ఝరి 61-70 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

చాలా విషయాలు చెప్పకా, వినకా కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కలవకుండా మిగిలే కొన్ని విషయాలూ ఒక ప్రశ్నార్ధకాన్నీ మోస్తూ కాలంతోపాటు కదుల్తుంటాయి. ఎవరో ఒకరిమీదికి ఆ ప్రశ్నార్ధకాన్ని విసురుతాయి. వాళ్ళు కొక్కానికి ఎరలా చిక్కిపోతారు. రవీ, రామారావూ ఎందుకు మాట్లాడుకోరనేది గీతావాళ్ళకి చాలాకాలంపాటు జవాబు దొరకని ప్రశ్న. అలాంటిదే మేఘన ఇంటి వ్యవహారం. తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారో మేఘనకి కచ్చితమైన కారణం తెలీదు. అంతమంది మధ్యని తిరుగుతున్నప్పుడు దాగకుండా బహిర్గతమయ్యే విషయాల చుట్టూ ఆమె అల్లుకున్న ఆలోచనలు, అర్ధసత్యాలే తప్ప పూర్తి వివరం తెలీదు. అత్త ఏం చెప్తుందోనని కుతుహలంగా చూస్తోంది.
“మేఘనా! నువ్వింక పెద్దదానివయ్యావు. పెళ్ళికూడా అవబోతోంది. కొన్ని విషయాలు చెప్తాను. విని అర్థం చేసుకో. ఎవరినీ జడ్జి చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఎవరి జోళ్ళల్లోనో కాళ్ళుపెట్టి నడవలేవు. సులువుగాగానీ, ఎక్కువదూరంగానీ. ఎవరి అనుభవాలూ, స్పందనా వాళ్లవి. ఐతే ప్రేమ అనే ఒక విశ్వజనీనమైన మూసలో పడ్డప్పుడు ఎంత పెద్దసమస్యైనా దాని తీవ్రతని పోగొట్టుకుంటుంది. పెళ్ళి అనేది కేవలం సంఘటనల పరిక్రమం కాదు. అది జీవితకాలపు భావవ్యక్తీకరణ. భార్యాభర్తలమధ్యా, వాళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ మధ్యా, వాళ్ళిద్దరి వెనుకా వున్న కుటుంబాలకీ వాళ్ళకీ మధ్యా, సమాజానికీ వాళ్లకీ మధ్య. ఈ భావవ్యక్తీకరణ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతునే వుండాలి. అది ఆగిపోయినచోట సమస్యలు మొదలౌతాయి. దురదృష్టవశాత్తూ మన కుటుంబంలో కొన్నిళ్ళలో ఇది ఏకపక్షంగా మారిపోయింది. అంటే ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా తమ మాటే సాగించుకుంటారన్నమాట” అంది గీత నెమ్మదిగా. తను చెప్పినది మేఘనకి అర్థమైందో లేదో తెలుసుకోవాలని ముఖంలోకి లోతుగా చూసింది.
వాళ్ల సంభాషణ చాలావరకూ ఇంగ్లీషులోనే సాగింది. మొదట ఇంట్లో అందరూ మాట్లాడుకునే భాష వస్తే మిగిలినవన్నీ వాటికవే వస్తాయన్న సూత్రంమీద పెంచింది మహతి, కూతుర్ని. కానీ ఆ పిల్ల పెరిగి పెద్దయాక తెలుగు ప్రాధాన్యం తగ్గి, మరాఠీ, ఇంగ్లీషు వాడుక, అవసరం పెరిగాయి. అంతా దాన్ని వప్పుకున్నారు. ఇలా పరరాష్ట్రంలో పెరుగుతున్న పిల్లలు ఇంకా వున్నారు. మాధవ్, వసంత్, రవి – వీళ్ళ పిల్లలు. ఇదికాక దేశాంతరాలు వెళ్ళిన, వెళ్ళినవాళ్ళ పిల్లలు. భాష అనేది పరిధులని విస్తరించుకుంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన సంస్కృతం ఇప్పుడు వాడుకలో లేదు. అందునించీ కొత్తభాషలు పుట్టుకొచ్చాయి. మార్పు అనేది ఒక ఝరి. నిరంతరాయంగా సాగే ప్రవాహం.
“నువ్వన్నది నిజం అత్తా! పెళ్ళేకాదు, జీవితమే పెద్ద కమ్యూనికేషన్ ప్రాసెస్. చాలా నిజం. ఇది అర్థంకాక అన్నివిధాల మానవసంబంధాలలోనూ విఫలమౌతున్నాం” అంది. ఆమెలో తను ఆశించిన పరిణతి కనిపించాక గీత ముందుకి సాగింది.
“ప్రేమ అనేది అతి గొప్ప కమ్యూనికేషన్. ఎదుటివ్యక్తిమీద మనకి కాస్తంత ప్రేమ వుంటే చాలు, వాళ్లపట్ల సానుకూల దృక్పథం మొదలౌతుంది. వాళ్ళు మనకి అర్థమైపోతారు. వాళ్ళ బాధ మనదైపోతుంది. చాలామందికి చిన్నవో పెద్దవో ఆరోగ్యసమస్యలు వుంటాయి. వాసూవాళ్ళ మామ్మకి విపరీతమైన పార్శ్వనొప్పి వుండేదట. ఏ తెల్లారో తలనొప్పి మొదలై, మధ్యాహ్నందాకానో సాయంత్రందాకానో వుండిపోయేది. ఎండ తీక్ష్ణంగా వున్నరోజుల్లో కన్నుకూడా తెరిచి చూడలేకపోయేది. అలాంటావిడతో ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా వుంటుందో ఆలోచించు. పాపం అలాగే సర్దుకుంటూ గడిపారట ఆ తాతయ్యగారు. ఎందరో డాక్టర్లకి చూపించారు. చిట్కావైద్యాలు, నాటువైద్యాలు, మంత్రాలు ఎన్నో చేయించాక మా తాతయ్యదగ్గిరకి వస్తే ఆయన నయం చేసారట. ఎలాగని అడక్కు. తగ్గింది. వాళ్లకి అది పెద్ద రిలీఫ్. అందుకు కృతజ్ఞతగా లక్ష్మమ్మమ్మని కట్నం తీసుకోకుండా చేసుకున్నారు” అని ఆగింది.
మేఘన ఆలోచించింది. ఈ విషయాన్ని వుదాహరణగా ఎందుకు చెప్పిందో అర్థమైంది.
“మీ అమ్మకి చిన్నప్పట్నుంచీ కొన్ని సమస్యలు వుండేవి. గుర్తు తెచ్చుకో, నీ స్నేహితుల్లో ఎవరికీ ఎలాంటి కంప్లెయింట్సూ వుండేవికాదూ?
మాట్లాడుకుంటారా, ఈ విషయాలు?” అడిగింది గీత.
“ఎందుకు మాట్లాడుకోం? ఎవరిదాకానో ఎందుకు? ఇందిరకే విపరీతమైన కడుపునొప్పి. రెండేళ్లైంది అది పెద్దదై. ఆ టైము వచ్చిందంటే దాన్ని ఎవరూ పట్టలేరు. గోలగోల చేసేస్తుంది. ఏడుస్తూ పడుక్కుంటుంది. పిన్ని ఒకసారి అడిగింది. మీ అమ్మకిలా నీకే బాధా వుండదా అని” అంది మేఘన. గీత పెదాలమీద అదోలాంటి నవ్వు మెరిసి లిప్తలో మాయమైంది.
“ఆ పిల్లకి పెళ్లౌతుంది. ఈ నొప్పి ఇలాగే వుంటుంది. వచ్చేవాడికి అర్థమవ్వదు. అర్థం చేసుకోడు. అప్పుడు?”
నిజమే. అప్పుడు?
“చెప్పటం ఒక్కటే కాదు, విని, అర్థం చేసుకోవడంకూడా కమ్యూనికేషన్ ప్రాసెస్‍లో భాగమే. మీ అమ్మ తన శరీరం ఇచ్చిన సంకేతాలన్నిటినీ అర్థం చేసుకుంది. పెళ్ళి చేసుకోనంది. మీ తాత వినలేదు. దాన్ని భయపెట్టీ, ప్రలోభపెట్టీ పెళ్ళిచేసారు. అలాగని తనకి నొప్పులూ, బాధలూ ఏమీ లేవు. పై పెదవిమీదా, కాళ్ళూచేతులమీదా కాస్త అన్‍వాంటెడ్ హెయిర్ వుండేది. పేర్లర్‍కి వెళ్ళటాలూ, వేక్సింగు, త్రెడింగ్‍లాంటివి ఇంకా మనింటికి రాలేదు. మొహం కడుక్కోవడం, ఇంత పౌడరు ముఖానికి రాసుకుని బొట్టు పెట్టుకోవడం. పెట్టుకుంటే కళ్ళకి కాటుక, తల్లో పూలు. లేకపోతే లేదు. అంతే. అలాగే దాన్ని పెళ్ళిచూపుల్లో చూసి, వాళ్ళిస్తామన్న కట్నానికి మోజుపడి చేసుకున్నారు మీ నాన్నావాళ్ళు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? మీ అమ్మని వున్నదాన్ని వున్నట్టే చూపించారు. ఇంతమందాన మేకప్ వేసి, అందంగా తయారుచేసి మీ నాన్నముందు కూర్చోబెట్టలేదు. ఆ మేకప్ కరిగిపోయేలోగా హడావిడిగా పెళ్ళీ చెయ్యలేదు. రెండునెలలు బేరసారాలు జరిగాయి. ఒకరొకరుగా రెండుమూడుసార్లు దాన్ని చూసారు. వాళ్లకి కట్నంముందు మరేదీ కనిపించలేదు” అంది.
“మా నాన్న కట్నం తీసుకున్నారా?” ఆశ్చర్యంగా అడిగింది మేఘన.
“అదంత తప్పుగా ఎవరూ అనుకోలేదు. ఆడపిల్ల పెళ్లవాలంటే ఇవ్వక తప్పేదికాదు. అందుకని ఇచ్చేవారు. వాళ్ళుకూడా లేక తీసుకోవడం కాదు, ఎంత కట్నం యిచ్చారంటే అంత గొప్ప. అందుకు తీసుకునేవారు”
“వాసు మామయ్య?”
“లేదు”
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“మా అమ్మని తప్పుపట్టాలని కాదత్తా! నాకు నాన్న కావాలనిపిస్తుంది. ఎప్పటికీ ఆయన మాతోనే వుండిపోవాలనిపిస్తుంది” మేఘనే నెమ్మదిగా అంది. ఆమెకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రేమగా దగ్గిరకి తీసుకుంది గీత. “అలాని అతనికీ వుండాలికదే?” అంది.
“లేదంటావా?” దెబ్బతిన్నట్టు అడిగింది.
“ఉంటే, ఈరోజు పొద్దున్న అలా ఎందుకు జరిగింది? వెళ్ళగానే వాళ్ళిద్దరూ తండ్రి దగ్గిరకి పరిగెడితే నువ్వెందుకు దూరంగా వుండిపోయావు?”
“అమ్మ చెప్పిందా?”
“ఉహు< మామయ్య చెప్పాడు”
“…”
“మేఘనా! నాన్నగురించి నీకలా అనిపించడం తప్పుకాదు. అతనికీ అలానే వుండాలని కోరుకోవడం తప్పు. అక్కడే నువ్వన్నట్టు సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎవరి ప్రాథమ్యాలు వాళ్ళకి వుంటాయి. మరొకరిని పెళ్ళిచేసుకున్న మనిషికి మొదటిభార్యా పిల్లలూ ఏమౌతారమ్మా?” ఆ పిల్ల జుత్తు సరిచేస్తూ అడిగింది. “నువ్వు ఏర్‍పోర్టులో దిగి ఒక్కమాట అనగానే మామయ్య పరిగెత్తుకుని వచ్చాడా? నువ్వు కోరిన ఆ సాయం మేము చెయ్యగలిగినది. మరి మా చేతుల్లో లేనిదానికి నువ్వు ఏడిస్తే మేం ఏం చెయ్యగలం? నాకు నువ్వేమౌతావు? నాకున్న ఆరుగుర్లో ఒక మేనత్త మనవరాలివి. అంతేకదా? కొంతమంది యిళ్లలో రాకపోకలే వుండవు. ఎవరు ఎవరో అన్నట్టు బతికేస్తారు. మరి మాకు? నువ్వు ప్రాణం. మీ అమ్మ ప్రాణం. అంటే ప్రేమేకదా, మనందరినీ కలిపి వుంచుతున్నది? అలాంటి ప్రేమ మీ నాన్నలో లేదు. అందుకే మీ అమ్మ అక్కడ వుండలేకపోయింది. ఒక్కపిల్లని కనడంకోసం చచ్చి బతికింది అది. మూడు అబార్షన్ల తర్వాత నువ్వు పుట్టావు. మరి అంత కష్టపడిన భార్యమీద మీ నాన్నకి కొంచెమేనా ప్రేమ వుండాలికదా? సర్దుకుని నార్మల్ లైఫ్‍లోకి రావడానికి సమయం ఇవ్వాలికదా? కొట్టడం తప్పుకదా? వాసూవాళ్ల మామ్మగురించి చెప్పాను. చెయ్యాలనుకుంటే ఆ తాతగారుకూడా అలా చెయ్యచ్చుకదా?” అంది.
“తలంటేసావా?” అడిగింది మేఘన తులసి మాటలు గుర్తుతెచ్చుకుని.
“ఉ<హు< ఇంకా లేదు. ఇది నలుగే” గీత నవ్వేసింది.
“హు< అదెలా వుంటుందో!”
సరిగ్గా అప్పుడే మహతి అక్కడ అడుగుపెట్టింది. గది గుమ్మాన్ని పట్టుకుని నిలబడింది. ఇంకా లోపలికి అడుగుపెట్టలేదు. ఆమె రాకని వాళ్ళిద్దరూ గమనించలేదు.
“అత్తా! నీకు అన్నీ తెలుసు. అందరూ నీమాట వింటారు. అందరికీ నువ్వంటే యిష్టం. మామయ్య చాలా మంచివాడు. మరి నువ్వెందుకలా
చేసావు?” నెమ్మదిగా అడిగింది మేఘన. ఆ కుటుంబంలోని మూడోతరంలోని పిల్లలందరి ప్రతినిధిగా అడిగింది. జవాబుకోసం వెతుక్కుంటున్న మయూఖ్, విహంగ్‍లపక్షాన ప్రత్యేకంగా అడిగింది. అడుగుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది. కళ్ళలో పలచటి నీటిపొర కదిలింది. గీత నవ్వు ఆగిపోయింది. ముఖం వెలతెలబోయింది. వెంటనే సర్దుకుంది. నవ్వు తిరిగిరాలేదు.
“నువ్వూ అడిగేసావా?” అంది. “చెప్పానుగా? టాబ్లెట్లు కనిపించాయి. ఏదో అర్జ్. అలా వేసేసుకున్నాను. అంతే” అంది నింపాదిగా మాటలు పేర్చుకుని. మేఘన ఆమె ముఖంలోకి తదేకంగా చూసింది.
“ఇది జరగడానికి సరిగ్గా రెండురోజులముందు తాతయ్య అమ్మని బాగా తిట్టాడు. ఆయన అలా తిట్టడం మాకు అలవాటే. ఆరోజుమాత్రం-
నువ్వుపోయి మీ అమ్మ బతికున్నా బావుండేది. ఆవిడ నీ బెంగతోనే పోయింది. నువ్వుమాత్రం నిరంధిగా బతికేస్తున్నావు. బతికేం సాధిస్తున్నావే? అందర్నీ కాల్చుకు తింటున్నావు – అన్నారు.
ఎన్నోసార్లు ఎన్నోమాటలు అన్నా, ఆరోజు అమ్మ ఆ మాటలకి తట్టుకోలేక ఏడ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఆయన్ని తీసుకెళ్ళి పిన్ని దగ్గిర కొన్నాళ్ళుండమని వదిలిపెట్టి వెంటనే వచ్చేసాను. నన్నో రెండురోజులు వుండమని పిన్నీ బాబాయ్ అడిగినా వుండలేదు. ఇక్కడ అమ్మని ఒక్కదాన్నీ వదిలిపెట్టి వెళ్ళానని భయం.
అలా ఎందుకు చేసావు మేఘనా? ఆయన నాకు నాన్న, నీకు తాత. ఒకమాట అన్నా, పడ్డా మనమధ్యనే వుంటుంది. అక్కడ బాబాయ్ వున్నారు. ఆయన్నీ పిన్నినీకూడా అంటారు నాన్న. వాళ్లల్లో ఎవరిని అన్నా రెండోవాళ్ళకి కోపం వస్తుంది. అలాగని తిరిగి బాబాయ్ ఆయన్ని ఏదేనా అంటే పిన్నికి ఇంకాస్త కోపం వస్తుంది. వాళ్లమధ్య అవసరంలేని గొడవలుకదా- అంది అమ్మ.
నేను వెళ్ళాక అమ్మ ఏడుపు ఆపిందీ, కడుపుకి ఏమైనా తిన్నదీ లేదు. నేను వచ్చాకే పొయ్యి వెలిగించింది. అత్తా! అదేరోజు రాత్రి నీగురించిన వార్త వచ్చింది. ఏ కారణం లేకుండానే నీకు చచ్చిపోవాలనిపించిందన్నావు. అదే నిజమైతే నేను లేని సమయంలో అమ్మకి జరగాల్సిన ప్రమాదం నీమీంచీ దాటిపోయిందని అనుకోవాలి. మీ యిద్దరికీ అంత ప్రేమకదా? అక్కడ అమ్మ పడ్డ బాధ ఇక్కడ నువ్వెలా అనుభవించావు? మనం చదువుకుంటున్న సైన్సు, టెక్నాలజీని దాటి ఇంకేదో వుందనుకోవాలి. అలాంటి ప్రేమని నేనూ నేర్చుకుంటాను. నువ్వింక నాకు తలంటక్కర్లేదు.” అంది.
తర్వాత తల తిప్పి చూసి, “అమ్మ” అంది. మహతి లోపలికి వచ్చింది. గీత పక్కన కూలబడింది.
“నేను వెళ్తాను. నా చుట్టాలిద్దరూ ఏం చేస్తున్నారో చూడాలి” అని వెళ్ళిపోయింది మేఘన. గీత ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో నిమగ్నమై వుండిపోయింది. ఆ మౌనముద్రలో ఆమె తామంతా చిన్నప్పట్నుంచీ ఎరిగున్న వ్యక్తికి భిన్నంగా అనిపించడాన్ని గుర్తించింది మహతి. అల్లరి, చురుకుతనం, క్రియాశీలత్వం అన్నీ కలిసి చైతన్యస్రవంతిలా వుండే మనిషిని శిలలా బిగుసుకుపోయి వుండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది.
“మేఘన అన్నది నిజంకదూ? మనిషి మనసునిండా ఎన్నో ఆలోచనలు. మనగురించీ, మనవాళ్లగురించీ. తటాకంలోని అలల్లా వ్యాప్తిచెందుతూ, గట్టుని తాకి తమలోకి తాము కుదించుకుపోతూ. ఈ హద్దు భౌతికమైనదికదూ? అలాంటభౌతికమైన హద్దులు లేనిచోటు అంతరంగంకదా? ఎందుకు మనిషికి మనిషి అర్థమవరు?” మౌనం విడిచిపెట్టి అడిగింది గీత.
“మేఘన చెప్పింది అలా అర్థమౌతారనికదా? నువ్వు చెప్తున్నది అందుకు భిన్నంగా వుంది” అంది మహతి.
“ఉ<హు< అర్థంచేసుకోనివాళ్లగురించి అంటున్నాను” అని, “నేను నోరు తెరిచి చెప్పే విషయాలకోసం అందరూ చాలా ఆతృతగా చూస్తున్నారు. అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తూ నేను మామూలుగా తిరగడం చూసి, మళ్ళీ అది ఎప్పుడు పేలుతుందోనని భయపడుతున్నారు. నాకు తెలుస్తోంది. కానీ అది అగ్నిపర్వతం కాదు, పేలేది కాదు. నిరంతరంగా నన్ను కొంచెంకొంచెం దహిస్తున్న జ్వాల. దాన్ని ఎలా తప్పించుకోవాలో తెలీక ఒక నరకం”
“గీతూ! పసిపిల్లలుగా వునప్పుడు మనది ఒకటే ప్రపంచం. స్నేహప్రపంచం. మన మూలాలు కొంచెం వేరువేరుగా వున్నా అందరం ఆ బంధానికి కట్టుబడిపోయాం. తర్వాత పిల్లకాలువల్లా ఎవరికి దొరికిన దార్లోకి వాళ్లం ప్రవహిస్తూ వెళ్ళిపోయాం. మేము కాసేపు ప్రవాహాలం. ఇంకాసేపు ప్రయాణించి అలిసిపోయిన ప్రయాణీకులం. మరికాసేపు పిల్లల భవిష్యత్తుని మోసిన, ఇంకా మోస్తున్న నావలం. ప్రవహిస్తున్నప్పుడు మా మూలంలాగా, ప్రయాణిస్తున్నప్పుడు మేము సేదతీరవలసిన వొడ్డులాగా, ఇప్పుడు పిల్లల్ని మోస్తున్నప్పుడు చేరవలసిన గమ్యంలాగా నువ్వే కనిపిస్తావు. ఎప్పుడు నీవైపు చూసినా అర్ధనారీశ్వరత్వానికి సంకేతంలా వాసులో వొదిగిపోయి వుంటావు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? ప్రాణం తీసుకోవాలనిపించేంతటి తీవ్రమైన బాధకి కారణం, కారకులు లేకుండా వుండదుకదా?” అడిగింది మహతి. “మా అందరికన్నా చాలా పెద్దదానివైపోయావు! మా అలకలు, స్వార్థాలు, అసూయలు భరించగలిగేంత ఎదిగావు” అంది బాధపడుతూ.
“అవన్నీ మనుషులకి సహజమైనవి. నేనుమాత్రం అతీతురాలినా?”
“వేదాంతం వొద్దు. అసలేం జరిగిందో చెప్పు. సుధీర్ కొడుక్కి మేఘనని చేసుకుంటాడన్న ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. మేఘన ఫోటోలు ప్రత్యేకం తెప్పించుకోవడం అవీ ఇంతకిముందే జరిగాయి. నా స్థాయెంతో నాకు తెలుసుకాబట్టి పిల్లని చేసుకొమ్మని నేనుగా అడగలేదు. తనంతట తనే అన్నాడు. అదీ ఈమధ్యనే. ఇప్పటికేనా మించిపోయింది లేదు. నిన్ను బాధపెడుతున్న యింటికి నా పిల్లని ఎలా ఇస్తాను? నచ్చజెప్తే మేఘనకూడా అర్థం చేసుకుంటుంది. రెండు ప్రలోభాలు. మేఘన భవిష్యత్తు గురించీ, వ్యాస్ మంచిపిల్లాడనీ. ఈ రెండిటిలోంచీ బైటికి వచ్చేసాను”
“నన్ను బాధపెట్టడమేమిటి? అదీ సుధీర్?!!” తెల్లబోయింది గీత.
“ఆ ఫోన్లు తన దగ్గిర్నుంచేగా?”
“అని చెప్పానా?”
“మరి?!!” మహతికి మనసు తేలికపడింది. తలమీంచీ పెద్దబరువు దిగిపోయినట్టైంది. తామంతా ఎన్నోయేళ్ళు కలిసి తిరిగారు. సుధీర్ ప్రవర్తనలో ఎప్పుడూ ఎలాంటి తేడా కనిపించలేదు. చాలా హుందాయైన మనిషి. గీత పెళ్ళికిముందు ఆఖరిసారి అందరూ కోటలో కలిసినప్పుడు రాణావిషయంలో అతను చేసిన ప్రయత్నం తనింకా మర్చిపోలేదు. అలాంటివాడు గీతని ఫోన్లో ఏడిపిస్తున్నాడంటే నమ్మకం కలగలేదు. కానీ గీత చెప్పాక నమ్మక తప్పని పరిస్థితి. ఆ నమ్మీనమ్మని స్థితిలోని అయోమయం. సుధీర్ వస్తే అన్నీ చక్కబడతాయంది గీత. తను సరిగ్గా అర్థం చేసుకోలేదేమోననే సందిగ్ధం. చక్కటిదని ఏకకంఠంతో అందరూ అంగీకరించిన సంబంధం, దాంతో ముడిపడివున్న మేఘన ఉజ్వలభవిష్యత్తు. అమెరికా సంబంధమని కాదు, ఇప్పటిదాకా వాసూగీతల ప్రాపకంలో వున్న పిల్ల ఇకపై సుధీర్ చేతిలోకి వెళ్తుందనే ఆశ. నిర్ణయాన్ని సుధీర్ రాకతో ముడిపెట్టుకుంది గీతలాగే. మధ్యాహ్నం భోజనాలవేళ కదిలింది ఆ ముల్లు. ఎందుకు కదిలింది? ఎక్కడో ఏదో జరిగితే ఇంకోచోట దాని ప్రభావం కనపడింది. హాస్పిటల్లో మేఘనకి జరిగింది మనసులోని ఈ భావాన్ని కదిలించింది. గీతని బాధపెట్టే మనిషితో తను సంబంధం కలుపుకోవడమేమిటన్న ప్రశ్న దు:ఖంతో మెత్తబడిపోయిన మనసులోంచీ వాడిగా ముల్లులా పొడుచుకుని వచ్చింది. లౌక్యంకాదు, ఇక్కడ తను చూపించాల్సింది, నిక్కచ్చితనం అనే స్పృహ ఒక్కసారి కలిగింది. ఒక విషయం తెలీకముందు ఒకలా వుండి, తెలిసాక మరోలా మారిపోయే భావనలకి జీవితాలని శాసించే శక్తి వుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
“సుధీర్ కాదని చెప్పి నా నెత్తిమీద పాలుపోసావు. వాడు కాకపోతే ఇంకెవరు?”
“వాడని నువ్వెలా అనుకున్నావు?”
“ఆ ఫోన్‍కాల్ తర్వాత నువ్వన్నమాటలు అలా అర్థమయ్యాయి”
“చాలా భరించాను మహీ! ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలీడం లేదు. ఇప్పటికే ఎంతో జరిగింది. ఇంక తట్టుకునే శక్తి నాకు లేదు” అంది గీత, మోకాళ్లమీద తలవాల్చుకుని. ఇద్దరి చూపులూ కలవకుండా జాగ్రత్తపడింది.
“చెప్పకపోతే ఎవరికేనా ఎలా తెలుస్తుంది? అసలు నీకంటూ సమస్యలేం వున్నాయి? చిన్నప్పుడు కష్టాలు పడ్డావు. ఉద్యోగం రావటం, వాసుతో పెళ్ళి, చక్కగా ఇద్దరు పిల్లలు. అన్నీ సరిగ్గానే వున్నాయికదే? ఎక్కడా మాకెవరికీ ఏ తేడా కనిపించడంలేదు. నువ్వు ఏదీ చెప్పకపోయేసరికి అందరికీ రకరకాలుగా ఆలోచనలు సాగుతున్నాయి. వాసుకి కోపం వస్తోంది. మామయ్యకి బీపీ పెరిగిపోతోంది. మళ్ళీ నువ్వేం చేస్తావోనని హడిలిపోతున్నాం అందరం. నువ్వు క్షణంసేపు కనిపించకపోయినా, వెతుక్కుంటూ వచ్చి నీ పక్కకి చేరుతున్నాం. అర్థమౌతోందా? ఈ ఫోన్ కాల్స్ ఎప్పుడు మొదలయ్యాయి? దేనిగురించి గొడవ? ఎవరు ఆ గొడవపడేది? నీ మాటల్నిబట్టి సుధీర్‍మీదికి కొద్ది అనుమానం పోయింది. అతను కాదంటున్నావు. మరి? ఆ ఫోను మళ్ళీ వచ్చిందా? సుధీర్ రాకతో దేనికి ముడిపెట్టావు?” మహతి అడిగింది. చాలాసేపు మాట్లాడలేదు గీత. నువ్వు చెప్పేదాకా కదిలేది లేదన్నట్టు కుర్చుంది మహతి. నెమ్మదిగా పెదవి యిప్పింది గీత.
“చెప్పానుకదూ, ఇంటినిండా మగపిల్లలని. అది మాయింట్లో కాస్త భయాన్ని సృష్టించింది. అమ్మమ్మ చాలా భయపడేది.
ఎవరో ఒకళ్ళకి పేరు పెట్టెయ్యండి. అలా అందరు మగపిల్లలమధ్య ఒక్కదాన్నీ వదలద్దు. అప్రతిష్ఠ వస్తుంది –
అని గొడవచేసేది. నాన్నకి అలా ఇష్టం వుండేదికాదు. అమ్మమ్మ భయం ఆయనకి అర్థమయ్యేదికాదు. ఎప్పుడో పెరిగిపెద్దయ్యాక యోగ్యతలనిబట్టి తీసుకొవలసిన నిర్ణయం అప్పుడే తీసుకోవడం ఆయనకి యిష్టం వుండేదికాదు. కాస్త నాకు వూహ తెలుస్తున్నప్పుడు అమ్మ, అమ్మమ్మ చెప్పారు-
వాళ్లంతా నీకు అత్తకొడుకులు. వరసైన పిల్లలు. అలాగే మామయ్యలంతా మేనమామలు కారు. మీ నాన్నకి త్రిమూర్తులుగారంటే గొప్ప గౌరవం. ఆయనలాగా కుటుంబాన్ని పెంచుకోవాలని కోరిక. వాళ్ళలా ఒకచోట కలిసి వుండకపోయినా, ఏకకుటుంబంలాగా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ కలిసిమెలిసి వుండాలని అనుకుంటున్నారు. అందులో తప్పుపట్టడానికేమీ లేదు. వాళ్లందరిమధ్యా నువ్వు తిరుగుతూ వుంటావు. ఎక్కడ నీకు తేడాగా అనిపించినా, దెబ్బలాడేసి, గొడవచెయ్యడం అలవాటుచేసుకో. పెద్దవాళ్ళం ఎవరో ఒకరం వస్తాము. వచ్చి గొడవ తీరుస్తాము. నోరుమూసుకుని ఓర్చుకోవడం, చెప్తే ఎవరేనా ఏదేనా అనుకుంటారని భయపడటం చెయ్యకూడదు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. లేదంటే నన్ను వదిలిపెట్టకుండా నా చుట్టే తిరుగుతూ వుండాలి- అని. అది నేను నేర్చుకున్న మొదటి పాఠం. గొప్పపాఠం. ఇప్పుడు పిల్లలకి గుడ్‍టచ్, బేడ్‍టచ్‍గురించి చెప్తున్నామే, అలాగన్నమాట.
నాన్నకికూడా కచ్చితమైన నియమం. ఎవరింట్లోనూ నన్ను వదిలిపెట్టకూడదని. రాత్రయ్యేసరికి ఎక్కడున్నా, వెతికి తెచ్చేసుకునేవారు.
కానీ మహీ! అలా వుండటం మనకి సంతోషాన్నివ్వదు. మనం ఉండేచోటు మనకి సురక్షితంగా వుండాలి. మనిషికీ మనిషికీ మధ్య ప్రేమ వుండాలిగానీ రక్షణకవచం కాదు. నిజానికి నాకు మనిళ్ళలో ఎలాంటి సమస్యా ఎదురవ్వలేదు. నాన్నమీద వున్న ప్రేమ, గౌరవం, జాలి అన్నీ కలిపి నామీది ప్రేమగా చూపించేవారు అత్తలంతా. మీ నాన్నావాళ్ళూకూడా మీతో సమానంగా చూసారు” గీత ఆపింది.
మహతి వింతగా చూసింది. తనకి తెలిసిన గీత కాదు. తమతో ఆడిపాడి, తమందరినీ నిరపేక్షగా ప్రేమించిన ఆమె అంతరంగంలోని దృశ్యమానకోణం కాదు. అందరూ ఒక యింట్లోని పిల్లలే ఐనా, మారిపోయిన వరసలు గీతని తమకన్నా భిన్నమైన వేదికమీద నిలబెట్టాయన్న విషయం చాలాసేపటిదాకా జీర్ణించుకోలేకపోయింది.
“చిన్నప్పుడు చాలా అల్లరిచేసేదాన్ని. ఎవ్వరిమాటా వినేదాన్ని కాదు. ఇప్పటిరోజుల్లోనైతే ఏదో పేరుపెట్టి నాకో ముద్రవేసి కూర్చోబెట్టేవాళ్ళు. నా చిన్నప్పుడు అది అల్లరిగానూ, పెంకెతనంగానే గుర్తించబడింది. అదృష్టవంతురాలిని” అంది గీత. మహతి చప్పుని ఆమె చెయ్యిపట్టుకుంది. ప్రపంచం, అందులోని విషయాలూ పెద్దవాళ్ళు నిర్మించినవి. పిల్లలకి అవి అర్థమవవు. అర్థం చేసుకునే క్రమంలో పిల్లలు పెద్దవాళ్ళు అనుకున్న కోణానికి భిన్నంగా వెళ్ళినప్పుడు అంతా కంగారుపడతారు. వాళ్లని తిరిగి దార్లోకి లాక్కొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అరచెయ్యంత విచ్చుకున్న గులాబీని వదిలేసి ఏ పిల్లేనా పిల్లాడేనా వంటరిగా ఆకాశంలోకి చూస్తున్న గడ్డిపువ్వుని ఆరాధిస్తే భయపడిపోతారు. ఎలాగో ఒకలా సంఘర్షించీ, పోరాడీ, రాపాడి ఆ పిల్లల చెవులు పట్టుకుని లాక్కొచ్చి సరైన కోణంలో నిలబెట్టి, తేలిగ్గా నిశ్వసిస్తారు. పెద్దయ్యాక ఎలాంటి ప్రవర్తనాబేధాలూ లేకుండ అంతా ఒకేలా ఆస్వాదించి, ఆలోచించి, ప్రవర్తించేలా ప్రతిక్షణం పిల్లలమీద నిఘా వుంటుంది. ఇప్పటి సమాజంలోనైతే గీత చెప్పినట్టు ఆమెలాంటి పిల్లలు నెగ్గడం కష్టం.
“అంత చిన్నప్పుడే వాసు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని –
అంతంత అల్లరిచెయ్యకూడదు. బేడ్‍గర్ల్ అంటారు. చెప్పినమాట వినాలి. పోనీ, అందరిమాటా కాదు, నేను చెప్తేనేనా వింటావా- అని అడిగాడట.
కాస్త పెద్దయ్యాక నేను అందరితోనూ దెబ్బలాడుతుండటం చూసి-
మాకందరికీ పెద్దమామయ్యంటే చాలా యిష్టం. మామయ్యకూతురివికాబట్టి నువ్వన్నా యిష్టమే. మా అందరితోటీ ఇలా దెబ్బలాడుతుంటే ఎలా? నీకేదైనా నచ్చకపోయినా, ఎవరేనా నిన్నేదైనా అన్నా, నాకో సుధీర్‍కో చెప్పాలి. పెద్దవాళ్లం మేమిద్దరం వున్నాంకదా- అని నచ్చజెప్పేవాడు.
అటు అమ్మా, అమ్మమ్మ చెప్పినట్టు పెద్దగా గొడవచెయ్యడానికీ, ఇటు వాసు చెప్పినట్టు ఆ యిద్దరితో ఫిర్యాదుచెయ్యడానికీ సాధ్యపడని విషయాలు ఆడపిల్లలకి చాలా వుంటాయి. వాడు నన్ను కొట్టాడనో, తిట్టాడనో, నా పలకపుల్ల విరిచేసాడనో చెప్పినట్టు చెప్పుకోలేనివి మనకి చాలా వుంటాయి”
“గీతా! ఎవరే అది? కనీసం మాతోకూడా ఎప్పుడూ చెప్పలేదు” అంది మహతి.
“అమ్మా, అమ్మమ్మా చెప్పారుకదూ, నా సమస్యలు నేనే పరిష్కరించుకోవాలని. అందులోనూ నేను పెద్దమామయ్య కూతుర్ననే కిరీటం ఒకటి. పోరాడుతునే పెరిగాను. ఇంకో భయంకూడా వుండేది. ఎవరిమీదేనా చెప్తే ఆ అత్తకి కోపమొస్తే దాని ప్రభావం అమ్మమీద ఎలా వుంటుందోనని. ఇలాంటి భయాలు మనకి స్పష్టంగా ఎవరూ నేర్పరు. ఏవో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి పర్యవసానంగా మన మనసు లోలోపల చెమ్మలా వాటంతట అవే వుబుకుతాయి. బాధ్యత తీర్చుకున్నానేగానీ అత్తలకి సరైన సంబంధాలు చెయ్యలేకపోయానని నాన్న అప్పుడప్పుడు బాధపడేవారు. ప్రహ్లాద్‍వాళ్ళ నాన్నతప్ప మిగిలిన అందరితోనూ ఏదో ఒక సమస్య. బాబాయ్‍లిద్దరి సపోర్టు లేదు. మాయింట్లో ఎప్పుడూ డబ్బు ఇబ్బందులు. ఐతే ఇవేవీ పిల్లలమీద ఎవరూ ఎప్పుడూ చూపించలేదు. నామీదకూడా. నా చిన్నతనం బాగానే గడిచింది. కొంచెం పెద్దయాం చూడు, అప్పుడు మొదలయ్యాయి నాకు సమస్యలు” అని ఆగింది గీత.
“మాకెవరికీ లేని సమస్యలు నీకేమిటే?”
“మహాజనానికి మరదలుపిల్లనికదూ?” రోషంతో గీతముఖం ఎర్రబడింది. మహతి ఆమె వీపుమీద ఒక్కటి చరిచింది. “చెత్తమాటలు మాట్లాడకు. ఎవరే, నీతో అలా అన్నది?” అంది.
“అలిసిపోయాను మహీ! విసుగుపుట్టేస్తోంది. నాకిష్టమైనవాడితో- నా బతుకు- నాకు నచ్చినట్టు- ఇంకొళ్ళని బాధపెట్టకుండా బతకడానికి ఎన్ని ఆటంకాలో చెప్పనీ, అడ్డు రాకు” అంది గీత.
“గీతలా మాట్లాడేట్టైతే చెప్పు. లేకపోతే వినను. చెవులు గట్టిగా ముసేసుకుంటాను” బెదిరించింది మహతి.
“నిజం వినటానికి భయపడితే ఎలా?” అడిగింది గీత. నిజంగానే భయం వేసింది మహతికి ఆమెని చూస్తుంటే.
“అందరం ఒక స్కూల్లో చదువుకున్నాం. గుంపుగా తిరిగాం. వాళ్ళ స్కూలు చదువులై కాలేజిల్లో చేరాకకూడా తీరిక దొరికినప్పుడల్లా కోటకో, నదివొడ్డుకో వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరికి నచ్చినవాళ్లతో వాళ్లం గ్రూపులు కట్టేవాళ్ళం. నాతర్వాత దాదాపు ఐదేళ్లదాకా మనింట్లో పిల్లల్లేరు. మనగ్రూపుకూడా అక్కడే ఆగిపోయింది. నా తర్వాతివాళ్లందరినీ చిన్నపిల్లలనీ, మనచుట్టూ వుపగ్రహాల్లా తిరుగుతారనీ మనతో కలుపుకునేవాళ్ళం కాదు. వసంత్‍కీ కృష్ణకీ పెద్దగా తేడా కనిపించేదికాదు నాకు. అంత ఇమ్మెచ్యూర్డ్‌గా వుండేవాడతను. మనతో వున్నంతసేపు వున్నా, కృష్ణని వెంటేసుకుని తిరిగేవాడు ఎప్పుడూ. మాధవ్‍కి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సీరియస్‍నెస్ లేదు. అందర్నీ ఆటపట్టించడం, జోక్స్ వెయ్యడం. అంతే. సుమంత్ నాలాగే బాగా దుడుకు. నేనేవైనా గొడవల్లోకి వెళ్తే వచ్చేసి పక్కని చేరిపోయేవాడు. కుదిర్తే తనూ ఓ రెండు తన్నులు తన్ని, మరింత జటిలం చేసి, మొత్తానికి పైచెయ్యిగా తను బైటపడి, నన్నూ బైటపడేసేవాడు. ప్రహ్లాద్ సంగతి. ఎప్పుడేనా మాయిద్దరం పక్కపక్కని నిలబడితే ఎత్తులు కళ్లతోటే కొలుచుకునేది వాళ్లమ్మ. ఎవరూ పట్టించుకోని విషయం ఏమిటంటే మా యిద్దరికీ పోలికలు కలుస్తాయి మహీ! తెలీనివాళ్లెవరేనా చూస్తే మేం అక్కాతమ్ముళ్ళం అనుకునేవారు. ఈ నలుగురితోటీ నాకు ఎలాంటి సమస్యా వుందేదికాదు. జస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసిపోయేవాళ్లం. వాసుకీ, సుధీర్‍కీ నావిషయంలో పైకి కనిపించని పోటీ వుండేది. ఐతే ఎప్పుడూ తొణికేవారు కాదు. ఈమధ్యలోకి రాణా దూరిపోయాడు”
రాణా పేరు వినగానే మహతి వులిక్కిపడింది.
“వాడా?!! వాడికేం వుందనే? చదువా, వుద్యోగమా? వాసు కాలిగోటికి సాటిరాడు” అంది నమ్మలేనట్టు.
“అది వాడికి తెలీదుకదా? మహీ! మీ యిళ్ళలో పెద్దవాళ్ళకి మా నాన్నపట్లా, మా కుటుంబంపట్లా వున్న అభిప్రాయాలు మీ ప్రవర్తనలో తెలిసేవి. నాకు ఎప్పుడూ ఎవరిదగ్గిరా ఎలాంటి బేధభావం కనిపించలేదు. మా నాన్న పెట్టుపోతలు చెయ్యలేదని సాధించిన గురుమూర్తి మామయ్యకూడా నన్నెప్పుడూ తేడాగా చూడలేదు. అందరికన్నా చిన్నదాన్నని వొళ్ళో కూర్చోబెట్టుకుని బిస్కెట్లవీ స్వయంగా తినిపించిన రోజులు గుర్తున్నాయి. అంత కోపిష్టిమనిషి, మీ నాన్నకూడా నన్ను ఒక్కమాటకూడా అనలేదు. కానీ రాణావాళ్ళింట్లో మాట్లాడుకున్న మాటలతీరు వాడి ప్రవర్తనలో తెలిసిపోయేది. నన్ను వూరికే తాకడానికి ప్రయత్నించేవాడు. చిన్నపుడైతే కోపం వచ్చి గిల్లేసి, రక్కేసేదాన్ని. కాస్త పెద్దయ్యాక ఎవరూ లేనప్పుడు జడపట్టుకుని మీదికి లాక్కున్నాడు. చాలా నొప్పెట్టింది. కోపంకూడా అలానే వచ్చింది. చాచిపెట్టి చెంపమీద కొట్టాను.
ఏముందనే, నీకీ గర్వం? మీ నాన్న నీకు పెళ్ళి చేస్తాడనే? ఏం పెట్టి చేస్తాడు? సుధీర్, సుమంత్‍వాళ్ళకి బాగా డబ్బుంది. వాళ్ళు చేసుకోరు. వాసుమాత్రం? కట్నం ఇవ్వకపోతే చేసుకుంటాడా? నన్ను మంచి చేసుకో. పుస్తె కడతాను- అన్నాడు.
అవి చిన్నపిల్లలు, వాడివయసువాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎక్కడో అలాంటి భావాలు పుడతాయి. వాటిని వీళ్ళు అందిపుచ్చుకుంటారు. అసలు ఆమాటకొస్తే మనం మాట్లాడే మాటలేవీ మనవి కాదు. పెద్దవాళ్ళు నాటిన భావాల మొలకలు. పెద్దౌతుంటే పైపైన కాస్తకాస్త సంస్కరించబడతాయేమోగానీ, మూలాలదగ్గిర కాదు. మూలాలు మారడమంటే మామిడిటెంక పాతి, కొబ్బరిచెట్టు రావాలనుకోవడం.
నిలువునా వుడికిపోయాను. మాకు డబ్బులేదనీ, పేదవాళ్లమనీ ఇప్పటిదాకా నాకు ఎవరూ ఎత్తి చూపించలేదు. అందరం కలిసి ఎక్కడికేనా వెళ్ళినప్పుడు నా డబ్బులు నేను తెచ్చుకునేదాన్ని. నా ఖర్చులు మీ ఎవ్వరిచేతా ఎప్పుడూ పెట్టించలేదు. ఎగబడి మీ యిళ్ళలో తిన్నది లేదు. పోనీ నాకేమైనా వయసు వచ్చి, పెళ్ళికోసం తపించిపోతున్నానా? లేదే? పధ్నాలుగేళ్ళు. కొత్తగా వోణీలు వేసుకుంటున్నాను. మరి వాడికి? నాకన్నా మూడునాలుగేళ్ళు ఎక్కువ. అంతే. వాడిమాటలు సగం అర్థమయ్యాయి, ఇంకోసగం అర్థమవ్వలేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని గొడవ చేసేసి, వచ్చేసాను” గీత ఆగింది.
తన కళ్లముందు జరిగిన విషయాల్లోని కొత్త అర్థాలు ఆశ్చర్యంగా వింటోంది మహతి. గీత తామందర్లోకీ చిన్నది కావటంతో ఆమె గురించి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. చిన్నపిల్లలాగే అనిపించేది తనకీ, సుమతికీ. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో గొడవపడుతూ వుండేదికావటాన్న రవళిలో వున్న పరిణతికూడా ఆమెలో కనిపించేది కాదు.
“అక్కడితో ఆగలేదు రాణా. అందరం వున్నప్పుడు నా భుజంమీద చెయ్యివెయ్యబోయాడు. నేను చప్పుని లేచి దూరం జరిగాను.
గీతకి దూరంగా వుండరా! ముట్టుకోకు! దానికి నచ్చదు. శివంగిలా విరుచుకుపడుతుంది- అన్నాడు సుధీర్ చాలా మామూలుగా అన్నట్టు.
నీకూ అయిందా, అనుభవం- అన్నాడు రాణా. వాడి మాటల్లో నేను భరించలేనితనం. ఆ క్షణాన్న వాసు కళ్లలో కనిపించిన కోపం చూసి నాకు చాలా భయం వేసింది.
ఛస్! కొత్తగా తెలియాలా ఏంటి? చిన్నప్పట్నుంచీ తనంతే- అన్నాడు సుమంత్.
పక్కని కూర్చుంది. పొరపాట్న భుజంమీద చెయ్యివెయ్యబోయాను. దానికింత గొడవా, అంతా ఏకమై? అది నాకూ మరదలే- రాణా కోపంగా అన్నాడు.
గీత నీపక్కని కూర్చోలేదు. నువ్వే కుర్చీ జరుపుకుని తన పక్కని కూర్చున్నావు- అన్నాడు వసంత్. వాడెప్పుడూ అంతే. ఉన్నది వున్నట్టు చెప్పేస్తాడు. ఎలాంటి సంకోచం వుండదు. రాణా కోపంగా లేచి వెళ్ళిపోయాడు.
నాకు అస్సలు నచ్చలేదు. భరించలేనంత అసహ్యం కలిగింది. ఇప్పటిదాకా స్నేహంగా వున్నాం. ఇప్పుడింక వీళ్ళు నా కారణాన్న కొట్టుకుంటారా? నేనేమీ గొప్ప అందగత్తెని కాను. కన్నొకరా, కాలొంకరా లేదనిపించుకునే స్థాయి. అఖండమైన తెలివితేటలున్నాయా అంటే అత్తెసరు మార్కుల తెలివి. ఆస్తులున్నాయా అంటే ఆ పెంకుటిల్లు తప్ప మరేమీ లేదు మా నాన్నకి. వీళ్ళు దేనికోసం పోటీపడుతున్నారు? వాసుకి ఎందుకంత కోపం? సుధీర్ ఎందుకు కలగజేసుకోవాలి? వసంత్, సుమంత్ ఎందుకు మధ్యలోకి రావాలి? నేను ఆడపిల్లననా? వీళ్ళకి మామయ్యకూతుర్ననా? ఆ వయసుకికూడా చికాకు పుట్టించిన విషయాలు.
నాకు ఏదేనా ప్రాబ్లం వస్తే నేను చూసుకోగలను. మీరంతా దేనికి కలగజేసుకుంటున్నారు- అన్నాను మిగతావాళ్లతో కోపంగా.
అప్పటిదాకా నీతోనూ, ప్రహ్లాద్‍తోనూ సీరియస్‍గా ఏదో పుస్తకంమీద చర్చలో వున్న సుమతి నాగొంతు విని, ఇటు తిరిగింది. ఒట్టి తెలివితక్కువది. సగం విని మాట్లాడుతుంది.
ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదురా! దీనికోసం ట్రాయ్ యుద్ధాలూ, రామరావణ యుద్ధాలూ వుండవు. అన్నీ తనే ఆడేస్తుంది. సిటీబస్‍లో ఎక్కామనుకో, కొంచెం రద్దీ వున్నాసరే, సేఫ్టీపిన్ తెరుచుకుని నిలబడుతుంది. ఇది కళ్లతో గీసుకున్న హద్దు ఎవడేనా దాటాడో, పిన్నుపెట్టి గీరేస్తుంది. సెప్టికై చస్తాడే వాడు అన్నా వినదు” అంది. అంతా నవ్వేసారు. ఇంక సీరియస్‍నెస్ ఎక్కడుంటుంది? వాసు తలపట్టుకున్నాడు,
ఇన్నాళ్ళూ నేను నేర్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి_ అన్నట్టు నామీదికి ఓ చూపు విసిరి.
ఎక్కడ మనం ఏ గొడవపడినా వసంత్ మోసేసేవాడు. మగపిల్లలకి మెంటర్ రవి బాబాయ్. అతనికి మోసేసాడు. ఏం జరిగిందో, తర్వాత చాలాకాలం రాణా నాజోలికి రాలేదు. వాసుతో మాట్లాడటం పూర్తిగా ఆపేసాను. తనూ ఆపేసాడు. అప్పటికే లక్ష్మత్త రెండుమూడుసార్లు హెచ్చరించింది, మేమిద్దరమే విడిగా కూర్చుని మాట్లాడుకోకూడదని. బహుశ రాణా అన్న కారణానికేనేమో అనుకున్నాను. కానీ నాకు వాసంటే విపరీతమైన యిష్టం. తను ఎదురుగా వుంటే ప్రపంచం కనిపించేదికాదు. తనూ నేనూ విడివిడి మనుషులమని ఎప్పుడూ అనిపించేదికాదు. నాకేదైనా దెబ్బ తగిలి నొప్పెడితే తన ముఖంలోకి చూసేదాన్ని ఆ బాధ కనిపిస్తుందేమోనని. అలాగే కనిపించేది. అది భ్రమేమో అనిపించేలా, అలాంటి స్థితిలోంచీ నన్ను ఒక్కసారి బైటికి యీడ్చిపడేసాయి రాణా మాటలు.
మాకు డబ్బు లేదు. నాన్న కట్నం ఇవ్వలేడు. వాసు నన్ను చేసుకోడు- ఒక శాపం పెట్టినట్టు ఇవేమాటలు నా చెవుల్లో నిండిపోయాయి. విషంలా నా మనసంతా వ్యాపించేసాయి” ఆగింది గీత.
“గీతూ! అలాంటి మాటలు మాయిళ్లలో ఎప్పుడూ అనుకోలేదు. ఒట్టు. ప్రమీల ఆమ్మకూడా వుద్యోగం చేసేదికాబట్టి వాళ్ళకి కొంచెం డబ్బు ఎక్కువ వుండేదేమో! వాళ్ళుకూడా రెండుసార్లు ఇల్లమ్మారు. సుమతి పెళ్ళి ఇల్లమ్మే చేసారుకదా? మిగిలినవాళ్ళం అందరివీ ఒక్కలాంటి కుటుంబాలే. ఇద్దరం ఆడపిల్లలం అని మాయింట్లో భయంకరమైన పొదుపు వుద్యమం వుండేది. పిల్లల చదువులకోసం, వైద్యాలకోసం అప్పులు చెయ్యకుండా, లోన్లూ అడ్వాన్సులూ తీసుకోకుండా ఎవరింట్లోనూ సాఫీగా నడవలేదు. నిన్ను వాడలా అన్నాడంటే అంతకన్నా పెద్ద ఫూల్ మరొకడు వుండదు. నువ్వెలా నమ్మావే, ఆ మాటలు?” అడిగింది మహతి.
“నాకసలు ఏం తెలుసని? మాయింట్లో ఇబ్బందులు చూసి అంతే అనుకున్నాను”
“సంకల్పంలోంచీ అన్నీ సృష్టించి ఆరుగురు చెల్లెళ్లకి చేసాడే మీ నాన్న. నీకు చెయ్యలేడని ఎలా అనిపించింది?”
“తెలీదు. వాసు చేసుకోడన్నమాట నేను తట్టుకోలేకపోయాను. ఆ వయసుకి అలాంటి ఆలోచనలు వస్తాయా అని అడక్కు. సగం తెలిసీ, సగం తెలీని విషయాలు. పెళ్లంటే ఏమిటో తెలీకపోయినా, పెళ్లైతే జీవితాంతం ఇంక విడిపోనక్కర్లేకుండా ఒకచోటే వుండటమన్న విషయం తెలుస్తుందికదా, అలా.
మీరంతా పై చదువులవైపుకి వెళ్తే నేను వుద్యోగం వెతుక్కున్నాను. నాన్న నాకు పెళ్ళి చేసినా చెయ్యకపోయినా, తనకి నేను బరువు కాకూడదనుకున్నాను. ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు నాలో నాకే సాగేవి. వాసుకూడా చదువు ఆపేసి వుద్యోగంలో చేరాడు. వాళ్ళింట్లో పరిస్థితులు వేరు. ఆ మామయ్య ఇల్లు పట్టించుకోరు. వాసు ఇద్దరు అత్తలకీ భర్తలు లేరు. మంచిచెడులు తనే చూసుకునేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమీద అన్నీ వదిలిపెట్టి రోజుకి పాతిక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసో, హాస్టల్లో వుండో చదువుకోవడం తనకి నచ్చలేదు. ఆ చర్చ మాయింట్లోనే జరిగింది. నాన్న తన నిర్ణయాన్ని సమర్ధించారు”
“వాడు మొదట్నుంచీ చాలా బాధ్యతగల మనిషి” అంది మహతి.
“ఇంట్లో నా పెళ్ళి తలపెట్టారు. బైటి సంబంధానికి వెళ్ళాలా ఇంట్లో సంబంధమేనా అని నాన్న నా యిష్టం అడిగారు. నేను చెప్పాను. ఔతుందా, అవదా అనే ఆలోచన రాలేదు. వాళ్లు కట్నం అడుగుతారా అన్న ఆలోచనకూడా రాలేదు. నాన్నకి చెప్పేసానన్న భరోసా. పెళ్ళిమాటలకి నన్నొక్కదాన్నీ ఇంట్లో వదిలేసి అంతా వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు…” ఆగింది గీత. గుర్తుతెచ్చుకోవడానికీ చెప్పడానికీ ఇష్టం లేనట్టు కొద్దిసేపు బ్లాంక్‍గా చూస్తూ వుండిపోయింది. చెప్పాలన్న గట్టి పట్టుదల వుండటంతో మళ్ళీ కొనసాగించింది.
“రాణాకి విషయం తెలిసి వచ్చాడు.
నిన్ను నేను ప్రేమిస్తున్నాను గీతా! వాసుని చేసుకోకు. వద్దని చెప్పెయ్- అన్నాడు. ప్రేమ అనేమాట తన నోట్లోంచే మొదటిసారి విన్నాను. వాసూ, నేనూ ఎప్పుడూ అనుకోలేదు. తెలిసీతెలీని వయసులోకూడా.
వాడిలో ఏముందని చేసుకుంటున్నావు? నేను ఎందులో తక్కువ. క్లర్కు వుద్యోగమేకదా వాడు చేసేది? ఆపాటి నాకూ వస్తుంది. స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకుంటాను- అని వాదనకి దిగాడు.
వాసునీ, సుధీర్‍నీ రవి బాబాయ్ పోల్చాడు. ఇద్దరు యోగ్యులమధ్య పోలిక గొప్పగా అనిపించింది. వాసు విలువ పెరిగినట్టనిపించింది. వీడితోకూడా వాసుని పోల్చాలా? వెళ్ళిపొమ్మని చెప్పాను. మా నాన్న కట్నాలిచ్చి, ఖర్చుపెట్టి పెళ్ళి చెయ్యలేడుకాబట్టి వీడికి యిచ్చి చేస్తే ఎలాగా నాకు వుద్యోగం వుందిగాబట్టి ఎలాగో ఒకలా బతికేస్తామని వాళ్ళింట్లో అనుకున్నారట. ఆ మాటలమీద బాగా ఆశలు పెట్టుకుని వచ్చాడు. గంటసేపు వాదించాడు.
మహీ! నాకు విసుగొచ్చేసిందే!
అప్పటికే రవి బాబాయ్ సుధీర్ విషయంలో వప్పించడానికి పెద్దప్రయత్నం చేసాడు. ఇప్పుడు వీడు తయారయ్యాడు.
వెళ్ళిపోరా! నీకు దణ్నం పెడతాను. నాకు మీ ఎవరూ వద్దు. వాసుని చేసుకుంటాను. మా యిద్దరికీ చిన్నప్పట్నుంచీ ఒకళ్లంటే ఒకళ్లకి యిష్టం. నన్ను మెండ్ చేసిందీ, నాకు కాస్త బుద్ధీ జ్ఞానం నేర్పిందీ అతనే. అర్థం చేసుకోండిరా! నేను మీకు అవకాశాన్నీ, మీరు నాకు ఎంపికా కాదు- అన్నాను.
వాడుకూడా విసిగిపోయాడు. వెళ్తూ ఏమన్నాడో తెలుసా?
వాడేదో దయదల్చి చేసుకుంటున్నాడు. ఆ దయ ఎంతకాలం వుంటుందో, వాడితో కాపురం ఎలా చేస్తావో చూస్తాను. వాడు నిన్నొదిలేస్తాడు. అప్పుడు నిన్నుంచుకోవడానికి మళ్ళీ వస్తాలే- ఈ మాటల్ని ఎంత మోటుగా అనచ్చో అంత మోటుగానూ అన్నాడు. పెళ్ళి జరగబోతోందన్న సంతోషం మిగలకుండా చేసాడు”
మహతి విచలితురాలైంది. ఒక్కొక్క మనిషి ఈ భూమికి ఎంత భారంగా పుడతారు! వీడు, రాణా చదువు సరిగ్గా చదువుకోలేదు. సరైన వుద్యోగం లేదు. ఇప్పటికీ జీవితంలో స్థిరపడలేదు. ఎవరు కనిపిస్తే వాళ్లని పదీ పరకా అడిగి బతికేస్తున్నాడు. ఇప్పుడు వాడు గీతని దేనికి సతాయిస్తున్నాడు? డబ్బుకోసమా? అదే ఐతే గీత ఇంత బాధపడదు. అందరికీ చెప్పి ఎంతోకొంత సర్దుతుంది. సమస్య అక్కడ ఆగి వుండదు.
“వాడు వెళ్ళాక చాలాసేపు ఏడ్చాను. ఆ మాటలకి, నాతో కలిసి పెరిగినవాడి సంస్కారం ఇలా వున్నందుకు, వాడి దృష్టి నామీద వున్నందుకు, వాసు తనకి అన్ననికూడా ఆలోచించని వాడి మూర్ఖత్వానికి అన్నిటికీ ఏడ్చాను”
“ఇంత జరిగితే వాడి భార్యకి వైద్యమదీ ఎందుకు చేయించావు గీతా?”
“వాళ్ళు మాకు బాగా తెలిసినవాళ్ళు. వీడు మాయమాటలు చెప్పి ఆమెని పెళ్ళిచేసుకున్నాడు. చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. కవలల్తో. ఇక్కడ ఆమెకి జరగట్లేదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏమీ లేదు. చాలా బీదవాళ్ళు మహీ! నేను, నీలిమ, రమ, లత- మా అందర్లాగా ఆ పిల్లకూడా మన కుటుంబానికి మెట్టి వచ్చి వచ్చింది. తెలిసి తెలిసి వూరుకోలేకపోయాను”
“ఆ అమ్మాయి మళ్ళీ మన మధ్యకి రాలేదు. వాళ్ళిద్దరూకూడా సఖ్యతగా వున్నట్టు లేరు”
“మన బాధలూ, కోపాలూ మరొకరికి చేసే సాయాన్ని ప్రభావితం చెయ్యకూడదుకదా?”
“అప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ చెప్తున్నావు” అంది మహతి.
“ఎప్పుడు జరిగినా వాటి ప్రభావం లేకుండా వుండదుకదా?”
“తర్వాతేం జరిగింది? మీ నిశ్చితార్ధానికిగానీ, పెళ్ళికిగానీ వాడు రాలేదు”
“పెళ్లయ్యాక మా ఆఫీసుకి వచ్చాడు”
“ఆ<” అంది మహతి వులిక్కిపడి.
“వాసూవాళ్ళూ కట్నం వద్దన్నారని మామ్మ సంతోషపడింది.
కట్నం వద్దనడం మంచితనానికి కొలమానమా- అని అడిగాను నేను. అదికాదట. వాసు మంచివాడట. అంటే ఏమిటో అర్థమవ్వలేదు. వాసుతో మాట్లాడద్దని కోప్పడ్డ అత్త ఇప్పుడీ సంబంధానికి ఎందుకు వప్పుకున్నట్టు? పెళ్ళికి అమ్మ తన బంగారం నాకు పెట్టేసింది. మయూ పుట్టినప్పుడు నాన్న స్థలం ఇచ్చారు. మా అమ్మమ్మ పోయినప్పుడు అమ్మకి వాటాగా వచ్చిన పొలం అరెకరం నా పేర్న పెడితే తీసుకున్నాను. ఇచ్చినవన్నీ. నిర్లజ్జగా. మహీ! ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో సిగ్గనిపిస్తుంది. కానీ పెళ్ళి అనేదానికి పునాది డబ్బే అనిపించిన రోజులవి. నాన్న నాకోసం అందర్లాగే అన్నీ చెయ్యగలరని మీ అందరికీ తెలియాలని అనిపించిన రోజులవి. రాణా మాటలు నామీద అంత ప్రభావాన్ని చూపించాయి”
“పెద్దవాళ్ళు పిల్లలకి పెట్టుకోరే?”
“అందరి విషయం వేరు. నాన్న విషయం వేరు. అవన్నీ వుంటే అమ్మానాన్నల జీవితం మరింత హుందాగా వుండేదికదా?”
“నీకు ఇచ్చారుకాబట్టి అవి అలా వున్నాయి. బాధ్యతల్లో యిరుక్కుని వున్న మనిషిదగ్గిర ఆస్తులు నిలవ్వు గీతూ!”
“మా మామయ్యా, నాన్నా కలిసి వెళ్లి తాంబూలాలిచ్చి వచ్చారు. ముహూర్తాలు పెట్టుకునేరోజు అందర్నీ పిలిచారు నాన్న. రాణా తప్ప అందరూ వచ్చారు. ఎందుకు రాలేదని మామూలుగా అడుగుతారుకదా, అలా అరుణత్త అడిగితే,
వరసపెట్టి మీ మూడిళ్ళవాళ్లనీ అడిగాడు అన్నయ్య. గీతని చేసుకొమ్మని. నా కొడుకుని వదిలేసాడు. కోపం రాదా- అందట వాళ్ళమ్మ.
అలా ఏమీ లేదే. వాసుకి లక్ష్మి అడిగింది. గీతా చేసుకుంటానంది. ఆ విషయం చెప్పడానికి వెళ్తే ప్రమీల మరోలా అర్థంచేసుకుంది. పెద్దపిల్లలు వాళ్ళిద్దరూ వుండగా ప్రహీకి ఎందుకు అడుగుతాడు- అరుణత్త సర్దిచెప్పింది. కానీ ఆవిడైతే కోపంగానే వుంది. అలాంటి కోపాలకి వేరే కారణాలూ బాధలూ వుంటాయని అప్పుడు నాకు తెలీదు. వాడు రాకపోవడంతో తేలిగ్గా ఫీలయ్యాను.
పెళ్ళికికూడా రాణా రాలేదు. సుధీర్ వచ్చాడు. సుమతికూడా నామీద చాలా కోపంగా వుంది. గుంపులో కలిసి మీతో తిరగడంతప్ప ప్రత్యేకించి ఎందులోకీ రాలేదు. నేనేదో తప్పుచేసినట్టు నన్ను దూరం నెట్టేసారు వాళ్ళు ముగ్గురూ. పెళ్ళి జరుగుతున్న వుద్వేగంలో అప్పుడంత తెలీలేదుగానీ, తర్వాత చాలా బాధపడ్డాను” ఆగింది గీత.
“…”
“పెళ్ళయాక ఒక చిన్నస్వర్గంలోంచీ మరో పెద్దస్వర్గంలోకి అడుగుపెట్టినట్టనిపించింది. పెద్దవాళ్ళంతా కలిసి నా పెళ్ళిఖర్చులకోసం నాన్నకి డబ్బు ఇవ్వబోయారు. నాన్న తీసుకోలేదు.
నేను దానికి పెళ్ళికూడా చెయ్యలేనని అనుకుంటుంది. మీరు ఇవ్వాలనుకున్నదేదో దానికే యివ్వండి. నా స్థాయికి తగ్గట్టు నేను పెళ్ళి చేస్తాను- అన్నారట. ఎంత గొప్పమనిషే, ఆయన! ఆ డబ్బుతో అరుణత్త నాకు ఏమేమి అవసరమౌతాయో అవన్నీ కొంది. ఆఫీసుకి కట్టుకోవడానికి నాలుగు తేలికపాటిచీరలు, చెప్పులు, హేండ్‍బేగు, చక్కగా సర్దుకోవడానికి లంచిబాక్సులు, వంట తేలిగ్గా అవడానికి పెద్దకుక్కరుతోసహా సారిసామానంతా కొంది. నన్ను దగ్గిర కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు చెప్పింది. ఇంకెన్నో విషయాలు నేర్పించింది. ఎవర్ని ఎలా చూడాలో, గౌరవించాలో అన్నీ సునిశితంగా వివరించింది.
ఇప్పటిదాకా నువ్వు అమ్మచాటు పిల్లవి. ఏవేనా పొరపాట్లు చేసినా అవి చిన్నచిన్నవి. ఎవర్నీ పెద్దగా బాధపెట్టవు. పెట్టినా తాత్కాలికం. కానీ ఇప్పుడు నువ్వు అనుభవించేది నిజమైన జీవితం. నీ జీవితం. నువ్వు, వాసు, ఈ అందరు కుటుంబసభ్యులు, వాళ్లందరిమీదా నువ్వు చేసేవాటి ప్రభావం పడుతుంది. ఆ తర్వాత నీకు బుజ్జిబుజ్జి పిల్లలు పుడతారు. వాళ్లు నిన్ను చూస్తూ అన్నీ నేర్చుకుంటారు. నీ వొళ్ళోంచేగా, వాళ్లకి బయటికి దారి తెలిసేది? ఎంత తొణక్కుండా వుంటే అంత సుఖంగా వుంటావు. ఆలోచన, వివేచన పెంచుకోవాలి. తొందరపాటుతనం, దురుసుతనం వదిలిపెట్టాలి- అంది.
చిన్నప్పట్నుంచీ నేనుకూడా చెప్తునే వున్నాను పిన్నీ- అన్నాడు వాసు నవ్వుతూ.
అప్పుడే అనేసుకున్నావేమిట్రా, ఇది నీ భార్యౌతుందని- అంది తనూ నవ్వి. వాసు సిగ్గుపడ్డాడు.
సిగ్గుపడతావేంటి పిల్లగా, చెప్పు. పెళ్ళి జరుగుతుందో లేదోనని తిండీతిప్పలూ మానేసి ఎంత బెంగపడిపోయావో- అంది వాళ్ళ మామ్మ భోళాగా నవ్వుతూ. అతను మరింత సిగ్గుపడిపోయాడు.
నన్ను వంటరిగా కూర్చోబెట్టుకుని అరుణత్త మరికొన్ని విషయాలు చెప్పింది.
మనింట్లో మగపిల్లలంతా సంస్కారం వున్నవాళ్ళేగానీ, ఒకొక్కసారి తెలీకుండానే పొరపాట్లు జరిగిపోతుంటాయి. మగపిల్లలకి భార్యపట్ల పొసెసివ్‍నెస్ చాలా వుంటుంది. వాసు మంచిపిల్లాడే. ఐతే వాడికిప్పుడు నువ్వు భార్యవి. అది గుర్తుంచుకో. ఎవరికీ చనువు ఇవ్వకు. నీకు ఎవరివల్లనేనా ఇబ్బందికలిగితే నాతో చెప్పు. నందకిషోరో, రవో చూసుకుంటారు. ముఖ్యంగా రాణాతో జాగ్రత్తగా వుండు- అంది. వాడు నాతో అన్నమాటలు చెప్పాలా, వద్దా? నాలో ఆలోచన. చెప్పలేకపోయాను. సంకోచం కలిగింది.
వాసూవాళ్ల మామ్మకూడా నన్నొక్కదాన్నీ కూర్చోబెట్టుకుని చాలా మాట్లాడింది.
“పిల్లా! మీ అత్త యిక్కడ యిన్ని కష్టాలు పడుతోంది. మళ్ళీ యింకోదాన్ని యీ యింటికి యిస్తారని ఎవ్వరం అనుకోలేదు. వాసుకి ఎంత యిష్టమైనా అడగడానికి ఎంతో ఆలోచించింది లక్ష్మి. దాన్ని జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. ఎప్పుడూ గొడవపడొద్దు. వాసు దానికి కొడుకయ్యాకే నీ మొగుడయ్యాడని మర్చిపోవద్దు. తులసమ్మ బాధ్యత మీదే. నీకులాగే మంచి సంబంధం చూసి సాగనంపాలి” అంది. అంత పెద్దావిడా కళ్లనీళ్ళు పెట్టుకుంది. చిన్నపిల్లని దగ్గరకి తీసుకున్నట్టు నన్ను దగ్గరకి తీసుకుంది. మనసులో నాటుకుపోయాయి ఆవిడ మాటలు”
“ఊ< నీ మనసు దుక్కి దున్ని పదునుమీదుంచిన పొలం. అందరిమాటలూ అందులో నాటుకుపోయి మొలకలెత్తి మహావృక్షాలైపోతాయి” అంది మహతి నవ్వుతూ.
“కావచ్చు మహీ! నా ఆలోచనల్లో నేను చాలా చిక్కుకుపోతుంటాను” అంది గీత.
“అన్నీ చెప్పేవాడు అతిగా ఆలోచించడం తప్పని ఎప్పుడూ చెప్పలేదా, వాసు?”
“తనకి తెలీదుగా? పదింటికల్లా తనకి నిద్రొచ్చేస్తుంది. నేను పక్కనే కళ్ళుమూసుకుని పడుక్కుంటానుగానీ, ఆ తర్వాత గంటో రెండుగంటలో నిద్రపట్టేదాకా నాకీ ఆలోచనలన్నీ సాగుతాయి. ఒక్కోసారి తెల్లారేదాకాకూడా”
“ఓసినీ!” అంది మహతి. విస్మయంగా చూసింది. గీత పట్టించుకోనట్టు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.
“ప్రమీలత్త అప్పటికి కాస్త అలకలో వుంది. అందుకని తను నేరుగా కలగజేసుకోలేదు. సంధ్యత్త అలక మరోతీరు. కుసుమపిన్ని, బాబాయ్ ఇక్కడికి బానే వస్తారు. వాసూ వాళ్ళ మామ్మ. వాసు ఆవిడ వెంట వుండి అన్నీ చూసుకుంటాడు. మామ్మామనవలకి పెద్ద అనుబంధం. ఇక ఆవిడ కూతుళ్ళు, మనవరాళ్ళు. హడావిడంతా వీళ్ళదే. వీళ్ళందరి ప్రేమలో తడిసి ముద్దైపోయాను. అత్తని రాణా తగిలించిన రంగుటద్దాల్లోంచీ చాలా పరీక్షగా చూసాను. ఆవిడకూడా సంతోషంగానే వుంది. పెళ్ళితంతంతా అయ్యేసరికి ఆ అద్దాలు మంచుపొరల్లా కరిగిపోయాయి.
మహీ! ఒక మనిషిని ఇంతమంది ప్రేమిస్తారా, ప్రేమించగలరా అని ఇప్పుడు గుర్తొస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో! ప్రేమతో ప్రపంచాన్ని శాసించగలిగినప్పుడు ద్వేషం అనే మార్గాన్నీ, కుళ్ళునీ, కుత్సితాన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాం మనం? నన్ను నిరంతరం బాధించే ప్రశ్నలివి. నాకు ప్రేమంటే చాలా యిష్టం. నేను కలిసిన అందరినీ ఒకలానే చూసాను. కానీ మీకు నేనిచ్చిన ప్రేమలో స్థిరంగా నాకు తిరిగి వచ్చినది చాలా తక్కువ. ఇంకోమార్గంలోకూడా ప్రేమని పంచాను. మయూఖ్ విహంగ్‍ల స్కూల్లో పిల్లలకి పంచాను. వాళ్ల తల్లిదండ్రులతో అనుబంధం పెంచుకున్నాను. అక్కడ నేను యిచ్చినదానికి వందలవేల రెట్లు తిరిగొచ్చింది. మిమ్మల్ని నేను ప్రేమించిన విధానంలోనే ఏదో లోపం వుందేమో!” అంది గీత.
“లేదు గీతా! నీమాటంటే ఇప్పటికీ అందరికీ గురే. నువ్వు ప్రేమ అన్నది రూపురేఖలు మార్చుకుంది అంతే. కుటుంబాలు, వాటి నిర్వహణ, మధ్యలో వచ్చి చేరాయి అందరికీను. అవి అనివార్యంకదా? ఈ బాధ్యతల్లోంచీ బయటపడ్డాక అందరూ అవంతీపురంవైపే చూస్తారు. గుర్తు తెచ్చుకో, నువ్వు చెప్పావని నాకోసం అందరూ వంతులువేసుకుని వచ్చారు. చంటిపిల్లని తీసుకుని సుమతికూడా వచ్చింది. అదో మహరాణీ. అప్పట్లో మీకు మాటలుకూడా లేవు. ఐనా వచ్చింది అది. ఇప్పుడీ పెళ్ళి చూడు, దీంతోపాటు ఎన్ని పెళ్ళిళ్ళు కుదురుస్తావో! నువ్వు మన కుటుంబానికి పెద్ద ఎసెట్టన్నాడు సుమతి భర్త” అంది మహతి.
గీత దు:ఖంయొక్క మూలం దొరకట్లేదు. చెప్పే విషయాలు, పడుతున్న బాధ పొంతన లేకుండా వున్నాయి. తను యౌవనంలో వుండి, చుట్టూ వున్నవాళ్ళు నడివయసులోనూ ప్రారంభవృద్ధాప్యంలోనూ వుండగా చూసిన గీత ఇప్పుడీ చుట్టూ వున్న ముసలివాళ్ళని చూసి బెంగపడుతోందా అనికూడా అనిపించింది. కొన్నాళ్ళు ఎటేనా తిరిగి వస్తే తేరుకుంటుందేమో! అసలు మాధవ్ బాధ్యత వదిలిపెట్టి ఏమీ కానట్టు అలా ఎలా వుండగలుగుతున్నాడు? కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చి వుండచ్చుకదా? మళ్ళీ అప్పుడు ఆస్తిలెక్కలొస్తాయేమో! అవొక్కటేనా, మనుషులమధ్య వుండేవి?
మేఘన పెళ్లిచేసి, తనిక్కడికి వస్తే ఈ సమస్యకి కొంత పరిష్కారం దొరకచ్చు.
రాణా దీన్నెందుకు బాధపెడుతున్నాడు? వాసుకి తెలీదా? తెలిసీ ఎలా వూరుకుంటున్నాడు? సుధీర్ విషయంలో చులకనగా ఒక మాట అన్నాడు. ఈ విషయంలోనూ అలాగే అని వుంటాడా? గీత పడుతుందా? పడి వూరుకుంటుందా? సర్దుకుపోతుందా? గీత మనస్తత్వం అలాంటిది కాదు. అలా మారిందంటే ఎంత సంఘర్షణపడివుంటుందో! ఆమె ఆలోచనలు అలా సాగుతునే వున్నాయి. గీత స్వరం మళ్ళీ వినిపించింది.
“పదహార్రోజుల పండగ అయ్యి, హడావిడంతా తగ్గాక ఆఫీసులో చేరాను. ఇప్పట్లా క్యుబికల్స్ కాకుండా హాల్లో పెద్దపెద్ద టేబుళ్ళు వుండేవి మాకు. వాటి వెనకకూర్చుని పని చేసుకుంటాం. ముందువైపుని మాకోసం ఎవరేనా వస్తే కూర్చుందుకు ఒకటో రెండో కుర్చీలుంటాయి. ఈ కుర్చీలు ఎక్కువ వుండవు. ఎవరి సీటుముందు అవసరమైతే అక్కడికి సబ్‍స్టాఫ్ తెచ్చి వేస్తాడు. నాముందు కుర్చీ వుంది. ఖాళీగా వుంది. రాణా వచ్చి కూర్చున్నాడు. తలొంచుకుని పని చేసుకుంటున్న నేను ఎవరో అనుకుని తలెత్తితే వీడు! ఆరోజు అంతమాట అని మళ్ళీ ఎందుకొచ్చాడు? ఐనా ఇక్కడేం పని, ఇంటికి వెళ్ళక? నాలో అసహనం”
“ఎందుకొచ్చాడు?” అడిగింది మహతి.
“గీతూ- అన్నాడు.
వదిన- సరిచేసాను.
పోనీ గీత- తన ప్రశ్న.
వదినే- కచ్చితంగా చెప్పాను. కొద్దిసేపు మాట్లాడకుండా వూరుకున్నాడు. అటెండరు ఫైలు తీసుకుని వచ్చాడు. అతను వెళ్ళేదాకా ఆగాడు. తర్వాత ఏదో విషయం మాట్లాడేందుకు నా పక్కసీటామె వచ్చింది. ఆమే వెళ్ళింది. అలా ఎవరో ఒకరు రావడం, ఫైల్స్ కదలిక, అన్నీ చూస్తూ కూర్చున్నాడు. తన చూపులు నేను చేస్తున్న పనిమీద కాదు. నామీద. చికాగ్గా అనిపించింది.
బైటికి వెళ్దామా- అడిగాడు.
కుదరదు- జవాబిచ్చాను.
ఎందుకని అడగవా- అన్నాడు.
అవసరం లేదు- చెప్పాను.
ఒక్కసారి. ప్లీజ్. మళ్ళీ నిన్నడగను – అన్నాడు బతిమాలుతున్నట్టు. మామూలుగా బైటికి వెళ్ళడానికి కాదు, వాడు అడుగుతున్నది. మాటల్లో ఏదో తేడా. వక్రత. నాకు మొదట అర్థమవ్వలేదు. కళ్ళు ఎర్రగా వున్నాయి. తాగి వున్నాడా? అదీ తెలీదు. తాగినవాళ్లని నేనెప్పుడూ చూడలేదు. మామూలుగానైతే లేడు. వాడు వెళ్ళిపోతే బావుణ్ణనిపించింది. అటెండర్ని పిలిచి పంపించెయ్యనా? ఎలా? అంత మొరటుగా ప్రవర్తించడం ఎలా? గొడవై, నాన్నకి తెలిస్తే అసలేం జరిగిందో తెలీక నన్నే కోప్పడతారు. వీడు అంటున్నమాటలన్నీ తిరిగి అప్పజెప్పడం నాకు రాదు. నేనింకా ఆలోచిస్తున్నాను.
ఇంట్లో ఎవరూ లేరు. నీకిష్టమైతే అక్కడే. లేకపోతే ఏదేనా లాడ్జికి వెళ్దాం. మళ్ళీ ఆఫీసు అయ్యేవేళకి ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతాను. ఎవరికీ అనుమానం రాదు. నాకు నీమీద చాలా క్రష్ వుంది. కళ్ళుమూసుకున్నా తెరుచుకున్నా నువ్వే గుర్తొస్తున్నావు. పిచ్చెక్కిపోతోంది. ప్లీజ్. ఒక్కసారే. ఆ తర్వాత నీజోలికి రాను. దుబాయ్‍లో అఫర్ వచ్చింది. వెళ్ళిపోతాను- అన్నాడు” గీత ఆగింది. మహతి నిర్ఘాంతపోయింది. నోట్లోంచీ మాట రాలేదు.
“ప్రతిమగవాడూ ఛేజర్ కాదు. ఉమనైజర్ కాదు. అందుబాటులో ఎవరేనా వుంటే ఒక ప్రయత్నం చెయ్యాలనిపిస్తుంది. ఆ స్త్రీ ఆహ్వానిస్తోందనుకుంటే ఇంకాస్త ముందుకి వెళ్తాడు. ఇవి అతని మనసులో జరిగే ఆలోచనలు. వాటితో ఆ స్త్రీకి ఎలాంటి సంబంధం వుండదు. ఆమె అందుబాటులోనూ వుండదు, ఆహ్వానించదుకూడా. ఆమె ప్రపంచంలో ఆమె వుంటుంది. ఇద్దరికీ మధ్య అగడ్తకూడా వుంటుంది. దాన్ని అతను దాటలేడు. అందులోకి ఆమెని లాగే ప్రయత్నం జరుగుతుంది. ప్రేమ పేరుతో, మరో పేరుతో. ఇవి వయసు వస్తుంటే నాకు తెలిసిన విషయాలు. ఆడా మగా తేడా లేదనుకుని కలిసి తిరుగుతున్నారు ఇప్పటి పిల్లలు. అందర్లో ఒకడుంటాడు దుర్మార్గుడు. వాడివలన ఆ పిల్ల జీవితం పాడౌతుంది. మిగతావాళ్ళు ఎంత మంచివాళ్ళయ్యీ ఏం లాభం? ” అంది గీత.
మహతి ఇంకా ఆశ్చర్యంలోంచీ తేరుకోలేదు.
“అప్పుడు నాకు ఇవేవీ తెలీవు. అసలే రెండుస్వర్గాల మనిషిని. వాడిని చూస్తుంటే చీదరపుట్టింది. బురదలో దొర్లిన జంతువుని చూసినంత అసహ్యం కలిగింది. ఈ జంతువు ఎందుకు నా వెంటపడుతోంది? నేనేదైనా అలుసిచ్చానా?
ఇది ఆఫీసైపోయింది. లేకపోతే చెప్పు చేతిలోకి తీసుకునేదాన్ని- అన్నాను.
అందుకే ఇక్కడికి వచ్చాను- జవాబు.
కంఠాణీ చేతిలోకి తీసుకున్నాను. అంటే ఫైళ్ళు కుట్టడానికి వాడే చెక్కపిడి వున్న ఇనపములుకు. చెక్కపిడిలో తాపడం చేసి వుంటుంది. టేబుల్ కిందనుంచీ అటు చివరకి సరిగ్గా వాడి మోకాలిమీదకి ములుకు వచ్చేలా పట్టుకున్నాను. మరో చేత్తో పేపర్ వెయిట్ పట్టుకున్నాను.
ఏం చేస్తున్నావే- అయోమయంగా అడిగాడు.
ఇప్పుడు నువ్వు లేచావనుకో, కంఠాణీ సరిగ్గా నీ మోకాల్లోకి దిగుతుంది. కుర్చీ వెనక్కి జరుపుకుంటే కుర్చీతోపాటు వాలుగా వచ్చి దిగుతుంది. రెండోచేతిలో వున్నది గాజు పేపర్‍వెయిట్. కంఠాణీ తప్పించే ప్రయత్నం చేస్తే ఇది జారిపడిపోయి, బౌన్సుకూడా అయి నీ మొహం పగలగొడుతుంది. ఎంతసేపు కూర్చుంటావో కూర్చో- అన్నాను కసిగా.
రాక్షసీ- అన్నాడు కోపంగా.
అర్థమైందిగా- నా జవాబు.
పొగరే, నీకు. అందరూ కలిసి నెత్తికి ఎక్కించుకుంటున్నారు- అన్నాడు.
నాకు కాకపోతే నీకుంటుందా పొగరు? చదువుంది. ఉద్యోగం వుంది. పెళ్ళీ అయింది. దిక్కులేని పెళ్ళిలా కాదు. మా నాన్న ఏం పెట్టగలడో నువ్వే చూసావుకదా? అందరి ప్రేమాభిమానాలున్నాయి. నీకేం వుందో నువ్వే ఆలోచించుకో. వద్దురా! ఇలాంటి బతుకు. మీనాన్నని కాదు, మీ అమ్మని చూసి మారు- అన్నాను.
అదేదో కాలిమీంచీ తియ్, వెళ్తాను- అన్నాడు లేవడానికి వుపక్రమించి.
తీసేసాను. వెళ్ళిపోయాడు”
“గీతా! వీడిగురించి ఎవరికీ ఎందుకు చెప్పలేదు?” అడిగింది మహతి.
“ఎందుకు చెప్పలేదు? రవి బాబాయ్ వాడి మక్కెలు విరగ్గొడితే?”
“వాసుకి తెలుసా?”
“చక్కగా. సాయంత్రం ఆఫీసయ్యేదాకా కోపంతో వుడికిపోయాను. ఫ్రెండ్స్‌తోకూడా సరిగ్గా మాట్లాడలేదు. ఇంటికి రాగానే చిటపట్లాడుతున్న నా మొహం చూసి ఏమైందని అడిగాడు. చెప్పేసాను. రాణా మా ఆఫీసుకి వచ్చి పిచ్చిగా మాట్లాడాడన్నానుగానీ ఏమన్నాడో చెప్పడానికి సంకోచం కలిగింది. తనూ అడగలేదు. తనకీ బాగా కోపం వచ్చింది. నిగ్రహించుకోవడానికి టైం పట్టింది. సుధీర్‍లాగ నేను తనని బేలన్సు చెయ్యలేకపోయాను. అది నేర్చుకోవాలని అర్థమైంది.
తయారై రా! బైటికి వెళ్దాం. అమ్మకీ, మాధవ్‍కీ ఏమీ చెప్పకు- అన్నాడు.
ఎక్కడికి- అడిగాను.
వాళ్ళింటికే- చెప్పాడు. వాళ్ళింటికి వెళ్ళి దెబ్బలాడటమంటే నాకు చిన్నగా సంతోషం వేసింది. మనకొక అన్యాయం జరిగినప్పుడు పోరాడేవాళ్ళు తోడుంటే ఎలాంటి సంతోషం కలుగుతుందో అలాంటి సంతోషం. ఇద్దరం బయల్దేరాం. వాళ్లమ్మతో చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నామో.
ఆదివారం వెళ్ళచ్చుకదరా! ఇంత పొద్దుపోయాక దేనికి- అంది అత్త.
చిన్నపనుంది. తొందరగానే వచ్చేస్తాం- వాసు జవాబు.
భోజనాలవీ పెట్టుకోకండి. వంటైపోయింది- అంది. తలూపాడు.
కందిపచ్చడి ఇస్తాను. పిన్నికివ్వు. దానికి చాలా యిష్టం- అని లోపలికి వెళ్ళబోయింది.
ఇప్పుడు కాదమ్మా! మరోసారి వెళ్లినప్పుడు చేసి ఇద్దువులే- వాసు వారించాడు.
నేనూ వస్తానన్నయ్యా. రాణా నాకు పచ్చగులాబీ తీగ ఇస్తానన్నాడు- అంది తులసి.
వాళ్ళింట్లో పచ్చగులాబీ లేదు. ఫ్రెండ్సెవరినో అడిగి తేవాలి. రాత్రివేళ ఎవరేనా మొక్కలు ఇస్తారంటే? నేను గుర్తుచేస్తాలే- వాసు తెచ్చిపెట్టుకున్న సహనంతో నచ్చజెప్పాడు.
అన్నయ్యా, వదినా పనిమీద వెళ్తున్నారుకదా, ఇంకోసారి నేను తీసుకెళ్తాలే. వాళ్లని వెళ్ళనీ- అంది అత్త.
మమ్మల్ని చూసి సంధ్యత్త చాలా సంతోషపడింది.
ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేసారేమిట్రా? భోజనాలు చేసి వెళ్ళండి- అంది వండటానికి లేస్తూ.
ఇప్పుడవేం వద్దు పిన్నీ! కూర్చో. ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం- అన్నాడు వాసు. మామయ్యకూడా యింట్లోనే వున్నారు. మాయిద్దర్నీ పలకరించారు.
రాణా లేడా పిన్నీ- అడిగాడు వాసు.
బాబాయ్, నేనూ ఇవాళ బయటికి వెళ్ళాంరా! వచ్చేసరికి వంట్లో బావుండలేదని పడకేసి వున్నాడు. లేపుతాను వుండు- అంది అత్త.
వంట్లో బాలేకపోవడం కాదు, తాగి వుంటాడు- వాసు గొంతు ఖంగుమంది.
ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు- అత్తకి కోపం వచ్చింది.
కొన్నాళ్లకిందట నేను, సుధీర్ మీయింటికి వచ్చి, నీకు కొన్నివిషయాలు చెప్పాం. వాడి స్నేహితులు ఎవరో, ఏం చేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో ఒక్కసారేనా అడిగారా? సరే, అది మీ యిష్టం. మీకొడుకు, మీకు గొప్ప. ఈరోజు వీళ్ళ ఆఫీసుకి వెళ్ళి గీతతో ఏదేదో వాగాడట- సూటిగా అన్నాడు వాసు.
వాగడానికేం వుంటుందిరా? దారే అని వెళ్ళి వుంటాడు. తాంబూలాలప్పుడూ, పెళ్ళికీకూడా రాలేదుకదా- అత్తకి ఎంత నమ్మకమో, కొడుకుమీద.
ఏమీ అనకపోతే ఇది కంఠాణీతో పొడిచెయ్యాలనీ, పేపర్‍వెయిట్‍తో మొహం పగలగొట్టాలనీ ఎందుకు అనుకుంటుంది? మీ అన్నకూతురికి కాస్తేమైనా పిచ్చీ, వెర్రీగానీ వున్నాయా- అడిగాడు వాసు.
వాసూ! అసలేమైందిరా- మామయ్య నోరిప్పారు.
రాణా!రాణా!- అత్త అగడపడుతూ పిలిచింది. మేలుకునే వున్నాడు. తప్పదన్నట్టు వచ్చాడు. మాయిద్దర్నీ చూసి బెదిరాడు. వాసుకి చెప్తాననుకుని వుండడు. ఇంతకుముందులాగ నాకు నేనే సర్దుబాటు చేసుకుంటాననుకుని వుంటాడు.
ఏమన్నావురా, గీతని- అత్త ఆవేశంగా అడిగింది.
ఏమన్నాడో అనవసరం పిన్నీ! గీత నాతో చెప్పలేదంటే చెప్పలేకపోయిందని అర్థం. ఇదీ, సుమంత్ చాలా దుడుగ్గా వుండేవారు. ఎక్కడే గొడవున్నా అందులోకి చేరిపోయేవారు. ఇద్దర్నీ కంట్రోల్ చెయ్యడం నాకూ సుధీర్‍కీ భలే కష్టంగా వుండేది. ఆమధ్యలో వీడొకడు. చాలాకాలంగా వీళ్ళిద్దరిమధ్యనీ ఏదో నడుస్తోంది. ఒకటిరెండు సందర్భాల్లో మేమూ చూసాం. కలగజేసుకోబోతే తనకోసం మేమంతా కొట్లాడుకుపోతామని గీత వద్దంది. అప్పటి సందర్భం వేరు. ఇప్పుడు వేరు. అప్పుడు కల్పించుకుంటే అనవసరంగా గొడవలు. మామధ్య పోటీలు. ఇప్పుడిక తను నా భార్య. గీత ఆఫీసుకి వెళ్ళి తనకి కోపంవచ్చేలా మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చిందో చెప్పమను- అన్నాడు వాసు.
తను అన్నమాటలు వాసుతో చెప్పలేదని తెలిసాక రాణా కాస్త కూడదీసుకున్నాడు.
వెళ్లకూడదు. తప్పే- అన్నాడు మాటలు పెకల్చుకుని.
వెళ్లడంకాదు, తప్పు. అసభ్యంగా మాట్లాడావని చెప్పింది. పోలీస్ కంప్లెయింటు ఇవ్వాలనుకుంటున్నాం. గీత కొలీగ్స్ సాక్షిసంతకాలు పెడతామన్నారు. పోలీసురికార్డుల్లోకి పేరు ఎక్కితే భవిష్యత్తు ఎలా వుంటుందో వూహించుకో- అన్నాడు వాసు. అత్త తెల్లబోయింది. మామయ్యకూడా వూహించి వుండడు ఇలాంటి ప్రతిచర్యని. ఐతే ఆయన వయసు, అనుభవం వున్నవాడు.
మరదలు, చిన్నప్పట్నుంచీ తెలిసిన పిల్ల. కొత్తగా పెళ్ళిచేసుకుంది. ఆ చనువుతో ఏదేనా ఒక పరాచకం మాటన్నాడేమో, దానికే పోలీసులదాకా వెళ్తారా? ఐనా కంప్లెయింటు ఏమని ఇస్తారు? ఏ ఆధారాలమీద ఇస్తారు- అడిగాడు వింతగా. వాసు ఏం చెయ్యబోతున్నాడు? పోలీసు కంప్లెయింటు విషయం ఇక్కడికి బయల్దేరేముందు మేం అనుకోలేదు. మా ఆఫీసులో ఎవరికీ నేను చెప్పలేదు. ఎందుకిలా బెదిరిస్తున్నాడు? ఏమీ అర్థమవ్వక చూస్తూ కూర్చున్నాను.
మామయ్యలెవరూ నీకు మేనమామలు కారని అమ్మా, అమ్మమ్మా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎంత నిజం! వీళ్ళ పిల్లలమీద నాకు ఎలాంటి ఫిర్యాదూ వుండనంతకాలం ఎలాంటి సమస్యా వుండదు. దానికి భిన్నంగా జరిగితేమాత్రం నేను పరాయిపిల్లనే! ఇద్దరూ రాణాని ఎలా వెనకేసుకొస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. అక్కడ ప్రమీలత్త యింట్లోకూడా సుధీర్ని నేను కాదనగానే వాళ్ళందరికీ కానిదాన్నయ్యాను. నాకళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. వాసు చప్పుని నా చెయ్యి బిగించి పట్టుకున్నాడు. వ్యవహారం నడిపేటప్పుడు సెంటిమెంట్సూ, వుద్వేగాలూ వుండకూడదన్న హెచ్చరిక. లేకపోతే సందర్భంలోని తీవ్రత తగ్గిపోతుంది.
ఏ ఆధారాలు కావాలి? రాణా ఆఫీసుకి రావడం అందరూ చూసారు. వచ్చి న్యూసెన్స్ చేసాడని స్టేషన్లో తను చెప్తుంది. ఆడపిల్ల స్వయంగా వెళ్ళి అలా చెప్తే చాలదా? మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఒకట్రెండుసార్లు వాడిని స్టేషనుకి పిలుస్తారు. వార్నింగిస్తారు- అన్నాడు వాసు.
మరదలు. ఈమాట మనింట్లో కొత్తగా వింటున్నాను బాబాయ్. మా అమ్మదగ్గిర్నుంచీ మొదలుపెడితే పద్మపిన్నివరకూ అందరూ వాళ్ళ అక్కల భర్తలకి మరదళ్ళే. అలాగని వాళ్ళతో ఎవరూ ఎప్పుడూ అనుచితంగా మాట్లాడింది నేను చూడలేదు. అలా మాట్లాడి వుంటే ఈరోజుని మనం ఇంత సరదాగా మాట్లాడుకుంటూ, కలుసుకుంటూ వుండేవాళ్లం కాదు. నాక్కూడా ఇద్దరు మేనత్తలు. ఇద్దరికీ చిన్నప్పుడే భర్తలు పోయారు. వాళ్లని ఎంతో దగ్గిర్నుంచీ చూసాను. పల్లెటూరు కావడాన్న ఇంటా బయటా అందరూ చాలామాటలన్నారు వాళ్ళని. ఇలాంటిమాటలు ఇంట్లోవాళ్ళన్నా, బయటివాళ్ళన్నా ఎవరికీ చెప్పుకోలేరు ఆడవాళ్ళు. ప్రత్యారోపణ వాళ్ళమీదే జరుగుతుందని. మేనమామ కూతుళ్ళనీ, భార్య చెల్లెళ్లనీ, మరోటనీ ఏదో హక్కున్నట్టు ఇంట్లోవాళ్ళే అంటూ వుండటం మనకి సరదాగా వుంటుందేమోగానీ వాళ్ళకి నచ్చదు. అదొక హింస. ఆ హింసని వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఇంకెవరికి చెప్పుకుంటారు? బయటివాళ్ళు మరెంత చులకనగా చూస్తారు? గీత విషయంలో. అందరం తనకన్నా పెద్దవాళ్ళం. ఎవరికివాళ్ళం ఏదో ఒకటి అంటూ ఎంజాయ్ చేస్తూ వుంటే ఆ పిల్ల ఏమౌతుంది? ఎందుకు అలా అనటం_ తనే మళ్ళీ నిలదీసినట్టు అడిగాడు.
తన గొంతు స్థిరంగా వుంది”
“అలా ఎలా అనగలిగాడే? అసలలా మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదుకదే? మేంకూడా ఎప్పుడూ జోక్ చెయ్యలేదు?” అంది మహతి జీర్ణించుకోలేక.
“ఈ ఒక్కసారికీ వదిలెయ్ వాసూ! పెద్దదాన్ని, అమ్మలాంటిదాన్ని చెప్తున్నాను. వాడు మళ్ళీ గీత జోలికి రాడు. ఎలాగా దుబాయ్‍కూడా వెళ్ళిపోతున్నాడు- అంది పిన్ని బలహీనమైన గొంతుతో. బతిమాలుతున్నట్టు. కోపం, అవమానం, దిగులు, నిస్సహాయత ఇలాంటివన్నీ మనిషిని తినేసాక మిగిలిన జీవావశేషంలా వుంది తను.
దీనిమీద సంతకం పెట్టు పిన్నీ! కింద పేరూ అడ్రెసూ రాయి- జేబులోంచీ ఒక కాగితాన్ని తీసి, అత్తముందు పరిచి, పెన్ను ఇచ్చి, అన్నాడు.
దేనికనికూడా అడక్కుండా సంతకం పెట్టేసింది. మామయ్య తెల్లబోయి చూసారు. దాన్ని జాగ్రత్తగా మడిచి జేబులో పెట్టుకున్నాడు వాసు.
నామీద నమ్మకమో, రాణా భవిష్యత్తుపట్ల భయమో, ఎందుకనికూడా అడక్కుండా సంతకం పెట్టావు. థేంక్స్ పిన్నీ! నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను. మీయింట్లో గొడవలు మాకందరికీ తెలుసు. పెద్దవాళ్ళ విషయమని మేం తలదూర్చలేదు. ఇప్పుడిక నేను కలగజేసుకుని సరిదిద్దక తప్పట్లేదు. ఈ కాగితంమీద నువ్వు రాసినట్టు కంప్లెయింటు రాసి బాబాయ్ వాళ్ళ ఆఫీసులో ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకి నేను చెప్పక్కర్లేదు. ఐనా నీకు తెలియాలని చెప్తున్నాను. బిగామీయో, అడల్ట్రీ కేసో ఔతుంది. ఉద్యోగం పోతుంది. ఇంకెంత, రిటైర్‍మెంటుకి దగ్గిరే వున్నానని ఆయన అనుకోవచ్చు. అప్పుడు ఆయనమీద చర్య తీసుకునే ప్రదేశం మారుతుందితప్ప కేసు మాఫవ్వదు. ఆఫీసుకి బదులుగా పోలీసుస్టేషనులో నడుస్తుంది. సో! రాణాని అదుపులో వుంచాల్సిన బాధ్యత ఆయనది. అదుపు తప్పకుండా వుండాల్సిన అవసరం వాడిది. నువ్వు కంప్లెయింటు వెనక్కి తీసుకున్నాకూడా జరగాల్సిన డేమేజి జరిగిపోతుంది- అన్నాడు వాసు. నేను తనని కొత్తమనిషిని చూసినట్టు చూసాను. నాతోపాటు మిగిలిన అందరూకూడా.
అరేయ్, నువ్వు మాలో ఒకడివని ఇంటికి వచ్చి ఇంతగా చెప్తున్నాను. మళ్ళీ గీతజోలికి వచ్చావంటే మర్యాదగా వుండదు. నాకోపం తెలుసుగా? సుధీర్‍కూడా పక్కన లేడు ఆపడానికి- అని రాణాని హెచ్చరించాడు.
నువ్వు ఇక్కడ వుండాల్సిన అవసరం లేదు పిన్నీ! మా అమ్మలాంటిదాన్నన్నావు. ఇప్పటికిప్పుడు నాతో వచ్చేసినా తీసుకెళ్ళిపోతాను. ఇద్దరం సంపాదించుకుంటున్నాం. నువ్వు మాకు బరువు కాదు- అన్నాడు అత్తతో. తన ముఖం పాలిపోయింది. కన్నీళ్ళు బలవంతంగా ఆపుకుంది.
నేను వెళ్ళాక ఆవిడ్ని ఏమీ అనకండి బాబాయ్! మీకులేని బాధ్యత తను తీసుకుంది. అంతే- అన్నాడు వాసు.
మాతో వచ్చెయ్ అత్తా- అన్నాను నేనుకూడా.
గొప్పవాళ్ళే ఇద్దరూ. భూమ్మీద పెడితే పంటలుండవు, ఆకాశంలో పెడితే వానలుండవు. ఇంకెన్ని చూడాలో మేము- అంది నిరసనగా. ఆవిడ కోపం నామీద. వాసుమీద కాదు. ఈ బేధభావాన్ని ఎలా జీర్ణించుకోను?
పిన్నీ! నువ్వెప్పుడు రావాలనుకున్నా రావచ్చు. ఒక్కమాట నాకు ఫోన్ చేసి చెప్తే నేనే వచ్చి తీసుకెళ్తాను- ఆవిడ మాటలు పట్టించుకోకుండా మరోమాటు అని లేచాడు వాసు. నేను అనుసరించాను” అని ఆగింది గీత.
“ఇలాంటి ఆలోచనలు వాసుకే వస్తాయి. ఏదేనా తేడా వస్తే ఇద్దర్నో ముగ్గుర్నో అందులో ఇరికించి జుట్లు ముడిపెట్టేస్తాడు. పిన్ని రాలేదుకదూ? మామయ్య త్రిమూర్తులుగారినీ, సుధీర్‍వాళ్ళ నాన్ననీ తీసుకుని వెళ్ళి బతిమాలితేనే రాలేదు ఆవిడ. ఐనా అలా వెళ్ళి అడిగితే ఎలా వస్తుందే?” అంది మహతి.
“మరెలా అడుగుతారు? ఆవిడ వుపేక్షించడంవల్లనేకదూ, రాణా పూర్తిగా దారితప్పాడు? అదే యింట్లో వుంటూ తండ్రిని చూసి నేర్చుకోవలసినదంతా నేర్చుకున్నాడు. తప్పుడు ఆలోచనలూ, తప్పుడు పనులూ చేసాడు. ఒక చెడు జరుగుతున్నప్పుడు అందరం కలిస్తేనేకదా, దాన్ని ఆపగలిగేది? నాన్న పిలిచినప్పుడు వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చింది ఆవిడకి. ఇంకా అప్పటికి ఆ కుటుంబం మునుగుతున్న పడవకాదు. తర్వాత మునిగింది. ఆవిడ్ని దయదల్చి యింటికి వస్తున్నాడంతే మామయ్య. రోజంతా ఆ రెండోయింట్లోనే. మరి మేం రమ్మన్నప్పుడు రావటానికేం? ఆరోజుని వాసుకి వచ్చిన కోపానికి నాకెంత భయం వేసిందో! సుధీర్‍ది ఆవేశం. ఇతనిది కోపం. అది గుప్పుమని లేచి చల్లబడుతుంది. ఇది రగులుతునే వుంటుంది. ఇలాంటి విషయాల్లో చంపుకోవడానిక్కూడా వెనక్కితియ్యరు మగవాళ్ళు. చిన్నవిషయమేం కాదుకదా? ఏమన్నాడని వాసు అడగలేదుగానీ, అడిగితే నోరు తెరిచి చెప్పగలిగే విషయమేనా? ఏమిటే, వాడి తెగింపు? అడగ్గానే వాడి వెంట వెళ్ళిపోతాననుకున్నాడా? వీళ్ళందరితోటీ వ్యవహారాలు నడిపించేదాన్ననుకున్నాడా? కామన్‍ప్రాపర్టీననుకున్నాడా? వంటిమీద పెట్రోలుపోసుకుని దహించుకుపోవాలనిపించదూ, అలాంటి మాటలు విన్నప్పుడు? అసలు అటువంటి ఆలోచన వాడిలో రావడానికి వాళ్ళ నాన్నకాదూ, కారణం?” ఆవేశంగా అడిగింది గీత. రామ్మోహన్ గుర్తొచ్చాడు మహతికి. అతనూ తనని అలానే అడిగాడు. తనూ స్వాగతించలేదు. ఆడామగా మనుష్యజీవులకి వున్న తేడా స్పష్టంగా తెలిసింది. సాంత్వనపరుస్తున్నట్టు ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుంది. ఆత్మీయస్పర్శ చాలా ఆవేశాలని తగ్గిస్తుంది.
“వాళ్లింటినుంచీ నేరుగా ఇంటికి రాలేదు మేము. కోటకి తీసుకెళ్ళాడు. ఒకచోట కూర్చున్నాం. గొడవకి కొనసాగింపు మా యిద్దరిమధ్యనీ వుంటుందనుకున్నాను. ఏమన్నాడని అడుగుతాడా వాసు? ఏం చెప్పను? చెప్పగలిగే మాటలేనా, రాణా అన్నవి? మేమిద్దరం ఎలా కాపురం చేస్తామో చూస్తానన్నాడు వాడు. అదే జరగబోతోందా? మా యిద్దరి పెళ్ళీ, ఈ ఆనందం స్వల్పకాలమేనా? నాకు కన్నీళ్ళు కారిపోతున్నాయి. పెద్దగా ఏడవాలని వుంది. బలవంతంగా ఆపుకుంటున్నాను. చాలాసేపు మాట్లాడలేదు తను.
కంఠాణీతో పొడిచెయ్యాలనీ, పేపర్‍వెయిట్ తీసుకుని మొహం పగలగొట్టెయ్యాలనీ అనుకున్నావా? ఇంత వయొలెన్సేమిటే, నీకు- అడిగాడు కాస్త కోపం చల్లారాక, నవ్వుతూ. తలదించుకున్నాను. తను మరికాసేపు మాట్లాడలేదు.
నువ్వు పబ్లిక్ సర్వెంటువి. డ్యూటీలో వున్నావు. పైగా వర్క్‌ప్లేస్. అలాంటిదేదైనా చేసి వుంటే వాడే నీమీద కంప్లెయింటు ఇచ్చేవాడు. మీ ఆఫీసరు వెంటనే నిన్ను సస్పెండ్ చేసేవాడు. రాణా పంతం పడితే నేరపూరితమైన చర్యకాబట్టి పోలీస్‍కంప్లెయింటుకూడా చేసేవారు. ఇవి చిన్నపిల్లల ఆటలుకావు గీతా! తెలివిగా బతకడం నేర్చుకో. నూటికి ఇద్దరికో ముగ్గురికో వుంటాయి ప్రభుత్వవుద్యోగాలు. మిగిలిన ఆ తొంభయ్యేడుమందికన్నా మనం పద్ధతిగా ఆలోచించాలి. కాండక్ట్ రూల్స్ మన వుద్యోగజీవితాన్నీ, వ్యక్తిగతజీవితాన్నీకూడా నియంత్రిస్తాయి. అవే మనకి ఆయుధాలుకూడా ఔతాయి. మనం చాలా సామాన్యమైన మనుషులం. సాఫీగా జీవితాలు గడిచిపోయేలా చూసుకోవాలి. అలాగని ఎవరేమన్నా పడి వూరుకొమ్మని కాదు. ఆలోచించి చెయ్యాలి ఏది చేసినా. ఇప్పుడీ కాగితం చూడు, ఆ రూల్స్ పరిధిలోకే వస్తుంది. బాబాయ్‍ని ఒక ఆట ఆడిస్తుంది- అన్నాడు. తలూపాను.
మరో విషయంకూడా చెప్పాడు.
నీకు మరొకళ్ళతో గొడవ జరిగినప్పుడు అవతలివాళ్ళు ఏమన్నారో నువ్వుగా చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు.
నేనా వుద్దేశంతో అనలేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు- అనేస్తారు తేలిగ్గా. అప్పుడు నువ్వే డిఫెన్సులో పడిపోతావు.
ఆ మాటలు నువ్వే వుద్దేశంతో అన్నాగానీ నాకు బాధని కలిగించాయి. సంజాయిషీ యివ్వమనాలి- అన్నాడు.
అంతేకదా? నేను చెప్పినా రాణా తనన్న మాటలు అందరిముందూ వప్పుకుంటాడా? వప్పుకోడు.
నేనంటే మొదట్నుంచీ యిష్టం వున్నప్పుడు ఆమాట నాతో ఒక్కసారేనా అని వుంటే మిగతావన్నీ చూసుకునేవాడిని. అమ్మేదో అందని నాతో పూర్తిగా మాట్లాడ్డం మానేసావు. ఒకవైపు సుధీర్ నీపట్ల కన్సర్న్ చూపించేవాడు. మరోవైపు సుమంత్‍తో కలిసి ప్రపంచయుద్ధాలు చేసేదానివి. వీడితో గొడవపడుతుండేదానివి. నీ మనసులో ఏం వుందో తెలిసేది కాదు. – అన్నాడు.
మాకు డబ్బులేదు. మీలో ఎవరేనా చేసుకుంటారని ఎలా అనుకుంటాను? నన్ను బాగా చూసుకోవడం వేరూ, ఇది వేరూకదా- అన్నాను. అనడంకాదు, బైటపడిపోయాను. ఆరేళ్లకిందట మనసుకి గాయంలా తగిలి ఇప్పటికీ నొప్పిగానే వున్న మాట. వాసుపట్ల నాకుగల యిష్టాన్ని నియంత్రించి, నన్నతనికి దూరంగా నిలబెట్టిన మాట. అతనిమీద నాకున్న ప్రేమని ఆరేళ్ళు నష్టపరిచిన మాట. ఎవరో అన్నది నా భావనగా స్థిరపడిపోయిన మాట. ఆ మాటే లేకపోతే మా యిష్టం అందరిముందూ స్థిరపడిపోయేదికదూ? ఎవరికీ నామీద మరో భావంవుండేది కాదు.
గీతూ- అన్నాడు దిగ్భ్రాంతిగా. బాధతో విలవిల్లాడాడు.
నా ప్రాణమే, నువ్వు. పెళ్ళికి వప్పుకుంటావో లేదోనని గిజగిజలాడిపోయాను. ఎవరన్నారు, నీతో అలా? చిన్నప్పుడంతా నాచుట్టూనే తిరిగావుకదా, అలా ఎలా అనుకోగలిగావు- అడిగాడు. నేను చెప్పలేదు. తనే అర్థం చేసుకున్నాడు. ఇంటికి వచ్చాం. వచ్చేదార్లో అన్నాడు-
తులసి పచ్చగులాబీతీగేదో కావాలంది. మొక్క వుంది మనింట్లో. మళ్ళీ ఈ తీగేమిటో? నీ స్నేహితులు, ఆఫీసువాళ్ళు ఎవరింట్లోనేనా వుందేమో కనుక్కో. నేనూ కనుక్కుంటాను- అని. తులసి అంటే అతనికి చాలా ప్రేమ. దాని నోట్లోంచీ ఒక మాట వచ్చిందంటే శిరసావహించాల్సిన ఆజ్ఞే అన్నదమ్ములకి. వాసుకి మరీ ఎక్కువగా.
ఇంట్లో మాకోసం ఎదురుచూస్తున్న అత్తకి క్లుప్తంగా విషయం చెప్తే తను బాధపడింది.
ఆఖరికి దాని బతుకు ఇలా అయింది. అటు భర్తా సరిగ్గా లేక, ఇటు కొడుకూ ఇలా తయారయ్యి, ఎంతకని భరిస్తుంది? వదిలేసి వచ్చెయ్యమంటాంకానీ, తననదైన నెలవు వదులుకుని, పరాయివాళ్ళ యింట్లో వుండాలంటే ఎవరేనా ఆలోచిస్తారు- అంది.
రాణా విషయం రవిబాబాయ్‍దాకా వెళ్ళింది. అత్త చెప్పింది. ఆయన వాడిని రూమ్‍లో వేసి కొట్టాడని చూచాయగా తెలిసింది. ఆయన్ని సంధ్యత్త, మామయ్య ఏమైనా అన్నారా అనే విషయాలేవీ బైటికి రానివ్వలేదు. వాసు దగ్గిర వున్న కాగితానికి అంత భయపడ్డారు వాళ్ళు. నాకు చట్టం అంటే ఏమిటో అర్థమైంది.
పువ్వు నెమ్మదినెమ్మదిగా రెక్కలు యిప్పుకుంటున్నట్టు జీవితంలోని అనేక అంశాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. నా జీవితం మంచి మలుపు తిరిగిందనే అనుకుంటాను. ప్రపంచాన్ని వాసుకోణంలోంచీ చూడటం మొదలుపెట్టాను. కానీ వాసు సుధీర్‍కోసం లోలోపల బెంగపడుతున్నాడు. ఇద్దరికీ నెలలు తేడా. పుట్టినప్పట్నుంచీ ప్రాణస్నేహితులుగా వున్న ఆ యిద్దరూ ఇప్పుడు విడిపోయారు. నా కారణంగా. నన్నుసరే, వాసునీ, మాధవ్‍నీకూడా దూరంపెట్టారు వాళ్ళు ముగ్గురూ. మాధవ్‍తో కలిపి మా ముగ్గురికీ కష్టంగానే వుంది ఇలా విడిపోవడం. సుధీర్ అసలు ఎదురుపడనే పడడు. మిగిలిన యిద్దరూ కలిసినా పొడిపొడిగా మాట్లాడి తప్పుకుంటున్నారు.
వీడింత ఫూలేమిటి-అని ఒకసారి వాసు అనేసాడు.
వాసుకీ సుధీర్‍కీ చాలా తేడా వుంది. సుధీర్ ప్రపంచం చాలా పరిమితమైనది. తల్లిదండ్రుల కలలపంటలా అపురూపమైన ప్రేమమధ్య చాలా సున్నితంగా పెరిగాడు. తనకి సమస్యలంటే మన గ్రూపులోనూ, కాలేజిలోనూ తలెత్తేవి. మన వయసువాళ్ళవి. అంతే. మళ్ళీ అవేనా భావోద్వేగాలతో ముడిపడివుంటాయి. అలక, కోపం, చిన్నబుచ్చుకోవడం, ఇలా. వాసు అలా కాదు, చిన్నప్పట్నుంచే పెద్దవాళ్ళ ప్రపంచంలో అడుగుపెట్టాడు. సమస్యలని చూడాల్సిన కోణాన్ని తెలుసుకున్నాడు. మా రెండిళ్లవాళ్ళనీ కలిపే ప్రయత్నం వసంత్, ప్రహ్లాద్ చేస్తున్నారు. ప్రహ్లాద్ సియ్యేలో ఇంటర్మీడియెట్ పాసైన సందర్భంగా పార్టీ ఇచ్చాడు” అంది గీత.
“నేను రాలేదు. ఏదో హెల్త్ ఇష్యూ. రవళి వచ్చింది. మరోరోజు పెట్టుకుందామని అన్నాడు వాడు. కానీ ఈ పార్టీ వెనుక వుద్దేశం మీ ఆరుగురినీ ఒకచోట కలపడం. ఆ విషయం వాడు చెప్పగానే, నాకోసం మానద్దన్నాను” మహతి గుర్తు చేసుకుంది. “అప్పుడేనటకదూ, మయూ తను ఈ ప్రపంచంలోకి రాబోతున్నట్టు ప్రకటించింది?” అడిగింది నవ్వుతూ. చివర్లో మహతి చేసిన పరిహాసానికి గీత ముఖం ఎర్రబడింది.
“నోరుమూసుకో. బస్సుల్లోనూ, రెస్టరెంట్లలోనూ, ఇంకా పబ్లిక్ ప్లేసెస్‍లోనూ వున్నప్పుడు ఈ పిల్లవెధవలు వీళ్ళ రాకల్ని ప్రకటించుకుంటే ఎలాగే? ఎంత ఎంబరాసింగ్‍గా వుంటుంది?” అంది చిరచిర్లాడుతూ. మహతి పెద్దగా నవ్వింది. ఆత్మహత్యాప్రయత్నం దాటిపోయాక గీత అసలు మాట్లాడింది లేదు. ఇప్పుడే కాస్త ఓపెనప్ అయింది. చాలాసేపు మాట్లాడుకున్నాం అని మాటలాపేసి లేచి వెళ్ళిపోతుందేమోనన్న భయం ఎలాగా వుంది. తామిద్దరూ మాట్లాడుకుంటున్నారన్న విషయం మేఘన అక్కడ అందరికీ చెప్పి వుంటుంది. అందుకే ఎవరూ ఇటు రాలేదు. గీత ఏం చెప్పి వుంటుందోనని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారేమో! ఇప్పటిదాకా చెప్పిందంతా వుపోద్ఘాతమేగానీ అసలు కథ ఇంకా బయటికి రాలేదు.
“వాళ్ళొస్తున్నారా- అని అడిగిందట సుమతి మా ముగ్గురిగురించి.
అందరం కలుద్దామనేకదా- అన్నాట్ట ప్రహ్లాద్.
ఎందుకురా? కలుసుకునేంత స్నేహాలు ఇంకా మిగిలివున్నాయా? చాలా పెద్దదైపోయింది గీత. స్వంతనిర్ణయాలు తీసుకోవడం, పెద్దాచిన్నా ఎవర్నీ లెక్కపెట్టకపోవడం నేర్చుకుంది. వాళ్ల పెళ్ళికంటే మామయ్య బాధపడతాడని అందరం నిలబడ్డాం. ఇంక చెల్లు- అందట.
ప్రహ్లాద్ ఎంతో నచ్చజెప్తే వప్పుకుందట రావడానికి. తను సరేననకపోతే సుధీర్ సుమంత్‍లుమాత్రం వస్తారా? రారు. తనమాట వేదం వాళ్ళింట్లో. తర్వాత తెలిసాయి ఆ విషయాలు. మేం వెళ్ళేసరికే వాళ్ళు వచ్చేసి వున్నారు. సుధీర్‍లో ప్రస్ఫుటంగా మార్పు. చాలా సన్నబడ్డాడు. ఇదివరకూ ట్రిమ్ముగా తయారయ్యేవాడు. బట్టలు నలగనిచ్చేవాడుకాదు. ఇప్పుడంత బట్టలవీ పట్టించుకున్నట్టు లేడు. మా పెళ్ళిసందర్భంగా వాళ్ళింట్లో కొన్ని గొడవలయ్యాయని తెలుసు, వాటి ప్రభావం అంత వుందని వూహించలేకపోయాను. మాకూ రాణాకీ మధ్య జరిగిన విషయం బైటికి రాలేదుగాబట్టి రాణానికూడా పిలిస్తే వాడూ వచ్చాడు. మేం వెళ్ళాక వసంత్‍‍తో కలిసి రవళి వచ్చింది. గమ్మత్తు చూడు. మాతో సుమతీవాళ్ళూ మాట్లాడరు. వాళ్ళతోటీ, రాణాతోటీ మేం మాట్లాడం. మాధవ్, సుమంత్ తటస్థం. ఒకప్పుడు నవ్వుల్తోటీ మాటల్తోటీ హోరెత్తిపోయే వాతావరణం అంతా పొడిపొడి నవ్వులూ, మొహమాటాలూ, అయోమయాలతో నిండిపోయింది. మాటలు నడుస్తున్నాయి. వారధులమీద సాగుతున్నాయి. వసంత్, ప్రహ్లాద్, రవళి ఆ వంతెనలు. మెనూమీదకూడా పెద్ద చర్చేం జరగలేదు. అందరం కామన్‍గా తినేవే ఆర్డర్ పెట్టేసింది సుమతి.
ప్రహ్లాద్ కెరీర్ ప్రాస్పెక్ట్స్, వసంత్ చదువు, మా వుద్యోగాలమీద చాలాసేపు నడిచాయి మాటలు. మాటల్లోని డొల్లతనం తెలుస్తోంది. సుధీర్ అసలు మాట్లాడట్లేదు. సుమతి వాడిని ఆనుకుని కూర్చుంది. వాళ్ళలో వాళ్ళు ఇద్దరే మధ్యమధ్యలో లోగొంతులో మాట్లాడుకుంటున్నారు. సుమంత్ మాటలు కలుపుతున్నాడుగానీ దృష్టంతా వాళ్ళిద్దరిమీదే వుంది.
డిన్నర్ వచ్చింది. ఆ వాసనలకి ఒక్కసారి నాకు కడుపులో తెర్లుకుపోయింది. చప్పుని లేచి వాష్‍బేసిన్‍దగ్గిరకి వెళ్ళాను. అసలెప్పుడూ గట్టిగా తుమ్మికూడా ఎరగని నాకు ప్రపంచం ఒక్కసారి తలకిందులైనట్టు కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం. అంతా గందరగోళం. వాసు కంగారుపడుతూ వచ్చి రెండుచెవులూ మూసాడు. తన సాయంతో వచ్చి టేబుల్‍కి దూరంగా కూర్చున్నాను. ఉండుండి తెరలా వస్తోంది కడుపులో తిప్పు. ఎప్పుడూ లేదిలాగ. ఉండలేకపోతున్నాను. అస్థిమితంగా వుంది.
వెళ్ళిపోదాం- అన్నాను అతనితో.
రవళి సలాడ్‍లోంచీ నిమ్మడిప్ప తీసి ఇచ్చింది రవళి వాసన చూడమని. ప్రహ్లాద్ మరో డిప్ప నీళ్ళలో పిండి ఉప్పువేసి కలుపుతున్నాడు. సుమతి తమాషా చూస్తున్నట్టు కూర్చుంది. సుధీర్ లేచి నా దగ్గిరకి వచ్చి చెయ్యి అందుకుని నాడి చూసి వెంటనే వదిలేసాడు. తన కళ్ళలో అదోలాంటి భావం.
కంగ్రాట్స్- అస్పష్టంగా అన్నాడు.
నాకు కొంచెం అయోమయం. అర్థమయ్యీ కానట్టుంది విషయం. అంతమంది పెళ్ళికానివాళ్ళమధ్య చాలా యిబ్బందిగా అనిపించింది. నాకూ వాసుకీ మాత్రమే సంబంధించిన రహస్యాలేవో అందరికీ తెలిసిపోయిన భావన. వాళ్ళందరికన్నా పెద్దరికం వచ్చికూడా చిన్నపిల్లలా వాళ్ళని కలవడానికి వచ్చానని అవమానం. నేలలోకి కృంగిపోతున్నట్టనిపించింది. ఆపైన ఏదో కనిపించని కాఠిన్యంకూడా అక్కడ పరుచుకున్నట్టు నా మనసుకి తెలుస్తోంది. ఒక్కమాట సుమతి ప్రేమగా, ఇదివరకట్లా అని వుంటే? సుధీర్ ఎప్పట్లా నవ్వి వుంటే? సుమంత్ ఏడిపించి వుంటే? నాకు అంతా సరిగా వున్నట్టనిపించేది.
మేం వెళ్తాంరా- అన్నాడు వాసు.
అలా ఎలా వెళ్తావురా? బిల్లు కట్టి కదులు- అన్నాడు వసంత్.
మీ యింటికొచ్చి బిల్లు వసూలుచేసుకుంటాను. ఈ పార్టీ నీదే- పకపక నవ్వాడు ప్రహ్లాద్. వాసు తనూ నవ్వుతూ తర్జనితో బెదిరించి నా చెయ్యిపట్టుకుని లేవదీసాడు. ఇద్దరం వచ్చేసాం.
బైక్‍మీద కూర్చోగలవా- అడిగాడు.
తలూపాను. బయల్దేరాము. అతని వెనక కూర్చున్నానన్నమాటేగానీ కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి. దు:ఖం ఆగట్లేదు. ఏమిటీ దు:ఖం? ఎందుకు ఈ బాధ? నేను ఎవరిని బాధపెట్టానని ఇంత దు:ఖం నాకు కోరుకోని బహుమతిగా వస్తోంది? నేను ఏడుస్తున్నట్టు వాసు గ్రహించాడు. ఒక పక్కకి తీసుకుని ఆపాడు.
దేనికి ఏడుస్తున్నావే- అడిగాడు.
తెలీదు- అన్నాను.
నాకు రాలేదేం, ఏడుపు- అడిగాడు.
నువ్వూ, నేనూ ఒకటేనా- అడగబోయి ఆగాను. ఇద్దరం ఒకటే. వేరువేరు కాదు.
పుట్టుకతో కొన్ని లక్షణాలు తెచ్చుకుని వస్తాడు మనిషి. అవి అతను పెరిగిన వాతావరణంతోటీ, అతను ఎదుర్కొనే పరిస్థితులతోటీ సంయోగం చెంది ప్రవర్తన అనే బ్రహ్మపదార్ధం ఏర్పడుతుంది. అందులో మామూలప్పుడు పైకి కనిపించేదే కాక అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అప్రమేయంగా బైటపడే స్పందనలుకూడా వుంటాయి. వాటిని అదుపులో వుంచుకోవలసిన బాధ్యత వాళ్లదే. నీది కాదు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇలా బాధపడకుండా వుండటం ఒక్కటే నీచేతుల్లోనే వుంది. వాళ్ళని సరిదిద్దడం కాదు. గీతూ! వాళ్ళు నలుగురినీ నేను లెక్కలోంచీ తీసేసాను. నువ్వూ నేనూ కాక ఇంక మిగిలినవాళ్ళు ఐదుగురు. వీళ్లలో ఎందరు ఎంతదాకా మనతో కలిసి నడుస్తారో చూద్దాం- అన్నాడు. అప్పటిదాకా మనసులో వున్న అస్పష్టమైన దు:ఖానికి సరైన రూపం అది.
నువ్వేదైనా తప్పు చేస్తే, దాన్ని సరిదిద్దుకోలేకపోతే అప్పుడు రావాలి కన్నీళ్ళు. అంతేగానీ వేరేవాళ్ళ ప్రవర్తనకి కాదు. దాన్ని అదుపుచెయ్యడం నీచేతుల్లో వుండదు. ఇప్పటిదాకా స్నేహితుల్లా వున్నాం. ఇకపై చుట్టాల్లా వుంటాం. అంతే. అదైనా ఎందుకంటే విడిపోయి దూరాలు జరిగే పరిస్థితులు మనకి లేవు. అర్థమైందా – అన్నాడు. తలూపాను.
ఇలా ఎప్పటికప్పుడు నేన్నీకు ప్రైవేట్లు చెప్తూ వుండాలా? నీ బుర్రకూడా కొంచెం వుపయోగించమ్మా! దాన్ని ఫ్రిజిలోనో, హేండ్‍బేగులోనో దాచుకుని తిరక్కు- అన్నాడు.
ఇద్దరం ఇంటికి వచ్చాము. మళ్ళీ అందర్నీ కలవడం సుమతి పెళ్ళిలో” అంది గీత.
“ఔను. నీ శ్రీమంతం మరీ పెద్దవాళ్ళ ఫంక్షన్ కావడంతో మమ్మల్ని దూరంగా వుంచారు” అని కళ్ళెగరేసి నవ్వింది మహతి. “గీత బ్రహ్మరాక్షసైపోయిందని వసంత్‍వాళ్ళంతా ఒకటే చెప్పుకున్నారు” అంది.
“నా పెళ్ళిలో కూడా అన్నారు. అసలీ బ్రహ్మరాక్షసులవ్వడం ఏమిటే? అందరూ కలిసి నన్నలా చేసేసారేమిటి?” అడిగింది గీత.
“ఎంత బెదిరించినా చెప్పలేదు. బోయ్స్ సీక్రెటట అది” అంది మహతి.
“చాలాసేపైంది. పనీపాటా లేనట్టు కూర్చున్నాం. అమ్మావాళ్ళూ కంగారుపడుతుంటారు, ఏమైపోయామోనని” లేవబోయింది గీత.
అనుకున్నంతా అయిందనుకుంది మహతి. “కూర్చోవే. తొందరేమీ లేదు. ఎక్కడికీ వెళ్ళిపోయామని అనుకోరు” చెయ్యిపట్టి ఆపింది మహతి. “నీ పెళ్ళి అందరికీ మేల్కొలుపులా అయింది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలని యుద్ధప్రాతిపదికన అందరూ నడుం బిగించారు. మా చదువులూ వుద్యోగాలూ అన్నీ పక్కని పడిపోయాయి ఈ వుద్యమంలో” అని నవ్వింది. మళ్ళీ ఆ ధ్యాసలో పడింది గీత. ఆమె మనసు, సంకల్పం బలంగా లేవు. ఏదో తోసుకొస్తున్నట్టు, ఎందులోంచో పారిపోయి దూరంగా వెళ్ళిపోవాలన్నట్టు వున్నాయి. చెప్పమనే అందరూ అడుగుతున్నారు. ఏం వుందని చెప్పడానికి, అంతా తెరిచిపట్టుకున్నట్టే కనిపిస్తుంటే? కళ్లలో నీళ్ళు నిలిచాయి. తుడుచుకుంది.
ఆమె అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చూడటం దుర్భరంగా అనిపించింది మహతికి. ఏం జరిగిందో, తనని బాధపెట్టిన విషయాలేంటో సూటిగా ఎందుకు చెప్పలేకపోతోంది గీత? ఈవేళ రోజంతా ఇక్కడే గడిచినాసరే, బుజ్జగించి రాబట్టాలి విషయం అనుకుంది.
“సుమతి పెళ్ళి చాలా పెద్దమలుపు తిప్పింది నా ఆలోచనలని. జీవితానికి ఒక గమ్యంకూడా కనిపించింది. ఎదుటివాళ్ళనుంచి ఏవో కోరుకుంటాం. వాళ్ళు మనకి నచ్చినట్టు వుండాలనీ, మనం ఆశించినది యివ్వాలనీ అనుకుంటాం. ఇవ్వనప్పుడు కలిగే ఆశాభంగంతోపాటు, కోపం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ మనసుని కాసేపు డోలాయమానంగా చేస్తాయిగానీ మనసులో పాతుకుపోయి వున్న ప్రేమనో, ద్వేషాన్నో, విజ్ఞతనో సమూలంగా పెకిలించలేవు. అది నాకేకాదు, అందరికీ వర్తిస్తుంది. పెళ్ళివార్త నాకు చాలా సంతోషాన్నిచ్చింది. లోలోపల్నుంచి వుత్సాహం తన్నుకు వచ్చింది.
వీళ్ళ చదువులకి అత్తావాళ్ళూ బాగా అప్పులు చేసారట. బేంకులోన్లు కూడా తీసుకున్నారట. తనింక పైకి చదవననీ, సుమతి పెళ్ళి చేసెయ్యమనీ గట్టిగా దెబ్బలాట వేసుకున్నాడట సుధీర్. సంబంధం మంచిదని వీళ్ళూ వప్పుకున్నారు. ఇల్లు అమ్మేసారు. మహీ! మా నాన్న ఏం చెయ్యాలని అత్త అనుకున్నదో అది వాళ్ళకే జరిగింది. ఇల్లు అమ్మినాకూడా పెళ్ళిలో కాస్త పొదుపు పాటించాల్సిన పరిస్థితి. ఖర్చులు చూసి పెట్టుకోవాలి. మామయ్య రిటైర్‍మెంటుకి వున్నారు. మగపిల్లలు సెటిలవ్వలేదు. డబ్బుసాయం చెయ్యమని ఎవరినీ అడగలేరు. ఇప్పటిదాకా పైన వున్న వాళ్ళ చెయ్యి కిందకి ఔతుందని పరువుతక్కువ. రవిబాబాయ్‍ద్వారా ఈ విషయాలు తెలిసాయి. నాన్నతో వచ్చిన బేధభావంవల్ల ఆయనతో నేరుగా ఇవన్నీ మాట్లాడలేకపోతున్నారు.
అందరం తలోచెయ్యీ వేసి నిలబడాలి. దుబారాలవ్వకుండా పెళ్ళి పకడ్బందీగా జరిపి వాళ్లని వడ్డుని పడెయ్యాలి. బావ చాలా దిగులుపడుతున్నారు. ఆయన్నలా చూస్తుంటే బాధేస్తోంది- అన్నాడు బాబాయ్.
ప్లానింగ్ అనేది నేను నాన్నదగ్గిర నేర్చుకున్నాను. నాన్నకి త్రిమూర్తులుగారు నేర్పారు. పెళ్ళికి తతంగాలేం వుంటాయో, తప్పనిసరి ఖర్చులు, సరదాకోసం పెట్టేవి, ఆర్భాటంకోసం పెట్టేవి, అన్నీ అడిగి తెలుసుకున్నాను. కొన్ని వస్తువులని సాంప్రదాయంపేరిట పాతవే వాడచ్చు. పెళ్ళిపీటలు ఇల్లిల్లూ తిరుగుతాయి. మాదగ్గిర్నుంచీ ఎంతమంది అడిగితీసుకున్నారో! తర్వాతకూడా ఒక్కసారి వాడి పక్కని పెట్టేసేవి చాలా వుంటాయి. వ్రతంపీట, వంటపాత్రలు, వుయ్యాలతొట్టి, చేద, ఇంకా చాలా.
మీరంతా కలిసి పందొమ్మిదిమంది. ఇకమీదట వరసగా అన్నీ పెళ్ళిళ్ళే. ఒక ట్రంకుపెట్టె పెట్టి, అందరిళ్ళలోనూ ఎక్కువైన వస్తువులు అందులో వుంచి దాన్ని తిప్పుకుంటే సరిపోతుంది. పెళ్లనగానే హడావిడికి అదనంగా కొనేస్తాం. అనవసరమైన, ఎవరికీ వుపయోగపడని ఖర్చు ఎందుకు చెయ్యాలి? మిగిలిపోయినవన్నీ అందులో పెట్టి దాస్తే మళ్ళీసారికి వాడుకోవచ్చు. ఆడపిల్లకి పెళ్ళిచేసి పంపాక అక్కడితో అవదు. పురుళ్ళు, బారసాలలు ఎన్నని? ఊపిరి పీల్చుకోవడానికి వుండదు. మగపిల్లలకి వుండే ఖర్చులు వాళ్ళకీ వుంటాయి అందరూ లక్ష్మిలా మాకేదీ అక్కర్లేదని మడికట్టుకుని వుండరు. – అన్నారు నాన్న.
పెళ్ళిపీటలు, జాకెట్టుముక్కలు, పెట్టుబడి చీరలు, కలశం చెంబులు, వక్కలు అంటూ దాచిపెట్టేందుకు చాలా పెద్దలిస్టే చెప్పారు. అత్తల పెళ్ళిళ్ళప్పుడు అలానే చెసేవారట.
పెళ్లిపెట్టె బాధ్యత మాయింటిమీద పెట్టారు. ఒక గది అందుకు కేటాయించాం. అవసరంలేని యిన్ని సామాన్లు ఇల్లంతా నింపుకుంటున్నామా అనిపించింది అందులో చేరిన వస్తువులు చూస్తుంటే. అప్పటికి యింకా మనిళ్ళలో వంటబ్రాహ్మలని పెట్టి వండించుకోవడమే. పాత్రసామాన్లుకూడా చేరాయి. ఆఫీసులో పనివిభజన ఎలా చేస్తారో అలా పెళ్ళిపనులన్నీ చిన్నచిన్నవిగా విడగొట్టి ఎవరెవరు ఏది చెయ్యాలో విఘ్నేశ్వరబియ్యం కట్టినప్పట్నుంచీ చెయ్యాల్సినవన్నీ రాసి బాబాయ్‍కి యిచ్చాను.
మీ నాన్నని మించిపోయావే. నిన్ను ముందుపెట్టుకుంటే వెనక్కి చూడాల్సిన అవసరం వుండదు- అన్నాడాయన” అంది గీత.
“నిజమే! ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా, నీ పేరే జపం చేసేవాళ్ళు అందరూ. గీతకి చెప్పేస్తే చూసుకుంటుందనేది కొన్నేళ్ళపాటు వూతపదమైపోయింది” అంది మహతి.
“ఎక్కడా మర్యాదలోపం చెయ్యలేదు. అందరిళ్లకీ వెళ్ళి పేరుపేరునా పిలిచారు అత్తా, మామయ్యా! రెండురోజులకి పెళ్ళిమంటపం మాట్లాడారు. సుమతిని పెళ్ళికూతుర్ని చేయడానికి అందరూ ముందురోజు రాత్రే అక్కడికి వెళ్ళిపోయారు. నాకు సదుపాయంగా వుండదని నన్నూ వాసునీ తెల్లారి రమ్మన్నారు. వెళ్ళాముగానీ నాకు ఒకటే నిద్ర. ఆగటం లేదు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. నెమ్మదిగా లేచి, ఆడపెళ్ళివాళ్ళ గదుల్లో ఒకదాన్లోకి వెళ్ళి అక్కడ జంపఖానా వుంటే పడుక్కున్నాను. ఎంతసేపు అలా నిద్రపోయానో తెలీదు” ఆగింది గీత.
“నీకోసం వెతుక్కున్నాం. వెతకడానికి లేవగానే పెద్దవాళ్ళు అది తెమ్మనో, ఇది తెమ్మనో పురమాయించేవారు. అసలుది మర్చిపోయి, ఆ పనుల్లో పడేవాళ్ళం” అంది మహతి.
“ఇక్కడేం చేస్తున్నావురా?” అన్న ప్రశ్న, “అదొక్కర్తీ ఆ గదిలో జంపఖానామీద పడుక్కుని నిద్రపోతోంది. నీరసం వచ్చిందో ఏమిటో! పిల్లని ఎవరూ పట్టించుకోరా- అన్నమాటలు మగతనిద్రలో వినిపించాయి. తర్వాత గదిలో అడుగుల చప్పుడు. ప్రమీలత్త. పక్కన కూర్చుంది.
గీతూ! ఇక్కడ పడుక్కున్నావేమే? ఆకలేస్తోందా? నీరసంగానీ వచ్చిందా? లే! ఈ పాలు తాగు. మనిల్లేకదా? వంటలూ మనవే. నువ్వెళ్ళి ఏదేనా కావాలని అడిగితే ఇవ్వరే- అని లేపి, పాలగ్లాసు చేతిలో పెట్టింది. ఇందాకా కలలోలా వినిపించిన గొంతు ఎవరిది? ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగించుకున్న వ్యక్తి ఎవరు? నాకేదో భయంలాంటిది వేసింది. ఆరోజు కలిగిన భయం నన్నింక వదిలిపెట్టలేదు. పూర్తిగా భయంకూడా కాదు, తెలీని శతృవెవరో నన్ను అనుసరిస్తున్న భావన అది.
ఇక్కడికి ఇంకెవరేనా వచ్చారా, అత్తా- అడిగాను.
మామయ్య ఎవర్నో వెతుక్కుంటూ వచ్చి నిన్నిక్కడ చూసి చెప్పారు- అంది.
ఇంకా- నా ప్రశ్న.
పెళ్ళిల్లుకదే, ఎవరో తిరుగుతూ వుంటారు. భయపడ్డావా? ఒక్కదానివీ వుండకు. ఇలాంటప్పుడు మనసుకి ఏవో భయాలవీ అనిపిస్తుంటాయి” ప్రేమగా అని, నా వెన్నుమీద రాసి, లేచింది” ఆగింది గీత.
“ఎవరని పెద్దనాన్నని అడగలేదా?” అడిగింది మహతి.
“పెళ్ళిహడావిడి అయాక అడిగాను. ఆయన హాస్యంగా తీసిపారేసారు. కానీ యింకేదో జరిగింది”
“పెళ్ళిలో రాణా కనిపించలేదు”
ఆ జవాబుకి గీత చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. “అప్పుడేమిటో మొండితనంతో బతికేసానుగానీ, ఈ బతుకు నాకు నచ్చలేదు మహీ! అస్సలు నచ్చలేదు. ఒకళ్ళనొకళ్ళం అర్థంచేసుకోలేనివాళ్ళం గొప్ప స్నేహితులమని చెప్పుకుంటూ తిరిగేం చూడు, దానికన్నా పెద్ద జోక్ మరోటి వుండదు. ఉద్వేగాలు ప్రభావం చూపే వయసు. అన్నీ ఫెయిల్డ్ కమ్యూనికేషన్స్. తర్వాతెప్పుడో అర్థమౌతాయి. అప్పుడవి బాధపెట్టడం మొదలెడతాయి. ఉన్న విషయాలేకదా, జరిగినవేకదా, తెలిసినప్పుడు ఒకలా, తెలీనప్పుడు ఒకలా ప్రవర్తించడమేమిటి? మహీ! ప్రవర్తన మనదికాదు, మనచుట్టూ జరిగే విషయాలది. మనలో మనకి చాలా సమీకరణాలు, కంపర్ట్‌జోన్స్ వుండేవి. సూదింగ్ ఫేక్టర్స్ వుండేవి. నాకు యే చిన్న సమస్య వచ్చినా వెళ్లి వాసు చెయ్యి పట్టుకునేదాన్ని. వాసు ఒకొక్కసారి కోప్పడేవాడు. సుధీర్ నేను తప్పుచేసినా ఏమీ అనేవాడుకాదు. రెండోవాళ్లకి సర్దిచెప్పేవాడు. తను నాకు సూదింగ్ ఫేక్టరు. రవళీ, వసంత్ ఒకరికొకరు నిలబడేవారు. నువ్వూ నేనూ అలానే వుండేవాళ్ళం. మాధవ్, సుమంత్, రాణా కలిసి తిరిగేవారు. సుధీర్, వాసు చాలా క్లోజు. సుమతి, సుధీర్ ఒక్కమాటమీద వుండేవారు. సుమంత్ నా పార్టీ. మళ్ళీ వీళ్ళందరిమధ్యా గొడవలు వస్తే అవి నేను తీర్చాలి. మీ అందర్లా రాణాకూడా ఏదో చెప్పాలని ప్రయత్నించేవాడు. వాడి కంఫర్ట్‌జోన్ నా దగ్గిర. సరిగ్గా చెప్పలేక వాడు చాలా పొరపాట్లు, ఆ స్థాయి దాటిన తప్పులూ చేసాడు. వాళ్ళ నాన్నమీది కోపాన్ని మనింట్లో అందరూ వాడిమీద చూపించేవారు” అని ఆగి, పమిటచెంగుతో ముఖం, కళ్ళూ శుభ్రంగా తుడుచుకుంది.
“నా రెండో ప్రశ్నకి అప్పటికప్పుడు జవాబు దొరకలేదుగానీ, కుటుంబసంబంధాల్లోని మర్మంమాత్రం అర్థమైంది నాకు. ముఖ్యంగా మనింట్లో. వీళ్ళెవరూ కోపాలని శాశ్వతంగా మనసుల్లో నిలుపుని బంధాలు తెంచుకుని దూరంగా జరిగిపోవాలనుకోవటంలేదు. సర్దుకుపోతున్నారు. ఈ సర్దుకుపోవటమనేది మనసులో ఎగిసిపడే మంటల్ని చల్లారుస్తోంది. రవిబాబాయ్‍కీ నాన్నకీ గొడవలయ్యాయి. ఐనా అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి అక్కర. బాబాయ్ నాన్న బాగుకోసం ఆలోచిస్తాడు. నాన్నకి అతనిపై కనీకనిపించని ప్రేమ.
లేమ్మా! ఈ పాలు తాగేసి, టిఫెనుకూడా తిని తయారవ్వు. అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. వెళ్దాం. అక్కడినుంచి వచ్చాక సుమతిని పెళ్ళికూతుర్ని చెయ్యాలి- అంది అత్త.
తను వెళ్ళిపోయింది. వెనకే నేనూ వెళ్ళాను. వీళ్ళేకాదు, అందరూ బాగానే వెతుక్కున్నారు నాగురించి.
మా అన్నదమ్ములు ముగ్గురిమధ్యనా పెద్దపిల్ల. మా చెల్లెలి కొడుక్కి చేసుకున్నాం. మా ఆరుగురు అక్కచెల్లెళ్లకీ పెద్దకోడలు- మగపెళ్ళివాళ్ళకి పరిచయంచేసారు.
అయ్యో! దానికి అరటిపండు తాంబూలంలో పెట్టకండి- నా చేతికి జాకెట్టుబట్టతోపాటు అరటిపండు పెట్టి యివ్వబోతుంటే పద్మత్త వారించింది.
చూసుకోలేదండీ. ఏమీ అనుకోవద్దు- వాళ్ళు సర్ది చెప్పుకుని, ఎండుఖర్జూరం పెట్టి యిచ్చారు.
ఎన్నో నెలమ్మా, వేవిళ్ళున్నాయా- ఎవరో పెద్దావిడ అడిగింది. పెద్దకబుర్లు ఎలా వుంటాయో, పెళ్లైన ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అర్థమైంది నాకు.
అరటిపండు ఎందుకు పెట్టకూడదు- పద్మత్తని అడిగాను.
డెలివరీ అయ్యాక చెప్తాను. ఈలోగా ఎవర్నీ అడక్కూడదు మరి. అలాగే ఎవరేనా పొరపాట్న తాంబూలంలో పెట్టి యిచ్చినా తీసుకోకు. తెలిసిందా- అంది. తలూపాను. అందరూ జంటలుగా వచ్చి పెళ్ళికొడుకుమీద అక్షతలు వేస్తున్నారు. వాసు వచ్చి నాపక్కని నిలబడ్డాడు. ఇదో కొత్త అనుభవం. సుమతి తనకన్నా చిన్నదీ, నేను వరసలో పెద్దా కాబట్టి అక్షతలు వేయచ్చట.
మేమంతా ఎదర వరసగా వున్నవాటిల్లో కుడివైపునించీ రెండోగదిలో వున్నాం. ఇక్కడవగానే వచ్చెయ్- అని చెప్పి తను వెళ్లిపోయాడు.
తను వెళ్లగానే ప్రహ్లాద్ వచ్చాడు.
వదినగారికి సీనియర్లబేచికి ప్రమోషన్ వచ్చింది- అని నవ్వాడు.
ఏయ్, మేమంతా అక్కడ ఆ గదిలో కూర్చున్నాం. సుమతికూడా అక్కడే వుంది. నువ్వూ వచ్చెయ్- అన్నాడు. అంటే సుమతిని మోసేసే కార్యక్రమం అన్నమాట. నా చెయ్యి పట్టుకు లాక్కెళ్ళబోతుంటే,
దాని చెయ్యి వదలరా, ముందు. ఇక్కడుండి అది చేసేదేమీ లేదుగానీ, నువ్వు వెళ్తుంటే నెమ్మదిగా వస్తుంది- అంది అరుణత్త. వాడు వెళ్తుంటే ప్రమీలత్త గబగబ వెంట వెళ్ళింది. వెనకే నేనూ, అరుణత్తా నడుస్తున్నాం.
అరేయ్, సుమతినేమీ అనకండిరా, బాబూ! పెళ్ళికొడుకు పేరు నచ్చలేదని అసలే అది పెళ్ళికి బోల్డంత గునిసింది! పెద్దనాన్న నాలుగు కేకలు వేస్తే అప్పుడు వప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ గునుపు మొదలెట్టిందంటే కష్టం- అంది బతిమాలుతున్నట్టు.
అయ్యో ఆమ్మా! దాన్నేమీ అనం. ఉత్తిగా మాట్లాడుకుంటాం. అంతే- అన్నాడు నవ్వుతూ. పిలక చేతిలో పెట్టాక ఇంక వీళ్ళేం ఆగుతారు? నాకు తెలీకపోతేకదా!
గీతా! నీకు పెళ్ళైంది. అంటే పెద్దరికం వచ్చింది. దానికి వదినవి. వీళ్ళు దాన్నేమీ అనకుండా చూసుకునే బాధ్యత నీదే- అంది నాతో.
దీనికే చెప్తున్నావా? వీళ్లందరికీ రింగ్‍లీడరు ఇదే. ఆ నలుసు కడుపులో పడ్డాక కాస్త భూమ్మీద నిలబడి నడుస్తోందిగానీ లేకపోతే దీన్నెవరు పట్టగలరు- అంది అరుణత్త.
లంకలో అంతరించిన రాక్షసమూకంతా అవంతీపురంలో మనిళ్లలో అవతరించారు. సుమతి మళ్ళీ ఏం గొడవచేస్తుందో ఏమిటో- తలపట్టుకుంది ప్రమీలత్త.
లేదత్తా! నేను చూసుకుంటాను- నెమ్మదిగా అని వాళ్ళున్నవైపుకి వెళ్ళాను.
ఒక్క రాణాతప్ప అందరూ అక్కడే వున్నారు. తులసి, కృష్ణావాళ్ళు నలుగురు, ఆ తర్వాతి నలుగురితో కలిపి అందరూ. వాసు పక్కని నాకో కుర్చీ ఖాళీగా వుంది. రేపటిరోజుని ఇంకో పెళ్ళిలో సుమతి పక్కనికూడా అలానే వుంచుతారు. నన్నూ వాసునీ మినహాయించుకుంటే వీళ్ళు పదిహేడుమంది. అంటే అన్ని కుటుంబాలుగా ఎదుగుతాం. అందరం ఇలా కలుసుకుంటూ వుంటే ఎంత బావుంటుంది! కోపాలన్నీ కరిగిపోయి, ఒక కమ్మని కల నా కళ్ళముందు కదుల్తుంటే చిన్న వులిక్కిపాటు. సుధీర్ నాముందు సౌకర్యంగా లేడు. అది గుర్తించాను.
దేనికి అతనికి ఆ కోపం, అయిష్టతాను? వాళ్ళకేం కావాలో ప్రమీలత్తచేత నాన్నకి చెప్పించారు. నాకేం కావాలో నేనూ నాన్నకి చెప్పాను. మళ్ళీ నన్ను రవిబాబాయ్ ఇంట్లో వప్పించే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి? నాకు నచ్చింది చెప్తే కోపాలెందుకు రావాలి? నాకూ, మామయ్యకీ, అత్తకీ లేని కోపం వీళ్ళు ముగ్గురికీ ఎందుకు? ఏం సాధించాలని? ఎవర్ని సాధించాలని? వాసుతో బానే వుంటున్నారు. నేనేనా చెడ్డదాన్ని? ఒక ధోరణిలో సాగుతున్న నా ఆలోచనలు వసంత్ మాటలతో ఆగిపోయాయి.
ఇదేమో గీతావాసుదేవ్. తోక పర్వాలేదు. బానేవుంది. బావ పేరేంటే సుమతీ- అని మొదలుపెట్టాడు వసంత్. అప్పుడలా రెండోవాళ్ళ పేరు కలుపుకుని రాసుకోవడం సరదాగా వుండేది. గీతావాసుదేవ్ అని రాసుకుంటే నాకేదో సాధించినంత గొప్పగా వుండేది.
అదేంటమ్మా, నోరు తిరగట్లేదు- అన్నాడు మాధవ్.
సుమతి కోపంగా చూసిందిగానీ మాట్లాడలేదు. అక్కడ తలుపుదగ్గిర ఎవరో చిన్నపిల్లాడి తలకాయ తొంగిచూస్తూ కనిపించింది. ఏడెనిమిదేళ్ళుంటాయి. మగపెళ్ళివారివైపు. తను చేత్తో రమ్మని సౌంజ్ఞచేస్తే వచ్చాడు.
చెప్పండి అత్తా- అన్నాడు. నాకు అనుభవంలోకి రాలేదుగానీ పెళ్ళితో ఎన్ని కొత్త బంధుత్వాలు మహీ! ఎన్ని కొత్త పిలుపులు! ముక్కూమొహం తెలీని పిల్లాడెవరో ఎంతో భక్తిగా తనని చూస్తూ అలా అనడం గమ్మత్తనిపించింది.
నేను రమ్మన్నానని మామయ్యని తీసుకొస్తావా- అంది ఆ పిల్లాడిని. అక్కడ వాళ్ళ కార్యక్రమం ఐపోయినట్టుంది, అతను వచ్చి కూర్చున్నాడు.
మా కజిన్స్ అందరం ఇక్కడే వున్నాం. వాళ్లని మీకు పరిచయంచేద్దామని పిలిచాను- అంది సుమతి అతన్తో” అని ఆగింది గీత.
“మన ఆటకి చెక్ పెట్టానని తను అనుకుంది. వీళ్ళూ కాస్త తికమకపడ్డారుగానీ వెంటనే రూటు మార్చేసారు” అంది మహతి నవ్వుతూ. ఆ విషయాలు ఇద్దరికీ గుర్తొచ్చాయి.


“మా పేర్లు మేం చెప్పుకోగలంలేమ్మా! ఇందర్ని పరిచయం చేసి అలిసిపోతే పీటలమీద కూర్చోవటానికి వోపికుండదు. అసలే ఏడుమల్లెలెత్తు రాజకుమారివి” అన్నాడు మాధవ్.
“పోరా” అంది సుమతి.
పదిహేనుమందీ వరసగా పేర్లు చెప్పుకుని పరిచయాలు చేసుకున్నారు. కొద్దిసేపు అతన్ని మాటల్లో పెట్టాక హఠాత్తుగా వాసు లేచి నిలబడి, “బావా! ఇందాకే మా పేర్లు మీకిచ్చేసాం. మళ్ళీ మావి మాకు ఇచ్చేస్తే వెళ్ళి పెళ్ళిపనులు చూసుకుంటాం” అన్నాడు. ఒక్కసారి అన్నిపేర్లు చెప్తే గుర్తుపెట్టుకుని వాటిని ఆయా మొహాలకి అతికించాలన్నమాట. అదేమైనా చిన్నవిషయమా? కుర్చీలు మారి వీళ్లు బాగా తికమకపెట్టేసారు. అతనుకూడా చాలా సరదాయైన మనిషి. స్పోర్టివ్‍గా తీసుకున్నాడు.
“ఆ ఎర్రపరికిణీ అమ్మాయి ఐఫిల్ టవరు, ఈ తెల్లగా నాజూగ్గా వున్నది అవంతీపురం రాకుమారి, ఈవిడేమో మీ రింగ్‍లీడర్‍… ట” అంటూ అందరికీ టకటక నిక్‍నేమ్స్ పెట్టేసాడు. అందులోని వుప్పంతా సుమతి అందించినదే. ఇలా అల్లరిపట్టిస్తామనికూడా ముందే చెప్పేసింది. ఇద్దరూ ఎప్పుడో జెల్ అప్ ఐపోయినట్టున్నారు.
“సుమతి మీకేం చదువుకున్నానని చెప్పిందో? పీజీ అని చెప్పిందా? వట్టి అబద్ధం. అదేం చదువుకోలేదు. మొద్దుబుర్ర. అందర్నీ ఇలాగే గుర్తుపెట్టుకుంటుంది. మీరు చదువుకున్నారుకదా, మీరూ అలానేనా?” అన్నాడు ప్రహ్లాద్. అతను సరదాగా నవ్వేసాడు.
“మరదళ్ళూ, బావమరుదులూ శతృవర్గంవాళ్ళు. నో డౌట్. కనీసం చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఆదుకోవచ్చుగా?” అన్నాడు జాలిగా మొహం పెట్టి. పిల్లసైన్యం కిచకిచ నవ్వుతున్నారు. వాళ్లలో వాళ్ళు గుసగుసలుపోతున్నారు.
అతను ఆలోచించుకున్నాడు.
అందర్లోకీ చిన్నది, రవి కూతురు పల్లవి. ఆ పిల్లని అమాంతం కుర్చీతోసహా గాల్లోకి లేపేసి తెచ్చి తన పక్కని కూర్చోబెట్టుకున్నాడు.
“అమ్మలూ! నువ్వు వీళ్ళందరికన్నా చాలా మంచిదాన్లా వున్నావు. వీళ్ళంతా బేడ్” అని వుబ్బేసేసరికి ఆ పిల్ల బుట్టలో పడిపోయింది. అందరి పేర్లూ టకటక చేప్పేసింది. సుమతి నవ్వుతూ గర్వంగా చూసింది.
“థేంక్స్ జో” అంది. అందరికీ వినిపించాలనే రెండుమూడుసార్లు ఆ పేరు వత్తి పలికి ఏవో చెప్పింది. అతను తలూపి నవ్వుల సెలయేరులా అక్కడినుంచీ వెళ్ళిపోయాడు. అతను వెదజల్లిన నవ్వుల తుంపరలు ఇంకా అక్కడ అందర్నీ తడుపుతునే వున్నాయి.
“గీతకదే, జోజో అనాల్సింది? ఇంకా పెళ్ళేనా అవలేదు, నువ్వంటున్నావేంటే?” అంది రవళి అమాయకంగా మొహం పెట్టి. అంతా పెద్దగా నవ్వారు. కాస్త అడల్ట్ జోక్స్ మొదలయ్యాయి. ముందు రవళి, తన వెనకాల తులసీ మొదలుపెట్టారు.
“ఎటుతిరిగీ గాలి నామీదకేనా?” అంది గీత చిరుకోపంగా. సిగ్గనిపిస్తున్నా ఈ పరిహాసాలకి నెమ్మదిగా అలవాటుపడుతోంది.
“మనందరం ఒకటికదా, ఇలా చేసావేమిటే?” అని పల్లవి వెంటపడ్డారు.
“నాకు గీతమీద కోపం వచ్చింది. దాని బొజ్జలో బేబీ వుందట. నాకు చూపించలేదు. ఎప్పుడో చూపిస్తుందట” అంది. మరోమాటు అంతా నవ్వేసారు.
“ఇంకా నయం, ఆమాటేదో అతనిముందు అనలేదు. సుమతిని వదిలేసి మళ్ళీ నా తాళం పట్టించారు. కానీ, సుడిగాలా, సెలయేరా ఏమిటే, ఆ మనిషి? ఇప్పటికీ అదే తీరు. సుమతి చాలా అదృష్టవంతురాలు” అంది గీత. “మహీ! మనసుకి గుచ్చుకోని వత్తైన పరిమళంలాంటి పరిహాసం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అలాంటి సువాసనలకి మనిల్లు ఒక పూదోటే అనుకో. కానీ, ఆ మధ్యలో సుధీర్. రాణాతో అయిందనుకుంటే వీడు. పెళ్లంతా ముభావంగానే వున్నాడు. వాళ్లవాళ్ళంతా వాడిని కాసుకోవడం” అంది విసుగ్గా.
“రోడ్ నాట్ టేకెన్” వాసు అనడం గుర్తొచ్చింది మహతికి.
“సుధీర్‍కూడా వాసులాగే నీగురించి అనుకున్నాడేమో!” అంది నెమ్మదిగా.
గీత వింతగా చూసింది. “ఐతే? తనకి నేను నచ్చితే సరిపోయిందా? నాకూ తను నచ్చాలికదా? ఏకపక్షనిర్ణయం సరిపోదు. ఒకవైపునించీ వుండే యిష్టం ప్రేమవదు. అది రెండోవైపునికూడా అలాంటి యిష్టాన్ని ట్రిగ్గర్ చెయ్యగలగాలి. అప్పుడూ, ప్రేమయేది. వాసు గీతని ఇష్టపడుతున్నాడు, మీకిష్టమైతే ఇద్దరికీ పెళ్ళిచేద్దాం అని అడిగింది లక్ష్మత్త. మరి ప్రమీలత్త? సుధీర్‍కి చదువు చెప్పించి అల్లుడిని చేసుకొమ్మంది. అలా అడుగుతుందని సుధీర్‍కి తెలీకుండా వుండదుకదా? ఆవిడని ఆపవచ్చుకదా? ఆపలేదు. మరింక యిందులో ప్రేమ ఎక్కడినుంచీ వచ్చింది? లేని ప్రేమగురించి కోపాలు, అలకలు దేనికి? మేం కాదంటామని అనుకోలేదేమో, కోపాలొచ్చాయి. నాన్నని ఏమీ అనలేరుకాబట్టి ఆ కోపమంతా నామీద చూపెట్టారు. పదేళ్ళు వీళ్ళు ఆ కోపాలు సాగించుకున్నారు. ఫోన్లు లేవు, రాకపోకల్లేవు. పెళ్ళిళ్ళకీ బారసాలలకీ కలుసుకోవడమే. చుట్టాల్లా పొడిపొడిగా మాట్లాడుకోవడమే తప్ప, అభిమానాలేం మిగిలాయి? మహీ! నరకమే, అది. అప్పటిదాకా ఒక్క ప్రాణంగా తిరిగినవాళ్ళమధ్యనుంచీ తప్పుచేసినదాన్లా దూరం జరగడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? పెళ్ళితో మీ అందరి జీవితాల్లోకీ కొత్తకొత్త మనుషులూ, బంధువులూ వచ్చి చేరారుగానీ, నాకు అలాంటి మార్పేమీ లేదు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ వున్నది మీరే. మీ అమ్మ పోయినప్పుడు సుధీర్ నాతో ఫోన్లో మాట్లాడాక అప్పుడు సుమతి, సుమంత్ మళ్ళీ మొదట్లోలా మాట్లాడ్డం మొదలుపెట్టారు. అప్పటికి నేను ఆ దూరానికి అలవాటుపడ్డాను” అంది.
సుమతి చెప్పిన మిగతా విషయాలు చెప్పి, ఆమెని మరింత యిబ్బందిపెట్టాలనుకోలేదు మహతి. తను ఏవేవో చెప్పడం కాదు, ఆమెని మాట్లాడించాలి. ఎన్నెన్ని విషయాలకి బాధపడుతోందో, ఎంత బాధ మనసులో పోగుపడిందో, అందులో ఆత్మహత్య చేసుకునేంత వివరం ఏం వుందో, దాన్ని బైటికి తియ్యాలి.
“మా పెళ్ళితో మనింట్లో మొదలైన పెళ్ళిళ్ళ సీజన్ సుమతి పెళ్ళితో స్థిరపడింది. వీళ్ళందరూ మెడికోలూ, డాక్టర్లూ కావడంతో నేల యీనినట్టు పెళ్ళికి వచ్చినవాళ్ళంతా డాక్టర్లూ, సిస్టర్లే. ప్రొఫెసర్లు, ప్రొఫెషనల్స్, క్లాస్‍మేట్స్, అనేకమంది. వాళ్లందరికీ ప్రత్యేకమైన మర్యాదలు జరిగాయి. సుధీర్‍వాళ్ల స్థాయి మారినట్టుకూడా అనిపించింది. అప్పుడే సుమంత్ లతని మనకి పరిచయం చేశాడు. నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చి చూపించాడు. ఏదో చెప్పాలనుకున్నాడుగానీ చెప్పలేకపోయాడు.
తర్వాత మాట్లాడతాలే- అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాతకూడా తనేమీ పెద్దగా చెప్పలేదుగానీ, నాకే అర్థమైంది. అటు సుధీర్ పెళ్ళి చేసుకోనని కూర్చున్నాడు. ఇటు వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో వున్నారు. సుధీర్‍కి నేనేమైనా చెప్పి వప్పిస్తానేమోనని సుమంత్ ఆలోచనకావచ్చు. ఈ పెద్దరికాలు, పెత్తనాలు చిన్నప్పట్నుంచీ నామీద వున్నాయికదా, అందుకు. కానీ నేను పట్టించుకోలేదు”
“…”
“పెళ్ళి చేసుకొమ్మని సుధీర్‍కి అందరూ చెప్పడం అయింది. తను వినట్లేదట. వాళ్ళమ్మానాన్నలతో సరిగ్గా వుండట్లేదనికూడా తెలిసింది. మరో ఐదేళ్ళకి నాకే చిరాకేసింది, ఇంకా శాలువాకోసం వెతుక్కుంటున్న ఆ దేవదాసుని చూస్తే. అప్పటికి మన బేచిలో అందరి పెళ్ళిళ్ళూ అయ్యాయి. వీళ్ళిద్దరే మిగిలారు. సుధీర్ని పట్టుకుని అడిగేసాను. నువ్వూ పెళ్ళి చేసుకోవచ్చుకదరా- అని. నేనలా సూటిగా అడుగుతానని అనుకుని వుండడు. కంగుతిన్నాడు. వెంటనే సర్దుకున్నాడు. మీరంతా మహామేథావులుకదా, లోలోపలి స్వయంపాకాలేవీ పైకి కనపడనివ్వరు.
చేసుకోవాలంటావా- అన్నాడు.
అదేం ప్రశ్న? చేసుకోక ఏం చేస్తావు? అందరూ చేసుకుంటున్నారు. నువ్వూ చేసుకో. నామీద కోపం వుంటే పెళ్ళి మానుకోనక్కర్లేదుకదా? చేసేస్తే నాక్కూడా ఒక బాధ్యత తీరిపోతుంది- అన్నాను కొంచెం తిక్కగా.
చివరిమాటలకి పడీపడీ నవ్వాడు. చాలారోజులతర్వాత ఆ నవ్వు. మబ్బులు విడిచిన చంద్రుడిలా వుంది ముఖం.
కాక? పెళ్ళి సాంబారాలు చేర్చడం, పెళ్ళిఖర్చుల లెక్కలు, ఈ సీనియర్లందర్నీ వరసతప్పకుండా నిలబెట్టడం-అన్నాను.
ఔను. అన్నీ నువ్వే చూస్తున్నావటగా? చాలా ప్లాన్‍డ్‍గా చేస్తున్నావని చెప్పాడులే, రవి మామయ్య. పెద్దదానివైపోయావు- అన్నాడు అదే నవ్వుతో.
అక్కడ సుమంత్ హాహాకారాలు చేస్తున్నాడు- అన్నాను.
అదేమిటి- ఆశ్చర్యంగా అడిగాడు. చెప్పాను.
నీమీద కోపం దేనికి? ఇంకా టైముందని అనుకుంటున్నాను. జాబ్‍లో సెటిలై, అమ్మావాళ్ళకోసం ఇల్లేదేనా తీసుకుంటే బావుంటుందని ఆగాను. నాన్న అద్దె యింట్లో సర్దుకోవడం చూడలేకపోతున్నాను. పెళ్ళి చేసుకుంటే ఇల్లు కొనడం వెంటనే కుదరదుకదా- మామూలుగా అన్నాడు. కావచ్చు.
ఇంట్లో వుండట్లేదు గీతా! హాస్పిటల్ క్వార్టర్స్‌లో వుంటున్నాను. చాలా బిజీగా వుంటున్నాను. సుమంత్‍కూడా నాతో ఏం చెప్పలేదు- అన్నాడు.
నీకు కాకుండా తనెలా చేసుకుంటాడు? నువ్విలా పెళ్ళే చేసుకోనని కూర్చుంటే అవతలి అమ్మాయికి ఏం చెప్తాడు- అడిగాను. అంతకన్నా నేను వాదించలేదు. అతని వ్యక్తిగత విషయం. వాళ్ళింటి విషయం. ఏమనుకున్నాడో, ఏం ఆలోచించుకున్నాడో మొత్తానికి ఆఖర్న పెళ్ళికి వప్పుకున్నాడు”
“వద్దనుకున్న చదువూ చదివాడు. అమెరికా లాక్కెళ్ళింది వదిన” అంది మహతి. కొద్దిసేపు ఆగింది గీత. మేఘన వచ్చింది.
“టీ ఇక్కడికి తేనా? అక్కడికొస్తారా?” అడిగింది.
“అమ్మావాళ్ళూ ఏం చేస్తున్నారే?” అడిగింది గీత.
“పెద్దవాళ్ళు ముగ్గురూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మామయ్య హరితో కలిసి బైటికి వెళ్ళాడు. ఇందిరేమో మొహం ముడుచుకునే వుంది. నేను హాయిగా టీవీ చూస్తున్నాను” అంది మేఘన.
“భలే వుంది పిల్ల!” అంది గీత.
“మేముకూడా చిన్నప్పటి విషయాలు గుర్తుచేసుకుంటున్నాం. టీ ఇక్కడికే తేపో” అంది మహతి. ’
“ఇదీవేళ నన్ను వదిలేలా లేదు. ఒకటే వాగిస్తోంది” అంది గీత.
మేఘన వెళ్లిపోయింది. టీ తీసుకుని తులసి వచ్చింది. ఆమె ముఖం బరువుగా వుంది.
“అలా వున్నావేమే?” అడిగింది గీత.
“ఎలా వున్నాను? బాగానే వున్నాను. ఇప్పుడే నిద్ర లేచాను” అంది తులసి తడబడి.
“బంధాలు తెంచుకోవడం అంత తేలికకాదు. తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నావా? ఈ బాధ నాకు అనుభవమేకదా?” మహతి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళు సవరిస్తూ అడిగింది.
“మనని పట్టి వుంచిన బంధాలన్నీ చివరిదాకా అదే సాంద్రతతో వుంటాయనేం లేదు మహీ! ముఖ్యంగా ఇలా కలుపుకున్నవి. బాధనిపించినా కొన్నిటినుంచీ విడివడటమే మంచిది. క్రమేపీ అలవాటు పడిపోతాం. కొన్నాళ్ళు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లలగురించే దిగులు. వాళ్ళింకా చిన్నవాళ్ళు. స్థిరపడలేదనేదొక్కటే సమస్య. ఐనా వదిన వుందనే ధైర్యం వుండేది మొన్నమొన్నటిదాకా. తనే ఇలా చేసిందంటే కాళ్లకింద నేల కదిలినట్టైంది” అంది తులసి.
“మేఘన పెళ్ళిచేసేసి నేనూ ఇక్కడికే వచ్చేస్తానులేవే. అది వెళ్ళిపోయాక ఇంక అక్కడ నాకేం వుంటుంది?” అంది మహతి. మళ్ళీ కాసేపు పడుకుంటానని వెళ్ళిపోయింది తులసి.
“అతను అలా ఎలా చెయ్యగలిగాడు గీతా? నాకీ విషయాల్లో ఎప్పుడూ ఆశ్చర్యమే. శృంగారం తప్ప ఆడామగా మధ్య మరేదీ వుండటానికి అవకాశంలేదా? వయసులో వున్నప్పుడుసరే, పెద్దవాళ్ళం ఔతున్నాకూడానా? మగవాళ్లని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? వాళ్ళకి కావల్సింది మనమే యివ్వలేక, మనసూ, మమతా అంటూ సెంటిమెంటల్ ట్రాష్ మాట్లాడుతున్నామా?” అడిగింది మహతి.
“దీన్ని బాధపెట్టడం యిష్టంలేక దూరం జరిగినా అతను తులసికే కట్టుబడి వున్నాడు. దీనికే మొహం తిరిగిపోయింది. దూరం పెట్టింది. నీలాగే ఆలోచించింది. నువ్వనేకాదు, ఆచరించగల అవకాశం, సమర్ధించేవాళ్ళూ వుంటే ఎవరేనా ఇలానే ఆలోచిస్తారు. అతనికి కావల్సింది దీనికి వద్దు. ఈ వద్దూ-కాదులమధ్య వాళ్ళ విడాకులు జరిగిపోయాయి.
ఎంతకాలం మల్లెపూలు సింగారించుకుని వుండగలం మనసులు వాడిపోయాక కూడా- అని అడిగింది.
నిజమే, అకారణంగా ఒకొక్కసారి మనసులు వాడిపోతాయి” అంది గీత. ఆమె ముఖంలో విషాదం తాండవించింది.
“ఇరవయ్యేళ్ళ పిల్ల మహీ! దారుణంగా చచ్చిపోయింది” తనే అంది అసందర్భంగా. ఒక భయమో, వేదనో, అలాంటి- అర్థంకాని మరెన్నో భావాల మిశ్రమమో తెలీని సంచలనం ఆమె ముఖంలో కదిలింది. మహతికి ఏమీ అర్థమవలేదు. భయం మాత్రం స్పష్టంగా తెలిసింది.
“ఎవరే?” అని అడుగుతునే వుంది, గీత లేచి నిలబడింది.
“వెళ్దాం పద. అన్నీ ఒక్కరోజే ఎందుకు?” అని హాల్లోకి దారితీసింది. మహతికి అనుసరించక తప్పలేదు.
వీళ్ళు వెళ్ళేసరికి అక్కడి పరిస్థితి ఇంచుమించు మేఘన చెప్పినట్టే వుంది. లక్ష్మీ, యశోదా ఏవో మాట్లాడుకుంటున్నారు. రామారావు వినీవిననట్టు వింటున్నాడు. ఆయనకి ఈమధ్య వినికిడీ, చూపూ తగ్గాయి. అందుకని పెద్దగా ఎందులోనూ తలదూర్చకుండా తటస్థంగానే వుంటున్నాడు. తులసిమాత్రం పడుక్కుని వుంది. వెళ్ళి యశోదావాళ్ళ పక్కని కూర్చుంది మహతి.
“మా బతుకులు మావని అన్నీ తెంచేసుకుని ముందుకి వెళ్తున్నప్పుడు ఇంకా ఈ మమకారాలు దేనికి?” అంది లక్ష్మి కోడల్ని చూసి.
“మనసులో ప్రతిమనిషికీ ఒక్కో అర వుంటుందనీ, అందులో మళ్ళీ రహస్యపు అరలు వుంటాయనీ నువ్వేకదా, అప్పుడెప్పుడో చెప్పావు?” అడిగింది గీత.
“అన్నీ తెలిసిన పండితురాలివి, నీకు నేనెప్పుడు చెప్పానూ?” సాగదీసింది లక్ష్మి.
“తులసికి జ్వరం వచ్చిందే! ఇందాకానే భారంగా అనిపించింది. టీకూడా వద్దని పడుక్కుంది” అంది యశోద.
“వద్దనుకున్నా వదలని మమకారాలు చాలా వుంటాయి. బంధాలు ఎలా బలహీనపడతాయో, బాధలూ అలానే బలహీనపడతాయి. టైం పడుతుంది” అంది మహతి. గీత తులసి పడుక్కున్న దగ్గిరకి వెళ్ళింది. కూతురు పక్కకి వెళ్ళింది చూసి అడిగింది యశోద, “ఏమంటోందే?” అని.
“ఎప్పటెప్పటి విషయాలో మాట్లాడిందత్తా! మనింట్లో జరిగినవే. గుర్తుచేసుకుని చెప్పింది. చివర్లోమాత్రం ఎవరో అమ్మాయిగురించి అని, ఆపేసింది. నీకు తెలుసా, ఆ అమ్మాయెవరో?” ఎదురు అడిగింది మహతి.
“ఖర్మ. ప్రపంచంలో ఎవ్వరికీ అక్కర్లేనివన్నీ వీళ్ళిద్దరికే కావాలి. లేనింటి పిల్లలందర్నీ పోగుచేసి చదువులు చెప్పిస్తారు. ఇది పడీపడీ ఆఫీసుకెళ్ళి సంపాదించుకొచ్చిమరీ వాళ్ళ ఫీజులవీ కట్టేది. ఎంతొస్తోందో, ఎంత ఖర్చుపెడుతున్నారో లెక్కాపత్రం ఏమైనా వున్నాయో లేదో ఎవరికీ తెలీదు. ఖర్మ. ఏసీబీవాళ్ళ దృష్టిలోకూడా పడ్డారు. అక్కడితో ఆగారా? ఆ పిల్లల కష్టాలూ సుఖాలూ వీళ్ళవే. వాళ్ళని కన్న అమ్మానాన్నలు వుంటారుకదా? వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు?” తన ధోరణిలో తను చెప్పుకుపోయింది యశోద.
అక్కడ గదిలో తులసి నుదురు పట్టి చూసింది గీత. వేడిగా వుంది.
“టేబ్లెట్ వేసుకున్నావా, తులసీ?” అడిగింది.
“వేసుకున్నాను వదినా! పొద్దుటికి తగ్గిపోతుందిలే! కాసిన్ని పాలు యివ్వు. తాగేసి పడుక్కుంటాను. అన్నం తినను” జవాబిచ్చిందామె. గీత పాలు తెచ్చి యిచ్చింది. తాగేసి పడుక్కుంది తులసి. బెడ్‍షీట్ కప్పి, తలుపు దగ్గిరకి వేసి ఇవతలికి వచ్చింది గీత.
“నన్నేనా, అంటున్నది? తిడుతున్నావా, పొగుడుతున్నావా?” తల్లిమాటలు సగం విని, అడిగింది.
“తిట్టో, పొగడ్తో తెలీకుండా వున్నావేం?” అందావిడ.
వాళ్ల వాగ్వివాదం ఇంకా నడిచేదేగానీ వాసు, హరి బైటినుంచీ రావటంతో ఆగిపోయింది. వాసు అతన్ని వెంటేసుకుని తిరగడం ఏమిటో అర్థమవ్వలేదు మహతికి. వీళ్ళిద్దరికీ రానురాను మతులు పోతున్నట్టున్నాయి! అనుకుంది. చాలా సంవత్సరాలక్రితం ఆమెకోసం ముంబై వెళ్ళినప్పుడు గురుమూర్తి ఇలానే కొడుకులకోసం బెంగపడి మాధవ్‍ని వెంటబెట్టుకుని వూరంతా తిరిగాడు. ఇప్పుడు వాసు. ఈమధ్యలో ఇంకా ఎందరున్నారో! ఈ నాన్నలూ అమ్మలూ శూన్యమైపోయిన వాకిళ్ళలోంచీ ఇవతలికి నడిచి వచ్చి, ప్రేమభిక్ష యాచిస్తున్నవారు!
గీత చెప్పిన ఆ పిల్ల ఎవరు? వీళ్ళకేంటి సంబంధం? వెంటనే మరో ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ఎవర్నీ అడిగే అవకాశం లేకుండానే భోజనాలు, మిగతా కార్యక్రమాలూ అయ్యాయి. హరి పిలిస్తే ఇందిర వచ్చి అన్నానికి కూర్చుంది.
“ఇంకొక ఆంటీ వుంటారు, ఆవిడ రాలేదే?” హరి మేఘనని అడిగాడు.
“తులసి పిన్నా? తనకి కొద్దిగా జ్వరం. పడుక్కుంది” జవాబిచ్చింది మేఘన.
మనిషికొక రకం వంట. ఎంత యిస్తోందో గీత, వంటాయన శ్రద్ధగానే చేస్తున్నాడు. విసుక్కోవట్లేదు. రామారావుకి బీపీతోపాటు షుగరుకూడా వుంది. రొట్టెలు నమలలేడు. మిలెట్స్ వేయించి పిండి చేసి కాచిన జావ తాగుతాడు. లక్ష్మికి మిల్లెట్స్ అరగవు. అన్నం మెత్తగా వండితే తింటుంది. పక్కింట్లో రుక్మిణమ్మావాళ్ళకీ అంతే. మహతీ, మేఘనా ముంబైలో వుండటంతో రొట్టెలకి బాగా అలవాటుపడ్డారు. మిగతావాళ్లకి మామూలు వంట. పెద్దగా మాట్లాడుకోకుండానే భోజనాలయ్యాయి. ఇంట్లోని ఒక మనిషి వొంట్లో బాలేకుండా వుండటంలోని తేడా తెలుస్తోంది. భోజనాలయ్యాక ఎవరితోటీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. వెనకే హరీ మేఘనా వెళ్ళారు. చెల్లెలి ప్రవర్తనలోని తప్పు తెలుస్తోంది హరికి. ఒకవైపు తల్లిలేకపోవడం, మరోవైపు తండ్రి హాస్పిటల్లో వుండటం, ఇంకోపక్కన తామిద్దరూ వచ్చి తెలీనిచోట వుండటం ఇంకా ఎన్నో అంశాలు బాధపెడుతున్నాయి ఎదిగీ ఎదగని వయసులో వున్న ఆ పిల్లని. ఎలా వోదార్చాలో, ఇక్కడున్నందుకు ఎవర్నీ నొప్పించకుండా మామూలుగా వుండాలని మరెలా నచ్చచెప్పాలో తెలీడం లేదు హరికి.
“ఇలా విడిగా గదుల్లో పడుక్కోవడం మాకు అలవాటు లేదు. అందరం ఒకదగ్గిరే మాట్లాడుకుంటూ పడుక్కుంటాం. నేనూ వాళ్లదగ్గిరకి వెళ్తాను” కొద్దిసేపు వాళ్ళ దగ్గిర వున్నాక దిండు పట్టుకుని లేచింది మేఘన. ఆమె చెయ్యిపట్టుకుని ఆపాడు హరి.
“కోపం వచ్చిందా, అక్కా?” అడిగాడు.
“కోపం దేనికిరా? మీరిద్దరుకూడా అక్కడికే వచ్చెయ్యండి. అమ్మావాళ్ళ దగ్గిర వుంటే కబుర్లతో అసలు టైమ్ తెలీదు. ఎవరికి నిద్రొస్తే వాళ్ళం మాట్లాడుతునే నిద్రలోకి జారుకుంటాం. మళ్ళీ ముంబై వెళ్తే నేనూ అమ్మేకదా?” అంది.
“మేమా? మీ మధ్యనా?” తెల్లబోయాడు హరి.
“తప్పేముంది? తాతయ్యా, మామయ్యా హాల్లో పడుక్కుంటారు మామాటలు వినపడేలాగ. వాళ్ళ పక్కని నీకూ మంచం వేస్తారు. మిగతావాళ్ళం గదిలో పడుక్కుంటాం. ఇందుకూడా మాతోనే వుంటుంది” అంది మేఘన మామూలుగా. ఆ ప్రతిపాదన అతనికి బాగా నచ్చింది.
“భలే వుంటుందిలే, వాళ్ళ కంపెనీ. అంతా పుస్తకాలు బాగా చదువుతారు. వాటిగురించి చర్చించుకుంటారు. ఎప్పటెప్పటివో చిన్నప్పటి విషయాలు చెప్తారు. వీళ్లలో కొంతమంది స్వాతంత్ర్యానికిముందు పుట్టారు తెలుసా? తాతయ్య అందర్లోకీ పెద్దకదా, చాలా విషయాలు తెలుసు ఆయనకి. అవన్నీ చెప్తారు” అంది.
“అక్కా, మయూఖ్ ఎవరు? వాసు అంకుల్‍వాళ్ళకి పిల్లల్లేరా?” కొంచెం సంకోచంగా అడిగాడు హరి.
“వాళ్ళకి పిల్లల్లేకపోవడమేమిటి? మయూఖ్ వాళ్ళ కొడుకే. పెద్దతను. రెండోవాడు విహంగ్. ఇద్దరూ స్టేట్స్‌లో వుంటారు. వీళ్ళిద్దరేకాదు, నా కజిన్స్‌లో చాలామంది బైట వున్నారు. ఇండియాలోకూడా చాలా సిటీస్‍లో వున్నారు. చెప్పాగా, మేం ముప్పైమందిమని. మేం ముంబైలో లేమా, అలాగే”
“నీ పెళ్ళటకదా? మరి నువ్వు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే పెద్దమ్మ ఒక్కరే వుంటారా?” ఏదో అడగాలనీ తెలుసుకోవాలనీ ఆరాటంగా వుంది అతనికి. చెల్లెలు దేనిగురించైతే భయపడుతోందో అది అతనికి ప్రలోభంగా అనిపిస్తోంది. అమ్మలేని యింట్లో ఏదో తెలీని దు:ఖం, వత్తిడి. తండ్రికూడా ఇదివరకట్లా లేడు. పైగా ఈ యాక్సిడెంటొకటి. తమకి తోడుగా పెద్దవాళ్ళు మరొకరుంటే బావుండునని బలంగా అనిపిస్తోంది. మేఘనని వదిలిపెట్టాలని లేదు. మహతి తమతో వస్తే బావుంటుందనీ వుంది. దేన్నీ వ్యక్తపరచలేని అనిశ్చితి.
“నేను వెళ్ళిపోయాక అమ్మ అక్కడెందుకు వుంటుంది? నాతోపాటు వచ్చేస్తుంది”
“అలా ఎలా కుదుర్తుంది? రానివ్వరుకదా? వచ్చినా ఆర్నెల్లు మించి వుండనివ్వరంట?” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఎప్పుడేనా ఏ వయసులోనేనా చదువుకోవచ్చు అక్కడ. శాట్, ఏసీటీలాంటి ఎగ్జామ్స్ ఏవో వుంటాయట. అవి రాయించి అమ్మని స్టూడెంట్ వీసామీద తీసుకెళ్ళిపోతాం” అంది. హరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మహతి ఇక్కడినుంచి వెళ్ళిపోతుందన్న ఒక్కమాట ఇందిర చెవుల్లో అమృతం పోసింది. చప్పుని మంచంమీద లేచి కూర్చుంది.
“పదండి వెళ్దాం” అని లేచింది మేఘన. ఇద్దరూ వెనకే వెళ్ళారు. లక్ష్మి తులసి గదిలో పడుకుంది. మహతి, గీత పెద్దమంచంమీద పడుకుంటే యశోద విడిగా పడుకుంది. దిళ్ళు పట్టుకుని వరసగా ఒకళ్ల వెనక ఒకళ్ళు నడుచుకుంటూ వస్తున్న ఆ ముగ్గురినీ చూసింది మహతి. క్షణంపాటు కళ్ళు చెదిరినట్టైంది. ఒక మూసలోంచీ తీసి, వేరువేరు రంగులు వేసిన బొమ్మల్లా అనిపించారు. ఇందిర, హరి తెల్లని తెలుపు. బహుశ: వాళ్ళమ్మలాగేమో. మేఘన తనూ, నరేంద్రల్లా కొంచెం ఛాయ తక్కువ. మనసు వొడిపెట్టినట్టైంది. తన బతుకు తనది కాదు. తను బతకాలనుకున్నట్టు లేదు. తన పిల్ల తనలా లేదు. వద్దనుకుని దూరం జరిగిన మనిషి పోలిక. జీవితం పూర్తిగా అర్థాన్ని పోగొట్టుకున్నట్టనిపించింది. కళ్ళలో తడి కదిలింది. కొంచెం సర్దుకున్నాక అనిపించింది, ఎందుకు, ఈ యింటిచుట్టూ విషాదం ఇలా సుళ్ళు తిరుగుతోంది? పిన్ని ఒకలా. గీత ఇంకొకలా. తులసి మరొకలా. గీత ఎందుకిలా చేసింది? ఆ పిల్ల ఎవరు? వీళ్ళకీ ఆమెకీ ఏమిటి సంబంధం?
పక్కకి తిరిగి చూసింది. గీత నిద్రపోవట్లేదు. అలాగని మాట్లాడేంత ఉత్సాహంగానూ లేదు.
“పడుక్కున్నావే?” అడిగింది.
“పడుక్కో” జవాబిచ్చిందామె అలసటగా.
“పడుక్కోనా? నువ్వు చెప్పాలేంటి?”
“చెప్పకపోతే రాత్రంతా ఆలోచిస్తావు”
“చెప్పినా ఆలోచిస్తానుకదా? ఒకదాన్ని బుర్రలో పుట్టించి వదిలావు”
“మర్చిపో”
“ఎలా?”
“ఎలాగో ఒకలా. పోనీ నాలా”
“ఎవరా అమ్మాయి?”
“పీడకల. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నాను”
“గీతూ! ఎవరే?”
“ఇప్పుడొద్దు. పిల్లల ఎదురుగా మాట్లాడే విషయాలు కాదు. ఆపిల్ల మనకేమీ కాదు. నాకూ, వాసుకీ దాని చావుతో ఏ సంబంధం లేదు. కానీ ఆ చావు పుట్టించిన బాధమాత్రం నన్ను నిలువునా కాల్చేస్తోంది. నేను అనుభవిస్తున్న సౌఖ్యాలూ, సంతోషాలూ ఇంకెవరికో చెందాల్సినవేమోననే భయంకూడా వేసి, తప్పుచేసినట్టనిపిస్తోంది” అంది.
“అంతేనా, మనవి అనుకున్నవికూడా మనవి కాదు. ఇప్పుడే ఆ విషయం తెలిసింది. వాళ్ళు ముగ్గుర్నీ చూడు” అంది మహతి.
“ఏయ్, మాట్లాడకుండా పడుక్కోండే, ఇద్దరూను. అన్నీ అక్కర్లేని విషయాలూ, అవసరంలేని వ్యవహారాలూను. ఏళ్ళొచ్చి ఏం లాభం?” యశోద సగం నిద్రలోంచీ లేచి ఇద్దర్నీ కేకలేసింది.
మహతీ, గీతా ఇద్దరూ చెరోవైపుకీ తిరిగి పడుక్కున్నారు.
“ఈవేళ వీళ్ళంతా ఎర్రర్ మోడ్‍లో వున్నారు. మిషన్ లేంగ్వేజిలో మాట్లాడుకుంటున్నారు. నువ్వే ఏవైనా చెప్పు మామయ్యా!” అంది మేఘన వాసు దగ్గిర చేరి. హరికూడా ఆమె పక్కని వచ్చి కూర్చున్నాడు. ఇందిర నిద్రొస్తోందంది. మేఘన ఆమెకి పక్క వేసి, మళ్ళీ వచ్చి కూర్చుంది. ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నాక వాసు గుడ్‍నైట్ చెప్పాడు. ఎవరి మంచాలమీదికి వాళ్ళు సర్దుకున్నారు.
గీతకి నిద్ర రావట్లేదు. ఆ సంఘటన పదేపదే కళ్ళముందు కదుల్తోంది. దాన్ని దూరం జరపడంకోసం ఎన్నో జ్ఞాపకాలని రారమ్మని పిలిచింది. రాణా నవ్వు, గొంతు చెవుల్లో ప్రతిధ్వనించాయి. సుధీర్ దిగులు చూపులు వెంటాడాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? తనని ఇందరు ఇష్టపడటమేమిటి? ఆ యిష్టానికి అవతలికొసని వున్న కోరికేమిటి? ప్రశ్న. ఒకసారా, రెండుసార్లా? ఎన్నోసార్లు ఎదురైన ప్రశ్న.
ఒక్క ఆడపిల్లని అందరు మగవాళ్ళు, ముగ్గురా, నలుగురా? కెవ్వుమని కేక రాబోయింది నోట్లోంచీ. బలవంతంగా ఆపుకుంది.
షీ వాజ్ రేప్‍డ్ డెడ్. హర్ బోడీ వాజ్ అబ్యూజ్డ్. లోపలి అవయవాలన్నీ బాగా చితికిపోయాయి. ఏవేవో లోపలికి తోసారు.
సమాజం మూకుమ్మడిగా చచ్చిపోవడమంటే ఇది కాదా? మంచం నిప్పుల కొలిమిలా అనిపించింది. వెంటనే దిగి ఇవతలికి వచ్చేసింది. తూర్పువైపు అరుగు దగ్గిర క్రీనీడగా ఒక రూపం. బాహ్యస్పృహలోకి వచ్చింది.
“ఎవరు? హరీ!” లైటు వేస్తూ నెమ్మదిగా పిలిచింది. “పడుక్కోలేదా? ఇంతరాత్రివేళ ఒక్కడివీ ఇక్కడేం చేస్తున్నావు?” అడిగింది. ఆ క్షణాన అతను మహతి సవతికొడుకనిపించలేదు. చీకట్లో తడుములాడుతున్న పిల్లాడిలా అనిపించాడు.
“మా అమ్మ గుర్తొస్తోందండీ!” నిస్సహాయంగా అన్నాడు. పక్కని కూర్చుంది గీత. మనసు ద్రవించింది.
“ఎలా పోయారామె?” అడిగింది.
“తనకి బీపీ వుండేది. మూడురోజులు జ్వరం కాసింది. డాక్టరుకి చూపించుకుని మందులు వేసుకుంటోంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారి టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. హాస్పిటల్‍కి తీసుకెళ్ళాం. బెడ్‍మీద పడుకోబెట్టారు. వైద్యం జరుగుతోంది. మేం చూస్తుండగానే చెవుల్లోంచీ, ముక్కులోంచీ రక్తం వచ్చింది. తర్వాత వెంటిలేటరు పెట్టారు. అదీ తీసేసారు. తర్వాత అమ్మ చచ్చిపోయిందన్నారు” అన్నాడు. ఆ అబ్బాయిగొంతు దు:ఖంతో పూడుకుపోయింది. బతుకుతారేమోనన్న ఆశతో వెంటిలేటరు పెట్టమని ఇంక బతకరని అనుకుని దాన్ని తొలగించమనడం వెనక ఎంత నరకం వుంటుందో గీత వూహించగలిగింది. తొలగించమన్న నిర్ణయం తీసుకున్న మనిషి నిత్యం అపరాథభావనతో కృంగిపోతాడు. చనిపోయిన మనిషికి సంబంధించినవాళ్ళు ఎదురుపడ్డప్పుడు లోలోపలకి కుంగిపోతాడు. తెలిసీ తెలీని వయసులో వున్న ఈ పిల్లలకి అతను ఎలా జవాబు చెప్పి వోదార్చాడో! తనని తను ఎలా వోదార్చుకున్నాడో!
“మరి మీ అమ్మమ్మావాళ్ళూ?”
“అమ్మమ్మ మంచిదేగానీ మామయ్య అలాకాదు. కల్చర్ లేదతనికి. మెకానిక్‍గా చేస్తాడు. తాగుతాడు. ఇంటికి ఎవరెవరో వస్తారు. వాళ్ళంతా కలిసి తాగుతారు. వాళ్ళొచ్చినప్పుడు అత్తని గదిలోంచీ రావద్దంటుంది అమ్మమ్మ. వాళ్లంటే నాన్నకి యిష్టం వుండదు. మమ్మల్ని వెళ్ళనివ్వడు. అమ్మమ్మ ఇక్కడికొస్తే తనూ వచ్చేస్తాడు. మీయింటిలా వుండదండీ, వాళ్ళింట్లో” దాపరికం లేకుండా చెప్పాడు హరి.
నిట్టూర్చింది గీత. ఆ మేనమామ ఎలాంటివాడో అర్థమైంది. తాగుడూ, ఆడవాళ్ళ వ్యసనం వున్న అతనికి ఇందిర ఆడపిల్లలానే కనిపిస్తుందికానీ, మేనకోడలిలా కాదు. పసిపిల్లలా కాదు. మీద చెయ్యేస్తాడు. కొన్నాళ్లకి ఆ పిల్లకి అది అలవాటైపోవచ్చు. నలుగురిని ఆకర్షించడానికి తన శరీరం ఒక సాధనం అనిపించవచ్చు. తప్పుకాదని చెప్పడానికి ఏవో సిద్ధాంతాలు తయారుచేస్తుంది. ఏ ఆడపిల్లని చూసినా ఈమధ్య యిలాంటి ఆలోచనలే వస్తున్నాయి. వాళ్లలా ఐపోతారేమోనని భయం వేస్తోంది.
ఆ పిల్ల అలా ఎలా చచ్చిపోయింది? చేస్తున్న పనులవల్ల చచ్చిపోవచ్చని ఆమెకి తెలీదా? మిగిలిన పిల్లలు తెలుసుకున్నారు, ఆమె ఎందుకు సరిదిద్దుకోలేదు? నర్మదకదూ, ఆమె పేరు? పోలీసులు అలానే రాసుకున్నారు. చక్కటి పిల్ల, చక్కటి పేరు, చదువు. కానీ ఎంచుకున్న దారి తప్పుదారి. తల బలంగా విదిల్చింది గీత.
పూర్ణకుంభంలాంటి జీవితాన్ని వదులుకున్నాడు నరేంద్ర. జోని చూసినట్టే అతన్నీ ప్రేమగా చూసారు అందరూను. మేఘనతో సంతృప్తిపడి, తల్లిదండ్రులనీ, అక్కనీ సమాధానపరిచి వుంటే కొన్నాళ్లకి సర్దుకుని మహతి పెళ్లైన కొత్తలోలా అతనితో సర్దుకుపోగలిగేది. ఇప్పుడీ పిల్లలకి ఇద్దరికీ ఏ దారి చూపిస్తాడో! మనుష్యులు ఎందుకింత సమస్యాత్మకంగా బతుకుతున్నారు? యాక్సిడెంటై హాస్పిటల్లో పడితే చూసే దిక్కుకూడా లేకుండా చేసుకున్న మనిషి వీళ్ళకేం దారి చూపించగలడు! నిరసనగా అనుకుంది.
దారి తోచకుండా వున్న పిల్లల విషయంలో కాఠిన్యం ఏమిటని మళ్ళీ వెంటనే సర్దుకుంది.
“అమ్మ గుర్తొస్తోందని నువ్వే ఇలా బెంగపడి కూర్చుంటే చెల్లి ఇంకా దిగులుపడుతుందికదా? ఇప్పుడు నీకెన్నేళ్ళు? ఏం చదువుతున్నావు?” మృదువుగా అడిగింది. చెప్పాడతను.
“వర్తమానం ఒకొక్కసారి బాధని కలిగిస్తుంది. అందుకు మనం అందమైన భవిష్యత్తుని వూహించుకోవాలి. కలలు కనాలి. అవి నిజమయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఇంకో ఐదారేళ్లకి నీ చదువౌతుంది. అరవైనెలలు కాగితంమీద రాసుకో. ప్రతీ ఒకటో తారీకునా ఒక అంకె చెరిపెయ్. ఒకొక్క అంకె చెరిగిపోతుంటే నువ్వు నీ గమ్యానికి దగ్గరగా వస్తున్నట్టు. అన్నీ అయేసరికి నీకు ఉద్యోగం వస్తుంది. అలాగే చెల్లికికూడా. తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళౌతాయి. బంధాలు, కుటుంబాలు, అన్నీ కొత్తగా మొదలుతాయి. రాబోయే రోజులగురించిన ఆలోచనలతో నీ మనసంతా నింపుకో. ఇలా బాధపడకూడదు. సరేనా?” అంది. అతను కొంచెం తేలికపడ్డాడు. గాఢమైన చీకట్లో చిన్నదీపం వెలిగించినట్టైంది. దీపం చిన్నదే. ఒక చుక్కంతది కావచ్చు. కానీ అతనికి దారిచూపే పని తీసుకుంది. నెమ్మదిగా విస్తరిస్తుంది.
“మేఘనావాళ్ళూ చాలామంది. వీళ్ళుకాక మా పిల్లల స్నేహితులు, మాయింట్లో చదువుకున్న పిల్లలు, ఎవరో ఒకరు మాయింటికి వస్తునే వుంటారు. మీరుకూడా అప్పుడప్పుడు రండి. ఒకటిరెండురోజులు ఇక్కడ వున్నా మాకేం సమస్య లేదు. మీ నాన్నకూడా కాదనరు. ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడితే బెంగ తగ్గుతుంది. సపోర్ట్ సిస్టమ్ ఏర్పడుతుంది. తెలీనివి తెలుసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం జరుగుతాయి. బైటివాళ్లతోనూ, తెలీనివాళ్లతోనూ స్నేహాలు చెయ్యకండి. ఇందిర చిన్నదికదా, తనకి అన్నీ నువ్వే చెప్పాలి”
“అలాగేనండీ!” అతను తలూపాడు. సంభాషణ దాదాపుగా ముగిసింది. అతనింక లేచి వెళ్ళిపోతాడేమో అనుకుంది గీత. కానీ అక్కడే కూర్చుని, కొద్దిసేపు గడిచాక నెమ్మదిగా, సంకోచంగా అడిగాడు.
“పెద్దమ్మ మాతో వస్తారా?”
ఆ ప్రశ్నకి ఆమె తెల్లబోయింది. ఇది పెద్దవాళ్లమధ్య నలుగుతున్న విషయమే అనుకుందిగానీ, పిల్లల్లోకూడా ఆ ఆలోచన మొదలైందనుకోలేదు. అవకాశాన్నిమాత్రం వుంచి ఆశని తుంచేసింది.
“అలా ఎలా వస్తుంది? మీకూ మాకూ చుట్టరికాలు తెగిపోయాయికదా? మేఘన బాధపడితే మేమెవ్వరం తట్టుకోలేం. అది అడిగిందని వాళ్ళమ్మ హాస్పిటల్‍కి వచ్చింది. ఐనా తననే అడుగు నువ్వు” అంది.
“అమ్మో! నేనా?” అన్నాడు భయంగా.
“నీకు భయమైతే మీ నాన్నని అడగమను”
హరి తలూపాడు. “ఆవిడ్ని చూస్తే చాలా భయం వేస్తుంది. అక్కని మేమెప్పుడూ సరిగ్గా చూడలేదు. మొదట్లో మానాన్న తనని చూడ్డానికి వెళ్ళేవారు. తర్వాత తనే ఆర్నెల్లకో సంవత్సరానికో ఒకసారి వచ్చేది. ఒకరోజో రెండురోజులో వుండేది. వచ్చినప్పుడంతా మాయింట్లో ఏదో యిబ్బంది. అమ్మకి అస్సలు యిష్టం వుండేదికాదు. గెస్టురూమ్‍లో వుంచేవాళ్లం. గెస్టులాగే చూసేవాళ్లం. నాన్నతో తను తిరుగుతుంటేనూ, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటేనూ ఎప్పుడు వెళ్ళిపోతుందా అనిపించేది. మీరు మమ్మల్ని చూస్తున్నట్టు మేం తనతో వుండలేదు” అన్నాడు తలదించుకుని. గీతకి గుండె చిక్కబట్టినట్టైంది.