“స్వంత తల్లిదండ్రులు పిల్లలమీద ఇంత కక్షకడతారని నాకు తెలీదు మానసా! నిన్నే చేసుకుంటానని పంతమేం పట్టలేదు. కట్నం తీసుకోనప్పుడు ఎవరైతేనేం, నువ్వూ ఇక్కడే వుంటే కజిన్సందరం ఒకే కుటుంబంలా వుంటామని, నచ్చజెప్పి చేసుకున్నాను. వప్పుకున్నారు. దగ్గరుండి మన పెళ్ళి చేసారు. కానీ మనసులో ఇంతంత కోపాలు పెట్టుకుంటారనుకోలేదు. నిన్ను నేను చేసుకోకపోయినా ఎక్కడో ఒకచోట సుఖంగా బతికేదానివి. ఇలా తిట్లు తింటూ, దరిద్రం అనుభవిస్తూ వుండేదానివికాదు. ఏం చూసి చేసుకున్నావే నన్ను? ఎంటెక్ చదివాను, పెద్ద వుద్యోగం చేస్తున్నాననేకదా? కానీ నా హోదానీ డబ్బునీ ఎప్పుడేనా అనుభవించావా? లేదుకదా? నీకింక స్వేచ్ఛ దొరుకుతుంది. మానసా! నీ చేతికో పదిలక్షలొస్తే తెలివిగా దాచుకోగలవుకదూ? జాబ్ చెయ్యగలవా? మీ అమ్మానాన్నలని పిలిపించుకో దగ్గిరకి. పిల్లలు పెద్దయేదాకా వాళ్ళ సపోర్టుకావాలి” అన్నాడు.
ఆ మాటలు విన్నాక లోపలికొచ్చింది గీత. అతని వీపుమీద ఒక్కటి చరిచింది.
“ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? దానికి ఈ అప్పగింతలేమిటి? సెన్సెస్లోకి రా, వసంత్!” అంది.
“వీళ్ళిప్పటిదాకా ఏడ్చి ఇప్పుడే పడుక్కున్నారు. లేచేస్తారేమో! బైట కూర్చుని మాట్లాడుకుందాం” అని చెయ్యిపట్టుకుని తీసుకొచ్చాడు వాసు.
వాసు అతన్ని పక్కని కూర్చోబెట్టుకున్నాడు.
అప్పటికి అతనేం చెప్పాడో అర్థమైంది మానసకి. భయంతో వణికిపోయింది. పెద్దగా ఏడుస్తూ మంచంమీదే కుప్పకూలిపోయింది. తల్లి వెళ్ళి ఇవతలికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది. కట్నం లేని పెళ్ళిళ్లన్నీ సుఖంగా వుండవనే వాస్తవానికి నిర్వచనంలా కనిపిస్తోంది మానస. భార్యాభర్తలకి ప్రేమలున్నాకూడా మిగిలినవాళ్ళు సుఖపడనివ్వరని అర్థమైంది.
“వసంత్! మేము చాలా నిస్సహాయులం. డబ్బూ లేదు, సంపాదించి సాదాలన్నా వయసూ, ఓపికా లేవు. మాదగ్గిర డబ్బే వుంటే పిల్లలకి కాకపొతే ఇంకెవరికిస్తాం? మీ అమ్మానాన్నల కోపం అర్థం కానట్టు అందుకే వుపేక్షించాం. అల్లుళ్ళు ముగ్గురూ మంచివాళ్లన్న నమ్మకంతో బతుకుతున్నాం. మీరే కొడుకులనుకున్నాం. మీరిలాంటి ఆలోచనలు చేస్తే మీ అమ్మగారికేకాదు, నాకూ కడుపుకోతే” అని ఏడ్చింది కమలాక్షి.
“ఊరుకోమ్మా!” అంది నీలిమ. మాధురి లేచి వెళ్ళి తల్లి పక్కని కూర్చుంది. అక్కచెల్లెళ్ళిద్దరూకూడా జరిగిన సంఘటనలు ఈ మలుపు తిరుగుతాయనుకోలేదు.
ఒకరకమైన వుద్రేకంతో వూగిపోతున్నాడు వసంత్. బలంగా పీల్చి వదిలిపెడుతున్న వూపిరి అతని లోలోపలి తుఫానుని వ్యక్తపరుస్తోంది.
“ఈ బట్టలేంట్రా వసంత్? ఆ గెడ్డమేంటి? ఇలానే రోడ్లమీద తిరిగావా? ఆఫీసుకీ ఈ వాలకంతోటే వెళ్లావా? సుమంత్, నువ్వూ పోటీలుపడి తయారౌతారుకదరా? రేపు పనిజేయించుకుందువుగాని, ముందు కాళ్ళూచేతులూ మొహం కడుక్కుని బట్టలు మార్చుకో” అన్నాడు వాసు ప్రేమగా. గీత పెద్దగ్లాసునిండా మజ్జిగ తెచ్చిచ్చింది. అందుకుని గటగట తాగేసాడు. ప్రాణం లేచొచ్చినట్టై, కొంచెం కుదుటపడ్డాడు. ఆమె మళ్ళీ వెళ్ళి వుతికిన పంచ, టీషర్టు తెచ్చిచ్చింది. వాటిని పక్కన పెట్టేసాడు.
“రైలుకింద పడటమేమిట్రా? ఎందుకనిపించింది అలా? కోపం వస్తే ఎవర్నేనా చితక్కొట్టేసే బేచికదా, మనది? ఈ పిరికితనం ఎప్పట్నుంచీ? నువ్వలా చేస్తే మానసా పిల్లలూ ఏమౌతారు?” అన్నాడు వాసు. చిన్నపిల్లాడితో, చిన్నతమ్ముడితో మాట్లాడినట్టు. వింటూ సోఫాలో వెనక్కివాలి కూర్చుని ఆ గొంతులోని కన్సర్న్కి తనని తను సంభాళించుకునే ప్రయత్నం చేసి విఫలమై, ఒక్కసారి దు:ఖపు కెరటంలా విరుచుకుపడ్డాడు వసంత్.
“నాన్న పోయి అప్పుడే నెలైపోతోంది. ఆయన నాతో ప్రేమగా మాట్లాడి కొన్ని సంవత్సరాలైంది. ఒకానొకప్పుడొక అందమైన కుటుంబం, అందులో అమ్మా, నాన్నా, చెల్లీ, నేనూ. చాలా బావుండేదప్పుడు. మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేవారు. ఎక్కడికెళ్ళినా నన్ను వెంటపెట్టుకుని వెళ్ళేవారు. క్రికెటాడేవారు. తప్పూ ఒప్పూ, మంచీ చెడూ అన్నీ చెప్పేవారు. నాకు ధైర్యం తను, ఆయనకి ఆశ నేను. అలాంటి మనిషి నన్ను ద్వేషించారు. ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో చెప్పడం మానేసారు. తను చెప్పినట్టల్లా నేను చెయ్యట్లేదని మాకిద్దరికీగల సంబంధం తుంచేసారు. లోలోపల్నుంచీ ఆశల వుచ్చు పేనుకుంటూ వచ్చి అందులో పడిపోయారు. ఎవరికీ ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు.
ఆయన మనని అన్యాయం చేసి వెళ్ళిపోయార్రా- అని అమ్మ నన్ను పట్టుకుని ఏడవాలికదా? నన్ను వోదార్చాలికదా? నాకు నాన్నకదా? కానీ ఆవిడక్కూడా నామీద కోపం. సమీర పెళ్ళై వెళ్లిపోయింది. మిగిలింది ఒకరికొకరం మేమిద్దరమేకదా? ఆవిడా మాట్లాడట్లేదు. కోపం. ద్వేషం. మా అందరిమీదా. కొత్తగా పుట్టిన కవలలమీదకూడా. ఆయన్ని చంపడానికి పుట్టుకొచ్చిన దయ్యాలట వాళ్ళు. ఏం చెయ్యన్రా, నేను? మానసనీ పిల్లల్నీ ఏం చెయ్యను? ఏం చెయ్యాలని ఆవిడ చెప్తోంది? వదిలెయ్యాలా? వదిలేసి? ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను” పెద్దగా ఏడ్చేసాడు.
అందరూ నిశ్చేష్టులై చూసారు. లక్ష్మికైతే ఏం మాట్లాడాలో, అతన్ని ఎలా వోదార్చాలో అర్థమవ్వలేదు. చెల్లెలి అసూయా, ద్వేషం, ఓర్వలేనితనం ఆఖరికి కన్నకొడుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకొచ్చాయి. పద్మ చిన్నప్పట్నుంచీ పేచీకోరుగానే వుండేది. అప్పుడు పంచుకోవడానికీ, పెట్టుకోవడానికీ ఏమీ లేదుకాబట్టి అవి అక్కడే ఆగాయి. పీజీ చదువుతాననీ, పెద్దసంబంధం కావాలనీ గొడవచేసింది. అన్నగారు శక్తికి మించిన బాధ్యత తీసుకోలేనని కచ్చితంగా చెప్పేసాడు. అందరూ సర్దిచెప్పారు. ఆమె సర్దుకుంది. సర్దుకోవడమంటే భర్తని నిప్పుకి ఆజ్యంలా మండించడమా? తన కోరికలని ఆ మంటకి సమిధలుగా చేర్చడమా?
గీతకి తండ్రి స్థలం రాసివ్వడంతో మొదలైన గొడవ రావణకాష్ఠంలా కాలుతునే వుంది. వాళ్ల వ్యవహారాలతో ఏ సంబంధం లేని తన కొడుకులమధ్య చిచ్చుపెట్టి విడదీసింది. ఇల్లనగానే దానికి వెలకట్టి ఆస్తుల్లో జమచేసుకుంటే సరిపోదు. విధాయకం కాకపోయినా నైతికమైన బాధ్యతలు కొన్ని వుంటాయి. పెద్దాడబడుచుకి పిల్లల్లేరు. ఆవిడ తమ కుటుంబానికి చాలా చేసింది. ఆవిడ పెద్దతనం తమదగ్గిరే వెళ్ళాలి. తన చివరిరోజులు వెళ్లాలి. కృష్ణ బైట వున్నాడు. వాళ్ల తల్లిదండ్రుల బాధ్యత గీతదే. విశాలంగా వున్న యింటిని చిన్నచిన్న యిరుకు ఫ్లాట్స్‌గా మార్చుకుని మంచానపడ్డ పెద్దవాళ్లతో తలుపులు మూసేసిన గోడలమధ్య యేళ్ళతరబడి కలిసి ఎంతకని బతగ్గలరు? అలా బతకడమంటే ఎప్పుడు పోతారా, విముక్తులౌదామా అని ఎదురుచూడటమేకదా?
వసంత్ చదువు, వుద్యోగం పెద్దవి. సంపాదించుకున్నది దాచుకోలేడా? పెళ్లైంది. పిల్లలు పుట్టారు. భార్యాపిల్లలనైతే వదిలెయ్యలేడు. ఎంత గొడవపెట్టినా ఇవ్వడానికి మానస తండ్రిదగ్గిర ఏమీ లేదు. కొడుక్కి నిలవనీడ కూడా లేకుండా చేసి, వున్నదంతా వూడ్చిపెట్టి ఎవరికీ చెప్పకుండా తగలేసేంత కోపాలు పిల్లలపట్ల చూపించడమేమిటి? వాళ్లని ఎదిరించక చచ్చిపోవాలన్న పిరికితనాన్ని వీడు పోగేసుకోవడమేమిటి? నలుగురు ఆడపిల్లల్తో నడిరోడ్డుమీద నిలబడ్డ వీడి భవిష్యత్తేంటి? ఎటూ అంతుచిక్కకుండా వుంది.
ఎవరూ ఏదీ మాట్లాడకముందే సర్దుకుని మళ్ళీ మొదలుపెట్టాడు.
“నా ఆలోచనలన్నీ ఆయననుంచి నేర్చుకున్నవే. సుధీర్, సుమంత్ల్లా మెడిసిన్ చదువుతానన్నాను. ఆ లైన్లో స్థిరపడటానికి చాలా టైం పడుతుంది, ఇంజనీరింగైతే వుద్యోగం తొందరగా వస్తుందన్నారు. విన్నాను. అందులో నాకు తప్పు కనిపించలేదు. మంచి వుద్యోగంకూడా వచ్చింది. అప్పటిదాకా ఆయన నాన్నే. సమాజపు ఏ కోణంలోంచో నేనాయనకి డబ్బువనరుగా కనిపించడం మొదలైంది. మారిపోయారు. నిన్ను నేను అందుకే చదివిస్తున్నాను, జీతంతోపాటు ఇంత తీసుకొస్తేనే నీకు తిండిపెడతానని చదువు విషయంలో చెప్పినట్టు చెప్తే అర్థమయ్యేది. మనసులో ఒకలా వుండి, పైకి మరోలా కనిపిస్తుంటే అర్థంచేసుకోలేకపోయాను.
ఇంట్లో దరిద్రం ఏమీ లేదు. ఆయనిల్లు ఆయనకీ, నాయిల్లు నాకూ దర్జాగానే వున్నాయి. దాచిన డబ్బులతోటే చెల్లికి పెళ్ళి చేసారు. అప్పులేం లేవు. నేను తీర్చకుండా వదిలేసాననుకునేందుకు. ఆస్తులు పోగుచేసి ఇమ్మని ఆయన్ని నేనేం అడగలేదు. చెప్పించిన చదువుకే కృతజ్ఞత, ఆ చదువుతో వచ్చిన వుద్యోగంతో బతకగలనన్న ధీమా చూపించాను. చట్టాన్ని గౌరవించాను. వుద్యోగంలో చేరినప్పుడే కాండక్ట్ రూల్స్ చదివానని సంతకం పెట్టించుకుని వుద్యోగం యిచ్చారు. అందులో కట్నం తీసుకోకూడదని వుంటుంది. సైన్సు, లెక్కల సూత్రాలని నమ్మినట్టు ఆ నిబంధనలని నమ్మాను.
పంధొమ్మిదేళ్లకి తాతయ్య పోతే ఆరుగురు చెల్లెళ్లకి డిగ్రీ చెప్పించి పెళ్ళిచేసిన గీత నాన్నపాటి నేను చెయ్యలేనా? మగపిల్లల్ని ఇంత నిర్వీర్యం చేసేస్తున్నారేంటి? లంచాలూ, కట్నాలూ లేకపోతే కుటుంబాన్ని పోషించుకోలేనంత అసమర్ధుడినా- అని అడిగాను. ఆయన్ని అవమానించాలని కాదు. ఆయన పెంపకంలో ఎంత గొప్పగా పెరిగానో చూపించుకోవాలని.
నాకు మొదట ఇన్వెస్టిగేషన్లో ఇచ్చారు. అంటే తపస్వినిమీద కట్టే ప్రాజెక్టుకి పేపరువర్కుమాత్రమే వుంటుంది. అదయ్యాక ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. పని తెలుస్తుందని నన్నూ అటువైపు వెయ్యమని అడిగాను.
సంపాదించుకోవడానికి అప్పుడే తొందర దేనికి? చిన్నవాడివి. ముందుముందు సర్వీసు చాలా వుంది- అని వెటకారంచేసాడు నా పై ఇంజనీరు. అక్కడే వున్న నా కొలిగ్స్ అదో జోక్‌లా నవ్వారు. చాలా అవమానంగా అనిపించింది. ఆ పోస్టులు మంచి పలుకుబడీ, పెద్దవాళ్ళ అండదండలూ వుండి సులువుగా పనులు జరిపించగలిగేవాళ్ళకి యిస్తారట. నాలా రూల్స్ పట్టుకు వేలాడేవాళ్లకి కాదు. ఇవన్నీ నాన్నకి ఎంతో వివరంగా చెప్పాను. నాది చేతకానితనంలా అనిపించింది.
నలుగురు ఆడపిల్లలు పుట్టేసారు. నిజమే. పదిసార్లు కాదు, లక్షసార్లు అన్నా వాళ్ళల్లో ఒక్కళ్ళుకూడా మగపిల్లాడిగా మారిపోరు. నిజాన్ని వప్పుకోనంతమాత్రాన అది మనకి కావలిసినట్టు మారిపోదు. తెలివితక్కువగానే కన్నాను. ఏం చేస్తే మగపిల్లలుమాత్రమే పుడతారో, నా యింజనీరింగ్ సబ్జెక్ట్స్ దేనిలోనూ లేదు. వైద్యం చదివినవాళ్ళు చెప్తారేమోనని సుధీర్‌ని అడిగాను. పుట్టడానికిగల కారణం చెప్పాడుగానీ, దాన్ని ఇంపోజ్ చెయ్యగలిగే టెక్నాలజీ ఇంకా రాలేదట. వాళ్ళకే తెలీనిది బియ్యే చదివిన నా భార్యకెలా తెలుస్తుంది? ఈ విషయాలన్నీ అందర్లోనూ చర్చిస్తున్న మా అమ్మ ఇలాంటి సమస్యకి పరిష్కారం ఎందుకు కనిపెట్టలేకపోయింది? పరిష్కారంలేని విషయంమీద గొడవపడితే కొత్తసమస్య పుట్టుకొచ్చింది. రెండోపిల్ల పుట్టినప్పుడే పోన్లెమ్మని వదిలిపెట్టేసి వుంటే ఈ కవలపిల్లల పుట్టుకకి అవకాశం మూతపడేది.
నలుగురిలో ఇద్దరు ఇప్పటికే పెద్దయారు. వాళ్ళని చూస్తుంటే విజయావాళ్ళ వెన్నెలా, చందమామా గుర్తొస్తాయి. అంత అందమైనవాళ్ళు. తెలివితేటలున్నాయి. చురుగ్గా వుంటారు. చక్కగా పెంచుకుంటున్నాం. ఒక ప్రశ్న అడిగారు-
నాన్నా, మనందరినీ మామ్మా తాతయ్యా ఎందుకు తిడుతూ వుంటారు- అని.
మళ్ళీ యిక్కడ నా చదువూ, నాలెడ్జీ ఎందుకూ పనికి రాలేదు. వాళ్ళకి చదువులో ఏ సందేహాలొచ్చినా నన్నే అడుగుతారు. అవేకాదు, పక్షి ఎలా ఎగురుతుందో, రాయి నీళ్లలో పడేస్తే ఎందుకు మునుగుతుందో ప్రతీదీ వివరించి చెప్పాలి. నాకు అన్నీ తెలుసని వాళ్ళకి గొప్ప నమ్మకం. క్రికెటు, ఫుట్‌బాల్, చెస్ సమస్తం వచ్చనుకుంటారు. వాళ్ళకి నాన్నంటే పెద్ద హీరో. ఈ ఒక్క ప్రశ్నకీ జవాబు చెప్పలేని జీరో అని తెలీదు.
కొత్తగా పుట్టినవాళ్ళని యిద్దర్నీ దెయ్యాలంది. నాన్న చావుకి వీళ్ళే కారణంట. వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదన్నంత కోపం పెంచుకుంది. కానీ వీళ్ళని చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది నాకైతే. మనుషుల్ని చంపడానికి పుట్టుకొచ్చినవాళ్లలా అసలే అనిపించట్లేదు. ప్రపంచంలోని వింతల్లో ఒకటి నాయింట్లో ఆవిర్భవించిందనుకుంటాను. ఇద్దరూ ఒకేలా వున్నారు. ఒక రాత్రంతా వాళ్లని చూస్తూ కూర్చున్నాం, ఎవరు ఎవరో కనిపెట్టాలని. దొరకలేదు. రేపు పెద్దయ్యాక ఎవరెవరో చెప్పుకొమ్మని వీళ్ళుకూడా నా తెలివిని ఛాలెంజి చేస్తారేమో!
నలభై యాబైలక్షలు. ఆయన జీవితకాలంపాటు సంపాదించినదీ, పదేళ్ల నా సర్వీసులో మిగిల్చిందీ అన్నీను. ఏది చేసినా యిద్దరూ కలిసి చేసారు. నన్నూ, నా భార్యనీ, పిల్లల్నీ తిట్టినా ఒకళ్లకొకళ్ళు మాటలు అందించుకున్నట్టు తిట్టేవాళ్ళు. ఈ విషయంలో అమ్మకికూడా చెప్పకుండా చెయ్యడమేంటి? అంతా తనదేనన్న అహంకారమా? ఆవిడకూడా ఏడుస్తోంది. ఇంక నాకు పాతికేళ్ల సర్వీసుకూడ లేదు. మా నాన్న నాకు ఇవ్వద్దనుకున్నారు. కాబట్టి బాధలేదు. ఇంక నా పదేళ్ళ సంపాదనలోంచీ ఆయనకి యిచ్చింది నాలుగైదు లక్షలుంటుంది. నా చదువుకీ, తిండికీ, ఖర్చులకీ ఆపాటి పెట్టి వుంటార్లే. ఇలా అనేసుకున్నాక నాదంటూ పోయిందేం లేదని అర్థమౌతోంది.
ఆయన ఆ డబ్బంతా ఏం చేసారనేది ఒక సమస్యైతే దానికన్నా పెద్దసమస్య సమీర. దానికి మంచికట్నమే యిచ్చి చేసారు. అది చాలా తెలివైనది. ఇండిపెండెంట్. తను ఆడపిల్లా, నేను మగవాడినీ కాబట్టి నేను కానుకలు యివ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. సుమతిని చూసి నేర్చుకుంది. నువ్వెంతో నేనూ అంతే అన్నట్టుండేది. వాళ్ళ ఇన్స్టిట్యూటు దానిమీదే నిలబడిందంటే అతిశయోక్తి కాదు. ఐనా దాన్ని పరాన్నజీవిని చేసారు. నా భార్యమీద అమ్మకి కోపం. అందుకని వాళ్ళు అడక్కపోయినా వెళ్ళి కానుకలు కుమ్మరించి వచ్చేది. వాళ్ళు వాటికి అలవాటుపడిపోయారు. ఇప్పుడు నేను నాపిల్లలతోపాటు దానికోసంకూడా సంపాదించాలా? ఇంట్లో సగంవాటా దానిదన్నారు. ఇప్పుడా యిల్లే లేదు. వాళ్ళెలా రియాక్టౌతారు? అంతకన్నా పెద్దసమస్య ఇంకోటి. అతను అమ్మాయిల్తో ఫ్లర్టింగ్ చేస్తాడు. ఇది బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ తిరుగుతుంది. ఒకటి రెండుసార్లు బైటపడి నాన్నకి చెప్పింది. అతనికి నాన్నంటే కాస్త భయం, పెట్టే మామగారన్న భక్తీ వున్నాయి. ఇప్పుడు ఆయన లేడు. మరి ఈ చేతకాని, నలుగురు ఆడపిల్లల్ని కన్న, చచ్చు, పుచ్చు తెలివితక్కువ దద్దమ్మ బావమరిది మాట అతను గౌరవిస్తాడా? దాని కాపురం ఏమౌతుంది? ఇవేవీ ఆయన ఆలోచించలేదా? కోటలు కడతానని అతన్నీ నమ్మించాడా? వాళ్ళకేం జవాబు చెప్పను? అమ్మనేం చెయ్యను? ఆయిల్లుంటే పెన్షను పెట్టుకుని ఆవిడ ఓ వాటాలో వుంటే అందరం ప్రశాంతంగా వుండేవాళ్లం. ఇప్పుడేంటి? అంత ద్వేషంతో రగిలిపోతున్న మనిషిని యింట్లో ఎలా తెచ్చిపెట్టుకుంటాను? తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ ఎంతకాలం కలిసి బతగ్గలం?” ఆగాడతను. ఊపిరిపీల్చుకున్నాడు.
“మగవాడివి, నువ్వు ధైర్యం కోల్పోతే ఎలారా? పెళ్ళిళ్ళు చేసుకుని, నట్టేట ముంచేసి, మీదారి మీరు చూసుకుంటామంటే మిమ్మల్ని ఆశ్రయించుకుని వున్నవాళ్ళు ఏం కావాలి? మామయ్య, నేను, సంధ్య, మహీ అందరం కష్టపడ్డవాళ్లమే. అసలే కష్టాలు లేకుండా ఎవరూ లేరు. కొన్నిసార్లు ఏటికి ఎదురీదక తప్పదు. చచ్చాక సాధించడానికేం వుంటుంది?” అంది లక్ష్మి.
“వసంత్ నాన్న అలా పోయారంటే నాకు బాధలేదా? దానికి పిల్లలేం చేసారు?
రెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ళు దెబ్బలాడితేనే-
మనవడు కావాలని కోరిగ్గా వుందేమో, మరోసారి చూద్దాం- అన్నాను.
మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయం వుండేది. ఐనా రిస్కు తీసుకోవాలనుకున్నాం. ఇలా ఇద్దరు పుడతారనుకోలేదు. పుట్టేసాక ఏం చెయ్యగలం? వసంత్‌కి కోపం వచ్చిందేమోననుకున్నాను. సరదాగానే తీసుకున్నారు. జోక్స్ వేసారు. మరేం పర్వాలేదు, చదువు చెప్పిస్తే మిగతావన్నీ అవే దార్లో పడతాయన్నారు.
మాకందరికీ మగపిల్లలున్నారు. కలుపుకుంటాం- అని తులసీ వల్లీ సమీరావాళ్ళన్నారు.
ఎప్పటిమాటో! ఐనా అందరూ వున్నారని ధైర్యంగా అనిపించింది. నన్నిటు తీసుకొచ్చారు. మీరంతా వున్నారన్న ధైర్యం వచ్చింది. ఎవరు ఎందరున్నా, యీయనతో సమానం కాదుకదా? తను బలవంతంగా ప్రాణంతీసుకుంటే వచ్చే డబ్బూ, వుద్యోగం నేనేం చేసుకోను? నేనెవరికి చెప్పుకుని ఏడవను?” పెద్దగా ఏడ్చింది మానస.
“ఊరుకోవే, వూరుకో! డబ్బులేని యింట ఆడపిల్లలుగా పుట్టడం యింత నేరమౌతుందని మాకు తెలిసుంటే అసలీ పెళ్ళికి ముందుకి వచ్చేవాళ్లమేకాదు” అంది కమలాక్షి తనూ ఏడుస్తూ.
“నీలిమా! ఐపోయిన పెళ్ళికి బాజాలెందుకే? మీ అమ్మనీ, చెల్లినీ ఏడుపాపమను” అన్నాడు మాధవ్.
“వసంత్! తన కష్టం సుఖం చూడాల్సింది నువ్వేకదా? వదిలేసి నీదారి నువ్వు చూసుకుంటానంటే ఎలారా? చావుతో సమస్యలు తీరిపోవు. నువ్వు బైటపడతావేమోగానీ మానసకి రెట్టింపౌతాయి. ఒక్క పిల్లని పెంచడానికి మహీ నానాతిప్పలూ పడుతోంది. ఇది నలుగుర్ని పెంచగలదని నువ్వెలా అనుకున్నావు? భార్యాభర్తలు, అమ్మానాన్నలు ఇద్దరు విడివ్యక్తులుకాదు. ఆ రెండోమనిషి లేని కుటుంబం అసంపూర్ణంగా వుంటుంది. నువ్వేం వంటరివాడివి కాదు. మనం పదకొండుమందిమి. వదిలేస్తామని ఎలా అనుకున్నావు? ఏరా, నమ్మకం పోయిందా, మామీద?” అతని కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది గీత. ఎందుకందో అర్థమై తలదించుకున్నాడు.
“లేదు గీతా! ఎలాంటి ఆశలూ, నమ్మకాలూ, మమకారాలూ, బంధాలూ పనిచెయ్యని స్థితిలోకి వెళ్ళిపోయాను. మనిషి వంటరిగానో, తన కుటుంబం అని గిరిగీసుకునో బతకలేడు. పరిస్థితులు బావున్నవరకూ పర్వాలేదు. ఇలా ఎదురుతిరిగినప్పుడు ఎక్స్టెండెడ్ ఫామిలీ, సపోర్టుసిస్టం కావాలి. ఆమ్మ ఆరోజుని వీళ్లని ఇక్కడికి వెంటబెట్టుకుని రాకపోతే అందరం అదే యింట్లో వుండి దెబ్బలాడుకుంటూ, తిట్టుకుంటూ విసిగిపోయి వుండేవాళ్లం. ఈపాటికి నేను ఎప్పుడో పేపర్లో వార్తగా మారిపోయి వుండేవాడిని” అన్నాడు.
“సమీర గొడవేంట్రా? మాకెవరికీ తెలీదు?” అడిగింది గీత.
“తెలీదు గీతా! బావొచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ పంపలేదు”
“అంత సంస్కారం లేనివాళ్ళు కాదు వసంత్! వాళ్లందరితో చాలాసార్లు మాట్లాడాను. మంచివాళ్ళలానే అనిపించారు. మామ్మ పోయినప్పుడు కూడా వచ్చారు” అంది.
“అదంత తక్షణసమస్య కాదు గీతూ! వీళ్ళగొడవ తేల్చాలి ముందు. వసంత్! ఈ కుటుంబం నీది. మీ అమ్మది కాదు. మానసని చివరిదాకా వదిలిపెట్టనని ప్రమాణాలు చేసి, తాళికట్టి పెళ్ళిచేసుకున్నది నువ్వు. మా నాన్న ఇంట్లోంచీ వెళ్లిపోయినప్పుడు మామ్మ అడిగింది.
నీకే పట్టనప్పుడు నీ సంసారాన్ని సాది సంతరించాల్సిన అవసరం నీ భార్యకేమిటి- అని.
అదే రూల్ నీకూ వర్తిస్తుంది. పెళ్ళిచేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వాళ్లని చివరిదాకా చూసుకోవలసిన బాధ్యత నీదే. పిచ్చిఆలోచనలు చెయ్యకు. మేమంతా వున్నాం. నాలుగురోజులు మీరొచ్చి వున్నంతమాత్రాన మాయిల్లేం అరిగిపోదు. డబ్బు కావల్సినా సర్దుతాను. నీకు జీతం వస్తుంది. పిన్నికి పెన్షనొస్తుంది. ఆవిడ డబ్బు ఆవిడకి వదిలెయ్. సమీరకి పెట్టుకుంటుందా, పెట్టుకోనీ. ఆవిడ సృష్టించిన సమస్యలోంచీ ఆవిడే ఇవతలికి రావాలి. నువ్వింక ఎవరికీ పెట్టక్కర్లేదు. నాలుగురోజులు ఇక్కడే మాట్లాడకుండా కూర్చో. అన్నీ దార్లో పడతాయి. మొదట్నుంచీ ఆవిడ పేచీమనిషే. నువ్వూ పేచీపడాలి. నిక్కచ్చిగా చెప్పెయ్, నీ భార్యాపిల్లలని అంటే వూరుకోనని. బాబాయ్ వున్నప్పుడు ఆయన ఆవిడకి ధైర్యం. ఇప్పుడాయన పోయాడు. నీమీద పట్టు బిగించాలని చూస్తుంది. సాగనివ్వకు. ఆవిడ్ని అమర్యాద చెయ్యమని చెప్పను. కానీ భార్యాపిల్లలు ముఖ్యం. చేసుకున్నాక భార్యనీ, కన్నాక వాళ్లనీ మధ్యలో వదిలేస్తామంటే కుదరదు” అన్నాడు వాసు.
“నువ్వుకూడా అక్కడినుంచీ వచ్చెయ్యరా! నెలాఖరుదాకా ఇక్కడుండండి అందరూ. మాయింట్లో పోర్షనుఖాళీ చేయిస్తాను. కొన్నాళ్ళుండి కుదుటపడ్డాక తిరిగి వెళ్దువుగాని.
నీకు మాతో పడట్లేదు. పిల్లలు పెద్దయేదాకా మాకొకరి సాయం కావాలిగాబట్టి మా అత్తమామల్ని తెచ్చుకుంటాను. నువ్వెక్కడవుంటావు- అని అడుగు, ఆవిడే దారికొస్తుంది” అన్నాడు మాధవ్.
లేచి లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆవిడ వొళ్ళో తలపెట్టుకుని కిందే కూర్చున్నాడు. “థేంక్యూ సో మచ్ ఆమ్మా!” అన్నాడు.
“ఎంత హడలగొట్టేసావురా? నిన్నూ నీ వాలకాన్నీ చూసి పై ప్రాణం పైనే పోయింది. చచ్చేం సాధిస్తావురా?” అంది అతని తలనిమురుతూ. ఎముకలపోగులా తయారైన అతన్ని చూసి కళ్లలో నీళ్ళు తిరిగాయి. కన్నతల్లి దగ్గర దొరకని ఓదార్పు లక్ష్మిదగ్గిరా, తనింట్లో లేని ప్రశాంతత ఇక్కడా దొరికాయి అతనికి. మానసకికూడా అదే అనిపించింది. పెద్దగండం గడిచి బైటపడ్డందుకు దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కిందో. పెనుఫాను వెలిసినట్టైంది. ఆఖరిక్షణాన మనసు మారి ఇటు రాకపోతే ఏమై వుండేదని వూహించడానికికూడా ఎవరికీ ధైర్యం చాలలేదు.
“పిల్లల్ని తీసుకురావే మానసా! ఎవరి తెలివి ఎంత వుందో చూద్దాం” అన్నాడు మాధవ్. ఆమె కళ్ళుతుడుచుకుని లేచింది.
నీలిమ ఒకరినీ, మానస ఒకరినీ తీసుకొచ్చారు. సోఫాలో పడుక్కోబెట్టి ఎంత పరీక్షగా చూసినా తేడాలు దొరకలేదు. ఇద్దరూ ఒక్కలా వున్నారు. మోనో జైగాటిక్ ట్విన్స్.
“నీకెలా తెలుస్తోందే?” అడిగింది నీలిమ.
“అమ్మకదే, గుర్తుపడుతుంది” అంది మాధురి.
“అంతేమీలేదు, గుర్తుపట్టడానికి ఒకళ్ళ అరికాలిమీద అగరుచుక్క పెడుతున్నాను. నిన్న ఒక పాపాయికి పాలిచ్చి, తెలీక మళ్ళీ దానికే యివ్వబోయాను. అదేమో తాగకుండా ఏడుపు, రెండోదేమో ఆకలికి ఏడుపు. కడుపునొప్పనుకుని ఇద్దరికీ గ్రైప్వాటరు పట్టాను. అప్పుడొచ్చింది కాస్త తెలివి” అంది.
“వసంత్ చిన్నప్పటి జుబ్బాలున్నాయి. వేస్తావా?” కుతూహలంగా అడిగింది గీత.
“ఇంకా వున్నాయా?” ఆశ్చర్యంగా అడిగింది మానస.
“వదిన చాలా జాగ్రత్తగా దాస్తుంది. మయూ మా అందరి బట్టలూ వేసుకునే పెరిగాడు. మరీ పొలంకొనుకున్నవాడికి స్వంతచొక్కాలు లేకపోతే ఎలాగని విహీ టైముకి కొనిచ్చాం” అన్నాడు మాధవ్. మనసులు తేలికపరిచేమాటలు మరికొన్ని సాగాక అందరూ నిద్రలకి వుపక్రమించారు. వాసు, మాధవ్ వంతులమీద వసంత్‌కి కాపలాకాస్తూ వుండిపోయారు.
గీతకి నిద్ర రాలేదు. సమీర విషయం బాగా కలవరపెట్టింది. చిన్నజ్ఞాపకం. దానికి సంబంధించిన చిన్నదు:ఖం. ఎప్పుడో కాలంలో కరిగిపోయిందిగానీ, ఈరోజు మళ్ళీ బయటపడింది. అద్దంముందు నిలబడింది. తను వాసు పక్కని సరిపోతుందా? ప్రశ్న. కన్నీటిబొట్టొకటి జారిపడింది. వెంటనే తుడిచేసుకుని, బీరువాలోంచీ ఆల్బమ్స్ తీసి చూస్తూ కూర్చుంది.
“ఇంకా పడుక్కోలేదేమే?” అని వాసు కేకేస్తే వాటిని పక్కని పెట్టి నిద్రకి వుపక్రమించింది.
మర్నాడు పొద్దున్న మాధవ్ రవికి ఫోన్‌చేసి, జరిగిన విషయం చెప్పాడు. వెంటనే బయల్దేరి వస్తున్నట్టు చెప్పాడతను. ముందురోజు రాత్రి గీత యిచ్చిన బట్టలేసుకుని, వాటిమీదే భార్యనీ, పిల్లల్నీ, వాళ్లతోబాటు అత్తగారినీ వెంటబెట్టుకుని హాస్పిటల్‌కి బయల్దేరాడు వసంత్, మాధవ్‌తో కలిసి. మానసకి వంటికి కొద్దిగా నీరుపట్టింది. పిల్లల్నికూడా ఒకసారి చూపించాలనుకున్నారు. వసంత్ ఇల్లు దాటి వెళ్ళీవెళ్లగానే పద్మ దగ్గిర్నుంచీ ఫోనొచ్చింది. వాసు ఎత్తాడు.
“నాతో దెబ్బలాడి నిన్న అర్ధరాత్రి ఇంట్లోంచీ బైటిపడ్డవాడు ఇప్పటికింకా అజా ఐపూ లేడు. దాన్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చాడా? ఒకసారి ఫోనివ్వరా. దిక్కులేనిదాన్ని వదిలేసినట్టు నా మానాన్న నన్ను వదిలేసి వెళ్లిపోయారు భార్యాభర్తలిద్దరూను” అంది.
“అంత అర్ధరాత్రి వాడు వెళ్తుంటే నువ్వెలా వెళ్లనిచ్చావు పిన్నీ?” అడిగాడు వాసు.
“ఉందికదా, మహమ్మారి? అది పిలిపించుకున్నట్టుంది. వీడు పరిగెత్తాడు. నేను వెళ్లనివ్వడం ఎక్కడిది?”
“వాడింట్లో లేడు. మానసని డాక్టరుదగ్గిరకి తీసుకెళ్ళాడు. అమ్మని తీసుకుని మామయ్య వస్తున్నాడు. మాట్లాడతాడట” అన్నాడు ఫోన్ పెట్టేస్తూ.
రవి వచ్చాక అతన్తో కలిసి లక్ష్మి వెళ్ళింది. ఇంకెవర్నీ వద్దన్నాడు రవి. అక్కడ మాట్లాడే విషయాలు ముగ్గురాడపిల్లలకీ వాళ్ళతండ్రికీ వివరంగా తెలియకూడదు. తెలిస్తే ఇంక ఎవ్వరినీ కాపురాలు చెయ్యనివ్వడు ఆయన.
వాసు, గీత ఆఫీసుకి వెళ్ళిపోయారు. ఇంట్లో నీలిమ, మాధురి మిగిలారు. పిల్లలు ఆడుతున్నారు.
“అబ్బ! రాత్రంతా నిద్రలేదు మాధురీ! పెద్ద గండం గడిచి గట్టెక్కాం. నువ్వు కాసేపు వీళ్ళని చూసుకో, నేను పడుక్కుంటాను. తర్వాత నువ్వు రెస్టు తీసుకో” అంటూ నీలిమ నిద్రకి వొరిగింది. మాధురి ఇల్లంతా తిరుగుతూ గీత గదిలోకి వచ్చింది. ఆమె రాత్రి సగం చూస్తూ మళ్ళీ లోపలపెట్టడం మర్చిపోయిన ఆల్బంమీద మాధురి దృష్టి పడింది. ఫామిలీ ఆల్బమ్స్ చూడటమేగానీ, పర్సనల్ ఆల్బమ్స్ ఎప్పుడూ చూడలేదామె. కూతూహలంగా తీసుకుంది.
మై లవ్స్ జర్నీ. ఆల్బంకి పేరుకూడా పెడతారా? వింతగా అనిపించింది.
గీతా వాసుల ఫోటోలు. జాగ్రత్తగా అందంగా అమర్చినవి. ఒకొక్క ఫోటో తదేకంగా చూస్తూ వుండిపోయింది. ప్రహ్లాద్‌కి తనంటే యిష్టమే. కానీ ఇలాంటి ఆరాధన లేదు. భావుకత్వం లేదు. జీవితమంటే రూపాయకి నూరుపైసలూ జీవితమే అతనికి. సరదాగానే వుంటాడు. నవ్వుతాడు, నవ్విస్తాడు. డబ్బు తెచ్చి తన చేతికే యిస్తాడు. ఖర్చులూ దాపరికాలూ తనవే. పిల్లల చదువులూ, హోంవర్కూ తనకే. మొదట్లో ముతగ్గానే వుండేది తను. పైసపోతే ప్రాణం పోతుందనిపించేది. అతన్ని చులకనగా చూసేది. అది చులకనగా చూడటమని తనకి తెలీదు. తల్లీతండ్రీ ఎలా వుంటారో తనూ అలాగే వుండాలనుకుంది. అత్తమామలని దూరంగా పెట్టింది. వల్లితోటీ తనకి పెత్తనంతప్ప అనుబంధం లేదు. ఇప్పుడింక ప్రహ్లాద్ ప్రొఫెషన్లో బిజీ. తనని పెద్దగా పట్టించుకోవడం మానేసాడు. సంపాదించి పోస్తున్నాడు. అది చాలా? తనెందుకుంది ఇక్కడ? ఈ మనుషులమధ్య సందడి వెతుక్కుంటూ వచ్చింది. తనింట్లో ఎందుకు లేవు? మనసు లోలోపల ఎక్కడో చిన్న కదలిక.
పద్మ ఇంట్లో రాజశేఖరం అన్నగారూ, ఆయన భార్యా, యిద్దరు చెల్లెళ్ళూ వున్నారు. వాళ్లందరిముందూ కొడుకుని అవమానించింది ఆవిడ. ఈ పరిస్థితులన్నీ ఇలా జరకుండా ఆపగలిగీ ఆపలేదన్న అభియోగం చేసారు అందరూ కలిసి. ఈ నెలపొడుగునా జరిగిన గొడవ వేరు, ముందురోజటిది వేరు.
“తిరుగుతూ తిరుగుతూ వున్న మనిషి ప్రాణం తియ్యడానికి పుట్టుకొచ్చిన దయ్యాలు అవి రెండూ. మనింట్లో ఎప్పుడూ కవలలు పుట్టలేదు. ఒక్కమనిషి ప్రాణం తియ్యడానికి ఇద్దరు పుట్టుకొచ్చారు. వాళ్ళని నెత్తికెత్తుకుని తిరుగుతున్నావు. నాకింత అన్నం వుడకేసి పడేసే దిక్కేనా లేకుండా నీ భార్యని లక్ష్మితో ఎందుకు పంపించావు? అదేం అబ్బురాల సుబ్బికాదు, పని చేస్తే రోగం రావడానికి. ఆ దద్దమ్మ తెలివికి నలుగురాడపిల్లలు. దాని తల్లికి ముగ్గురు ఆడపిల్లలు. ఒక్కదాన్ని చేసుకోవడానికి ముందుకెళ్తే ఇంకో యిద్దరిని వలేసి పట్టుకున్నాడు మీ మామ. నీకూ అదే గతి పట్టించింది” అంది.
అతనికి సహనం చచ్చిపోయింది. ఒళ్ళూ పై తెలీని ఆవేశంతో యింట్లోంచీ బైటపడ్డాడు. రైల్వే ట్రాక్దగ్గిరకి వెళ్ళేంతలో భార్యాపిల్లలపట్ల మమకారం అటు లాగింది. లేకపోతే ఈరోజుని పద్మకి ఏడవడానికికూడా శక్తి వుండేది కాదు. ఆవిషయం తెలీక ఇంకా ఆవిడలో వైమనస్యం. ఎవరెవరు వస్తున్నారు, ఏం మాట్లాడతారు? మానసకేమైంది? తనేదో అందని నాటకాలా? వసంత్ రాకుండా వీళ్ళని పంపడమేమిటి? తాత చావుకి కారకులని కవలలనీ, మానసని లక్ష్మితో పంపించినందుకు కొడుకునీ, వెళ్ళినందుకు ఆమెనీ బానే మాటలంది కొడుకుదగ్గిర. ఆ మాటలకి కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి, మొహం చూపలేక రాయబారానికి పంపిస్తున్నట్టున్నాడు!
రవి, లక్ష్మి రావడం, పలకరింపులూ అయ్యాయి. రాజశేఖరం పోయిన దు:ఖం, అతను పోయి ఇంకా నెలేనా అవలేదన్న ఆలోచన, అంతలోనే ఇలా రావసిన అవసరం బాధనిపించాయి ఇద్దరికీ. అక్కడున్న అందరి మనసులూకూడా విచలితమయ్యాయి. చనిపోయినమనిషి ఎవరికీ పరాయివాడు కాదు. పరిస్థితులు పరిస్థితులే, దు:ఖం దు:ఖమే. వీళ్ళిద్దరే రావడంచూసి కాస్త తేలిగ్గా వూపిరి పీల్చుకుంది పద్మ. వాసు, మాధవ్ల్లో ఎవరొచ్చినా వాళ్ళడిగేవాటికి సంజాయిషీ యిచ్చుకోలేదు తను.
“మాయింట్లో నా తర్వాత ఇంజనీరింగు చదివింది వీడొక్కడే. నా ఆఖరి మేనల్లుడు.
లంచాలూ, కట్నాలూ తీసుకోకపోతే భార్యాపిల్లలని పోషించలేని నిర్వీర్యమైన స్థితిలో వున్నారా మగపిల్లలు- అని చాలా బోల్డ్‌గా అడిగిన యంగ్ హీరో వాడు. అలాంటివాడు రైలుకింద తలపెట్టి ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. పద్మా! అర్థమౌతోందా? నిన్నరాత్రి వాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఆఖరినిముషంలో మనసు మార్చుకుని వీళ్ళింటికి వచ్చాడు” అన్నాడు రవి.
ఆవిడ ముఖం వెలతెలబోయింది. తలమీద పెద్ద పిడుగు పడ్డట్టైంది. “అదేంట్రా? అంత కష్టం వాడికేమొచ్చింది?” అడిగింది నమ్మలేక.
“విసుగొచ్చింది” గట్టిగానే అన్నాడతను. “పోయినమనిషి వాడికి తండ్రి. వాడికీ బాధ వుంటుందని నీకెందుకు అర్థమవ్వదే? మేలుచెయ్యడం అటుంచి ఉన్నదంతా తగలేసి పోయాడు బావ. ఇక వాడి జీవితం వాడు చక్కదిద్దుకోవలసిందేకదా? ఆ ప్రయత్నంలోనే వున్నాడు. తిట్లూ దెబ్బలాటలూ కాదు వాడికిప్పుడు కావలిసింది. కుదురైన జీవితం. అది అమిరితే భార్యని ఏ వుద్యోగంలోనో పెట్టుకుంటాడు. నీకేమో వాళ్ళతో పడదు. నానామాటలూ అంటున్నావు. అంతంత మాటలనుకుంటూ ఒకే యింట్లో వుండటం దేనికి? నువ్వెక్కడుంటావే, మరి? నా దగ్గిరకో, అన్నయ్యదగ్గిరకో వస్తావా? మీ అత్తారింటికి వెళ్తావా? అక్కడ నీకు ఇల్లేనా జాగాయేనా వుందా?” అన్న రవి ప్రశ్నలకి వెలతెలబోయింది.
“అదేదో మత్తుమందు జల్లింది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాడికి” అంది కోపంగా.
“ఔనమ్మా! మీరంతా మత్తుమందులు జల్లితేనే మేం కాపురాలు చేసాం, పిల్లల్ని పెంచుకున్నాం, మీ మాట విన్నాం” అన్నాడు వెటకారంగా. “బావ చావుకీ కవలల పుట్టుకకీ ఏమైనా సంబంధం వుందా పద్మా? చదువుకున్నావు, పెద్దచదువులు చదివిన ఇద్దరు పిల్లలకి తల్లివి. రోజులు చాలా మారాయి. తెలుసుకోవే. అన్నిరోజులూ మనవి కాదు. వీణని తీసుకొచ్చి కేసు పెట్టాం చూడు, అలాంటి కేసు నీమీద మానసచేత పెట్టిద్దామనుకుంటున్నాడు. వెళ్ళి జైల్లో కూర్చుంటావా? చట్టాలూ, రూల్సూ, రెగ్యులేషన్సూ అన్నీ తెలుసు వాడికి. ఎవరెవరు ఎంతెంత ఎలా సంపాదించిందీ వాడికి తెలీదా? తెలుసుకోవడం ఎంతపని? మర్యాద యిస్తున్నారుకదాని చేటు చేసేదాకా ఎవరినీ విసిగించకూడదు. వాడి ఆలోచనేంటో నీకు చెప్పాను. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో ఆలోచించుకుని చెప్పు”
నిర్ఘాంతపోయిందామె. రాజశేఖరం చెల్లెళ్ళకీ, అన్నగారికీ కత్తివేటుకి రక్తం లేనట్టు ముఖాలు పాలిపోయాయి. సంబంధం లేని విషయాల్లో అతిగా దూరితే ఎలా వుంటుందో అర్థమైంది.
లక్ష్మి చెల్లెలి భుజంమీద చేయ్యేసి అంది.
“వాళ్ళ పెళ్ళై పదేళ్ళైంది. ఇంకా ఆ పిల్లని కోడలనుకోకపోతే ఎలానే? చూస్తుండగా తరాలు గడిచిపోతున్నాయి. నిన్నటిదాకా యింట్లో పెత్తనం చేస్తూ తిరిగాను. ఇప్పుడు గీత నా స్థానంలోకి వచ్చింది. పోనీ అదేమైనా శాశ్వతంగా అలానే వుండిపోతుందా? రేపు దానికి కోడళ్ళొస్తారు, పక్కకి జరుపుతారు. ఎందుకే, నీకీ కోపం? ఏం తక్కువని? అతనొక తప్పుమాటంటే సర్దిచెప్పాల్సింది పోయి, సమర్ధించావు. ఎవరంతటివాళ్ళు వాళ్ళు. ఎవరిళ్ళు పడగొడతామంటే ఎవరు వూరుకుంటారు? భార్యాపిల్లల్ని తిడితే వసంత్ వూరుకుంటాడా? నిన్న వాడెలాంటి స్థితిలో వచ్చాడో తెలుసా? నిజంగా ఏదేనా జరిగితే మానసకీ పిల్లలకీ జవాబు చెప్పగలవా? పోనీ, నీకు సంతోషంగా వుండేదా? రెప్పకి తెలీకుండా కనుగుడ్డు తీసేసినట్టు నీ భర్త యిల్లు అమ్మేస్తుంటేనే కనిపెట్టలేకపోయినదానివి, నువ్వు పెత్తనం చేస్తానంటే ఎవరు వింటారు? అరవయ్యైదేళ్ళ మనిషి, అన్నీ కొడుక్కి అప్పజెప్పక ఇంకా ఏం సాధిద్దామనుకున్నాడు? డబ్బేమైందో ఎవరికిచ్చాడో ఒక్క వివరంకూడా దొరకట్లేదు. బైటివాళ్లందరూ కలిసి అతన్ని మోసం చేసినట్టేకదా? అతను బతికున్నా అదే జరిగేది. వాడిమీద అంత జాలి వుంటే సమీరకి నచ్చజెప్పి, యిల్లు వాడికివ్వాల్సింది. ఏమే, మీ చేతుల్లో వున్నది చెయ్యడం మానేసి, వాడేదో చెయ్యలేదని బాధపడ్డమేమిటి? నీ కోడలికేం తక్కువ పద్మా? బంగారుబొమ్మలా వుంటుంది. అంత చక్కటిపిల్లలు మనింట్లో లేరనేకదా, అరుణా, నేనూ కోడళ్ళుగా తెచ్చుకున్నది? అలాంటి పిల్ల తన నట్టింట్లోనూ తిరిగాలనుకున్నాడు వాడు. నలుగురు దేవకన్యలని తనతో దింపుకొచ్చింది పిల్ల. చదువులు చెప్పిస్తే పెళ్ళిళ్ళు ఎంతలో మాట? ముప్పైలు దాటి నలభైలకి దగ్గిరపడుతున్నవాడు, ఎలా బతకాలో వసంత్‌కి తెలీదా? మీ పెళ్లైన కొత్తలో రాముమీద అలిగి నీ భర్తని తీసుకుని మాయింటికి స్వతంత్రంగా వచ్చేదానివి. అతనూ మాయింట్లో కలిసిపోయి తిరిగాడు. అవన్నీ ఎలా మర్చిపోయారు? ” అడిగింది.
తమ్ముడేమో మొత్తి మాట్లాడుతున్నాడు, ఈవిడేమో మెత్తగా మాట్లాడుతోంది. వసంత్ తనమీద కేసు పెట్టడమేమిటి? ఇలాకూడా వుంటుందా? న్యాయం, ధర్మం నిద్రపోతున్నాయా? తల తిరిగిపోయింది పద్మకి. చాలాసేపు మాట్లాడి వెళ్లారు లక్ష్మీ, రవీ.
“వాడంత చావుకి తెగించాడంటే మనసు ఎంత విరిగిపోయి వుంటుందో నేను వూహించగలను. అలాంటివాడు నీతో కలిసి వుండటం కల్ల. నువ్వెప్పుడొస్తానంటే అప్పుడు నాకు ఫోన్ చెయ్యి, వచ్చి తీసుకెళ్తాను. మాయింటికి వచ్చి కొన్నాళ్ళుండి ఏ విషయం ఆలోచించుకో పద్మా!” వెళ్ళేముందు అన్నాడు రవి.
ఇద్దరూ వెళ్ళిపోయాక పద్మ చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది.
“మంచి చెప్పబోతే మరేదో వచ్చి తలకి చుట్టుకుందని మా ఆస్తులు లెక్కకి తీయిస్తాడటనా, నీ కొడుకు? భలే పెంపకం వదినా! అంత తప్పుడు పనులు మేమేం చేసాం? లోకంలో వున్నదేకదా? మాకిచ్చినవాళ్ళు, వాళ్ళు తినరా?” అంది ఒక ఆడబడుచు.
“పనులు చేయించుకోవడానికి పైసో పరకో చేతిలో పెడతారు. వాటితోనే ఆస్తులు పోగుపడతాయా? ఎంత కష్టపడితే వస్తాయి యిళ్ళూ వాకిళ్ళూ? తినీ తినకా పోగుచేసాం” అంది మరో ఆడబడుచు.
“కేసులదాకా వద్దులేమ్మా! తమ్ముడు వీడిగురించే దిగులుపడేవాడు. నాలుగు మంచిమాటలు చెప్తే అర్థంచేసుకుంటాడనుకున్నాను. ఇలా ఎదురుతిరుగుతాడు, ప్రేమలూ అభిమానాలూ చంపుకుని మాట్లాడతాడనుకోలేదు. పెట్టిందీ చేసింది లేకపోయినా, మొదట్నుంచీ మీ పుట్టింటివాళ్ళ పెత్తనమే ఎక్కువ మీయింట్లో. వాడు మీవాళ్ళు చెప్పినట్టే వింటాడు. వాళ్ళు ఆడించినట్టే ఆడతాడు. బైట ఎన్నో కేసులు వింటున్నాం. అవన్నీ మగపిల్లలమీద భార్యలు పెట్టినవి. పదిలక్షలూ పాతికలక్షలూ కోడళ్ళకి మనోవర్తిగా ఇచ్చేసి, కొడుకుల్ని విడిపించుకుంటున్నారు నీలాంటి తల్లిదండ్రులు. లేకపోతే జైలు తప్పట్లేదు. అక్కడికి నీ కోడలు మంచిదే. మొగుడ్ని వదిలేసి, నీమీదమాత్రమే పెడతానంటోంది. వాడు బతిమాలుకున్నాడేమో! ఇంకా నయం, నీ వియ్యంకుడు దేవాంతకుడు. ఆయనకీ ఆలోచన రాలేదు. వచ్చివుంటే యీపాటికల్లా కూతుర్ని విడిపించుకుని తీసుపోయేవాడు” అన్నాడు బావగారు.
రెండురోజులయ్యేసరికి ఎవరిదారినవాళ్ళు వెళ్ళిపోయారు. రవి వచ్చి, పద్మని తనింటికి తీసుకెళ్ళాడు.
“చూడు, కేసులు పెడతారని బెదిరించి మీ అమ్మనీ, మిగతావాళ్లనీ దార్లోకి తెచ్చాం. ఈ విషయం మనమధ్యనే వుండాలి. పొరపాట్నకూడా నీ భార్యకి తెలీకూడదు” అని వసంత్‌ని హెచ్చరించాడు రవి. మాధవ్, వాసు చూచాయగా గ్రహించారు.
మాధురికూడా ఇంటికి వెళ్లిపోయింది.
రెండురోజులకి యింట్లో మామూలువాతావరణం నెలకొంది. దు:ఖం, బాధ వెనక్కి పడ్డాయి.
ఈ రెండురోజులూ దాచివుంచిన మాటలు గీతనోట్లోంచీ బైటికి వచ్చాయి.
“బావా! పరాయి ఆడపిల్లల్తో సరదాగా మాట్లాడాలని నీకెప్పుడేనా అనిపించిందా” అడిగింది వాసుని. అతను తెల్లబోయాడు.
“గీతూ! అలా ప్రతీదీ మొహంపట్టుకుని అడిగెయ్యకూడదే. గమనించి తెలుసుకోవాలి. నువ్వుండగా ఎందుకనిపిస్తుంది?” అన్నాడు.
“మనింట్లో ఆడపిల్లలందరం మామూలుగా వుంటాం. అత్తలకిగానీ, మాకుగానీ పెద్ద అందచందాలేం లేవు. తులసి ఒక్కర్తీ చాలా బావుంటుంది. దాన్ని కాస్త గొప్పగా చూసేవాళ్లం. మామధ్య ఎక్కువతక్కువలు రాలేదు. బైటి పెళ్ళిళ్ళకీ ఫంక్షన్స్‌కి అత్త నన్నూ, నీలిమనీ వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు మాయిద్దర్నీ చెరోలా చూసేవారు. ఒకరిద్దరు నేనసలు నీ భార్యననుకోలేదు.
మీ పెద్దకోడలేదీ- అనడిగారు. నేనే పెద్దకోడల్నని అత్త చెప్తే ఆశ్చర్యపోయారు.
ఒకసారి అత్తే యింటికొచ్చాక నేను వినట్లేదనుకుని మాధవ్‌తో అంది-
గీతని వాసుకి చేసుకోవడంలో తొందరపడ్డాను. అప్పట్లో మనకి మామయ్యతో వున్న మొహమాటాలకి వాడలా అన్నాడేమో! నచ్చజెప్తే వినేవాడేమో- అని.
జరిగిపోయిన పెళ్ళిలో లోపాలు వెతకరు ఎవరూ. అలా వెతికితే ఏ బంధం శాశ్వతంగా వుండదు. ఏదెప్పుడు ఏ కారణానికి తెగిపోతుందోననే భయంతోనే బతికినంతకాలం గడపాలి. గీతకేం తక్కువ? చదువుకుంది, వుద్యోగం చేస్తోంది, మనందరితో ప్రేమగా వుంటోంది- అని మాధవ్ కోప్పడ్డాడు.
వాసు చకితుడయ్యాడు. తల్లి అలా అందంటే ఆశ్చర్యం కలిగింది. నమ్మలేకపోతున్నాడు. గీతని చేసుకుంటానని ఆవిడకేకదా, తను చెప్పింది? పెళ్ళికి వప్పుకుందనే వార్త తెలిసేదాకా ఎంత టెన్షనుపడ్డాడో స్వయంగా చూసింది. మర్చిపోయిందా? అదంతా ఆవిడకి ప్రేమనిపించలేదా? కాదంటే ఆ తిరస్కారానికి మాత్రమే బాధపడతాడనుకుందా? ఎన్నేళ్లకిందటో జరిగిన సంఘటన గీత యింకా మర్చిపోలేదంటే మనసులో ఎంత బాధదాచుకుందో!
“గీతూ! నాకుకదా, నువ్వంటే యిష్టం? అమ్మ ఫ్రెండ్స్‌కి కాదు. అమ్మేనా ఏదో పొరపాట్న అని వుంటుంది. ఎవరేనా తెలివితక్కువగా మాట్లాడితే కోప్పడతాం. మాధవ్ కోప్పడ్డాడు. అక్కడితో సరి. కళ్లతో చూసుకుని, బాహ్యరూపాన్ని యిష్టపడి, సాన్నిహిత్యాన్ని పెంచుకుని, ప్రేమించుకోలేదు మనం. ఇరవయ్యేళ్ళు నువ్వూ, పాతికేళ్ళు నేనూ ఒకరిచుట్టూ ఒకరం తిరుగుతూ ఇంక విడిగా వుండలేమనిపించి, పెళ్ళిచేసుకుని ఒకటయ్యాం. నువ్వు లేకుండా నేను లేను. సరేనా?” అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుని.
“ఒక్కొక్కసారి కొన్ని అహాలమధ్య ఇరుక్కుపోయిన అస్తిత్వాన్ననిపిస్తాను నాకు నేను” నెమ్మదిగా అంది.
“పొయెట్రీ వద్దమ్మా! చెప్పేదాంట్లో కాకుండా అర్థం చేసుకునేదాంట్లో వుంటుంది ఎసెన్స్”
“విను, మనచుట్టూ అందరూ మనుషులు. వాళ్ల రూపాలు కళ్లముందు కనిపిస్తూ వుంటాయి. అవి మారవు. అలానే వుంటాయి. కానీ ఒకసారి కోపంగా, మరోసారి ప్రేమగా, ఇంకోసారి పట్టనట్టుగా రకరకాలుగా మారిపోతూ వుంటారు. వాటినే నేను అహాలనేది. కోపాన్ని ప్రేమించలేం. అయిష్టాన్ని ప్రేమించలేం. ద్వేషాన్ని ప్రేమించలేం. ప్రేమ ఎప్పటికీ వుండదు. మిగిలిన భావాలతో మార్పిడి చెందిపోతూ వుంటుంది. జరిగే సంఘటనలకి మారిపోతూ వుంటుంది. ఇప్పుడు మనం దేన్ని ప్రేమించాలి? కంటికి కనిపించే రూపాన్నా? వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూపించే ప్రేమనా? లేక వాళ్ళు మనకి ఏదో ఒకటి కావడాన్నా?” అడిగింది. చాలా ఆలోచన రేపింది ఆమె అతన్లో.
“రేపు చెప్పనా?” చిన్నగా నవ్వి అడిగాడు.
“నీయిష్టం” అంది తనూ నవ్వి.
ఆమె నిద్రపోయింది. అతనికి అంత వెంటనే నిద్ర రాలేదు. ఏదో బాధ కలవరపెడితే తప్ప ఇలా మాట్లాడదు గీత. ఆమె ప్రశ్నలు అతన్ని వెంటాడాయి. ఎప్పటెప్పటి విషయాలో గుర్తొచ్చాయి.
పెద్దపెద్ద గుంపుల్నేసుకుని అల్లరల్లరిగా తిరగడమేగానీ పెద్దగా స్ట్రీట్ ఫైట్లవీ చెయ్యలేదు తామెవరూ. రాణామాత్రం ఒక రోగ్ బేచితో తిరిగేవాడు. అమ్మాయిల్ని ఏడిపించడం, వాళ్ళు అన్నకో, తండ్రికో చెప్తే ఆ అన్నలూ, తండ్రులూ వచ్చి తిట్టే తిట్లనీ, కొట్టే దెబ్బల్నీ తినడం, కొన్నిసార్లు పోలీసుకేసులుకూడా అవడం జరుగుతూ వున్నరోజులవి. మొదటిసారి గొడవల్లోకి వీడే లాగాడు. సుధీర్ యింట్లో అందరూ కూర్చుని వున్నప్పుడు రాణా గీత భుజంమీద చెయ్యేసాడు. ఎవరికీ నచ్చలేదు. అందరూ తలోమాటా అనగానే కోపంవచ్చి రాణా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకి వాళ్ళు బయల్దేరినప్పుడు మాధవ్ వసంత్‌తో వెళ్ళాడు. ప్రహ్లాద్ తనతో కొంతదూరం వచ్చి, వేరే ఫ్రెండు కలిస్తే సైకిలు దిగేసాడు. తనొక్కడే యింటికి వెళ్తున్నాడు. రాణా పదిమంది ఫ్రెండ్సుతో రోడ్డుమీద నిలబడి కబుర్లు చెప్తున్నాడు. వాళ్లంతా తనకీ తెలిసినవాళ్ళే.
“గీత నాకూ మరదలేరా!” అన్నాడు తనని చూసి. మిగతావాళ్లంతా అదేదో జోకన్నట్టు పెద్దగా నవ్వసాగారు. తన కోపం అదుపుతప్పింది.
“మనింటి ఆడపిల్ల పేరు బజార్లో ఎత్తుతావా?” అని సైకిల్ దిగి, రాణాని కాలరు గుంజిపట్టుకుని ఆ చెంపా యీ చెంపా వాయించేసాడు. ఆ కోపంచూసి, రాణాతో వున్నవాళ్లలో సగంమంది తనవైపు వచ్చేసారు. రెండు గ్రూపులుగా విడిపోయి అందరూ కలియబడి కొట్టుకున్నారు. దూరాన్నుంచీ ఎవరో వస్తుంటే సర్దుకుని ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తను సైకిలు తీసుకుని వచ్చేసాడు. ఇంటికి వెళ్ళాలంటే భయం వేసింది. పిచ్చిపట్టినట్టు సైకిలు తొక్కుతూ వూరంతా తిరిగాడు. మిగిలినవాళ్ళకి ఈ గొడవగురించి తెలిసి, కొందరు ఫ్రెండ్సుని తీసుకుని బయల్దేరారట. తనకోసం వూరంతా వెతికారట. తల్లి భయపడి చిన్నమేనమామకి ఫోన్‌చేసి విషయం చెప్తే ఆయన వచ్చి కూర్చున్నాడు. తను తిరిగితిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆయన యింట్లో వున్నాడు. బాగా తిట్టాడు.
“అరేయ్, మీ నాన్న ఎప్పుడు ఇల్లొదిలేసి పారిపోతాడో తెలీదు. ఇంటికి పెద్దకొడుకువి, వీళ్ళందరికీ తిండి పెట్టి చూసుకోవలసిన బాధ్యత నీది. మీ అమ్మ ఆశలన్నీ నీమీదే పెట్టుకుని బతుకుతోంది. చదువుకుని, వుద్యోగం తెచ్చుకునే మార్గం ఆలోచించాలిగానీ, రోడ్డునపడి యీ గొడవలేంట్రా? రాణాతో నీకేంటి? వాడెప్పుడో చెయ్యిజారిపోయాడు. వాళ్ళ నాన్నకే పట్టింపు లేదు” అన్నాడు.
“సారీ మామయ్యా! ఇంకెప్పుడూ ఇలా చెయ్యను” అన్నాడు తను.
“వాసూ! నీమీద మొదట్నుంచీ మంచి అభిప్రాయం వుంది. దాన్ని పోగొట్టుకోకు. ఏం?” అన్నాడు, తన దగ్గిరగా వచ్చి, భుజం తట్టి. తలూపాడు తను.
“ఆ పక్షివెధవలు రెక్కలరిగిపోయేలా సైకిళ్ళు తొక్కుతూ నీకోసం వెతుకుతున్నారు. వాళ్ళకోసారి కనిపించి రా! లేకపోతే ఇంకా తిరుగుతునే వుంటారు” అన్నాడు. తను బైటికి వెళ్ళి చెయ్యూపాడు. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. మాధవ్ వాళ్లనొదిలేసి యింట్లోకి వచ్చాడు. మర్నాడు పొద్దున్న గీత వచ్చింది.
“ఎక్కడికెళ్ళిపోయావు, నిన్న? చాలా భయపడిపోయాం తెలుసా? నాన్నేమో యింట్లోకీ బైటికీ తిరుగుతున్నారు, మీయింట్లో బాబాయ్ వున్నాడుగాబట్టి ఇక్కడికి రారు. మిగిలినవాళ్ళంతా నీకోసం బాగా వెతికారట. నువ్వొచ్చావన్న విషయంకూడా వాళ్లు చెప్తేనే తెలిసింది” అంది. తనేదో చెప్పబోతుంటే ఆపి, “రాణాకీ నేను మరదలినే. అదే వాడు చెప్పబోయింది. క్రాస్కజిన్స్ని అలానే అంటారు. నీకు నచ్చలేదు. ఐతే వాణ్ణి కొట్టేస్తావా? మీరంతా నాకన్నా ఎంత పెద్దని? ఒకడు నాలుగునెలలు, ఇంకొకడు ఏడాది, అలా లెక్కలెయ్యగా వెయ్యగా ఐదేళ్ళు పెద్దవాళ్ళు మీరిద్దరు తేలారు. నాలాంటి పిల్లలేకదా, మీరూను? నాకేదైనా ప్రాబ్లం వుంటే మీకెందుకు చెప్తాను? మా అమ్మకో నాన్నకో చెప్తానుగానీ?” అంది. తెల్లబోయాడు తను. కోపంకూడా వచ్చింది.
“ఆలోచించు వాసూ! మనం బాగా చదువుకుని మంచిమంచి వుద్యోగాలు చెయ్యాలనీ, బాగా బతకాలనీ అమ్మానాన్నలు కోరుకుంటారు. ఇలా స్ట్రీట్ఫైట్సవీ చేసి, భవిష్యత్తనేది లేకుండా చేసుకోవడం అవసరమా? మన గ్రూపులో ఒక్కడు చెడిపోతే వాడి తోకపట్టుకుని మీరందరూకూడా అదేదార్లో వెళ్ళాలా?’రాణాని మనం దూరంపెడుతున్నాం. రేపు నిన్నూ అంతేకదా? వాడికి నేనిలా చెప్పాలని చూసినా చెప్పనివ్వడు. నువ్వు వేరు. ఎలాగైతే కూర్చుని నిదానంగా విన్నావో అలానే ఆలోచించు” అని వెళ్లిపోయింది.
ఒక్కమాటో రెండుమాటలో స్పష్టాస్పష్టంగా అంటుంది. ఆ మాటల్లో లేని స్పష్టత ఆలోచనల్లో వుండేది. అర్థంకావడానికి టైం పడుతుంది. చిన్నప్పుడు దగ్గర కూర్చుని కథలు చెప్పేది. తర్వాత మానేసింది. దగ్గిరకి రావడం, ముట్టుకోవడం, పట్టుకోవడం వుండేది కాదు. అంతదూరాన్న కిటికీలోనో, కుర్చీలోనో కూర్చుని మాట్లాడేది. ఒక స్నేహితురాలిలా. ప్రేమనేమాట తమమధ్యని రాలేదు. ఆ వయసు తనకి లేదు. ఆతర్వాత మాటలూ ఆగిపోయాయి. అందుకు రాణా ఒక కారణమైతే అమ్మ మరో కారణం. ఆరేళ్ళు మనసులో పెట్టుకుని బాధపడింది. ఇప్పుడీ మాటలు? ఎన్నేళ్లనాటివో! సమీర విషయం రాకపోతే బైటికి వచ్చేవికాదు. ఇలాంటి మాటలు కలిగించే దు:ఖాన్ని ఒక చిన్నపోగులా తన వ్యక్తిత్వంలో కలిపి అల్లేసుకుంటుంది.
అమ్మలా ఎందుకంది? తెలిస్తే గీత బాధపడుతుందనుకోలేదా?
నీలాంటి తింగరిదాన్ని నా కొడుకుగాబట్టి చేసుకున్నాడు- అనేది ఒక్కోసారి కోపం వచ్చి. మామూలు మాటలేనా అవి? చనువుతో అనేసిందా? వాటికికూడా బాధపడుతోందా, గీత?
చాలాసేపటికి నిద్రపట్టింది. ఐనా, మర్నాడు పొద్దున్న ఐదుగంటలకి లేపాడు గీతని.
“తయారవ్వు, రివర్సైడు వెళ్దాం” అన్నాడు.
“ఇప్పుడా?!” ఆశ్చర్యంగా అడిగింది.
“సన్‌రైజ్ చూసి చాలాకాలమైంది” అన్నాడు. గబగబ తయారయ్యారు. వీళ్లలా ఐదింటికీ ఆరింటికీ తెల్లారుతుందన్న విషయం గుర్తున్నవాళ్ళు కొంతమంది ఆ టైముకి నది వొడ్డుకి వెళ్తారు. సూర్యోదయం చూడటానికి వచ్చేవాళ్ళు, యోగా, మెడిటేషన్కోసం వచ్చేవాళ్ళు, వాకర్స్‌తో కాస్త రద్దీగానే వుంటుంది. ఒక ఆర్టిస్టు కాగితాలూ, బ్రష్షులు తెచ్చుకుని రావడం ఎన్నో యేళ్ళుగా చూస్తున్నారు. మరొకతను యీమధ్యే వస్తున్నాడు. అతను వాసుకి పరిచయం. చేతినిండా పుస్తకాలు తెచ్చుకుని వెలుతురుకోసం ఎదురుచూస్తూ సూర్యకిరణాలసందడి మొదలవ్వగానే చదువుకోవడం మొదలుపెడతాడు.
“హాయ్! అంకుల్!” పలకరించాడు వీళ్లని చూసి. వాసు తిరిగి పలకరించి ముందుకి దారితీసాడు. వీళ్లందర్నీ దాటుకుని ఎప్పుడూ తాము కూర్చునే రాతికోసం వెళ్ళారు. మరెవరో కూర్చున్నారు దానిమీద.
“రాళ్లకికూడా అహం వుంటుంది గీతా! ఒకసారి దొరుకుతాయి, మరోసారి దొరకవు” అన్నాడు నవ్వి.
ఇంకాదూరం వెళ్ళాక ఒకచోట ఎత్తుగావున్న మట్టిదిబ్బమీద ఒకరికొకరు ఆనుకుని కూర్చున్నారు. అతను చెయ్యిజాపి, ఆమెని దగ్గరగా తీసుకున్నాడు. పక్షుల కూతలు తప్ప వాతావరణం ప్రశాంతంగా వుంది. చల్లటి మంద్రమైన గాలి వీస్తోంది. ఎప్పుడూ నిరంతరాయంగా శబ్దాలు చేస్తుండే మనుషులుకూడా పరిసరాలలో కలగలిసిపోయారు. కాసేపటికి సూర్యబింబం ఎర్రగా వ్యక్తమౌతుంటే మరింత దగ్గిరగా హత్తుకుని అన్నాడు.
“గీతా! సూర్యుడు, నది, నేల, అవంతీపురం, గీత, వాసు. మనం అహాలం కాదు, భావాలం కాదు, కాసేపు కోపం, కాసేపు ప్రేమా కాదు. నిలువెత్తు మనుషులం. మార్పుండదు. మిగిలినవాళ్ళు మారే భావాలు. అమ్మకూడా. చాలావరకూ ప్రేమ. ఎప్పుడో ఒకప్పుడు కోపం. అంతే. ఆ మాటలు ఇన్నేళ్ళు మర్చిపోకుండా ఎందుకు దాచుకున్నావు? ” అన్నాడు.
“తెలీదు. కొన్నికొన్ని అలా వుండిపోయి ఎప్పుడో వున్నట్టుండి గుర్తొస్తాయి. చాలా చిన్నచిన్న విషయాలు. గుర్తొచ్చి మరుగునపడిపోతాయి. పెద్దగా కోపం, బాధా ఏమీ వుండవు. అవతలివారితో మనకి జరిగే దైనందిన వ్యాపారంలో లావాదేవీ అనుకుంటాను” అని అతని భుజంమీద తలానించింది.
“ఇల్లంతా ఆటోమేటిక్ మోడ్‌లోకి వచ్చేసింది. పనులన్నీ ఎవరో ఒకరు చేస్తున్నాం. డబ్బు డబ్బుని సంపాదించి పెడ్తోంది మనం పెద్దగా ప్రయాసపడకుండా. మయూకి అన్నీ తెలుస్తున్నాయి. మనకి మూడోమనిషయ్యాడు వాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకు. ఇంత పెద్దైపోయామా మనం అని” అంది. “ఒకొక్కసారి భయంకూడా వేస్తుంది, ఇదంతా కలేమో, చెదిరిపోతుందని. ఇంత సంతోషం సాధ్యమా? మనమేం సంతోషంగా వుండాలనుకుని సూత్రాలు కనిపెట్టలేదు. మామూలుగానే బతుకుతున్నాం. అందరికీ ఎందుకు కుదరట్లేదు? వసంత్ నాతో పెరిగినవాడు. సూసైడ్ అటెంప్ట్ చెయ్యడమేంటి? మహీ, వీణ, కొత్తగా సమీర నాకు సవాళ్ళలా అనిపిస్తున్నారు. నాకు దొరికింది, వాళ్ళకి దొరకనిదీ ఏంటి? చాలా ప్రశ్నలకి జవాబులుండవు. డెస్టినీ అనుకుంటే నాముందు ఏమి వున్నాయో, ఎప్పుడు వ్యక్తపడతాయోనని ఆందోళనగా అనిపిస్తుంది” అంది.
“అలాంటిదేం వుండదు గీతూ! ఇన్నేళ్ళూ ఎలాంటి వొడిదుడుకులూ లేకుండానే గడిపాం. ఇకముందుమాత్రం ఏం జరుగుతాయి? మనం కోరుకున్నవాటి పర్యవసానంగానే బతుకుతున్నాం. మన జీవితాల్లో బలమైన సంఘటనలేం లేవు, ప్రతికూలంగా ఏదో జరగడానికి. మనకి పెద్ద కోరికలూ లేవు. అమ్మా, నువ్వూ సుఖంగా వుండాలని తప్పించి నేనింకేం కోరుకోను. డబ్బేనా వస్తోందని దాస్తున్నాను. ఆ పునాది అలా పడింది. లేకపోతే వుద్యోగాలు మనకి చాలు. మయూ బానే చదువుతున్నాడు. వాడికి నచ్చిన ఫీల్డులో సెటిలైపోతాడు. విహీకూడా అంతే. అక్కడితో మన జీవితాలు కన్‌క్లూడ్ అయినట్టేకదా? ఇంకో పదేళ్ళు. ఆ తర్వాత చెయ్యడానికేం వుండదు. అన్నీ దాటేసినట్టే” అన్నాడు.
సంతోషంగా నవ్వింది.
కానీ జీవితం అతను అనుకుంటున్నట్టు ఒక సూత్రానికి కట్టుబడి వుండే సిద్ధాంతం కాదు. నేను మంచివాడిని, ఎవరికీ హానిచెయ్యనుకాబట్టి నాకెలాంటి కష్టం రాదనే నమ్మకాన్ని ఇవ్వదు. ఎక్కడో చెలరేగిన తుఫాను ఎవరి జీవితాన్నో తలకిందులు చేస్తే ఆ కదలిక మరెవరి జీవితాన్నో కిందుమీదులు చెయ్యచ్చు. ఇప్పుడనుభవిస్తున్న సంతోషానికి కొన్నిరెట్ల విషాదం తమకోసం ఎదురుచూస్తోందని ఇద్దరికీ తెలీదు.
వెలుతురొస్తూ వుంటే యిద్దరూ లేచారు.
“మయూ పెద్దై వుద్యోగం చేస్తాడనే ఆలోచనే గమ్మత్తుగా వుంది. నిన్నమొన్నటి రోజుల్లా వున్నాయి మన చిన్నతనాలు. అప్పుడే అవంత దూరం జరిగేసాయా? మనసులోకి అమృతం వొంపుతావు. నా ఆలోచనలన్నీ అందులో మునకలు వేస్తుంటాయి. నీగురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఆఫీసుకెళ్లాకకూడా నా పక్కనే వున్నావనిపిస్తుంది. నీకేదో చెప్పడం మర్చిపోయానేమో అనుకుంటాను. ఉద్యోగం మానేసి, యింట్లోనే కూర్చుంటే నీ ఆలోచనలతో రోజులు గడిచిపోవా?” అంది కార్లో కూర్చున్నాక.
“మరి తుంబురకూడా కొనాలా?”
“దేనికి?”
“మీరాబాయిలా పాడుకోవడానికి. కృష్ణుడి విగ్రహానికి బదులు ఎదురుగా నేను కూర్చుంటాలే” అన్నాడు.
“ఎదురుగా వుంటే నీతో మాట్లాడతానుగానీ ఆలోచనలెందుకు చేస్తాను?”
“గీతూ! చిన్నప్పుడు నీ వొంటికేం రాసుకునేదానివి? కొన్నిపువ్వుల్లా కొందరు పిల్లలుకూడా వాసనొస్తారు, గీత మంచివాసనొస్తుందనుకునేవాడిని” అన్నాడు నవ్వుతూ. అతని మాటలకి ఆమెకీ నవ్వొచ్చింది.
“నన్నడిగితే చెప్పేదాన్ని. ఊహాగానం దేనికి? నాన్న మాకున్న చిన్నచిన్నకోరికలు గుర్తుపెట్టుకుని శ్రద్ధగా తీర్చేవారు. అమ్మకి జవ్వాది యిష్టం. కొనేవారు. తను రాసుకుంటూ నాకూ రాసేది. పెద్దయ్యాక తను మానేసింది. నాకు అలవాటైంది” అంది.
అతని నవ్వు పెద్దదైంది. “జవ్వాది రాసుకుని, తల్లో ఒకటో రెండో మల్లెపూలు పెట్టుకుని, సైకిల్ ఎక్కి కూర్చుంటే ఎలానే?”
ఆమె సిగ్గుపడింది “పద, వెళ్దాం. నీకొడుక్కివన్నీ చెప్పకు. వాడేం కథలుపడతాడో చూడాలి” అంది మాట తప్పిస్తూ. ఇద్దరూ ఇల్లు చేరేదాకా నవ్వుతునే వున్నారు. నవ్వు ఒకళ్ళొకళ్లనుంచీ ఒకళ్లకి అంటుకుంటూ వుంది.
“పక్కకి ఆపు. ఈ నవ్వుల్ని కాస్త అరిగించుకుందాం. మరీ వెలుగుతున్న సూర్యబింబాల్లాంటి మొహాల్తో వెళ్తే ఏళ్ళొస్తున్నా వీళ్ళకి సిగ్గు రాలేదనుకుంటారు” అంది.
ఇద్దరూ ఇల్లు చేరేసరికి అందరూ నిద్రలేచారు. అంతా కాఫీల హడావిడిలో వున్నారు.
“ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళారు?” అడిగింది లక్ష్మి. తనతో పిడికిట్లో పట్టుకుని తీసుకొచ్చిన గవ్వని తడియిసుకతోపాటు ఆవిడచేతిలో పెట్టింది గీత. ఆమె కళ్లలోని మెరుపు ఆవిడ చూపుల్ని దాటిపోలేదు. ఆశ్చర్యాన్ని దాచుకుంది.
ఇద్దరికీ కాఫీ కలుపుకుని వచ్చింది గీత.
“మమ్మల్నీ పిలిస్తే వచ్చేవాళ్లంకదరా?” అన్నాడు మాధవ్.
“అందరం కలిసి వెళ్తే అది పిక్నిక్లా వుంటుంది. ఎవరికివాళ్ళే వెళ్ళాలి మాధవ్. మరొకరు మనని చూస్తున్నారనిపించకూడదు. మొదట్లో మాకూ తెలీదు. సాయంత్రం టైంపాస్‌కి వెళ్ళేవాళ్లం. ఇలా పొద్దున్నే వెళ్తే నేచర్‌లో కలిసిపోయినట్టుంటుంది. రిజువనేట్ ఔతాం” అన్నాడు వాసు.
“తెలుస్తోంది” అన్నాడు వసంత్.
మయూ, విహీ వచ్చారు.
“ఎక్కడికెళ్ళినా అమ్మనే తీసుకెళ్తారు మీరు. ఆవిడేమో గొప్పగా ఫీలైపోయి మమ్మల్నసలు కేర్ చెయ్యదు. రెస్పెక్ట్ ఇవ్వదు” అన్నాడు మయూ తండ్రితో ఫిర్యాదుగా.
“మిమ్మల్ని నేను కేర్ చేసి రెస్పెక్ట్ ఇవ్వాలా?” ఆశ్చర్యంగా అడిగింది గీత. “అరేయ్, మీరు నా పిల్లలు” అంది.
“ఏం కాదు. చిన్నప్పుడెప్పుడో నన్ను మింగేసి, మళ్ళీ బైటికి తీసావట, పల్లవి చెప్పింది” అన్నాడు మయూ.
“నేను చెట్టుకి కాస్తే కోసి పండించుకున్నారట, సుధీర్ పెద్దనాన్న చెప్పాడు” అన్నాడు విహీ.
పెద్దగా నవ్వుతూ వాసూ, కాస్త మొహమాటంగా గీతా, చెరోవైపుకీ వెళ్ళిపోయారు. వాళ్లమాటలకి తిక్కరేగింది మాధవ్‌కి.
“అరేయ్, నువ్వేం చదువుతున్నావురా?” అడిగాడు మయూని. “ఇంటరుకదా? సైన్సు వచ్చుకదా? పల్లవిమాటలు నమ్మడమేంటి?” అడిగాడు.
“అమ్మతో ఇలా మాట్లాడితేనే బావుంటుంది” అన్నాడు వాడు.
“తమరేంటి? చెట్టుక్కాసారా? ఏ చెట్టుకో?” అడిగాడు విహీని.
“మా అమ్మమ్మ నన్ను పనసపండంటుంది. పనసచెట్టుకే కాసాను” నమ్మకంగా చెప్పాడు విహీ.
“ఇలా పెరుగుతున్నారా, మీరు?” తలకొట్టుకున్నాడు మాధవ్.
లక్ష్మి మొదలుపెట్టిన వంట తను పూర్తిచేసింది గీత. నలుగురూ భోజనాలు చేసాక పిల్లల్ని పంపించి తామిద్దరూ ఆఫీసులకి బయల్దేరారు.
“ప్రతీ ఆఫీసులోనూ వీళ్లదో బేచి వుంటుంది. బ్రాండెడ్ డ్రెస్సులూ, పట్టుచీరలూ కట్టేసుకుని, ఏడువారాల నగలు పెట్టుకుని కార్లో ఆఫీసుకొచ్చి పాకెట్మనీయో, పెట్రోలుఖర్చులో సంపాదించుకుని వెళ్ళే బేచి” అన్నాడు వసంత్ నవ్వుతూ. ఇప్పుడే కొద్దిగా గ్లూమీనెస్నుంచి బైటపడ్డాడు.
“ఏడాదికోసారి ఎన్ఓసీ అడిగే బేచి మాటో?” అన్నాడు వాసు.
“తొందర్లోనే మీరూ చేరతార్లే” అన్నాడు మాధవ్.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.