ఝరి – 63 by S Sridevi

  1. ఝరి – 61 by S Sridevi
  2. ఝరి – 62 by S Sridevi
  3. ఝరి – 63 by S Sridevi
  4. ఝరి – 64 by S Sridevi
  5. ఝరి – 65 by S Sridevi
  6. ఝరి – 66 by S Sridevi
  7. ఝరి – 67 by S Sridevi
  8. ఝరి – 68 by S Sridevi
  9. ఝరి – 69 by S Sridevi
  10. ఝరి – 70 by S Sridevi
  11. ఝరి – 71 by S Sridevi
  12. ఝరి – 73 by S Sridevi
  13. ఝరి – 74 by S Sridevi
  14. ఝరి – 75 by S Sridevi
  15. ఝరి – 72 by S Sridevi

“అందరం ఒక స్కూల్లో చదువుకున్నాం. గుంపుగా తిరిగాం. వాళ్ళ స్కూలు చదువులై కాలేజిల్లో చేరాకకూడా తీరిక దొరికినప్పుడల్లా కోటకో, నదివొడ్డుకో వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరికి నచ్చినవాళ్లతో వాళ్లం గ్రూపులు కట్టేవాళ్ళం. నాతర్వాత దాదాపు ఐదేళ్లదాకా మనింట్లో పిల్లల్లేరు. మనగ్రూపుకూడా అక్కడే ఆగిపోయింది. నా తర్వాతివాళ్లందరినీ చిన్నపిల్లలనీ, మనచుట్టూ వుపగ్రహాల్లా తిరుగుతారనీ మనతో కలుపుకునేవాళ్ళం కాదు. వసంత్‍కీ కృష్ణకీ పెద్దగా తేడా కనిపించేదికాదు నాకు. అంత ఇమ్మెచ్యూర్డ్‌గా వుండేవాడు తను. మనతో వున్నంతసేపు వున్నా, కృష్ణని వెంటేసుకుని తిరిగేవాడు ఎప్పుడూ. మాధవ్‍కి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సీరియస్‍నెస్ లేదు. అందర్నీ ఆటపట్టించడం, జోక్స్ వెయ్యడం. అంతే. సుమంత్ నాలాగే బాగా దుడుకు. నేనేవైనా గొడవల్లోకి వెళ్తే వచ్చేసి పక్కని చేరిపోయేవాడు. కుదిర్తే తనూ ఓ రెండు తన్నులు తన్ని, మరింత జటిలం చేసి, మొత్తానికి పైచెయ్యిగా తను బైటపడి, నన్నూ బైటపడేసేవాడు. ప్రహ్లాద్ సంగతి. ఎప్పుడేనా మాయిద్దరం పక్కపక్కని నిలబడితే ఎత్తులు కళ్లతోటే కొలుచుకునేది వాళ్లమ్మ. ఎవరూ పట్టించుకోని విషయం ఏమిటంటే మా యిద్దరికీ పోలికలు కలుస్తాయి మహీ! తెలీనివాళ్లెవరేనా చూస్తే మేం అక్కాతమ్ముళ్ళం అనుకునేవారు. ఈ నలుగురితోటీ నాకు ఎలాంటి సమస్యా వుందేదికాదు. జస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసిపోయేవాళ్లం. వాసుకీ, సుధీర్‍కీ నావిషయంలో పైకి కనిపించని పోటీ వుండేది. ఐతే ఎప్పుడూ తొణికేవారు కాదు. ఈమధ్యలోకి రాణా దూరిపోయాడు”
రాణా పేరు వినగానే మహతి వులిక్కిపడింది.
“వాడా?!! వాడికేం వుందనే? చదువా, వుద్యోగమా? వాసు కాలిగోటికి సాటిరాడు” అంది నమ్మలేనట్టు.
“అది వాడికి తెలీదుకదా? మహీ! మీ యిళ్ళలో పెద్దవాళ్ళకి మా నాన్నపట్లా, మా కుటుంబంపట్లా వున్న అభిప్రాయాలు మీ ప్రవర్తనలో తెలిసేవి. నాకు ఎప్పుడూ ఎవరిదగ్గిరా ఎలాంటి బేధభావం కనిపించలేదు. మా నాన్న పెట్టుపోతలు చెయ్యలేదని సాధించిన గురుమూర్తి మామయ్యకూడా నన్నెప్పుడూ తేడాగా చూడలేదు. అందరికన్నా చిన్నదాన్నని వొళ్ళో కూర్చోబెట్టుకుని బిస్కెట్లవీ స్వయంగా తినిపించిన రోజులు గుర్తున్నాయి. అంత కోపిష్టిమనిషి, మీ నాన్నకూడా నన్ను ఒక్కమాటకూడా అనలేదు. కానీ రాణావాళ్ళింట్లో మాట్లాడుకున్న మాటలతీరు వాడి ప్రవర్తనలో తెలిసిపోయేది. నన్ను వూరికే తాకడానికి ప్రయత్నించేవాడు. చిన్నపుడైతే కోపం వచ్చి గిల్లేసి, రక్కేసేదాన్ని. కాస్త పెద్దయ్యాక ఎవరూ లేనప్పుడు జడపట్టుకుని మీదికి లాక్కున్నాడు. చాలా నొప్పెట్టింది. కోపంకూడా అలానే వచ్చింది. చాచిపెట్టి చెంపమీద కొట్టాను.
ఏముందనే, నీకీ గర్వం? మీ నాన్న నీకు పెళ్ళి చేస్తాడనే? ఏం పెట్టి చేస్తాడు? సుధీర్, సుమంత్‍వాళ్ళకి బాగా డబ్బుంది. వాళ్ళు చేసుకోరు. వాసుమాత్రం? కట్నం ఇవ్వకపోతే చేసుకుంటాడా? నన్ను మంచి చేసుకో. పుస్తె కడతాను- అన్నాడు.
అవి చిన్నపిల్లలు, వాడివయసువాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎక్కడో అలాంటి భావాలు పుడతాయి. వాటిని వీళ్ళు అందిపుచ్చుకుంటారు. అసలు ఆమాటకొస్తే మనం మాట్లాడే మాటలేవీ మనవి కాదు. పెద్దవాళ్ళు నాటిన భావాల మొలకలు. పెద్దౌతుంటే పైపైన కాస్తకాస్త సంస్కరించబడతాయేమోగానీ, మూలాలదగ్గిర కాదు. మూలాలు మారడమంటే మామిడిటెంక పాతి, కొబ్బరిచెట్టు రావాలనుకోవడం.
నిలువునా వుడికిపోయాను. మాకు డబ్బులేదనీ, పేదవాళ్లమనీ ఇప్పటిదాకా నాకు ఎవరూ ఎత్తి చూపించలేదు. అందరం కలిసి ఎక్కడికేనా వెళ్ళినప్పుడు నా డబ్బులు నేను తెచ్చుకునేదాన్ని. నా ఖర్చులు మీ ఎవ్వరిచేతా ఎప్పుడూ పెట్టించలేదు. ఎగబడి మీ యిళ్ళలో తిన్నది లేదు. పోనీ నాకేమైనా వయసు వచ్చి, పెళ్ళికోసం తపించిపోతున్నానా? లేదే? పధ్నాలుగేళ్ళు. కొత్తగా వోణీలు వేసుకుంటున్నాను. మరి వాడికి? నాకన్నా మూడునాలుగేళ్ళు ఎక్కువ. అంతే. వాడిమాటలు సగం అర్థమయ్యాయి, ఇంకోసగం అర్థమవ్వలేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని గొడవ చేసేసి, వచ్చేసాను” గీత ఆగింది.
తన కళ్లముందు జరిగిన విషయాల్లోని కొత్త అర్థాలు ఆశ్చర్యంగా వింటోంది మహతి. గీత తామందర్లోకీ చిన్నది కావటంతో ఆమె గురించి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. చిన్నపిల్లలాగే అనిపించేది తనకీ, సుమతికీ. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో గొడవపడుతూ వుండేదికావటాన్న రవళిలో వున్న పరిణతికూడా ఆమెలో కనిపించేది కాదు.
“అక్కడితో ఆగలేదు రాణా. అందరం వున్నప్పుడు నా భుజంమీద చెయ్యివెయ్యబోయాడు. నేను చప్పుని లేచి దూరం జరిగాను.
గీతకి దూరంగా వుండరా! ముట్టుకోకు! దానికి నచ్చదు. శివంగిలా విరుచుకుపడుతుంది- అన్నాడు సుధీర్ చాలా మామూలుగా అన్నట్టు.
నీకూ అయిందా, అనుభవం- అన్నాడు రాణా. వాడి మాటల్లో నేను భరించలేనితనం. ఆ క్షణాన్న వాసు కళ్లలో కనిపించిన కోపం చూసి నాకు చాలా భయం వేసింది.
ఛస్! కొత్తగా తెలియాలా ఏంటి? చిన్నప్పట్నుంచీ తనంతే- అన్నాడు సుమంత్.
పక్కని కూర్చుంది. పొరపాట్న భుజంమీద చెయ్యివెయ్యబోయాను. దానికింత గొడవా, అంతా ఏకమై? అది నాకూ మరదలే- రాణా కోపంగా అన్నాడు.
గీత నీపక్కని కూర్చోలేదు. నువ్వే కుర్చీ జరుపుకుని తన పక్కని కూర్చున్నావు- అన్నాడు వసంత్. వాడెప్పుడూ అంతే. ఉన్నది వున్నట్టు చెప్పేస్తాడు. ఎలాంటి సంకోచం వుండదు. రాణా కోపంగా లేచి వెళ్ళిపోయాడు.
నాకు అస్సలు నచ్చలేదు. భరించలేనంత అసహ్యం కలిగింది. ఇప్పటిదాకా స్నేహంగా వున్నాం. ఇప్పుడింక వీళ్ళు నా కారణాన్న కొట్టుకుంటారా? నేనేమీ గొప్ప అందగత్తెని కాను. కన్నొకరా, కాలొంకరా లేదనిపించుకునే స్థాయి. అఖండమైన తెలివితేటలున్నాయా అంటే అత్తెసరు మార్కుల తెలివి. ఆస్తులున్నాయా అంటే ఆ పెంకుటిల్లు తప్ప మరేమీ లేదు మా నాన్నకి. వీళ్ళు దేనికోసం పోటీపడుతున్నారు? వాసుకి ఎందుకంత కోపం? సుధీర్ ఎందుకు కలగజేసుకోవాలి? వసంత్, సుమంత్ ఎందుకు మధ్యలోకి రావాలి? నేను ఆడపిల్లననా? వీళ్ళకి మామయ్యకూతుర్ననా? ఆ వయసుకికూడా చికాకు పుట్టించిన విషయాలు.
నాకు ఏదేనా ప్రాబ్లం వస్తే నేను చూసుకోగలను. మీరంతా దేనికి కలగజేసుకుంటున్నారు- అన్నాను మిగతావాళ్లతో కోపంగా.
అప్పటిదాకా నీతోనూ, ప్రహ్లాద్‍తోనూ సీరియస్‍గా ఏదో పుస్తకంమీద చర్చలో వున్న సుమతి నాగొంతు విని, ఇటు తిరిగింది. ఒట్టి తెలివితక్కువది. సగం విని మాట్లాడుతుంది.
ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదురా! దీనికోసం ట్రాయ్ యుద్ధాలూ, రామరావణ యుద్ధాలూ వుండవు. అన్నీ తనే ఆడేస్తుంది. సిటీబస్‍లో ఎక్కామనుకో, కొంచెం రద్దీ వున్నాసరే, సేఫ్టీపిన్ తెరుచుకుని నిలబడుతుంది. ఇది కళ్లతో గీసుకున్న హద్దు ఎవడేనా దాటాడో, పిన్నుపెట్టి గీరేస్తుంది. సెప్టికై చస్తాడే వాడు అన్నా వినదు” అంది. అంతా నవ్వేసారు. ఇంక సీరియస్‍నెస్ ఎక్కడుంటుంది? వాసు తలపట్టుకున్నాడు,
ఇన్నాళ్ళూ నేను నేర్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి_ అన్నట్టు నామీదికి ఓ చూపు విసిరి.
ఎక్కడ మనం ఏ గొడవపడినా వసంత్ మోసేసేవాడు. మగపిల్లలకి మెంటర్ రవి బాబాయ్. అతనికి మోసేసాడు. ఏం జరిగిందో, తర్వాత చాలాకాలం రాణా నాజోలికి రాలేదు. వాసుతో మాట్లాడటం పూర్తిగా ఆపేసాను. తనూ ఆపేసాడు. అప్పటికే లక్ష్మత్త రెండుమూడుసార్లు హెచ్చరించింది, మేమిద్దరమే విడిగా కూర్చుని మాట్లాడుకోకూడదని. బహుశ రాణా అన్న కారణానికేనేమో అనుకున్నాను. కానీ నాకు వాసంటే విపరీతమైన యిష్టం. తను ఎదురుగా వుంటే ప్రపంచం కనిపించేదికాదు. తనూ నేనూ విడివిడి మనుషులమని ఎప్పుడూ అనిపించేదికాదు. నాకేదైనా దెబ్బ తగిలి నొప్పెడితే తన ముఖంలోకి చూసేదాన్ని ఆ బాధ కనిపిస్తుందేమోనని. అలాగే కనిపించేది. అది భ్రమేమో అనిపించేలా, అలాంటి స్థితిలోంచీ నన్ను ఒక్కసారి బైటికి యీడ్చిపడేసాయి రాణా మాటలు.
మాకు డబ్బు లేదు. నాన్న కట్నం ఇవ్వలేడు. వాసు నన్ను చేసుకోడు- ఒక శాపం పెట్టినట్టు ఇవేమాటలు నా చెవుల్లో నిండిపోయాయి. విషంలా నా మనసంతా వ్యాపించేసాయి” ఆగింది గీత.
“గీతూ! అలాంటి మాటలు మాయిళ్లలో ఎప్పుడూ అనుకోలేదు. ఒట్టు. ప్రమీల ఆమ్మకూడా వుద్యోగం చేసేదికాబట్టి వాళ్ళకి కొంచెం డబ్బు ఎక్కువ వుండేదేమో! వాళ్ళుకూడా రెండుసార్లు ఇల్లమ్మారు. సుమతి పెళ్ళి ఇల్లమ్మే చేసారుకదా? మిగిలినవాళ్ళం అందరివీ ఒక్కలాంటి కుటుంబాలే. ఇద్దరం ఆడపిల్లలం అని మాయింట్లో భయంకరమైన పొదుపు వుద్యమం వుండేది. పిల్లల చదువులకోసం, వైద్యాలకోసం అప్పులు చెయ్యకుండా, లోన్లూ అడ్వాన్సులూ తీసుకోకుండా ఎవరింట్లోనూ సాఫీగా నడవలేదు. నిన్ను వాడలా అన్నాడంటే అంతకన్నా పెద్ద ఫూల్ మరొకడు వుండదు. నువ్వెలా నమ్మావే, ఆ మాటలు?” అడిగింది మహతి.
“నాకసలు ఏం తెలుసని? మాయింట్లో ఇబ్బందులు చూసి అంతే అనుకున్నాను”
“సంకల్పంలోంచీ అన్నీ సృష్టించి ఆరుగురు చెల్లెళ్లకి చేసాడే మీ నాన్న. నీకు చెయ్యలేడని ఎలా అనిపించింది?”
“తెలీదు. వాసు చేసుకోడన్నమాట నేను తట్టుకోలేకపోయాను. ఆ వయసుకి అలాంటి ఆలోచనలు వస్తాయా అని అడక్కు. సగం తెలిసీ, సగం తెలీని విషయాలు. పెళ్లంటే ఏమిటో తెలీకపోయినా, పెళ్లైతే జీవితాంతం ఇంక విడిపోనక్కర్లేకుండా ఒకచోటే వుండటమన్న విషయం తెలుస్తుందికదా, అలా.
మీరంతా పై చదువులవైపుకి వెళ్తే నేను వుద్యోగం వెతుక్కున్నాను. నాన్న నాకు పెళ్ళి చేసినా చెయ్యకపోయినా, తనకి నేను బరువు కాకూడదనుకున్నాను. ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు నాలో నాకే సాగేవి. వాసుకూడా చదువు ఆపేసి వుద్యోగంలో చేరాడు. వాళ్ళింట్లో పరిస్థితులు వేరు. ఆ మామయ్య ఇల్లు పట్టించుకోరు. వాసు ఇద్దరు అత్తలకీ భర్తలు లేరు. మంచిచెడులు తనే చూసుకునేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమీద అన్నీ వదిలిపెట్టి రోజుకి పాతిక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసో, హాస్టల్లో వుండో చదువుకోవడం తనకి నచ్చలేదు. ఆ చర్చ మాయింట్లోనే జరిగింది. నాన్న తన నిర్ణయాన్ని సమర్ధించారు”
“వాడు మొదట్నుంచీ చాలా బాధ్యతగల మనిషి” అంది మహతి.
“ఇంట్లో నా పెళ్ళి తలపెట్టారు. బైటి సంబంధానికి వెళ్ళాలా ఇంట్లో సంబంధమేనా అని నాన్న నా యిష్టం అడిగారు. నేను చెప్పాను. ఔతుందా, అవదా అనే ఆలోచన రాలేదు. వాళ్లు కట్నం అడుగుతారా అన్న ఆలోచనకూడా రాలేదు. నాన్నకి చెప్పేసానన్న భరోసా. పెళ్ళిమాటలకి నన్నొక్కదాన్నీ ఇంట్లో వదిలేసి అంతా వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు…” ఆగింది గీత. గుర్తుతెచ్చుకోవడానికీ చెప్పడానికీ ఇష్టం లేనట్టు కొద్దిసేపు బ్లాంక్‍గా చూస్తూ వుండిపోయింది. చెప్పాలన్న గట్టి పట్టుదల వుండటంతో మళ్ళీ కొనసాగించింది.
“రాణాకి విషయం తెలిసి వచ్చాడు.
నిన్ను నేను ప్రేమిస్తున్నాను గీతా! వాసుని చేసుకోకు. వద్దని చెప్పెయ్- అన్నాడు. ప్రేమ అనేమాట తన నోట్లోంచే మొదటిసారి విన్నాను. వాసూ, నేనూ ఎప్పుడూ అనుకోలేదు. తెలిసీతెలీని వయసులోకూడా.
వాడిలో ఏముందని చేసుకుంటున్నావు? నేను ఎందులో తక్కువ. క్లర్కు వుద్యోగమేకదా వాడు చేసేది? ఆపాటి నాకూ వస్తుంది. స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకుంటాను- అని వాదనకి దిగాడు.
వాసునీ, సుధీర్‍నీ రవి బాబాయ్ పోల్చాడు. ఇద్దరు యోగ్యులమధ్య పోలిక గొప్పగా అనిపించింది. వాసు విలువ పెరిగినట్టనిపించింది. వీడితోకూడా వాసుని పోల్చాలా? వెళ్ళిపొమ్మని చెప్పాను. మా నాన్న కట్నాలిచ్చి, ఖర్చుపెట్టి పెళ్ళి చెయ్యలేడుకాబట్టి వీడికి యిచ్చి చేస్తే ఎలాగా నాకు వుద్యోగం వుందిగాబట్టి ఎలాగో ఒకలా బతికేస్తామని వాళ్ళింట్లో అనుకున్నారట. ఆ మాటలమీద బాగా ఆశలు పెట్టుకుని వచ్చాడు. గంటసేపు వాదించాడు.
మహీ! నాకు విసుగొచ్చేసిందే!
అప్పటికే రవి బాబాయ్ సుధీర్ విషయంలో వప్పించడానికి పెద్దప్రయత్నం చేసాడు. ఇప్పుడు వీడు తయారయ్యాడు.
వెళ్ళిపోరా! నీకు దణ్నం పెడతాను. నాకు మీ ఎవరూ వద్దు. వాసుని చేసుకుంటాను. మా యిద్దరికీ చిన్నప్పట్నుంచీ ఒకళ్లంటే ఒకళ్లకి యిష్టం. నన్ను మెండ్ చేసిందీ, నాకు కాస్త బుద్ధీ జ్ఞానం నేర్పిందీ అతనే. అర్థం చేసుకోండిరా! నేను మీకు అవకాశాన్నీ, మీరు నాకు ఎంపికా కాదు- అన్నాను.
వాడుకూడా విసిగిపోయాడు. వెళ్తూ ఏమన్నాడో తెలుసా?
వాడేదో దయదల్చి చేసుకుంటున్నాడు. ఆ దయ ఎంతకాలం వుంటుందో, వాడితో కాపురం ఎలా చేస్తావో చూస్తాను. వాడు నిన్నొదిలేస్తాడు. అప్పుడు నిన్నుంచుకోవడానికి మళ్ళీ వస్తాలే- ఈ మాటల్ని ఎంత మోటుగా అనచ్చో అంత మోటుగానూ అన్నాడు. పెళ్ళి జరగబోతోందన్న సంతోషం మిగలకుండా చేసాడు”