ఝరి – 58 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


రెండు దశాబ్దాలకిపైగా అనుభవించిన జీవితంలోని వంటరితనాన్నీ, దు:ఖాన్నీ ఒక్కరాత్రిలో మళ్ళీ రుచి చూసింది మహతి. ఇలాంటి రాత్రులనే కాళరాత్రులంటారు. పక్క బెడ్‍మీద నరేంద్ర. చేతికి సెలైన్‍తో వంటినిండా కట్లతో. గంటకోమాటు నర్స్ రావడం, అతనికి మందులు వేసి, టెంపరేచరు చూసుకుని వెళ్ళడం తెలుస్తోంది. తన బెడ్‍మీద మఠం వేసుకుని కూర్చుంది.
బెడ్‍లాంప్ వెలుతుర్లో అతను మగతగా పడి వున్న దృశ్యం గుండెని చిక్కబట్టింది. ఎంతకాలం పడుతుందో కోలుకోవడానికి? అప్పటిదాకా ఎవరు చూసుకుంటారు? ఇతన్నే కాదు, అటూ ఇటూ కాని వయసులో వున్న యితని పిల్లల్ని కూడా. మేఘన ఆ బాధ్యత ఎత్తుకుంటుందా? సుధీర్ కొడుకుతో దీని పెళ్ళి? నెమ్మదిగా బెడ్ దిగి అతని దగ్గిరకి వెళ్ళింది. ఎంత అణచుకున్నా వ్యామోహం ఆగలేదు. జుత్తు పలచబడి, కాస్త వృద్ధాప్యపు ఛాయలు తొంగిచూస్తున్న అతని ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూసి, నెమ్మదిగా వంగి అతని నుదుటిమీది వెంట్రుకలని సరిచేసి పెదవులు ఆనించింది. కళ్ళలోంచీ నీళ్ళు టపటప జారిపడ్డాయి. చప్పుని సర్దుకుని నిలబడబోతుంటే అతని చెయ్యి ఆమె తలమీద పడింది. యాదృచ్ఛికం కావచ్చు. ఆ చేతిని అతని ఛాతీమీదే వుంచి దూరం జరిగింది.
వెళ్ళి తన బెడ్‍మీద పడుక్కుంది. ఎప్పటికో నిద్రపట్టింది. వాసు మాటలు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. వాసు,వేణు కనిపించారు. ఇందిర, హరి తండ్రి మంచందగ్గిర వున్నారు. అతనికి స్పృహ వచ్చినట్టుంది. వాళ్ళతో చిన్నగా ఏవో చెప్తున్నాడు. మేఘన కాస్త దూరంగా నిలబడి వుంది. ఆమెకి తండ్రితో వాళ్ళంత చనువు లేదు. మహతి కూతురికేసి చూసింది. ఆ పిల్ల తల్లి చూపుల్ని తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. ఇంత పలుచటి బంధంకోసమా, కూతురు తపించిపోయేది? నాన్న నాన్నని కలవరించేది? అతను కనిపించగానే అతనే ప్రపంచం అన్నట్టు అతన్తో వెళ్ళిపోయేది? అతనికే ఇంత దూరమైతే, అతనింట్లో ఎలా చూసేవారో ఈ పిల్లని? మనసు చివుక్కుమనిపించింది.
“అమ్మకి బ్రష్, పేస్టూ ఇవ్వవే! “అన్నాడు వాసు పరిస్థితిని అర్థం చేసుకుని. అతని గొంతు అక్కడ వున్న అందర్లో చలనాన్ని తెచ్చింది. మహతి వాష్‍రూమ్‍కి వెళ్ళింది.
“మీకిప్పుడెలా వుంది?” అని నరేంద్రని అడిగి, “రెస్టు తీసుకోండి” అని చెప్పి,
“ఇందిరా! నీకేదో ఎగ్జామ్ వుందన్నావు, వెళదాం వస్తావా?” అడిగాడు వాసు. ఆ పిల్ల తండ్రిని వదిలి ఇవతలికి వచ్చింది.
“ఎవరెవరు వెళ్తున్నారు మామయ్యా?” అడిగింది మేఘన.
“అమ్మా, నేనూ, ఆ అమ్మాయిని స్కూలుదగ్గిర దింపి, ఇంటికి వెళ్తాం. నువ్వూ, హరీ స్కూలుకి వెళ్ళి తనని తీసుకుని ఇంటికి రండి. వేణుమామ బట్టలవీ తెచ్చుకున్నాడు. డిశ్చార్జయేదాకా ఇక్కడే వుంటాడు. మీరు మధ్యలో వచ్చి చూసి వెళ్తుందురుగాని” అన్నాడు. ఆమెకి స్వల్పంగా అసంతృప్తి కలిగిందిగానీ, బైటపడలేదు. తలూపి వూరుకుంది.
మహతి రాగానే ముగ్గురూ బయల్దేరారు. వాళ్ళు వెళ్తుంటే నరేంద్ర దృష్టి ముందు వాసుమీద పడి, నెమ్మదిగా మహతిమీదికి మళ్ళింది. కలలోనో, మగతలోనో నుదుటిని తాకినట్టనిపించిన ఆమె స్పర్శ, జారిపడ్డట్టనిపించిన కన్నీటి చుక్కలు గుర్తొచ్చాయి.
తను మహతితో కొంచెం గౌరవంగా ప్రవర్తించవలసినది. భయాలు తగ్గి, తనంతట తను దగ్గరయేదాకా ఇంకొన్నాళ్ళు వేచి వుండాల్సింది. తప్పు చేసాడు. పెళ్ళి అనేది మనిషికి ఒకేఒక్కసారి గొప్ప అవకాశమౌతుంది. ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆమెని వదిలిపెట్టి తనేం సుఖపడలేదు. ఆఫీసులో పార్ట్‌టైమ్‍గా పనిచేసే విజయతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెని వెంటేసుకుని బైక్‍మీద తిరుగుతూ ఈ వాసూవాళ్ళకి కనిపించాడు. మొదటిసారి ఎదురుపడ్డప్పుడు తనకి కొంచెం బిడియంగా అనిపించిందిగానీ పంతానికి పదేపదే అదేపని చేసాడు. ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. మేఘన విషయంలో తనకీ మహతికీ పంతం పెరిగి విడాకులు ఆలస్యమైంది. విడాకులు వచ్చేసరికి విజయ ప్రెగ్నెంటు.
“పెళ్ళికాకుండా పరాయి మగాడితో పబ్లిగ్గా తిరిగినదాంతో పెళ్ళేమిటి? ఇంకో మంచి సంబంధం చూస్తాం. దాన్ని వదిలించుకో” అని తల్లీ, తండ్రీ పెళ్ళికి వప్పుకోలేదు. గుళ్ళో చేసుకున్నాడు. కొన్నాళ్ళు తల్లిదండ్రుల కోపాలు సాగాయి. హరి పుట్టాక కలుపుకున్నారు. వాళ్ళు అన్నారని కాదుగానీ, తనకే అనిపించేది అప్పుడప్పుడు తనేదైనా మోసపోయాడేమోనని. మనుషులు పాటించే నైతికవిలువల మౌలికతలో తేడాలున్నప్పుడు అలా ఆలోచించడం సహజమేమో!
మహతి సున్నితం, సంస్కారం విజయలో ఎక్కడా కనిపించేవి కాదు. అంత చదువుకుని, పెద్దకుటుంబంలోంచీ వచ్చిన మహతి ఎందుకు ఇంట్లోంచీ వెళ్ళిపోయిందనేది ఆమె సందేహం. తామిద్దరూ ఎవరికివారే ఏవో అనుమానాలతో భయాలతో సతమతమయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో లభించిన శృంగారం ఏమీ గొప్ప అనుభవంలా అనిపించేదికాదు. పోగొట్టుకున్నదానిముందు అల్పమైనదిగా తోచేది. మేఘననికూడా కుటుంబంలో కలవనివ్వలేదు విజయ. ఇప్పుడు ఆమెకూడా లేదు. కళ్ళుమూసుకున్నాడు.
తల్లీవాళ్ళూ వెళ్ళాక అప్పుడు దగ్గిరకొచ్చి అడిగింది మేఘన.
“ఎలా వుంది నాన్నా, మీకిప్పుడు? నిన్నటిమీద తేలిగ్గా లేదూ? తగ్గుతుంది. కంగారుపడకండి. మేమందరం వున్నాం” అంది.
అతను కళ్ళు తెరిచాడు. రూపంలో పూర్తిగా తన పోలిక పిల్ల. చామనచాయలో దృఢంగా, ధైర్యం చెప్తూ, ఆత్మవిశ్వాసంతో మిసమిసలాడుతూ.
“థేంక్సమ్మా!” అన్నాడు. కళ్ళలో నీళ్ళు నిండాయి.
“అయ్యో! నాకు థేంక్స్ దేనికి? వదిలేస్తానా, అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని?” అంటుంటే డాక్టరు రౌండ్స్‌కి వచ్చాడు.
“మీరు మాకేమౌతారు?” కార్లో కూర్చున్నాక అడిగింది ఇందిర.
“ఏమీ కాము” మహతి జవాబు.
“అలా కాదు. మేఘన నాకు అక్క. మీకు కూతురు. తను మా నాన్నని నాన్నని పిలుస్తుంది. అంటే మీరు… మీరు…” ఏదో అర్థమై ఆ అమ్మాయి ముక్కూ, ముఖం ఎర్రబడ్డాయి. మహతికి ఏం జవాబు చెప్పాలో అర్థమవ్వలేదు. చాలా ఇబ్బందిగా, చికాగ్గా అనిపించింది.
“ఇవాళ ఏం పరీక్ష?” వాసు అడిగాడు ఆ పిల్లని.
“లెక్కలు” ఎందుకు అడిగాడోనని చెప్పింది.
“మా చిన్నప్పుడు మేమైతే లెక్కల పరీక్షకి ఏవో ఫార్ములాలూ అవీ నేర్చుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు యింటివిషయాలన్నీ అడుగుతున్నారా?” అడిగాడు సరదాగా. అతని ప్రశ్నకి మహతి చిన్నగా నవ్వితే ఇందిర మూతి బిగించుకుంది.
“మీ నాన్నకి తగ్గాక ఇవన్నీ అడగచ్చుగానీ, ఎగ్జామ్ బాగా రాయి. బెస్టాఫ్ లక్” అన్నాడు.


(అమృత వర్తమానం – 29వ భాగం తర్వాత)
గడుస్తున్న ప్రతి ఒక్కరోజుకీ ప్రాధాన్యత వుంది. అమృత యింటి లెక్కలు ఒక దారికి వచ్చాయి. విశాలా, వెంకట్రావులు ఎన్నోదారుల్లోంచీ డబ్బు పుట్టించారు. కోటికి పైగా విలువ చేసే యిల్లు కుదువపెట్టి యాభైలక్షలు తెచ్చారు. ప్రోనోట్లమీద తీసుకున్న లక్షారెండులక్షల అప్పులు కొన్ని. ఎక్కువ వడ్డీ యిస్తామని చెప్పి పోగుచేసినది పాతికలక్షలదాకా వుంటుంది. ఇవికాక చిట్టీల డబ్బులు, ఇచ్చినవి, ఇవ్వాల్సినవి, వచ్చినవి, రావల్సినవి, అన్నీ కలిపి నాలుగుకోట్లకి తేలగా అందులోంచీ ఒక కోటిపైగా లెక్కకి దొరక్కుండా వుంది.
కంప్లెయింటులోనూ, పోలీసు ఎంక్వైరీలోనూ వీళ్ళు డబ్బు ఇవ్వాల్సినవాళ్ళు దాదాపు రెండువందలమంది తేలారు.
లక్షరూపాయల చీటీ ఇరవైనెలలకి ఇరవైమంది సభ్యులతో మొదలుపెడితే చివరికి వచ్చేసరికి అందులో నలభైలక్షలు చేతులు మారుతుంది. అది పదినెలలు నడిచిందంటే పదిమంది పాడి తీసుకుని వుంటారు. ఇరవైలక్షలు చేతులు మారి వుంటుంది. అప్పటికి వాళ్ళు కట్టేది ఐదులక్షలే. తమవంతుకోసం ఎదురుచూసేవాళ్ళు మరోపదిమంది మిగిలిన ఐదూ కడతారు. ముందే పాడి తీసుకున్నవాళ్ళు బాగానే వున్నారుగానీ, మిగిలినవాళ్ళ డబ్బు ఇక్కడ యిరుక్కుపోయింది. ఒక నలుగురు పాట పాడినా డబ్బు చేతికి రానివాళ్ళు. మొదటే పాడి తీసుకున్నవాళ్ళ దగ్గిర విశాలావాళ్ళ డబ్బు ఇరుక్కుని వుంది. తిరిగి యిమ్మంటే లేకేకదా, మేం తీసుకున్నది, ఇప్పటికిప్పుడు ఎక్కడినుంచీ తేవాలని నిలదీస్తున్నారు. ఇదికాక చిట్టీలు నడిపేవాళ్ళు పూర్తి చిట్టీ మొత్తాన్ని అదో ప్రెవిలిజ్‍గా మొదటినెలే తీసుకుంటారు. ఆ డబ్బు ఏమైంది? చాలా చీటీలు నడిపించారు విశాలా – వెంట్రావులు. ఈ వ్యాపారానికి అనుసంధానించుకుని ఇంకా అనేక లావాదేవీలు వున్నాయి. చీటీల్లో వచ్చింది వడ్డీకి తిప్పడం, డబ్బంతా ఏదో పథకంప్రకారం ఎక్కడికో నడిపించారనేది సుస్పష్టమైంది.
బేంకు అకౌంట్లలో వెతగ్గా అదీ దొరికింది. ఒక డీమేట్ అకౌంటు లింకై వుంది. ఈక్విటీల్లో అడ్డదిడ్డంగా పెట్టుబడులు పెట్టారు. ఒక్క కోటికాదు, ఇంకా ఎక్కువే.
పెన్షను బెనిఫిట్స్‌కోసం వెంకట్రావు ఆఫీసుకి వెళ్తే అక్కడా చుక్కెదురైంది శ్యామ్మోహన్‍కి. ఆఫీసుడబ్బు వాడి సస్పెండయాడట వెంకట్రావు. పోలీసుకేసుకూడా పెట్టారు. భార్యాభర్తలు అంత అత్యవసరంగా ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందో ఇప్పుడర్థమైంది శ్యామ్మోహన్‍కి. వెంకట్రావు చనిపోయాడు. చార్జెస్ డ్రాప్ చేసి, పెన్షన్ కేసు మొదలుపెట్టాలి. అతను వాడుకున్న డబ్బంతా పట్టుకుని మిగతాది ఇస్తారు. గ్రాట్యుటీ, పీయఫ్, లీవు ఎన్‍కాష్‍మెంటు, గ్రూపు ఇన్షూరెన్సులాంటివి వుంటాయి. ఆమృతకి ఫామిలీ పెన్షను రాదు. వచ్చేవికూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఐనా అమృత ఆల్టర్నేట్ నామినీగా కాగితాలు పెట్టించాడు శ్యామ్మోహన్.
స్వంత యిల్లు, కాస్త భూమి, గవర్నమెంటు వుద్యోగం వుండి అన్నీ అమరివున్న జీవితాన్ని ఎలా చిందరవందర చేసుకున్నారో నెమ్మదినెమ్మదిగా వ్యక్తమైంది. అమృతని బైటపడేసే దారులు మూసుకుపోవడంకూడా. పోలీస్ ఇన్‍స్పెక్టర్ని మేనేజి చేసి అమృతని దూరంగాఎక్కడికో పంపిచెయ్యడం తప్ప మరో మార్గం లేదనిపించింది. మాధవరావు తొందరపడ్డాడా, ఈ విషయంలో తలదూర్చి? వదిలేస్తే అమృత పరిస్థితి? ఈపాటికి తనూ చచ్చిపోయి వుండేది. అమాయకపు పిల్ల. అలాంటిపిల్ల విశాలకి ఎలా పుట్టిందో! పరిస్థితి ఎటూ అర్థమవలేదు. మాధవరావుదీ అదే అయోమయ పరిస్థితి.
“ఏం వుందో, ఎంత చేతికొస్తుందో తొందరగా చూసేసుకుంటే ముందు టెన్షన్ తగ్గుతుందిరా” అన్నాడు.
“ఎన్ని లెక్కలు వేసినా అంతడబ్బు సమకూరడం అసాధ్యం. అప్పులవాళ్ళు వదిలిపెట్టడంలేదు. కోర్టులూ కేసులూ అని బెదిరించే సందర్భం కాదిది. ఇల్లు తణఖా పట్టినవాడు యాభైకే దాన్ని కొట్టేద్దామని ముఖం చాటేస్తున్నాడు. ఇందులో కనిపిస్తున్నది ఆడపిల్ల. ఆ ఇన్‍స్పెక్టరు కేసుపెట్టకుండా వదిలేలా లేడు. ఆ పిల్లని ఏం చేద్దాం?” అడిగాడు శ్యామ్మోహన్.
“ఇంకా కోర్టులో చార్జిషీటు వెయ్యలేదు. ఏం చేసినా ఈలోపల జరగాలి” సాలోచనగా అన్నాడు మధవరావు.
“విజయ్ ఆలోచన?” శ్యామ్మోహన్ ప్రశ్న.
“ఇంకా మేమే ఏదీ అనుకోలేదు. నీదాకా ఎలా వచ్చింది? వాడు చెప్పాడా” ఆశ్చర్యంగా అడిగాడు మాధవరావు. కొడుకు చొరవపట్ల అతనికి కోపంకూడా వచ్చింది.
“ప్రసూన చెప్పింది. అమృత విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పింది. ఈమధ్యని త్రిమూర్తులు తాతయ్యని చూడ్డానికి వాసు, రామారావుగారు వచ్చారటకదా, అప్పుడు వాళ్లతో వీడేదో అన్నాడట.
ఆ పిల్లకోసం డబ్బంతా తగలేస్తాడేమో, శ్యామ్ పెద్దనాన్నా! లేనింటి పిల్లల్నే మనం కోడళ్ళుగా తెచ్చుకుంటున్నాం. నిజమే! కానీ ఈ అమృత పరిస్థితి వేరు. డబ్బులేకపోవడంతోపాటు నిండా అపఖ్యాతితో వుంది. అలాంటి పిల్లకి మానవధర్మంగా సాయం చెయ్యడం వేరు, వాళ్ళ బురదంతా మనం నెత్తికి పులుముకోవడం వేరు- అని నాతో చాలా కోపంగా మాట్లాడింది.
తన మాటా నిజమే” అన్నాడు శ్యామ్మోహన్.
“ఊళ్ళో పొలం మాటేం చేసావు?” అడిగాడు మాధవరావు.
“వెంకట్రావు నాన్న నెలక్రితం చనిపోయాడు. పోయేముందు వాడి అన్నలిద్దరూ ఆయనచేత వేలిముద్రలు వేయించేసుకుని పొలం తమ పేరుమీదకీ మార్చుకున్నారు”
“అదేంటి?”