(“నువ్వూ తినెయ్. ఆఫీసుకి లేటౌతుంది” అంది లక్ష్మి గీతతో. వాసు నీలిమ పెట్టిన ఆరు పూరీలూ తినేసి, కొంచెం అన్నం పెట్టించుకుని పప్పు, పెరుగుతో తిని లేచాడు. గీతా అలానే తింది. ఇంతంత తిళ్ళు తినే మనుషుల్ని పల్చగా రెండు దోసెలో, ఇడ్లీలో పెట్టి పంపాలనుకుందా నీలిమ అని కమలాక్షి విస్తుపోయింది.)
“ఆఫీసయ్యాక ఓసారి కనిపించి వెళ్లరా!” అని ఫోన్ చేసాడు గురుమూర్తి వాసుకి ఆఫీసుకి. గీతని ఆఫీసయ్యాక ఆటోలో యింటికి వెళ్ళిపొమ్మని ఆమె ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పి, తను అటు వెళ్ళాడు వాసు. అతను వెళ్ళేసరికి ఒక్కడూ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు గురుమూర్తి. ప్రమీల ఇంకోగదిలో వుంది. టీవీ చప్పుడు తప్ప ఇల్లంతా ఒకవిధమైన నిశబ్దం. తాము పెద్దై ఎడాలు పెరిగాకకూడా ఎప్పుడూ పిల్లలు, వాళ్ళ స్నేహితులు నలుగురైదుగురు వుండేవాళ్ళు యింట్లో. మాటలు, నవ్వులు గలగల్లాడేవి. ఎక్కడికెళ్ళినా ఇలా ఎదురౌతున్న ఖాళీయిళ్ళూ, వంటరితనాలూ వాసుకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
“ఎలా వున్నావు పెదనాన్నా!” అడుగుతూ లోపలికి అడుగుపెట్టాడు వాసు.
“రారా, వాసూ! రా! నీకోసమే చూస్తున్నాను” అని, అతను ఎదురు సోఫాలో కూర్చోబోతుంటే జరిగి పక్కని చోటిచ్చాడు. ప్రేమగా భుజాలచుట్టూ చెయ్యేసి దగ్గిరకి హత్తుకుని వదిలాడు గురుమూర్తి. ప్రమీలకూడా లోపల్నుంచీ వచ్చింది.
“గీతనీ పిల్లల్నీ తీసుకురాలేదేరా?” అడిగింది.
“ఆఫీసునించీ నేరుగా వచ్చాను ఆమ్మా! రేపు బెంగుళూరు వెళ్తున్నాం. తనకి సర్దుళ్లవీ వుంటాయికదా? అందుకని తీసుకు రాలేదు. అక్కడినుంచీ వచ్చాక మళ్ళీ వస్తాంలే”
“ఇప్పుడు బెంగుళూరు దేనికిరా?”
“ఎల్టీసీ పెట్టాను. మామయ్యని చూసి చాలారోజులైందికదా, వెళ్దామని”
“వాడికి తినడానికేదైనా పెట్టు” అని భార్యతో అని, “వెళ్ళి మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని రా! తింటూ మాట్లాడుకుందాం” అన్నాడు గురుమూర్తి వాసుతో. వాసు వెళ్ళాడు.
“అదేనే, విహీ బారసాలప్పుడు అనుకున్నాం చూడు, ఆ విషయమే. మాధవ్‍తో చెప్పడంకన్నా వీడితోనైతే బావుంటుందని రమ్మన్నాను” అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తున్న ప్రమీలతో. సరేనన్నట్టు తలూపి, లోపలికి వెళ్ళి వాసు వచ్చేసరికి పెద్దపళ్లెంనిండా పప్పుచెక్కలతో వచ్చింది.
“ఇదివరకూ ఏవేనా చేస్తే చేసినప్పుడు తినడమేగానీ మళ్ళీ తిందామనుకుంటే మిగిలేవి కాదు. ఇప్పుడేమిటో తినేవాళ్ళే కనిపించట్లేదు. కాస్తంత మీయిల్లే యింటిలా వుంది. పిల్లల్తో. ఔను, పిల్లలెవరికో చదువు చెప్పిస్తున్నారట?” అడిగింది ప్రమీల.
వాసు తలూపాడు. “ఇద్దరు పిల్లలకి చెప్పిస్తున్నాం. మయూకి సందడిగా వుంటోంది. చిన్నప్పుడు మేం తిరిగినట్టే, వాళ్ళు ముగ్గురూ కలిసి తిరుగుతున్నారు. పెద్దవాళ్ళమధ్య పిల్లలకేం బావుంటుంది?” అన్నాడు. లతగురించీ, రమగురించీ అడిగాడు వాసు.
“అసలే పిల్ల అపురూపం. ఉత్తప్పుడే కాలు కిందపెట్టనివ్వరు. ఇప్పుడింక అసలే లేదు. పుట్టింట్లో వుంది. సుమంతే వెళ్లొస్తున్నాడు” అంది ప్రమీల లతగురించి. ఆమె మాటల్లో స్వల్పంగా అసంతృప్తి కనిపించింది. ప్రాక్టీసుకి వీలుగా వుంటుందని వేరే ఫ్లాట్లోకి మారారు సుమంత్, లత. అది పేరుకే. సుమంత్ టైములో ఎక్కువభాగం ప్రాక్టీసుకీ, మిగిలిన కాస్తలో సింహభాగం అత్తారింటికీ సరిపోతోంది.
“కూతుళ్ళకి పెళ్ళిచేసి మేము అత్తారిళ్లకి పంపిస్తే కొడుకులు పెళ్ళిచేసుకుని వాళ్లంతట వాళ్ళు అత్తారిళ్లకి వెళ్తున్నారు” అంది నిరసనగా.
వాసు నవ్వాడు. “నువ్వూ పెద్దనాన్నని ఆయన అత్తారింటికి తీసుకెళ్ళచ్చుకదా?”’అన్నాడు సరదాగా. “మాతో బెంగుళూరు రండి” అన్నాడు. గురుమూర్తి పెద్దగా నవ్వాడు.
“ఏవమ్మా, వెళ్దామా? ఇదేదో బావున్నట్టుంది. నీ కొడుక్కేనా అత్తారిల్లున్నది? నాకూ వుంది” అన్నాడు నవ్వుతూనే.
“పోరా, నీ మాటలు!” అంది ప్రమీలకూడా నవ్వి.
“ఎలా కుదుర్తుందిరా? అందరిళ్లలోనూ ఎవరో ఒకరు పురిటికి వున్నారు. మహీ వైద్యంతో నిర్మల అలిసిపోతోంది. రవళి విషయం మేం చూసుకుంటాం, డెలివరీకికూడా మాయింటికే తీసుకొస్తామని చెప్పాను. ఐనా అది వూరికే టెన్షనుపడిపోతోంది. దాన్ని నారాయణ నిలవనివ్వడు, కూర్చోనివ్వడు” అంది.
“సుధీర్ ఎలా వున్నాడు ఆమ్మా?” అడిగాడు వాసు.
“అమెరికాలో వున్న పిల్లాడు ఎలా వుంటాడు? బానే వున్నాడు” అతని ప్రస్తావన వచ్చేసరికి ముభావంగా అంది.
“మాధవ్ సంగతేంట్రా? పిల్లలగురించి డాక్టర్లేమంటున్నారు?” అడిగాడు గురుమూర్తి.
“మిగతా అందరికీ బాగానే అయి, వల్లికి బెడ్‍రెస్ట్ ఏమిటి? మహీకీ, మాధవ్‍కీ ఇలా ఎందుకైంది ఆమ్మా? వాడు చిన్నబుచ్చుకుని తిరుగుతుంటే బాధనిపిస్తోంది. పైకి మామూలుగానే వుంటాడు. నవ్వుతూనే వుంటాడు. కానీ తెలిసిపోతుందికదా? నీలిమకూడా విహీని ఎత్తుకుని తిరిగేది. ఇప్పుడైతే ఏడుస్తుంటుంది, గొడవచేస్తుంటుంది ” అన్నాడు వాసు.
ఆవిడ నిట్టూర్చింది. “చిన్నచిన్న సంతోషాలకికూడా ఒకొక్కప్పుడు ఎంతోకాలం ఎదురుచూడాలి వాసూ! పిల్లల్లేరని మనకి వున్నా లేకపోయినా, చుట్టూ వున్నవాళ్ళు ఏమంటారోననే భయం మనని నిలవనివ్వదు” అంది. ఆమెకి తనప్పటిరోజులు గుర్తొచ్చాయి. అత్తగారు ఎంత సతాయించేదో గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టైంది. మనుషులు పోయాకకూడా వాళ్ళు మిగిల్చిన చేదు కరగలేదంటే అదెంత కరుడుగట్టిన గుండెలోంచీ వచ్చి వుంటుంది.
“మహీకి వైద్యం జరుగుతోందికదా, రిజల్ట్స్ చూసి వాళ్లనీ మొదలుపెట్టమనాలి” అన్నాడు వాసు.
“చాలా ఖర్చొస్తుందిరా! మనిషికి నోరు అదుపులో వుండదుగానీ, నారాయణ డబ్బు నీళ్ళలా పోస్తున్నాడు. చిన్నదేదో సైటు వుందికదా, అది అమ్మకానికి పెట్టాడు. మాధవ్‍వాళ్ళ మామ పెట్టగలడా అంత?” అడిగాడు గురుమూర్తి.
“వాళ్లకి పెద్దగా ఏమీ లేదు పెద్దనాన్నా! పెన్షను, రిటైర్‍మెంటు బెనిఫిట్స్. అందులోంచే వీళ్ల పెళ్ళిళ్ళకైన అప్పులు తీర్చారు. ఆవిడ మంచితనంతో గుట్టుగా నడిపించుకుని వస్తున్నారు. మనింటికి వచ్చిన పిల్ల మనదే ఔతుంది. గీత, తులసిల్లాగే. మనమే చూసుకోవాలి”
గురుమూర్తి అతనికేసి తదేకంగా చూసాడు. “చాలా మంచివాడివిరా వాసూ, నువ్వు. అమాయకుడివికూడాను. నీచుట్టూ వుండే ప్రపంచం నీఅంత ఫెయిర్‍గా వుండదు. మాధవ్ మామగారితో కొంచెం జాగ్రత్తగా వుండు. ఎవరి ఆశలు వాళ్ళకి వున్నాయి. ఎవరి పిల్లలకి వాళ్ళు చూసుకుంటున్నారు. మీ నాన్నే ఏదీ పట్టించుకోకుండా నిరంధిగా గడిపేస్తున్నాడు. మగవాళ్ల వ్యవహారంలో మీ అమ్మ మాట ఎంతదాకా నెగ్గనిస్తారు? రాముకూడా ఈ విషయాల్లో ఏదీ చెప్పలేకపోవచ్చు” అని ఆగాడు గురుమూర్తి. వాసు ప్రశ్నార్థకంగా చూసాడు. సూచన మనసుకి అందుతోంది.
“మాధవ్‍కి యిల్లు వదిలెయ్యమని గీతతో పద్మ అందట విహీ బారసాలలో”
“ఆ విషయం గీత నాకు చెప్పలేదు. కానీ అంతకుముందే బాబాయ్ నాతో అన్నాడు. మానస డెలివరీకి వుంది. నీలిమని మానస డెలివరీకి తోడుగా తీసుకెళ్ళటానికి మాధవ్ అత్తామామా వచ్చి వున్నారు. పొద్దున్నకూడా ఏదో గొడవైనట్టుంది. అసలీమధ్య తను నాతో ఏవీ చెప్పట్లేదు. లోపల్లోపల పెట్టుకుని బాధపడుతోంది”
“పెద్దదైందికదరా? ప్రతీదీ నేరం చెప్పినట్టు ఎలా చెప్తుంది? మగవాడివి, నువ్వే గమనించుకోవాలి” అంది ప్రమీల.
“ఇల్లు పడగొట్టి అపార్టుమెంటు కట్టమని ఇంకో ప్రతిపాదన వుంది. అది ముగ్గురాడపిల్లల తండ్రిదో, పద్మావాళ్లదో, ఇద్దరిదీనో” అన్నాడు గురుమూర్తి.
వాసు ముఖం ఎర్రబడింది. “అలా ఎలా పడగొట్టుకుంటాం? ఇల్లు వుందిగాబట్టి, లోన్లూ, ఈఎమ్మైలూ లేకుండా చేతినిండా డబ్బు ఆడుతోంది. ఐనా మాధవ్‍కి తక్కువేంటి పెద్దనాన్నా? వాడిది నాకన్నా మంచి జాబ్. మాట్లాడితే గీత జీతం లెక్కేస్తారేమిటి అంతాను?”
“అదేరా, నేను చెప్పేదీను. అదేమంత కోట్లలో వ్యవహారంకాదు. తిప్పితిప్పికొడితే నాలుగైదొందలగజాల స్థలం. అంతగా యిల్లు పాతబడిందనిపిస్తే మీరిద్దరూ కలిసి కట్టుకోలేరా? వాళ్ళూవీళ్ళూ ఎందుకురా, మధ్యలో? మాధవ్‍కూడా అటు తూగుతాడేమో, నువ్వే గట్టిగా నిలబడాలి. అంతగా అడిగితే, వాడి వాటా డబ్బు వాడికిచ్చేసి వాడినే వెళ్ళమనండి. తప్పుగా అనుకోకురా! ఇల్లు నిలబడాలంటే అంతకన్నా మార్గం వుండదు. ఒకసారి వదులుకుంటే అంతస్థలం మళ్ళీమళ్ళీ కొనలేరు. అలాంటి యిల్లూ కట్టలేరు. ఆ కలపా, పనితనం, సదుపాయాలూ ఇప్పుడు దొరకవు. మా యిల్లమ్మేసినందుకు ఇప్పటికి నేను బాధపడుతున్నాను” అన్నాడు గురుమూర్తి.
“మాధవ్ ఒక్కడితోటే ఐతే సరిపోతుందిగానీ, మూడుతరాలనాటి యిల్లు. ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే ఎవరెవరు వాటాలు కావాలంటారో! దాన్ని కదిలించడంవల్ల నష్టమేగానీ లాభం వుండదు. ఆడవాళ్లకి ఆస్తిహక్కు వచ్చింది. ప్రభుత్వమే పిలిచి యిచ్చాక, ఎవరు వద్దనుకుంటారు? తులసి వుంది. వీళ్ళకో ఇద్దరు మేనత్తలున్నారు. చిన్నావిడకి పిల్లలుకూడాను. హక్కులు, వాటాల విషయం తర్వాత. ముందు గొడవలైతే ఔతాయి” అంది ప్రమీల.
“నేనన్నానో, వాళ్లన్నారనో కాదు. మీరిద్దరూ సామరస్యంగా కూర్చుని ఆలోచించుకోండి” చివరిగా అన్నాడాయన.
“భోజనం చేసి వెళ్ళు. ఎంత? పదినిముషాల్లో వండేస్తాను” అంది ప్రమీల లేస్తూ. గీతకి తనకోసం చూడద్దని ఇంటికి ఫోన్‍చేసి చెప్పాడు. అప్పుడే గీత వంటప్రయత్నం మొదలుపెట్టింది.
ప్రమీల కొత్తగా కొనుక్కున్న మైక్రోవేవ్ అవెన్ చూపించింది వాసుకి. “సుమంత్ కొన్నాడురా! ఏవేవో రకరకాలు చేసుకోవచ్చని రమా అంది, లతా అందిగానీ అవన్నీ మేమేం తింటాం? పాలు కాచుకోవడానికీ, కూరలు చేసుకోవడానికీ, సాంబారు వెచ్చచేసుకోవడానికీ, అప్పడాలు కాల్చుకోవడానికీ వాడుతున్నాను. వంకాయలు చిన్నగా తరిగేసి, అన్నీ వేసి, కాసిన్ని నీళ్ళు చల్లి పెట్టేస్తే కూర తయారైపోతుంది. మాకిద్దరికీ ఎంత కావాలి?” అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లైన కొడుకులముందు పాతమితృడిలా అనిపిస్తున్నాడు వాసు ఆమెకి
“పన్నెండులీటర్లూ, పదహారులీటర్లూ కుక్కర్లు వాడేదాన్ని మనింట్లో. తీసెయ్యలేక పక్కకి పెట్టేసాను. ఎప్పుడేనా పిల్లలు ముగ్గురూ కుటుంబాలతో వస్తే వాడచ్చని. పెద్దాడెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. చిన్నాడు నల్లపూసయ్యాడు. సుమతిది, దాని ప్రపంచం దానిదైంది. మీకు వుపయోగపడతాయేమో ఎవరిచేతేనా పంపిస్తాను. అంతగా వాళ్ళొస్తే మీదగ్గర్నుంచీ తెప్పించుకుంటాలే. మళ్ళీ మీరు కొనుక్కోవడం దేనికి? ” అంది. ఏవో చెప్తునే వుంది. ముగ్గురూ భోజనాలు చేసారు. ఎలెక్ట్రిక్ రైస్‍కుక్కర్లో వండిన అన్నం, అవెన్లో వేగిన కూర, అప్పడాలు, వేడేక్కిన సాంబారు. ఆధునికతా? పనుల కుదింపా? జీవితపు క్లుప్తతా? వాసుకి అర్థమవలేదు. మాట్లాడుతూ చాలాసేపే వున్నాడు. అతను లేని ఈ కాసేపట్లో అతనింట్లో చాలా జరిగాయి.
ఇంట్లో అంతా వున్నారని మాధవ్ తొందరగా వచ్చేసాడు. వచ్చాక తెలిసింది, వాసు ఇటొచ్చాడని.
“అర్రె! నాకు ఫోన్ చేసుంటే నేనూ వెళ్ళేవాడిని. చాలారోజులైంది వాళ్ళిద్దర్నీ చూసి” అన్నాడు తల్లి చెప్తే విని జవాబుగా. అతను తల్లితో మాట్లాడి గదిలోకి వెళ్ళేసరికి నీలిమ ధుమధుమలాడుతోంది. ఉదయం తనమాట విని మాధవ్ గీతని నిలదియ్యడంతో తనకేదో అధికారం వచ్చినట్టో, తనేదో విజయకేతనం ఎగరేస్తున్నట్టో అనిపించింది ఆమెకి. అంత గొడవ జరిగాకకూడా గీత వచ్చి వంటలో సాయం చెయ్యడం, తను పెట్టినవి తినడం చూసాక తను చేస్తున్నది సరైనదేననిపించి, ఆ ఆలోచనలకి బలం చేకూరింది.
“మళ్ళీ ఏమైంది?” అడిగాడు.
“ఏముంది? ఇంత విస్సాటం మనిషిని ఆమెనే చూస్తున్నాను. తనకి కావల్సిందేదో వండేసుకుంది. అందరికీ పెట్టేసి, తను తినేసి మూతి తుడిచేసుకుని గదిలో వెళ్ళి కూర్చుంది. కుక్కరు, పేన్‍తోసహా అన్నీ అంట్లలోనే వున్నాయి. కడిగి తెచ్చుకుని వండుకున్నాను” అంది ఆరోపణగా. ఆమె నొచ్చుకున్నా, ఏడ్చి బాధపడ్డా, కొంత కటువుగా వుండాల్సిన టైము వచ్చిందని మాధవ్‍కి అర్థమైంది. అత్తమామలున్న టైములో ఎందుకని మొదట అనుకున్నాడుగానీ, వాళ్లకికూడా తెలిస్తేనే మంచిదనిపించింది.
“ఆ కుక్కర్లు, గిన్నెలు, కంచాలవీ వదిన పెళ్ళిసారెలో తెచ్చుకుంది. మిక్సీ తన ఆఫీసువాళ్ళు గిఫ్టుగా ఇచ్చారు. తరవాత కొన్నిటిని పనిసులువుకోసం అవసరమనిపించి కొనుక్కుంది. అంతకుముందు మా అమ్మ ఇత్తడిగిన్నెల్లో వండేది. జాతికో కంచం, రకానికో గ్లాసూ వుండేవి మనింట్లో. వాటన్నిటి స్థానంలోకి కుక్కర్లూ, డిన్నరుసెట్టూ వచ్చాయి. ఆ వస్తువులు నిన్ను ముట్టుకోవద్దని తనేం అనట్లేదు. తన పని తను చేసుకునే మనిషితో నువ్వు దేనికి గొడవపడుతున్నావు? నీకోసం గిన్నెలుకూడా తోమాలా తను? తనవి తను వాడుకుంటే మళ్ళీ కడిగి నీకు సిద్ధంచేసిపెట్టాలా? నిన్నడిగి నీకేం కావాలో వండిపెట్టాలా? ఏమనుకుంటున్నావు మా వదిన గురించి? ఎవరూ నిన్నేమీ అనట్లేదని ఎలా తోస్తే అలా ప్రవర్తిస్తావా? ఆమెతో నీకు పోటీ ఏమిటి? ఎందులో పోటీ? నీలిమా! ఒకళ్లతో పోటిపడటంవలన అవసరం లేకపోయినా వాళ్ల జీవితాన్ని మనం బతుకుతున్నట్టు లెక్క. మన ప్రాథమ్యాలు మారిపోతాయి. పొద్దున్న జరిగిందే చాలా తప్పు. నువ్వు విషయం స్పష్టంగా చెప్పలేదు. నేను వెళ్ళి తనతో అనేసాను. తను చాలా హర్టైంది. మరోసారి ఇలా జరిగితే బావుండదు. నీకేం కావాలో నువ్వూ కొనుక్కో. డబ్బిస్తాను. వంటింట్లో ఇంకోపక్కని నీపని నువ్వు చేసుకో ” అన్నాడు.
“నేనిప్పుడేమన్నానని? ఉమ్మడిలో వుంటున్నప్పుడు నీవీ, నావీ అనుకుంటే ఎలా కుదురుతుంది?” నీలిమ సన్నసన్నగా అంది.
“ఉమ్మడిలో మనవి ఎన్ని వున్నాయో వెళ్ళి లెక్కచూసి వచ్చి నాకు చెప్పు” అనేసి, అక్కడితో సంభాషణ ఆపి, పొద్దున్న సగంలో ఆపేసిన పేపరు హాల్లోకెళ్ళి తెచ్చుకుని కూర్చుని చదువుకోవడం మొదలుపెట్టాడు. అతనికోపం చూసాక ఆమెకి మరేం మాట్లాడాలో తెలీలేదు.
“ముగ్గురూ ముగ్గురే! వీళ్ళకేమీ తెలీదులేవే” అన్న మాధురిమాటలు ఒకమాటూ,
“నువ్విలా గొడవపెట్టుకుంటూ వుంటేనే యిల్లు మీకు దక్కేది” అనే తండ్రిమాటలు మరోమాటూ గుర్తుచేసుకుని వూరుకుంది.
“సర్లెండి. భోజనం చేస్తారా? పెట్టెయ్యనా?” అని అడిగింది.
“పెట్టు. వాళ్లనికూడా రమ్మను” అని లేచాడు. భోజనాలయ్యాక మళ్ళీ గదిలోకి వెళ్లబోతూ తల్లి పెరటి అరుగుమీద కూర్చుని వుండటం చూసి వెళ్ళాడు.
“నువ్వూ వెళ్ళు. ఏమైనా ఎక్కిస్తుందేమో ఆవిడ” అన్నాడు కుటుంబరావు కూతురితో. “మానసని పురిటికి తీసుకురమ్మని మీ ఆయన మాతో అన్నాడని, ఈ పిల్లని పుట్టింటికి పంపించేస్తోంది మీ అత్త. ఇంక వీళ్ళు మనకేం చేస్తారు? మన పిల్లని మనం తీసుకెళ్ళడమే మంచిదేమో! వీళ్ళంతా గొప్పవాళ్ళు, మాది పెద్దకుటుంబం, ఒకళ్ళకొకళ్లం నిలబడతామని వసంత్ గొప్పగా చెప్పాడుగానీ, ఇలాంటి అవమానాలు దులిపేసుకుని తిరగడంకూడా వుంటుందని అనలేదు” అనికూడా అన్నాడు. నీలిమ వెళ్ళలేదు. ఆయన అన్న కారణానికి కాదుగానీ, ఇక్కడ కూతురు పెడుతున్న గొడవలు చూస్తుంటే వెళ్ళిపోవడమే మంచిదనిపించింది కమలాక్షికి.
“ఇక్కడ కూర్చున్నావేమ్మా?” పక్కన కూర్చుంటూ ప్రేమగా అడిగాడు మాధవ్.
“వాసు ఇంకా రాలేదు. వాడికోసమే చూస్తున్నాను” లక్ష్మి జవాబిచ్చింది.
“వదిన, పిల్లలు పడుక్కున్నారా?” అడిగాడు.
“మయూ అలసిపోయి పడుక్కుంటాడు. విహీ ఇప్పుడే పడుక్కుంటాడూ? వాళ్ల నాన్న రావాలి. ఇదేవో సర్దుకుంటోంది. ప్రయాణం అనుకుంటున్నారుకదా?” అని, “మాధవ్, మానసని వాళ్ళు తీసుకెళ్తున్నారో, ఇక్కడికి తీసుకొస్తున్నారో నాకు స్పష్టంగా చెప్పు. ఇక్కడికే తీసుకొచ్చేట్టైతే వదిన్ని ఈ హడావిడయ్యేదాకా పుట్టింట్లోనే వుండమని చెప్తాను. దాని లీవు విషయం నువ్వూ, వాసూ చూసుకోండి. ” అంది.
“అలా వద్దమ్మా! వాళ్ళ పెళ్లప్పుడు సుధీర్‍వాళ్లతో వచ్చిన అపార్థాలు ఇప్పటికీ పోలేదు. మళ్ళీ యిదో గొడవౌతుంది. వెళ్ళి వచ్చేస్తేనే మంచిది. కావాలంటే మళ్ళీ వెళ్ళమను. నేనేనా తీసుకెళ్ళి దింపి వస్తాను” అన్నాడు మాధవ్.
“నీలిమ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఇది గీత ఇల్లెంతో నీలిమకీ అంతే. బాధ్యతలూ అంతే. వేళకి అన్నీ చేసుకుని బైటికి వెళ్ళాల్సిన అవసరం తనదని గీత చకచక చేసేసుకుంటోంది. నీలిమ సాయంచెయ్యకపోగా పైనుంచీ మాటలంటోంది. నిన్నుకూడా చెడగొడుతోంది. గీత చిన్నబుచ్చుకుంటే నేను తట్టుకోలేను మాధవ్ ” అంది గొంతు జీరవోతుంటే.
మాధవ్ తల్లి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. “ఇంకోసారి యిలా జరగదమ్మా! గీతతో నేను మళ్ళీ మాట్లాడతాను” అన్నాడు. తల్లిని ఆనుకుని కూర్చున్నాడు. ఆవిడకి ఎక్కడో కలుక్కుమంది. పిల్లలమీది కోపాలు క్షణికంగానే వుంటాయి. ఆమె మనసు ఆర్ద్రమైంది.
“ఏంట్రా?” అడిగింది ప్రేమగా.
“మహీకి ఎలా వుందమ్మా? రిజల్టేమైనా వచ్చిందా?” ఆతృతని దాచుకుంటూ అడిగాడు.
“ఇంకా తెలీదు” అంది.
“దాన్ని చూసొచ్చానుగానీ, ఇలాంటివి నేనెలా మాట్లాడగలను? నేను వెళ్ళేసరికి వాళ్ళ నాన్నమీద అరుస్తోంది” అన్నాడు.
“దానికిష్టం లేదురా! వీళ్ళ బలవంతానికి వైద్యానికి వప్పుకుంది” నిట్టూర్చింది.
“ఇవన్నీ నీలిమకూడా ఫేస్‍చెయ్యాలామ్మా?” చాలాసేపటికి అడిగాడు.
“సవ్యంగానే జరుగుతుందని అనుకుందాం మాధవ్! డబ్బైతే జమచేసుకుని వుంచుకోండి. చాలా ఖర్చొస్తుందట. నేనా అంతంత పెట్టలేను. అన్నని పెట్టమనడం సమంజసం కాదు. మీ మామగారేమంటాడు? అసలా ప్రస్తావన వచ్చిందా?” అడిగింది. అతను లేదన్నాడు.
సుదీర్ఘంగా నిశ్వసించింది లక్ష్మి. “మయూ బారసాల ఖర్చులు పెట్టుకోవాలని వాసు, గీత కలిసి అనుకున్నారు. అలాగే మీరిద్దరూ అనుకుని నాకు చెప్పండి. వాళ్ళేమీ అనకుండా నాఅంతట నేనే ముందుపడి చెప్పలేనుకదా? ఇప్పటికే వాళ్లకి చాలా లోకువయ్యాం” అంది.
“నీలిమ చేసే గడబిడంతకీ కారణం అదే. వాళ్ళు పట్టించుకోరు. నన్ను నేరుగా అడగలేదు. ఏమని అడుగుతుంది? దాంతో గీతని చూసి అసూయపడుతోంది” అన్నాడు.
“మనకి లేదని ఏడిస్తే ఒక్క కన్నే పోతుంది. ఇంకొకళ్ళకి వుందని ఏడిస్తే రెండు కళ్ళూ పోతాయి. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ దీన్ని కలుపుకుంటే ఏం?”
మాధవ్ నవ్వేసాడు, “పోమ్మా! నీ పెద్దకోడలికి చీరలూ, నగలూ, షాపింగులూ ఏవీ అక్కర్లేదు. ఆ అవతారపురుషుడిని చూసుకుని పరవశించిపోతూ వుంటుంది. చిన్నప్పుడు తనని వాసుగాడి పిల్లిపిల్లనేవాళ్ళం. ఆ పిల్లికూన ఎవరిదగ్గిరకీ వెళ్లదు. ఇంక వాళ్ళు ఈవిడతో ఏం మాట్లాడతారు?” అని లేచి వెళ్ళిపోయాడు. తల్లితో మాట్లాడాక అతని మనసు తేలికపడింది. తల్లీకొడుకులు కూర్చుని మాట్లాడుకుంటున్నారంటే ఇంకేం గొడవలౌతాయోనని కమలాక్షి భయపడింది. కానీ అతను నవ్వుతూ రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. లక్ష్మిమీద గొప్ప గౌరవం కలిగింది.
మరుసటిరోజు వాసు, గీత, పిల్లలు బయల్దేరారు. మాధవ్ స్టేషనుదాకా వెళ్ళి వాళ్లని ఎక్కించి వచ్చాడు. ఆ పక్కరోజు నీలిమని తీసుకుని కుటుంబరావు, కమలాక్షీ బయల్దేరారు. మాధవ్‍కూడా వెంటవెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి వసంత్ యింట్లోనే వున్నాడు. పలకరింపులయ్యాయి.
“మాయింటికే తీసుకురమ్మన్నానురా, అమ్మకూడా చెప్పింది. వీళ్ళేమో వినట్లేదు” అన్నాడు మాధవ్.
“ఇటు మమ్మల్ని రమ్మన్నారు, అటు మీ వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇష్టం లేదేమోననుకున్నాం” అన్నాడు కుటుంబరావు గురిచూసి బాణం వదిలినట్టు. ఆ అభియోగానికి మాధవ్ తెల్లబోయాడు.
“మానసని చూసుకోవడానికి పెద్దవాళ్ళున్నారు. ఆ టైముకి మా అమ్మమ్మ వస్తుంది. వదిన వుండి ఏం చేస్తుంది?” అడిగాడు.
“గీత బెంగుళూరు వెళ్ళిందా?” అడిగాడు వసంత్ విస్మయాన్ని దాచుకుంటూ. మానస వస్తోదంటే గీతకి పట్టింపు లేదా? రిసీవ్ చేసుకోకుండా ఎందుకు వెళ్ళింది? తనేమో వాసూ గీతలని వెనకేసుకుని తండ్రితో దెబ్బలాడుతున్నాడు. చిన్నప్పటి స్నేహాలకి తనే ఎక్కువ విలువిస్తున్నాడా? చిన్నబేధభావం మనసులో పొడసూపింది.
“ఎల్టీసీమీద పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. వారంరోజులకి. వెళ్ళాలని నెలరోజుల్నించీ అనుకుంటున్నారట. మనందరికీ తెలిసిందేగా? ఆవిడ వాళ్ళ నాన్నని వదిలిపెట్టి వుండలేదు. ఓమాటు చూసి వచ్చేద్దామని బయల్దేరారు. డెలివరీకి ఇంకా టైముందిగా? ఆసరికి వచ్చేస్తారు. ఇప్పుడేనా మించిపోయిందేం లేదు. మాతో పంపించు. అమ్మకూడా అక్కడికే తీసుకురమ్మని చెప్పింది” అన్నాడు మాధవ్.
“ఎందుకులేరా, ఎలాగా వచ్చేసారుకదా? వాళ్ళింటికే వెళ్తారులే. ఎక్కడైతేనేముంది?” అన్నాడు వసంత్ వుదాశీనంగా.
వసంత్‍కన్నా కొంచెం చురుగ్గా ఆలోచించింది మానస. తండ్రివలన అక్కడేదో గొడవ జరిగివుంటుందనుకుంది. వసంత్‍కూడా గీత ఎందుకు వెళ్ళిందని కాకుండా లక్ష్మి ఎలా పంపించిందని ఆలోచించి వుంటే వైమనస్యత కలిగేదే కాదు. గీతమీద మరో నిందకూడా పడీపడనట్టు పడింది. ఇంకో బంధం బలహీనపడింది. చాలావరకూ బంధాలన్నీ అంచనాలమీదే ఆధారపడి బతుకుతాయి. మనిషి అంటే బంధాలు. బంధాలంటే అంచనాలు. అంచనాలంటే ఆ కొసా, ఈ కొసా అంటుకోని వంతెనలు.
మరోసారి చెప్పి, మాధవ్ వెనక్కి వచ్చేసాడు. మంచిది చూసుకుని పద్మ యింట్లో సూడిదలు ఇచ్చి, కూతుళ్ళిద్దర్నీ తీసుకుని బయల్దేరారు కుటుంబరావు దంపతులు. వెళ్ళేముందు భార్యకి ఖర్చులకని డబ్బిచ్చాడు వసంత్. తన చేతిలో పెట్టి, వుంచమంటుందనుకున్నాడు కుటుంబరావు. కానీ ఆమె జాగ్రత్తగా తన బేగ్‍లోనే పెట్టుకుంది. నీలిమ దగ్గిరకూడా డబ్బు వుండే వుంటుందని ఆయనకి అర్థమైంది.
“పిల్లలు తెలివి మీరారు. స్వంత పెత్తనాలు ఎక్కువయాయి” అన్నాడు భార్యతో కినుకగా. ఎప్పట్లాగే ఆవిడ మౌనంగా వుండిపోయింది.
“అసలేం జరిగిందే?” అడిగింది మానస అక్కని ఇంటికెళ్ళాక. తండ్రి లేనప్పుడు.
జవాబు కమలాక్షి చెప్పింది. “మంచివాళ్ళుకాబట్టి మొహమ్మీద పేణ్ణీళ్ళు కొట్టి పొమ్మనకుండా మర్యాదగా పంపించారు. ఇది ఆ గీతమీద వంటికాలిమీద లేస్తోంది. తను లేచిందేకాక బావనికూడా వుసిగొల్పుతోంది. మేము దగ్గిరుండి ఇదంతా చేయిస్తున్నామని వాళ్ళనుకుంటారని హడిలిపోయాను. అందులోనూ నిజం లేకపోలేదు. మీ నాన్న దీన్ని ఎగేస్తున్నారు. నిండింట్లో కళ్ళనీళ్ళు పెట్టించారు ఆ పిల్లచేత. వాళ్లత్తగారు ఎందుకు వూరుకుంటుంది? ఛడామడా దులిపేసింది. పద్ధతులు మార్చుకుంటే మార్చుకో లేకపోతే నీ ఖర్మని, వేళకి యింత తిండి పడేసి దీని మానాన్న దీన్ని వదిలేస్తారు. రోజంతా ఒక్కర్తీ అలా గదిలో కూర్చుని కుళ్ళిపోతూ వుంటుంది. దేనికే నీలిమా, ఆ బాధ? నిన్నెవరేనా ఏదేనా అంటే ఎందుకంటున్నారని అడుగు. అంతేగానీ తినికూర్చుని గొడవలు పెట్టుకోవడమేంటి? గీత పరాయిపిల్లే అవనీ, దీనికి తోటికోడలే అవనీ, ఎంత ముచ్చటేసిందో చూస్తుంటే. పొద్దున్న ఐదింటికి లేస్తుంది. అప్పట్నుంచీ గిలకలా తిరుగుతూ అన్ని పనులూ చేసుకుని ఆఫీసుకి వెళ్తుంది. అత్తగారిని కూర్చోబెట్టి చేస్తోంది. సంపాదిస్తున్నాననిగానీ, పుట్టింటినుంచీ ఇంత తెచ్చుకున్నాననిగానీ గర్వం పిసరంతకూడా లేదు. ఇద్దరు పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు. వాళ్లని సొంతపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటోంది. ఎవరి పిల్లలోగానీ, కడిగిన ముత్యాల్లా తయారుచేసింది. అందులో ఒకడున్నాడు, పూజారిగారి కొడుకట ఆటల్లో ఆటల్లో రుద్రం, నమకం, చమకం చదివేస్తూ వుంటాడు. ముద్దొచ్చేసాడు పిల్లాడు. నా కూతుళ్లలో ఒక్కతేనా అలా వుంటే బావుణ్ణనిపించింది. ఇదిలా తయారైంది. ఏం కొంప మునుగుతుందోనని భయపడ్డాను ఈ రెండురోజులూ. మీ నాన్న వెళ్దామన్నదే చాలన్నట్టు బయల్దేరిపోయాను. ఇంకా వాళ్ళింట్లో వుండి నీకు పురుడుపొయ్యడం ఎక్కడిది?” మనసులో బాధంతా వెళ్ళగక్కింది.
“పోమ్మా! వాళ్లవంటే చిన్న వుద్యోగాలుగాబట్టి పైసపైసకీ లెక్కలు చూసుకుంటూ, పనులు పుణుక్కుంటూ, కడుపే కైలాసం, యిల్లే వైకుంఠం అన్నట్టుంటారు భార్యాభర్తలు. నీ అల్లుడికింద అలాంటివాళ్ళు ఎంతమంది చేస్తుంటారో! నాకేం అవసరం అలా వుండటానికి? వాళ్ళా కొంప వదిలిపెట్టి పోతారేమోనని చూస్తున్నాను. అప్పుడు నాకు నచ్చినట్టు మార్చుకుంటాను” అంది నీలిమ. అక్కని ఆశ్చర్యంగా చూసింది మానస.
“మనకి ఇక్కడేం వుంది నీలూ? నాన్నదీ అలాంటి వుద్యోగమేకదా?” అడిగింది.
“ఈ స్టేజీ దాటాంకదా? దర్జాగా బతక్కుండా దేవులాడుకోవడం దేనికి? అందుకే నాకామె నచ్చదు. వాళ్ళూ వీళ్ళూ పెట్టిన చీరలు కట్టుకుని, మెతుకు పోతే బతుకు పోతుందన్నట్టు బతకడం నావల్లకాదు. సొంతకొడుకుని వీధిబళ్ళో పడేసారు, వూళ్ళోవాళ్లని వుద్ధరిస్తున్నారు. అదో స్కూలు, వాడిదో చదువు. చురుకైన పిల్లాడు. ఎంత దర్జాగా పెంచచ్చు?” నిరసనగా అంది నీలిమ. మానస అక్కతో ఏకీభవించలేకపోయింది. ఆ విబేధానికి మూలం ఆమెకి చిక్కలేదుకానీ అసలుకారణం మధ్యతరగతిలోనే సౌకర్యవంతమైన జీవితం ఆమె కోరుకుంటే, పైతరగతికి వెళ్ళాలని నీలిమ ఆశపడింది. పద్మలా. దారులు మళ్ళుతున్న ఆలోచనలు రక్తసంబంధాలనికూడా పలచనచేస్తాయి. పెళ్ళికిముందు ఒక ప్రాణంలా బతికిన అక్కచెల్లెళ్ల దారులు చీలుతున్నాయి. ప్రవాహం మూలాన్ని వదిలాక ఏకధారగా ప్రవహించాలనేం లేదు. చిన్నచిన్న పాయలుగా చీలి విడివిడిగాకూడా ప్రవహించవచ్చు.
మానసకి మళ్ళీ పాప పుట్టింది. అనుకున్నరోజుకి మూడురోజులముందే పాప పుట్టేసింది. కుటుంబరావు విషయం ఫోన్ చేసి చెప్పగానే వసంత్ కంగారుపడుతూ వున్నపళంగా లీవు పెట్టి వచ్చేసాడు. పద్మమాత్రం తనకి వార్త చెప్పిన కమలాక్షిని చెరిగేసింది.
“మళ్ళీ ఆడపిల్లా? తల్లిపోలికే వచ్చినట్టుంది. ఆస్తులూ ఐశ్వర్యాలూ లేకపోయినా ఈ వారడిమాత్రం బానే వచ్చింది. వద్దురా అంటే వినకుండా చేసుకున్నాడు. ఇక అనుభవించాలి. వాళ్ల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ ఒక్కచేతిమీద లాక్కురావాలి. కట్నం అక్కర్లేదనే దద్దమ్మలు మాయింట్లో తప్ప ఈ భూప్రపంచంమీద ఇంకెక్కడా పుట్టరు ” అని నోటికొచ్చినట్టు అనేసింది. కమలాక్షికి కళ్లమ్మట నీళ్ళు తిరిగాయి.
“ఐతే ఏమిటే? మగపిల్లాడిని కనడం మన చేతుల్లో వుంటుందా? అలా వుండే మాటైతే నేనే ముగ్గురు ఆడపిలల్ని కనేవాడిని కాదు. అంతగా వీళ్ళు పెంచుకోలేకపోతే నీలిమావాళ్ళూ పెంచుకుంటారు ఒక పిల్లని” అన్నాడు కుటుంబారావు, పక్కనే వుండి విని. ఫోనయ్యాక.
మానస కస్సుమని లేచింది. “నా పిల్ల నాకు బరువా? నేనెందుకు పెంపకం యిస్తాను నాన్నా? ఆ విషయం నువ్వెలా చెప్తావు?? తెలివితక్కువగా మాట్లాడి యిదో తంటసం నాకు తెచ్చిపెట్టకు. అంతగా వాళ్ళు మగపిల్లాడే కావాలనుకుంటే, ఇంకోసారి చూస్తాం. మా పిల్లల్ని మేం పెంచుకోనూగలం, చదువులు చెప్పించి పెళ్ళిళ్ళూ చెయ్యగలం” అంది.
“మీరిలాగే లెక్కలేసుకోండి. ఆ గీత దాని కొడుకుని అంటగడుతుంది వీళ్ళకి” అన్నాడు.
“ఆ< వాడి నెత్తిమీద నాలుగెకరాలు పెట్టి మరీ అందిస్తుంది” వెటకారంగా అంది కమలాక్షి. “ఎవరి పిల్లలని ఎవరూ ఇవ్వరు. ఎవరికివాళ్ళకే యిద్దరూ ముగ్గురూను” అంది. నీలిమ ముఖం ముడుచుకుపోయింది. గుండెల్లోంచీ చివ్వుమని బాధ ఎగజిమ్మింది. అయ్యో, పిల్లలేరే అన్న సానుభూతి లేదు, వీళ్ళవైపునించీ ఒక చిన్న ప్రయత్నంకూడా లేదు, ఇక పుట్టరని ఆయనే తీర్మానించేసాడు.
“నాన్న మాటలు పట్టించుకోకు నీలూ! ఈ హాస్పిటల్లోనే నువ్వూ ఒకమాటు డాక్టరుకి చూపించుకో” అంది మానస.
“వద్దులేవే. అక్కడ రెగ్యులర్‍గా వెళ్ళి చూపించుకుంటున్నాం. బావకి చెప్పకుండా నేను చూపించుకుని ఏం లాభం? మహతిని తీసుకొచ్చి ఐవీఎఫ్‍కి ప్రయత్నిస్తున్నారు. అలా పిల్లల్ని పట్టించుకునే అమ్మానాన్నలు అందరికీ వుండద్దూ? నా ప్రాప్తంలో వుంటే వాళ్ళే పుడతారు. సర్లే, నేను ఇంటికెళ్తాను. నువ్వు, పాప జాగ్రత్త. ఖర్చుకి చూడకు. కావల్సిన మందులూ అవీ నాన్నకి చెప్పి తెప్పించుకో. ఈ డబ్బుంచు. పెద్దదాన్ని నాతో తీసుకెళ్తున్నాను. అది ఇక్కడెందుకు?” అని మడతపెట్టిన వందనోట్లు కొన్ని చెల్లెలి చేతిలో పెట్టి, “అమ్మా! వంట చేసి, కేరేజి తీసుకుని వస్తాను, అప్పుడు నువ్వు ఇంటికెళ్దువుగాని” తల్లికి చెప్పి లేచింది. పిల్లని ఎత్తుకుని వెళ్తుంటే నిరాశా, నిస్పృహా కలగలిసి ఆమె నడుస్తున్న భంగిమల్లో వ్యక్తమౌతూ మానసకి మనసు కలచివేసినట్టైంది.
“ఇప్పుడేమంటుందే, ఇది? మహతికి చేయించినట్టు దీనికి చేయించడానికి లక్షో రెండులక్షలో కావాలి డబ్బు. వాళ్లకంటే వుంది, ఖర్చుపెడుతున్నారు. నా దగ్గిరెక్కడిది? ఉన్నవాళ్ళు పెట్టుకోవాలి. అతనికిమాత్రం పిల్లలక్కర్లేదా? దీనికేనా కావల్సింది?” అన్నాడు కుటుంబరావు. నాన్నలంతా గొప్పవాళ్ళు కారు. అలా గొప్పవాళ్ళు కావడానికి వాళ్లకి స్వార్థరహితమైన మనసు వుండాలి, అవకాశాలు కలిసిరావాలి. కుటుంబరావుకి రెండూ లేవు. ఒంటిమీద ఒక షర్టు, వుతుక్కో షర్టూ తప్ప మరేవీ లేని రామారావుకి ఆ మనసు వుంది. పిల్లలకి అమర్చిపెట్టాలనే తాపత్రయం ప్రాణనాడిలా ఆయన శరీరంలో కొట్టుకుంటుంది.
“ఏదో అందిలే, నాన్నా!” అంది మానస విసుగ్గా. “హాస్పిటల్ బిల్లులవీ వసంత్ పేరుమీద తీసుకో. మాకు రీయింబర్స్‌మెంటు వుంటుంది” అని తండ్రికి చెప్పి, అలసటగా కళ్ళుమూసుకుంది. ఆయన ఏదో అనుకుంటూ వెళ్లిపోయాడు.
“ఆ మనిషి చేసే ఆలోచనలకి వళ్ళు మండుతుందిగానీ అన్నిటికీ మీ నాన్నని తప్పుపట్టలేను మానసా! రిటైర్మెంటప్పుడు వచ్చింది చాలావరకూ ఖర్చైపోయింది. పెన్షను తప్ప ఇంకే ఆధారం లేదు. పోనీ, ఓపికుంది, ఇంకెక్కడేనా చేసి ఇంకో నాలుగుపైసలు తీసుకొస్తారా అంటే నామర్దా. చేతిలో వున్న ఆ కాస్తా ఖర్చుపెట్టేస్తే మారోజులు ఎలా వెళ్ళాలి? అందుకే నీలిమ విషయంలో మనసుకి ఎంత బాధనిపించినా, నోరు బిగబట్టుకుని కూర్చుంటున్నాను” అంది కమలాక్షి.
“వాళ్లతో గొడవలు పెట్టుకోకండమ్మా! ముఖ్యంగా గీతతో. ఏదేనా జరగాలన్నా, ఎవరికేనా నచ్చజెప్పాలన్నా ఆమెవల్లనే సాధ్యపడుతుంది. ఆమె మాటకి పెద్దాచిన్నా అంతా చాలా విలువిస్తారు” క్లుప్తంగా అంది మానస.
పద్మ కమలాక్షిని అని వూరుకోలేదు. భర్తతో కలిసి కొడుకునీ బానే అంది. తను అనేవన్నీ అనేసి, భర్తకి ఫోను యిచ్చింది. అతనూ అన్నాడు.
“ఇంకా ఎంతకాలం చిన్నపిల్లవాడిలా చూస్తారు నన్ను? ఇష్టమో, కష్టమో పెళ్లైంది. పిల్లలూ పుట్టారు. ఇకనేనా నా బతుకు నన్ను బతకనివ్వండి. నా జీతం నాకొదిలేస్తే పిల్లల్ని నేను పెంచుకోగలను” అన్నాడు వసంత్ విసురుగా.
“నీ భార్య చెప్పిపెట్టిందా, ఇలా అనమని? ఏం పెట్టి పెంచుతావురా, పిల్లల్ని? సమీరకి అంత చదువూ చెప్పించి పైనుంచి పెళ్ళికి ఎంత ఖర్చు చేసానో తెలీదా, నీకు? నీ ఖర్చులకి వుంచుకుని, మిగిలిందేగా నాకు పంపేది? పైనేమైనా సంపాదిస్తున్నావా? ఆ తెలివీ లేదుకదా, తమరికి? ఇంట్లో అంత ఖర్చెందుకౌతోంది? డబ్బుకి మొహంవాచి వున్నారు, నీ భార్యా, నీ మామాను. ఆ పిల్ల ఎలా తగలేస్తోందో చూడలేదా? ఎన్నేసి చీరలు కొని పడేసింది? ఇంట్లో వుండేదానికి అవసరమా? పుట్టింటికి ఏం పెడుతోందో తెలీనే తెలీదు. పెద్దవాళ్ళ అదుపూ ఆజ్ఞాలేదు. వాసుని చూసి నేర్చుకోండిరా! బిడ్డ పుట్టకుండానే సమకూర్చిపెట్టాడు. జీతం పంపిచేస్తున్నానని లెక్కలడుగుతున్నావు, నీ డబ్బుతో నేనేమైనా జల్సా చేస్తున్నానా? ఓ యిల్లో వాకిలో నీకు ఏర్పడుతుందనేకదా, నా తాపత్రయం?” అన్నాడు రాజశేఖరం.
“నువ్వూ నా పేరుమీదికి యిల్లు మార్చెయ్. నా పిల్లలకీ ఆస్తులుంటాయి. జీతం చేతిలో వుంటే నేనూ కొని చూపిస్తాను”
“ఓరి ఫూల్! వాసుకి వాళ్ళ నాన్న కాదు ఇచ్చింది, వాడి మామ. ఏమైనా అర్థమౌతోందా? మాధవ్‍ని మంచి చేసుకుని ఆ యింటివిషయంలో వాడిని మనదారికి తీసుకొస్తావంటే అదీ వినకుండా వాళ్లని వెనకేసుకొచ్చి మాతో దెబ్బలాడుతున్నావు. వాసు ఆ యింట్లోంచీ కదిల్తే దాన్ని పడగొట్టి అపార్టుమెంటు కడితే వాళ్ళూ బాగుపడతారు, మనకీ చవకలో ఒకటో రెండో ఫ్లాట్స్ వస్తాయి. పూర్తిగా పెట్టుబడి పెట్టి కట్టేంత స్థాయి నాకు లేదు. ఇద్దరుముగ్గురం కలిసి కడదామని ఆలోచిస్తున్నాం. బైటిస్థలం కొనాలంటే డబ్బు కావాలికదా? ఇదైతే ముందుగా స్థలానికి పెట్టుబడి పెట్టక్కర్లేదని చూస్తున్నాను. సివిల్ ఇంజనీరువి, ఇవన్నీ నీకు నేను చెప్పాలా? నీకే రావాలి, ఇలాంటి ఆలోచనలు”
అంత స్పష్టంగా ఆయన మనసులోని అభిప్రాయం బైటపెట్టేసరికి వసంత్ తెల్లబోయాడు. తమాయించుకుని జవాబు యిచ్చే అవకాశం యివ్వలేదాయన.
“అంతయిల్లూ అద్దెన్నది రాకుండా వుంది. వాళ్లకి తెలీడం లేదు. మీ మామయ్యని చూసి అదే పద్ధతనుకుని డబ్బు ఖర్చుపెట్టకుండా దాస్తున్నారు. దాస్తే ఏమొస్తుందిరా? బేంకులిచ్చే వడ్డీలు పెరిగే అద్దెల్తో పోల్చితే ఏమూలకి? ఆయనకేం తెలుస్తాయిరా, ఇలాంటి విషయాలు? ఆపైన వాళ్ళకి సలహాలిచ్చేది గీత. పిల్లల ఆటలా ఇల్లు నడిపిస్తున్నారు ముగ్గురూ కలిసి. ఇద్దరికీ చెరో రెండు ఫ్లాట్సూ వస్తే ఒకదాంట్లో వున్నా, రెండోదానిమీద అద్దెలొస్తాయి. అటు గీతావాళ్ల స్థలం మాత్రం? ఖాళీగా వదిలెయ్యడం దేనికి? అక్కడ కడితే దానిమీదా అద్దెలొస్తాయికదా? భార్యాభర్తలిద్దరికీ వుద్యోగాలు. చిన్నవయసు. బోల్డంత సర్వీసుంది. లోన్లు తీసుకుని కట్టడానికి ఏడుస్తారేమిట్రా? వాళ్ళేమైనా జమీందార్లా, మూడుతరాలనుంచీ, నాలుగురుతరాలనుంచీ ఆ యింట్లో వుంటున్నాం అని గొప్పలు చెప్పుకోవడానికి? మహామహా అవంతీపురం జమీందార్లే కోట వదిలేసి పట్టణాలకీ, అట్నుంచీ విదేశాలకీ దారిపట్టారు, అంతకన్నా గొప్పవాళ్ళా, వీళ్ళు? వాళ్ళనేం మనం ముంచట్లేదుకదా? మనింటి పిల్లలూ, వాళ్ల నాన్నకేం పట్టదనీకదా, మంచీచెడూ చెప్పబోయేది?” కొనసాగించాడు. గురుమూర్తిలా ఆయనదీ ప్రేమే. స్వార్థంపాళ్ళు మోతాదు దాటి ఎక్కువగా వున్న ప్రేమ.
అప్పటికే వసంత్ మనసులో ఒక ముడి విడింది. ఇప్పుడు తండ్రి అంతరంగంమీది తెర తొలగింది. అతను ఆలోచనలోపడ్డాడు. వీలుచూసుకుని తండ్రి అన్నమాటల్ని మాధవ్‍తో అంటే అతను అలాంటి ఆసక్తి లేదని నిక్కచ్చిగా చెప్పేసాడు.
“నాన్న వాసూవాళ్లని వేరే వెళ్లమన్నప్పుడు నాకూ కోపం వచ్చిందిరా! ఆయన సరిగ్గా చెప్పలేకపోయారు. వాళ్ల స్థలం పెద్దది ఐదారు వాటాలు కట్టుకోవచ్చు. ఇటు మీరుండే యింటిని అపార్టుమెంటు కడితే ఫార్టీ సిక్స్టీ లెక్కన ఫ్లాట్లొస్తాయి. అన్నిటిమీదా అద్దెలొస్తాయి. రెండు ప్రాపర్టీస్‍నీ నిరుపయోగంగా వుంచడం దేనికని అంటున్నారు” అని వసంత్ అంటే,
“ఇల్లు డెవలప్‍మెంటుకి యివ్వడమంటే యింట్లో అందరినీ వప్పించాలి. వాసుకి యిష్టం లేదు. ఎలాగో ఒకలా వాడు సరేనంటే మరో యిల్లు చూసుకుని పుల్లా పుడకాతోసహా అన్నీ అక్కడికి చేర్చాలి. ఇంతచేస్తే మాకు ప్రత్యేకంగా వొరిగేది ఏమీ వుండదు. కొత్త ఫ్లాట్లు వస్తాయిగానీ స్థలం ముక్కాచెక్కా ఔతుంది. కంప్యూటర్లొచ్చాక సిటీ బాగా డెవలపైంది. స్థలాల ధరలు బాగా పెరుగుతున్నాయి. మళ్ళీ ఇంత స్థలం కొనలేం, ఇంత యిల్లూ కట్టలేం. అద్దెలు చేతికి తీసుకున్నా మళ్ళీ పెట్టుబడి పెట్టేది స్థలాలమీదా యిళ్లమీదేకదా? ఉన్న యిల్లు ఇలా వదిలేసి, ఇంకెక్కడేనా తీసుకుంటే సరిపోతుంది. దానిక్కూడా నాకు కొంత వ్యవధి కావాలి” అన్నాడతను. సంభాషణంతా రాజశేఖరం ఎదురుగానే జరిగింది.
అన్నదమ్ములిద్దరూ చాలా స్పష్టతతో వున్నారని వసంత్ గ్రహించాడు. మాధవ్ అక్కడితో దానికి ముగింపు చెప్పేసాననుకున్నాడుగానీ, రాజశేఖరం అలా వదిలేసే మనిషి కాదు. కుటుంబరావు నిప్పుకి గాలి తోడులాంటివాడు.
స్వర్గపు వాకిట్లో రాలిపడ్డ వెన్నెలపూలు ఎగిరొచ్చి ముంగిట్లో పడ్డట్టు తిరిగి ఇంటికి వచ్చారు గీతా, వాసూ. వాళ్ళని అంటుకుని వచ్చిన సంతోషపుధూళి వాళ్లవెంట యింట్లోకికూడా వచ్చింది. గీత తల్లిదండ్రుల ప్రేమలో తడిసి ముద్దైపోయింది.
“చిన్నాడిని ఎత్తుకుని తిరగాలి. పెద్దాడికిమాత్రం మీరు తిరిగేచోట్లన్నీ ఏం తెలుస్తాయి? ఇక్కడ నాన్న, తమ్ముడు తిప్పుతార్లే. పెళ్ళవగానే పుట్టేసారు. ఈ నాలుగురోజులేనా సరదాగా తిరిగి రండి” అంది యశోద. విహీ వుంటాడో వుండదో అని భయపడింది గీత. కానీ రామారావు వాడిని బానే మచ్చికచేసుకున్నాడు. కృష్ణ ఆఫీసుకి వెళ్ళినప్పుడు తాతతోనూ, అతనున్నప్పుడు అతన్ని వదలకుండానూ తిరిగాడు మయూ.
పిల్లల్ని వాళ్ల దగ్గిర వదిలేసి, వాసూ తనూ చెయ్యీచెయ్యీ పట్టుకుని వూరంతా తిరిగిన అనుభవం కొత్తది. మూడురోజులు మైసూర్లో లలితామహల్ పేలెస్‍లో గడిపిన ఏకాంతం మరీ అపురూపమైనది. ఇద్దరికీ. సమంగా. ఎలాంటి ఎక్కువతక్కువలు లేకుండా.
రాగానే మనవలిద్దరూ మామ్మని అల్లుకుపోయారు. గీత కళ్లనిండా మేనత్తని చూసుకుంది.
“అమ్మా, నాన్నా ఎలా వున్నారే? ప్రయాణం బాగా జరిగిందా?” వివరాలన్నీ తరచి తరచి అడిగింది లక్ష్మి.
మాధవ్, వాసూ మాటల్లో పడ్డారు.
“మామయ్య మీయిద్దర్నీకూడా రమ్మన్నాడురా! మానస డెలివరీ, హడావిడీ అయ్యాక వెళ్ళిరండి ” అన్నాడు వాసు. మాధవ్ తలూపాడు.
ఆ తర్వాత వారానికి మానస డెలివరీ అయింది.
“డెలివరీ అయిందికదా, వెళ్లి నీలిమని తీసుకురానా?” అడిగాడు మాధవ్.
“ఇద్దరు చంటిపిల్లల్నీ బాలింతరాలినీ ఒక్కావిడ మీ అత్తగారు ఎలా చూసుకుంటుంది? ఉండనీ. వచ్చి చేసేదేం వుంది? ఐనా ఇక్కడికే తీసుకురమ్మంటే వాళ్ళు వినిపించుకోలేదు. అందరం వున్నాం, నెలకో రోజు తక్కువ చేసుకుని తీసుకెళ్ళి మూడోనెల్లో బారసాల చేసుకుంటే అయ్యేది” అంది లక్ష్మి. కుటుంబరావు అన్నమాటలు చెప్పాడు మాధవ్.
“వేషాలా? నీలిమని తీసుకెళ్తామనికదా, వాళ్ళు అడిగింది? మానసనే ఇక్కడికి తీసుకురమ్మన్నాం. వదినావాళ్లు వెళ్ళేముందురోజు రాత్రికూడా నిన్నా విషయం అడిగాను. ఏమాటా చెప్పకుండా బయల్దేరిపోయారు. మీరూమీరూ నిర్ణయించుకోకుండా మధ్యలో దాని ప్రసక్తి దేనికి? ” అంది లక్ష్మి.
నెలకి ఒకరోజు తక్కువగా మానసనీ పిల్లల్నీ తీసుకొచ్చేసాడు వసంత్. ఆమె తల్లిదండ్రులు, నీలిమకూడా తిరిగొచ్చారు. వెళ్ళేముందు నీలిమకి బాగా హితబోధ చేసాడు కుటుంబరావు.
“మీ ముగ్గురికీ పెళ్ళిళ్ళు చేసి పంపాను. అదే నా శక్తికి మించినది. తినీ తినకా మిగిల్చి, అప్పులు చేసి మీ బాధ్యతలు తీర్చుకున్నాను. రేపటి మా రోజేమిటి? చాలీచాలని పెన్షనుతో రోజెలా వెళ్తుంది? కాలూచెయ్యీ ఆడనప్పుడు మా పరిస్థితేమిటి? మీరు స్థిరపడితేకదా, మాకో దారి దొరికేది? మిగిలిన యిద్దరి యిళ్ళలో మామగార్ల పెత్తనం నడుస్తోంది. మనమాట చొరబడదు. మీ అత్తామామలమధ్య గొడవేంటో మనకి తెలీదు. ఆయన్ని మూలగదిలో పడేసి యీవిడ పెత్తనం చలాయిస్తోంది. అన్నగారికి డబ్బు యిబ్బందులని ఆయనకి ఏ మందేనా పెట్టిందేమో తెలీదు. లేకపోతే ఆఫీసుకెళ్ళి వుద్యోగం చేసి సంపాదించుకొచ్చే మనిషికి ఆ పిచ్చిపూజలేమిటి? వాసుది ఇంటిపెత్తనం. అతనికి రామారావు సలహాలు. పోనీ ఆ రామారావేమైనా వుద్దండుడా? కాదు. అందరికీ అయ్యా, బాబూ అని సలాములు కొట్టి నెట్టుకొచ్చినవాడేకదా? ఏమే, సమర్ధుడైన కొడుకుని , మీ ఆయన్ని పక్కనపెట్టి వాళ్ళ పెత్తనమేమిటి?
మాధవ్ పెద్ద ఆఫీసరు. గీతది వదిలెయ్, ఆడాళ్ల వుద్యోగానికి పెద్దా చిన్నా ఏంటి? ఎంత ఆఫీసరమ్మైనా వంటింట్లో గరిట తిప్పాల్సిందే. వాసుది చిన్న వుద్యోగం. ఎంత ఆస్తి సంపాదించినా వాళ్ళు మీతో సమానం కారు. మీముగ్గురూ ఎక్కడెకెళ్ళినా వాళ్ళూ తయారైపోతున్నారు. అక్కడ పెద్దాయన యింట్లో చూస్తే అందరూ డాక్టర్లు. వాళ్ల వెంటా అలానే పడి తిరుగుతున్నారు. ఎవరు విలువిస్తారే? చిన్నప్పట్నుంచీ వున్న స్నేహంచేత ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. మీరే వాళ్లని దూరం పెట్టాలి. మీ ఆయనకి మొదట అర్థంకాకపోయినా, నెమ్మదిమీద తెలుస్తుంది. ఆఫీసరంటే ఎంత డాబూ దర్పం వుండాలి? ప్యూన్లు ఇంటికొచ్చి పనిచేస్తారు. మీరేమిటే, అంత సాదాగా బతుకుతున్నారు? వాసునీ, రామారావునీ చూసి కాదూ? మా ఆఫీసరు మమ్మల్నెప్పుడూ దగ్గిరకి రానిచ్చేవాడు కాదు. ఆయనముందు నిలబడి మాట్లాడేవాళ్లం. పిలిస్తే ఫైళ్ళు మేమే పట్టుకుని పరిగెత్తేవాళ్ళం. ఎందుకు? హోదా. అన్నావదినలైతేమాత్రం? వాళ్ళతో కలిసి తిరగడం చూస్తే మాధవ్ ఆఫీసులోవాళ్ళు లోకువకట్టరూ? వాసు ఫ్రెండ్సు, ఆఫీసులోవాళ్ళు అతన్ని వాసుతో సమానంచెయ్యరూ? ఏరా వాసూ అన్నట్టే అతన్నీ అనరూ? ప్రహ్లాద్‍కీ వసంత్‍కీకూడా నామర్దానేకదా? నామర్దా మాట అలా వుంచు, ఇంట్లో మెతగ్గా వుంటే, ఆఫీసులో ధాటీగా ఎలా వుండగలరు? అందుకని ఎవరి హద్దుల్లో వాళ్ళని వుంచాలి. వాళ్లకున్న స్థలంలో యిల్లు కట్టుకుని వుంటారా, నడిరోడ్డుమీద నిలబడతారా అనేది వాళ్ళిష్టం. ఇప్పటిదాకా చెప్పేవాళ్లంతా మర్యాదగానే చెప్పారు.
ఇంక పిల్లల విషయం. దేవుడు ఆ రామారావుకి ఒక కొడుకునీ, సంపాదించే కూతుర్నీ యిచ్చాడు. అన్ని బాధ్యతలు ఎత్తుకున్నా, నిలవనీడ మిగుల్చుకున్నాడు. రామారావులాగే నేనూ పుట్టాను. మరి నా అదృష్టం యిలా ఏడ్చిందేం? నాకు వుండి మీకు పెట్టకపోవటం కాదుకదా? నేనేదో చెయ్యలేదని బాధపడ్డా వుపయోగం లేదు. రిటైర్మెంటు డబ్బులుకూడా ఐపోవచ్చాయి. కొద్దిగా బిగబట్టి వుంచాను. నాలా నువ్వు సర్దుకు బతకాలనేం లేదు. అందరికీ ఆస్తులుండవు. మన కళ్లముందు ఏం వున్నాయో మనమే వెతుక్కోవాలి. దార్లో వున్న ముళ్ళు ఏరి పారేసి దాన్ని మనమే వెళ్ళి అందుకోవాలి. నీ జీవితానికి కర్తవీ కర్మవీ నువ్వే. మీ ఆయన్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఆ పని ఎంతలో జరుగుతుంది? మీ అమ్మలా మెతగ్గా వుండకుండా నోరుపెట్టుకుని బతికితే అన్నీ సాధ్యపడతాయి.
మీ మామతో మాట కలుపుతూ డబ్బూ అదీ ఏముందో ఏమిటో కూపీ లాగు. అత్తని మంచిచేసుకో. ఊరికే ఆ గదిలో పడుండటం కాదు. నిన్ను చూసి అగ్గగ్గలాడాలి వాళ్ళు. ఇలాంటివన్నీ ఆడాళ్ళు కూతుళ్లకి చెప్పాలి. ఖర్మ. మీ అమ్మకి ఆ తెలివి లేక నాకీ ఏడుపు. మీ పెళ్లై ఇప్పటికి నాలుగేళ్ళు. కాపురానికి పంపిస్తూ చెప్పాను, అన్నీ చక్కబెట్టుకోవే అని. ఇప్పటిదాకా ఏం చేసావు? గీత మాటలు నువ్వు వినడమేమిటే? వంటింట్లో నీ పనికి అడ్డొచ్చినప్పుడు విదిలించికొడితే నీ జోలికి మళ్ళీ వస్తుందీ? నీకు అనువుగా తనుండాలిగానీ, తనకి తగ్గట్టు నువ్వు సర్దుకోవడమేమిటి? ” నిలదీస్తున్నట్టు అడిగాడు. ఆమె తలదించుకుంది.
“ఇదో, గీత కొడుకుని ఎంత ఎత్తుకుని తిరిగినా నీ కొడుకవ్వడు. వాళ్లమ్మ కనిపించగానే దులిపేసుకుని వెళ్ళిపోతాడు. ఆ పిల్లతో మంచిగా వుంటే నీకు వొరిగేదేం లేదు. రామారావుకి యిద్దరు మేనల్లుళ్ళూ సమానమేగా, జాగా యిద్దరికీ కలిపి రాయచ్చుకదా? రాయలేదు. తెలివిగా కూతురిపేర్న పెట్టుకున్నాడు. వాళ్లకి లేని ప్రేమలూ, మొహమాటాలూ నీకెందుకు? వాసేదో ఇంటిఖర్చులు పెడుతున్నాడనుకునేవు, సీజన్లో చవగ్గా వచ్చినవి చూసి కొని పడేస్తున్నాడు. మిగతా ఖర్చంతా మీ అత్తదేగా? వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, మీ అత్తా, మామా. వచ్చే చుట్టాలు, వెళ్ళే చుట్టాలు. పెట్టకేం చేస్తాడు? మీ అత్తమీద పడి వాళ్ళు తిన్నప్పుడు మీరు తినడానికేం? నీలిమా! గొడవపెట్టుకుని ఎంత తొందరగా వాళ్ళని వెళ్లగొడితే నీకంత లాభం” అన్నాడు హెచ్చరికగా. నీలిమ అన్నీ చక్కగా వంటపట్టించుకుంది.
మాధురి పూర్తిగా తండ్రినోట్లోంచీ వుడిపడింది. తండ్రీకూతుళ్ళ ఆలోచనలు ఒక్కలా వుంటాయి. నీలిమ స్వంతహాగా చెడ్డదికాదుగానీ, తండ్రి, అక్క చెప్పే మాటలు వింటుంది. మానస స్వంతంగా ఆలోచిస్తుంది. ఐతే ఆమెది తనవాళ్లని బజార్నపడేసి, తనకేదేనా కలిసొచ్చేదుంటే వదులుకునేంత వుదారస్వభావం కాదు.
బారసాల వసంత్ యింట్లోనే జరిగింది. బారసాలలో గీత వంటిమీది బంగారంమీద పడింది కుటుంబరావు దృష్టి. ఆయన గీతకి సంబంధించిన ఏ చిన్నవిషయం వదిలిపెట్టట్లేదు. ఎక్కడ ఏ గొడవ సృష్టించవచ్చా అని వెతుక్కుంటున్నాడు.
“అవన్నీ బంగారమా, గిల్టువా? మీ అత్తగారివి పెట్టుకుని తిరుగుతోందా?” అతని ప్రశ్నలు.
“బంగారమే నాన్నా. ఆవిడవే. సగం పెళ్ళిలో పెట్టినవి, మిగతావి తరవాత చేయించుకున్నవి” అని నీలిమ లేచి అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
“పెళ్ళిలో పెట్టినవంటే? వీళ్ళ అత్తగారు పెట్టిందా? అలా ఎలా? ఇద్దరు కోడళ్ళున్నప్పుడు ఇద్దరికీ ఒక్కలానే పెట్టాలికదా? న్యాయం వుండద్దూ?” అన్నాడాయన.
“మీరడిగే ఆరాలకి జవాబులు చెప్పలేక చచ్చిపోతున్నాను. చెప్పకపోతే ఎక్కడేం నోరుపడేసుకుంటారోనని ఇంకో భయం. ఆ పిల్లకి పుట్టింటివాళ్ళు పెట్టారు. వియ్యపురాలేమీ ఎక్కువ పెట్టెయ్యలేదు. ఆవిడకో కూతురుందికదా, కోడళ్ళకెందుకు పెడుతుంది?” అంది కమలాక్షి.
“అదేమిటి? రామారావువాళ్లకి ఏమీలేదనికదా, మనం విన్నది?!” నిర్ఘాంతపోయాడు.
“లేదంటే? మనంత గతికడుక్కుపోయి ఎవరూ వుండరు” విసుగ్గా అంది.
“ఐనా తోటిపిల్ల మన నీలిమ మెళ్ళో వట్టి నానుతాడూ, చేతికి మట్టిగాజులతో తిరుగుతుంటే తనవో జత తీసిచ్చి వేసుకొమ్మనచ్చుగా? ఓ గొలుసు మెళ్ళో పడేయ్యచ్చుగా? అరిగిపోతాయా? అన్నీ తనే దిగేసుకుని తిరగడం దేనికి? ” అన్నాడు. పెళ్ళిలో లక్ష్మి కోడళ్ళిద్దరికీ సమానంగానే పెట్తింది. గీత జత గాజులడిగితే, నీలిమ సూత్రాలగొలుసు పెట్టించుకుంది.
“ఆ సౌడభ్యం ముందు మన పిల్లలో వుండాలికదా?” అనేసి అక్కడినుంచీ ఆవిడా లేచింది. ఆయన ఒక్కడూ మిగిలిపోయాడు. కంట్లో నలకలా గీతని మనసులో వేసుకుని.
మానస కూతురి బారసాల అయ్యాక నీలిమ వచ్చింది. కుటుంబరావు వెంటబెట్టుకుని వచ్చాడు. దించేసి వెళ్ళిపోయాడు. ఆమె ముఖంలో నైరాశ్యం, ఏదో కోల్పోయినతనం కనీకనిపించనట్టు. ఆమె కళ్ళముందు కొన్ని కలలశిఖరాలు కూలిపోయి కనిపిస్తున్నాయి. మొదట వేరుకాపురం పెడదామంది. ఆ వెంటనే వూరించినట్టు, వూరడించినట్టు ఇల్లు తమకి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత యిల్లే వునికిలో లేకుండా పోయి అపార్టుమెంట్లు కట్టాలన్న ఆలోచన వచ్చింది. అన్నీ క్షణంపాటు మెరిసి, మురిపించిన కలలు. ఎప్పటికీ సాధ్యపడవు. గీతకి దూరంగా కాదు, గీతతోనే కలిసి ఇదే యింట్లో. ఆమె వెలుతుర్లా, తను చీకట్లా. ఎప్పటిదాకా? ప్రశ్న వేధిస్తూ వుంటే ఏ పరిష్కారం దొరక్క నెమ్మదిగా తనని తను కూడదీసుకుని తండ్రి చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ దినచర్యలో పడింది.
మాటలమధ్యలో లక్ష్మితో అంది,
“అక్క అలా వెళ్ళిపోకుండా వుండాల్సింది” అని.
“దాని పుట్టింటికి అది వెళ్తే మీకేం బాధే? అదేమైనా పురుడుపోస్తుందా, బొడ్డుకోసి పేరుపెడుతుందా? పోనీ, మీ చెల్లెల్ని తీసుకురావద్దందా? ఇది నీయిల్లు కాదా? వాళ్ళకి నచ్చజెప్పి వప్పించుకునే బాధ్యత నీది కాదా? నీకు పనికి వొళ్ళొంగక దానిమీద నెపం వేస్తున్నావా?” కటువుగానే అడిగింది లక్ష్మి. నీలిమతో సున్నితం పనికిరాదని అర్థమైంది అప్పటికే.
“మీ వదిన వుండకుండా వెళ్ళిపోయినందుకు మరిదిగారికి కోపం వచ్చింది. ఒకవేళ మానసని ఇక్కడికి తీసుకొస్తే తనూ వుండి రీసీవ్ చేసుకుంటే బావుండేదికదా?” అత్తగారి దగ్గర చెల్లుబడి కాని మాటలని మాధవ్ దగ్గిర పేర్చింది నీలిమ.
“మానసని ఇక్కడికి తీసుకొస్తున్నట్టు ఎవరన్నారు? నాతోనే ఎవరూ అనలేదు, వదినకి ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? చెప్తే తనెందుకు వెళ్తుంది?” నిలదీసినట్టు అడిగాడు మాధవ్.
“వసంత్‍కి అవన్నీ తెలీవుకదా?” అందామె.
“మరైతే మీ నాన్న ఆ విషయం వసంత్ ముందు ఎందుకన్నాడు?”
“నాన్నకూడా బాధ వేసే అన్నాడు”
“అర్థంపర్థం లేకుండా మాట్లాడకు నీలిమా! వదిన పుట్టింటికి వెళ్తే మీ నాన్న బాధపడటమేమిటి? ఎవరి పనులమీద వాళ్ళు వెళ్లరా?”
“ఇంటికి ఎవరేనా వస్తుంటే అలా పట్టనట్టు వెళ్ళిపోతారా?”
“అదే అడుగుతున్నాను. ఎవరన్నారు, మానసని ఇక్కడికి తీసుకొస్తున్నారని? నాకుకూడా చెప్పలేదు నువ్వు?” మాధవ్ గద్దించాడు.
“రాదనైతే ఎవరూ చెప్పలేదుకదా?”
“ఊహాగానాలు చెయ్యడానికి ఎవరికీ అంత తీరికలేదుగానీ, చెయ్యడానికి ఏ పనీ లేకపోతే మరో వారంరోజులు వెళ్ళి మీ అమ్మకి తోడుగా వుండిరా. ఇక్కడ గొడవలు పెట్టకు” అన్నాడు విసుగ్గా.
“నేనా, గొడవలు పెడుతున్నది?” అని కళ్ళనీళ్ళు పెట్టుకుందామె. తను తల్లితో అన్నట్టే గీత విషయంలో జరగడం మాధవ్‍కి వింతగా అనిపించింది. ఎందుకు గీతని టార్గెట్ చేస్తున్నారు? ఎవరు? ఏమొస్తుంది? అప్పుడంటే సుధీర్ని కాదందన్న కారణం వుంది. ఇప్పుడేం వుంది?
గీత గొడవ అక్కడితో ఆగలేదు.
“నువ్వన్నది నిజం సుమతీ! గీత చాలా మారిపోయింది” అన్నాడు వసంత్ సుమతి యింటికి వెళ్ళి జరిగింది చెప్పి. బాధని అలా పంచుకోవాలనిపించి వెళ్ళాడు. సుమంత్ అక్కడే వున్నాడు.
“అరేయ్, మనమేం ఏ తప్పూ చెయ్యని మణిపూసలం కాదు. మన విషయాలేవీ బైటికి రావట్లేదు. గీత విషయంలో ప్రతిచిన్నదీ ఎందుకు చర్చకి వస్తోంది? మీ మామ పనిగట్టుకుని చెప్తేనేకదా, నీకు తెలిసింది? ఆయన కూతుళ్లలాంటిదికాదా గీత? ఎల్టీసీమీద వారంరోజులు పుట్టింటికి వెళ్తే అదో నేరంలా నీ దగ్గిర అనడం దేనికి? సరే, గీత తనకి పట్టనట్టు వెళ్లిపోయింది. ఆమె వెళ్తే వెళ్ళింది, మానసని తీసుకెళ్తానని నీలిమ ఎందుకు అనలేకపోయింది? స్వంతచెల్లెలే కదా? అలా అనే స్వతంత్రం ఆ అమ్మాయికి లేకపోయిందంటే నువ్వు తప్పుపట్టాల్సింది మాధవ్‍ని. మనకి తెలుసు, వాడుగానీ, పిన్నిగానీ అలాంటివాళ్లు కారు. మనిళ్ళలో ఇలా తీసుకెళ్ళడాలు కొత్తాకాదు. నీలిమలోనే ఆ ఆసక్తి లేదు. చూసావా, వాళ్ళమ్మాయిని తప్పుపట్టకుండా ఫోకస్ గీతమీదకి ఎలా మళ్ళించారో! ఇవన్నీ కుటుంబరాజకీయాలు. ఇలా చేస్తే ఏం వస్తుందో నాకైతే తెలీదుగానీ, మనం లొంగిపోతే ఎలారా?” అన్నాడు.
వసంత్ బుర్రకి పట్టిన తుప్పు వదిలిపోయింది.
మళ్ళీసారి గీత కలిసినప్పుడు విహీని ఎత్తుకుంటూ మనస్ఫూర్తిగా అన్నాడు, “వీడు అమ్మాయై వుంటే నీ చిన్నతనం మళ్ళీ చూసేవాళ్ళం” అని.
“అబ్బాయ్ గీత, అమ్మాయ్ వసంత్. మన ఆపోజిట్ వెర్షన్స్‌ని చూసుకుందాం. వాసు సరిగానే పుట్టాడ్లే” అని నవ్విందామె.
బెంగుళూరునుంచి వచ్చాక, గురుమూర్తి యింట్లో జరిగిన సంభాషణ గుర్తుతెచ్చుకుని, వాసు మాధవ్‍తో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాడుగానీ అదంత ప్రత్యేకంగా మాట్లాడే విషయంకాదని, సందర్భం వచ్చినప్పుడు అందర్లో కాకుండా విడిగా చెప్పాలని ఆగాడు. రోజులు ముందుకి సాగుతున్నాయి. వసంత్‍కి రెండోకూతురు పుట్టిన నెలన్నరకి సమీరకి కొడుకు పుట్టాడు. పద్మకీ, రాజశేఖరానికీ మానస యిక కంటికికూడా ఆనడం మానేసింది. వాళ్ళిద్దరి ప్రవర్తనకి భార్యతోపాటు వసంత్‍కూడా చాలా బాధపడ్డాడు.
“పోనివ్వండి. మగపిల్లాడు కావాలని వాళ్ళకి అంతగా వుందేమో! ఇంకోసారి చూద్దాం” తనే సర్దిచెప్పింది మానస.
మహతికి మొదటిసారి ప్రెగ్నెన్సీ నిలవలేదు. గీత తల్లడిల్లిపోయింది.
“గీతూ! మహీ యిప్పుడు నీ ఫ్రెండు కాదు, నరేంద్ర భార్య. ఎన్ని కష్టాలేనా వోర్చుకుని ఒక పిల్లని కనాలని నిర్ణయం తీసుకున్నారు భార్యాభర్తలు. మాధవ్ ఈ ప్రయత్నాలన్నీ గమనిస్తున్నాడు. మహీ రిజల్ట్సు చూసి వాళ్ళూ మొదలుపెడతారేమో! నువ్విలా బెంబేలుపడితే వాడు కన్ఫ్యూజౌతాడు” అనాడు వాసు.
“మాధవ్‍వాళ్ళా?” తెల్లబోయింది గీత.
“వాళ్ల పెళ్ళై నాలుగేళ్ళైందిగా?”
“ఇద్దరూ చిన్నవాళ్ళేగా?”
“ఇప్పటికిప్పుడు అనికాదు, కానీ ఆలోచనైతే వుంది. ముందు ఇంజక్షన్లు చేస్తారు. దాంతో రిజల్ట్ వస్తే సరే, లేకపోతే తప్పదు”
“ఏమో వాసూ! ఆ అమ్మాయితో ఏదేనా మాట్లాడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తను మాధవ్‍నితప్ప మనెవర్నీ ఓన్ చేసుకోలేదు. వాళ్ళ అమ్మానాన్నలూ, అక్కా, చెల్లెలూ అంతే. మొదట్లో కొంచెం పలికేది. ఇప్పుడైతే రోజంతా గదిలోనే వుంటుంది. పనంతా నేనే చేసుకుంటాను. సాయానికేనా రాదు. నేనేదో కష్టపడిపోతున్నానని కాదు, కలిసి చేసుకుంటే మా యిద్దరికీ చనువు పెరుగుతుందికదా? మాధవ్‍కీ తనకీ ఏవో విడిగా వండుతుంది. అలా చేస్తే అత్తకి కోపం. సాయంత్రం షటిల్ ఆడటానికి రమ్మంటాను, రాదు. నేర్చుకోవాలన్న కుతూహలంకూడా లేదు. ఇంక యిలాంటి విషయాలేం మాట్లాడతాను? నువ్వే మాధవ్‍తో మాట్లాడి తెలుసుకో” అంది.
మహతి విషయం మిగిలిన అందరి మనసుల్లోనూ కదుల్తుండటంతో యింట్లో ఒకరకమైన నిరుత్సాహం అలముకుంది. వాళ్ళంతా మహతిగురించి బాధపడుతున్నారనుకుంది నీలిమ. ఔను. తనగురించి ఎవరికి కావాలి? ఆమెకి కోపం వస్తోంది. తండ్రి చెప్పిన విషయాలు మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. భళ్ళున బద్దలయ్యే అగ్నిపర్వతంలా వుందామె పరిస్థితి. సంయమనంగా వుండటానికి చాలా కష్టపడుతోంది.
మామూలుగానే ఇంట్లో చిన్నచిన్న గొడవలు. గీత పక్కకి పక్కకి తప్పుకుపోతోంది. కానీ, పిల్లలు అల్లరిచెయ్యకుండా వుండరు. అందులోనూ విహంగ్ రాలుగాయి. ఆమె తలనొప్పని తలుపేసుకుని పడుక్కున్నా దగ్గిరకి వెళ్ళిపోతాడు. గడియపెట్టుకుంటే తలుపుదగ్గిర నిలబడి ఏడుస్తాడు. అది పెంకితనం కాదు. తను వెళ్ళాలనుకున్నచోటికి ఒక అడ్డు వుండటాన్ని వాడు అర్థంచేసుకోలేకపోతున్నాడు. అంత వయసులేక. అయిష్టం అనేది మొదలైతే ఆ మనుషుల్ని భరించలేకపోవటం, విసుగు, చికాకు ఒక్కొక్కటీ పుట్టుకొస్తాయి. గీతమీద పేరుకుపోయిన అయిష్టానికీ, తండ్రి నేర్పిన అసహ్యానికీ మధ్య పిల్లల్ని తూస్తోంది నీలిమ. ఏమీ తెలీని పసివాడికి నీలిమగురించి ఏం చెప్పాలో, యింట్లోనే వుండే మనిషికి ఎలా దూరంపెట్టాలో అర్థమవ్వట్లేదు లక్ష్మికి. కొన్నాళ్ళు వాళ్ళని దూరంగా పంపిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వస్తోందావిడకి.
చిన్నచిన్న మార్పులతో దినచర్య మొదలైంది ఆరోజు. బద్ధకంగా అనిపించి గ్రౌండుకి వెళ్లలేదు వాసు. మయూ, విహీ ఆడుకుంటున్నారు. అన్నదమ్ములిద్దరికీ అల్లరిలో వున్న సఖ్యత ఆటల్లో వుండదు.
పొద్దున్నే ఫోనొచ్చింది లక్ష్మికి. తులసి అత్తగారు. తులసికి వొంట్లో బాలేదట.
“కంగారేం లేదు. శుభవార్తే” అందావిడ నవ్వుతూ. లక్ష్మికి సంతోషం, దాన్ని పల్చగా కప్పేస్తూ చిన్న బాధలాంటి యిబ్బందీ కలిగాయి. మాధవ్‍కేసి సూటిగా చూడలేకపోయింది.
“తులసి అత్తగారి ఫోను. అది మళ్ళీ నీళ్ళోసుకుందట. నేనోమాటు వెళ్ళి చూసి, వాళ్ళు పంపిస్తే నాతో నాలుగురోజులు తీసుకొస్తాను” ఫోన్ పెట్టేసి నెమ్మదిగా అంది. అందరూ అక్కడే వున్నారు. మాధవ్ బైటపడలేదు. సంతోషాన్నే చూపించాడు. కానీ తెచ్చిపెట్టుకున్న ఆ సంతోషం వాసు దృష్టిని దాటిపోలేదు. గీతకూడా గమనించింది. నీలిమ అక్కడే వుంది. వెళ్లి మాధవ్ పక్కని కూర్చుంది. ఆమె గుండెల్లో అలజడి తీవ్రమౌతోంది. తుఫానుకిముందు వాతావరణంలా వుంది లోలోపల.
“ఈవేళ మరేం వండను. ఉన్నవే వేసుకుని తిందాం” అని గీతకూడా స్టౌకట్టేసి వచ్చి కూర్చుంది. లక్ష్మికూడా వచ్చికూర్చుంది. పిల్లలు చెప్పుకునే కబుర్లు వినడం ఆమెకి సరదానే. ఎప్పటెప్పటి విషయాలో చెప్పుకుంటూ ఒకళ్ల రహస్యాలొకళ్ళు బైటపెట్టేసుకుంటారు. ఆ క్షణందాకా అసలలా జరిగిందనికూడా ఆవిడకి తెలీదు. ఇంతల్లరి చేసేవాళ్ళా వీళ్ళని ఆశ్చర్యపోతుంది.
చాలారోజులైంది అలా కూర్చుని. మొదట్లో నీలిమ బాగానే వినేది. నలుగురుంటేనే అలాంటి మాటలు సాగుతాయి. తర్వాత్తర్వాత ఆ సరదామాటలు గీతావాసులకే పరిమితమైపోయాయి. ఒకళ్ళ భుజాన్ని మరొకరు తట్టుకుంటున్నట్టు వాళ్ళిద్దరే ఎంతకని చెప్పుకోగలరు? వాళ్ళిద్దరిమధ్యాకూడా ఎక్కువగా మౌనమే వుంటోంది. పక్కపక్కని కూర్చుని ఒకరి స్పర్శ మరొకరు ఆస్వాదిస్తూ, ఒకటీ అరా మాటలు చెప్పుకుంటారు. లేకపోతే చదివిన పుస్తకాల చర్చించుకుంటారు. సుమతి పుస్తకాలకి సమీక్షలు రాస్తుంది. సరిదిద్దమని వాసుకి పంపిస్తుంది. తను చూసాక గీతకి యిస్తాడతను. తిరిగొచ్చినకాగితాల్లో గీత సూచనలుకూడా వుంటాయని సుమతికి తెలుసు. గీత చేతిరాతతో వున్న ఒకటో రెండో పదాలని చేత్తో ప్రేమగా తడుముతుందామె. ఎందుకిలా చేసావు గీతూ అనుకుంటుంది. మనసు మూగవోతుంది. కొద్దిసేపే. మళ్ళీ ఆగ్రహజ్వాల రగులుకుంటుంది.
“ఇంత పిల్ల. నేను ఎత్తుకుని తిప్పేవాడిని. అప్పుడే దానికి యిద్దరు పిల్లలా?” అన్నాడు వాసు చెల్లెలిగురించి. మెల్లమెల్లగా కబుర్లు మొదలయ్యాయి.
“నేనుమాత్రం ఎత్తుకోలేదేంట్రా?” అన్నాడు మాధవ్.
“ఎన్నిసార్లు పడేసావురా దాన్ని?” అడిగాడు వాసు.
“అదసలు నా చేతుల్లో ఆగేదికాదు. పడ్డా దానికి దెబ్బలేమీ తగిలేవికాదుగానీ, నాకుమాత్రం పడిపోయేవి, వీపుమీద ” అన్నాడు మాధవ్.
“నీ పెద్దకొడుకేం తక్కువ తినలేదు. సైకిలు నేర్పిస్తానని నన్ను ఎన్నిసార్లు పడేసాడో!” అంది గీత లక్ష్మితో.
“మోపెడేసి కుచ్చెళ్ళున్న పరికిణీలు వేసుకుని సైకిలు తొక్కుతామంటే ఎలానే?” అడిగాడు వాసు నవ్వుతూ.
“వీడా సందుమొదట్లో సైకిలు పట్టుకుని నిలబడేవాడమ్మా, ఈవిడకోసం. రాడ్‍మీద ఎక్కించుకునేవాడు. ఒక్కోసారి వెనక నన్నూ ఎక్కమనేవాడు” అన్నాడు మాధవ్.
“ఏమే, నిజమా? నాకసలు తెలీనే తెలీదు. దగ్గిరేకదా, నడిచి వెళ్ళిపోతానని నాదగ్గిర నయగారాలు పోయేదానివి?” అంది లక్ష్మి.
“పిలిచి ఎక్కించుకుంటానంటే ఎక్కరేంటి?” అంది గీత.
“ఏం కాదమ్మా, దబాయించి ఎక్కేది. తల్లో బంతిపువ్వొక్కటే తక్కువ. మా ఇద్దర్నీ అలా చూసి, కూలికి రమ్మంటారేమోనని దారంతా భయపడేవాడిని” అన్నాడు వాసు.
“తనకోసం కాకపోతే అక్కడెందుకు నిలబడేవాడివిరా?” అడిగాడు మాధవ్. “ఒకసారి అలానే త్రిబుల్స్ ఎక్కాం. ముందు గీత, వెనక నేను, వీడు తొక్కడం. మెయిన్‍రోడ్డెక్కాక లారీ ఎదురొచ్చిందమ్మా! వీడు గట్టిగా కళ్ళుమూసుకుని హేండిల్ వదిలేసాడు. మేమిద్దరం పెద్దగా కేకలు పెట్టేసాం. లారీవాడు పక్కకి కోసుకుని వెళ్ళిపోయాడు. వీడు చేతులొదిలేసాడుకదా, చక్కగా పడ్డాం. అక్కడున్నవాళ్లంతా వచ్చి లేవదీసారు. ముందు మమ్మల్ని లేవదీసి, ఎవరి పిల్లలని అడిగి బాగా మేత పెట్టారు. వీళ్ళింటి సందు దగ్గిర వదిన్ని వదిలేసి, కాళ్లకీ చేతులకీ లేచిపోయిన చెక్కులు చూసుకుంటూ మేము యింటికొచ్చాం. భయపడిపోయి రెండురోజులు చాలా బుద్ధిగా మెసులుకున్నాం” అన్నాడు.
“అబ్బా! రెండురోజులే! మీకు ఆ రవిగాడే సరి! వాడైతేనా, బెల్టు తీసుకుని వుతికేసేవాడు. ఈ రామారావుకి నాన్నా, కన్నా అని బతిమాలడంతప్ప మరేమీ రాదు. భయంలేదురా, మీకు?” అని కొడుకుల్ని కోప్పడి, “ఐనా, నీకెంత సిగ్గులేదే? వాళ్లకి బుద్ధిలేదుసరే, నీ తెలివేమైంది? ఆడపిల్లవికాదూ?” అంది గీతని.
“ఎప్పుడో పడితే ఇప్పుడెందుకు తిడతావు? మా అమ్మ బానే తిట్టిందిలే. నాకన్నా ముందు ఆవిడకి వార్త వెళ్ళిపోయింది. చీపురుకట్ట పట్టుకుని వాకిట్లో నిలబడింది. మామ్మ అడ్డంపడకపోతే వాయించేసేది.
ఆడపిల్లవి, కాలో చెయ్యో విరిగితే ఏం చేసేదానివే? ఎవరూ పెళ్ళికూడా చేసుకునేవాళ్ళు కాదు- అని తిట్టింది. ఇంకా కొన్ని తిట్లు కనిపెట్టి మరీ తిట్టింది.
విరగ్గొట్టినవాడే చేసుకునేవాడు- అన్నాను.
అప్పుడూ, వీపుమీద వేడివేడి బొబ్బట్టు పడింది.
దేవుడిచ్చిన కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుని ఎవడో లారీవాణ్ణి చేసుకుంటానంటావేంటే- అని యింకో రెండు వేసింది. నేనేమో వాసుగురించి అంటే తనకలా అర్థమైందిమరి! ” అంది.
వాసు, మాధవ్ పగలబడి నవ్వేస్తే, నీలిమకికూడా ఎంత బిగబట్టుకున్నా నవ్వాగలేదు. లక్ష్మి నవ్వాపుకుంది. తల్లి ఆ విషయం తనకి చెప్పాక, గీతని వాసుకీ, మాధవ్‍కీ దూరం పెట్టడం మొదలుపెట్టింది.
“నీ కొడుకులిద్దరి అలుసూ చూసుకుని అది రౌడీలా తయారౌతోంది” అని తనని తిట్టిందావిడ.
“ఇక్కడిలాగామ్మా? సుధీర్‍వాళ్ళింటికెళ్తే ఆ మహారాణీగారు వాళ్ళిద్దర్నీ వదిలేసి నన్ను పట్టుకునేది. ఆవిడ సైకిలు తొక్కితే నేను వెనక కూర్చుని కాళ్లతో బ్రేకులు వెయ్యాలట. సుధీర్‍కి కాళ్లతో ఆపడం చేతనయ్యేదికాదు. అది బ్రేక్ వదిలేసరికి వీడు భయపడి కాళ్ళు పైకెత్తేసేవాడు. ఇద్దరూ కలిసి పడేవారు. సుమంతేమో కావాలని దాన్ని పడేసి తను తప్పుకునేవాడు. అందుకు అది నావెంటపడేది. నాలుగురౌండ్లు తొక్కేసరికి నా చెప్పులు సగం అరిగిపోయేవి” అన్నాడు వాసు.
“వాళ్లమ్మకూడా అలానే తిట్టేది, ఆడపిల్లవి భయం వుండద్దాని. మాకు మాత్రం సైకిళ్ళు తొక్కాలనుండదా?” అంది గీత.
“వాడన్నట్టు చీరల్తోటీ, పరికీణీవోణీలతోటీ ఎలా తొక్కుతారే?” అడిగింది లక్ష్మి.
“లేడీస్ సైకిల్ కొనివ్వచ్చుగా? ఒక్కటేనా మామధ్యని వుంటే మా సరదాకూడా తీరేది. ఎంతసేపూ ఆడపిల్లలు, పడతారు, దెబ్బలు తగులుతాయనేగానీ మాక్కూడా అవసరమని తెలీకపోతే ఎలా? అసలు వీళ్లకి పంచెలూ కండువాలూ పెట్టడం మానేసినప్పుడు మాకుమాత్రం చీరలెందుకు పెట్టడం? ఫాంటుగుడ్డలూ షర్టుగుడ్డలే పెడితే, మేమూ కుట్టించుకుని ఝాంఝామ్మని తిరిగేవాళ్ళం?” నిలదీసి అడిగింది. ఈవిడెప్పుడూ యిలానే మాట్లాడుతుందా అని మానస అడగడం గుర్తొచ్చింది నీలిమకి. వినేవాళ్ళుంటే ఎలాగేనా మాట్లాడచ్చునని చెప్పాలి యీసారి కలిసినప్పుడు- అనుకుంది.
“నీ కోడళ్ళకి అలానే పెడతాంలే, పళ్ళెంలో పసుపూకుంకాలతోపాటు ఫాంటు, షర్టుగుడ్డలు” అంది లక్ష్మి చిరుకోపంతో.
“ఆమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు వీళ్లంతా సుధీర్, సుమంత్‍ల ఫాంట్లూ షర్టులూ వేసేసుకునేవారమ్మా! ఒక్కొక్కసారి రాత్రి లేటైతే అలానే నిద్రపోయేవారు. గీతని మామయ్య ఎంతరాత్రైనా వచ్చి తీసుకెళ్ళిపోయేవాడుకదా, తను బట్టలు మార్చేసుకుని రెడిగా వుండేది, మణిపూసన్నట్టు. వెళ్తూవెళ్తూమాత్రం స్కెచ్చితో వాళ్లకి మీసాలూగెడ్డాలూ దిద్దేసి వెళ్ళిపోయేది. నల్లస్కెచ్చే అక్కర్లేదు, ఆకుపచ్చమీసాలూ, ఎర్రగడ్డాలూకూడా పెట్టేసేది. మాకు నవ్వాగేదికాదు. పొద్దున్న లేచాక చూడాలి, వాళ్లగొడవ” అన్నాడు వాసు. లక్ష్మి నుదురు కొట్టుకుంది.
“మళ్ళీసారి కలిసినప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకుని ముగ్గురూ వదిన్ని చితక్కొట్టేసేవారు” అన్నాడు మాధవ్ పకపక నవ్వి.
“ఏవో చిన్నచిన్న అల్లర్లు మావి. బుద్ధిమంతులం. చెప్పినమాటల్లా విన్నాం. ఎలా వుండమంటే అలానే వున్నాం” అంది గీత గొప్పగా మొహంపెట్టి.
“అబ్బా! అంతేం లేదు. మీగురించి మీరే చెప్పుకోవాలి” అన్నాడు మాధవ్.
“ఔనౌను. నదిలో యీతలూ, నది వొడ్డున సైకిలు రేసులూ, కాళ్ళూ చేతులూ కదుములు కట్టడాలూ మాకెక్కడివి?” దెప్పింది గీత. “అత్తా! ఎప్పుడేనా అందరం కలిసి కోటకి వెళ్తే మమ్మల్ని తిరగమని వదిలేసి వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయేవారు. గంటో అరగంటో గడిచాక కుంటుకుంటూ ఒకళ్ళూ, మోచేతులు చూసుకుంటూ ఒకళ్ళూ, హాచ్చిహాచ్చిమని తుమ్ముకుంటూ ఒకళ్ళూ, అమ్మా అప్పా అంటూ ఇంకొళ్ళూ. అబ్బో! చెప్పక్కర్లేదు. వింతవింత అవతారాల్తో వచ్చేవాళ్ళు” అంది లక్ష్మితో.
“మీగురించి అంటుంటే మాట తప్పించి మాగురించి చెప్తావేమే? తులసీ, వల్లీ, సమీరావాళ్ళూ బుద్ధిమతులను, వింటాను. అంత అల్లరేం చేసేవారు కాదు. వాళ్ళ లోకం వేరు. టికిలీలూ, రబ్బరుబాండ్లూ, గాజులూ కొనుక్కోవడం, ఒకళ్ళవి ఒకళ్ళకి చూపించుకోవడం, మార్చుకోవడం, పంచుకోవడంతో గుండాపిండీ అయ్యేవారు” అన్నాడు వాసు. మాధవ్ అస్సలు వప్పుకోలేదు.
“అందరూ అందరే. ఎవ్వరూ తక్కువవాళ్ళు కాదు. ప్రహీ జారుకునేవాడు. నేనూ వసంత్ బుక్కైపోయేవాళ్ళం. కంగన్‍హాల్స్ చుట్టూ వాళ్లని తిప్పడం, ముందు కొనుక్కోవడం, ఇంటికొచ్చాక బాలేవని మార్చి వేరేవి తెచ్చుకోవడం అదొక అంతులేని కథలా వుండేది. ఎవరేనా ఎర్రబొట్లు పెట్టుకుంటారు.వీళ్ళేంటో పదో పన్నెండో కుండల్లాంటి రంగురంగుల తిలకం సీసాలు ఒక ప్లేటుకి అతికించి వుండేవి, అవి కొనిపించుకునేవారు.
ఆకుపచ్చ బొట్టూ, నీలం బొట్టూ దేనికే? అవి పెట్టుకుని తిరుగుతావా? ఎబ్బే- అని తిట్టేది పద్మ పిన్ని. ఒకసారి వల్లి లిప్‍స్టిక్ తెచ్చింది. ముగ్గురూ ఇంతమందాన పెదాలకి పట్టించేసుకున్నారు. సమీరకి పడక అలర్జీ యిచ్చి, హనుమంతుడిమూతిలా వాచిపోయింది. కోతుల్రా బాబూ! మాయిద్దర్నీ ఏడిపించేసేవాళ్ళులే.
వీళ్ళంతా అల్లరిచెయ్యడం జన్మహక్కుగా అనుకుని పుడతారేంట్రా? ఈ తొమ్మండుగురి జుత్తులోంచీ పుట్టుకొచ్చింది పల్లవి. దాన్ని కంట్రోల్ చెయ్యలేక మామయ్యే చేతులెత్తేసాడు. అత్తైతే కొట్టేసేది. మయూ పుట్టకముందు ఒకసారి సుమంత్‍తో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను. బాగా ఏడ్చినట్టుంది, కళ్ళూ ముక్కూ ఎర్రగా వున్నాయి. ఇంకా ఎక్కెక్కిపడుతోంది. వాడి వొళ్ళో ఎక్కికూర్చుని,
నన్ను పెళ్లి చేసేసుకోరా. మీయింటికి వచ్చేస్తాను- అంది. వాడు తెల్లబోయాడు.
వీళ్ళిద్దరూ నన్ను బాగా కొట్టేస్తున్నార్రా! మా అమ్మనికూడా అమ్మమ్మ కొట్టేసేదట. నాన్న పెళ్ళి చేసుకున్నాక ఇంక వాళ్ళు నాన్నకి భయపడి కొట్టడం మానేసారు- అంది.
నువ్వేం చేసావే_ తెప్పరిల్లి అడిగాడు వాడు. అదేమో వుష్ట్రపక్షిలా వాడి పొట్టలో తలదూర్చేసుకుని కూర్చుంటే, కుసుమత్త చెప్పింది.
ఇంట్లో అద్దెకుండేవాళ్లకి ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకమ్మాయి నల్లగా వుంటుంది. ఆ పిల్ల మామ్మ, మేనత్తలు ఆ మాట పదేపదే అంటుంటే విన్న పిల్లసైన్యం దీని నాయకత్వంలో దాన్ని తెల్లగా చేద్దామని ప్లానేసుకుని, ఎవరూ చూడకుండా ఎక్కడో దాచిన తెల్లపెయింటు తెచ్చి దాని వంటికి పట్టించేసారట. వేసినప్పుడు బాగానే వేయించుకున్నా, ఆరుతున్నకొద్దీ పెయింటు బిగుసుకుపోయి మంటెక్కడం మొదలుపెట్టేసరికి ఆ పిల్ల కుయ్యోమొర్రోమని ఏడుపు అందుకుంటే అందరూ వచ్చి చూసుకుని, మొత్తానికి కిరసనాయిలూ, థిన్నరూ వాడి పిల్ల వంటిమీది పెయింటు వదలగొట్టి, డాక్టరుదగిరకి పట్టుకెళ్ళారట. మిగతా అందరు పిల్లలకీ వీపులమీద వడ్డింపులయ్యాయి. సూత్రధారి యిదని అత్తావాళ్ళు గ్రహించి ఇంకోనాలుగు ఎక్కువ వేసారట.
ఎందుకేనా మంచిదని, చిన్నపిల్లలు పెళ్ళి చేసుకుంటే పోలీసులు ఎత్తుకుపోయి బేడ్ చిల్డ్రన్స్ హాస్టల్లో వేస్తారు, అక్కడ పిల్లలూ పోలీసులూకూడా కొడతారని బాగా భయం చెప్పి, నాలుగు చాక్లెట్లు లంచంకూడా ఇచ్చి వచ్చాం” అన్నాడు మాధవ్.
“దాన్ని ఎవరం దార్లో పెట్టలేకపోతున్నాం. గీతే అనుకుంటే గీతని మించి అల్లరి చేస్తోంది. ఇప్పుడు కాస్త దార్లో పడింది” అంది లక్ష్మి.
“తిడితే దాన్ని తిట్టు. మధ్యలో నన్నంటావేం? నేనేం అల్లరి చేసానూ? ఎప్పుడేనా సర్దాపడి కాస్త చేద్దామన్నా ఈయనగారు చెయ్యనిస్తేనా? ప్రైవేట్లు చెప్పేవాడు. ఏదో అంత పొడుగుమనిషి, తలొంచుకుని నాతో చెప్తుంటే వినకపోతే బావుండదని బుద్ధిగా వుండేదాన్ని” అంది గీత. “అదైతే నిజంగా రాక్షసే. మయూ పుట్టాక నా దగ్గిరకొచ్చి, వాడిని ఎందుకు మింగేసావ్? నువ్వేమైనా బ్రహ్మరాక్షసివా- అనడిగింది.
నువ్వు అల్లరి బాగా చేస్తున్నావు. నిన్నూ మింగేస్తాను- అన్నాను.
అంతా వట్టి గేస్. మా నాన్న చెప్పాడు. మేం నీనోట్లో పట్టం- అని వెక్కిరించి పోయింది” అంది తనే.
“అదామ్మా? పెద్దరౌడీ” అన్నాడు వాసుకూడా. “హడిలిపోతున్నారు అత్తా మామయ్యాను. గమ్మత్తేంటంటే వీణా, అర్చనా దాని వెంట తిరగడం. వారంరోజులకిందట, వాళ్ళు ముగ్గురూ రవిమామయ్య యింట్లో లేని టైములో, అత్త నిద్రపోతుంటే ప్లాన్ చేసుకుని బైకు తీసుకుని బైటపడ్డారట. కాస్తదూరం వెళ్ళగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి, ముగ్గుర్నీ దింపేసి, బైకు తాళం తీసేసుకుని మీ పెద్దవాళ్లని తీసుకురండని తిప్పిపంపించాడట. బాబాయ్ వెళ్ళి బైకు తీసుకొచ్చి, కోపంతో ముగ్గుర్నీ తలో బెడ్రూంలోనూ పడేసి తాళం పెట్టి రోజంతా ఇలాగే వుండండని పనిష్‍మెంటు ఇచ్చాడట. వాళ్ళు కాసేపు వూరుకుని కిటికీలదగ్గిర చేరి ఒకళ్ల తర్వాత ఒకళ్ళు మొదలెట్టి,
రారా! కరుణమాలినారా! ప్రియతములారా! కర్ణకఠోరంగా పాడటం మొదలెట్టేసరికి, ఆగోల భరించలేక పక్కవాటావాళ్ళు వచ్చి, విషయం ఏమిటో తెలుసుకుని బాబాయ్‍కి నచ్చజెప్పి, విడిపించి వెళ్ళారట” అన్నాడు వాసు. నవ్వులతో ఇల్లు హోరెత్తిపోయింది.
“భలే సింకౌతారు వాళ్లు ముగ్గురూను” అన్నాడు మాధవ్.
“ఇద్దరు పిల్లలు పుట్టారుగా, పెద్దవాళ్ళ భయాలేమిటో మీకూ తెలుస్తుందిలే!” అంది లక్ష్మి కాస్త సద్దుమణిగాక. సంభాషణ సినిమాలమీదికీ, పుస్తకాలమీదికీ మళ్ళింది. నీలిమ అప్పుడూ మౌనంగానే వుంది.
“నువ్వేం మాట్లాడవేంటి నీలిమా? అంత బుద్ధిమంతురాలివా?” అడిగాడు వాసు నవ్వుతూ.
“ముగ్గురం ఆడపిల్లలంకదండీ, పెద్దగా ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. ఇల్లూ, కాలేజీ అంతే. ఎప్పుడేనా పంపిస్తే సినిమాకి వెళ్ళేవాళ్లం” ముక్తసరిగా జవాబిచ్చింది. గీతకన్నా తను చాలా పద్ధతిగా పెరిగినట్టు అనిపించింది ఆమెకి. మాధవ్ వీళ్ళపక్కని చేరి పనీపాటా లేనట్టు ఈ సోదికబుర్లు చెప్పుకోవడం అస్సలు నచ్చలేదు.
“వాళ్ళకి వార్తలూ, రీకేప్‍లూ ఇవే” అని అక్కచెల్లెళ్ళు ముగ్గురూ వీళ్ల వెనకాల చులకనగా నవ్వుకుంటారు.
“మీ కజిన్స్‌కూడా చాలామందే వున్నారుకదే? చెప్పెయ్యమ్మా! ఇక్కడెవరూ చొక్కం కాదు” అన్నాడు మాధవ్.
“వాళ్ళు మాతో పెద్దగా కలిసేవాళ్ళు కాదు. అత్తల పిల్లలూ, పెద్దనాన్నలపిల్లలూ కలిసి తిరిగేవాళ్ళు” అంది. ఆ కారణాలు ఆమెకి తెలుసు. లేక కొంతా, లోభత్వంచేతకొంతా కుటుంబరావు పిల్లలకి అత్యవసరానికికూడా డబ్బులు యిచ్చేవాడు కాదు. అందరివీ అంతంతమాత్రం సంసారాలే ఐనప్పుడు, ముగ్గురు పిల్లలకి ఖర్చులు పెట్టి ఎవరు తిప్పుతారు? దూరానికి అదే కారణం. అందరికీ కూడాఅర్థమైంది.
“సర్లె. పెళ్ళికి ముందు ఏదో వున్నారు, ఇప్పుడలాంటిదేం లేదుకదా? నలుగుర్లోకీ వెళ్లడం నేర్చుకో” అంది లక్ష్మి. తలూపి నీలిమ లేచి తమగదిలోకి వెళ్ళింది. ఆవిడ నిట్టూర్చింది.
“ఇవాళ ఎవరూ ఆఫీసులకి వెళ్ళరా, తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు? మీయిద్దర్లో ఒకరొచ్చి నన్ను బస్సెక్కించండి. సాయంత్రానికో, రేపటికో వచ్చేస్తాను” అంది మాటమార్చి.
“నేనెక్కిస్తాలే. నువ్వు తయారవ్వు. అట్నుంచీ ఆఫీసుకి వెళ్ళిపోతాను” అన్నాడు వాసు.
“మరి వీడే? నాతో తీసుకెళ్లనా?” విహీగురించి అడిగింది.
“నీళ్ళలో బాగా ఆడుతున్నాడు. రొంపచేసింది. జ్వరం వస్తుందేమో! వాడొద్దులే, నేను లీవు పెడతాను” అంది గీత.
లక్ష్మి ప్రయాణపు ఏర్పాట్లలో పడింది. మాధవ్ వాళ్ళ గదిలోకి వెళ్ళబోతుంటే వాసు అతన్ని చెయ్యిపట్టుకుని పెరట్లోకి తీసుకెళ్ళాడు, మాట్లాడుకుందామని. గురుమూర్తి యింట్లో జరిగిన సంభాషణ చెప్పి,
“అరేయ్, ఎందుకురా, అలా దివాలాదాసులా తిరుగుతున్నావు? మనింట్లో మరీ చిన్నవయసుల్లో చేసేస్తున్నారుగానీ, అసలిప్పుడు పాతికలు దాటితేగానీ అమ్మాయిలే చేసుకోవట్లేదు. మీకేం వయసైపోలేదు. చిన్నవాళ్ళేకదా? మహీ రిజల్ట్స్ రానివ్వు. డబ్బుకికూడా నువ్వేం టెన్షను పడకు. మేం సర్దుతాం. నిన్నిలా వదిలేస్తామేమిట్రా?” అన్నాడు ప్రేమగా.
మాధవ్ వాసు చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు.
“థేంక్స్‌రా వాసూ! ఐనా పిల్లల్లేకపోవడం అంత నేరమేంట్రా? మహీ కష్టపడ్డం చూస్తూ, నీలిమతో ఆ విషయం ఆ విషయం అనలేకపోతున్నాను. పిల్లలకోసం మనమేదో తొందరడుతున్నట్టుండదా? వాళ్లవైపునించీ ప్రస్తావన వస్తే ముందుకి వెళ్ళచ్చని ఆలోచిస్తున్నాను. అమ్మేమో మా యిద్దర్నే నిర్ణయించుకోమంది” అన్నాడు.
“వాళ్ళు అనకపోవచ్చు మాధవ్. డబ్బుతో ముడిపడి వున్న విషయంకదా? నీలిమ మనసులో ఏం వుందో నువ్వే తెలుసుకోవాలి. ఇష్టపడి పెళ్ళిచేసుకున్నావు, ఆ యిష్టంతోటే తనకేం కావాలో తెలుసుకో. ప్రేమ మనసులో వుంటే చాలదు. పైకికూడా చెప్పాలి. నువ్వేమనుకుంటున్నావో ఓపెన్‍గా మాట్లాడు” అన్నాడు వాసు.
“మరోటి. ఇద్దరం హెల్దీగా వున్నామని డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ అవసరమా, ఇంకొన్నాళ్ళు చూద్దామనికూడా అనిపిస్తోంది. నాకే స్పష్టత లేనప్పుడు బైటికేం అంటాను? వదినైతే ఇలాంటివి బాగా హేండిల్ చెయ్యగలదు. అంటించినా, అంటుకట్టినా తనే” అన్నాడు మాధవ్.
“మరలాంటప్పుడు తనతో బాగా వుండాలికదరా?” అడిగాడు వాసు. బిగుసుకున్న ముడిని నెమ్మదిగా యిప్పుతున్నట్టుంది అతనిగొంతు. తమ్ముడి ముఖంలోకి నిశితంగా చూసాడు. గతుక్కుమన్నాడు మాధవ్. ఆరోజు జరిగినగొడవ తెలిసిందా, వీడికి అనుకున్నాడు.
“ఇద్దరూ బానే వుంటార్రా. వదిన వుద్యోగం చేస్తుంది. నీలిమ యింట్లో వుంటుంది. ఇద్దరికీ కామన్ టాపిక్సేం వుంటాయి?” అన్నాడు తమాయించుకుని.
“అమ్మతోకూడా పెద్దగా కలవదు?”
“అలాంటిదేం లేదురా! అందరం ఎక్కడివాళ్ళం అక్కడికి వెళ్ళిపోయాక యింట్లో వుండేది వాళ్ళిద్దరేకదా? కలివిడిగా లేకుండా ఎలా వుంటారు? ఈ విషయంలోనే కాస్త దిగులు. అంతే”
“అలాగైతే సరేననుకో! ఇద్దరాడపిల్లలు యింట్లో వుండి పక్కపక్కకి తప్పుకుంటూ తిరిగితే ఎలారా? చక్కగా ఇద్దరూ ఫ్రెండ్లీగా వుండచ్చుకదరా? తోటికోడళ్లుగాబట్టి యిలానే వుండాలని వీళ్ళేమైనా డిసైడయ్యారా అని డౌటు “
“అంతేం ఆలోచించకురా! ఆడపిల్లల పాలిటిక్స్. వాళ్ళు ముగ్గురూ కలిసి పట్టు బిగిద్దామని చూస్తే నీ పిల్లికూన దొరకదు” నవ్వుతూ అని లేచాడు మాధవ్.
“తంతానొరేయ్” బెదిరించాడు వాసు.
మాధవ్ నవ్వులో పూర్తి జీవం లేదు. తనన్నవి నిజంకాదని అతనికి తెలుసు. నీలిమలో గీతపట్ల అసూయ వుంది. దాన్ని తను తొలగించలేకపోతున్నాడు. ఆరోజు జరిగిందేకాక యింకా ఏవైనా గొడవలు జరిగాయా? వాసు దృష్టికి వచ్చాయా? ఏవీ పెద్దవి కాకపోవచ్చు. కానీ స్పర్థ అనేది నిప్పురవ్వలాంటిది. ఒకటి మరోదాన్ని ముట్టిస్తుంది.
లక్ష్మి భర్తకి విషయం చెప్పేసి, వచ్చి, తయారై కేకేసింది.
“నీలిమా! నేను బయల్దేరుతున్నాను. నువ్వూ, గీతా యిల్లు జాగ్రత్తగా చూసుకోండి. మామయ్యగారికి అన్నీ వేళకి చూసి నువ్వే యివ్వు. విహీతో దానికి చెయ్యివీలవదు” అని అప్పగింతలు పెట్టి బయల్దేరింది. నీలిమ యివతలికి వచ్చింది. లక్ష్మి తయారవ్వడం చూసి, విహీ ఏడుపు మొదలెట్టాడు. గీత వాడిని తీసుకుని పక్కకి వెళ్లింది. వాసు తల్లిని బైక్‍మీద ఎక్కించుకుని కదిలేదాకా చూసి, లోపలికి వచ్చారు మాధవ్, మయూ. గుమ్మంలో నిలబడింది నీలిమ. మాధవ్ నీలిమతో కలిసి వాళ్లగదిలోకి వెళ్తే గీత మయూని తయారుచేసి స్కూలుకి పంపించింది. తనూ వెళ్తానని ఏడుస్తున్నాడు విహీ.
“చిన్నాడెందుకో ఏడుస్తున్నాడు. వెళ్ళి తీసుకురా!” అన్నాడు మాధవ్.
“లేచినదగ్గర్నుంచీ అలా దేనికో ఒకదానికి ఏడుస్తునే వుంటాడు” అంది నీలిమ చులకనగా. ఆమె వెళ్లదని అర్థమైంది అతనికి. తనే వెళ్ళాడు.
“ఇటివ్వు వదినా! అలా తిప్పి తీసుకొస్తాను” అని తీసుకున్నాడు. ఇద్దరూ బైటికి వెళ్ళారు. ఇల్లంతా ఖాళీగా, మనసంతా గుబులుగా అనిపించింది గీతకి. వాసుకి ఫోన్ చేసింది. అతను అప్పుడే ఆఫీసుకి వచ్చాడట.
“పనేం లేకపోతే లీవుపెట్టి వచ్చెయ్యకూడదూ?” అడిగింది.
“ముఖ్యమైన ఫైల్సున్నాయి గీతూ! మధ్యాహ్నానికి వచ్చేస్తానేం?” అన్నాడతను. ఆమె సరేనని పెట్టేసింది.
బైకుమీద విహీని రెండు రౌండ్లు తిప్పాడు మాధవ్. వాడు ముందు కూర్చుని ఏవో చూపిస్తూ కేరింతలు కొడుతుంటే సరదాగా అనిపించింది. ఏవేనా బొమ్మలు కొందామని షాపుకోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. పార్కు కనిపిస్తే ఆపి లోపలికి తీసుకెళ్ళాడు. ఉయ్యాలలో కూర్చోబెట్టి వూపాడు. మెర్రి గో రౌండులో గుండ్రంగా తిప్పాడు. కాసేపయ్యాక దిగి విహీ అటూయిటూ పరుగులుపెడుతుంటే వాడివెంట తనూ తిరిగాడు. ఈ గంటసేపట్లో వాడు కేరింతలు కొట్టడమేతప్ప ఒక్కమాటకూడా అనలేదన్న విషయం స్ఫురించి చురుక్కుమంది. ఎందుకు వీడింకా మాట్లాడట్లేదు? కంగారుగా అనుకున్నాడు. పేరుపెట్టి పిలిస్తే తలతిప్పి చూసి నవ్వుతున్నాడు. చెవులదగ్గిర చిటికెలు వేస్తే ఎటు వేస్తే అటువైపు తిరిగి చూస్తున్నాడు. వెనక నిలబడి ఈల వేస్తే తలపైకెత్తి చూస్తున్నాడు. పక్షుల అరుపులకోసం వెతుక్కుంటున్నాడు. సాధారణంగా మాటలురాకపోవడానికి వినికిడితో సంబంధం వుంటుంది. ఆ సందేహం తీరిపోయింది. మరింక మాటలెందుకు రాలేదు? కేరింతలు కొడుతున్నప్పుడు గొంతు వినసొంపుగానే వుంది తప్ప వికృతంగా లేదు. కలకల కిలకిల నవ్వుతున్నాడు. మరి? వాసుతో అనాలనుకున్నాడు. అంతకన్నాముందు జోని అడగడం మంచిదనిపించింది. గంటయ్యాక ఇద్దరూ తిరుగుప్రయాణమయ్యారు.
గేటు దగ్గిరకి రాగానే వాడు దిగనని మారాము మొదలుపెట్టాడు.
“అరేయ్, ఇవేం బేరాల్రా? నాదగ్గిర కుదరవు నాన్నా!” అని నవ్వుతూ ఎత్తుకుని తీసుకొచ్చి గీతకి అప్పగించాడు.
“ఒక్కదానివే ఏం చేస్తున్నావు? అక్కడికి వచ్చి కూర్చోకూడదూ?” అడిగాడు, నీలిమని ఇవతలికి రమ్మన్నా రాదని.
“పనుంది”అని,కొడుకు చెయ్యిపట్టుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. తోటికోడళ్ళిద్దరిమధ్యా పేరుకున్న వైరాన్ని ఎలా తొలగించాలో అర్థంకావట్లేదు మాధవ్‍కి. వాసు అన్నట్టు యింట్లో యీ యిద్దరూ బిగుసుకుపోయి వుండటం కాస్త చికాగ్గానే వుంది.
అంతసేపు అందరితో సమానంగా కూర్చుని మాట్లాడటమే చిరాగ్గా అనిపించింది నీలిమకి. చెప్పడానికి తనదగ్గిర ఒక్క విశేషమూ లేకుండా వాళ్లంతా ఏవేవో చెప్పుకుంటుంటే విని వాళ్లతో కలిసి నవ్వటం స్టేజిషో జరుగుతుంటే విదూషకుడి చేష్టలని చూసి నవ్వినట్టు అనిపించింది. అంత వైవిధ్యం ఏమిటి, గీత జీవితంలో అని నివ్వెరపాటుకూడా కలిగింది. గీతతోపాటు మరోముగ్గురుకూడా వున్నారనీ, వాళ్ళకీ ఎంతోకొంత వైవిధ్యం అంటుకునే వుంటుందనీ ఆమె అనుకోవట్లేదు. మాధవ్ విహీని తీసుకుని తనకి చెప్పనేనా చెప్పకుండా వెళ్లటం కోపం తెప్పించింది.
“ఎక్కడికి వెళ్లిపోయారు ఇంతసేపూ?” రాగానే మాధవ్‍ని నిలదీసింది.
“వీడినలా తిప్పి తీసుకొద్దామని బయల్దేరాను. ఏదేనా బొమ్మ కొందామనిపించింది. షాపుకోసం చాలా దూరం వెళ్ళాం. కనిపించలేదు. పార్కుకి తీసుకెళ్ళి ఆడించి తీసుకొస్తున్నాను” అన్నాడు.
“నన్నూ రమ్మనచ్చుగా?”
“ముందు అనుకోలేదు నీలూ!”
“అనుకున్నాకేనా వెనక్కి రావచ్చుకదా?”
అతను నవ్వేసాడు. “లా చదవడానికి బాగా పనికొస్తావు” అన్నాడు.
“అందరం కూర్చుని చాలాసేపే మాట్లాడుకున్నాంకదా? మళ్ళీ పక్కకెళ్ళి అన్నదమ్ములిద్దరూ ఏం రహస్యాలు మాట్లాడుకున్నారు?”
“మామూలు విషయాలే”
“ఈవేళ ఆఫీసుకి వెళ్ళాలా? ఉండిపోకూడదూ?”
“రెండు మీటింగ్స్ వున్నాయి నీలూ! అవి అవగానే వచ్చేస్తాను. ఒక్కదానివే గదిలో కూర్చునేబదులు వదినతో మాట్లాడచ్చుకదా?” మృదువుగా అడిగాడు.
“ఏముంటాయి ఆమెతో మాటలు? అంతగా ఏమన్నా వుంటే ఆమెనే వచ్చి మాట్లాడమనండి” అంది పుల్లవిరుపుగా. అతనింక తర్కించలేదు. తయారై ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఆమె మళ్ళీ గదిలోకి వస్తూ, వంటింటిద్వారంలోంచీ చూసేసరికి అంతదూరాన్న అటువైపు తిరిగి కనకాంబరం మొక్కలమధ్య గీత కనిపించింది. పువ్వులు కోస్తున్నట్టుంది. వంగుని పూలు కోస్తుంటే పక్కకి వేలాడుతున్న ఆమె జడ రబ్బర్‍బేండు వూడదీసే ప్రయత్నంలో వున్నాడు విహీ. ఆమెనే చూస్తూ నిలబడింది నీలిమ. మనసులో భగ్గుమంటున్న జ్వాల. ఎంతకాలం తనీమెతో? పిల్లల్లేని బాధ ఎలాగా వుంది. బతుకుకూడా తనస్థాయిని దిగి బతుకుతోంది. కాలక్షేపం లేదు. ఎక్కడికెళ్ళాలో ఏం చెయ్యాలో తెలీక గదిలోపడి మగ్గిపోతోంది. దారీతెన్నూ తోచకుండా వుంది. ఇప్పుడిక తులసికూడా తయారౌతుంది తన ప్రాణానికి.
పెళ్లైనప్పట్నుంచీ తండ్రిపోసిన ఆజ్యానికి ఆమె అసూయ, అసహనం తోడై జ్వలించిపోతోంది. ఆయన తగిలించిన అద్దాలు కాసేపు అద్దాలుగా వుండి కాసేపు తామే కళ్ళలాగా మారిపోతున్నాయి. ఆ రంగుటద్దాలలోంచీ చూస్తుంటే గీత వికృతంగా కనిపిస్తోంది. కనకాంబరాలు తెంపడం అయ్యి, తల్లీకొడుకులిద్దరూ ఇవతలికొచ్చారు. గదిలోకి వెళ్ళిపోదామనుకుంటూ మళ్ళీ ఆగింది.
విహీ తల్లి కాళ్లకి అడ్డంపడుతూ నడుస్తున్నాడు. “సరిగ్గా నడూ. అలా తిప్పుకుంటూ నడిస్తే పడిపోతావు” అందామె.
అంతెత్తునించీ వినిపించిన మాటలకి తల పైకెత్తి చూసాడు. “పైకి చూస్తూకూడా నడుస్తావా? ఇహ సరే!” అంది నవ్వి. మయూతోకూడా అలానే మాట్లాడేది. నీ తింగరిమాటలు వాడికీ వస్తున్నాయనేవాడు వాసు. నీలిమకూడా ఫక్కుమనబోయి ముక్కు నులుముకుంటూ బలవంతంగా ఆపుకుంది. నవ్వితే? స్పర్థలు తొలగితే? తరువాతి పరిణామాలు వేరేగా వుండేవి. ఒక్క ప్రాణంగా పెరిగిన అన్నదమ్ములు, ముగ్గురు ప్రాణస్నేహితులు రెండు వేరువేరు కుటుంబాలుగా విడిపోయేవారు కాదు. ఒక మడుగులో పుట్టిన వూట అక్కడక్కడే విస్తరించకుండా రెండు భిన్నమైనదారుల్లో ప్రవహించడం వుండేదికాదు.
నడుస్తూ హఠాత్తుగా ఆగిపోయింది గీత. మనసునిండా దు:ఖం, భయం. కొద్దిరోజులుగా ఆమెని వెంటాడుతున్నాయి. బైటికి అనడం పేరుపెట్టినట్టౌతుందని ఆగిపోయింది. వాసేనా లక్ష్మేనా గుర్తించాడో లేదో తెలీలేదు. ఈ వయసుకి మయూ వాగుడుకాయలా వుండేవాడు, వచ్చిన కొన్నిమాటలే పదేపదే వల్లెవేసేవాడు, వీడికింకా మాటలు రాలేదేంటి? అత్త, తాత, అమ్మ, నాన్న అని చిన్నపదాలు అంటునే వుంటారు ఎవరో ఒకరు. విని పెదాలు కదుపుతాడుగానీ పైకి అనడు. చాలా బెంగగా అనిపించింది గీతకి. నూతిపక్కని బిందె పెట్టుకోవడానికి వుండే చిన్నగద్దెమీద కూర్చుంది. వాడిని వళ్ళో కూర్చోబెట్టుకుని నెమ్మదిగా మాటలు మొదలుపెట్టింది.
“ఈవేళ సెలవుపెట్టావేమ్మా, గీతా?” కంచుగంటలా రుక్మిణమ్మ గొంతు వినిపించడంతో వెనక్కి తప్పుకుంది నీలిమ. వాళ్లమాటలు వినపడేలా నిలబడింది. వాళ్ళ మాటల్లో తులసిగురించి చెప్పుకుంటారని తెలుసు. ఏం చెప్పుకుంటారోనని కుతూహలం.
“పొద్దున్నే లక్ష్మి ఎక్కడికో వెళ్ళినట్టుంది. వీడికోసం పెట్టావా సెలవు? మీ తోడికోడలు లేదూ? పోనీ మాయింట్లో వదిలేసినా చూద్దును” అంది.
“అత్త తులసిదగ్గిరకి వెళ్ళింది. వీణ్ణీ తీసుకెళ్తానందిగానీ, జలుబుగా వున్నాడని నేనే వద్దన్నాను” అంది గీత. ఆవిడతో మాట్లాడుతుంటే కాస్త దిగులు తీరినట్టనిపించింది. వాళ్ళింటికి కాసేపు వెళ్ళికూర్చుందామనిపించింది.
“దేనికే, అంత పొద్దున్నే?” కుతూహలంగా అడిగింది.
“మళ్ళీ వుయ్యాలలూ, జోలపాటలూ” నవ్వుతూ అంది.
“నిజంగానే?” ఆవిడ ఆశ్చర్యపోయింది. “ఆడపిల్లలు ఎంతలో పెద్దౌతారే? దాని చదువు మళ్ళీ చెట్టెక్కినట్టేనా?” అంది తనూ నవ్వుతూ.
“ఇంటరైతే అయిందికదత్తా! మా ఎవ్వరివల్లా కాలేదు తులసిచేత చదివించడం. వాళ్లాయన సాధించాడు”
“కనకాంబరాలు కోసినట్టున్నావు, ఇటివ్వు. మా దొడ్లోనూ విరగపూసాయి. మరువంకూడా గోళెం నిండిపోయింది. అన్నీ కలిపి కడతాను” అంది రుక్మిణమ్మ. గీత పూలబుట్ట ఆవిడకి యిచ్చింది. వరసగా మూడిళ్ళు. రుక్మిణమ్మది మధ్యది. అటూయిటూ సంధానకర్త ఆవిడ. అందరిళ్లలోనూ కనకాంబరం, మల్లె, చామంతి, జాజి, డిసెంబరంపూల మొక్కలున్నాయి. ఇవికాక దేవుడి పూజకి మందార, నందివర్ధనం, నిత్యమల్లె. వానాకాలం వచ్చింటే అన్నిళ్ళవాళ్ళూ ఒకటోరెండోపాదులు ఎక్కిస్తారు. పువ్వులు, ఆనపకాయలు, చిక్కుడుకాయలు, కరివేపాకు, పొట్ల, బీర, దొండకాయలు కాపునిబట్టి గోడలమీంచీ దాటి తిరుగుతుంటాయి. ప్రహరీగోడమీద పెట్టి కేకేస్తే విని, ఎవరి వీలునిబట్టి వాళ్ళు తీసుకుంటారు. తీరిక వున్నప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. మూడిళ్లమధ్యనీ దెబ్బలాటలు, మొహం తిప్పుకోవటాలూ లేవు.
కాసేపు ఇద్దరూ నిలబడే మాట్లాడుకున్నాక ఆవిడ అంది.
“మాధవ్‍కికూడా ఒక్క పిల్లో పిల్లాడో పుట్టేస్తే వెల్తి లేకుండా వుండేది” అని.
“పుడతార్లే అత్తా! ఇద్దరూ ఇంకా చిన్నవాళ్ళేకదూ?” గీత జవాబిచ్చింది.
నీలిమకి భగ్గుమనిపోయింది. అసలే మనసులో అనుమానం వుంది, వీళ్లంతా తనవెనక అనుకుంటారని. ఇప్పుడది రుజువైందనుకుంది. ఆపైన గీతతో గొడవ పెట్టుకుందుకు నెపంకోసం వెతుకులాడుతోంది. తండ్రి అమర్చిన కళ్లద్దాలు అసలు కళ్లలా మారిపోగా దురుసుగా ఇవతలికి వచ్చింది. ఆమె వచ్చేలోపల భర్త పిలుస్తున్నాడని రుక్మిణమ్మ వెళ్ళింది.
“అడ్డమైనవాళ్లతోటీ ఇంటివిషయాలు ఎందుకు మాట్లాడతారక్కా, మీరు?” గీత వెనక్కి తిరిగేసరికి నిప్పులు చెరుగుతున్నకళ్లతో నీలిమ కనిపించింది. ఆమె తమ మాటలు ఎప్పుడు ఎలా విందో, అందులో అంత కోపానికొచ్చే విషయం ఏముందో అర్థమవ్వలేదు.
“ఎవర్నిగురించి అంటున్నావు నీలిమా? పెద్దావిడ. అత్త స్నేహితురాలు. అలా అనడంసరైనది కాదు” అంది.
“స్నేహితురాలైతే స్నేహితురాల్లాగే వుండాలి. మనింటి విషయాలు ఆవిడకెందుకు? ఆవిడ అడగ్గానే మా యింటి విషయాలు నీకెందుకని మొహం పగిలేట్టు మీరెందుకు అనలేదు?’”
“అంత తప్పుమాట ఏమంది?”
“నాకు పిల్లలు పుడితే ఆవిడకెందుకు? పుట్టకపోతే ఎందుకు? మా విషయం ఇలా రచ్చబండలో పెట్టి చర్చించుకుంటూ వుంటారా రోజూను?” ఆగ్రహంగా అడిగింది. ఆ తర్వాత ఆమె నోటికి హద్దూ అదుపూ లేకపోయింది. అసూయ, నిస్పృహ, నిరాశా, ఆక్రోశం, అవమానం ఇంకా ఎన్నో భావాలు ఆమెని నిలువునా దహించేస్తుంటే మాటల అగ్నికీలలా గీతమీద విరుచుకుపడింది. అంత విషం తనలో నిండిపోయిందనిగానీ, అన్నిమాటలు తను అనగలదనిగానీ ఆమెకే తెలీదు. ఏన్నోరోజుల్నించీ పేర్చుకున్న మాటలు అవి. వాటిలో చాలావరకూ తండ్రి గోడకట్టినట్టు పెట్టినవి. అన్నిటితోపాటు ఒక తెగింపుకూడా వుంది. ఇంట్లో మరెవ్వరూ లేనప్పుడు అన్నమాటలు మూడోమనిషికి తెలీవు, గీత చెప్పలేదు, చెప్పినా తను దబాయించగలదన్న ధైర్యం అది. అన్నిటికీ మించినది ఆమె అజ్ఞానం.
“మీకున్నారుగా, ఇద్దరు? ముష్టివెధవని పెంచినట్టు పెంచుతున్నారు ఒకడిని. ఇంకోడేమో మూగాడిలా అరుస్తుంటాడు. చీమకుట్టినట్టుకూడా లేదేం? ఏమిటీ, ప్రేమా, మీది? సైకిలెక్కి వూరేగి మరీ చెప్పుకున్నారా? రేప్పొద్దున్న వీడికి చెప్పుకోండి మీ గొప్పలు. రాణాగారితో మాట్లాడ్డానికి మీకు చిన్నతనం. మరీ మీతో మాట్లాడ్డానికి మాకు చిన్నతనం వుండదా? అక్కడాయిక్కడా నాలుగుపైసలు సంపాదించుకొచ్చి నాలుగెకరాల భూమి కొన్నంతమాత్రాన గొప్పవాళ్లైపోరు. మాతో సమానం అవరు. ఎంత వుంటేనేం? గరువులు దేవుకుంటూ బతుకుతున్నారు. పుట్టింటినుంచీ నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చిన దరిద్రం ఎక్కడికి పోతుంది? నా మొగుడు పెద్ద ఆఫీసరు, మరిది ఇంజనీరు, బావ సియ్యే. అలాంటి సంబంధాలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. అదీ మా నాన్న గొప్పతనం. అక్కడ పెద్దాయన యింట్లో అంతా డాక్టర్లు. మాకందరికీ మీతో కలిసి తిరగడం ఎంత చిన్నతనమో తెలీదా? అలాంటి విషయాలు అర్థమవ్వవా? ఆ పద్మగారు మీకు పడి యేడుస్తోంది, చదువుకోవాలనుకున్నాను, చదివించలేదని. అలా మిగుల్చుకున్న స్థలమేకదూ, మీ నాన్న యిచ్చినది? ఒకళ్ల వుసురు పోసుకుని ఇవ్వడం అదో గొప్పా? అత్తయ్యగారికేనా పెద్దవుద్యోగం చేసే కొడుకుమీదే వుంటుంది. అతని హోదా డాబూదర్పం అనుభవించాలని వుంటుంది. మీరు కదిల్తే చాకిరీకి మాకు మీపాటి మనుషులూ దొరుకుతారు. ఈ యిల్లు పట్టుకుని వేలాడదామని మీకుంది. మేం వాళ్లని చూసుకోగలం. మీదారి మీరు చూసుకుంటే మంచిది. అంతగా మీకు యింట్లో వాటా వదులుకోవాలని లేకపోతే ఎంతోకొంత పడేస్తాం. అది తీసుకుని పొండి. మమ్మల్ని వదిలెయ్యండి” అంది గట్టిగా. అన్నాక ఇంక అక్కడ నిలబడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసింది. వస్తూ వంటింటి తలుపు ధడేల్మని మొహమ్మీద వేసినట్టు వేసింది.
గీత నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఇలాంటి మాటలు ఎవరూ ఎవర్తోటీ మాట్లాడగా వినలేదు. అనుకుంటారనికూడా తెలీదు. అలాంటి అవమానం ఎవరూ చెయ్యలేదు. తనేం తప్పు చేసిందని? చాలాసేపు చేష్టలు దక్కి అలాగే నిలబడి, ఆతర్వాత నిలబడ్డచోటే కూర్చుండిపోయింది. రాణాతో పడింది. సుధీర్‍తో అయింది, సుమతి, సుమంత్ యింకా సాధిస్తునే వున్నారు. మాధవ్‍కూడానా? వసంత్‍వాళ్లతో బైటికి వెళ్లాలనుకున్నరోజు పెద్దగొడవే అయింది. అప్పట్నుంచీ వాళ్ళకి వండటం మానేసింది. మాధవ్ గిన్నెలు వెతుక్కుంటూ వుంటే తనకే తప్పనిపించి వాళ్లకని కాకపోయినా కొంచెం మిగిలేట్టు వండటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వంటింట్లో గొడవప్పుడు పొరపాట్న అన్నానన్నాడు. మనసుకి కష్టమనిపించినా సర్దుకుంది. పొద్దున్న బాగానే మాట్లాడుకున్నారు. నీలిమ అసూయ తెలుస్తోంది. ఈరోజే అదెందుకు ఈస్థాయిలో బైటపడిందోకూడా అర్థమైంది.
మనసెంత జ్వలించిపోయినా పసిపిల్లల్ని అలా అంటారా? ఎదిగిన మనిషే అయినా ఆమె తప్పులమీద తప్పులు చేస్తుంటే తనేమీ అనలేదే? పసివాళ్లమీద అంత ద్వేషమా? తామిద్దరు సంపాదిస్తున్నారు. కొద్దోగొప్పో ఆస్తులున్నాయి. మయూని అదేం మాట? ఆ పిల్లలు మాత్రం? వాళ్ళకి లేక తమింటికి వచ్చారా? తామేదో వుద్ధరిస్తామంటే వచ్చారు. ఎవరి పిల్లలు వాళ్లకే ముద్దు. ఎవరింట్లో వాడు రాజే. ఎలాంటి మనిషి! ఆమె ఎత్తుకుంటే ప్రేమనుకుంది. ముద్దుచేస్తే మురిపెమనుకుంది. తెలీక పాముబుట్టలో పెట్టినట్టు ఆమె వొళ్ళో పెట్టింది వాళ్ళని. విహీకి మాటలు రావా? తమది మేనరికం కావడంవలన అలా జరిగిందా? దేవుడా!! పరిసరాలు మర్చిపోయింది. విహీనికూడా మర్చిపోయింది. అలా ఎంతసేపు ఏడ్చిందో! ఇంకా ఏడుస్తునే వుంది.
“వదినా! ఇక్కడేం చేస్తున్నావు? ఆ ఏడవడమేంటి? ఏం జరిగింది?” ఆఫీసునించీ ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికని వచ్చి, పెరట్లో ఎక్కడో ఒకమూల మట్టిలో ఆడుతూ, మొక్కలన్నీ పీకి పెడుతున్న విహీని తీసుకొస్తూ ఆమెని అలా చూసి తెల్లబోయి అడిగాడు. అప్పుడు బాహ్యస్పృహ కలిగింది గీతకి. చుట్టూ ఒక్కసారి చూసింది.
“ముందు లోపలికి పద” అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని. కరెంటుషాకు కొట్టినట్టు విడిపించుకుని అతని చేతుల్లోంచీ విహీని లాక్కున్నట్టు తీసేసుకుంది.
“ఏమైంది?” అడిగాడు మరోసారి.
“నీ భార్యని అడిగి తెలుసుకో. రేపు అత్త వచ్చాక మాట్లాడుకుందాం” అంది క్లుప్తంగా. పమిటకొంగుతో ముఖం గట్టిగా తుడుచుకుని విహీ వంటినిండా పట్టించుకున్న మట్టిని దులిపి శుభ్రంచెయ్యడంలో మునిగిపోయింది. “మట్టిలోనూ, నీళ్ళలోనూ ఆడితే నీ ముక్కు కోసేస్తానన్నాను. కోసెయ్యనా? ఆ<య్” అని కోప్పడితే వాడు సమ్మోహనంగా నవ్వాడు. ఆమెకి కన్నీళ్ళు తుడిచినట్టైంది.
మాధవ్ లోపలికి వెళ్ళాడు. అనాలనుకున్న మాటలన్నీ అనేసాక బుర్ర పూర్తిగా ఖాళీయైపోయినట్టైంది నీలిమకి. పరీక్ష రాసాక ఫలితాలరోజు కలిగేలాంటి వుద్విగ్నత మొదలైంది. తను అన్నవన్నీ చెప్తుందా, గీత? ఎవరికి చెప్తుంది? అలాంటిమాటలు చెప్పుకోవడానికి సిగ్గుపడదా? చెప్తుందేమో! సిగ్గులేనిమనిషని తన తండ్రి అననే అన్నాడు.
“నేను ఆఫీసుకెళ్ళినది గంటారెండుగంటలు. ఈకొద్దిసేపట్లో ఏం జరిగింది నీలిమా? వచ్చేసరికి వదిన ఎందుకేడుస్తోంది?” మాధవ్ గొంతు ఖంగుమంది.
“నాకేం తెలుసు?” అంది బింకంగా.
“నువ్వీయింట్లో వుండట్లేదా? ఆమె ఒక్కర్తీ కూర్చుని ఏడుస్తుంటే నీకు పట్టలేదా?” కోపంగా అడిగాడు.
“నాకెలా తెలుస్తుంది? ఆవిడ వెంటవెంట తిరుగుతూ నిలబడిందో కూర్చుందో చూడటానికి నేనేమైనా ఆవిడ చెలికత్తెనా?” అంది.
“ఏం జరిగింది?” అతను పళ్ళ బిగువుని కోపం అణచుకుని అడిగాడు.
“బైటివాళ్లతో మనవిషయాలు చర్చకి పెడితే ఎందుకని అడిగాను”
“ఎవరు ఆ బైటివాళ్ళు?”
“పక్కింటావిడ”
“నువ్వు అడవిలో బతికేవా, మనుషులమధ్యే వున్నావా పెళ్ళికిముందు? ఆవిడ మా అమ్మ ఫ్రెండు”
“ఫ్రెండు ఫ్రెండులా వుండాలి. మనింట్లో విషయాలెందుకు ఆరాతియ్యడం? ఈవిడ తుంచేసి రానక్కర్లేదా?”
“ఏం అడిగింది?”
“నాకు పిల్లల్లేకపోతే వీళ్ళిద్దరికీ ఏం నొప్పి?”
“అయుండదు. నీలిమకి పిల్లల్లేకపోతే ఇక్కడ ఎవరికీ ఎలాంటి బాధా వుండదు, వుండక్కర్లేదు. మాధవ్‍కి లేకపోతేనే వాళ్లకి నొప్పెడుతుంది”
“మీరు నేనూ ఒకటికాదా?”
“మీ అమ్మ ఏమంటుంది? మా నీలిమకి యింకా పిల్లల్లేరంటుందిగానీ మాధవ్‍కి లేరనైతే అనదుకదా? అలాగే. ఎవరివాళ్ళగురించి వాళ్ళు బాధపడతారు. ఆవిడతోటే అన్నావా? మరి వదిన్నేం అన్నావు?”
“వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాటలు వినిపించాయి. నేను వెళ్ళేలోపు ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది”
“చాటుగా విని వదినమీదికి ఎగిరావా? అదొక్కటే ఐతే జవాబివ్వగలిగే విషయమే. అంత బాధపడదు. ఏమన్నావు నీలిమా తనని? నీకేమైనా అర్థమౌతోందా? నా సంస్కారం అడ్డొచ్చి తనతో పోటీపడుతున్నావని అన్నాను, కానీ నువ్వు తనని చూసి అసూయపడుతున్నావు తెలుస్తోందా? ఈరోజే ఎందుకిలా చేసేవో అదేనా తెలుసా? తులసిని చూసికూడా నువ్వు అసూయపడుతున్నావు” అతను రెండుచేతుల్తో తలపట్టుకుని మంచంమీద కూలబడ్డాడు. తన మనసు పట్టేసుకున్నట్టు అతనన్న మాటలని భరించలేక తల తిప్పేసుకుంది.
“పొద్దున్న మీ అన్నదమ్ములిద్దరూ పక్కకెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడుకున్నారని అడిగావు, ఈ విషయమే మాట్లాడుకున్నాం. నాకు నువ్వంటే పిచ్చిప్రేమ నీలూ! మహీని చూస్తూ నీతో ఆ విషయాలు మాట్లాడలేకపోతున్నాను. ఆ మందులూ, ఇంజెక్షన్లూ నేనే తీసుకునే వీలుంటే ఒకళ్ళు కాదు, పదిమంది పిల్లలని కని నీ చేతిలో పెట్టేవాడిని. ఆలోచించుకుని నిర్ణయం తీసుకొమ్మన్నాడు వాసు. డబ్బుకి చూడద్దన్నాడు” అన్నాడు.
“ఎందుకు? పాపం, నీలిమ తల్లిదండ్రులకి ఏమీ లేదు, వైద్యం చేయించలేరు, అందరం తలోకాస్తా వేయించుకుని చేయిద్దాం అని మీ వదిన ముందుపడితే నేనుకూడా ఓ పిల్లని కని, ఆవిడ కాళ్ల దగ్గిర పెట్టి నాకు సంతానభిక్ష పెట్టారని దణ్నం పెట్టాలా, ఆ యమునలాగ?” పదునుగా అడిగింది.
అతను తెల్లబోయాడు. “అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నీకు? నువ్వు యీ యింటిపిల్లవి. నా భార్యవి. ఒకరికి పెట్టగలిగే స్థాయి మనది. యమునతో నీకు పోలికేంటి? అలా ఎందుకు చేస్తాం?” అడిగాడు. ఆమె తలదించుకుంది. “మీముగ్గురిదీ ఒకటే మాట. నేనే పైదాన్ని. ప్రతినిముషం అలానే అనిపిస్తుంది నాకు. అలానే చేస్తుందనుకున్నాను” అంది ఏడుస్తూ.
అతను దగ్గరగా వెళ్ళి ఆమెని గుండెకి హత్తుకున్నాడు. “నిన్ను నువ్వే పరాయిదాన్ని చేసుకుంటున్నావు. ఒక వ్యాపకం అంటూ కల్పించుకోక ఏవేవో భయాలూ, ఆలోచనలూ, అసూయలూ మనసులో నింపుకుని నువ్వు బాధపడి అందర్నీ బాధపెడుతున్నావు. లేనిపోని గొడవలుపెడుతున్నావు. అమ్మ వచ్చాక పంచాయితీ పెడుతుందట వదిన. నువ్వేం అన్నావో, ఆవిడకెందుకంత దు:ఖం కలిగిందో నాకు తెలీడం లేదు. అమ్మదాకా ఎందుకు? వాసుకూడా యింట్లో లేడు. వెళ్ళి సర్దుబాటు చేసుకోకూడదూ?” మృదువుగా అడిగాడు. తనన్నవి చిన్నమాటలు కాదు. అనదగ్గమాటలూ కావు. శివమెత్తినట్టు అనేసింది. ఏం జరుగుతుందో చూడక తప్పదు. ఇతని మనసేమిటో తెలిసింది. వదిలేసి మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడేమోనన్నంతవరకూ వచ్చింది తన భయం. తండ్రి అలా జరగనివ్వడనే ధైర్యం వున్నా, ముందు భయం పుట్టాకే, ఆ ధైర్యం వచ్చింది. ఇతను తనవైపు వున్నంతవరకూ తను తగ్గక్కర్లేదు. గీతని తను భరించలేదు. అటోయిటో తేలిపోనిమ్మనుకుంది.
“నావెనక నాగురించి మాట్లాడితే నాక్కూడా అలానే వుంటుంది” అంది విసురుగా. అతను ఇంకేమీ మాట్లాడలేదు.
గీతతో అన్నట్టు వంటిగంటకి ఆఫీసు ముగించుకుని సగంపూట సెలవుపెట్టి వచ్చేసాడు వాసు. అప్పుడే ఎక్కడికో వెళ్ళొస్తూ గేటుదగ్గిర తండ్రి కలిసాడు. కూడా వెళ్ళి ఆయన గదిలో కూర్చున్నాడు.
“ఎక్కడికెళ్ళారు నాన్నా?” కుండలోంచీ మంచినీళ్ళు తీసి ఆయనకి యిస్తూ అడిగాడు.
రామకృష్ణ చేతిలోని కాగితాలు అతని చేతిలో పెట్టాడు. స్టాంపు కాగితాలు.
“ఏమిటివి?” అడిగాడు వాసు చదవకుండా.
“ఇల్లు అమ్మకి విల్లు రాసి రిజిస్టర్ చేయించాను వాసూ! ఇది మా తాత కట్టించిన యిల్లు. చివర్లో ఎందుకో మా నాన్నమీద కోపంవచ్చి, నాపేరిట రాసేసాడు. మీ అమ్మ ఆవిడ పేరుమీదికి మార్పిస్తానంటే వద్దంది. వద్దంటే ఎలా కుదుర్తుంది? ఎవరి జీవితాన్నిగురించి వాళ్ళకి జాగ్రత్త వుండాలికదా?” అన్నాడాయన.
“మీరెక్కడికి వెళ్తున్నారు?” అనుమానంగా అడిగాడు వాసు.
“ఇంకా ఎంతకాలం వుంటానురా?” అన్నాడాయన.
“ఇంట్లో ఇద్దరు మనుషులు నాన్నా! మీరు, మీ చిన్నకోడలు. రోజంతా గదిలో కూర్చుని దు:ఖాలనీ భయాలనీ పోగుచేసుకుంటున్నారు. ఇప్పుడు మీకెన్నేళ్ళని అలా అంటున్నారు? మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరున్నారన్న సంతోషాన్ని మాకు మిగల్చండి” అన్నాడు వాసు. “పిల్లల్లేరన్న బాధ ఒక్కటీ తప్పించి ఇంక వేరే ప్రపంచమే లేనట్టు వుంటుంది నీలిమ. ఎంత వయసని? మాధవ్ అంత చలాకీగా వుంటాడా, ఆమెకి ఎందులోనూ సరదా, ఆసక్తీ లేవు. మేం మాట్లాడుకుంటూ చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటుంటే చిరాగ్గా ముళ్ళమీదున్నట్తు కూర్చుంటుంది. తనూ ఏవన్నా చెప్పచ్చుకదా? ఉ<హు< ఉ<మ్మని చూస్తూ వుంటుంది. చిన్నప్పుడు ఎవరికీ ఏవీ లేవు, రావు. ఆ చిన్నతనం ఎంత? ఇరవయ్యేళ్ళో, పాతికేళ్ళో. తర్వాతి జీవితమంతా మన చేతుల్లోనే వుంటుంది. దాన్ని మనకి నచ్చినట్టు గడపచ్చు. మనింట్లో ఆంక్షలు పెట్టేవాళ్ళెవరూ లేరు. గీత ఎడంచేత్తో అవలీలగా వండిపడేస్తోంది. రకరకాలు వండుతుంది. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదిరితే వండినదాని పేరు చెప్తుంది. కుదరకపోతే మమ్మల్ని పేరుపెట్టమంటుంది. నవ్వుతుంది, నవ్విస్తుంది. సైకిలు తొక్కుతానంది. ట్రాక్స్‌కి తీసుకెళ్ళి నేర్పించాను. ఫుట్‍బాల్ నేర్పమంది. షటిల్ ఆడుతుంది. పెయింటింగ్ చేస్తుంది. పుస్తకాలు చదువుతుంది. ఇవన్నీ పెళ్లయాక నేర్చుకున్నవే. ఇంకా ఏవో చెయ్యాలనుకుంటుంది. మాధవ్‍ది గెజెటెడ్ పోస్టు. చాలా బాధ్యతలు వుంటాయి. మాలాగా ఐదయ్యేసరికి వచ్చెయ్యడానికి వీలుండదు. ఈ అమ్మాయి వాడెప్పుడొస్తాడా అని చూస్తుంటుంది. నీలిమనికాదుగానీ, వాడిని చూస్తుంటే జాలేస్తోంది” అన్నాడు.
“వాడితో అన్నావా, ఈ విషయాలు?” అడిగాడు రామకృష్ణ.
“వాడూ చెప్తునే వుంటాడట”
తండ్రీకొడుకులు మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాక వాసు వెళ్తానని లేచాడు. తండ్రి యిచ్చిన కాగితాలు తల్లికి కనిపించేలా బీరువాలో పెట్టి, తమగదిలోకి వెళ్ళేసరికి గీత అతనికి టిఫెను ప్లేట్లో పెట్టుకుని వచ్చింది. విహీ నిద్రపోతున్నాడు.
“అలా వున్నావేం?” ఆమె ముఖం చూసి అతను అడిగిన మొదటి ప్రశ్న.
“చెప్తాను. ముందైతే తిను” అందామె. ఆమె ముఖంలోకి చూసి తినడం మొదలుపెట్టాడు.
“నీకు కోపం ఎక్కువ. గొడవపెట్టుకోవడానికి వీళ్ళు బైటవాళ్ళు కాదు, యింట్లోవాళ్ళు. ఏం చేద్దామో కాస్త నిదానంగా ఆలోచించు” అంది.
“ముందరికాళ్లకి బంధం వేస్తున్నావా?” అడిగాడు.
అతను తినడం పూర్తయ్యేసరికి జరిగిన విషయాలు మరీ తూచాతప్పకుండా కాకుండా వాటిలోని సారాంశం అందించింది.
“బావా! ఇక్కడినుంచీ మనని వెళ్ళిపోమనడం వెనక ఎవరెవరో వున్నారనుకున్నాంగానీ దాని మూలం మనింట్లోనే వుంది. ఆమెలో గర్వం, అసూయ, దాంబికంలాంటివి చాలా వున్నాయి. నీకు విలువ యివ్వని మనిషితో కలిసి వుండటం ఇకపైని నాకు సాధ్యపడదు. నిన్ను తక్కువచేస్తే నేను తట్టుకోలేను. నాకు ప్రాణంపోయినట్టుంది. మనవెంట ఇంకెవరెవరు వస్తారో చూద్దామని ఒకనాడు నువ్వన్నావు, ఈ తోడల్లుళ్ళు ముగ్గురుకూడా వుండరు. నువ్వూ, నేనూ, మహీ, రవళీ మిగిలాం. అంతే” అంది.
“ఆ అమ్మాయి అంటుంటే నువ్వు ఏడుస్తూ కూర్చున్నావా?” కోపంగా అడిగాడు వాసు.
“నీకు నేను లౌకికమైన విషయాలు చెప్పాను. అంతరంగాన్ని తాకేవి కొన్ని వుంటాయి అవి చెప్పలేదు, చెప్పలేను. నన్నడక్కు. కన్నీళ్ళు తెప్పిస్తాయి”
“ఎవరేనా ఏదేనా అంటే జవాబివ్వాలిగానీ ఏడిస్తే ఎలా గీతా? అవతలివారికి చులకనైపోవా?”
తలదించుకుంది. గుండెల్లో దిగిన ముల్లు మళ్ళీ కదిలింది. కళ్లలోంచీ నీళ్ళు జలజల జారిపడ్డాయి.
“చాలా బాధనిపించింది. అసలైన దు:ఖం ఎలా వుంటుందో అర్థమైంది. చుట్టూ వున్న ప్రపంచం ఒక్కసారిగా మాయమైపోయింది. నరాలన్నీ వుండచుట్టుకుపోయాయి. వాటిల్లోంచీ ఈ దు:ఖం ప్రవహించడానికి తల్లాడిపోయింది. ఒళ్లంతా దు:ఖమే నిండిపోయింది. నా కళ్లముందునించీ ప్రపంచం మాయమైపోయాక ఇంక ఆరోపణలూ, జవాబులూ ఎక్కడుంటాయి? నిన్నూ, పిల్లల్నీ అందర్నీ అంది. నావల్ల కావడంలేదు” తనకి తను చెప్పుకుంటున్నట్టు, జరిగినదాన్ని అర్థం చేసుకున్నట్టు, గొణుగుతున్నట్టు అంది. అతను చలించిపోయాడు. చాలాసేపటిదాకా ఆ దు:ఖంలోంచీ తేరుకోలేకపోయింది. ఆ అనుభవంలోని రసస్పర్శ అతన్నీ తాకింది. కంట్లోంచీ నీరొచ్చింది. దగ్గిరకి తీసుకుని ఓదారుస్తూ వుండిపోయాడు.
“మన పెళ్ళై నేనొచ్చినప్పటికి తులసికూడా వుండేది. మన నలుగురం యిది మనిల్లనుకుని, తలోపనీ చేసుకునేవాళ్ళం. ఇది చెయ్యి, అది చెయ్యి అని అత్త మనకెప్పుడూ చెప్పలేదు. నీలిమ వచ్చినప్పట్నుంచీ గొడవే, ఇంత పొద్దున్నే వంటెందుకు, టిఫెన్ తిన్నాక తీరిగ్గా వండుకోవచ్చుకదా అనేది. ఇంతమందికి టిఫెన్లు, టిఫెన్లలోకి అనుపానాలు, అవయ్యాక వంట. ఎలా కుదురుతుంది? ఆఫీసుకి లేటైపోదూ? పోనీ తొందరగా లేచి మొదలుపెడుతుందా అంటే అదీ లేదు. అత్తేమో తననీ పిలవమనేది. పిలిస్తే వచ్చి, ఏం చెయ్యను అన్నట్టు నిలబడేది. అలాంటివాళ్లతో ఎన్ని పనులు చేయించగలం? గంటలో అయేది రెండుగంటలు పట్టేది. అందుకే నేనే చేసుకోవడం మొదలుపెట్టాను. అదీ గొడవే, మాకు చల్లారిపోతున్నాయి, మాకు నచ్చినవి వండట్లేదని. తను నన్నలా అనడమేమిటన్న ప్రశ్న. అత్త వాళ్లని వేరే వండుకొమ్మనేది. ఒకరోజో రెండురోజులో వండి మానేసేది. మాధవ్‍ని మాడబెట్టేది. ఇవన్నీ పైపైకి కనిపించే విషయాలు. వీటి వెనక వేరేవి వున్నాయి. తనకి మనతో కలిసి వుండటం మొదట్నుంచీ యిష్టం లేదు. అది అర్థం చేసుకోలేకపోయాను. మనకి మాధవ్ ఎంత దగ్గరో, తనూ అంతేననుకున్నాను. తులసి వెళ్లింది, తనొచ్చిందనుకున్నాను. నా లెక్క తప్పింది” అంది. కన్నీళ్ళు ఆగట్లేదు.
విహీ లేచాడు. మయూఖ్ స్కూలునుంచీ వచ్చాడు. మొహం తుడుచుకుని లేచింది.
మాధవ్ గదిలోంచీ ఇవతలికి రాలేదు. వాసుకి మొహం చూపించలేకపోయాడు. ఒక అపురూపమైన కానుకలా గీత యీ యింటికి వచ్చింది. అమాయకత్వం, ఏదేనా తొందరగా నేర్చేసుకునే చురుకూ, ప్రేమ, అభిమానం, స్నేహం అన్నీ కలబోసుకుని తిరుగుతుంటే యింటికి కొత్త అందం వచ్చినట్టనిపించేది. చిన్నప్పట్నుంచీ తనతో కలిసి పెరిగిన పిల్లే అన్నకి భార్యగా రావడం, నునుసిగ్గుతో తనని తప్పుకుని తిరగడం, ఎక్కడ ఏడిపిస్తాడోనన్నట్టు పెద్దరికం నటించడం అవన్నీ గుర్తొచ్చి కళ్లలో నీళ్ళు తిరిగాయి. తమ కుటుంబానికి ఎంతో చేసిన మేనమామ, తమందరిమీది నమ్మకంతో కూతుర్ని యీ యింటికి కోడలిగా పంపితే గౌరవంగా చూసుకోలేకపోయాడు తను.
ఎవర్నీ ఒకమాటకూడా అనే తత్వంగానీ చొచ్చుకునిపోయే మనస్తత్వంగానీ కాదు గీతది. తన ప్రపంచాన్ని వాసుచుట్టూ నిర్మించుకుంది. ఆపై ఆవర్తనం తమ కుటుంబాలసమూహం. అలా నిర్మించుకున్న చిన్నిప్రపంచాన్ని ఆహ్లాదంగా వుంచేందుకు నిరంతరప్రయత్నం చేస్తుంది. వాసుకి సంబంధించిన ప్రతిచిన్నదాన్నీ, విషయమవనీ, వస్తువవనీ, మనిషవనీ అతనెంత ప్రేమిస్తాడో తనూ అంత ప్రేమిస్తుంది. వాసులోని ఒక చిన్న అంశలా, అంతే తన వునికి. ఇద్దరు మనుషులు అంతలా కలిసిపోవడం తనెక్కడా చూడలేదు. వాసు తమ్ముడు మాధవ్- మాధవ్ భార్య నీలిమ- నీలిమ అక్కా, చెల్లెలు, అమ్మానాన్నలు- ఇంత విస్తృతమైన ప్రేమ ఆమెది. వాసుకూడా ఆమెని అలానే ఇష్టపడతాడు. తులసి విషయం విని చాలా మామూలుగా తనగురించి అనివుంటుంది రుక్కమ్మ ఆమ్మ. ఆవిడదీ ప్రేమే. పుట్టినప్పటినుంచీ తెలిసిన మనిషి. తనని తాకిన తొలిస్పర్శల్లో ఆవిడదీ వుంది. ఆ ప్రేమ యిచ్చిన చనువుతోటే అని వుంటుంది. గీతకూడా మామూలుగానే జవాబిచ్చి వుంటుంది. ఇవన్నీ నిత్యజీవితంలో జరిగే అత్యంత సాధారణమైన సంభాషణలు. ఆ మాటలు పట్టుకుని గీతని అంత బాధపెట్టేలా ఏమంది నీలిమ?
అసలు ఇంతంత విబేధాలు ఎందుకొచ్చాయి? పిల్లలు పుట్టలేదన్న బాధ ఒక్కటేకాదు నీలిమది, ఇంకా లోతైన ఆలోచనలేవో వున్నట్టున్నాయి. తను పెద్దగా పట్టించుకోలేదు. ఏమిటవి? తామిద్దరికీ మధ్య జరిగిన సంభాషణలు గుర్తుతెచ్చుకుంటే అర్థం కానిదేదో వుందనిపించింది. గీతని చూసి అసూయపడుతుంది. విడమర్చి చెప్పాడు. ఆమెనీ ఎదగమన్నాడు. గీతకి వున్నన్ని అవకాశాలూ నీలిమకీ వున్నాయి. గీత చేసినవే తనూ చెయ్యాలనికాదు, గీత నేర్చుకున్నవే తనకీ రావాలని కాదు. పెళ్ళికిముందు ఏవీ కుదరలేదుకాబట్టి ఇంక అదే జీవితమని అనుకుంటే మనిషి ముందుకి వెళ్ళలేడు. ఏం చెయ్యాలి నీలిమతో? అతని ఆలోచనలు సాగుతునే వున్నాయి.
అతనలా కూర్చుని వుంటే నీలిమకి నచ్చలేదు.
“నేనిప్పుడేమన్నానని? మనగురించి నలుగుర్లో చర్చకి పెడితే నాకు కోపం రాదా?” అంది మళ్ళీ కళ్లనీళ్ళు పెట్టుకుంటూ.
“మాయింట్లో ఇలా మాటలనుకోవడం, మరొకరిని బాధపెట్టడం అలవాటులేదు నీలిమా! ఏ విషయమేనా అందరం కూర్చుని మాట్లాడుకుంటాం” అన్నాడు.
“వాళ్ళు నా వెనక యిలా మాట్లాడుకుంటారని నాకు తెలీదుకదా?”
“నీతో నేరుగా అననిమాటలకి నువ్వు జవాబివ్వకూడదు. నేనిలా అన్నానని నీకెలా తెలిసిందని అడిగితే ఏం చెప్తావు? గోడచాటుని నిలబడి విన్నానంటావా? నేను ఆ సమయంలో అక్కడ నిలబడి అంటానని నీకు ముందే ఎలా తెలుసంటే? పొంచిపొంచి వినడం నా అలవాటని వప్పుకుంటావా? పొరపాట్న చెవినపడ్డా వినీవిననట్టు వదిలెయ్యాలి. అదికదా, సంస్కారం అంటే? ఇలాంటి పనులవలన నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావని తెలుస్తోందా?” అనేసి అతను లేచి వెళ్ళిపోయాడు. వంటింట్లో చూస్తే మయూకీ, మిగిలిన పిల్లలకీ టిఫెను పెడుతోంది గీత. మరోవైపు వంట చేసుకుంటోంది.
“అన్నయ్యేడి?” అడిగాడు. పెరట్లో వున్నాడన్నట్టు చేత్తో చూపించింది.
అక్కడ వాసు విహీని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే నిద్రలేచాడేమో, బద్దకంగా తండ్రి గుండెకి తలానించి వున్నాడు విహీ.
“తలనిండా ఏంట్రా, ఇది? మట్టిలో ఆడావా? అమ్మ నీ ముక్కు కోసెయ్యలేదా?” ప్రేమగా అడిగాడు వాసు. వాడి వళ్ళు అప్పటికే కాస్త వెచ్చగా వుంది. మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.
వెళ్ళి పక్కని కూర్చున్నాడు మాధవ్. వాసు మాట్లాడలేదు. మాధవ్‍కి అర్థమైంది, అతనికి విషయం తెలిసిందని. గీతని ఏమందో నీలిమ తనకి చెప్పలేదు. వాసుకిమాత్రం పూర్తిగా తెలిసే వుంటుంది. ఇద్దరూ మాట్లాడకుండా ఎంతసేపు కూర్చుంటారు? ఐనా తప్పు మాధవ్‍ది కాదు. వాసులో విచక్షణ మేలుకుంది. చెప్పమన్నట్టు చూసాడు.
“మనం ఆఫీసులకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిమధ్యా ఏదో చిన్న గొడవొచ్చిందట” నెమ్మదిగా అన్నాడు మాధవ్.
“చిన్నగొడవా? అక్కడ ఆవిడ దు:ఖాన్నిగురించి బ్రహ్మాండం బద్దలైపోయేలాంటి నిర్వచనం ఇస్తేను?” అన్నాడు వాసు.
“అమ్మ వచ్చాక మాట్లాడుకుందామంది వదిన. మనం చిన్నప్పుడు ఎన్నో అల్లరిపనులు చేసాం. అమ్మకి చెప్పకుండా దాచాం. ఇదిమాత్రం అమ్మదాకా ఎందుకు? తను బాధపడుతుంది”
“వదిన బాధపడితే పర్వాలేదా? అదికాదురా, ఇల్లు మనదనీ, ఇంట్లో అంతా బాగానే వుందనీ నమ్మకంతో మనం బైటికి వెళ్తాం. తిరిగొచ్చేసరికి ఎవరో ఒకళ్ళు ఏడుస్తూ ఎదురొస్తే ఎలా? ఎవరింట్లో చూసాం ఇలా? మనింట్లో అమ్మా, మామ్మా ఒకళ్లనొకళ్ళు ఏడిపించుకున్నది లేదు. అత్తలకికూడా అమ్మంటే ప్రేమే. గీతావాళ్ళింట్లో అత్తా, అమ్మమ్మా అలానే వుంటారు. అమ్మా, గీతా తల్లీకూతుళ్ళలా కలిసిపోయారు. ఈ దెబ్బలాటలేంటి? కొత్తగా మొదలయ్యాయా లేకపోతే నాదాకా రావటం ఇదే మొదలా?” ప్రశ్నల వర్షం కురిపించాడు వాసు. మాధవ్ మాట్లాడలేదు.
“ఆఫీసునుంచీ వస్తూ నాన్న దగ్గిర కూర్చున్నాను చాలాసేపు. ఆ గదిలో ఒక్కరూ కూర్చుని రోజంతా పనికిరాని ఆలోచనలు చేస్తుంటారు. ఇంకెంతకాలం వుంటాన్రా అన్నారు యిందాకా. అమ్మ, ముగ్గురు పిల్లలం, కోడళ్ళు, అల్లుడు, మనవలు ఇందరం వుండగా ఆయనకి అలా అనిపించడమేమిటి? మనం పరాయివాళ్ళలా కనిపించడంవలనేకదా? నీలిమకూడా అంతే. ఆ అమ్మాయిచేత పలికిద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. పొద్దున్న అంతసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. ఎప్పటికీ వుద్యోగాలూ, డబ్బుసంపాదనలేకాదుకదా మనిషికి వుండేవి? అందులోనూ మన గ్రూపులో ముగ్గురం ఇక్కడే వున్నాం. ఒక్క వయసువాళ్ళం. మాట్లాడుకుంటాం. చదివిన పుస్తకం, చూసిన సినిమా, వాళ్ళక్కచెల్లెళ్ల పిల్లల విషయాలు, వేటితోనేనా మాట కలపచ్చు. నోరిప్పలేదు. నువ్వుతప్ప మనింట్లో ఇంకెవరూ తనకేం కారనుకుంటోంది. ఎవరితోటీ మాట్లాడదు. రోజంతా గదిలోనే వుంటుంది. పెళ్ళికిముందు ఆడపిల్లలు పుట్టింట్లోగడిపేది ఇరవయ్యేళ్ళు. ఆ తర్వాతంతా అత్తవారింట్లోనే. అత్తవారింట్లో అందరూ పరాయివాళ్లనుకుంటే మరి మీకు స్వంతవాళ్లెవరు? తులసికి పెళ్ళై వెళ్ళింది, నీకు పెళ్లై నీలిమ వచ్చిందనుకున్నాం. మేము తనకి అక్కర్లేనప్పుడు మాక్కూడా అంతే. చేసుకున్నావుగాబట్టి మీరిద్దరూ ఒకళ్లనొకళ్ళు పట్టుకుని వుండండి మమ్మల్ని మర్చిపోయి” దులిపేసాడు వాసు. అతనికి అంత కోపం రావడంలో విచిత్రమేమీ కనిపించలేదు మాధవ్‍కి. జవాబు చెప్పడానికికూడా ఏమీ తోచలేదు.
“అదిసరే, పిల్లల్నికూడా ఏదేదో అందట. పిల్లల్ని అంటే గీతకి ఏడుపురాదా? అది వాళ్ళకి కన్నతల్లి. ఏమందని అడిగి చెప్పించి మరోమాటు తనని బాధపెట్టలేక వూరుకున్నాను. కానీ అంత ఏడ్చిందంటే గట్టిమాటలే అనుంటుంది. వాళ్లగురించి అనడానికి ఏముంటాయి? వాళ్ళూ యీ యింట్లో మనుషులే. వాళ్ళేమైనా పినతల్లితో గొడవలుపడుతుంటారా? వాళ్ల వయసుకి తగ్గట్టు వాళ్ళు బతుకుతున్నారు. వీడికింకా మాటలే రాలేదు. వాడు పెద్దవాడుకాబట్టి కాస్త గొడవచేస్తూ ఆడుకుంటాడు. పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు అల్లరిచేస్తారా? నీ తోడల్లుళ్ళిద్దరింట్లో అలానే వుందా? మనింట్లో వుండి చదువుకుంటున్న పిల్లలుమాత్రం ఏం అల్లరి చేస్తున్నారు? వజ్రాల్లాంటి పిల్లల్ని వెతికి తెచ్చి సానపడుతున్నాం. వాళ్లు నచ్చలేదట మీ ఆవిడకి. ఆమెకి నచ్చినట్టు మేం వుండలేం. అమ్మ వచ్చాక మాట్లాడుకుని వేర్లు పడదాం. అదే గీత అమ్మతో చెప్పాలనుకున్నది”
నీలిమ తనేమందో చెప్తే మాధవ్‍కి మాట్లాడ్డానికి వీలుండేది. అసూయతో మాటలేవో తూలిందనే అనుకున్నాడు. వాసు చెప్తేనే ఒకొక్కటీ తెలుస్తుంటే ఇంక తనేం చెప్పగలడు? కొమ్ములు చూసి గేదెని బేరం చేసుకున్నట్టుంది. ఐనా పిల్లల్నికూడా అందా, నీలిమ? ఏమంది? అల్లరి చేస్తే గీతే కోప్పడుతుంది. ఎవరేనా కోప్పడ్డా అడ్డుచెప్పదు. వాళ్ళనేమంది నీలిమ? అతని భృకుటి ముడిపడింది.
“గొడవలుపడి వేర్లుపడ్డామని అందర్లో పరువుతీసుకోవడం దేనికిరా, వాసూ? నేను ట్రాన్స్‌ఫర్‍కో డెప్టేషన్‍కో అడుగుతాను. కొంచెం టైమివ్వు. కొన్నాళ్ళు దూరంగా వెళ్తే నీలిమలో మార్పొస్తుందేమో! ఈలోగా మళ్ళీ గొడవేం జరక్కుండా నేను చూసుకుంటాను” అని లేచాడు మాధవ్. ఇంట్లోకి వెళ్ళాలనిపించలేదు. అలాగని అక్కడే వుండాలనీ అనిపించలేదు. ఎక్కడికీ వెళ్లక గాల్లో వేలాడలేడు. అందుకని మళ్ళీ గదిలోకే వెళ్ళాడు.
“పిల్లల్నేమన్నావు నీలిమా?” విసుగ్గా అడిగాడు. “అందరినీ తోచినట్టు అనేసి, నీమానాన్న నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే పడ్డవాళ్ళు వూరుకోరు. నీ బట్టలు సర్దుకో. మీయింటికి వెళ్లి కొన్నాళ్ళు వుందువుగాని. మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, వచ్చి తీసికెళ్ళమని. నాకీ వారంరోజులూ చాలా బిజీగా వుంటుంది. ఎక్కడికీ కదలడానికి వుండదు. వేరే వెళ్లిపోదాం. ఇల్లు వెతికాక వద్దువుగాని” అన్నాడు.
“మనం వేరే వెళ్లడమేమిటి?” తెల్లబోయింది.
“మరి లేకపోతే? ఇక్కడే వుండి గొడవలు పెట్టుకుంటూ వుంటావా? వాళ్ళెందుకు వూరుకుంటారు? మిగతావాళ్లకి తెలిసిందంటే నవ్వుతారు. వదిన్ని బాధపెట్టినందుకు రాణా తర్వాతి స్థానం నాదౌతుంది” అన్నాడు.
సరదాకబుర్ల వుదయం దు:ఖపు మధ్యాహ్నమైంది, దు:ఖానంతర విషాదపు సాయంత్రమైంది, మనసులనీ, మాటలనీ మూగవోయేలా చేస్తూ రాత్రైంది. గీత యథాతథంగా తన పనులన్నీ చేసుకుంది. ఏవీ మానలేదు. పిల్లలు ముగ్గురికీ అన్నాలు పెట్టి, ఎవరింటికి వాళ్లని పంపాక మయూని పడుకోబెట్టింది. నీలిమ వంటప్రయత్నాలు మొదలుపెట్టకపోవడంతో మామగారికి తనే తీసుకెళ్ళి భోజనం ఇచ్చింది. విహీకి జ్వరం రావడంతో వాడికి పాలు పట్టించింది. భార్యాభర్తలిద్దరూ తిన్నామనిపించి లేచారు. మాటలేం సాగలేదు. నీలిమ రాత్రెప్పుడో అన్నం వండితే పచ్చడీ, పొడీ, పెరుగూ వేసుకుని తిన్నాడు మాధవ్.
“వాడు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని కొన్నాళ్ళు దూరంగా వెళ్తానన్నాడు” తామిద్దరికీ మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు వాసు.
“అది సరైన పరిష్కారం కాదు. అత్త, తులసి బాధపడతారు”
“మరి మనం వెళ్దామా?”
“అప్పుడూ బాధపడతారు. ఏదైనా మీ అన్నదమ్ములు విడిపోవడమేకదా?”
“మరెలాగే? ఇలా దెబ్బలాడుకోవడమేమిటి అసహ్యంగా? వాడింత మెతగ్గా వున్నాడేంటి?”
“ఇలాంటివి మనకెలా కొత్తనో, మాధవ్‍కీ అంతే. మనలాగే తనూ తెల్లబోతున్నాడు”
“పిల్లలు పాడైపోతారు”
“ఇక్కడే వేర్లుపడదాం. ఇల్లు రెండుభాగాలుగా ఎలా చెయ్యచ్చో ఆలోచించు”
“నవ్వుతారు గీతూ, అందరూను”
“అత్తావాళ్లని వదిలేసి సుమంత్ వేరుకాపురం పెడితే మనం నవ్వామా? అర్థం చేసుకునే సంస్కారం మనింట్లో వుందిలే”
వాసు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. గీతకి ఎంతకీ నిద్రపట్టలేదు. జీవితం తిరుగుతున్న మలుపులు చూస్తుంటే ఆశ్చర్యంగా వుంది. ఇలా జరుగుతాయని ఎక్కడా చిన్న సూచనకూడా లేకుండా అజ్ఞాతంలోంచీ పొరలు యిప్పుకుంటూ ఏవో సంఘటనలు ఎరుకలోకి రావడం వింతగా అనిపించింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన నీలిమ కేవలం తోటికోడలైన కారణాన్న తననీ వాసునీ అవమానించింది. ఆమెది అసూయో, మరొకటో అనికాదు. బైటపడ్డానికి ఈవేళ ఇదో కారణం దొరికింది. రేపు మరొకటి దొరుకుతుంది. పద్మత్తలాగ దొరికిన జీవితంతో రాజీపడలేకపోవడం, దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చెయ్యకపోవడం ఆమె సమస్యలు. అసంతృప్త జీవులు. మాధవ్ ముందు జీవితం ఎలా వుంటుందో! చిన్నగా నిట్టూర్చింది.
చాలాసేపటికి చిన్న నిద్రతెర కళ్లమీదికి వస్తుంటే చిన్నగా పిలుపు. పక్కని.
“అమ్…మా!” ఒకసారి కాదు, నాలుగుసార్లు వరసగా. మయూఖ్ కాదు. కంగారుగా లైటేసి చూసింది. విహీ!! పక్కంతా పాడుచేసుకున్నాడు. పిలవడం కొత్త. సంభ్రమంగా అనిపించింది. మనసులో అమృతవృష్టి కురిసింది.
“బావా! వీడేంటో అన్నాడు, విను” వాసుని కుదిపింది. విహీని లేవదియ్యబోతే వొళ్ళు మసిలిపోతోంది. వేలాడిపోతున్నాడు.
“జ్వరం. వళ్ళు కాలిపోతోంది” కంగారుగా అంది.
వాసు లేచి కూర్చున్నాడు. ఆమె విహీని కడిగి, శుభ్రం చేసి తీసుకొచ్చింది. ధర్మామీటరు పెట్టి చూస్తే నూటమూడుంది జ్వరం. అతని నిద్రమత్తంతా ఎగిరిపోయింది. పిల్లలకి జలుబులూ, జ్వరాలూ చాలా తక్కువ. ఏదేనా వచ్చినా, యింట్లోయింట్లో చూసుకోవడమేతప్ప మందులూ, సిరప్‍లూ వాడడం అరుదు. అందులోనూ లక్ష్మి లేదు.
“హాస్పిటల్‍కి వెళ్దాం. పద” అతను బట్టలు మార్చుకున్నాడు.
“వీడు?” అడిగింది మయూఖ్‍గురించి.
“నాన్నదగ్గిర పడుక్కోబెడదాం” అన్నాడు. ఇద్దరూ చెరొకళ్ళనీ ఎత్తుకుని యివతలికి వచ్చారు. ఇంటికి బైటినుంచి తాళంవేసాడు వాసు.
“విహీకి జ్వరం వచ్చింది నాన్నా! హాస్పిటల్‍కి వెళ్తున్నాం. వీణ్ణి మీదగ్గిర పడుకోబెట్టుకోండి. ఇంటికి బైటినుంచి తాళం వేసాను. తెల్లారగానే తీసెయ్యండి” అన్నాడు తండ్రితో.
“ఇంతరాత్రి డాక్టర్లు ఎవరుంటార్రా?” అడిగాడాయన.
“మెయిన్‍రోడ్డెక్కితే పిల్లల హాస్పిటల్ వుంది. వీళ్లకి పోలియోడ్రాప్స్‌కి అక్కడికే తీసుకెళ్తాం. వాళ్ళు అవసరమైతే డాక్టర్ని పిలిపిస్తారు”
వాళ్ళు వెళ్లిపోయారు. ఆ హడావిడిలో ఏదీ అడగలేదుగానీ ఆయనకి చాలా సందేహాలొచ్చాయి. మాధవ్‍కి చెప్పకుండా వెళ్లడమేమిటి? నిద్రపోతున్నారు, లేపడం దేనికనుకునేంత చిన్నవిషయం కాదనుకుంటూ మనవడిని సరిగ్గా పడుక్కోబెట్టి, తలుపు దగ్గిరకి వేసి, తాళం తీసుకుని యింట్లోకి వెళ్ళాడు. మాధవ్‍ని లేపాడు.
అంతరాత్రి తండ్రి రావటం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. నిద్రకళ్లతో ఇవతలికి వచ్చాడు. వెనకే నీలిమా వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి, ఆయనకి రాత్రి భోజనం యివ్వడం మర్చిపోయిందని. చురుక్కుమంది.
“చిన్నాడిని తీసుకుని వాళ్లు హాస్పిటల్‍కి వెళ్ళారు. వెంట నువ్వెందుకు వెళ్లలేదురా?” అడిగాడు.
“హాస్పిటల్‍కా? ఏ హాస్పిటల్‍కి? ఏమైంది వాడికి? సాయంత్రం బానే వున్నాడు? ఎంతసేపైంది?” అడుగుతునే ఆయన జవాబులు వింటూ చకచక తయారై వచ్చాడతను.
“వీడేడి? పెద్దాడు? ఒక్కడే వున్నాడా, గదిలో?”
“లేదురా, వాడిని నాదగ్గర పడుక్కోబెట్టి వెళ్ళారు. నేను వెళ్తాను. లేస్తాడేమో! భయపడతాడు. నీలిమా! నువ్వూ వెళ్ళు. గీతకి ధైర్యంగా వుంటుంది” అంటూ వెళ్లిపోయాడు.
మాధవ్‍కి చెంపమీద చెళ్ళుమని కొట్టినట్టైంది. ఒక్కపూటలో ఎంతదూరం తోసేసారు, ఇద్దరూ! క్షణంపాటు మెదడు స్తంభించిపోయింది. తెప్పరిల్లి, “నువ్వొద్దు. నేను వెళ్తాను. తలుపేసుకో” నీలిమతో అనేసి తనూ వెళ్ళిపోయాడు.
నీలిమ అక్కడే కుర్చీలో కూలబడింది.
హాస్పిటల్‍కి వెళ్ళేదార్లోనే మరోరెండుసార్లు బట్టలు పాడుచేసుకున్నాడు విహీ. ఎప్పుడూ అనారోగ్యమని పిల్లల్ని హాస్పిటల్‍కి తీసుకురానివాళ్ళు విహీని తీసుకుని రావడం చూసి డాక్టరుకే ఆశ్చర్యం వేసింది. గీత చెప్పింది విని,
“నీళ్ళలోనూ మట్టిలోనూ ఆడనివ్వకండి. తెలీక ఆ చేతులు నోట్లో పెట్టేసుకుంటాడు. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు కంగారేం లేదు. తెల్లారేదాకా వుంచి అన్నీ కంట్రోలయాక తీసుకెళ్లండి” అని చెప్పి వెళ్ళాడు.
మాధవ్ వెళ్ళేసరికి సిరప్‍లు వేసి, ఇంజక్షన్ యిచ్చి, బెడ్‍మీద పడుకోబెట్టారు వాడిని.
“నన్ను లేపలేదేరా? అంత కానివాడినైపోయానా?” అన్నాడు మాధవ్. అతని భుజం తట్టి వూరుకున్నాడు వాసు.
మాధవ్ వెళ్ళాక నీలిమకి మనసు మనసులో లేదు. తలకెక్కినదంతా దిగింది. విచక్షణ మేల్కొంది. ఉన్నట్టుండి వీడికింత జ్వరం ఎలా వచ్చింది? ఇప్పుడెలా వున్నాడు? తను ఎత్తుకుని తిరిగినవాడేకదా, వీడు? అంతలా ఎలా అనగలిగింది? తగ్గిపోతుందా? క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడా? భయంతో వణికిపోయింది. ఎంతసేపు కూర్చుందో తెలీదు. బాహ్యస్పృహ కలిగి చూస్తే తెల్లారి నాలుగు. హాస్పిటల్లో చేర్చారా? ఎలా వుంది వాడికి? ఏమీ కాదుకదా? ఒక వుద్వేగంలాంటిది వచ్చింది. పళ్ళు తోముకుని, బావిదగ్గర రెండుచేదల నీళ్ళు తోడుకుని అక్కడే నెత్తిమీంచీ పోసుకుని, తడిబట్టలతో లోపలికి వచ్చింది. దేవుడి గది తుడిచి, దీపంపెట్టి చేతులు జోడించి అలాగే నిలబడింది. ఒకొక్క నిముషం గడుస్తుంటే వెన్నులోంచీ వణుకొస్తోంది. వంటిమీంచీ నీళ్ళు కారి కింద మడుగుకట్టాయి. బట్టలు మార్చుకోవాలన్న స్పృహ లేనట్టు అక్కడే కూర్చుంది. చాలాసేపటికి కాలింగ్‍బెల్ మోగింది. లేచి, దీపం కొడిగడుతుంటే మళ్ళీ నూనె పోసి వెళ్ళి తలుపు తీసింది. మాధవ్.
“ఎలా వుంది వాడికి?” ఆతృతగా అడిగింది.
“ఈ తడిబట్టలేమిటి? ఇల్లంతా యీ నీళ్ళేంటి? వెళ్లి బట్టలు మార్చుకో ముందు” అన్నాడు. ఎదురుగా దేవుడిగదిలో వెలుగుతున్న దీపం చూస్తే విషయం అర్థమైంది. ఏం లాభం? గాజుగ్లాసు చేతిలోంచీ పడి పగిలిపోయింది. ఇంక అతకదు. అనుబంధాలూ అలానే పగిలిపోయాయి. ఇక అంతే.
“వెనక వస్తున్నారు” అని గబగబ వాసు గదిలోకి వెళ్ళి, దుప్పటి పాడై వుండటం చూసి, దాన్ని మార్చి వేరేది వేసాడు. దానిమీద రబ్బరుషీటు, అది కవరయ్యేలా రెండుమడతల టవలూ వేసి యివతలికి వచ్చాడు. ఫ్రిజ్జిలోంచీ పాలు తీసి వెచ్చబెట్టి కాఫీ చేసి, రెండుగ్లాసుల్లో పోసి వాళ్ల గదిలో వుంచి మూతలు పెట్టి వచ్చాడు. నీలిమకి యిచ్చి తనూ తాగుతూ వాసూ గీతా వచ్చేదాకా వుండి, వాళ్ళొచ్చాక, కాఫీ తాగండని చెప్పేసి తనగదిలోకి వచ్చాడు. నీలిమ బట్టలు మార్చుకుని పొడిబట్టలు కట్టుకుని వుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.