ఝరి 141-150 by S Sridevi

  1. ఝరి 101-110 by S Sridevi
  2. ఝరి 111-120 by S Sridevi
  3. ఝరి 121-130 by S Sridevi
  4. ఝరి 131-140 by S Sridevi
  5. ఝరి 141-150 by S Sridevi
  6. ఝరి 151-160 by S Sridevi

(“మరి నీ సంగతేంట్రా?” అడిగాడు మాధవ్. తననుకున్నది నిజంకావడం ఆశ్చర్యం కలిగించింది. ఆక్షణాన తనకి కలిగింది బాధో కోపమో అతనికే తెలీలేదు. కృష్ణ విషయం వూహకికూడా అందలేదు.
“పెళ్ళీడు వచ్చింది దానికి, నాకు కాదు. నాకింకా నాలుగేళ్ళు టైమ్ కావాలి. అప్పటికి దీనిలాంటి తింగరిమేళాన్ని హేండిల్ చెయ్యగలిగే వయసు వస్తుంది” అనేసి వెళ్ళిపోయాడు.
“అయ్యో!” అంది నీలిమ.)
కృష్ణ వెళ్లిన కాసేపటికి భవానీ మాధవ్‍కి ఫోన్ చేసింది.
“అన్నయ్యా! కృష్ణ వెళ్ళిపోయాడా?”అడిగింది. మాధవ్ కోపాన్ని తమాయించుకున్నాడు.
“ఇప్పుడే వెళ్ళాడు” అన్నాడు.
“నీతో మాట్లాడాలి. ఒక్క పదినిముషాలు” అంది.
“రా! ఇంట్లోనే వుంటాను. ఆఫీసుకి ఆలస్యంగా వెళ్తాలే” అన్నాడు.
“థాంక్స్. నేనూ మా వూరు వెళ్తున్నాను. నా ట్రెయిన్ పన్నెండింటికి. ఇప్పుడు రానా?”
“వచ్చెయ్ భవానీ! వదిన వండేస్తుంది. ఇక్కడే భోచేద్దువుగాని. నిన్ను స్టేషన్లో దింపి అట్నుంచటు ఆఫీసుకి వెళ్తాను” అని పెట్టేసాడు.
“దేనికట?” చిరుకోపగా అడిగింది నీలిమ. గీత తమ్ముడు ఇప్పుడామెకీ కొంచెం తమ్ముడనిపిస్తున్నాడు. గీత మమకారపు సంపద ఆమె పరోక్షంలో అతని నవ్వుల్నీ, బాధల్నీ తనకీ పంచడం గమ్మత్తనిపించింది.
“వస్తే తెలుస్తుందికదా?” అన్నాడు మాధవ్.
మరోగంటకి వచ్చిందా అమ్మాయి. గుడికి వెళ్ళొచ్చింది. అరచేతిలో వేసుకుని జాగ్రత్తగా తెచ్చిన కుంకుమని నీలిమకీ, కమలాక్షికీ పెట్టి, చెయ్యి కడుక్కుని వచ్చింది. కొబ్బరిచిప్పలో వున్న పువ్వుల్లోంచీ చెరో పువ్వూ యిచ్చి, చిప్ప నీలిమకి యిచ్చింది. గీత గుర్తొచ్చింది. ఆమెకూడా పదంలో ఒక అక్షరం తర్వాత మరో అక్షరం చేర్చినట్టు చేస్తుంది ఏపనేనా. ఇద్దరికీ పోలికలున్నాయా? ఉ<హు< లేవు. ఈ పిల్ల కాస్త అందంగానే వుంది చెప్పుకోవడానికి. ముఖంలోకి పరికించి చూసింది. రాత్రంతా ఏడవడంతో కళ్ళూ, మొహం బాగా వుబ్బి వున్నాయి. ఇంకా దు:ఖాన్ని మోస్తున్నట్టే వుంది, ఉండుండి కనురెప్పలు తడుస్తున్నాయి. కింది పెదవి అదురుతోంది. మాధవ్‍కూడా గమనించాడు. తాము దగ్గిరవాళ్ళమనేకదా, ఇంత దు:ఖాన్నీ మోసుకుంటూ ఇక్కడికి వచ్చింది! అతని మనసులోని కోపం విడి, మనసు ఆర్ద్రమైంది.
“చెప్పిందేదీ పూర్తిగా వినడు. సగం వినేసి వుడతపిల్లలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. కాఫీషాపులో మొదలుపెట్టాడు, రాత్రంతా ఏడుస్తునే వున్నాడు. చెప్పడానికి ప్రయత్నించాను.
పెళ్ళంటే ఇద్దర్లోనూ ఎలాంటి సరదా లేదు, ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టు ఇందులోంచీ బైటపడాలని చూస్తున్నాం. మనిద్దరికీ పర్సనల్ స్పేస్ వుండాలని ఎప్పుడేనా అనిపించిందా? మనిద్దరమే కూర్చునున్నప్పుడు నా ఫ్రెండ్సు, నీ ఫ్రెండ్సు, ఎవరొస్తే వాళ్లని కలుపుకుంటూ మాట్లాడుతూ వెళ్ళాంతప్ప మనమధ్యలోకి వాళ్ళొచ్చినట్టు ఎప్పుడూ అనుకోలేదు. ఎంతమంది స్నేహితులు విడిపోలేదు? మనంకూడా అలానే- అంటే వప్పుకున్నాడు.
ఏన్నో యేళ్ళకిందట పెళ్ళై మామూలుగా గడిపేస్తున్న ఇంట్లో ఒక పండగేదో వచ్చి వెళ్ళినంత సాదాగా పెళ్ళిచేసుకోవడం దేనికి? పెళ్ళి జీవితంలో ఎంతోకొంత మార్పులని తీసుకురావాలి- అన్నాక, నాకూ తనంత తెలివితేటలే వుండి, అప్పటికి అలాంటి ఎన్నో విషయాలు ఒకరంటే ఒకరికి ఎలాంటి పొసెసివ్‍నెసూ లేకుండా మాట్లాడుకున్నాం కాబట్టని నేనొక ప్రస్తావన చేసాను. అలా మాట్లాడ్డం తప్పేకానీ, తనకి అర్థమౌతుందని అన్నాను. చాలా కోపం వచ్చేసింది” అంది.
“ఎవరతను?” మృదువుగా అడిగాడు మాధవ్. “కృష్ణేం కోపం తెచ్చుకోలేదు భవానీ! అతని వివరాలవీ తెలుసుకుని మీవాళ్లకి చెప్పమన్నాడు” అన్నాడు.
“అయ్యో! అలాంటిదేం లేదన్నయ్యా! నేనీ వూరొచ్చిన కొత్తలో మా కొలీగ్ ఒకతను నన్ను చాలా ఆరాధనగా చూసేవాడు. కొంచెం చిరాగ్గా అనిపించినా, అదొక సటిల్ అవేకనింగ్ నాకు. నేనూ ఆడపిల్లననో, బావుంటాననో, వయసులో వున్నాననో కొత్త ఫీలింగ్స్ కలిగాయి. అదే కృష్ణకి చెప్పబోయాను. వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఐ వాజ్ సచ్ యాన్ ఇడియట్ టు టెల్ హిమ్” అంది.
“వాడి విషయం పక్కనిపెట్టు, నీకతను యిష్టమేనా?”
“నువ్వూ వాడిలానే మాట్లాడితే ఎలా అన్నయ్యా? నాకేసి చూడద్దనైతే ఎవరికీ చెప్పలేం. నేను నిన్ను చూస్తున్నానని నీకెలా తెలిసింది, నువ్వూ చూస్తేనేగా అనేస్తారు. నేనలా వదిలేసరికి అతను కొంచెం అడ్వాన్సయాడు. ప్రేమిస్తున్నానని నాలుక చివరిమాటేదో అనేసాడు. నాకు చాలా భయం వేసింది. జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను. ఫ్రెండ్స్ కోప్పడ్డారు.
ఇలాంటివి ఇక్కడ కామన్. చదువుకుని వుద్యోగం చేస్తున్నావు, ఇష్టమైతే యిష్టమని చెప్పు, లేకపోతే లేదను. ఎవరికోసమో జాబ్ వదిలేసి వెళ్తావా? హేండిల్ చెయ్యటం నేర్చుకో- అని.
ఈ విషయం అమ్మావాళ్లకో, అన్నయ్యలకో ఎలా చెప్పలేకపోయానో అలానే కృష్ణకీ చెప్పలేకపోయాను. దాచాలని దాచలేదు. మా నాన్నా, అన్నయ్యలూ ఇచ్చిన సెక్యూరిటీజోన్‍ని వదిలేసి, ఎవరో ముక్కూ మొహం తెలీని మనిషిని వోన్ చేసుకుని, అతనిచుట్టూ నా కుటుంబాన్ని తిప్పలేను. వదిన అమ్మానాన్నలు ఇక్కడికి స్వతంత్రంగా రాగలుగుతున్నారు. అదే నువ్వు తన ఎంపిక అనుకో, వాళ్ళకి మనసులో ఆ విషయం ఎక్కడో గుచ్చుతునే వుంటుంది. నీతో అనుబంధం పెరగదు. పెంచుకోలేరు. బాగా చదువుకున్న కుటుంబాలలో వేరు కావచ్చు. నేను పెరిగిన పల్లెటూళ్ళో, మాయింట్లో, మా అమ్మానాన్నలకి అలానే వుంటుంది.
నీ పెళ్ళి నువ్వే చేసుకుంటావా, పెద్దవాళ్ళు మంచీచెడూ మాట్లాడుకోనక్కర్లేదా- అని గీతని కోప్పడిందట యశోదత్త.
అంత తెలిసిన సంబంధానికే వాళ్లకలా వుంటే ఇలాంటి విషయాల్లో ఎలా వుంటుందో నాకు తెలుసు” అంది భవానీ చాలా కచ్చితంగా.
“అంత రిజిడ్‍గా వుంటే ఎలా? అతని పేరూ వివరాలూ చెప్పు. నేను మిగతావి కనుక్కుని మాకు తెలిసిన సంబంధం అని మీవాళ్లకి చెప్తాను. ఇప్పటికిప్పుడు దొరకాలంటే కష్టంకదా? అన్నీ చూసుకోకుండా మీవాళ్ళుమాత్రం ఎలా యిస్తారు?” అని ఎంతో నచ్చజెప్పాక అప్పుడు చెప్పింది భవానీ అతనిపేరు. భోజనం చేసాక, అంతదూరం వచ్చి మాధవ్ దింపడం దేనికని తనే వెళ్ళిపోతానంది. వెళ్లిపోయింది.
కృష్ణ ఫోన్ చేసాడు. బెంగుళూరు చేరాడట.
“అతని వివరాలేమైనా చెప్పిందా బావా?” అని.
“నువ్వనుకున్నట్టేం లేదురా! ఎంతో అడిగితేగానీ చెప్పలేదు” అన్నాడు మాధవ్.
“అదంతే. మనసులో దాచుకుంటుంది. వాళ్ళింట్లో చెప్పడానికి భయం. నాకు చెప్తే ఏమైనా అనుకుంటానని భయం. తనేమో ఒక్కర్తీ దేశం దాటి వెళ్లలేదు. మళ్ళీ అదో భయం. పోనీ వెళ్లకుండా ఆగిపోతుందా? ఆగదు. ఇద్దరం చేసుకోవద్దనుకున్నాం. ఇంక ముందుకి వెళ్ళిపోవాలికద? ఇంకా ఎంతకని నన్ను పట్టుకుని వేలాడుతుంది? అందుకే రూడ్‍గా మాట్లాడాను” అన్నాడు. ఇంకొంచెం ఏవో చెప్పి, పెట్టేసాడు.
వాసుకి చేసాడు మాధవ్. వీళ్ళిద్దరూ వచ్చిన విషయం విని, పెద్దగా నవ్వి, “ఇప్పుడే వార్త వచ్చింది, బెంగుళూర్లో పుట్టిన వాయుగుండం అరేబియా సముద్రం దగ్గిర తీరం దాటి, బౌన్సై వెనక్కి తిరిగొచ్చిందని” అన్నాడతను. మాధవ్‍కూడా నవ్వాడు.
“అమెరికా వెళ్తోంది, వీడికి ముడిపెట్టేస్తే కూతురు క్షేమంగా వుంటుందని అనుకున్నాడు వాళ్ళ నాన్న. వాళ్లకి హైదరాబాదే దేశాంతరం వెళ్ళినంత. గీతావాళ్లమ్మకి పెద్దగా యిష్టం లేదు. పెళ్ళిమాటెత్తగానే మీ వదిన భాషలో చెప్పాలంటే తోకకాలిన పిల్లుల్లా గిలగిల్లాడిపోయారు ఇద్దరూ. అరేయ్, పెళ్ళంటే సంతోషపడాలిగానీ, ఇలా కంగారుపడ్డమేంట్రా? అమ్మమ్మగారిల్లుకదా, వాళ్ళింటికి బానే వెళ్తుంటాడు. అంతా కోతులమందలా వుంటారు. మనింట్లో అల్లరి వేరు, ఇక్కడిది వేరు. వీళ్ళిద్దరూ సరేసరి. విడివిడిగా తెలివిగానే వుంటారు. మంచి వుద్యోగాలే తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరికీ పెళ్ళిమాత్రం పొసగదు. ఇద్దరికీ తీరువు లేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరిమాటొకరు వింటూనేనా వుండాలి, లేకపోతే ఇద్దర్లో ఒకరు రెండోవాళ్లని కమాండన్నా చెయ్యాలి. రెండూ లేకపోతే యిల్లు నడవడం కష్టం” అన్నాడు.
“వదినేమంటోంది?”
“తనకీ యిష్టం లేదు. ఇద్దరినీ విడదీస్తేగానీ బాగుపడరని తిడుతుంది”
“మీకు కోపం వస్తుందేమోనని భయపడుతోంది భవానీ”
“దేనికి కోపం?”
“కౌలు వదులుకుంటారేమోనని”
“దీనికీ దానికీ ఏమిటి సంబంధం? మాకు వాళ్ళు నమ్మకస్తులు. ఐనవాళ్ళు. అరెకరంలో కనకాంబరాలు పెట్టుకుంది వదిన. మరో అరెకరం కూరగాయలు పెట్టాం. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మిగతాది మామూలుగా వాళ్ళే ఏవో వేసుకుని పండించుకుంటున్నారు. మామ్మ వెంటా పెద్దత్త వెంటా పొలాలకి వెళ్ళడమేగానీ నాకూ వ్యవసాయాన్నిగురించి పెద్దగా తెలీదు. డబ్బుండి చేసే వ్యవసాయానికీ, అప్పుల్తో చేసే వ్యవసాయానికీ తేడా వుంటుంది మాధవ్! సోయిల్ టెస్టు చేయించడం, ఎక్కడ ఏ పంట పండుతుందని అడగడం, పూలు పెట్టడం, అన్నిటినీ మించి, వెనకాడకుండా డబ్బు ఖర్చుపెట్టడం ఇవన్నీ వాళ్ళకి వింత. నాలుగు కనకాంబరం విత్తులు పెరట్లో చల్లితే ఇన్ని పూలుపూస్తాయి, అందరిళ్ళలోనూ వుంటాయి, ఎవరు కొనుక్కుంటారు, ప్రత్యేకం పంట వెయ్యడమేమిటని గోలపెట్టేసారు. ఇప్పుడు మామీద నమ్మకం కుదిరింది”
ఇవన్నీ తనతో ఎప్పుడూ చెప్పలేదు వాసు. విహీ పుట్టాక ఇంట్లో కొంచెం గొడవలుగానే వుండేది. అక్కడున్నప్పుడు నీలిమ చాలా డిప్రెస్‍డ్‍గా వుండేది. ఆమెని వోదార్చడం, గొడవలవకుండా చూసుకోవడంతోనే సరిపోయింది. ఆఫీసులో పనికూడా అలానే వుండేది. కౌలుకిచ్చారని విని వూరుకున్నాడు. ఇంత జరుగుతోందనీ, గీత అక్కడకూడా రంగవల్లులు తీర్చిదిద్దుతోందనీ ఇప్పుడే తెలిసింది. సుమతి అనేట్టు, దేన్నెనా పూర్తిగా మనసుకి ఎక్కించేసుకుంటుంది. మమేకమై చేస్తుంది.
“రాబడి వస్తోందా?” కుతుహలంగా అడిగాడు మాధవ్.
“నువ్వూ కొనాల్సింది. అప్పుడు తెలిసేది” తమాషాగా అన్నాడు వాసు.
“ఇప్పుడు రేట్లెలా వున్నాయి? పెరిగాయా?”
“భూమి ధర పెరగకుండా వుండదు. కొని అలా కొన్నేళ్ళు వదిలెయ్యాలి. ఆస్తిమీద వచ్చే ఆదాయంకన్నాకూడా దాని ధర పెరిగితే వచ్చే లాభం ఎక్కువుంటుంది. ఆదాయం రావాలంటే మనం దానిమీద పెట్టుబడి, ఫోకస్ పెట్టాలి. మొదటిది యిష్టం లేదు, రెండోది నావల్లకాదు. వాళ్ళు చూస్తున్నారుకాబట్టి ఏవో ప్రయోగాలు చేస్తున్నాం. అదీ వదినకోసం. భవానీ అన్నలెవరికీ పెద్దగా చదువులూ సరైన వుద్యోగాలూ లేవు. ఆడపిల్లలకీ మామూలు సంబంధాలు చేసారు. వాళ్ళకేదో సాయంచెయ్యాలని వుంటుంది తనకి. విన్‍విన్‍లో వెళ్తోంది”
“ఇవన్నీ భవానీకి తెలీవు”
“ఐతే చేసేసుకుంటుందా? అదే తెలివితక్కువతనమంటే. ఇష్టం లేకుండా పెళ్ళి అలా ఎలా చేసుకుంటారు? నీలిమ అక్కడుందా?”
“పడుక్కుంది” చెప్పాడు మాధవ్.
“వినిపించదుకదా?”
“చెప్పు”
“మనిద్దరికీ పెళ్ళిళ్ళయాయి. వాళ్ళిద్దరూ ముందునించీ తెలిసిన పిల్లలే ఐనా పెళ్లనగానే వాళ్ళు సిగ్గుపడటం, మనం మాట్లాడలేక తడబడటం ఎన్ని జరిగాయి? కృష్ణకీ భవానీకీ అలాంటి ఫీలింగ్సేం లేవు. వాళ్ళే వద్దనుకున్నాక ఇంక మనం నచ్చచెప్పకూడదు. ఇద్దరికీ మంచిమంచి సంబంధాలే కుదురుతాయిలే. ముందా పిల్లకి కుదిర్తే, వీడికి రెండుమూడేళ్ళాగి చెయ్యచ్చు. ఇల్లు బాగుచేయించుకున్నాడు. రీమోడలింగ్ అనుకో. పడగొట్టి లోన్ తీసుకుని కట్టిస్తానంటే వద్దని చెప్పాను. వాడిక్కడుండనప్పుడు దేనికని? ఇప్పుడు వాడిదగ్గిర పెద్దగా డబ్బుకూడా లేదు. కాస్త సంపాదించుకోనీ” అన్నాడు. మరికాసేపటికి ఇద్దరిమధ్యా మాటలింక మిగల్లేదు.
మరుసటిరోజు తిథి మంచిదని భవానీ ఇచ్చిన వివరాలప్రకారం రఘుని ఆఫీసులో కలిసి, కేంటిన్లో కూర్చుని మాట్లాడాడు మాధవ్.
మాధవ్‍కి కార్పొరేట్ ఆఫీసు చూడటం అదే మొదలు. గవర్నమెంటు ఆఫీసులకన్నా బేంకుల్లో పరిసరాలు, శుభ్రత బావుంటాయి. అంత పెద్ద ఆవరణ, వరసగా పార్కు చేసిన కార్లు, పెద్దపెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే అసూయనిపించింది.
రఘు బ్రాయిలర్ కోడిలా చాలా జాగ్రత్తగా పెంచబడ్డవాడు. స్కూలు, కాలేజి, కోచింగ్ సెంటర్లు, ఎంట్రెన్సులు, చదువు బై చదువు అనే లెక్క ఎప్పుడూ పూర్ణాంకానికి దిగకుండా బతికాడు. కేంపస్‍ సెలక్షన్స్‌లో మంచివుద్యోగం రావడమనే పెద్దమత్తులో వున్నాడు. మాధవ్ పరిచయంచేసుకోగానే అతనిది గవర్నమెంటు వుద్యోగం అని కాస్త చిన్నచూపు కలిగింది. అసలదేమిటో, మాధవ్ హోదా యేమిటో అతనికి తెలీదు. తెలుసుకోవాలనే కుతుహలంకూడా లేదు. తనని కలవడానికి ఎందుకొచ్చాడా అనుకుంటూ ఇంగ్లీషులోనే మొదలుపెట్టాడు.
“నేను మీకెలా తెలుసు?” అని.
“ఇద్దరం తెలుగువాళ్లమే. ఇంగ్లీషులో మాట్లాడుకోవడం దేనికి?” ఇంగ్లీషులో జవాబిచ్చి, తెలుగులోకి వచ్చాడు మాధవ్.
“భవానీ మా చెల్లెలు. మీగురించి చెప్పింది” అన్నాడు.
రఘు భృకుటి ముడిపడింది. “ఏమని?”
మాధవ్‍కి అతనేమిటో సూచన అందింది.
“మీరు తనతో ఏదో అన్నారట? మీ తల్లిదండ్రుల వివరాలు ఇవ్వండి. వెళ్లి మాట్లాడతాను” అన్నాడు సహనంగా.
“దేనికి? ఏం మాట్లాడతారు వాళ్లతో? ఆమె నాకు నచ్చింది. ఆమెకీ యిష్టమైతే కొన్నాళ్ళు స్నేహంగా వుంటాం. కలిసి తిరుగుతాం. ఒకళ్ళకొకళ్ళు సరిపోతామో లేదో చూసుకున్నాక అప్పుడు ఇళ్లలో చెప్తాం” అన్నాడు.
ఇప్పుడు మాధవ్‍కి అర్థమైంది.
“సరిపోకపోతే?”
“మూవాన్ ఔతాం” చాలా మామూలుగా అన్నాడు. అంతే కేజువల్‍గా రఘు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మాధవ్. రఘుకి అర్థం కాలేదు. విడిపించుకునేలోగా పట్టు బిగుసుకుంది. గట్టిగా, ఇంకా గట్టిగా, వేలిమండలని కదుపుతూ, ఎముకలు విరిగిపోతాయన్నంత గట్టిగా. విడిపించుకునే ప్రయత్నం చేసాడు. నొప్పికి కళ్లలో నీళ్ళొచ్చేసాయి.
“ఏయ్, చెయ్యి వదులు. ఏం చేస్తున్నావు?” అన్నాడు పళ్ల బిగువుని. కాస్త దూరంలో సెక్యూరిటీ కనిపించాడు. రమ్మన్నట్టు సౌంజ్ఞ చేసాడు.
“నీకు సరిపోతుందో లేదో చూసుకుని, సరిపోకపోతే వదిలెయ్యడానికి తనేం కమోడిటీ కాదు. ఇక్కడ కాబట్టి ఇంతతో వదిలేస్తున్నాను. అదే మావూరైతే నీ ఎముకలు లెక్కబెట్టుకుని తీసుకెళ్ళడానికి మరో మనిషి కావలిసొచ్చేవాడు” అన్నాడు.
సెక్యూరిటీ వచ్చాడు.
“ఎవడేనా నీ కూతుర్నో, చెల్లెల్నో వాడుకుని వదిలేస్తానంటే ఏం చేస్తావు?” మరాఠీలో అడిగాడు మాధవ్ అతన్ని.
“ఇక్కడ గొడవొద్దు సార్! మీకే ప్రాబ్లమౌతుంది. బైట చూసుకోండి” అన్నాడతను.
“కంటీబ్రూట్!” అన్నాడు రఘు. మాధవ్ మరోసారి చెయ్యి నొక్కి వదిలేసి లేచాడు. ప్రాణం పైనే ఎగిరిపోయింది రఘుకి.
“కాస్త జిమ్‍కి వెళ్లమ్మా! ఇలా ఆడపిల్లలా నాజూగ్గా వుండకూడదు” అని వచ్చేసాడు మాధవ్.
రఘు ఆలోచనని జీర్ణించుకోలేకపోయాడు. అదేమిటా ఆలోచన? అంత వికృతంగా? ఆడపిల్లలూ మగపిల్లలూ స్నేహం చెయ్యడంలో తప్పు లేదు. ఒకచోట చదువుకున్నందుకో, ఒకచోట వుద్యోగం చేస్తున్నందుకో పరిచయాలూ స్నేహాలూ ఏర్పడతాయి. ఒకరిద్దరికి అలాంటి స్నేహం ప్రేమకి దారితీయడం జరుగుతుంది. సుమంత్, లత అలా చేసుకున్నవాళ్ళే. పెళ్ళి చేసుకోవడానికి సరిపోతామా లేదా అని చూసుకోవడానికి ప్రేమ పేరు చెప్పుకుని కలిసి తిరగడమేంటి? ఏం సరిపోవాలి? ఎంతదాకా సరిచూసుకుంటారు? మగపిల్లలే ఇలా ఆలోచిస్తున్నారా, ఆడపిల్లలుకూడానా? మనసులమీద రకరకాల సాన్నిహిత్యాల ముద్రలు వేసుకున్నాక పెళ్ళిపీటలెక్కుతున్నారా వీళ్ళు? అందరూ కాకపోవచ్చు, కొందరు. ఆ కొందరూ తారసపడ్డ మిగతావాళ్ళు? అదేం పెళ్ళి? గౌరీపూజలూ, తెరవెనుక కూర్చోవడాలూ, కాళ్ళు కడిగించుకుని, కన్యాదానాలూ ఎందుకు? కాగితాలపెళ్ళి చేసుకోకుండా?
కొన్నేళ్ల తర్వాత ఇలాంటివే కొన్ని సంఘటనలకి స్పందించి,
ద సొసైటీ ఇట్‍సెల్ఫ్ ఈజ్ డైయింగ్- అంది గీత. వీళ్లంతా ఒక్కలాగే ఆలోచిస్తారన్నది నిజం.
“ఏమైంది?’ ఇంటికొచ్చాక అడిగింది నీలిమ. చెప్పాడు.
“అవంతీపురం విలువలు ఇక్కడెందుకు వుంటాయి? ఇది ప్రెసిడెన్సీ సిటీ. స్వతంత్రానికి ముందు వున్నప్పటి వెస్ట్రన్ కల్చరు ఇంకా వదల్లేదు మనని. అదీకాక ఇప్పుడు పిల్లలంతా అబ్రాడ్ వెళ్తున్నారు. అక్కడ ఇంకొన్ని చూస్తున్నారు. కొందరు నేర్చుకుంటున్నారు. కొందరు పాటిస్తున్నారు” అంది.
“వాళ్లవి వలసదారులూ, సైనికులూ, దోపిడీకారులూ నిర్మించిన సమాజాలు. మనది మనుషులు నిర్మించుకున్న సమాజం. విలువలు ఎక్కడేనా ఒక్కలాగే వుండాలి” అన్నాడు.
“మీ వదిన్ని పిలిపించుకోండి. ఆవిడ మింగేసేట్టు చూస్తుంది. మీరేమో కాళ్ళూచేతులూ విరగ్గొట్టెయ్యండి. ఇద్దరూ కలిసి అందర్నీ దార్లో పెట్టేద్దురు” అంది.
“మధ్యలో ఆవిడ ప్రసక్తి దేనికి?” అన్నాడు మాధవ్.
“మరిలాంటివి చూస్తే ముందు గుర్తొచ్చేది ఆవిడే” అంది నీలిమ. అతను టీ తాగేసి, అలా నడిచొస్తానని వెళ్ళిపోయాడు.
“ఇదివరకూ వదినగార్ని అదీ యిదీ అనేవాడు, ఇప్పుడు మానేసినట్టున్నాడు. మరీ తేడాతో యిచ్చారేమో గీతని? అందుకే అన్నదమ్ములిద్దరూ అంత అంగలార్చుకుపోతారు. నిన్నా పిల్ల అననే అంది, పెళ్ళిచేసుకున్నాడా, పెంచుకున్నాడా అని. మరీ పెంచుకునే వయసు కాకపోవచ్చేమోగానీ, మీ బావకి నలభయ్యేళ్ళుండవూ? కొందరికి వయసు కనిపించదు” అడిగాడు కుటుంబరావు. చెయ్యడానికి చేతిలో పనేమీ లేక చాలా ఆలోచనలు చేస్తున్నాడు.
“అంతెక్కడిది నాన్నా? ఆయన మాధవ్‍కన్నా రెండేళ్ళు పెద్దట” అంది నీలిమ కొంచెం విసుగ్గా. తండ్రి ఏది దేనికి అడిగి తెలుసుకుని, ఇంకెక్కడ దేంతో ముడిపెడతాడో తెలుసుకోలేకపోతోంది.
“వయసు తగ్గించుకుని రాసుకున్నారేమో!” అన్నాడు.
తన లెక్కలు తను చెప్పాడు. ప్రమీలకీ, లక్ష్మికీ వెంటవెంటనే పెళ్ళిళ్ళయాయి. ఇద్దరికీ ఒకేలా ఐదేళ్లపాటు పిల్లలు పుట్టకుండా వుండటం జరగదుకాబట్టి, వాసుకి వయసు తక్కువ వేసివుంటారనే అభిప్రాయానికి వచ్చాడు. ఇలాంటి వివరాలన్నీ మాధురి సేకరించి ఇస్తుంది. వాసుకే ఎందుకు తగ్గించి రాయడం, సుధీర్‌కి ఎందుకు కాదని ఆయన్ని ఎవరూ అడగలేదు. అడిగితే ఏం చెప్పేవాడో?
“ఇలాంటి పనులు చేస్తారుగనుకే నాలాంటివాళ్లకి అంత తేలిగ్గా వుద్యోగాలు రావు. ఒక్క కంప్లెయింటు పారేస్తే అన్ని విషయాలూ బైటికొస్తాయి” అన్నాడు.
“ఎవరిమీద నాన్నా?” అడిగింది నీలిమ.
“మిమ్మల్ని యింట్లోంచీ వెళ్ళగొట్టినవాళ్ళమీదే. గర్వంతో కన్నూమిన్నూ కానకుండా వున్నారు. తోటికోడళ్ళన్నాక మాటామాటా అనుకోరా? దెబ్బలాడుకోరా? మీరేమైనా ఓ తల్లి కడుపుని పుట్టిన అక్కచెల్లెళ్ళా పొరపొచ్చాలు లేకుండా వుండటానికి? తోడికోడళ్ళు తిట్టుకున్నా, జుట్లుపట్టుకున్నా ఒకింట్లోనే పడుంటారు. మిమ్మల్ని వెళ్లగొట్టి, ఇల్లంతా ఆక్రమించుకున్నారు. ఇంటికి వుత్తరోత్రా వారసులు వాళ్ళొక్కళ్ళేనా? మీకు హక్కులేదా? మీరొచ్చి ఇక్కడ అద్దెపోసుకుని బతుకుతున్నందుకు సగం అద్దె వాళ్ళు పంపక్కర్లేదూ?” అన్నాడు.
“ఇప్పుడే గొడవలొద్దు. నేను చూసుకుంటాను.నువ్వు మాట్లాడకు” అందామె. రాత్రి మాధవ్‍తో అననే అంది.
“ఖర్చులు పెరిగిపోలేదూ? డబ్బేమైనా మిగుల్తోందా?” అని.
“సహజమేకదా? అక్కడ ఖర్చులన్నీ అమ్మా, అన్నయ్యా చూసుకునేవారు. మనం లైట్‍మ్యూజిక్ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరి బేండు వాళ్లది” అన్నాడతను. ఆమెకి చురుక్కుమంది.
తర్వాతి నెల్లో కృష్ణ యూయస్ వెళ్ళిపోయాడు. యశోదకీ ఇప్పుడే కొడుక్కి చెయ్యడం ఇష్టంలేదు. ఆవిడ ఆలోచనలు ఆవిడకి వున్నాయి. తనే వద్దందామనుకుంది. ఇంకో నాలుగైదేళ్ళు ఆగచ్చని ఆలోచన. ఇల్లు బాగుచేయించాడు. హాయిగా వుంది. ఇంట్లోకి నాలుగూ కొనాలి. వచ్చేపిల్లముందు తీసికట్టుగా వుండకుండా గీతకి బంగారం అమర్చిపెట్టాలి. కొడుక్కి పెళ్లయ్యాక ఇవన్నీ కుదరవు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు పిల్లలే చెప్పేసారు చేసుకోమని.
భవానీ ఇంట్లో కొద్దిగా గొడవైంది. కృష్ణని చేసుకోనని ఆమె అంత ఖరాఖండీగా చెప్పేసాక వాళ్ళకి బైటి సంబంధం చూడక తప్పలేదు. ప్రతివాళ్ళూ కట్నం వద్దంటున్నారు, కానుకల లిస్టు చెప్తున్నారు. తనింట్లో ఏం వుందో తెలిసేది అమ్మాయికి. తనకేం కావాలో తండ్రిని అడిగి తెచ్చుకోవలసింది ఆమె. కానీ, డిమాండ్లు మగపిల్లలవైపునించీ వస్తున్నాయి. చుట్టూవున్నవాళ్ళ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో దాక్కుని వున్న మిగిలిన అసంతృప్తులుకూడా ఇలాంటప్పుడే బైటపడతాయి. ఉన్నదంతా ఒక్కదానికే పెడితే మా భవిష్యత్తేంటని వదినలు ముఖాలు ముడుచుకున్నారు. భవానీ అక్కది అతిమామూలు సంబంధం. ఆమెకూడా వదినలతో కలిసి దు:ఖపడుతోంది. అనువుగా లేనిచోట చదువుకూడా యిబ్బందులని సృష్టిస్తుంది.
“కృష్ణ ఒక్కడే వెళ్ళాడు. మీరీ పెళ్ళిమాట ఎత్తకపోతే ఇద్దరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. వాడు నాకో అన్న, తమ్ముడు. ఎవరి ఫ్రెండ్సుతో వాళ్ళం వుండేవాళ్ళం. ఏడాదో రెండేళ్ళో సంపాదించి యిచ్చాక పెళ్ళిచేసుకునేదాన్ని. మనింట్లో బాగా చదివినదాన్ని నేను. ఆ సంతోషం, గర్వం ఏం వున్నాయని? నా చదువుకి ఖర్చుపెట్టారు. ఇప్పుడు పెళ్లికి పెట్టాలి. మగపిల్లలకి ఖర్చైనదాన్ని ఒక పెట్టుబడిలా వెనక్కి తీసుకుంటున్నారు. ఆడపిల్లలుమాత్రం చదువుకీ, పెళ్ళికీ ఖర్చుపెట్టాలి. పైగా సంపాదనంతా వాళ్ళకే యివ్వాలి. ప్రపంచాన్ని చూసాకకూడా కళ్ళకి గంతలు కట్టుకుని వుండమంటే ఎలా నాన్నా?” అంది.
“ఏం చేద్దామనే? నువ్వు అన్నో తమ్ముడో అనుకున్నా అతను నీకు అత్తకొడుకే. ఇద్దరూ పెళ్ళిచేసుకోకుండా కలిసి వెళ్తే తప్పుపడతారు. ఇంకెవరూ నిన్ను చేసుకోవడానికి ముందుకి రారు” అన్నాడు తండ్రి.
చాలా తర్జనభర్జనలయ్యాక మూడు సంబంధాలు చూసి, ఒక సంబంధం పెళ్ళిచూపులదాకా తెస్తే పెళ్ళికొడుకుతో కూర్చుని నిక్కచ్చిగా మాట్లాడింది భవానీ. కుటుంబపరిస్థితులు చెప్పింది. అతనిదీ ఇంచుమించు అదే పరిస్థితి. ఎన్నో అప్పులు చేసి, జాబ్ వీసామీద బైటికి పంపించారు తల్లిదండ్రులు. అవన్నీ తీరుస్తున్నాడు. ఇప్పుడే పెళ్ళొద్దనుకుంటుంటే ఈ సంబంధం వచ్చింది. అతనికి ఆమె, ఆమె వుద్యోగం నచ్చాయి. మనుషులంతా పూర్తిగా చెడ్డవాళ్ళూ, పూర్తిగా మంచివాళ్ళూగా వుండరు. అర్థంచేసుకున్నాడు. ఇప్పటికిప్పుడు ఆమె సంపాదన మొత్తం తను అనుభవించలేకపోవచ్చు, అది చేతికొచ్చేదాకా మనిషితోడు. వయసుచేసే మారాములకి సైదోడు.
“తనవాళ్లకి తనూ, మాకు నువ్వూ పెడుతుంటే మీకు మిగిలేదేంట్రా? వాళ్ళ కుటుంబాన్ని చూస్తే గుంభనగా నడిపించుకొస్తున్నట్టున్నారు. పెద్దగా ఏమీ వున్నట్టు లేదు” అన్నాడు తండ్రి.
“తప్పదు నాన్నా! ఆమెకూడా నాలానే చదువుకుంది. ప్రపంచం చాలా మారింది. ఆడపిల్లలు ఇంకా మారారు. ఇది కాకుండా మరో సంబంధానికి వెళ్ళినా ఇంతే. భవానీలా బాధ్యత ఎరిగి ఆలోచించే ఆడపిల్లలు కొందరైతే పెళ్ళిచేసుకునేదే సుఖపడటంకోసమని వాళ్ళ జీతాలు భర్తనికూడా ముట్టుకోనివ్వనివాళ్ళు ఇంకొంతమంది. మనకి ఈమె తటస్థపడటం మంచివిషయం. ఇంకా వీళ్ళకి పట్నవాసపు తెలివితేటలు రాలేదు. ఫెయిర్‍గానే వున్నారు” అన్నాడు.
“అక్కడ ఎవరెంతకాలం వుంటామో తెలీదు. మన వుద్యోగాలు పర్మనెంటు కాదు. మన ఖర్చులు మనకి వుంటాయి. ఏడాదో రెండేళ్ళో పూర్తి జీతం పంపడంకాదుగానీ, నెలకింతని పంపించు. ఎన్నాళ్ళు పంపినా మనకి భారంకాకుండా వుంటుంది” అని వప్పించాడు. తనూ ఇక్కడే నాలుగైదు ఎకరాలు కొంటే వీళ్ళకి జీవనోపాధి ఔతుంది, తన ఆస్తికూడా నమ్మకంగా వుంటుందనిపించింది. ఏవో డబ్బులెక్కలు. ప్రాథమిక స్థాయిలో ఇల్లుగడవడంకోసం, భుక్తికోసం, అది దాటాక ఆస్తులు సంచయించుకుని దాచుకోవడంకోసం. రెండోది దేనికంటే భవిష్యత్తు భయం. పదేసిమంది పిల్లలని నిర్భయంగా కనేసిన మనుషులు ఇప్పుడు ఒకళ్ళనో యిద్దరినో కని ఆపేస్తుంటే ఆ ఒకరిద్దరూకూడా భవిష్యత్తుపట్ల భయాలతో సతమతమౌతున్నారు. కేవలం గవర్నమెంటే పెద్ద జాబ్ ప్రొవైడరుగా వున్నంతకాలం సమాజం చాలా హుందాగా వుండేది. చేసే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఒక ఒరవడికి లోబడి వుండేవారు మనుషులు. ఆ కట్టుబాట్లు తెగిపోయినట్టుంది.
సంబంధం కుదిరింది. ఖర్చులూ, పెట్టుపోతల బేరసారాలన్నీ మధ్యేమార్గంగా సాగాయి. ఇంట్లోని పాతబంగారం చేతులుమారింది. ఇంకొంత పొలం అమ్మకానికి పెట్టాడు భవానీ తండ్రి.
“ఇప్పుడు అమ్మడం దేనికి మామయ్యా? నేను కొంత సర్దుతాను. నీకు కుదిరినప్పుడు తిరిగి యివ్వు” అంది గీత.
“తిరిగి ఇవ్వగలననే నమ్మకం నాకు లేదు గీతా! బైటవాళ్లెవరో ఎందుకు? మీకే ఇస్తాను. తీసుకుంటారా? అబ్బాయినడుగు” అన్నాడు. పది పన్నెండెకరాలు తరో, బంజరో కలిగి వుండి భూస్వామి అనిపించుకున్న వ్యక్తి రైతుకూలీగా మారటాన్ని స్వయంగా చూసింది గీత. బాధపడింది. పెద్దమేనమామ బైటికి వెళ్ళడమే మానేసాడు. ఉన్నదేదో ఓ కొడుకు చేసుకుంటున్నాడు. మిగిలిన యిద్దరు కొడుకులవీ అటూయిటూ కాని వుద్యోగాలు.
పెళ్ళికి మాధవ్ ఒక్కడే వచ్చాడు. నీలిమ రాలేదు. “డబ్బేం పోగేసుకుని వుందా? మీ వదిన మేనమామ కూతురి పెళ్ళికి నేనెందుకు? మీరే దండగ” అంది. అతనికి ఆ వెళ్లటం అందర్నీ చూడటానికీ, బంధాలు బలపరుచుకోవడానికీ.
పెళ్లయాక వెంటనే భర్తతో వెళ్ళిపోయింది భవానీ. రెండు వుద్యోగాలు మారింది. మూడేళ్ళు పిల్లల్ని కనకుండా జాగ్రత్తపడి, ఖర్చులు కుదించుకుని, ఎవరివాళ్ళని వాళ్ళు వడ్డుని పడేసాక అప్పుడు కూతుర్ని కన్నది. ఈమూడేళ్ళూ ఆమె భర్తకి జీవితంలో కాలంరూపాన కలిగిన లాభం. తల్లి వెళ్లి పురుడు పోసి, కూతుర్నీ మనవరాలినీ వెంటబెట్టుకుని వచ్చింది.
కృష్ణ ఆమెని మళ్ళీ కలవలేదు. కలవద్దని గీతద్వారా భవానీ తల్లి చెప్పించింది.
“ఇలా చెప్తున్నానని కోపం తెచ్చుకోకు గీతా! నాచేతుల్లో పెరిగిన పిల్లవని నమ్మకం. వాసుదాకా వెళ్లనివ్వకు. పనిమంతుడు పందిరేస్తే పిచ్చుక వాలగానే పడిపోయిందట. అలా వుంటాయి మన పెళ్ళిళ్ళు. పెళ్లిలో జరపాల్సిన మర్యాదలదగ్గిర్నుంచీ ఇంట్లో జరిగే పనులదాకా ఏ చిన్నతేడా వచ్చినా బుస్సుమని కోపం వచ్చేస్తుంది మగవారికి. భార్య మరీ లోకువ. ఇంత ప్రయాసపడి పెళ్ళిచేసాం. దాన్ని ఏదో ఒకలా నిలబెట్టాలి. వీళ్ళిద్దరూ చిన్నప్పట్నుంచీ ఎడమన్నది తెలీకుండా పెరిగారు. అందుకే పెళ్ళిచేసుకోలేకపోయారు. మనందరికీ ఆ విషయం అర్థమైంది. కలిసివచ్చిన మేనరికం వుండగా ఎందుకు చేసుకోలేదనే సందేహం అల్లుడికి వచ్చిందంటే దాని బతుకింక నరకమే” అందావిడ గీతతో.
“తమ్ముడికి చెప్తాను. వాడికీ తెలుసులే అత్తా! నువ్వు చెప్పినదాంట్లో తప్పేంలేదు. పెద్దవాళ్ళు చెప్పకపోతే పిల్లలం ఎప్పటికీ ఏదీ తెలీనివాళ్లలా వుండిపోతాం” అంది గీత. అలాగే కృష్ణకి చెప్తే అతని మొహం చిన్నబోయింది. ఆమెకి మనసు చిక్కబట్టినట్టైంది.
“నువ్వూ చేసుకుంటావా? సంబంధాలు చూడాలా? బోల్డంతమంది బీటెక్ పిల్లలు మనిళ్ళలో” అంది ఓదార్పుగా.
అతనికి వళ్ళుమడిపోయింది.”నన్నిలా వదిలెయ్యండే బాబూ! నీకు యిరవైకి చేసారు, దానికి మరోమూడేళ్లకి చేశారు. అందుకని నాకు వయసైపోయిందనుకుంటున్నావా? మీతో కాదేబాబూ, నన్ను పోల్చాల్సింది. మీ పెళ్లప్పటికి బావ వయసెంత? ఇప్పుడీ పెళ్ళికొడుకు వయసెంత? నాక్కూడా టైమివ్వండే. ఇంకో నాలుగైదేళ్ళు మాట్లాడద్దు” అన్నాడు. “ఒక్కసారి సంబంధాలు తెంచేసుకోవడమంటే వుంటుందికదా, బాధ? మీ గుంపు అందర్తోటీ మాటలు మానేసి నువ్వుండు చూద్దాం. ఇది అంతే”
యశోద కోరుకున్నది అదేకాబట్టి అక్కడితో ఆ గొడవ ఆగింది. ప్రశాంతంగా వుద్యోగం చేసుకుంటున్నాడు. కంపెనీలు మారుతూ, పేకేజి పెంచుకుంటూ అక్కడే కుదురుకున్నాడు. తల్లినీ అక్కనీ పిలుచుకెళ్ళి దేశమంతా చూపించాడు. మరోసారి వాసూ గీతా ఖర్చుపెట్టుకుని వెళ్లొచ్చారు.
అతనితో ఎవరూ భవానీ ప్రస్తావన తీసుకురారు. ఎలా వుందని అతనూ అడగలేడు.


ఫ్రెండు కారు అమ్మేస్తుంటే వాసు కొన్నాడు. ముందు తను, తర్వాత గీత డ్రైవింగ్‍స్కూల్లో చేరి నేర్చుకున్నారు. మయూ తల్లిపక్కని నిలబడి ఎత్తు చూసుకున్నాడు.
“నేనూ అమ్మంత వున్నాను. నాకూ నేర్పించాలికదా?” అన్నాడు తండ్రితో గొడవేసుకుని. అన్నకి ముందు దారి తెలిస్తే తనూ వెనక పరిగెత్తచ్చని చూస్తున్నాడు విహీ. వాళ్లని చూస్తే వీళ్ళిద్దరికీ నవ్వాగడం లేదు. మాధవ్‍ ఫోన్‍చేసినప్పుడు అతన్తో మయూ కంప్లెయింటు చేసాడు. వెంటనే తన కష్టం విహీకూడా చెప్పుకున్నాడు.
“అరేయ్, మాఅంత ఎత్తున్నా మాకున్నన్ని యేళ్ళు నీకు లేవుకదరా? కారు నడపాలంటే పద్ధెనిమిదేళ్ళుండాలి” అన్నాడు నచ్చజెప్తూ. మయూకి వయసుగురించి కొంచెం అర్థమైనా విహీకి ఇంకా అవగాహన రాలేదు. వాడు అస్సలు వినలేదు.
“అమ్మకెక్కడివి?” అడిగాడు. మాధవ్‍కి తిక్కరేగిపోయింది.
“మీనాన్నిచ్చాడు. కావాలంటే నువ్వూ అడిగి తీసుకో” అని ముట్టించి కూర్చున్నాడు. గొడవ రెండురోజులు నడిచాక, తల్లి నడిపినప్పుడు మయూ, తండ్రి నడిపినప్పుడు విహీ షాట్‍గన్ సీట్లో కూర్చోవడానికి వప్పందాలయ్యాక ముగిసింది.
తాము నేర్చుకోవడం అయ్యాక లక్ష్మిని డ్రైవింగ్‍స్కూల్లో చేరమంది గీత.
“నాకెందుకే? మీరేదో సరదాపడి కొనుక్కున్నారు” అందావిడ తెల్లబోతూ.
“నీకు సరదా లేదా? నేర్చుకో అత్తా! ఎవరింటికేనా వెళ్ళాలంటే తేలిగ్గా వెళ్ళిపోవచ్చు” అంది. వాసుకూడా ముందు తెల్లబోయాడు. తనకి రాని ఆలోచన గీతకి వచ్చినందుకు ప్రశంసతో కూడిన ఆశ్చర్యం కలిగింది. ట్రెయినర్‍తోపాటు తనూ కూర్చుని దగ్గిరుండి తల్లికి ధైర్యం చెప్పి నేర్పించాడు. అది ఆ అన్ని యిళ్ళలో పెద్ద సంచలనమే.
“గీత ఆలోచనే వేరు. అమ్మలూ, అత్తలూ మనుషులేనని దానికి తప్ప ఇంకెవరికీ అనిపించలేదు” అంది ప్రమీల పిల్లల్ని దెప్పుతూ. నిజంగా విస్తుపోయి.
“ఎంతసేపూ మేం వున్నాంకదా అనడమో, చీరలూ నగలూ చేయించడమో తప్ప, టూవీలర్ నేర్చుకుంటావా అని ఎప్పుడేనా అడిగారూ?” అనేసింది ఎంతో అన్యోన్యదాంపత్యం అన్న పేరున్న అరుణకూడా.
“మీ అమ్మకికూడ నేర్పించావా?” గీతని అడిగింది మాధురి పరిహాసంగా. తల్లినికూడ నేర్చుకొమ్మనే అంది గీత. అప్పటికింకా వాళ్లకి కారు కొనే ఆలోచనలేదు. అదీకాక ప్రతీదానికీ వియ్యపురాలితో పోటీపడ్డట్టుంటుందని ఆగిపోయింది యశోద.
“ఇంకా లేదు. కారు కొనుక్కున్నప్పుడు నెచుకుంటుందట” జవాబిచ్చింది.
“లక్ష్మి పెట్టి పుట్టింది. అలాంటి కోడలు దొరికింది దానికి” అంది పద్మ. మానసని గురించిన కోపంతో మనసు భగ్గుమంది.
“ఏం ముట్టించావే? వీళ్లందరూ కలిసికట్టుగా మామీద దండయాత్రకొస్తున్నారు” అన్నాడు ప్రహ్లాద్.
మాధవ్ బైటికే హర్షం వ్యక్తపరిస్తే నీలిమ లోలోపల దిగ్భ్రాంతిచెందింది. నిజమే! ఆమె ఆలోచనలు ఎవరూ అందుకోలేనట్టుంటాయి. చిన్నవిషయాన్నికూడా భిన్నమైన కోణంలోంచీ చూస్తుంది. పిల్లల్నికూడా పిల్లలని కాకుండా,
వాళ్ళూ ఇంట్లోని మనుషులే, వాళ్ల వయసుకి తగ్గట్టు వాళ్ళు బతుకుతున్నారు- అనగలగడం వాళ్లకే చెల్లింది.
అత్తగారిని చూసుకోవడం అనే మాటే పడనివ్వదు.
ఆవిడ్ని మనం చూసుకోవడమేంటి- అంటూ ఆవిడకి కుటుంబంలో పూర్తి సభ్యత్వం ఇవ్వటం ఆమెకే చెల్లింది.
ఈ అన్నిటిమధ్యా, లెర్నింగ్ పీరియడ్ పూర్తైంది లక్ష్మికి. రెగ్యులర్ లైసెన్సు వస్తుందా అనుకుంది. తేలిగ్గానే వచ్చింది. రోడ్డుమీద టాఫిక్ మధ్యలో తను డ్రైవ్ చేస్తూ వెళ్లగలదా అనుకుంది. ఆవిడ్ని స్టీరింగు చేతికిచ్చి అరుణ యింటికి తీసుకెళ్ళింది గీత. లక్ష్మికి ఇక భయం పోయింది. కారు తీసుకుని అందరిళ్లకీ వెళ్ళొచ్చింది. ఇలాంటి మార్పు ఆవిడ అసలు వూహించలేదు.


అలాగే రోజులూ, మూడునాలుగు సంవత్సరాలూ గడిచాక ముందు నిర్మలా, తర్వాత విజ్జెమ్మా పోయారు. నిర్మలప్పుడు వెళ్ళలేకపోయాడు. మామ్మకోసం పరిగెత్తుకొచ్చాడు. సుధీర్‍కూడా అలానే వచ్చాడు. ఆఖరిచూపులకి అందుకున్నారు.
“ఏరా! మాకసలు కాంటాక్ట్‌లోనే వుండవు?” అని కోప్పడ్డాడు సుధీర్. ఒక్క నవ్వుతో దాటేసాడు కృష్ణ. సందర్భంకాదుగాబట్టి అక్కడితో ఆ విషయం ఆగిపోయింది.
వీణ రాలేదు.
“మాకిలా చీటికీమాటికీ పుట్టింటికి పంపే పద్ధతి లేదు. పెళ్లైన ఆడపిల్లలకి పుట్టింటి సూతకాలేవీ వుండవు. లేని మైల, పడితే మాయింట్లో మారుచావులొస్తాయి. తొంభయ్యేళ్ల ముసలమ్మ పోతే ఏడుపెందుకు, భూమికి భారం తగ్గిందని సంతోషపడక? ఏం ఆస్తులున్నాయని మీకు, అంత పడీపడీ వెళ్లి పంచుకోవడానికి? మీ నాన్నమాత్రం అలా ఎలా చెప్పాడు? బుద్ధుండక్కర్లేదా? చావుకబుర్లు ఫోన్లలో చెప్పేస్తాడా? ఇక్కడ మనం ఏ స్థితిలో వున్నామో ఆలోచించడా? పండగో, పూజో, నలుగురూ వచ్చి వుంటారో. ఏడుపాపి, పని చూసుకో. ఎవరేనా వచ్చి తీసుకెళ్తే పదోరోజుని వెళ్దువుగాని” అంది అత్తగారు.
ఎవరొస్తారు? ఇలాంటివాటికి వచ్చి తీసుకెళ్తారా, అక్కరతో వెళ్ళాలిగానీ? పంపించరని అర్థమైంది వీణకి. పక్షిణీ పట్టాల్సిన పిల్ల కన్నీళ్ళు దిగమింగుతూ వండిన వంటని అందరూ తిన్నారు.
బీటెక్ గోల్డ్‌మెడలిస్టు. మంచి వుద్యోగం చేసేది. అవకాశం యిస్తే కృష్ణ వెనక అబ్రాడ్ వెళ్ళిపోయేది. అలాంటి పిల్లని వుద్యోగం మానిపించి పెళ్ళిచేసి పంపారు. వీణ తండ్రిలాగే మొదట్నుంచీ నోరులేనిది. అర్చన, పల్లవిలతో తిరిగేది. ముగ్గుర్లోకీ పెద్దదైనా వాళ్ళు చెప్పినట్టల్లా చేసేది. పెళ్లై ఇక్కడికొచ్చాక దెబ్బలు తింటోంది. పుట్టింటికి వెళ్లనివ్వరు. ఫోను మాట్లాడితే పక్కని ఎవరో ఒకరు వుంటారు. వాళ్ళు చెప్పిన చిలకపలుకులే పలకాలి. దొంగనవ్వులు నవ్వాలి. తల్లీ తండ్రీ వచ్చినా నిఘా వుంటుంది. ఒక్క పూటకన్నా వుండే పరిస్థితి వాళ్లకి వుండదు. మీరెప్పుడెళ్తారు, మేం వెయ్యిపనులు ఆపుకుని మీకోసం వుండిపోయామన్నట్టు ప్రవర్తిస్తారు.
అత్తమామలు కొన్నాళ్ళు వాళ్లింట్లోనూ, కొన్నాళ్ళు ఇక్కడా వుంటారు. వాళ్లు లేనప్పుడు ఫోన్ డిస్కనెక్ట్ చేసి, బీరువాలో పెట్టి తాళం పెట్టుకుని, ఇంటికి బైటినుంచి తాళం వేసుకుని వెళ్తాడు భర్త. రాత్రికి ఇంటికొచ్చాక ప్రేమ చూపిస్తాడు. బలహీనంగా వున్నావని ఇంజెక్షన్ ఇస్తాడు. వద్దు, కాదు అనదు. భయం. గాఢమైన నిద్రలోకి జారిపోతుంది. మర్నాడు నిద్రలేచేసరికి వళ్లంతా పచ్చిపుండులా వుంటుంది. తను స్పృహలో లేనప్పుడు ఏం జరుగుతుందో ఆమెకి తెలీదు. లేచేసరికి ఒక్కోరోజు చాలా పొద్దుపోతుంది. భర్త యింట్లో వుండడు. తినడానికేవో టేబుల్‍మీద పెట్టి మామూలు పద్ధతిలో వెళ్లిపోతాడు.
మొదటిరాత్రి ఎలా జరుగుతుందో తల్లే చెప్పింది.
“ముద్దు పెట్టుకుంటాడు. ఏంచేసినా కాదనకూడదు. కాస్త నొప్పెడుతుంది. ఒక్కసారికే. ఓర్చుకోవాలి. ఆతర్వాత అంతా మామూలైపోతుంది” అని. ముద్దుపెట్టుకుంటే నొప్పెందుకుంటుందో ఆ అమ్మాయికి అప్పుడు అర్థమవ్వలేదు. ఇప్పుడా నొప్పి అక్కడ కుళ్లబొడిచినట్టు వుంటుంది. అదీ అత్తమామలు ఇంట్లో లేనిరోజుల్లోనే. మిగతారోజుల్లో మామూలుగానే వుంటుంది. ఆవిడకి ఎలా చెప్పాలో తెలీదు. కాస్తేనా ఆదరంగా మాట్లాడితే నోరిప్పగలుగుతుంది. ఆవిడకలాంటిది రాదు.
భార్యని కొట్టడం, తిట్టడం స్థాయిని దాటిపోయారు కొందరు మగవాళ్ళు. అపార్టుమెంట్లలో ముందువైపుకి కిటికీలుండవు. ప్రైవసీకి భంగమని పెట్టరు. మూసివున్న ఆరున్నరా ఏడడుగుల ఎత్తు టేకు తలుపువెనక ఏదో జరుగుతోందని ఎవరికీ తెలిసే అవకాశం వుండదు. బాల్కనీలోంచీ కనిపించేవాళ్ళు ఏ ఎదుటి బ్లాకువాళ్ళో అయుంటారు. వాళ్ళతో చెప్పాలన్నా పరిచయం వుండదు, వినిపించదు. భాష రాదు.
లీలకి ఇవన్నీ వూహకికూడా అందవు. ఎప్పుడో పాతకాలంలోలా అత్తింట్లో ఆరళ్లుపడుతోంది, కూతురు, ఓర్చుకుంటే అదే దార్లోపడుతుందనుకుంటుంది.
అలాంటి సంబంధం చూసారు దానికి. ఒక్క పిల్లని అపురూపంగా పెంచాం_ అని పుట్టింటివాళ్ళతో దెబ్బలాడుతుంది.
“మేంమాత్రం అనుకున్నామా? కుర్రాడు డాక్టరు. మంచి సంబంధం. కట్నంకూడా వద్దన్నారు. ఇంకేం కావాలని ఆలోచించాను. మరీ నోట్లో నాలుకలేకుండా పెంచావు దాన్ని- అని వాళ్ళు దులుపుకుంటారు. అన్నిళ్ళూ అవంతీపురం యిళ్ళు కావు. ఒకళ్లకోసం మరొకరు తపించిపోరు. అందరు మేనమామలూ రామారావులు కారు.
శేఖర్‍ కూతురికోసం తల్లడిల్లిపోతున్నాడు. లీల వద్దన్నా రెండుసార్లు చూసి వచ్చాడు. దండిగా కానుకలు తీసుకుని వెళ్ళాడు. వాళ్లు చూసుకుని తృప్తిపడి మర్యాదలు చేసి పంపించారు. ఇలాంటప్పుడుకూడా కూతుర్ని పంపకపోవడం లీలకి కొంచెం భయాన్ని కలిగించింది. ఎవరూ తనని ప్రశ్నలు అడక్కుండా పనుల్లో మునిగిపోయింది.
ఎప్పుడూ ఏ శుభానికీ రాని మహతికూడా వచ్చింది.
కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అందర్నీ చుట్టూ పెట్టుకుని సుధీర్‍నీ, వాసునీ చెరోచేత్తోటీ పట్టుకుని ప్రాణం వదిలిందావిడ. ముందు సుధీర్‍కి అర్థమైంది. తన చేతిలో వున్న చెయ్యి వాలిపోతే వాసు అయోమయంగా చూసాడు. తరవాత అందరితోపాటు అతనూ గ్రహించాడు. గంభీరంగా ముఖాలు పెట్టుకుని కూర్చోవడం తప్ప పెద్దవాళ్లెవరూ ఏడవలేదు. వాళ్లు దీన్ని సహజమైన సంఘటనగానే తీసుకున్నారు. జరిగితీరుతుందని ముందే సంసిద్ధమయ్యారు. బైటికి కనిపించే దు:ఖానికన్నా మనసుని కుదిపేసే విషాదం ఎక్కువగా ఆవరించింది వాళ్ళ మనసుల్ని.
వల్లి ఏడుస్తుంటే భర్త ఓదార్చాడు. తులసి కన్నీళ్ళని ఆమె కొడుకులు చిట్టిచిట్టి చేతుల్తో తుడిచారు. మిగిలిన ఆడపిల్లల్నికూడా అలానే ఎవరో ఒకరు ఓదారుస్తున్నారు. గీత వాసు పక్కని కింద కూలబడి, అతని వొళ్ళో తలానించుకుని ఏడ్చింది. అతనూ ఆమె చేతుల్లో ముఖం దాచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. సుమతి వచ్చి, సుధీర్ని అక్కడినుంచీ లేవదీసుకెళ్ళింది. పెద్దవాళ్ళు వీళ్లందర్నీ కోప్పడి దూరంగా పంపించారు. రావలిసినవాళ్ళు ఇంకెవరూ లేకపోవడంతో వెంటనే కర్మ మొదలుపెట్టారు.
కుటుంబరావు, కమలాక్షి వచ్చి వియ్యపురాళ్లని పరామర్శ చేసి వెళ్లారు. ముసలావిడ పేరుమీద ఆస్తులేవైనా వున్నాయా, వుంటే గీతకి అట్నుంచీ ఇట్నుంచీకూడా వాటాలొస్తాయని ఆలోచించుకుని దు:ఖపడ్డాడు. అలాంటివేం లేవని తెలిసి మనసులో బరువు దింపుకుని తేలిగ్గా నిట్టూర్చాడు.
“చూడ, మగతనమంటే అది. ఆ ముసలావిడ భర్త వున్నదేదో ముగ్గురు కొడుకులకీ బతికుండగానే రాసిచ్చేసాడు. మన వియ్యంకుడూ వున్నాడు, వున్నదంతా భార్య పేరిట పెట్టి కొడుకులిద్దర్నీ తన్నుకు చావమన్నాడు. తగ్గట్టుగానే బలవంతుడిది రాజ్యమైంది” అన్నాడు లక్ష్మి యింటిగురించి.
సరిగ్గా ఇలాంటి లెక్కలే వేసుకుని ఈ కుటుంబానికి ఎడంగా వుండిపోయింది లీల. ఎప్పుడో తమ పెళ్లైన కొత్తలో స్థలాన్ని అమ్ముకుని తీసుకున్న డబ్బుని, గీతకి తండ్రి రాసిచ్చిన స్థలానికి ఇప్పుడున్న విలువతో పోల్చుకుని దు:ఖపడుతుంది. అదే డబ్బుపెట్టి తాము కొన్న స్థలానికి అంతకంతా విలువ పెరిగిందనే విషయాన్ని పాతలావాదేవీతో అనుసంధానించుకోవడం చేతకాక ఆవిడకి ఆ బాధ.
“కొడుకులు పెడితే తింది, తిడితే పడింది. నెత్తిమీదేమీ పెట్టుకుని చూసేసి వుండడు ఆ రామారావు. మంచంమీదున్న ముసలావిడ్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయేది గీత తల్లి. రేపు ఆవిడ బతుకేనా యింతే. కొడుకు ఇంతకన్నా గొప్పగా చూస్తాడనుకున్నావా? లేదు. ఈరోజు తిన్నదే తిండి, కట్టిందే బట్ట ఆడవాళ్లకి. మొగుడుండగా బతికిందే బతుకు” అని ముక్తాయించాడు.
తన జీవితంలోని హైన్యత ఈ కుటుంబాన్ని చూసాకే తెలుస్తోంది కమలాక్షికి. ఈయన తర్వాత తనకి పెన్షను వస్తుందా, లేక గవర్నమెంటుకి వదిలేసి, రోడ్డుమీద నిలబడి అడుక్కుని తినమంటాడా అనే భయం వేసింది. గీతని అడగాలి ఈ విషయం. ఆమే ఎందుకంటే రాగద్వేషాలకి అతీతంగా న్యాయం చెప్పగలదని.
ఒకటిరెండురోజులు విషాదవాతావరణం వుంది. తర్వాత తేలికపడింది. సూతకం వున్నవాళ్లు, ముఖ్యమైనవాళ్ళు ఇక్కడ వుండిపోయారు. మిగతావాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఎవరికి వారికే జీవనవ్యాపారాలు. ఉద్యోగాలు, పిల్లలు, చదువులు. అన్నదమ్ములు ముగ్గురూ ఖర్చుకి చూసుకోలేదు. ఆడపిల్లలూ యిచ్చారు, అమ్మకోసం అని. అందరి స్థితీ ఇప్పుడు బాగానే వుంది. పెళ్ళిళ్లకి ముందే కొనుక్కుని పెట్టుకుంటారు. ఏప్పుడో జరగబోయే పెళ్ళిని దృష్టిలో వుంచుకుని ఎన్నో కొంటారు. చావుకి అలా వుండదు. ఒక ముహూర్తం పెట్టుకుని రాదు. ముంచుకొచ్చే ముప్పులా వచ్చి పడుతుంది. అప్పటికప్పుడు అన్నీ సమకూర్చటమే వుంటుంది. ఈ బాధ్యతలన్నీ అనివార్యంగా గీతమీదే పడుతున్నాయి. అందరిచూపూ ఆమెమీదే వుంది. ఈసారి డబ్బుబాధ్యత ఆమెది. బేగులో పెట్టుకుని అడిగినప్పుడు ఇస్తుండమని ఆమె చేతికి ఇచ్చారు. ఏవో విషయాలు అదిలాగా, ఇదలాగా అని అడుగుతున్నారు. అప్పటికే వాళ్ళింట్లో రెండుసార్లు కర్మ చేసి వున్నారుకాబట్టి ఎవరూ తప్పుగా అనుకోవడం లేదు.
“ఇందరం వున్నా ఈవిడ పెత్తనమేనా? ఆపాటి కేష్‍బేగ్ పట్టుకుని తిరగడం ఎవరికి రాదని?” గింజుకుంది మాధురి.
రెండువంటలు నడుస్తున్నాయి. వాసు బియ్యం వేయించాడు. కూరగాయలు రప్పించాడు.
మొదటితరంవాళ్ళంతా అరవైలూ, డబ్బైల్లో వున్నారు. చాలామంది ఇక్కడే వుండిపోయారు. గురుమూర్తి బాగా పెద్దవాడయ్యాడు. ఓపిక తగ్గింది. అరవైలు దాటాక ఒకేడాదికీ మరో యేడాదికే మార్పొస్తుంది. పసిపిల్లల్లో పెరుగుదల కనిపించినట్టు. ఎక్కడికెళ్లినా భార్యాభర్తలిద్దరూ మూలని సోఫా వెతుక్కుని సెటిలైపోతారు.
సుధీర్ ఒక్కొక్కరినీ ప్రేమగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ముఖ్యంగా మహతి. తర్వాత సంధ్య. మహతి జీవితాన్ని కమ్మేసిన విషాదం, పూర్తిగా మారిపోయిన రూపం అతన్ని కలచివేసాయి. దేంట్లోనూ ఆసక్తి లేకుండా, అమ్మనికూడా పోగొట్టుకుని, నిర్లిప్తంగా వుంది. మేఘనని నారాయణే వెంట తిప్పుకుంటున్నాడు. రవళి బానే వుంది. కానీ జీవితానికి చిన్న విషాదపుపోగు కలిసినట్టుంది. అక్క జీవితానికి సంబంధించినదో, అమ్మని పోగొట్టుకున్న దు:ఖమో!
“నీకు మేమంతా వున్నాం మహీ! దేనికీ బెంగపడక్కర్లేదు. మా అందరికీ మగపిల్లలున్నారు. పిల్లని ఎవరో ఒకళ్లం కలుపుకుంటాం” అన్నాడు సుధీర్.
“ఎంత మంచివాళ్ళురా, మీరంతా? స్వంత అన్నదమ్ములుకూడా ఇంత చెయ్యరు” అంది మహతి అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని.
“ఇంకోమాట. ఇప్పుడు, ఇంత నేరుగా అనచ్చో అనకూడదో తెలీదుగానీ, కాస్త కుదుటపడ్డావు, ఎవర్నేనా చేసుకుని సెటిల్ కావచ్చుకదా? మొదట్లో కొంచెం వింతగా అనిపిస్తుంది. తర్వాత అదే అలవాటౌతుంది. చూడమంటావా?” అడిగాడు.
“వద్దు సుధీర్. నాకిలా సింగిల్‍గానే బావుంది” అంది. అతనింక తర్కించలేదు. మిగతా విషయాలు మాట్లాడుకున్నారు.
సంధ్యతో చాలాసేపు మాట్లాడారు ఇద్దరూ. ఒకమాటకీ మరోమాటకీ పొంతన కుదరకుండా మాట్లాడింది. సుధీర్‍కి బాధేసింది ఆమెనలా చూస్తుంటే.
“నాతో వచ్చెయ్ పిన్నీ! చాలా వర్కుంటుంది నాకు. చెయ్యలేకపోతున్నాను. ఒక కంప్యూటరు పెట్టుకుని నువ్వూ చేద్దువుగాని” అంది మహతి ప్రేమగా. అంతవరకూ ఎవరేనా చెయ్యగలరు. ఆ తర్వాత మొదలయ్యే రాణా చొరబాటు భరించడం ఎవరివల్లా కాదు.
తులసీ, వల్లీ, సమీరా ఇద్దరేసి పిల్లల్నేసుకుని తిరుగుతుంటేనూ, ఆరిందాల్లా మాట్లాడుతుంటేనూ, ఇద్దరికీ నవ్వులాటగా అనిపించింది. అర్చన ప్రెగ్మెంటు. రాకూడదని తీసుకురాలేదు వాళ్లత్తగారు. ఆవిడొచ్చి వెళ్ళింది. తనే వెళ్లి అర్చనని కలిసి రావాలనుకున్నాడు సుధీర్.
“నువ్వొస్తావా?” అడిగాడు మహతిని. వస్తానంది.
మగపిల్లలంతా భార్యలతోటీ, పిల్లల్తోటీ దర్శనం యిస్తుంటే సుధీర్‍కి అదో వింత. ఇదంతా ఎప్పుడు మిస్సైపోయాడు తను? తన కళ్ళెదురుగానే జరిగాయి అన్ని పెళ్ళుళ్ళూ. అప్పుడు మామూలుగా అనిపించినవన్నీ, ఇన్నేళ్ళ గేప్ తర్వాత చూస్తుంటే ఒక కొత్తలోకంలో అడుగుపెట్టినట్టుంది.
“ఎంత మారిపోయారే, వీళ్ళంతా!” అన్నాడు ఆశ్చర్యంగా.
“నాకూ అలానే వుందిరా! ఒకొక్కళ్ళనీ చూస్తుంటే మతిపోతోంది. అందరికీ పిల్లలు పుట్టేసారు, ఇల్లంతా నిండిపోయింది. మనకన్నా చాలా పెద్ద టీం వీళ్లది” అంది మహతి.
వాళ్ళిద్దరి మాటలూ విని, “ఔనే, నువ్వేమో ముంబైలో కూర్చునీ, వీడేమో ఇంకెక్కడో కూర్చునీ మమ్మల్ని చూడకుండా యేళ్ళకేళ్ళు గడిపేస్తూ మేం మారిపోయామంటే ఎలా?” అంది సమీర.
“మిగిలిన యిద్దరూ ఏరి? యుద్ధానికి ఒక్కదానివే వచ్చావేం?” అటుగా వస్తూ అడిగింది మాధురి.
“యుద్ధమేంటి?” అంది మహతి.
“వీళ్ళు ముగ్గురూ మాతో ఎలా యుద్ధాలు చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడుకూడా సమీర నడుం బిగించి వచ్చింది అందుకేగా? ఒక్కమాటకూడా మీదుంచుకోరు” అంది మహతి పక్కన కూర్చుంటూ. నీలిమా, వెనక మానసా వచ్చారు. మరోవైపునించీ తులసీ, వల్లీ వచ్చారు. అందరిమధ్యా ఇరుక్కుపోయాడు సుధీర్. వినోదంగానూ అనిపించింది. జడివానలో ఇరుక్కున్నట్టు తమాషాగానూ అనిపించింది. లేవబోతుంటే గీత వచ్చింది. మహతి పక్కని సర్దుకుంది. మాధురి ఆమెనీ సుధీర్నీ మార్చిమార్చి చూసింది. మాటేమైనా తూలుతుందేమోని భయపడింది మానస. నోరు తెరవకుండా చూసుకోవడానికి అక్క పక్కనొచ్చి కూర్చుంది.
“మామ్మ నీగురించి బాగా కలవరించేది సుధీర్! ఆఖరిచూపులకేనా అందుకున్నావు” అంది నెమ్మదిగా. “నీకేమైందే? ఆవిడ బావుండగా ఒక్కసారికూడా రాలేదు?” అంది మహతితో. ఇద్దరి స్పందనకోసం ఆగలేదు.
“నీదగ్గిర్నుంచీ వచ్చేసాక ఒక్కసారి ఓపిక తగ్గిపోయింది మహీ! బైటికి రావడం తగ్గించేసింది. తమ్ముడక్కడికి వెళ్ళాక మా అందర్నీ రమ్మని గొడవచేసేవాడు. ఆవిడకలా వుండగా ఎలా వస్తాననేది అమ్మ.
నాకోసం మీపనులూ, సరదాలూ మానుకోనక్కర్లేదు. ఎప్పుడు పోతానా నేనని ఎదురుచూస్తున్నట్టుంటుంది- అని కోప్పడి అమ్మని పంపేది. అంత మంచిమనసూ, ఆలోచనా ఎవరికుంటాయి? నా చిన్నప్పుడంతా ఆవిడతోనే గడిచింది. ఎన్నో చెప్పేది. ఎన్ని కష్టాలూ, బాధలూ పడ్డా అవి చెప్పేదికాదు, కొడుకు ఎంత సమర్ధవంతంగా తనని అందులోంచీ బైటపడేసాడో చెప్పేది. మానసికమైన బంధం తెగిపోతే భౌతికంగా ఆ మనుషులు మనమధ్యనే వున్నా ఏమీ బాధనిపించదు. మానసికబంధం అలాగే వుండి, భౌతికంగా వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించలేం. నిన్న నాన్న చాలాసేపు ఏడ్చారు.
ఎక్కడికెళ్ళినా, ఎంతదూరం వెళ్ళినా అమ్మ ఒక్కర్తే వుందని తిరిగొచ్చెయ్యాలన్న తపన వుండేది. ఇప్పుడింక తెగిన గాలిపటాలమే కదా అమ్మా, నేనూ- అని బాధపడ్డారు.
ఈరోజునేంటో తొడిమ వూడిపోయి చెల్లాచెదరుగా రాలిపడ్డ పూరెక్కల్లా అనిపిస్తున్నాం మనం నాకు. తొమ్మిదికుటుంబాలవాళ్ళయారు మన అమ్మానాన్నలు. ఇంకో యిన్ని విడివిడి కుటుంబాలయ్యాం మనం. మనవడనో, మనవరాలనో మనని కలిపి వుంచే ఆ చెయ్యి ఇంక పడిపోయింది. ఈ పూరెక్కలని దగ్గిరకి పోగుచేసుకుని వుంచుకోగలమా? ఇంకా దూరానికి ఎగిరిపోకుండా ఆపుకునే శక్తి మనకి వుందా?” అని చేతుల్లో ముఖం దాచుకుంది. దు:ఖం నెమ్మదినెమ్మదిగా పెరిగి వుధృతమైంది. సుధీర్ నిర్విణ్ణుడయాడు. ఆమె దు:ఖం అతని గుండెని మెలితిప్పింది.
“గీతూ! ఏంటే ఇది? ఎందుకేడుస్తున్నావు? అమ్మమ్మ వున్నప్పుడెలా వున్నామో ఇకమీదటకూడ అలానే వుంటాం. నేనున్నానుకదా, మీమధ్యని? నా బాధ్యత మీ అందరిదీ అని చెప్పారా? మరి నన్ను చూసుకోకుండా వదిలేస్తారా?” అంది మహతి దగ్గిరకి తీసుకుని బుజ్జగిస్తున్నట్టు.
“వల్లీ, దీని మెంటార్ని పిలవ్వే” అన్నాడు సుధీర్ తేరుకుని.
అప్పటికే వల్లి కళ్లనిండా నీళ్ళున్నాయి. “ఎవర్రా?” అడిగింది కన్నీళ్ళతోనే.
“నువ్వెందుకేడుస్తున్నావే? పక్కవాయిద్యమా?” కోప్పడ్డాడు.
“మై డైనమిక్ మాడ్రన్ ఓల్డ్ లేడీరా!” అంది వల్లి కన్నీళ్ళు తుడుచుకుంటూ.
నెమ్మదిగా అందరూ సర్దుకుని మాటల్లో పడ్డారు.
“గీతా! అలా బాధపడకూడదుకదే? నువ్వంతలా ఏడిస్తే తట్టుకోగలమా? మేమంతా ఎక్కడికెళ్లిపోతాం? కొన్నాళ్ళు ఉద్యోగాలూ, పిల్లలూ, వాళ్ల చదువులతో బిజీగా వుంటాం. ఆ తర్వాత? మనకి మనమేకదా, మిగిలేది? నువ్వూ వాసూ, మా మెమరీస్ అన్నీ యిక్కడ వుండగా అవంతీపురాన్ని మర్చిపోవడం సాధ్యమా? అమ్మమ్మమాత్రం ఈ వూరొదిలి ఎక్కడికో వెళ్లిపోతుందనుకుంటున్నావా? ఎవరింట్లోనో చిన్నపాపగా పుట్టి పాకడం, మాట్లాడ్డం అన్నీ నేర్చుకుంటూ పెరుగుతుంటుంది” అన్నాడు మృదువుగా.
“మమ్మల్ని చూస్తే మీకందరికీ ఇలాంటి కథలే చెప్పాలనిపిస్తుందేం? శ్రీ స్టార్‍గేజింగ్ చేస్తారు. తనదగ్గిర చాలా మంచి టెలిస్కోప్ వుంది. అప్పుడప్పుడు నన్నూ పిలిచి చూపిస్తారు. మా నాన్న పోయిన కొత్తలో బాగా ఏడ్చేదాన్ని. టెలిస్కోప్ ముందు కుర్చోబెట్టి,
మన పూర్వీకుల పేర్లన్నీ ఈ నక్షత్రాలకి పెట్టుకున్నాం. ఇంకా చాలా మిగిలాయి. ఓ నక్షత్రానికి నువ్వూ మీ నాన్న పేరుపెట్టుకో. రోజూ చూసుకో- అన్నారు. చలికాలంలో కనిపించే ఓరియన్‍కి పేరుమార్చి నాన్న పేరు పెట్టేసాను. చాలారోజులు చూసాను. బావుంటాయిరా, అలాంటి ఆలోచనలు” అంది తులసి.
“నాకూ చూపిస్తావా, బాబాయ్‍ని?” చిన్నగా నవ్వి అడిగాడు.
“అక్కడినుంచీకూడా చూడచ్చు” అంది తులసి తనూ నవ్వి.
నెమ్మదిగా అక్కడినుంచీ లేచాడు. మిగతావాళ్ళుకూడా ఒకొక్కరూ కదిలిపోయారు. నీలిమకి గీత మొహం చూడటానికి మొహం చెల్లట్లేదు.
మాధురి అంది,”ఆవిడన్న మాటలు ఏమన్నా అర్థమయ్యాయా నీకు?” అనడిగింది మాధురి. “వీళ్ళకి గొడవలున్నాయంటారు, బానే మాట్లాడుకున్నారుకదే ఇద్దరూను?” అడిగింది.
“గొడవలంటే ముఖాలు మాడ్చుకుని, సూటిపోటిమాటలనుకుంటూ తిరుగుతారేమిటే? పెద్దకుటుంబాల్లో గొడవలు గొడవలే. వ్యవహారాలు వ్యవహారాలే. వేటి దారి వాటిదే” అంది మానస.
గీత దు:ఖం బాగా కలవరపరిచింది సుధీర్‍ని. వాసుతో ఇంకా మాటలు కలవలేదు. మాట్లాడాలని బలంగా అనిపించింది. అతని పెళ్లయాక తగ్గిపోయి, క్రమంగా ఆగిపోయాయి. యూయస్ వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా అని మీమాంసపడి, ఒక టూర్లో వున్నప్పుడు బావుండదు, తప్పదనుకుని దార్లో పదినిముషాలు వెళ్ళొచ్చారు, వాసూ గీతలు. నిర్మల పోయినప్పుడు ఒకటో రెండో కాల్స్. అంతే. పొడిపొడిగా. సుధీర్‍కి అతనిమీద కోపమేం లేదు, కలివిడిగా వుండాలంటే కాస్త యిబ్బంది తప్ప. కాలం ముందుకి తొయ్యబట్టి, కష్టమ్మీద అదీ దాటాడు. ఇప్పుడిక్కడ. ఒకళ్ళొచ్చినప్పుడు ఇంకొకళ్ళు బైట వుంటున్నారు. ఆఖరికి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకళ్ళ ముఖంలోకి మరొకళ్ళు చూసుకున్నప్పుడు సుమతి పెళ్ళిలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి ఒక్కసారి పెద్దగా నవ్వేసాడు సుధీర్.
“ఏరా! మీ చిన్నాడు మీకే పుట్టాడా, లేకపోతే ఏ చెట్టుకేనా కాస్తే కోసుకొచ్చి మగ్గేసుకున్నారా? నాకు గుర్తు రావట్లేదు” అడిగాడు నవ్వుమధ్య. వాసుకూడా నవ్వాడు. కాస్త సిగ్గుపడ్డాడు, ఆరోజుని జరిగింది గుర్తొచ్చి.
“నీఅంత ఎత్తున్న కొడుకుని పెట్టుకుని కొత్తపెళ్ళికొడుకులా సిగ్గుపడతావేంట్రా?” అన్నాడు సుధీర్ ఇంకా అలాగే నవ్వుతూ.
“పోరా!” అన్నాడు వాసు.
చాలా సహజంగా ఒకళ్ల చెయ్యొకళ్ళు పట్టుకుని ఒకరినొకరు తీసుకెళ్తున్నట్టు వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఇంద్రధనుస్సు విరిసినట్టో, ధృవదీపాలు వెలిగినట్టో, వెన్నెల కురిసినట్టో వుంది ఇద్దరికీ. దశాబ్దం దాటిన మౌనం విడేసరికి.
“ఏరా, కోపం తగ్గిందా? అలకలు తీరాయా? మరీ నేనే రావణాసురుడినో, గీతనెత్తుకుపోయి పెళ్ళిచేసుకున్నానో అన్నట్టు నామీద కోపమేమిట్రా? అది చిన్నప్పుడే నన్ను తనకి దానపట్టా రాసేసుకుంది” అన్నాడు వాసు.
“నీమీద కోపం దేనికిరా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో పడి బైటికెలా రావాలో అర్థమవ్వక గిజగిజలాడితేను?” అన్నాడు సుధీర్.
“ఏమిటో అది?”
“పద్ధెనిమిదేళ్లకి ఆర్థికస్వతంత్రం, ఇరవయ్యేళ్ళకి వుద్యోగం, జీతం, సంపాదనా, దాపరికాలూ, పాతికేళ్ళకి పెళ్ళీ తమరికి. మరిక్కడ మా పరిస్థితి? అంతూదరీ కనిపించని అప్పులు, అసలెప్పుడౌతుందో తెలీని చదువు. మెడిసిన్‍వైపు వెళ్తే సెటిలవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అందులోనూ డిగ్రీ అయాక మెడిసిన్లో చేరాను. అమ్మేమో కట్నం అడిగింది. వాళ్ళు చేసుకోం పొమ్మన్నారు. నువ్వు కట్నం అక్కర్లేదన్నావు. నాకు జరిగింది చూసి ప్రహీ, వసంత్ కట్నం వద్దనేసారు. ఇంక నా పరువేం మిగిలింది?” అన్నాడు సుధీర్ కోపంగా. చిన్నపిల్లవాడి కోపంలా అనిపించింది వాసుకి.
“కట్నం తీసుకోకపోవడం వెనుక నాకు పెద్ద ఆదర్శమేదీ లేదు సుధీర్! నాన్నకి తీసుకోలేదట. మాకూ వద్దనుకున్నారు. పెద్దవాళ్ళ నిర్ణయం. అంతే. ఇల్లుంది, నాన్న ఇంకా సర్వీసులో వున్నారు. ఇటు చూస్తే గీతకీ వుద్యోగం వుంది. అప్పటికే నేను కొద్దిగా దాచాను. ఇంక ప్రత్యేకంగా కట్నం తీసుకోవాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఇంటింటికీ పరిస్థితులు మారుతాయి” అన్నాడు.
“మామయ్యని అలా అడగడం తప్పుకదరా? ఎవరి మొహం చూడలేకపోయేవాడిని”
“వదిలెయ్‍రా! ఎవరూ నిన్నుగానీ ఆమ్మనిగానీ తప్పుపట్టలేదు. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు. వాళ్ల వ్యవహారాలు వాళ్లకుంటాయి. మనం వాళ్ళూ గీతగీసుకున్నాంకదా, ఏ తరం గొడవలు ఆ తరానివేనని? మళ్ళీ ఆ మధ్యలోకి వెళ్ళి, మనసులు పాడుచేసుకోవడం దేనికి? మా నాన్నగురించి నాకిలాగే కోపం వుండేది.
నీకు నచ్చినట్టుండి, నీకు కావల్సిసినవన్నీ అమర్చిపెడితేనే నాన్నా, లేకపోతే కాదా – అంది గీత.
తట్టి లేపినట్టైంది నాకు. ఆయన్నలాగే చూడటం అలవాటుచేసుకుని, ఆయన మధ్యలో వదిలిపెట్టేసిన బాధ్యతలని నేను అందుకున్నాను. నువ్వూ అంతేకదా? కార్పొరేషన్ హాస్పిటల్లో చేరావు, ఇల్లు కొన్నావు. ఇక్కడ అన్నీదార్లో పెట్టి, యూయస్ వెళ్లావు. ఇన్నీ చేసి, ఆమ్మనెందుకు బాధపెడుతున్నావురా? నువ్వెన్ని కొనిచ్చినా ఎంత డబ్బు పంపించినా ఆవిడకేం సంతోషం వుంటుంది?” అన్నాడు వాసు మృదువుగా.
“లేదులే, ఈసారి ఇద్దర్నీ నాతో వెంటబెట్టుకుని వెళ్తాను”
“అసలిక్కడికి ఎందుకు రావు నువ్వు? అందరం వున్నాం. ముంబై వచ్చి అట్నుంచటే వెళ్లిపోవడమేంటి? మాకూ నిన్ను చూడాలనుంటుంది. మా అందర్లోకీ నువ్వొక్కడివేకదా, ఎంతో ఎత్తుకి ఎదిగిపోయింది?”
“ఊరంతా ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటుంది. నువ్వంటే ఇక్కడే వుంటావు. అవన్ని సహజంగా అనిపిస్తాయి. నాకలా కాదు. పోయినసారి వచ్చినప్పుడు చూసినవన్నీ మళ్ళీ వచ్చినప్పుడు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. అవంతీపురమే చూడు, సిటీలో కలిసిపోయింది. చిన్నప్పుడక్కడ ఆడుకున్న చెట్టేది, ఫ్రెండ్స్‌తో వన్ బై టూ టీ తాగిన బంక్ ఏదీ, ఆ ఫ్రెండ్సేరి ఇలాంటి సిల్లీ సమాచారం మనసుని తూట్లుపొడుస్తుంది. ముంబైతో అలాంటి అటాచిమెంట్సేవీ లేవు, రావడం నాలుగు బజార్లు తిరిగేసి వెళ్లిపోవడం అంతే. ఐనా నేను వచ్చింది తక్కువ. రమ వస్తుంటుంది” అన్నాడు.
పిల్లలు, కొనుక్కున్న ఆస్తులూ, ఇక్కడొచ్చిన మార్పులు, అక్కడి జీవితం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాక,
“ఇందాకా ఏదో దానపట్టా అన్నావు?” అడిగాడు సుధీర్ మళ్ళీ గుర్తుతెచ్చుకుని వేళాకోళంగా.
“మాటవరసకి అన్నాం, కమిట్ చేయించేస్తావేంటి?” అన్నాడు వాసు పెద్దగా నవ్వి.
వీళ్ళిద్దరూ వెనకట్లా కూర్చుని మాట్లాడుకుంటున్నారన్న విషయం పెద్ద సంచలనం. పిల్లా, పెద్దా అందర్లో. ఇద్దరూ కలిసి నడిపించిన గ్రూపుకి గట్టిగా అగ్గిలా అంటుకుంది. ఒకొక్కరూ రావటం, వీళ్ళపక్కని కూర్చుని మాట్లాడటం. రాణాతప్ప అందరూ వచ్చారు. దహనానికి ఎట్నుంచో మెరుపులా వచ్చి వెళ్ళాడుతప్ప మళ్ళీ రాలేదు.
“నేనుండగా రాడు. రెండుసార్లు నాదగ్గిర డబ్బుపట్టించాడు. బాగుపడతాడని యిచ్చాను. హోప్‍లెస్ ఫెలో” అన్నాడు సుధీర్.
“అలా ఎలా యిచ్చావురా?” అని మిగతావాళ్ళు కోప్పడ్డారు.
వాసు, సుధీర్ అంత ఆత్మీయంగా మాట్లాడుకుంటుంటే నీలిమకి ఆశ్చర్యంతో తలమునకలుగా వుంది. అక్కడ చేరినవాళ్లందరిమధ్యా ఎలాంటి ఎక్కువతక్కువలూ కనిపించలేదు. తను వాసుని అన్నమాటలు తననే పరిహసిస్తున్నట్టనిపించింది. మాధవ్‍ ఆమె మొహంలోకి చూసీ చూడనట్టు చూసాడు. అది చాలు ఆమెకి ప్రాణం చచ్చిపోవడానికి. తలదించుకుంది. గీతకూడ వచ్చికూర్చుంది. చావింట్లో భోజనాలు చెయ్యరుకాబట్టని, ఇంట్లో వుండే పిల్లలకి అక్కడే అన్నం వండించి పెట్టి వచ్చింది. పల్లవి, సంతోష్ అసహనంగా అటూయిటూ తిరుగుతున్నారు. పల్లవి వచ్చి గీత పక్కని కూర్చుంది.
“వీణ ఈసారికూడా రాలేదు. పదోరోజుకికూడా పంపరేమో” అంది దిగులుగా.
“అదేమిటే?” అంది గీత.
“అర్చీనేమో వాళ్లత్తగారు వెంటవెంట తిప్పుకుంటుంది. అన్నిటికీ తీసుకొస్తుంది. మనమధ్యని వదిలిపెడ్తుంది. ఎప్పుడంటే అప్పుడు మాయింటికి పంపిస్తుంది. వాళ్ళకి ఆడపిల్లల్లేరు, ఒక్కడే కొడుకు. అందుకని ఇది అపురూపం. ఇదికూడా ఎంజాయ్ చేస్తోంది. సరే, వప్పుకున్నాం. వీణనేంటో పూర్తిగా ఏడుసముద్రాల అవతల వొంటిస్తంభం మేడలో అన్నట్టు దాచేసారు. పెళ్లయాక అసలు పంపనే లేదు. పెద్దనాన్నావాళ్ళూ వెళ్ళి చూసి రావడమే. ఎంత నార్త్ సాంప్రదాయం ఐతేమాత్రం, ఆడపిల్లని పుట్టింటికి పంపరా? అలాంటివాళ్ళు నార్త్ పిల్లనే చేసుకోవలసింది. ఇక్కడివాళ్ళు అక్కడికి వెళ్తే సాంప్రదాయాలు మారిపోతాయా? ఈరోజుల్లో అలాంటివి ఎవరు పాటిస్తున్నారు?” అంది.
“ఇప్పుడెవరేనా వెళ్ళి తీసుకురావచ్చుకదే? వెళ్ళి అడిగితేకూడా కాదంటారా?” అంది సుమతి.
“ఎవరెళ్తారు? మాకందరికీ ఏటిసుతకం. వెళ్లకూడదు. వెళ్తే తప్పుపడతారు. మీలోనే ఎవరేనా వెళ్ళాలి”
“పిన్నేమంటోంది?” అడిగింది గీత.
“అక్కడేదో జరుగుతోందే గీతూ! ఆమ్మ అందర్నీ తప్పించుకుని తప్పించుకుని తిరుగుతోంది. పెద్దనాన్న దానిగురించి దిగులుపడుతున్నాడు. తిండికూడా సరిగ్గా తినట్లేదట, సంతోష్ చెప్పాడు”
“భలే వుండేదది చిన్నప్పుడు. పట్టుపరికిణీ, బుట్టచేతుల జాకెట్టూ, చివర్లు వదిలేసి రబ్బరు బేండ్లు పెట్టుకున్న రెండు జడలూ, విల్లులా కలుసుకునే దట్టమైన కనుబొమ్మలూ, మధ్యలో చిన్న దోసగింజంత బొట్టూ, ముద్దొచ్చేసేది. పిలిచినా దగ్గిరకి వచ్చేది కాదు. ఏమూలో నిలబడి కళ్ళు ఆల్చిప్పలంతంత చేసుకుని చూసేది. నేను ఏమరపాటుగా వున్నప్పుడు వెనకనుంచీ వచ్చి, భుజాలమీంచీ చేతులేసి, చెంపకి చెంప ఆనించి ముద్దుపెట్టేసుకుని పారిపోయేది. పట్టుకుందామన్నా దొరికేదికాదు. ఒక్కసారిమాత్రం గబుక్కుని పట్టేసుకుని వొళ్ళో కూర్చోబెట్టుకున్నాను.
అమ్మ చూస్తుంది, కోప్పడుతుంది- అని రహస్యంగా చెప్పేసి, వెళ్ళిపోయింది.
ఎన్ని ముద్దులు పెట్టిందో! ఆ ముద్దులకే ప్రాణం యివ్వచ్చు” అంది గీత.
“నువ్వంటే దానికి చాలా యిష్టం. నీగురించి ఎవరేనా మాట్లాడుకుంటే చేస్తున్న పనాపేసి వినేది”
“అమ్మావాళ్ళింటికి విడిగా వచ్చేది కాదు. ఫంక్షన్లకే రావటం. నా పెళ్ళయ్యాక ఇక్కడికొచ్చేది. సంతోష్ తీసుకొచ్చేవాడు. వచ్చినా మాధవ్‍ దగ్గిర కూర్చునేది. నాదగ్గిరకి రావాలంటే ఏదో బెరుకు కనిపించేది. మరీ అంత దగ్గిరకి పిలవకపోయినా పిన్ని మొదట్లో నాతో బానే వుండేది. నామీదెందుకు ఆవిడకి కోపం?”
“కథలు చాలా వున్నాయిలేవే, అవన్నీ ఇప్పుడెందుకుగానీ, దాని విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి. మర్యాదగా పదోరోజుకి వచ్చిందా వచ్చింది, లేకపోతే వదిలేది లేదు” అంది పల్లవి. వీళ్ళు మాట్లాడుతున్నది చెల్లెలిగురించే అని అర్థమై సంతోష్ వచ్చికూర్చున్నాడు.
“నీకెందుకు, గీతా! వదిలేసెయ్. ఆవిడతో మనకి వర్కౌట్ కాదు” అన్నాడు వాసు కాస్త కోపంగా.
“అదేంట్రా?” వెలతెలబోయింది పల్లవి.
“మేమంతా దానికి బావలంట. దాంతో మాట్లాడితే వాళ్లాయన తప్పుపడతాడట” చిన్నబుచ్చుకుని అన్నాడు సుమంత్.
“నేనే పదేళ్ళు పెద్దదాన్ని. ఇంకో పదేళ్ళు పెద్దౌతే అంత కూతురుండేది మాకు. మీరంతా ఇంకా పెద్దవాళ్ళు. అదేంటా అనడం, అసహ్యంగా?” అంది గీత ఆశ్చర్యంగా. “పెళ్ళి ఇక్కడ చెయ్యకుండా బెంగుళూర్లో చేసారు. పెళ్ళివాళ్ళు చెయ్యమన్నారట. ఖర్చు తడిపిమోపెడైంది. అందరూ కోప్పడ్డారు బాబాయ్‍ని” అంది.
“పెళ్ళిలో వూరికే దానిచుట్టూ తిరిగి హడావిడి చెయ్యకండి. ముహూర్తం టైముకి ఎవరి భార్యల పక్కని వాళ్ళు నిలబడి అక్షతలేసి వెళ్ళండని ఆవిడ ఆర్డరు” అన్నాడు వసంత్.
“అందుకేనా, మీరంతా విడిదింటికి రాకుండా గెస్ట్‌హౌస్‍లో దిగింది? ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదేంరా? సుమంత్‍కూడా మాటదాటేసాడు ” అడిగింది సుమతి ఆశ్చర్యంగా.
“అదీ పెళ్ళిమంటపానికి ఎదురుగా, ఎవరం ఇవతలికొచ్చినా కనిపించేలా దిగాం. ఒకొక్కరూ ఇవతలికి వెళ్ళను, మొహం చూపించి,
ఇప్పుడే రాం, ముహుర్తం టైముకి వస్తాం- ఎవరో ఒకర్తో అనేసి వచ్చెయ్యను” అంది లత నవ్వుతూ.
“అందరం కలిసే వచ్చాం, మీరంతా ఏమైపోయారా అని మేం వెతుక్కుంటుంటే పల్లవి చెప్పింది” అంది రవళి.
“ఏదో జరిగిందని అర్థమైంది. ఏం జరిగిందో చెప్పినవాళ్ళు లేరు. మీరెవరూ లేకుండా మేంమాత్రం ఎందుకని సిటీ చూడటానికి వెళ్ళిపోయాం. సగం మంటపం ఖాళీ. మీతోపాటే ముహూర్తం టైముకి వస్తే, రవి మామయ్య తిట్టడం-
ఆవిడేదో అందని అందరూ మూకుమ్మడిగా మాయమౌతారా? ఇంత కట్టేమిటే, మీకు? ఇదివరకు పదకొండుమందే. ఇప్పుడు అందరూ చేరిపోయారా గుంపులో? మీవెనక మీ మొగుళ్ళుకూడా రావటమేంటి? పెళ్ళిలో వేసిన కొంగుముళ్ళు ఇప్పుకోవడం మర్చిపోయారా? తల తిరిగిపోతోంది. అసలు మీకెవ్వరికీ సీరియస్‍నెస్ లేదా? ఉద్యోగాలు చేస్తున్నాం, డాక్టర్లం, ఇంజనీర్లం, పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలున్నారని అనుకోవట్లేదా ఎవరూను? పిల్లలాటలింకా అవలేదా- అని”
అంది సుమతి. అందరూ నవ్వేసారు.
“కళ్లతోటీ, చూపుల్తోటీ మాట్లాడేసి, బొంగరంలా తిరిగేస్తే సరిపోతుందేమిటి? వాళ్లమ్మని సరిగ్గా పెంచుకోనక్కర్లేదా? వేలెడుండేది, కొత్తిమీరకట్టల్లా జళ్ళేసుకుని, నా కాళ్లకి అడ్డంపడిపోయేది. నన్ను కింద పడేద్దామని ఎన్నోసార్లు ప్లాన్లేసింది. అది మరదలేంటి? ఆమాటకే చిరాకేసిపోయింది. కోప్పడక్కర్లేదూ ఆవిడ్ని?” అన్నాడు వాసు కోపంగా.
“వాళ్లమ్మని అది పెంచుకోవాలా?” నవ్వింది గీత.
“ఎవరూ పెంచలేనంతా, వంచలేనంతా ముదురుఠంగణాగానీ ఆవిడ, నాకే లొంగలేదు. దీని విషయం ఏం చేద్దామే?” అడిగింది పల్లవి.
“మరైతే ఇప్పుడేం చేద్దాంరా? దాని పెళ్లై రెండేళ్ళపైమాటే. ఇప్పటిదాకా ఒక్కసారికూడా దాన్ని చూసింది లేదు” అంది సుమతికూడా.
“మీరే ఆలోచించాలి సుమతీ!” అన్నాడు సంతోష్.
“ఏటిసూతకంవాళ్ళనీ, బావకేరక్టర్లనీ తీసేస్తే ఆడపటాలం వున్నాం. మేం వెళ్తాం. ఈ హడవిడంతా అయాక నార్త్‌టూరనో, తీర్థయాత్రలనో పేరుపెట్టుకుని నేరుగా వాళ్ళింటికే వెళ్ళిపోతాం” అంది గీత.
“నేనోసారి వెళ్ళాను. అసలేం జరుగుతోందో చూద్దామని ముందుగా చెప్పకుండా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఇంటికి తాళం. ఫోన్ చేస్తే డెడ్. వాళ్ళత్తగారింటికి ఫోన్ చేస్తే ఎటో టూర్ వెళ్ళారని చెప్పి, ముందుగా చెప్పి రావద్దా అని కోప్పడి పెట్టేసింది”
“ఎవరెవరొస్తారో ఆలోచించుకుని నాకు డేట్ చెప్పండి. లీవు పెడతాను. ట్రిప్ ఆర్గనైజరుగా ఎవరుంటారో చెప్తే యాక్షన్ ప్లాను ఇస్తాను. మనం అనవసరంగా భయపడుతున్నామేమో! అక్కడంతా నార్మల్‍గానే వుంటుంది. పదోరోజుకి వీణ వచ్చినా రాకపోయినా జాలీట్రిప్‍లాగా వెళ్ళొచ్చేద్దాం. పంపిస్తే దాన్నీ మనతో తీసుకెళ్దాం. పిన్నీ, బాబాయ్ మాతో వచ్చి హోటల్లో దిగుతారు. దాన్ని అక్కడికే తీసుకొచ్చి చూపిస్తాం. ఏరా సంతోష్, సరేనా? ముందు బాబాయ్‍నీ పిన్నినీ వప్పించు” అంది గీత.
అతను తలూపాడు.
ఈపాటి ఆలోచన ఎవరూ చెయ్యలేరా? ఈవిడే చెప్పాలా? వీళ్ళంతా తలలూపాలా? అని చిరచిర్లాడింది మాధురికి. నీలిమ అర్థంచేసుకునే ప్రయత్నంలో వుంది. మానసకి అర్థమై తనూ వెళ్లాలని సరదాపడింది. ఒకరు ముందుండి నడిపిస్తుంటే ఇలాంటివాటిల్లో అనుసరించి వెళ్లడం ఆమెకి నచ్చుతోంది.
“అమ్మయ్య! ఒక సమస్య పరిష్కరించేసాం. మన జీవితాలకీ సార్ధకత వుంది. మరీ పిల్లలాటలా ఏమీ బతకట్లేదు మనం” అంది గీత చివరికి. అంతా నవ్వారు. అంతే. నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, మళ్ళీ నవ్వుకోవడం. ఇంకే పనీ వుండదు. ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళేదాకా. వంటకీ పైపనులకీ మనుషుల్ని పెట్టుకున్నారు. పెద్దవాళ్లకే పనులు లేకపోతే ఇంక వీళ్ళకేం వుంటాయి?
సుధీర్ అక్కడినుంచీ లేచి యివతలికి వచ్చాడు. తల్లీ తండ్రీ ఇద్దరే కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు. తల్లి పక్కని కూర్చున్నాడు. ఆవిడ కోపంగా చూసింది.
“దేనికొచ్చావురా? ఎవరివని వచ్చావు? ఏడేళ్ళు వదిలేసి పోయినవాళ్ళు ఎవరికీ ఏమీ కారు” అంది.
“నీకు నేనేమీ కానేమోగానీ, మిగిలిన అందరికీ అన్నీ ఔతాను. అమ్మమ్మ పోతే రాకుండా ఎలా వుంటాను?” అన్నాడు.
“అంత ప్రేమ వుంటే రమనీ పిల్లల్నీ ఎందుకు తీసుకురాలేదు?’ఇలాంటప్పుడే అందరూ కలిసేదీ, ఒకళ్లకొకళ్ళు పిల్లల్ని చూపెట్టుకునేదీ”
“ఆలోచించలేదు. వాళ్ళమ్మావాళ్ళున్నారని ఆగిపోయింది”
“అసలు నీకు ఆలోచన ఎప్పుడుందని? ఉంటే ఇలా మబ్బుమొహం వేసుకుని వుండవు. హాయిగా బతికేవాడివి”
“నన్ను చూసి కరెంటుఖర్చని ఎక్కడుంటే అక్కడ ట్యూబ్‍లైట్ ఆఫ్ చేసుకుంటున్నారు”
“అబ్బో!”
“నేనిక్కడ నెల వుంటాను. ముంబైలో పనులున్నాయి. అవి చూసుకుని మళ్ళీ వస్తాను. మీరిద్దరూ నాతో రండి”
“అక్కడికొచ్చి ఏం చెయ్యాలి?”
“ఎంతమంది అమ్మలూ నాన్నలూ రావట్లేదు? అలాగే మీరూను”
గురుమూర్తి కలగజేసుకున్నాడు. “ఇక్కడంటే అందరూ వున్నారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం. అక్కడికొస్తే మీరెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి, మీరేది చూపిస్తే దాన్నే స్వర్గమనుకోవాలి. నాలుగుసార్లు వచ్చాం, మీరు చూపించిన స్వర్గాలన్నీ చూసాం. ఇంక చాలు. అదో, వీళ్ళ చెల్లెలు డ్రైవింగ్ నేర్చుకుని, కారేసుకుని తిరుగుతోందని మీ అమ్మ తెగ వుబలాటపడిపోతోంది. ఈ పోటీల జీవితం అక్కడెక్కడిది?”
“ఏ చెల్లెలు?” ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్.
“లక్ష్మి”
పద్మో, అరుణో అనుకున్నాడు. కాకపోయేసరికి మతిపోయింది.
“ఇప్పుడు నువ్వు కొత్తవేవో మొదలుపెట్టి అక్కడ నాకున్న టెన్షన్లకి కొత్తది చేర్చకు. నలభైల్లో పడుతున్నాం, ఓపికలు తగ్గుతున్నాయని మేం అనుకుంటున్నాంగానీ, అరవై దాటినా మీ అక్కచెల్లెళ్లకి తగ్గవేం? ఇప్పుడంత నువ్వు డ్రైవింగే నేర్చుకుని ఆవిడకి పోటీ యివ్వక్కర్లేదు. కంప్యూటరు కొనిస్తాను, అది నేర్చుకున్నా చాలు” అన్నాడు.
“ఈ వయసులో కంప్యూటరు కొనుక్కుని నేర్చుకునేదేముంటుంది? అదేదో వుద్యోగంలో వున్నప్పుడైతే బావుండేది. జబ్బలు నొప్పెట్టేలా కార్బన్‍పేపర్లు పెట్టి రాసేవాళ్ళం” అంది.
“ఇంటర్నెటని వుంటుంది. అది తెరిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈమెయిల్ అకౌంటు తెరుస్తాను నీకు. నన్ను తిట్టాలనుకున్నప్పుడు దాంట్లో రాసి పంపించేస్తే నోరు నొప్పుండదు. వెంటనే నా జవాబుకూడా వినక్కర్లేదు”
“ఓహో! నిన్ను తిట్టేపని మీ ఆవిడది. నేను ఆ బాధ్యతలోంచీ తప్పుకున్నాను. బానే దార్లో పెట్టుకుంది”
వాళ్ళిదరి వాదనా తెగదని గురుమూర్తి కలగజేసుకున్నాడు.
“ఇక్కడ మాకు చాలా బావుంది సుధీర్! రామారావు నాకేం పెట్టాడని ఒకప్పుడు అనుకునేవాడిని. అప్పటి అవసరం అది. ఇప్పుడు చూస్తే ఇంత పెద్దకుటుంబాన్ని నాచుట్టూ అమర్చాడు. గీత చూసుకున్నంతకాలం అన్ని పెళ్ళిళ్ళలోనూ, వేడుకల్లోనూ అగ్రతాంబూలం మాదే. ఇప్పుడైతే తోచక ఫోన్ చేస్తే వాసు, ప్రహీ, వసంత్ ఎవరో ఒకరు వచ్చి గంటో రెండుగంటలో కూర్చుని మాట్లాడి, దిగులు తీర్చి వెళ్తారు. అరేయ్, మా అమ్మకి ఒక్క కొడుకుని. చిన్నప్పుడే తండ్రినీ, నడివయసుకూడ రాకుండా తల్లినీ పోగొట్టుకున్న వంటరివాడిని. ఈ మనుషులంతా నావాళ్లని ఇప్పుడు మమకారం పెరిగిపోయింది. నీలో మార్పురావాలని అక్కడికి పంపాం. మారావు సంతోషం. నీకు తోచినప్పుడు వచ్చి చూసి వెళ్ళు” అన్నాడు.
“మేమూ వచ్చేస్తాంలెండి నాన్నా! మీకులానే నాకూ వుంటుంది” అన్నాడు సుధీర్.
“ఎందుకూ? మళ్ళీ మాడిపోయిన బల్బులా తిరగడానికా?” అడిగింది ప్రమీల.
“రాణావాళ్లమ్మ పరిస్థితేంటి నాన్నా? ఆయన పూర్తిగా వీళ్ళని వదిలిపెట్టేసాడా? మీరెవరూ ఏమీ చెయ్యలేదా?” తల్లి మాటలు పట్టించుకోకుండా అడిగాడు.
“చాలా బావుండేదిరా, సంధ్య. పదేళ్ళవ్యవధిలో ఆరుగురు వీళ్ళు. మా పెళ్ళప్పటికి పదకొండో పన్నెండో తనకి. చాలా స్టైలుగా వుండేది. పొడవాటి రెండుజడలేసుకుని, పువ్వులున్న తెల్లటి చీరకట్టుకుని తిరిగిన రూపం లీలగా గుర్తు. పదిహేనేళ్ళేమో, అప్పుడు. ఇంకా చిన్నదో? చీర కచ్చా దోపేసుకుని, సైకిలు నేర్పమని వచ్చేది.
సిగ్గులేదా నీకు? సైకిలు తొక్కుతావా? అదీ పెద్దబావగార్ని నేర్పమని అడుగుతున్నావా- అని మా అమ్మ తిట్టి వెళ్లగొట్టేది. ఆవిడ లేని టైము చూసుకుని మళ్ళీ వచ్చేది. నచ్చజెప్పి పంపించేది అమ్మ.
అన్నీ చూసే యిచ్చారు. మరి అతనికి ఎప్పుడలాంటి బుద్ధి పుట్టిందో? మొదటిసారి విషయం బైటపడ్డప్పుడు త్రిమూర్తులినీ నన్నూ వెంటబెట్టుకుని వెళ్ళి నిలదీసాడు మామయ్య. అతను తప్పొప్పుకున్నాడు. మరోసారి చెయ్యనని హామీయిచ్చాడు. అతను చేసిన ప్రతీసారీ సంధ్య గొడవచేసి వుంటే బావుండేదేమో! దాచిపెట్టేసింది. కొంపమీదికి వచ్చింది. అప్పటిదాకా చిల్లరస్నేహాలు చేసిన మనిషి ఏకంగా ఇంకో కాపురం పెట్టాడు. మాకు తెలిసేసరికి అంతా ఐపోయింది. అవతలింట్లో ఒక పిల్లో, పిల్లాడో! ఎంతోకొంత డబ్బిచ్చి వదిలించుకోమన్నాం. ఇద్దర్నీ చూసుకుంటానన్నాడు. అదీ నీటిమీది రాతే అయింది. ఇప్పుడేదో పిన్ని తిండికీ జరుగుబాటుకీ పంపించి చేతులు దులుపుకుంటున్నాడు. మా ఎవరిదగ్గిరకో వచ్చెయ్యమని సంధ్యకి అందరం చెప్పాం. కొడుకుని వదిలిపెట్టి రాదు. తన దురదృష్టం, వాడలా తయారయ్యాడు. వాడినెవరం భరించలేం” అన్నాడు గురుమూర్తి.
“మిగతా అంతా బావుండి పిన్నికీ, మహీకీ ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు వీళ్ళంతా వీణగురించి కంగారుపడుతున్నారు. అతను డాక్టరు, మంచిసంబంధమేననుకున్నారు?”
“మన ఒక్కింట్లోనే సంస్కారం వుంటే బైటినుంచీ వచ్చే ఎంతోమంది ఆడపిల్లలు సుఖపడతారు. మన ఆడపిల్లలు సుఖపడాలంటే బైట ఎన్నో యిళ్లలో సంస్కారం వుండాలి. అందుకే అంటారు, మనం బావున్నామంటే పక్కవాడు మంచివాడని. శేఖరం పిల్లకోసం తల్లాడిపోతున్నాడు. అంతదూరం, ముక్కూమొహం తెలీనిచోట వద్దంటే వినకుండా యిచ్చారు. ఆమాటకొస్తే అమెరికాయే పంపిస్తున్నారు. కాదనం. కానీ పిల్లాడి తల్లిదండ్రులు మనకి అందుబాటులో వుంటే పిల్ల క్షేమం తెలుస్తుంటుంది. పిల్లా దగ్గర్లో లేక పిల్లాడి తల్లిదండ్రులూ లేకపోతే ఇలానే వుంటుంది. సిటీ గొడ్డుపోయిందా, అంతదూరాన్న యివ్వడానికి? సుమతీవాళ్ళు పెద్దయారనుకో, మీ తర్వాతి నలుగురు ఆడపిల్లలూ ఏ చిన్నదున్నా పరిగెత్తుకొచ్చేస్తారు. ఏం పెట్టినా పెట్టకపోయినా కళ్లతో చూసుకుంటే సంతోషం కదరా?” అన్నాడు గురుమూర్తి. కొడుకు ఈ విషయాలన్నీ పట్టించుకుని అడగడం అతన్లో వచ్చిన మార్పుని సూచించింది. అసలు వాళ్ళ పెళ్లి నిలబడుతుందా, లేదా అనుకున్నవాడు తేలిగ్గా నిశ్వసించాడు. ప్రమీలకూడా.
వాళ్ల దగ్గర్నుంచీకూడా లేచి ఇవతలికి వచ్చాడు సుధీర్.
ఇంట్లో జనం చాలావరకూ వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు భోజనాలయ్యి పడుక్కుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చావింటినుంచీ వెళ్తూ చెప్పకూడదుకాబట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ కదిలిపోయి మాయమౌతున్నారు. మళ్ళీ సాయంత్రానికో రాత్రికో చేరతారు. ఒక్కోగదీ చూస్తూ వెళ్తున్నాడు. అదే స్ట్రక్చరు. లోపలా బయటా మార్పులు చేసారు. అధునాతన సదుపాయాలతో యాంటిక్ లుక్‍తో వుంది. ఇది దక్షిణముఖం యిల్లు. తూర్పుకీ ఉత్తరానికీ చాలా స్థలం వుంది. తూర్పుని వున్న స్థలంలోంచే గీతకి ఇచ్చాడు రామారావు. అంతా కలిసే వుంది. గార్డెన్ టైల్స్ వేసారు. కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ వున్నాయి. మధ్యమధ్యలో లైట్లు, కూర్చోవడానికి రెండు బెంచీలూ వున్నాయి. చాలా శ్రద్ధపెట్టి చేయించాడు కృష్ణ .
“ఇక్కడేం చేస్తున్నావు సుధీర్?” యశోద లోపల్నుంచీ వస్తూ అడిగింది.
“ఇల్లు చాలా బావుంది. పూర్తిగా మారిపోయింది. పెరట్లో చెట్లవీ వుండేవి, తీసేసారా?” అడిగాడు.
“అమెరికానుంచీ వచ్చి, ఇక్కడ మామయ్య పెరట్లో చెట్లూ, మొక్కలూ గుర్తుతెచ్చుకుని లెక్కపెడుతున్నావా? అందరూ అందరే. నువ్వూ మారలేదు” అంది నవ్వుతూ. నెమ్మదిగా నవ్వు మందగించింది. “చాలా పాతవి, పూతా కాపూ లేదు. అలా వదిలేస్తే ఎండిపోయాయి. కొట్టించేసాం. కాలదోషం మనుషులకే తప్పలేదు, ఇంక చెట్టూపుట్టా ఎంత?” అంది. వెంటనే సర్దుకుంది.
“మీ నిధినిక్షేపాలన్నీ ఆమూల అలమార్లో వున్నాయి, అవీ చూసుకో. మళ్ళీ ఎప్పుడొస్తావో! ఇల్లు బాగుచేయించినప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. మళ్ళీ లోపలికెందుకని అక్కడే వానజల్లు పడకుండా షేడ్ పెట్టించాడు కృష్ణ. చూసేసి వచ్చెయ్. ఎక్కువసేపు ఎండలో వుండకు” అని లోపలికి వెళ్ళింది. ఆవిడ చూపించినవైపుకి వెళ్ళాడు.
రెండుగోడలు కలిసే మూల ఒక అలమార, దానికి అందమైన షేడ్. చాలా చాలా తెచ్చిదాచుకునేవాళ్ళు వీళ్ళింట్లో. గీత కేర్‍టేకర్ కాబట్టి వీళ్ళిల్లు. ఇప్పుడేమేం మిగిలాయో! ఎంత శ్రద్ధో, అత్తకీ మామయ్యకీ. పిల్లలకి సంబంధించిన ఏ చిన్నవిషయాన్నీ తక్కువగా చూడరు. అలమార తలుపు తెరిచాడు. కర్పూరం బిళ్ళలూ, కలరావుండల వాసన వచ్చింది. పెద్దగా ఏమీ లేవు. మూడువరసల్లో పుస్తకాలు. మిగతావన్నీ తీసేసినట్టున్నారు. పదీ, యింటరూ అయాక ఎక్కువమార్కులొచ్చిన సబ్జెక్టు నోట్సులు తెచ్చి పెట్టుకున్నారు. అవి పై రెండువరసల్లో వున్నాయి. కిందని మయూవాళ్ళందరి ఒకటోతరగతి పుస్తకాలు. తన పిల్లలవి అందులో లేవు. ఈమారు వచ్చినప్పుడు తెచ్చిపెట్టాలి. లేదా పంపాలి.
అన్నిటికంటే పై అరలో మొదటిది తనది. అందర్లోకీ తను పెద్ద. తర్వాత వాసు. ఒకొక్కటీ తీసి చూస్తుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. తమ గ్రూపులో ఆఖరివాళ్ళు రవళీ, వసంత్, గీత. రవళి చేతిరాత బావుండేది. వీళ్ళిద్దరూమాత్రం టీచర్లచేత దెబ్బలు తినేవాళ్ళు. అరచేతులు చాపించి బెత్తంతో కొట్టేవాళ్ళు. గీతది కోడి కెక్కిరించినట్టుండేది. వసంత్ న్యూస్‍పేపరంత సమాచారాన్నికూడ పావుఠావులో ఇరికించగలంత చిన్నక్షరాలు రాసేవాడు. పెన్సిలు చెక్కినవాడు చెక్కినట్టుండేవాడు. ఇద్దరూ ఇంపొజిషన్లమీద ఇంపొజిషన్లు రాసేవారు. దెబ్బలు తిని వచ్చి వాసుకీ తనకీ చెప్పుకునేవాళ్ళు. తామిద్దరూ పదీ, వాళ్ళు ఐదు. వాసు, గీత చెయ్యి తన చేత్తో పట్టుకుని సాఫుచేసేవాడు.
“తలకి నూనె వుందికదా, చెయ్యి రెండుమాట్లు అక్కడ రుద్దుకో, నొప్పి తగ్గిపోతుంది” అని పరిష్కారం చెప్పి, “మరి గుండ్రంగా రాయలికదే? టీచరుకి అర్థం కాకపోతే మార్కులెలా వేస్తాడు? అందుకే నీకు తక్కువొస్తున్నాయి” అనేవాడు. వసంత్‍కూడా గీత తలకే చెయ్యిరుద్దుకునేవాడు.
“వెధవా! చత్వారంజోడు పెట్టుకున్నా నీ అక్షరాలు కళ్లకి కనిపించడంలేదు. ఇప్పుడు నీకోసం కళ్లజోడెక్కడ మార్చను?” అనేవాడు లెక్కలటీచరు వసంత్‍ని బైట చూసినప్పుడు బెత్తంతో వీపుమీద మరో దెబ్బ వేసి.
“చీమతలకాయలంత అక్షరాలు రాసి తమరు చేసే పొదుపు పెన్సిళ్ళఖర్చుకి సరిపోతోంది” అని తిట్టేవాడు వసంత్ తండ్రి. ఇప్పుడు మాంటెక్స్ పెన్నులు కొనేసుకుని రాస్తున్నాడట.
వీళ్ల పై తరగతి సుమంత్‍ది. ఇప్పుడతనికి లత తోడైంది. ఇద్దరి ప్రిస్క్రిప్షన్లూ మెడికల్ షాపులవాళ్లకి ఎలా అర్థమౌతున్నాయో తెలీదు. అసలందుకే మెడికల్ షాపుల్ని ఫార్మసిస్టులే నడపాలనే చట్టం తెచ్చారేమో! చిన్నగా నవ్వుకుని పుస్తకాలన్నీ సర్దేసాడు.
అప్పుడో కుతూహలం, నమ్మకం వుండేవి. పెద్దయ్యాక ఈ పుస్తకాలన్నీ చూసుకుంటామని. పెద్దయ్యాక విడిపోవచ్చుకూడానని ఎప్పుడూ అనుకోలేదు. విడిపోయిందల్లా ఎవరు? తనొక్కడే. సన్నగా బాధ మొదలైంది. ఈ బాధని తట్టుకోలేకే ఇక్కడికి రాకపోవడం.
యూయస్ వెళ్ళాక తనకి కొడుకు. లేబర్ రూంలో తనూ వున్నాడు. ఒక డాక్టరుగా కాకుండా భర్తగా రమ పడ్డ బాధంతా చూసాడు. ఆమె కళ్లలో నీళ్ళు తిరిగితే తనకీ తిరిగాయి. ఆఖర్న అందమైన వ్యాస్ తన చేతుల్లో వున్నాడు. వాడి నల్లటి జుత్తూ, మిలమిల్లాడే కళ్ళూ చూస్తుంటే, వాడి మెత్తటి స్పర్శ తాకుతుంటే తదాత్మ్యం కలిగింది.
“నాలాంటి బుద్ధావతారానికికూడా అప్పుడప్పుడు అపురూపమైన వరాలు దొరుకుతాయని తెలిసింది. కృతజ్ఞతలు” అన్నాడు
“బుద్ధావతారాన్నని వప్పుకున్నట్టేగా?” అడిగింది అల్లరిగా.
“ఏదో మాటవరసకి అన్నాం. అలా కమిట్ చేసేస్తే ఎలా?” అడిగాడు. కొద్దిసేపటిముందు వాసు అన్నట్టే. కొన్ని అవే మాటలు ఇద్దరివీ. ఒకసారి ఒక సందర్భంలో తనంటే ఇంకోసారి ఇంకొకర్తో వాసు అంటాడు.
ఆమె కళ్ళెగరేసింది. “జారిపోతే?”
తను నవ్వాడు.
“ఇలా నవ్వుతుంటే ఎంత బావుంటావో తెలుసా సుధీర్? ఎందుకు, అంత సీరియస్‍గా వుండటం? ప్రొఫెషనల్ డిగ్నిటీయా? అది బైట. నాదగ్గిర కాదు. ఇందాకా కళ్లల్లో నీళ్ళెందుకొచ్చాయి, నాతోపాటు? మీయింట్లో జరిగినవి నాకు కొద్దిగా తెలిసాయి. ఏ పరిస్థితుల్లో మీ అమ్మ అలా అడిగారో? ఆ సంబంధం ఇష్టం లేక తప్పించుకోవడానికి అలా అన్నారేమో! నీ చదువు ఆగిపోవడం యిష్టంలేక అన్నారేమో! చదువుకున్నారు, ఉద్యోగం చేసారు, మంచీ చెడూ ఆవిడకి తెలీదా? మనకి బాధ కలిగినా, సంతోషం కలిగినా అమ్మకేకదా, చెప్పుకుంటాం. అమ్మమీద కోపమేంటి? ఐనా ఆమధ్యనుంచీ వచ్చేసాం. సంతోషంగా వుందాం” అంది నచ్చజెప్తున్నట్టు.
ఆమె జీవితం తనకి ముడివేసి వుంది. అసలు విషయం బైటికి రాకుండా అల్లిన కథలో పాత్రగా తను నటించాలి. తప్పదు. గీతకోసం, వాసుకోసం. రమకోసంకూడా. ఇష్టమయ్యో, అవకో, మర్యాదకో, మొహమాటానికో చేసిన కాపురం. ఆ యిష్టానిష్టమర్యాదామొహమాటాలన్నీ భావాలు. వ్యాస్ వాస్తవం. అదే అల్లరి, అవే మాటలు. గీతేనా, రమేనా. అనుభవం ఒకటే ఐనప్పుడు ఆస్వాదనలో తేడా ఎందుకుంది? ఎక్కడ ఆ తేడా? తను ప్రేమించింది దేన్ని? గీత ఆకృతినా? గీతతో సాన్నిహిత్యాన్నా? గీతే ఎందుకు? వాసుతో కనీకనిపించకుండ వున్న పోటీలో పైచెయ్యనిపించుకోవడానికా? అహం చల్లార్చుకుందుకా?
“వాడిని చూడు, ఎంత బుద్ధిగా వున్నాడో! అస్సలు అల్లరి చెయ్యడు. చక్కగా చదువుకుంటున్నాడు” అని ఒకళ్లని మరొకళ్లకి చూపిస్తూ తామిద్దరినీ పెంచారు. ఇద్దరికీ కనిపించని స్పర్థ వుందేది. ఒకళ్లని మరొకళ్ళు దాటిపోవాలని వుండేది. పధ్నాలుగేళ్ల వయసులో వాసు జీవితంలో కుదుపు వచ్చింది. తండ్రి పట్టించుకోకపోవడంతో ఇంటిబాధ్యతలు మీద పడ్డాయి. చదువు పక్కకి పడింది. పీజీకి వెళ్లలేకపోయాడు. తను మెడిసిన్లో చేరిపోయాడు. ఐదోతరగతి పిల్లని బుజ్జగించి నచ్చచెప్పిన వాసు ఆ పిల్లతో ప్రేమలో ఎప్పుడు పడ్డాడు? అది ప్రేమేనా? తనతో సమానంగా చదువుకోలేకపోయినందుకు ప్రతిగా గీతని గెలుచుకున్నాడా? వాడిదీ అహమేనా?
తనది కేవలం అహమే ఐతే గుండెల్ని మెలిపెట్టేసే బాధ ఎందుకు కలుగుతోంది? ఎవరు చెప్తారు, వాళ్ళది ప్రేమని? గీత వాసుని యిష్టపడిందంటే మనసుకి ఒక ఓదార్పు. కేవలం కట్నం యివ్వలేక వాసుని వప్పుకుందంటే అంతకన్నా అవమానం మరొకటి వుండదు తనకి. చిన్నప్పుడే దానపత్రం రాసుకుందన్నాడు వాసు. ఎంత చిన్నప్పుడు? అప్పుడి ప్రేమలూ అవీ తెలుస్తాయా? మనిషికి అలాంటి వికాసం ఎన్నేళ్లకి కలుగుతుంది? వాళ్ళకి పెళ్లని తెలిసేదాకా తనకి చురుక్కుమనలేదు. వాళ్ళిద్దరికీ ఎప్పుడనిపించింది? ఎప్పుడు తెలుసుకున్నారు? ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఎలా చెప్పుకున్నారు?
వాళ్ళు ప్రేమించుకున్నారన్న విషయం బైటికి వచ్చాక రవిమామయ్య మిగతావాళ్లందర్నీ తిరగేసీ మరగేసీ అడిగాడట.
వాళ్ళిద్దరూ విడిగా కలుసుకునేవారా? వేరేగా కూర్చుని ఏవేనా చెప్పుకునేవారా? మీకు తెలీకుండా ఎక్కడికేనా వెళ్ళేవారా? చీటీలూ అవీ రాసుకునేవారా? మీమధ్యని యింత జరుగుతుంటే కనిపెట్టద్దా- అని. ఆయన భయం ఆయనది. గీత కాకుండా ఇంకో ముగ్గురు ఆడపిల్లలున్నారు. గీతదంటే ఇంట్లోయింట్లో తేలిపోయింది. వీళ్ళు ఇలాంటిదేదైనా మొదలెడితే ఇంటి పరువు ఏంకాను అని.
ఎలా తెలియాలి, అసలేం జరిగిందో?
అక్కడినుంచీ వడిగా వచ్చేసాడు. మిగతావాళ్ళు అతనికోసం ఎదురుచూస్తున్నారు.
“ఎక్కడికెళ్లిపోయావురా, ఇంతసేపూ? నీకోసమే చూస్తున్నాం” అన్నాడు సుమంత్.
“ఇల్లంతా చూస్తూ పెరట్లోకి వెళ్ళాను. బావుంది వీళ్ళిల్లు” ముక్తసరిగా అన్నాడు. అంతా కలిసి బయల్దేరారు.
“ఇదేది? ఎక్కడికెళ్ళింది?” అడిగింది మహతి గీతగురించి.
“దానికి తలవెంట్రుకలన్ని వ్యవహారాలు. ఎవరిళ్ళకీకూడా రాదు. ఇప్పుడింత తీరిగ్గా కనిపించిందంటే ఆఫీసుకి సెలవుపెట్టుకుని, పిల్లల్ని ఎవరికో అప్పజెప్పడంచేత” అంది సుమతి.
“ఇందాకా ఏడ్చిందే” అంది మహతి.
“నేనెక్కడున్నాను? అప్పటికింకా రాలేదేమో! మనందరికన్నా దానికి అమ్మమ్మ మరీ దగ్గిర. మనవరాలంటే ఆవిడకి గీతే. ఆవిడా పక్కలో పడుక్కుని కథలూ, కబుర్లూ వింటూ, వెంట తిరుగుతూ పెరిగింది.” అంది సుమతి.
“ఏదో వెల్తి వచ్చేసింది మహీ! దాన్ని నింపుకునేందుకు ఎన్నో వ్యాపకాలు కల్పించుకుంటున్నాం. నేనేనా, గీతేనా. ఒక్కదండలో పూసల్లా వుండేవాళ్లం అందరం. తెగి చెల్లాచెదరైనట్టు విడిపోయాం. మళ్ళీ ఎవరేనా మనని ఒకచోట కూర్చుతారా అనిపిస్తుంది. అలా ఎలా కుదుర్తుంది? విడిపోయిన మనం విడివిడి కుటుంబాల్లో మణిపూసలయ్యాం. ఇప్పుడింక విడివడి మళ్ళీ చేరువవ్వడం వుండదు. అందుకే కలుసుకోగలిగే క్షణాలకోసం ఇంత తహతహ” అంది.
“అదీ ఇంచుమించు ఇవే మాటలంది. నాకూ ఇలానే వుంటుంది” అంది మహతి.
కారెక్కబోతుంటే భవానీ, తల్లితో కలిసి వస్తూ కనిపించింది. ఆగి, పలకరించాక కదిలారు.
“ఈపిల్లని మొదట కృష్ణకి అనుకున్నారు. ఎందుకు చేసుకోలేదో మరి! సాయంత్రం వెళ్ళాక వాడినే అడిగాలి” అంది సుమతి.
“ఇప్పుడంత పనిగట్టుకు తెలుసుకుని ఏం చెయ్యాలి? పనిలేక ఆరాలెక్కువౌతున్నాయి నీకు ” కోప్పడ్డాడు సుమంత్.
“మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ కదరా? పెళ్ళిచేసుకోకుండా వున్నాడని ప్రపంచం ఘోషించిపోతోంది”
“ఐతే సంబంధం చూడు” అన్నాడు సుధీర్.
“నేను చూసేదేంటి? పెళ్ళకావల్సిన పిల్లల సమాచారం గీతదగ్గిర బోల్డంత వుంది. ఎందుకేనా పనికొస్తుందని బాగా తెలిసినవాళ్ల గోత్రం, నక్షత్రం వివరాలు రాసి పెట్టుకుంటోంది”
“పెళ్ళిళ్ళు చెయ్యడం ఐపోయింది, ఇప్పుడింక పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టిందా? అంత తీరికెక్కడిదే తనకి?” పడీపడీ నవ్వాడు సుమంత్. లత శృతి కలిపింది.

1 thought on “ఝరి 141-150 by S Sridevi”

  1. I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.

Comments are closed.