ఝరి 131-140 by S Sridevi

  1. ఝరి 101-110 by S Sridevi
  2. ఝరి 111-120 by S Sridevi
  3. ఝరి 121-130 by S Sridevi
  4. ఝరి 131-140 by S Sridevi
  5. ఝరి 141-150 by S Sridevi
  6. ఝరి 151-160 by S Sridevi

(“ఇంత వివరంగా తెలీదుగానీ, కొన్ని విషయాలు అమ్మ చెప్పింది”
“ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి. ఎవరికి వున్నవి వాళ్ళు తినాలి. ఆయనకి యిల్లు లేనిమాట నిజమే. ముగ్గురల్లుళ్ళం వున్నాం, నడిరోడ్డుమీద వదిలేస్తామేంట్రా? ఏదో ఒకదారి చూపిస్తాం. ఎవరింట్లో వచ్చి వుంటే ఎవరు కాదంటారు? అలా సర్దుకుని వుండటంకాదు, ఆయనక్కావలిసింది, పెత్తనం కావాలి”
“అరేయ్, ముగ్గురు కూతుళ్ళూ చక్కగా స్థిరపడ్డారు. ఇంకేం కావాల్రా, ఆయనకి?”’ వింతగా అడిగాడు సుమంత్.)


“అదే పెద్ద సమస్యైపోతుంది కొన్ని జీవితాలకి. ఉన్న సమస్యలు తీరిపోతే కొత్త సమస్యలు వెతుక్కుంటారు. అవి లేకుండా బతకలేరు” అన్నాడు ప్రహ్లాద్. కొద్దిసేపు మౌనం తర్వాత తనే మళ్ళీ అన్నాడు ప్రహ్లాద్. “ఇక్కడ వాసూవాళ్ళకి అద్దె లేదు, మాధవ్ అక్కడ అద్దె కడుతున్నారు. ఇక్కడి యిల్లు అద్దెకిచ్చేలా లేదు. ఇదిప్పుడు కొత్తసమస్య. పెద్దనాన్న డబ్బుకి లెక్కలు కావాలి. వాసు ఎంత తింటున్నాడో తెలియాలి. అక్కడికీ వీళ్ళకి బియ్యం పంపిస్తాడు వాసు. ఎంతోకొంత డబ్బు సర్దుతాడు. నువ్వే చూసావుకదా, పిల్లాడికి స్థలం చదివించాడు. కానీ వీళ్ళకి సంతృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి. ఆ ఏమిటో ఏంటంటే గీత. తనలా వుండకూడదు. వీళ్ళలా పనీపాటా లేకుండా చదివిన చదువుకూడా మర్చిపోయి, గాలికబుర్లు చెప్పుకుంటూ తిరగాలి. అలా వుండదుకాబట్టి వీళ్ళకి వెటకారం. వాళ్ళ వుక్రోషం తనమీద చూపిస్తారు. వాసునితప్ప గీత యింకెవరినీ పట్టించుకోదు. అది మరోకోపం. వాళ్ళది ప్రేమకాదు, అన్యోన్యత కాదు, ఇంకేదో. ఇద్దరినీ భూమ్మీద పెడితే పంటలుండవు, ఆకాశంలో పెడితే వానలుండవని హేళన. ఒకళ్లని తిట్టుకుంటూ ఎంతకాలం బతుకుతాంరా? మన బతుక్కి మనకి ఒక గోల్ వుండక్కర్లే? ఎంతసేపూ అవతలివాళ్ల జీవితాల్లోకి తొంగిచూడటమే మన జీవితధ్యేయమైతే ఎలా? అరేయ్, ఇదేదో ముదిరి, వాసూమాధవ్‍ల మధ్య గొడవలు రాకముందే ఒక పరిష్కారం చూడాలి”
“పెద్ద ఆలోచనకేం వుందిరా? ఓరోజు అందరం కూర్చుని మాట్లాడుకుందాం. ఇల్లు ఆమ్మది. ఆవిడకి బాధ కలగకుండా జరగాలి ఏది జరిగినా. నలుగురు మనుషులు, నాలుగు వాటాలు. ఇంటికి ధర కట్టించి ఇల్లెవరికి కావాలో వాళ్లని మిగిలిన యిద్దరికీ డబ్బిచ్చ్చెయ్యమంటే సరిపోతుంది. ఆమ్మ అక్కడే వుంటుంది. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఆవిడ మంచీచెడూ చూసుకుంటారు” అన్నాడు సుమంత్. ప్రహ్లాద్ తలూపాడు.
“అరేయ్ ప్రహీ, ఈ కాసేపట్లో మూడు కాల్చావు. మంచిదికాదు. దేనికిరా, నీకంత టెన్షను? పెళ్ళికిముందు ఎలా పెరిగిందో వదిన యిప్పుడూ అలానే వుంటుంది. అంతేననుకుని వదిలేసెయ్యాలి. మనకి కొత్తగానే వుంటుంది. అలవాటుపడాలి. ఇంట్లో తనకి తోచినట్టు తనుంటుంది. నువ్వు బైట బిజీ అవ్వు. కెరీర్‍మీద దృష్టిపెట్టు. స్పేసెస్ విడగొట్టుకోవడం మంచిది. కాన్ఫ్లిక్ట్ లేకుండా కాపురాలుండవు. ఏ ఇద్దరు మనుషులూ ఎలాంటి గొడవాపడకుండా ఎప్పటికీ ఒకేలా కలిసి వుండలేరు. ఇది సర్వసాధారణమైన విషయం. అలాగని అందరి గొడవలూ ఒక్కలా వుండవు. ఇలానే వుండాలని జెనరలైజ్ చెయ్యలేం. వాసూ గీతలు ఎక్సెప్షనల్. అదలా ఒక పరిమళంలా వాడిలో కలిసిపోయింది. అలా వుండేవాళ్ళు చాలా అరుదు. మనింట్లో అందరం డౌన్ టు అర్త్ పెరిగాం. పదకొండుమందిమి ఇన్నేళ్ళు కలిసి తిరిగాంకాబట్టి ఆడ, మగ మనస్తత్వాలు అవగాహనకి వచ్చాయి. నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు ఇండివిడ్యువాలిటీ సిండ్రోమ్‍తో బాధపడతుంటారు. తల్లిదండ్రుల దగ్గిర రాని సమస్య భర్తదగ్గిర వస్తుంది. మగవాడికికూడా ఇండివిడ్యువాలిటీ వుంటుంది. దాన్ని గుర్తించరు. ఎన్నో ప్రేమలు, ఎన్నో బ్రేకప్‍లు చూసాం. చేసుకున్న పెళ్ళిళ్ళుకూడా నిత్యకలహాలతోనే నడుస్తుంటాయి. లతతో నాకూ సమస్యలుంటాయి. డబ్బున్న యింట్లో ఒక్కర్తే పిల్లగా పెరిగింది. సర్దుకోవడం రాదు. పనీ రాదు. మా రెండుంపావు మనుషులకీ వంటమనిషీ, పనివాళ్ళూను. ఆమె పెరిగిన తీరు అది. బజార్నపెట్టుకుంటే ఏం వస్తుంది? మనకి అమ్మానాన్నల గౌరవం ఎంత ముఖ్యమో, భార్యాపిల్లలతో కలిసిన సామరస్యమైన జీవితంకూడా అంతే అవసరం. ఒకటి ప్రాముఖ్యతా, మరోటి అవసరం. ఈ తేడా గుర్తుంచుకో. అమ్మావాళ్లతో కలిసుండి గొడవలుపడటంకన్నా విడిగా వుండటం మంచిదనిపించింది. వేరే వచ్చేసాం. మూడిళ్లమధ్యా తిరుగుతూ వుంటాం. వదిన్నికూడా స్టడీ చెయ్యి. తనలో వుండే సామరస్యమైన అంశాలేమిటో వెతికిపట్టుకో” అన్నాడు సుమంత్.
అదంత తేలికకాదని అనిపించినా, ఇంకోవైపునించీ ప్రయత్నించే ఆశ చూపించాయి ప్రహ్లాద్‍కి అతని మాటలు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. సుమంత్ ఇంకెవరి దగ్గిరో వెళ్ళి కూర్చుంటే మాధురి వెతుక్కుంటూ వచ్చి భర్త పక్కని కుర్చుంది.
“ఏం మాట్లాడుకున్నారు, ఇంతసేపూ?” అడిగింది కుతూహలంగా.
లతకూడా సుమంత్‍ని ఇలాగే అడిగిందా అనే సందేహం వచ్చిందతనికి. అలా అడగడం సుమంత్‍కి పెద్దసమస్య కాకపోవచ్చు. సమస్యలకిలాగే అయిష్టాలకికూడా పోలికలుండవు.


కొన్ని ప్రశ్నలకి జవాబులు నిగూఢంగా వుంటాయి. దాక్కుని వుంటాయి.
కర్మ పూర్తై ఎక్కడివాళ్లక్కడికి వెళ్లిపోయారు. మాధవ్, నీలిమా ఇంకా వెళ్ళలేదు. ప్రయాణపు ఏర్పాట్లలో వున్నారు. ఇల్లంతా వెల్తిగా వుంది. యాంత్రికంగా ఆఫీసుకి వెళ్ళి వస్తున్నారు భార్యాభర్తలిద్దరూ. విజ్జెమ్మ కూతురికి తోడుగా వుండిపోయింది.
ఆ గదిలో తండ్రి వున్నట్టే అనిపిస్తోంది వాసుకి. అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఎన్నో ప్రశ్నలు, ఆయన ప్రవర్తనకి సంబంధించి. మొదట్లో బాగానే వుండి, ముగ్గురు పిల్లలని కన్నాక అంత హఠాత్తుగా యిల్లొదిలిపెట్టి వెళ్ళేంతగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఎవరితోటీ కలవకుండా కుటుంబాన్నించీ తనని తను వేరుపరుచుకోవడం దేనికి? ఎంత భక్తైనా, మనిషిని సమూహాన్నించీ అంతదూరం తీసుకెళ్ళదు. భార్యాపిల్లలని, కనీసం భార్యని తనతో తీసుకెళ్ళే ప్రయత్నం చేయిస్తుంది. అమ్మనికూడా దూరంగా ఎందుకు జరిపేసారు? మిగతావాళ్లందరి జీవితాలూ వాళ్ళవాళ్ల నాన్నలతో పెనవేసుకుని ఎంతందంగా వుంటాయి? చదువులో ముందుకి వెళ్తున్నకొద్దీ సుధీర్ని వాళ్ల నాన్న ఎంత ప్రేమగా చూసేవాడో! సరిగ్గా తన చదువు ముందుకి సాగాల్సిన కీలకమైన సందర్భంలో తమ జీవితాల్లో తుఫాను మొదలైంది. పధ్నాలుగేళ్ళు తనకి. తండ్రి యిల్లొదిలేసి వెళ్లిపోయాడు. వెతికి తీసుకొచ్చి ఇంటికీ ఆఫీసుకీ కట్టేసారు. ఆయన్ని తీసుకొచ్చినరోజు ఇంట్లో పిల్లాపెద్దా అందరూ వున్నారు. పిల్లలంతా ఆటల్లో వున్నారు. తాము వెళ్లలేదు.
పెద్దవాళ్ల విషయాలు మీకెందుకు, వెళ్ళి ఆడుకోండి అవతల – అని ఎవరూ పంపించలేదు. వ్యవహారంలో తమనీ భాగస్తులని చేసారు.
“ముగ్గురు పిల్లల్తో ఆడదాన్ని వదిలేసి వెళ్తావా? ఏ గంగలో దూకమంటావు దాన్ని? లక్ష్మి అన్నకేం వుందని యింత కుటుంబాన్ని తీసుకెళ్ళి పోషిస్తాడు? అదే మందోమాకో మింగుతుంది. నుయ్యోగొయ్యో చూసుకుంటుంది. పో, నీ పిల్లలని నీతో తీసుకెళ్ళిపో. అందరూ కలిసి రోడ్డుమీద పడి, గెడ్డాలూ మీసాలూ పెంచి, కాషాయం కట్టి, చిలుం తాగుతూ బతకండి. మిగిలింది ఆడపిల్ల, తులసి. దాన్నేదో పెంచి పెద్దచేసి, ఎవడ్నో ఒకణ్ణి తలకి మాసినవాడిని తీసుకొచ్చి ముడిపెడతాం. నీ కుటుంబం నీకే పట్టనప్పుడు మాకేంట్రా?” అని తిట్టింది మామ్మ. తండ్రికి తమందరి భవిష్యత్తూ కళ్లముందు పరిచిచూపించింది. ఆవిడలా తిడుతుంటే తమ్ముడినీ చెల్లెలినీ చూసి తనకి గుండెల్ని మెలిపెట్టేసినట్టైంది. ఇద్దర్నీ దగ్గిరకి తీసుకుని నిలబడ్డాడు.
“నీకేం కష్టం వచ్చిందని? నీతోటివాళ్లని చూడు, భార్యాపిల్లలని ఎంత బాగా చూసుకుంటున్నారో! లక్ష్మి పన్నెత్తి ఒక్కమాటకూడా అనే మనిషికాదు. కట్నం అక్కర్లేదని కోరి చేసుకున్నాం. ఇలా దాన్ని నట్టేట ముంచడానికా? నిన్ను చూసుకునేకదరా, నీ యిద్దరక్కలూ నేనూ బతుకుతున్నది? మగదిక్కులేని కుటుంబమైపోతోంది. ఏం దారి చూపిస్తావురా, మాకందరికీ?” అని పెద్దగా ఏడ్చింది. తల్లి మరోపక్క ఏడుస్తూ కూర్చుంది. అత్తలుకూడా తండ్రిని పట్టుకుని ఏడ్చారు. ఎవరెవరో వచ్చి హితవుచెప్పారు. ఎవరి మాటలు, ఎవరి కన్నీళ్ళు ఆయన మనసు మార్చాయో ఔట్‍హౌసులో వుంటూ తన బతుకు తను బతడానికి వప్పుకున్నాడు. ఉద్యోగానికి వెళ్తానన్నాడు. జీతం తెచ్చి యిచ్చేవరకే తన బాధ్యతని హద్దుగీసుకున్నాడు. ఎవరేనా తన గదిలోకి రావడానికిగానీ, తన విషయాల్లో తలదూర్చడానికిగానీ ప్రయత్నిస్తే తనదారి తనదేనన్న బెదిరింపుతో యింట్లో వున్నాడు.
ఆయన్ని గౌరవించాలా, తిరగబడాలా అనే ప్రశ్న తనలో తలెత్తింది కొన్నాళ్ళకి.
అప్పటికి గీత తనకి చాలా సన్నిహితంగా వచ్చింది. వాళ్ల నాన్నతో తరుచుగా తమింటికి వచ్చేది. మరదలు, తనకేదో ఐపోతుందని కాదు, చక్కటి స్నేహితురాలు. తన కోపాన్నీ ఆవేశాన్నీ చాలా అదుపులో వుంచింది. తన ఆలోచనలు వింది.
“మీ నాన్నకదా?” చాలా మామూలుగా అంది. “మారతారేమో చూడు. ఆయన అలా వుండటంవలన నీకొచ్చిన కష్టమేంటి? కష్టమే ఐనా వోర్చుకో వాసూ! మామయ్య అలా గడపాలనుకుంటున్నారు. నీకు నచ్చినట్టు నువ్వుండట్లేదా? అలాగే. అంతే” లోతైన మాటలు. తన తల్లి అన్నట్టు తిక్కా, తింగరీ మాటల్లానే అనిపిస్తాయి. ఆలోచిస్తే లోతు తెలుస్తుంది. నాన్నకదా అన్న ఒక్క ప్రశ్న తన దృక్పథాన్ని మార్చింది. ఆయనతో పరాయితనం, వైరం తొలగిపోయాయి. తండ్రిమీద తిరగబడాలనే ఆలోచనా, దురుసుతనం మానేసాడు. ఆయన జీవితం ఆయనది. ఆయన అలా వుంటున్నప్పుడు తనెలా వుండాలి? బాధ్యతగా. అమ్మకి కష్టం కలగకుండా. మాధవ్‍నీ, తులసినీ జాగ్రత్తగా చూసుకుంటూ. నాన్నకోసం.
కానీ ఆయన ఎందుకలా? ఈ ప్రశ్నకి జవాబు దొరకాలికదా? తల్లి ఎలా భరిస్తోంది ఈ సందిగ్ధాన్ని? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? అసలు ఏం వెతుక్కున్నాడు ఆయన తను చేసే పూజల్లోనూ, చదివే పుస్తకాల్లోనూ?
ఎదురుగా షేల్ఫ్‌లో వందకి పైగా పుస్తకాలు. మూడుజతల బట్టలు- కాషాయ పంచెలు, లాల్చీలు, కండువాలు మడతపెట్టి ఇంకోదాంట్లో పెట్టుకున్నాడు. ఆయన బట్టలు ఆయనే వుతుక్కునేవాడు. ఆరినవికూడా ఆయనే తీసుకోవాలి. ఎవరూ ముట్టుకోకూడదు. కాళ్లకి చెప్పులు వేసుకునేవాడు కాదు. అలానే ఆఫీసుకి వెళ్ళేవాడు. మనవలెవ్వరినీ దగ్గిరకి తీసేవాడు కాదు. ఎప్పుడూ వాళ్లని ఎత్తుకోగా చూడలేదు. ఎన్నోసార్లు చాపిన చేతులని వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు? ఏ డైరీయేనా రాసేవాడా ఆయన? ఏదేనా వుత్తరం వదిలిపెట్టాడా? ఆశ. లేచాడు. తండ్రి వస్తువులని ప్రేమగా తాకాడు. గీత అన్నది నిజం. నాన్నకదా?
నెమ్మదిగా ఒకొక్క పుస్తకం చూస్తూ, పేజీలమధ్య వెతుక్కుంటూ వుంటే కొన్ని గంటలు గడిచాయి. నిరాశగా అనిపించింది. ఇంక వెళ్దామనుకుంటూ వెనక్కి తిరుగుతుంటే కాసేపటికింద కదిపి మళ్ళీ సరిగ్గా పెట్టని పుస్తకాలు కొన్ని టపటప కిందపడ్డాయి. వాటితోపాటు ఒక టాబ్లెట్స్ స్ట్రిప్. అతను చప్పుని వంగి దాన్ని తీసి, పేరుచూసాడు. డాప్సోన్ బిళ్లలు. లెప్రసీకి వాడతారు.
“వాసూ! అర్థమైందికదా?” అన్నట్టు. తల గిర్రుమని తిరిగింది. దిమ్మెరపోయినట్టు అలానే కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలీలేదు.
“ఒక్కడివీ ఇక్కడేం చేస్తున్నావు?” గీత గొంతు అతన్ని బాహ్యప్రపంచంలోకి తీసుకొచ్చింది. “ఎంతసేపు ఇక్కడ ఒక్కడివీ కూర్చుని బాధపడతావు?” మృదువుగా అడిగింది. అతనిచేతిలో మాత్రలు చూసి, “కనిపించిందా? నువ్వు చూడాలనే అక్కడ పెట్టాను. ఎక్కడో ఒకదగ్గిర మనం ఈ విషయం మాట్లాడుకోవడం మొదలెట్టాలికదా?” అంటూ వచ్చి అతని పక్కని కూర్చుంది. అక్కడ కుర్చీలవీ వుండవు. చాపవేసుకుని కూర్చోవడమే.
“గీతా! నీకు తెలుసా?!!” ఆశ్చర్యంగా అడిగాడు.
“కొద్దిరోజులకిందట మామయ్య నన్ను పిలిచి ఒక విషయంలో ప్రామిస్ చేయించుకున్నారు. ఆయనదొక నీలంసంచీ వుంటుంది, తను ఎప్పుడు పోయినా, చనిపోయిన వెంటనే ఎవరూ చూడకుండా, ఎవరికీ కనిపించనిచోట దాన్ని పారెయ్యాలని. లేకపోతే కాల్చెయ్యాలని. వింతకోరిక. ఆయనకి మాటైతే ఇచ్చానుగానీ ఆ పని చెయ్యలేదు. ఆయన ప్రవర్తనకి సంబంధించిన రహస్యం అందులో వుంటుందనిపించి, పక్కని పెట్టి, కర్మంతా అయాక చూసాను. వెంటనే ఆ డాక్టరుని వెళ్ళి కలిసాను. అంటువ్యాధి కాదు, వంశపారంపర్యంగా వస్తుందనేందుకు ఆధారాలేమీ లేవు, భయపడక్కర్లేదని చెప్పారు. పిల్లలకి ఇప్పించే వేక్సినేషన్లలో ఒకటి దీన్నికూడా కవర్‍చేస్తుందట. నీతో ఎలా చెప్పాలో తెలీలేదు” అంది. అతను కదిలిపోయాడు.
“గీతూ! నీకు మనింట్లో చాలా అన్యాయం జరిగింది. నేను నీనుంచీ అన్నీ లాక్కున్నాను. నీతోటివాళ్లమధ్య నీకు సరైన హోదా యివ్వలేదు. గుమస్తా భార్యగా నిలబెట్టాను. ఈరోజుని మన పిల్లల భవిష్యత్తుకూడా ప్రశ్నగా మారిపోయింది” ఆమె వళ్ళో తలపెట్టుకుని ఏడ్చేసాడు. గీతకూడా ఏడ్చింది. ఆ సమయాన ఇద్దరిలో వున్న వుద్వేగం అలాంటిది. కొన్ని వ్యాధులు మనుషులని అలానే భయపెడతాయి.
“ఎంతకీ కనిపించకపోతే ఎక్కడికో వెళ్ళారనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నారు ఇద్దరూను?” అంటూ మాధవ్ వచ్చాడు. ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు. పక్కని కూర్చోమన్నట్టు తమ్ముడికి సౌంజ్ఞచేసాడు వాసు.
“ఏంట్రా, ఇది? మీరిద్దరికన్నా అమ్మే ధైర్యంగా వుంది. మేం వెళ్ళిపోయాక ఇద్దరూ ఈ గదిలో కూర్చుని ఇలా ఏడుస్తూ వుంటారా? అంత అభిమానాలేం మిగిల్చాడాయన?” పక్కని కూర్చుంటూ కోప్పడ్డాడు మాధవ్.
“నీలిమ ఏం చేస్తోంది?” అడిగాడు వాసు.
“ఏం? పిల్లాడితో బిజీగా వుంది. వాడెందుకో తిక్కచేసి ఏడుస్తున్నాడు”
“ఇప్పట్లో ఇక్కడికి రాదుగా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. కంగారుపడటానికేం లేదు. జరగాల్సింది జరిగిపోయింది. ఇంకేదీ జరగకుండా జాగ్రత్తపడటం ఒక్కటే మనం చెయ్యగలిగింది” అన్నాడు వాసు. విషయం చెప్పాడు. అతను నిర్ఘాంతపోయాడు. కాళ్లకింది నేల కదిలిపోయినట్టైంది.
“అలా ఎలా చేసార్రా? ఇల్లొదిలేసి పారిపోతేనూ, ఎవరితోనూ కలవకుండా గిరిగీసుకుని కూర్చుంటేనూ సమస్య తీరిపోతుందని ఎలా అనుకున్నారు? చదువుకున్న మనిషేకదా? మనకి చెప్పి వుంటే ఏం చెయ్యాలో ఆలోచించుకునేవాళ్ళం” అన్నాడు ఆవేశంగా. “మామయ్యకీ అమ్మకీ తెలుసా ఈ విషయం? తెలిసి నీ గొంతెలా కోసారే? మీకిద్దరు, నాకొక్కడు. నీలిమకి తెలిస్తే గోలపెట్టేస్తుంది. వాళ్ల నాన్న మనెవ్వరినీ బతకనివ్వడు. తులసి సంగతి ఏం చేద్దాం? దానికెలా చెప్తాం?” అన్నాడు. ముగ్గురూ చాలాసేపు మాటల్లేకుండా వుండిపోయారు.
“మాధవ్, ఎవ్వరికీ చెప్పద్దు. అత్తకికూడా. ఆవిడ బాధపడుతుంది. ఇంకెవరితోటెనా అంటుంది. నలుగురికీ తెలుస్తున్నకొద్దీ రచ్చ పెంచుకున్నట్టౌతుంది. ఈ విషయం మన ముగ్గురిమధ్యనే వుండాలి. ఉంటుంది. ఏదీ జరగకూడదని ఆశిద్దాం. తులసికి అసలు చెప్పద్దు. వాళ్లింట్లో గొడవలౌతాయి. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోరు. మనుషులు విషయాలు అర్థం చేసుకోవటంలో వాళ్ళుండే స్థానం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇలాంటి విషయం అర్థం చేసుకుని రహస్యాన్ని నిలబెట్టడానికిగానీ, శ్రీధర్‍కి అర్థమయ్యేలా చెప్పడానికిగానీ తులసికి వయసు లేదు. ఇంకొన్నాళ్ళు పోనిద్దాం” అంది గీత.
“ఎంత ధైర్యంగా వున్నావే? నాకైతే ఈ ఐదుగురు పిల్లల్నీ తలుచుకుంటే గుండె నీరైపోతోంది” అన్నాడతను.
“హడలగొట్టకురా బాబూ, నీకు పుణ్యం వుంటుంది” అంది గీత. ఇంకేమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్లు వుండిపోయారు.
“కొన్ని విషయాలు నాకు చాలా గందరగోళంగా అనిపిస్తుంటాయి. అసలు అర్థమవ్వవు. ఒక నిజం బైటపడగానే ప్రపంచం ఎందుకు మారిపోతుంటుంది? దారి తెలిస్తే తేలిగ్గా ముందుకి వెళ్లగలుగుతాం. ఐనాసరే, తెలీకపోవడంలో వున్న సుఖం తెలీడంలో ఎందుకుండదు? ఏదో ఒకటి చెయ్యాల్సిన అవసరం వున్నందునా?” అడిగింది గీత. తలూపాడు వాసు.
నీలిమ వచ్చింది.
“వీళ్ళకోసం వెతుక్కుంటూ మీరొచ్చారు. మిమ్మల్ని వెతుకుతూ నేనొచ్చాను. పదండి వెళ్దాం. లేకపోతే మనందరికోసం అత్తయ్యొస్తారు” అంది. వాళ్ళు ముగ్గురినీ అలా చూస్తుంటే ఆమెకి మనసులో ఎక్కడో అసూయ కలిగింది. ఎప్పట్లాగే. ముగ్గురూ లేచారు. నలుగురూ కలిసి కదిలారు. నీలిమ కాస్త ఎడంగా.
“నాన్న వుత్తరమేమైనా రాసిపెట్టారా? పుస్తకాల్లో ఏదేనా పెట్టారేమో చూసావా?” ఆరాటంగా అడిగింది లక్ష్మి వాసుని. కళ్లలో నీళ్ళు తిరిగాయి. అభిమానం అడ్డొచ్చి కొడుకుముఖంలోకికూడా చూడలేకపోయింది.
“ఇరవయ్యేళ్ళు కాపురం చేసిన భార్యా, కన్నపిల్లలూ ఉన్నట్టుండి ఎందుకు పరాయివాళ్లైపోయారో తెలుసుకోవాలనుంది. ఈ ప్రశ్న నా మనసుని మెలిపెట్టేస్తోంది” అంది. “సరదాగా వుండేవారు. ఎప్పుడూ జోక్స్ వేసి నవ్వించేవారు. నీకూ గుర్తుందికదా, మనిల్లు ఎలా వుండేదో! ఇంటికి ఎవర్ని తీసుకొచ్చి పెట్టుకున్నా కాదనేవారు కాదు. మూడు పురుళ్ళు ఈ యింట్లో పోసాను. ఎందుకనలేదు.
అవసరాల్లో ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోకపోతే ఎలా- అనేవారు.
అలాంటివాడు అన్ని బంధాలూ తెంచేసుకుని కాని మనిషిలా వుండిపోయారు. ఏదేనా అడగబోయినా, చెప్పబోయినా,
నువ్వు చదువుకున్నావు, తెలివైనదానివి. ఇల్లు నడుపుకో. నీకు అన్నీ వున్నాయి. లేనిదానికోసం వెతక్కు- అని మాట పెరగకుండా తుంచేసేవారు.
ఎందుకు వచ్చింది ఆ విముఖత? ఏం అడిగానని? ఏది వినలేదని? మారతారేమోనని చూసీ చూసీ విసిగిపోయి వదిలేసాను. ఇంకాస్త పట్టించుకుని వుంటే మరి కొన్నాళ్ళు బతికేవారేమో! తప్పేం జరిగిందని గట్టిగా నిలదీసి నిత్యం గొడవచేస్తూ వుంటే ఒకప్పటికి కాకపోతే మరొకప్పటికి మారేవారేమో! అక్కడికీ అడిగాను, మీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఇంట్లోకి వచ్చి మీ బతుకేదో మీరు సుఖంగా బతకండని, మనం వెనకట్లా కలిసి వుండక్కర్లేదు, కనీసం కారణం చెప్పండని. ఆఖరికి ఇంకెవర్నేనా యిష్టపడుతున్నారేమోననికూడా అడిగాను. దేనికీ పలకలేదు. గుండె బరువెక్కిపోతోందిరా” అతని చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. తల్లిని ఓదారుస్తూ వుండిపోయాడు వాసు.
“కనీసం మామయ్యకేనా చెప్పారామ్మా?” ఆరాగా అడిగాడు మాధవ్.
“లేదురా! నేనడిగిన ప్రశ్నలన్నీ వాడూ అడిగాడు. మగాళ్ళుకదా, నాతో చెప్పలేనివి తనకేనా చెప్తారేమోనని ప్రయత్నించాడు. ఏమీ చెప్పలేదట. ఇంట్లోంచీ వెళ్ళిన నెలకి కాశీలో ఏదో రోడ్డుమీద కనిపిస్తే ఆయన్ని పట్టుకుని మళ్ళీ పారిపోకుండా వస్తాదుల్లాంటి ఇద్దరు మనుషులు కాపలా కాస్తూ తీసుకెళ్ళి త్రిమూర్తులుగారింట్లో దించారట.
నేను సన్యాసుల్లో కల్సిపోయాను, ఇంటికి రానని గొడవచేస్తే-
భార్యకి తెలీకుండా అలా ఎలా సన్యాసం పుచ్చుకుంటావు? నువ్వేదో చివరిదాకా చూస్తావనుకుని మా పిల్ల నిన్ను చేసుకుంది, నీ ముగ్గురు పిల్లలకి తల్లైంది. నీ దారి నువ్వు చూసుకుంటానంటే ఎలా కుదురుతుంది? మా పిల్లని మేం తీసుకెళ్ళిపోతాం, నీ పిల్లలని నువ్వేం చేసుకుంటావో చేసుకో- అని దెబ్బలాడి ఇంటికి తీసుకొచ్చారు. మామ్మకూడా అదేపాట పాడింది. పిల్లలన్న పాశానికి ఆగారు” అంది లక్ష్మి.
“వల్లీ సుమతీవాళ్లమధ్యని కూర్చుని తులసి బాగా ఏడ్చిందట పదోరోజు” గీత నెమ్మదిగా మాటమార్చింది.
“కన్నతండ్రి కదమ్మా?” అంది లక్ష్మి. ఇంక సంభాషణ ముందుకి కదల్లేదు.
కొద్దిరోజులు భయం ముగ్గురినీ బాగా వెంటాడింది. స్నానం చేస్తూ అన్నదమ్ములిద్దరూ తమ వొంటిని తాము వెతికివెతికి చూసుకోవడం, పిల్లలకి స్నానం చేయిస్తూ వాళ్ళ వొళ్లంతా చూడ్డం జరిగింది. తులసి పిల్లలనీ వదిలిపెట్టలేదు గీత. క్రమంగా అలవాటుపడ్డారు. ఏదెలా వుంటే అలా జరుగుతుందనే నిర్లిప్తతకి వచ్చేసారు.


రామకృష్ణ సంవత్సరీకాలు పూర్తయ్యాయి. మహతి భర్తనుంచీ విడిపోయి ముంబైలో వుండిపోయింది. ఇక్కడ అవంతీపురం యింట్లోలా కాకుండా కొడుకు పుట్టాక మాధవ్‍కి ఖర్చులు బాగా పెరిగాయి. ఏదంటే అది పెట్టి సాదాగా పెంచదు నీలిమ. పిల్లల విషయంలో అక్కచెల్లెళ్ళకి పోటీ. బట్టలూ, బొమ్మలూ అన్నిట్లోనూ పోటీ పడతారు.
అక్కడ అంత యిల్లుంది. మనకి దానిమీద పైసా ఆదాయం లేదు. వాళ్ళు వదిలేసి వెళ్తే పడగొట్టి విడివాటాలుగా కట్టించుకోవచ్చు, ఎవరికి వాళ్లకి అద్దెలేనా వస్తాయంటే వాళ్ళా యిల్లు వదలరు. డెవలప్‍మెంటుకి యిచ్చినా ఫ్లాట్స్ వస్తాయి. అక్కడ అద్దెకి యిచ్చుకుని, ఆ అద్దె ఇక్కడ మనం కట్టుకోవచ్చు” అనే నస ఎక్కువైపోయింది. నాలుగైదువందల గజాల స్థలంలో వున్న యింటిని పడగొట్టి మళ్ళీ కట్టించుకునేంత శక్తి తనకి లేదని మాధవ్‍కి తెలుసు. వాసు కలిసినాకూడా వుండదు. వాళ్లకి ఆ ఆసక్తీ లేదు. అందుకే ఆ యింటిని అలాగే వుంచి వేరే ఆస్తులు కొంటున్నారు. తనూ రెండు స్థలాలు కొన్నాడు. ఇల్లు కట్టుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది.
“అలాగైతే మనవాటా మనకి పంచిమ్మనండి” అంది నీలిమ. ఆమె అనుకున్నది, సగం యిల్లొస్తుందని. అతనికి కచ్చితంగా తెలుసు, నాలుగోవాటానో ఆరోవాటానో తనదని. ఆమెకి చెప్పినా అర్థం చేసుకోదు. అతనికేమీ తెలీదనీ, ఆమె తండ్రి గట్టిగా అందరితోటీ మాట్లాడితే వ్యవహారాలు పొసిగిపోతాయనుకుంటోంది. నెమ్మదిగా పావులు కదిలాయి. మాధవ్ సెలవుమీద వచ్చినప్పుడు సుమంత్ ఆ ప్రతిపాదన ముందుకి తెచ్చాడు. అందరికీ అనువుగా వున్న రోజుని కూర్చుని మాట్లాడుకుందామనుకున్నారు.
“అత్తలిద్దరికీ చెప్పాలి. చిన్నావిడ వచ్చినా రాకపోయినా పెద్దావిడ వస్తుంది. ఆవిడ లేకుండా మనింట్లో ఏదీ జరగదు” అంది లక్ష్మి. ఈ పంపకాలు తప్పవని ఆమెకి తెలుసు. నిత్యకాష్ఠంలా కాలుతున్న వ్యవహారాన్ని ఎక్కడో ఒకచోట తుంచెయ్యాలనుకుంది.
“వాళ్ళేమైనా అడుగుతారామ్మా?” అడిగాడు మాధవ్.
“వాళ్లకిచ్చేది వాళ్ళకీ యిచ్చారు. ఇద్దరికీ పెళ్ళిళ్లప్పుడు రెండేసి ఎకరాలు కట్నం యిచ్చారు” అంది లక్ష్మి.
“మరి మనకి పొలం లేదా?” కుతుహలంగా అడిగింది గీత.
“అయ్యో! ఎందుకు లేదూ? పెద్దాయన ఇల్లు మనవడి పేర్న పెట్టారన్న కోపంతో వీళ్ళిద్దరికీ ఇవ్వగా అరెకరం మిగిలితే గుడికి రాసేసారు. ఇంట్లోకిరానని పంతంకట్టి ఇంటిముందు ఔట్‍హౌసుకి ఆనుకుని పాకవేసుకుని అందులో వుండేవారు. ఇంతిల్లూ పెట్టుకుని ఇంటివెనకాల చచ్చినట్టు అనేది వీళ్ళ మామ్మ” అంది లక్ష్మి.
“అయ్యో! అదేమిటి?” అంది గీత.
“మీ మామగారు చెయ్యలేదా? అలానే. పోలికలు ఎక్కడికి పోతాయి?”
“అసలు పెద్దాయన అలా ఎందుకు చేసారు?”
“అన్ని ఆరాలూ నీకే కావాలేం?”
“చెప్పచ్చుగా?”
“ఒకావిడతో స్నేహం వుండేది. ఆవిడని ఇంటికి తీసుకొచ్చేస్తారన్న భయం”
“పొలం ఆవిడకేనా యివ్వకుండా గుడికి రాయటమేమిటి?”
“అలాంటిపనులు బాహాటంగా చేసేవారు కాదు. ఊళ్ళో నలుగురూ తిడతారు, నవ్వుతారు”
“మామయ్యకూడానా?” చప్పుని అడిగేసింది.
“ఏయ్, నీ వీపు పగలగొడతానే. ఏది తోస్తే అది అడిగెయ్యడమేనా?” చెయ్యెత్తాడు వాసు.
“తప్పేముంది? తెలుసుకుందామని అడిగాను” అంది గీత. ఇంకా అడగాల్సినవి మిగిలిపోయాయిగానీ అప్పటికి వూరుకుంది. నీలిమ తెల్లబోయి చూసింది వాళ్లందర్నీ.
“ఆవిడెందుకు? వాళ్ళకీ వాటా వుంటుందని అంటున్నారు మీరు. పిలిచి గొడవచేయించుకోవడం దేనికి? పంపకాలయ్యాక ఎలాగా తెలుస్తుంది. అప్పుడింక ఏమీ మాట్లాడలేక వూరుకుంటారు. ఈ చారెడు జాగాకోసం, పాతకొంపకోసం కోర్టుకెళ్తారా? వాళ్లకి లేదా, పోదా?” అంది నీలిమ తర్వాత తమ గదిలోకి వచ్చాక. మాధవ్‍కి ఆమె, ఆమె ఆలోచనలు నిత్యనూతనం.
“అమ్మకి ఎలా నచ్చితే అలా చెయ్యనీ నీలూ!” విసుగ్గా అన్నాడు. ఆమెకి కోపం వచ్చింది.
“వీళ్లందరితోటీ నేను నెగ్గలేను. మా నాన్నని రమ్మంటాను” అంది. పెద్దలిచ్చిన యిల్లు పంచుకోవడంలో నెగ్గటాలూ, ఓడిపోవడాలూ ఎక్కడినుంచీ వచ్చాయో అతనికి అర్థమవ్వలేదు. పెద్దగొడవ జరగబోతోందనిమాత్రం గ్రహించాడు. తను ఆపాలన్నా ఆగదు.
“నీయిష్టం” అన్నాడు.
లక్ష్మి పిలుపు అందుకుని సక్కూబాయి, నీలిమ ఫోనుమీద కుటుంబరావు వచ్చారు. కుటుంబరావైతే గాభరాయెత్తిపోతున్నాడు. అన్నదమ్ములు వేర్లుపడటంమీద చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చూసినవో, అలా జరుగుతాయని విన్నవో, పాతసినిమాల్లో చూసినవో కొన్ని దృశ్యాలు ఆయన మనోఫలకంమీద ముద్రించుకుని వున్నాయి. చెంబూ తప్పాలా దగ్గిర్నుంచీ అన్నీ పంచుకుంటారనీ, పంపకాల్లో తేడలొచ్చి, గొడవలౌతాయనీ వూహించుకున్నాడు. తనకి ఎవర్నేనా తోడుగా తీసుకెళ్దామనుకున్నాడు.
“ఉన్నది ఒక్క యిల్లు. వాళ్ళు పంచుకోగలరు. అక్కడ అందరూ చదువుకున్నవాళ్ళే. మీరు తలదూర్చకండి నాన్నా!” అని తండ్రికి గట్టి హెచ్చరిక చేసాడు వసంత్. కుటుంబరావేమైనా ఇల్లు ఆక్రమించినా, మాధవ్ లొంగి వచ్చినా తను అందులో దూరచ్చనుకున్నాడు రాజశేఖరం. అవి రెండూ జరగలేదు. వియ్యంకుడు అడిగితే అందుకే రానన్నాడు. ఒక్కడే వెళ్ళాడు కుటుంబరావు. ప్రహ్లాద్‍కీ వెళ్లడం యిష్టంలేకపోయింది. కానీ మాధురి బయల్దేరిపోవడంతో తప్పనిసరై తయారయ్యాడు. వెళ్తూ సుమంత్‍ని రమ్మన్నాడు. అంతమందిని చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. గీతని లోపలే కూర్చోమంది సక్కూబాయి.
“ఏమన్నా వుంటే వాసుకి చెప్పు. నువ్వసలు మాట్లాడకు. నిన్ను చూస్తే వాళ్లంతా కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. ఇంత వోర్వలేనితనం ఎక్కడా చూడం” అంది.
“మీ చెల్లినీ, మరిదినీకూడా రమనకపోయావా?” అంది నీలిమతో. అందులో చిన్న హేళన వుంది.
మాధవ్ అనుకున్నట్టే కుటుంబరావు, మాధురి చాలా గొడవచేసారు. వాసుని వెళ్లగొట్టి యిల్లు ఆక్రమిద్దామనుకున్నాడాయన. రాజశేఖరం సహకారంతో ఇల్లు పడగొట్టి అపార్టుమెంటు కడితే తనూ అందులో ఇరకచ్చనుకున్నాడు. మాధవ్ దేనికీ సహకరించలేదు. అన్నచేతిలో తురపుముక్కలా వుండిపోయాడు. అతని జీవితం అతను చక్కదిద్దుకోవద్దూ? ఈ యిల్లు సంపాదించడానికి నీలిమ ఎంతో కృషిచేసింది. మాటలంది, తిట్లుపడింది, చెడ్డదనిపించుకుంది. ఏం లాభం? ఇతను అల్లుకుపోవద్దూ? ఆఖరికి ఆడాళ్ళతో సమంగా ఆస్తిని పంచుకుంటున్నాడు! మాధవ్ చేతకానితనానికి ఆయనకి అసహ్యం వేసింది.
“స్థిరాస్తులేవేనా వుంటే మగపిల్లలు పంచుకోవడం లోకవిధాయకం. మీరిద్దరుకాబట్టి చెరో ఆర్నెల్లూ ఆవిడ్ని దగ్గిరపెట్టుకుని చూసుకోండి. మీ చెల్లెలికి దండిగా కట్నం యిచ్చి పెళ్ళిచేసారు. ఇంకా వాటా ఏమిటి? ఇవేమైనా పప్పుబద్దలా? అందరికీ పంచుకుంటూ వెళ్లడానికి? ఆమాటకొస్తే మీ అన్నకేం తక్కువ? రెండుజీతాలు. ఆస్తులున్నాయి. పొలాలు కొన్నారు. వాళ్లకిమాత్రం దేనికి? ఈకాస్త యిల్లు మీకు వదిలిపెట్టలేరా? వాళ్ళకి అంత కక్కుర్తి దేనికి?” అన్నాడు. ఇంకా చాలా అన్నాడు.
మాధురికూడా మాట్లాడింది. “మా నాన్న అన్నదాంట్లో తప్పేం వుంది మరిదిగారూ? మాయిళ్లలో అంతే. భర్తపోయిన ఆడవాళ్లని కొడుకులే చూసుకుంటారు. మా పెద్దమ్మైతే ఏ కొడుకింట్లో వుంటే ఆ కొడుకు చేతిలోపెన్షను డబ్బులు పెట్టేసి కృష్ణారామా అనుకుంటూ బతుకుతుంది. మాకలాగే తెలుసు. ఇక్కడున్నవాళ్లంతా మీవాళ్ళు. మా చెల్లి ఖర్మకొద్దీ మీరుకూడా మీ అన్నయ్యవైపే మాట్లాడతారు. ఆయన ఎంత దయదలిచి యిస్తే అంత తీసుకునేలా వున్నారు” అంది. ప్రహ్లాద్ తనతో మాట్లాడుతూ మూడు సిగరెట్లు వరసగా కాల్చడం గుర్తొచ్చింది సుమంత్‍కి. ఇప్పుడు జాలేసింది.
వాదనలు, ప్రతివాదనలు అయ్యాయి. మాధవ్‍కి కోపం వచ్చి అన్నీ ఆపేద్దామని అరిచాక అప్పుడు తగ్గాడు కుటుంబరావు. ఆఖరిగా వాసు అన్నాడు.
“పదిలక్షలూ పన్నెండులక్షలూ ఎవరూ వదులుకోరు. నాకూ ఇద్దరు కొడుకులున్నారు. మా చెల్లికీ వున్నారు. వదులుకోకపోవటాన్ని కక్కుర్తి అనరు, వదులుకోవటాన్ని తెలివితక్కువతనం అంటారు. మీరలా ఆశపడుతున్నంతసేపూ ఈ వ్యవహారం తెగదు. మీతో కూర్చుని సాగదీసేంత టైము నాకు లేదు. నా అభిప్రాయం చెప్తాను. ఆ తర్వాత లాయరుతో మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. అరేయ్ మాధవ్! ఇద్దరం చదువుకుని వుద్యోగాలు చేస్తున్నవాళ్లం. ఇంత చిన్నలెక్కలుకూడా చెయ్యలేకపోతే మన చదువులూ వుద్యోగాలూ దండగ. ఇల్లుకట్టి ఎనభయ్యేళ్ళు దాటింది. డిప్రీసియేషన్ పీరియడ్‍కూడా దాటిపోయింది. స్థలానికి మాత్రమే విలువకడతారు. లెక్కవేయిద్దాం. నలుగురివీ నాలుగువాటాలు. మీరు ఇక్కడుండరు. అమ్మ మీతోపాటు తిరగలేదు. తులసి, దానిపిల్లలు, మా పిల్లలు, ఆవిడ అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందర్నీ వదిలేసి ఆవిడ వుండలేదు. తను నాదగ్గిరే వుంటుంది. ఇల్లు నువ్వు కావాలనుకుంటే మా ముగ్గురివాటాలూ మాకివ్వు. నాతో అమ్మని తీసుకెళ్తాను. తులసికి లక్ష కట్నం యిచ్చాం. ఆ లక్షా నేను భరిస్తాను. అది తగ్గించుకో. అలా కాకపోతే, నీకూ తులసికీ నేను యిస్తాను, ఇంట్లో అమ్మ వాటా అమ్మకి అలానే వుంటుంది”
“అందరికీ యివ్వడానికి అంత డబ్బు నాదగ్గిర ఎక్కడిదిరా?” అన్నాడు మాధవ్.
“నాదగ్గిరమాత్రం వుందా? నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను. తులసిని అడుగుతాను, పొలంగానీ, స్థలంగానీ తీసుకుంటుందేమో! కాదంటే పొలం అమ్మేసి డబ్బిచ్చేస్తాను. ఇక్కడింట్లో అమ్మతోపాటు గీత పేరుకూడా చేర్చితే మామయ్యకి అభ్యంతరం వుండకపోవచ్చు. నాది అభిప్రాయం మాత్రమే. ఆలోచించుకుని చెప్పు” అనేసి లేచాడు వాసు.
“అత్తాకోడళ్ళిద్దరూ కలిసి రేపెప్పుడేనా నన్ను వెళ్ళిపొమ్మంటే మీయింటికే వస్తాను. మర్చిపోకొరేయ్!” అని నవ్వుతూ అతను వెళ్తుంటే సుమంత్, ప్రహ్లాద్ అనుసరించారు. వాళ్ల వెంట మాధవ్‍కూడా వెళ్లిపోయాడు.
“మీ కాళ్ళిటు పెట్టండ్రా! దణ్నం పెట్టుకుంటాను. ఎలా భరిస్తున్నార్రా, ఈ అర, పావు, పల్లిగింజసైజు, ఆవగింజసైజు, చీమతలకాయసైజు మెదళ్లమనుషుల్ని? ఇక్కడ ఆయన పెట్టింది పైసకూడా లేనప్పుడు పెద్దమనిషితనానికి ఎలా వచ్చాడ్రా? నువ్వు తెగ్గొట్టకపోతే ఇది ఈరోజుకి తెగేది కాదు” అన్నాడు సుమంత్. ఆ సైజులన్నీ తెలివితక్కువతనానికి వీళ్ళు పెట్టుకున్న కొలతలు. ఆడపిల్లల్తో మాట్లాడేటప్పుడు అవసరమయ్యేవి.
“వీడి పెళ్లైనప్పట్నుంచీ మొదలైంది” అన్నాడు ప్రహ్లాద్ మాధవ్‍ని చూపిస్తూ. మాధవ్ చిన్నబుచ్చుకున్నాడు.
“పాపం మంచిదేరా, నీలిమ. స్వంతబుర్ర వాడితే బానే వుంటుంది. వాళ్లనాన్న సరిగ్గా చెప్పడు. ఆయన ఆలోచనలన్నీ తనకి ఎక్కిస్తాడు. గీత వాళ్ల నాన్నని ఫాలో ఐనట్టు తనూ ఆయన్ని ఫాలో ఔదామనుకుంటుంది” అన్నాడు.


తులసికి రెండెకరాల పొలం, మాధవ్‍కి డబ్బూ ఇచ్చేసి ఇల్లు తల్లితోపాటు తనదనిపించుకున్నాడు వాసు. మాధవ్ వెంటనే తన స్థలంలో యిల్లుమొదలుపెట్టి రెండంతస్తుల్లో నాలుగువాటాలు కట్టాడు. ఒకపక్కని చిన్నగా మామగారికోసం రెండుగదుల పోర్షన్ వేసాడు. నాలుగువాటాల అద్దెలవాళ్లని కనిపెట్టుకుని వుంటాడని. తనకీ ఒక పూర్తివాటా ఇవ్వనందుకు ఆయన చిన్నబుచ్చుకున్నాడుగానీ నీలిమ పట్టించుకోలేదు. కొత్తిల్లు వాసు యింటికి దగ్గిరే. ఇక్కడుండే పనులన్నీ చూసుకుంటున్నారు భార్యాభర్తలు. కుటుంబరావు, కమలాక్షీకూడా ఇక్కడే వున్నారు. మాధురి వచ్చి వెళ్తోంది. మాధవ్ తనవాటా తనదని తీసుకున్నాక ఇంకా యిక్కడ వుండటమేమిటని ఎక్కడా వాళ్లకి అనిపించలేదు. ఇంట్లోకేవైనా తెద్దామనికూడా ఎవరూ అనుకోలేదు. కమలాక్షో, గీతో వండిపెడితే నిర్మొహమాటంగా తిని పని కానిచ్చుకుంటున్నారు. వచ్చినవాళ్లకి తిండి పెట్టడాన్నిమించి తనకి బాధ్యత వుంటుందనుకోలేదు గీత. అదీ మాధవ్‍కోసం. అంతకుమించి ఎందులోనూ కలగజేసుకోలేదు. ఇంటిగురించి మాధవ్ ఏవేనా చెప్తే వింది. అతను బలవంతం చేస్తే రెండుసార్లు వెళ్ళి చూసి వచ్చింది. సలహా అడిగితేమాత్రం,
“నాకేం తెలుస్తుంది? బాబాయ్‍లిద్దరూ కట్టుకున్నారుకదా, వాళ్లనడుగు” అంది. రవి కొంతవరకూ సలహాలిచాడు. వసంత్ చదువు వుపయోగపడింది.
అద్దెలకేకాబట్టి ఇల్లు సింపుల్‍గా కడదామంటే నీలిమ వినలేదు. ఇంటీరియర్స్‌కి బాగా ఖర్చొచ్చింది. ఇల్లే పెద్దది. అప్పర్ లిమిట్ పెట్టి యాభై బేసిక్‍పేలు హోమ్‍లోనుగా ఇస్తారు. హోమ్‍లోను ఒకమూలకి రాలేదు. ఒక స్థలాలుకూడా తీసేసాడు. అవి అమ్మగా వచ్చింది పంటికిందికి రాలేదు. చాలాచోట్ల అప్పులు చేసాడు. అద్దెలకిచ్చే వాటాలకి ఇంత హంగూ ఆర్భాటం దేనికని అన్నవాళ్లని అడవిమృగాలని చూసినట్టు చూసింది మాధురి. ఆమె అధ్వర్యంలో నీలిమ నడిచింది. అక్కచెల్లెళ్ళిద్దరికీ వళ్ళూపై తెలీలేదు. డబ్బుని ధారాళంగా ఖర్చుపెట్టడంలోని సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించింది నీలిమ. కొడుకుని పూర్తిగా వాళ్లు లొంగదీసుకుని ఆడిస్తున్నారనిపించింది లక్ష్మికి. అక్కడికీ అతన్ని హెచ్చరించింది, చూసుకుని ఖర్చుపెట్టమని. రవీ చెప్పాడు. అక్కడున్నది కుటుంబరావు అల్లుడు, నీలిమ మొగుడు. అది అర్థమయ్యాక అతనూ తప్పుకున్నాడు.
“ఎక్కడమ్మా, వినట్లేదు. ఇల్లు ఆర్భాటంగా వుంటే అద్దెలు బాగా వస్తాయంటుంది” అన్నాడు మాధవ్ తల్లి అడిగినప్పుడు విసుగ్గా.
“అద్దెలొస్తాయని అప్పులు చేసి ఖర్చులు పెంచుకుంటామా? మీరెలాగా ఇక్కడ వుండరు. సాదాగా కట్టించుకుని ఇక్కడికొచ్చినప్పుడు మీ కోరికలన్నీ తీర్చుకుంటే సరిపోతుంది” అంది. అంతకన్నా చెప్పలేదు. డబ్బు కావాలా అని వాసుకూడా అడగలేదు. అతనికీ ఖర్చులన్నీ చిరాగ్గా వున్నాయి. ఉండి విలాసంగా ఖర్చుపెట్టుకుంటే ఎవరిష్టం వాళ్లదనుకోవచ్చు. అప్పుచేసి తగలేసుకోవడానికి సాయంచెయ్యడం దేనికని ఊరుకున్నాడు. తన వాటా నిమిత్తం ఎత్తిపెట్టి అన్న అంత డబ్బిచ్చాక ఇంకా యిమ్మని మాధవ్‍కూడా అడగలేకపోయాడు.
ఇల్లు కట్టడంతో అవలేదు. తరవాతి అధ్యాయం గృహప్రవేశం.
“తలకి మించిన అప్పులతో వున్నారు. క్లుప్తంగా చేసుకోండి. అందరికీ బట్టలూ అవీ అక్కర్లేదు. ఎవరో ముఖ్యమైనవాళ్లకి పెడితే చాలు” అన్న కుటుంబరావు మాటలు ఆచరణకి సాధ్యంగా కనిపించలేదు. ఆయన లోలోపలి వుద్దేశాలు వేరుగాబట్టి. అప్పటికి తొమ్మిదికుటుంబాలవాళ్ళూ ఎవరికివారే కోడళ్ళు, అల్లుళ్ళు, వియ్యాలవారికుటుంబాలని కలుపుకుని విడివిడిగా బాగా విస్తరించారు. పెట్టుపోతలు భారంగా మారాయి. ఎవరివాళ్లకి వాళ్ళు పెట్టుకుని, మిగతా ఎనిమిది కుటుంబాలలో పెద్దవాళ్లకి మాత్రం బట్టలుపెట్టి, పిల్లలకి జాకెట్టుముక్క, నూటపదహార్లతో సరిపెట్టాలనే నిర్ణయంతీసుకున్నారు పెద్దవాళ్ళంతా కూర్చుని. అలా చూసుకున్నా మాధవ్ బలగం చాలా పెద్దది. పదిచీరలు, పాతిక జాకెట్టుబట్టలు తీసి ఇచ్చింది లక్ష్మి. అన్నీ మంచివే. అవి ఎవరెవరికి పెట్టాలో చీటీలమీద పేర్లు రాయించి వాటిల్లో పెట్టించింది.
“చదివింపుల్లో వచ్చినవన్నీ కలగాపులగం చేసెయ్యకండి. పదిపన్నెండు సంచీలు పేర్లు రాసి పక్కని పెట్టుకుంటాం మనింట్లో. ఎవరెవరు పెట్టినవి వాళ్లకుటుంబానికి సంబంధించిన సంచీలో పెడితే తర్వాత లెక్కచూసుకోవచ్చు. ఇక్కడితో ఐపోదు. తిరిగి చదివించాల్సిన సందర్భాలు చాలా వుంటాయి” హెచ్చరించింది.
ముగ్గురక్కచెల్లెళ్ళూ ఒక్కలాంటి చీరలు తీసుకోవాలనుకున్నారు. గీతకీ, తులసికీకూడా ఆ ఖరీదులోనే తీసుకోమన్నాడు మాధవ్. వాళ్ళిద్దరి విషయంలోనూ ఏ చిన్నతేడా వచ్చినా అతను వూరుకోడని నీలిమకి బాగా తెలుసు. అసూయో, వాసు విలువ గుర్తించడం యిష్టంలేకనో తులసి చెప్పిన విషయాలేవీ అక్కచెల్లెళ్లకి చెప్పలేదు ఆమె.
“అదాటుని చూస్తే పనిమనిషిలా వుంటుంది. ఆవిడకి యింత ఖరీదైన చీరెందుకో! ఐనా ఈమధ్య బానే సింగారించుకుంటోంది” వెటకారంగా అంది మాధురి గీతగురించి. “ఇల్లుచూసి కుళ్ళుకుపోతోంది. ఒక్కమాటా ముచ్చటా లేదు” అంది తనే మళ్ళీ.
“అసూయపడటానికి ఆవిడకేం తక్కువ మాధురీ? నికరాస్తి కోటిపైన వుంటుందట వాళ్ళకి. వసంత్ చెప్పాడు. కళ్లకి కనిపిస్తునే వున్నాయికదా?” అంది మానస. నోరు తెరిచేసింది మాధురి. “ఎక్కడిదే, అంత? ఎలా సంపాదించారు?”
“ఫస్టుతారీకు ఎప్పుడొస్తుందా జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తాం మనం. వాళ్లకి జీతంతో పనేముంది? ఇంటద్దె లేదు, బియ్యంకొనే పని లేదు. పిల్లల ఫీజులుకూడా నామమాత్రం. పైఖర్చులకి చూసుకుంటే చాలు. బావగారు పెళ్ళికిముందునించే దాచేవారట. ఆమెని చూసికూడా నేర్చుకోవలసింది చాలా వుంది” అంది.
“ఏమైందే, ఇవాళ ఆవిడ భజన చేస్తున్నావు?” అడిగింది నీలిమ నవ్వి.
“మాయింట్లో చాలా గొడవలౌతున్నాయి నీలూ! మాయమాటలు చెప్పి యిల్లు వాళ్ళు కాజేసారనీ, అంత స్థలం ఎలా వదిలేసారనీ, మాధవ్ ఇంత యిల్లు కడుతున్నాడు, మాకా తెలివి లేదనీ, గీతకి వాళ్ళ నాన్న యిచ్చిన స్థలంధర రెక్కలుకట్టుకుని ఎగురుతోందనీ, రోజుకో దెబ్బలాట యింట్లో. మీయిల్లు చూసి అసూయపడుతున్నది గీత కాదు, వసంత్ అమ్మానాన్నలు. మాతో గొడవపెట్టుకోవడానికి పనిగట్టుకుని అక్కడికొస్తారు వాళ్ళిద్దరూ. ఇద్దరూ ఆడపిల్లలు, ఎలా పెంచుతావని నిలదీస్తారు. జీతంలో కనాకష్టం ఖర్చులకి వుంచుకుని వాళ్ళకి పంపించేస్తాం. డబ్బు చేతిలో వుంటేకదా, ఏదన్నా చెయ్యడానికి? పోనీ మళ్ళీ వెళ్ళి స్కూల్లో చేద్దామా అంటే చిన్నదాన్ని ఎవరు చూస్తారు?” అంది మానస దిగులుగా. “పిల్లలకి కలలుంటే పెద్దవాళ్ళు సహకరిస్తే ఏదో ఒకలా తీర్చుకోగలుగుతారు. మాడబ్బులన్నీ లాక్కుని అరవయ్యేళ్ళ వయసులో ఇంకా ఏదో చెయ్యాలనే పిచ్చేమిటో తెలీడంలేదు. ఎక్కడో స్థలం వుంది, ఇంటిమీద అప్పుచేసి కొంటారట. ఈన్ని బేంకులోన్లవీ పెట్టమన్నారు. అంతా అగమ్యగోచరంగా వుంది. భవిష్యత్తు తలుచుకుంటే చాలా భయం వేస్తోంది.
చిన్నప్పుడు మాకే సమస్య వచ్చినా గీతని ముందు పెట్టుకుని కదిలేవాళ్లం. చక్కగా నచ్చజెప్పేది. సుమతి తన పక్కనుండేది. వాళ్ళ అమాయకపు మాటలకీ, తెలిసీతెలీనితనానికీ వీళ్ళంతా ఐసైపోయేవారు. పెద్దయ్యాక మమ్మల్ని మీ ముగ్గురూ మాధురీ, నీలిమా, మానసల మొగుళ్లని చేసిపెట్టారు. మీ మొగుళ్ల వకాల్తా అదెందుకు తీసుకుంటుంది- అన్నాడు వసంత్. నవ్వులాటగానేకావచ్చు, కానీ మనవైపుని ఒక బలమైన మనిషి వుంటే బావుంటుందికదూ? వీళ్లంతా చాలా క్లోజుగా వుండేవారట. ఎందుకు పెద్దయాం, ఎవరిదారి వాళ్లదైందని బాధపడుతున్నారు” అంది తనే మళ్ళీ.
“బావుంది. మనిళ్ళలో గొడవల్లో తనేం చేస్తుంది? మీయింట్లో వ్యవహారం నువ్వు చూసుకోవాలి, నాన్నకో, బావలకో చెప్పాలి. అంతేగానీ బైటివాళ్ళ జోక్యం దేనికి? కొత్తసమస్యలకా?” అంది మాధురి.
ఇల్లంతా పూర్తయాక గీతనీ, తల్లినీ వెంటబెట్టుకుని వెళ్ళి దగ్గరుండి ఇల్లంతా అణువణువూ చూపించాడు మాధవ్.
“చాలా బావుంది మాధవ్” ప్రశంసగా అంది గీత. లక్ష్మికిమాత్రం కొడుకు నెత్తిన వున్న అప్పులు మనసులో మెదిలాయి. పెట్టేసిన ఖర్చులకి ఇప్పుడు ఆక్షేపణ దేనికనిపించి, తనూ సంతోషాన్నే ప్రదర్శించింది.
“మీరూ ఇంటీరియర్స్ చేయించుకోండి వదినా! మనిల్లు రాజభవనంలా తయారౌతుంది” అన్నాడు.
“నాకు గంపెడుమంది పిల్లలు. అది ముట్టుకోకూ, ఇది ముట్టుకోకూ అని వాళ్ల వెంట తిరగలేను” అని నవ్వింది గీత. మాధురి పెత్తనం అదే. పిల్లలు ఏది ముట్టుకున్నా అదిలిస్తోంది. అతనూ నవ్వేసాడు.
గృహప్రవేశానికి తెల్లవారు ముహూర్తం. అవంతీపురం ఇంటినుంచే బయల్దేరారు. తండ్రి ఫోటోదగ్గిరా, తల్లికీ బట్టలు పెట్టి, తల్లి ఆశీర్వచనం తీసుకున్నాడు మాధవ్. ఫంక్షను బాగా జరిగింది. కొద్దిమందితప్ప దాదాపుగా పిలిచినవాళ్లంతా వచ్చారు. అందరూ ఇల్లు చాలా బావుందని మెచ్చుకున్నారు.
ఇల్లు మొదలుపెట్టినప్పట్నుంచీ రాణా పడిపడీ చాకిరీచేసాడు. కుటుంబరావుకికూడా అతను పెద్దగా నచ్చలేదు. అల్లుళ్ళకి బంధువులమని చెప్పుకుంటున్నవాళ్లందరూ దర్జాగా పెద్దపెద్ద చదువులతోటీ, హోదాలతోటీ తిరుగుతుంటే ఇతనేమిటని చిన్నతనంపడ్డాడు.వాసుని ఆస్తిపరుల జాబితాల్లో వేసాడూ, ఇంటితగాదా ఐపోయిందీగాబట్టి అతనూ తక్కువనిపించలేదు. గీతే ఇంకా కొంచెం కొరుకుడుపడకుండా వుంది. ఆమెమీది ద్వేషం తగ్గలేదు.
మహతి తండ్రి నారాయణ ముంబైనుంచీ వచ్చాడు. ఎవరెంత చెప్పినా మహతి రాలేదు. ఆమెకి తోడుగా నిర్మల వుండిపోయింది. రాకూడదని రవళి రాలేదు. సందడంతా వల్లి, సమీర, తులసిలదే అయింది. స్వతంత్రంగా ఇల్లంతా తిరిగి చూసారు. దర్జాగా మంగళహారతి కట్నం తీసుకుని సుమతితో కలిసి పంచుకున్నారు. మహతీ రవళిల వాటా నారాయణ చేతికిచ్చారు. ఎంతనికాదు, అదో ముచ్చట. వీణ, అర్చన, పల్లవి తర్వాతి గ్రూపు. వీణని అత్తవారు పంపలేదు. అది అందరికీ వెల్తిగా అనిపిస్తోంది. కుదరక రాకపోవడం వేరు, ఎవరో వెళ్లద్దంటే ఆగిపోవడం వేరు. ఆమెగురించి ఎవరేం అడుగుతారోనని లీల అందర్నీ తప్పించుకుని తిరుగుతోంది. అర్చన అత్తగారితో కలిసి వచ్చింది. పల్లవి బీటెక్‍లో వుంది. అదయ్యాక లా చదువుతానంది. అప్పుడట, పెళ్ళి. కృష్ణ యూయస్‍లో వున్నాడు. రాలేదు. సంతోష్‍కూడా ఏవో కారణాలతో రాలేకపోయాడు. సుధీర్ ఎప్పుడూ దూరంగానే వుంటున్నాడు.
“మా అన్నలిద్దరూ ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, మనకెప్పుడు హారతులు చదివిస్తారో!” అంది పల్లవి, గీత పక్కని కూలబడి వుస్సురంటూ.
గీత అందరిమధ్యా కూర్చుందితప్ప ఏ పనిలోనూ కలగజేసుకోలేదు. ఆమె అటూయిటూ వెళ్ళినప్పుడు రాణా ఆమెని పలకరిద్దామని ప్రయత్నించాడు. విననట్టు వచ్చేసింది. అందరిలోనూ అంతకన్నా చొరవచెయ్యలేకపోయాడు.
కుటుంబరావు, మాధురిలదే పెత్తనమంతా. వచ్చినవాళ్ళందరికీ ఇల్లు కట్టడానికైన ఖర్చూ, పడ్డ ప్రయాసా వివరించి చెప్పారు. అమ్మ పుట్టింటిగొప్ప మేనమామదగ్గిర చెప్పినట్టు. వాళ్ళెవరికీ మాధవ్ పరాయివాడు కాదు. ఇప్పుడనిపిస్తున్నాడు. ఎవరికివారు బైటి చుట్టాల్లా వచ్చి, అందర్నీ పలకరించి, చదివింపులు చేసి, తినేసి వెళ్ళిపోతున్నారు.
సంధ్య వచ్చింది. బొమ్మలా అలంకరించుకుని కూర్చుని వున్న గీతని చూస్తుంటే ఆమెలో వులిక్కిపాటు. దృష్టంతా ఆమెమీదే నిలిచింది. “ఇది గీతేనా? తన అన్నకూతురు? చదువు, వుద్యోగం, ఆస్తి అన్నీ సంపాదించుకుని ఎంత గర్వంగా వుందో!” ఏదో మనసులో మెదిలి భగభగమంది.
ఇల్లంతా చిన్నచిన్న పిల్లలతో నిండిపోయింది. కొత్తతరం. వాళ్లలో వాళ్ళు ఆడుకుంటున్నారు, గ్రూపులు కడుతున్నారు, కొట్టుకుంటున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు. అమ్మా అని వాళ్ళ అమ్మల్ని వెతుక్కుంటూ పరుగులుపెడుతున్నారు. ఒకళ్ళమీద మరొకళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. అన్నీ చూస్తూ, వింటూ కూర్చుంది గీత. ఏదో వింతగా వుంది.
“బాబోయ్, ఇంతమందే? ఇంతల్లరి చేస్తున్నారేంటి? ఎవరు వీళ్ళంతా? నిన్న లేరు, మొన్న లేరు. తాము ఆడుకుంటూ తిరుగుతున్నప్పుడు వీళ్ల వునికే లేదు. తమ పధ్నాలుగుమంది మొహాల పోలికలతో కొందరు, కొన్నిసంవత్సరాకిందటిదాకా అసలీ కుటుంబంతో పరిచయమే లేని వ్యక్తుల పోలికలతో ఇంకొందరు. అసలేమీ తోచనివ్వట్లేదు. మేం ఇంతల్లరి చెయ్యలేదు” అనుకుంటున్నారు ఎవరికివాళ్ళు.
వల్లి భర్తతో దేనికో పేచీపడుతున్నాడు విహీ. వాడిని అల్లరిపెడుతూ అతను నవ్వుతున్నాడు. చప్పుని లేచి గీతపక్కకొచ్చి కూర్చుంది వల్లి.
“వీడు భలే స్మార్ట్‌గా వున్నాడే గీతూ. నేనింక అల్లుడికోసం వెతుక్కోనక్కర్లేదు” అంది. గీతకి ఎక్కడో చురుక్కుమన్నాయి ఆ మాటలు.
“హాస్యానిక్కూడా అలాంటి ఆలోచనలు వద్దే తల్లీ! మాది మేనరికంకదా? తప్పని అప్పుడు ఎవరూ చెప్పలేదు. వీడికి మాటలు ఆలస్యంగా వచ్చాయి. అసలు రావేమో, ఇందుకేనేమోనని హడిలిపోయాం” దాపరికం లేకుండా చెప్పేసింది. దాచిన మరో విషయంమాత్రం ఆమె మనసుని ముల్లులా కెలికింది. రామారావు, యశోదా వచ్చారు. సంభాషణ మరోవైపు మళ్ళిపోయింది.
విజ్జెమ్మ చాలా పెద్దదైపోయింది. మహతిని ఏడాదిపాటు చూసుకున్నదీ, లక్ష్మికి పదోరోజు జరక్కుండా ఆపిందీ ఆవిడేనా అన్నంతగా మార్పొచ్చింది. ఓపిక తగ్గిపోయింది. కొంచెం దూరానికీ కారు మాట్లాడి ఆవిడని జాగ్రత్తగా తీసుకొచ్చారు వాసు, ప్రహ్లాద్. ఇంట్లో తిప్పడానికి వీల్ చెయిర్ తెప్పించాడు మాధవ్. మనవలంతా ఒక్కసారి ఆవిడని చుట్టుముట్టారు.
“ఓయ్, నువ్వేనా, మా డైనమిక్ మాడర్న్ ఓల్డ్‌లేడీవి? ఇలాగైపోయావేంటి అమ్మమ్మా!” అంది వల్లి ఆవిడ్ని గుండెలకి హత్తుకుని. చిన్నపిల్లలా తన చేతుల్లో వొదిగిపోయిన ఆవిడ్ని చూస్తుంటే ఆపిల్లకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“పెద్దదాన్నవలేదూ?” అని నవ్వి, “అలా బాధపడకూడదు. చిన్నప్పుడు నిన్నెత్తుకున్నాను. ఇప్పుడెత్తుకోగలనా? అలానే ఇదీను” అందావిడ.
“బావుంది సంబరం! ఇప్పుడీవిడ దేనికి వచ్చినట్టు? పుసుక్కున ఏదేనా ఐందంటే అసలే కొత్తిల్లు, పాడుబెట్టాలి. చూసిందికదా? ఇంకెంతసేపుంటుంది? నెమ్మదిగా మీ ఆయనకి చెప్పి, పంపిచెయ్యమను” అన్నాడు కుటుంబరావు కూతురిని పక్కకి తీసుకెళ్ళి. ఆమె తలూపి వూరుకుంది. అంతకన్నా తనేం చెయ్యలేదు. ఇలాంటివి మాధవ్‍కి చెప్పకూడదన్నది ఆమెకి బాగా తెలిసొచ్చింది.
అరగంటసేపు కూర్చున్నాక ఆవిడే అంది, “ఇంక వెళ్ళిపోదాం యశోదా! కూర్చోలేకపోతున్నాను” అని.
“మాయింటికి వెళ్లండమ్మా! ఇక్కడయ్యాక అందరూ అటే వస్తారు. అందర్నీ చూస్తే మామ్మకీ సరదాగా వుంటుంది” అంది గీత.
“ఆవిడ ఎక్కడా వుండలేకపోతున్నారు గీతూ! పెద్దదైందికదా? మనింటికే వెళ్తాం. అంతా వచ్చి చూసి వెళ్తుండండి” మాధవ్‍కీ నీలిమకీ చెప్పి బయల్దేరారు.
మాధవ్ ఆవిడకి చీరపెట్టి, నీలిమతో కలిసి దణ్ణం పెట్టాడు.
“మీ తాతయ్య నాటిన విత్తనాలన్నీ మహావృక్షాలౌతున్నాయి. మాధవ్, పెద్ద వుద్యోగస్తుడివయ్యావు, కొడుకుని కన్నావు, ఇల్లు కట్టావు. ఇంకేం కావాలిరా? ఇద్దరన్నదమ్ములూ కలిసి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. రాముని చూసేకదా, మీరంతా అన్నీ నేర్చుకున్నది? ఇప్పుడు వాడు నన్ను సొంతకూతుర్ని, పసిబిడ్డని చూసినట్టు చూసుకుంటున్నాడు. అదికూడా నేర్చుకోండి” అంది నెమ్మదిగా. ఆకాస్తా అన్నందుకు ఆయాసపడిపోయింది. ఆవిడకీ, అందరికీకూడా తెలుసు, ఇవింక ఆఖరిరోజులని. మాధవ్ బలవంతంమీద తీసుకొచ్చారు. అంతా సాగనంపి వచ్చారు.
ఫంక్షనంతా అయాక మళ్ళీ అవంతీపురం ఇంటికి తిరిగొచ్చారు. మాధవ్ పడక ఏర్పాట్లు చూస్తుంటే వాసు వెళ్ళి పెరట్లో అరుగుమీద కూలబడ్డాడు. మనసంతా వెల్తి. గుండెలనిండా దు:ఖం. చెప్పలేని బాధ. కన్నీళ్ళు ఆగడంలేదు. అతనలా వెళ్ళడం చూసి, గీత చేస్తున్న పని వదిలేసి వచ్చింది.
“ఏమైంది?” అడిగింది ఆందోళనగా. నీలిమతో గొడవైనప్పట్నుంచీ ఆమెకి దడగానే వుంది, ఎప్పుడు ఎక్కడెలా నోరుపారేసుకుంటుందోనని.
“ఐపోయింది గీతూ! తమ్ముణ్ణికూడా పంపించేసాను. ఇంక వాడిల్లు వాడిది. ఎప్పుడేనా చుట్టపుచూపుగానే వచ్చేది. ఇది జరక్కుండా ఆపలేకపోయాను. మిగిలిందింక నువ్వూ నేనే” అన్నాడు ఆవేదనగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని. పక్కని కూర్చుని అతని చేతిని తన వొళ్ళో పెట్టుకుంది.
“అదేం కాదు. మనమేం దెబ్బలాడుకుని విడిపోలేదు. ఎక్కడికెళ్తాడు మాధవ్? ఇల్లంతా అద్దెలకి యిచ్చుకున్నాక ఇక్కడికేగా రావాలి? తన గది తనకే వుంటుంది. తులసి గది తులసికి లేదా? అలాగే. బాధపడకు బావా! ఆ అమ్మాయికి ఇలా లగ్జరీగా బతకాలనుంది. కానివ్వు. వాళ్ళ జీవితంకదా?” అంది.
“ఇంకేం లగ్జరీ? వాడు దొరికిన లోన్లన్నీ తీసుకున్నాడు. ఇల్లు అద్దెలకి వెళ్లకపోతే చాలా కష్టం”
“పొదుపు విలువ మనకి తెలుసు. విలాసం వెల యెంతో వాళ్లకీ తెలియాలికదా?”
“అంతేనంటావా?”
“కాక? వీళ్ళు వుండని యింటికి చేయించిన ఆ ఫాల్స్ సీలింగులకీ, వేయించిన డిస్టెంపర్లకీ మనం కడతామా? వాళ్ల పొరపాట్లు వాళ్ళకెలా తెలుస్తాయి? పోతే ఒకపని చేయచ్చు మనం. ప్రతీసంవత్సరం ఒక అదనపు వాయిదా కడితే లోన్ టెన్యూర్ చాలా తగ్గిపోతుందట. అది మనం చేద్దాం. పిల్లాడు చదువుకి వచ్చినప్పుడు చెయ్యేద్దాం” అంది.
“ఎంత ఆలోచిస్తావే నువ్వు?” అన్నాడతను.
“తను లోనుగురించి కొంచెం టెన్షనుపడుతున్నాడు తప్పించి మిగతా అంతా సంతోషంగానే వున్నాడు. వాళ్ల సంతోషం వాళ్లది. ఇంకేం అనకు. బాధపడతాడు. కోపం వస్తుంది. చిన్నపిల్లాడుకాదు, వూరికే చెప్పడానికి” అంది. అతను తలూపాడు. దు:ఖంలోంచీ తేరుకున్నాడు.
“ఇవాళ చాలా బావున్నావు గీతూ! యూ లుక్ గార్జియస్. పొద్దుటినుంచీ ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. ఎక్కడా దొరకలేదు నువ్వు” అన్నాడు ఆమె భుజంచుట్టూ చెయ్యేసి.
“నేనెప్పుడూ బావుంటాను. నీకివ్వాళే అనిపించాను” అంది.
అతను నవ్వేసాడు. “నిజమే! రోజూ బావుంటావు, ఈవేళ కాస్తెక్కువగా. నీ ఆలోచనలే నీకు అందం” అన్నాడు.
“ఎ రాతే, ఎ మౌసమ్, నదీ క కినారా…” సన్నగా హమ్ చేస్తూ కూర్చుంది.
సంతోషం, దు:ఖం మనసులో ఒకదాంట్లో ఒకటి మునకలేస్తూ సహజీవనం చేస్తుంటాయి. అందుకే సంతోషపు సందర్భాన చిన్నదేనా దు:ఖపుఛాయ, గుండెలు పగిలేంత దు:ఖంలోకూడా ఆశ రూపాన్న చిన్న సంతోషపు రేఖ. ఈ రెండురకాల స్థితులూ ఆమెని నిరంతరం వెన్నంటి వుంటాయి, అడుగుపెట్టేందుకు వీలుగా. ఆవరించి కాదు.
“చిన్నప్పుడు నాకీ పాటలన్నీ నేర్పించేవారు నాన్న. ముఖేష్‍కో రఫీకో పాఠాలు నేర్పిస్తానని ఆశపడేవారు. ఆ నేర్పినదేదో పాఠం అనుకుని, ఆయనకే తిరిగి అప్పజెప్పేదాన్ని” అంటూ నవ్వింది. “ఇంతంత వినడం వుండేదికాదు. రేడియోవాళ్ళు దయదల్చి ఎప్పుడిస్తే అప్పుడు వినడమే. కొన్నిపాటలు అలా వెంటాడుతూ వుండేవి. మళ్ళీ వినాలంటే కుదిరేదికాదు. టేప్‍రికార్డరు వచ్చాక బావుండేది. కృష్ణ నాన్నకి మ్యూజిక్ సిస్టం, సీడీలు కొనిచ్చాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రోజంతా పాటలే.
వినివిని కంఠతా వచ్చేసాయే- అంటుంది అమ్మ.
చిన్నప్పుడు నేను అప్పజెప్పాను, ఇప్పుడు నువ్వు అప్పజెప్పు- అన్నాను.
ఎందుకు? నీఅంత మొద్దుపిల్లని కాను. పదిసార్లు వింటే పదకొండోసారి మనలో మనం కూనిరాగం తీసుకోవడమేనా వస్తుంది. జోలపాటలూ, మంగళహారతులూ బాగానే పాడతావుకదా? ఎవరేనా మాస్టారు దొరికితే, కాస్త స్వరశుద్ధి వచ్చేదాకా నేర్చుకో. మాకు పెళ్ళిళ్ళయేదాకా హార్మోనియం నేర్పించేవారు. నాకూ నేర్పించారు. పెళ్లయాక కుదరక వదిలేసాను. వరవీణా మృదుపాణీ నేర్చుకుని పెళ్ళిచూపుల్లో పాడితే అపరసంగీతసర్వస్వతనేవారు. ఇప్పుడేమిటో ప్రతీదీ విద్యకింద మార్చుకుని, నేర్చుకోడానికి ప్రయాసపడుతున్నారు. కచేరీలకంటే కష్టపడి నేర్చుకోవాలిగానీ, మనసుకి నచ్చిన పాట పాడుకోవడానికి అక్కర్లేదు- అంది. ఆవిడ గొంతిప్పి పాడటం మొదలెట్టింది. నేనూ ఆవిడతో గొంతు కలుపుతున్నాను. మేమిద్దరం తప్పులుతడకలుగా పాడుతుంటే నాన్న నవ్వుతుంటారు. ఇట్సే జాయ్. అంతే.
ఎన్ని దు:ఖాలూ, బాధలూ, బాధ్యతలూ పోగేసుకున్నా జీవితం చెత్తపోగుమాత్రం కాదు. తాతయ్య పోయేదాకా కబడ్డీ, ఖోఖో ఆడుతూ స్నేహితులతో తిరుగుతూ వుండేవాడిని. మధ్యలో చదువు. ఉద్యోగం రాలేదని ఆయన అనేలోపు అదీ తెచ్చేసుకున్నాను. అనుకోకుండా ఆయన పోయారు. అప్పటిదాకా నాచుట్టూ విశాలంగా, విస్తృతంగా పరుచుకుని కనిపించిన ప్రపంచం ఒక్కసారి కుదించుకుపోయి పంజరంగా మారిపోయింది. దాంట్లోంచీ తప్పించుకుపోలేంకదమ్మా! అలాంటి పంజరాలు ప్రతిమనిషిచుట్టూ వుంటాయి. మనిషి ఆ నిజాన్ని గుర్తించి, దు:ఖించకుండానూ, తెరుచుకుపోవాలని పోరాడి అలసిపోకుండానూ వుండేందుకు ఎంతమంది తమవొంతు తాము సమర్పించారో! ఎన్ని పాటలు, ఎన్ని పుస్తకాలు! ఒక మార్మికలోకంలోకి మనని లాక్కెళ్ళి, సేదదీరుస్తూ. వాళ్లందరికీ రుణపడి వుంటాను- అన్నారు నాన్న.
నిజమేకదా? మనని తనలోకి లాక్కునే అలాంటి మాయాలోకం లేకపోతే బతకడం చాలా కష్టం.
నాన్నా, అత్తా, సంధ్యత్త, మహీ ఈ వంటరితనపు చక్రబంధాల్లో ఇరుక్కుపోయారు. అమ్మ వున్నా, పంథొమ్మిదేళ్ళ వయసులో ముసురుకున్న వంటరితనం ఆయన జీవితాన్ని తిప్పిన మలుపులోకి వచ్చి చెయ్యందుకోగలిగిందితప్ప అందులోంచీ ఆయన్ని బైటపడెయ్యలేకపోయింది. ఎందుకంటే అమ్మకి ఆయన సహచర్యం తాతయ్య చావు తదుపరి పరిస్థితులకి పర్యవసానంగా వచ్చింది. పెళ్ళి అనే కారణంగా కాదు. అందుకే ఇద్దరూ పాటల్లో, కథల్లో జవాబులు వెతుక్కుంటూ వుండిపోయారు” అంది.
గీత తన జీవితంలోకి రాకపోతే తనేమయ్యేవాడా అనిపించింది వాసుకి. ఈ వెలుగూ, వైవిధ్యం, మాటలూ, ఆలోచనలూ ఏవీ వుండేవి కాదు. అవిలేని తను? ఆమె మళ్ళీ కూనిరాగం మొదలుపెట్టింది.
మాధురికి యీయిల్లు చాలా యిష్టం. ఆగదిలోకీ ఈగదిలోకీ ఇంటిచుట్టూనూ తిరుగుతూ వుంటుంది. ఇప్పుడూ అలాగే లైటు వెలుగుతోందని పెరట్లోకి వచ్చేసింది. వీళ్ళిద్దర్నీ చూసి కంగారుపడి వెనక్కి తిరగబోతుంటే చెయ్యిపట్టుకుని ఆపింది గీత.
“రా, మాధురీ! రహస్యాలేమీ లేవు. కూర్చో. మాకిద్దరికీ నిద్రొచ్చేదాకా ఇక్కడ కూర్చోవడం అలవాటు. ఏవేవో మాట్లాడుకుంటూ వుంటాం” అంది. ఎదుటివాళ్ల మనసు లోతుల్ని వెతికే మనస్తత్వం మాధురిది. లోపాలనో, బలహీనతలనో ఎత్తి చూపించి సంతోషపడుతుంది. వచ్చి గీత పక్కని కుర్చుంది. వాసు లేవబోయాడు.
“ఉండు, ఒకొక్కళ్ళూ ఇక్కడికే వస్తారు” అని అతన్నీ ఆపింది గీత.
“నువ్వెప్పుడూ బావగారిని మీరనవేం? పెద్దవాళ్ళెవరూ తప్పని చెప్పరా?” ఎప్పట్నుంచో మనసులో దాచుకున్నది అడిగేసింది మాధురి. అసలా ప్రశ్నేమిటో, దానికి జవాబేం వుంటుందో అర్థమవలేదు గీతకి. చాలా తికమకపడింది. వాసు నవ్వు బిగబట్టి, ఆమె ఏం చెప్తుందోనని చూస్తున్నాడు.
“ఎమ్మేలోకూడా ఇంత కష్టమైన ప్రశ్న అడగలేదు. నాకు చదువు చెప్పింది నువ్వేగా, నీకు తెలీదా ఇలాకూడా అడుగుతారు, నేను జవాబుచెప్పాలని?” అంది చివరికి. అతను నవ్వేసాడు. ఎందుకో అర్థమవ్వలేదు మాధురికి.
“నువ్వసలెప్పుడూ మీవారి కాళ్లకి దణ్నంపెట్టగాకూడా చూడలేదు. దేవుడికో దీపం, కాస్త నైవేద్యం పెట్టేసి వూరుకుంటావు. కనీసం శుక్రవారమేనా అక్షతలు చేతిలో పెట్టి నెత్తిమీద వేయించుకోవచ్చుకదా? నేనైతే శుక్రవారాల్లోనూ, పండగలకీ మీ మరిది ఆశీర్వాదం తీసుకుంటాను” అంది తనే మళ్ళీ. ఇద్దరికీ నవ్వాపుకోవడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ప్రహ్లాద్‍ని అలా వూహించుకోలేకపోతున్నారు. నీలిమా, మానసాకూడానా? మాధవ్‍వాళ్ళెక్కడ? వాళ్ల గదిలోనా? ఎప్పుడేనా అక్షతలు తీసుకుని నీలిమ వాళ్ళగదిలోకి వెళ్లడం తను చూసిందా? గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
మాధురి, గీతావాసులతో ముచ్చట్లకి కూర్చుందనగానే ఏం ముట్టిస్తుందోనని కంగారుపడుతూ, ఎవర్తోటో మాట్లాడుతున్నవాడల్లా వున్నపళంగా లేచి ఇప్పుడే వస్తానని వచ్చేసాడు ప్రహ్లాద్. అలాగే కంగారుపడుతూ మానసకూడా వచ్చింది. తనడిగిన రెండు ప్రశ్నలకీ ఏం జవాబు చెప్తుందోనని గీత మొహంలోకి తేరిపారిచూస్తున్న మాధురి దృష్టి హఠాత్తుగా ఆమె చెవులకున్న దుద్దులమీద పడింది.
“ఇవి అప్పుడు హోటల్లో కొనుక్కునవేకదా? గాజులు? అప్పుడే కొనుక్కున్నావా?” అడిగింది. ప్రహ్లాద్ ఎందుకంత టెన్స్‌గా వుంటాడో అర్థమైంది గీతకి. ఈ కొన్ని నిముషాల్లో మూడో టాపిక్‍లోకి వచ్చింది.
“దుద్దులు అప్పటివే. గాజులు తర్వాత కొన్నాం” అంది.
“నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. నువ్వసలు నోరుతెరిచి అడగనే అడగలేదు, బావగారు ఎదురడిగి కొనుక్కోమనేసారని”
జటిలమైన రెండు ప్రశ్నలూ వెనక్కిపడటంతో వూపిరిపీల్చుకుంది గీత. ప్రశ్నపత్రంలోని ఈ మూడో ప్రశ్న కాస్త తేలిగ్గా అనిపించింది.
“ఆశ్చర్యానికేముంది మాధురీ? లత కోటీశ్వరుల పిల్ల. సుమంత్‍ని చేసుకోవడంతో మనమధ్యకి వచ్చింది. మంచిదే. కలిసిపోతుంది. తనతో మనకి పోలికే లేదు. జో పెద్ద ఫిజీషియను. ఆరోజు ఎంత ప్రయత్నించినా రాలేకపోయాడు చూడు. అతనికి ఎప్పుడూ అంతే. సుమతితోకూడా మనం తూగలేం. అది కొంచెం అమాయకురాలు. తనలాగే మనందరం వున్నామనుకుంటుంది. ఉన్నట్టుండి ఒక తెలివితక్కువ ప్రపోజల్ పెట్టేసింది. ఎవరో ఒకరం ఏదో ఒకటి కొనకపోతే తనపరువూ మనపరువూ పోతుందని మేం కొన్నాం”
“ఇంత వుందా? నాకైతే నువ్వు చెప్పేదాకా తెలీలేదు” అంది మాధురి నోరు తెరిచేసి.
“తర్వాత సుమతికి అర్థమయ్యేలా చెప్పాం, అందరిలో కూర్చుని అలాంటి ప్రతిపాదనలు చెయ్యకూడదని”
వీళ్ళిద్దరినీ ముందుపెట్టుకుని వ్యవహారానికి ఎందుకు వెళ్తారో అర్థమైంది మానసకి. రెండువైపులా పదునున్న కత్తితోకూడా పనులు చేసుకోగలరు.
మాధవ్ వచ్చికూర్చున్నాడు.
“అక్కడ మీ నాన్న నీకోసం కలవరిస్తున్నాడు” అని మాధురిని తీసుకెళ్ళిపోయాడు ప్రహ్లాద్. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కొత్తింటి ట్రాన్స్‌లో వున్నారు. ప్రస్తుతానికి ప్రమాదం లేకపోవచ్చు. కానీ జాగ్రత్త మంచిదని.
“ఊ< ఇద్దరు ప్రేమపక్షులు. గూడు కట్టేసుకున్నారు” అంది గీత మాధవ్‍ని చూసి. కుటుంబవిషయాలు మాట్లాడుకుంటారని మానసా వెళ్ళిపోయింది. వెళ్తూ ఆ మాటలు వింది.
“రెండుజేబులనిండా గోళీలు పోసుకుని, సైకిల్ చక్రాన్ని కర్రతో తోసుకుంటూ పరుగులు పెట్టిన అవంతీపురం ఐదో రాజకుమారుడి గోళీలు ఎలా ఎప్పుడు ప్రేమబాణాలయ్యాయో అర్థం కావట్లేదు. ఆరోవాడేమో, పిల్లని వెంటేసుకుని వదినా వదినా అంటూ నాచుట్టూ తిరగడం, ఈయనేమో అసలు పిల్లనే చూపించకుండా తిరగడం. రోజులెంత తొందరగా గడిచిపోయాయో!” అంది.
“కొంచెం నిమ్మకాయనీళ్ళు కలిపి తీసుకురానా? పైత్యం దిగిపోతుంది” నవ్వుతూ అడిగాడు మాధవ్.
“వచ్చేవారం బయల్దేరతాంరా వాసూ! ఇక్కడ నీలిమావాళ్ళ నాన్న వుండి అద్దెలకివ్వడం అదీ చూసుకుంటాడు. ఆపైన మాధురి వుంది” అన్నాడు తర్వాత.
“డబ్బేమైనా కావాలంటే మొహమాటపడకుండా అడుగు. ఇబ్బందులు పడకు. అమ్మ బాధపడుతుంది” అన్నాడు వాసు.
“నీకున్న ప్రేమ నాకు లేదురా! అందుకే చాలా బాధపెట్టాను మిమ్మల్ని. వదినా! జరిగినవి మర్చిపోగలిగితే మర్చిపో. లేకపోతే కనీసం క్షమించు” అన్నాడు గీత చేతులు పట్టుకుని.
“మనలో మనకి క్షమార్పణలేంటి మాధవ్? ఏవో జరిగిపోతుంటాయి, సర్దుకోవాలని నువ్వే నాకు చెప్పి, మళ్ళీ నువ్వే బాధపడటం దేనికి? వదిలెయ్ ఆ విషయాలు” అందామె చేతులు విడిపించుకుని.
“మనిళ్లలో ఏ పంక్షను జరిగినా సెంటర్ పాయింటు నువ్వే. అలాంటిది ఈరోజు నువ్వలా దూరదూరంగా కూర్చునేసరికి చాలా బాధనిపించింది. వల్లి పెళ్ళిలోకూడా ఏదో అన్నారటకదా? తులసి చెప్పింది. అందుకు వాళ్ళు ముగ్గురూ వదినగార్లతో గొడవపడ్డారు. ప్రహీ వచ్చి నీకు సారీ చెప్తానన్నాడు”
“ఏదో అనడమేముంది? అర్థమైందిలే. ఎవరి ఆలోచనలూ అనుభవాలనిబట్టి వాళ్ళు అనుకుంటారు. మనకి ఈ ఫంక్షన్సవీ చాలా ఎక్కువ. ఖర్చూ అదీ చూసుకుంటూ ఓ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. పెద్దవాళ్ళంతా అలా చేస్తే సంతోషపడ్డారు. ఇన్నాళ్ళూ వాళ్లడిగారు, నేను చూసుకున్నాను. నాదికూడా తప్పేనేమోలే, మాధవ్! పక్కకి తప్పుకోవలసింది. ఈ ముగ్గురక్కచెల్లెళ్ళూ ఇన్నేసి వేడుకలు చూడలేదు. అందుకని ప్రతీదీ సరదాపడుతున్నారు. ఎవరిళ్ళు వాళ్లవికదా? ఎవరి స్పేస్ వాళ్లం వుంచుకుంటేనే బావుంటుంది. పెద్దగా ఆలోచించద్దు” అంది. లేచి లోపలికి వెళ్ళింది.
ఆమె వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయాడు. ఈరోజు ఫంక్షను ఎంత రసాభాసగా జరిగిందో, అది బైటికి రాకుండా చూడటానికి ప్రహ్లాద్, వసంత్ ఎంత ప్రయాసపడ్డారో, ఎంత దుబారా అయిందో తలుచుకుంటే బాధనిపించింది. అన్నీ ఒక్కడూ చూసుకోలేక కొన్నిటిని మామగారికి అప్పగించాడు. ఆయన పైస ఖర్చుపెట్టడు, తనదీ, ఖర్చుపెట్టమని తనకి యిచ్చినదీకూడా. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ముగ్గురే. ఏదీ తెలీదు, నిండుగా చేసుకోవడం చూడలేదు. దేనికీ సరేననరు. వాదించుకోకుండా ఏదీ జరగలేదు. గీత అన్నీ చూసుకుంటున్న రోజుల్లో ఎవరింట్లో ఏది జరిగినా, అది అన్నిళ్ళలో వేడుకే అన్న ఫీల్ తీసుకొచ్చేది. ఇలాకాదు, అలా అన్నమాటే వచ్చేదికాదు. అంత పకడ్బందీగా ప్లాన్‍చేసేది. ఇప్పుడు?బైటిచుట్టాల్లా వచ్చి వెళ్ళారు. అందరి కళ్లలో వెయ్యి ప్రశ్నలు, పెదాలమీద వంద పరిహాసాలు. అవంతీపురంవాళ్ల కుటుంబాల ప్రభ మసకబారుతోందా? ఒకప్పుడు ఈ విషయంపైన బాధపడ్డదీ, కోపం తెచ్చుకున్నదీ తను. కానీ ఆరోజు అనుకున్నట్టే చేసి చూపించిందికూడా తనే.
“బాధపడకురా! నీమీద మాకేం కోపం లేదు. మా స్థాయెంతో నీలిమ చెప్పాకకూడా ఇంకా వెంటపడి చేసి, మరింత తగ్గించుకోలేంకదా? అందుకే దూరంగా వుండిపోయాం. ఐనా చెయ్యగలిగింది చేసాను. వదిలెయ్యలేదు. నెమ్మదిమీద తనూ నేర్చుకుంటుందిలే. నేనిలా అన్నానని పంతాలూ అవీ పెట్టుకోవద్దు. అమ్మ యిల్లిది. తులసిగది ఎలా వుందో, నీగదీ అలానే వుంటుంది. స్వతంత్రంగా వచ్చి వెళ్తుండండి” అన్నాడు వాసు, తమ్ముడి భుజంతట్టి తనూ లేస్తూ.
“ఒక్క నిముషం. రాణానేం చెయ్యన్రా? ఇల్లు మొదలెట్టినప్పట్నుంచీ వాడంతట వాడు వచ్చేసి ఏదో ఒకటి చేస్తున్నాడు” అన్నాడు.
“వాడికేం కావాలో అడుగు. నీకు కష్టమైనా ఐదువేలో, పదివేలో ఎంతో కొంచెం పెద్దమొత్తం చేతిలో పెట్టి వదిలించుకో. ఇల్లు మీ మామగారు చూసుకుంటారు. వాడి చేతిలో పెట్టకు. ఈ పనీపాటా లేనివాళ్ళంతా చాలామంది రెంట్‍బ్రోకర్ల అవతారం ఎత్తుతున్నారు. వీళ్లదొక నెట్‍వర్కు. అందులోనూ వీడికి తన హద్దు తెలీదు” అన్నాడు వాసు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు.
కమలాక్షి రాత్రిభోజనాలవీ చూస్తోంది. తులసి పిల్లల్నీ, మయూ విహీలనీ పిలుచుకుని తినిపించి, లక్ష్మికీ, తులసికీ, ఆమె అత్తమామమలకీ, శ్రీధర్‍కీ పెట్టి వాసుకోసం చూస్తూ కూర్చుంది గీత. అతను రాగానే అతనికి పెట్టి తనూ తినేసింది. ఎవరికీ పెద్దగా ఆకలి లేదు. పైపైన తినేసి లేచారు. నిద్రొస్తోందని చెప్పి, తమ గదిలోకి వెళ్ళింది.
తులసి గదిలో ఆమె అత్తమామలూ, శ్రీధర్ పడుక్కున్నారు. పిల్లల్ని పెట్టుకుని ఆమె లక్ష్మి గదిలో పడుక్కుంది. భార్యా, కూతుళ్ళూ, మనవలూ ఇందరయేసరికి మాధవ్ గదిలో కుటుంబరావుకి చోటు మిగల్లేదు. హాల్లోకి వచ్చి, గుంపులో కలిసి పడుక్కోవడం అవమానంగా అనిపించింది.
“సత్రంలో పడుక్కున్నట్టు ఇదేమిటి?” అని చిరచిరలాడాడు లోలోపల. మహారాణీలా ఈవిడొక్కర్తీ పడుక్కోవడమేమిటనిపించింది గీతగురించి. కూతుళ్లలో ఒకరో ఇద్దరో ఆమెగదిలోకి వెళ్తే తను లోపల సర్దుకోవచ్చనుకున్నాడు. నీలిమతో అంటే,
“అల్లుళ్ళే పడుక్కున్నప్పుడు నీకేంటి నాన్నా?” అంది.
“పోనీ నేను వెళ్లనా?” అడిగింది మానస.
“వద్దు మానసా! ఇదిప్పుడు వాళ్ళిల్లు. మన అవసరాలకి ఇందరం ఇన్నిరోజులు వచ్చి గడుపుకున్నా ఎవరూ ఏమీ అనలేదు. వాళ్ల గదిలోకికూడా వెళ్ళిపోయి, పక్కలెక్కి తొక్కితే బావుండదు. ఎవరి హద్దుల్లో వాళ్లం వుండటమే బావుంటుంది” జవాబిచ్చింది నీలిమ. ఈ యింటికి తను పరాయిదయిందన్న విషయం ఇప్పుడిప్పుడే ఆమె మనసుకి తడుతోంది. గుండె బరువెక్కడం మొదలైంది.
అంతా బాగా అలసిపోయారేమో, అందరూ తొందరగానే నిద్రపోయారు. ఫాన్లు తిరుగుతున్న చప్పుడు, గోడగడియారం టిక్‍టిక్‍లు తప్ప, ఎక్కడా సవ్వడిలేదు. శక్తినిమించి అలసిపోయాక వచ్చే గ్లానితో నీలిమకి నిద్రపట్టలేదు. నెమ్మదిగా లేచి ఇవతలికొచ్చి, గీత గదిలోకి వెళ్ళింది. పుచ్చపువ్వులాంటి వెన్నెల కాస్తోంది బయట. కిటికీలోంచీ జలపాతంలా దూకుతూ మంచాన్ని పాలసముద్రంలా మార్చేసింది. మంచినిద్రలో వుంది గీత. లేతగులాబీరంగు జరీపూలచీర కట్టుకుంది. ఈమధ్య ఇంట్లోకూడా మంచిమంచి చీరలు కట్టుకుంటోంది. మామూలుగానే చాలా హుందాగా వుంటుంది. ఇప్పుడైతే రాణివాసపు పడుచులా వుంది. పక్కని మయూ, విహీ. ఏది చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. చిన్నప్పుడు వాసు, మాధవ్‍కూడా అంతేనట. దాదాపు తల్లంత పొడవున్నాడు మయూ. తండ్రిని మించిపోతాడేమో! తనూ ఎత్తుకుని పెంచింది వీళ్ళని. ఇప్పుడు దగ్గిరకి రావట్లేదు. మర్యాదగా పలకరించేసి వెళ్ళిపోతున్నారు. తను చేసుకున్నదే. ఎవరి తప్పూ లేదు. వంగి నెమ్మదిగా పిల్లలిద్దరి నుదుటిమీదా శబ్దంరాకుండా ముద్దుపెట్టుకుంది. అక్కడినుంచీ హాల్లోకి వచ్చింది.
వరసగా నవారుమంచాలేసుకుని అందరూ పడుక్కుని వున్నారు. ఆఖర్న పడుక్కున్నవాడు వాసు. అతనికి ఈ మంచాలు చాలవు. కిటికీదగ్గరగా జరుపుకుని, కిటికీలో కాళ్ళు పెట్టుకుని పడుక్కుంటాడు. కాస్త తెల్లారగానే లేచి పెరట్లోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి పడుక్కోవచ్చు. కానీ వెళ్లడు. తమ్ముళ్ళని వదిలేసి భార్యతో కలిసి గదిలో పడుక్కోవడానికి మొహమాటం. అతన్ని దాటుకుని నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళింది. అరుగుమీద కూలబడింది. పెద్దదు:ఖపు కెరటం ఆమెని ముంచెత్తింది. ఆపుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆరేడేళ్లకిందట కొత్తకోడలిగా ఈయింటికి వచ్చింది. మాధవ్‍కి తగ్గ భార్యని అపురూపంగా చూసింది గీత తనని.
తులసి వెళ్ళింది, ఆ స్థానంలోకి నీలిమ వచ్చింది- అందట.
అత్తగారు, తులసి, వాసు, ఎవరూ తనని తక్కువగా చూడలేదు.
పెళ్ళికి ముందు ఆడపిల్లలంతా తెల్లకాగితాలే. మగపిల్లలకి యిచ్చే స్వేచ్ఛా, అవకాశాలూ ఇవ్వరు. కవితగానో, కావ్యంగానో, ఉపకరణంగానో మారే అవకాశం వాళ్ళకి పెళ్ళితో వస్తుంది. దానికి మెరుగులు దిద్దుకోవడమే జీవితం- అన్నాడు మాధవ్. అతను ఎన్నిసార్లు చెప్పినా అర్థమవ్వలేదు.
తమింటి వాతావరణం వేరు. కుటుంబం నిండా భార్యలని తిడుతూ, చులకన చేస్తూ, దాష్టీకం చేసే మగవాళ్ళు ఎక్కువ. ఎవరికేనా ఒక్క పిసరు సంస్కారం, భార్యని గౌరవించే ధోరణీ వున్నా, చుట్టూ వున్నవాళ్ళు చులకన చేస్తారని వాటిని ఇంటికో, పడగ్గదికో పరిమితం చేసుకుంటారు. భార్యమీద ప్రేమ వున్నా ఆమెకి చెప్తే లోకువౌతామని దాన్ని మనసులోనే దాచుకునేవాళ్ళూ వున్నారు. చిన్నాన్న పెదనాన్నలు, మేనమామలు, అత్తలు, పినతల్లిపెత్తల్లులు. ఇక్కడంత కాకపోయినా తనదీ పెద్దబంధువర్గమే. కానీ ఇక్కడిలా కాదు. వీళ్ళంతా తేరిన నీటిలాంటి స్వచ్ఛమైన మనుషులు. మనసులో ఒకటీ, బైట మరొకటీ వుండదు. ముఖ్యంగా గీత. ఏదీ దాచుకోదు. బావుందనిపిస్తే బాహాటంగా అనేసేది. కోపం వస్తే చురచుర చూస్తుంది. ఎవర్నీ తిట్టడం, చెడ్డమాటలనడం రాదు. ఆ చిన్నప్పటి మాటలే. అవీ పెద్దగా మారలేదేమోననిపిస్తుంది. ఆమె ఆక్షేపణలుకూడా వింతగా వుండేవి.
ఎప్పుడేనా కోపం వస్తే అవతారపురుషుడని దెప్పిపొడిస్తుంది వాసుని. అదేమిటని ఆశ్చర్యంగా అడిగింది తను. అప్పటికి తామిద్దరిమధ్యా సయోధ్య వుండేది. శ్రీకృష్ణపరమాత్ముడి పేరు పెట్టుకున్నాడుకాబట్టి ఏమీ అనకూడదని వాళ్ళ మామ్మ చెప్పిందట. ఈవిడ నమ్మేసింది. ఆయనతో అస్సలు దెబ్బలాడదు.
మీ మరిదిగారి పేరుకూడా అదేకదా- అంది తను నవ్వుతూ.
తెల్లబోయింది. జవాబు వెతుక్కుంది.
ఆగమ్మకాకుల్లా ఎండలో తిరుగుతూ గోళీలు ఆడేవాళ్ళూ, కర్రాబిళ్ళా ఆడేవాళ్ళూ అవతారపురుషులవరు- కచ్చితంగా చెప్పేసింది. పరువు తీసింది ఇంక చాలన్నట్టు మాధవ్ రెండుచేతులూ ఎత్తి దణ్నం పెట్టాడు. ఆగిపోయింది. నవ్వులూ, పరిహాసాలూ చాలా వుండేవి వాళ్లమధ్య. వాళ్ళమధ్యేకాదు, ఈ పదకొండుమందిమధ్యా, ఇంకా విస్తృతంగా పదహారుమంది మధ్యా, పూర్తివృత్తమైతే పంధొమ్మిదిమందిమధ్యా. రాణాకూడా ఎక్కడో ఒక కొసని కలుస్తాడు. నువ్వీ మోటుపనులు చెయ్యలేవని తనంతట తనొచ్చి ఇంటిపనుల్లో కలగజేసుకుని చాలా సాయంచేసాడు మాధవ్‍కి. తనతో మాటకలపబోతే తులసి చెప్పింది గుర్తొచ్చి తుంచేసింది.
వాసు. తనవాళ్లని ప్రేమించుకోవడం అతన్నుంచే నేర్చుకోవాలి. గీతని ఎవరూ ఏమీ అనకూడదు. అదతని థంబ్‍రూల్. అంత బాహాటంగా భార్యని సమర్ధించినవాళ్లని ఎవరినీ చూడలేదు తను. చాలాసార్లు ఆ రూల్‍ని బ్రేక్‍చేసింది. ఐనా ఉపేక్షించాడు. మాధవ్‍కోసం ఆవిడ సర్దుకుందికాబట్టి, వాళ్ళిద్దరికోసం అతను సర్దుకున్నాడు. తండ్రి కోరికలనీ, మాటల్నీ నింపుకున్న విషభాండంలా వచ్చింది తను. చాలా అవమానించింది వీళ్లని. వీళ్ళు వెళ్లిపోతే ఇల్లు ఆక్రమించుకుని దర్జాగా బతకచ్చనుకుంది. గీతకి వున్న విలువా, గౌరవం తను తుడిచేస్తే పోయేవనుకుంది. ఆమెకి తూగదని తనకే అనిపించి, తనవాళ్ళుకూడా అన్నప్పుడైనా తను ఎదిగే ప్రయత్నం చెయ్యలేదు. ఇంకాస్త కిందికి దింపుకుంది తనని తను.
నిశబ్దంగా భరించారు. ప్రహ్లాద్, వసంత్ బంధాలు తెగకుండా వుంచేందుకు ఎంతో కృషిచేసారు. ఆస్థాయి దాటిపోయింది. తమని యింక గౌరవంగా పంపించేసారు. తనీయింటికి పరాయిదైంది. ఈ పరాయితనాన్ని కష్టపడి సాధించుకుంది. కష్టఫలం తనకి సంతోషాన్నివ్వాలికదా? ఇవ్వట్లేదు. బాధపెడుతోంది. తనొక్కర్తే వీళ్ళకి పరాయిది. మాధవ్‍మీది ప్రేమ తగ్గలేదు. అతన్ని వదులుకోలేదు. ఇల్లు కట్టడంలో చెయ్యగలిగిన సాయం చేసారు. ఎదురుగా కనిపించినా తనో మనిషి కానట్టు, ఏ వస్తువో అన్నట్టు పూర్తిగా వుపేక్షించి. కోపం, వుక్రోషం వచ్చినా భరించక తప్పని పరిస్థితి తనదీ, మాధవ్‍దీ. వాసుకి ఎన్ని పరిచయాలు! ఎన్ని స్నేహాలు! సిమెంటు, కర్ర, ఇసుక, ఇటుక అన్నిట్లో ఎంతోకొంత డిస్కౌంట్లు ఇప్పించాడు. ప్రతిచోటా బేరం పొసిగించుకున్నాడు. ముఠామేస్త్రీ, చెక్కమేస్త్రీ దగ్గర్నుంచీ ప్రతివాళ్ళూ అతనిమాటమీద ఎలాంటి మోసం చెయ్యకుండా వళ్ళుదగ్గిరపెట్టుకుని చేసారు. టైముకి పూర్తిచేసారు. ఇందులో పదిశాతంకూడా తన తండ్రిగానీ, వసంత్, ప్రహ్లద్‍లుగానీ చెయ్యలేరు. వసంత్ తండ్రి కాంట్రాక్టుకి ఇమ్మన్నాడు.
వద్దు బాబాయ్! ముంచుతారు. దగ్గిరుండి చేయించుకోవడం మంచిది- అన్నాడు వాసు. ఆయనతో అప్పటికే గొడవలున్నాయి అవంతీపురం యింటివిషయంగా. తాము కడుతున్న కొత్తిల్లు ఆయన చేతుల్లో పెట్టి సంబంధాలు పునర్నిర్మించుకోవచ్చు. ఐనా నిర్మోహమాటమే. ఏదని నేర్చుకోవాలి వాళ్ళదగ్గిర్నుంచీ?
ఖర్మ. అంతా జరిగిపోయాకకూడా వీళ్లగురించే ఆలోచిస్తోందేంటి తను? కోరుకున్న స్వేచ్ఛ దొరికాక, తర్వాతి జీవితాన్నిగురించికదా, కలలుకనాల్సింది? నెత్తి కొట్టుకుంది నీలిమ. ఆగట్లేదు దు:ఖం. తుడుచుకుంటున్నకొద్దీ కన్నీళ్ళు జాలువారుతున్నాయి.
“ఒక్కదానివీ ఇక్కడేం చేస్తున్నావే?” మానస వచ్చి పక్కని కూర్చుంది. మాధురి వస్తే మాట్లాడుకునే మాటలు వేరేగా వుంటాయి.
“పరాయిదాన్నైపోయానుకదూ? బాధనిపిస్తోంది” అంది జీరవోయిన గొంతుతో.
“నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళ మాధవ్ వాళ్ళకి పదిలంగానే వున్నాడు. అందుకే వాళ్ళు ప్రశాంతంగా పడుక్కున్నారు. నీకు నిద్ర రావట్లేదు” అని, “ప్రేమపక్షులంది మిమ్మల్ని గీత” అంది మానస.
“అదేమిటి? కొత్తగా” ఆశ్చర్యంగా అడిగింది నీలిమ.
“వాళ్లలో వాళ్ళకి కోడ్‍బాషలూ, పరిహాసాలూ చాలా వుంటాయి నీలూ! టికిల్ చేసినట్టుంటాయి. చాలా ఆహ్లాదంగా వుంటాయి. సుమంత్‍ని వీళ్లంతా చాలా ఏడిపిస్తారు. మళ్ళీ లతముందు డీసెంటుగా వుంటారు. మీ మామగారు పోయినప్పుడు వీళ్ళ అమ్మమ్మ ఏదో అందట ప్రవల్లికని. అది పట్టుకుని సుమంత్ దాన్ని ఏడిపిస్తున్నాడీమధ్య. మనం కలవకుండా గిరిగీసుకుని కూర్చున్నాంకాబట్టి మనముందు బైటపడరు. మాధవ్‍నీ ఏడిపిస్తారు. వసంత్ కొన్నికొన్ని చెప్తాడు. నేను మొదట్నుంచీ చెప్తునే వున్నాను, కోరుకున్నట్టు బతగ్గలిగేంత గొప్పగా మనం పెరగలేదు, సర్దుకుపోవాలని. మీకిద్దరికీ అర్థమవ్వలేదు. మాధురి తన అత్తమామల్ని ఆక్షేపిస్తుంది. ఎంత సరదాగా వుంటారే వాళ్ళు? రేపటి మనలా అనిపించరూ? ఎలా వుంటే బావుంటుంది దానికి? మా అత్తమామల్లా నిత్యం దెబ్బలాడుతూనా? నువ్వేనా ఎలా ఆశపడ్డావు నీలూ, ఇంత యిల్లూ మీకిచ్చేస్తారని? వాటాలెయ్యడానికేనా మీ అత్తగారు వప్పుకుంటుందనుకోలేదు నేనైతే. నాన్నకంటే ఇంగితం లేదు. పెట్టుపోతలకోసం మామయ్యలతోటీ, జాకీలు పెట్టి తనని లేపలేదని బాబాయ్, పెద్దనాన్నలతోటీ దెబ్బలాడుతుంటాడు. ఆయన మనకి నాన్న. ఎంతవరకూ వినాలో అంతవరకే వినాలి. విని పాటించే మాటలు ఏం చెప్పాడని, నువ్వంత మనసుకి ఎక్కించుకుని గీతతో దెబ్బలాడావు?” తీక్ష్ణంగా అడిగింది మానస.
తలదించుకుంది నీలిమ.
“ఈరోజు నాన్నని అదుపుచెయ్యడం ఎంతకష్టమైందో చూసావుకదా? అదే ఆమైతే తొమ్మిదికుటుంబాల పెద్దవాళ్లందర్నీ ముందునిలబెట్టి వాళ్ళ మాట ఎవరూ కాదనకుండా కట్టడిచేసి, ఐందనిపించి బైటపడేసేది. ఇకమీదట నాన్నతో కలిసి మీరు ముందుకి నడవాలి. మాధవ్‍తో గొడవలు రాకుండా చూసుకో. ఆయన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపడం నేర్చుకో. పద, వెళ్దాం” అని చెయ్యిపట్టుకుని లేవదీసింది.
వారానికల్లా ఎక్కడివాళ్లక్కడికి వెళ్ళిపోయి, ఇంట్లో సందడంతా ముగిసింది. ఇల్లు మామగారికి అప్పజెప్పి మాధవ్, నీలిమ ముంబై వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతనికి రాజస్థాన్ ట్రాన్స్ఫరైంది. ఇల్లు అద్దెలకి బానే వెళ్ళిందిగానీ వచ్చే అద్దెలకీ కట్టాల్సిన లోన్ వాయిదాలకీ కాస్త తేడా వుంది. ఇంకా చేతిదే పడుతోంది. తాము కట్టాల్సిన అద్దె అలానే వుండిపోయింది.
ఇంత యిల్లు కట్టి తను సాధించిందేమిటి? ఎవరికో సౌకర్యంగా బతకడానికి ఏర్పాట్లు చేసి, ఇక్కడ తను కిస్తులు కట్టడమా? ఎప్పుడో లోన్ తీరి, ఇల్లు తనదౌతుంది. కానీ కట్టిన వడ్డీలు, ఆస్తి పన్నులు, చేసుకున్న సర్దుబాట్లు, కుదించుకున్న అవసరాలు, తగ్గించుకున్న సరదాలు, ఇవన్నీ ఆరోజు పెరగబోయే ఆస్తివిలువకి సమానమౌతాయా అనే ఒక వైరాగ్యంలో పడ్డాడు మాధవ్.


తర్వాతిది నిర్మల మరణం. అదైన నెలకే విజ్జెమ్మ పోయింది. ఇద్దరు భగ్నప్రేమికులు చావింట్లో కలుసుకున్నారు. ఒకరు సుధీర్, ఇంకొకరు కృష్ణ.
మాధవ్‍కి ముంబై ట్రాన్స్ఫరైన కొత్తలో కృష్ణ అతనింటికి వస్తానని ఫోన్‍చేసాడు.
“బావా! ఫ్రెండు పెళ్ళికి అక్కడికి వస్తున్నాను. అట్నుంచీ మీయింటికి వస్తాను. భవానీ నీకు గుర్తుందా? దాన్ని తీసుకొస్తాను. కొంచెం మాట్లాడుకోవాలి. సమస్యేం లేదుకదా? అక్కేం అనదుగా?” అని అడిగాడు.
“భవానీ అంటే మీ చిన్నమేనమామ కూతురేకదా? ఆ అమ్మాయి చదువైపోయిందా? ఏం చేస్తోంది? హాయిగా పెళ్ళిచేసుకోక ఈ వెంటేసుకుని తిరగడమేంట్రా?” అన్నాడు మాధవ్.
“అక్కడికొచ్చాక నీకే తెలుస్తుందిలే” అన్నాడు కృష్ణ.
“సర్లె. వచ్చేసెయ్యండి” అన్నాడు మాధవ్.
“ఎవరు?” అడిగింది నీలిమ. చెవులు రిక్కించాడు కుటుంబరావు. చెప్పాడు మాధవ్. ఇంతదూరం వచ్చాకకూడా గీత, గీత ఛాయలు తనని వదలవా? నీలిమ సుదీర్ఘంగా నిశ్వసించింది.
అతను బెంగుళూరునుంచీ నేరుగా పెళ్ళిమంటపానికి వెళ్ళి, పెళ్ళి చూసుకుని, రాత్రికి వాళ్ళిచ్చిన విడిలో వుండి, పొద్దున్నే ఫ్రెషై, భవానీ దగ్గరకి వెళ్ళాడు. ఆమెని తీసుకుని వీళ్ళింటికి వచ్చేసరికి పదైంది. నవ్వుతూ, తుళ్ళుతూ గాలిదుమారంలా వచ్చారు ఇద్దరూ. పెళ్ళింటిలో ఇచ్చిన స్వీట్సు, చీర, అమ్మ పంపించిందని మరోచీర నీలిమ చేతిలో పెట్టాడు.
“అయ్యో! ఇవన్నీ ఏమిటి?” అంది.
“అక్కవికదా, తీసేసుకోలే” అన్నాడు. అందరికీ భవానీని పరిచయం చేసాడు కృష్ణ. చక్కగా చేతులు జోడించి దణ్నం పెట్టింది ఆపిల్ల.
వీళ్ళింట్లో మర్యాదకీ మన్ననకీ లోటు లేదు. అసలా పిల్ల నవ్వులకే నవరత్నాలివ్వచ్చు- అనుకుంది కమలాక్షి.
ఆవిడ టిఫెను పెడితే తిన్నారు. మామూలు మాటలయ్యాయి కాసేపు.
“ఏరా, నన్ను పెళ్ళి చేసేసుకుందామనే?” వున్నట్టుండి అడిగింది భవానీ. అదేం ప్రశ్న? అందరూ తెల్లబోయారు.
“పెద్దవాళ్ళడిగారు, కాదంటే బావోదని సరేనందామనుకుంటున్నాను. చెప్పు, నువ్వొద్దంటే మానేస్తాను” అన్నాడు కృష్ణ.
“నాకన్నా నువ్వెంత పెద్దని? ఆర్నెల్లు. అంతేగా? ఇప్పటిదాకా మీ మామ్మ, అమ్మమ్మ, అమ్మ, అక్క నిన్ను ముద్దుచేసి, ముక్కూ, మూతీ తుడుస్తూ పెంచారు. ఇప్పుడింక పెళ్ళిచేసుకుని నేను చెయ్యాలా?” అంది.
“సూటిగా చెప్పు. నువ్వు సరేనంటే సరే. వద్దంటే వద్దు” అన్నాడతను.
“భార్యాభర్తలంటే వాసూగీతల్లా వుండాలి. ఆయనేమో, అంతపొడుగు. గీతకన్నా ఐదేళ్ళు పెద్ద. చక్కగా బుజ్జిపిల్లని చూసినట్టు చూసుకుంటారు దాన్ని. మా అమ్మంటుంది,
అతను దాన్ని పెళ్ళిచేసుకున్నాడా, పెంచుకుంటున్నాడా- అని”
“డౌటక్కర్లేదని చెప్పు ఆవిడకి. వాళ్ళు పెళ్ళే చేసుకున్నారు. ఇద్దరు పిల్లలుకూడా పుట్టారు”
“సిగ్గులేదు” తిట్టింది భవాని.
మాధవ్ నవ్వేసాడు. నీలిమ నవ్వాపుకుంది. బాబోయ్, ఇలా మాట్లాడేసుకుంటున్నారేంటి వీళ్లని కాస్త కంగారేసింది. అది గమనించి అన్నాడు కృష్ణ. “నేను మా అక్కలాగ కాదు. దాన్ని బోల్డన్ని తప్పొప్పులు చెప్పి పెంచారు. నేను తప్పించుకుని బైటపడ్డాను. ఆ కోటాకూడాఆ దానికే పడింది. అవంతీపురంలో మాకు సెటలైటు బేచని పేరు. వీళ్ళచుట్టూ ఉపగ్రహాల్లా తిరుగుతుంటామని. ఛస్, మా బేచి మేమే విడిగా వుందామనుకుంటే అంతా ఆడమళయాళం. తులసి, వల్లి, సమీర. ఊళ్ళో వున్న కంగన్‍హాల్సన్నిటికీ వాళ్లని తిప్పాలి. ఏ గాజులు ఎవరికి బావుంటాయో, రిబ్బన్లు, రబ్బర్‍బాండ్లు ఎలా పెట్టుకోవాలో ఏ పిలకకి ఏది సరిపోతుందోలాంటి విషయాలమీద కనీసపు అవగాహన వుండాలి. ప్రహీ తప్పించుకునేవాడు. మాధవ్, వసంత్‍లు బుక్కైపోయేవారు. ఇలా లాభంలేదని నేను మా అమ్మమ్మావాళ్ళింటికి మారిపోయాను. ఎక్కువ అక్కడే పెరిగాను. అక్కడ మగాళ్ళు నలుగురు, మగరాయుళ్ళు ముగ్గురు”
“అరేయ్, మనం ఇక్కడికి కబుర్లు చెప్పుకోవడానికి వచ్చామా? మాట్లాడుకోవడానికా?” అడిగింది భవానీ.
“రెండిటికీ తేడా ఏమిటో?”
“ఎప్పటికీ ఇలానే నవ్వుతూ మాట్లాడుకుంటూ కాలం జరిగిపోదుకదా? ఆడపిల్లని కాబట్టి నాకు కొన్ని కష్టాలొస్తాయి. నువ్వే పిల్లాడివి, నన్నేం చూసుకోగలవు? నేను ఏడిస్తే నాతో కలిసి ఏడుస్తావు. నా కష్టం మాట అటుంచి, నిన్నుకూడా నేనే వోదార్చాలి. మనిద్దరం కలిసి ఎన్నిసార్లు ఏడ్చివుంటామో గుర్తుతెచ్చుకో” అంది.
“ఇంకెవర్నేనా అనుకుంటున్నావా భవానీ? నిజం చెప్పమ్మా!” అనుమానంగా అడిగాడు.
“ఏం? జెలసీయా? అలాంటిదేం లేదులే. నాకు నాబట్టలే సెలక్ట్ చేసుకోవడం రాదు, మొగుణ్ణేం వెతుక్కుంటాను? మాఅమ్మ మానాన్నని చేసుకుంది చూడు, అది బెస్ట్ పిక్. ఆవిడకే వదిలేస్తాను”
“మా వల్లి గుర్తుందా? వాళ్ళాయన కజినొకడు చాలా హేండ్సమ్‍గా వుంటాడు” అన్నాడు కృష్ణ అల్లరిగా.
“ఇంకా బ్రేకప్పే పూర్తవలేదు, అప్పుడే నాకు సంబంధాలు చూడటం మొదలెట్టేసావా?”
“కాదే, ఎవరో ఒకర్ని ఇరికించి, ఇక నేను బైటపడదామని”
“నిన్నూ… ” చూపుడువేలు చూపిస్తూ బెదిరించింది.
“ముందు నేను చెప్తే బావోదు. ఆడపిల్లవి, నువ్వు చెప్పేసెయ్” అన్నాడతను.
“మా నాన్న తంతాడేమోరా! ” అంది బెంగగా.
“ఇప్పుడేగా, బెస్ట్ పిక్ అన్నావు?”
“కంటెక్స్చువల్‍గా అన్నాను. అదీ యిదీ ఒకటెలాగౌతుంది?”
మాధవ్ కలగజేసుకున్నాడు. “కృష్ణా! మాట్లాడుకోవాలంటే యూయస్ వెళ్ళడం గురించనుకున్నాను. పెళ్ళొద్దనుకోవడమేంట్రా? అదికూడా మీకు మీరే అనేసుకుంటారా?” అడిగాడు.
“ముందు మేమొక నిర్ణయానికి వస్తేకదా, ఇంట్లోవాళ్ళకి చెప్పగలిగేది?”
“అదేరా, ఎందుకొద్దనుకుంటున్నారు? ఇద్దరూ బీటెక్ చదివారు. సాఫ్ట్‌వేర్ వుద్యోగాలు. అమెరికా అవకాశంకూడా వచ్చింది. ఇద్దరూ కలిసి వెళ్లచ్చుకదా?”
“నూతిగట్టు రివలేషన్ బావా!” అన్నాడు కృష్ణ.
ఫక్కుమని నవ్వింది భవానీ. “వదినా! మీ యిల్లు చూపించు నాకు” అంటూ లేచింది. నీలిమ ఆ అమ్మాయిని లోపలికి వెంటబెట్టుకుని వెళ్లింది. కమలాక్షికూడా వెళ్లింది. “చక్కటి సంబంధం. ఎందుకు వద్దనుకుంటున్నావు?” మృదువుగా అడిగింది.
“ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? అస్సలు సీరియస్‍నెస్ లేదు. చిన్నప్పట్నుంచీ ఇద్దరం యింతే. ఎప్పుడూ ఒకరిగురించి ఒకరం సీరియస్‍గా అనుకోలేదు. వాడు మాయింటికి రావడం, పొలాలమ్మటా, చేలమ్మటా బలాదూర్ తిరగడం, తిరిగెళ్ళిపోవడం, అంతే. ఇంట్లో అలాంటి మాట ఒకటిరెండుసార్లు మా మామ్మ వున్నప్పుడు వచ్చినా, అప్పటికి చిన్నవాళ్లం. పెద్దావిడకి ఎదురుచెప్పడం దేనికనుకుని వూరుకున్నారేమో, తర్వాతెప్పుడూ ఎవరూ అనలేదు. కాబోయే భార్యాభర్తలమని మాకెప్పుడూ అనిపించలేదు. ఇప్పుడేమో అమ్మానాన్నలు ముహుర్తాలు పెట్టుకుందామంటున్నారు. మాకిద్దరికీ ఏదో ఆబ్లిగేషన్లో ఇరుక్కుపోతున్నట్టుందితప్ప సరదాగా లేదు. అదీకాక…” కొద్దిగా సంకోచించి అంది. “విహీకి మాటలు ఆలస్యమయ్యాయి. అసలు రాకపోతే? తెలీక తప్పుచేస్తే దేవుడు ఒకసారి మన్నిస్తాడు. తెలిసాకకూడా చేస్తే ఎలా?” పూర్తిచేసింది.
“విహీకేం తక్కువ? చక్కగా పనసపండులా వున్నాడు. మామూలుగానే కొంతమంది పిల్లలకి నడక, మాటలు ఆలస్యమౌతాయి. ఇందుకేననుకోకూడదు. పెద్దవాళ్ళకి చెప్పి ఆలోచించుకోండమ్మా ఇద్దరూ! తొందరపడద్దు. అన్నీ అమరిన సంబంధం, అర్థంచేసుకునే మనిషీ దొరకడం కష్టం” మరోసారి చెప్పింది కమలాక్షి.
అక్కడ హాల్లో మాధవ్ అడిగాడు, “అదేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పరా” అని.
“మా మామయ్యగారిల్లు నీకు గుర్తుందికదా? పెద్దనుయ్యీ, దాని చుట్టూ చప్టా. వేసవిసెలవుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. పెద్దమామయ్య పిల్లలు నలుగురు, వీళ్ళు ముగ్గురు, మేం ఇద్దరం. పెద్దత్తది పొయ్యి పెట్టి వేణ్ణీళ్ళు కాచిచ్చే బాధ్యత. మామయ్యది మా అందరినీ తళతళ్ళాడేలా తోమే బాధ్యత. అందర్లోకీ మేమిద్దరం చిన్న. మాయిద్దర్నీ బట్టలు ఇప్పించి కూర్చోబెట్టేవారు, నీళ్ళుపొయ్యడానికి. స్నానాలు చేసాక ఒకళ్ల వెనక ఒకళ్లం బట్టలెయ్యనీకుండా తప్పించుకుని అటూయిటూ పరుగులు పెట్టేవాళ్లంట. మూడేళ్ళదాకానో నాలుగేళ్లదాకానో సిగ్గన్నది తెలీకుండా అలా చేసుంటాం. వాళ్ళ అక్కలూ, అన్నల పిల్లల్తో సీను రిపీటయ్యి, దీనికి జ్ఞానోదయమైంది.
మనక్కూడా ఇలానే జరిగుంటుందికదా? కవలపిల్లల్లా ఒకళ్ళేడుస్తుంటే చూసి ఇంకొకళ్ళం ఏడుపు అందుకునేవాళ్ళమట. ఒకళ్ల బట్టలు ఒకళ్ళం వేసుకుని పెరిగాం. పెళ్లంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయితప్ప రొమాంటిక్ ఫీలింగ్సేం రావట్లేదు. నువ్వో అన్నవో తమ్ముడివో అనిపించి తప్పనిపిస్తోంది – అంది.
తనకి ఇష్టంలేదని అర్థమైంది. వాళ్ళింట్లో పూజలూ అవీ ఎక్కువ. తనుకూడ ఏవో మొక్కులవీ మొక్కుకుని వుపోషాలుంటుంది. కార్తీకస్నానాలు చేస్తుంది. మాఘపు ఆదివారాలూ, మార్గశిర లక్ష్మివారాలూ అది చెప్తేనే తెలిసింది. ఎక్కడ మనసుకి తప్పనిపించిందో! ఆడపిల్ల నో అంటే నోయే. నాకన్నా ఆర్నెల్లు చిన్నది తను. భవానీది పెళ్ళివయసే. నాకుమాత్రం అప్పుడే పెళ్ళేంటనిపిస్తోంది. ఒక్కదాన్నీ అమెరికా పంపడం వాళ్లకిష్టం లేదు. వచ్చిన అవకాశం వదులుకోవడం దీనికిష్టం లేదు. మేం పెద్దపెద్ద కాలేజిల్లో చదవలేదు. వైటూకేకోసం చాలామందిని పంపిస్తున్నారు. ఇప్పుడు తప్పితే మాకు యూయస్ అవకాశాలు రావడం కష్టం. ఎన్నాళ్ళు వుంచుతారనేది వేరే విషయం. మేం ఒక నిర్ణయానికొస్తే వాళ్ళు బైట సంబంధం చూసుకుంటారని ఆలోచన. మొదట్నుంచీ మా మంచిచెడులు చూసారు మామయ్యలు. ఇప్పుడు కాదంటే బాధపడతారేమోనని భయం. తనకి మరో సంబంధం దొరకదని కాదు. మంచిపిల్ల. చక్కటి జాబ్. కళ్ళకద్దుకుని చేసుకుంటారు. నేనక్కడ, తనిక్కడ. ఫోన్లో ఇలాంటి విషయాలేం మాట్లాడుకుంటాం? అందుకే ఇక్కడికొచ్చాం” అన్నాడు.
“ఇద్దరికీ అంత యిష్టం లేకపోతే వద్దులే కృష్ణా! ఎవరికి వాళ్ళకే మంచి సంబంధాలే దొరుకుతాయి. వాసుకి చెప్పు. వాడైతే ఎవరూ నొచ్చుకోకుండా నడిపిస్తాడు. పిల్ల వెళ్ళేలోగా సంబంధంకూడా వెతకగలడు. మనిళ్ళలోనే వెతికితే దొరుకుతారు. నువ్వన్నట్టు అమెరికా వెళ్లబోయే పిల్లంటే ఎవరేనా సంతోషంగా చేసుకుంటారు” అన్నాడు మాధవ్.
లోపలికెళ్ళిన ముగ్గురూ ఇవతలికొచ్చారు.
“చెప్పేసావా?” అడిగింది భవానీ మళ్ళీ ఫక్కుమని నవ్వి. చెక్కిళ్ళు కాస్త ఎర్రబడ్డాయి. “బుజ్జాళ్ళిద్దర్నీ చూస్తుంటే మనిద్దరమే గుర్తొచ్చాం. అమ్మకూడా గుర్తుచేసుకుని నవ్వింది” అంది. మరికాసిని మాటలు నడిచాయి. భవానీవాళ్ళకి ఆస్తులేం వున్నాయో, ఆ పిల్ల జీతం ఎంతో అడిగి తెలుసుకున్నాడు కుటుంబరావు.
“ఆడపిల్లలకి అంతంత జీతాలిస్తారా?” ఆశ్చర్యంగా అడిగాడు. అలాంటి సంబంధం వదులుకుంటున్నందుకు కృష్ణని వింతగా చూసాడు. ఏదో ఒకటి నచ్చజెప్పి చేసుకోవాలిగానీ అనుకున్నాడు.
“నీకు వంటా అవీ వచ్చా?” అడిగింది కమలాక్షి కుతుహలంగా. చదువుకుని వుద్యోగం చేసే ఆడపిల్లలంటే గీతతో మొదలైన ఆవిడ గౌరవం భవానీని చూసి పెరిగింది.
“మీరలా అడక్కండి. వంటల్తో చంపుతారు వీళ్ళంతా. మా అక్కకీ వీళ్ళకీ పెద్దపోటీ. దానికొచ్చినవన్నీ వీళ్ళకి వచ్చెయ్యాలి. వీళ్ళు వండిపెట్టినవన్నీ ఎలా చేసారో రహస్యంగా కనిపెట్టి దానికి చెప్పాలి” అన్నాడు.
“గీతకూడా బాగా వండుతుంది” ప్రశంసగా అంది కమలాక్షి.
“జ్ఞానప్రసూనాంబా! నీవంటిని జ్ఞానమేమిటే, ఇలా అంటుకుని ధగధగా మెరిసిపోతోంది? కొత్తగా ఏం నేర్చుకున్నావు? అప్పుడేదో గోళీలాడుకొమ్మని మంచూరియన్ బాల్స్ ఇచ్చావు మీ అన్న పిల్లలకి, దాన్ని ఇంప్రూవ్ చేసావేంటి కొంపతీసి? ” అడిగాడు కృష్ణ.
“మీ అక్కకి మోసేద్దామనే? అలా చెప్పేస్తారేంటి?”
“కనీసం క్లూ ఇవ్వవే. నువ్వు సడెన్‍గా దాని విస్తట్లో ఏదేనా వేసావనుకో, నాకు బేండు బజాయిస్తుంది” బతిమాలాడు. ఆమె మూతి మూడువంకర్లు తిప్పింది.
“ఇద్దరూ ఇలాగే మాట్లాడుకుంటూ వుంటారా? మీ అక్కతో బానే వుంటావుకదా?” అంది నీలిమ నవ్వీ నవ్వీ కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా.
“మా అక్కా? జోక్ వేస్తే సరిపోదు దాంతో. జోకేసాను, నవ్వవే అనేదాకా నవ్వదు” అన్నాడు కృష్ణ.
భోజనాలవేళైంది. కమలాక్షి లేచి ఏర్పాట్లు చూస్తుంటే భవానీ లేచి వెళ్ళింది. కంచాలూ, మంచినీళ్ళూ పెట్టింది.
“నువ్వెందుకు భవానీ? కూర్చో” అని, డైనింగ్ టేబుల్‍ముందు కూర్చోబెట్టింది నీలిమ. తినడం అయింది. ఇద్దరూ వాళ్ళ ప్లేట్లు సింకులో వేసి వచ్చారు.
“ఇంక వెళ్తాం బావా! నీ బైకు ఇస్తావా? భవానీని వాళ్ళ ఫ్లాట్‍లో దించేసి వస్తాను. రాత్రి ఇక్కడే వుంటాను. రేపు ఏడింటికి నాకు ఫ్లైట్. నాలుగున్నరకల్లా బయల్దేరాలి. మీకేం ఇబ్బందవదుకదా?” అన్నాడు కృష్ణ.
“ఈ మర్యాదలెప్పట్నుంచీ?” కోప్పడి, మాధవ్ తాళాలు తెచ్చిచ్చాడు. నీలిమ భవానీకి బొట్టుపెట్టి చీర పెట్టింది. “ఇక్కడున్నన్నిరోజులూ అప్పుడప్పుడు వస్తుండు. మీ గీతేకాదు, నేనూ నీకు వదిన్నే” అంది. వస్తానన్నట్టు తలూపింది.
“వదినా! నువ్వు చాలా అప్డేట్ కావాలి. ఇప్పుడింక ఇలా చీరలవీ పెట్టకూడదు. సింపుల్‍గా ఒక జీన్సో, టాపో పెట్టాలి” కృష్ణ ఏదో అంటుంటే వింటున్నదల్లా వున్నట్టుండి అంది. గీత గుర్తొచ్చింది నీలిమకి.
“నేను కొనిస్తాలే, పద” అన్నాడు కృష్ణ.
“నిజంగానే కొనిస్తావా?” అడిగింది.
“అదేం ప్రశ్నే? అబద్దంగా కొనడంకూడా వుంటుందా?”
“నీమాటలు నిజమేనా, అని?”
“భగవద్గీతమీద ప్రమాణం చేసి – అని చెప్తూ వుండాలా యేంటి, నీముందు?”
“పోరా!” అంది.
“పొమ్మనా, రమ్మనా? రెండూ చెయ్యమనా?” అన్నాడు.
“అక్కడికెళ్ళాక బిల్లు నన్నే కట్టుకోమంటావేమోనని”
“నీలా అనుకున్నావా? హోటలుకి వెళ్దామని ప్రపోజల్ పెట్టి బిల్లు మగపిల్లలే కట్టాలనడానికి?” అతను వేలెట్‍లోంచీ డెబిట్‍కార్డు తీసిచ్చాడు.
“దగ్గరుంచుకో” అన్నాడు. ఆమె జాగ్రత్తగా బేగ్‍లో పెట్టుకుంది.
“పిన్?”
“అబ్బో! అది మర్చిపోవేం? చాక్లెట్టిస్తారుగానీ, రేపర్ తీసిస్తారా?”
“మూడుసార్లు తప్పు కొడితే బ్లాకైపోతుంది. అదా, నీ తెలివి?”
“గెస్ చేస్తావనుకున్నాను. అక్క పుట్టిన సంవత్సరం” అన్నాడు.
అప్పటిదాకా మామూలుగా వాళ్లమాటలు వింటున్న నీలిమ వులిక్కిపడింది.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
“అమ్మయ్య, గాలిదుమారం వెలిసినట్టుందే, నీలూ! ఒకళ్లకి ఇద్దరయ్యారు. కాగితాలూ, పుస్తకాలూ సరిగ్గా వున్నాయో వీళ్లగాలికి కొట్టుకుపోయాయో చూడు” అన్నాడు మాధవ్ నవ్వుతూ. నీలిమా నవ్వేసింది.
“మేం లోపల కూర్చున్నప్పుడు ఏం చెప్పాడు?” కుతుహలంగా అడిగింది.
“తర్వాత చెప్తాను” అన్నాడు. పనుందని బైటికి వెళ్లాడు. అతను లేని టైము కుటుంబరావుకి ఆటవిడుపు.
“ఇద్దరూ చక్కగా వున్నారు. చేసుకోవడానికేం? అసలు మీయింట్లో పిల్లపెత్తనాలు ఎక్కువ” అన్నాడు కుటుంబరావు.
“మేనరికంకదా, భయపడుతున్నారు” ఏం చెప్పాలో తెలీక అంది నీలిమ.
“గీతది అదేకదా?”
“వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు వద్దనుకుంటున్నారు” విసుక్కుంది.
మాధవ్ తిరిగొచ్చాక చాలాసేపటిదాకా కృష్ణ రాకపోయేసరికి అతను కంగారుపడ్డాడు. మనసు పరిపరివిధాల పోయింది. ఎనిమిదౌతుంటే మొహం వేలాడేసుకుని వచ్చాడు. సోఫాలో కూలబడ్డాడు. నీలిమ మంచినీళ్ళు తెచ్చిచ్చింది.
“కాఫీ తాగుతావా? అన్నం తినేస్తావా?” అడిగింది.
“ప్లీజక్కా, ఓ కప్పు కాఫీ యిస్తావా? తల వేడెక్కిపోయింది” అన్నాడు. కమలాక్షి వెళ్ళింది కాఫీ తేవడానికి.
“చాలా తిక్కచేసింది బావా! జీన్స్ కొనిమ్మంది. పది షాపులకేనా తిరిగాం. ఏవీ నచ్చలేదంది.
అన్నీ నీలంవేనా? వెరైటీకేనా ఎరుపో పసుపో పెట్టచ్చుకదా- అని ఒక షాపులో దెబ్బలాట వేసుకుంది షాప్‍వాడికి రూఫ్‍లోంచే చుక్కలు కనిపించాయి. దానికి కొనే వుద్దేశం లేదని అర్థమైంది. బైటికి వచ్చేసాం.
వద్దులేరా! తొడుక్కున్నప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు. అదో బాధ. కాఫీషాప్‍కి వెళ్దాం. అదైతే అరిగిపోతుంది- అంది.
వెళ్ళాం. ఏడుపు మొదలెట్టింది. టిష్యూలు ఇస్తూ కూర్చున్నాను. చివర్లో నాకూ ఇచ్చింది. నేనూ ఏడుస్తున్నానని అప్పుడర్థమైంది. ఇంకెక్కడికేనా వెళ్దామంది. ఫుల్‍టాంకు కొట్టించాను. అలా దారీతెన్నూలేకుండా తిరిగాం” అన్నాడు తలదించుకుని.
“మరేంట్రా, ఇది? చిన్నప్పుడేవో జరుగుతాయి. మర్చిపోవాలి. మీ అక్క బానే చేసుకుందికదా?”
“తను అదేమాటమీద వుంది. విడిపోతున్నవాళ్ళంతా ప్రేమతోనే బాధపడుతున్నారని కాదు. వీణనీ, అర్చననీ, పల్లవినీ చూడాలనిపించిదనుకో, వాళ్ళకి అన్ననని స్వతంత్రంగా వెళ్ళిపోగలుగుతాను. అదే వల్లీ, సమీరా, తులసీవాళ్లనుకో, క్రాస్‍కజిన్స్‌మి కాబట్టి కొంచెం స్కానింగ్ వుంటుంది. వాళ్ళు ముగ్గురూ నాకన్నా పెద్ద. మరీ అంత తప్పేం పట్టరు. దీన్ని చూడాలనిపిస్తే ఏం చెప్పుకుని వెళ్తాను? తను నన్ను చూడాలన్నా అంతేకదా? లోతైన ఒక అనుబంధాన్ని దేంతోటో ముడిపెట్టేస్తారు. ఆ సంబంధం లేకుండా అంతలోతైన అనుబంధం వుండదనే ఒక తీర్మానం ప్రపంచాన్ని శాసిస్తూ వుంటుంది. లోకంలో వున్నవన్నీ ప్రేమలు కావు బావా! విడివడలేని ఇలాంటి స్నేహబంధాలే ఎక్కువ. విడిపోతామేమోనన్న భయంతో పెళ్ళిచేసుకుంటారు. చేసుకున్నాక కలిసివుండలేక విడిపోతున్నారు. కలిసి చదువుకోవడాలూ వుద్యోగం చెయ్యటాలూ వచ్చాక స్నేహాలు పెరిగాయి. వాటిని హేండిల్ చెయ్యడంలో మేం ఫెయిలౌతున్నాం. ప్లేటోనిక్ లవ్వూ, బ్యూబోనిక్ ప్లేగూ వుండవు హ్యుమన్ రిలేషన్స్‌లో. ఉండేదల్లా స్నేహం, ప్రేమా అంతే ” అన్నాడు. అతనేనా, భవానీతో కలిసి అంత అల్లరిచేసిందని ఆశ్చర్యపోయింది నీలిమ.
ఫోన్ తీసుకుని భవానికి రింగ్ చేసాడు.
“భవానీ! ఏంచేస్తున్నావే?”
“…”
“నేనిప్పుడే యింటికొచ్చాను. ఎనిమిదైందికదా, కాస్తేదైనా తినేసి పడుక్కో. రేపటికి అన్నీ మర్చిపోతావు” అని పెట్టేసాడు. మాధవ్‍తో కొనసాగించాడు.
“పెళ్ళి వద్దనుకోవడం ఒక్కటే కాదుబావా! ఆ విషయంలో గట్టిగానే వుందిగానీ, మిగతా విషయాలకి చాలా బాధపడుతోంది. అవడానికి తాతయ్య ఇచ్చినది ఇద్దరు మామయ్యలకీ చెరో పన్నెండెకరాలుగానీ, పెద్దగా ఏమీ పండవు. తొండలుగుడ్లు పెట్టే ఊసరక్షేత్రం అంటారే, అలాంటి భూములవి. వేరే డబ్బేదో కొద్దిగా వస్తే, ఈ భూమి చాలావరకూ అమ్మేసి, కెనాల్‍కింద అక్కావాళ్ళూ కొన్నప్పుడు చెరో నాలుగెకరాలూ తీసుకున్నారు. అవసరాలు వచ్చినప్పుడల్లా అందులోంచీకూడా ఎకరం అరెకరం అమ్మేసారు. మగపిల్లలకి సరైన చదువులూ, వుద్యోగాలూ లేవు. ఇదొక్కర్తే నన్ను చూసి చదువుకోవడం మొదలుపెట్టింది. దీని చదువుకీ అమ్మారు. ఎవ్వెరి సిల్వర్ లైనింగ్ హేజ్ అ డార్క్ క్లౌడ్ విదిన్. దీని వుద్యోగం వెనకా అంతే. ఇప్పుడు నన్ను చేసుకోననేసింది. బైటి సంబంధం అంటే ఎంత ఖర్చౌతుందోనని బెంగపడుతోంది” అన్నాడు.
మాధవ్ తలూపాడు. ఆ అమ్మాయిది తెలివైన నిర్ణయమో కాదో నిర్ధారించలేకపోయాడు.
“అక్కావాళ్ల పొలం కౌలు వీళ్ళే చూస్తున్నారు. బావకి కోపం వస్తుందేమోనని భయపడుతోంది” అన్నాడు.
“అవన్నీ తర్వాత. నీకు భవానీ అంటే ఇష్టమా, కాదా?” నిలదీసాడు మాధవ్.
“ఇష్టం వుంటే పెళ్ళిచేసుకోవడానికింత తటపటాయింపు దేనికి? లేకపోతే ఎందుకింత బాధ? అదే, ఇద్దరం తేల్చుకోలేకపోతున్నాం” అన్నాడు.
“మీ అమ్మ పుట్టింటిపేరుగానీ తిక్కాపురంవాళ్ళా?” అన్నాడు మాధవ్ కోపంగా.
“పెద్దవాళ్ళున్నారుగా, తేల్చిపెడతారుగానీ, భోజనాలకి లేవండి” అంది కమలాక్షి. పెద్దగా ఆకలి లేదని, తిన్నాననిపించి, హాల్లో సోఫాలో పడుక్కున్నాడు కృష్ణ. గుడ్‍నైట్ చెప్పి వాళ్లగదిలోకి వెళ్ళారు మాధవ్, నీలిమ. మరోగదిలో కమలాక్షి, కుటుంబరావు దంపతులు పడుక్కున్నారు. మాధవ్‍కూడా హాల్లోనే పడుక్కోవాలనుకున్నాడుగానీ, ఇంట్లో కదపగలిగే మంచం లేదు.
“వీళ్ళిద్దరూ మరీ ఎడం లేకుండా పెరిగారు. అక్కడే అవే వూళ్ళలో వుండి వుంటే ఇంత ఆలోచన వుండేదికాదు. జీవనశైలి మారి, రకరకాల మనుషుల్ని చూసేసరికి ఆలోచనలు విస్తృతమయ్యాయి. నాకు తెలిసి భవానీని ఎవరో డిస్టర్బ్ చేసారు. అందుకే తప్పొప్పులమధ్య సతమతమౌతోంది” అన్నాడు మాధవ్, వీళ్ళ పరోక్షంలో తనకి కృష్ణ చెప్పిన విషయాన్ని నీలిమతో చెప్తూ.
“మీ అన్నయ్యావదినలుకూడా చిన్నప్పట్నుంచీ తెలిసినవాళ్ళే” అంది నీలిమ.
“అక్కడ పెళ్ళి చేసుకుందామనుకున్నది వాళ్ళిద్దరూ. ఇక్కడ వీళ్లకి చేస్తామంటున్నది పెద్దవాళ్లు. ఎప్పుడేనా మాటవరసకి అనుకున్నా, ఆర్నెల్లు వారా అంటే వరహీనంగానే చూస్తారు. అమెరికా వెళ్లబోయే పిల్లకి ఇప్పటికిప్పుడు సంబంధం ఎక్కడ్నుంచీ తెస్తాం, ఇంట్లో యింట్లో ముడిపెట్టేస్తే ఖర్చుండదులాంటి ఆలోచనల్లోంచీ ఈ ప్రతిపాదన పుట్టింది. రేపు వీడు వెళ్ళాక ఆ పిల్లని తీసుకొచ్చి మాట్లాడదాం” అన్నాడు.
అక్కడ భవానీ ఏడుస్తోంది, ఇక్కడ కృష్ణ ఓదార్చుతున్నాడు. అర్ధరాత్రయేదాకా ఫోన్లు నడిచాయి. ఎంత చిన్నగొంతుతో మాట్లాడుకున్నా ఒకటో రెండోమాటలు వినిపిస్తునే వున్నాయి మాధవ్‍వాళ్ళకి. అంతరాత్రిదాకా మాట్లాడాకకూడా పొద్దున్నే లేచి తయారై వెళ్ళిపోయాడు కృష్ణ.
“సెటిలైపోయింది బావా! తన కొలీగెవరో ప్రపోజ్ చేసాడట. నేనేమన్నా అనుకుంటానేమోనని భయపడింది. నన్ను బాధపెట్టానని రాత్రంతా ఏడ్చింది. అతని వివరాలవీ అడగడానికి నాకు నామర్దాగా అనిపించింది. నీకు చెప్తుందేమో! అతనెవరో ఎలాంటివాడో కొంచెం తెలుసుకుంటావా? మరీ పట్టనట్టో, కోపం వచ్చినట్టో దాని ఖర్మానికి దాన్ని వదిలెయ్యలేను. మంచిపిల్లే. పెద్దవాళ్ళు ఈ ఆలోచన మొదలుపెట్టకపోతే తనే మామూలుగా చెప్పేసేది. నేనే వెళ్లి అతన్ని పరిచయం చేసుకుని వచ్చేవాడిని. ఇప్పుడేంటో అదంత బాగా అనిపించలేదు. మా దు:ఖాలూ కన్నీళ్ళూ అతనిముందు వొలికిపోతాయని భయం” వెళ్తూ చెప్పాడు.
“మరి నీ సంగతేంట్రా?” అడిగాడు మాధవ్. తననుకున్నది నిజంకావడం ఆశ్చర్యం కలిగించింది.ఆ క్షణాన తనకి కలిగింది బాధో కోపమో అతనికే తెలీలేదు. కృష్ణ విషయం వూహకికూడా అందలేదు.
“పెళ్ళీడు వచ్చింది దానికి, నాకు కాదు. నాకింకా నాలుగేళ్ళు టైమ్ కావాలి. అప్పటికి దీనిలాంటి తింగరిమేళాన్ని హేండిల్ చెయ్యగలిగే వయసు వస్తుంది” అనేసి వెళ్ళిపోయాడు.
“అయ్యో!” అంది నీలిమ.