ఝరి – 57 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

ఈ కర్మరోజుల్లోనే సుధీర్ మహతికి రెండుమూడుసార్లు వీడియో కాల్ చేసాడు. వరస కష్టాలతో సతమతమౌతున్న ఆమెని ఎలా ఓదార్చాలో అతనికి తెలీలేదు. తనూ కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతప్ప ఇంకేం చెయ్యలేకపోయాడు. ఒకసారి కాల్ చేసినప్పుడు మయూఖ్ ఆమె దగ్గిరే వున్నాడు.
“ఎవరే, వీడు? ఒక్కక్షణంపాటు నాకు మన చిన్నతనం కళ్లముందు తిరిగిందనుకో. చిన్నవాడినైపోయానన్న భ్రమ కలిగింది” అన్నాడు సంభ్రమంతో తలమునకలౌతూ. ఫోటోలవీ ఎప్పుడేనా చూసినా పిల్లలందరిమధ్యా వీళ్ళూ వుండేవాళ్ళు. వాసు పోలిక ఒకడిదీ, యశోదపోలిక ఒకడిదీ అనుకోవడం వుండేది. ఇంత ప్రత్యేకంగా అతను వీళ్ళని చూడలేదు. చూపించి అతని దృష్టికి తెచ్చినవాళ్ళూ లేరు.
“వాసు కొడుకురా! పెద్దాడు. మయూఖ్” అంది మహతి వాడిని దగ్గరగా తీసుకుని. “సుధీర్ పెద్దనాన్న” వాడికి చెప్పింది.
“వాసా? వాడింకా ఎక్కడున్నాడు? ఎప్పుడో గీతమొగుడైపోతే? చెవులుపట్టుకుని ఆడిస్తోందని విన్నాం” అన్నాడు సుధీర్ పకపక నవ్వి.
అక్కడే వున్న సుమతీ, గీతాకూడా విన్నారు ఆ మాటల్ని.
“ఓయ్, ఒకానొక రమాదేవిగారిని చేసుకుని, అలవైకుంఠపురంలో ఆమూల సౌధంబున అన్నట్టు వెళ్ళి యూయస్‍లో కూర్చున్న రమాపతి ఎవరో?” చురుగ్గా అంది గీత కెమెరాలోకి తొంగిచూసి. ఒక్కక్షణంపాటు. అతని మనసులోని జ్ఞాపకాలు తుఫానులే రేపాయో, అగాథాలే తవ్వుకున్నాయో, కళ్లలోంచీ ప్రేమే వర్షించిందో, తనని తను ఓదార్చుకుంటున్న దయే జాలువారిందో, తీవ్రమైన భావసంచలనానికి గురయ్యాడు, అన్నేళ్ళ తర్వాత ఆమెని చూసి. అదే క్షణంలో మళ్ళీ సర్దుకున్నాడు.
“అప్పటికీ యిప్పటికీ మారలేదే, నువ్వు. ఒక్కమాటకూడా వంటిమీద వుంచుకోవేం?” అన్నాడు అలాగే నవ్వుతూ. ఈ నవ్వు వెలవెలబోయింది.
“అందరివంతూ నువ్వు మారిపోయావులే. ఇక్కడికి రావేంట్రా, నువ్వు? అత్తనీ, మామయ్యనీ ముంబై వురికిస్తావు?” అడిగింది గీత తనూ నవ్వుతూ. నోరారా నవ్వుతూ ఆ నవ్వుని ముఖంనిండుగా నింపుకునే ఆమెని చూస్తే పెరుగన్నం తిని, ముఖమంతా పులుముకున్న పసిపిల్లలా అనిపించింది.
“మర్యాద… మర్యాద… బావగారిని నేను” అన్నాడతను ఇంకా నవ్వుతునే.
“ఇక్కడికి రండి. అక్కగారికీ, బావగారికీ అన్ని మర్యాదలూ చేస్తాను” అంది. తల్లి కట్నం అడిగినందుకు అతను చిన్నతనం పడి, ఇక్కడికి తమమధ్యకి రావట్లేదనుకుంటోంది గీత. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆమె ఆలోచన. ఆమెగానీ, వాసుగానీ, మరొకళ్ళుగానీ అంతకన్నా లోతుగా ఆలోచించకుండా దాన్నొక చట్రంలా బిగించి వుంచారు సుమతీవాళ్ళు.
చాలాయేళ్లతర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం. రాసుకుంటే వుత్తరాలు రాసుకోవాలి. లేదా ఫోన్లు చేసుకోవాలి. ఆ రెండూ జరగలేదు వాళ్లమధ్య. సహజంగానే ఎందరిమధ్యో ఆగిపోయినట్టు మాటలూ పలకరింపులూ ఆగిపోయాయి. అనుబంధం మాత్రం చెక్కుచెదరలేదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే సుమతికి మనసులోంచీ పెద్దబరువు దిగిపోయినట్టైంది.
“ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడికి రండి సుధీర్. చాలాకాలమైంది మనమంతా కలుసుకుని. మన పెళ్ళిళ్ళయ్యే ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఆ గొడవలు వదిలిపెట్టకపోతే ఎలా? అత్త చాలా బాధపడుతోంది. నాక్కూడా గిల్టీగా వుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మిగిలినవాళ్లం అందరం కలుస్తున్నాం. నువ్వు లేని లోటు మా అందరికీ తెలుస్తుంది” అంది గీత మృదువుగా, నచ్చజెప్తున్నట్టు.
అతని మనసు మూగవోయింది. అవంతీపురం వెళ్ళి, అక్కడి వంటరితనాన్నీ, తోడుగా గీత లేనితనాన్నీ, గీత పరాయితనాన్నీ అనుభవించగలడా? రమని పక్కనపెట్టుకుని? ఇన్నేళ్ళ తర్వాతకూడా ఆ ప్రేమలోని చెమ్మ ఆరలేదు. రమతో గడిపే జీవితానికి ఒక సమాంతరరేఖలా లోలోపల సుళ్ళు తిరిగే దు:ఖం తనని వదిలిపెట్టటం లేదు. ఇంకా చాలా సంయమనం సాధించాలి తను.
“వస్తాన్లే గీతూ! ఎప్పుడూ ఏదో బిజీ. ఈసారి తప్పకుండా వస్తాం” అని, “వాసు వున్నాడా?” అడిగాడు మాట మార్చి.
“లేడు, బయటికి వెళ్ళాడు” అంది.
“రేపు మళ్ళీ ఈ టైముకే చేస్తాను. వాడిని వుండమనేం?” అన్నాడు.
ఆమె తలూపింది. మళ్ళీ మహతితోనూ, రవళితోనూ మాట్లాడి పెట్టేసాడు. సుమతి విహంగ్‍ని దగ్గిరకి పిలుచుకుని వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. వాడు సిగ్గుపడిపోయి, తుడిచేసుకుంటే నవ్వి, “మీ అమ్మకి ఇచ్చి రా!” అంది. వాడు బుద్ధిగా తల్లి బుగ్గకి తన బుగ్గ ఆనించాడు. గీత చురచుర చూసింది. “అక్కర్లేదని చెప్పు” అంది కొడుకుతో.
“నేనే పెట్టుకుందును. ఎక్కడా చోటుకనిపించట్లేదు. పిల్లల ముద్దులూ… ” అర్థోక్తిగా ఆగింది సుమతి అదే నవ్వుతో. గీత దగ్గిరకి జరిగి ఆమె చెవిలో పూర్తిచేసింది. గీత ముఖం ఎర్రబడింది.
“చచ్చేకాలానికి సారెకావిళ్ళని దీన్నే అంటారు. ఇన్నేళ్ళూ మాట్లాడకుండా నోటికి తాళం పెట్టుకుని, ఇప్పుడేమిటి కొత్తగా?”అంది.
“ఎప్పుడో ఒకప్పుడు. అసలంటూ ఇవ్వలికదా? ఐనా ముప్పయ్యేళ్ళదానివి, ముసలికబుర్లు చెప్తావేమే?” సుమతి నవ్వింది.
సుమంత్, భార్యా వచ్చారు. అతనికి ఇద్దరు పిల్లలు. ముందు కూతురు, తర్వాత కొడుకు. కూతురికి నాలుగేళ్ళు. మయూఖ్ వాళ్ళ వరసని ఆ పిల్ల పదోది.
“దస్ నంబరీ ఏది?” అడిగింది సుమంత్ చేతిలోంచీ బాబుని అందుకుంటూ.
“ఏం పేరు తల్లీ, అది? నీ పేరేమిటే అంటే చెప్పడం మానేసి, దస్‍నంబరీ అని చెప్పుకుంటోంది. మానిపించలేక చచ్చిపోతున్నాం” అంది సుమంత్ భార్య, లత కినుకగా. గీత నవ్వేసింది. లత ప్రేమగా ఆమె చెయ్యి నొక్కి వదిలింది. “స్కూలుకి వెళ్ళింది. కాంపౌండర్‍కి చెప్పాను. స్కూలయ్యాక తీసుకొచ్చి వదులుతాడు” అంది. సుమతిని పలకరించి, వెళ్ళి మహతీ రవళిల దగ్గర కూర్చుంది.
కలుసుకున్నది తక్కువే ఐనా, గీతతో ఆమెకి మంచిస్నేహం వుంది. చీరలు, నగలు, ఆస్తులు, వుద్యోగాలు, ఇవేవీ కాకుండా- ఎవరిమీదా ఒక చిన్న కంప్లెయింటేనా చెయ్యకుండా ఇంట్లోవాళ్ళు, మయూఖ్ స్కూల్లో పిల్లలు, ఆఫీసులో కొలీగ్స్ ఇలా గంటలసేపు కేవలం మనుషులగురించే మాట్లాడగలదు గీత. ఆ కబుర్లు చాలా యిష్టం లతకి. అంత ఆసక్తితోనూ వింటుంది గీత ఆమె చెప్పేవి.
“పెద్దగా ప్రపంచజ్ఞానం లేదు గీతకి. ఇల్లు, వుద్యోగం, ఇన్ని కార్యక్రమాలు, ఎలా నెట్టుకొస్తోందో” అని సుమంత్‍తో ఒకసారి అంటే,
“అవంతీపురం మహాజ్ఞాని అది. తనకి ప్రపంచజ్ఞానంలాంటి పెద్దవిషయాలు అర్థంకావు” అన్నాడు సుమంత్ నవ్వేసి. ఆమెతో వీళ్ళకి ఏవో చిన్నపాటిగొడవలు వున్నాయని తెలుసు లతకి. ఎప్పుడూ సుమంత్‍ని అడగలేదు. అతనూ చెప్పలేదు.
పదోరోజుకి అందరూ చేరారు. మాధవ్, నీలిమకూడా వచ్చారు. నీలిమ, మాధురి అంటుకు తిరిగారు. తులసి, సమీర, ప్రవల్లిక వస్తే వాళ్ళకి సమవయస్కురాలైన మానస అటు కలిసింది. వీణ శేఖర్ కూతురు. ఈ ఆడపిల్లలు నలుగురికీ గీత, వాసు పెద్ద ఆకర్షణ. వాళ్లతో కలిసి గీత చుట్టూ తిరిగింది మానస. మొదట కొంత అయిష్టంగా. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటూ.
“ఇదేమిటే, ఆవిడ తోకపట్టుకుని తిరుగుతోంది?” అనుకున్నారు, ఆమె అక్కచెల్లెళ్ళు.
అక్కడ లేనిదల్లా సుధీర్, గీత తమ్ముడు కృష్ణ. మగపిల్లాడని, అందునా అన్నకొడుకని చాలా గారం చేసేది నిర్మల అతన్ని. మహతికీ అతనికీ వయోబేధం కాస్త ఎక్కువ. రవళితో బాగా ఆడేవాడు. ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. “రావాలనే వుంది రవళీ! ప్రాజెక్టు పీక్‍లో వుంది. రాలేకపోతున్నాను. ఏడుపొచ్చేస్తోందే” అన్నాడు దాదాపు ఏడ్చేస్తూ. రవళి ఏడ్చేసింది.
“ఏమిటే, ఇద్దరూను? ” పెద్దవాళ్ళు కోప్పడ్డారు.
ప్రేమలు, కోపాలు, మమకారాలు, గెలుపులు, ఓటములు ఇంకా ఎన్నో స్వీకరించిన, తిరస్కరించిన, జీర్ణించుకున్న, జీర్ణించుకోలేక అణిచిపెట్టుకున్న భావాలని దట్టించి కూరిన బాంబులాంటిది కుటుంబం. అందులో వుండేవన్నీ స్థిరంగానే వున్నా చలనశీలంగా వుండే ఒకానొక వ్యక్తో సంఘటనో ప్రభావం చూపించి దాన్ని పేల్చుతారు. ఐతే ఈ బాంబు ఎంత గట్టిగా పేలినా మళ్ళీ దాన్నది సరిచేసుకుని ఇంకో ప్రయోగానికి తయారౌతుంది.
గీత, సుధీర్ మామూలుగా మాట్లాడుకున్నారన్న విషయం అందరికీ తెలిసింది. అందరితోపాటు గురుమూర్తికికూడా. ఎక్కడో అహానికి చిన్నదెబ్బ. ఆ బాధ కొద్దిసేపే. దాన్ని మరిపిస్తూ కొడుకుమీది మమకారం. తమవైపునించీ జరిగిందికూడా పొరపాటే. వాడి మనసు తెలుసుకోకుండా ప్రవర్తించారు. పెద్దకొడుకు. మొదటిసారి తనకి తండ్రి అనే భావనని పరిచయం చేసినవాడు. ప్రపంచాన్ని జయించినంత సంతోషాన్ని ఇచ్చినవాడు, పుట్టీ, పెరిగీ, ఒక్కొక్క అడుగూ ముందుకేసి. ప్రతివాళ్ళకీ రాజ్యాలూ, ధనరాశులూ వుండవు. కుటుంబమే మహాసామ్రాజ్యం. అక్కడ పొందే విజయాలే, ప్రపంచాన్ని గెలిచినంత. ఎంత ప్రేమించారు వాడిని! మిగిలినవాళ్లమీద ప్రేమలేదని కాదు, తొలి అనుభవం తర్వాతిదానికి కొంత సాంద్రత తగ్గుతుంది. మరో రూపంలో సంతోషం అందుతుంది. ఇన్నేళ్ళు గడిచినా ఎందుకీ కోపం వాడికి? ఎవరిదారిన వాళ్ళు సుఖంగానే వున్నారుకదా, ఇంకా ఎందుకీ కోపం? గీతతో ఏం మాట్లాడాడు? ఇదేం చెప్పింది? ఎన్నో ప్రశ్నలు. గీత చెప్తే పెళ్ళి చేసుకున్నాడు. మళ్ళీ యిప్పుడది అందికాబట్టి ఇక్కడికి వస్తాడేమో! సంతోషం, దు:ఖం కలగలిపినట్టు కలిగాయి.
ఒకొక్కరోజూ గడుస్తుంటే నిర్మల ఇక లేదన్న నిజం అందరికీ అర్థమౌతోంది. దు:ఖం నెమ్మదిగా పలచబడి గుండెలోతుల్లోకి సర్దుకుంటోంది. ఒక మనిషి చనిపోగానే ఇంతమంది ఒకచోట కలుసుకునేది, దు:ఖాన్ని పంచుకుని, గుండె భారాన్ని తగ్గించుకునేందుకు. ఆ వ్యక్తి నిష్క్రమణాన్ని వప్పుకునేందుకు. జీవితం ఇకమీద ఆ వ్యక్తి వున్నప్పట్లా వుండదు. నిర్మలా అని పిలవబోయే గొంతు నిజం గుర్తొచ్చి ఆగిపోతుంది. వాళ్ళు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములకి కట్టే రాఖీలు ఐదే వుంటాయి. మంగళహారతి పట్టే చేతుల్లో ఒకటి తగ్గుతుంది. ఇంకా ఎన్నోచోట్ల ఆమె లేని లోటు దాన్నది నెమ్మదిగా పూడ్చుకుంటు వెళ్తుంది. ఎక్కడెక్కడి జీవశక్తినో తెచ్చుకుని ఆ దుఖాన్ని దాటేందుకు వాడుకుంటుంది.
కర్మంతా అయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు మహతీ, నారాయణా.
“ఇక్కడే వుండిపోవచ్చుకదా, మహీ! ఆ డీటీపీ సెంటరేదో ఇక్కడే నడిపించుకోండి” అన్నాడు రామారావు.
“వెళ్ళిపోతాం మామయ్యా! ఇక్కడ వుండను” ఆమెది ఒకటే మాట. ఇక్కడ వుండిపోవాలనే వ్యామోహం ఆమెకి కొంచెంకూడా లేదు. దానికి తగ్గట్టు కర్మకి వచ్చినవాళ్ళలో ఒకావిడ అన్నమాటలు చాలా కలవరపెట్టాయి. ఎవరి గురించైతే వినకూడదనుకుని అంతదూరాన్న వుండిపోయిందో, ఆ వ్యక్తి గురించి చెప్పింది ఆమె.
“నువ్విలా వదిలేసి వెళ్ళిపోయావా, మీ ఆయన ఎవర్నో వెంటేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆవిడ్నే చేసుకున్నాడు. ఏడాది తిరక్కుండా పిల్లాడు పుట్టాడు. మీ అత్తమామలకీ, ఆడబడుచుకీ సంతోషానికి అవధుల్లేవనుకో” అంది పనిగట్టుకుని మహతి ఒక్కర్తే వున్నప్పుడు దగ్గిర కూర్చుని. అదంతా మహతికి ఎందుకు చెప్పిందో, మహతికిగానీ తనకిగానీ దాంతో ప్రయోజనమేమిటో ఆమెకి తెలీదు. తనకి తెలిసిన విషయాలని వుత్కంఠ ఆపుకోలేక చెప్పింది. అంతే.
ఎంత వుండమన్నా వుండలేదు మహతి. ఆమెని ఆపే శక్తి ఎవరికీ లేకపోయింది. ఉన్నదంతా డీటీపీ సెంటరుమీద పెట్టేసాక దాన్ని వదిలి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రయత్నం చెయ్యటం నారాయణకీ యిష్టం లేకపోయింది. కష్టమో, సుఖమో, కూతురితోనే, అక్కడే అని నిర్ణయించుకున్నాడు.
ఆ తర్వాత?
రోజులు సంవత్సరాలై ముందుకి సాగాయి. కొన్ని పరిచయాలు, ఇంకొన్ని ప్రతిపాదనలు, వేటికీ ప్రలోభపడనితనం, మేఘన. నెమ్మదిగా విస్తరిస్తున్న ఆ పిల్ల వునికి, పెరుగుతున్న ఖర్చులు, కష్టపడి పనిచెయ్యటం, సంపాదించుకోవడం. జీవితం ఒక గాడిలో పడింది మహతికి. రామ్మోహన్ మళ్ళీ కనిపించలేదు. కానీ అనుకునో అనుకోకుండానో అతను చేసిన మేలు గంధపుసువాసనలా ఆమెని అంటిపెట్టుకునే వుంది. చాలామంది రచయితలకి ఆమె పనితనాన్నిగురించి తెలిసింది. తప్పుల్లేకుండా డీటీపీ చేసి, అనుకున్న టైముకి ఇవ్వటాన్ని గురించి అతను ఇద్దరుముగ్గురు సహరచయితలతో అన్నమాటలు ఆమెకి చాలా వుపయోగపడ్డాయి.