(“వెనక వస్తున్నారు” అని గబగబ వాసు గదిలోకి వెళ్ళి, దుప్పటి పాడై వుండటం చూసి, దాన్ని మార్చి వేరేది వేసాడు. దానిమీద రబ్బరుషీటు, అది కవరయ్యేలా రెండుమడతల టవలూ వేసి యివతలికి వచ్చాడు. ఫ్రిజ్జిలోంచీ పాలు తీసి వెచ్చబెట్టి కాఫీ చేసి, రెండుగ్లాసుల్లో పోసి వాళ్ల గదిలో వుంచి మూతలు పెట్టి వచ్చాడు. నీలిమకి యిచ్చి తనూ తాగుతూ వాసూ గీతా వచ్చేదాకా వుండి, వాళ్ళొచ్చాక, కాఫీ తాగండని చెప్పేసి తనగదిలోకి వచ్చాడు. నీలిమ బట్టలు మార్చుకుని పొడిబట్టలు కట్టుకుని వుంది.)
“ఎలా వుందిరా, వాడికి? డాక్టరు ఏమన్నాడు?” తండ్రి గొంతు వినిపించింది.
“తగ్గింది నాన్నా! కంగారేం లేదన్నాడు” వాసు జవాబు.
“జాగ్రత్తగా చూసుకోండి” అని ఆయన వెళ్లిపోయాడు.
“ఒక్కరోజులో అంతా తలకిందులు చేసేసావు నీలిమా!” అన్నాడు మాధవ్ అలసటగా మంచంమీద వాలి. ఆమె ఏమీ మాట్లాడకుండా తనూ నిద్రకి వుపక్రమించింది. ఆరోజు ఆదివారం ఎవరికీ ఆఫీసు వుండదుకాబట్టి కాస్త ఎక్కువసేపు పడుక్కుందామనుకున్నా, కుదరలేదు. మయూ లేచి వచ్చేసాడు. వాడిని పడుకోబెట్టి తను ఇవతలికి వచ్చాడు వాసు. తర్వాత పనావిడ వచ్చింది. వాసు వెళ్లబోతుంటే నీలిమ గబగబ లేచివచ్చింది.
“నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి” అంది. ముందురోజు జరిగిన సంఘటన నిజమేనా అనే అనుమానం వచ్చిందతనికి ఆమెని చూడగానే. ఆమె అతని ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. తలదించుకుని అతన్ని దాటుకుని వెళ్ళిపోయింది.
ఏ సంఘటనా వంటరిది కాదు. దానికి ఒక కర్త వుంటాడు, ద్రష్టలుంటారు. ప్రత్యక్షంగా చూడకపోయినా దాని పూర్వాపరాలని విశ్లేషించే ఆలోచనలు వుంటాయి. దాన్ని అనుసంధానించుకుని పుట్టే మరికొన్ని సంఘటనలు వుంటాయి. ఇంత సమూహం దానిచుట్టూ వుంటాయి. తులసిని చూడతానికి వచ్చింది లక్ష్మి. కొద్దిగా నలతగా వుంది. అంతే. చరణ్ అమ్మ వళ్ళో చేరిపోయాడు. ఇంట్లో అందరూ అభిమానంగా మాట్లాడారు. ఆరోజు వున్నాక తులసిని నాలుగురోజులు తనతో తీసుకెళ్తానని వియ్యపురాలిని అడిగింది లక్ష్మి. వాళ్ళకి శ్రీధర్ కాకుండా మరో కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. పెద్దకొడుకు ఢిల్లీలో వుంటాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్ళాలనుకున్నారట. ఆవిడ చెప్పింది.
“అక్కడినుంచీ వచ్చాక వస్తాను” అంది తులసి. ఢిల్లీ వెళ్తున్నందుకు చాలా వుత్సాహంగా వుంది ఆమెకి. ఆరోజుకి వుండి మర్నాడు తిరుగుప్రయాణమైంది లక్ష్మి.
“వచ్చారుకదా, రెండురోజులుండండి” అంది తులసి అత్తగారు.
“గీత అమ్మానాన్నలు ఇప్పుడు బెంగుళూర్లో వుంటున్నారు. విహీని చూసుకోవడానికి ఎవరూ లేరు” అంది లక్ష్మి.
“అదేంటి, ఒకటిరెండురోజులకి నీలిమ చూసుకోలేదూ?” అడిగిందావిడ చాలా మామూలుగా. లక్ష్మి నవ్వేసి వూరుకుంది. అలాంటి నవ్వులో అంతరంగం తొంగిచూస్తుంది. ఆవిడ ఇంక తర్కించలేదు. ఏ యింట్లో వుండే గొడవలు ఆయింట్లోనే వుంటున్నాయి. ఆవిడ పెద్దకోడలు తులసిలా నెమ్మదస్తురాలు కాదు. పెళ్లైనప్పట్నుంచే వేరే వుండటంతో ఆ అమ్మాయి మంచిచెడులు పెద్దగా బైటపడలేదు. చుట్టపుచూపుగా వెళ్తే మర్యాదలు బానే చేస్తుందిగానీ, నలుగురిమధ్య కలిసిపోయి, సర్దుకుని వుండే తత్వంకాదు.
“టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నాక ఏ రైలుకి వెళ్తున్నారో చెప్తే ఎవర్నేనా స్టేషనుకి పంపిస్తాను” అంది లక్ష్మి. ఆమాట అందరి ఎదుటా అంది.
“వస్తే అన్నయ్యలిద్దర్నీ రమ్మను. లేకపోతే వాసునీ, వదిన్నీ రమ్మను. చిన్నొదిన్నిమాత్రం పంపకు. నాకు చిరాకు” అంది తులసి తల్లితో విడిగా.
“అదేంటే?” అంది లక్ష్మి తెల్లబోయి.
“ఆవిడేదో ఆకాశాన్నుంచీ దిగొచ్చాననుకుంటుంది. గీతలా ఫెయిర్ కాదు. ఏదన్నా అంటే మాధవ్ బాధపడతాడని వూరుకుంటాను” అంది తులసి.
“నిన్నేమైనా అందా?” ఆరాగా అడిగింది లక్ష్మి.
“ఏమీ అనదుగానీ, తనేదో ప్రత్యేకమైన మనిషిననుకుంటుంది. ఎవర్తోనూ సరిగ్గా మాట్లాడదు. మనలాంటి కుటుంబమేగా వాళ్ళదీను? చదువూ మామూలు చదువే. మాధవ్ పొజిషన్ చూసి ఆ గర్వం. ఇందులో తక్కువవాళ్ళెవరం? ఎవరికి వుండేవి వాళ్ళకి వున్నాయి”
తనకి చూచాయగా అనిపిస్తున్న విషయాలు, అలా అనిపించినా వప్పుకోవడానికి మనసు వప్పని విషయాలు ఇంత స్పష్టంగా వేరేవాళ్లకి కనిపిస్తాయా? లక్ష్మి నిర్విణ్ణురాలైంది.
“గీతకూడా మాధవ్‍ని చూసే ఆగుతోంది. అలుసు యివ్వద్దు ఆమెకి. మా అత్తగారు ఇంత అభిమానం చూపిస్తుందా, ఎక్కడా ఆవిడ గీసిన గీటు దాటనివ్వదు. నువ్వూ అలా వుండాలమ్మా! ఎంతకాలం నాన్నగురించి బాధపడతావో చెప్పు. ఆయనంతే. మారరు. ఇల్లు, సంసారం నీవి. ఆయన వదిలెసారని నువ్వూ పట్టించుకోకపోతే మేమంతా ఏమౌతాం? మాధవ్‍కి అర్థమయ్యేలా చెప్పగలిగినదానివి నువ్వే. మేం ఎవరం చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటాడు. భార్యాభర్తల విషయంకదూ?” అంది తులసి ఆరిందాలా.
“అవన్నీ నేను చూసుకుంటాలే తులసీ! పిల్లల్లేరని భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడుతున్నారు. ఎవరమేనా ఆ వొక్కవిషయందగ్గిరే ఆగుతున్నాం. మాధవ్ వెనక అదేమైనా వేషాలు వేస్తుందిగానీ, వాడికి తెలిసేలా కాదు” అంది లక్ష్మి.
“మరి తీసుకెళ్ళి డాక్టరుకి చూపించారా వాళ్లవాళ్ళు?”
“పిల్లలకి పురుళ్ళు పోసి పేర్లుపెట్టించడానికే గిజగిజలాడిపోతున్నారు. మాధవే డాక్టర్లదగ్గిరకి తిప్పుతున్నాడు”
“గీతని తెలివితక్కువదని మీరంతా అంటారుగానీ, నీకు లేని తెలివి తనకెలా వస్తుందమ్మా? వాళ్లకి డబ్బులేదని మీరనుకోవడం దేనికి? అది వాళ్ళుకదా, చెప్పుకుని తగ్గివుండాలి. మనం యిచ్చేది మర్యాదని వాళ్లకి అర్థంకావద్దూ? విహీని నువ్వే చూడాలా? రెండురోజులు నువ్వు ఎక్కడికేనా వెళ్తే ఆమె చూడదా? ఇంట్లో మనిషేకదా? మరి మీరిద్దరూ వండిపెడితే తిని కూర్చుంటుందేం? మీ అత్తాకోడళ్ళిద్దర్నీ వాసు ఎలా భరిస్తున్నాడో! ఇద్దరూ ఇద్దరే. మాధవ్‍కూడా మీకు జత” అంది తులసి. తనింట్లో నేర్చుకున్న మంచితనాన్నీ, అత్తగారిదగ్గర నేర్చుకున్న లౌక్యాన్నీ రంగరించుకుని సేవించి, జీర్ణం చేసుకుంటోందామె. తులసి అత్తగారు మంచిదే. కానీ అది షరతులతో కూడిన మంచితనం. నిక్కచ్చితనంతో కలిసిన లౌకికత్వం.
“ఇలా మెతగ్గా వుంటే మీ అక్కగారితో నెగ్గలేవు తులసీ! నీ తెలివి నువ్వు నేర్చుకోవాలి. మీమధ్య గొడవలొస్తే నేను మధ్యవర్తిత్వానికి రాను. వాళ్ళిద్దరు అన్నదమ్ములూ మీకోసం గొడవపడరు. ఇల్లన్నాక నాలుగురకాల మనుషులుంటారు. మాటామాటా వస్తే అక్కడికక్కడ తేల్చేసుకోవాలి. మళ్ళీ కలిసిపోవాలి. అంతేగానీ, ఏడవటాలూ, ముఖాలుమాడ్చుకోవడాలూ, మధ్యవర్తిమంతనాలూ నాకు నచ్చవు. మనసెంత మంచిదైనా, మాట చలాకీతనం లేకపోతే లోకంలో నెగ్గడం కష్టం” అని మొదట్లోనే చెప్పేసిందావిడ. అప్పట్నుంచీ తనని తను మార్చుకుంటూ వచ్చింది తులసి. తన కళ్లముందే ఇంత మార్పు చెందిన కూతుర్ని చూసి లక్ష్మి చాలా ఆశ్చర్యపోయింది.
ఊరెళ్తున్నారు, ఏవేనా కొనుక్కోండని వెళ్ళేముందు తులసికి డబ్బిచ్చింది లక్ష్మి.
“మీ అమ్మాయి నాకు అప్పులిచ్చి పదిరూపాయల వడ్డీ తీసుకుంటోందండీ” అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.
“ఏం కాదమ్మా! అప్పుడెప్పుడో అవసరంపడి నాదగ్గిర వెయ్యి తీసుకున్నారు. బంగారం ధర తగ్గింది, మకరకుండలాలు చేయించమన్నాను. కంసాలికి ఆర్డరిస్తే ఆ వెయ్యీకాక ఇంకా పైన పడింది. ఏవో దొంగలెక్కలేసుకుని అప్పట్నుంచీ ఇలా బనాయిస్తున్నారు” అంది తులసి.
“నువ్వు సరిగ్గా చదువుకుంటే అతని లెక్కల్లో తప్పెక్కడో చెప్పగలిగేదానివికదే?” అంది లక్ష్మి తనూ నవ్వుతూ.
“డిగ్రీ అవగొడతాలేమ్మా!” అంది తులసి.
“మరేం తొందర లేదులే తులసీ! మన పెళ్ళికి ఇంటరైంది. చరణ్‍గాడి పెళ్ళికి డిగ్రీ చెయ్యచ్చు” అన్నాడతను.
నవ్వులమధ్య లక్ష్మి కదిలింది. అతనొచ్చి బస్సెక్కించాడు. ఇంటికి తిరిగి వెళ్ళేడప్పుడు ఎప్పుడన్నది చెప్పదు లక్ష్మి. ఇల్లెలా కిష్కింధలా వుందో చూద్దామని చెప్పాపెట్టకుండా వచ్చేస్తుంది. అదే అలవాటు ఇప్పటికీ. ఫోన్లొచ్చాకకూడా. ఇంటిదగ్గిర సందుమలుపు తిరుగుతుంటే వీళ్లకి వెనకింట్లో వుండే పిల్లవాడు రివ్వుని వాళ్ళ గేట్లోంచీ వచ్చాడు.
“మామ్మగారూ! నిన్న మా బంతి మీ పెరట్లో పడితే తీసుకుందామని గోడమీంచీ దూకాను. గీతత్త బావిదగ్గిర కూర్చుని ఏడుస్తోంది. విహీగాడేమో మట్టిలో ఆడేస్తున్నాడు. గుప్పిళ్లతోతీసుకుని తలమీద పొసేసుకున్నాడు” అన్నాడు ఒక బాధ్యత నిర్వర్తించినట్టు. నిర్విణ్ణురాలైంది. నాలుగైదు క్షణాలుపట్టాయి ఆమెకి తేరుకోవడానికి.
“మరి నువ్వేం చేసావు? ఎందుకు ఏడుస్తున్నావని అత్తని అడగలేదా? ” అడిగింది.
“మయూవిహీవాళ్ల బాబాయ్ వచ్చి వాళ్ళిద్దర్నీ లోపలికి తీసుకెళ్ళాడు. నేను నా బంతి తీసుకుని గోడెక్కి వెళ్లిపోయాను”
ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వచ్చేముందు అలవాటుప్రకారం భర్త గదిలో కాసేపు కూర్చుంది. ఆయన రాత్రి జరిగినదాన్నీ, తన సందేహాన్నీ ఆమెముందు పెట్టి, “వాసూ, మాధవ్ దెబ్బలాడుకున్నారా లక్ష్మీ? మాట్లాడుకోవట్లేదా?” అని అడిగాడు.
గీత ఏడ్చింది, విహీకి జ్వరం. ఆమెకి మనసంతా అతలాకుతమైపోయింది. తులసి అన్నట్టు యింటిని తను సరిగ్గా నడపట్లేదా? తను లేని సమయాన ఏం గొడవజరిగింది? గీత ఏడవడమేమిటి? వెళ్ళేముందు జలుబుగా వున్నాడు విహీ. వాడికి వున్నపళంగా అంత జ్వరం ఎందుకొచ్చింది? ఇంట్లోకి వెళ్ళి మనవడిని చూసేదాకా మనసు ఆగలేదు. జ్వరంతగ్గి కాస్త తేటపడ్డాడు విహీ. హాల్లో వాసు పక్కని కూర్చుని ఆడుకుంటున్నాడు. మామ్మకి చేతులందించాడు. అమ్మా అమ్మా అంటున్నాడు పదేపదే. చెవికోసిన మేకలా.
“ఇదెప్పట్నుంచీ?” ఆశ్చర్యంగా అడిగింది. “వాడు గీతకొడుకు, వీడు అమ్మకొడుకూనా?” అంది. ప్రహ్లాద్ పెళ్ళిలో మయూ గీతకొడుకునని చెప్పుకుని తిరగడం గుర్తుచేసుకుని. పర్సు బీరువాలో పెడుతుంటే వాసు అక్కడ పెట్టిన కాగితాలు కనిపించాయి. తీసి చూసింది. మడిచి జాగ్రత్తగా పెట్టింది. ఉన్నట్టుండి ఈపనెందుకు చేసినట్టు? భర్తని ఎవరేనా అడిగారా, ఇంటిగురించి? భృకుటి ముడిపడింది.
“ఎలా వుందమ్మా, తులసి? తీసుకొస్తానన్నావు?” అడిగాడు వాసు.
“అనారోగ్యమేమీ కాదుగా? ఇప్పుడు రానంది. ఢిల్లీ వెళ్తున్నారట. తిరిగొచ్చాక వస్తానంది” అంది.
“గీతేది?” అడిగింది. అడుగుతూ వాసు ముఖంలోకి చూసింది. అతని ముఖంలో చిన్నకోపరేఖ కనిపించింది. వాసు కోపాన్ని అసలు దాచుకోలేడు.
“తినేసి, పడుక్కుంది. బాగా అలిసిపోయింది. నిన్నంతా చికాగ్గా గడిచింది. రాత్రసలు నిద్ర లేదు. తను లేచాక మాట్లాడుకుందాం” అన్నాడతను. వాళ్లగదిలోకి వెళ్ళి గీతని చూసింది. మనసు కదిలిపోయింది. మమకారం పెల్లుబికింది. ఆ గూట్లోంచీ ఈ గూట్లోకి వచ్చిన చిలక. ప్రపంచం తెలీదు. అంతా మంచే వుంటుందనుకుంటోంది. అందరూ ఒకళ్లనొకళ్ళు ఇష్టపడుతూనే బతుకుతారనుకుంటుంది. తనకి కనిపించే పారదర్శకతే ప్రపంచమంతా నిండి వుంటుందనుకుంటుంది. తనలాగే ముక్కుసూటిగా వుంటారన్న నమ్మకం. అది కొంచెం సడిలినప్పుడు ఇలాకూడా వుంటుందాని ఆశ్చర్యపోతుంది. బాధపడుతుంది. ఏడుస్తుంది. భిన్నావసరాలు విభిన్నకోణాల్లోంచీ ప్రపంచాన్ని చూపిస్తాయని ఇంకా ఎప్పుడు తెలుసుకుంటుంది? అసలు నిన్నేం జరిగింది?
తులసి విషయం తెలిసింది. సంతోషపడ్డారు. చిన్నపిల్లల్లా ముగ్గురూ కూర్చుని మాట్లాడుకున్నారు. ఎప్పటెప్పటి విషయాలో చెప్పుకున్నారు. నీలిమ మాటాపలుకూ లేకుండా కూర్చుంది. తులసి అన్నట్టు ఆకాశంనుంచీ వూడిపడ్డట్టా? ఆ తర్వాత ఎటువాళ్లటు వెళ్ళాక గీతతో గొడవపెట్టుకుందా? ఏం కావాలి నీలిమకి? గీతతో గొడవెందుకుపడింది? నిన్ననే ఎందుకు? ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడి సమాచారాన్నో పోగుచేసుకుని ఒకదాంతో ఒకటి అనుసంధానమౌతున్నాయి.
భోజనాలయ్యాయి. అంతా హాల్లో కూర్చున్నారు. గీతని మాటలనేసినంత తేలిగ్గా లక్ష్మి ఎదురుగా కూర్చోలేకపోతోంది నీలిమ. గుండె దడదడలాడుతోంది. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
“అమ్మా! మేము కొన్నాళ్ళు వేరే వుందామనుకుంటున్నాం” అన్నాడు మాధవ్ నెమ్మదిగా.
“ఆ విషయం నేనే చెప్పాలనుకున్నాను మాధవ్! మనింట్లో ఇంకో పదేళ్లదాకా ఈ జాతర నడుస్తునే వుంటుంది. ఇప్పుడింకా అందరికీ ఒక్కొక్క పిల్లలే. మరోరౌండు మొదలౌతుంది. ఈలోపు మిగతావాళ్ళ పెళ్ళిళ్ళౌతాయి. ఇవన్నీ చూస్తూ తట్టుకోవడం నీ భార్యకి కష్టమే. ఎవర్ని అంటే ఎవరూ వూరుకోరు. గీత యిన్నాళ్ళూ వూరుకుందంటే నీమీది అభిమానంచేత. దూరంగా వుండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి” అంది లక్ష్మి క్లుప్తంగా. జరిగిన గొడవ తల్లికి తెలిసిందని మాధవ్‍కి అర్థమైంది. తలదించుకుని కూర్చున్నాడు.
“మనసుకి సంతోషం లేకుండా చేస్తున్నారు ఇద్దరూను. ఇంట్లోవాళ్ల గౌరవం ఎలా నిలబెట్టాలో భార్యకి చెప్పుకోలేనివాడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా? గీతని చూస్తే ఎందుకంత అసూయ? అది మీకేం అడ్డొచ్చింది? దాన్ని ఏడిపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నువ్వూ, వాసూ వుండగానే గొడవపడ్డారా? లేకపోతే ఎవరూ లేనిది చూసి మనసులో దాచుకున్నదంతా కక్కేసిందా? ఏమందసలు? అనడానికేం వుంది?” అడిగింది.
“నీకెవరు చెప్పారు?” చప్పుని అడిగాడు మాధవ్.
“ఎవరు చెప్తేనేం, ఇక్కడికి వచ్చేదార్లోనే వార్త అందింది. దొంగపనులు చేస్తే దాగవు. ఏదో ఒకలా బైటపడతాయి. ఇంటికి రాగానే నాన్న అడిగారు, ఇద్దరూ దెబ్బలాడుకున్నారా, మాట్లాడుకోవట్లేదా అని. ఇంత జరిగితే నాకు ఫోనెందుకు చెయ్యలేదురా వాసూ?”
“అవన్నీ యిప్పుడెందుకులేమ్మా? వాళ్ళు వేరే వుంటామంటున్నారుకదా? వెళ్లనీ. పొమ్మంటే మేముకూడా వెళ్ళిపోతాం. ఆ తెలివితక్కువదాంతో నువ్వుమాత్రం ఎంతకని వేగుతావు? తనని తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎవరం ఎంతని దగ్గిరుండి చూసుకోగలం? ఇరవైనాలుగ్గంటలూ తన వెంట నేనుండను. తలొంచుకుని పనిచేసుకోవడంతోపాటు అవసరమైతే గరిట తిప్పి రెండు తగిలించడంకూడా రావాలి” అన్నాడు వాసు.
నీలిమ చివాల్న తలెత్తి రోషంగా చూసింది. పట్టించుకోలేదు వాసు. వీళ్ళమాటలకి గీత నిద్రలేచి ఇవతలికి వచ్చింది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళి లక్ష్మి పక్కని కూర్చుంది.
“దాన్నంటావేరా?” అంది లక్ష్మి.
“అనక ఏం చెయ్యను? మేమిద్దరం ఆఫీసులకి వెళ్ళాం. రుక్కమ్మ ఆమ్మ గోడమీంచీ పలకరించి, తులసి విషయం విని, వీళ్ల విషయంలో ఏదో అందట. దానిమీద పెద్దగొడవ. అన్నీ ఒకదాంతో ఒకటి పొంతనలేని విషయాలు మాట్లాడిందట నీలిమ. అంటే చాలా సమస్యలున్నట్టున్నాయి ఆమెకి. వాళ్లక్కచెల్లెళ్ల భర్తలు ముగ్గురివీ పెద్దపెద్దవుద్యోగాలుకదా, మాతో కలిసి వుండటానికి యిబ్బందిగా వుందట! మా పిల్లలూ, మా పెంపుడు పిల్లలూ నచ్చలేదట. వాళ్ళ స్టేటస్‍కి తగరట. అందుకని మాదారిన మేముకూడా వెళ్లిపోదామనుకుంటున్నాం”
లక్ష్మి నివ్వెరబోయింది. కొన్నిగంటలకిందట కూతురన్నదీ యిదే. వదిలిపెట్టకూడదు. సరిదిద్దాల్సిన టైము యిదే. నీలిమా నివ్వెరబోయింది. అన్నీ చెప్పేసిందా, గీత? అలా ఎలా చెప్పుకుంది? సిగ్గనిపించలేదా? సన్నగా వణుకు మొదలైంది.
“వెళ్తావు, వెళ్తావు. నీకేం? ఇక్కడ గడప దాటితే మంగళహారతులతో ఎదురొచ్చి తీసుకెళ్లడానికి నీ మామ వున్నాడు. వీడిదే ఎటూ కాని పరిస్థితి. వీడిమామకే, యిల్లు లేదు. ఇంక వీళ్ళనెక్కడికి తీసుకెళ్తాడు? అవంతీపురంవాళ్ల ఐదోయువరాజావారు మేనమామ వెనకాలా అన్న వెనకాలా నిలబడి ఇన్నేళ్ళూ కానిచ్చుకున్నాడు. ఇప్పుడిక స్వంతపెత్తనం వెలగబెట్టాలి” అంది లక్ష్మి.
సంభాషణ ఎటు తిరుగుతోందో నీలిమ వూహించలేకపోయింది. ఇంట్లో తనెలా వున్నా, ఏం చేసినా ఇన్నాళ్ళూ ఎవరూ ఏమీ అనలేదు. అత్తగారు నాలుగైదుసార్లు చెప్పి చూసి వదిలేసింది. మాకు పదేపదే చెప్పే అలవాటు లేదంటే తలెగరేసింది. ఇంట్లో మరోమనిషుండి అన్నీ బాధ్యతగా చూసుకుంటుంటే తన అవసరం ఆవిడకి లేకపోయింది. అందుకే చెప్పి వూరుకుంది. ఇప్పుడేంటి? ఇల్లంతా చేతిలోకి రావాలని తను అనుకుంటే మాధవ్ మనమే బైటికి వెళిపోదామంటున్నాడు!
“రెండుమూడొందల గజాలు కొని మీముగ్గురికీ యిమ్మను. తలో ఫ్లోరూ కట్టుకుని ఆయనక్కూడా ఒకటి వేసిద్దురు” అంది లక్ష్మి.
“అమ్మా! ఆయన గొడవ మనకెందుకు?” ఇబ్బందిగా అన్నాడు మాధవ్.
“ఎందుకేమిటి? గొడవ మొదలైందే అక్కడకదా? ఎవరో ఎవరిదగ్గిరో కూర్చుని ఏడవకపోతే అలాంటి ఆలోచనలు పుట్టవు. ఏడుపులు దేనికి? డొంకతిరుగుడు అక్కర్లేదు. గీతకి వాళ్ల నాన్న పదికాసుల బంగారం పెట్టి ఆరుసెంట్ల స్థలం యిచ్చాడు. కట్నమంటే వద్దన్నాంగానీ, అసలేమీ యివ్వద్దనలేదు మీ మామని. వాళ్లపిల్లకి వాళ్ళు పెట్టుకోవడానికేం? ఇక్కడ కూర్చుని గీతని చూసి ఏడవకుండా, అదేదో మీ నాన్నతో దెబ్బలాడి కావలిసినవి తెచ్చుకోకూడదా నీలిమా? మీకింకా పిల్లలు పుట్టకపోతే మీవాళ్లకి పట్టదేమే? పెళ్ళిచేసేసి చేతులు దులుపుకున్నారు” అంది లక్ష్మి. ఆవిడ గొంతు కటువుగా వుంది. నిజానికి ఈ సంఘటన ఆవిడకి పెద్ద గుణపాఠంలా వుంది. ఉపేక్ష ఎంతకి దారితీస్తుందో తెలిసింది. తులసి చేసిన హితబోధ బాగా పనిచేసింది. తను యిన్నాళ్ళూ వుపేక్షించడంతోపాటు గీతకికూడా తప్పు సందేశం యిచ్చింది. నిన్నోమాట అంటే ఫెడీమని జవాబివ్వని చెప్పి వుంటే పరిస్థితి వేరేగా వుండేది. తను చెప్పిందనో, మాధవ్ బాధపడతాడనో చిన్నచిన్న విషయాలకి గొడవెందుకనో వూరుకుంది గీత. ఇప్పుడవి పెద్దపెద్దవిగా మారిపోయాయి. వీళ్లంతా తన పెద్దరికానికి విలువనిస్తున్నారు. పెద్దరికమంటే ప్రతిదాంట్లో దూరిపోవడం కాకపోవచ్చుగానీ, అవసరమైన నియంత్రణేనా చెయ్యకపోతే ఎలా?
ఆవిడకి అన్నిమాటలు వచ్చుననీ, అనగలదనీ అనుకోలేదు నీలిమ. పిల్లల విషయం ఎత్తడం నచ్చలేదు. ములుగర్రతో పొడిచి లేపినట్టైంది. తన తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదన్న విషయం అంత ఎత్తిచూపించడం దేనికి? డబ్బుంటే చూపించరా? తన్వాళ్ళకెనా, వీళ్లకి పిల్లలక్కర్లేదా? కోరి చేసుకున్నారుకదా? గీతతో సమానంగా కానుకలు తేవాలా? ఆవిడ మనసులో అలాంటి కోరిక మొదట్నుంచీ వుందా? తనే గొడవలు పెట్టుకుని తెచ్చి ప్రతిష్టించిందా? కట్నం తీసుకోలేదుగాబట్టి భారీగా కానుకలు ఇవ్వాలని కోరుకుంటున్నారా మూడిళ్లలోనూ? వీళ్ళ సంస్కారాలు ఇంతేనా? మానస యింట్లో గొడవలు గుర్తొచ్చాయి. ఇప్పుడిక ఇక్కడ మొదలా? ఉన్నవాళ్ళు పిల్లలకి పెట్టుకుంటారు. తల్లిదండ్రులు పెట్టలేనప్పుడు పిల్లలే సమకూర్చుకోవాలనికదా, తండ్రి చెప్పినది? తనదార్లో వున్న ముళ్లంటే గీతావాసులేగా?
“వాళ్లకి ఉంటే ఇవ్వరాండీ?” అంది నెమ్మదిగా.
“ఆ విషయం గుర్తుందా? మర్చిపోకు. గుర్తుచేసే సందర్భం మరోసారి వస్తే ఇంత సాఫీగా వుండదు. మీకు యిల్లు దొరికేదాకా వెళ్ళి మీ పుట్టింట్లో వుండి పనీ అదీ నేర్చుకో. వేరే వెళ్తే నువ్వే అన్నీ చేసుకోవాలి. ఎవరూ కూర్చోబెట్టి చెయ్యరు” ఆమెతో అని, “మీ మామని వచ్చి తీసుకెళ్ళమను మాధవ్!” కొడుక్కి చెప్పింది లక్ష్మి. ఆవిడ తగ్గదని అర్థమైంది నీలిమకి.
గీతవైపు తిరిగింది లక్ష్మి.
“నీ సంగతేంటే? వంటిమీద ఒక్కమాటకూడా వుంచుకోవని మీగుంపంతా నిన్నంత ఎత్తుకి ఎత్తుతారు, జవాబు చెప్పలేవా నీలిమకి?” అడిగింది.
“మేమంటే సరదాగా అనుకుంటాం. ఇవేం గొడవలు, అసహ్యంగా? వాళ్ళింట్లో అలా తిట్టుకోవడం అలవాటేమో, నేను పెరిగిన పదిళ్లలోనూ అలాంటిది చూడలేదు. బురదలో పడితే ముందు ఏడుపేగా వచ్చేది? తర్వాత చీదరపుడుతుంది. తనకంటే వుద్యోగం సద్యోగం లేదు, వ్యాపకం లేదు. నాకు చాలా పనులుంటాయి” అంది గీత విసుగ్గా.
“ఓయబ్బో! ఏమిటో అవి? మీదపడ్డ బురదని కడుక్కోవడానిక్కూడా తీరికలేనంతవి? ” అంది లక్ష్మి.
“ఎవరో డ్రాయింగ్ అకాడమీ పెట్టారట, వెళ్ళి నేర్చుకొమ్మన్నాడు బావ. స్టాండూ, డ్రాయింగ్‍బోర్డూకూడా కొనిస్తానన్నాడు. అకాడెమీ అనేమీ పెద్ద ఆర్భాటం ఏమీ లేదు. రివర్‍సైడు కూర్చోబెట్టి నేర్పిస్తారట ఆదివారాల్లో. మొత్తం ఇరవయ్యైదువారాలు. నువ్వూ రావచ్చు. సరదాగా నేర్చుకోవడానికేం? ఎవరో పుస్తకం అచ్చేసుకుంటారట. కవర్‍పేజీ డిజైన్ చేసిమ్మని అడుగుతున్నారు. నేరుగా అడగరు. రికమెండేషన్లు చేయిస్తారు. నువ్వు కాస్తంత బ్రష్షుపట్టుకోవటమేనా నేర్చుకుంటే నీ పేర్న వేసిస్తాను. నిన్నటిదాకా చిన్నాడికి మాటలు రాలేదు. ఇప్పుడింక వాడికి అన్నీ నేర్పించుకోవాలి. రవళిదగ్గిరకి వెళ్దామనుకుంటున్నాం. వచ్చే ఏడాది చదివించడానికి పిల్లాడిని వెతుక్కోవాలి. తులసి డెలివరీయా? ఇవయ్యేలోగా ఇంకెన్ని పనులొచ్చి చేరతాయో తెలీదు. ఇలా దెబ్బలాడుకుంటూ కూర్చునే తీరికేది? ఈ పిల్లితగాదాలు, కుక్కజెట్టీలు నావల్ల కావు. తగూపడ్డానికి వాళ్ళని ఇంకెవర్నేనా వెతుక్కోమను” లక్ష్మికి జవాబిచ్చి, “ఇలాంటమ్మాయితో ఎలా వేగుతావో! పిటీ యూ మాధవ్” అంది గీత. అతనికి కోపం వస్తుందనుకుంది నీలిమ. కానీ రాలేదు. తలదించుకున్నాడు. తిట్టింది స్నేహితురాలు. వదినైతే కోపం వచ్చేదేమో! అన్నాక లేచి వెళ్ళిపోయింది.
“గీతేం తెలివితక్కువది కాదు. తనకేం కావాలో, ఏం అక్కర్లేదో స్పష్టంగా చెప్పింది. అది మంచిగంధం వంటికి రాసుకుని తిరగాలనుకుంటోంది, బురద అంటించకండి. అరేయ్ వాసూ! దాన్ని తీసుకెళ్ళి ఏం కొనిస్తానన్నావో కొనివ్వు. నిన్న పొద్దున్న మీరు కూర్చుని చిన్నప్పటి అల్లర్లగురించి చెప్పుకున్నారు. మీలో ఎవరికీ పెద్దగా ఏమీ ముద్దు జరగలేదు. కన్నాం, పెంచాం, తిన్నారా, వున్నారా అని చూసుకున్నాం. అంతే. ఇప్పుడు వాళ్లు నలుగురూ పెద్దయ్యారు. సీతాకోకచిలుకల్లా రెక్కలిప్పుకుని ఎగురుతున్నారు. సుమతినీ తెలివితక్కువదనే తిట్టేవాళ్లం. కానీ అది చదువుతున్న పుస్తకాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బాధ్యతలన్నీ తీర్చుకుని తీరుబడిగా వున్నవాళ్ళం, మమ్మల్ని చదవమని ప్రోత్సహిస్తోంది. చదివి పక్కని పడెయ్యటం కాదు, వాటిమీద నోట్సవీ రాయమంది నన్ను. అవి చూసుకుని తను రెవ్యూలు రాసుకుంటుందట.
నాకంత యింగ్లీషు ఎక్కడ వస్తుందే – అన్నాను.
చదవడం రాలేదా, అలాగే ఇదీను_ అంది.
అది రాసిన రెవ్యూలన్నీ కలిపి పుస్తకం వేయిస్తాడట వాళ్ళాయన. అలాంటిపిల్లని భార్యని చెప్పుకుని తిరగడం అతనికి గొప్పకదూ? ఆ పుస్తకాన్నిగురించేనా, గీత ఇప్పుడన్నది? దీన్ని కవర్‍పేజీ వేసిమ్మందా? అది అడగదు, ఇది వెయ్యననదు. బానే వున్నారు ఇద్దరూను. మధ్యలో నాపేరెందుకు?
రవళికి రైల్వే వుద్యోగం. భార్యాభర్తలిద్దరికీ పాసు వుంది. దేశమంతా తిరిగెయ్యాలని దాని కోరిక.
పాసుంటే సరిపోతుందే? మిగిలిన ఖర్చులకి డబ్బులొద్దా- అంటే
గీతలాగే నేనూ చీరలు కొనడం మానేసాను. ఒక గోల్ సెట్టయ్యాక చాలా ఖర్చులు అనవసరం అనిపిస్తున్నాయి- అంది.
మహీ ఒక్క పిల్లనో, పిల్లాడినో కనేసి ఐందనిపించుకోవాలని చూస్తోంది.
వీళ్లని చూస్తే నాకే చాలా వుత్సాహంగా వుంటుంది, నీలిమకేమైందిరా? చిన్నపిల్ల. ఎంతో జీవితం వుంది. ఎన్నో చెయ్యచ్చు. ఎన్నో నేర్చుకోవచ్చు. సమీర, తులసి, వల్లికూడా జీవితాలని ప్రవహించుకునే ప్రయత్నాల్లోనే వున్నారు. గీత చిన్నప్పట్నుంచీ యిలానే వుంది. ఏవేవో అతకని పొసగని పనులు చాలా చేసేది. అల్లరిచేస్తోందని కోప్పడేవాళ్లం. దానికి నచ్చిన పనులు చేస్తూ ఇప్పుడు బానే వుంది. ఎవరిని యిబ్బంది పెడుతోంది? ” అంది లక్ష్మి.
కుటుంబరావుని పిలిచి నీలిమని ఆయనతో పంపాడు మాధవ్.
“కొన్నాళ్ళు వేరే వుందామనుకుంటున్నాం. ఇల్లు దొరికేదాకా మీరు తీసుకెళ్ళండి. మళ్ళీ నేనొచ్చి తీసుకెళ్తాను” అన్నాడు. ఆయన కలవరపడిపోయాడు.
“ఉన్నవూళ్ళో వేరే వెళ్లడందేనికి? ఐనా మీరు వెళ్లడమేంటి?” మాట జారాడు.
“నీలిమని అడగండి అన్నీ వివరంగా చెప్తుంది” కటువుగా అని, ఏదో అర్థమైనట్టు తలూపి మరోమాటకి ఆస్కారం ఇవ్వకుండా వెళ్లిపోయాడు మాధవ్. ఇంట్లో లక్ష్మితప్ప ఇంకెవరూ లేరు. లక్ష్మిని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు. వెనక ఎన్నేనా అనగలడుగానీ ఎదురుపడి ఒక్కమాటకూడా అనలేని మనిషాయన. తను వెనకవెనక అనేమాటలు పట్టుకుని భార్యాకూతుళ్ళు అన్నీ చక్కబెట్టాలనే ఆకాంక్షగల వ్యక్తి. నీలిమని తీసుకుని బయల్దేరాడు.
“మీరు వేరే వెళ్ళడమేంటి? ఇల్లు ఇంక చెయ్యిజారినట్టే” ఇల్లు దాటగానే ఆందోళనగా అన్నాడు నీలిమతో.
“అది నువ్వుగానీ, మీనాన్నగానీ కట్టించిందికాదు. దానిమీద నువ్వెందుకిన్ని ఆశలు పెట్టుకుంటున్నావు నాన్నా?” అడిగిందామె. ఒక మహావిస్ఫోటనం తర్వాతి ప్రశాంతతలా వుంది ఆమె మనసులో. బాంబులో మందు దట్టించినట్టు, ఆమె మనసునిండా క్రిక్కిరిసిపోయిన భావాలన్నిటినీ బైటికి అనేసాక మిగిలిన భావశూన్యప్రదేశంలో చిన్నగా ఆలోచన మొదలైంది. తండ్రిమాటలు తప్ప మరే ఆధారమూ లేకుండా, అంతా దడికట్టినట్టు గీత చుట్టూ నిలబడితే తనపక్కన నిలబడేందుకు కనీసం మాధవ్‍కూడా వుండడని తెలిసీ ఎందుకు అలా మాట్లాడిందన్న ప్రశ్న తలెత్తింది.
“అదేమిటే, అలా అంటావు? నేను చెప్పిందంతా గాలికి వదిలేసావా?” అన్నాడు కుటుంబరావు.
“ఓ మూడొందలగజాలస్థలం నువ్వూ ఇవ్వు. మాముగ్గురికీ కలిపి ఇస్తే అందులో మేం తలోటీ కట్టుకుని, నీకూ ఓ వాటా వేసిస్తాం”
“నీలిమా?” తెల్లబోయాడు.
“ఔను. మా అత్తగారు అదే అంది. గీత తెచ్చుకున్నట్టు నన్నూ అన్నీ తెచ్చుకొమ్మంది మా అత్తగారు. అప్పుడట, నాకు ఆమెకేసి తలెత్తిచూసే అర్హత వచ్చేదని స్పష్టంగా చెప్పింది. ఇన్నాళ్ళూ నువ్వు చెప్పినవన్నీ నిజమనుకున్నాను. ఇప్పుడు ఆవిడ చెప్పినవికూడా విని ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్ళూ నన్నొక్క మాట అననిది యిప్పుడు చెప్పింది”
“అవన్నీ యివ్వగలిగే తాహతే వుంటే ఈ సంబంధాలకి ఎందుకు వెళ్తాను నీలిమా? మీ అందచందాలకి గొప్ప ఆస్తిపరులే వచ్చేవారు” అన్నాడు. ఆమె ఇంక తర్కించలేదు. ఇంటికి వచ్చాకతల్లికికూడా పెద్దగా ఏమీ చెప్పలేదు. గీతకీ తనకీ గొడవైందనిమాత్రం అంది.
“ఇంటికి మూలవిరాట్టులాంటి ఆ పిల్లతోనే గొడవపెట్టుకున్నావా నీలిమా? ఏమన్నావే, ఆమెని? వెళ్లిపొమ్మన్నారా, నిన్ను వాళ్ళు? మళ్ళీ నీమొహం చూస్తారా? ఏం చూసుకుని నీ ధైర్యం? ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ నీలూ, నీలూ అని నీ వెంట తిరిగే అల్లుడికే కోపంవచ్చిందంటే… దేవుడా! ఏం ముసలకం పుట్టించుకుని వచ్చావు? అసలు ఇన్నాళ్ళు నిన్ను వాళ్ళు భరించారంటేనే గొప్పవిషయం” అని నెత్తీనోరూ కొట్టుకుంది ఆవిడ.
“ఆమెతో కలిసి ఒకచోట వుండలేనని మొదట్లోనే చెప్పాను. మీకూ చెప్పాను, మాధవ్‍కీ చెప్పాను. ఎవరో ఒకరు ఏదో ఒకదారి చూపిస్తారనుకున్నాను. ఎవరికీ పట్టలేదు. ఇప్పుడేం మించిపోలేదులే. వాళ్లకి పరువు ముఖ్యం. వదిలెయ్యరు నన్ను. నువ్వేం భయపడకు” నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. కుటుంబరావు తన ఆలోచనలో తను కూరుకుపోయి వున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కమలాక్షి అన్నగారికి ఫోన్ చేసి రప్పించింది. విషయం తెలియగానే ఛడామడా తిట్టేసాడాయన మేనకోడల్ని.
“బుద్ధీ జ్ఞానం వున్నాయటే నీకు? అన్నం తింటున్నావా, గడ్డితింటున్నావా? మీ నాన్న తెలివికి మీకింతంత సంబంధాలు రావడమే గొప్ప. లక్షల్లో వున్నాయి కట్నాలు. ఆపైన కానుకలు కుమ్మరించాలి. అవేవీ ఆశించలేదు వాళ్ళు. మా పిల్లలకి సంబంధాలు వెతకడానికి కాళ్ళచెప్పులరిగేలా తిరిగాం మా అన్నదమ్ములం. మీకు? ముగ్గురికి ముగ్గురూ రాజకుమారుల్లా వచ్చి పంచకళ్యాణిమీద తీసుకెళ్ళినట్టు మీ ముగ్గుర్నీ తీసుకెళ్ళారు. కృతజ్ఞత వుండక్కర్లేదే? ఏముందే, మీ నాన్నకి? నువ్వేదో పుట్టిల్లనుకుంటున్నావు. రెండురోజులు అన్నంపెడతాడు. మూడోరోజుని, నీ దగ్గరున్న డబ్బులు తీయిస్తాడు. ఎక్కడివి నీకా డబ్బులు? మీ ఆయన యిచ్చినవేకదా? తేరగా తినికూర్చుని వాళ్లతో దెబ్బలాడ్డమేమిటి నీలిమా? కూర్చున్న కొమ్మ నరుక్కోవడంలా అనిపించట్లేదూ?” అన్నాడు. వాళ్ళింట్లో అలా తిట్టుకోవడం అలవాటేమోనని గీత అన్నట్టుగా ఇంకా చాలా అన్నాడు.
“ఏదో చిన్నగొడవ మామయ్యా!” ఆయన వాక్ప్రవాహాన్ని ఆపాలని అంది నీలిమ.
“గొడవదాకా ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళోమాటంటే నువ్వు పడలేవా? నీకే అంత పౌరుషం పొడుచుకొస్తే మరి వాళ్లకెంత వుండాలి? అందునా నీ తోడికోడలితో గొడవపెట్టుకుని వస్తావా? ఆ పిల్ల కాలిగోటికేనా నువ్వు చాలతావా? ఎమ్మే చదివింది. ఉద్యోగం చేస్తోంది. భర్తతో సమానంగా సంపాదిస్తోంది. ఇద్దరు మగపిల్లల్ని కన్నది. తమ్ముడు ఇవేళో రేపో అమెరికా వెళ్తాడు. అక్కడికికూడా వెళ్ళొస్తుంది. ఆ కుటుంబంలో అందరికీ తల్లో నాలుకలాంటి పిల్ల. ఆ పనితనం, తెలివీ స్వయానా కళ్ళతో చూసాను. అలాంటి పిల్లతో నీకు గొడవేంటే? ఖర్మ కాకపోతేను? మీ నాన్నలా ఐమూలతెలివితేటలు చూపించకండి, అత్తారిళ్లలో సాగదని ఎన్నిసార్లు చెప్పానే మీకు?” అన్నాడు. ఏ తరంలోనూ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళు నిలదొక్కుకునేలా చూడటం తమ బాధ్యతనుకునే మగవారికి కష్టమే. కమలాక్షి అన్నదమ్ములు తండ్రివెనక కుక్కతోక పట్టుకుని గోదావరి యీదినట్టే యీదారు, చెల్లెలి కుటుంబం నిలబెట్టడానికి.’ఆయన పోయాకకూడా అదే పరంపర సాగుతోంది.
“ఎన్నని ఏం లాభంలే అన్నయ్యా? ఈయన ఏవో ఎగేస్తారు. వీళ్ళది నిజమనేసుకుంటారు. తండ్రన్నవాడు పిల్లలకి మంచి నేర్పించాలి. అది చేతకాకపోతే మాట్లాడక వూరుకోవాలి. మానస కాస్త మారింది. అర్థంచేసుకుంటోంది. దీనికే, ఏదీ చెప్పలేకపోతున్నాను. నువ్వోమాటు వాళ్ళింటికి వెళ్లి అసలేం జరిగిందో తెలుసుకుని రా! దాన్నిబట్టి ఆలోచిద్దాం” అంది కమలాక్షి.
“తప్పదుకదమ్మా, నాకు? అలాగే వెళ్తాలే” అన్నాడాయన.
ఆమె గొప్పది! ఆమె గొప్పది!! ఆమె గొప్పది!!! ఆ గొప్పావిడతో కలిసి వుందలేనంటే వీళ్ళకి అర్థంకాదు. నీలిమ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకుంది.
జరిగిన సంఘటన లక్ష్మి యింట్లో అందరిలోనూ ప్రస్ఫుటమైన మార్పు తెచ్చింది.
మాధవ్ బాగా స్తబ్దుగా మారాడు. యాంత్రికంగా ఆఫీసుకి వెళ్ళొస్తున్నాడు. లోలోపల చెలరేగుతున్న ఆలోచనలతుఫాను బాహ్యస్పృహ తగ్గించి, అతన్ని పైకలా కనిపించేలా చేసింది. నీలిమ తల్లిదండ్రులని తనెప్పుడూ తక్కువచేసి చూసింది లేదు. ఆమె తనవాళ్లని అలా ఎలా అనగలిగింది? ఏ ధైర్యంతో అనగలిగింది? తన అసమర్ధతేకదా? వాసూగీతలవి చిన్నవుద్యోగాలని తనకి ఎప్పుడూ ఆలోచనే రాలేదు. ఒకింట్లోవాళ్లమధ్య, అన్నదమ్ములమధ్య ఎక్కువతక్కువలు ఎందుకుంటాయి? చిన్నమేనమామది తప్ప పైతరంలో అందరివీ మామూలు వుద్యోగాలే. మెట్రిక్కో స్కూల్‍పైనలో అవగానే గవర్నమెంటుదో, ప్రైవేటుదో ఉద్యోగం వెతుక్కుని దొరికినదాంట్లో చేరిపొయ్యారు. ఎదిగిన పిల్లలని కూర్చోబెట్టి పోషించే శక్తి ఏ తండ్రికీ వుండేది కాదు. పెద్దచదువులు చదవాలనే కోరికగానీ, అవకాశాలుగానీ చాలా తక్కువమందికి వుండేవి. నీలిమ తండ్రిదికూడా మామూలు వుద్యోగమే. తమింట్లో పిల్లల్ని చదివించగలిగే స్తోమత వున్నా పరిస్థితులు వేరు. దాంతో వాసు వచ్చిన వుద్యోగంలో చేరిపోయాడు. వాసు అలా చేరిపోయి, బాధ్యతలు తీసుకున్నాడుకాబట్టి తనకి సివిల్సనీ, గ్రూప్సనీ కోచింగుకీ వాటికీ తిరగడానికి వీలు దొరికింది. లేకపోతే చెల్లినీ అమ్మనీ వదిలేసి ఎవరిదారిన వాళ్ళు తిరుగుతుంటే ఈ యిల్లేమయేది? ఖాళీగా వుండటం దేనికని గీత వుద్యోగంలో చేరింది. ట్రాన్స్‌ఫర్లుండవుకాబట్టి ఇంకా చేస్తోంది. ప్రమోషన్ రిజెక్ట్ చేసింది. పెద్ద వుద్యోగం ఒక్కటే మనిషి గొప్పతనానికి కొలబద్దా? అతని ఆలోచనలు తెగట్లేదు.
మరోవైపు వాసుకూడా బాధపడుతున్నాడు. ఒక డాక్టర్ని కాదనుకుని తన చెయ్యిపట్టుకుంది గీత. ఆమెకి తను సరైన హోదా యివ్వలేకపోయాడని మనసులో గుచ్చుతోంది. తనని పెళ్ళిచేసుకుందని సంతోషపడటంతో సరిపెట్టుకున్నాడు. అది సరిపోదు. గీతా బాధపడుతోంది. ఆమెది గిల్ట్‌తోకూడిన బాధ. గట్టిగా నాలుగు దులిపేస్తే అయేదానికి వేర్లుపడేదాకా తెచ్చిందని. అన్నదమ్ములిద్దరికీ ఎంత ఎటాచిమెంటో ఆమెకి తెలుసు. తల్లిని వాళ్ళు వదిలిపెట్టి వుండలేరని తెలుసు. అలాంటి కుటుంబంలో చీలిక వచ్చిందని విలవిల్లాడుతోంది. దానికి కారణం తనేనా అనేది తేల్చుకోలేకపోతోంది. ఎవరూ రెండోవాళ్ళ మొహంలోకి సూటిగా చూడలేకపోతున్నారు. ఎటూ తొణక్కుండా వున్నది లక్ష్మే. పిల్లలు పుట్టేదాకా మాధవ్ దూరంగా వుండటమే వాళ్ల సమస్యకి కచ్చితమైన పరిష్కారమని ఆవిడకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళింటికి వచ్చిన పెద్దమనిషికి మర్యాదలు బాగానే చేసింది లక్ష్మి. నీలిమ ఎలా వుందని పరామర్శ చేసింది. లోపల గీత మాధవ్‍తో అంది.
“ఇక్కడేదో గొడవజరిగిందని బయటపడకు మాధవ్! వీళ్ళేకాదు, ప్రహీవాళ్ళకికూడా చెప్పకు. అత్తకూడా అదే అంది. మీ భార్యాభర్తలమధ్య మధ్యవాళ్ళ జోక్యాలు పెరుగుతాయి. ఏదున్నా మీరిద్దరే మాట్లాడుకోవడం మంచిది” అంది. అతను తలూపాడు. బంధంలో వుండే లోపాలని సరిదిద్దుకోవడం, అది సాధ్యపడకపోతే సర్దుకుపోవడమేతప్ప దాన్ని తెంచుకోవడం అప్పటికి యింకా కుటుంబాలలోకి రాలేదు. ఏదీ జరగనట్టు మామూలుగా మాట్లాడి పంపించారు అందరూ నీలిమ మేనమామని.
“వాళ్ళు చాలా గుంభనగా వున్నారమ్మా! ఏదీ జరగనట్టే మాట్లాడారు. ఇల్లు దొరికాక వచ్చి తీసుకెళ్తానని అన్నాడు అల్లుడు. ఇంకోసారి ఇలా చెయ్యకుండా బుద్ధిగా వుండమను దీన్ని” అన్నాడాయన తిరిగొచ్చి. అక్కడ జరిగిందేమైనా చెప్తారేమో, సమర్ధించుకోవడానికి జవాబులు వెతికిపెట్టుకుంది నీలిమ. ఆ అవసరం రాలేదుగానీ, మనసుకి ఎక్కడో చురుక్కుమంది. తను మాధవ్ అవసరం, ఇంటి గౌరవం, అంతే!అంతకన్నా ఇంకే విలువా లేదని స్పష్టంగా అర్థమైంది.
ఇక్కడే విడిగా వుండడంకాకుండా దూరంగా వెళ్ళాలనే ఆలోచనలో వున్నాడు మాధవ్. తులసి వార్త అతన్నికూడా కొంచెం ఇబ్బందిపెడుతోంది. ముంబైలో వేకెన్సీ వుంటే అప్లైచేసాడు. అతను ఇక్కడ చేస్తున్నది బాగా పై ఆదాయం వుండే పోస్టు. ముంబైలో వచ్చిన వేకెన్సీ లంచావతారుల పరిభాషలో చాలా డ్రై పోస్టు. ఫైలు చకచక నడుస్తోంది.
నీలిమ వెళ్లిన నెలరోజులకి తులసిని తీసుకొచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళాడు శ్రీధర్. అప్పటికి వాళ్ళు డిల్లీ వెళ్ళొచ్చి వారమైంది. ఆపూటకి వుండి, అందర్నీ కలిసేసి వెళ్ళిపోయాడతను.
“ఆవిడో నాలుగు బాణాలు విసిరితే మీరవి గుచ్చుకుని విలవిల్లాడుతున్నారన్నమాట. తీసి అవతల పారెయ్యక అలాగే దాచుకుని బాధపడుతున్నారా?” అంది తులసి గొడవంతా విని పకపకా నవ్వి. ఆమె నవ్వుతో ఇంట్లో అప్పటిదాకా వున్న దిగులేదో స్విచ్చివెయ్యగానే వెలిగే దీపానికి భయపడే చీకట్లా పారిపోయింది.
“వదినా! తిరుగుబాణాలు నువ్వెందుకు వెయ్యలేదు?” అంది గీతతో.
“అంత అవసరమా? నేను నాలా వుండాలనుకుంటే అలా వుండటం కుదరదా? నీలిమలా మారిపోయి, మాటకి మాట అంటిస్తూ బతకాలా?” అడిగింది గీత.
“పూర్తిగా ఆమెలా మారమని కాదు. డిఫెన్సుకోసం జవాబు చెప్పక తప్పదు. ఆమె ఒకమాటంటే నువ్వు రెండు జవాబిస్తే ఇదంతా ఇంతదాకా వచ్చేదికాదు. మాయింట్లో పద్ధతి ఇంతే. మా అత్తగారు కచ్చితంగా చెప్పేసింది. ఎవరిగొడవ వాళ్ళు చూసుకోవాలి, మేమెవ్వరం కల్పించుకోమని. మా తోడికోడలు ఏదేనా అంటే జవాబిచ్చేస్తాను. ఆమె మరీ చిన్నబుచ్చుకున్నట్టనిపిస్తే సారీకూడా చెప్పేస్తాను. నాకన్నా బానే పెద్దది. అందుకని సారీ చెప్పడంలో నాకేం చిన్నతనంలేదు. నువ్విక్కడ పెద్దకోడలివి. అంతా మనమే. నిన్ను తప్పుపట్టేవాళ్ళెవరు? ఆమెని మొదటే హద్దులో వుంచాల్సింది”
“ఏమోనే! ఎవరిళ్ళలో చూసాను, ఇలాంటి గొడవలు? ఇలా ఏకు మేకౌతుందనుకోలేదు. తనకి తోచిందే తప్ప ఏదీ వినదు. తనతో వాదిస్తూ కూర్చునేంత తీరిక నాకెక్కడిది? ఇంతదాకా తీసుకొస్తుందనుకోలేదు” అంది గీత విసుగ్గా.
మాధవ్‍తో చాలా వివరంగా మాట్లాడింది తులసి.
“అన్నయ్యా! వదినవరకూ తనో పెద్ద ఆఫీసర్ని పెళ్ళిచేసుకుంది. పెద్దఆఫీసరుకి ఆమె చెప్పుకున్న నిర్వచనం ఏమిటో నాకు తెలీదు. బహుశ: నౌకర్లతో ఇల్లంతా అట్టహాసంగా వుంటుందనుకుందేమో! ఆపైన ప్రహీ, వసంత్‍లవికూడా మంచి పొజిషన్స్. ఇలా చెప్పడం వాసు, గీతలని తక్కువ చెయ్యడంకాదు. వీళ్ళిద్దరూ ఎంచుకున్న జీవితం అది. ఏ స్పష్టతోనైతే గీత వాసుని చేసుకుందో అదే స్పష్టతతో వదిన నిన్ను చేసుకుంది. ఇంట్లో ఇందరికి వుద్యోగాలున్నా, మనకి సాదాగా బతకడమే అలవాటు. ఆమెకి వేరేలా బతకాలనుందేమో! ఎప్పుడేనా అడిగావా, తనకి ఎలా వుండటం యిష్టమో?” అంది మాధవ్‍తో.
“మనింట్లో ఏం తక్కువే తనకి? ” అడిగాడతను.
“పోనీ తనకి ఎందులో ఇంట్రెస్టు?”
“ఎందులోనూ లేదు. తినికూర్చుని గొడవలు పెట్టుకోవడంలోనేమో! అప్పుడప్పుడు నాతోనూ పెట్టుకుంటుంది. ఈమధ్య గీతని టార్గెట్ చేసుకున్నట్టుంది. గొడవలు తనవల్ల కాదని గీత తేల్చి చెప్పేసింది. నేను చెప్పలేకపోతున్నాను. అది తేడా. అమ్మకూడా అంది, నీ భార్య మమ్మల్ని గౌరవించేలా చూసుకోవద్దా అని” అన్నాడు మాధవ్.
కొద్దిసేపు ఆగి అంది తులసి.
“ఇంతదాకా వచ్చిందిగాబట్టి చెప్తున్నారా! వాళ్ళు ముగ్గురికీ మాకూ గొడవలౌతుంటాయి. మీ గొడవలు మాదాకా రానివ్వద్దని అమ్మావాళ్ళూ మనతో అన్నట్టే మా గొడవలు మాలోనే సర్దుబాటు చేసుకోవాలని మేమూ అనుకున్నాం. వల్లి పెళ్ళిలో వదిన్ని ఏదో అంది మాధురి. కమిషనూ అదీ అని. అన్నాక, వాళ్లలో వాళ్ళూ నవ్వుకున్నారు. ఎవరికీ అర్థమవ్వలేదు. వదినకీ అయ్యుండదుగానీ తనని టార్గెట్ చేసి అన్నప్పుడు తేడా తెలుస్తుందిగా? అలా తను చిన్నబుచ్చుకుని డయస్‍మీంచీ దిగిపోయింది. తనలా వెళ్ళిపోయేసరికి అక్కడున్నవాళ్ళందరంకూడా దిగేసాం. మీరెవరూ ఫోటోల్లో లేకుండా పెళ్ళేమిటని పీటలమీంచీ లేచాక వల్లి గొడవచేసింది. ఫొటోగ్రాఫర్‍కి అదనంగా ఇచ్చి, మేమందరం విడిగా పోటోలు దిగాం. పెళ్లి హడావిడంతా అయ్యాక వల్లి వాళ్ళతో గొడవేసుకుంది-
గీతని మీరేమన్నారని.
మేమేమన్నాం- అని మొహాలు చూసుకుని మళ్ళీ నవ్వుకున్నారు వాళ్ళు ముగ్గురూ.
వల్లి వదిలిపెట్టలేదు.
పెళ్ళిపనులూ అవీ మీదేసుకుని చేస్తే కమిషను యిస్తారు. ఈరోజుల్లో అది గవర్నమెంటు వుద్యోగానికన్నా పెద్ద బిజినెసైపోయిందన్నాను . దానికి ఆమె ఎందుకు భుజాలు తడుముకుంది? నేను జనరల్‍గా అన్నాను-అంది మాధురి.
గొడవ యింకా పెద్దదై ప్రహీకి తెలిసింది.
నేను వెళ్ళి గీతకి సారీ చెప్పనా- అన్నాడు వాడు ఎలా సర్దిచెప్పాలో తెలీక.
సర్లే, అది ఏదో లోకంలోంచీ ఇంకేదో లోకానికి వెళ్తూ మధ్యలో ఇక్కడేవో తమాషాలు జరుగుతున్నాయి, ఆగి చూద్దాం అన్నట్టు అన్నిటినీ వింతగా చూస్తుంది. ఇలాంటివి అర్థమవ్వవు. ఏదో అన్నారనుకుంటోందిగానీ యిలాగని తెలీదు. ఇప్పుడు పనిగట్టుకుని వాళ్ళిలా అన్నారని బోధపరిచి, బాధపడమని చెప్పి, ఆ తర్వాత సారీ చెప్తావా? తెలివి-’ అంది సమీర.
మాధురి అలా వదిలేసే మనిషికాదు.
ఇందులో పనిగట్టుకుని మీరెళ్ళి సారీ చెప్పడానికేం వుంది? వాళ్ళిద్దరివీ చిన్నవుద్యోగాలు. ఏదీ చెయ్యకపోతే అంతంత డబ్బెక్కడినుంచీ వస్తుంది- అంది.
ఔనే, మీ నాన్నది కలెక్టరు వుద్యోగం మరి- అని ప్రహీ ఎద్దేవాచేసాడు.
మా నాన్నదీ అలాంటి వుద్యోగంకాబట్టే చెప్తున్నాను. పైసపైసకీ తడుముకుంటూ బతికాం. వీళ్ళకింత ఎక్కడిదని- అంది.
ముప్పయ్యైదేళ్ళకి వుద్యోగంలో చేరి, భార్యాముగ్గురుపిల్లలతో అద్దెయింట్లో గడిపిన మీ నాన్నతో వాళ్లకి పోలికా? మాట్లాడే మాటలకి అర్థం వుండాలి. ఎందుకొచ్చిన పోచికోలు కబుర్లివి- అని కోప్పడ్డాడు.
మాధవ్, ప్రహీ చాలా మారిపోయాడురా! రూడ్‍గా మాట్లాడుతున్నాడు. మాతో కాదులే, వదినతోనే. మళ్ళీ సర్దుకుంటున్నాడు. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ అపారమైన తెలిగలవాళ్ళు. లేని కుటుంబంకాబట్టి ఆపాటి తెలివి వుండాల్లే. మనింటి విషయమై ఏదో నడుస్తోంది వాళ్ళమధ్య. మానసది వేరు కాపురం. అక్కలిద్దరూ పక్కని లేకపోతే తను కొంచెం మెరుగు. మాధురి అరుణపిన్నికి చుక్కలు చూపిస్తోంది. వల్లి డెలివరీ అయాక ఇంక కలిసి వుండరనుకుంటాను. మనింట్లో అలా కాదు. అమ్మా నీలిమే ఐతే తేల్చుకునేవారు. మధ్యలో గీతకూడా వుండటం వాళ్లకి ఇబ్బందికలిగిస్తోంది. గీత మూసబొమ్మలా కాకుండా వుద్యోగం చేస్తూ, డైనమిగ్గా వుండటం, వాళ్ళిద్దరికీ మనిళ్ళలో ప్రాధాన్యత ఇవ్వటం, తనకి యిద్దరు మగపిల్లలు వుండటం, మిగిలినవాళ్లకి ఆడపిల్లలే అవడం, అన్నిటికీమించి మీకింకా పిల్లల్లేకపోవడం వాళ్ళకి నచ్చట్లేదు. ఇవి పైకి కనిపించే కొన్ని విషయాలు. లోతుగా చూస్తే ఇంకా ఏవో వున్నట్టున్నాయి. గీత వాటిని టేకిల్ చెయ్యలేదు. నమ్మకంమీద పనులు నడిపించుకుంటుంది. మనలో ఎవరమేనా ఏదేనా చెప్తే చెప్పింది మనం కాబట్టి మరో ఆలోచన చెయ్యదు. ఇంకెవరేనా వంకరగా మాట్లాడితే అలా మాట్లాడటం వెనక వున్న వుద్దేశాలు తనకి అర్థమవ్వవు. అర్థమవ్వక వుక్రోషం వచ్చి ఏడ్చేస్తుంది” అంది తులసి.
మాధవ్ చెల్లెలికేసి చూస్తూ వుండిపోయాడు. తనకి అర్థమవ్వని చాలా విషయాలు తేలిగ్గా గ్రహించింది. ఆడపిల్లల రాజకీయాలని తను వాసుతో తమాషాకి అన్నాడుగానీ, అది వాస్తవమే.
“నీతోకూడా నీలిమ అలానే వుంటుందా తులసీ?” అడిగాడు మాధవ్ బాధపడుతూ.
“నేను గీతలా వుండనుకాబట్టి బానే వుంటుంది. మనకంటే కొత్తగానీ, చాలా యిళ్ళలో ఇవన్నీ మామూలు విషయాల్రా! పెద్దగా పట్టించుకోవద్దు. అత్తాకోడళ్ళు దెబ్బలాడుకోవడం, తోటికోడళ్ళు, భార్యభర్తలు మాటామాటా అనుకోవడం మా అద్దెవాటాల్లో చూసాను. ఇంట్లో దెబ్బలాడుకుని మా అత్తగారిదగ్గిరకి వచ్చి ఒకళ్లమీద ఒకళ్ళు చెప్పుకుంటారు. ఆవిడ సర్దిచెప్తుంది. కాబట్టి పట్టించుకోనక్కర్లేదు. కొన్నాళ్ళు దూరంగా వుండటమనేది మంచినిర్ణయం. నన్ను తీసుకెళ్లడానికి ఈసారి బావని రమ్మంటాను. ఇద్దరం కలిసి వదిన్ని కలిసి వస్తాం. ఈలోగా యిల్లు వెతుక్కో” అంది తులసి.
“ముంబై ట్రాన్స్ఫర్‍కి అడిగాను. బహుశ: ఐపోతుందేమో!” అన్నాడతను.
“అదేంట్రా, అంతదూరమా?” దిగులుగా అంది. మాధవ్ నిస్తేజంగా నవ్వాడు.
నాలుగురోజులు గడిచాయి. ఇంట్లో ఇంకా పూర్తిగా మామూలు వాతావరణం రాలేదు. తులసి కొడుకు చరణ్ తండ్రికోసం అడుగుతున్నాడు. అతన్ని రమ్మని ఫోన్‍చేసింది తులసి. అతనుకూడా వాసూ, మాధవ్‍లిద్దరితోటీ మాట్లాడాడు.
“ఆడవాళ్ళ గొడవల్లో మనం తలదూర్చకూడదు బావా! ఎంత తటస్థంగా వుంటే అంత మంచిది. లేకపోతే కుటుంబాలు నిట్టనిలువునా చీలిపోతాయి. మనం అన్నదమ్ములం రక్తసంబంధం వున్నవాళ్ళం. పుట్టినప్పట్నుంచీ కలిసున్నవాళ్ళం. వాళ్ళు వేరువేరు యిళ్ళనుంచీ వచ్చి ఇటు మనతోటీ, అటు మరోయింటినుంచీ వచ్చిన ఆడపిల్లతోటీ సర్దుకుపోవాలి. ఏవో చిన్నచిన్న గొడవలుంటాయి. వాళ్లలో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. మీ చెల్లెలుకూడా తక్కువదేం కాదు. మా వదినగారితో ఫటఫటా మాటలనేసి గొడవపడుతుంది. మళ్ళీ ఇద్దరూ కాసేపటికే కలిసిపోతారు. మా అన్నయ్య ఢిల్లీలో వుంటాడు. ఆ లైఫ్‍స్టైల్ వేరు. ఈవిడిక్కడ అవంతీపురం పొలిమేరలు దాటింది మాయింటికే. అలాగే గీత జాబ్ చేస్తుంది. నీలిమ ఇంట్లోనే వుంటుంది. ఇద్దరికీ తేడాలుంటాయి. మీ అన్నదమ్ములు కలతపడద్దు” అతనింట్లో అతను నేర్చుకున్నది చెప్పాడు శ్రీధర్.
ఇద్దరూ కలిసి వెళ్ళారు నీలిమని కలవడానికి. కమలాక్షి మర్యాదలు చేసింది. చరణ్‍ని తీసుకురాలేదేమని అడిగింది. శ్రీధర్ కుటుంబరావుతో మాటల్లో పడ్డాడు. ఏదో అల్లాటప్పా పల్లెటూరి సంబంధం అనుకున్న కుటుంబరావు అతని విషయపరిజ్ఞానానికీ అతిచులాగ్గా మాట్లాడేస్తున్న ఇంగ్లీషు మాటలకీ తెల్లమొహం వేసాడు.
తులసి, నీలిమ అందచందాల్లో పోటీపడ్డట్టుంటారు. ఐతే తులసిలో వున్న నాజూకుతనం, ఆమె చేసుకునే శరీరపోషణ, అలంకారాలముందు ముందు నీలిమ కాస్త తేలిపోతుంది. తులసి వంటిమీద సొమ్ములు బానే పెట్టుకుంటుంది. నాలుగుజతల గాజులు, మధ్యలో చీరకి మేచింగ్ గాజుగాజులు, రెండువరసల సూత్రాలగొలుసు నిత్యం వుంటాయి. చిక్కంలాంటి చిన్నసంచీ ఒకటి చీరమడతల్లో ఇమిడిపోయేలా నడుముకి పట్టుదారంతో కట్టుకుంటుంది. అందులో పెద్దగొలుసు పెట్టుకుని, అవసరమైనప్పుడు తీసి వేసుకుంటుంది. కొత్తగా చేయించుకున్న మకరకుండలాల మెరుపు, అందులోని రాళ్ళరంగు చెక్కిళ్ళమీద ప్రతిబింబిస్తున్నట్టే వున్నాయి. ఆమెని ద్వేషంగా చూసాడు కుటుంబరావు.
“వారంరోజులైంది వచ్చి. ఈవేళ వెళ్లిపోతున్నాను. వదిన్నికూడా చూసేసి వెళ్దామని వచ్చాను” అంది తులసి కమలాక్షితో.
ముగ్గురూ వేరేగదిలోకి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపూ కుటుంబరావుని ఎంగేజ్ చేసే బాధ్యత శ్రీధర్ తీసుకున్నాడు. ఆయన మాటలూ, మనస్తత్వాన్నీ గురించి తులసి వచ్చేముందు చెప్పింది. వదినామరదళ్ళు బాగానే మాట్లాడుకున్నారు.
“అందరూ కలిసి నన్ను చెడ్డదాన్ని చేసారు. ఆఖరికి మీ అన్నయ్యకికూడా నామీద కోపం వచ్చింది. మాకు పిల్లల్లేని విషయం మీ వదిన నడిబజార్లో పెట్టి చర్చిస్తుంది. నాచెవుల్తో నేను విన్నాను. కోపం రాదా? మీ అమ్మగారు ఆమెతో సమానంగా కానుకలు తెచ్చుకోలేదని దెప్పిపొడిచారు. మా మానస ఈ విషయంలో ఎన్నిమాటలు పడుతోందో తెలీదా, నీకు? మాకు ఏముందో తెలిసే, కట్నాలు వద్దని చేసుకుని ఇప్పుడు కొత్తగా ఏంటి?” అంది కళ్లమ్మట నీళ్ళు పెట్టుకుని విక్టిమ్ కార్డు విసురుతూ. తులసి కరగలేదు.
“ఇంత తీసుకెళ్ళిన నన్నుకూడా మా అత్తగారు అడుగుతుంది వదినా! మీ అమ్మేం కొందని ఇక్కడినుంచీ వెళ్ళగానే ఆరా తీస్తుంది. అమ్మ పెట్టిన చీరో ఏదో పెట్టె తెరిచి వెంటనే చూపించాలి నేను. పట్టిపట్టి చూసి దాని విలువ ఆవిడ నిర్ధారించాలి. బావుందనో బాలేదనో, ఈ రంగుకాకుండా ఇంకో రంగైతే బావుండేదనో అనాలి. వీటన్నిటివలనా ఆవిడకేం రాదుకదా? అక్కడ మా బావగారింట్లో ఏదన్నా కొంటే ఇక్కడ అవసరం వున్నా లేకపోయినా మేమూ కొనుక్కోవాలి. లేకపోతే చిన్నకొడుక్కి తక్కువైపోయిందని బాధపడుతుంది. అమ్మా, అన్నయ్యలూ నాకు ఏవేనా కొనుక్కోమని డబ్బులిస్తారు. శ్రీ ఎప్పుడేనా అవసరమై తీసుకుంటే, దాని డబ్బు దానికిచ్చెయ్యమని తనే గుర్తుచేసి చెప్తుంది. అటూయిటూ ఖర్చులుపెట్టి తగలేసుకోక, బంగారం కొనుక్కోమని నాకు పురమాయిస్తుంది. మావాళ్ళిచ్చిన డబ్బుకి మీలెక్కలేంటని నేను అనచ్చు. ఆవిడది ప్రేమేకదా, వదినా? పెద్దవాళ్ళిలానే వుంటారు. మనం పట్టించుకోకూడదు.
మా అందరికీ సుమతి పుస్తకాలు చదవడం అలవాటుచేసింది. ఖాళీగా కూర్చుని పోచికోలు కబుర్లుచెప్పుకుని, ఆనక నువ్వలా అన్నావు, నువ్వలా చేసావని కొట్లాటలు పెట్టుకోకుండా శుభ్రంగా పుస్తకాలు చదవండని దాని ఆర్డరు. మా అత్తగారూ, మాయింట్లో అద్దెలకుండేవాళ్ళూ తెలుగునవలలూ రామాయణం, భారతం, భాగవతంలాంటివి చదువుకుంటారు. ఇంగ్లీషు పుస్తకాలు నేను చదివి వినిపిస్తాను. ఐదారుగురు నా చుట్టూ కూర్చుని వింటారు. ఆ కథలని తెలుగుకథల్తో పోల్చుకుని చర్చిస్తారు. కానీ, వదినా! మాయిల్లు అమ్మావాళ్ళింటిలా వుండదు. మా కబుర్లు వల్లీ, సమీరావాళ్లందరితో చెప్పుకున్నట్టుండవు. నాచుట్టూ అందరూ పెద్దవాళ్ళే వుంటారు. నాకు చాలా చిన్నప్పుడు పెళ్ళిచేసేసారు. నావయసు పిల్లలకింకా పెళ్ళిళ్లవట్లేదు. చరణ్‍ని ఎత్తుకుని తిరుగుతుంటే నా వయసువాళ్ళే నన్ను ఆంటీ అని పిలుస్తారు. ఎందరితో దెబ్బలాడతాను?” చురుగ్గా అడిగింది తులసి.
నీలిమకి తులసి చెప్పినవి బాగానే అర్థమయ్యాయి. తెలీకకాదుకదా, తను గొడవపెట్టుకున్నది?
ఇంకా చాలా మాట్లాడింది తులసి. “మాధవ్‍కి కోపం వచ్చిందనేది నీ అభియోగం. మేమంతా ఒక కుటుంబం అనుకుంటాం. కుటుంబాన్ని గౌరవించకపోతే వాడికి కోపం రాదా? ఒక కుటుంబంలోవాళ్ళు ఇలా తిట్టుకోరు. నువ్వు మా యింటిమనిషివి కాదా?” అంది నిలదీస్తున్నట్టు.
“అలాంటిదేం లేదు తులసీ! పక్కావిడతో ఆ విషయం అనేసరికి నాకు కోపం వచ్చేసింది” అంది నీలిమ మాటలకోసం వెతుక్కుంటూ.
“అలాంటప్పుడు ఆవిడింటికే వెళ్ళి దెబ్బలాడి రావాలి. మనింట్లోవాళ్లతో గొడవపెట్టుకోవడమేమిటి? అదీ పెద్దొదినతోనా? ఆవిడ తిరిగి గొడవపడుతుందనే? పడదు. చిరాకుపడుతుంది. ఆవిడకలాంటివి నచ్చవు. పన్నెత్తి ఒక్కమాటకూడా తిరిగి అనని మనిషిని ఏకపక్షంగా అనటం అసహ్యంగా లేదూ? ఐనా పెద్దన్నయ్యగురించి అంత తక్కువగా ఎలా అనుకోగలిగావు చిన్నొదినా, నువ్వు? నీకసలు తనగురించి ఏం తెలుసు? మాయిళ్ళలో పిల్లలు పుట్టగానే ఐదో, పదో, ఇరవయ్యో రికరింగ్ డిపాజిట్ వెయ్యడం మొదలుపెట్టేస్తారు. అది పెద్దమొత్తం కాకపోవచ్చు. మేము పెద్దై, చదువులదాకా వచ్చేసరికి ఎంతోకొంత చేతిలో వుంటుందని ఆలోచిస్తారు. అలా నాన్న మాముగ్గురికీ దాచేవారు. ఆయన ఇల్లు పట్టించుకోవడం మానేసాక అమ్మ ఆయన మొదలుపెట్టినవరకూ పూర్తిచేసి ఆపేసింది. మా చదువులన్నీ రాజావారి ఇన్స్టిటూషన్స్‌లో అయ్యాయి, చదువులకి పెద్దగా ఖర్చవలేదు. దాచిన డబ్బులు ఒకొక్కరికీ ఐదువేలదాకా చేతికొచ్చాయి. ఇవికాక మా పెద్దత్త అప్పుడప్పుడు ఖర్చుపెట్టుకోవడానికి మాకు డబ్బులిచ్చేది. డిగ్రీ అవగానే వాసు వుద్యోగంలో చేరాడు. నెలకి ఆరేడువందల జీతం వచ్చేది. అమ్మ తీసుకునేది కాదు. నాన్న సర్వీసులోనే వున్నారుకాబట్టి ఆయన జీతంతోనే యిల్లు నడిపేది.
మీ జీతాలుతీసుకుని దాచేంత తెలివి నాకు లేదుగానీ, పెద్దవాళ్ళెవరికేనా చెప్పి జాగ్రత్తగా దాచుకో. అలాగని, కొమ్ములు మొలిపించుకుని వేషాలేస్తే మాత్రం వూరుకోను- అని తనకే వదిలేసింది. తను ఏవేవో కొనుక్కొచ్చి నా దగ్గిర దాచుకునేవాడు. ఒకరోజు నా పెట్టె సర్దుతూ మామ్మ అవన్నీ చూసింది. అడిగితే చెప్పాడు. తెల్లబోయిందావిడ. కాసేపు నోటమాట రాకుండా అలానే వుండిపోయాక తెప్పరిల్లి అంది.
బానే దాచుకున్నావుగానీ, ఇప్పుడే ఎవరికీ చెప్పకు. ఇప్పుడెలా వున్నావో ఇంకముందుకూడా అలానే వుండు. మీ సైన్యం అంతా వున్నారుకదా, వాళ్ళు ఒకొక్కళ్ళూ పైకొస్తుంటే అప్పుడు నువ్వూ ఏదో ఒకటి చేసి చూపిద్దువు- అంది.
ఒక స్థలం, ఐదేళ్ళకీ ఆరేళ్ళకీ పెట్టిన డబ్బు రెట్టింపయే స్కీముల బాండుపేపర్లు. పెళ్ళికిముందు వాసు ఐదేళ్ళు వుద్యోగం చేసాడు. ప్రతినెలా పత్రాలు కొనేవాడు. వాళ్ళ పెళ్ళైనప్పట్నుంచీ తనకి ఆ డబ్బు రెండోజీతంలా వచ్చేది. గీతది మూడో జీతం. మ్యుచువల్ ఫండ్సు వుంటాయనీ, వాటిల్లో పెడితే బేంకువడ్డీలకన్నా ఎక్కువ డివిడెండ్లు వస్తాయనీ తెలుసుకున్నాడు. పెడతాడు. బిందాస్, హేండ్స్ ఫ్రీ అంటారే, అలాంటి జీవితం వాళ్ళది. మాధవ్ తన డబ్బు కోచింగుకీ, పుస్తకాలకీ వాడుకున్నాడు. నాకు బంగారం కొన్నారు.
మాధవ్ నిన్నిష్టపడుతున్నట్టు మొదట వదినకే చెప్పాడు. వీళ్ళంతా చైల్డ్‍హుడ్ ఫ్రెండ్స్. మీ అక్కచెల్లెళ్ళ ముగ్గురి భర్తలూ మంచి పొజిషన్స్‌లో వుండచ్చు. వాళ్ళు వాసుని ఆదర్శంగా తీసుకుని కట్నాలు వద్దనుకుంటేనే మీ పెళ్ళిళ్ళయ్యాయి. వాసుకి వాళ్ళిచ్చే గౌరవం అది. ఆ గౌరవం తగ్గినరోజు తనంతట తను దూరం జరిగే ఇంగితం వాసుకి వుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది జరిగినప్పుడు ఆ ముగ్గురికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మాకులేదు. పోగొట్టుకోబోయే ఆ గౌరవంకోసమే మాధవ్ భయపడుతున్నాడు. కుటుంబం అనే ఫాబ్రిక్‍లో మనమంతా పోగులం. ఒక బట్టలో వుండే పోగుల్లో ఒకటి నచ్చి, ఇంకొకటి నచ్చకపోవడం వుండదు. వదినా! ఇంట్లోవాళ్ళ ఆలోచనల్లోనూ పద్ధతుల్లోనూ బేధాలు వుండచ్చుగానీ, మనసుల్లో విద్వేషాలు వుండకూడదు. గీత చిన్నప్పట్నుంచీ అలానే వుంది. నేనిలానే వున్నాను. నువ్వూ అంతేననుకుంటాను. పెరిగే ప్రోసెస్‍లో కొద్దిగా మారతాంగానీ ఒకళ్లకోసం మరొకరు సమూలంగా మారిపోం. వాళ్ళ సాంగత్యంలో వున్న కాసేపూ, అవసరమైనంతవరకూ మారతారు. తర్వాత మామూలైపోతారు. మనం ఒక కుటుంబం. మన అమ్మానాన్నల్లో ఎన్నో లోపాలుంటాయి. మా నాన్న ఎలా వున్నా మాకు నాన్నే. అదొక బంధం. బంధానికి గౌరవం యివ్వకపోతే ఇంక మనకి జీవితంలో వుండేవేమిటి? మాధవ్ నిన్నెంతో యిష్టపడి చేసుకున్నాడు. వాడి నిర్ణయాన్ని మేమంతా గౌరవించాం. మాకిచ్చే గౌరవం ఇదేనా? ” అంది తులసి.
నీలిమ మాట్లాడలేదు.
“ఇక రాణా విషయం. మాధవ్, సుమంత్ పోలికల్తో వుంటాడని వాడేదో గొప్పవాడనుకుంటున్నావు. వాడికి మేనర్సవీ తెలీవు. మేమంతా అక్కచెల్లెళ్ళంకాబట్టి మమ్మల్నేమీ అనడు. మీరు వేరే వెళ్తున్నారు. వాడిని మీ యింటికి పిలిపించుకుని నాలుగురోజులు వుంచుకుని మర్యాదలు చెయ్యి. నీకే తెలుస్తుంది. మీ మంచంమీద పడుక్కుంటాడు. మాధవ్ షర్టులు వేసేసుకుంటాడు. జేబులో చేతులు పెట్టి స్వతంత్రంగా డబ్బులు తీసుకుంటాడు. మీరంతా వాడికి మరదళ్ళు. మీతో జోక్సేస్తూ చిరాకు పుట్టిస్తాడు. మీ మర్యాద నిలబెట్టడంకోసం అంతా వాడిని దూరం పెడుతున్నారు. ఇప్పుడిక మీరు కలుపుకోండి” చెప్పాల్సినవన్నీ పూర్తిచేసి ఆగింది తులసి.
కమలాక్షి ఆ అమ్మాయి మాటల చాకచక్యానికి ఆశ్చర్యపోయింది. ఎక్కడా నీలిమని ఒక్కమాటకూడా ఆక్షేపించలేదు. తెలుసుకోవలసిన విషయాలని సవివరంగా చెప్పింది. ఆడబడుచులు ముగ్గురూ వదినగార్లతో గొడవలేసుకుంటూ వుంటారనీ, గౌరవం యివ్వరనీ మాధురి తరుచు అంటుంది. అలా గొడవపడేదానిలా తులసి ఎక్కడా కనిపించలేదు. మిగిలినవాళ్ళిద్దరూకూడా అంతేనేమో! రెండుచేతులూ కలవనిదే చప్పుళ్ళవవు.
“మాధవ్ యిప్పుడు ట్రాన్స్‌ఫర్ హడావిడిలో వున్నాడు. ముంబై ఔతుందనుకుంటున్నాడు. పెద్దొదిన అమెరికా వెళ్ళేలోగా నాకు కనీసం ముంబై చూపిద్దురుగాని” అంది తులసి మాటమార్చేసి నవ్వుతూ. ఇంకాసిని కబుర్లయ్యాక వెళ్తానని లేచింది.
కమలాక్షి చీర పెట్టబోతే, “వద్దండీ అత్తయ్యగారూ! అమ్మావాళ్ళూ ఇంకా ఏమీ పెట్టలేదు. తీసుకోకూడదనుకుంటాను. ఏమీ అనుకోకండి” అంది తులసి.
“భలేదానివే! ఇంతమంచివార్త చెప్పావుకాదేం? రాగానే చెప్తే నీకు నచ్చిందేదైనా చేసిపెట్టేదాన్ని” అందావిడ.
“వదిన చెప్పిందనుకున్నాను” అంది తులసి. చురుక్కుమంది నీలిమకి. కావాలనే చెప్పలేదు తల్లికి ఆ విషయం. చెప్పాలనిపించలేదు.
తులసి శ్రీధర్ వెళ్ళిపోయారు.
“ఎందుకొచ్చిందే, ఈ అమ్మాయి? తనకున్న సొమ్ములన్నీ చూపించుకోవడానికా? లేకపోతే దీనికింకా పిల్లలు పుట్టలేదు, తన ప్రజ్ఞ చూడమని చెప్పుకోవడానికా? వాళ్లన్న ఎందుకు రాలేదట?” అన్నాడు కుటుంబరావు ఎద్దేవాగా. ఏ మనుషుల్తోనైతే జీవితకాలం బాధ్యతలు పంచుకుంటూ బతకాలో వాళ్ళని ద్వేషించడం సంతోషపురహదారికి పెడగా లాగడంకాదా? కమలాక్షికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన మాటలకి కాదు, కూతురికి తప్పుదారి చూపిస్తున్నందుకు. ఇంత జరిగాక, మాధవ్ నీలిమ విడిపోతారేమోనన్నంతదాకా వచ్చాకకూడా ఆయన మారకపోవటం బాధకలిగించింది.
నీలిమ తులసి చెప్పినవన్నీ వింది, అందులో తెలీనివి తెలుసుకుంది. సమస్య సమస్యే. ఆ సమస్య గీత.
“తులసి చాలా సామరస్యంగా చెప్పింది నీలూ! అర్థంచేసుకో. మీ బావగారిని గౌరవించాలో అక్కర్లేదో తేల్చవలసినది నువ్వు కాదు. ఎవరికుండేవి వాళ్ళకి వుంటాయి. ఎవరి వుద్యోగాలూ, హోదాలూ వాళ్ళవి. అందరికీ పెద్ద వుద్యోగాలు రావు. వచ్చినవాటిల్లో చేరిపోతారు. నువ్వు వాళ్ళనన్న మాటల్నే మరోవైపునించీ చూడు. డబ్బున్నవాళ్ళుకాబట్టి ప్రహ్లాద్, వసంత్‍లకి వాసే ఎక్కువేమో! మీకేం వుంది? మనకేం వుంది? మాతో మాట్లాడాలన్నా మమ్మల్ని చుట్టాలని చెప్పుకుని తిరగాలన్నా ఏదో పెళ్ళంటే చేసుకున్నారుగానీ, చిన్నతనమేమో! మీ యింట్లో అన్నదమ్ములిద్దరికీ ప్రేమ. అన్నావదినలంటే మాధవ్‍కి గౌరవం. తల్లిదండ్రులంటే యిష్టం. పద్ధతిగా పెరిగినవాడతను. ఐనా నీకోసం అన్నీ వదులుకుని దూరం వచ్చేస్తున్నాడు. కుటుంబాన్నించీ అతన్ని విడదీయడం అవసరమా?” అడిగింది కమలాక్షి నచ్చజెప్తూ.
“నాకూ మానసలా సింగిల్‍గా నాయిల్లు నేను పెట్టుకుని బతకాలనుందమ్మా! ఎందుకు మీకిది అర్థం కాదు? ఎంతకాలం ఎలాంటి గుర్తింపూ లేకుండా వాళ్లనీడలో బతుకుతాం? జరిగేది జరగనీ” అంది నీలిమ. ఆవిడ నిట్టూర్చింది.
నీలిమ ఆ రాత్రంతా గీతగురించే ఆలోచించింది.
మాధవ్‍కి ముంబై ట్రాన్స్ఫరైంది. అక్కడ ఇల్లూ అదీ వెతుక్కుని వచ్చాక నీలిమని తీసుకొచ్చాడు. ఆమెపట్ల ప్రేమ ప్రేమే. కోపం కోపమే. ఆమెకి తనేమిటో, తను పాటించే విలువలేమిటో, తన ప్రాధాన్యతలేమిటో తెలియజేసే ప్రయత్నంలో వున్నాడు. కుటుంబాన్ని గౌరవించడం నేర్పద్దా అని తల్లి ఆక్షేపించాక చురుక్కుమంది. ఇంట్లోకి మామూలుగానే ఆహ్వానించారు.
“మీ అమ్మా, నాన్నా ఎలా వున్నారే? వంటా అదీ నేర్చుకున్నవా?” అనడిగింది లక్ష్మి. నేను చెప్పినవి తెచ్చుకున్నావా అంటుందేమోననుకుంది నీలిమ. కానీ లక్ష్మి ఆ ప్రశ్నని తురపుముక్కలాగే వుంచుకుంది.
నీలిమ జవాబులు విని, “వెళ్ళేదాకా నువ్వే వంటా అదీ చెయ్యి. మీ అమ్మ ఏం నేర్పిందో చూస్తాను. గీత ఇన్నేళ్ళూ చేసిందిగా, ఈ వారంరోజులూ నువ్వు చేసిపెట్టు” అంది. తలూపిందామె. కొత్తగా అత్తగారిలో మొదలైన ఈ కాఠిన్యం లోలోపలెక్కడో ముల్లుతో కెలికినట్టు కెలుకుతోంది ఆమెని. ఉ<హు, ఇదివరకూకూడా వుండేదేమో! ఇప్పుడు తనకి అర్థమౌతోదనుకుంది.
అతనికి వీడ్కోలుచెప్పడానికి తులసి, శ్రీధర్ వచ్చారు. వెళ్ళేముందురోజు అందరూ హోటల్లో కలుసుకుందామనుకున్నారు. వాసు రానన్నాడు.
“మీలో మీరు మాట్లాడుకునేవి వుంటాయి. నువ్వెళ్ళు. మాకు వేరే పనులున్నాయి” అన్నాడు.
“ఐతే వద్దులే. కేన్సిల్ చేసేద్దాం. నేనూ వెళ్లను” అన్నాడు మాధవ్ చిన్నబుచ్చుకుని.
“అలాకాదురా! వాళ్లక్కచెల్లెళ్ల్ళు ముగ్గురిమధ్యనా గీతెందుకు? సుమతి వచ్చినా వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అక్కడికి మేం రావడం దేనికి, తనని బాధపెట్టడం దేనికి?” అన్నాడు. తులసి కలగజేసుకుని యిద్దరికీ రాజీ చేసింది.
“రుక్కమ్మ ఆమ్మ ఏదో అందని నీలిమ మనింట్లోవాళ్ళతో గొడవపడ్డం తప్పు. అదే తప్పు మీరూ చేస్తారా? ఈవిడేదో అందని మీరిద్దరూ ముఖాలు ముడుచుకోవడమేమిట్రా? వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్ళూ మాట్లాడుకుంటూ కూర్చున్నా, మిగతావాళ్లం వున్నాంకదా? ఎవరి సర్కిల్ వాళ్లది. మొదట్నుంచీ అంతేకదా? మాముగ్గుర్నీ మీరు కలవనిచ్చేవాళ్ళా? మాగోల మేం పడేవాళ్లం. మీరు రాకపోతే నేనూ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతాం” అంది.
వాసు తగ్గాడు. లక్ష్మి గీతకి నచ్చజెప్పింది. గీత ఆవిడ భుజంమీద తలవాల్చి ఏడ్చేసింది.
“నావలన తను అవమానపడ్డాడు. తిరుగుజవాబు చెప్పకపోవడం నా తప్పేకదా?” అంది గీత.
“వదినా! జరిగిపోయినదాన్నిగురించి ఇంకా ఎందుకు బాధపడతావు? వాసుని ఆమె అవమానం చెయ్యడమేమిటి? ఆమెకేం తెలుసని? నువ్వు పద. ఇలా ఏడవడం వాడు చూసాడంటే బాధపడతాడు” అంది తులసి.
“సింపుల్‍గా వుండటం నీకెంత యిష్టమైనా అందరికీ అలాంటి భాష అర్థంకాదు. ఎవరిభాషలో వాళ్ళకి చెప్పాలి. అలా దాస్తున్నావు, ఏం చేసుకుంటావు ఈ చీరలన్నీ?” అని గీతకోసం చీరా అవీ తనే తీసిపెట్టింది. వీళ్ళ మాటలన్నీ అరాకొరాగా వంటింట్లో వున్న నీలిమకి వినిపిస్తునే వున్నాయి. రాత్రి వంటంతా దగ్గరుండి ఆమెచేత చేయించింది లక్ష్మి. ఆ విషయంమీద లోలోపల చాలా కోపంగా వుంది నీలిమకి.
“వదినా! రెడీయా?” అని ఆమెనీ అడిగింది తులసి.
“వాళ్లకక్కడ కట్టి పడేసినట్టుంటుంది. తోచని అల్లరి చేస్తారు. వదిలేసి వెళ్లండి” లక్ష్మి పిల్లలగురించి.
“అక్కడ మసాలావన్నీ తినకు. పళ్ళజూసు, లస్సీ, కర్డ్‌రైస్ అలాంటివే తెప్పించుకో” కూతురికి చెప్పింది.
ఎలీట్ లెవెన్‍లో చాలామంది ఇక్కడలేరు. వాళ్ల స్థానాన్ని తర్వాతివాళ్ళు నింపుతున్నారు. తులసి, శ్రీధర్ వాళ్లతో కలుస్తున్నారు. వల్లీ, సమీరా ఇక్కడుంటే వస్తున్నారు. ఎవరికి వాళ్ళకే స్వంతబాధ్యతలూ, వ్యవహారాలూ మొదలయ్యాయి. మానస, మాధురి పిల్లలని తీసుకుని వచ్చారు. లక్ష్మి అన్నట్టు వాళ్లు అప్పుడే అల్లరి మొదలుపెటేసారు. పిల్లల్ని యింట్లో వదిలేసి వచ్చిన గీతనీ, తులసినీ చూసి అసూయకలిగింది మాధురికి. తులసి అందంతో మెరిసిపోతుంటే గీత ఎలెగెంటుగా వుంది.
అక్కచెల్లెళ్ళిద్దరికీ విషయం చూచాయగా చెప్పింది తల్లి. “ఇదక్కడ గొడవపడి వచ్చింది. ఇదంతా ఎటు దారితీస్తుందో తెలీదు. అనవసరంగా మీరు తలదూర్చద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎవరికీ చెప్పద్దు. మీదాకా వస్తే నీలిమకి నచ్చజెప్తాం, పొరపాటైంది- అనే అనండి.
ఆపైన మీ యిష్టం” అని హెచ్చరించింది.
ఏం జరిగిందో పూసగుచ్చినట్టు తెలుసుకోవాలని మాధురికి వుంది. మానసకిమాత్రం పరిస్థితిలో తీవ్రత అర్థమైంది. ఎంత ప్రాణం పెట్టే మనుషులైనా అహం దెబ్బతిననంతవరకే ఆ ప్రేమ. తనింట్లోనే చూస్తోంది. వసంత్‍ని పంచప్రాణాలుగా చూసుకునేవారట, అతని తల్లిదండ్రులు. వాళ్ళని కాదని పెళ్ళిచేసుకున్నందుకు శతృవుని చూసినట్టు చూస్తున్నారు. గీతతో గొడవపడద్దని ఎన్నోసార్లు చెప్పింది నీలిమకి. ఎందుకిలా చేసింది? ఏం చేసింది? ఇది ఎక్కడిదాకా వెళ్తుందని సతమతమౌతోంది. అక్కచెల్లెళ్ళు ముఖాలు చూసుకుంటున్నారుగానీ పలకరింపులుతప్ప మరేం మాట్లాడుకోలేదు. నీలిమ మానస కూతుర్నొకదాన్ని తీసుకుంది. వసంత్ చెయ్యి కొంచెం ఖాళీ అయింది.
వీళ్లు పదిమందీ కూర్చుని మాట్లాడుకుంటుంటే సుమతి, లత వచ్చారు. చక్కగా తయారైన గీతని చూసి సుమతి కాస్త ఆశ్చర్యపోయింది.
దీనికి వయసుగానీ తగ్గిందా? ఓ నాలుగేళ్ళు? అంతకన్నా తగ్గితే వాసు ముసలివాడైపోతాడు- లతతో గొణిగింది. లతని చూసి తులసి కంగారుపడితే లత ఆమె దగ్గరకూర్చుని చెప్పింది.
“ఓయ్ బొమ్మా! అలా కంగారుపడకు. డాక్టర్ని నేను. మనిద్దర్లో ఎవరికీ ఏమీ ఐపోదు. ఇప్పుడైతే ఒకింట్లో వున్నా ఏమీకాదు. వల్లి పెళ్ళిలోనే ఈ ప్రస్తావన వచ్చింది. అవసరాలనిబట్టి కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి. వెనకట పెద్దపెద్ద కుటుంబాలుండి ఇద్దరో ముగ్గురో మనలాంటివాళ్ళుంటే తిళ్ళూ అవీ అమర్చలేకపోయేవారట. తర్వాత అబార్షన్లూ, ప్రసూతిమరణాలూ ఎక్కువగా వుండేవి. ఇంట్లోనే మంత్రసాని వచ్చి డెలివరీ చేసేది. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు భయపడతారని కలవనిచ్చేవాళ్ళు కాదని వివరించి చెప్తే మీ అమ్మమ్మగారు సంతోషపడ్డారు. షీ ఈజె గ్రేట్ లేడీ. భలే అర్థం చేసుకుంటారు” అంది. తులసి సర్దుకుంది.
“ఏమే, మీ వదిన ట్రెయినింగా? మొబైల్ నగలదుకాణంలా ఇన్ని దిగేసుకుని తిరుగుతున్నావు?” అంది సుమతి తులసిని. గీత ఎర్రగా చూసింది.
“ఇప్పుడెవరూ ఇన్నేసి వేసుకోవట్లేదు. రిస్కుకూడా. డైమండ్స్ వేసుకుంటున్నారు. ఒక నల్లపూసల దండ, ఒక్క గాజు, చెవులకి దుద్దులు. అంతే” అంది లత.
“గాళ్స్, వినండి. అందరం చక్కగా డైమండ్స్ కొనుక్కుందాం” అంది సుమతి. వసంత్ వెంటనే ప్రహ్లాద్ చెయ్యిపట్టుకుని లేచి నిలబడ్డాడు.
“మేం నలుగురం అక్కడ నిలబడతాం. వేలంలో అమ్మేసి మీక్కావల్సినవేవో కొనుక్కుని యింటికి వెళ్లిపొండి” అన్నాడు.
విరగబడి నవ్వింది లత. “మీకందరికీ ఇలాంటి ఆలోచనలు స్పాంటేనియస్‍గా వస్తాయేం?” అంది నవ్వు మధ్య.
“మిమ్మల్నెవరు కొంటారు? మీలో ఒక్కడికేనా పప్పు రుబ్బి కరకర్లాడేలా గారెలు వెయ్యడం వచ్చూ?” అడిగింది సుమతి.
“మూడు గవర్నమెంటు వుద్యోగాలు, ఒక సియ్యే. మరీ అంత తీసిపడెయ్యకమ్మా!” అన్నాడు ప్రహ్లాద్.
“ఛాన్సే లేదు. ఇద్దరు డాక్టర్లని కొసరేసినా మిమ్మల్నెవరూ కొనరు. ఇది హోటల్ కమ్ రెస్టరెంట్. ఇక్కడ కావల్సింది పప్పు రుబ్బి గారెలు వెయ్యడం” అంది సుమతి.
“దీనికి గారెలంటే ఇష్టం. ఆబ్దికమంటే చనిపోయినవాళ్ల పుట్టినరోజని చెప్పేవారు చిన్నప్పుడు మాకు. గారెలు తినాలనిపించినప్పుడల్లా ఆబ్దికం పెట్టమని ఏడ్చేది” అన్నాడు వసంత్ మానసతో. నవ్వుల్తో హోరెత్తిపోయారు అందరూ. సుమంత్ వచ్చాడు. తులసినీ, శ్రీధర్నీ చూసి సంతోషపడ్డాడు. వాళ్ళిద్దరిదగ్గిరా సెటిలైపోయాడు. అన్నాచెల్లెళ్ళు మాటల్లో పడ్డారు.
“అబ్బ! ఎన్నాళ్లైందే, నిన్ను చూసి!” అన్నాడు.
“ఎన్నాళ్ళో ఏమిట్రా, వల్లి పెళ్ళిలో కలిసాంకదా?” అంది తులసి నవ్వుతూ.
“అబ్బో! అదెప్పటిమాట?” అన్నాడతను. వసంత్, ప్రహ్లాద్‍ల్లా అతను ఈ ముగ్గుర్నీ కలవడం తక్కువ. ఎప్పుడు ఎవర్ని కలిసినా అలాగే అంటాడు.
“భలే మంచిచౌకబేరము” అంది లత రాగయుక్తంగా. అతనికి అర్థం కాలేదు.
“వీళ్ళు మనందర్నీ వేలం వేసేసి సొమ్ములు కొనుక్కునే ప్లాన్‍లో వున్నార్రా” అన్నాడు ప్రహ్లాద్.
“మరి వీళ్ళ ఏటీయమ్ కార్డులకి డబ్బులేసేదెవర్రా? అమ్మాయిలూ, ఆలోచించుకున్నారా?” అడిగాడు సుమంత్.
“పోవోయ్! మా అందరికీ రెండేసి మూడేసి కార్డులు” అంది లత.
“జోక్స్ అపార్ట్. కింది ఫ్లోర్లో డైమండ్ ఎక్స్పో నడుస్తోంది. వెళ్దాం” అంది సుమతి.
“చెవులకేవో తీసుకుంటానన్నావు?” అడిగాడు వాసు, గీతని. ఆమె తలూపింది.
“అరేయ్, నీదగ్గిర కేషుందా? చెక్కిచ్చేసి తీసుకుంటాను” అడిగాడు వాసు సుమంత్‍ని.
“నాదగ్గిరుంది బావగారూ! నాన్న బేంకులో వెయ్యమన్నారు. కుదరలేదు” అంది లత. గీత చెక్కు రాసింది. సుమంత్ చెక్కుని తీసుకుని ఫక్కుమని నవ్వాడు.
“గీతా, గీతా! ఏం గీత? వంకరటింకర గీత, కొక్కిరిబిక్కిరి రాత” అన్నాడు. చెక్కు చేతులు మారింది. నవ్వుల హోరు పెరిగింది.
“ఇంకెంతకాలం ఏడిపిస్తార్రా, నన్ను? మీ బాధకి మా నాన్న పెట్టిన పేరుకూడా మార్చేసుకున్నాను” అంది గీత నీరసంగా.
“అదేమిటి?” నవ్వుతూ అడిగింది లత.
“మా మామయ్య బినాకా గీత్‍మాల ఇష్టంగా వినేవాడు. బుధవారం పుట్టిందని గీతమాల అని పెట్టుకున్నాడు. ఆయనమీద గౌరవం చూపిద్దామని పూర్తిపేరుతో పిలిచేవాళ్ళం. ఇంట్లోనైతే మేము పదిమందిమే. స్కూల్లో చేరాక అందరూ పిలవడం మొదలెట్టేసరికి హెడ్‍మాస్టారి దగ్గిరకి వెళ్ళి పేరు కుదించుకుని వచ్చింది. మాకు డౌటొచ్చి ఇలా అడిగేవాళ్ళం” అన్నాడు సుమంత్.
బేగులోంచీ స్క్రిబ్లింగ్ పేడ్ తీసి చకచక ఏదో రాసి, మధ్యని పడేసి, “అందరూ రాయండి. ఎవరి చేతిరాతెలా వుందో చూద్దాం” అంది కోపంగా. ఒకొక్కళ్ళూ రాసారు. ముగ్గురక్కచెల్లెళ్ళుకూడా రాసారు. వాళ్ళకి కొత్తగా వుంది. శ్రీధర్ కాస్త మొహమాటపడ్డాడు. తులసి వప్పుకోలేదు. సుమంత్ రాయనని మొండికేసాడు. రాసేదాకా వదిలిపెట్టలేదు గీత. అంతా రాసాక సుమతిముందుకి తోసి, “మార్కులెయ్యవే” అన్నాడు మాధవ్.
“మార్కులంత పెద్దపనొద్దుగానీ పాస్, ఫెయిల్. అంతే” అందామె. పైనుంచి కిందకి చూసి, అందరికీ టిక్కులు పెట్టి, ముగ్గుర్ని వదిలేసింది.
“వీటిని బ్రహ్మరాతలంటారు. ఎవరికీ అర్థం కావు” అంది. అవి లత, సుమంత్‍లవి, గీతది.
“దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్” అన్నాడు ప్రహ్లాద్ సుమంత్‍ని చూసి నవ్వుతూ. ఏక్ దూజే కేలియే ట్యూన్‍లో. లత కాస్త సిగ్గుపడింది. ఆ సంఘటనలో వున్నవాళ్ళు ఇంకో ఇద్దరుకూడా నవ్వేసారు.
“ఏమిటో?” అంది సుమతి.
“రవళి వస్తుందిగా, డెలివరీకి? అప్పుడు అడుగు. ఒక రోజంత ఎపిసోడ్. నిముషంలో చెప్పేస్తామేం?” అన్నాడు వసంత్ భుజాలు ఎగరేసి.
“పెయింటింగ్ వేస్తావుకదే, రాతేమిటి మరి? ఆమధ్యనేదో కాంపిటిషన్లో ప్రైజుకూడా వచ్చిందని విన్నాను. చిన్నప్పుడు మరీ యిలా వుండేది కాదు? ఇలా రాస్తే ఆఫీసులో ఎవరికేనా అర్థమౌతుందా?” అడిగాడు ప్రహ్లాద్ గీతని.
“అదీ ఇదీ వేరు. టైపు చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి. మా ఆఫీసులోనూ వుంది. మొదట్లో డాస్‍లో చేసేదాన్ని. ఇప్పుడు వర్డ్ అనీ వచ్చింది. దాంట్లో బానే వుంటుంది. అసలందుకే రాత మరీ పాడైంది” అంది గీత.
వెనక్కి వొరిగి వాసుచేతిమీద తలవాల్చి కూరుంది.
“ఉండాలనిపించట్లేదు. ఇది రెండోసారి. ఇక్కడున్నవాళ్లంతా పరాయివాళ్లనిపించడం” అంది లోగొంతుకలో అతనికే వినిపించేలా.
“తులసి, బావ అంతగా చెప్పాక బావుండదు గీతూ!” అన్నాడు.
“ఔను” అంది.
ఆఖరిదాకా ఎదురుచూసారుగానీ జో రాలేకపోయాడు. రిసెప్షనునెంబరుకి ఫోన్‍చేసి చెప్పాడు. లతకీ, తులసికీ ఏవేవో తెప్పించాడు సుమంత్. బలవంతం చేసి తులసిచేత అన్నీ తినిపించారు యిద్దరూను. వాసు పెద్దగా మాట్లాడకపోవటం అందర్లో ఆశ్చర్యం కలిగించింది. తినడం అయాక ఎక్స్‌పో చూసి, లత గాజులు, సుమతి, గీత దుద్దులు తీసుకున్నారు. తులసికి ఒంటిరవ్వ ముక్కుపుడక తీసుకుంది గీత.
రెస్టరెంటు బిల్లు మాధవ్ కట్టాడు. ఇంటికి వెళ్తూ స్వీట్‍హౌసు ముందు ఆగి తల్లికోసం బాసుంది, పిల్లలకి స్వీట్సు తీసుకున్నాడు. ఇల్లు చేరేసరికి మయూ, చరణ్ నిద్రపోతున్నారు. విహీ నిద్రకళ్లతో ఇంకా ఆడుతున్నాడు. తల్లిని చూడగానే వళ్ళోకి ఎక్కేసాడు.
“జో అచ్యుతానంద జోజో ముకుందా!” వాడిని పక్కమీద వేసి జోకొడుతూ మంద్రస్వరంలో ఆమె పాడుతున్నా జోలపాటలో చిన్న దు:ఖపుజీర.
మాధవ్, నీలిమ ముంబై వెళ్ళిపోయారు. వెంట వెళ్ళడానికి తనకి కుదరదంది లక్ష్మి. కమలాక్షి, కుటుంబరావు వెళ్ళారు. చిన్న ఫ్లాటు. రెండు బెడ్రూమ్‍లన్న పేరేగానీ బొమ్మరింటిలా వుంది యిల్లు. ఆ యిల్లు, వాతావరణం, రోజూ వెళ్ళిరావల్సిన దూరాలు ఏవీ నచ్చలేదు మాధవ్‍కి. చాలా బెంగపడ్డాడు. అవంతీపురం గాలి, నేల, తను పుట్టిపెరిగిన పరిసరాలకోసం తపించిపోయాడు. ఉద్యోగనిబంధనల్లో భాగంగా బదిలీమీద రావడానికీ ఇలా రావడానికీ తేడా తెలుస్తోంది. వాసు తనని దూరం పెట్టేసాడా? ఇంక ఇదివరకట్లా మాట్లాడడా? గీత? అమ్మ? పిల్లలు? గొడవజరిగినరోజు విహీని వూరంతా తిప్పడం గుర్తొచ్చింది. వాళ్లమ్మని అన్నందుకు బదులు తీర్చుకున్నట్టు ఆరోజే వాడు మొదటి పలుకు అని చూపించాడు. అంతా అత్తా తాతా అంటారట. వీడు అమ్మ అన్నాడు. ఎంత పౌరుషమో! ఎలా వున్నాడో! మయూ వాడి ఫ్రెండ్సు. ఎప్పుడేనా తనకి తీరిక దొరికి వాళ్ళతో కూర్చుంటే ఎన్ని కబుర్లు చెప్పేవారు? జ్ఞాపకాల పరంపర ఆగట్లేదు. అతనలా దిగులుగా వుంటే కమలాక్షికి బాధనిపిస్తోంది.
“గీత, పీత, రోత, రొచ్చూ లేవు. అమ్మా! హాయిగా వుంది. ఇదింత తేలికని తెలీక, బైటపడటానికి నేను ఇంకేవేవో దారులు వెతికాను. తనే మారతాడు. ఎంతకాలం అన్న నీడలో అనామకంగా బతుకుతాడు?” అంది నీలిమ మరోసారి.
“ఆ అమ్మాయినిచూస్తే ఎందుకంత ద్వేషం నీలూ? తను నీకే హానీ చెయ్యలేదు. అలా ఏ కారణం లేకుండా అసూయపెంచుకోవడం నీకే మంచిదికాదు. దూరంగా వచ్చేసావు. ఇంకనేనా ప్రశాంతంగా వుండటం అలవాటుచేసుకో” అంది.
“ఆ యింటి విషయం నాకొదిలెయ్. మీకు అన్యాయం చేస్తే చూస్తూ వూరుకుంటానా?” అన్నాడు కుటుంబరావు తన ధోరణిలో తను. ఆవిడ తలకొట్టుకుంది.
అక్కడ వాసుకూడా తమ్ముడిని చూడకుండా వుండలేకపోతున్నాడు.
“ఓమాటు వెళ్ళి చూసిరా వాసూ! అలా వదిలేస్తే వాడు పూర్తిగా వాళ్లలో కలిసిపోతాడు. ప్రహ్లాద్, వసంత్‍ల విషయం వేరు. వాళ్ళింకా తండ్రి వద్దికలో వున్నారు. మనింట్లో అలాకాదు. మీ అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు కాకుండాపోతారు” అంది లక్ష్మి. తమ్ముడిని చూసి వచ్చాడు వాసు. ఏ బాధ్యతా తెలీకుండా పెరిగిన తమ్ముడు యిల్లు నిభాయించడం చూస్తే నవ్వొచ్చింది. ఆ యిల్లూ అదీ చూస్తే బాధా కలిగింది.
“బొమ్మరిల్లులా వుందమ్మా, వాడిల్లు. లక్కపిడతల్తో వండుకుంటే సరిపోతుంది” అన్నాడు తిరిగొచ్చాక.
“అక్కడ బియ్యం బాలేవు. ఇక్కడినుంచీ నాలుగుబస్తాలు పంపించినా పెట్టుకోవడానికి చోటు లేదు” అని లారీట్రాన్స్‌పోర్టులో బస్తా పంపించి వచ్చాడు. నాలుగైదుసార్లు వాసు, మాధవ్ అటువాడిటూ, యిటువాడటూ వెళ్లడం జరిగాక ఇద్దరూ నెమ్మదించారు. బెంగలు తగ్గి, ఇలా విడిపోవడం సహజమే అని అర్థం చేసుకునే స్థితికి వచ్చారు.
ఇంట్లో తన వస్తువులెవరో ముట్టుకుంటున్నట్టు, సర్దుతున్నట్టు అనిపిస్తోంది మాధవ్‍కి. ముఖ్యంగా బేంకు పాస్‍బుక్ పెట్టినచోట వుండట్లేదు. నీలిమకీ తనకీ దాపరికాలు లేవు. బేంకు ట్రాన్సాక్షన్ చేసాక పాస్‍బుక్ దాచమని ఆమెచేతికే ఇస్తాడు. ఎక్కడెక్కడ ఎంత దాస్తున్నాడో, ఖర్చులేమిటో కూడా చెప్తాడు. కమలాక్షి వాళ్ళ విషయాల్లో తలదూర్చదు. ఏదేనా చెప్తే వింటుంది. అక్కడ ఇల్లొదిలేసి ఇక్కడ వుంటున్నారు. ఇంక తమింటికి తాము వెళ్తే బావుంటుందని వుందావిడకి. ఆయనకి ఎక్కడా అలాంటి అభిప్రాయం వున్నట్టు కనిపించట్లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మనుషులు కలిసివుండటం పెద్దసమస్య కాకపోవచ్చు. కుటుంబరావుకి ప్రతీదీ ఆరా కావాలి.
“నీకింకా కోపం పోలేదామ్మా? నువ్విక్కడికి రావా?” అడిగాడు మాధవ్ తల్లిని. నిజమే! ఇలాంటి చీలికకి కారణమని నీలిమమీది కోపం ఇంకా తగ్గలేదు లక్ష్మికి. ఐనా కొడుకుకోసం సంధ్యని వెంటబెట్టుకుని వెళ్ళింది.
“మీరుండండి. ఇంక మేం వెళ్తాం” అంది కమలాక్షి. కుటుంబరావు ఎందుకెందుకు సర్దుకుందాం అంటున్నా అర్థంకానట్టు లాక్కెళ్ళిపోయింది. మాధవ్ వూపిరి పీల్చుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక ఏ వస్తువుకీ కదలిక లేకపోవడంకూడా గమనించాడు. వచ్చినవాళ్ళిద్దరినీ వూరంతా తిప్పి చూపించారు భార్యాభర్తలు. పూర్తి ఖర్చు పిల్లలచేత పెట్టించదు లక్ష్మి. ఉంచమని ఎంతోకొంత చేతికిస్తుంది. తన తల్లిదండ్రులకీ ఆవిడకీ వున్న తేడా మొదటిసారి గుర్తించింది నీలిమ.
లక్ష్మి ప్రాణమంతా మయూ విహీలమీద కొట్టుకుపోతోంది. అక్కడ తను కామా పెట్టుకుని వచ్చిన దినచర్యమీద వుంది. ఆపైన తులసి డెలివరీ బాధ్యత. పదిరోజులుండి బయల్దేరారు అక్కాచెల్లెళ్ళు.
“నువ్వేనా మరోనాలుగురోజులుండు పిన్నీ” అన్నాడు మాధవ్.
“ఒక్కదాన్నీ తిరిగి వెళ్ళలేనురా! మళ్ళీ నాకోసం ఎవరో ఒకరు రావాలి” నచ్చజెప్పింది. రాణాగురించీ, యమునా, పిల్లలగురించీ మాట్లాడుకున్నారు. పిల్లలు విహీ వయసువాళ్ళు. నెలలు పెద్ద. మాటలవీ మామూలుగానే వచ్చాయట. పుట్టింట్లో వుంచి రాణా వెళ్ళి చూసివస్తున్నాడట.
“వాడిక్కూడా ఏదో ఒకదారి చూపించండిరా! ఆ మహారాణీగారు వచ్చి దెబ్బలాడి వెళ్ళింది. వాసు ఇంక పట్టించుకోవడంలేదు. చిన్నప్పట్నుంచీ వున్న చనువుతో ఏదేనా అన్నాడేమో! తప్పని చెప్తే సరిపోయేదానికి ఇంటికొచ్చి గొడవచెయ్యాలా? పెళ్లయ్యాక అది చాలా మారిపోయిందిలే. మీ అన్నని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోంది. మిమ్మల్ని బైటికి సాగనంపింది. అంతా కనిపిస్తునే వుంది. మీ అందరూ ఒక్కచోట పెరిగినవాళ్ళేకదా? ఇలా కోపాలు పెట్టుకుంటే ఎలారా? నువ్వేనా ఏదో ఒకటి చెయ్యి” అడిగింది కన్నీళ్ళతో.
“సంధ్యా, నీకేం కావాలో చెప్పక, మధ్యలో ఈమాటలన్నీ ఎందుకు? పెళ్లైన పిల్ల జోలికి ఎందుకెళ్ళాలి వాడు? జరిగేవి జరుగుతాయి. మధ్యలో గీతేం చేసింది? వీడిదేం చిన్న వుద్యోగం కాదుకదా, ఒక్క ఆఫీసే పట్టుకుని వుండటానికి? ఐనా నీ కోడలు పెళ్ళికిముందే రాణాని గుప్పిట్లో బిగించిందని మర్చిపోకు” గుర్తుచేసింది లక్ష్మి.
“అదో కోడలు, నన్నూ వాడినీ వుద్ధరించబోతోందీను” నిరసనగా అంది సంధ్య.
“అలాంటివేం లేదు పిన్నీ! అలా ఎలా వదిలేస్తాం? సుమంత్ చూసుకుంటున్నాడు. వాళ్ళ మామగారి కంపెనీలో ఇప్పిస్తాడు” అన్నాడు మాధవ్.
సంధ్యకి పెట్టమని తన పెట్లోంచీ చీర తీసిచ్చింది లక్ష్మి నీలిమకి.
“మరి మీకు? ఇద్దరం వెళ్ళి తీసుకుందామా?” అయోమయంగా అడిగింది నీలిమ.
“ఇదీ నాయిల్లే. నాయింట్లో నాకు మర్యాదలు చేస్తావా?” అంది లక్ష్మి. వెంటనే సర్దుకుంది నీలిమ.
“మొదటిసారి ఇక్కడికి వచ్చారుకదా, అందుకు” అంది.
“అవే దండగఖర్చులంటే. ఇంట్లోవాళ్ళకి మర్యాద యివ్వాలి. బైటివాళ్ళకి మర్యాదలు చెయ్యాలి” అంది లక్ష్మి.
అక్కచెల్లెళ్ళిద్దరినీ రైలెక్కించి జాగ్రత్తలు చెప్పి పంపించి వచ్చారు. తిరిగొచ్చాక ఇల్లంతా ఖాళీగా అనిపించింది అతనికి. అవంతీపురంలో సందడి గుర్తొచ్చి మనసుని వడిపెట్టినట్టైంది.
“వాళ్ళు వెళ్లిపోయారు. మీరు మళ్ళీ వీలుచూసుకుని బయల్దేరండమ్మా!” అని తల్లికి చెప్పింది నీలిమ.
“నీకు తెలివితేటలు ఇంకా ఎప్పుడొస్తాయి? మేము ఇక్కడ యిన్నిరోజులు వుండటం, మీ నాన్న అన్నిట్లో దూరిపోవడం చూసి చిరాకెత్తి మీ ఆయన వాళ్ళని రప్పించాడు. మేం అక్కడినుంచీ వచ్చేసాం. వచ్చిన పని పూర్తై వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇంకా మన పరువుతీసుకోవడం అవసరంలేదు. ఇద్దరూ జరిగినవన్నీ మర్చిపోయి హాయిగా వుండండి” అంది.
ఈ హడావిడిలోనే నీలిమకి పీరియడ్స్ తప్పాయి. ముంబాయి వెళ్లిన ఏడాదికల్లా వాళ్ళకి కొడుకు.
“ఇక్కడినుంచీ వెళ్లగానే నెలతప్పింది మా చెల్లికి” అని నర్మగర్భంగా అంది మాధురి. ప్రహ్లాద్ కోపంగా చూసాడు ఆమెని. గీతకి ఎప్పట్లానే అందులోని వ్యంగ్యం అర్థమవ్వలేదు.
అవంతీపురం యింట్లోనే మాధవ్ తొలిసంతానం మగపిల్లాడు పుట్టాడు. అప్పటికి తులసి పురిటి అధ్యాయం అయింది. ఆమెకి చేతన్ పుట్టాడు. మొదటిసారి ఆ యింట్లో వారంరోజులున్నారు నీలిమ అక్కచెల్లెళ్ళు. తాము ముగ్గురు అక్కచెల్లెళ్ళు, తమ తల్లిదండ్రులు, నీలిమ ఆడబడుచు, నీలిమ అత్తమామలు, ఇలా పేర్చుకున్న వరసలో గీత ఎంతో పరాయిదనిపించింది మాధురికి. ఆమె తనింట్లో తను తిరుగుతుంటేకూడా మాధురికి అసహనంగా అనిపించింది. ఆమె గదిలో కనిపించిన డ్రాయింగ్‍బోర్డూ, బ్రష్షులూ వినోదంగా అనిపించాయి. ఇంత కళకూడా వుందా, ఈవిడకి! వెటకారంగా అనుకుంది.
“వంట నేను చేస్తాలేమ్మా, గీతా!” అంది కమలాక్షి మామూలుగా వంటచేసుకుంటున్న గీతతో.
“అలాకాదండీ! బైటికి వెళ్ళేవాళ్లకోసం నేను చేసేస్తాను. అత్తా, మామయ్యాకూడా భోజనానికి ఆలస్యమైతే వుండలేరు. మిగతాది మీరు నిదానంగా చూసుకోండి” అంది గీత. ఇదివరకూ వరసపెట్టి పిలిచేది. ఇప్పుడు మానేసింది.
“తనవంట తను చేసేసుకుని ఏదీ పట్టనట్టు ఎలా వెళ్ళిపోతోందో చూడు!” అంది మాధురి మానసతో. వాసుకి ఏదో పని పురమాయించబోయాడు కుటుంబరావు. అక్కడే వున్న మాధవ్ వెంటనే కలగజేసుకున్నాడు. “మా అన్నయ్యకి అలా చెప్పకండి. నాకు నచ్చదు. నేను చూసుకుంటున్నానుకదా? మళ్ళీ ప్రత్యేకంగా తనకి చెప్పడందేనికి?” అడిగాడు నిర్మోహమాటంగా.
“పర్వాలేదులేరా!” అన్నాడు వాసు. అన్నాడుగానీ మనసుకి చివుక్కుమనిపించింది ఆయన ప్రవర్తన. మామూలుగా యింట్లోమనిషికి చెప్పినట్టు లేదు. గీత ఆరోజు అంతగా ఎందుకు ఏడ్చిందో అతనికి అర్థమైంది. గీతనికూడా ఇలాగే చూస్తున్నారా వీళ్ళు? పిల్లలని? అమ్మని? ఆ క్షణాన్నుంచీ అప్రమత్తమయ్యాడతను. ప్రతీదీ స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. వాళ్లు ఎక్కడ ఎవరిని చులకనగా చూసే వీలుందో అక్కడ మరింత జాగ్రత్తపడుతున్నాడు. ఇంట్లో పెరుగుతున్న పిల్లలు ఇప్పుడు ముగ్గురు. ఎవ్వరూ విసుక్కోకుండా వాళ్ళని కాస్తున్నాడు.
అన్నీ గమనిస్తోంది లక్ష్మి. గీత పెద్దగా ఏదీ పట్టించుకోకుండా దూరదూరంగా వుండటాన్నీ, వాసు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవడాన్నీకూడా. విహీని అసలు వదలట్లేదు ఆవిడ. ఇది వాళ్ళకి కొత్తఅనుభవం. రాణా, రవళీ, పల్లవీ ఇక్కడే పుట్టారు. తను తీసుకొచ్చింది. మిగతావాళ్ళనికూడా నిద్రకి తీసుకురావడం, అనారోగ్యాలకి వారమో నెలో తీసుకొచ్చి వుంచుకోవడం జరిగాయి. అందరూ కలిసిమెలిసే వున్నారు. ఇలాంటి బేధభావాలు ఎప్పుడూ లేవు. మొదట నీలిమ బైటపెట్టుకుంది. మిగిలినవాళ్ళు తామూ ఆ తానులోని ముక్కలమేనని చూపించుకుంటున్నారు. ఎలాంటి రాజకీయం మనసులో లేకుండా వున్నది కమలాక్షి ఒక్కర్తే. స్వంతింట్లోలా ఏ ఆంక్షలూ లేకుండా ఇల్లంతా స్వతంత్రంగా తిరుగుతూ తోచినపని నచ్చినట్టు చేసుకోగలగడం ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
బారసాల ముందురోజు యశోద, రామారావు వచ్చారు. ఇల్లు అద్దెకి యిచ్చేసారుకాబట్టి నేరుగా యిటే వచ్చారు. కొడుకుని గొప్పగా చూపించాడు మాధవ్. ఎత్తుకుని ముద్దుచేసింది యశోద.
“ఎందర్రా, మీ సైన్యం? ఎన్నిసార్లు తాతని చేస్తారు, నన్ను?” అని మురిపాలాడాడు రామారావు.
గీత తండ్రిని వదిలిపెట్టలేదు. సెలవుపెట్టి యింట్లోనే వుండిపోయింది. తులసికి అత్తమీద ప్రేమ. యశోద చుట్టూ తిరిగింది. సహవియ్యంకులిద్దరూ కాసేపు కబుర్లాడుకున్నారు. రక్షకభటుల్లా వాసూ, మాధవ్ వాళ్ళని కాసారు. లోతులు వెతుకుతున్నట్టు కుటుంబరావూ, పైపైమనిషినే అని రామారావూ. ఈ కుటుంబంమీద తను హక్కుదారుణ్నని చూపించుకోబోయాడు కుటుంబరావు. రామారావుకి అలాంటి ఆలోచనల్లేవు. ఎలాంటి కల్మషం తెలీదు. ఆయన బైటిమనుషులతో పెద్దగా తిరిగింది లేదు. ఇంట్లోవాళ్ళు గౌరవం ఇవ్వటం, తను తిరిగి గౌరవించడంమాత్రమే తెలుసు. రామకృష్ణదగ్గిర కూర్చుని మాట్లాడి మంచీచెడూ విచారించి వచ్చాడు.
“ఏమిటే లక్ష్మీ! నీ వియ్యంకుడు కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికీ వేస్తాడు? మాట్లాడ్డం కష్టంలే. ఆయనతో నువ్వు వ్యవహారం పెట్టుకోకు. మాధవ్‍కి వదిలెయ్. వాడి భార్యకూడా అంతేనా?” అన్నాడు. మెతుకు పట్టుకుని అన్నమంతా వుడికిందో లేదో పట్టేసుకుంటున్నట్టు. గతుక్కుమంది లక్ష్మి.
“వదినా! జరిగినవేవీ మామయ్యకి చెప్పకు. ప్లీజ్!” అని గీతని బతిమాలుకున్నాడు మాధవ్.
“నాకు మా నాన్నెంతో అత్తకూడా అంతే మాధవ్. ఆవిడ్ని యిరుకునపెట్టన్లే” అంది గీత.
బారసాల ఘనంగా జరిగింది. నోట్లోనోట్లో రుద్రం చమకం చదువుకునే పిల్లాడిని కూర్చోబెట్టి వాడికి వచ్చినవన్నీ చదివించింది గీత. వాళ్లనాన్నని పిలిచి శాస్త్రోక్తంగా మళ్ళీ చదివించింది. ఆయనతో వచ్చిన వేదపండితులు స్వరయుక్తంగా రుగ్వేదం చదివారు. వింటూ గురుమూర్తి వుద్వేగం చెందాడు. “ఏమిటే, నువ్వు? మానాన్న నోటినుంచీ ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను గీతూ! మళ్ళీ వింటున్నాను. గాఢనిద్రలోంచీ తట్టి లేపినట్టుందమ్మా! మనింట్లోకి కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చావే. బ్రాహ్మడిని పిలిచామా, శుభకార్యం జరిపించుకుని నాలుగు అక్షింతలు నెత్తిమీద వేయించుకున్నామా అన్నట్టే జరిగాయి మనింట్లో అన్నీను. ఇదో కొత్తపద్ధతి. బావుంది” అన్నాడు.
“ఏమిటో వీళ్ళు! స్వంతపిల్లలని మానేసి, భట్రాజుల్లా ఈ పిల్లని పొగుడుతారు! కాస్త డబ్బు పడేస్తే జరిగేవన్నీ వింతలే?” చిరచిర్లాడాడు కుటుంబరావు.
“వేదం చదువుతున్నారు, మీరూ రండి మామయ్యా!” అని రామకృష్ణనికూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టింది గీత. వాసు చప్పుని లేచి వచ్చి తండ్రిపక్కని కూర్చున్నాడు. మాధవ్ కొడుకుని తీసుకొచ్చి తండ్రి వళ్ళో పెట్టాడు. ఆయన వెంటనే తిరిగిచ్చేసాడు.
వచ్చిన పండితులందరికీ సంభావన యిచ్చి, సకుటుంబంగా ఆశీర్వాదం తీసుకున్నాడు వాసు. మాధవ్, నీలిమకూడా దణ్నంపెట్టారు.
చదివింపుల్లో వచ్చినవి వచ్చినట్టు అక్కడాయిక్కడా దాచేస్తోంది మాధురి. లక్ష్మి చెప్పింది, “అన్నీ కనిపించేలా ఒకచోట పెట్టు మాధురీ! ఎవరెవరు ఏం చదివించారో చూసుకోవాలి. మళ్ళీ మనం పెట్టేదగ్గిర పొరపాటు జరక్కూడదు” అని.
పాతికవేల విలువచేసే నూటయిరవైగజాలస్థలం పిల్లవాడిపేరుమీద పెట్టాడు వాసు.
“ఇదేంట్రా?” తెల్లబోయాడు మాధవ్.
“నీకు యింత బాధ్యత ఎలా తెలిసిందాని అప్పుడు నేనూ ఇలానే తెల్లబోయాన్రా! ఇలాంటి సందర్భం వచ్చి బదులుతీర్చుకోవాలని నేనూ వదినా ఎంత ఎదురుచూసామో తెలుసా?” అన్నాడు వాసు. తనకి స్వంతంగా అమరిన మొదటి ఆస్తి. మాధవ్‍కి చాలా సంతోషంగా అనిపించింది. నీలిమకికూడ అపురూపంగానే వుంది. స్టాంపుపేపర్లని అబ్బురంగా చూసింది. తులసికి ఎనిమిదివేలు పెట్టి నెక్లెసు కొన్నాడు మాధవ్. చిన్నమేనల్లుడికి ఆమె గొలుసు, వుంగరం పెట్టింది. అందరూ ఎంతో ఎదురుచూసిన అతిథి వాడు.
“అరేయ్, ఇవన్నీ కాదుగానీ, ఈ మగసంతని చూస్తుంటే నీరసం వస్తోంది. ఒకళ్ళా, ఇద్దరా? ఐదుగురు. ఓ గౌనేద్దామంటే లేదు, గొలుసేద్దామంటే లేదు. రెండోసారేనా మీరు ఆడపిల్లని కంటే, అంతకన్నా కావల్సిందేమీ లేదు” అంది.
“నువ్వున్నావుకదే, అందరివంతూ ఆడపిల్లవి. అన్నీ చక్కగా పెట్టుకో” అన్నాడు మాధవ్ ప్రేమగా. ఇద్దరు మేనల్లుళ్లని ఇచ్చిన చెల్లెలు. నిన్నటి పసిపిల్ల. ఈరోజు ఆరిందాలా మాట్లాడుతోంది, గొడవలు తీరుస్తోంది. అతని మనసు పరవశించింది.
విహీ ఫంక్షనుకి వున్నంత సందడి యిప్పుడు లేదు. అందరూ వచ్చారుగానీ, ఆరోజటి వినోదం వేరు. కుటుంబరావు అన్నిట్లోనూ తలదూర్చడం, వాసు, గీత అంటీముట్టనట్టు వుండటంతో పెద్దగా ఎవరూ చొరవచూపించలేదు. బైటిఫంక్షనుకి వచ్చి వెళ్ళినట్టు వెళ్ళారు.
కుటుంబరావు స్థలం పేపర్లు చూసి మొదట సంతోషించినా తర్వాత చకచక లెక్కలేసాడు.
“అంత ఎగిరిపడకు. మీ బావకి వాళ్ల మామ ఇచ్చింది మూడొందలగజాలు. మీకు వీళ్ళిచ్చింది నూట ఇరవైగజాలు. దాంట్లో ఇల్లేం వస్తుంది? అదీకాక అందులో పదివేలు మీరిచ్చిందే. చాలదన్నట్టు తులసికి నెక్లెసు కొన్నారు. ఇంక మీకు మిగిలిందేమిటే? మీరిచ్చిన పదివేలమీదా వచ్చిన వడ్డీ. అంతేకదా? ఐనా పెద్దజమీందార్లలా అంత బంగారం పెట్టడమేమిటి? పదో పాతికో మంగళహారతి వేస్తే చాలదా? నీకేం సొమ్ములున్నాయని ఆ పిల్లకి చేయించి యివ్వడానికి? అసలు మీకు ఇంటిస్థలం యివ్వడమేమిటే? ఇంతిల్లూ వదిలేసి, అక్కడెక్కడో కట్టుకొమ్మనా? ఇల్లు వదిలిపెట్టే ప్రసక్తేలేదు” అన్నాడు కూతురితో ఫంక్షనయాక. నీలిమకి తండ్రిని చూస్తుంటే చీదరగా అనిపించింది. అదే సమయానికి ఆమె ఆలోచనలు మరోవైపు సాగుతున్నాయి.
తప్పుచేసినవాళ్ళకి ఎదుటివాళ్ళు తమని క్షమించేసి ఆ విషయం అక్కడితో వదిలెయ్యాలని వుంటుంది. ఆ మనస్థితిలో వుందామె. గీత ఆరోజుతర్వాత మళ్ళీ తనతో నేరుగా మాట్లాడలేదు. ఇప్పుడుకూడా పిల్లలని తన దగ్గిరకి రానివ్వలేదు. పంకజ్‍ని ఎత్తుకోలేదు. ఎత్తుకుంటామని గొడవచేస్తే తులసే పిల్లలందరినీ వరసగా కూర్చోబెట్టి వాడిని వాళ్ళ వళ్ళో పెట్టి తను పట్టుకుంది. ఇంకా కోపం తగ్గలేదా గీతకి? ఎంత పంతం సాగించుకుంటోంది!
“మీ వదిన ఇప్పటిదాకా వీడిని ఎత్తుకోనేలేదు” మాధవ్‍తో అంది. అతను తెల్లబోయాడు.
“అందుకే తొందరపడి ఎవరినీ ఏమీ అనకూడదు. తను చాలా సెన్సిటివ్ నీలూ! బాధపెడితే ఇంక వాళ్లకేసి చూడనుకూడా చూడదు” అన్నాడు. అని, “నాతో రా!” అని బాబుని తీసుకుని గీత వున్నగదిలోకి వెళ్ళాడు. గీత ఒక్కర్తే వుంది. ఏదో చదువుకుంటోంది. ఎప్పుడూ పదిమంది మధ్యని వుండే మనిషి అలా వంటరిగా కూర్చుని కనిపించేసరికి బాధేసింది.
“ఇంకా కోపం పోలేదా గీతూ?” మృదువుగా అడిగాడు.
“అదేం లేదురా!” జవాబిచ్చింది గీత.
“మరి వీడినెందుకు ఎత్తుకోవు?” అన్నాడు పిల్లాడిని ఆమెకి అందిస్తూ. గీత కాదనలేదు. తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకుంది.
“వదిన కాళ్లకి దణ్నంపెట్టవే” అన్నాడు నీలిమతో.
“వదిన్నికదా, నువ్వూ పెట్టు” దబాయించింది గీత.
“వద్దులేవే. చిన్నదానివి. అన్నయ్య పక్కనుంటే అది వేరు” అన్నాడు మాధవ్. నీలిమ వంగి గీత పాదాలని తాకింది. మొక్కుబడిగా కాదు, మాధవ్ అన్నాడనీ కాదు. రెండు కన్నీటిబొట్లుకూడా జారిపడ్డాయి.
“అయ్యో! ఇదేంటి? లే నీలిమా!” అంది. కొద్దిసేపు అక్కడే కూర్చున్నాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
“ఇంక మీ సమస్య తీరినట్టేకదా? వెనక్కి వచ్చెయ్యండి మాధవ్. పసిపిల్లాడితో ఒక్కళ్ళూ అంతదూరాన్న ఎందుకు?” అడిగింది లక్ష్మి కొడుకుని. వెళ్ళేముందు.
“కొన్నాళ్ళు బైటే వుంటాంలేమ్మా!” అన్నాడు మాధవ్. నీలిమలో వచ్చిన మార్పుమీద మాధవ్‍కి నమ్మకం కలగలేదు. ఒక సమస్య వున్నప్పుడు మనసులోని వుద్వేగాలని అదుపుచేసుకుని సంయమనం చూపించలేనివాళ్ళు ఆ సమస్య తీరాక చల్లబడ్డా మళ్ళీ ఇంకో సమస్య రాగానే మొదటికి వస్తారు. అతనికి నీలిమతో ఇప్పుడప్పుడే కొత్తగొడవలు సృష్టించుకోవాలనుకోలేదు.
“నువ్వు రావచ్చుగా, మాతో? వదిన నాన్నని చూసుకుంటుంది. విహీకూడా పెద్దయాడు?” అడిగాడు.
“వచ్చినా నెలో రెండునెలలో వుండగలనుగానీ అంతకన్నా కాదు. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. గీతదగ్గిర నాకు సౌకర్యంగా వుంటుంది. ఇక్కడ నాకు క్షణం తీరికలేనన్ని వ్యాపకాలు కల్పించిపెట్టిందది. తెలివితక్కువగా మాట్లాడినట్టనిపిస్తుందిగానీ చాలా లోతుగా మాట్లాడుతుందిరా! మనకి అర్థమవ్వటంలో వుంటుంది. మీ నాన్న యిలా ఎందుకు చేసారని బాధపడేదాన్ని. నా సమయమంతా ఆ ఒక్క ప్రశ్నతోటీ ముడిపెట్టేసుకుని, దు:ఖపడుతూ గడిపేదాన్ని. ఆయన అలా తయారైనందుకు నా లోపం వుందేమోనన్న గిల్ట్ వుండేది. ఆ టైములో మిమ్మల్నికూడా పెద్దగా పట్టించుకోలేదు!
మామయ్య తనకి నచ్చినట్టు తను సంతోషంగా బతుకుతున్నారు. నీకు నీలా వుండటానికి స్వేచ్ఛ యిచ్చారు. ఇంకా ఎందుకత్తా, బాధ- అని అడిగింది.
ఏమిటే, నీ తింగరిమాటలు- అని విసుక్కున్నాను. కానీ ఆమాటలు పదేపదే నా మనసులో కదిలాయి.
తెగిపోయిన బంధాన్ని పట్టుకుని ఎందుకు బాధపడుతున్నావనికదా, దాని ప్రశ్న? ఆయన అలా, నేను నాలా వుండలేమా, ఇదొక పరిణామం అనుకోకుండా ఎందుకు దు:ఖపడుతున్నాను నేను- అని ప్రశ్నించుకున్నాను.
సంతోషాన్ని వెతుక్కోవడం రాక- అనేది నా వెతుకులాటలో దొరికిన జవాబు.
ఇప్పుడు నాకు చాలా బావుంది మాధవ్. ఎన్నేళ్ళేనా మీ నాన్నని అలా చూసుకుంటూ ఇద్దరం వేరువేరు సంతోషాలతో బతికెయ్యగలమన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు నీతో వస్తే, అక్కడ చెయ్యడానికి ఏమీ వుండదు. ఇద్దరం ఒకళ్ళ మొహం ఒకళ్ళం చూసుకుంటూ వుండాలి. నీలిమది కలిసిపోయే మనస్తత్వం కాదు. ఇవి ఏ గొడవలకి దారితీస్తాయో తెలిదు” అంది. తల్లిని భుజంచుట్టూ చెయ్యేసి దగ్గిరకి తీసుకున్నాడు మాధవ్.
“నీయిష్టమమ్మా! ఆవిడతో ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆయన ప్రతీదీ ఆరా తీస్తాడు. పాస్‍బుక్కులవీ చూస్తాడు. చికాగ్గా అనిపిస్తుంది”
“నీకు యిబ్బంది కలిగేటప్పుడు ఎదుటివాళ్ళు బాధపడతారేమోనని చూడకూడదు. ముఖ్యమైనవి బీరువా లాకర్లో పెట్టుకుని తాళంపెట్టుకో. నీ దాపరికాలూ అవీ అందరికీ సవివరంగా తెలీకూడదు. నీలిమ చెప్తే అది వేరే విషయం. తనేనా పూసగుచ్చినట్టు అన్నీ చెప్పేస్తే ఇంక మీ కాపురం మీదెందుకౌతుంది? మీరు తీసుకునే ప్రతినిర్ణయాన్నీ ఇంకెవరో మార్చడానికి చూస్తారు. అది తనకి అర్థమయ్యేలా చెప్పు” అంది. అతను తలూపాడు.
నీలిమకూడా అడిగింది ఆవిడ్ని తమతో రమ్మని.
“ఇప్పటికి మీవాళ్లని తీసుకెళ్లండి నీలిమా! నేను వీలుచూసుకుని వస్తాను. మీరే నెమ్మదిమీద వెనక్కి వచ్చెయ్యండి” అంది. నీలిమ తలూపింది. అత్తగారికన్నా తల్లిని తీసుకెళ్ళడం బానేవుంటుంది. పనిదగ్గర గొడవుండదు. కానీ తండ్రితోనే సమస్య.
“మరోసారి మిమ్మల్ని తిరిగిరమ్మంటే ఆ ముష్టివెధవలమూకని తీసుకుని వాళ్ళు యింట్లోంచీ కదిల్తే శుద్ధీ అదీ చేయించుకుని వస్తానని చెప్పు. లేకపోతే వాళ్లతో వీడినీ కలిపేస్తారు. ఎంత తెలివి వున్నా, చదువొచ్చినా, ఇంటిపిల్లల్తో వాళ్ళు సమానం కారుకదా? నా మనవడు ఎంతో దర్జాగా పెరగాలి. ఆఫీసరు కొడుకు వాడు. ముగ్గురు మనవరాళ్ళమీద ఒక్కడు. అపురూపంగా పుట్టాడు. చూడు, ఎవరూ ఎవరికీ ఎక్కువ కాదు. ఎవరి పిల్లలకి వాళ్ళు చూసుకుంటారు. ఆ రామారావు నీ కొడుక్కి ఏం పెట్టాడు? బైటిపిల్లలకి పెట్టినట్టేనా? ఇంక నువ్వు దేనికి మొహమాటపడాలి?” అన్నాడు కుటుంబరావు కూతుర్తో.
“అమ్మా! మిమ్మల్ని మాతో రమ్మనటానికి నాకు ఇదే సమస్య. ఈయన్ని ఇలాంటివేం మాట్లాడద్దని చెప్పు. పొరపాట్న మాధవ్ చెవినపడ్డాయా, ఇంక నేను శాశ్వతంగా మీదగ్గిరే. నాన్నా! ఎవరి పిల్లలకి వాళ్ళు పెట్టుకుంటారుకదా, నువ్వు నా కొడుక్కేం పెట్టావు? తులసిపాటేనా పెట్టావా? లేదుకదా? ఇంక మాట్లాడకు” అంది విసుగ్గా.
“ఉంటే పెట్టనేమిటే? కట్టకట్టుకుని నాతో తీసికెళ్తానా?” అన్నాడు తెల్లబోతూ. ఈమధ్య నీలిమ తనేది చెప్పినా ఎదురుచెప్తోందని గ్రహించాడు. దాని మంచికోసమేగా, నేను చెప్పేది? అనుకున్నాడు.
ఆ తర్వాతియేడు రామకృష్ణ చనిపోయాడు. భార్యపట్ల తన నిర్లక్ష్యానికి ఎలాంటి నివేదనలూ చెయ్యకుండానే కుటుంబాన్నిగురించి ఏ అప్పగింతలూ పెట్టకుండానే నిద్రలో ప్రాణం వదిలాడు. ఎలాంటి ముందస్తు సూచనాలేని సంఘటన అది. ఆ తొమ్మిదికుటుంబాల్లోనూ అదొక పెద్దకుదుపు. అరవైలు దాటినవాళ్లంతా ఒక్కసారి వులిక్కిపడ్డారు.
అప్పుడే ప్రమీల అన్నది, “అవంతీపురంవాళ్ల బళ్లన్నీ ప్లాట్‍ఫామ్‍మీదికి వచ్చి ఆగాయి, ఎప్పుడు పైవాడి పిలుపొస్తే అప్పుడు ఒకొక్కటీ కదలడమే- అని.
మరో విషయం అందరినీ చకితులని చేసింది. తనకీ, భార్యకీ కర్మకి డబ్బు ఏర్పాట్లు చేసుకున్నాడు రామకృష్ణ, అంతకన్నా ఒక్కపైసకూడా ఎక్కువ ఖర్చుపెట్టడానికి వీలులేదనే షరతుతో. అదొక మార్గదర్శకంగా అనిపించింది పెద్దవాళ్ళందరికీ.
లక్ష్మికి బైటికి వెక్కివెక్కి ఏడ్చేంత దు:ఖం కలగలేదు. విషాదం ఒక మేఘంలా మొదలై మనసంతా ముసురులా కమ్మేసింది. ఎన్నో జ్ఞాపకాలు. ముప్పయ్యైదేళ్ళ పైబడ్డ సాహచర్యం. ప్రేమగానే చూసేవాడు. ఎందుకో మనిషిలో వున్నట్టుండి మార్పొచ్చింది. ఆ తర్వాతకూడా అతను బాధ్యతలు వదిలిపెట్టేసాడుగానీ తనని అగౌరవపరిచింది లేదు. అత్తగారు సూచనగా అంది. ఒకేఒక్కసారి.
“నువ్వే కాస్త చొరవతీసుకుని వాడిని దార్లోకి తెచ్చుకోవాలి” అని. చెయ్యలేకపోయింది. అవమానంగా అనిపించింది. ఇరవయ్యేళ్ళు కాపురం చేసాక నువ్వు నాకక్కర్లేదని అన్నీ తెంచుకువెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ వలచి వలపించడానికి తనది చిన్నవయసేం కాదు. శృంగారం ఒక్కటేకాదుకదా, జీవితానికి కావల్సినది? అతను ఆ గదిలోనూ, తను యీ యింట్లోనూ స్థిరపడిపోయారు. ఒకరికొకరు ఏమీ కానట్టు, కేవలం కొన్ని లావాదేవీలుమాత్రమే మిగిలివున్న పరిచితుల్లా మిగిలిపోయారు. అతనలా వుండటంవలన తనకి ఎలాంటి యిబ్బందీ కలగలేదు. ఇప్పుడిదేంటి హఠాత్తుగా? అతని గోత్రాన్నీ, ఇంటిపేరునీ మోస్తూ అతనివాళ్లమని చెప్పుకుంటూ ఇంతమంది వుండగా ఎవరికీ ఏమీ కానట్టు వెళ్ళిపోయాడు?
రామకృష్ణ అక్కలిద్దరూ వలవల ఏడ్చారు.
“ఇంక మాకు పుట్టిల్లుకూడా లేకుండా చేసావారా? నిన్నెవరమేనా పన్నెత్తి ఒక్కమాట అన్నామా? నీకు తోచినట్టే బతికావుకదా? ఇప్పుడేం కష్టం వచ్చిందని చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయావు?” అని ఏడుస్తుంటే వాసు దగ్గిరకి తీసుకుని ఓదార్చాడు.
“నాన్నంటే లేరుగానీ ఆయన కన్నపిల్లలం వున్నాంకదాత్తా! అప్పుడే ఇది మీయిల్లు కాకుండాపోయిందా? మేము పరాయివాళ్ళమైపోయామా?” అని తనూ ఏడ్చాడు.
కర్మకాండ యథావిథిగా చేస్తున్నారు. పదోరోజు సమస్య తలెత్తింది. ఆరోజు లక్ష్మికి చేయాల్సిన కార్యక్రమానికి ఆడపిల్లలలెవరూ వప్పుకోలేదు. వాళ్లకి అదేమిటో సరిగ్గా తెలీదు. అడిగి తెలుసుకున్నదే. విజ్జెమ్మ అందరిమధ్యనీ కూర్చుని చెప్పసాగింది.
“తాతయ్య పోయినప్పుడు తెల్లవారకముందే లాంతెర్లు వెలిగించుకుని అందరం కలిసి నదివొడ్డుకి వెళ్ళిపోయాము. ఇలాంటి కార్యక్రమాలు అక్కడే చేసేవారు. మంగళసూత్రం, మట్టిగాజులూ తీసి అక్కడ పెట్టెయ్యమన్నారు. పెట్టేసాను. మంగళసూత్రాలు చాకలావిడకి వెళ్తాయట. మనం తెచ్చుకోకూడదని చెప్పారు. తలారా స్నానంచేసి యింటికి వచ్చేసాం. అప్పటికింకా తెల్లవారలేదు. ఎవరూ నన్ను చూడలేదు. అప్పట్లో రాణీగారి అధ్వర్యంలో మహిళామండలి నడిచేది. బాగా చదువుకున్నవాళ్ళు అందులో వుండేవాళ్ళు. తెల్లారేసరికి పదిపదిహేనుమంది వచ్చేసి నాచుట్టూ దడికట్టినట్టు కూర్చున్నారు. పదోరోజు తతంగాలేవీ జరగనివ్వలేదు. పెద్దగొడవైపోయింది. కర్మకి వచ్చిన బ్రాహ్మలు కొందరు సమర్ధించారు, కొందరు విబేధించారు.
భర్త చనిపోయాక కుటుంబ ఆధిపత్యం మారుతుంది. స్త్రీకి అప్పటిదాకా సంకెళ్ళలా వున్నవాటిని తొలగించడమే ఈ సాంప్రదాయానికి అర్థం. ఆవిడే అవన్నీ తీసేసిందికాబట్టి ఇక్కడింక చర్చకి అవకాశమే లేదు- అన్నాడు సమర్ధించినవాళ్లలో ఒకాయన. ఆయనకి ఉద్దండపండితుడనే పేరుంది. దానిమీద వాదోపవాదాలూ, చర్చోపచర్చలూ జరిగాయి. అరుపులూ గోలలూ అయ్యాయి.
మరోవిషయంకూడ అన్నాడు- నిజంగా మంగళసూత్రానికి మా ప్రాణాలుకాపాడే శక్తే వుంటే దాన్ని ఆడవాళ్ల మెడల్లో ఎందుకు కడతాం? జంధ్యానికి ముడేసుకుని మేమే జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళం. రాజకీయ, చారిత్రక కారణాలకో, మనసులో వుండే భయాలని అధిగమించేందుకో కొన్నికొన్ని ఆచారాలు ఏర్పరుచుకుంటాం. ఆ కారణాలు సమసిపోయాక ఆ ఆచారాలనికూడా వదిలిపెట్టాలి. కాలంతోపాటు అప్రమేయంగానే కొన్ని మారతాయి. ఒక మగమనిషి చనిపోతే అతనికి కర్మ సవ్యంగా చెయ్యడం విధాయకంగానీ ఇవన్నీ కాదు- అని కచ్చితంగా చెప్పేసాడు.
త్రిమూర్తులుకూడా వున్నాడు అక్కడ. పెద్దపంతులుగారు చెప్పినట్టే చేద్దాం. మనకీ అక్కచెల్లెళ్ళున్నారుకదా- అన్నాడు.
నాచుట్టు కూర్చున్న ఆడవాళ్లలో ఒకావిడ అంది- మా అందరి అడ్రెసులూ ఇస్తాం. మావాళ్లకి ఏమైనా జరిగిందేమో మీరు స్వయంగా మా యిళ్లకి వచ్చి నిర్ధారించుకోండి- అని. వాళ్ల విషయంకాదు, మనింట్లో మరో అశుభం ఈరోజుదాకా జరగలేదు.
ఇలాంటి అనాచారం మేం చూడం అని కొంతమంది ఆడామగా వెళ్ళిపోయారు. ఆడపిల్లలకి సంబంధాలు రావేమోనని మా అమ్మ భయపడింది. కానీ అసలంటూ ఏదేనా మొదలెడితేనే ముందుకు సాగేది. అందరికీ సంబంధాలు చక్కగా కుదిరాయి. ఐతే ప్రమీల అత్తగారు అడిగింది.
మీకు పదోరోజు చెయ్యలేదట- అని.
మగాడున్నా, లేకపోయినా మన బతుకులేమీ గొప్పగా వుండవు. మీకులాగే చిన్నప్పుడే పోయారు మావారూను. మెడల్లో పసుపుకొమ్ము కట్టుకుని, నోట్లో జీలకర్ర పోసుకుని నవుల్తూ పదోరోజు కార్యక్రమం యథావిధిగా జరిపించి, జుత్తుకూడా తీయించేసి, నామీదికి ఐదుమూరల సైనుగుడ్డలు విసిరేసి, వెనక్కి తిరిగిచూడకుండా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు అంతాను. అతను పోయారుకాబట్టి నేనింక తిండే తినక్కర్లేదనుకుంది మా అత్తగారు. ఇంటెడు చాకిరీ చేయించుకుని గుప్పెడు మెతుకులు పడేసేది. రాత్రికి అదికూడా లేదు. అన్నం మిగిలినా అందులో నీళ్ళు పోసి అంట్లలో పడేసేది తప్ప, పెట్టేది కాదు. ఆకలికి పేగులు గింగుర్లెత్తిపోయేవి. అందరూ నిద్రపోయాక ఆ మెతుకులు తీసుకుని తిన్న రోజులున్నాయి. గురవయ్యకోసం ప్రాణాలు నిలబెట్టుకున్నాను- అంది.
మనిషి మంచిదో చెడ్డదో. ఆవిడ విజ్ఞతకి తగ్గట్టు ఆవిడ బతికింది. కాబట్టి నాతరంలోనే ఆగిపోయిన సాంప్రదాయాన్ని యిప్పుడు మళ్ళీ మొదలుపెట్టక్కర్లేదు ” అంది.
వల్లి అమాంతం ఆవిడ్ని ఎత్తి గిరగిర తిప్పేసింది.
“ఒసేయ్, రాక్షసీ! తాటకీ! దింపవే ముందు” అని గోలపెట్టేసిందావిడ “తాటిచెట్టంత ఎదిగావుగానీ బుర్రలేదేమే, నీకు? మీ ఆయన్ననుకున్నావా, హిడింబిలా ఇలా ఎత్తేసావు?” అంది. అక్కడున్నవాళ్ళంతా ముసిముసిగా నవ్వుకున్నారు. వల్లి భర్త సిగ్గుపడిపోయి అక్కడినుంచీ జారుకున్నాడు. ఆవిడ్ని జాగ్రత్తగా కిందికి దించింది వల్లి.
“ఇంత డైనమిక్, మాడ్రన్ ఓల్డ్‌లేడీవి. అమ్మమ్మా! నువ్వు మన మొత్తం కుటుంబానికే గర్వకారణం” అంది వల్లి.
“నీ తలకాయ్” అందావిడ గుండెదడ ఇంకా తగ్గక. కాస్త కుదురుకున్నాక అక్కడున్నవాళ్ళందరికీ చెప్పింది.
“మాయింట్లో మాకు తగ్గట్టు చేసుకుంటాం. మీకు యిష్టమైతే రేపు మామూలుగా లక్ష్మిని చూడచ్చు. అలా కాదనుకుంటే మంచీచెడూ చూసుకుని మీకు నచ్చినప్పుడు వచ్చి చూడండి. ఎవరికీ ఇందులో బలవంతమేమీ లేదు. దానికి జాకెట్టుబట్ట లేకుండానూ, అంచుల్లేకుండానూ చీరలూ అవీమాత్రం తేవద్దు. దాన్ని బాధపెట్టద్దు” అంది. అక్కడ పరాయివాళ్ళెవరూ లేరు. చదువుకున్న ఆడవాళ్ళూ, చదువుకున్న పిల్లలకి తల్లులూ, అత్తగార్లూను. ఎవరూ ఆక్షేపించనూలేదు. పెద్దగా పట్టించుకోనూ లేదు. విజ్జెమ్మ అన్నట్టు ఏదైనా మొదలంటూ పెట్టాలిగానీ దానంతట అదే ముందుకి వెళ్ళిపోతుంది.
“ఇదెక్కడి అనాచారం? పెద్దవాళ్ళు వుత్తిగా పెట్టారా సాంప్రదాయాలన్నీను? పాటించకపోతే వినాశనం జరుగుతుంది. విధవ్వాళ్ళు విధవ్వాళ్ళలా వుంటున్నారా ఎక్కడేనాను? అన్ని శుభకార్యాలకీ వాళ్ళే ముందు. అంతా కలికాలం. అందుకే లోకంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి” అని గిజగిజలాడిపోయింది ఒక్క కుటుంబరావే.
“చూడండి, మీ అత్తగార్లకి లేని ఆక్షేపణ మీకెందుకే? మీరు ఆ యింటి పిల్లలుగానీ మా పిల్లలుకాదు యిప్పుడు. వాళ్లెలా చెప్తే అలా చెయ్యండి” అంది కమలాక్షి కూతుళ్లతో.
“మరి నువ్వు?” ఆవిడని అడిగాడు.
“వేషాలేస్తే ఇంక వియ్యాలవారిళ్లకి వెళ్ళే పని వుండదు” అంది.
“నీకు తోచినట్టు ఏడు. పైకి కనిపించకుండా పసుపుకొమ్ము కట్టుకుంటే మంచిది. లేకపోతే ఆ పుస్తె పుటుక్కుమంటుంది. నేనంటూ వున్నానుగాబట్టి నీకా మర్యాద. లేకపోతే ఏమీ వుండదు. తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం వుండదు. సర్లె, నేను పోతే నువ్వు చేయించుకుంటావా? లేక నువ్వూ యింతేనా? పదోరోజు జరిగితేనే మంచిది. జుత్తుకూడా శాస్త్రానికి మూడుకత్తెర్లివ్వు” అన్నాడు. ఆవిడ నొచ్చుకోలేదు. అయ్యో, అవేం మాటలనలేదు. తలూపింది. ఆరోజు రాత్రి ఆయనకి నిద్రపట్టలేదు. పట్టినా పీడకలలు. తను చచ్చిపోయినట్టూ, భార్య పట్టుచీరకట్టుకుని పసుపు పూసేసుకుని, కుంకం పెట్టేసుకుని, తలనిండా పువ్వులదండలు పెట్టుకుని, బారెడు జడ వూపుకుంటూ ఇల్లంతా తిరిగినట్టు కలలు. మాధురితోనే ఈవిషయం మాట్లాడాలి- అనుకున్నాడు తెల్లారి లేచాక.
ఇలాంటి నిర్ణయాన్ని అంతా వ్యతిరేకిస్తారనీ, పెద్దగొడవౌతుందనీ అనుకుంది మాధురి. అక్కడున్నవాళ్ళెవరికీ అసలా విషయమే పట్టింపులేకపోవడం గాభరా కలిగించింది. ఏదో గొడవ జరగాలి. అప్పుడామెకి ప్రశాంతంగా వుంటుంది. పోయింది వియ్యంకుడుకాబట్టి కుటుంబరావు పరామర్శకి వెళ్లకూడదు, వెళ్ళలేదు. అక్కడేం జరుగుతోందో ప్రత్యక్షంగా చూడకుండా వుండటం ఆయనకి దుర్భరంగా వుంది. ఆ చుట్టుపక్కలే తిరుగుతూ వాళ్లదగ్గిరా వీళ్లదగ్గిరా నోరుపారేసుకుంటున్నాడు.
“ఇల్లూ, డబ్బూదస్కం అన్నీ ఆవిడ పేరిటే వున్నాయట. లక్షణంగా ఇద్దరు మగపిల్లలుంటే ఆవిడ పేర్న పెట్టడమేమిటి? ఆడాళ్లకేం చాతనౌతాయి డబ్బువ్యవహారాలు? ఎవరు నాలుగు యిచ్చకంమాటలు చెప్తే తోచిందల్లా వాళ్ళచేతిలో పెట్టేస్తారు. ఓవైపు మేనకోడలు, మరోవైపు కూతురు. కాకాపట్టి అన్నీ అంకించేసుకుంటారు. ఇంక నా కూతురినోట్లో మట్టే” అన్నాడు. ఇంకా చాలా అన్నాడు. కర్మచేసేది పెద్దకొడుకు కాబట్టి ఖర్చు అతనే పెట్టుకోవాలనీ, తండ్రి దాచుకున్న డబ్బుకి కక్కుర్తిపడకూడదనీ అన్నాడు. మాటలు పుట్టినవి అక్కడికక్కడే ఆగిపోవు. ఎక్కడెక్కడికో చేరతాయి. అలా చేర్చేవాళ్లని వెతుక్కునే ఆయనా అంటున్నాడు.
“అనవసరంగా మాటపడుతోంది లక్ష్మి. అప్పుడే వాసూవాళ్లని వేరే పెడితే ఈ అనుకోవడాలుండవుకదా? మాధవ్ మామ, ఆయన భయం ఆయనదీ” అంది పద్మ నట్టింట్లో కూర్చుని. నిప్పు సన్నసన్నగా రాజుకుంటోంది. అన్నదమ్ములిద్దరూ దు:ఖంచేతా, కర్మకార్యక్రమాలచేతా అలసిపోయి వున్నారు. ఖర్చులకి తనూ కొంత డబ్బివ్వబోయాడు మాధవ్.
“వద్దురా!” అన్నాడు వాసు ముభావంగా.
“అదేంట్రా? చాలా ఖర్చౌతోంది. బేంకు క్లెయిమ్ సెటిలయ్యి డబ్బు తెచ్చుకునేదాకా నడవాలికదా? అంతా నువ్వుమాత్రం ఎక్కడినుంచీ తెస్తావు?” అన్నాడు మాధవ్.
“నాకంతా ఏదో పెట్టేస్తున్నారని ఇప్పటికే మీ మామ వూరూవాడా ఏకంచేసేస్తున్నాడు. మనింట్లో నేను పరాయివాడిని. ఈ యిల్లు నాదికాదు, నాన్న డబ్బు నేను ముట్టుకోకూడదు. ఇక్కడ నేనుండకూడదు. నువ్వేమో నీ భార్యకీ మామకీ చెప్పుకోలేవు. చూడగా చూడగా నీక్కూడా వాళ్లమాటలు యిష్టమేననిపిస్తున్నాయి” అన్నాడు.
“అదేంట్రా వాసూ!” వెలతెలబోతూ అన్నాడు మాధవ్, కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా.
“నాకు తెలిసిన విషయాలు నీకెందుకు తెలీవురా? వేషాలు కాకపోతే?” అన్నాడు వాసు.
నీలిమ అక్కడే ఇంకేదో పని చూసుకుంటోంది. గీతకూడా అక్కడే వుంది. చప్పుని కలగజేసుకుంది.
“ఏంటిది? ఎవరో ఏదో అంటే అది పట్టుకుని ఈ టైములో మీరిద్దరూ దెబ్బలాడుకుంటారా?” అంది. ఆ మాటలు మాధురి చెవినపడ్డాయి. వీళ్ళు నలుగురూ ఎక్కడుంటే ఆమె ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటుంది.
“ఎవరో ఏదోనా? చెప్పేదేదో సూటిగానే చెప్పచ్చు, అన్నది మానాన్నే అని. మానాన్నని పరాయివాడిని చేసి మాట్లాడతావా? మీ నాన్నలాగే ఆయనా ఓ పిల్లని ఇక్కడ యిచ్చుకున్నాడు” అంది పెద్దగొంతుతో. ఆమె గొంతువిని నీలిమ కలగజేసుకునేలోగా, పెద్దగొంతుతో మాట్లాడుతూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
“ఏం వాగుతున్నాడు నీలిమా, మీ నాన్న? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను మా అన్నయ్యని ఏదన్నా అంటే వూరుకోనని. వాడినే మీనాన్నకి చెప్పమంటావా? వాడు నోరెత్తి మాట్లాడితే మీ మర్యాద దక్కదు. ఆయన్నే నోరుమూసుకుని కూర్చోమను” అరిచాడు మాధవ్.
“మా నాన్న ఇక్కడికి రానే రాలేదు. అన్నది మీ పిన్ని. ముందు ఆవిడ సంగతి చూడండి” జవాబిచ్చింది నీలిమ. తండ్రి అంటున్నవి ఆమెకి తెలుసు. కానీ బైటపడలేదు. ఎవరివి వాళ్ళు పంచుకుని వేర్లుపడితే బావుణ్ణని ఆమెకీ వుంది. మీరిక్కడ అద్దెకట్టుకుంటూ అగ్గిపెట్టెలాంటి యింట్లో వుంటుంటే వాళ్ళు పైసా ఖర్చులేకుండా ఆ యింటిని అనుభవిస్తున్నారని తండ్రీ, మాధురీ అన్నమాటలు ఆమెలో చాలారోజులకిందటే సంచలనాన్ని రేపాయి. మాధవ్ అనుకున్నట్టే ఆమె తన పాతపంథాలోకి తిరిగి వెళ్లిపోయింది.
మాధవ్ కోపంగా వెళ్లబోయాడు. గీత చెయ్యిపట్టుకుని ఆపింది.
“ఇది గొడవలుపడే టైము కాదు మాధవ్. అంతా నవ్వుతారు” అంది మృదువుగా.
“మీకు రెచ్చగొట్టడం, వెన్నరాయడం బానే వచ్చును. అన్నది ఎవరో మీకు తెలీదా?” అంది నీలిమ.
“ఎవరెవరు ఏమేం అన్నారో లెక్కతేల్చుకుందాంలే” అన్నాడు మాధవ్. అన్నదమ్ములకి ఇంకా సయోధ్య కుదరకుండానే బ్రాహ్మడు పిలిచాడు. ఇట్నించీ మాధురి వాళ్ల గొడవ విన్నట్టే అట్నించీ వాసు పెద్దమేనత్త సక్కూబాయికూడా విన్నది.
“ఇదో, నీలిమా! ఇలా రా!” అని వెళ్లబోతున్నదాన్ని ఆపి, పిలిచింది. ఏదేనా పనేమోనని గీతా ఆగింది.
నీలిమని ఎగాదిగా చూసిందావిడ. “సూత్రాలగొలుసుతోటో పసుపుతాడుతోటో వచ్చినదానివి వంటినిండా బాగానే చేయించుకున్నావు. మీకు డబ్బులేదని ఆవిడ అంటుంటే చిన్నతనంవెయ్యలేదా? సిగ్గనిపించలేదా? నీకు పిల్లల్లేరని పక్కింటి రుక్కమ్మ అంటే అదో పెద్దనేరంలాగ పంచాయితీ పెట్టినదానివి, ఇప్పుడు నీనోరు లేవదేం? డబ్బు లేదని చెప్పుకుని తిరగడం మీపుట్టింట్లో అలవాటా? లేక నిజంగానే మా చిన్నల్లుడు సంపాదించిందంతా తగలేసుక్కూర్చున్నారా? ఏం చేసారు డబ్బంతాను? వీళ్ళకి మిగిలింది, మీకెందుకు మిగలదు? పేకాడుతున్నాడా వాడు? తాగుతాడా? ఈ రెండూ లేకుంటే నెలకి నెల ఎత్తే జీతాలు యేమౌతాయి? మీ నాన్నకి తెలుసా? అల్లుడి మంచీచెడూ చూడడా? పిల్లనివ్వడంతో సరనుకుంటున్నాడా?” అడిగింది. నీలిమ ముఖంలో రంగులు మారాయి. గీత తెల్లబోయి చూస్తుంటే, ఆమెనీ దులిపిందామె.
“అలా గుడ్లేసుకుని చూస్తావేమే? ఆమె అంటుంటే మా మరిదికేం తక్కువని జవాబు చెప్పలేవా? సర్లే, నువ్వెక్కడ మాట్లాడగలవు? లోకంలో వున్నవాళ్ళంతా నీ చుట్టాలే. నేనే మాట్లాడతాను. వదిలిపెడతానా? ” అంది. నీలిమ విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయింది.
“ఏంటి గీతా, ఈ గోల? అన్నదమ్ములుకూడా మాటలనుకుంటున్నారు? విహీ బారసాలప్పటి గొడవ ఇంకా ఆగలేదా?” అడిగిందావిడ.
“ప్రాణాలు తినేస్తున్నారు పిన్నీ! దేనికో ఒకదానికి గొడవ. అన్నిటికీ కారణం ఒక్కటే, నీకు తెలిసిందే. బైటెక్కడో కూర్చుని ఆయన ముట్టిస్తాడు, ఈవిడ ఇక్కడ అంటిస్తుంది. పైకి ఎవరూ ఏమీ అననట్టే వుంటుంది. ఎదురుగా ఏదేనా అంటే జవాబు చెప్పగలం. మనతో నేరుగా అననివాటికి ఎలా జవాబివ్వగలం? నాకిలా దెబ్బలాడుకుంటూ బతకాలంటే చాలా కష్టంగా వుంది” అంది గీత రుద్ధస్వరంతో.
“నాకు నచ్చినట్టు నేనుంటానని నువ్వనుకున్నట్టే వాళ్ళూ అనుకుంటారుకదే? నువ్వు గట్టిపడితే వాళ్ళు ఎక్కడో ఒకదగ్గిర ఆగుతారు. నువ్వు దూదల్లే వుంటే ములుకులా కసుక్కుని దిగేస్తారు” అంది. “వెళ్ళు, వెళ్లి పని చూసుకో, నువ్వు పక్కన లేకుంటే పనులవ్వవు” అని పంపించింది.
“మీ పిన్నేదో అంటే ఈవిడేమిటి నన్ను తిడుతుంది?” అంది నీలిమ మాధవ్‍తో, అతను ఇవతలికి వచ్చినప్పుడు.
“ఇప్పుడు మనం ఎవరితో దెబ్బలాడదాం? పిన్నితోనా, అత్తతోనా?” అన్నాడు.
ఆమె కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది.
“మళ్ళీ ఏమైందిరా?” విసుగ్గా అడిగాడు వాసు.
“పిల్లీ పిల్లీ పోరు పిట్ట తీర్చిందట. తన పోరు పిట్ట ఎత్తుకుపోయిందని ఏడుస్తోంది” అన్నాడు మాధవ్.
అక్కడ హాల్లో అందరిముందూ గట్టిగా మాధురి అంది, “మొదట్నుంచీ వీళ్ళింట్లో మా చెల్లిని పరాయిదానిలాగే చూసారు. కడుపునిండా తిండిపెట్టకుండా నాలుగేళ్ళు మాడ్చారు. ఇక్కడున్నన్నాళ్ళూ ఎన్నిసార్లు డాక్టర్లకి చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అక్కడికి వెళ్లగానే నెలతప్పింది. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి” అని.
ఒక్క నిముషంపాటు ఎవరికీ ఏమీ అర్థంకాక ప్రశ్నార్థకంగా చూసారు. ప్రహ్లాద్ కోపంగా కుర్చీలోంచీ లేవబోయాడు. ప్రవల్లిక అతన్ని ఆపింది.
“అందర్లో గొడవెందుకు? రా! వదినా! ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం” అంది ఆమెని చెయ్యిపట్టుకుని పక్కకి తీసుకెళ్ళిపోయింది. అట్నుంచీ తులసీ, సమీరా వచ్చి కూర్చున్నారు. మరోవైపునించీ మానస వచ్చింది.
“నీకు మనింట్లో అన్నం ఎవరు పెడతారు? నువ్వేకదా, పెట్టుకుని తినేది? నీలిమకి ఎవరో ఎందుకు పెట్టాలి?” అని మొదలెట్టింది వల్లి.
“పెట్టుకు తిండానికేనా దానికసలు వంటే చేసేదికాదు గీత” ఆరోపణగా అంది మాధురి.
“గీత వండిపెట్టడమేంటి? తనేం చేసేది? ఇంట్లోనేగా, వుండేది? తనే వండచ్చుకదా? గాలి తిని బతికిందా, ఆ నాలుగేళ్ళూను? అబ్బబ్బబ్బబ్బ! మాకూ చెప్పచ్చుకదా, ఆ మంత్రమేదో, మేమూ వంటలు మానేస్తాం” అంది సమీర.
“ఇక్కడున్నన్నాళ్ళూ మాధవ్‍కి తెలీకుండా వేరే డాక్టరుదగ్గిర తెచ్చుకుని కాంట్రసెప్టివ్స్ వాడిందట. లేకపోతే అన్నీ సవ్యంగా వున్నవాళ్లకి పిల్లలెందుకు పుట్టరు? అతికినట్టుందా? ఇలాంటి మాటలు మేమందరం కలిసి ఒక్కమాటగా చెప్తే వాళ్ళిద్దరూ కాపురం చేస్తారూ? చెప్పలేకనా?” అడిగింది తులసి. ఐదుగురూ కలిసి గంటసేపు వాదించుకున్నారు. తను తప్పుగా ఏమీ అనలేదని వప్పించే ప్రయత్నం చేసింది మాధురి. మానసకి అక్కని ఎలా వెనకేసుకురావాలో తెలీలేదు. నీలిమ వుంటే బావుణ్ణనిపించింది. నువ్వలా మాట్లాడటం తప్పే అని ఖండితంగా చెప్పేసారు వీళ్ళు అక్కచెల్లెళ్ళు ముగ్గురూ.
“ఈ హడావిడంతా అయాక అందరం కూర్చుని మాట్లాడుకుందాం. అందరం అంటే మన కుటుంబంలోని పిల్లలం పెద్దలం అందరం. అందరికీ తెలియాలనేకదా, నువ్వింత గట్టిగా అరిచింది? అటోయిటో తేలిపోతుంది. మాకు ఇలా అరుచుకోవడం దెబ్బలాడుకోవడం నచ్చవు. ఒక్కసారి బేధాభిప్రాయం రాగానే రిజల్టు వచ్చెయ్యాలి” అంది వల్లి. దాంతో తోకముడిచింది మాధురి. విసవిస వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్లడం చూసి,
“వల్లీ! ఇలా రావే!” అన్నాడు సుమంత్. వచ్చి పక్కని కూర్చుందామె. తులసి ఎవరో రమ్మని పిలిస్తే వెళ్ళింది.
“వదిన్ని ఏమన్నారే, ముగ్గురూ కలిసి? అలా వెళ్ళిపోయింది?” అడిగాడు నవ్వుతూ.
“మేం ముగ్గురం – వాళ్ళు ముగ్గురు. వాళ్లలోంచీ ఓ కేండిడేటు బిజీగా వుంది. అందుకే లెక్క తొందరగా తేలిపోయింది” అంది వల్లి.
“ఇందాకా అమ్మమ్మ నిన్నేమందే?” అడిగాడు.
“ఏమంది?” అర్థంకానట్టు అమాయకంగా అడిగింది.
“రాక్షసీ అంది, తాటకీ అంది, ఆతర్వాత?” అంటూ పకపక నవ్వేసాడు. వల్లి ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
“నేను విన్నాను. ఐదున్నరడుగుల అందగత్తె మా చెల్లెలు. అడ్డొస్తే కొంగు బిగించి బావని అమాంతం ఎత్తి పక్కని పెట్టేస్తుందని” అన్నాడు నవ్వుతూనే.
“పోరా! ఏం వదినా! అన్నయ్యకీ అనుభవమేనా, ఇంత కచ్చితంగా చెప్తున్నాడు?” అంది.
“ఇది నిజంగా రాక్షసే” అంది లత తనూ నవ్వుతూ. ఆ నవ్వుతోనే ఆమె వాళ్లలో కలిసిపోతుంది. వాళ్ళూ కలుపుకుంటారు. సుమతి వచ్చిందక్కడికి.
“ఆ నగల దుకాణాన్ని పిలవ్వే. దాని మెడలో కొత్తగా ఏదో కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొత్తది వేసుకుని తిరుగుతుంది, అంత సంపాదిస్తున్నాడేమిటి వాళ్ళాయన?” అంది.
“దానికేమే? అక్కడ సంగతి వదిలెయ్. ఇక్కడే నాలుగు ఏటీయమ్‍లు. ఇక్కడికొచ్చినప్పుడు చాక్లెట్లూ బిస్కెట్లూ కొనుక్కోమని ఆ బుజ్జిదానికి అందరూ ఐదువందలో వెయ్యో చేతిలో పెడతారు. అలా రెండుమూడువేలు పోగుచేసి బావ చేతిలో పెట్టి, పైని వేసి, కొనుక్కురమ్మంటుంది. వస్తువు ధరలో ఇదంతా కన్సెషనేకదా అని దబాయిస్తుంది” అంది సమీర.
“అంత తేలికేమిటే, కొనిపించుకోవడం? ఇన్నాళ్ళూ నాకు తెలీనేలేదు. నాదగ్గిరా వుంటాయి ఆపాటి రెండువేలు” అంది సుమతి.
“అబ్బా! ఆశ. అంత తేలికేం, వీళ్ళచేత కొనిపించడం? మన నాన్నలూ అన్నయ్యలూ ఏదేనా కొనిమ్మని అడగ్గానే కొనేస్తారా, ఏంటి? వాళ్ళలాగే వీళ్ళూను. వై క్రోమోజోమల్ స్టఫ్‍కదా? టోటల్లీ డిఫరెంటు టెక్స్చరు. మెడచుట్టూ చేతులేసి, కళ్లలో కళ్ళుపెట్టి చూస్తూ అడగాలి. అప్పుడుకూడా మనకంత సీనుండదు. మా ఆయనైతే,
ఎందుకే, వల్లీ? అవసరమా? బేంకులో ఫిక్స్ చేస్తే బోల్డంత వడ్డీ వస్తుంది. బంగారం కొనడం లాకర్లో దాచుకోవడానికేకదా- అని దానిమీద తరుగూ, లాకరు అద్దె, దానికోసం చేసే పెద్దగా వడ్డీరాని ఫిక్స్డ్ డిపాజిట్టు అవీ ఇవీ అని లెక్కలు చెప్పి ఏమార్చుతాడు. ఒక్క నిముషం నాకూ నిజమేకదా అనిపిస్తుంది. జారిపోతాను. కానీ తులసి మొహంచూస్తూ లెక్కలు చెప్పడానికి అతనేమైనా ప్రవరాఖ్యుడా?” అంది వల్లి.
“ఇంత రౌడిలా మాట్లాడతావేమే? మేమసలు ఎప్పుడూ ఇలా మాట్లాడుకోలేదు” నవ్వాపుకుంటూ అంది సుమతి.
“మీరంతా ముసలాళ్ళైపోయారమ్మా!” అంది వల్లి.
తులసి వచ్చింది. మొహం చిన్నబోయి వుంది.
“పిండం పెట్టారు. మిమ్మల్నందరినీ రమ్మన్నారు. దణ్నం పెట్టి అక్షంతలు వేయించుకోవాలట” అంది. అంటూనే ఏడుపు మొదలుపెట్టింది.
“ఏమైందే? తులసీ? దేనికి ఏడుపు?” దగ్గిరకి తీసుకుని బుజ్జగించింది సుమతి.
“నాన్న ఇంక లేరే. నాకు నాన్నతో పెద్దగా చనువులేదుగానీ, ఈవేళేంటో ఏడుపొస్తోంది. నాకు మూడునాలుగేళ్లట, ఆయన యింట్లోంచీ వెళ్ళిపోయినప్పుడు. నన్ను ఎత్తుకున్నారా, ఆడించారా, ముద్దుచేసారా ఏమీ గుర్తులేవు. పెద్దయ్యాక ఆయన గదిముందునించీ వెళ్తూ చూసేదాన్ని. గదిలోకి ఎప్పుడేనా వెళ్తే –
ఏమ్మా, బాగా చదువుకుంటున్నావా? వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి ఆడుకో- అనేవారు తప్పిస్తే దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడింది లేదు. ఎప్పుడూ వాసే. ఎత్తుకునేవాడు, ఆడించేవాడు. నాన్నతో వున్నట్టుంటుంది వాడిదగ్గిర. పెళ్ళికిమాత్రం? అన్నీ వాసూ గీతా చూసుకుంటే ఆయన ముహూర్తం టైముకి వచ్చి కన్యధార పోసారు. అదీ అంతా బలవంతపెడితే. లేకపోతే నా పెళ్ళికూడా ఆయన చేతులమీద జరిగేది కాదు. మా పిల్లలనీ ఎప్పుడూ దగ్గరకి తీయలేదు. నాకు కోపం వచ్చేది. ఉక్రోషం వేసేది.
మీరేనా, నేనూ మిమ్మల్ని పట్టించుకోను- అన్నానొకసారి. ఆయన నవ్వారు. చాలా నవ్వేవారటకదా, ఆయన? మాధవ్ అలానే నవ్వుతాడట. నాకు ఆయన నవ్వు తెలీదు. ఎందుకు అలా చేసారు? అమ్మ పక్కని పడుక్కునేదాన్ని. ఒక్కోసారి ఏ అర్ధరాత్రో మెలకువ వచ్చి చూస్తే అమ్మ చీకట్లోకి చూస్తూ, ఆలోచిస్తూ కనిపించేది.
అమ్మా! పడుక్కోమ్మా- అనేదాన్ని.
పడుక్కుంటానమ్మా! నువ్వు పడుక్కో- భారమైన గొంతుతో అని వచ్చి పడుక్కునేది.
వాసుకి తన ఎత్తు యిచ్చారు, మాధవ్‍కి నవ్విచ్చారు. మరి నాకేం యిచ్చారే?
ఇన్ని చేసినా ఈవేళెందుకో ఆయనమీద కోపం రావట్లేదు. ఆ గది యింక ఖాళీగా వుంటుంది. అట్నుంచీ వెళ్తూ దొంగచూపులు చూడక్కర్లేదు. ఆయన అసలుకే లేరంటే తట్టుకోలేకపోతున్నాను. ఏమీ బాలేదు” అని పెద్దగా ఏడ్చేసింది. అందరూ దగ్గిరకి వచ్చారు. ఏవేవో చెప్పి ఓదార్చే ప్రయత్నం చేసారు. కన్నతండ్రిని కోల్పోయిన దు:ఖం. నిండా పాతికేళ్ళేనా లేని పిల్ల. ఏ వేదాంతం చెప్పి ఓదార్చగలరు? తులసి అత్తగారు వచ్చిందక్కడికి. చిన్నమంత్రం వేసింది.
“చిన్నాడు లేచి ఏడుస్తుంటే ఎత్తుకుని అక్కడ గదిలో కూర్చుని వున్నాడే శ్రీధర్! ” అంది.
కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళింది వెళ్లింది తులసి.
“వీళ్ళు సంబంధం అడిగినప్పుడు తులసి బాగా చిన్నది. ఇంత చిన్నపిల్ల సరిగ్గా కాపురం చేస్తుందా, చెప్పిన మాట వింటుందా అని భయపడ్డాను. మావాడు దీన్నే చేసుకుంటానన్నాడు. సరేననక తప్పలేదు. పిల్ల ఎక్కడా మమ్మల్ని యిబ్బందిపెట్టలేదు. అన్నీ చక్కగా నేర్పించి పంపించారు తల్లీ, పెద్దవదినా. మాయింట్లో బాగా కలిసిపోయింది. బాధ్యతగా వుంటుంది. ఇప్పుడిది నా కూతుళ్ళకన్నా ఎక్కువైపోయింది” అందావిడ.
సుమంత్ ప్రహ్లాద్ పక్కని వెళ్ళికూర్చున్నాడు.
“ఏంట్రా, వదిన ఏదో అంటోంది?” అడిగాడు.
“పద అవతలికి వెళ్లి మాట్లాడుకుందాం” అన్నాడు ప్రహ్లాద్. ఇద్దరూ లేచి పక్కకి వెళ్ళారు. జేబులోంచీ తీసి, తనో సిగరెట్ ముట్టించుకుని సుమంత్‍కి ఇంకోటి యివ్వబోయాడు.
“ఇదెప్పట్నుంచీ?” అందుకోకుండా ఆశ్చర్యంగా అడిగాడు సుమంత్.
“నీకు అలవాటు కాలేదా?” అడిగాడు ప్రహ్లాద్ చిన్నగా నవ్వి.
“లత పక్కనుంటే కాల్చను. తనకి నచ్చదు. ఫ్రెండ్స్‌తో ఎప్పుడేనా. ఐనా ఇంటికి రాగానే కనిపెట్టేస్తుంది. సామ్రాజ్యాలు విడగొట్టేసినట్టు పడగ్గదులు విడగొట్టేస్తుంది. ఇక మా పిల్ల మొహంలో వంద అడగని ప్రశ్నలు. ఎందుకులే? ” నవ్వేసాడు సుమంత్.
నిజానికి ప్రహ్లాద్‍కి చాలా టెన్స్‌గా వుంటుంది. తను తనుగా వుండలేకపోతున్నాడతను. పుట్టింట్లో తండ్రిని తల్లి ఎలా చూస్తుందో ఇక్కడ ఇతన్ని అలానే చూస్తుంది మాధురి. తల్లిదండ్రులని చూసి అదే నేర్చుకుంది. అలానే వుండాలనుకుంటోంది. ఈ బంధాలనేవి మనిషిమనిషికీ, ఇంటింటికీ మారతాయని ఆమెకి తెలీదు. తెలిసిన ఒకే ఒక సిద్ధాంతాన్ని అమలుచేస్తోంది. డబ్బుపెత్తనం చేతిలోకి తీసుకుంది. పైసపైసకీ లెక్కడుగుతుంది. వచ్చినదాంతో సంతృప్తి వుండదు. దేనికో ఒకదానికి గొడవ పెట్టుకుంటూ వుంటుంది. ఇవి చాలక చెల్లెళ్ల సమస్యలు తెచ్చి తనింట్లో కుమ్మరిస్తుంది. ఆపైన కుటుంబరావు నస. అతనికి వూపిరిబిగుసుకుపోయినట్టు వుంటుంది.
“వీళ్ళిద్దర్నీ పొడుచుకు తినేస్తున్నార్రా, ముగ్గురూ కలిసి” అన్నాడు ప్రహ్లాద్.
“ఎవర్ని?” అర్థంకాలేదు సుమంత్‍కి.
“వసంత్‍వాళ్ల నాన్ననీ, మా మామనీకూడా కలుపు”
“ఎవర్నిరా ప్రహీ?”
“వాసూవాళ్ళింటిమీద పడింది వసంత్‍వాళ్ల నాన్న కన్ను. ఇప్పటికిప్పుడు రియలెస్టేట్ బిజినెస్ చేసేసి కోట్లు సంపాదించెయ్యాలనుంది ఆయనకి. వాళ్ళిల్లు అమ్ముకునో, అప్పుతెచ్చుకునో మొదలుపెట్టాలి. అదికాదు, వాసూవాళ్ళిల్లు పడగొట్టి కట్టేసి, చేతిది పైస ఖర్చవకుండా కొడుక్కి ఆస్తులు అమర్చుదామని చూస్తున్నాడు. పైకిమాత్రం, మాధవ్‍కి ఏమీ లేదు, వాడి మంచీచెడూ ఎవరూ పట్టించుకోవట్లేదని. ఇహ మా మామకి. ఆ యిల్లేదో మాధవ్‍కి వదిలెయ్యకూడదా అని. గీతకి వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలంలో యిల్లుకట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతే ఆ యింటిని ఆక్రమించుకుని కూర్చోవచ్చని ఆయన ఆలోచన. కూతుళ్ళు తప్పని చెప్పరు. పద్మ పిన్ని తక్కువ తిందా? ఆవిడ చేసే గొడవ ఆవిడ చేస్తోంది”
“ఇంత వివరంగా తెలీదుగానీ, కొన్ని విషయాలు అమ్మ చెప్పింది”
“ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి. ఎవరికి వున్నవి వాళ్ళు తినాలి. ఆయనకి యిల్లు లేనిమాట నిజమే. ముగ్గురల్లుళ్ళం వున్నాం, నడిరోడ్డుమీద వదిలేస్తామేంట్రా? ఏదో ఒకదారి చూపిస్తాం. ఎవరింట్లో వచ్చి వుంటే ఎవరు కాదంటారు? అలా సర్దుకుని వుండటంకాదు, ఆయనక్కావలిసింది, పెత్తనం కావాలి”
“అరేయ్, ముగ్గురు కూతుళ్ళూ చక్కగా స్థిరపడ్డారు. ఇంకేం కావాల్రా, ఆయనకి?”’ వింతగా అడిగాడు సుమంత్.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.