ఝరి 212 by S Sridevi


యశోద, రామారావు వచ్చారు. వాసుని చూసి యశోద అల్లల్లాడిపోయింది. అతన్ని పట్టుకుని ఏడ్చింది. లక్ష్మితో అతని విబేధాలు సర్దుకున్నాయని తెలిసి తేలిగ్గా నిశ్వసించింది. రామారావు చాలా దిగులుపడ్డాడు. తన కీడుకోరేవాళ్ళు తనింట్లోనే వున్నారంటే నమ్మలేకపోయాడు.
లీలనీ, శేఖర్నీ పిలిపించి మాట్లాడదామని అనుకున్నారు మొదట. గీత వద్దంది.
“మనం వాళ్ళ ఆలోచనలని గుర్తించినట్టౌతుంది. అర్థం కానట్టు వదిలేస్తేనే మంచిది” అంది.
వారంపైనే పట్టింది వాసుకి దెబ్బల్లోంచీ కోలుకోవడానికి. పగలూ రాత్రీ అదే జ్ఞాపకం అతన్ని తినేస్తోంది. తనకేదైనా జరిగి వుంటే గీత తట్టుకోగలిగేదా అనుకుని వులిక్కిపడుతున్నాడు. మనిషిలో వుత్సాహం బాగా తగ్గింది. గీత అతన్ని నీడలా వదలకుండా తిరుగుతోంది. ఆమెకి మరీ అతుక్కుపోయాడు. కళ్ళముందునించీ వెళ్లనివ్వట్లేదు.
ఆ తర్వాత మార్పులన్నీ చకచక జరిగిపోయాయి. మాధవ్ వుండే సొసైటీలోనే మరో ఫ్లాట్ పదకొండునెలల రెంటల్ అగ్రిమెంటుకి తీసుకున్నారు. పిల్లలని ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళని జాగ్రత్తగా అప్పజెప్పి, వాళ్ళ చదువుకయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పాడు వాసు. మయూ ఫ్రెండ్స్ ముందుకొచ్చి, చదువు చూసుకుంటామన్నారు. ఫామ్‍హౌసుని మేరేజి వెన్యూగా మార్చాలన్న మయూ ప్రతిపాదనతో పిల్లలిద్దరి పేరుమీదికీ దాన్ని మార్చాడు. అవన్నీ అతనివల్ల కావు. మరొకటి విహీ పేరుమీద వున్న సోప్‍నట్ ప్లాంటేషను. ఒక కాస్మటిక్ కంపెనీవాళ్లతో అగ్రిమెంటు చేసుకోవాలి. మయూ చూసుకుంటానన్నాడు. విహీ సంపాదనకూడా మొదలైనట్టే.


అతికొద్ది సామాన్లతో ముంబై చేరారు వాసు, గీత. మాధవ్ వెళ్ళి వెంటబెట్టుకుని వచ్చాడు. ఆరు కార్టన్ల సామాన్లు మూవర్స్‌కి ఇచ్చారు. బక్కబడిపోయి, అలసటగా, అనారోగ్యంగా కనిపిస్తున్న వాసుని చూస్తుంటే లక్ష్మికి కన్నీరు ఆగలేదు. రాగానే పలకరిద్దామని ఆతృతగా దగ్గిరకి వెళ్తే తప్పుకుని పక్కకి వెళ్ళిపోయాడు. ఒకసారికాదు, రెండుమూడుసార్లు అలానే చేసాడు. అతనికి తల్లిమీద కోపం ఇంకా తగ్గలేదు. మాధవ్ యింట్లో రెండురోజులుండి రెంటల్ అగ్రిమెంటు సంతకం చేసారు. ఫర్నిష్‍డ్ ఫ్లాట్. మంచాలూ, ఏసీలూ, డైనింగ్ టేబులు, సోఫాసెట్టు వున్నాయి. అన్నీ క్లీనింగ్ చేయించి పెట్టింది నీలిమ. మూవర్స్‌కి ఇచ్చినవికూడా వచ్చేసాయి. ఈ మార్పులన్నీ వాసుకి చాలా అసహనాన్ని కలిగిస్తున్నాయి. అక్కడ నెగ్గలేక పారిపోయి వచ్చాడు, తనని తీసుకొచ్చి యిక్కడ దాచాడు తమ్ముడని కోపం.
“ఇక్కడే వుంటాడుకదమ్మా! మారతాడు. జో చెప్పాడు, దెబ్బలు బాగా తగిలాయట. ముగ్గురు మనుషులు మీదపడి కొడితే తగలవా? వాడుగాబట్టి ఇంత తొందరగా కోలుకుని లేచి తిరుగుతున్నాడు. ఇంకెవరేనా ఐతే ఆర్నెల్లు మంచంపట్టేసేవారు” లక్ష్మి బాధపడుతుంటే ఓదార్చాడు మాధవ్.
“గీతకూడా మాట్లాడలేదు. తింగరిమాటో దెబ్బలాటో ఏదో ఒకటి చెయ్యాలిగా? ఇంత జరుగుతుందని అనుకున్నానా నేను? సంధ్యని దులిపాను. అదిమాత్రం ఏం చేస్తుంది? అడ్డాలనాడు బిడ్డలుగానీ, గెడ్డాలనాడు కాదు. ఆ వెధవ ఎవరిమాటా వినడు. నాబుద్ధి గడ్డితినిపోయింది. చేజేతులారా వీడిని అప్పజెప్పాను” అని ఏడ్చింది.
“అమ్మా! జరిగినవేవో జరిగాయి, ఎవరం కావాలని ఏమీ చెయ్యలేదుగానీ, ఇప్పుడు వాళ్ళని టెన్షనుపెట్టకు. మామూలుగా వుండు. వాళ్ళే మాట్లాడతారు” నచ్చజెప్పాడు.
మంచిరోజు చూసుకుని పాలుపొంగించుకుని కొత్తింట్లో దిగారు వాసు, గీత. ఇంకో నాలుగురోజులు తమింట్లోనే వుండమని మాధవ్ అన్నా యిద్దరూ వినలేదు. పాలు పొంగించగానే సొసైటీ చూసి, ఏవో కొనుక్కొస్తానని బయల్దేరాడు వాసు. తనూ వస్తానన్నాడు మాధవ్.
“దేనికిరా? దగ్గిరేగా? నేను వెళ్ళొచ్చేస్తాను. ఆ కార్టన్సేవో చూడు” అని వెళ్ళిపోయాడు వాసు.
“మీవేవీ తెచ్చుకోలేదా? పెయింటిగ్స్ చాలా వుండాలి. అవన్నీ ఏం చేశారు?” కార్టన్స్ తెరుస్తుంటే అందులో సామాన్లు చూసి ఆశ్చర్యంగా అడిగింది నీలిమ.
“మళ్ళీ వెళ్ళిపోతాంకదా, నీలిమా? పెయింటింగ్సన్నీ అవంతీపురం కోట గేలరీలో పెట్టాను. పియానో అమ్మదగ్గిరుంది. ఇంకేం వున్నాయి మాకు?” మామూలుగా అంది గీత.
“రెండుభుజాలూ పట్టుకుని ఆవిడ్నోసారి కుదపవే, నీలూ” అన్నాడు మాధవ్.
“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగిందామె.
“డబ్బులేవైనా రాల్తాయేమోనని. రెండు పెయింటింగ్స్ అక్కడికక్కడే కొనేసుకున్నారు” అన్నాడు పకపక నవ్వి.
“వదినా! బాధపడద్దు. పుట్టినప్పట్నుంచీ ఆ యింటికీ, యీ యింటికీ అతుక్కుపోయారు. ఎక్కడికీ వెళ్ళలేదు ఇద్దరూను. ఈ ఏడాదీ మార్పుగా గడపండి. అన్నీ చూడండి. నచ్చినవాళ్ళని పిలిపించుకోండి. సరదాగా వుండండి. ఒకరినొకరు చూసి ఏడవటం కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కాదు. జరిగిన సంఘటన మర్చిపొండి” అన్నాడు.
“చాలా అవమానంగా ఫీలౌతున్నాడు మాధవ్! ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆవంలో పేలాపగింజలా చిటపట్లాడిపోతున్నాడు. కుమ్ములో వంకాయలా వుడికిపోతున్నాడు. ఆ కోపం తగ్గించడం నావల్ల కావట్లేదు. అందర్నీ చితక్కొట్టేస్తానంటాడు. ఇక్కడికి రావడం మంచిదే అయింది. అక్కడుండి ఎవరితో ఎంతని దెబ్బలాడతాం?” అంది గీత.
“తోక కాలిన పిల్లిని మర్చిపోయావు” నవ్వుతూ మూడో వుపమానం గుర్తుచేసాడు మాధవ్ ఎప్పుడో సుధీర్ని అన్నది గుర్తుతెచ్చుకుని. తనూ నవ్వింది గీత.
“మిమ్మల్ని కదపడం మయూదగ్గిరకా ఇక్కడికా అనే చర్చ వచ్చింది. వాడేం చెయ్యగలుగుతాడు? చిన్నవాడు. మిమ్మల్నిలా చూసి బెంబేలెత్తుతాడు. ఇక్కడైతే నేనుంటాను. అందుకే యిటు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం గడవనీ. ఏ మార్పులొస్తాయో చూద్దాం. శశిధర్ అండచూసుకుని రాణా రెచ్చిపోయాడు. శశి వాడిని బాగా వాడుకున్నాడు. చెత్తపనులన్నీ చేయించుకుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఆ యిద్దరూ విడిపోయారంటే మనం అంత భయపడక్కర్లేదు. ఫామ్‍హౌసు విషయం తెలీనట్టు వుండిపొండి. తేలుకుట్టిన దొంగలా అతనూ మాట్లాడడు. కాదంటే సమీర విషయం ఎత్తినట్టు ఎత్తి అతనికి వార్నింగిద్దాం రవి మామయ్య వచ్చాక” అన్నాడు.
“ఎవ్వరినీ కదిలించకండి మాధవ్! రాణాకి శిక్షపడుతుంది. శశిని అలానే వదిలేస్తే మంచిది. ఎవరేం చేసినా రాణాతో గొడవలున్నాయికాబట్టి వాడిమీదికే నెట్టడం మాకు మంచిది. వాళ్ళూవాళ్ళూ చూసుకుంటారు. వీణని ఒక్కసారి ఆ కంఫర్ట్‌జోన్లోంచీ ఇవతలికి తీసుకురాగలిగితే బాబాయ్‍ని ఏదేనా ఆశ్రమంలో చేర్చి, అమ్మాకూతుళ్ళ విషయం తను చూసుకుంటానన్నాడు సంతోష్. వాసు వివరాలవీ ఎవరికో పంపించిందట అది.
జాగ్రత్తగా వుండండక్కా- అని బెంబేలెత్తిపోయాడు” అంది.
“ఎవరికి పంపించింది వదినా?” ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్. గీత సంతోష్ తనకి చెప్పిన వివరాలు చెప్పింది.
అతను తెల్లబోయాడు. ఒక ఆడపిల్ల అంతకి తెగిస్తుందని వూహించలేకపోయాడు. అతనిలాగే వుంది నీలిమ పరిస్థితికూడా.
“వాళ్ళు దీన్ని డబ్బులకోసం బ్లాక్‍మెయిల్ చేసేసరికి వాసు వివరాలిచ్చి కూర్చుందట. ఏం జరిగిందో కనిపెట్టడానికి మాయింటికి వచ్చింది. నేను తిట్టి పంపించాను. నాకింక చెప్పలేదు. సంతోష్ ఆ కంపెనీని వెతుక్కుంటూ వెళ్తే బోర్డుతిప్పేసి వుందట. కంపెనీపెట్టినవాళ్ళు పరారీలో వున్నారు మాధవ్! ప్రాజెక్ట్స్ చేసిస్తామని అడ్వాన్సు తీసుకుని ఇవ్వలేదని క్లయంట్సు, జీతాలివ్వలేదని వుద్యోగులు పోలీసుకేసు పెట్టారట. బ్లాక్‍మెయిల్ చేసేవాళ్ళైతే నేరుగా అటాక్‍చెయ్యరు. డబ్బివ్వమని ఫోన్లు చేసాక ఇవ్వకపోతే అప్పుడింక భౌతికదాడి చేస్తారు. వాసుకి అలాంటి ఫోన్లేం రాలేదు” వివరించింది గీత.
“వీణ ఇలా తయారైందేమిటి వదినా? నేనసలు నమ్మలేకపోతున్నాను” అన్నాడు మాధవ్.
“తయారుచేసారు” క్లుప్తంగా అంది గీత. తర్వాత సంతోష్ చేసిందికూడా చెప్పింది.
“ఇప్పుడు దానిదగ్గిర డబ్బుగానీ, ఐడీకార్డులుగానీ ఏవీ లేవు. కోరలు తీసిన పాములా పడుందట. వాడు చెప్పినట్టల్లా చేస్తోందట.
అమ్మమ్మ మోటుగా చెప్పింది, నేను సున్నితంగా చెప్పానక్కా! అవే మాటలు. బాధనిపించిందిగానీ, తప్పలేదు. ఒక ట్రాక్‍లోకి రాకపోతే ముందుముందు ఎలా? ఎన్నేళ్ళు గడిస్తే ముసలిదౌతుంది? జీవితం ముగింపుకొస్తుంది- అన్నాడు.
వాడి పెళ్ళి ఏమౌతుందో తెలీడం లేదు. అక్కా అక్కా అని అల్లుకుపోతాడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. అలా తెచ్చిపెట్టుకున్నారు. లేకపోతే భార్యాభర్తలిద్దరినీ నా దగ్గిర పెట్టుకుని అందర్నీ పిలిచి చిన్న వేడుకలా చేసి మన కుటుంబంలో కలిపేదాన్ని” అంది గీత.
బైటికి వెళ్ళినవాడు, వాసు ఎంతసేపటికీ రాకపోయేసరికి మాధవ్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒకచోట బెంచీమీద కూర్చుని కనిపించాడు.
“ఇక్కడ కూర్చున్నావేరా?” అడిగాడు మాధవ్ అర్థంకాక.
“కాళ్ళులాగుతున్నాయని కూర్చున్నాను. కూర్చో. వెళ్దాంలే” అన్నాడు వాసు అలసటగా. మాధవ్‍కి మనసు మెలిపెట్టినట్టైంది. అతని పక్కని కూర్చుని, చేతిలోని బేగ్ తీసుకునాడు.
“తిరక్కురా! బాగా రెస్టుతీసుకో. ఏం కావాలన్నా ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిస్తారు. కాదంటే నాకు మెసేజి పెట్టు. ఆఫీసునించీ వస్తూ తెస్తాను” అన్నాడు.
“సొసైటీ బావుంది. అక్కడ మేం వుండినదానికన్నా బాగా పెద్దది” అన్నాడు వాసు సంభాషణకి నాందిగా.
“చాలా సదుపాయాలున్నాయి. క్లబ్‍హౌసు, పూల్, జిమ్, ఇన్‍డోర్ గేమ్స్, లైబ్రరీ వున్నాయి” వివరించాడు మాధవ్.
“పిల్లలని హాస్టల్స్‌లో ఎందుకు? ఇంతమంది పెద్దవాళ్ళం వున్నాం. తీసుకొచ్చెయ్యండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడే వేరే ఆఫీసుకి అయ్యేలా చూసుకో. కొంచెం మారాంగా, ఇంకొచెం మారు” అన్నాడు వాసు. మాధవ్ తలూపాడు. కొద్దిరోజులుగా వాళ్ళు భార్యాభర్తలిద్దరూ అదే ఆలోచిస్తున్నారు.
“ఆరోజు రాత్రి జరిగింది మర్చిపోలేకపోతున్నాను మాధవ్! నన్నక్కడ కొట్టి చంపేసి, తర్వాత గీతనికూడా చంపేస్తారేమోనన్న భయం నన్ను నిలువునా వణికించింది. ప్రాణాలకి తెగించి ఫైట్ చేసాను. ఏదో ఒకటో రెండో దెబ్బలు అనుకుని కొట్టుకోవడం, ఇలా అనూహ్యంగా మీదపడి కొట్టడం వేరు” కాసేపటితర్వాత నెమ్మదిగా అన్నాడు వాసు. మాధవ్ తన చేతిని అన్నభుజమ్మీద వేసాడు.
“మర్చిపోవడానికి ప్రయత్నించరా వాసూ! ఒక యాక్సిడెంటనుకో. శతృత్వాన్ని పాటించి అమీతుమీ తేల్చుకోవడానికి వాళ్ళు నీతో సరీసాటీ కాదు. చీమలపుట్టమీద కాలేస్తే వెంటనే కాలుతీసేసి వెనక్కి అడుగేస్తాం. కుక్కలు వెంటపడితే తప్పించుకుని వచ్చేస్తాం. ఇదీ అంతే! దొంగదెబ్బ తీసారు. నువ్వు మాకు ప్రాణాలతో దక్కావుచూడు, అదీ వాళ్ళని చావుదెబ్బకొట్టడమంటే. నువ్వు వాళ్ళకి అందనంత ఎత్తులోనే వుండు. కోపాలూ కక్షలూ సాధించడానికి వాళ్ళస్థాయికి దిగకు. నేను పుట్టినప్పట్నుంచీ ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. వదిన మరో రెండేళ్ళకి కలిసింది. మీరిద్దరూ బావుంటేనే నాకు సంతోషంగా వుంటుంది. నీలిమకూడా మారింది. అనవసరమైన గొడవలు పెట్టదు. నచ్చితే అక్కడున్నవన్నీ అమ్మేసి, ఇక్కడికి వచ్చి దర్జాగా బతకండి. పిల్లల పెళ్ళిళ్ళు చేసి మనవల్నెత్తండి” ప్రేమగా అన్నాడు.
“మాధవ్!” సంకోచంగా ఆగాడు వాసు.
“చెప్పరా!”
“ఎంత ప్రేమలున్నా భార్యాభర్తలిద్దరూ ఒక్కసారే చచ్చిపోవడం వుండదేమో! నాకన్నా ముందు తనే పోవాలని గీత అంది ఒకసారి. ఎందుకో దానికా ఆలోచన వచ్చింది. నవ్వులాటగా తీసిపారేసాను.
తను చాలా అమాయకమైనది. ఎవ్వరికీ హానితలపెట్టదు. కానీ తననలా వుండనివ్వరు. ముఖ్యంగా రాణా. డబ్బుకోసం సతాయించుకు తింటాడు. ఒకవేళ నేను పోయి తను వుండిపోతే తనని మరోపెళ్ళికి వప్పించాలి. అలా వదిలెయ్యద్దు” అన్నాడు మాధవ్ తెల్లబోయాడు. ఏదో అనబోతుంటే చేత్తోటే ఆపాడు.
“పూర్తిగా విను. బతికేది మనమే ఐనా జీవితం పూర్తిగా మనది కాదు. నాన్న దూరంపెట్టేసాక అమ్మ వంటరితనంతో విసిగిపోయేది. నువ్వూ, నేనూ కొడుకులం. మన భార్యాపిల్లలూ, మన జీవితాలూ మనవి. మనకి చాలా స్వంతజీవితం, అమ్మతో కొద్దిపాటి కలగలుపుకాలం. మనలాగే తులసి. అందరం కలిసి అమ్మని బాగానే చూసుకున్నాం. నేను, గీత తొమ్మిదింటిదాకా ఆవిడతో మాట్లాడి మాగదిలోకి వెళ్ళేవాళ్ళం. ఆవిడదగ్గిరే పిల్లలు పడుక్కునేవారు. వాళ్ళిప్పుడు మాతో లేరు. ఆవిడ ఒక్కర్తే గదిలో మిగిలింది. ఆవిడకి ఏ చిన్న అవసరం వచ్చినా మమ్మల్ని లేపడానికి చేతికి అందుబాటులో వుండేలా రెండుమూడుచోట్ల బజర్లు పెట్టించాను. గీత తెల్లారి లేచాక వెళ్ళి కాసేపు అమ్మగదిలో పడుక్కుని మాటలుచెప్పేది. ఆవిడకి జవజీవాలొచ్చేవి. రాత్రంతా ఆవిడ వంటరితనంతో పోరాడేదన్న విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఆ వంటరితనం దుర్భరంగా వుంటుంది. మనసు లోలోపలి పొరల్లోకి ఇంకిపోతుంది. దాన్ని వదిలించుకోలేరు. నాన్నప్పట్నుంచే ఆవిడ వంటరిగా వుండటంతో నేను దాన్నొక సహజమైన విషయంగా తీసుకున్నాను. బైటికి వెళ్ళే ఓపికకూడా తగ్గడంతో ఆవిడ సోషల్‍లైఫ్ కుదించుకుపోయింది. మాట్లాడే మనిషికోసం తపించిపోయేది. వీణ వచ్చాక ఆవిడలో మార్పు కనిపించింది. అది రాత్రికూడా వుండిపోయేది. చాలారాత్రిదాకా ఇద్దరూ మాట్లాడుకునేవారు. సమీకరణాలు మారి మాకన్నా అది దగ్గరైపోయింది. అది ఆ అవకాశాన్ని చక్కగా వాడుకుంది. ఏ కొడుకు, ఏ కోడలు ఇరవైనాలుగ్గంటలూ తోడుగా వుండగలరు? ఈ వంటరిమనుషులు మిగతావాళ్ళని ప్రశాంతంగా వుండనివ్వరేమో! నాకేదైనా ఔతే గీతేనా అంతేనేమో! వంటరితనం బాధపెట్టకుండా సరైన మనిషిని తనకి కంపానియన్‍గా వెతకాలి” అన్నాడు. వెర్రిగా చూసాడు మాధవ్ అతన్ని.
“చాలానే ఆలోచించావుగానీ, పద వెళ్దాం. సిటీరోడ్లమీద టూవీలర్‍పైన వెళ్తున్నప్పుడు నాకూ అనిపిస్తుంటుంది, నాకేదైనా ఔతే నీలిమా పిల్లలూ ఏమైపోతారా అని. తెల్లారి లేస్తే తొంభైతొమ్మిది జరుగుతాయి అలా అనిపించే సంఘటనలు. నాన్నా! అవన్నీ భ్రమలు, ఆలోచనలు, భయాలు. కాసేపే వుంటాయి. ఆ పరిస్థితి దాటేస్తే మర్చిపోతాం. నువ్వూ గీతా చక్కగా వున్నారు. ఇది నిజం. నువ్వనుకున్నట్టేదీ జరగదు. ఆవిడ గీత. యమధర్మరాజుతోకూడా యుద్ధంచేసి నిన్ను వెనక్కి తెచ్చుకోగలదు. నీమీద నీకు నమ్మకంపోతే ఆవిడమీద పెట్టుకో. ఎక్కువగా ఆలోచించకు” అని లేవదీసాడు.
నీలిమ ఫోన్ చేసింది. ఎలాగా ఆరోజుకి భోజనాలు తమింట్లోనేగాబట్టి నేరుగా అక్కడికే వచ్చెయ్యమని. ఇద్దరూ వెళ్ళారు. వాసుకి ఎదురుపడద్దని లక్ష్మి ముందే తినేసి గదిలోకి వెళ్ళిపోయింది. భోజనాలయ్యాయి. కాసేపు కూర్చుని మాట్లాడాక వాసు పడుక్కుంటానన్నాడు. గీత అతనితోపాటు వెళ్ళింది నిద్రపోయేదాకా మాటలు చెప్పడానికి. మాధవ్‍తో చెప్పిన విషయాలు ఆమెకీ చెప్పాడు. అంత తేలికా, ఇతనికి తను? చురుక్కుమంది గీతకి.
“అల్లపురసం తీసుకొస్తాను. బాగా పైత్యం తలకెక్కింది” అని లేవబోయింది. అతను చెయ్యిపట్టుకుని ఆపాడు.
“కాళ్ళూ, చేతులూ, కళ్ళూ, ముక్కూ, చెవులూ అన్నీ జాగ్రత్తగానే తెచ్చుకుని వచ్చావు, బుర్రమాత్రం అక్కడ పారేసుకున్నావా? రేపెవర్నేనా పంపి వెతికిస్తాను. నీకు పూర్తిగా తగ్గాక మీ అమ్మాకొడుకులిద్దరికీ వుందిలే, నాతో అన్నమాటలకి ఎవరి లెక్క వాళ్ళచేత చెప్పిస్తాను” అంది.
“దేనికే, అంతకోపం?” ఆమె చేతిని పెదాలకి తాకించుకుని అడిగాడు. ఈ ప్రేమొకటి! రోషంగా అనుకుంది. అనేది అనేసి, చేసేది చేసేసి మళ్ళీ ముట్టుకునీ, ముద్దుచేసీ కోపాన్ని మంచులా కరిగించేస్తాడు.
“అందరి విషయం నేను చెప్పట్లేదు. మనగురించి చెప్తున్నాను. మామిడిపండుంటుంది. దాన్నిండా రసం, లోపల టెంకా, పైన తొక్కా వుంటాయి. ఈ మూడూ కలిస్తేనే అది. మనం గడిపిన జీవితం అలాంటిది. రసం పీల్చేసుకున్నాక మిగిలిపోయిన టెంకా, తొక్కా ఎవరికీ అక్కర్లేదు. మనిద్దర్లో వంటరిగా మిగిలిపోయినవాళ్ళు ఆ రెండిట్లో ఒకటి ఔతాం. కోరికలుండవు. మనసు స్తంభించిపోతుంది. కాలం ఆగిపోతుంది. రాత్రికీ పగటికీ తేడా వుండదు. దు:ఖపు జడివానలో తడిసిపోతూ వుంటాం. మృత్యువుకితప్ప మరో అతిథికోసం ఆహ్వానం వుండదు. ఇంకో వాసూ రాడు, ఇంకో గీతా వుండదు. వాసూ వాసూ అని మీ అమ్మా, తమ్ముడూ, చెల్లెలూ, నాన్నా నాన్నా అని పిల్లలూ ఏడుస్తూ వుంటారు. నా దు:ఖం తీర్చలేని నిస్సహాయతతో పరితపించిపోతూవుంటారు. వాళ్ళని చూసి, చుట్టూ వున్నవాళ్ళంతా ఏడుస్తుంటారు. మొత్తం ప్రపంచమే దు:ఖభాజనమైపోతుంది. చావుబాజాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటాయి. తర్వాత నావంతు. అదేకదా, నువ్వు చెప్పింది? గీతా గీతా అని మా అమ్మానాన్నలూ, తమ్ముడూ, అమ్మా అని పిల్లలూ ఏడుస్తూ వుంటారు. రెండుపార్టీలవాళ్ళూ కలిసిపోయి మనిద్దరికోసం ఏడవడం మొదలుపెడతారు” అంది వొళ్ళుమండిపోతుంటే. వాసు హడిలిపోయాడు.
“పొరపాట్న అన్నాను. ఇంకెప్పుడూ అనను. అంత భయపెట్టకమ్మా!” అన్నాడు చెంపలేసుకుని.
“రెండుసార్లు లేబర్‍కి వెళ్ళాను. ఇలాంటి అప్పగింతలేం నేను పెట్టలేదు. అన్ని నొప్పులతర్వాత పుట్టుకొచ్చిన పిల్లల్ని చూసి సంతోషపడ్డాం. నా నొప్పి చిన్నదీ, నీ నొప్పి జీవితం తలకిందులైపోయేంత పెద్దదీనా? నీ దెబ్బలకీ నొప్పులకీ రిజల్టు యిదా? వెరీ బేడ్. తొందరగా తగ్గించుకుంటే అన్నీ తిరుగుదాం. దిగులుపడుతూ మంచంమీద పడుక్కుని వుంటే ఇలాంటి ఆలోచనలే చేస్తూ గడపాలి” అంది.
“ఏం పోలికే ఇది?” నుదురు కొట్టుకున్నాడు.
“అర్థంపర్థంలేని భయాలకి ఇలాంటి పోలికలే వుంటాయి” అని, “సారీ చెప్పు” దబాయించింది.
“చెంపలెసుకున్నానుకదా?” ఎదురుతిరిగాడు. ఆమె వినలేదు. అతను రెండు చెవులూ చేతుల్తో పట్టుకుని సారీ చెప్పాడు. అప్పుడు శాంతించినట్టు తలూపింది.
“ఎక్కడినుంచీ పుట్టుకొస్తాయి గీతా, ఇలాంటి ఆలోచనలు?” ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ అడిగాడు.
“నీ మాటల్లోంచీ” ఠకీమని అంది. “ఆలోచించడం నీకు రాదుగానీ, ఆ పని నాకొదిలేసి, ఇంక పడుక్కో” అంది. అతను మళ్ళీ నవ్వాడు. తర్వాత,
“ఆవిడతో ఏదో ఒకటి మాట్లాడు గీతా! బాధపడుతోంది. తప్పదు. తెలివితక్కువవాళ్ళైనా, తెలివిఎక్కువవాళ్ళైనా అమ్మలూ, నాన్నలూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ వంటిమీది పుట్టుమచ్చల్లాంటి వాళ్ళు. తీసెయ్యలేం” అన్నాడు నెమ్మదిగా. తలూపింది.
కళ్ళుమూసుకున్నాడు.
ఆమె మాటలు ఆగినచోట అతని ఆలోచనలు కొనసాగాయి. మాధవ్‍తో అన్నవన్నీ గీతతో అనలేదు. తల్లిగురించి అనుకున్నవి చెప్పలేకపోయాడు. ఆమె తనకన్నా ఎక్కువ వూహించగలదని తెలుసు. వంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళ భావోద్వేగాల ట్రిగ్గర్‍పాయింట్స్ జంటలుగా కనిపించే భార్యాభర్తలు అని మనసులో ఎక్కడో అపరాథభావన. తల్లిని తమతో కలుపుకుని స్నేహితుల్లాగే బతుకుతున్నారు. కానీ తనకీ గీతకీ భార్యాభర్తలతనం వుంది. అది ఏకాంతాన్ని కోరుకుంటుంది. అందులో శృంగారం ఒక్కటే కాదు, స్నేహాన్నీ, రకరకాల ప్రేమల్నీ, ఎన్నో భావాలనీ, ఆలోచనలనీ, ఇష్టాలనీ పంచుకోవడం వుంటుంది. గీత నవ్వు, స్పర్శ, చూపు, గొంతు ఇవన్నీ తనకి చాలా యిష్టం. గాలిని నిలవరించే బలమైన పూలతీగలాంటి ఆమె కదలికలకి తన చూపులు అతుక్కుపోతాయి. ఎంత హేల! ఎంత విలాసం! ఎంత దర్పం! అన్నీ కలగలిసిపోయిన చైతన్యస్రవంతిలా వుంటుంది. గుండెనిండా తనే. నిద్రపోతున్నా పక్కపక్కనే గుసగుసలాడుతున్నట్టుంటుంది. ఇవన్నీ అమ్మకోసం వదిలేసి, ఆ అనుబంధాన్ని రెండుమూడు నిముషాల చాటుమాటు అనుభవంగా మార్చుకోగలడా? అతనికి అసహ్యంగా అనిపించింది. త్యాగాలమీద జీవితాలు నడవ్వు. అమ్మకి పూర్తి కాలక్షేపం తనూ గీతా కాదు. ఆలోచించాలి. అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. గీత లేచి ఇవతలికి వచ్చింది.
హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు మాధవ్, నీలిమ. వాసు పడుక్కున్నాడని లక్ష్మికూడా వచ్చి కూర్చుంది.
“చాలా భయపడ్డాడు మాధవ్! మొదటి రెండుమూడురోజులైతే సగంనిద్రలో వులిక్కిపడి లేచి కూర్చునేవాడు. నిలువునా చెమటలు పట్టేసేవి. ఇంకా ఆ భయం తగ్గనట్టుంది. తనకేదో ఔతుందన్న ఆలోచనలు ఇంకా వదిలిపెట్టట్లేదు” అంది.
“నీకూ చెప్పాడా? హడిలిపోయాను. వాడు మాట్లాడుతుంటే” మాధవ్ పకపక నవ్వాడు. గీతకూడా చిన్నగా నవ్వి, లక్ష్మివైపు తిరిగి, “నువ్వేంటి, అలా ఆడసోక్రటీస్‍లా మొహంపెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వొదిలేసి వెళ్ళిపోయినా జాగ్రత్తగానే తీసుకొచ్చానుగా, నీ కొడుకుని?” అడిగింది. ఆమె పలకరించేసరికి లక్ష్మి మొహం కాస్త విడింది.
“నాకొడుకెందుకయ్యాడు? ఏదో చుట్టరికం చెప్పావుకదా? ఇద్దరు కొడుకుల్ని కంటే ఒక్కమాటతో వాళ్ళని దూరపుచుట్టాలని చేసిపారేసావు. నీకున్నంత తిక్క ఇంకెవరికీ వుండదు. అరేయ్ మాధవ్, వాడేమో రామారావు కూతురి మొగుడట. నిన్నేనా నా కొడుకుగా వుంచిందా? లేకపోతే మార్చేసిందా? రామారావైతే కనీసం నాకు అన్నౌతాడు. కుటుంబరావు ఏమీకాడుకూడాను” అంది లక్ష్మి. ఆ చుట్టరికం విని నీలిమ మాధవ్‍ని మురిపెంగా చూసుకుంది. మాధవ్ పడీపడీ నవ్వాడు. నీలిమకూడా శృతికలిపింది.
“ఎలా వుంది గీతా, వాడికి? రాణాయేనా?” నవ్వులు ఆగాక అడిగింది లక్ష్మి.
“కాకపోతే శశిధర్” అంది గీత.
“పద్మ అల్లుడు. అతనికేం అవసరమే?” తెల్లబోయిందావిడ.
“రాణాకేం అవసరం?” ఎదురు ప్రశ్నించింది గీత. “తులసి నీకేం చెప్పలేదా? దాని కడుపులో బోల్డన్ని రహస్యాలున్నాయి. వాటన్నిటికీ ప్రాణం వుంటే కౌరవుల్లా నూటొక్కమంది పుట్టుకొస్తారు” అంది. “ఆలోచించత్తా! మామీద నీకెందుకంత కోపం వచ్చింది? ఏవో అసంబద్ధమైన ఆలోచనలు పుట్టుకురావటంచేతనేకదా? అలానే వాళ్ళకీను. ఎవరి ఆలోచనలు వాళ్లవి” అంది. లక్ష్మి మాట్లాడలేదు.
గీతని చాలామాటలంది తను. కొడుక్కింకా తెలీదు. నేరంలా చెప్పే అలవాటు దీనికి లేదు. కానీ మనసులో దేన్నీ దాచుకోలేదు. ఎక్కడో ఒకచోట దొరికిపోతుంది. ఆ విషయాలన్నీ బైటపడితే మళ్ళీ ఎంతకోపం వస్తుందో, వాసుకి! ఇది మాట్లాడినంతమాత్రాన గొడవ సమసినట్టుకాదు. ఆవిడ ఆలోచన సాగింది.
మరో వారానికి వాసు బాగా కోలుకున్నాడు. వాసు, గీతల దినచర్య క్రమబద్ధమైంది. ముందుగా మహతిని చూడటానికి వెళ్ళారు.
“ఇంత చిక్కిపోయావేంట్రా?” వాసుని చూసి ఆశ్చర్యంగా అడిగింది మహతి. ప్రేమగా దగ్గరకి తీసుకుంది.
“కొద్దిగా జ్వరం వచ్చి తగ్గింది. ఇప్పుడు బానే వుంది. నువ్వెలా వున్నావు మహీ? ఎవరింటికీ రాకుండా ఎన్నాళ్ళిలా వుంటావే?” ఆరాటంగా అడిగాడతను. ఇద్దరూ పక్కపక్కని ఒకరి చెయ్యొకరు పట్టుకుని కూర్చున్నారు. వద్దనుకున్నా, ఈ బంధాలూ ప్రేమలూ దూరం జరగనివ్వవు. చిన్నప్పటిరోజులు గుర్తొచ్చాయి ముగ్గురికీను.
మహతికి జరిగినవేవీ తెలీదు. ఎవరూ చెప్పరు. తెలుసుకుని చేసేది ఏమీ వుండదు, అనవసర ఆరాటంతప్ప మరో ప్రయోజనం వుండదని. ఎవరేనా చూడటనికి వెళ్ళినప్పుడు అరాకొరాగా తెలిసేదే ఆమె విషయపరిజ్ఞానం. మరీ దూరంపెట్టారనుకోకుండా వుండటానికి పైపైని చెప్పింది గీత. నారాయణ బాగా పెద్దవాడయ్యాడు. ముసలితనం తెలుస్తోంది. నోరూ, ధాటీమాత్రం తగ్గినట్టు లేవు. మహీ ఎలా వేగుతోందో అనుకుంది.
“పిల్లలిద్దరూ పెద్దయ్యారు. మయూ జాబ్ చేస్తున్నాడు. విహీ చదువు పూర్తౌతోంది. మేం రిటైర్‍మెంటు తీసుకుని ఎక్కడో ఒకచోట స్థిరపడాలనుకుంటున్నాం. కొన్నాళ్ళైతే ఇక్కడుండాలని వచ్చాం. ఏడాది అనుకుంటున్నాం. ఇల్లదీ తీసుకున్నాం. మీరొచ్చి మాతోనే వుండండి” అడిగింది.
“మీరు వెళ్ళాక మళ్ళీ ఇల్లు వెతుక్కోవాలి. ఇంత తక్కువలో దొరకద్దే? ఇక్కడే వుంటాం. వచ్చి వెళ్తుండండి. లక్ష్మికూడా ఇక్కడే వుందటకదా? బీపీ బాగా పెరిగిందనీ, మార్పుకోసం తనదగ్గిరకి తీసుకొచ్చానని చెప్పాడు మాధవ్” అన్నాడు నారాయణ. “అంతంత లీవంటే జీతాలు పోవే?” ఆరాగా అడిగాడు.
“ఇద్దరికీ చాలా లీవుంది మామయ్యా!” అంది గీత.
“మీ చిన్నాడి చదువైపోతోందంటున్నావు, ఉద్యోగం వస్తే మేఘనని చేసుకుంటారే, గీతూ? మాకూ ఒక బాధ్యత తీరుతుంది” అన్నాడు.
“ఇద్దరూ ఎంతంత పిల్లలు బాబాయ్? వాడి పైన మయూ వున్నాడు. ఇంకా చాలా టైముంది” అని వాసు అంటే,
“మాది ఎలాగా మేనరికం. మా పిల్లలకి బైటివే చూస్తాం. మనింట్లో ఇంకా చాలామంది మగపిల్లలున్నారు. వీళ్ళు కాకపోతే బైట చూద్దాం. నాకు బాగా తెలిసిన పిల్లలందరి పేర్లూ, గోత్రాలూ, వివరాలూ రాసి పెట్టుకుంటున్నాను. మంచిసంబంధం చూసి దాని పెళ్ళిచేసే బాధ్యత పూర్తిగా మాది. ఇప్పట్నుంచీ ఇలాంటి ఆలోచనలు వద్దు. చదువుకోనివ్వండి” అంది గీత నచ్చజెప్తూ. ముప్పైమంది పిల్లలు ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి. ఎవరి పిల్లలేం చదువుతున్నారు, ఎలా వుంటారు అనే కబుర్లతో గంటలుగడిచిపోయాయి. సాయంత్రందాకా వుండి మేఘననికూడా చూసారు. అంతా కలిసి బైటికి వెళ్ళారు. మహతికోసం రెండుచీరలు కొంది గీత.
“నువ్వు నాకు కొనడమేమిటి? వద్దు” అంది మహతి.
“అందమైన చీరలు కనిపిస్తే కొనాలనుంటుంది మహీ! కానీ నాచుట్టూ చీరలు పోగుపడితే చిరాకు. అందుకు నీకు కొన్నాను. రెండూ చాలా బావున్నాయి. నీకు నప్పుతాయి” అంది గీత ప్రేమగా.
“నువ్వేమీ మారలేదు గీతూ! అంత సంపాదిస్తున్నా, చిన్నప్పుడెలా వున్నావో అలానే వున్నావు. నువ్వేకాదు, మీలో ఎవరూ మారలేదు. రెండునెల్లక్రితం సుమంత్ కాన్ఫరెన్స్‌కని ఇక్కడికొచ్చి, మాయిల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఉన్నది అరగంటేగానీ, పూట తీరికచేసుకుని గుర్తుపెట్టుకుని వచ్చాడు. ఎక్కడివే మీకు ఇంతంత ప్రేమలు?” అంది మహతి వుద్వేగంగా.
“అప్పటి స్నేహమేకదా, మనని ఇక్కడిదాకా నడిపించింది? లేకపోతే పిన్నికూతురు, ఆమ్మకొడుకు అనుకునేవాళ్ళం” అన్నాడు వాసు.
“ఇద్దరిదీ ఒకటే మాట. అలానే వుండండిరా!” అందామె నవ్వి.
మేఘనకి డ్రెస్సులూ, క్లిప్పులలాంటివి కొంది. చాలా పొదుపైన పిల్ల. తల్లి కష్టం తెలుసుకుని పెరుగుతోంది. పెద్దగా ఏవీ అడగలేదు. కొంటుంటే మొహమాటపడింది. గీతే కోప్పడి తీసుకుంది. వాళ్ళదగ్గిరకి వెళ్ళినప్పుడూ అంతే. నారాయణకోసం రకరకాల బిస్కెట్లు, కొన్ని స్నాక్ ఐటెమ్స్ కొంది.
తమతో రమ్మంటే-
“ఇప్పుడు పరీక్షలు వున్నాయత్తా! మయూ. విహీ వచ్చినప్పుడు ఫోన్ చెయ్యి, వచ్చేస్తాను. పంకజ్, తనూజావాళ్లనికూడా తీసుకొస్తే అందరం కలిసి సరదాగా గడుపుతాం” అంది ఆపిల్ల.
రాత్రికి బైటే భోజనం చేసి, మహతీవాళ్ళని యింటిదగ్గర దింపి తిరిగొచ్చారు. వాసు పెద్దగా ఏమీ తినలేదు. తిరిగొచ్చాక అలసటవలన మళ్ళీ కాస్త జ్వరం వచ్చింది. గీత కలవరపడింది. ఇంకా మర్చిపోలేకపోతున్నాడా, చీకట్లో ఒక్కడూ ప్రాణాలకి తెంచి చేసిన పోరాటాన్ని? ఎంతమంది వుంటేనేం, నిరంతరం నీడలా తనుండి మాత్రమేం లాభం? ఆ దురదృష్టకరమైన సంఘటని తప్పించలేకపోయారు. కనీసం తనూ వెంటవుండి అతనితో కలిసి ఎదుర్కోలేకపోయింది. ఎన్ని రుణాలున్నా దేనిదారి దానిదే. నుదుటిమీద రాసిపెట్టి వున్నదాన్ని ఎవరికివారు అనుభవించాల్సిందే తప్ప, మరొకరు పంచుకోలేరు. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
అతను తీవ్రమైన ఆలోచనలో నిమగ్నమై వున్నాడు.
“ఏంటంత ఆలోచన?” మృదువుగా అడిగింది.
“మయూని గమనించావా గీతూ? వాడు చాలా డిస్టర్బ్‌డ్‍గా వున్నాడు. అటాక్ విషయం అందరికీ తెలిసేసరికే వీడు ఫ్లైటెక్కేసాడు. అక్కడ ఎవర్నో పెట్టుకుని సమాచారం తెలుసుకుంటున్నాడు. లీగల్‍గా వెళ్తున్నామనేదికూడా వాడికి నచ్చలేదు. నాలాగే వాడుకూడా అందర్నీ చితక్కొట్టెయ్యలనుకుంటున్నాడేమో! ఇవన్నీ తాత్కాలికమైన ఆవేశాలు. తగ్గించుకోవాలి. వాడేం చేస్తున్నాడో కనిపెట్టాలి. విహీనికూడా. ఒక్కసారి పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే ఇంక భవిష్యత్తుండదు. రాణాదేం వుంది? అన్నీ వదిలేసాడు. పిల్లలగురించికూడా వాడికి పట్టింపులేదు. వీళ్ళు ఆ ట్రాప్‍లో పడకూడదు. ఇద్దరం కూర్చుని అర్థమయ్యేలా చెపాలి,
కోపంవచ్చినప్పుడు నోటితో అంటాంరా, చేతల్లో చేసి చూపించం_ అని.
సేతు బుర్రలోకికూడా ఎక్కిస్తే వాడు వీడికి గట్టిగా చెప్పగలుగుతాడు” అన్నాడతను.
“నాకూ అనుమానం వచ్చింది” అంది.
“ఆమధ్యలోంచీ వచ్చేద్దాం గీతూ! ఇల్లే వద్దనుకుని ఇవతలికి వచ్చాక ఇంకా వూరితో పనేం వుంది? మంచిది చూసుకుని రిటైర్మెంటు నోటీసులు ఇద్దాం” అన్నాడు. ఆమె తలూపింది. గుండెలనిండా దు:ఖం నిండింది ఇద్దరికీ. సాఫీగా సాగిపోతున్న జీవితాలని ఏవో శక్తులు బలంగా మలుపుతిప్పడం నచ్చలేదు. మామూలు చుట్టరికాల్లో హద్దులు వుంటాయి. తమమధ్య ఎలాంటి హద్దులూ ఎప్పుడూ లేవు, రాణాతప్ప ఎవరూ దాటిందీ లేదు. ఇప్పుడు జరిగింది హద్దుదాటి చిన్నగా కవ్వించి వెనక్కి వెళ్ళటంకాదు. నిజరూపాన్ని చూపించుకోవటం. శశిధర్ ఎందుకు చేసాడు అలా? అతన్నెలా దార్లోకి తేవడం? చేసింది తప్పని అర్థమయ్యేలా చెప్పి, సమీరని డిచ్ చెయ్యద్దని గట్టిగా చెప్పెవాళ్ళు కావాలి. జో అన్నట్టు రవిమాత్రమే అందుకు సమర్ధుడని ఇద్దరికీ అర్థమైంది. గీతగీసి, ఎక్కడివాళ్లని అక్కడ ఆపాల్సిన టైమొచ్చిందని తెలిసింది.
మాధవ్‍తో మాట్లాడాక పెద్దవాళ్ళు తనకి ఏదీ చెప్పట్లేదని అర్థమైంది మయూకి. తమ కుటుంబంలో ఒక థం‍బ్‍రూల‌ట.ఏతరానికి సంబంధించిన సమస్యలు ఆతరంవాళ్ళే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని. మరీ జటిలమైన సమస్యైతే పల్లవినాన్నకి చెప్తారట. అంతేతప్ప నీకు చెప్పరు, నువ్వే తెలుసుకోవాలని మాధవ్ అన్నాడు. అలానే నిర్ణయించుకున్నాడు మయూ. మొదటిసారి అమ్మానాన్నలని రామస్వామిఫ్లాట్లో చూడటానికి వెళ్ళినప్పుడు అతను ముగ్గురిని కలిసాడు. ఒకరు ప్రహ్లాద్. వాసే చెప్పాడు కలవమని. రెండోవాడు శశిధర్. సమీరని చూడటానికి వెళ్ళినట్టు వెళ్ళి అతన్ని చూసి వచ్చాడు. మూడోవాడు చిన్నప్పటి మితృడు.
వాసుతో సమానమైన ఎత్తుతో, దృఢంగా, తులసి అందాన్ని పౌడర్లా కాస్త రాసుకున్న మొహంతో వున్న మయూని చూసి, సమీరకి స్పష్టమైన సంతోషం, శశిధర్‍కి కాస్త వినోదం కలిగాయి. ఇంతంత శాల్తీలేసుకుని వీళ్ళు ఏదీ చెయ్యకుండా వుండటం అతనికి నవ్వు తెప్పించింది. పైగా పెద్ద చుట్టరికం వున్నట్టు సమీరని అత్తా అని పిలుస్తూ రావడం! తను చేసింది వీళ్ళకి తెలీదనే నిర్ధారణకి వచ్చాడు. తెలిసినా ఏమీ చెయ్యలేరనే చులకనభావం కలిగింది. అది తెలియజెయ్యడానికే వచ్చాడేమో, తండ్రి పంపించాడనుకున్నాక కాస్త గర్వంకూడా వచ్చింది.
“ఇటు తిరిగిందేంట్రా, నీ గాలి?” నవ్వుతూ అడిగింది సమీర. ఈ ముగ్గురు అత్తలూ విజ్జెమ్మపోయినప్పుడు సరదాగా తిరగడం గుర్తొచ్చింది మయూకి.
“ఫ్రెండుని కలవాలని వచ్చాను” అని, అనుమానం రాకుండా ఆ ఫ్రెండు వివరాలుకూడా చెప్పాడు. అతని వుద్యోగం, ప్రాస్పెక్ట్సు,అతనితో చదివిన పిల్లల వివరాలు అన్నీ వివరంగా అడిగి తెలుసుకుందామె. తన పిల్లలగురించి చెప్పింది. రాణా పిల్లలుకూడా తెలుసతనికి. వాళ్ల చదువులగురించికూడా అడిగాడు. అత్తాఅల్లుళ్ళు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. మయూ మాటలు వింటుంటే గీతనీ, వాసునీ చూస్తున్నట్టే అనిపించింది సమీరకి. చాలాకాలమైంది వాళ్ళిద్దర్నీ చూసి. కలిసే సందర్భాలు తగ్గాయి. పెళ్ళిళ్ళు మొదలౌతే మళ్ళీ అందరూ కనిపిస్తారనుకుంది.
సమీర అత్తగారుకూడా మయూని పలకరించి లక్ష్మిగురించి అడిగింది.
“వంట నువ్వే చేస్తున్నావేంట్రా?” అప్పటెప్పటి విషయమో గుర్తుచేసుకుని వేళాకోళంగా అడిగింది.
“ఇంకా మర్చిపోలేదా? ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకుంటారేం?” తనూ నవ్వుతూ అడిగాడు.
మాట్లాడుతూ వుంటే రోడ్డు వెడల్పుచెయ్యడంకోసం హాల్లో గోడమీద గీసివున్న ఎర్రటిమార్కు కనిపించింది. గుర్తుపెట్టుకున్నాడు. మరికాసేపు వుండి వెళ్ళాడు. ఫ్రెండింట్లో కూర్చుని అడిగితే వివరాలన్నీ తెలిసాయి. అప్పటికింకా ఏం చెయ్యాలన్నదానిమీద స్పష్టమైన ఆలోచన లేదు.
“ఎందుకొచ్చినట్టో? పిల్లాడు బావున్నాడు. మంచి వుద్యోగం చేస్తున్నాడు. తల్లీతండ్రీ ఇద్దరూ ఇంకా సర్విసులో వున్నారు. ఆస్థికూడా బానేవుందటకదా? మీకేమన్నా సంబంధం కలుపుకునే ఆలోచన వుందా సామ్? లేకపోతే మాపిల్లకి అడగచ్చు. కానీ వాళ్ళకీ మనకీ ఏమాత్రం సరిపడదు. అంత మడికట్టుకుని రూల్సూ చట్టాలూ అని వేలాడితే ఎలా కుదురుతుంది? ఇంత తిక్కమనుషులమధ్య పడేస్తే మన పిల్ల కష్టాలుపడుతుంది. ఓ కోటి కట్నం పారేస్తే ఇంతపాటి సంబంధం దొరకదా?” అంది సమీర తోటికోడలు. అలా పరస్పరవ్యతిరేకంగా మాట్లాడటంద్వారా ఆమె మనసులో మయూమీద యిష్టం, ఒకవేళ సమీర కూతురికి అనేసుకుంటుందేమో పొసగనివ్వకూడదనే ఆదుర్దా స్పష్టంగా తెలిసాయి వినేవాళ్ళకి.
అత్తగారిని పక్కని కూర్చోబెట్టి కాలేజి మేనేజిమెంటు చేతిలోకి తీసుకుంది. అప్పటి పద్ధతులవీ పూర్తిగా మార్చేసింది. ఎంతసేపటికీ డబ్బే. స్టుడెంట్సుని పిండుతారు. లెక్చరర్లకి సరైన జీతాలివ్వరు. ఇప్పుడింక ఆమెని కార్పొరేటరుగా నిలబెట్టాలని చూస్తున్నారు అన్నదమ్ములు. పొలిటికల్‍గా బలపడచ్చని ఆలోచన.
సమీర ఏం జవాబిస్తుందోనని చూసాడు శశిధర్.
“వాడేదో ఫ్రెండింటికని వచ్చి చూసివెళ్ళాడు. వచ్చాడు, వెళ్ళాడు. ఇన్ని ఆలోచనలు దేనికి?” అందామె మామూలుగా. పైకి. వాసు యిల్లు మెట్టడానికీ, గీత కోడలవ్వడానికీ, లక్ష్మీ, యశోదల మురిపాలు పొందడానికీ పెట్టిపుట్టాలనుకుంది. కట్నం పడేస్తే గొప్ప సంబంధం వస్తుంది. కానీ వచ్చేవాడు మయూ కాడు. వెళ్ళే యిల్లు అవంతీపురంలక్ష్మిది కాదు. దొరికే జీవితం వేరు. అలసిన మనసుని సేదదీర్చే, అలసటేమీ లేనిదానికి వుత్తేజాన్నిచ్చే జీవితం అది. చూసి ఆస్వాదించినవాళ్ళకి అర్థమౌతుంది.
తిరిగి వెళ్ళేలోగా అవంతీపురం బైప్రోడక్ట్స్‌లో ఒకడైన ఫ్రెండుని వెతుక్కున్నాడు మయూ. ఇక్కడ జరుగుతున్నవన్నీ సమాచారం ఇవ్వడానికి. అంతకిమించిన ఆలోచనలేదు. వ్యవహారాలు కొట్టుకోవడందాకా వెళ్తాయని వూహించలేదు. షాకయ్యాడు. చీకట్లో జరిగినదాడిని తప్పించుకుని తండ్రి యింటికొచ్చినందుకు గర్వం, సంతోషంతో సమానంగా నివ్వెరపాటు కలిగినా అదేస్థాయిలో భయం, కోపం తన్నుకొచ్చాయి. అక్కడ అప్పుడున్న పరిస్థితులనిబట్టి ఏమీమాట్లాడలేకపోయాడు.
“నాన్నని కొట్టించడానికి ఎంత ధైర్యం అతనికి? ఒక డెవిల్ ఆయన్ని డీఫేమ్ చేసింది. మామట, మా ప్రాపర్టీలోకి ట్రెస్‍పాస్ చేసాడు. షేమ్‍లెస్ క్రీచర్స్. వీళ్ళంతా మాచుట్టాలు. అమ్మానాన్నలేమీ చెయ్యలేకపోతున్నారు. నేనుమాత్రం ఒక్కడినీ వదిలిపెట్టను” తిరిగొచ్చాక సేతుదగ్గిరా, హరిదగ్గిరా చిటపట్లాడిపోయాడు.
“తొందరపడకు మయూ! ఏం చేసినా నాకు చెప్పాలి” అని ప్రామిస్ తీసుకున్నాడు సేతు.
“ఏయ్‍రా! మనం చదువుకున్నాం. తొందరపడి పిచ్చిపనులేం చెయ్యకు. కెరీర్ పాడౌతుంది. పేరెంట్స్ ఎప్పుడూ అలాంటిది కోరుకోరు. అలా జరగకూడదనే వాళ్ళ ఇమోషన్స్ బైటపెట్టుకోరు. మా డాడ్, మామ్ మంచిపొజిషన్స్‌లో వున్నారు. వాళ్ళతో నేను మాట్లాడతాను. స్ట్రాటజికల్‍గా వెళ్దాం” అన్నాడు. పిల్లలు స్వంత అమ్మానాన్నల మాటలు వినరు. స్నేహితులు, వాళ్ళ అమ్మానాన్నలు చెప్పింది వేదంలా వింటారు. ఆ పాయింటుదగ్గర ఆపాడు హరి మయూని. అది జరిగాక హరి మయూతో వాళ్ళింటికి వచ్చాడు. రావాలని ఎప్పట్నుంచో కోరిక. వాసునీ, గీతనీ చూడాలని ఆరాటం. అందులోనూ ఇంత జరిగాక. పైకి చెప్పడానికి మొహమాటం.
హరి తండ్రి భరత్. గీత వుద్యోగంలో చేరినప్పటి ఆఫీసరు, కమలాకర్ అల్లుడు. పుట్టగానే తల్లిని పోగొట్టుకుని, పోతపాలుపడక ప్రాణాలమీదికి తెచ్చుకుని, వుంటాడో తల్లిదార్లోనే వెళ్ళిపోతాడో అని ఆశలు వదులుకున్న పిల్లవాడిని వొళ్ళోకి చేర్చుకుని బంతిలా తయారుచేసి యిచ్చింది గీతని తెలుసు ఆయనకి. మొదటిభార్యకి సజీవజ్ఞాపకంలా కళ్ళముందు తిరుగుతున్న కొడుకుని చూస్తుంటే ఆవిషయం పదేపదే గుర్తొస్తుంటుంది. చాలా సున్నితమైన విషయం అది. గీతకీ వాసుకీ కృతజ్ఞతలు చెప్పడానికి యిబ్బందిపడ్డాడు. పెద్దవాళ్ళు చూసుకుంటున్నారని పక్కకి తప్పుకున్నాడు.
హరి తల్లి పోయాక అపర్ణ అనే బంధువులమ్మాయినే చేసుకున్నాడు భరత్. ఆమె గీతని చాలెంజిగా తీసుకుంది. ఏ బంధుత్వంలేని పిల్లాడి ప్రాణం గీత నిలబెట్టగా లేనిది తను వీడిని పెంచి పెద్దచెయ్యలేదా అనుకుంది. ప్రేమగానే చూసింది హరిని. అమ్మా అని పిలిపించుకుంది. ఇద్దరు కూతుళ్ళు ఆమెకి.
మూడేళ్ళు అవంతీపురంలో పెరిగాడు హరిచందన్. అమ్మమ్మా తాతగార్ల దగ్గిర వున్నాడు చాలాకాలం. వాళ్ళు వున్నంతకాలం మయూగురించి చెప్పేవారు. గీతగురించి గొప్పగా చెప్పేవారు. మయూకి ఉత్తరాలు రాయించేవారు. ఫోన్లొచ్చాక క్రమంగా వుత్తరాలు ఆగిపోయాయి. అమ్మమ్మ, తాతయ్య ఒకరితర్వాత ఒకరు పోయారు. పెద్దవాళ్ళు పోయాక తండ్రిదగ్గిరకి వచ్చాడు. గాల్లో వేలాడుతూ ఏనుకోవడానికి నేలకోసం వెతుక్కుంటున్నట్టు వుంటుంది అతనికి. కన్నతల్లి చనిపోయింది. తల్లివేరు తెగింది. పెంచినవాళ్ళు చనిపోయారు. మొక్కని పెకిలించినట్టైంది. ప్రేమగానే చూసినా మారుతల్లి, తండ్రితో మరీ అంత అటాచిమెంటు ఏర్పడలేదు. చెల్లెళ్ళమీదమాత్రం ప్రేమ.
మయూని కలవాలనే ఒక బలమైన కోరికని అతని మనసులో నిక్షిప్తంచేసి వెళ్ళారు హరి అమ్మమ్మా తాతయ్యలు. అది సటిల్‍గా వుండిపోయింది. వాళ్లకి తనింకా గుర్తున్నాడో లేదోననే సంశయం కలిగి, ఆకోరిక ముందుకి సాగలేదు. బీటెక్ చేస్తుంటే ఒక ఫ్రెండుదగ్గిర మయూ పేరు విన్నాడు. అరుదైన పేరవడంతో వివరాలడిగితే ఆ ఫ్రెండు చెప్పాడు. వెంటనే ఫోన్ నెంబరు తీసుకుని కాల్ చేసాడు. పెద్దగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేకపోయింది. తాతగారి పేరు చెప్పగానే పోల్చుకున్నాడు. ఇంక ఆ స్నేహం బలంగా అల్లుకుపోయింది. నవ్వులు, హాస్యాలు, వేళాకోళాలు. ఎంతో స్నేహం వున్నట్టు. ఎన్నోయేళ్ళు కలిసిమెలిసి తిరిగినట్టు. ఇంకా ఎంతోమంది స్నేహితులు మయూకి. తను ముందు, వాళ్ళు కాస్త వెనక. అసూయకలిగింది. కానీ అందరూ అతన్ని కలిపేసుకున్నారు.
విహీని చూసి ఆశ్చర్యం.
“వీడెక్కడ్నుంచీ వచ్చాడ్రా? మనిద్దరమేకదా, అప్పుడు?” అని అడిగితే,
“చెట్టుకి కాస్తే కోసుకుని తెచ్చుకుందట మా అమ్మ” అన్నాడు మయూ. తను మాట్లాడుతూ ఫోను వాళ్ళకిస్తాను, వీళ్ళకిస్తానని అనడం మయూకి అలవాటు లేదు. హరితో వాసు మాట్లాడాడుగానీ, గీత యింకా మాట్లాడలేదు.
ఆప్తబంధువుల్ని చూసినట్టుంది హరికి వాళ్ళని కలవడం. కొంచెం మొహమాటపడుతునే గీత దగ్గిరొచ్చి కూర్చున్నాడు.
“పెద్దైపోయాడా, హరి? ఇంతుండేవాడు” దోసిలి కొలత చూపించి నవ్వుతూ ప్రేమగా అడిగింది గీత. అప్పటిరోజులు గుర్తొచ్చాయి. తప్పటడుగులు వేస్తూ, మయూతో పోటీగా తమ కాళ్ళకి అడ్డంపడటం, ఇద్దరూ చెరొకళ్ళనీ ఎత్తుకోవడం మనసులో కదిలింది. పాత ఆల్బమ్స్ తీసుకొచ్చి ఇద్దరి ఫోటోలూ చూపించింది. అతను వాటిని తన ఫోన్లోకి తీసుకున్నాడు. గీత చెరోవైపూ నిలబెట్టి పట్టుకోవడం, కూర్చోబెట్టుకోవడం, వాసు చెరోచేత్తోటీ ఎత్తుకోవడం, వాళ్ళ నవ్వుమొహాలూ చూసి ఆశ్చర్యపోయాడు. స్వంతకొడుకుతో సమానంగా అంత ప్రేమగా చూసారా, వీళ్ళు అని.
“మిమ్మల్నేమని పిలవను? నాకు అత్తలూ మామయ్యలూ వున్నారు. వాళ్ళలో కలిపేసుకోనా?” అడిగాడు. “అమ్మమ్మ, తాతయ్య మిమ్మల్ని బాగా
గుర్తుచేసుకునేవారు. అమ్మమ్మకైతే మీ పేరే జపం. మీగురించి చాలా చెప్పేది. చిన్నప్పుడంతా మీయింట్లోనే పెరిగానట. మీదగ్గర్నుంచీ రానని ఏడ్చేవాడినట” అన్నాడు.
“అది ఆవిడ అభిమానం. అంతే నాన్నా!” అంది గీత. తనున్న రెండురోజులూ వీళ్ళతో కలిసిపోయాడు. వాసుతో మాట్లాడటం, ముగ్గురూ కలిసి తిరగడం, ఆడటం సరదాగా అనిపించింది. ఎప్పుడూ పెద్దగా నవ్వుతూ జోక్సేస్తూ వుండే మాధవ్ మరో ఆకర్షణ. వారాంతం అవగానే మయూ, హరీ వెళ్ళిపోయారు. విహీ వచ్చివెళ్ళాడు. తర్వాత శివుడు తల్లిదండ్రులని తీసుకుని వచ్చాడు. అభిషేకం చేయించి, అభిషేకజలం విబూధి తెచ్చారు.
గీతనీ, వాసునీ పీటలమీద కూర్చోబెట్టి బట్టలుపెట్టి,
“అమ్మగారూ! ఇద్దరూ పార్వతీపరమేశ్వరుల్లా చిరకాలం వుండాలి” అని దీవించారు.
తండ్రీకొడుకులు రుద్రం, నమకం, చమకం చదివారు. కొద్దిరోజుల్లో బైటికి వెళ్లబోతున్నాడు శివుడు. వాళ్ళు వెళ్ళాక సేతు వచ్చాడు. సేతుకి తన భయాలు చెప్పి,
“అరేయ్, ఇవన్నీ మా వ్యవహారాలు. పోలీసుకేసు పెట్టాం. మీకు సంబంధం లేదు. క్రికెట్ బేట్లూ, హాకీస్టిక్‍లూ పట్టుకుని రెడీ ఐపోవడానికి ఇది కాలేజిగ్రౌండు కాదు, మీరు స్టుడెంట్స్ కాదు. గొడవలకి తయారైపోకండి. మయూకి చెప్పు. వాడి ముమెంట్స్ కనిపెట్టు. అన్నీ ఇద్దరూ చెప్పుకుంటారుగా? అవంతీపురం బయల్దేరితే ముందు నాకు ఫోన్ చెయ్యి” అని హెచ్చరించాడు వాసు.
“పర్సనల్ ఎక్స్పీరియెన్సా?” అడిగాడు సేతు మిశ్చివస్‍గా.
“కొట్టానంటే” చెయ్యెత్తాడు వాసు. అతను నవ్వేసాడు.
“మయూ ఒక్కడేకాదు, జరిగినవాటికి అందరం ఒక్కలా బాధపడుతున్నాం మయూస్‍డాడ్! లీగల్‍గా వెళ్లడమే మంచిది. మయూకి మేం చెప్తున్నాం” అన్నాడతను.
అందరూ అమెరికా అవకాశాలకోసమే ఎదురుచూస్తున్నారు. శివుడికి వున్న వెసులుబాటు సేతుకి లేదు. తల్లిని దగ్గరపెట్టుకోలేకపోయాడు. ఆవిడ వెనక తండ్రీ, ఆయనవెనక రెండోఆమే తయారయ్యారు. ఆ ఆలోచన మానుకున్నాడు సేతు. తల్లికి సదుపాయాలు చేసినా వాటిని ఆ రెండోఆమెతో పంచుకోవలసిన పరిస్థితి. ఐనా చేస్తున్నాడు. ఆ బాధకి అలవాటుపడిపోయాడు. వాసు, గీతల దగ్గిరే అతనికి సంతోషం దొరుకుతుంది. జీవితాన్ని ముందుకి నడిపించే శక్తినిస్తుంది.
కృతజ్ఞత చూపించబోయినా,
“యూ డిజర్వ్ ఇట్” అంటాడు వాసు. “తెలివైనవాడివి. తెలివిని వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. ఎక్కడినుంచీ, ఎవరిచ్చారనేవి ఆలోచించక్కర్లేదు” అనేది గీత జవాబు.
దామోదర్ వచ్చాడు. “అన్నా, కోలుకున్నావు! చాలా సంతోషంగా వుంది. మిగతావాళ్ళుకూడా వీలుచూసుకుని వస్తామన్నారు. ఇప్పటికీ ఆరోజు జరిగినదానికి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నీవెంట ఇంటిదాకా మేం వచ్చుంటే బావుండేది. ఏవైనా ప్రమాదాలు తప్పినతర్వాతే చేసిన తప్పులు కనిపిస్తాయి” అన్నాడు.
“అదేం లేదురా! ఆరోజు మీరున్నారని వదిలిపెట్టేసి మరోరోజు వెతుక్కునేవారు. చెయ్యాలనుకున్నవాడిని ఎవరూ ఆపలేరు” వాసే నచ్చజెప్పాడు.
రామస్వామి, మంజుల వచ్చారు. వారంరోజులుండి వెళ్ళారు. స్నేహం స్నేహమే. దాన్ని పక్కనిపెడితే రామస్వామి తను చేసినదానికి పైసకిపైస కిట్టించుకుని తీసుకునే మనిషి. ముంబైలో వీళ్ళున్నారు, తిండికీ, వసతికీ లోటుండదుకాబట్టి ముంబై చూడచ్చని వచ్చాడు. సిటీ అంతా చూపించారు వాసు, గీత. వెళ్ళేముందు ఇద్దరికీ బట్టలు పెట్టి పంపింది. అతనితో వాళ్ళకి యింకా చాలా పనుంది. వాసుకీ మాధవ్‍కీ ఇలాంటివి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఎవరో ఒకరు రావడం, రెండురోజులుండి వెళ్లడం, వారాంతాల్లో అందరూ కలిసి బైట తిరగటం, మిగతారోజుల్లో వాసు, గీత ఇద్దరే వెళ్లడం ఇన్ని వ్యాపకాలతో రోజులు చులాగ్గా దొర్లిపోతున్నాయి.


వరల్డ్‌టూర్‍కి టూరిస్టుగ్రూపుతో లీల, వీణ వెళ్ళారు. శేఖర్ వెళ్ళలేదు. ఆయనకి వెళ్ళాలనిపించలేదు. జరుగుతున్న పరిణామాలు చాలా బాధపెట్టాయి. వాసుని కొట్టించడంలో వీణ ప్రోద్బలం వుందేమోనన్న అనుమానం ఆయనకి తీవ్రమైన దు:ఖాన్ని కలిగిస్తోంది. ఇప్పుడంటే దూరంగా పంపించేసాడు కొడుకు, తిరిగొచ్చాక ఆమె జీవితం, భవిష్యత్తూ ఏమిటన్న ప్రశ్నలు పగలూ రాత్రీ తినేస్తున్నాయి. వాసునింక వదిలిపెట్టదా? ఇలా వెంటపడి తిరుగుతుంటుందా? అన్న, వదిన తిరిగొచ్చారట. ఏమొహం పెట్టుకుని వాళ్లని చూడటానికి వెళ్తాడు? రవి తిరిగొచ్చాక పెద్దపంచాయితీ పెడతాడు. వదిలిపెట్టడు. ఇంకో నెల వుందేమో వాడు రావడానికి?
“బాగా దెబ్బలు తగిలాయట బావకి. మాధవ్ వాళ్ళిద్దర్నీ ముంబై తీసుకెళ్ళిపోయాడు. రాణామీద కేసు పెట్టారు. వాడు వీణ పేరెత్తుతాడేమోనని భయంగా వుంది. ఇది మొదలుపెట్టింది, వాడు పూర్తిచేసాడు. ఇక్కడితో ఆగుతాడో లేదో తెలీదు. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందో, ఇదేమైనా ఎగేసి డబ్బిచ్చిందా అనేది తెలీడంలేదు. చాలా డ్రాచేసింది. ఏం చేసావంటే బ్లాక్‍మెయిలర్స్‌ అడిగితే యిచ్చానంది. అందులో నిజమెంత? వాళ్ళకి వాసు వివరాలిచ్చి కూర్చుంది” అన్నాడు సంతోష్.
“పూనా క్రైమ్‍లోంచీ బైటపడింది చెల్లి. దాన్ని కాస్త దయగా చూస్తే బావుండేది. మీ అమ్మకీ, అమ్మమ్మకీ నేను చెప్పింది అర్థం కాలేదు. దాని వంటిన ఆ మనుషులింకా వేలాడుతున్నట్టు అసహ్యించుకున్నారు. కన్నతల్లేకదా? ఒక్కసారికూడా దగ్గిరకి తీసుకోలేకపోయింది లీల. పైకి చెప్పకపోయినా తెలుస్తాయిరా! నాకే తెలిసినప్పుడు దానికి తెలీదా? ఆ బాధని భరించడంలో దాని మనసు వంకరతిరిగింది. అక్కర్లేని గొడవలన్నీ తెచ్చిపెట్టుకుంది. అందరిముందూ దోషులుగా నిలబడ్డాం. ఎవరికీ మొహం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నాం. ఎవరూ సాయంచెయ్యడానికి ముందుకి రారు. ఇప్పుడు వీణ పరిస్థితేంటిరా? ఈ టూర్నించీ వస్తారు. తర్వాత?” అడిగాడు శేఖర్.
“ఫోకస్ వీణమీద కాదు, దానిచుట్టూ వుండాల్సిన ప్రపంచంమీద పెట్టాలి. ఇప్పుడది సరైనచోట వుంది. కొత్తపరిచయాలౌతాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. కనీసం మొదలౌతాయి. కొంచెం మారి, నా భార్యతో సఖ్యతగా వుండగలిగితే నాదగ్గిరకి కొన్నాళ్ళు తీసుకెళ్తాను. లేకపోతే మారేదాకా తిప్పుతునే వుంటాను. అలా గాల్లోనే వుంటుంది. దాని అకౌంట్లోంచీ డబ్బు తీసేసాను. అదంతా అయేదాకా ఖర్చుపెడతాను. ఇక్కడుంటే దానికి చిల్లిపైసా యివ్వను. కారు వుంచను. లగ్జరీలేవీ వుండవు. మీకుకూడా డబ్బు పంపను. జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోండి. వాసు వెంటపడటం మాలో ఎవరికీ నచ్చలేదు. వాడిని మర్చిపోతేనే అది నాకు చెల్లెలు. అప్పటిదాకా అంతే. వీడియోలు, తోటిటూరిస్టులతో పాడ్‍కాస్టులు చెయ్యమన్నాను. ఎక్విప్‍మెంటు ఇచ్చాను. రవళి ఇచ్చింది ఈ సలహా. వాళ్ళు అన్ని రాష్ట్రాలూ వెళ్ళారు. అప్పట్లో దానికి ఈ ఆలోచన రాలేదట. వీణ ఛానెల్ పెడితే అందరూ కలిసి ప్రమోట్ చేస్తామని చెప్పింది. ఎవరు ఎంత చెయ్యగలరో అంతే చేస్తారు. వాళ్ళు ఇవ్వగలిగినదాన్ని మించి మనం ఆలోచించకూడదు. ఇల్లు దానికివ్వడంమాట మర్చిపోండి. ఇప్పుడే దానికిస్తే మిమ్మల్నికూడా ఇక్కడ వుండనివ్వదు. ఆ తెలివితేటలూ పుట్టుకొస్తాయి. అడిగిందటకదా తనపేర్న పెట్టమని” అన్నాడు సంతోష్.
“దాన్నిమాత్రం అన్యాయం చెయ్యకు సంతోష్! ఇప్పటికే అన్నీ పోగొట్టుకుంది. నిన్నొక్కడినే నమ్ముతోంది” అన్నాడు శేఖర్. ఆయన మెతకతనానికి కోపం వచ్చిందతనికి.
“నేను మోసం చెయ్యకుండా వుండాలంటే ముందు మీరు నన్ను మోసంచెయ్యకుండా వుండాలి. చెప్పింది చెయ్యాలి” కటువుగా అన్నాడు.
అతను మరోవారానికి యూయస్ వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు కారు అమ్మేసాడు. ఇంటి కాగితాలు తనదగ్గిరే పెట్టుకున్నాడు. శేఖర్ని ఒక నెలకి ప్రకృతి ఆశ్రమంలో చేర్చాడు.
వీణ ట్రావెల్‍గ్రూపులో వున్న ఇద్దరమ్మాయిలు అవంతీపురంకోటగేలరీలో కొన్ని పెయింటింగ్స్ కొన్నారు. వాళ్ళది వైజాగ్. భాగ్యనగరం చూసి, టూర్‍కి బయల్దేరారు. కొన్న పెయింటింగ్స్‌లో ఒకటి గీతది. డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్‍ని తెచ్చి, ఇంకొందరికి చూపించి దానిగురించి చర్చిస్తున్నారు. జీవీడీ అన్న మాటలు విని వీణ తనూ పెయింటింగ్ తీసుకుని చూసింది. లీలా చూసింది.
నదీ, నది వొడ్డుని అంతర్వీక్షణంలో వున్న ఒక యువతి. ఆమెలోపలి భావాలు రూపుదిద్దుకుని, లీలగా కనిపిస్తున్నట్టు కొన్ని రేఖలు. అవి సూచించే అస్పష్టమైన ఒక పురుషాకృతి.
“ఆర్టిస్టు తన వివరాలేవీ బైటికి చెప్పద్దన్నారట. ఆడో మగోకూడా తెలీదు. వాళ్ళవి చాలా పెయింటింగ్స్ వచ్చాయి. ఇంకా కేటలాగ్ చెయ్యలేదు. ఎంతో రిక్వెస్టు చేసి ఇదొక్కటీ చేయించుకుని కొనుక్కుని వచ్చాము. అన్నీ కొనేసుకోవచ్చు. కానీ పెట్టాలంటే ఏ రాజమహలో వుండాలి” అంది ఆ పెయింటింగ్ కొనుక్కున్న అమ్మాయి.
వీణ దాన్ని తిరిగిచ్చేసింది.
“గీతా వాసుదేవ్” నెమ్మదిగా తల్లివైపు తిరిగి అంది.
లీల ఆశ్చర్యంగా చూసింది.
“గీతకి చదువు, వుద్యోగం, డబ్బు, వ్యాపకాలు అన్నీ వున్నాయి. పిల్లల్నికూడా కనేసాక, ఇన్నిటిమధ్య వాసుకి స్థానం ఎక్కడుందో తెలీదు. నాకోసం పక్కకి తప్పుకుంటుందని ఆశపడ్డాను. ఇంకా స్వేచ్ఛదొరుకుతుందికదా?” అంది.
ఆవిడ సుదీర్ఘంగా నిశ్వసించింది.
“వీణా! నీ పిచ్చిమాటలు వదిలేసి నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వక్కడ వుండటం, వాసునీ గీతనీ ఇబ్బందిపెట్టడం ఎవరికీ నచ్చలేదు. ఇద్దరూ ప్రస్తుతం ముంబైలోవున్నా, వాళ్ళ వుద్యోగాలు, ఆస్తులు ఇక్కడున్నాయి. మళ్ళీ తిరిగొస్తారు. నువ్వు నీ ఆలోచనలు మార్చుకోకపోతే నీ డబ్బంతా అయ్యేదాకా ఇలా గాల్లో తిప్పాలని నిర్ణయించుకున్నారు ఆ కోతివెధవలంతా. అందులో సంతోష్ ముందుంటాడు. ఈ ట్రిప్పుకి ఖర్చు వాడు పెట్టుకున్నాడు. చెప్పినట్టు వినకపోతే తరువాతి ట్రిప్‍నుంచీ నీ డబ్బేవాడటం మొదలుపెడతాడు. నీ అకౌంట్లో వున్నదంతా డ్రాచేసేసాడు. అంటే నాన్న పెన్షను, కొద్దిపాటి డిపాజిట్లమీద వచ్చే వడ్డీతప్ప మనకి మరేదీ వుండదు. నీకు తెలుసుకదా, మనకి పెన్షను చాలా తక్కువొస్తుంది” అంది.
కొద్దిసమయం పట్టింది వీణకి అర్థంకావడానికి. ఏమీ మాట్లాడలేదు. డిన్నరయ్యాక దగ్గర్లో మాల్‍లో షాపింగ్ చేసారు చాలామంది. వీణ ఏమీ కొనలేదు. నిరాసక్తిగా తిరిగింది. మళ్ళీ హోటల్ రూమ్‍కి వచ్చాక లీల మంచంమీద వొరిగితే తనుమాత్రం కిటికీదగ్గిరకి కుర్చీ జరుపుకుని బైటికి చూస్తూ కూర్చుంది. కూతురికి తను స్నేహితురాలిగా ఎలా వుండాలో అర్థమవ్వలేదు లీలకి. ఇంత వండి పెట్టి, తిన్నారా లేదా అని చూసుకుని కావలిసినవి కొనిపెట్టడంతప్ప పిల్లల్తో పెద్ద ఆత్మీయంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంట్లోనైతే మూడుపడగ్గదులూ, హాలూ వున్నాయి. ఇక్కడ ఒక్కగదిలో ఇద్దర్నీ వుంచుతున్నారు. ఎదురెదురుగా వున్నా మాటలు పుట్టట్లేదు. కూతురు కాపురం చెడి తిరిగొస్తే ఇంత తిండి పెట్టి చూసుకుంటే చాలనుకుంది. డబ్బుంది, సాగిపోతుందనుకుంది. ఏం మాట్లాడాలి దీనితో? ఉక్కిరిబిక్కిరైంది.
వీణ తన ఫోన్ తీసుకుని చూసుకుంది. ఫాక్టరీ సెట్టింగ్స్‌తో నిర్జీవంగా మారిపోయింది. తనింట్లోని ముగ్గురివీ, టూర్ ఆర్గైనైజర్‍దీ తప్ప మరే నెంబర్లూ లేవు. ఎవరితోటీ మాట్లాడకపోయినా ఆ నెంబర్లు, పేర్లూ చూస్తుంటే వాళ్లంతా తనకి వున్నారన్న నమ్మకం వుండేది. తల్లి ఫోన్లోంచీకూడా ఇటువైపువాళ్ళ నెంబర్లన్నీ తీసేసాడు సంతోష్. వంటరితనం, నిద్రరానిరాత్రులు, నిద్రమాత్రలు, భయంకరమైనఆలోచనల వలయం మళ్ళీ మొదలౌతుందనిపించింది. అపరిచితవ్యక్తుల స్పర్శ తన వంటిమీద. వాళ్ల చర్యల అవశేషాలు తనవంట్లో. తనని ఆలంబన చేసుకుని, జరిగినవాటికి సాక్షీభూతంగా మారబోయిన ఒక ప్రాణి. బలంగా తల విదిలించింది. పెద్దచదువు చదువుకుందన్న జ్ఞానాన్నీ, విజ్ఞతనీ, సభ్యతాసంస్కారాలనీ మింగేసిన అనుభవాలు. ఇప్పటికి మూడు బతుకులయ్యాయి. నాలుగోది మొదలుపెట్టాలి. వీల్‍చెయిర్‍కి చెరో చక్రంలా అమరివున్న గడవని కాలాన్నీ, వదలని జ్ఞాపకాలనీ తోసుకుంటూ బతకాలి. ఈ వంటరితనం భరించలేక వాసుని చేసుకోవాలనుకుంది. చేస్తున్నదేంటో తెలిసే, స్పష్టమైన తెలికిడితోటే చేసింది. అంతకన్నా మరోమార్గం లేక చేసింది.
వాళ్ళంతా ఒకటి. సంతోష్ వాళ్ళలో ఒకడు. తనకి అన్న అనుకుంది. ఇక్కడ జరుగుతున్నవన్నీ అక్కడ అందిస్తున్నాడు. గీత వాడి తోబుట్టువు. తనుకాదు. తనని మోసంచేసాడు. వాడి సుఖం వాడు వెతుక్కున్నాడు. తన డబ్బు లాక్కున్నాడు. ఇచ్చినట్టే యిచ్చి, కంఫర్ట్సన్నీ వెనక్కి తీసేసుకున్నాడు. వాడి మాట వింటేనే తిరిగిస్తాడట. వాడు తిరిగిచ్చేదేంటి? గుండెల్లో సన్నటిమంట మొదలైంది. కళ్లలో నీళ్ళు ధారాపాతంగా కారడం మొదలుపెట్టాయి. తుడుచుకుంది.
ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఏమీ తెలీనితనం, ద్రోహం, మోసం, కోపం, నిస్సహాయతలాంటి అనేక వుద్వేగాలమీద దాదాపు రెండుగంటలు మాట్లాడి రికార్డుచేసింది. చదుకున్న చదువు, చక్కటి భాష అన్నీ పునరుత్థానం చెందాయి. దాన్ని సంతోష్‍కి పంపించి అతని నెంబరు తన ఫోన్లోంచీ, తల్లి ఫోన్లోంచీ బ్లాక్ చేసింది. అప్పటికే లీల పంపించిన వీడియోలు యూట్యూబులో పెట్టాడు. ఇప్పుడీ ఆడియోనికూడా జాగ్రత్తగా ఎడిట్ చేసి, పర్సనల్ విషయాలు లేకుండా చూసి, ఎంపతీ అనే పేరుతో అప్‍లోడ్ చేసాడు.
తెల్లారేలోగా మరో మూడుగంటలుకూడా రికార్డు చేసి అన్‍బ్లాక్ చేసి పంపించి, మళ్ళీ మర్చిపోకుండా బ్లాక్ చేసి నిద్రపోయింది.


మయూ విషయం తండ్రికి చెప్పాడు హరి.
“నీ ఫ్రెండుకి ఒక సమస్య రాగానే నా దగ్గిరకి వచ్చావు. పదవి, రాజకీయాలు మన దైనందిన విషయాలనికూడా ప్రభావితం చేస్తాయని మీ యువత మర్చిపోతున్నారు. ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్స్ తెచ్చుకోవడంతో సరిపెట్టుకుంటున్నారు. అందరూ కార్పొరేట్ జాబ్స్ వెతుక్కుని చేరిపోతే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరు సాయంచేస్తార్రా? కనీసం ఇప్పుడేనా అర్థమైందా? ఇంజనీర్లొక్కరే చాలరు సమాజానికని? సివిల్స్ రాస్తావా? ఏసీ రూమ్‍లో కూర్చుని కంప్యూటర్ టకటకలాడించే వుద్యోగం బానే వుంటుంది. సోషల్ రెస్పాన్సిబులిటీ ఎవరూ తీసుకోకపోతే మీ తరం గడిచేసరికి సమస్యలు తప్ప పరిష్కారాలుండవు. మీ సమస్యలు పట్టనివాళ్ళు ఆ పొజిషన్స్‌లో కూర్చుంటారు” అన్నాడు భరత్.