ఝరి 211 by S Sridevi

వీణ తన బేంకు అకౌంటు చూసుకుంది. వాసుతో వ్యవహారానికి చాలా ఖర్చుపెట్టింది. మార్ఫింగ్ సాఫ్ట్‌వేర్ కొంది, ఫోటోలు విడిగా ఎన్క్రిప్ట్ చేయించడానికి సాఫ్ట్‌వేర్ లేబ్‍కి పంపింది. ఆ లేబ్ నడిపే సాఫ్ట్‌వేర్ కంపెనీ బోగస్‍ది. వాళ్ళు డబ్బుకావాలనీ లేకపోతే వాటిని సర్కులేట్ చేస్తామనీ బెదిరిస్తున్నారు. చాలా డబ్బే యిచ్చింది వాళ్ళకి. ఇంకా అడుగుతున్నారు. ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి? అలాంటివి చాలా చూసిందికాబట్టి తనకేం సిగ్గులేదు. ఇప్పటిదాకా ఇంట్లోయింట్లోనే కాబట్టి వాసు వూరుకున్నట్టున్నాడు. ఇంకేదైనా జరిగితే పూనా వెళ్ళి వాళ్ళని వెంటబెట్టుకుని వస్తాడు. వీళ్ళని అతనికే అంటగడితే? ఏదో ఒకటి చేస్తాడు. సమస్య వదిలిపోతుంది. ఆలోచన రావడం ఆలస్యం,
ఫోటోల్లో నేనొక్కదాన్నే లేను. మరొకతనుకూడా వున్నాడు. అతనికి చాలా డబ్బుంది. అతన్ని చూసుకోండి. ఇంక నాదగ్గిర లేదు- అని వాసు ఫోన్‍నెంబరుతోపాటు మెసేజి చేసింది.
శేఖర్ యింట్లో జరిగిన విషయాన్నీ వూరూవాడా వినిపించేట్టు అన్నిళ్ళలోనూ ప్రచారంచేసింది సంధ్య. రాణాలాంటివాడిని కొడుకని వెనకేసుకొచ్చిన చెల్లెలిని చూసి, లక్ష్మి తెలతెలబోయింది.
రాణా దగ్గిర తీసుకున్న అడ్రెసు వెతుక్కుంటూ ఒక సాయంత్రంవేళ వాసు యింటికి బయల్దేరింది వీణ. వాసు రామస్వామితో బైటికి వెళ్ళాడు. గీత యింట్లోనే వుండి పుస్తకం చదువుకుంటోంది. ఇంటర్‍కం మోగింది.
“అమ్మా! మీకోసం ఎవరో మేడం వచ్చారు. పేరడిగితే చెప్పట్లేదు. విజిటర్స్ బుక్‍లోకూడా రాయరట” సెక్యూరిటీ చెప్పాడు. గీత కొద్దిగా గెస్ చేసి, కిందికి వచ్చింది. గేటవతల సెక్యూరిటీతో ఘర్షణపడుతున్న వీణని చూసింది. ఎందుకొచ్చింది యిది? వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తునే ముందుకి వెళ్ళింది.
ఇది ఈ కుటుంబాన్ని దాటి వెళ్ళట్లేదు. తమింట్లో గొడవంతా చేసాక రాణావైపు తిరిగింది. అక్కడ తిరగబడేసరికి మళ్ళీ యిటొచ్చినట్టుంది. రాణా చేతిలో యిరుక్కోలేదు. మంచిదైంది. అసలే డబ్బుందని చెప్పుకుంటూ తిరుగుతోంది. వాడు వదిలిపెట్టేవాడు కాదు. ముగ్గురక్కచెల్లెళ్ళ చేతిలో పడిందంటే బజారుదాన్ని చేసి వదిలిపెడతారు. వీణ తల్లీతండ్రీ చేతులెత్తేసారు. ఎవరో ఒకరు దార్లో పెట్టకపోతే ఈ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళని బానే కొడుతోందట. ఏది అందుబాటులో వుంటే అది అందుకుని విసిరేస్తోందట. ఎవరో ఒకరిద్వారా సమాచారం అందజేస్తున్నాడు సంతోష్. వాడికి తనేదో చేసి ఈ వుత్పాతంలోంచీ పడెయ్యాలని ఆశ. బెంగుళూరునించీ వెళ్లగొట్టారట. తిరిగొచ్చారు. భార్యని యూయస్ పంపేసి, తనిక్కడ కూర్చున్నాడు. అసలే ఎలాంటి అరాల్డైటూ లేని పెళ్ళి వాడిది. ఎలా అతుక్కుంటుందో చూడాలి. ఈ అందర్లోకీ సకారణంగా కష్టాలుపడుతున్నది వీణైతే అకారణంగా కష్టాలుపడుతున్నది వీడు.
గీత చేసేవన్నీ అవతలివారి ఆలోచనకి అందనంత చురుగ్గా చేస్తుంది. దాన్నే చిన్నప్పుడు అల్లరనేవారు. దేన్ని పాడుచేసినా ఆపడానికి వీల్లేనంత వేగంగా చక్కబెట్టేది.
“అరేయ్, అది తిప్పుకుంటూ ఎటో బయల్దేరింది. పట్టుకోండి” అని యశోద ఎవరికో పురమాయించేలోగా, మూలనున్న చీపురుకట్టకో, కింద మర్చిపోయిన డబ్బాలో ముగ్గుపిండికో ఆయువు మూడిపోయేది. ఆ గీత మారలేదు. అలాగే పెరిగి పెద్దదైంది. మారాల్సిన అవసరం రాలేదు.
“పద. కార్లో కూర్చుని మాట్లాడుకుందాం” అంటూనే కారు కీ చేతిలోకి తీసుకుంది. తెల్లబోయింది వీణ. వెంటనే తెప్పరిల్లి కీ వెనక్కి తీసుకోబోయింది.
“ఉ<హు<” అంది గీత కీ పట్టుకున్న చెయ్యి దూరంగా చాపి. “పదా!” తోసుకెళ్ళినట్టు తీసుకెళ్ళింది. ఇద్దరూ గేటు దాటారు. తను డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చుని కారు స్టార్ట్ చేస్తే, ఇక చేసేది లేక పక్కసీట్లో కూర్చుంది వీణ.
“ఎందుకొచ్చావు? ఏం పని యిక్కడ నీకు? భయంకూడా లేదా?” అడుగుతూ, కారు రివర్స్ తీసుకుని, టర్న్ చేసి ఎన్‍ట్రెన్సుకి రెండోవైపుకి తీసుకెళ్ళింది. అటు రోడ్డుకి డెడ్ ఎండ్. అపార్టుమెంటు కాంపౌండువాల్ ఆ చివరిదాకా వుంటుంది. వాహనాలేవీ అటు రావు. అటెవరూ వెళ్లరు. శనాదివారాల్లో పిల్లలు ఆడుకుంటారు. అంతే.
బాగా చివరిదాకా వెళ్ళి అక్కడ ఆపింది. చెయ్యి వీణ వెనకనుంచీ చాపి, జుత్తు సవరిస్తున్నట్టు నెమ్మదిగా చేతిలోకి తీసుకుంది.
“ఏం చేస్తున్నావు? జడ వదులు” కోపంగా చెయ్యి విదిలించబోయింది వీణ.
“ఇలాంటి నొప్పి ఎలా వుంటుందో నాకు తెలుసు. ఒక వెధవ నాకు రుచి చూపించాడు. వాడినే వాసు చావచితక్కొట్టి వచ్చింది. వాడు నీకు ఫ్రెండా? తెలివితక్కువదానా! ఒకసారి చావుతప్పి బైటపడ్డావు, బుద్ధిరాలేదా?” అని ఒకటి, రెండు, మూడుసార్లు వొడితిప్పింది.
“ఏయ్, గీతా! వదులు. నొప్పెడుతోంది వదలవే” గింజుకుంది వీణ. తల కదిపితే ఇంకా నొప్పెడుతోంది, పట్టు బిగుస్తోంది. పళ్లబిగువుని నొప్పి భరిస్తోందామె. గీత వదిలిపెట్టింది. ఆ కాసేపటికే నరాలన్నీ బిగబట్టిపోయి, విపరీతమైన తలనొప్పి మొదలైంది వీణకి. కళ్ళు బైర్లు కమ్మాయి. వాటర్‍బాటిల్ ఎత్తిపెట్టి గటగట తాగేసింది. చెమటలొచ్చాయి.
“నొప్పెట్టిందా?” తలమీది చేతిని భుజంమీదికి జార్చి అడిగింది. “ముప్పయ్యైదేళ్ళున్నాయి. నీకు పెట్టే నొప్పి అమ్మానాన్నలకీ వుంటుందని తెలీదా? వాళ్లమీదికి అన్నీ విసిరేస్తున్నావట ఏంటి? పైకికూడా విసిరేస్తున్నావట? పిచ్చాసుపత్రికి పంపించాలా? వట్టి పిచ్చాళ్ళే అలా చేస్తారు. వాళ్ళేం హానిచేసారు నీకు? పెళ్ళీ అదీ బానే చేసారుకదా? వాడు వెధవైతే ఏం చెయ్యగలరు? తప్పించుకుని బైటపడ్డావు. ఇష్టమో కష్టమో ఇంట్లో పెట్టుకుని చూస్తున్నారు. వాళ్లకి నచ్చినట్టే వాళ్ళు చూస్తారు. ఉద్యోగం సద్యోగం చెయ్యకుండా యింట్లో కూర్చుని వాళ్ళమీద పడి తింటున్నది నువ్వు. నువ్వే సర్దుకోవాలి. నీకిలా అవ్వకపోతే హాయిగా మిగతావాళ్లలా కొడుక్కి పెళ్ళిచేసి రెండుదేశాలకీ మధ్య తిరిగేవాళ్ళు. మీనాన్న ఆరోగ్యం అలా అయేదికాదు. సంతోష్‍కి ఇంకో చక్కటిపిల్ల దొరికేది. నష్టపోయింది వాళ్ళంతాకూడా. నువ్వొక్కదానివే కాదు. అర్థమైందా? ఇక్కడికి దేనికి వచ్చావు? పూనా వెళ్ళి ఆ మందందరినీ తోలుకురావడానికి చెప్పుల్లో కాళ్ళుపెట్టుకుని కూర్చున్నారు వాసు, మాధవ్. నీమీద మాకు ప్రేమ ఎందుకుంటుంది? నువ్వసలు మాకెవరివి? ఎక్కడో దూరపు చుట్టరికం. మానాన్న తమ్ముడి అత్తగారికి మనవరాలివి. వాసుకీ అంతే. ఎవరో పేరుకూడా తెలీని ముసలమ్మగారి మనవరాలివి. ఆవిడకూతుర్ని మాయింట్లో యిచ్చారుగాబట్టి మాకు చుట్టానివయ్యావు”’
“మీరెలా వున్నారో చూడాలనుకున్నాను” ఆమె చెయ్యి తోసేసింది.
“నువ్వు పెట్టిన మంటలెలా మండుతున్నాయో, చూద్దామనుకున్నావా? ఈరోజు చస్తే రేపటికి రెండోరోజు. మా పరువుపోయి కొన్నినెలలైంది. బోడిపరువు! ఇంకా దానికోసం ఎవరేడుస్తారు? ఎక్కడేనా కనిపిస్తే పదో పాతికో పడేసి తీయిస్తున్నాం. ఆ పరువు విలువ అది. తెలిసిందా? నువ్వెవరివి మేమెలా వున్నామో చూడటానికి? చెప్పానుగా? నీ చుట్టరికం మాకేం లేదని. సరే, వచ్చావుగా, విను. సంతోష్ రోజుకి లక్షకి పైన ఖర్చుపెట్టి మిమ్మల్ని ఫారిన్ ట్రిప్ పంపిస్తున్నాడు. వెళ్ళు. మొత్తం ఇరవయ్యెనిమిది రోజులు. రోజుకి పన్నెండుగంటలు నిద్రకీ మిగతా పనులకీ తీసేసినా, ఇంకా పన్నెండుగంటలు. ప్రతిముమెంటూ వీడియో తీసి యూట్యూబులో పెట్టు. ఈ పిచ్చిగుడ్డలు మానేసి కాస్త నీ వయసుపిల్లలెలా వున్నారో అలా వుండి వీడియోల్లో కనిపించు. ఫాషన్లు మారిపోయాయి. పదేళ్ళకిందట ఇలాంటివి బావుండేవి. బానే షాపింగు చేస్తారుగా, అమ్మాకూతుళ్ళు? వెళ్లి కొనుక్కో. నా చీరలు కట్టుకెళ్ళావు, అలాంటివి కొనుక్కో. సౌకర్యంగానూ, హుందాగానూ వుంటాయి. ఇక్కడినుంచీ అన్నీ నేను చూస్తాను. ఏమన్నా తేడా వచ్చిందో, బావతో నేనూ పూనా బయల్దేరతాను. ఇద్దరం చెరో బజార్లోనూ వెతుకుతాం. అంతదాకా ఎందుకు? నువ్వు మాకెలా ఫోటోలు పంపించావో అలానే మేంకూడా ఫోటోలు పూనా లోకల్‍పేపర్లో వేయించి మరీ వెతికిస్తాం. నువ్వో పాతిక ముద్దులు పెట్టావు నాకు. అవి కిలకిల్లాడుతూ నన్ను కాస్త ఆపుతున్నాయి. ఎంతలే, వాటిని తోసి అవతల పారెయ్యడం?” అంది గీత.
“నాకివన్నీ రాక కాదు. పెద్ద తెలివైనదానిలా చెప్తున్నావు. వాళ్ళు నన్ను గుర్తుపడతారు” రోషంగా అంది వీణ.
“ఎన్నాళ్ళు నంగిరిమాటలు మాట్లాడుతూ మా అందరివెనకా దాక్కుంటావు? దాక్కుని వూరుకోవట్లేదు, గోతులు తవ్వుతున్నావు. ఆడపిల్లవి కావా? నిన్ను నువ్వు కాపాడుకోవడం రాకపోతే బతకడం దేనికే? నేర్చుకో. ఎవరొచ్చి యిరవైనాలుగ్గంటలూ నీకు బాడిగార్డు డ్యూటీ చేస్తారు?” అంది. అని,
“వెళ్ళింక ఇంటికి. ఇంకోసారి నాకు కనిపించకు. నాగురించి ఇది మచ్చు. నీ ఫ్రెండు, రాణాగాడినడుగు అసలు ఎలా వుంటుందో చెప్తాడు” అంది. ఉక్రోషం వచ్చేసింది వీణకి. తనేం చేసినా పడుండటానికి ఇక్కడున్నది అమ్మానాన్నలు కాదన్న విషయం అర్థమైంది. తనతో యింతసేపూ మాట్లాడినది లక్ష్మి కాదు, గీతని గ్రహించాక ఇద్దరికీమధ్య వుండే తేడా తెలిసింది. గీత చెప్పిన చుట్టరికాలు తలకెక్కలేదు. తనని వీళ్ళు చాలాదూరం పెట్టారని అర్థమైంది. వీళ్ళు ఆ ఫోటోలకి భయపడలేదు. చెప్పుడుమాటలకి భయపడలేదు. వాసు వివరాలు బ్లాక్‍మెయిలర్స్‌కి యిచ్చింది. తన పేరు బైటికొస్తే ఏం చేస్తాడో! తన పేరు బైటికి రాకుండా ఆ ఒక్కపనీ ఐపోతే ఇంక వీళ్లకేసి చూడదు. తనపేరు చెప్పద్దనికూడా ప్రత్యేకంగా చెప్పింది. వాళ్ళకి కావల్సింది డబ్బు. అంతే. ధైర్యం చెప్పుకుంది.
ఇదే యింత రాక్షసైతే అతనూ అంతేనేమో! తమింట్లో టీపాయ్ విరగ్గొట్టాడు. అమ్మమీదికి చెయ్యెత్తాడు. నవ్వుతుంటే మంచివాడనుకుంది. ఇద్దర్నీ భూమ్మీద పెడితే పంటలూ, ఆకాశంలో పెడితే వానలూ వుండవంటారు. నిజం.
గీత కారు దిగేసింది. వీణ దిగలేదు. అలానే కూర్చుండిపోయింది. గీతకి జాలనిపించింది. తగ్గి, అమ్మా అప్పా అంటే మారదు. అందుకే కఠినంగానే వుంది. కాసేపటికి సర్దుకుని డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు స్టార్ట్ చేసుకుంది వీణ. ఎలా ఇల్లు చేరిందో తెలీదు. కారు గేటవతలే వదిలేసి పార్కింగ్‍లో పెట్టమని సెక్యూరిటీ టేబుల్‍మీద కీ పడేసి, పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళిపోయి, గదిలోకి వెళ్ళి తలుపుకూడా వేసుకోకుండా మంచంమీద చెప్పులతోటే అడ్డంగా వాలిపోయింది. ఏడుస్తుంటే లీల కంగారుపడింది.
“వీణా! ఏమైందే? ఎక్కడికెళ్ళావు? ఏం చేసి వచ్చావు?” ఎన్నో ప్రశ్నలడిగింది. కాళ్ళకున్న చెప్పులు లాగి కింద పడేసింది.
“తలనొప్పమ్మా! పగిలిపోతోంది తల” అంది.
లీల టేబ్లెట్, నీళ్ళు తెచ్చిచ్చి, కాఫీకూడా చేసుకొచ్చింది. జండూబామ్ తెచ్చుకుని కూతురి నుదుటికి రాస్తూ కూర్చుంది. మొహమంతా వుబ్బిపోయి వుంది. ఏడుపుచేత అనుకుంది. ఎక్కడికెళ్ళిందో ఏం జరిగిందో ఎంతడిగినా చెప్పలేదు. ఆమె నిద్రలోకి జారిపోతే ఆవిడ లేచి యివతలికి వచ్చింది.
ఏం జరుగుతోంది తన కూతురికి? వాసు వెంటపడింది. వాళ్ళు మాడుపగలగొట్టారు. రాణాతో సినిమాకెళ్ళిందని తనెదురుగానే చెంపలు వాయగొట్టింది సంధ్య. అమాయకంగా పెరిగింది పిల్ల. చిన్నప్పట్నుంచీ చాలా జాగ్రత్తగా పెంచారు. స్కూలుకీ కాలేజికీ సంతోష్ తోడుండేవాడు. వాడు వెళ్లలేనప్పుడు తనూ మానేసేదిగానీ ఒక్కర్తీ ఎప్పుడూ వెళ్లలేదు. స్నేహితుల్లేరు. బైట పరిచయస్తుల్లేరు. రవి పిల్లలతోటే తిరిగేది. వాళ్ళిక్కడ లేరు. మాటలుకూడా మానేసారు. ఇంక ఎక్కడికెళ్ళింది?
ఆవిడ ఫోన్ మోగింది. గీత. వొళ్ళు ఝల్లుమంది. వాళ్ళింటికే వెళ్ళిందా ఇది?
“చేరిందా, అది యింటికి?” నేరుగా అడిగింది గీత.
“మీయింటికి వచ్చిందా గీతా? ఏం చేసావే దాన్ని? కొట్టావా?” అడిగింది దు:ఖంతోటీ అవమానంతోటీ వుక్కిరిబిక్కిరౌతూ.
“ఆ< లేదు. సన్మానం చేసి, శాలువా కప్పి, పట్టుచీర పెట్టి పంపాను. చూపించలేదా?”
“అది తెలివితక్కువది గీతా! వాసు మంచివాడు, భయపడ్డట్టేమీ జరగలేదు. ఇంక దానిమీద కోపందేనికే?”
“నాకేం భయం? ఎంతకాలం దాన్ని తెలివితక్కువదానిగా వుంచాలనుకుంటున్నావు?” పదునుగా అడిగింది. “చూడు, సంతోష్ ఏర్పాటు చేస్తున్న ట్రిప్పుకి వెళ్లండి. దానికి తల్లివీ స్నేహితురాలివీ నువ్వే. దాన్ని భరించాల్సిందీ నువ్వే. నేను, వాసు, రాణా కాదు. అర్థమైందా? దాన్ని వీడియోలు తియ్యమన్నాను. అది తియ్యకపోతే నువ్వు తియ్యి. నీకు ఫోటోలవీ తియ్యడం వచ్చుగా?’ స్టైల్‍గానే వుండేదానివిగా? వెళ్ళేలోగా దాన్ని కాస్త మాడర్న్‌గా తయారుచెయ్యి. తింగరిదాన్లా వుంటే ఎవరూ మాట్లాడరు”
“ముప్పైలక్షలు తగలేస్తున్నాడు. వాడికి బుద్ధిలేదు. దాని గోల ఎలాగోలా వదిలిపోతే చాలని నువ్వు చూస్తున్నట్టున్నావు. మీకేమే, కోట్లకి పడగలెత్తి వున్నారు” అంది లీల కోపంగా.
“సరే ఐతే. ఆ లక్షలు తింటూ కూర్చో, నేనొచ్చి ఇంటికి తాళం వేసుకుని వెళ్తాను, మీరెవరూ ఇవతలికి రాకుండా”
“నన్నే దబాయిస్తున్నావా?”
“నీకన్నా కాస్త ఎక్కువ పెద్దమనుషులు, ఆ రవిగారినీ, వారి పెద్ద మేనల్లుడినే దార్లో పెట్టాను, నువ్వో లెక్కలోదానివి కాదు”
“ఏయ్! ఫోన్ పెట్టెయ్”
“నువ్వే పెట్టెయ్యచ్చుగా?”
లీల ఫోన్ కట్‍చేస్తుందేమోనని చూసింది గీత. చెప్పాల్సింది చెప్పకపోతే ఎలా? ఆవిడ ఇంకా లైన్లోనే వుండటం చూసి అంది,
“వీణ మన కుటుంబాన్ని దాటి ఎక్కడికీ వెళ్లదని అర్థమైంది. దానికి మగవాళ్ళని చూస్తే భయం. ఇంట్లో యింట్లోనే తోడు వెతుక్కుంటోంది. అది జరగని పని. వాసు అర్జెంటుగా వున్నవన్నీ మా ముగ్గురిపేరిటా విల్లు రాసి, రిజిష్టర్ చేయించి అక్కడ పడేసాడు. నామినేషన్లన్నీ చెక్ చేసుకున్నాడు. అంటే అర్థమైందికదా? ఆ గుర్రాన్ని చెరువులో ముంచేసినా ఝాడించి తంతుందితప్ప నీళ్ళు తాగదు. రాణా శశిధర్ మనిషి. శశిధర్ వుత్తివెధవ. ఉమనైజరు. సామ్ అతని చేతుల్లో యిరుక్కుని వుంది. వాళ్ళ నాన్న పోయాక అది బాగా డల్లైపోయింది. వంట్లోకూడా బావుండట్లేదట. పిల్లల చదువులయ్యేదాకా వుండి వాళ్లతోపాటు వెళ్ళిపోతానంటోంది. రాణా దీన్ని వాళ్ళింటికి తప్పక తీసుకెళ్తాడు. సామ్ ప్రేమగానే దగ్గిరకి తీస్తుంది. దాని భర్తకూడా మరీ జంతుస్థాయి కాకుండా వావివరసలు తెలిసిన మనిషిగాబట్టి తనుగా ఏం చెయ్యడు. కానీ అతనికి ఆడా మగా చాలామంది పరిచయం. లిఫ్టిస్తానని కార్లో ఎక్కించుకుని, సగందార్లో కారుతోసహా మరొకరికి అప్పజెప్పెసే మనిషి. రాణా మీకెప్పట్నుంచీ చుట్టం? మా ఫామ్‍హౌస్ ట్రెస్‍పాస్ చేసారు వాళ్ళు. నలుగురు ఆడామగా జంటలు పట్టుబడ్డారు. ఇంకాస్త చనువు పెరిగుంటే నీ కూతురు అందులో తప్పక వుండేది. ఎలాగేనా బతికే స్వేచ్ఛ మీకుంది. మీరలాగే బతకాలనుకుంటే బతకండి. మా జోలికి రావద్దు”
లీలకి కాళ్లకింది నేల కదిలినట్టైంది.
“గీతా! ఏదో పొరపాటు జరిగిందమ్మా! వీణది తప్పే. మనసు కష్టపెట్టుకోకు. నేనూ బాబాయ్ వాసుకి సారీ చెప్తాం” అంది నెమ్మదిగా తనని తను కూడదీసుకుని, ఆమె చెప్పినవాటికి మొదటి స్పందనగా.
“ఉ<హు< అది పొరపాటు కానే కాదు. బ్లఫ్ చెయ్యకు. మురళీధర్ నీ తమ్ముడేకదా?”
భూమీ ఆకాశం ఏకమై తనని చుట్టేసుకుని వుక్కిరిబిక్కిరిచేస్తున్నట్టనిపించింది లీలకి. గీత ఏంటో మొదటిసారి అర్థమైంది. ఆమెని ముందుపెట్టుకుని పెద్దవాళ్లంతా వ్యవహారాలకి ఎందుకు దిగుతారో తెలిసింది. కూలంకషంగా తెలుసుకోవడం, ఆమూలాగ్రంగా చదివెయ్యడంలాంటి పదాలు సృష్టించి పెట్టారు ఇలాంటివాళ్లకోసం.
“ఇద్దరం గవర్నమెంటు వుద్యోగస్థులం. ఒక ఆఫీసులో జరిగినవి ఇంకోచోట పుకార్లలాగ తెలుస్తాయి. ఎక్కడెక్కడో తిరిగేనా మాదగ్గిరకి వస్తాయి. కాస్త కష్టపడి కూపీల్లాగితే అతనిపేరు బైటికొచ్చింది. వాసుకింకా తెలీదు. ఎలా మీతమ్ముడికి బుద్ధిచెప్పాలో ఆలోచించాక తనకి చెప్తాను. ఈలోగా వాసుకే తెలిస్తే తనే చూసుకుంటాడు. వదిలిపెట్టం. మేనమామలు, మామకొడుకులు మీయింట్లోను చాలామందే వున్నారుకదా, అటు కొంపే కూల్చే ప్రయత్నం చెయ్యచ్చు. ఎందుకు మామీద మీకు ద్వేషం? మాకూ మీకూ ఎలాంటి విరోధం లేదు. మా నాన్న తన శక్తికి తగ్గట్టు అత్తల పెళ్ళిళ్ళు చేసాడు. బాబాయిలిద్దరూ ఆయనకి కలిసొచ్చి వుంటే వీళ్ళారుగురి జీవితాలూ ఇంకాస్త మెరుగ్గా వుండి, మనకుటుంబం స్థాయీప్రమాణాలు ఇంకా వున్నతంగా వుండేవని బాధపడ్డారేతప్ప, ఎప్పుడూ మిమ్మల్నో మాటకూడా అనలేదు” మర్మాలూ, రహస్యాలూ వెతికి పట్టుకుని దోషిత్వం నిర్ధారణ చేసినట్టున్నాయి ఆమె మాటలు.
“నాకు ఆలోచనలు చాలా ఎక్కువ. బాగా ఆలోచిస్తాను. ఎప్పటెప్పటి విషయాలో అప్పట్లో నేను గ్రహించలేకపోయినవి తర్వాతెప్పుడో స్ఫురిస్తుంటాయి. ఇదంతా ఎలాంటి వ్యవహారమంటే రోడ్డుమీద ఎదురుపడి పలకరింపుగా నవ్విన మనిషి ఎవరో ఆక్షణాన్న గుర్తురాక, ఇంటికొచ్చాక తీరిగ్గా గుర్తుచేసుకుని మన పలకరింపు బదులిచ్చినలాంటిది. మా పిల్లలగుంపు అందరిళ్లకీ వెళ్ళేవాళ్ళంగానీ, మీయింటికి రావడం తక్కువ. నేనొస్తున్నానని తెలిసినప్పుడు అక్కడా యిక్కడా చిల్లరడబ్బులు పెట్టి గమనించేదానివి. గీతకి డబ్బులేదు, అల్లరిది, దొంగిలిస్తుందేమోనని చూడటానికి. నాతోటి పిల్లలు మరోపదిమందీ, నాకన్నా చిన్నవాళ్లొక ఐదుగురూ, ఇంకా చిన్నవాళ్ళు ముగ్గురూ చెయ్యని పని నేను చేస్తానని అనుకున్నావు. ఒక మనిషిని ఇంతగా డిస్‍ఓన్ చేస్తారని నాకు తెలీదు. మా నాన్న నాకు కాస్త వూహ తెలిసాక చెప్పాడు.
మనచుట్టూ వందమంది మనుషులుంటారు. ఒకొక్కరిదీ ఒకొక్క మనస్త్వత్వం. నీకుమాత్రం ఒకటే వ్యక్తిత్వం వుంటుంది. ఒక్కోమనిషికోసం ఒక్కోలా మారిపోయి ప్రవర్తించలేవు. ఎన్ని ప్రలోభాలూ, కష్టాలూ, సుఖాలూ ఎదురైనా నువ్వు నీలాగే వుండాలి. ఎదుటివాళ్ళలో నీకు అవసరమైనది తీసుకుని అక్కర్లేనిది వదిలెయ్. నీకు అవసరమైన ఆ కొద్దిభాగంమాత్రమే వాళ్లతో నీకుండే అనుబంధం-అని.
అదే ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చాను. మీ అభిప్రాయాలూ, భయాలూ, నమ్మకాలతో నాకెలాంటి సంబంధం లేదు. మీతో నాకున్నదల్లా బాబాయ్‍తో నాకుగల రక్తసంబంధం మాత్రమే. ఇంతకిముందే చెప్పినట్టు ఎలా బతకాలనేది మీయిష్టం. మా హద్దుల్లోకి రాకపోవడం మీబాధ్యత. దాన్ని గుర్తుచేస్తున్నాను” చెప్పడం ముగించి ఫోన్ పెట్టేసింది గీత.
లీలకి తను బతికుందో చచ్చిపోయిందో అర్థమవ్వలేదు. వారాంతం కావడంతో సంతోష్ వచ్చాడు. అతనొచ్చి పలకరించేదాకా అలానే కూర్చుంది.
మురళీధర్ భార్య కమర్షియల్ టాక్స్‌లో చేస్తుంది. తెలిసినవాళ్లద్వారా ఆవిడ ఫోన్ నెంబరు సంపాదించి పెట్టుకుంది గీత.
భర్తని వదిలిపెట్టిన పెళ్ళికూతురుంది. రెండోపెళ్ళివాడైనా, భార్యాపిల్లలున్నా పర్వాలేదు. ముసలివాడైనాసరే, చేసేసుకుంటుంది. మీకు యిష్టమైతే సంప్రదించండి. తర్వాత ఈ పాట పాడుకుంటూ కూర్చోండి- అని లీల నెంబరిస్తూ మెసేజి చేసి, భర్త మరో స్త్రీ ప్రేమలో పడిన సందర్భానికి సావిత్రి పాట-
నిన్ను చూసింది లేదు, కన్ను మూసింది లేదూ- అనీ,
ఆ పాట లింకు పంపించేసి కుతకుత వుడికిపోతున్న మనసూ, మండిపోతున్న వొళ్ళూ చల్లబరుచుకుని కూర్చుంది.
వాసు, రామస్వామితో కలిసి వచ్చాడు. కొద్దిసేపు నిలబడికూడా మాట్లాడుకున్నాక ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇద్దరికీమధ్య చనువు పెరిగి మంచిస్నేహం మొదలైంది. అప్పుడప్పుడు సాయంత్రాలు అతనితో కలిసి వెళ్ళి యూనియన్ ఆఫీసులో కూర్చుంటాడు వాసు. రూల్ పొజిషన్ బాగా తెలియటంవల్ల ఎవరెవరో ఏవేవో అడుగుతుంటారు. అప్లికేషన్లు రాసిస్తుంటాడు. అక్కడ బాహాటంగా జరిగే రాజకీయాలవీ అతన్ని ఆశ్చర్యపరుస్తాయి. అందరికీ అతనిమీద గౌరవం వున్నా ఒకరిద్దరు నెగెటివ్ కామెంట్స్ చేస్తారు. అసూయపడతారు.
మీది ప్రివిలిజ్‍డ్ కమ్యూనిటీగాబట్టి అవకాశాలన్నీ దొరకబుచ్చుకుంటారు. మాకు ఏవీ వదలరు. గవర్నమెంటు జాబ్స్‌లో చేరి పైకొస్తున్నామని అనుకునేసరికి అవి తగ్గి ప్రైవేట్ జాబ్స్ వచ్చాయి. మళ్ళీ మీకే అవకాశాలు. మమ్మల్ని పైకి రానివ్వరు-
మీ కమ్యూనిటీవాళ్ళకే మీరు సాయం చేస్తున్నారు. చదువుచెప్పించినా మీవాళ్ళకే-
మీరు నాన్ వెజ్ ఎందుకు తినరు? తప్పుకింద ఎందుకు చూస్తారు-
రకరకాల కామెంట్స్ అతనిముందూ వెనకా అంటుంటారు. ఇంతకుముందు అతను పెద్దగా ఎవరితోటీ కలిసేవాడుకాదు, పొగరనుకుని కొందరూ, గౌరవంతో కొందరూ వదిలిపెట్టేసినా, ఈ అనేవాళ్ళు అప్పుడు యిప్పుడూ వున్నారు. వాసు అవన్నీ పట్టించుకోడు. రెచ్చగొట్టినా నవ్వి వదిలేస్తాడుగానీ, వాదనకి దిగడు. జవాబివ్వక తప్పనిసరైతే,
“నా చేతిలోలేనివాటికీ,నాస్వంతడబ్బుతో చేసేపనులకీ, తండ్రితాతలకాలంనుంచీ వచ్చే అలవాట్లకీ ఎలాంటి వివరణా యివ్వక్కర్లేదనుకుంటాను” అనెసి వూరుకుంటాడు.
రామస్వామితో కలిసి వాసు బైటిప్రపంచంలోకి అడుగుపెడితే వాసుని చూసి అతనూ కొన్ని నేర్చుకున్నాడు.
పొద్దున్న ఆరింటికి లేచి, అప్పట్నుంచీ పదిన్నరదాకా వుండే సమయంలో కనీసం ఒకగంట భార్యతో సరదాగా మాట్లాడటం అలవాటుచేసుకున్నాడు. మైత్రీసమావేశాలు సాయంత్రం ఎనిమిదింటికి ముగించుకుని వచ్చేస్తున్నాడు. ఇదివరకూ యూనియన్‍కోసం, స్నేహితులకోసమే బతుకుతున్నట్టుండేవాడు. రోజంతా మంజుల ఒక్కర్తీ వుండేది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాక వాళ్ళ ఫోన్లకోసం చూడటం తప్ప ఆమెకి మరోపెద్ద వ్యాపకం వుండట్లేదు. కిట్టీపార్టీలు, డాబుదర్పాలు చూపించుకోవడాం ఆమెకి పెద్దగా నచ్చవు. గీతని చూసి చిన్నచిన్నగా తెలుగుపుస్తకాలు చదవడం మొదలుపెట్టింది. భర్తలో వచ్చిన ఈ మార్పు ఆమెకి సంతోషాన్నిచ్చింది.
విహీకోసం కొన్న జానీవాకర్ని అతనికి యిచ్చి, జరిగిన విషయం చెప్పాడు వాసు.
“విహీతో నాకు చాలా అటాచ్‍మెంటు స్వామిగారూ! మయూని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టుంటుంది. వీడేమిటో, నాలోనే దాక్కుని వుండి మధ్యమధ్యలో ఒకసారి యివతలికొచ్చి చిన్నికృష్ణుడిలా కళ్ళముందు నాట్యంచేసి మళ్ళీ నాలోపలికి వెళ్ళిపోయినట్టనిపిస్తుంటుంది. చాలా గమ్మత్తైన ఫీలింగ్. వాడలా చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఇట్ వజ్ సో సాడ్” అన్నాడు. పిల్లలకోసం తపించిపోయే తల్లులని చూసాడాయన. తండ్రులకి ఎంత ప్రేమ వున్నా బాహాటంగా చెప్పుకోవడం చూడలేదు. వాసుని చూసి చకితుడయ్యాడు.
“డ్రింకింగ్‍ని మీరంత సీరియస్‍గా తీసుకుంటారా?” అడిగాడు.
“అదంత తప్పనో ఒప్పనో కాదు. పెద్దవాళ్లంతా వద్దన్నదాన్ని ఎందుకు చేయాలని. ఆ అలవాటుని సరిగ్గా హేండిల్ చెయ్యలేకపోతే జీవితం పాడైపోయినట్టేకదా?” వాసు జవాబు.
వాసు యింట్లోకి వచ్చేసరికి గీత చాలా ఆలోచనలో వుంది. వీణ ఎందుకొచ్చిందనేది అర్థం కావట్లేదు ఆమెకి.
“ఏమైంది గీతూ?”
జరిగినవన్నీ చెప్పింది.
“వీణ మళ్ళీ వచ్చిందా?” నమ్మలేనట్టు అడిగాడు.
“ఏదో ముట్టించి, మంట అందుకుందో లేదో చూసుకోవడానికి వచ్చినట్టుంది”
“లోపలికి రానివ్వలేదుకదా, గీతా?” హడిలిపోయాడు.
“లేదు. దాని కార్లోనే దానికి ప్రైవేటు చెప్పి పంపించాను. ఆవిడకీ బానే చెప్పాలే”
“ఏంటే, ఈ న్యూసెన్సు మనకి? ఏదో బెదిరిస్తున్నారుగానీ, మనమేం చెయ్యమనా?” చికాకుపడ్డాడు.
“సంతోష్ వాళ్ళకోసం ఇరవయ్యెనిమిదిరోజుల ట్రిప్పేదో ప్లాన్ చేసాడు. ట్రావెల్ వ్లాగింగ్ చెయ్యమంటున్నాడు. అదేమో యిటు పరిగెత్తుకొచ్చింది. సలహాకోసంకావచ్చు. ఆ మర్యాద, మనింట్లో స్థానం నిలుపుకోలేదన్నది మర్చిపోయింది. వాళ్ళమ్మేమో అంత డబ్బెక్కడ ఖర్చుపెడతాం అంటోంది”
“లక్షల్లో వస్తుంది”
“ఔనట. వాడు పెట్టుకుంటున్నాడు”
“వాడిభార్య వూరుకుంటుందా?”
“ఎవరి సంపాదనలూ, ఆస్థులూ ఖర్చులూ వాళ్లవేనటలే. చాలా కండిషన్లు పెట్టుకుని చేసుకున్నారు. అవన్నీ వాళ్ల సమస్యలు. ఆ మురళీధర్ ఎవరో తెలుసా? బాబీ అంటారు అతన్ని. మనకలానే తెలుసు. లీలావతిగారి ఆఖరి తమ్ముడు. సంతోష్‍కి మెసేజి పెట్టి బాబీ అసలు పేరేంటని అడిగాను. వాడు చెప్పాడు. అతని భార్య కమర్షియల్ టాక్స్‌లో చేస్తుంది. తెలిసినవాళ్ళద్వారా ఫోన్ నెంబరు తీసుకుని పెట్టుకున్నాను. వాళ్ళకీ బాంబు పెట్టేసాను. అక్కడ పేలుతుందో ఇక్కడ పేలుతుందో చూడాలి” అంది. శేఖర్ పెద్ద ఆలోచనతోటే తమింటికి వచ్చాడని అతనూ నమ్మాడు. మనసులో పెద్దకెరటంలా బాధ ఎగిసిపడింది. గీత ముఖంలోకి చూసాడు. ఎటువంటి మనుషుల్ని చుట్టూ పెట్టుకుని బతుకుతున్నారు తాము!
“ఇది విను. మనవిషయంలో సాయం చెయ్యలేదని సుమంత్, మామగారితో హోరాహోరీ యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ కంపెనీలకి వెళ్ళడం మానేసాడు. కూతురూ అల్లుళ్లమీద పూర్తిగా ఆధారపడిపోయాడు ఆయన. ఇప్పుడింక ఎవరేనా మగపిల్లాడిని పెంచుకుంటానని బెదిరిస్తున్నాడట. లత వూరుకుంటుందా? వాళ్లవి అనేకరకాల వారసత్వపు ఆస్థులు.
ఏకైక వారసురాలినని ఇప్పటిదాకా నన్ను నమ్మించారు. ఎవరో బైటినుంచీ వచ్చేవాడితో నేను పంచుకోవాలా? ఉన్నవన్నీ నా పేరుమీద పెట్టి, అప్పుడు పెంచుకోండి. లేకపోతే కోర్టుకెళ్తాను- అని తనూ బెదిరించిందట. వాళ్లమ్మకూడా ఇటే.
ఇదంతా నువ్వే చేయిస్తున్నావని ఆయనో మాట అన్నాడని సమాచారం” అందామె.
“ఇదికూడా నా ఖాతాలోనేనా?” అడిగాడు వాసు ఆశ్చర్యంగా. “మీరంతా అసలు పెద్దవడం. పెద్దాళ్ళలా ఆలోచించడం వుండదా, గీతా? నాకోసం సుమంత్ వాళ్ళ మామతో దెబ్బలాడటమేమిటే? ఆయనకి కోపం వచ్చిందంటే రాదామరి?” అన్నాడు విసుగ్గా.
కాసేపు అటూయిటూ పచార్లు చేసి వచ్చి ఆమె వొళ్ళో తలపెట్టుకుని పడుక్కున్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఇద్దరే విడిగా వుంటున్నప్పట్నుంచీ చాలా చేస్తున్నాడు. కొత్తగా కనిపెడుతున్నట్టు. నవ్వొస్తుందామెకి. ఈ కొత్తచనువులు మరీ దగ్గరచేస్తున్నాయి. అతనిమీది కోపం కొద్దికొద్దిగా మరుగునపడుతోంది.
“చాలా చెత్తగా వుంది” అన్నాడు.
“ఏమిటి?” అడిగింది.
“నా మొహంలా వుంది”
“ఇలా పడుక్కోవడమా? మరైతే లేచి బుద్ధిగా కూర్చో. కొత్తవిద్యలు అలానే వుంటాయి” అంది నవ్వాపుకుని.
“చెత్తగా వున్నది లైఫు”
“ఓహో! తర్వాతిది?”
“ఏంటి?”
“నీమొహంలా వున్నది?”
“ఏం, నీకు నవ్వులాటగా వుందా? నాకు చిరాకేస్తోంది తెలుసా? రామస్వామి ఎవర్నేనా వెంటపెట్టుకుని తిరగమని సలహాయిచ్చాడు. ఎవరికి భయపడీ? ఆ కొత్తిమీరకట్ట పిలకలకా? దాని మేనమామకా? శశిధర్‍కా? రాణాకా? ఆ కౄరజంతువుని ఇటు తోలేబదులు ఆ మేనమామే ఎందుకు చేసుకోలేదు? శశిధర్ని సమీర యింకా ఎందుకు భరిస్తోంది? రాణాకేం కావాలి? వీడింక మారడు. డబ్బులేదని కొన్నాళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు డబ్బొచ్చేమార్గం చూపించినా ఇంకా ఏడుపే. వీడీ సుమంత్‍గాడి సమస్యేంటి? వీడి మామగోలేమిటి? అల్లుడికి కోపం వస్తే కాస్త బతిమాలి మంచిచేసుకోవాలిగానీ, డబ్భయ్యేళ్ళ వయసులో ఎవర్నో పెంచుకుంటాననడమేంటి? అసలు మనుషులకి తెలివితేటలు నశించిపోతున్నాయి. ఒకప్పుడు రాణా ఒక్కడుండేవాడు యింట్లో. ఈ తెలివితక్కువవాళ్లంతా ఒకరికొకరు జమౌతున్నారు. వీళ్లంతా నా చుట్టూ చేరారు” అన్నాడు.
“ఇదొక ఫేజ్ వాసూ! కాలంతో మనంకూడా ప్రవహిస్తున్నాం. ప్రవాహంతో చెత్తకూడా కొట్టుకొస్తుంది చూడు, అలా వీళ్లంతా చేరారు. ఒడ్డుకి కొట్టేసి, మనం వెళ్ళిపోతాంలే. అంతదాకా జాగ్రత్తగా వుండటంలో తప్పులేదు” అంది.
“బెకబెకమంటూ అవంతీపురం యింట్లో వుండేవాడిని బైటపడేసారు. ప్రపంచం ఇంత పెద్దగా వుండటం నాకు నచ్చలేదు” అన్నాడు. ఫక్కుమని నవ్వింది గీత ఆ పోలికకి.
“కప్పగారూ! కింద కాసేపు నడిచేసి వద్దాం పదండి” అని లేవదీసింది. ఇద్దరూ గార్డెన్‍లోకి వెళ్ళారు. ఎవరెవరో కలిసారు. అంతరిక్షంనుంచీ ఆవకాయదాకా, షేర్‍మార్కెట్‍నుంచీ వీధివ్యాపారాలదాకా చర్చలు. కాసేపు కాలక్షేపం.
వాసు లోలోపల జరుగుతున్నదేమిటో గీతకి తెలుసు.
శశిధర్ చేసిన పని చెప్పి,
“బావా! అతనితో జగ్రత్తగా వుండాలి. వాళ్ళకి బాగా పలుకుబడి వుంది. చేతినిండా రకరకాల మనుషులున్నారు. తగ్గే మనిషి కాదు. అతని అన్న మరీ దుర్మార్గుడు. తడిగుడ్డతో గొంతులు కోసేరకం. శశిలా బైటపడడు. నువ్వెలా రియాక్టౌతావా అని ఆలోచించి, వాళ్ళు పైయెత్తుకి సిద్ధంగా వుండచ్చు. ఇప్పటిదాకా మనకి అలాంటివి అవసరంపడలేదు. క్లోజ్‍డ్ సర్కిల్లా వుండిపోయి, పరిచయాలు పెంచుకోలేదు మనలో ఎవరం. ఇప్పుడింక అంతా బలపరీక్షల్లో పడ్డాం. శశిధర్ నీకు తెలీకుండా చేసాడు. నువ్వూ తెలీనట్టే వుండు. లేదా సమీర విషయంలో నిన్ను కవ్వించడంకోసం చేసాడేమో! అది మనింటి సమస్య కాదు. వసంత్ తేల్చాలి. తలకెత్తుకోకు. రాణా వెనక ఎవరెవరున్నారో తెలీదు. అతనైతే శశి జేబులో బొమ్మ. ఎలా ఆడమంటే అలా ఆడతాడు. ఇదంతా ఒక మైండ్‍గేమ్‍లా జరిగింది. మీ మామయ్యలని రానీ. తొందరపడద్దు” అని నచ్చజెప్పాడు శ్రీధర్. అతనిమాట తీసెయ్యలేక కోపాన్ని అదుపులో వుంచుకుంటున్నాడు వాసు. లేకపోతే ముందు వెళ్ళి రాణాతో గొడవపెట్టుకునేవాడే.
చిన్నప్పట్నుంచీ తెలిసినవాళ్ళకి మధ్య కొత్తకొత్తవాళ్లెవరో వచ్చి చేరారు. ఇష్టమైన, అభిరుచులు కలిసిన మనుషులమధ్య బతికారు యింతకాలం. రోజూ కలవకపోయినా కలిసినప్పుడు జ్ఞాపకాలు పంచుకుని కలయికని ఆహ్లాదంగా మిగుల్చుకునేవారు. ఇప్పుడు ఎవరిని పలకరించాలన్నా సంకోచం వాసుకి. జరిగినవి ఎవరికేనా తెలుసేమోనని. ప్రోబ్ చేస్తారేమోనని. ఈ కొత్తఆలోచనలూ, భయాలూ నిండిన ప్రపంచం పెద్దదైందో, ఇరుకైందో అర్థంకాలేదు వాసుకి. ఆ అర్థంకాకపోవటమే నచ్చకపోవటం.
అలసట వచ్చేదాకా తిరిగి ఇంటికొచ్చి తినేసి పడుక్కున్నారు.
గీత పంపించిన మెసేజి చూసి, లీల మరదలు గీత ఫోన్ పెట్టేసిన మరోగంటకి లీలకి ఫోన్ చేసి నానామాటలూ అంది. అత్తగారికి తగ్గ కోడలామె. ఇక్కడ లీల ఎంత కోడలో, అక్కడ ఆమెకూడా అంతే కోడలు. ఐతే ఆవిడకి ఇంగితం వుంది. అందుకే గీతకి చెయ్యకుండా వదినగారికి చేసింది. సంతోష్ వచ్చీరాగానే ఈ కాల్ వచ్చింది.
జరిగినవన్నీ తెలిసాయి సంతోష్‍కి. వాసుమీద కేసు పెట్టినందుకు మేనమామతో బాగా గొడవపెట్టుకున్నాడు. ఆ విషయం తనదగ్గిర దాచినందుకు తల్లినీ తిట్టాడు. వీణ వాసు యింటికి వెళ్లిందని తెలిసి తెల్లబోయాడు. శేఖర్ ఈ గొడవలు జరుగుతున్నప్పట్నుంచీ బాల్కనీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. కొడుకుని చూసి నిర్వేదంగా నవ్వాడు.
“ఒకటేదైనా జరిగితే మీ అమ్మమ్మా, మామయ్యలూ, అమ్మా అందరూ తలోలాగా రియాక్టై ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తారు. పరిస్థితులు చేతుల్లోంచీ జారిపోతాయి. వాటంతట అవి సర్దుకోవలసిందే తప్ప మనం ఏమీ చెయ్యలేం. కుర్చీ తెచ్చుకుని నువ్వుకూడా నాపక్కని కూర్చో” అన్నాడు. తండ్రిమాటలకి కోపం రాలేదతనికి. మరో ఆలోచనలో వున్నాడు.
అలేఖ్య కూతురు అతనికి బాగా చేరికైంది. ఫోన్లో చూసి, “ఎప్పుడొస్తావు?’ అని చేతులు తిప్పుతూ వచ్చీరాని మాటలతో అడుగుతోంది. అతని మనసు గాలం వేసి లాగేసినట్టౌతోంది. అక్కడికి వెళ్ళిపోవాలని వుంది. వెళ్లకపోతున్నాడు. అక్కడో ఇక్కడో యిరుక్కుపోయాననిపిస్తోంది.
మర్నాడు పొద్దున్న వీణని నిలదీసాడు.
“ఎందుకెళ్ళావు చెల్లీ? అక్కడ నీకేం పని? నువ్వు చేస్తున్నపనులు నీకేమన్నా అర్థమౌతున్నాయా? ఏం చెయ్యాలని వెళ్ళావు?” విసుగ్గా అడిగాడు.
“నేను పోగొట్టుకున్న సుఖసంతోషాలూ, సభ్యతాసంస్కారాలూ, నేను బతకాలనుకున్న జీవితం అక్కడ కనిపిస్తాయి. వాటిచుట్టే నా మనసు తిరుగుతుంటుంది. వాసుని చూడాలని వెళ్లాను. వాళ్ళిప్పుడు ఫ్లాట్‍లో వుంటున్నారు. సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వలేదు. వెళ్లనిస్తే లోపల ఒకవార ఎక్కడేనా కూర్చుని, వాసుని కనిపెట్టి, అతనితో మాట్లాడి, నాతో ఫారిన్‍టూర్ వస్తాడేమో అడగాలనుకున్నాను. రాణాకి గీతంటే యిష్టమట. వాసు వదిలేస్తే అతను చేసుకుంటాడట. ఇంక సమస్యేం వుంది? అదే వివరంగా చెప్పాలని వెళ్ళాను కానీ ఆ సెక్యూరిటీవెధవ గీతని పిలిచాడు. అదొచ్చి గొడవచేసింది” అంది.
సంతోష్ ఒక్కడేకాదు, లీలకూడా పిచ్చిదానిలా చూసింది ఆమెని. తనతో మాట్లాడిన చెత్తంతా రాణా ఆమెతోకూడా మాట్లాడివుంటాడని గ్రహించాడు సంతోష్.
“యాభయ్యేసేళ్ళొస్తున్నాయి ఒక్కొక్కరికీ. ఏం పిచ్చిమాటలు వీణా, ఇవి? ఇంకెక్కడేనా అన్నావంటే నిన్నూ నన్నూ బతకనివ్వరు. చదరంగంలోలా పావుల్ని అటూయిటూ బానే సర్దేసావుగానీ, రాణాగాడి భార్యనేం చేస్తావే?” అడిగింది, సంధ్య వుగ్రరూపాన్ని గుర్తుతెచ్చుకుని.
“పాతచీరలు అద్దెకిచ్చుకుంటుంది. పనిమనిషిలా వుంటుందట. రాణా దాన్నసలు ప్రేమించలేదట. మోసంచేసి చేసుకుందనీ దాని బతుకు దానిదనీ వదిలేసాడట. పెద్దతేడా ఏమీ వుండదు” అంది.
“దీనికి పిచ్చి లేదన్న డాక్టరుకే పిచ్చి వుందేమో! ఆయన్నే మంచిడాక్టరుకి చూపించుకొమ్మను” అంది లీల కొడుకుతో.
“పిచ్చేదైనా వుంటే అది మీకు. గీతావాళ్ళూ మననేమీ చెయ్యరు, చెయ్యలేరు. చెయ్యగలిగితే ఈపాటికి చేసేవారే. ఆ ఫోటోల విషయంలో ఏం చెయ్యగలిగారు? పూనా వెళ్తామన్నదికూడ బెదిరింపే. వాడొస్తే పోలీసులకి పట్టిస్తాను. నాకే వాసు భయపడాలి. అపార్టుమెంటులోకి వెళ్లగలిగితే మంచి సీన్ క్రియెట్ చేసి వచ్చేదాన్ని. చట్టాలన్నీ ఆడవాళ్లవైపే వున్నాయి. అందుకే గీతవెనక దాక్కుంటున్నాడు” అంది.
“జరిగింది చాలు వీణా! ఇలా చెంపదెబ్బలూ చెప్పుదెబ్బలూ తింటూ బతుకుతావా? నీకేం ఖర్మే? సంధ్యత్త చెంపదెబ్బలు కొట్టి అక్కడితో ఆగింది. గీత ఇంకా మొండిది. పెద్దదాన్నన్ని నా పరువూ వుంచలేదు. పరాయివాడని మామయ్య పరువూ వుంచలేదు. నానా మాటలూ అంది. బెంగుళూరునించీ మనని వెళ్లగొట్టడంలోనూ దాని చెయ్యే వుండి వుంటుంది” అంది లీల.
వాదనల్తోనూ నచ్చజెప్పడాలతోనూ రోజంతా గడిచింది.
మర్నాడు వాసు స్కూల్‍ఫ్రెండ్సొచ్చి అతన్ని వెంటబెట్టుకుని వెళ్ళారు. అదో బేచి. మొదట్లో పదిమందిదాకా వుండేవారు. చాలా క్లోజుగా తిరిగేవారు. సుధీర్ యూయస్‍లో వున్నట్టే, మిగతావాళ్ళలో కొందరు ఉద్యోగాలమీద ఎక్కడెక్కడికో వెళ్ళిపోగా, ఇప్పుడు ఇక్కడున్నది నలుగురు. పెద్దగా ఫోన్లు చేసుకోవడం, నువ్వెలా వున్నావంటే నువ్వెలా వున్నావని నిరంతరం పలకరించుకోవడం వుండదు. ఏడాదికో ఆర్నెల్లకో ఒకసారి ఎవరికో గుర్తొస్తుంది. మరొకరి యింటికి వెళ్తారు. ఇద్దరు కలుసుకోగానే మిగతా యిద్దర్నీ యిళ్ళలోంచీ ఎత్తుకొచ్చేస్తారు. రివర్‍సైడో, చుట్టుపక్కల హోటల్లోనో కూర్చుని రెండుమూడుగంటలు మాట్లాడుకుంటారు. వాసు యింటికి వెళ్తే అతను అక్కడ వుండట్లేదని తెలిసింది. ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకుని వచ్చారు.
గీత భయపడుతుంటే,
“కొత్తగా యిదేంటి వదినమ్మా? నువ్వు గీతవేనా? మమ్మల్నందర్నీ దబాయించేదానివి? బ్లాక్‍మేజిక్ నేర్చుకున్నావా? ఈమధ్యకాలంలో వాసుని పిల్లిని చేసావా ఏంటి? మరేం భయంలేదు. నీ పిల్లిని మేం మళ్ళీ యింటిదగ్గర జాగ్రత్తగా వదిలిపెడతాం” అన్నాడు ఒకతను. మిగతావాళ్ళు నవ్వారు.
ఎవరికీ ఈమధ్య జరిగిన గొడవలు తెలీవు. వాసుకూడా తనింటి విషయాలు ఈ సర్కిల్లో పెద్దగా చెప్పడు. నవ్వులమధ్య-
“గీతా! వచ్చేసరికి లేటౌతుంది. నువ్వు తినేసి పడుక్కో. మేం బైట తింటాం” అనేసి వెళ్ళిపోయాడు వాసు.
“నిన్న కప్పనన్నాడు, ఈవేళ వీళ్ళొచ్చి పిల్లిని చేసారు. మళ్ళీ పులిలా ఎప్పుడౌతాడో!” దిగులుగా అనుకుంది గీత వాళ్ళు వెళ్ళాక.
యశోద ఫోన్‍చేసి, మరో రెండురోజులకి బయల్దేరుతున్నామని చెప్పింది.
“ఉండలేకపోతున్నాను గీతూ! మీ యిద్దర్నీ చూసేదాకా మనసు స్థిమితపడదు” అంది.
“వచ్చి మాదగ్గిరే వుండండి” అంది గీత.
“లక్ష్మి ఏమన్నా అనుకుంటుందేమోనే”
“కొత్తగా అదేమిటి? అప్పుడప్పుడు కలిసి వున్నవాళ్లమేకదా? అనుకోవడం దేనికి? మూడు బెడ్రూంలున్నాయి. ఆవిడా వచ్చి వుండచ్చు” అంది.
“చూద్దాంలే” అని వేరేవిషయాలు మాట్లాడి పెట్టేసింది.
ఇదివరకు ఇంట్లో మూడోమనిషిగా లక్ష్మి వుండేది. వాసు బైటికి వెళ్ళినా వంటరిగా అనిపించేదికాదు గీతకి. ఇప్పుడేంటో ఒక్కర్తికీ దిగులనిపించింది. భోజనం చేసి, కాస్త సందడిగా వుంటుందని టీవీ పెట్టుకుని, పుస్తకం చదువుతూ కూర్చుంది. ఈమధ్య మిగతావేటిమిదికీ మనసు పోవట్లేదామెకి. ఆలోచనలు స్థిరంగా వుండట్లేదు. పుస్తకం చదువుతున్నా నిమగ్నం కాలేకపోతోంది.
డిన్నరయాక పదిన్నరకి ఫ్రెండ్స్ నలుగురూ బయల్దేరారు. అవంతీపురం మలుపుదగ్గిర-
“ఏరా, ఇంటిదాకా రావాలా?” వేళాకోళంగా అడిగితే,
“వేషాలా?” అన్నాడు వాసు.
“వదినమ్మకి చెప్పాంకదా? లేకుంటే పంపేది కాదు”
“జాగ్రత్తగా ఇల్లు చేరామని గీతకి మీరే చెప్పుకోండి” అని నవ్వుతూ చెయ్యూపి కదిలిపోయాడు వాసు.
మలుపుదాటాక మునిసిపల్ గ్రౌండు, తర్వాత పదిదాకా రోడ్డుకి అటూయిటూ పెద్దపెద్ద ఇండిపెండెంట్ యిళ్ళు. పిల్లలు దగ్గరలేని సీనియర్ సిటిజెన్స్ వుంటారు వాటిల్లో. ఏడు దాటితే గేట్లకి తాళాలు వేసేస్తారు. అవి దాటాక ఎప్పట్నుంచో ఖాళీగా వున్న స్థలం. ఒక స్ట్రీట్‍లైట్ చాలాకాలంగా వెలగట్లేదు. రోడ్డంతా ఒక్కమనిషికూడా వుండరు. దాన్ని దాటితే వాసు పాతయింటి మలుపు. చిన్నప్పట్నుంచీ తిరిగిన పరిసరాలు. ఎప్పుడూ అతను భయపడ్డదిగానీ, అవి అతన్ని భయపెట్టిందిగానీ లేదు. అందుకే ఎలాంటి ఆలోచనా లేకుండా ముందుకెళ్ళిపోయాడు. సగం వెళ్ళాక దార్లో రెండు బైకులు అడ్డుపెట్టి, అతను దిగగానే ముగ్గురుమనుషులు చుట్టుముట్టి కొట్టడం మొదలుపెట్టారు. అటాక్ మరీ బ్రూటల్‍గా లేకపోయినా ముగ్గురినీ ఒక్కడు ఆపలేకపోతున్నాడు. శక్తి చాలట్లేదు.
వాసు ఫ్రెండ్స్‌లో ఒకతనికి గీత చూపించిన భయం అసహజంగా అనిపించి, ఎందుకేనా మంచిదని వెనక్కి తిరిగొచ్చాడు. అతను దామోదర్. బైక్ హెడ్‍లైట్ చూసి, వాళ్ళు పారిపోయారు.
“మైగాడ్! వాసూ! ఏమిట్రా, ఇది? ఎవరు వాళ్ళు? నీకేం గొడవలున్నాయి? లేకపోతే దొంగలా?” వాసుని పట్టుకుని తడుముతూ కంగారుగా అడిగాడు. అతన్ని చూసాక వాసుకి ధైర్యం వచ్చింది.
“తెలీదు. సీనియర్ ఎన్టీఆర్ బేచిలావుంది, ఇంకా కత్తులూ అవీ తియ్యలేదు. శివా బేచైతే ఈరోజు నాపనైపోయేది” అలసటతో రొప్పుతూ అన్నాడు.
“దెబ్బలు తగిలాయా?”
“తగలక? ఇక్కడుండద్దు. పద. వెళ్లిపోదాం. పోలీస్‍స్టేషనుకి వస్తావా? కంప్లెయింటిచ్చి వెళ్ళిపోదాం”
స్టేషన్లో కంప్లెయింటు యిచ్చారు. సైటు చూడటానికి పొద్దున్న వస్తానన్నాడు ఇన్స్పెక్టరు. ఇద్దర్నీ ఆ టైముకి రమ్మన్నాడు. కాన్స్టేబుల్ ఎస్కార్టు రాగా ఇద్దరూ వాసు ఫ్లాట్‍కి వచ్చారు. గీతకి చాలా అలజడిగా వుంది. కలవరపడుతోంది. అన్నవేళకి రాకుండా, లేటైతే మెసేజిపెట్టకుండా ఎప్పుడూ చెయ్యలేదతను.
“ఏం జరిగింది?” అతని ఆకారం చూసి నిలువునా వొణికింది.
“చిన్న యాక్సిడెంటైంది గీతూ! పెద్దగా దెబ్బలేం తగల్లేదు” అన్నాడు. ఆమెని దాటుకుని లోపలికి వెళ్తూ. అతని వెనక దామోదర్ రెండుచేతులూ ఎత్తి దణ్ణం పెట్టి క్షమించమన్నట్టు చెంపలువేసుకుంటూ వెళ్ళాడు.
“యాక్సిడెంటైతే కన్నెందుకు వాస్తుంది? ముక్కులోచీ ఆ రక్తమేంటి? ఏం జరిగింది?” గట్టిగా అడిగింది.
“నేను చెప్తాను వదినమ్మా! ముందు వాడిని నీళ్లవీ తాగి స్నానం చేసి నిమ్మళించనీ” అన్నాడు. వాసు లోపలికి వెళ్ళాడు. ఆమె వెనకే వెళ్ళి ఏర్పాట్లన్నీ చేసి వచ్చి కూర్చుంది. దామోదర్ జరిగింది చెప్పాడు.
“అన్న ఏవో గొడవల్లో వున్నాడని తెలుసు. పెద్దగా ఏం చెప్పడు. మేం వెళ్తుంటే నువ్వు కాస్త భయపడ్డట్టనిపించింది. ఎందుకేనా మంచిదని వెనక్కొచ్చాను. రావడం మంచిదైంది. క్షమించు వదినమ్మా, మళ్ళీ యింట్లో వదిలిపెడతానన్నాం, ఆ పని చెయ్యనందుకు” అన్నాడు బాధపడుతూ.
“నువ్వేం చేస్తావు దామోదర్? వెనక్కొచ్చి మంచిపని చేసినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి” అంది గీత. వాసు వచ్చాడు. నాలుగు బకెట్ల వేడినీళ్లతో స్నానం చేసేసరికి కాస్త తెరిపినపడ్డాడు. స్నానం చేసిన వంటిమీద దెబ్బలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వెళ్ళి వేడివేడి పాలు ఇద్దరికీ తెచ్చిచ్చింది.
“ఈవేళ ఇక్కడ వుండిపో దామోదర్. చాలా రాత్రైంది. అంతదూరం ఒక్కడివీ ఎలా వెళ్తావు? రేపు నాతో స్టేషన్‍కి వచ్చి అట్నుంచీ వెళ్దువు. సిస్టర్‍కి ఫోన్ చేసి చెప్పు” అన్నాడు.
“ఎవరు?” అడిగింది గీత.
“రాణా అయుండాలి. వాడిమీదే అనుమానం. వాడిని వీణ ఎగేసి వుంటుంది. శశిధర్ని ఇప్పుడే కదపడం మంచిదికాదు”
“ఇంకా మీ గొడవలు ఆగలేదా వాసూ? ఎప్పుడో కాలేజిరోజుల్లో ఒకసారి కొట్టుకున్నాం. ఈ వీణెవర్రా, మధ్యలో?” అడిగాడు దామోదర్.
“ఉందిలే, మా ప్రాణానికి. మాకున్న తొంబాతొట్టి చుట్టాల్లో అదొకర్తి” విసుక్కున్నాడు వాసు.
గీత దామోదర్‍కి పక్క ఏర్పాటుచేసింది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. వళ్ళంతా కదుములు కట్టి పక్కకుదరట్లేదు వాసుకి. జ్వరంకూడా మొదలైంది. అతనేమీ మేరునగధీరుడు కాదు. మామూలు మనిషి. భయం, దు:ఖం, అవమానం వణికిస్తున్నాయి. నొప్పులకి కళ్లలో నీళ్ళొచ్చేసాయి. అప్పటిదాకా చూపించిన బింకం సడలిపోయింది.
“హాస్పిటల్‍కి వెళ్దామా?” అడిగింది గీత.
రానన్నట్టు తల అడ్డంగా వూపాడు.
“జోని రమ్మంటాను” అంది.
“అతన్ని యిబ్బందిపెట్టడం దేనికి గీతా? పొద్దున్న వెళ్తాను డాక్టర్‍దగ్గిరకి”
“ఇబ్బంది పెట్టడమేం వుంటుంది? అతని వృత్తే అలాంటిది. బైటి పేషెంట్లు పిలిస్తే వెళ్ళడా? మొహమాటాలుండవా?” అంటూ జోకి చేసింది. ఆమె చెప్పింది విని, కంగారుపడుతూ బయల్దేరాడు. సుమతి లేదట. కొడుకు దగ్గిరకి వెళ్ళిందని చెప్పాడు. అతనొచ్చేసరికి వాసు, గీత ఒకరినొకరు పట్టుకుని చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. దామోదర్ లేచి వచ్చి వాళ్ళనెలా వోదార్చాలో తెలీక చూస్తున్నాడు.
“వదినమ్మా! ఏంటిది? మా హీరోనలా ఏడిపిస్తున్నావు? జ్వరం వస్తుంది. సుమతి భర్త వస్తున్నాడంటివి కదా?” అంటున్నాడు.
వాసుని చూసి తెల్లబోయాడు జో.
“నొప్పి బావా!” అన్నాడు వాసు.
నొప్పికాదు, అవమానం అని అర్థమైంది జోకి. ఇద్దర్నీ కోప్పడి, దామోదర్ని పరిచయం చేసుకుని, జరిగిందేమిటో అడుగుతునే వాసుని చూసి, తనతో తెచ్చిన టేబ్లెట్స్ వేసి, ఇంజక్షన్ యిచ్చాడు.
“ముగ్గుర్ని చీకట్లో కొట్టి వచ్చినవాడికి నొప్పేంటి వాసూ? బ్రేవో మాన్! నువ్వు, సుధీర్ ఒకటే నాకు. సుమతి ఎన్నోసార్లంది,
వాడు పలికే అన్నయ్య, వీడు దగ్గరొచ్చి కూర్చునే అన్నయ్య- అని.
ఒకసారి ఏదో చెయ్యలేకపోయామని వదిలేసినట్టు కాదు. కంప్లెయింటిచ్చావుకదా? అదవ్వనీ, నీకు తగ్గగానే అందరం కూర్చుని మాట్లాడతాం. రాణా, శశి, వీణ ఎవరైనా ఒకటే. వదిలిపెట్టేది లేదు. దేనికా దు:ఖం? చిన్నపిల్లాడివా? నువ్వలా బాధపడితే గీతకెలా వుంటుంది? నిద్రపో. రేపటికి తేలికపడతావు” అని అతన్ని ఓదార్చి ఇవతలికి వచ్చాడు.
అతని వెనకే వచ్చింది గీత.
“ఏం జరుగుతోందో తెలీడం లేదు. అందర్నీ వేళకాని వేళల్లో యిబ్బంది పెడుతున్నాం. ఎందుకు మామీద ఇంత కక్షనేది అర్థం కావట్లేదు. వదిలిపెట్టకుండా సాధిస్తున్నారు” అంది గీత కళ్లలో నీళ్ళు సుళ్ళుతిరుగుతుండగా.
“ఇబ్బందేమీ లేదు గీతా! సంతోషంగా వున్నప్పుడు కలిసి తిరిగి కష్టంవేళ వదిలిపెట్టేస్తామా? నాకు ఫోన్‍చేసి మంచిపని చేసావు. ప్రైవేటుహాస్పిటల్స్‌లో చూడరు. లీగల్ సమస్యలొస్తాయని భయపడతారు. మీ బాబాయికీ, వీణకీ గట్టి వార్నింగ్ ఇద్దాం. రాణానైతే వదిలిపెట్టేదే లేదు. శశి విషయం రవిగారికి వదిలేద్దాం. రేపు నేనూ స్టేషన్‍కి వెళ్తాను. నేనిస్తే మెడికల్ సర్టిఫికెట్ పనికొస్తుందో లేదో, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడతాను. కొన్నాళ్ళు మీరు మయూదగ్గిరకో, మాధవ్‍దగ్గరకో వెళ్ళి వుండండి. మీ పిల్లలకి అందరం కలిసి ఏదో ఒక ఏర్పాటు చేస్తాం. ఒక మంచిపని తలకెత్తున్నప్పుడు దాన్ని మధ్యలో ఆగనివ్వం. ఆరోజేనా తమ్ముడి కూతురి ప్యూబర్టీ ఫంక్షను. చాలా ఇన్నర్ సర్కిల్లో చేసుకున్నాం. అందుకే ఎవర్నీ పిలవలేదు. లేకపోతే మాతో మీరూ వచ్చేవారు. అరెస్టవ్వకుండా అడ్డుపడి ఆపేన్ని పరిచయాలు మేం పెంచుకోలేదుగానీ, బైటికిమాత్రం తీసుకురాగలిగేవాళ్ళం” అన్నాడు.
గీత కళ్ళు తుడుచుకుంది.
“ధైర్యంగా వుండాలి. గీతంటే అంతేకదా?” అన్నాడతను నవ్వి, చిన్నగా ఆమె తలమీద తట్టి.
వాసుని మరోసారి చూసి, వెళ్ళి పొద్దున్నే స్టేషన్‍కి వస్తానని లేచాడు. దామోదర్‍కూడా అతనితో బయల్దేరాడు.
“మందులుపడ్డాయికద వదినమ్మా, మరేం భయంలేదు. నువ్వుకూడా మంచిగా నిద్రపో. రేపుపొద్దున్నే వస్తాను. అన్నని తీసుకెళ్తాను” అన్నాడు.
మర్నాడు పొద్దున్న ఏడింటికి స్నేహితులిద్దరూ పోలీస్‍స్టేషనుకి వెళ్ళారు. వాకింగ్‍కి రాలేదేమని అడగటానికి రామస్వామి వచ్చాడు. గీత జరిగింది చెప్పింది. ఆయన నిశ్చేష్ఠుడయ్యాడు. తను అంటునే వున్నాడు, జాగ్రత్తగా వుండమని. ఇంతలోనే జరిగిపోయింది. వాసు ఏ స్టేషనుకి వెళ్ళాడో అడిగి, తనూ వెళ్ళాడు.
అతను తిరిగొచ్చేసరికి బాగానే వేళైంది. జోనీ, దామోదర్ని అట్నుంచటే పంపించి రామస్వామితో తిరిగొచ్చాడు. జ్వరంతోటీ, దెబ్బలవాపులతోటీ మనిషి వుబ్బిపోయి వున్నాడు.
“తినికూర్చుని తిన్నదరక్క గొడవలు పెట్టుకుంటున్నట్టుంది. ఊరికే కవ్విస్తున్నారు. మీరేం భాగార్లు కాదు. తల్లివైపు చుట్టరికాలు. మరి దేనికీ గొడవలు? మీరింక యిక్కడ వుండకండి. కొన్నాళ్ళు మీతమ్ముడింటికి వెళ్లండి. మీ లీవులు నేను మేనేజి చేస్తాను. పరిస్థితి చెప్తే ఏ ఆఫీసరేనా లీవు యివ్వక మానడు” అన్నాడు రామస్వామి. మంజులకూడా వచ్చి చూసి, ధైర్యం చెప్పింది. ఆ వయసులోకూడా ముగ్గుర్ని కొట్టి రాగలిగిన వాసుని చూస్తే ఆయనకి ఆశ్చర్యం వేసింది. వయసులో వున్నప్పుడు ఇంకెంత పొగరుగా వుండేవాడోననిపించింది. వాసు లీవ్ అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అదేమాట రాజేష్‍తో అంటే, అతను నవ్వుతూ-
“పొగరుమోత్తనం ఏమీలేదు. ఎవరిమాటా వినడు. యూ బ్రెయిన్. యురేనియమ్, రేడియేషన్ని వదిలిపెడుతుందిగానీ వెనక్కి తీసుకోదు. అలా అతనికి తోచిందేతప్ప బైటినుంచీ వచ్చే ఏమాటా తలకెక్కదు. భార్యాభర్తలిద్దరూ చుక్కలు చూపిస్తారు స్టాఫ్‍కి. నీకు అడ్డేముంది? వాళ్ళ ఆఫీసుక్కూడా వెళ్ళు. గీతగారిగురించి చెప్తారు” అన్నాడు.
వాసు సర్కిల్స్‌లో అందరికీ వార్త అందిపోయింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు.
“మీరింక అక్కడ వుండద్దు. సామాన్లన్నీ పేక్ చేసుకుని సిద్ధంగా వుండండి. నేనొచ్చి తీసుకెళ్తాను. కొన్నాళ్ళు ఇక్కడున్నాక అప్పుడు ఆలోచిద్దురుగాని” కచ్చితంగా చెప్పేసాడు మాధవ్.
రాణాని అదేరోజు అరెస్టుచేసారు. చూసుకోవడానికి శశిధర్ వున్నాడన్న ధీమాతో చేయించాడతను. వాసు తిరిగే ప్రదేశాలేంటో, ఎక్కడైతే ఒక్కడూ దొరుకుతాడో అవన్నీ అతనికి బాగా తెలుసు. వారంరోజులపాటు అతని కదలికలు తెలుసుకోవడానికి రెక్కీకూడా చేయించాడు. తక్షణకోపానికి కారణం అసూయ. వాసు, గీత పిల్లలతో షాపింగ్‍కి వచ్చినప్పుడు చూసాడు. మనసు భగ్గుమంది. గీతకోసం తామిద్దరూ కొట్టుకున్నారు. అది తనని వదిలేసి వాసుని రాజుని చేసింది. అదే ఆలోచన. అదే భావన. కాలంతోపాటు పెరిగింది. ఎలాంటి వికాసం లేని అతని బుద్ధిలా అదీ అలాగే గడ్డకట్టుకుని వుండిపోయింది. అతనికి డబ్బు కావాలి. విచ్చలవిడిగా ఖర్చుచేసుకోవడానికి సరిపడేంత కావాలి. వాసుని చంపేస్తానని బెదిరిస్తే గీత యిస్తుందనుకున్నాడు. అతని చేతిలో అప్పుడూ యిప్పుడూ శశిధర్ పడేసిందీ యముని పీడించి తీసుకున్నదీ డబ్బుంది. చెయ్యి దురదపెట్టేసింది.
అతను అరెస్టవగానే శశిధర్‍కి తన స్టేటస్ గుర్తొచ్చింది. ముఖం తిప్పేసుకున్నాడు.
వాసుమీద అటాక్‍ జరిగిందని తెలిసినప్పుడు వీణ మొహంలో కంగారునీ, రాణా అరెస్టయాక రిలీఫ్‍నీ చూసాడు సంతోష్. మనసులో ఏదో అనుమానం కదిలింది. ఆమె నిద్రమాత్రలు వేసుకుని మొద్దునిద్రలో వున్నవేళ ఫోన్ తీసుకుని చూసాడు. అన్నాచెల్లెళ్ళిద్దరికీ దాపరికాలు లేవు. ఎప్పుడూ అతను ఆమె ఫోన్ తీసుకుని చెక్‍చెయ్యడుగాబట్టి ఆమె జాగ్రత్తలు తీసుకోలేదు. వీణ పాస్‍వర్డులు దాదాపు అన్నీ సంతోష్‍కి తెలుసు. దేన్నీ మార్చలేదామె. బేంకుకి కొత్త పాస్‍వర్డు పెట్టాల్సొస్తే అతన్నే అడుగుతుంది ఏం పెట్టాలని. కొంచెంకూడా బుర్ర వాడదు. మెసేజిలూ, ఆమె అకౌంటులోంచీ బైటికి పోయిన డబ్బూ చూసి తెల్లబోయాడు. వాసు వివరాలు ఎవరికో పంపిన మెసేజి చూసి తలతిరిగిపోయింది.
వీణ ఈ దార్లో వెళ్తోందేంటి? ఎవరికిచ్చింది వాసు వివరాలు? ఎందుకిచ్చింది? అతన్ని కొట్టించడం వెనక దీని చెయ్యుందా? అతనికి వళ్ళు జలదరించింది. ఇదంతా దేనికి దారితీస్తుంది? ఫోన్ తీసుకుని తనగదిలోకి వచ్చాడు. అకౌంటు ఫ్రీజ్ చేసి సిమ్ మార్చేసి, ఫోన్ ఫాక్టరీ సెట్టింగ్స్‌కి తెచ్చి మళ్ళీ వీణ గదిలో పెట్టాడు. పోలీసులు గుమ్మందాకా వస్తే సిమ్ మార్చడం, డాటా డిలీట్ చెయ్యడం పెద్దనేరాలౌతాయి. వీణని గీత యిరికించదని అతనికో నమ్మకం. తండ్రి రాసిన విల్లు చింపేసాడు. అది రిజిస్టర్డ్ విల్ కాదు. ఇల్లు తనపేరుమీదకి మార్చమని దెబ్బలాడిందట వీణ. ఆమె డ్రైవింగ్ లైసెన్సు, బేంకు కార్డు, ఐడీకార్డు అన్నీ తీసుకొచ్చేసాడు. ఇప్పడామె ఒక తెల్లకాగితం.
మర్నాడు అన్నాచెల్లెళ్ళిద్దరికీ చాలా పెద్దగొడవైంది.
“నా ఫోనెందుకు తీసావు? నా సిమ్ ఏం చేసావు? నాది నాకు యివ్వు” అని యుద్ధం చేసి, అతనిమీదకి ఏవేవో విసిరేసింది. గ్లాసు విసిరితే అతను దాన్ని గాల్లోనే వెనక్కి తిప్పికొట్టాడు. ఆమెకే నుదుటికి కొట్టుకుని విలవిల్లాడింది.
“చూడు, ఇంతకాలం ఓపికపట్టానంటే చేతకాక కాదు. నీ జీవితం దార్లో పెట్టాలని. ఒకసారి ఆ అవకాశాన్ని వదులుకున్నావు. ఇప్పుడుకూడా చెడగొట్టుకుంటే నీకూ నాకూ రా‍మ్‍రామ్. నామొహం చూసి గీత ఆగింది. లేకపోతే జైల్లో కూర్చుని చిప్పకూడు తినేదానివి. వాసు వివరాలు ఎవరికిచ్చావు? డబ్బెవరికి పంపించావు? వీణా! ఎక్కడ నేర్చుకుంటున్నావు యివన్నీ? ఎందుకు చేస్తున్నావు? వాసుని కొట్టించమని రాణాకి డబ్బిచ్చావా? ఆ ఆవారావెధవకి రౌడీలని పెట్టి కొట్టించేంత డబ్బెక్కడిది? నాకు మొత్తం తెలియాలి” అన్నాడు కరుగ్గా.
ఇక తప్పదన్నట్టు ఒకొక్క విషయం చెప్పింది వీణ. లీల నిర్ఘాంతపోయింది.
“నువ్వెలా బతకాలనుకుంటున్నావో ఇంక నీయిష్టం వీణా! బావని కొట్టించే ప్రయత్నం చేసావంటే నీమీద నాకు ఎలాంటి జాలీకలగట్లేదు. నీ డబ్బుగానీ, ఈ యిల్లుగానీ ఎక్కడికీ పోవు. నీకిప్పుడు ఇంకా ముప్పయ్యైదేళ్ళు. ఇంకా యాభయ్యేళ్ళో అరవయ్యేళ్ళో బతుకుతావు. దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటావో నీకే వదిలేసాను. నాకు నచ్చినట్టుంటేనే నీకు మద్దతిస్తాను. ఇలా బతకాలనుకుంటేమాత్రం వాళ్ళుకాదు, నాదగ్గిరున్న ఆధారాలతో నేనే నిన్ను పోలీసులకి పట్టిస్తాను. ఆలోచించుకుని చెప్పు. నీ ట్రిప్పుకి ప్లాన్ చేస్తాను. తర్వాత ఉద్యోగం వెతుక్కుంటావో, ఫ్రీలాన్సర్‍గా వుంటావో నీయిష్టం. డిజిటల్ వరల్డ్‌లో చాలా అవకాశాలున్నాయి. వ్లాగింగ్, అఫీలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ ఏది చేసినా నీ చాయిస్. నువ్వు వెయ్యి సంపాదిస్తే నేను మరో వెయ్యి నీ ఫండ్స్‌లోంచీ రిలీజ్ చేస్తాను” అతని గొంతులోని కాఠిన్యం చూసి వీణ కాస్త అదుపులోకి వచ్చింది. మూడురోజులు చెప్పిందే చెప్పాడతను.
“నా సిమ్ ఇచ్చెయ్యరా” బతిమాలింది.
“ఇవ్వను” కచ్చితంగా చెప్పాడు.
“ఇంట్లోంచీ వెళ్ళిపోతాను” బెదిరించింది.
“సంతోషంగా” అన్నాడు.
“చచ్చిపోతాను”
“అమ్మమ్మ ఎప్పుడో చెప్పింది ఆపని చెయ్యమని”
అవేవీ చెయ్యలేదామె. ఆఖరికి అతని దార్లోకి వచ్చింది.


యశోద, రామారావు వచ్చారు. వాసుని చూసి యశోద అల్లల్లాడిపోయింది. అతన్ని పట్టుకుని ఏడ్చింది. లక్ష్మితో అతని విబేధాలు సర్దుకున్నాయని తెలిసి తేలిగ్గా నిశ్వసించింది. రామారావు చాలా దిగులుపడ్డాడు. తన కీడుకోరేవాళ్ళు తనింట్లోనే వున్నారంటే నమ్మలేకపోయాడు.
లీలనీ, శేఖర్నీ పిలిపించి మాట్లాడదామని అనుకున్నారు మొదట. గీత వద్దంది.
“మనం వాళ్ళ ఆలోచనలని గుర్తించినట్టౌతుంది. అర్థం కానట్టు వదిలేస్తేనే మంచిది” అంది.
వారంపైనే పట్టింది వాసుకి దెబ్బల్లోంచీ కోలుకోవడానికి. పగలూ రాత్రీ అదే జ్ఞాపకం అతన్ని తినేస్తోంది. తనకేదైనా జరిగి వుంటే గీత తట్టుకోగలిగేదా అనుకుని వులిక్కిపడుతున్నాడు. మనిషిలో వుత్సాహం బాగా తగ్గింది. గీత అతన్ని నీడలా వదలకుండా తిరుగుతోంది. ఆమెకి మరీ అతుక్కుపోయాడు. కళ్ళముందునించీ వెళ్లనివ్వట్లేదు.
ఆ తర్వాత మార్పులన్నీ చకచక జరిగిపోయాయి. మాధవ్ వుండే సొసైటీలోనే మరో ఫ్లాట్ పదకొండునెలల రెంటల్ అగ్రిమెంటుకి తీసుకున్నారు. పిల్లలని ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళని జాగ్రత్తగా అప్పజెప్పి, వాళ్ళ చదువుకయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పాడు వాసు. మయూ ఫ్రెండ్స్ ముందుకొచ్చి, చదువు చూసుకుంటామన్నారు. ఫామ్‍హౌసుని మేరేజిహాల్‍గా మార్చాలన్న మయూ ప్రతిపాదనతో పిల్లలిద్దరి పేరుమీదికీ దాన్ని మార్చాడు. అవన్నీ అతనివల్ల కావు.