోవాలనుకుంటోంది. సంఘటన ఒకటే వుంటుంది చెల్లీ! రకరకాల మార్గాల్లో కనిపిస్తుంది. దృగ్దోషంకూడా దానికి కలుస్తుంది. ఏం చేస్తే పరిష్కారమౌతుందో తెలిసే గీత అలా చేసింది. ఆ వ్యవహారం ముదరకుండా తను అడ్డంగా నిలబడింది. వాసుచుట్టూ గోడకట్టేసింది. తనొక్కర్తే అలా చెయ్యగలదు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరు ఇంకొకరిని లెట్ డౌన్ చేయరు”
తులసి మాట్లాడలేదు. “అమ్మ చాలా బాధపడుతోంది. ఆవిడనేనా కన్విన్స్ చెయ్యలేదు” మరోసారి అంది.
“వీణగురించికాదు ఆవిడ బాధ. ఫోటోలు చూసి మొదటమొదట కంగారెత్తిపోయినమాట నిజం. నాకు తెలీకుండా వీణతో ఫోను మాట్లాడేది. ఏం మాట్లాడుకునేవాళ్ళో, అదేం ఎక్కించేదో తెలీదు. ఆ ఎక్కినదాన్ని దించుకోలేక ఆవిడ బాధ”
తులసి తలదించుకుంది.
“కొంతకాలంగా ఆవిడలో అసంతృప్తి మొదలైంది. నాన్నని గుర్తుచేసుకుని బాధపడుతోంది. వదిన్ని చూసి అసూయపడుతోంది. నేను చూచాయగా గ్రహించాను”
“ఆవిడ్ని చూసి అసూయపడటమేమిటి?” తులసి తెల్లబోయింది.
“ఎప్పటెప్పటి విషయాలో తెచ్చి చెప్తోంది. వాళ్ల పెళ్ళి జరిగి పాతికేళ్ళౌతోంది. ఇంకాకూడా దాన్నిగురించి మనిళ్లలో మాట్లాడుకోవడం నాకు ఆశ్చర్యంగా వుంటుంది. అవన్నీ గుర్తుతెచ్చుకుని, అప్పట్లో తను చాలా జనరస్‍గా ప్రవర్తించినట్టూ, వదిన దాన్ని గుర్తించనట్టూ అనుకుంటోంది అమ్మ. ఎవరు జనరస్‍గా వున్నది? మనం అప్పుడున్న పరిస్థితిలో, అంటే భర్త పోయిన ఆడవాళ్ళు ముగ్గురూ, భర్తతో సామరస్యం లేనిది మరొకరూ వున్న యింటితో ఎవరూ సంబంధం కలుపుకోరు. డబ్బొక్కటేకాదుకదా, పెళ్ళిళ్లని నిర్ణయించేది? గీత అడిగిందని వాళ్ళింట్లో వప్పుకున్నారు. పెళ్ళిముందురోజో, ఇంకాస్త ముందో అమ్మ నిర్ణయం మార్చుకుంది. సుధీర్ సూసైడ్ చేసుకోబోయాడని, వాడితో గీతకి చెయ్యడానికి వాసుని వప్పించింది. కానీ మామయ్య పెళ్ళికొడుకుని మార్చడానికి వప్పుకోలేదు” అన్నాడు.
“అన్నా!!”
“నీలిమని చూసాక వాసుకీ అలాంటి అందమైన అమ్మాయిని వెతికి వుంటే బావుండేదని అమ్మ నాతో అంది. తప్పుకదా? ఐపోయిన పెళ్ళికి? గీతకేం తక్కువ? నాకు తెలిసిన ఈ విషయాలు గీతకీ తెలుసా? తెలిస్తే అది ఎంత అవమానాన్ని దిగమింగుకుందో వూహించగలవా? ఎప్పుడేనా బైటపడిందా? నువ్వు చాలా చిన్నదానివి, నువ్వు పెద్దయ్యెసరికే ఎన్నో జరిగాయి. వద్దమ్మా! ఎవరినీ మనం జడ్జిచెయ్యకూడదు. వాసు, గీత మనవాళ్ళు. వాళ్ళు చెప్పింది నమ్ముదాం. వీణ మనకేం కాదు. అమ్మ ఆలోచనలకి నువ్వు ప్రోత్సాహం యివ్వకు. చాలా పెద్దదైంది. ఆవిడ చివరిరోజులు గీత చేతిలోనైతే గౌరవంగా సాగుతాయి. పెద్దత్తని ఎంత జాగ్రత్తగా చూసుకుందో మనకి తెలుసుకదా? నీలిమని నేను తప్పుపట్టను. తనతోకూడా అమ్మ సరిగ్గా ప్రవర్తించలేదు. అలాంటివి గీత పట్టించుకోదు, నీలిమ మర్చిపోదు. అది తేడా” అన్నాడు.
“ఫామ్‍హౌస్‍లో పార్టీలవీ ఎవరికోసం యిస్తున్నాడు? అసలక్కడేం జరుగుతోంది?”
“మాల్‍వేర్‍తో నువ్వూ మాట్లాడావా?”
తులసి చిన్నగా నవ్వింది.
“వీణ అన్నమాటలన్నీ సింపుల్‍గా బుర్రలోంచీ చెరిపెయ్. ఏదీ జరిగినట్టనిపించదు. నీకే అన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. అదితప్ప ఇంకెవరేనా నీకు ఇలాంటి విషయాలు చెప్పారా? సుధీర్, సుమతి? ప్రహ్లాద్? వల్లి? ఎవరూ లేదుకదా? ఎంత గౌరవంగా బతికామే మనం? వాసు? ఎంత హుందాయైన మనిషి వాడు?”
“సరేగానీ, సామ్ విషయంలో నువ్వు చెప్పింది నిజమేనా?” అడిగాడు.
నిజమేనన్నట్టు తలూపింది. ఆ విషయాలు మాట్లాడుతుంటే శ్రీధర్ వచ్చాడు. ఆరోజుకి అక్కడే వుండి, మళ్ళీ వెనక్కొచ్చి సమీర యింటికి వెళ్ళాడు మాధవ్.