ఝరి – 50 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“మా యిద్దరి గొడవా మేం చూసుకోగలం కానీ, నీలిమకీ తనకీ మధ్యని ఏమిట్రా? చాలా విషయాలు తెలిసాయి. నీలిమ మంచిపిల్లే. సరదాగా కలుపుగోలుగా వుంది” అడిగింది కొద్దిసేపటికి సర్దుకుని. మాటమార్చి.
“థేంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నీలూకి చెప్తాను. తను సంతోషపడుతుంది”
“ఉన్నమాటేగా, అన్నది?”
“నేనూ అదే చెప్తున్నాను. మంచిదికాబట్టే మహీ విషయంలో నిలబడగలుగుతున్నాను. చాలా కోపరేషన్ యిచ్చింది”
“మరి గీత విషయంలో?”
“దాన్ని అందరం తలోవిధంగా బాధపెడుతున్నాం” అన్నాడు.
“కాస్త అర్థమయ్యేలా చెప్పచ్చుకదా? నేనేం అనుకోను. ఎవర్నీ జడ్జి చెయ్యను. వీలైతే పరిష్కారం ఆలోచిద్దాం”
మాధవ్ చాలాసేపు మాట్లాడలేదు. ఎవరితోనూ ఈ విషయాలు ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ అందరికీ ఎంతోకొంత తెలుసు. తల్లిద్వారా బయటపడి వుండచ్చు. నీలిమ అక్కచెల్లెళ్లద్వారా కూడా తెలిసి వుండచ్చు.
“అప్పటికే వున్న వ్యవస్థలోకి మనం కొత్తగా అడుగుపెట్టినప్పుడు మనకి అది నచ్చదు. దాన్ని సమూలంగా మార్చెయ్యాలన్న వూపు వస్తుంది. వ్యవస్థ అంటే మనుషులగుంపు, వాళ్ళు అలా గుంపుగా కలిసి వుండటానికి చేసుకున్న ఏర్పాట్లు. అప్పటికే మనం అందులో వుంటే వీటన్నిటిగురించీ ఏమీ ఆలోచించకుండానే పాటిస్తూ వెళ్ళిపోతాం. ఆ ప్రవాహంలో కలిసిపోయి ప్రయాణిస్తాం. గుంపుగుంపు ఒక్క మనిషికోసం మారదు, మారలేదు”
“…”
“నీలిమకి ఈ కుటుంబం, మనమధ్య వుండే అనుబంధాలూ అర్థంకావు. తన అమ్మానాన్నలు, వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు… చాలా క్లుప్తమైన పరిధి వాళ్ళది. ఎవర్నీ కలుపుకోరు. ఇప్పుడు పెళ్ళై వచ్చిందిగాబట్టి మా యింట్లో ముగ్గురం… మనింట్లో ముగ్గురం … అని గిరిగీసుకుని కూర్చుంది. అలా ఎలా కుదుర్తుంది? ముఖ్యంగా గీతతో? మనింటికి కొత్తగా వచ్చింది నీలిమ. తను క్రమంగా మన పద్ధతులకి అలవాటుపడాలి. తనకంటూ ఒక వునికిని ఏర్పరుచుకోవాలి. దాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనిల్లుకూడా తనకోసం కొంత మారుతుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఆడపిల్లలకి అది కష్టమే. కాదనను”
“తను అనుకున్నట్టు అలా ఎలా కుదుర్తుందిరా? ఆడవాళ్ళో మగవాళ్ళో ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి. భార్యాభర్తలిద్దరే వుండేట్టైతే ఏవో తంటాలుపడతారు. వాళ్ళిద్దర్లో కూడా కొంతమంది మారగలరు. ఇంకొంతమంది సాంచీస్థూపంలా స్థిరంగా వుండిపోతారు. అలాంటివాళ్లని ఏం చెయ్యగలం? మారటానికి మనం అనువుగా వున్నప్పుడు మారలేదని రెండోవాళ్లతో గొడవపడటం దేనికి? నలుగురు కొడుకులు వుండేచోట వచ్చేకోడళ్ళకోసం అలా మారిపోతూ వుండరుకదా? ఐనా మీకేం బాధ్యతల్లేవు. ఎవరి సంపాదనలు వాళ్ళవే. పిన్నికి పెన్షనొస్తుంది. మనిళ్ళలో ఒకళ్ళనించీ ఒకళ్ళు ఆశించడం అనే పద్ధతి లేదు. ఇంటికి నలుగురూ వచ్చిపోతుంటే, నలుగుర్తో కలిసి తిరుగుతుంటే సరదాయేగానీ సమస్యేమిటి?”
మాధవ్ నవ్వేడు. “బానే వుంటుంది. ఆ వొచ్చేవాళ్ళు తనకోసం రావాలి. నాకు ప్రాధాన్యత ఇవ్వాలి”
“అర్థం కాలేదు”
“సమర్ధత వుండి, అన్నీ చూసుకుంటోందని గీతకి మనం చాలా విలువ యిస్తాం. మనందరం ఇంకా కలిసి నడుస్తున్నామంటే తను చొరవతీసుకోవడంవల్లనే. నేను, మాయిల్లు, మా అమ్మానాన్న అని కాకుండా మన తొమ్మిదికుటుంబాలనీ కలిపి చూస్తుంది. అలా ఏరియల్ పెర్స్పెక్టివ్‍తో చూడటంవలన చాలా పనులు తేలిగ్గా జరిగిపోతుంటాయి. అందులో ఒక బిజినెస్ పెర్స్పెక్టివ్‍కూడా. ఫంక్షన్లని ఒకచేతిమీద ఆర్గనైజ్ చెయ్యడం, సీజన్లో హోల్‍సేల్లో బియ్యం పప్పులు కొనుక్కుని పంచుకోవడంలాంటివి. దానివలన చాలా డబ్బు ఆదా ఔతుంది. అది అందరికీ తెలుసు. అలా చూడటం తనకిమాత్రమే వచ్చు. తన స్థానంలో బైటిపిల్ల ఎవరేనా వుందనుకో… అంతదాకా ఎందుకు, నా భార్యనే తీసుకో, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని మనందరినీ మోటివేట్ చెయ్యగలదా? గీత చెప్తే విన్నట్టు పెద్దవాళ్ళేనా, చిన్నవాళ్ళేనా తనమాట వింటారా? వినరు”
“అలా ఎలా కుదుర్తుందిరా? ఎవరి స్థానం వాళ్ళదే. ఆ అమ్మాయితో మాకు చనువేం వుంటుంది?”
“అన్నిట్లో ఈవిడ పెత్తనమేమిటి, ప్రతిదానికీ తయారైపోతుంది. నేను చూసుకోలేనా? మా అక్కచెల్లెళ్ళు లేరా- అని గొడవపడుతుంది. ఇక్కడేకాదు, ప్రహ్లాద్ యింట్లోనూ ఇదేగోల. వసంత్‍కీ ఇదే తలనొప్పి. నీకు లాభం కలిగినంతవరకూ వాడుకుని తర్వాత దూరం పెట్టడానికి వాసూగీతలు పైవాళ్ళు కాదు. మనింటి పద్ధతీ అది కాదు. దూరాలు పెరిగిపోయాయి. గీతకూడా ఎందులోనూ తలదూర్చకుండా దూరదూరంగానే వుంటుంది. తను ఇదివరకట్లా చురుగ్గా ఉండట్లేదని నందకిషోర్ బాబాయ్ చాలాసార్లు అన్నాడు. పెద్దవాళ్ళం అవట్లేదా అంటుంది. ఆ మాటల్లో వెల్తి. పెద్దవాళ్లం అవటం ఇంత బాధని కలిగిస్తుందా సుమా?”
“ఇలా గొడవలుపడటం అవసరంలేదు. గీతని కలుపుకుని వాళ్ళు నలుగురూ అక్కచెల్లెళ్ళలా వుండచ్చు”
“గీతకూడా-
నాకు అందరూ క్రాస్‍కజిన్స్. బాబాయ్‍ల పిల్లలు చిన్నవాళ్ళు. నాకో చెల్లెలు దొరికిందనుకున్నాను. దొరక్కదొరక్క దొరికిన ఈ చెల్లెలు ఇంత బాధపెడుతుందనుకోలేదు- అంది”
“…”
“అమ్మ, కోడళ్ళిద్దరినీ సమానంగా చూడట్లేదని మరో గొడవ. సమానం అంటే? గీతకి యిచ్చిన విలువ ఎవ్వరూ తనకిగానీ, తన అక్కచెల్లెళ్లకిగానీ యివ్వరని దుగ్ధపడిపోతుంది. పెళ్లై ఆ యింట్లోంచీ ఈ యింట్లోకి వచ్చింది గీత. అక్కడ దానికి ఎంత ముద్దు జరిగేదో ఇక్కడా అంతే జరిగేది. ఈ వూరు, ఈ యింటి మనుషులూ గీతకి పుట్టినప్పట్నుంచీ తెలుసు. వాళ్ళకి తనూ, తనకి వాళ్ళూ అలవాటుపడిపోయారు. తను వీటన్నిటిలో ఒక భాగం అనుకుంటుందిగానీ విడిగా చూసుకోలేదు. అంతదాకా ఎందుకు? తన ఆఫీసులో సగంమందికిపైగా మామయ్య స్నేహితులు, పరిచయస్థులు. కొత్తగా వచ్చినవాళ్ళెవరేనా వుంటే వాసు వెళ్ళి వాళ్లని పరిచయం చేసుకుని వస్తాడు. లేడీకొలీగ్స్‌ని ఇంటికి రప్పించుకుని ప్రేమగా చూస్తుంది అమ్మ. మనంతప్ప మరో ప్రపంచం తెలీకుండా పెరిగింది గీత. అందరు మంచివాళ్ళనే నమ్ముతుంది. తనతో అంతా అలానే వుంటారు. ఇలా అన్నీ అమరి వున్న మనిషిని ఎవర్నీ నీలిమ చూడలేదు. అదే సమస్య”
“గీతేమంటుంది?”
“అనడానికి ఏముంది? నీలిమని నీలిమలానే వప్పుకుంది. తను తనలానే వుంది”
“అంటే?”
“ఒకళ్ళకోసం మరొకళ్ళు మారరుకదే, సుమా! నీలిమకోసం గీత పద్దతులెందుకు మార్చుకుంటుంది? ఇది ఇంకో ఎత్తు ఎత్తింది. తను పెద్ద ఆఫీసరు భార్య, గీత-వాసులు వట్టి క్లర్కులు. తన గొప్పతనానికి వాళ్ళు పనికిరారని. దీని నోరు మూయించలేక, కొన్నిసార్లు… ఇంకా చిన్నపిల్లలానే వుంటే ఎలాగని నేనూ తననే కోప్పడ్డాను. తప్పలేదు. మనం అల్లరి చేస్తూ దెబ్బలాడుకున్నది వేరు, ఇది వేరు. వ్యవహారం చెయ్యడం వచ్చినట్టుగా జవాబు చెప్పడం రాదే గీతకి. తెల్లబోయి చూసేద్. ఆ చూపుల్లో కనిపించిన షాక్… అసలు వూహించలేం”
“…??!!”
“ఇక ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని ఇవతలపడటమే మంచిదనిపించింది. ఉన్న వూళ్ళో వేర్లుపడి అమ్మని బాధపెట్టలేక, అందర్లో నవ్వులపాలు అవలేక బదిలీ అడిగాను. మాకు స్టేట్‍ హెడ్‍క్వార్టర్స్‌లో మాత్రమే బ్రాంచిలు వుంటాయి. ముంబై ట్రాన్స్‌ఫరంటే గొప్పగా బయల్దేరిపోయింది. చాలీచాలని యింట్లో, అరాకొరా సదుపాయాలతో అదీ ఒక బతుకేనా అనిపిస్తుంది నాకు. నీలిమ సంతోషంగానే వుంది. పెద్దభవంతిలాంటి యింట్లో ఐనవాళ్ళమధ్య యువరాజులా బతకాల్సినవాడు నా కొడుకు, అంత పెద్దసిటీలో ముక్కూమొహం తెలీనివాళ్లమధ్య తనూ ఒక అనామకుడిలా బతుకుతున్నాడు. ఇక్కడ టెన్యూర్ అవగానే మళ్ళీ వెనక్కి వచ్చెయ్యనా? అదే వూళ్ళో వేరే వుంటే అమ్మ బాధపడుతుందా? మా యిల్లే పంచుకుని ఎవరి వాటాలో వాళ్ళు వుండటం మంచిదా? పంచుకునే వీలుకూడా లేదు. మా తాతయ్యా, మా నాన్న ఒక్కళ్ళే కొడుకులు. అందుకని ఏకవాటాగానే కట్టించారు యింటిని. రీమాడలింగ్ చేయించాలి. అందం పోతుంది. ఏమీ అర్థం కావటం లేదు”
“వచ్చెయ్యరా! ఒక్కడివీ అక్కడెందుకు? సుమంత్ వేరే వుండట్లేదా? అలాగే నువ్వూను. ఎవరూ తప్పుపట్టరు. అందరూ అర్థంచేసుకుంటారు. ఇందులో బైటివాళ్లెవరు? పిన్నికిమాత్రం తెలీదా?”
“పుట్టాక పెరిగాక వాసూ నేనూ ఒక్కసారికూడా వేరుగా లేము. వాడూ నన్ను చాలా మిస్‍చేస్తున్నాడు. మేం పండుగలకీవాటికీ వెళ్తామా, నన్ను వెంటేసుకుని తిరిగినవాడు తిరిగినట్టు తిరుగుతాడు. ఇక్కడ వాళ్ళు పెద్ద ఖర్చులేమీ లేకుండా రెండుజీతాల్తో సాఫీగా బతికేస్తుంటే అంత పెద్ద సిటీలో ఒక్క జీతంతో నేనేం యిబ్బందిపడుతున్నానోనని బాధపడతాడు. డబ్బు యివ్వబోతాడు. వాడిదీ ఒక్క జీతమైతే మిగలదు. ఇప్పుడీ ఎక్కువున్న డబ్బు వదిన జీతంవల్లనేకదా? ఆవిడ తెలివివల్లేకదా? ఆవిడ మాకు పనికిరానప్పుడు ఆవిడ డబ్బుమాత్రం పనికొస్తుందా? నీలిమకి తెలిసి రావాలని తీసుకోను. ఇంక వెళ్ళేరోజుని… ఇద్దరూ స్టేషన్‍కి వస్తారు, మమ్మల్ని రైలెక్కించడానికి. మాధురీ, మానసా వస్తారు. వసంత్, ప్రహ్లాద్ వీలునిబట్టి వస్తారు. గీత నా కొడుకుని ఎత్తుకుని ముద్దుచేస్తూ నిలబడుతుంది. తనని అలా వదిలేసి, వాళ్ళు ముగ్గురూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ నిలబడతారు. నేనూ వాసూ అలా ప్లాట్‍ఫామంతా తిరుగుతూ వుంటాం. ఈలోగా రైలొస్తుంది. నీలూనీ పిల్లాడినీ ఎక్కిస్తాను. రైలు కూతకూసేదాకా కంపార్టుమెంటు బైట విండోదగ్గిర నిలబడి మాట్లాడుకుంటాం. రైలు కదుల్తుంది. నేను ఎక్కేస్తాను. వాడు కిటికీ చువ్వలు పట్టుకుని అలా నడుస్తునే వుంటాడు. నడక పరుగుగా మారాక, ఇంక అందుకోలేక ఆగిపోతాడు. అక్కడ దూరంగా గీత చెయ్యి వూపుతూ కనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుందే! ఇంతంత ప్రేమలు వున్నవాళ్ళం ఎందుకు విడిపోవాలి?” ఆవేదనగా అడిగాడు.
“బాధపడకురా! బతకాలంటే దూరాలు తప్పవు. సుధీర్ అమెరికా వెళ్లలేదా? అలాగే”
“ఒకొక్కసారి వాళ్ళిద్దర్నీ అలా చూస్తుంటే కాలం వాళ్ల విషయంలో ఆగిపోయిందేమో, వాళ్లని చూడ్డంకోసం నేను వెనక్కి ప్రయాణం చేస్తున్నానేమోననిపిస్తుంది. ఆ అవంతీపురం, ఆ రెండిళ్ళు, ఆ మనుషులు… ఎలాంటి మార్పు లేని జీవితం. యాంటిక్ పీసుల్లా వాళ్ళు… వాళ్ళిద్దర్నీ అలా వదిలెయ్యడమేనా? వాళ్ళ అవసరంకూడా మన కుటుంబానికి తీరిపోయిందికదూ? ముఖ్యంగా గీతది? గీతూ ఎలా చేద్దామే అని అడగడానికి సీనియర్స్‌కి ఇంకే ఈవెంట్సూ మిగిలిలేవు. దాదాపు అన్నీ ఐపోయాయి. మామయ్యల పిల్లల పెళ్లిళ్ళు తప్ప. అందరం తలోదార్లో ప్రయాణిస్తున్నాం. వెనక్కి చూసుకుని వాసు పెళ్ళిలోనో నీ పెళ్ళిలోనో ఎంజాయ్ చేసినట్టు చెయ్యగలమా?”
“బాధపడకురా! ఈ ప్రేమలు ఏ మనిషినీ స్థిమితంగా వుండనివ్వవు. అందులోనూ మనవి వట్టి చుట్టరికాలు కాదు. నీలిమ మంచిదనే అనుకున్నాను. చిచ్చరపిడుగన్నమాట! ఔను, ఇద్దరూ ఎవరి వంట వాళ్ళు చేసుకునేవారటకదా, కొన్నాళ్ళు?”
మాధవ్ దు:ఖంలోంచీ బైటపడి నవ్వేసాడు ఆ ప్రశ్నకి. “మా పరువంతా చర్చకి వచ్చిందన్నమాట? ఎవరు చెప్పారు? అమ్మా?” అడిగాడు.
సుమతికూడ తలూపి నవ్వింది. “అప్పుడేగా, మాకు తెలిసింది, గీత ప్రతాపమంతా మనమీదేగానీ, బైటివాళ్ళముందు అది పిల్లిపిల్లేనని”
“కొన్నాళ్ళేమీ కాదు, నా ట్రాన్స్‌ఫర్‍కి ముందు. వారంరోజులు”
“ఎవరి తెలివితేటలవి? గీతవా, మీ ఆవిడవా?”
“వాసు”
“వాసువా?!!”
“ఆహా! చెప్పానుకదా, నీలిమకి తను ఆఫీసరు భార్యననే విషయం బుర్రకెక్కిందని. గీతకి వుద్యోగం, పిల్లలు… వాళ్ళుకాక ఏడాదికొకళ్ళుగా పెంచుకుంటూ వీళ్ళు చదువుచెప్పించే బైటిపిల్లలు, పేరెంటు కమిటీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్… పనులన్నీ చకచక జరిగిపోవాలి. ఎక్కడా ఆగదు. ఒకళ్ళు చెయ్యాలని చూడదు. పిల్లలకి చద్దెన్నం పెట్టేసి స్కూలుకి పంపిస్తుంది. దగ్గిరే, స్కూలు. మధ్యాహ్నం యింటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ భోజనాలు చేసేసి బాక్స్‌లో టిఫెనో, పెరుగన్నమో పెట్టుకుని ఆఫీసులకి వెళ్తారు. మాయింట్లో ఈ పద్ధతి తనే మొదలుపెట్టింది. వండుకున్నవి వేడివేడిగా తినక బాక్సుల్లో సర్దుకుని చల్లారబెట్టుకుని తినడం తనకి యిష్టం వుండదు. ఇంకోమాటకూడా అనేది.
ఆఫీసన్నాక రకరకాల మనుషులు వస్తారు. కొన్ని మొహమాటాలుంటాయి. టీ కాఫీలు తాగక తప్పని పరిస్థితి వస్తుంది. లంచిబాక్సులోది తినడానికి ఆకలి చచ్చిపోతుంది. ఇంట్లో భోజనం చేసేస్తే మధ్యాహ్నం లైట్‍గా తిన్నా సరిపోతుంది- అని.
మళ్ళీ ఆఫీసునించీ రాగానే వంట తనే చేసేస్తుంది. స్నానాలు, పిల్లల చదువులు, భోజనాలు ముగించుకుని, పదింటికల్లా నిద్రపోతారు”
“ఇంకేమిట్రా, నీలిమకి? శుభ్రంగా వండిపెడితే తినడానికి? గీత వంటకూడా బావుంటుంది”

1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.

1 thought on “ఝరి – 50 by S Sridevi”

Comments are closed.