ఝరి 51-60 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

“ఓరోజు ఆఫీసునించీ వచ్చేసరికి గొడవ. ఆరోజు వసంత్ యింటికి వెళ్ళి అట్నుంచీ బైటకెళ్ళి భోజనం చెయ్యాలనుకున్నాం. వాసుని అడిగితే ఆఫీసులో పనుందని లేటౌతుందన్నాడు. గీతకి అసలు ఆ విషయం తెలీదు. మామూలుగా వంట చేసేసింది. అమ్మ తులసి దగ్గిరకి వెళ్ళింది. ఆ అదును చూసి నీలిమ నోరు జారింది.
తిండికి మొహం వాచినట్టు ఆఫీసునుంచీ రాగానే ఓ కుంభం వండి పారేస్తుంది- అని ఇంకేదో చులకనగా అంది”
“అంతమాట అందిరా? నోట్లో నాలుకే లేనట్టు వుంటుంది? ముగ్గురాడపిల్లల పెళ్ళిళ్ళు చేసాడు వాళ్ళ నాన్న. మనింట్లో కట్నాలవీ లేవుకాబట్టి తేలిగ్గా బైటపడ్డాడుగానీ లేకపోతే పుస్తీపూసా అమ్ముకోవలసిన పరిస్థితి”
“వాసు విన్నాడు ఆమాటలు. ఆఫీసులో కరెంటుపోయిందట. ఇంక పని సాగదని వచ్చేసాడు. వాడికి సాధారణంగా కోపం రాదు. వస్తే ప్రళయమే.
చూడమ్మాయ్, మేం అన్నం తినే బతుకుతాం. మా తమ్ముడు కూడా అన్నమే తింటాడు. మీయింట్లో గాలి తినే అలవాటేమో! నువ్వు కావాలంటే అన్నం మానెయ్ కానీ వాడిని మాడబెట్టకు- అని నీలిమని కోప్పడి,
ఇకనుంచీ మనకి మాత్రమే చెయ్యి. వాళ్ళకి కావాలంటే వాళ్ళు వండుకుంటారు. లేకపోతే మానేస్తారు. వాళ్ళిష్టం- అని గీతకి చెప్పేసాడు. భోజనాలు చేసేసి, మిగిలినవి పనామెని తనే పిలుచుకొచ్చి యిచ్చేసాడు. వాసు కోప్పడ్డాడని ఏడుస్తూ పడుక్కుంది నీలిమ. ఈ గొడవకి అటు మేం బైటికీ వెళ్ళలేదు. ఇటు ఇంట్లోనూ తిండి లేదు. అమ్మ తులసిదగ్గిర్నుంచీ వచ్చేసరికి అదీ రెండువంటల కథ. తర్వాత నెలకి ట్రాన్స్‌ఫరైంది. ఈలోగా మొహం చెల్లక నీలిమ పుట్టింటికి వెళ్ళికూర్చుంది” అన్నాడు. ఇంకా పెద్ద గొడవలయ్యాయి. అవి చెప్పలేదు మాధవ్. చెప్పడానికి సిగ్గనిపించింది.
“నువ్వెలా వూరుకున్నావురా, నీలిమ గీతని అలా అంటుంటే?”
“అక్కచెల్లెళ్ళు వాళ్ళు ముగ్గురికి ముగ్గురే. వినరు సుమా! చెప్పినకొద్దీ యింకా గొడవ. వాళ్ళమ్మకూడా నీలిమనే కోప్పడుతుంది. పెళ్ళంటూ చేసుకున్నాక తెంపుకు పోలేముకదే?” అని, కొద్దిగా ఆగాడు. సుమతి అతను తర్వాతేం చెప్తాడోనని కుతూహలంగా చూసింది.
“ఒక మనిషిని ప్రేమించడమంటే వాళ్ళలో వున్న మంచినిమాత్రమే ప్రేమించడం కాదు. వాళ్లలో మనకి అనువుగాలేని విషయాలకి కొంత రాజీపడి, చెడు అనిపించినవాటిని సరిచెయ్యాలి. అప్పటికీ యిప్పటికీ నీలిమ చాలా మారింది. పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలందరికీ కొద్దోగొప్పో అభద్రత వుంటుంది. కోడలంటే కూడలి అని అర్థం. ఆ పదాన్ని మనిషికి ఎందుకు, ఎప్పుడు వర్తింపచేసారో తెలీదు. పెళ్ళితో ఆడపిల్ల ఒక కూడలిలోకి వచ్చి చేరుతుంది. అక్కడ అప్పటికే ఇంకొంతమంది కోడళ్ళు, రెండుమూడు తరాలకి చెందినవాళ్ళు వచ్చి చేరి వుంటారు. వాళ్లంతా చేరి ఒక ఇంటిని ఆధారంగా చేసుకుని, కుటుంబాన్ని నడుపుతుంటారు. వాళ్లతో కలిసిపోయి నడవాలి. స్థూలంగా చెప్పాలంటే దీని పేరు సాంప్రదాయం. దాన్ని పాటించాలా వద్దా అనే విషయంలో వుండే స్వేఛ్ఛ చాలా తక్కువ. తనొచ్చిన యీ యిల్లు తన పుట్టింటిలా మారిపోవడం సాధ్యం కాదన్న విషయం నీలిమకి అర్థం కాదు. మార్చెయ్యాలన్న నిరంతర ప్రయత్నం”
“…”
“అందులోనూ మనది ఇంత పెద్ద కుటుంబం. ఇవికాక గీత పుట్టింటి చుట్టరికాలన్నీ మాకు అనివార్యమైనవి. గీత మేనమామలు తులసినీ గీతని చేసినట్టే ముద్దుచేస్తారు. అమ్మని గౌరవిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చేస్తే అత్తకీ, గీతకీ సౌఖ్యమో అవన్నీ నిస్సంకోచంగా చేస్తారు. నీలిమ ఈమధ్యలో ఇమడలేదు. పరాయిదాన్నని అనుకుంటుంది. ఐతే నా ప్రశ్న ఒక్కటే. తను మారటం అంటే అందర్నీ కలుపుకుపోవటం. నేను మారటమంటే బంధాలని తెంచుకోవడం. ఈ క్రాస్‍రోడ్స్‌లో వున్నాం. ఏది మర్చిపోగలను సుమా?”
“…”
“మీయింట్లో చాక్లెట్లు, బిస్కెట్లు దొరికేవి. ప్రహ్లాద్ వాళ్ళ నాన్న జోక్స్ వేసి నవ్విస్తునే, నవ్వుతూనే అల్లరిచేస్తే మందలించి దార్లో పెట్టేవారు. జెండర్ అవే‍ర్‍నెస్ లేని వయసునించీ, ఎవరేమిటో తెలుస్తున్నప్పట్నుంచీ వెంటవెంట వుండి అన్నీ చెప్తూ నడిపించాడు రవిమామ. ఐస్‍ప్రూట్ బండివెనక సైకిల్ వేసుకుని వెళ్ళి, వాడిని దొరకబట్టి ఇంటికి తీసుకొచ్చి మనందరికీ తలోటీ కొనిచ్చేవాడు రాణావాళ్ళ నాన్న. ఆఖరికి మహీవాళ్ళ నాన్న తిట్లనీ, వసంత్ వాళ్ళ నాన్నతో ఆడిన గల్లీక్రికెట్‍నీకూడా సమంగా ఆస్వాదించాం. వీళ్ళంతా మనకి బిల్డింగ్ బ్లాక్స్. పరాయివాళ్ళు, మనకేమీ కారని ఎలా అనుకోగలం?” అన్నాడు.
సుమతి ఓదార్పుగా అతని చేతిని పట్టుకుంది. మనుషులు పెద్దవాళ్ళవడం వలన అవగాహన పెరిగి, చిన్నప్పటి పొరపాట్లు మళ్ళీ చేయ్యకుండా వుండాలి. బాధ్యత పెరగాలి. సంతోషానికి మూలాలు ఎక్కడుంటాయో తెలియాలి. కానీ బాధలు పెరగటమేమిటి? ఎక్కడుంది లోపం? ప్రహ్లాద్ యింట్లో అత్తాకోడళ్ళకి పడదు. మొదటితరం అక్కచెల్లెళ్ళు ఆరుగురూ పెద్ద గొప్పగా ఏమీ పెరగలేదు. సర్దుకుంటూ, సామాన్యమైన జీవితాలే గడిపారు. గొడవలు పెట్టుకునే మనస్తత్వం ఎవరికీ లేదు. అరుణ పిన్ని చాలా సుకుమారం. బాబాయ్ పిన్నిని చాలా గొప్పగా చూస్తాడు. భార్యాభర్తలంటే ఇలానే వుండాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. భరించలేకపోవడం ప్రహ్లాద్‍ని కాదు. అతను వాళ్ళ కొడుకు. భరించలేకపోవడం మాధురిని. ఆమె, వాళ్ళని. వేరుపెట్టేసారు. వసంత్ విషయంలోనూ అంతే జరిగింది. మానస కట్నం తేలేదని పిన్నికీ బాబాయికీ కోపం. తమింట్లో పరిస్థితి వేరు. తన పెళ్ళి, మిగిలిన ఖర్చులు, అప్పులకోసం యిల్లు అమ్మేసారు అమ్మానాన్నలు. సుధీర్ వుద్యోగంలో చేరాక కొంత డబ్బు దాచి ఇస్తే దానిమీద రిటైర్‍మెంటు బెనిఫిట్స్‌లోంచీ కలుపుకుని ఫ్లాట్ తీసుకున్నారు. కొన్నాళ్ళు సుమంత్ వాళ్ళతోనే వుండేవాడు. ప్రాక్టీసు పెరగడంతో ఇంటికీ, ప్రాక్టిసుకీ, లాబ్‍కీ కలిపి తీసుకున్నాడు. వాళ్ళ అత్తమామలు కొంత సర్దారు. కారణాలు ఏవైనా ఒక్కో యిల్లూ రెండేసి, మూడేసిగా చీలిపోయింది. అనుబంధాల్లో సాంద్రత తగ్గింది. ఫంక్షన్స్‌కి అదో ఫార్మాలిటీగా కలుసుకుని విడిపోవటమేతప్ప, మనసు యిప్పి మాట్లాడుకోవడం తగ్గింది. తనుమాత్రం? ఒక కకూన్‍లో వుండినట్టు వుండిపోలేదూ?
“నువ్వేంట్రా, మహతి భర్తని కొట్టడానికి వెళ్ళావట? రవళి చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగే మాధవ్‍కి అంత కోపం రావటం వింతనిపించిందీ అని అది ఒకటే నవ్వు” అడిగింది మాటమార్చి.
“గొడవలు ఎన్నున్నా కొట్టేస్తాడేమిటే, దాన్ని? గీత వెనక్కి లాగిందిగానీ లేకపోతే దెబ్బలు తినటంలోని బాధా అవమానం ఏమిటో రుచిచూపించేవాడిని” కోపంగా అడిగాడు.
“ఇంక వాళ్లంతేనా? విడిపోవటం ఒక్కటేనా దారి?” సుమతి గొంతులో బాధ ధ్వనించింది.
“రాత్రివేళ యిల్లొదిలిపెట్టి వచ్చేసి, ఒక రాత్రంతా చంటిపిల్లని పెట్టుకుని ప్రయాణం చేసిన మనిషిని మళ్ళీ అక్కడికి పంపిస్తామా? అలా పంపిస్తే దాన్ని తిరిగి కళ్ళచూస్తామా? ఆరోజు అది మాయింటికి వచ్చినప్పటి వాలకం, ఏడ్చిన ఏడుపు నా జన్మలో మర్చిపోను. అది యింకోమాట ఏమందో తెలుసా? నా దగ్గిరకి రావాలని ముంబై రాలేదట. ఆగి వున్న రైలు ముంబైది కాబట్టి ఇక్కడికి వచ్చిందట. లేకపోతే డిల్లీయో, కలకత్తాయో వెళ్ళిపోదామనుకుందట ఒక్కర్తీ ఆడపిల్లని తీసుకుని. అబ్బ! తలుచుకుంటేనే భయం వేస్తుంది. రాత్రంతా అది మరే పిచ్చిపనీ చెయ్యకుండా ఒకాయన కాసుకున్నాడట. ఆయన గట్టిగా నిలదీసాడట, ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ మీకెవరేనా వున్నారా, లేకపోతే తిరిగి తీసుకెళ్ళి మీవాళ్ళకి అప్పజెప్తానని. అప్పుడింక తప్పనిసరై నా పేరు చెప్పిందట. నా ఫోన్ నెంబరుకూడా తనదగ్గిర లేదు. అడ్రెసూ తెలీదు. గీతకి చేసి నాకు చెప్పమందట” అన్నాడు. అతని గొంతులో ధ్వనించిన బాధని ఆమె పూర్తిగా ఆస్వాదించింది. గుండె బరువెక్కింది.
చాలాసేపు మాట్లాడుకోవడంతో ఇద్దరూ అలసిపోయారు. మనసులో వున్నవన్నీ బైటికి రావటంవలన తేలిగాకూడా వుంది. మాధవ్ మనసులో వున్న చిన్న అనుమానం తప్ప. తుషార నిద్రపోతోంది. మాధవ్‍తో మాట్లాడుతూ వున్నప్పుడే ఆ పిల్లకి పాలుపట్టడం, పడుకోబెట్టడం అన్నీ అయ్యాయి.
“ఇది లేస్తే నన్ను పడుకోనివ్వదు. కాసేపు పడుకుంటాను. నువ్వూ పడుక్కోరా! ఇన్ని డబ్బులూ పోసి ఫస్ట్‌క్లాస్ టికెట్టు కొనుక్కున్నది కూర్చుని వెళ్ళడానికా?” అంది సుమతి. పడకకి వుపక్రమించింది.
“నువ్వు పడుక్కోవే. పిల్ల లేస్తే నేను చూసుకుంటాను” అని పేపరు తీసుకుని కూర్చున్నాడు మాధవ్.
మర్నాడు వీళ్ళు స్టేషన్లో దిగేసరికి కారు రెడీగా వుంది. ఇంటికి వెళ్ళారు. పెద్ద యిల్లు. ముందువైపు క్లినిక్, పక్కనుంచీ ఇంట్లోకి దారి. అది సుమతి ప్రపంచం. అప్పటికే ఆమె భర్త బిజీగా వున్నాడు.
“మనిద్దరికీ కాఫీ తెస్తాను” అని లోపలికి వెళ్ళింది సుమతి. వంటమనిషికి పురమాయింపులు చేసి వచ్చేలోగా మాధవ్ దృష్టి హాల్లో ఒకమూలకి వున్న పెద్ద ఫ్రిజిమీద నిలిచింది. ఒక్కక్షణం ఆలోచించి డోర్ తెరిచాడు. కూల్‍డ్రింక్సు, కొన్ని ఏవో మందులు…తను అనుకున్నవేవీ లేవు. వెనకనుంచీ వచ్చి, వీపుమీద ఒక్కటి చరిచింది సుమతి. సరిగ్గా అప్పుడే వీళ్ళొచ్చారని తెలిసి వీలుచేసుకుని లోపలికి వచ్చాడు సుమతి భర్త, జో.
“అదేమిటి, అంత దెబ్బకొట్టావు అతన్ని?” కంగారుగా అడిగాడు.
“చాక్లెట్లకోసం వెతుక్కుంటున్నట్టున్నాడు” అని విరగబడి నవ్వింది సుమతి. “నువ్వు వెతుకుతున్న వస్తువులు మాయింట్లో వుండవురా! ఒకవేళ వున్నా యిలా హాల్లో ఫ్రిజిలో పెట్టుకోరు. బెడ్‍రూమ్‍లో దాచుకుంటారు. అక్కడకూడా వెతుక్కుని రా!” అంది ఇంకా నవ్వుతూనే.
“ఏమిటి?” అయోమయంగా అడిగాడతను.
“నాకు ఇక్కడ టైంపాస్ ఎలా ఔతుందని అడిగాడు. అన్నీ చెప్పి, పార్టీలగురించి కూడా చెప్పాను. అప్పటికే వీడిని మిస్ చేసినందుకు దు:ఖంతో కూడిన ఆనందభాష్పాలు వచ్చేసాయి. వీడు దాన్ని మరోలా అర్థం చేసుకుని, ఇంతదూరం నావెంట వచ్చాడు” అంది ఇంకా నవ్వుతునే.
“దు:ఖంతోకూడిన ఆనందభాష్పాలా? విరోధాభాసలు ఇలా వుండవమ్మా!” అన్నాడు మాధవ్. “ఎలా భరిస్తున్నారు బావా, దీన్ని? చిన్నప్పుడైతే మా అందరి వీపులూ పగలగొట్టేసేది. ఇంకా ఆ అలవాటు పోలేదంటే? ” అని నవ్వుతూ సందిగ్ధంగా ఆగాడు.
“మీరు తనకి అన్నా, తమ్ముడా?” అని అడిగాడు జోగేశ్వర్రావు. అన్నైతే మర్యాద యివ్వాలి, తమ్ముడైతే ఓ ఆట ఆడుకోవచ్చని.
“వాసు, సుధీర్ తప్పించి మిగతావాళ్ళంతా నాకు తమ్ముళ్ళే. మీకేం సందేహం అక్కర్లేదు” అని హామీ యిచ్చింది సుమతి. ఆ హామీ దేనికో అర్థం కాలేదు మాధవ్‍కి. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు.
ఒక్కర్తినీ పంపడం దేనికని వచ్చాననబోయి ఆగాడు మాధవ్. అది అర్థం లేనిమాట. “నాకిక్కడ కొద్దిగా పనుంది. నిజానికైతే వచ్చే నెల రావాలి. కంపెనీ వుందని సుమతితో వచ్చేసాను” అన్నాడు. అతను సంతోషించినట్టు తలూపాడు. తుషార తండ్రిమీదికి దూకింది. అతను ఎత్తుకుని ముద్దుచేసి తిరిగిచ్చేసాడు. నానీ వచ్చి తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి.
సుమతి ప్రపంచాన్ని చూసాడు మాధవ్. పుస్తకాలు, బొమ్మలు, భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడానికి కస్టమైజ్ చేయించుకున్న వుయ్యాల, పుస్తకాలు చదువుకోవడానికి ఆమె సృష్టించుకున్న కార్నర్‍స్పేసెస్, వంటరితనం అనుకోకపోతే ఇమిడిపోవటానికి అందమైన వాతావరణం. ముంబై వచ్చినప్పుడు ఆమెలో వున్న బెంగ, తిరిగొస్తున్నప్పుడు ఆమె రైల్లో చూపించిన దు:ఖం అవేవీ యిప్పుడు లేవు. తుళ్ళిపడుతున్న ఆనందపు తరంగంలా వుంది. సమూహంలోంచీ విడివడి వచ్చాక కొంత దు:ఖంతోపాటు చాలా సంతోషం వుంటుంది. నెమ్మదిగా ఆ దు:ఖపు స్థానాన్ని ఈ సంతోషం ఆక్రమించుకుంటూ వెళ్ళి పూర్తి ఆనందంగా మారిపొతుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణమైన కుటుంబానికి ఆలంబన ఔతాడు. తనుకూడా సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకోవాలి. విడిపోవటం అనివార్యమైనచోట కొత్తసంతోషాలు పుట్టడంకూడా అనివార్యం కావాలి.
జోగేశ్వర్రావు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మాధవ్‍ని బాగా ఆటపట్టించాడు. ఇద్దరూ సరదాయైన మనుషులు. పార్టీలూ, రీపార్టీలతో టైము తెలీలేదు. ఎప్పటెప్పటి విషయాలో గుర్తుతెచ్చుకుని మాట్లాడుకున్నారు ముగ్గురూ.
“అందరం కలవాలి బావా! ఫంక్షన్లలో కలిసినా అది వేరు. గెట్ టుగెదర్‍లా పెట్టుకుని కలుసుకుంటూ వుంటేనే ఒకళ్లకొకళ్లం చనువౌతాం” అన్నాడు మాధవ్. అతను సరేనన్నాడు. సుమతి కొడుకునికూడా చూసి బయల్దేరాడు. వెళ్ళేముందు భార్యభర్తలిద్దరినీ అటు ముంబైలో తనింటికి ఆహ్వానించి, ఇటు అవంతీపురం యింటికి వెళ్లమనికూడా చెప్పాడు.
“అందరం మనం మనమే బావా! కలుస్తూ వుంటే సర్కిల్ పెరుగుతూ వుంటుంది. పిల్లలకీ ఒకళ్ళనొకళ్ళని చూపిస్తూ వుంటే పరిచయాలౌతాయి. మన స్నేహాలని ఇంకో తరానికి తీసుకెళ్ళచ్చు” అని సుమతి భర్తకి చెప్పి, “జరిగినవేవో జరిగిపోయాయి. జరిగికూడా చాలా కాలమైంది. కోపాలవీ మర్చిపోయి, మాయింటికి వెళ్ళండి. అమ్మ సంతోషపడుతుంది” అని ఆమెకి చెప్పాడు.
పొద్దున్నెప్పుడో రైలు దిగాడు. ఒక పూట యిక్కడే గడిచింది. ఈ వూరొచ్చి, ఇంటికి వెళ్ళాలనే ధ్యాసలేకుండా ఇంతసేపు గడపడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. ముంబైలో నీలిమతో వున్న యిల్లు తనదనిపిస్తోందిగానీ ఇక్కడ కొంచెం దూరం పెరిగినట్టే వుంది. తన గమ్యం అదన్న ఎరుకైతే వుందిగానీ అక్కడికి వెళ్ళి వాలిపోవాలన్న ఆతృత లేదు. అప్పటికే మనసునిండా అలుక్కుపోయినట్టు వున్న విషయాలకి స్పష్టత వచ్చిందో, కొత్త గందరగోళం వచ్చి చేరిందో అర్థమవలేదు అతనికి. మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సుమతిని చూసాక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా పెంచుకోవాలో అర్థమైంది. బాధలనీ, కోపాలనీ, ఇష్టాలనీ, సంతోషాన్నీ విడివిడిగా చూడాలని తెలిసింది.
ఇల్లు చేరుకున్నాడు.
“ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావురా? పొద్దుటినుంచీ ఎదురుచూస్తున్నాం. చూసిచూసి అన్నంకూడా తినేసాం” అంది లక్ష్మి చిరుకోపంగా.
“సుమతి యింట్లో వుండిపోయానమ్మా! అది అక్కడికి వచ్చినప్పుడు బెంగపెట్టుకున్నట్టు చేసింది. మళ్ళీ కలవడం ఎప్పటికి కుదురుతుందోననిపించి ఆగాను. బావకూడా బానే మాట్లాడారు. భోజనం అక్కడే అయింది. దాని కొడుకునికూడా చూసేసి వస్తున్నాను” అన్నాడు మామూలుగా.
“అన్నీ వేషాలు. కళ్ళు బాగా నెత్తికెక్కాయి వాళ్ళకి. అంత బెంగ వుంటే ఓమాటు యిటు రావచ్చుగా?”
“అలాంటిదేం లేదమ్మా! అది వెనకటిలానే వుంది. లేకపోతే అంతదూరం చంటిపిల్లనేసుకుని ఎందుకు వస్తుంది? ఆమ్మా, పెదనాన్నా రాలేదా? పోతే వీళ్ళ పెళ్ళితో మొదలైన అపార్థాలు ఇంకా అలానే వున్నాయి. చెప్పగలిగినంత చెప్పాను”
“వాళ్ళు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత?”
ఆవిడ కోపానికి మాధవ్ నవ్వేసాడు. గీత లోపల్నుంచీ వచ్చి మంచినీళ్ళు, కాఫీ యిచ్చింది. “అంతా బావున్నారా, అక్కడ?” అడిగింది ముక్తసరిగా. తల్లిముఖంలో కనిపించిన కోపం ఆమె ముఖంలో ప్రతిబింబించినట్టు అనిపించింది.
“అందరూ పెద్దవాళ్ళయారు. ఎవరివాళ్ళు వాళ్ళకి వున్నారు, వెనకేసుకుని రావడానికి” అంది లక్ష్మి.
వాసు ఆఫీసునించీ వచ్చాడు. తమ్ముడిని చూడగానే అతని ముఖంలో మెరుపు. “పొద్దుటినుంచీ ఎక్కడ తిరుగుతున్నావురా?” తల్లి అడిగిన ప్రశ్ననే తనూ అడిగాడు.
“సుమతితో కలిసి వచ్చానుకదరా? అది ఆపేసింది” జవాబిచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. మాధవ్ వచ్చాడని తెలిసి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళు చిన్నాన్నని పలకరించేసి, క్రికెట్ మేచి మధ్యలో వుందని, మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు.
“వచ్చే ఏడాది టెన్యూర్ పూర్తౌతుందిరా! మళ్ళీ వెనక్కి వచ్చేద్దామనుకుంటున్నాను. వేకెన్సీలుకూడా వున్నాయి” అన్నాడు మాధవ్.
“మిమ్మల్ని వెళ్ళమనీ ఎవరూ అనలేదు, రావద్దనీ ఎవరూ ఆపట్లేదు. నీయింటికి నువ్వు రావడానికి లెక్కలేసుకోవడం దేనికి? ” అంది లక్ష్మి.
“అలా లేదుకదమ్మా, మనింట్లో?” మామూలుగా అనేసాడు మాధవ్.
“నేను నీ భార్యని ఒక్కమాటకూడా అనలేదు. నా వంట నేను చేసుకున్నాను, నా తిండి నేను తిన్నాను. నాతో గొడవలు పెట్టుకున్నదీ, నన్నూ, నా పుట్టింటినీ అన్నదీ తను. తనకి చెప్పలేక టాన్స్‌ఫర్ చేయించుకున్నది నువ్వు” రోషంగా అంది గీత. విసురుగా అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయింది. తమ పదకొండుమందిలో ముగ్గురు యీ యింట్లో వున్నారు. వీళ్ళ పెళ్లైన కొత్తలో హాస్యాలూ, పరిహాసాలూ వుండేవి. అవకాశం దొరికితేచాలు, మిగిలినవాళ్ళు ఇక్కడికి వచ్చేసేవారు. చాలా చైతన్యవంతగా వుండేవి రోజులు. అదంతా మారిపోయింది. సరదాకి అన్నమాటకూడా విపరీతార్ధాలని యిస్తోంది. ఇప్పుడేమిటో చిటపటలు. కన్నీళ్ళు, కలతలు. క్షమకూడా తగ్గినట్టే అనిపిస్తోంది.
“ఒకే యింట్లోంచీ ఇందరు పిల్లలని తెచ్చుకోకూడదు. బాగా బుద్ధి చెప్తున్నారు వీళ్ళు” అంది లక్ష్మి.
“మళ్ళీ ఏమైంది?” అడిగాడు మాధవ్.
“ఒకే యింటికి యిచ్చారుకదా, మనం చెప్పలేమా ఆ బుద్ధేదో?” అన్నాడు వాసు.
“నీకు తెలీదా? అసలు ఇంటికి ఇంతదాకా రాకపోయేసరికి నీకూ ఏదేనా ఎక్కిందేమోననుకున్నాను. మీ మామ ఇంటికో వదిన యింటికో వెళ్ళావనుకున్నాను” అంది లక్ష్మి. మాధవ్‍కి ఏమీ అర్థమవలేదు.
“ఏంజరిగిందో చెప్పకుండా ఇద్దరూ ఈ సూటిపోట్లేమిటి? కొత్తగా ఎక్కడ నేర్చుకున్నారు? మనింటికి రాకుండా వాళ్ళందరి యిళ్ళకీ ఎందుకు వెళ్తాను? సుమతి యింటికేనా, అది రావడం ఒక్కర్తే వచ్చినా వెంట వెళ్ళడం మర్యాదందని అమ్మమ్మ, వెళ్ళాను”
“ఈమధ్య ప్రహ్లాద్ భార్యని తీసుకుని వచ్చాడు. అదే మొదటిసారి వచ్చినట్టు ఆ పిల్ల ఇల్లంతా తిరిగి చూసి, ఇంత పెద్ద యిల్లు, బైట బోల్డంత అద్దె పోస్తేగానీ దొరకదు అని, మా చెల్లెనినీ, మరిదినీ దూరం పంపేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు- అంది గీతతో.
ప్రహ్లాద్ ఇంకా మన పిల్లాడే. వెంటనే అనేసాడు- ఈరోజుల్లో ఇలాంటి యిళ్లకి డిమాండు లేదు. స్వంతయిళ్ళు వున్నవాళ్ళు అమ్ముకోలేక వుంచుకుంటున్నారు. ఇళ్ళు లేనివాళ్ళుమాత్రం ఫ్లాట్సే నచ్చుకుంటున్నారని.
మరలాంటప్పుడు స్థలం పెద్దదేకదా, డెవలప్‍మెంటుకి ఇస్తే? అదీకాక పాతయిల్లు- అంది.
అది వాళ్ళ యిల్లు, వాళ్ళ యిష్టం- అని వాడు ఖండించాడు” అని చెప్పి, “నీకు తెలీకుండా, నీ భార్య ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందా? ” సూటిగా అడిగింది లక్ష్మి.
“నిజంగానే నాకు తెలీదు” అన్నాడు మాధవ్.
“ఐతే నీలిమ నీకు బాగానే తాటాకులు కడుతోందన్నమాట”
“అలాంటిదేం వుండదమ్మా! తనకీ తెలీకపోవచ్చు. వెళ్ళగానే అడుగుతాను” అతనికి నిజంగానే కోపం వచ్చింది. తన యింటి వ్యవహారంలో వదినగారు తలదూర్చి సలహాలు ఇవ్వడమేమిటని.
లక్ష్మి ఆపలేదు. “అదయ్యిందా? పద్మపిన్ని, బాబాయ్ వచ్చారు. ఆమాటా ఈమాటా మాట్లాడారు. వాసేకాదు, మాధవ్‍కూడా నీ కొడుకే. వాడికి అన్యాయం చెయ్యద్దని పాతసూక్తులే చెప్పింది పిన్ని. ఎప్పటెప్పటివో విషయాలన్నీ తవ్విపోసింది. తను చదువుకుంటానంటే అన్నయ్య చదివించలేదన్నదగ్గిర మొదలుపెట్టి-
మా అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళకికూడా యిల్లమ్మలేదు. తూతూమంత్రంగా ఐందనిపించాడు, ఇప్పుడా స్థలం నీపేర పెట్టాడు. నిన్ను పక్కని వుంచుకోవాలనేకదా? మీరు అందులో కట్టుకుని, ఈ యిల్లు మాధవ్‍కి వదిలెయ్యండి. మీకు రెండు జీతాలు. వాడికి ఒకటే జీతం. ఎలా బతుకుతాడు? అందులో ముంబైలో వుంటున్నాడు. వాడేం పైవాడు కాదుకదా- గీతతో అంది.
చెప్పేవాళ్లకి విసుగులేకపోయినా వినేవాళ్ళకి విసుగేకదా? ఎవరేనా వాళ్ళ జవాబుల్ని ఎన్నిసార్లు చెప్తారు? తులసి పెళ్ళయాక మీకు చెప్పాను, ఇంక దాని బతుకు దానిది, మీరు కొనుక్కున్నవన్నీ దానికి కొనక్కర్లేదని. మిమ్మల్ని చూసి అన్నలు యివ్వాలని ఆశపడ్డంకాదు, తనూ కొనుక్కోవడం నేర్చుకోవాలని. నువ్వేనా అంతేకదా? వాసుకి ఆస్తులున్నాయని మీరు ఏడవడం దేనికి?” అంది. మాధవ్‍కి ఇది మరీ ఆశ్చర్యం కలిగించించింది. ఐపోయిందనుకున్న గొడవ మళ్ళీమళ్ళీ ఎందుకు బైటికి వస్తోంది? తన వెనక ఏమేం జరిగాయో చాలాకాలం తనకే వివరంగా తెలీలేదు. తెలిసిందికూడా క్లుప్తంగానే. నీలిమ గీతని ఏవేవో అంది. అవేమిటో గీత బైటపెట్టలేదుగానీ చాలా బాధపడింది. ఎప్పుడూ కంటతడి పెట్టనిది వెక్కివెక్కి ఏడ్చింది. పెద్ద గొడవైంది. అందుకేగా, తను ట్రాన్స్ఫరు పెట్టుకుని ముంబై వెళ్ళింది? మళ్ళీ కొత్తగా ఏమిటి?
“ఇక్కడినుంచీ వెళ్ళేముందు చాలా స్పష్టంగా చెప్పాను బాబాయికి. అక్కడితో ఆపేస్తారనుకున్నాను. మళ్ళీ మొదలుపెట్టారా? ఇంకెవరెవరు ఇందులో మాట్లాడారు?” అడిగాడు కోపంగా.
“ఇంకెవరికి కావాలి? అరుణకీ భర్తకీ మంచిచెడులు తెలుసు. వాళ్ల కోడలు ఎగిరినా, వాళ్ళు కలగజేసుకోరు. ఇక మిగిలింది నీ మరదలు. దానికి తగ్గట్టే పద్మపిన్ని…” లక్ష్మి జవాబిచ్చింది.
“గీతకి వాళ్ళ నాన్న ఏదో యిచ్చుకుంటే అమ్మానాన్నలిచ్చిన యింట్లోంచీ నేనెందుకు వెళ్లాలిరా? అంతగా కావాలంటే వేర్లుపడదాం. అమ్మా, నేనూ, నువ్వూ, తులసి… తలోగదీ తీసుకుందాం. అత్తలేం అంటారో! ” అన్నాడు వాసు.
“మీ మా దగ్గిరకీ, వాటాలదగ్గిరకీ వచ్చావేంట్రా?” అన్నాడు మాధవ్ చిన్నబుచ్చుకుని.
“లేకపోతే ఏం చెయ్యాల్రా? చిన్నప్పట్నుంచీ పుట్టి పెరిగిన యిల్లు డిమాలిష్ చెయ్యమని ఒకళ్లంటారు, వదులుకుని పొమ్మని యింకొకళ్ల సలహా. నాలుగేళ్ళనాడు మొదలైన గొడవ రావణకాష్ఠంలా కాలుతునే వుంది. వీళ్లందరికీ మనింటి వ్యవహారాలతో ఏం పని?” వాసు నిలదీసాడు.
“నువ్వు వెనక్కి రావాలనుకుంటే రావచ్చు. ఎవరికీ ఆక్షేపణ లేదు. ఇదివరకట్లాగే వుండండి. ఇష్టమైతే కలిసి వండుకోండి. లేకపోతే ఎవరి వంట వాళ్ళు చేసుకోండి. నలుగురూ నాలుగురోజులు నవ్వుతారు. తర్వాత వదిలేస్తారు. కాదూ, వేరే యిల్లు తీసుకుని వుండండి. మధ్యలో గీతకెందుకురా, పడి ఏడుస్తారు? ఇంట్లో మీకెంత హక్కు వుందో దానికీ అంతే హక్కుంది. నా పెద్దకోడలది. మీ నాన్నని చెయ్యిపట్టుకుని తీసుకొచ్చి అందరి మధ్యనీ అన్నానికి కూర్చోబెట్టగలిగిన చొరవ మీరిద్దరు అన్నదమ్ములుగానీ, తులసిగానీ ఎప్పుడేనా చేసారా? అది చేసింది. దాని జీవితం ఈ రెండిళ్లతోనూ ముడిపడి వుంది. దాన్ని అకారణంగా కంటతడి పెట్టిస్తున్నారు. అదెవర్రా, ఆ మాధురి, నా ఇల్లు పడగొట్టించమనడానికి? దానికి నువ్వు ఎంత లోకువ యివ్వకపోతే అలా మాట్లాడుతుంది?” దులిపేసింది లక్ష్మి.
మాధవ్ తలపట్టుకున్నాడు. వాసు చూస్తూ కూర్చున్నాడు. పనిగట్టుకుని వచ్చి, మాధురి అలా మాట్లాడటం అతనికి అసలు నచ్చలేదు. ఒకప్పుడు ప్రాణస్నేహాలుగా వున్న చుట్టరికాలు పెళుసుగా, మాట తాకితే పగిలిపోయేలా మారిపోవడం తెలుస్తోంది. అప్పటికప్పుడే జవాబు యివ్వచ్చు. మాధురి నోరుమూయించవచ్చు. ఇప్పుడు తమమధ్యనే వున్న గొడవలు పెద్దవాళ్ళదాకా వెళ్తాయేమోనని ఆగాడు. నందకిషోర్‍తో చెడగొట్టుకోవడం అతనికి యిష్టం లేదు. చాలా మంచిమనిషి అతను. మాధురి మాటలకి స్పందించి జవాబివ్వడం అనేది ఆమెకి అనవసరప్రాధాన్యత యివ్వడంలా వుంటుందనికూడా వూరుకున్నాడు.
“ఎవరి ఆశలు వాళ్ళకి వున్నాయి. మీ మామ వెనకనుంచీ ఎగేస్తున్నాడు. ఇప్పుడీ యిల్లు మీకొదిలేసి వీళ్ళు వెళ్ళిపోతే దీన్ని పడగొట్టి అపార్టుమెంటు కట్టించి, మీ ముగ్గురినీ ఒకదగ్గిర చేర్చాలని ఆయన కోరిక. నాకూ వాసుకీకూడా చెరో ఫ్లాటూ వస్తుందట. దయా? ధర్మమా? అందరూ పైకొస్తారంట. నాకదే అర్థం కావట్లేదు. నా పెద్దకొడుకుని వదిలేసి, ఇంకెవరి బాగో నాకెందుకు? వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళకి లేరా? వీళ్ళంతా ఎవర్రా, నాయింటిగురించి మాట్లాడ్డానికి? అసలు నువ్వెందుకు నోరు మెదపట్లేదు? మీ యిల్లు మీరు చూసుకోలేనంత అసమర్ధులా మీరిద్దరూ? నువ్వు ఔనేమో, వాసుమాత్రం కాదు. అంతగా కూతుళ్ళు ముగ్గుర్నీ ఒకచోట పెట్టి ఆమధ్యని తనూ వుండాలనుకుంటే మీ మామని ఓ రెండొందలగజాల స్థలం కొనిమ్మనండి. అందులో కట్టుకుని ముగ్గురూ వూరేగండి. ఆయన్ని తలోకాసేపూ ఎత్తుకుని ఆడించుకోండి. మీనాన్న పోయినప్పుడు మొదలుపెట్టిన ఏడుపు ఇంకా ఆపలేదు ఆయన” అంది లక్ష్మి.
తల్లి కోపం చూసి మాధవ్ కంగారుపడ్డాడు.
“అమ్మా! నువ్వన్నట్టు ఇదంతా కచ్చితంగా ఆయన నిర్వాకమే. ఆయన తన జీవితకాలంలో యిల్లూవాకిలీ ఏర్పరుచుకోలేదు. ఇప్పుడింక పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఖాళీగా వున్నాడు. మేం ముగ్గురం కట్నాలూ కానుకలూ ఆశించకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మనమేదో తెలివితక్కువవాళ్ళమని అనుకుంటున్నట్టుంది. మిగిలిన రెండిళ్ళలోనూ యీయన పెత్తనం నడవదు. నాన్న లేరుగాబట్టి ఇక్కడ సాగిద్దామని చూస్తున్నాడు. ఇంతకాలం వుపేక్షించడమే తప్పు. ఇక ఆయన సంగతి నేను చూసుకుంటాను. వదిలెయ్. పట్టించుకోనట్టు మామూలుగా వుండు. ఏం జరిగిందోనని ఆయనే కిందుమీదులౌతాడు. ఎవ్వరికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు” అన్నాడు నచ్చజెప్తూ.
“ఇంకోసారి ఈ విషయాలు ఎత్తుకుని మనింటి గడప ఎవరేనా తొక్కారంటే మర్యాద దక్కదు. బాబాయ్ వాసుని చూసి కొడుకు చెడిపోయాడనుకుంటున్నాడు. వాసువల్ల వాళ్లకి ద్రోహం జరిగిందనుకుంటున్నాడు. మనసులో వున్నది స్పష్టంగా బయటపెడితే జవాబు చెప్పచ్చు. దాన్ని బైటికి రాకుండా దాచుకుని డొంకతిరుగుడుగా మాట్లాడితే ఏం చెప్పాలోకూడా తెలీడంలేదు. పద్మకి చెప్పాను. వసంత్‍ని పిలిపించి కేకలేసాను. బాబాయ్‍కి నేను చెప్పలేను. ఎంత చెడ్డా చెల్లెలి భర్తకదా? నువ్వు చెప్పు, లేదా వసంత్‍ద్వారా చెప్పించు. ప్రహీ తప్పు నాకేం కనిపించలేదు. మాధురిని నోరు అదుపులో వుంచుకొమ్మని ఎవరు చెప్తారో చెప్పండి” కొంచెం విసుగ్గా అంది. దారపుచిక్కుల్లాంటి బంధాలు. ఎవరికీ ఏమీ లేనిరోజుల్లో ఒకళ్ళకొకళ్ళు ఆప్తులని అనిపించారు. పద్మకి అన్నగారిమీద అలక. భర్తని తీసుకుని ఇక్కడికే వచ్చేసేది. శేఖర్, రవీవాళ్లలాగే చనువుగా వుండేవాడతను. స్వంతమనిషిలా కలిసిపోయేవాడు. అలాంటి మనిషిలో మార్పొచ్చింది.
“నీ భార్యకికూడా అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళు భార్యాభర్తలిద్దరూ వుద్యోగం చేస్తున్నారు. పుట్టింటివాళ్ళు పెడుతున్నారు. ఆపైన యిది పొదుపరి. సహజంగానే వీళ్ళదగ్గిర డబ్బుపోగుపడుతుంది. ఇహ మీకు. తిండికీ బట్టకీ లోటు లేదు. నీకు వుద్యోగం వుంది. ఇంకా పైకి రావాలంటే మీరుకూడా కొంత కష్టపడాలి. అంతేగానీ డబ్బనేది అకాశంలోంచీ రాలిపడదు. పిల్లాడిని స్కూల్లో వేసాక నీలిమనికూడా వుద్యోగం చెయ్యమను. సంపాదించుకున్నది ఒబ్బిడి చేసి దాచుకొమ్మను. ఎవరికి వుండేవి వాళ్లకి వుంటాయి. అంతేగానీ వీళ్ళని యిరుకుని పెట్టడం తప్పు. మీరిద్దరూ నా పిల్లలే. ఒకళ్ళు ఎక్కువా, ఒకళ్ళు తక్కువా కాదు” అనికూడా అంది. అతను తలూపాడు.
“వచ్చినవాళ్లకి వచ్చినట్టు జవాబివ్వచ్చు. గీత ఆపింది. ఏదేనా వుంటే మాధవ్‍తో మాట్లాడాలి, వీళ్లందరికీ చెప్పుకోవడం దేనికి, వీళ్ళకోసం మన బంధుత్వాలు చెడగొట్టుకోవడం దేనికని. అది నీకు యిచ్చిన విలువ నువ్వూ నిలబెట్టుకోవడం మంచిది” అంది చివరగా.
అతనికి బాధ కలిగింది. ఈ యిల్లూ, ఇందులోని మనుషులూ తనవాళ్ళు. తనిక్కడ పుట్టి పెరిగాడు. వీళ్ళమధ్య ఎలాంటి అరమరికలూ లేకుండా బతికాడు. ఇప్పుడు ఎవరెవరివో ఆకాంక్షలూ, కోరికలూ తనకి తెలీకుండానే, తన ప్రమేయం లేకుండానే, తను వద్దని చెప్పాకకూడా తనకి ఆపాదించబడుతున్నాయి. తను చెయ్యనివాటికి తను జవాబుదారీ ఔతున్నాడు. ఈ యిల్లు తనొక్కడిదే కాదు, నాలుగు వాటాలు వెయ్యాలి. అప్పుడు తనస్థానం ఎక్కడ? మాధవ్ యిల్లనేది ఒకమూల, ఒకగదో రెండుగదులో! అప్పుడు తన పరువు, చిన్నప్పట్నుంచీ అందర్లో వున్న పేరు ఎక్కడ? పాతాళంలో. ఇంట్లోవాళ్ళ మనసుల్లో తన స్థానం ఎక్కడ? అగాథంలో.
వాసు పిల్లలు వచ్చారు. ఇద్దరూ చాలా చురుగ్గా వున్నారు. ఇంటిదగ్గరే స్కూలు. సేవాసమితి నడుపుతుంది. హంగులూ ఆర్భాటాలూ వుండవు. పేరెంట్స్ కమిటీ కేవలం ఫిర్యాదులకి పరిమితమవలేదు. స్కూలుని పైకి తీసుకురావడానికి అహర్నిశం కష్టపడుతుంది. వాళ్ళలో డ్రాయింగు, సంగీతంలాంటివాటిల్లో టేలెంట్స్ వున్నవాళ్ళు పిల్లలకి స్పెషల్ క్లాసులు తీసుకుంటారు. పెద్దక్లాసుల పిల్లలు చిన్నక్లాసులకి వెళ్ళి ఒక పీరియడంతా ఆ పిల్లలతో గడిపి వస్తారు. ప్రతిపిల్లకీ, ప్రతిపిల్లాడికీ తనకన్నా వయసులో చిన్నవాళ్ళైన పిల్లలతో వ్యవహరించడం వచ్చు. బేంకు, పోస్టల్, రైల్వే రిజర్వేషను ఫారాలు నింపడం, ఫస్టెయిడ్ చెయ్యడం నేర్పిస్తున్నారు. పబ్లిక్కి సాయం చేయటానికి వారంలో ఒకరోజు పిల్లల్ని పంపిస్తారు. నెలలో ఒక ఆదివారం పిల్లలకి రకరకాల పోటీలు పెడతారు. ఇవికాక మెడికల్ కేంపులు, ఎన్‍సీసీ. పిల్లలు తల్లిదండ్రుల కనుసన్నల్లోంచీ తప్పిపోకుండా తల్లిదండ్రులతో అనుసంధానం చేస్తూ ఇంకా ఎన్నో వ్యాపకాలు. గీత పిల్లలని ఇందులో వేసినప్పుడు ఈ స్కూలు ఎవరికీ నచ్చలేదు. కెరీర్ ఓరియెంటేషన్ లేదని ప్రతి ఒక్కళ్ళూ ఆక్షేపించారు.
“కెరీర్ అంటే? ఎప్పుడో సుఖపడతామనే నమ్మకంకోసం ఇప్పట్నుంచీ కష్టపడటమా? అక్కర్లేదు. నేనూ, వాసూ చదువుకున్నట్టే వాళ్ళూ చదువుకుంటారు. పెద్దయ్యాక వుద్యోగం వెతుక్కుంటారు. ఉద్యోగాలు రాకపోతే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇది ఎన్నో తరాలుగా మనందరం పాటించిన పద్ధతి. కొత్తగా మార్చటం దేనికి?” అనేసింది.
పిల్లలతో ఎలా సమయం గడిచిందోకూడా తెలీలేదు మాధవ్‍కి. అన్ని విషయాలున్నాయి వాళ్లదగ్గిర చెప్పడానికి. నీలిమైతే పంకజ్‍ని ఈ స్కూల్లో వేసేది కాదు. ఏ పదికిలోమీటర్ల దూరంలోనో వున్న గొప్పస్కూలు వెతికి తను హైరానపడుతూ వాడిని హైరానపెడుతూ వేసేది. ఇంటిపక్కనున్న స్కూలు వెతుక్కుని, తనకి అనుగుణంగా దాన్నీ, దానికి అనుగుణంగా తననీ మార్చుకుంటూ పిల్లలతోపాటుగా ఎదగడానికి ప్ర్రాముఖ్యత ఇచ్చేదికాదు. గీత దారి వేరు. అది అందరూ వెళ్ళగలిగేది కాదు. తను చేస్తుంది. సంఘర్షించదు. నీలిమ చెయ్యదు. చేసేవాళ్ళతో ఘర్షణ పడుతుంది. అదీ తేడా. ఈ తేడా తమ కుటుంబాన్ని చీల్చుతోంది. పిల్లలతో వున్నా అతని ఆలోచనలు సమాంతరంగా సాగుతున్నాయి.
రాత్రి తొమ్మిదౌతుంటే నీలిమ తండ్రి వచ్చాడు. రావటానికి గంటముందు ఫోన్ చేసాడు. అప్పటికి అది మూడో ఫోను. మొదటి రెండూ లక్ష్మి ఎత్తితే ఇప్పుడు గీత ఎత్తింది.
“అల్లుడు ఈవేళ అవంతీపురం వస్తానన్నాడు. వచ్చేడామ్మా?” అని అడిగాడు.
“వచ్చాడండీ బాబాయిగారూ! మా పెద్దత్త కూతురింటికి వెళ్ళి యిటొచ్చాడు. అందుకే లేటైంది” అంది గీత.
“మరైతే నేను అటొస్తున్నాను. ఒకమాటు అతన్ని కలిసి వెళ్తాను” అని బయల్దేరి వచ్చాడు. కూతురి అత్తగారింట్లో ఆయనకి పెద్దగా మర్యాదలు జరగలేదు. అంతా ముభావంగా వున్నారు. లక్ష్మి కాస్త కోపాన్ని ప్రదర్శించింది. భోజనాలవేళ వచ్చాడని భోజనానికి ఆపారు. తిన్నాక, ఇంతరాత్రేం వెళ్తారని వుండమన్నాడు మాధవ్. అతన్తో మాట్లాడచ్చని ఆయన ఆగిపోయాడు. మగపిల్లలు లేని ఆయనకి అల్లుళ్ళని చూస్తే చాలా సంతోషంగా వుంటుంది. వాళ్ళూ ఆయనతో మొదట్లో కలుపుగోలుగానే వుండేవారు. తర్వాత ఆ పరిస్థితి మారింది. మాధవ్ ఆయన్ని పలకరించాడుగానీ వుదాశీనంగానే. ఆయన హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటే అతనొచ్చి వంటిల్లు సర్దుకుంటున్న గీత దగ్గిర కూర్చున్నాడు. వాసుకూడా టీవీముందే వున్నాడుకానీ పెద్దగా మాట్లాడలేదు.
“అలకలూ, కోపాలూ తీరాయా వదినా?” అడిగాడు మాధవ్ నవ్వుతూ. వదిన అన్న పదం వత్తి పలికాడు.
“వాసు బాధపడితే నాకు బావుండదు మాధవ్. తన కోపం నీకోసం బాధగా మారుతోంది. మాతో కలిసి వుండటం యిష్టంలేకపోతే వేరే వెళ్ళాల్సింది మీరుకదా? అంతేగానీ మమ్మల్ని యింట్లోంచీ వెళ్ళిపొమ్మనడమేమిటి? తిరకాసు మాటలుకాదూ? నిన్నలా వెళ్లమనడం యిష్టంలేక వూరుకున్నాడు. మీరు ముంబై వెళ్ళిన కొత్తలో మీయిద్దరూ ఒకరికోసం ఒకళ్ళు ఎంతెంత బెంగలు పెట్టుకున్నారు? అటూయిటూ ఎలా పరుగులు పెట్టారు? అటు సుధీర్ దూరమయ్యి, యిటు నువ్వూ దగ్గరలేక ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లకోసమో, వసంత్‍వాళ్ల నాన్న సెకండ్ కెరీర్‍కోసమో మీరిద్దరు అన్నదమ్ములూ గొడవలుపడి విడిపోతారా? అవసరమా? నీకిక్కడ జరిగిన అన్యాయం ఏమన్నా వుందా?” సూటిగా అడిగింది.
“ఈ పిల్ల పెద్దదైపోయిందండీ. ఏడుపులు మానేసి, పెత్తనం మొదలుపెట్టింది” అన్నాడు మాధవ్ నవ్వుతూ.
“డైవర్టు చెయ్యక. చాలా కచ్చితమైన స్టాండ్‍మీద వున్నాం మేమిద్దరం. మా నాన్న నాకు స్థలం రాసిచ్చిన మాట నిజమే. కానీ ఆయన ఆ పాతడాబాయింట్లో వుంటుండగా పక్కని మూడంతస్తులో నాలుగంతస్తులో వేసుకుని వుండలేను. మా నాన్న తర్వాతే నేను. ఆయనకి మాతో సమానంగా కట్టించి యిచ్చేంత స్తోమతా లేదు. ఆ పని చెయ్యాల్సింది నేను కాదుకూడా. కృష్ణ చూసుకుంటాడు. వాడు యింటికి మార్పులు చేస్తానన్నా, నాన్న వప్పుకోవట్లేదు. మరి అత్తపట్ల మీకు అలాంటి గౌరవం లేదా? ఆవిడ ఎదురుగానే ఇలాంటి మాటలు రావటం బావుందా? ఇల్లు మీకందరికీ పంచేసి, ఇప్పట్నుంచీ వాసు ఇంట్లోనూ మాధవ్ యింట్లోనూ అనుకుంటూ మనిళ్ళలో వుండలేదుకదా? తులసికీ బాధేకదూ? మీ అత్తలనేం చేస్తారు? రావద్దంటారా? ఇంటిమర్యాదకి సంబంధించిన విషయంకాబట్టి యిది వుమ్మడి ఆస్తిగానే వుంటుంది. వాసుతో కలిసి ఈ యింట్లో ఉండాలని నేను ఒకరోజుని కలలు కన్నాను. వాసునేకాదు, మీ అందర్నీ, ఈ యింటినీకూడా ఇష్టపడి వచ్చాను. మాకు వాటా వదులుకునే ఆలోచన లేదు. నువ్వూ, నీలిమాకూడా మాలాగ ఒక అవగాహనకి రావడం మంచిది. హక్కు వున్నంతవరకే ఆశిస్తే బావుంటుంది. లేనిపోని ఆశలు పెంచుకోవద్దని చెప్పు తనకి”
ఆమె మాటలకి అతనికి కోపం రాలేదు. వాటిల్లో ఎలాంటి శషభిషలూ వుండవు. ఆమె ఆలోచన చాలా స్పష్టంగా, ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా వుంటుంది. జీర్ణించుకోవడం కష్టం. అలా జీర్ణించుకోవడానికి పట్టే వ్యవధిలో కలిగే ఇబ్బందినే కోపంగా ప్రదర్శించడం జరుగుతోంది. తను చెప్పేది చెప్పేసాక ఇంక ఈ కోపాలకీ విమర్శలకీ జవాబు చెప్పదు. కానీ లోలోపల బాధపడుతోందని తెలుసుస్తోంది. నిట్టూర్చాడు.
“మేం అన్నదమ్ములం వదినా! వాళ్ళెవరో అన్నంతమాత్రాన అలా ఎలా చేస్తాను? నాకలాంటి ఆలోచనలేం లేవు. మా తాత యిచ్చిన యిల్లు నాకుమాత్రం గొప్పకాదేంటి? ఎందరికి వుంటుంది ఇలాంటి యిల్లు? వాడు చాలా సెన్సిటివ్. నువ్వే వాడికి చెప్పు. ఇద్దరూ మనసులో ఏవీ పెట్టుకోకండి” అన్నాడు మాధవ్.
“అసలు విషయం ఇంకోటి వుంది మాధవ్!” సందిగ్ధంగా ఆగింది.
అతను ప్రశ్నార్ధకంగా చూసాడు.
“మహీ భర్త ఎవరో అమ్మాయిని బైక్‍మీద కూర్చోబెట్టుకుని మేం ఆఫీసునించీ ఇంటికి వచ్చేదారిలో రెండుసార్లు కనిపించాడు. ఆదార్లో కనిపించాడంటే కావాలని వాసుని రెచ్చగొట్టడానికి అలా చేసాడో లేక విడాకులయ్యేదాకా ఆగేంత నిలకడ లేనివాడో అర్థమవ్వలేదు. వెంటనే అత్తకీ నారాయణమామయ్యకీ చెప్పాం. ఆయన రచ్చరచ్చ చేసాడు. మహీని మరోమాటు తిట్టాడు” అంది.
మాధవ్ ముఖం కోపంతో ఎర్రబడింది. “కంప్లెయింటు పారేస్తే వుద్యోగం వూడి జైల్లో కూర్చుంటాడు” అన్నాడు.
“కోపం తెచ్చుకుని లాభం లేదు. దానికి వెళ్ళాలని లేనప్పుడు, భవిష్యత్తుగురించి తన భయాలు విన్నాకకూడా ఇంకా వాళ్ళని కలపాలని ఆలోచించడం దండగ. తర్వాత ఏం చెయ్యాలో వెళ్ళాక నువ్వూ అదీ కలిసి ఆలోచించి మాకు చెప్పండి” అంది.
“తెలిస్తే చాలా బాధపడుతుందది. అతను అలా కావద్దనే విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది”
“అందుకే, మరోసారి దాంతో మాట్లాడు” చెప్పి, “మీ మామగారు నీకోసం చూస్తున్నారు. ఆయన్ని వదిలిపెట్టి మనం మాట్లాడుకుంటూ కూర్చోవడం బావోదు. వెళ్ళు” అంది గీత. అతను లేచాడు. వెళ్ళి వాసు పక్కని కూర్చున్నాడు.
“ముగ్గురల్లుళ్ళూ ఆణిముత్యాలనుకోండి. పెద్దదానికీ చిన్నదానికీ ఏ సమస్యా లేదుగానీ, మా నీలిమకే, ఇంట్లో అంతా ఆడపెత్తనం. వియ్యంకుడు జరిగిపోయాడు. అత్తగారూ, పెద్దకోడలూ చలాయించుకుంటున్నారు. ఆమాంబాపతులన్నీ పెద్దావిడ పేర్న వున్నాయట. దులిపితే లక్షల్లో రాల్తాయి. పైగా పెన్షనొస్తుంది. ఆ డబ్బేదో ఆవిడ వుండగానే ఇద్దరు కొడుకులిద్దరికీ పంచి యివ్వచ్చుకదా? పైస రాల్చదు. అంతా బిగబట్టుకుని కూర్చుంది. అటు చూస్తే ఆవిడకో కూతురు. ఇటు చూస్తే పెద్దకోడలు మేనరికం పిల్ల. అన్నకూతుర్ని చేసుకుంది. ఆయన ఎంత చెప్తే వీళ్ళకి అంతట. మధ్యలో మా నీలిమ అన్యాయమౌతుందేమోనని భయం” అంటాడు ఆయన ఎవరేనా పలకరిస్తే.
“పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం. వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు. మీకెందుకు తాపత్రయం? ” అంటుంది ఆయన భార్య, కమలాక్షి.
“అదికాదే! నీలిమ బావగారికి బోల్డంత వుంది. మేనమామ పెడతాడు. భార్యకికూడా వుద్యోగం. లోన్లొస్తాయి. ఇంకోచోట యిల్లుకొనుక్కుని వెళ్ళచ్చుగా? ఈ యిల్లు పట్టుకుని వేలాడటం దేనికి? తమ్ముడికి వదిలెయ్యచ్చుగా? వాళ్ళక్కడ అద్దెలకి పోస్తుంటే వీళ్ళు ఇంత యిల్లూ అనుభవిస్తున్నారు” అన్నాడు.
“ఎవరికి వుండేవి వాళ్ళకి వుంటాయి. చాలడానికి ఎక్కడ? ఎక్కువ వున్నాయని ఇళ్ళూ వాకిళ్ళూ ఎవరు వదులుకుంటారు? అలా వుండటాన్ని అదృష్టం అనుకుంటారు. పెళ్ళిళ్ళు చేసాక ఆడపిల్లల బతుకుల్లో తలదూర్చకూడదు. మానస చెప్పింది అదేకదా? అక్కడ పెత్తనాలు చేసేవాళ్ళు వేరేవుంటారు. మనమాట ఎవరు వింటారు? ఎందుకు వింటారు? ఆస్తులు వాళ్లవి, వాటికి సంబంధించిన నిర్ణయాలుకూడా వాళ్లవే వుంటాయి. చూసిచూసి బైటివాళ్ళకి పెత్తనం ఎందుకిస్తారు? వీళ్లని వేరే వెళ్లమని ఎవరేనా అన్నారా? మీ కూతురు ఇమడలేకపోయింది. అల్లుడి కాళ్ళకింద అగ్గిపోసింది. ఎటూ చెప్పలేక ట్రాన్స్‌పర్ చేయించుకున్నాడు. తెలివైనదైతే ఆమధ్యలో తనూ నిలదొక్కుకోవాలి. పెళ్లై కొత్తగా వెళ్లేచోటు పుట్టింటిలా ఎందుకుంటుంది? సర్దుకోవాలి. సర్దుకుంటూనే పరిస్థితులని సానుకూలంగా మార్చుకోవాలి” అంటుంది. ఆవిడకి భర్త చెప్పే మాటలు విసుగు. ఆవిడ వినదని కూతుళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఆ ఆలోచనలకి పిల్లలని పుట్టిస్తారు. ఇప్పుడు పుట్టినవి అలాంటివే.
బేధాలనేవి రాకూడదు. వస్తే చూసే ప్రతిదృశ్యం మారిపోతుంది. మామాఅల్లుళ్ళు మాట్లాడుకుంటారనుకున్నాడు వాసు. తనేమీ మారలేదని నిరూపించుకోవలసిన అవసరం మాధవ్‍ది. “అందరం నడవలో పడుక్కుందాంరా వాసూ! మనం కబుర్లు చెప్పుకుని చాలాకాలమైంది. మా
ఎన్‍క్లోజర్లుంటే గదుల్లోనేగా, మగ్గేది? మళ్ళీ మాకు పొద్దున్నే రైలు” అన్నాడు. వాసు నవ్వి, మంచాలు తెచ్చి వెయ్యడం మొదలుపెట్టాడు.
“మేంకూడా మీ దగ్గరే” అన్నారు వాసు పిల్లలు. వాళ్ళతో తన కొడుకు లేకపోవటం మాధవ్‍కి బాధనిపించింది. వీళ్ళకి తమ్ముడు, ఈ యింట్లో వాడూ ఒకడు. కాని ఎక్కడో పెరుగుతున్నాడు! చుట్టపుచూపుగా వస్తూ, చుట్టంగా మారిపోయాడు. గుండెలు పిండేసినట్టైంది.
మాధవ్, వాసు మంచాలూ, పరుపులూ తెస్తుంటే వాళ్ళు దిళ్ళూ, దుప్పట్లూ తెచ్చారు. ఐదు నవారుమంచాలు తెచ్చి వరసగా వేసినా యింకా చాలాచోటు మిగిలింది ఆ గదిలో. అన్నదమ్ములు, పిల్లలు మాట్లాడుకుంటుంటే ఆయన ఎత్తైన పైకప్పుకేసి చూస్తూ పడుక్కున్నాడు. మూడు మూడుతరాలని చూసి కూడా పటిష్ఠంగా వున్న, విశాలమైన ఆ యిల్లు నీలిమకి దఖలైతే బావుంటుందన్న కల నెమ్మదిగా ఆయన్ని నిద్రలోకి జార్చింది. అంతలోనే వాసు మాటలకి ఠక్కుమని మెలకువ వచ్చేసింది.
“జీతం ఏం చేస్తున్నావురా? కిడ్డీబేంకు కొనుక్కుని అందులో దాచుకుంటున్నావా?” అడిగాడు వాసు, తమ్ముడిని. మాధవ్ నవ్వేసాడు ఆ మాటలకి. చెప్పేస్తాడా ఏమిటని కంగారుపడ్డాడు కుటుంబరావు.
“నువ్వు చెప్పినట్టే జీపీయఫ్‍లోనూ, పీపీఎఫ్‍లోనూ వేస్తున్నాను. మిగిలింది బేంకులో వుంది. ఈమధ్య నీలిమ ఏదో బంగారం కొనుక్కుంది” అన్నాడు మాధవ్. ఇతను యిలా చెప్పేస్తున్నాడేమిటి? సర్దమని అడుగుతాడేమో, వాసు? కలవరపడిపోయాడాయన.
“విను, ఒకటో రెండో స్థలాలు తీసుకో. కట్టుకుని వుండేలా ఒకటి కొనుక్కుని, సిటీకి కాస్తదూరంలో రెండోది కొనుక్కుంటే ధరలు పెరిగినప్పుడు అదీ, పంకజ్‍కి మేమిచ్చినదీ అమ్మేసి యిల్లు కట్టుకోవచ్చు. ఇకమీదట ఆ పనిమీదే వుండు. పీపీయఫ్ వాడి చదువుకి వదిలెయ్. ఇదివరకూ ఎవరిదగ్గరా డబ్బు పెద్దగా వుండేదికాదు. ఈ కొనుగోళ్లవీ ఎక్కువగా జరిగేవి కాదు. ఇప్పుడలాకాదు. రిటైరయ్యేవాళ్లకి బాగానే వస్తున్నాయి. చిన్న కుటుంబాలయ్యేసరికి బాధ్యతలు తీరి వచ్చిందంతా మిగుల్తోంది. డబల్ ఇన్‍కం గ్రూపుకూడా బాగా పెరిగారు. పిల్లలు బైటికి వెళ్ళి సంపాదించి పంపిస్తున్నారు. సుధీర్నీ, కృష్ణనీ మనం చూస్తున్నాంకదరా? వాళ్ళ మిగులు డబ్బంతా ఇళ్ళమీదా, స్థలాలమీదా పెడుతున్నారు. భూమికి డిమాండు బాగా పెరిగింది. నిన్న కొనాలనుకుని వదిలేసిన స్థలం ఇవ్వాళ కొనడానికి అందడం లేదు” అన్నాడు వాసు.
“ఔన్రా! నాకూ అనిపించింది. ముంబైలో వున్నాను. ఇక్కడికి రావాలని వుందనుకో, ట్రాన్స్‌ఫర్ ఇవ్వకపోతే? ఎప్పుడు ఎక్కడ వుంటానో తెలీదుకదా? అందుకే ఏదీ అనుకోలేకపోతున్నాను” అన్నాడు మాధవ్.
“ఆయన నిద్రపోతున్నాడు. పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ లేచి వెళ్ళాడు వాసు. మాధవ్ అనుసరించాడు. వాళ్ళు చెప్పుకునేవి తనకి వినపడవని బాధపడ్డాడు కుటుంబరావు. వినాల్సిందైతే విన్నాడు. గుండె మండిపోయింది.
అన్నదమ్ములు మహతి విషయం మాట్లాడుకున్నారు. ఇద్దరికీ చాలా బాధనిపించింది. కాసేపటికి మాటలు ఆగాయి. కానీ వాసు అలానే కూర్చున్నాడు. తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని.
“ఏమిట్రా, వాసూ?” అడిగాడు మాధవ్.
“గీత” అన్నాడు వాసు.
“వదినకేమైంది?” కంగారుపడ్డాడు మాధవ్.
“ఏమీ లేదుగానీ, మేంకూడా మీ అందర్లా ఈ వూరు వదిలేసి కొన్నాళ్ళేనా దూరం వెళ్ళాల్సిందేమో! మనింట్లోనూ, వాళ్ళింట్లోనూ అందరూ పెద్దవాళ్ళు. నేను వెళ్ళిపోతే ఎలా అనుకున్నాను. గీత మరీ అటాచిమెంట్సు పెంచేసుకుంది. మీ అందర్నీ మిస్సౌతోంది. హరిచందన్నికూడా తను మర్చిపోదు. పైకి నవ్వుతూ బానే తిరుగుతుందిగానీ రెండు పొరలుగా వుంటోంది తన అంతరంగం. ఆ లోపలి పొరలోంచీ వచ్చే దు:ఖపుచెమ్మ ఒకొక్కసారి తెలిసిపోతోంది. వాళ్ళ అమ్మమ్మా తాతయ్యలు పోయారు. ఇటు మన మామ్మ, నాన్న పోయారు. వీళ్లందరిగురించి ఆలోచిస్తుంది. పైకి తేలదు. అదంతా లోలోపలి వ్యవహారం. ఈమధ్య డ్రైవింగ్ నేర్చుకుంటాను, కారు కొనమంది. ఇంత హఠాత్తుగా ఎందుకు అడిగిందో అర్థమవ్వలేదు.
సుమతి కారు నడుపుతూ తిరుగుతోందికదూ, దీనికీ అనిపించిందేమో- అంది అమ్మ. అప్పటికి నాకు అర్థమైంది. కారు కొనడం సమస్య కాదు. కానీ సుమతిని దూరం చేసుకోలేకపోతోంది. మహీగురించి బాధపడుతోంది. సుధీర్, రాణా, సుమంత్ వీళ్లందరిగురించీకూడా ఆలోచిస్తుందనుకుంటాను. కానీ వాళ్ళ ఆలోచనల్లో తనుండదు. అదీ గొప్ప విషాదం”
మాధవ్ నిట్టూర్చాడు. “మీయింట్లో పిల్లలు చాలామందే అయారుకదూ?” అడిగాడు. వాసు తలూపాడు.
“అంత డబ్బు ఎక్కడ్నుంచీ వస్తోంది? చాలుతోందా, అసలు మీకు?”
“ఖర్చులేమున్నాయి?”
“అరేయ్, చిన్నప్పుడు స్నేహితులే ప్రాణం అన్నట్టు తిరుగుతాం. ఒకొక్కడూ వాళ్ల నాన్నలకి ట్రాన్స్‌ఫర్లై వెళ్ళిపోతుంటే బాధపడతాం. కొత్త స్నేహితులు చేరతారు. కొత్తసంతోషాలని యిస్తారు. ఒకప్పుడు ప్రాణం అని తిరిగినవాళ్ళు మళ్ళీ ఎదురుపడ్డా, మామూలు పరిచయస్తుల్లా పలకరించుకుని వూరుకుంటాం. మనం అవలా? భార్యా, పిల్లలూ, కుటుంబం అనేవి ప్రథమస్థానంలోకి వచ్చేస్తాయి. సుమతేనా అంతే, నేనేనా అంతే. దేవుడి దయవల్ల మనకి బాధలు సమస్యలూ ఏవీ లేవు. మామయ్య కూతురవడాన్న మరీ ఆయనలా ముసలమ్మ వైరాగ్యాలు చూపిస్తే కుదరదని ఆవిడకి అర్థమయ్యేలా చెప్పు. పిల్లలని వెంకటలక్ష్మికి అప్పజెప్పి కొన్నాళ్ళు ఎటేనా తిరిగిరండి ఇద్దరూను ” అన్నాడు మాధవ్. వాసు నవ్వాడు. సమస్య వుందనికాదుగానీ, తమ్ముడితో పంచుకుంటే బరువు తగ్గినట్టైంది వాసుకి.
మర్నాడు పొద్దున్నే మాధవ్ తల్లిని తీసుకుని బయల్దేరాడు. వాసు, నీలిమ తండ్రి కుటుంబరావు, స్టేషనుకి వెళ్ళారు దింపడానికి. అట్నుంచీ ఆయన యింటికి వెళ్ళిపోతే వాసు తిరిగొచ్చాడు. మాధవ్ తిరిగొచ్చిన రెండురోజులకి కూతుర్ని తిడుతూ నారాయణ రాసిన వుత్తరం వచ్చింది. దాన్ని మాధవ్ చేతికిచ్చింది మహతి.
“మిమ్మల్ని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోమంటాడేంటే మీ బావ? మహాఘటికుడు. అంత పెద్ద యిల్లూ తనుంచేసుకుని, మిమ్మల్ని పొమ్మంటాడేమో!” అని నీలిమకి ఫోన్ చేసి లబలబలాడాడు కుటుంబరావు. ఇంటికి చేరగానే ఆయన చేసిన మొదటిపని అది.
“ఇంట్లో వాటా వాళ్ళు వదులుకోనప్పుడు మేం మాత్రం వదులుకుంటామా?” అంది నీలిమ. అప్పటికే అమె మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది.


తనవి కాని సమస్యలు ప్రత్యక్షంగా కొంతా, పరోక్షంగా కొంతా ప్రభావితం చెయ్యగా, తనదైన జీవితాన్ని దార్లో పెట్టుకుందుకు విడాకులకోర్టులో నిలబడింది మహతి. లీగల్ సెపరేషన్ పీరియడ్ అయాక పరస్పరాంగీకారంతో విడిపోయారు. మేఘన కస్టడీ ఆమెకే ఇచ్చారు. అప్పటికి ఆమెకి డాటా ఎంట్రీ వర్కులో బాగా చెయ్యి తిరిగింది. డీటీపీ వర్కుకూడా నేర్చుకుంది. అందరూ కలిసి కొనిచ్చిన కంప్యూటరు పెట్టుకుని యింట్లోనే పనిచేసుకుంటోంది. నారాయణ రిటైరవ్వగానే ఆమె దగ్గిరకి వచ్చేసాడు. అదంత తేలికైన వ్యవహారంలా అనిపించలేదు ఆయనకి. సమూలమైన మార్పు. మలివయసులో. మంచికే వచ్చింది. సెకండ్‍హేండులో ఇంకో కంప్యూటరు కొనుక్కుని డీటీపీసెంటరు పెట్టాడు. కూతురితో సమానంగా తనూ టైప్ చేసేవాడు. ఇద్దరూ కలిసి దాదాపు ఇరవైగంటలు చేసేవారు. సంపాదన బానే వుండేది.
తమందరి జీవితాల్లో అనివార్యంగా వచ్చిన ఈ మార్పు నిర్మలని చాలా బాధపెట్టింది. డబ్బొచ్చే ఒక వ్యాపకం చేతిలో వుండటంతో నారాయణకి ఇది రెండో కెరీర్‍లా అనిపించి తొందరగానే సర్దుకున్నాడు. ఐనవాళ్ళందరికి దూరంగా వుండటం, తనలోకి తను కుదించుకుపోతున్నట్టు బయటి ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి కంప్యూటర్‍కీ, దాంట్లో అక్షరాలనీ పదాలనీ సృష్టిస్తూ, వాటిని పేజీలమీద పోగుచేయటానికీ పరిమితమై విరాగిలా మిగిలిపోయిన మహతిని చూస్తుంటే ఆమెకి గుండెకోతగా వుంటుంది. మొదట్నుంచీ మహతిని తను భయపడుతూ, భయపెడుతూ పెంచింది.
“నీకీ సమస్య వుంది. పెళ్లయాక ఎలా దారితీస్తుందో!” అన్న సూచన ఇవ్వకుండా మూతముక్కిడి చేసి, పెళ్ళి చేసి, కాపురం నిలబెట్టాలని చూసింది. అంతకన్నా, కూతురి యిష్టానికి ప్రాధాన్యత యిచ్చి, ఆమె పెళ్ళి వాయిదా వేసి, రవళికి చేసి, తనంతట తను చేసుకుంటాననేదాకా ఆగి వుంటే బావుండేది. చేసుకోకపోయినా సమస్య వుండేది కాదు. తన మనసులో ఈ ఆలోచన లోలోపల వున్నా, లోకానికి భిన్నంగా వెళ్ళడానికి భయం, భర్తకి అర్థమయ్యేలా చెప్పి వప్పించలేని అసక్తత.
మధ్యమధ్యలో నరేంద్ర మేఘనని చూడటానికి వస్తాడు.
నరేంద్రది హక్కు. నెలకోసారి పిల్లని చూసుకోవచ్చు. వీలునుబట్టి వస్తాడు. కట్నం, పెళ్ళిఖర్చులూ వెనక్కి తీసుకున్నాక మరొక్క పైస అతన్నుంచీ ఆశించలేదు మహతి. విజ్జెమ్మ వున్నప్పుడు కొద్దిగా ఏదో మేఘన వుయ్యాల్లో పెట్టబోతే, “చూడాలని వుంటే వచ్చి చూడమను. అంతేగానీ, డబ్బు ఇవ్వద్దని చెప్పు అమ్మమ్మా! నాకు ముట్టేవి ముట్టాయి” అంది మహతి.
అతనింక ఆ ప్రయత్నం చెయ్యలేదు. నిజానికి కూతురి పుట్టుకగురించి అతనికి బాగా గిల్ట్ వుంది. ఈ ప్రయత్నాలు చెయ్యకుండా విడిపోయి వుంటే బావుండేదన్న ఆలోచన అతన్ని స్థిమితంగా వుండనివ్వదు. విజ్జెమ్మకి అతను రావడంలో ఎలాంటి ఆక్షేపణా లేదు. అతని కూతుర్ని అతను చూసుకోకుండా ఆపడం జరగనిపని అని తెలుసు. కోర్టు ఆర్డరుకూడా వున్నాక. ఆవిడ వెళ్ళి, తల్లిదండ్రులు వచ్చాక నరేంద్ర రాకపోకలు కొంచెం సమస్యగా మారాయి. కాళ్ళుకడిగి కన్యాదానం చేసి, ఇంటిమనిషిగా గుర్తించిన వ్యక్తిని పరాయివాడిలా చూడటం ఎలానో అర్థమవదు నిర్మలకి.
“పిల్లని మనం చూసుకోలేమా? అతనెందుకు రావటం?” అని మండిపడతాడు నారాయణ.
స్వేచ్ఛ అనే రెండక్షరాల పదం ఒకరిది ఒకరు కబ్జా చేసినప్పుడు తలెత్తే అసంబద్ధతలలో ఇదొకటి. నారాయణ కూతురి నిర్ణయాలు తనే తీసుకోబోతాడు. అతను వచ్చే సమయానికి వాళ్ళిద్దర్నీ ఎటో ఒకవైపు పంపేస్తుంది మహతి.
మనుషులు కలుస్తూ విడిపోతూ వుంటారు. ప్రతికలయికా శాశ్వతమైన బంధానికి దారితీయదు. కలిసాక విడిపోవటం సహజం. శాశ్వతబంధమే విడిపోయింది మహతి విషయంలో. విడిపోయినవాళ్ళు మళ్ళీ కలవడం మాత్రం చాలా అరుదు. రామ్మోహన్ మహతిని మళ్ళీ కలవడం అలాంటి అరుదైన విషయాల్లో ఒకటి.
అతను ఆ సంవత్సరం జైపూర్లో జరిగే బుక్ ఫెస్టివల్లో తన పుస్తకాన్ని విడుదల చెయ్యాలనుకున్నాడు. ప్రచురణసంస్థలు ముందుకొచ్చి ప్రచురించే పుస్తకాల విషయంలో ఎలాంటి సమస్యా వుండదు. గ్రంథచౌర్యం, కాపీరైట్ సమస్యల్లాంటివి వాళ్ళు పరిష్కరించుకోగలరు. కానీ స్వీయప్రచురణ చేసేప్పుడు చాలా జాగ్రత్తపడాలి. రామ్మోహన్ మొత్తం నవల చేత్తో రాసి నాలుగైదుచోట్ల కొన్నికొన్ని పేజీలు డీటీపీ చేయిస్తాడు. ఫాంటు, మిగిలిన వివరాలన్నీ తనే చెప్తాడు. అది మొత్తం మరోచోట కలిపించి సీడీలో వేసుకుని ప్రింటరుకి ఇస్తాడు. ఈవరసలో అతనికి నారాయణ పరిచయమయ్యాడు.
ఇద్దరూ తెలుగువాళ్ళు. మూలాలు తెలుసుకుంటే అవంతీపురం దగ్గిర తేలారు.
“మీకు త్రిమూర్తులు తెలుసా?” కొంచెం అమర్యాదగా అడిగాడు రామ్మోహన్.
“అతను మా పెద్దబావమరిదికి చాలా దగ్గర” అన్నాడు నారాయణ.
“దుర్మార్గుడు” త్రిమూర్తులిని తెలిసినవాళ్ళకి ఎవరో ఒకరికి చెప్పాలనిపించిన వుక్రోషం. ఎప్పట్నుంచో దాచుకున్నది.
“అదేమిటలా అనేసారు? హైద్రాబాదులో చాలా పేరున్న వ్యక్తి అతను. పెద్ద ఉమ్మడికుటుంబం. చాలా వ్యాపారాలు వున్నాయి. బాగా ఆస్తులు కూడబెట్టాడు. ఎవరికీ హాని తలపెట్టినట్టు వినలేదు” అన్నాడు నారాయణ కొంచెం ఆశ్చర్యంగా.
“మా అమ్మ అతని చెల్లెలు” అన్నాడు రామ్మోహన్.
“చెల్లెలా? త్రిమూర్తులు ఒక్కడే కొడుకు వాళ్ల నాన్నకి” అంటూ అర్థమైనట్టు ఆగాడు నారాయణ. అతనికి ఆ కథ తెలుసు. రామ్మోహన్‍పట్ల కొద్దిగా చులకనభావంలాంటిది కలిగింది. మనిషిని కొలిచేందుకు కొన్ని వుపకరణాలుంటాయి. తల్లిదండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగిన పరిసరాలు. వీటికి భిన్నమైన లక్షణాలు చూపించే మనుషులు చాలా అరుదుగా వుండచ్చు. వాళ్ళు ఒకరిద్దరినీ మినహాయించుకుంటే మిగిలినవాళ్ళంతా ఆ త్రాసులో తూగేవాళ్ళే. ఎదుటిమనిషిగురించి వుండే కనీసపు అంచనా అది. వీళ్ళు మాట్లాడుకుంటుంటే మహతి ప్రింటు తీసిన కాగితాలు, సిడీ తీసుకుని వచ్చింది. అప్పుడు మరోసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఒకరినొకరు గుర్తుపట్టారు.
“ఆరోజు మీకు చెప్పిన కథే రాసాను. పుస్తకం ప్రింటయాక కాపీ యిస్తాను చదివి అభిప్రాయం చెప్పండి” అన్నాడు. ఆమె తలూపింది.
“మీకు మా అమ్మాయెలా తెలుసు?” అడిగాడు నారాయణ కొంచెం అసహనంగా. రైల్లో సంఘటన చెప్పాడు రామ్మోహన్. నారాయణకి అతనిమీది అసహనం తగ్గిందిగానీ తేలికభావం పోలేదు.
“అతన్తో జాగ్రత్తగా వుండు. కల్పించుకుని మాట్లాడతాడేమో, తుంచెయ్. వాళ్ళది అంత మంచి కుటుంబం కాదు” అన్నాడు మహతితో, తర్వాత. అతను ఎలా చెడ్డవాడో, తండ్రి ఎలా ఆ విషయం తెలుసుకోగలిగాడో, కుటుంబాన్నిబట్టి అలా నిర్ణయించడం సరైనదోకాదో మహతికి తెలీదు. ప్రశ్నించడం, ఎదురుతిరగడం ఆమె స్వభావం కాదు. తలూపి వూరుకుంది.
“ఎవర్నిగురించి?” నిర్మల అడిగింది ఆరాగా. చెప్పాడు. ప్రపంచం ఎంత చిన్నదోననిపించి ఆశ్చర్యపోయింది.
ఈ యిన్నిరోజుల్లో రామ్మోహన్ మహతిని మర్చిపోలేదు. మర్చిపోవడమంటే? సగం చదివాక తప్పనిసరై మూసేసిన పుస్తకంలా ఆమెని గురించిన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.
ఆమె పేరేమిటి?
ఆరోజు వచ్చినది, తిరిగి వెళ్ళలేదా? ఇక్కడే వుండిపోయిందా?
భర్తతో కలిసే వుంటోందా? ఇద్దరూ విడిపోయారా?
మళ్ళీ ఎవరితోనేనా కమిట్‍మెంటు ఏర్పడిందా? వంటరిగానే వుందా?
ఆ తర్వాతది ఆమెపట్ల చిన్న క్రష్. పురుషసహజమైన కోరిక. అతని జీవనశైలికి అనుచితం అనిపించనిది.
ఆమె స్ఫూర్తిగా పెద్దరిసెర్చే చేసాడు. ఆడపిల్లలు కష్టం రాగానే ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిపోతారన్న విషయంమీద. అన్నిదారులూ ఒకవైపుకే వెళ్ళాయి. ఇంట్లోవాళ్ళకి కాస్త భిన్నంగా ఆమె నిర్ణయం తీసుకోగానే, దాన్ని ఆపేందుకు అందరూ అన్నివైపులనించీ వత్తిడి మొదలుపెడతారు. బలప్రయోగం చేసేనా ఆ నిర్ణయాన్ని మార్చాలనుకుంటారు. ఆమెకి ఏమీ తెలీకుండా పెంచి, ఏమీ తెలీనిదని ఆరోపిస్తారు. ఇక తప్పనిసరై ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంది.
పెళ్ళి, ఇష్టం లేకపోయినా చేసుకోవాలి.
భర్త, కొట్టినా తిట్టినా భరించాలి. అన్నీ భరించి, అతన్ని మార్చుకుని, ఆనందంగా బతకాలి.
పిల్లలు, పెద్దతనాన తిండి పెట్టినా పెట్టకపోయినా సర్దుకుపోవాలి.
సమాజం, పెళ్ళి కాకుండా నిరోధించినా ఆ సమాజంలోనే బతకాలి.
ఈ ప్రపంచం యుటోపియా కాకపోయినా ఆమె మాత్రం యుటోపియన్‍గానే భావించబడుతుంది. పెళ్ళికిముందు ఒకలా, పెళ్లయాక మరోలా, ఇంట్లో ఒకలా, ఆఫీసులో ఒకలా. ఇలా మనిషిని, పరిసరాలని, పరిస్థితులనిబట్టి మారుతూ, అలాంటి నిరంతరమైన మార్పునే పీలుస్తూ అందరి జీవితాలకీ ఆలంబన కావాలనే ఒక వింత ఆశింపు ఆమెనుంచి వుంటుంది. అదే సమాజంలో వున్న వైకల్యాలన్నిటికీ కారణం అనేది అతను తనుగా నిర్ధారించుకున్న విషయం.
రామ్మోహన్ మహతిని తరుచు కలిసేవాడు. ఇంటికే వచ్చేవాడు. తమమధ్య ఆంతరంగిక సాన్నిహిత్యమేదో వున్నట్టు ఇద్దరికీ అనిపించేది. ఆమె జీవితంలోని అత్యంతక్లిష్టమైన రోజుని అతను చూసాడు. ఆమె ఎలాంటి తెలివితక్కువ నిర్ణయం తీసుకోకుండా ఆపాడు. వాళ్లమధ్య సాన్నిహిత్యానికి కారణం అదే. సాహిత్యాన్ని గురించి, అతను రాసిన పుస్తకాలగురించి మాట్లాడుకునేవారు. అతను యింటికి రావడం, మహతితో ఈ చర్చలు నారాయణకి యిష్టం వుండేవి కాదు.
“పెద్దవాడేకదా? తప్పేం లేదు. మాట్లాడుకోనివ్వండి. అది ఆ కంప్యూటరు వర్కుతప్ప మరోధ్యాస వదిలేసింది. ఎవరికీ ఫోన్‍కూడా చెయ్యడం లేదు. వాళ్ళు చేస్తే పలకడమే. మనకిమాత్రం ఇక్కడ ఎవరున్నారు?” అంది నిర్మల.
మహతి ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా సంఘటనలు జరిగాయి. మాధవ్ రాజస్థాన్ ట్రాన్స్‌ఫరై వెళ్ళిపోయాడు. మహతిని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డాడు. తమతోపాటు నిలబెట్టాలని రాణాని తీసుకొస్తే అతను మూడునెలలు జల్సా చేసి, తెచ్చుకున్న డబ్బంతా ఖర్చుపెట్టుకుని, చివరికి చార్జీలు అడిగి తీసుకుని వెళ్ళాడు. గీత అంచనా ఇక్కడ తప్పింది. సుధీర్ ఏం చెప్పాడోగానీ, అతని అత్తమామలుమాత్రం మంచిసపోర్టు ఇచ్చారు. డీటీపీ సెంటరు పెట్టడం, మాధవ్ వెళ్ళిపోయాక తమకి దగ్గర్లో, తక్కువలో ఫ్లాటు చూసి, అందులోకి వాళ్ళని షిఫ్ట్ చెయ్యడం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. గీత, వాసు వచ్చి మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు. రవళి వస్తుంటుంది.
పదకొండుమంది కలిసి ఏర్పరిచిన స్నేహప్రవాహం ఇప్పుడు చిన్నచిన్నపాయలుగా చీలి, దేని గతిననుసరించి అది విడిగా ప్రవహిస్తోంది. ఒకరంటే ఒకరికి గల ప్రేమాభిమానాలు నేలపొరల లోలోపలి చెమ్మలాగా వుండిపోయాయి. ఒకరికోసం మరొకరు ఏదేనా చెయ్యగలిగే పరిస్థితి స్వంతకుటుంబం అనే పరిమితులకి లోబడిపోయింది.
రామ్మోహన్‍తో మహతి పరిచయం అక్కడే ఆగలేదు. కొద్దిరోజులతర్వాత అతన్నుంచీ పెళ్ళిప్రస్తావనలాంటిది వచ్చింది.
“నాకు ఈ వివాహవ్యవస్థమీద నమ్మకంలేక పెళ్ళి చేసుకోలేదు. మూడేళ్ళు రిలేషన్‍షిప్‍లో వున్నాను. ఒక బాబు పుట్టాక అభిప్రాయబేధాలు వచ్చి ఇద్దరం విడిపోయాం. వాడు నా దగ్గిరే వున్నాడు” అన్నాడు తన ప్రతిపాదనకి నాందీప్రస్తావనలా.
“మీరు పెళ్ళిచేసుకోవద్దనుకున్నారు, చేసుకోకుండా వుండగలిగారు. నేనూ అనుకున్నానుగానీ బలవంతంగా చేసారు. అంత బలంతోనూ విడిపించుకుని బైటపడ్డాను” అంది మహతి చిన్నగా నవ్వి. వివాహవ్యవస్థలో వస్తున్న మార్పులు తెలుస్తున్నాయి ఆమెకి. కొన్నాళ్ళు బైటికి వెళ్ళి వుద్యోగం చేసింది. అనేక పరిచయాలు. రేకులు ముడుచుకున్న పువ్వుని బలవంతంగా రెక్కలు ఇప్పినట్టు కొన్ని పరిచయాలు. తప్పనిసరిగా. విడాకులు తీసుకున్నాక మానవసంబంధాలకి చెందిన ఒక కొత్తకోణం తెరుచుకుంది. బాయ్‍ఫ్రెండ్సు, గర్ల్‌ఫ్రెండ్సు, పార్టీలు, పబ్‍లు, పెళ్ళిచేసుకోకుండా కలిసి వుండటం. అన్నిటినీ చుట్టుకుని శృంగారం. అవంతీపురంలో ఇంత విశృంఖలత లేదు. ఉందేమో, గమనించలేదు. చదువుకునేరోజుల్లో చూచాయగా విన్న విషయాలు ఇప్పుడు విస్తృతంగా తెలుస్తున్నాయి. తెలుసుకుంటోంది. అందుకే రామ్మోహన్ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ తనతో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడో అనుకుంది. సాహిత్యచర్చలో భాగంగా చెప్తున్నాడనుకుంది.
“మీకు ఇష్టమైతే మనం కలిసి వుండచ్చు. నా కొడుకు, మీ పాప. మీరు, నేను, మా అమ్మ ఐదుగురం ఒక కుటుంబంగా. ఇష్టమైతే మీ తల్లిదండ్రులుకూడా. అలా వుండటం మీకు అభ్యంతరమైతే సివిల్ మేరేజి చేసుకుందాం” అన్నాడు చాలా మామూలు విషయమన్నట్టు.
మహతి తొణకలేదు. అతన్ని నిశితంగా చూసింది. ఇద్దరు మనుషులమధ్య శృంగారం లేకుండా మరే బంధం వుండకూడదా? ఆరోజు రాత్రి బలమైన వుద్వేగాలమధ్య కొట్టుకుపోతూ బేలన్సు తప్పి వున్న తనని సరైన దార్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు ఇతడు. చెయ్యాలనుకుంటే తన నిస్సహాయత చూసి ఆరోజే మోసం చెయ్యచ్చు. అవకాశం తీసుకోవచ్చు. కానీ ఆ పని చెయ్యలేదు. చాలా బాధ్యతగా వ్యవహరించాడు. కనీసం తన పేరుకూడా అడగలేదు. మాధవ్‍ని పరిచయంచేసుకుని, ఆ పరిచయాన్ని పెంచుకుని మళ్ళీ కలిసే ప్రయత్నం చెయ్యచ్చు. కానీ చెయ్యలేదు. మరి యిప్పుడెందుకిలా? తనని చూడగానే శృంగారం గుర్తొచ్చిందా? ఎందుకు? భర్తని వదిలిపెట్టిందనా? ఇక్కడ తనకి స్థానబలం లేదనా?
ఆమె తొణకలేదు. తొందరపడలేదు. గొడవపడలేదు. అతనెంత మామూలు విషయంలా అడిగాడో అంతే మామూలుగా వుండాలని నిర్ణయించుకుంది.
“నాకు అలాంటి ఆలోచన లేదు. నా భర్తంటే నాకు ఇప్పటికీ ప్రేమే. అతను చెడ్డవాడని మేం విడిపోలేదు. ఐ వజ్ ఎ బేడ్ వైఫ్ ఆల్ త్రూ” అంది.
“పోనీ కేజువల్‍గా? బయట ఎక్కడేనా?” అడిగాడు.
పుట్టుకతోటే మనిషి ఒక మూసలో ఇమడ్చబడతాడు. అతని చుట్టూ వుండే మనుషులు, పరిసరాలు ఆ మూసకి శీలలని బిగిస్తాయి. అతను ఆ మూసకి అలవాటుపడిపోతాడు. ఆపైన ఆవ్యక్తి ఆలోచనలకీ, వెతుకులాటకీ ఒక పరిమితి ఏర్పడుతుంది. అతని అమ్మమ్మ పెళ్ళైన మగవాడితో అంటే త్రిమూర్తులి తండ్రితో కలిసి వుంది. నలుగురు పిల్లలని కన్నది. వాళ్ళకి సరైన జీవితాలు ఏర్పరచలేకపోయింది. ఇప్పుడతను తల్లిగా చెప్పుకుంటున్న స్త్రీ- త్రిమూర్తులి చిన్నచెల్లెలు- ఆమెకూడా వివాహబంధానికి వెలుపలే బతికింది. ఇవన్నీ అతనిలో ఆత్మన్యూనతని పెంచి వుంటాయి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొన్ని సిద్ధాంతాలని చేసుకున్నాడు. ఆ సిద్ధాంతాలకి అనువైనవాళ్ళతోనే స్నేహం చేసాడు. అతని వ్యాసంగం, ముంబై సంస్కృతి దానికి చక్కగా సహకరించాయి. మహతిని పెళ్ళిచేసుకోవాలనుకోవడంలో ముసుగుకప్పి దాచిన ఆత్మన్యూనత వుంది. అది లేకుండా బతకడం అతనికి చేతకాలేదు. ఎవరూ నేర్పలేదు. సాహిత్యం చదివేడు. తను కొంత సృష్టించాడు. స్త్రీపట్ల సానుభూతి తనకి వుందనుకున్నాడు. అలాంటిదేమీ లేదనీ తెలుసుకున్నాడు. తన మనసులో వున్న అభిప్రాయాల్నే ఇంకొంచెం కృషి చేసి కథలుగా సృష్టించాడు. నిజానికి అన్నీ సవ్యంగా సాగిపోతున్న ఏ వ్యక్తికీ స్వంతజీవితం నడిపించుకునేందుకు ఆదర్శాలు అవసరం లేదు. అది లేనప్పుడే వాటి అవసరం.
“బిగ్ నో” అంది మహతి. ఈమాటు ఆమెకి కొద్దిగా చికాకు కలిగింది. దాన్ని అణచుకుంది.
“మరి? ఇలాగే వుండిపోతారా?” అతను ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
“తప్పేముంది? ఇది నా జీవితం” అంది.
అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. అతను వెళ్ళిపోయాడు. కోపాలూ, కక్ష పెంచుకోవటాలూ లేవు. కానీ అతనుమాత్రం చిన్న వోటమిని రుచి చూసినట్టనుకున్నాడు. గాయపడ్డాడు. అందుకు బాధ్యతమాత్రం మహతిది కాదు.
అతను ఇదివరకట్లా రావటం లేదని గుర్తించి నిర్మల అడిగింది. “రామ్మోహన్‍గారు రావట్లేదేమే?” అని.
“పోనీమ్మా! గంటలతరబడి కబుర్లకి ఏముంటాయి? నాకేమైనా అన్నా, తమ్ముడా, స్నేహితుడా? రావద్దని చెప్పలేక వూరుకున్నాను. నా పని పాడు” అంది మహతి. ఇద్దరిమధ్యా ఏదో జరిగిందని నిర్మల గ్రహించిందిగానీ రెట్టించి అడగలేదు. అడగటంవలన ప్రయోజనం వుండదని తెలుసు. నువ్వితన్ని చేసుకో అనటానికి నరేంద్రతో పోలిస్తే రామ్మోహన్ దివిటీముందు దివ్వెలా వున్నాడు. ఇటు మహతి భర్తని వద్దనుకుని వచ్చిన కారణం చిన్నదికాదు. వాళ్ళ స్నేహం ముందుకి వెళ్ళనందుకు నారాయణ సంతోషించాడు. జీవితంలో వచ్చే మరే మార్పునీ తట్టుకునే శక్తి అతనికి లేదు. జీవితం అంటే మహతిది.
కూతురు ఇంక యింతేనా? ఏకాకిలా? నిరంతరం ఈ ప్రశ్న నిర్మలని తినేసింది. అలిసిపోయిన ఆమె గుండె ఆగిపోయింది. అందరూ షాక్కి గురయ్యారు. తనవల్లే ఇదంతా జరిగిందని మహతి కృంగిపోయింది. కర్మ అవంతీపురంలో చేద్దామనుకున్నారు. ఇల్లు అద్దెకి ఇచ్చారు, అప్పటికప్పుడు ఖాళీచేయించడం సాధ్యపడదుకాబట్టి సత్రంలో చేద్దామని నారాయణ అనుకుంటే రామారావు తనింటికి వచ్చెయ్యమన్నాడు.


నిర్మల పార్థివదేహాన్ని తీసుకురావడానికి రవి, నందకిశోర్ నారాయణకి తోడుగా వెళ్ళారు. రామారావు ఇక్కడి ఏర్పాట్లు చూడటానికి వుండిపోయాడు. పిల్లలూ పెద్దవాళ్ళూ అందరూ ఒకళ్ళొకళ్ళుగా ఆ యింటికి చేరుకుంటున్నారు. ఆ కుటుంబంలో జరిగిన మరణవిషాదాల్లో ఇది రెండోది. మొదటిది లక్ష్మి భర్తది. అప్పుడది తమలో ఒకరికి వచ్చిన కష్టంలా అనిపించింది. ఇదిమాత్రం తమకే వచ్చిన కష్టం అని అందరికీ అనిపించింది. విజ్జెమ్మ మంచం పట్టేసి వుంది. ఆవిడకి ఇవి ఆఖరిరోజులన్నట్టే. అలాంటి సమయాన వచ్చి పడిన దు:ఖం ఇది.
“పెద్దదాన్ని నేనుండగా ఏం తొందరొచ్చిందే, నీకు?” అని ఏడ్చింది ప్రమీల. ఎన్నో దు:ఖాలు ఆమె గుండెల్లో గూడుకట్టుకుని వున్నాయి. అవన్నీ ఒక్కసారి కరిగి ప్రవహించాయి. కనిపించని దు:ఖాన్ని తనలో ఎంతోకాలం మోసిన లక్ష్మి అప్పుడూ యిప్పుడూ నిర్వికారంగానే వుంది. తన చేత్తో పెళ్ళి చేసి పంపించిన చెల్లెలికి ఇప్పుడీ తతంగాలు చేయవలసిరావడం రామారావుకి దిగ్భ్రమగా వుంది. జీవితం ఇంక ముగింపుకి వస్తోందా? ఒక్కమనిషిగా పుట్టి, అనేక జీవితాలతో ముళ్ళూ వేసుకుంటూ పెరిగి, ఆ ముళ్ళని యిప్పుకుంటూ వంటరిగా తిరిగి వెళ్ళిపోవటమేనా, జీవితానికి అర్థం? ఇన్నేళ్ళ ప్రయాసకి ఫలితం? అర్థంకాని అయోమయం.
“అమ్మని నేనే చంపుకున్నాను. అక్కడికి వాళ్ళు రాకుండా వుండాల్సింది. కళ్ళెదుట నేను కనిపిస్తూ వుంటే తట్టుకోలేకపోయింది. నాకే బాధా లేదమ్మా అంటే నమ్మలేదు. లేని దు:ఖాన్ని వూహించుకుని బలైపోయింది” అని భోరుని ఏడ్చింది మహతి. రవళి అక్కని పట్టుకుని ఏడుస్తూ వుండిపోయింది. తమని తిట్టీ, కోప్పడీ, బుజ్జగించీ, బుద్ధులు చెప్పీ, ఇంతవాళ్ళని చేసిన తల్లి, తమ బాధలన్నిటినీ తమతో సమానంగా మోసిన తల్లి, ఆవిడ రుణం తీర్చనివ్వకుండానే వెళ్ళిపోయింది. ఇకమీదట తాము పెద్దవాళ్ళు. ఎవరికీ తమపట్ల అలాంటి బాధ్యత వుండదనుకుంటే కడుపులోంచీ తెర్లుకు వచ్చింది దు:ఖం. చనిపోయిన వ్యక్తిచుట్టూ గజిబిజిగా అల్లుకుని ఎన్నో బంధాలు. బాంధవ్యాలు, రక్తసంబంధాలు, చుట్టరికాలు. ఆ ముడులన్నీ ఇప్పుకోవడానికి ఎవరికివారే ప్రయాసపడుతున్నారు. బాధపడుతున్నారు.
సుధీర్ సూచనమీద వాళ్ళ బేచి అందరూ కలిసి కొంత బాధ్యతని పంచుకోవాలనుకున్నారు. వాసు తండ్రి పోయినప్పుడుకూడా ఇచ్చారు. గీత ఆ డబ్బుకి మరికొంత కలిపి ఆయన పేరుమీద మయూఖ్ స్కూల్లో స్కాలర్‍షిప్ పెట్టించింది. వాళ్ళకి పుష్కలంగా డబ్బుంది. ఆ పని చెయ్యగలిగింది. మహతి ఆర్ధికపరిస్థితి ఎలా వుందో తెలీదు. భర్తని వదిలిపెట్టి బతుకుతోంది. నిలదొక్కుకుందో లేదో! కుటుంబం మొత్తం ముంబైకి మారటానికి చాలా ఖర్చు వచ్చింది. అదంతా దృష్టిలో వుంచుకుని తలోకొంతా ప్రహ్లాద్ అకౌంట్లో వేసారు.
దానికిముందు అతనికి భార్యతో కొంత చర్చలాంటిది జరిగింది. దాన్ని వాదన అనచ్చు. అది సందర్భం కాదని ఆమెకి తెలీదు. ఆమెకి ఈ కుటుంబాన్ని ఏకతానుగా చూడటం ఇప్పటికీ రాలేదు. నిర్మల పోవడాన్ని తమకి పెద్దగా సంబంధం లేని ఒక సంఘటనగానే అనిపిస్తోంది.
“బావుంది. ప్రతీదానికీ మీరంతా వేసుకోవడమేమిటి? వాళ్లకి లేదా, పోదా? పోనీ వాళ్ళ ఆస్తుల్లో మీకేమైనా భాగం పంచుతారా?” అంది నిరసనగా.
“ఒకళ్ళకొకళ్ళం వున్నామన్న నమ్మకం కలిగించడానికి ఇస్తున్నాం. ఆస్తులు పంచి యిచ్చేంత త్యాగాలు మనమేం చెయ్యడం లేదు” అన్నాడతను.
“ఐతేమాత్రం? ఏదొచ్చినా ఇలా డబ్బులు ఇవ్వడం దేనికి? ఎవరికి వుండేది వాళ్ళకి వుంటుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఖర్చుపెట్టుకుంటారు” అంది తగ్గకుండా.
అతను ఆమెని నిశితంగా చూసాడు. “వాళ్ళూ మనమూ కాదు. మనది ఒకటే కుటుంబం. చాలా పెద్దకుటుంబం. ఈ పదిపన్నెండురోజులూ వెళ్ళేవాళ్ళం వెళ్తాం, వచ్చేవాళ్లం వస్తాం. మా అమ్మావాళ్ళు తొమ్మండుగురిలో ఒకళ్ళు పోయారు. మహీకీ, రవళికీ వచ్చిన కష్టం చిన్నదేం కాదు. వాళ్ళని దగ్గిరుండి చూసుకోవాలి. వంటమనుషులకీ, భోజనాలకీ మిగతావాటికీ చాలా ఖర్చొస్తుంది. బాబాయ్ ఎంతని పెట్టగలడు? ఒక్కళ్ళమీద భారంమోపి తినాలంటే అందరికీ ఇబ్బందిగా వుంటుంది. ఇతరకులస్తుల్లో ఒక్కోరోజు ఒకొక్కళ్ళని ఖర్చులు పెట్టుకుంటారు. చదివింపులుకూడా చేస్తారు కొందరు. అందరూ తలోచెయ్యీ వేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు సరిగ్గా సాగుతాయి” అన్నాడు వివరణ యిస్తూ. ముందుగానే చెప్పి వప్పించకపోతే ఆ తర్వాత అక్కడికెళ్ళి మాట తూలే మనిషి మాధురి.
“మందమందంతా వెళ్ళడం దేనికి? పదోరోజుని కనిపించి వస్తే చాలదా?” అంది.
“ఈ మంద నచ్చేకదా, ముందు నిన్ను తోసాడు ఇందులోకి? అది చాలదన్నట్టు నీ చెల్లెళ్ళిద్దరినీకూడా మందలో కలిపేసాడు?” అన్నాడు కొంచెం మొరటుగా. అతను ఇలా మాట్లాడుతుంటే విన్నప్పుడు అరుణ చాలా బాధపడుతుంది. ఎంతో సున్నితంగా, జాగ్రత్తగా పెంచింది పిల్లలని, లోలోపలి పశుప్రవృత్తి బైటికి తీస్తుందేమిటీ ఈ పిల్లని బాధపడుతుంది.
“చూడు, ఒక్క ఐదువేలల్లో మన ఆస్తులేం కరిగిపోవు. ఒకవేళ నీకు అలా కరిగిపోతూ కనిపించినా, అందర్లో ఏం మాట్లాడకు. కార్యక్రమాలన్నీ అయాక లెక్కలు తేల్చుకుందాం” అన్నాడు అతనే.
“మీ అందరిమధ్యనీ నోరెత్తేంత ధైర్యం నాకెక్కడిదిగానీ?” అని, “అందరూ చేరతారుకదా? ఆ యింటివిషయం ఒకమాటు ఎత్తకూడదూ? నీలిమ మీకేమన్నా పరాయిదా? స్వంత మరదలేకదా?” అంది అతని మాటకి వప్పుకున్నందుకు బేరమాడుతున్నట్టు.
“ఏ యిల్లు?” అడిగాడు ప్రహ్లాద్ అర్థం కానట్టు.
“వాసు బావగారికి మీరంతా కూర్చుని చెప్తే వినరా? మాధవ్ ఆయన స్వంతతమ్ముడేకదా?”
“నేను అందులో కలగజేసుకోను. అది వాళ్ళింటి విషయం. వాళ్ల నాన్న పోయినప్పుడు జరిగిన గొడవ చాలు. మీ నాన్న రావాలనుకుంటే పదోరోజుని వచ్చి ధర్మోదకాలు ఇచ్చి, ఇంత తిని, మర్యాదగా వెళ్ళిపొమ్మను. మీ అమ్మ రాకూడదన్నావుకాబట్టి ఆయన నోరు తెరవకుండా చూసుకునే బాధ్యత నీది” కచ్చితంగా అన్నాడు.
“ఇంత పెద్దకుటుంబం, అంత పెద్దకుటుంబం అని గొప్పగా చెప్పుకుంటారు, తినిపోవడానికేనా, మంచీచెడూ చెప్పుకోవడానికి కాదా?”
“ఎవరి మంచి వాళ్ళకి తెలుసు. ఒకళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాసు, మాధవ్ ఇద్దరూ నాకు ఆమ్మ పిల్లలు. ఇద్దరూ సమానమే. వాసేనా, తమ్ముడు కష్టపడున్నాడంటే వెయ్యో పదివేలో సర్దగలడుగానీ, ఇంట్లో వాటా వదులుకోడు. వాడేకాదు, ఎవరేనా అంతే. అందులో తులసికీ వాటా వుంటుంది. దాని భర్త ఎందుకు వదులుకుంటాడు? అనవసరంగా దాని కాపురంలో సమస్యలు తేవద్దు”
“అదేమిటి? ఆ అమ్మాయికి బోల్డు కట్నం యిచ్చారు. భారీగా ఖర్చుపెట్టి పెళ్ళి చేసారు. ఇంకా వాటా ఏమిటి?”
“ఐతే? కట్నం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు జరగవు. అందుకని యిస్తారు. నీ పెళ్ళి నువ్వు చేసుకో అని ఆడపిల్లని వదిలెయ్యరు. అలా వదిలేస్తే అది ఏ తలకిమాసినవాడినో తీసుకొస్తే వాడిని కలుపుకోలేక పెద్దసమస్యకదా? అందుకు ఆడపిల్ల పెళ్ళిబాధ్యత పెద్దవాళ్ళు, అన్నదమ్ములు తీసుకుంటారు. ఆస్తిలో వాటా చట్టపరంగా వస్తుంది. వద్దంటున్నా వాళ్ళింటిమీద పడ్డాయేమిటి మీ తండ్రీకూతుళ్ళ కళ్ళు? మాధురీ! ఇది మనకి సంబంధం లేని వ్యవహారం. ఇప్పటికే వాసుకీ, ఆమ్మకీ మనమీద చాలా కోపంగా వుంది, ఆరోజుని వాళ్ళింట్లో నువ్వలా అన్నందుకు. ఒకసారికాదు, రెండుసార్లు జరిగింది అలా. తెలివితక్కువమాటలని వదిలెయ్యనివ్వకుండా ఇంకా ఎగసెనదోస్తున్నారు మీరు. అది మంచిదికాదు” నచ్చజెప్తున్నట్టు అన్నాడు.
ఆమె బలంగా నిశ్వసించింది. కోపంగా చూసింది. పెళ్ళైన మొదట్లో అతను తనేం చెప్పినా వినేవాడు. తర్వాత తర్వాత మార్పొచ్చింది. ప్రతిదానికీ హద్దురేఖలు గీస్తున్నాడు. వాసూ, గీతలతో పోలిస్తే నీలిమా, మాధవ్‍లు తమకి దగ్గిర. ఇప్పటికి ఇంకా స్వంతిల్లు లేకుండా వున్నారు వాళ్ళు. వాళ్ళపక్షం తీసుకుని, వసంత్‍ని కలుపుకుని పెద్దవాళ్లమధ్య ఆ యింటి విషయం గట్టిగా అడగచ్చు. చెల్లెలి అత్తగారుకూడా తమవైపే వుంది. కానీ ఇతను అడగడు. ఆ విషయంలో చాలా అసంతృప్తి వుంది మాధురికి.
“నేనిప్పుడు అటే వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తావా? విడిగా వస్తావా?” అడిగాడు వెళ్లడానికి వుద్యుక్తుడై.
“ఇప్పుడే వచ్చి చేసేదేముంది? అందులోనూ కర్మ జరిగేది మీ వదినగారి పుట్టింట్లో. బయటినుంచీ వచ్చిన కోడళ్ళం ఎవరికీ కంటికి ఆనం. ఆవిడ విశ్వరూపదర్శనం చూడ్డానికి రావాలి” అంది నిరసనగా.
“నీ యిష్టం” అనేసి వెళ్ళిపోయాడు. కొంతమంది దు:ఖాలు ఎవరూ తీర్చలేరు. గీతంటే పడదు. వాసు వదులుకుంటే వచ్చే ఆస్తులు కావాలి. మాధవ్‍ గీతని అభిమానించకూడదు. తనుమాత్రం ఈమె చెల్లెళ్ళని నెత్తిమీద పెట్టుకోవాలి. వాసు, గీత ఒకళ్లనొకళ్ళు ఇష్టపడి చేసుకున్నారంటే హేళన. మాధవ్, నీలిమల ప్రేమకథ మాత్రం అద్వితీయం. హిడింబి, భీముడు అందొకసారి వాసూగీతలని. చాచిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చిందతనికి. తమాయించుకున్నాడు.
“ఇంకోసారి వాళ్లని తక్కువచేసి మాట్లాడకు మాధురీ! నాకు నచ్చదు. మర్యాదకని వూరుకుంటున్నాను. నేనూ నోరు తెరవాల్సి వస్తుంది” అన్నాడు ఆరోజుని కటువుగా. అప్పుడు అంటుకున్న కటుత్వం అతన్ని వదలట్లేదు. అకారణమైన ఈ ద్వేషాలు, అసూయలు తమ వైవాహికబంధాన్ని ప్రభావితం చేసి, రసస్ఫూర్తిని కరిగిస్తున్నాయని అర్థం చేసుకోదు. అతను నిట్టూర్చాడు.
డబ్బు డ్రా చేసుకుని మహతిని వెతుక్కుంటూ వెళ్ళాడు. గీత, రవళి, మహతి, సుమతి ఇంకా కొంతమంది ఒక గదిలో కూర్చుని వున్నారు. వెళ్ళి మహతి పక్కని కూరున్నాడు. ఏడ్చేడ్చి అందరి ముఖాలూ ఎర్రగా వుబ్బి వున్నాయి.
“ఏమిటే, ఇది? వీళ్ళిద్దర్నీ ఓదార్చడం మానేసి ఇంకా ఏడిపిస్తున్నారా?” అని అడిగాడు. అతనికీ కళ్ళలో నీళ్ళు తిరిగితే కళ్ళద్దాలు తీసి తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు.
“ఈ డబ్బు వుంచవే” మహతి చేతిని తనచేతిలోకి తీసుకుని అందులో పెట్టాడు.
“ఏమిట్రా, ఇది? ఉంది డబ్బు” అంది చెయ్యి వెనక్కి తీసుకుని.
“లేదని ఇవ్వట్లేదు మహీ! లేకుండా ఎలా వుంటుంది? మనందర్లోకి ఎక్కువ బాధలు పడుతున్నది నువ్వు. నీ కష్టాన్నీ బాధనీ మేమెవ్వరం తుడిచెయ్యలేం. కొంచెం భారం పంచుకోనీ. భార్యలూ, భర్తలూ ఎవ్వరూ మనకి ఆత్మబంధువులు కారు, కాలేరు. చిన్నప్పట్నుంచీ కలిసిమెలిసి పెరిగినవాళ్ళం, మనకి మనమే” అన్నాడు నిర్వేదంగా. వచ్చేముందు జరిగిన వాదన అతన్ని చాలా బాధపెడుతోంది. అతని భుజమ్మీద తలవాల్చి ఏడ్చేసింది మహతి.
“రుణపడిపోతున్నానురా, మీ అందరికీ. ఎందుకురా, ఇంత ప్రేమ?” అంది ఏడుస్తునే.
“అంతంత పెద్దమాటలు వద్దు మహీ! చిన్నప్పట్నుంచీ కలిసి వున్నాం. ఇప్పుడూ అంతే” అని, “రవళీ! ధైర్యం తెచ్చుకోవాలమ్మా! మేమంతా లేమా?” అంటూ ఆమెనీ వోదార్చాడు.
డబ్బు నేరుగా నారాయణకో, రామారావుకో ఇవ్వచ్చు. వాళ్ళు పిల్లల దగ్గిర్నుంచీ తీసుకోరు. ఎవరికివాళ్ళే మహరాజులు. వాళ్ళతరంలో ప్రతీదీ పకడ్బందీగా ప్రణాళికతో చేసుకున్నారు. ప్రతిబాధ్యతకీ ఎంతో కొంత డబ్బు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరిధిలోనే వుండి బాధ్యతలని తీర్చుకున్నారు. తన చెల్లెలి పెళ్ళికి ఖర్చంతా తండ్రే పెట్టుకున్నాడు. తులసి పెళ్ళికి వాళ్ళింట్లోనూ అంతే. వసంత్‍కీ సమీరకీ ఒకేరోజు చేసారు. ఖర్చుల్ని మూడుకుటుంబాలవాళ్ళూ పంచుకున్నారు. అంతదాకా ఎందుకు? గీత పెళ్ళప్పుడు ఐదుగురు అక్కచెల్లెళ్ళూ ఇద్దరు తమ్ముళ్ళూ కలిసి కొంత డబ్బు అన్నగారికి సాయంగా ఇవ్వాలని నిర్ణయం చేసుకుని తన తల్లిని రాయబారం పంపారట.
“నేను పెళ్ళికూడా చెయ్యలేని స్థితిలో వున్నానని గీతకి అనిపించడం నాకిష్టం లేదు. అందరం పలచనౌతాం. నా తహతుకి తగ్గట్టు చేస్తాను. మీకు ఇవ్వాలనిపించిందేదో పిల్లకి ఇవ్వండి. దానికీ సంతోషంగా వుంటుంది” అన్నాడట మేనమామ. గీత పెళ్ళప్పటికి తామెవరికీ వుద్యోగాలూ సంపాదనలూ లేవు. ఆ తర్వాత వుద్యోగాలు వచ్చినా కలెక్టివ్‍గా చేసింది ఏమీ లేదు. రాణా భార్యకి ఆరోగ్యసమస్య వచ్చినప్పుడు గీత ప్రతిపాదన చేసింది.
“మన పదకొండుమందిమీ పెద్దవాళ్ళయ్యాం. మగపిల్లలు మీకందరికీ, నాకూ, రవళికీ వుద్యోగాలు వున్నాయి. మనందరం నిలబడి ఎంతోకొంత సాయం చేస్తే రాణా భార్యకి జరిగే వైద్యానికి ఇంకాస్త హెల్ప్‌గా వుంటుంది” అంది. సుమతికూడా యిచ్చింది. మహతి ఇవ్వలేకపోయింది. సెటలైట్స్ బేచి అంటే ప్రవల్లికా, కృష్ణావాళ్ళు నలుగురూ తమతో చేరారు. ఇప్పుడిప్పుడు క్రేడిల్స్ బేచిలో చిన్నమేనమామ పిల్లలు ఒకొక్కళ్ళుగా చేరుతున్నారు. ఈ ఇచ్చుకోవటాలు పెద్దవాళ్ళకి సంబంధం లేని, పిల్లల వ్యవహారంగా వుండిపోయింది.


ఈ కర్మరోజుల్లోనే సుధీర్ మహతికి రెండుమూడుసార్లు వీడియో కాల్ చేసాడు. వరస కష్టాలతో సతమతమౌతున్న ఆమెని ఎలా ఓదార్చాలో అతనికి తెలీలేదు. తనూ కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతప్ప ఇంకేం చెయ్యలేకపోయాడు. ఒకసారి కాల్ చేసినప్పుడు మయూఖ్ ఆమె దగ్గిరే వున్నాడు.
“ఎవరే, వీడు? ఒక్కక్షణంపాటు నాకు మన చిన్నతనం కళ్లముందు తిరిగిందనుకో. చిన్నవాడినైపోయానన్న భ్రమ కలిగింది” అన్నాడు సంభ్రమంతో తలమునకలౌతూ. ఫోటోలవీ ఎప్పుడేనా చూసినా పిల్లలందరిమధ్యా వీళ్ళూ వుండేవాళ్ళు. వాసు పోలిక ఒకడిదీ, యశోదపోలిక ఒకడిదీ అనుకోవడం వుండేది. ఇంత ప్రత్యేకంగా అతను వీళ్ళని చూడలేదు. చూపించి అతని దృష్టికి తెచ్చినవాళ్ళూ లేరు.
“వాసు కొడుకురా! పెద్దాడు. మయూఖ్” అంది మహతి వాడిని దగ్గరగా తీసుకుని. “సుధీర్ పెద్దనాన్న” వాడికి చెప్పింది.
“వాసా? వాడింకా ఎక్కడున్నాడు? ఎప్పుడో గీతమొగుడైపోతే? చెవులుపట్టుకుని ఆడిస్తోందని విన్నాం” అన్నాడు సుధీర్ పకపక నవ్వి.
అక్కడే వున్న సుమతీ, గీతాకూడా విన్నారు ఆ మాటల్ని.
“ఓయ్, ఒకానొక రమాదేవిగారిని చేసుకుని, అలవైకుంఠపురంలో ఆమూల సౌధంబున అన్నట్టు వెళ్ళి యూయస్‍లో కూర్చున్న రమాపతి ఎవరో?” చురుగ్గా అంది గీత కెమెరాలోకి తొంగిచూసి. ఒక్కక్షణంపాటు. అతని మనసులోని జ్ఞాపకాలు తుఫానులే రేపాయో, అగాథాలే తవ్వుకున్నాయో, కళ్లలోంచీ ప్రేమే వర్షించిందో, తనని తను ఓదార్చుకుంటున్న దయే జాలువారిందో, తీవ్రమైన భావసంచలనానికి గురయ్యాడు, అన్నేళ్ళ తర్వాత ఆమెని చూసి. అదే క్షణంలో మళ్ళీ సర్దుకున్నాడు.
“అప్పటికీ యిప్పటికీ మారలేదే, నువ్వు. ఒక్కమాటకూడా వంటిమీద వుంచుకోవేం?” అన్నాడు అలాగే నవ్వుతూ. ఈ నవ్వు వెలవెలబోయింది.
“అందరివంతూ నువ్వు మారిపోయావులే. ఇక్కడికి రావేంట్రా, నువ్వు? అత్తనీ, మామయ్యనీ ముంబై వురికిస్తావు?” అడిగింది గీత తనూ నవ్వుతూ. నోరారా నవ్వుతూ ఆ నవ్వుని ముఖంనిండుగా నింపుకునే ఆమెని చూస్తే పెరుగన్నం తిని, ముఖమంతా పులుముకున్న పసిపిల్లలా అనిపించింది.
“మర్యాద. మర్యాద. బావగారిని నేను” అన్నాడతను ఇంకా నవ్వుతునే.
“ఇక్కడికి రండి. అక్కగారికీ, బావగారికీ అన్ని మర్యాదలూ చేస్తాను” అంది. తల్లి కట్నం అడిగినందుకు అతను చిన్నతనం పడి, ఇక్కడికి తమమధ్యకి రావట్లేదనుకుంటోంది గీత. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆమె ఆలోచన. ఆమెగానీ, వాసుగానీ, మరొకళ్ళుగానీ అంతకన్నా లోతుగా ఆలోచించకుండా దాన్నొక చట్రంలా బిగించి వుంచారు సుమతీవాళ్ళు.
చాలాయేళ్లతర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం. రాసుకుంటే వుత్తరాలు రాసుకోవాలి. లేదా ఫోన్లు చేసుకోవాలి. ఆ రెండూ జరగలేదు వాళ్లమధ్య. సహజంగానే ఎందరిమధ్యో ఆగిపోయినట్టు మాటలూ పలకరింపులూ ఆగిపోయాయి. అనుబంధం మాత్రం చెక్కుచెదరలేదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే సుమతికి మనసులోంచీ పెద్దబరువు దిగిపోయినట్టైంది.
“ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడికి రండి సుధీర్. చాలాకాలమైంది మనమంతా కలుసుకుని. మన పెళ్ళిళ్ళయ్యే ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఆ గొడవలు వదిలిపెట్టకపోతే ఎలా? అత్త చాలా బాధపడుతోంది. నాక్కూడా గిల్టీగా వుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మిగిలినవాళ్లం అందరం కలుస్తున్నాం. నువ్వు లేని లోటు మా అందరికీ తెలుస్తుంది” అంది గీత మృదువుగా, నచ్చజెప్తున్నట్టు.
అతని మనసు మూగవోయింది. అవంతీపురం వెళ్ళి, అక్కడి వంటరితనాన్నీ, తోడుగా గీత లేనితనాన్నీ, గీత పరాయితనాన్నీ అనుభవించగలడా? రమని పక్కనపెట్టుకుని? ఇన్నేళ్ళ తర్వాతకూడా ఆ ప్రేమలోని చెమ్మ ఆరలేదు. రమతో గడిపే జీవితానికి ఒక సమాంతరరేఖలా లోలోపల సుళ్ళు తిరిగే దు:ఖం తనని వదిలిపెట్టటం లేదు. ఇంకా చాలా సంయమనం సాధించాలి తను.
“వస్తాన్లే గీతూ! ఎప్పుడూ ఏదో బిజీ. ఈసారి తప్పకుండా వస్తాం” అని, “వాసు వున్నాడా?” అడిగాడు మాట మార్చి.
“లేడు, బయటికి వెళ్ళాడు” అంది.
“రేపు మళ్ళీ ఈ టైముకే చేస్తాను. వాడిని వుండమనేం?” అన్నాడు.
ఆమె తలూపింది. మళ్ళీ మహతితోనూ, రవళితోనూ మాట్లాడి పెట్టేసాడు. సుమతి విహంగ్‍ని దగ్గిరకి పిలుచుకుని వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. వాడు సిగ్గుపడిపోయి, తుడిచేసుకుంటే నవ్వి, “మీ అమ్మకి ఇచ్చి రా!” అంది. వాడు బుద్ధిగా తల్లి బుగ్గకి తన బుగ్గ ఆనించాడు. గీత చురచుర చూసింది. “అక్కర్లేదని చెప్పు” అంది కొడుకుతో.
“నేనే పెట్టుకుందును. ఎక్కడా చోటుకనిపించట్లేదు. వాసు ప్రేమలూ, పిల్లల ముద్దులూ ” అర్థోక్తిగా ఆగింది సుమతి అదే నవ్వుతో. గీత దగ్గిరకి జరిగి ఆమె చెవిలో పూర్తిచేసింది. గీత ముఖం ఎర్రబడింది.
“చచ్చేకాలానికి సారెకావిళ్ళని దీన్నే అంటారు. ఇన్నేళ్ళూ మాట్లాడకుండా నోటికి తాళం పెట్టుకుని, ఇప్పుడేమిటి కొత్తగా?”అంది.
“ఎప్పుడో ఒకప్పుడు. అసలంటూ ఇవ్వలికదా? ఐనా ముప్పయ్యేళ్ళదానివి, ముసలికబుర్లు చెప్తావేమే?” సుమతి నవ్వింది.
సుమంత్, భార్యా వచ్చారు. అతనికి ఒక కొడుకు. “వాడేడి?” అని పిల్లాడిగురించి అడిగింది.
“ప్లేస్కూలుకి వెళ్ళాడు. కాంపౌండర్‍కి చెప్పాను. స్కూలయ్యాక తీసుకొచ్చి వదులుతాడు” అంది. సుమతిని పలకరించి, వెళ్ళి మహతీ రవళిల దగ్గర కూర్చుంది. కలుసుకున్నది తక్కువే ఐనా, గీతతో ఆమెకి మంచిస్నేహం వుంది. చీరలు, నగలు, ఆస్తులు, వుద్యోగాలు, ఇవేవీ కాకుండా- ఎవరిమీదా ఒక చిన్న కంప్లెయింటేనా చెయ్యకుండా ఇంట్లోవాళ్ళు, మయూఖ్ స్కూల్లో పిల్లలు, ఆఫీసులో కొలీగ్స్ ఇలా గంటలసేపు కేవలం మనుషులగురించే మాట్లాడగలదు గీత. ఆ కబుర్లు చాలా యిష్టం లతకి. అంత ఆసక్తితోనూ వింటుంది గీత ఆమె చెప్పేవి.
“పెద్దగా ప్రపంచజ్ఞానం లేదు గీతకి. ఇల్లు, వుద్యోగం, ఇన్ని కార్యక్రమాలు, ఎలా నెట్టుకొస్తోందో” అని సుమంత్‍తో ఒకసారి అంటే,
“అవంతీపురం మహాజ్ఞాని అది. తనకి ప్రపంచజ్ఞానంలాంటి పెద్దవిషయాలు అర్థంకావు” అన్నాడు సుమంత్ నవ్వేసి. ఆమెతో వీళ్ళకి ఏవో చిన్నపాటిగొడవలు వున్నాయని తెలుసు లతకి. ఎప్పుడూ సుమంత్‍ని అడగలేదు. అతనూ చెప్పలేదు.
పదోరోజుకి అందరూ చేరారు. మాధవ్, నీలిమకూడా వచ్చారు. నీలిమ, మాధురి అంటుకు తిరిగారు. తులసి, సమీర, ప్రవల్లిక వస్తే వాళ్ళకి సమవయస్కురాలైన మానస అటు కలిసింది. వీణ శేఖర్ కూతురు. ఈ ఆడపిల్లలు నలుగురికీ గీత, వాసు పెద్ద ఆకర్షణ. వాళ్లతో కలిసి గీత చుట్టూ తిరిగింది మానస. మొదట కొంత అయిష్టంగా. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటూ.
“ఇదేమిటే, ఆవిడ తోకపట్టుకుని తిరుగుతోంది?” అనుకున్నారు, ఆమె అక్కచెల్లెళ్ళు.
అక్కడ లేనిదల్లా సుధీర్, గీత తమ్ముడు కృష్ణ. మగపిల్లాడని, అందునా అన్నకొడుకని చాలా గారం చేసేది నిర్మల అతన్ని. మహతికీ అతనికీ వయోబేధం కాస్త ఎక్కువ. రవళితో బాగా ఆడేవాడు. ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. “రావాలనే వుంది రవళీ! ప్రాజెక్టు పీక్‍లో వుంది. రాలేకపోతున్నాను. ఏడుపొచ్చేస్తోందే” అన్నాడు దాదాపు ఏడ్చేస్తూ. రవళి ఏడ్చేసింది.
“ఏమిటే, ఇద్దరూను? ” పెద్దవాళ్ళు కోప్పడ్డారు.
ప్రేమలు, కోపాలు, మమకారాలు, గెలుపులు, ఓటములు ఇంకా ఎన్నో స్వీకరించిన, తిరస్కరించిన, జీర్ణించుకున్న, జీర్ణించుకోలేక అణిచిపెట్టుకున్న భావాలని దట్టించి కూరిన బాంబులాంటిది కుటుంబం. అందులో వుండేవన్నీ స్థిరంగానే వున్నా చలనశీలంగా వుండే ఒకానొక వ్యక్తో సంఘటనో ప్రభావం చూపించి దాన్ని పేల్చుతారు. ఐతే ఈ బాంబు ఎంత గట్టిగా పేలినా మళ్ళీ దాన్నది సరిచేసుకుని ఇంకో ప్రయోగానికి తయారౌతుంది.
గీత, సుధీర్ మామూలుగా మాట్లాడుకున్నారన్న విషయం అందరికీ తెలిసింది. అందరితోపాటు గురుమూర్తికికూడా. ఎక్కడో అహానికి చిన్నదెబ్బ. ఆ బాధ కొద్దిసేపే. దాన్ని మరిపిస్తూ కొడుకుమీది మమకారం. తమవైపునించీ జరిగిందికూడా పొరపాటే. వాడి మనసు తెలుసుకోకుండా ప్రవర్తించారు. పెద్దకొడుకు. మొదటిసారి తనకి తండ్రి అనే భావనని పరిచయం చేసినవాడు. ప్రపంచాన్ని జయించినంత సంతోషాన్ని ఇచ్చినవాడు, పుట్టీ, పెరిగీ, ఒక్కొక్క అడుగూ ముందుకేసి. ప్రతివాళ్ళకీ రాజ్యాలూ, ధనరాశులూ వుండవు. కుటుంబమే మహాసామ్రాజ్యం. అక్కడ పొందే విజయాలే, ప్రపంచాన్ని గెలిచినంత. ఎంత ప్రేమించారు వాడిని! మిగిలినవాళ్లమీద ప్రేమలేదని కాదు, తొలి అనుభవం తర్వాతిదానికి కొంత సాంద్రత తగ్గుతుంది. మరో రూపంలో సంతోషం అందుతుంది. ఇన్నేళ్ళు గడిచినా ఎందుకీ కోపం వాడికి? ఎవరిదారిన వాళ్ళు సుఖంగానే వున్నారుకదా, ఇంకా ఎందుకీ కోపం? గీతతో ఏం మాట్లాడాడు? ఇదేం చెప్పింది? ఎన్నో ప్రశ్నలు. గీత చెప్తే పెళ్ళి చేసుకున్నాడు. మళ్ళీ యిప్పుడది అందికాబట్టి ఇక్కడికి వస్తాడేమో! సంతోషం, దు:ఖం కలగలిపినట్టు కలిగాయి.
ఒకొక్కరోజూ గడుస్తుంటే నిర్మల ఇక లేదన్న నిజం అందరికీ అర్థమౌతోంది. దు:ఖం నెమ్మదిగా పలచబడి గుండెలోతుల్లోకి సర్దుకుంటోంది. ఒక మనిషి చనిపోగానే ఇంతమంది ఒకచోట కలుసుకునేది, దు:ఖాన్ని పంచుకుని, గుండె భారాన్ని తగ్గించుకునేందుకు. ఆ వ్యక్తి నిష్క్రమణాన్ని వప్పుకునేందుకు. జీవితం ఇకమీద ఆ వ్యక్తి వున్నప్పట్లా వుండదు. నిర్మలా అని పిలవబోయే గొంతు నిజం గుర్తొచ్చి ఆగిపోతుంది. వాళ్ళు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములకి కట్టే రాఖీలు ఐదే వుంటాయి. మంగళహారతి పట్టే చేతుల్లో ఒకటి తగ్గుతుంది. ఇంకా ఎన్నోచోట్ల ఆమె లేని లోటు దాన్నది నెమ్మదిగా పూడ్చుకుంటు వెళ్తుంది. ఎక్కడెక్కడి జీవశక్తినో తెచ్చుకుని ఆ దుఖాన్ని దాటేందుకు వాడుకుంటుంది.
కర్మంతా అయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు మహతీ, నారాయణా.
“ఇక్కడే వుండిపోవచ్చుకదా, మహీ! ఆ డీటీపీ సెంటరేదో ఇక్కడే నడిపించుకోండి” అన్నాడు రామారావు.
“వెళ్ళిపోతాం మామయ్యా! ఇక్కడ వుండను” ఆమెది ఒకటే మాట. ఇక్కడ వుండిపోవాలనే వ్యామోహం ఆమెకి కొంచెంకూడా లేదు. దానికి తగ్గట్టు కర్మకి వచ్చినవాళ్ళలో ఒకావిడ అన్నమాటలు చాలా కలవరపెట్టాయి. ఎవరి గురించైతే వినకూడదనుకుని అంతదూరాన్న వుండిపోయిందో, ఆ వ్యక్తి గురించి చెప్పింది ఆమె.
“నువ్విలా వదిలేసి వెళ్ళిపోయావా, మీ ఆయన ఎవర్నో వెంటేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆవిడ్నే చేసుకున్నాడు. ఏడాది తిరక్కుండా పిల్లాడు పుట్టాడు. మీ అత్తమామలకీ, ఆడబడుచుకీ సంతోషానికి అవధుల్లేవనుకో” అంది పనిగట్టుకుని మహతి ఒక్కర్తే వున్నప్పుడు దగ్గిర కూర్చుని. అదంతా మహతికి ఎందుకు చెప్పిందో, మహతికిగానీ తనకిగానీ దాంతో ప్రయోజనమేమిటో ఆమెకి తెలీదు. తనకి తెలిసిన విషయాలని వుత్కంఠ ఆపుకోలేక చెప్పింది. అంతే.
ఎంత వుండమన్నా వుండలేదు మహతి. ఆమెని ఆపే శక్తి ఎవరికీ లేకపోయింది. ఉన్నదంతా డీటీపీ సెంటరుమీద పెట్టేసాక దాన్ని వదిలి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రయత్నం చెయ్యటం నారాయణకీ యిష్టం లేకపోయింది. కష్టమో, సుఖమో, కూతురితోనే, అక్కడే అని నిర్ణయించుకున్నాడు.
ఆ తర్వాత?
రోజులు సంవత్సరాలై ముందుకి సాగాయి. కొన్ని పరిచయాలు, ఇంకొన్ని ప్రతిపాదనలు, వేటికీ ప్రలోభపడనితనం, మేఘన. నెమ్మదిగా విస్తరిస్తున్న ఆ పిల్ల వునికి, పెరుగుతున్న ఖర్చులు, కష్టపడి పనిచెయ్యటం, సంపాదించుకోవడం. జీవితం ఒక గాడిలో పడింది మహతికి. రామ్మోహన్ మళ్ళీ కనిపించలేదు. కానీ అనుకునో అనుకోకుండానో అతను చేసిన మేలు గంధపుసువాసనలా ఆమెని అంటిపెట్టుకునే వుంది. చాలామంది రచయితలకి ఆమె పనితనాన్నిగురించి తెలిసింది. తప్పుల్లేకుండా డీటీపీ చేసి, అనుకున్న టైముకి ఇవ్వటాన్ని గురించి అతను ఇద్దరుముగ్గురు సహరచయితలతో అన్నమాటలు ఆమెకి చాలా వుపయోగపడ్డాయి.


రెండు దశాబ్దాలకిపైగా అనుభవించిన జీవితంలోని వంటరితనాన్నీ, దు:ఖాన్నీ ఒక్కరాత్రిలో మళ్ళీ రుచి చూసింది మహతి. ఇలాంటి రాత్రులనే కాళరాత్రులంటారు. పక్క బెడ్‍మీద నరేంద్ర. చేతికి సెలైన్‍తో వంటినిండా కట్లతో. గంటకోమాటు నర్స్ రావడం, అతనికి మందులు వేసి, టెంపరేచరు చూసుకుని వెళ్ళడం తెలుస్తోంది. తన బెడ్‍మీద మఠం వేసుకుని కూర్చుంది.
బెడ్‍లాంప్ వెలుతుర్లో అతను మగతగా పడి వున్న దృశ్యం గుండెని చిక్కబట్టింది. ఎంతకాలం పడుతుందో కోలుకోవడానికి? అప్పటిదాకా ఎవరు చూసుకుంటారు? ఇతన్నే కాదు, అటూ ఇటూ కాని వయసులో వున్న యితని పిల్లల్ని కూడా. మేఘన ఆ బాధ్యత ఎత్తుకుంటుందా? సుధీర్ కొడుకుతో దీని పెళ్ళి? నెమ్మదిగా బెడ్ దిగి అతని దగ్గిరకి వెళ్ళింది. ఎంత అణచుకున్నా వ్యామోహం ఆగలేదు. జుత్తు పలచబడి, కాస్త వృద్ధాప్యపు ఛాయలు తొంగిచూస్తున్న అతని ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూసి, నెమ్మదిగా వంగి అతని నుదుటిమీది వెంట్రుకలని సరిచేసి పెదవులు ఆనించింది. కళ్ళలోంచీ నీళ్ళు టపటప జారిపడ్డాయి. చప్పుని సర్దుకుని నిలబడబోతుంటే అతని చెయ్యి ఆమె తలమీద పడింది. యాదృచ్ఛికం కావచ్చు. ఆ చేతిని అతని ఛాతీమీదే వుంచి దూరం జరిగింది.
వెళ్ళి తన బెడ్‍మీద పడుక్కుంది. ఎప్పటికో నిద్రపట్టింది. వాసు మాటలు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. వాసు,వేణు కనిపించారు. ఇందిర, హరి తండ్రి మంచందగ్గిర వున్నారు. అతనికి స్పృహ వచ్చినట్టుంది. వాళ్ళతో చిన్నగా ఏవో చెప్తున్నాడు. మేఘన కాస్త దూరంగా నిలబడి వుంది. ఆమెకి తండ్రితో వాళ్ళంత చనువు లేదు. మహతి కూతురికేసి చూసింది. ఆ పిల్ల తల్లి చూపుల్ని తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. ఇంత పలుచటి బంధంకోసమా, కూతురు తపించిపోయేది? నాన్న నాన్నని కలవరించేది? అతను కనిపించగానే అతనే ప్రపంచం అన్నట్టు అతన్తో వెళ్ళిపోయేది? అతనికే ఇంత దూరమైతే, అతనింట్లో ఎలా చూసేవారో ఈ పిల్లని? మనసు చివుక్కుమనిపించింది.
“అమ్మకి బ్రష్, పేస్టూ ఇవ్వవే! “అన్నాడు వాసు పరిస్థితిని అర్థం చేసుకుని. అతని గొంతు అక్కడ వున్న అందర్లో చలనాన్ని తెచ్చింది. మహతి వాష్‍రూమ్‍కి వెళ్ళింది.
“మీకిప్పుడెలా వుంది?” అని నరేంద్రని అడిగి, “రెస్టు తీసుకోండి” అని చెప్పి,
“ఇందిరా! నీకేదో ఎగ్జామ్ వుందన్నావు, వెళదాం వస్తావా?” అడిగాడు వాసు. ఆ పిల్ల తండ్రిని వదిలి ఇవతలికి వచ్చింది.
“ఎవరెవరు వెళ్తున్నారు మామయ్యా?” అడిగింది మేఘన.
“అమ్మా, నేనూ, ఆ అమ్మాయిని స్కూలుదగ్గిర దింపి, ఇంటికి వెళ్తాం. నువ్వూ, హరీ స్కూలుకి వెళ్ళి తనని తీసుకుని ఇంటికి రండి. వేణుమామ బట్టలవీ తెచ్చుకున్నాడు. డిశ్చార్జయేదాకా ఇక్కడే వుంటాడు. మీరు మధ్యలో వచ్చి చూసి వెళ్తుందురుగాని” అన్నాడు. ఆమెకి స్వల్పంగా అసంతృప్తి కలిగిందిగానీ, బైటపడలేదు. తలూపి వూరుకుంది.
మహతి రాగానే ముగ్గురూ బయల్దేరారు. వాళ్ళు వెళ్తుంటే నరేంద్ర దృష్టి ముందు వాసుమీద పడి, నెమ్మదిగా మహతిమీదికి మళ్ళింది. కలలోనో, మగతలోనో నుదుటిని తాకినట్టనిపించిన ఆమె స్పర్శ, జారిపడ్డట్టనిపించిన కన్నీటి చుక్కలు గుర్తొచ్చాయి.
తను మహతితో కొంచెం గౌరవంగా ప్రవర్తించవలసినది. భయాలు తగ్గి, తనంతట తను దగ్గరయేదాకా ఇంకొన్నాళ్ళు వేచి వుండాల్సింది. తప్పు చేసాడు. పెళ్ళి అనేది మనిషికి ఒకేఒక్కసారి గొప్ప అవకాశమౌతుంది. ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆమెని వదిలిపెట్టి తనేం సుఖపడలేదు. ఆఫీసులో పార్ట్‌టైమ్‍గా పనిచేసే విజయతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెని వెంటేసుకుని బైక్‍మీద తిరుగుతూ ఈ వాసూవాళ్ళకి కనిపించాడు. మొదటిసారి ఎదురుపడ్డప్పుడు తనకి కొంచెం బిడియంగా అనిపించిందిగానీ పంతానికి పదేపదే అదేపని చేసాడు. ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. మేఘన విషయంలో తనకీ మహతికీ పంతం పెరిగి విడాకులు ఆలస్యమైంది. విడాకులు వచ్చేసరికి విజయ ప్రెగ్నెంటు.
“పెళ్ళికాకుండా పరాయి మగాడితో పబ్లిగ్గా తిరిగినదాంతో పెళ్ళేమిటి? ఇంకో మంచి సంబంధం చూస్తాం. దాన్ని వదిలించుకో” అని తల్లీ, తండ్రీ పెళ్ళికి వప్పుకోలేదు. గుళ్ళో చేసుకున్నాడు. కొన్నాళ్ళు తల్లిదండ్రుల కోపాలు సాగాయి. హరి పుట్టాక కలుపుకున్నారు. వాళ్ళు అన్నారని కాదుగానీ, తనకే అనిపించేది అప్పుడప్పుడు తనేదైనా మోసపోయాడేమోనని. మనుషులు పాటించే నైతికవిలువల మౌలికతలో తేడాలున్నప్పుడు అలా ఆలోచించడం సహజమేమో!
మహతి సున్నితం, సంస్కారం విజయలో ఎక్కడా కనిపించేవి కాదు. అంత చదువుకుని, పెద్దకుటుంబంలోంచీ వచ్చిన మహతి ఎందుకు ఇంట్లోంచీ వెళ్ళిపోయిందనేది ఆమె సందేహం. తామిద్దరూ ఎవరికివారే ఏవో అనుమానాలతో భయాలతో సతమతమయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో లభించిన శృంగారం ఏమీ గొప్ప అనుభవంలా అనిపించేదికాదు. పోగొట్టుకున్నదానిముందు అల్పమైనదిగా తోచేది. మేఘననికూడా కుటుంబంలో కలవనివ్వలేదు విజయ. ఇప్పుడు ఆమెకూడా లేదు. కళ్ళుమూసుకున్నాడు.
తల్లీవాళ్ళూ వెళ్ళాక అప్పుడు దగ్గిరకొచ్చి అడిగింది మేఘన.
“ఎలా వుంది నాన్నా, మీకిప్పుడు? నిన్నటిమీద తేలిగ్గా లేదూ? తగ్గుతుంది. కంగారుపడకండి. మేమందరం వున్నాం” అంది.
అతను కళ్ళు తెరిచాడు. రూపంలో పూర్తిగా తన పోలిక పిల్ల. చామనచాయలో దృఢంగా, ధైర్యం చెప్తూ, ఆత్మవిశ్వాసంతో మిసమిసలాడుతూ.
“థేంక్సమ్మా!” అన్నాడు. కళ్ళలో నీళ్ళు నిండాయి.
“అయ్యో! నాకు థేంక్స్ దేనికి? వదిలేస్తానా, అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని?” అంటుంటే డాక్టరు రౌండ్స్‌కి వచ్చాడు.
“మీరు మాకేమౌతారు?” కార్లో కూర్చున్నాక అడిగింది ఇందిర.
“ఏమీ కాము” మహతి జవాబు.
“అలా కాదు. మేఘన నాకు అక్క. మీకు కూతురు. తను మా నాన్నని నాన్నని పిలుస్తుంది. అంటే మీరు?” ఏదో అర్థమై ఆ అమ్మాయి ముక్కూ, ముఖం ఎర్రబడ్డాయి. మహతికి ఏం జవాబు చెప్పాలో అర్థమవ్వలేదు. చాలా ఇబ్బందిగా, చికాగ్గా అనిపించింది.
“ఇవాళ ఏం పరీక్ష?” వాసు అడిగాడు ఆ పిల్లని.
“లెక్కలు” ఎందుకు అడిగాడోనని చెప్పింది.
“మా చిన్నప్పుడు మేమైతే లెక్కల పరీక్షకి ఏవో ఫార్ములాలూ అవీ నేర్చుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు యింటివిషయాలన్నీ అడుగుతున్నారా?” అడిగాడు సరదాగా. అతని ప్రశ్నకి మహతి చిన్నగా నవ్వితే ఇందిర మూతి బిగించుకుంది.
“మీ నాన్నకి తగ్గాక ఇవన్నీ అడగచ్చుగానీ, ఎగ్జామ్ బాగా రాయి. బెస్టాఫ్ లక్” అన్నాడు.


(అమృత వర్తమానం – 29వ భాగం తర్వాత)
గడుస్తున్న ప్రతి ఒక్కరోజుకీ ప్రాధాన్యత వుంది. అమృత యింటి లెక్కలు ఒక దారికి వచ్చాయి. విశాలా, వెంకట్రావులు ఎన్నోదారుల్లోంచీ డబ్బు పుట్టించారు. కోటికి పైగా విలువ చేసే యిల్లు కుదువపెట్టి యాభైలక్షలు తెచ్చారు. ప్రోనోట్లమీద తీసుకున్న లక్షారెండులక్షల అప్పులు కొన్ని. ఎక్కువ వడ్డీ యిస్తామని చెప్పి పోగుచేసినది పాతికలక్షలదాకా వుంటుంది. ఇవికాక చిట్టీల డబ్బులు, ఇచ్చినవి, ఇవ్వాల్సినవి, వచ్చినవి, రావల్సినవి, అన్నీ కలిపి నాలుగుకోట్లకి తేలగా అందులోంచీ ఒక కోటిపైగా లెక్కకి దొరక్కుండా వుంది.
కంప్లెయింటులోనూ, పోలీసు ఎంక్వైరీలోనూ వీళ్ళు డబ్బు ఇవ్వాల్సినవాళ్ళు దాదాపు రెండువందలమంది తేలారు.
లక్షరూపాయల చీటీ ఇరవైనెలలకి ఇరవైమంది సభ్యులతో మొదలుపెడితే చివరికి వచ్చేసరికి అందులో నలభైలక్షలు చేతులు మారుతుంది. అది పదినెలలు నడిచిందంటే పదిమంది పాడి తీసుకుని వుంటారు. ఇరవైలక్షలు చేతులు మారి వుంటుంది. అప్పటికి వాళ్ళు కట్టేది ఐదులక్షలే. తమవంతుకోసం ఎదురుచూసేవాళ్ళు మరోపదిమంది మిగిలిన ఐదూ కడతారు. ముందే పాడి తీసుకున్నవాళ్ళు బాగానే వున్నారుగానీ, మిగిలినవాళ్ళ డబ్బు ఇక్కడ యిరుక్కుపోయింది. ఒక నలుగురు పాట పాడినా డబ్బు చేతికి రానివాళ్ళు. మొదటే పాడి తీసుకున్నవాళ్ళ దగ్గిర విశాలావాళ్ళ డబ్బు ఇరుక్కుని వుంది. తిరిగి యిమ్మంటే లేకేకదా, మేం తీసుకున్నది, ఇప్పటికిప్పుడు ఎక్కడినుంచీ తేవాలని నిలదీస్తున్నారు. ఇదికాక చిట్టీలు నడిపేవాళ్ళు పూర్తి చిట్టీ మొత్తాన్ని అదో ప్రెవిలిజ్‍గా మొదటినెలే తీసుకుంటారు. ఆ డబ్బు ఏమైంది? చాలా చీటీలు నడిపించారు విశాలా – వెంట్రావులు. ఈ వ్యాపారానికి అనుసంధానించుకుని ఇంకా అనేక లావాదేవీలు వున్నాయి. చీటీల్లో వచ్చింది వడ్డీకి తిప్పడం, డబ్బంతా ఏదో పథకంప్రకారం ఎక్కడికో నడిపించారనేది సుస్పష్టమైంది.
బేంకు అకౌంట్లలో వెతగ్గా అదీ దొరికింది. ఒక డీమేట్ అకౌంటు లింకై వుంది. ఈక్విటీల్లో అడ్డదిడ్డంగా పెట్టుబడులు పెట్టారు. ఒక్క కోటికాదు, ఇంకా ఎక్కువే.
పెన్షను బెనిఫిట్స్‌కోసం వెంకట్రావు ఆఫీసుకి వెళ్తే అక్కడా చుక్కెదురైంది శ్యామ్మోహన్‍కి. ఆఫీసుడబ్బు వాడి సస్పెండయాడట వెంకట్రావు. పోలీసుకేసుకూడా పెట్టారు. భార్యాభర్తలు అంత అత్యవసరంగా ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందో ఇప్పుడర్థమైంది శ్యామ్మోహన్‍కి. వెంకట్రావు చనిపోయాడు. చార్జెస్ డ్రాప్ చేసి, పెన్షన్ కేసు మొదలుపెట్టాలి. అతను వాడుకున్న డబ్బంతా పట్టుకుని మిగతాది ఇస్తారు. గ్రాట్యుటీ, పీయఫ్, లీవు ఎన్‍కాష్‍మెంటు, గ్రూపు ఇన్షూరెన్సులాంటివి వుంటాయి. ఆమృతకి ఫామిలీ పెన్షను రాదు. వచ్చేవికూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఐనా అమృత ఆల్టర్నేట్ నామినీగా కాగితాలు పెట్టించాడు శ్యామ్మోహన్.
స్వంత యిల్లు, కాస్త భూమి, గవర్నమెంటు వుద్యోగం వుండి అన్నీ అమరివున్న జీవితాన్ని ఎలా చిందరవందర చేసుకున్నారో నెమ్మదినెమ్మదిగా వ్యక్తమైంది. అమృతని బైటపడేసే దారులు మూసుకుపోవడంకూడా. పోలీస్ ఇన్‍స్పెక్టర్ని మేనేజి చేసి అమృతని దూరంగాఎక్కడికో పంపిచెయ్యడం తప్ప మరో మార్గం లేదనిపించింది. మాధవరావు తొందరపడ్డాడా, ఈ విషయంలో తలదూర్చి? వదిలేస్తే అమృత పరిస్థితి? ఈపాటికి తనూ చచ్చిపోయి వుండేది. అమాయకపు పిల్ల. అలాంటిపిల్ల విశాలకి ఎలా పుట్టిందో! పరిస్థితి ఎటూ అర్థమవలేదు. మాధవరావుదీ అదే అయోమయ పరిస్థితి.
“ఏం వుందో, ఎంత చేతికొస్తుందో తొందరగా చూసేసుకుంటే ముందు టెన్షన్ తగ్గుతుందిరా” అన్నాడు.
“ఎన్ని లెక్కలు వేసినా అంతడబ్బు సమకూరడం అసాధ్యం. అప్పులవాళ్ళు వదిలిపెట్టడంలేదు. కోర్టులూ కేసులూ అని బెదిరించే సందర్భం కాదిది. ఇల్లు తణఖా పట్టినవాడు యాభైకే దాన్ని కొట్టేద్దామని ముఖం చాటేస్తున్నాడు. ఇందులో కనిపిస్తున్నది ఆడపిల్ల. ఆ ఇన్‍స్పెక్టరు కేసుపెట్టకుండా వదిలేలా లేడు. ఆ పిల్లని ఏం చేద్దాం?” అడిగాడు శ్యామ్మోహన్.
“ఇంకా కోర్టులో చార్జిషీటు వెయ్యలేదు. ఏం చేసినా ఈలోపల జరగాలి” సాలోచనగా అన్నాడు మధవరావు.
“విజయ్ ఆలోచన?” శ్యామ్మోహన్ ప్రశ్న.
“ఇంకా మేమే ఏదీ అనుకోలేదు. నీదాకా ఎలా వచ్చింది? వాడు చెప్పాడా” ఆశ్చర్యంగా అడిగాడు మాధవరావు. కొడుకు చొరవపట్ల అతనికి కోపంకూడా వచ్చింది.
“ప్రసూన చెప్పింది. అమృత విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పింది. ఈమధ్యని త్రిమూర్తులు తాతయ్యని చూడ్డానికి వాసు, రామారావుగారు వచ్చారటకదా, అప్పుడు వాళ్లతో వీడేదో అన్నాడట.
ఆ పిల్లకోసం డబ్బంతా తగలేస్తాడేమో, శ్యామ్ పెద్దనాన్నా! లేనింటి పిల్లల్నే మనం కోడళ్ళుగా తెచ్చుకుంటున్నాం. నిజమే! కానీ ఈ అమృత పరిస్థితి వేరు. డబ్బులేకపోవడంతోపాటు నిండా అపఖ్యాతితో వుంది. అలాంటి పిల్లకి మానవధర్మంగా సాయం చెయ్యడం వేరు, వాళ్ళ బురదంతా మనం నెత్తికి పులుముకోవడం వేరు- అని నాతో చాలా కోపంగా మాట్లాడింది.
తన మాటా నిజమే” అన్నాడు శ్యామ్మోహన్.
“ఊళ్ళో పొలం మాటేం చేసావు?” అడిగాడు మాధవరావు.
“వెంకట్రావు నాన్న నెలక్రితం చనిపోయాడు. పోయేముందు వాడి అన్నలిద్దరూ ఆయనచేత వేలిముద్రలు వేయించేసుకుని పొలం తమ పేరుమీదకీ మార్చుకున్నారు”
“అదేంటి?”
“అందులో ఒకాయన కొడుకు అమెరికాలో వున్నాడు. అతనక్కడ ఇల్లు కట్టాడు. డబ్బు కావాలని తండ్రికి ఇండెంటు పెడితే ఈయన పొలం బేరానికి పెట్టాడు. ఎలాంటి అవసరం లేకపోయినా రెండోఆయనకూడా అమ్ముతున్నాడు. కాస్త ప్రోబ్ చేస్తే తెలిసింది, వాళ్ళు అమ్ముతున్నది పిత్రార్జితమని. వెంకట్రావుకి అందులో వాటా వుంటుంది. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. తొందరతొందరగా అమ్మేసి డబ్బుచేసుకుందామని చూస్తున్నారు. వాళ్లది ఆరెకరాలు పిత్రార్జితం, నాలుగెకరాలు తండ్రి స్వార్జితం. ఈ ఆరెకరాలూ అమ్మడానికి లేదు, ఎంత వేలిముద్రలు వేయించుకున్నాకూడా”
“ఇంత అన్యాయమా?” మాధవరావుకి కోపం వచ్చింది. ఇప్పటిదాకా అమృత ఎలా వుందోకూడా వాళ్ళు తెలుసుకోలేదు. తమ్ముడి అంత్యక్రియలకికూడా రాలేదు. పట్టనట్టు వదిలేసారు పిల్లని.
“డబ్బుముందు ఏవీ వుండవు. మానవత్వం, మన్నూ మశానం అని ఇందులోకి దిగావుచూడు, దానికి జవాబు చెప్పుకోవాలి “
“కాదురా! ఆడపిల్లని చూసిచూసి వదిలెయ్యలేకపోయాను. ఇప్పుడా పొలంవిషయంలో ఏమీ చెయ్యలేమా? ఎంతుంటుంది, దాని విలువ?”
“సిటీకి దగ్గర్లో కాబట్టి ఎకరం కోటేనా చేస్తుంది. అంటే రెండెకరాలూ రెండుకోట్లు. బేరాలు నడుస్తున్నాయి. బేరం ఖరారయ్యాక ఫోన్ చేసి చెప్పమని అక్కడి సర్పంచికి చెప్పి వచ్చాను. ఆయన వీళ్ళకి ఎగనెస్ట్ పార్టీ. ఐనా నా జగ్రత్తలో నేనున్నాననుకో. డబ్బులు చేతులుమారే టైముకి వెళ్ళి అడ్డంపడటమే”
“చెక్కులైతే?”
“అంతా బ్లాకే. ఎకరంపాతికలక్షలుంటే రెండుకో, మూడుకో రాయించుకుంటున్నారు”
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“గవర్నమెంటు వుద్యోగం, మూడుకోట్ల ఆస్థి వుండి ఈ గతి పట్టించుకున్నారేమిట్రా?”
“ప్రతివాడికీ శక్తిని మించిన ఆశ పట్టుకుంది. సంపద సృష్టించడం అనే మంత్రం జపిస్తున్నారు. మరోవైపు అంతంత ఆస్తులు లేకపోతే రేపు బతకలేమేమోనన్న భయంతో వణికిపోతున్నారు. మూడుకోట్లున్నవాడు ముప్పైకోట్లుండాలనుకుంటున్నాడు. అరేయ్, మాధవా! నెలకి కోటి ఆదాయం వున్నా, మొత్తం కుటుంబానికి తిండిమీద ఖర్చుపెట్టేది పాతికవేలమించి వుండదు. అందరూ తినే తిండి తినకపోవడం, అందరికీ అందుబాట్లో వున్న కారు వద్దనుకోవడం, పక్కింట్లోవాళ్ళ ఫంక్షనుకికూడా కొత్తపట్టుచీర కొనుక్కోవడం, అన్న యింట్లో ఫంక్షనుకి కొత్తనగ కొనుక్కోవడం. ఎన్నిరకాల పిచ్చో! పుట్టినరోజులు, ఆడపిల్లలకి చీర, మగపిల్లాడికి ధోవతి కట్టించడం, వీటన్నిటికీ ఆర్భాటాలు, లక్షలు తగలెయ్యటాలు, ఆ లక్షలకోసం పగలు రాత్రీ తేడా తెలీకుండా వుద్యోగాలకి అంటుకుపోవడం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. అవంతీపురం బళ్ళో చదువుకున్నాం అందరం. ఆడుతూ పాడుతున్నట్టు చదువైపోయింది. ఒక్క పిల్లకో పిల్లాడికో చదువు చెప్పించాలనుకుంటే కోటి కావాలట. మాయింట్లో మనవడికోసం లెక్కలు. వెంకడు మొదట్నుంచీ తెలివితక్కువవాడే. ఆవిడ నడిపించింది. ఇదుగో, ఇలాగేననుకుంటా” అన్నాడు శ్యామ్మోహన్ కాస్త ఆవేశంగా.
“…”
“చీటీలు నడిపించారు. ఆ డబ్బు వడ్డీలకి తిప్పారు. తీసుకున్నవాళ్ళు మొహం చాటేసారు. చీటీలు కట్టినవాళ్ళు వూరుకోరుకదా? ఎక్కువ వడ్డీలిస్తామని పెట్టుబడులు పెట్టించి వాటిని చీటీలవాళ్ళకి యిచ్చారు. డబ్బు పెట్టినవాళ్ళకి యివ్వడంకోసం వడ్డీలకి తెచ్చారు. ఈ నష్టాలన్నిటిలోంచీ ఒక్క వూపులో బైటపడాలని షేర్లలో పెట్టారు. అదీ ఎవరి సలహా తీసుకోకుండా. రహస్యంగా. రాత్రికిరాత్రి లాభాలు వచ్చేస్తాయి, ఎవరికీ తెలీకుండా కవర్ చేసెయ్యొచ్చని. అలా వచ్చేసేట్టైతే అందరూ ఈపాటికి కోటీశ్వరులై కూర్చునేవారుకదా? రోజువారీ వ్యవహారాలు నడపడానికి డబ్బన్నది చేతిలో లేకుండా అయాక కొంతవరకూ నష్టాలకి అమ్మి షేర్లడబ్బు వెనక్కి తీసుకున్నారు. అది చాలక ఆఫీసు డబ్బు వాడటం మొదలుపెట్టాడు. అది బైటపడేసరికి పరువుకి భయపడి ప్రాణాలు తీసుకున్నారు”
ఇద్దరూ మళ్ళీ మౌనం వహించారు.
తను ఏదో ఒకటి చెయ్యాల్సింది కొడుకు విషయంలోనా, అమృత విషయంలోనా అనేది అర్థమవలేదు మాధవరావుకి. అమృత విషయంలో విజయ్ చాలా పట్టుదలగా వున్నాడన్నది శ్యామ్మోహన్‍కి అర్థమైంది. పరువు, మర్యాద అనేవి పక్కని పెట్టి ఈ లావాదేవీల్లోంచీ ఆ పిల్లని బైటపడేస్తే దిగినందుకు పని సార్ధకమౌతుంది.
“వెంకట్రావు యిల్లు కోటికి పైన చేస్తుంది మాధవా! మిగిలిన షేర్లు ఐనకాడికి వదిలించుకోవచ్చు. మార్కెట్ రేటుకి ఇల్లు ఎవరేనా కొనగలిగితే ఓ కొలిక్కి వస్తుంది. ఈ గొడవంతా సద్దుమణిగాక ఇల్లు మళ్ళీ అమ్మెయ్యచ్చు” సాలోచనగా అన్నాడు.
“విజయ్ దగ్గిర అంత డబ్బు లేదు. నేను ఇంకో కొడుక్కీ, కూతురికీ జవాబు చెప్పుకోవలసి వుంటుంది. తాతయ్య కొంటారని అనుకోను. ఎందుకంటే ఆయన మా అందరికీ జవాబు చెప్పాలి” అన్నాడు మాధవరావు ముక్తసరిగా.
అదే జరుగుతుందనిపించింది శ్యామ్మోహన్‍కి. ఎవరో ఒకరు కొంటారు. ఇప్పుడు తెగించి పెట్టుబడి పెడితే పెద్దలాభాలు రాకపోయినా, నష్టంమాత్రం వుండదు. వెంకట్రావు చచ్చిపోయింది డబ్బులేక కాదు, డబ్బు ఆడక. పీల్చుకునేగాలిలాగా, డబ్బాడక. లిక్విడ్ కేష్ లేక.


హాస్పిటల్‍నుంచీ పిల్లలు ముగ్గురూ బాగా ఆలస్యంగా వచ్చారు. ఎదురుచూస్తూ కూర్చున్నారు మహతి, తులసి, గీత. పెద్దవాళ్ళందరి భోజనాలూ అయ్యాయి. వీళ్ళొస్తే అందరూ కలిసి తినచ్చని చూస్తున్నారు.
“మళ్ళీ హాస్పిటల్‍కిగానీ వెళ్ళారా? దారిలో ఏదేనా సమస్య వచ్చిందా? ఏం వున్నా ఫోన్ చెయ్యచ్చుకదా?” పరిపరివిధాల పోయాయి అందరి ఆలోచనలు. మహతి రెండుసార్లు కాల్ చేసినా వెంటనే కట్‍చేసేసింది మేఘన.
“ఆఫీసు కాల్‍మీద వుందేమోనే!” అంది తులసి.
మొత్తానికీ వచ్చారు. మేఘన, ఇందిర ఎవరికివాళ్ళు ముఖాలు మాడ్చుకుని వున్నారు. వస్తూనే అన్నతో కలిసి వాళ్లకని కేటాయించిన గదిలోకి వెళ్ళి కూర్చుంది ఇందిర.
“ఈ పిల్ల భలే అదరగండంగా వుందే! ఓ మాట లేదు, పలుకు లేదు. ఎక్కడా చిన్నపిల్లా, చిన్నందం లేవు” అంది తులసి.
“మీరు మాకేమౌతారని అడిగింది నన్ను. తండ్రి హాస్పిటల్లో వుంటే వదిలెయ్యలేక తీసుకొచ్చాం. నాలుగురోజులు వుండి వెళ్ళిపోయేదానికి ఈ ఆరాలెందుకు? చిరాకేసింది. పిల్లలకి స్నేహమూ, సహాయం చేసే బుద్ధీ లేకుండా పోతున్నాయి. ముదినాపసానుల్లా ప్రతిదానికీ అర్థాలూ, లోతులూ వెతకడమే” అంది మహతి.
వచ్చింది వచ్చినట్టు తల్లి వళ్ళో పడి ఏడవటం మొదలుపెట్టింది మేఘన. అందరూ తెల్లబోయారు ఆ పరిణామానికి.
“ఏమైందే, మేఘనా? ఏం జరిగిందే? ఇంత ఆలస్యం ఎందుకైంది? డాక్టరేమైనా చెప్పాడా? నాన్నకి తగ్గిపోతుందమ్మా! వాసు మామయ్య డాక్టర్తో మాట్లాడాడుగా?” ఆ పిల్ల వీపుమీద ఓదార్పుగా రాస్తూ అడిగింది మహతి. ఏడుపు వుధృతి తగ్గడానికి కొన్ని నిముషాలు పట్టింది మేఘనకి.
“మనం నాన్నకి ఏమీ కామా, అమ్మా?” తలెత్తి దూరం జరిగి తల్లి మొహంలోకి చూస్తూ అడిగింది.
“ఏమౌతారే? ఎత్తేస్తే ఏడుచెక్కలు, దిగేస్తే దిమ్మచెక్కలు. మీ అమ్మని పెట్టాల్సిన బాధలన్నీ పెట్టి, విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. ఇంకో యిద్దరు పిల్లలుకూడా పుట్టారు. ఏమైనా కాస్త వుంటే నీమీద వుంటుందిగానీ, మీ అమ్మమీద ఎందుకుంటుంది? నీమీదేనా, బాధ్యతంతా మీద వేసుకుని ఇది పెంచితే తనొచ్చి చిటికెలు వేసి వెళ్ళే పాత్రకాబట్టి ఆకాస్త ప్రేమాను” వెంటనే అంది గీత.
“అసలేం జరిగింది మేఘనా?” అడిగింది తులసి.
ఆమె చెప్పింది. స్కూలుకెళ్ళి ఇందిరని తీసుకుని ఇంటికెళ్దామనుకుంటే ఆ పిల్ల మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్దామని పంతం పట్టిందట.
“అది చాలా మొండిది. అస్సలు చెప్పినమాట వినదు. సరేనని వెళ్ళాం పిన్నీ! వెళ్ళగానే నాన్న బెడ్‍దగ్గిరకి వెళ్ళిపోయింది. నాన్న కాన్షస్‍గానే వున్నారు. నేను ఆఫీసునించీ కాల్ వస్తే మొబైల్ తీసుకుని పక్కకి వెళ్ళాను. జస్ట్ వన్‍మినిట్ కాల్ నాది. మళ్ళీ వచ్చేసరికి నాన్నతో అంటోంది,
వాళ్ళెవరో నాకు అర్థమైంది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళట నాన్నా! అమ్మ చెప్పింది. అన్నా, నేనూ వాళ్ళింట్లో వుండం. మనింటికి వెళ్ళిపోతాం-అని.
నాన్న విన్నారు. అలా అనడం తప్పనికూడా చెప్పలేదు. నన్ను చూసి మాట మార్చేసారు” అంది. మళ్ళీ కళ్లనిండా నీళ్ళు నిండాయి.
మహతి మనసంతా అల్లకల్లోలమైంది. అలా ఎలా చెయ్యగలిగాడు? పొద్దున్నే చూసింది, ఆ యిద్దరు పిల్లలూ చనువుగా అతని దగ్గిరకి వెళ్తే మేఘన దూరంగా నిలబడివుండటం. ఈపాటి ప్రేమకేనా, కూతురు, కూతురని ముంబై పరిగెత్తుకొచ్చేవాడు! తల్లి వున్నప్పుడు అలా చెప్పిందేమో, ఇప్పుడేనా, ఇతనేనా, ఈ పరిస్థితుల్లోనేనా ఇందిరకి తప్పని చెప్పుకోవాలికదా? ఐనా మేఘనకూడా తన కూతురేనని పిల్లలతో స్పష్టంగా చెప్పకుండా ఎందుకు వుండిపోయాడు? అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయింది.
“ఈ విషయాలన్నీ అన్నాలు తిన్నాక మాట్లాడుకుందాం మేఘనా! నీతో చాలా చెప్పాలి. ఇప్పటికే చాలా వేళైపోయింది. మీరు వచ్చాక తినచ్చని మేమూ కూర్చున్నాం” అని చెయ్యిపట్టి లేవదీసింది గీత.
“తలంటుతుంది. ఓమాటు అత్తచేత తలంటించుకున్నావనుకో, ఈ తిక్కలన్నీ పోతాయి” అని నవ్వింది తులసి.
“అంటే?” అడిగింది మేఘన అర్థంకాక, ఏదో అందనిమాత్రం గ్రహించి ముక్కూమొహం ఎర్రబడగా.
“మా కోడ్ భాషలే. అంతంత తెలుగు నీకు అర్థంకాదు”
“అబ్బ వూరుకోవే తులసీ! దాంతో సమానంగాను. ఏదో పొరపాటు జరిగి వుంటుంది. అతనేదో చెప్పేలోగా ఇది వెళ్ళేసరికి కంగారుపడి మాట మార్చేసి వుంటాడు. తర్వాత ఆ పిల్లకి చెప్పుకుంటాడేమో!” విసుక్కుంది గీత. మేఘన కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కుని వచ్చేసరికి కంచాల్లో అన్నీ పెడుతోంది గీత.
“నీ చుట్టాలనికూడా పిలుచుకు రా!” అంది మహతి.
“నేనా?!” ఎర్రగా చూసింది మేఘన.
“లేకపోతే నేనా?” ఎదురు అడిగింది ఆమె.
“ఓయ్, పిల్లలూ! అన్నాలకి రండి. ఇంక మేం ఆకలికి వుండలేం” అని వున్నచోటినుంచే కేక పెట్టింది గీత. అందరూ బైట మాట్లాడుకుంటూ వుంటే తామిద్దరూ గదిలో బంధించుకుని వుండటం హరికి నచ్చలేదు. లేవబోయాడు.
“నువ్వెళ్ళు. నేను తినను” అంది, ఇందిర. ఆపిల్ల భయాలు ఆపిల్లవి. తల్లితో కూర్చుని టీవీ సీరియల్స్ బాగా చూసేది. ఆపైన సవతిమాత్సర్యంతో ఆవిడ చెప్పిన మాటలు మనసులో నాటుకున్నాయి.
ఇందిరకన్నా హరి మూడేళ్ళు పెద్దవాడు. కొంచెం పరిణతి వుంది. తండ్రికి రెండుసార్లు పెళ్ళైందనీ, మేఘన తమకి అక్కనీ, తండ్రికి ఆ పిల్లపట్లకూడా ప్రేమ వుందనీ గ్రహించాడు. కొన్నాళ్ళు ఆయన ముంబై వెళ్ళి చూసి వచ్చేవాడు. అలా వెళ్ళడం తల్లికి ఏమాత్రం ఇష్టం వుండేదికాదు. ఆమెనే రప్పించమంది. అదీ అయిష్టంగా. తండ్రిని నిలవరించలేక. ఆ అయిష్టాన్ని స్పష్టంగా చూపించేది. మేఘనని గెస్ట్‌రూం దాటి లోపలికి రానిచ్చేదికాదు. డైనింగ్ టేబుల్‍మీద అన్నం పెడితే తినేసి మళ్ళీ వెళ్ళి గదిలో కూర్చోమనేది. తండ్రి బైటికి తీసుకెళ్ళేవాడు. తిప్పుకొచ్చేవాడు. ఏమీ కొననివ్వకుండా కాపలాగా తననీ చెల్లినీ పంపేది. ఏం మాట్లాడుకున్నారో విని చెప్పమనేది. ఏడాదికో ఆర్నెల్లకో ఒకసారి వచ్చి రెండురోజులుండి వెళ్ళేది మేఘన. తన ఖర్చులు తను పెట్టుకునేది. కేవలం తండ్రిని చూడటానికి వచ్చినట్టుగా వచ్చేది. దూరదూరంగానే వుండేది. అలాంటిది తమకోసం ఇంత చేస్తుందనుకోలేదు.
అదీకాక సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఇంతమంది మనుషులమధ్య తిరగడం అతనికి తమాషాగా వుంది. తండ్రినీ మేనమామనీ తప్ప మరో మగమనిషిని దగ్గరగా చూడని అతనికి వాసు చాలా నచ్చాడు. ఆ యింట్లో మేఘనకి వున్న ప్రాధాన్యత, వాళ్ళు తమని ఎలాంటి ఆంక్షలూ పెట్టకుండా ఇల్లంతా తిరగనివ్వడం చూసాక తమింట్లో ఆమెని ఎలా చూసింది గుర్తొచ్చి కొంచెం చిన్నతనంగా అనిపించింది. హాస్పిటల్లో ఇందిర అన్నమాటలుకూడా ఇబ్బందిని కలిగించాయి. మామూలుగానైతే మేఘన వచ్చి వాళ్ళిద్దరినీ భోజనానికి తీసుకెళ్ళేది. ఇప్పుడలా జరగలేదంటే ఆ మాటలు విని వుండాలి. వినే వుంటుంది. హాస్పిటల్లోనే ఆమె ప్రవర్తనలో మార్పొచ్చింది. ఇంట్లో చెప్పిందేమో!
“పద ఇందూ! బావుండదు. ఇది మనిల్లు కాదు బతిమాలించుకోవడానికి” అని చెయ్యిపట్టుకుని లేవదీసాడు. అయిష్టంగా అతని వెంట వెళ్ళింది. అందరూ డైనింగ్‍టేబుల్ దగ్గిర వున్నారు. వీళ్లకోసం చూస్తున్నారు.
“రండి” ఏమీ జరగనట్టే చిన్నగా నవ్వి అంది తులసి. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. మేఘన వాసు చెయ్యి తన చేత్తో పట్టుకుని కూర్చుంది. వదలట్లేదు.
“ఏమైందే?” అడిగాడు.
“నేను మిమ్మల్నందర్నీ చాలా యిబ్బందిపెట్టాను మామయ్యా! ” అంది కళ్లలో మళ్ళీ నీళ్ళు నిండుతుండగా. గీతకేసి ప్రశ్నార్ధకంగా చూసాడు.
“మా నాన్న విషయంలో సాయం చెయ్యమన్నందుకు నీకు కోపంరాలేదా, మామయ్యా?” అడిగింది. ఇందిర తినడం ఆపేసింది.
“నువ్వు అడిగితే కాదనడం వుందంటే? అందులోనూ, మామయ్య?” అంది గీత.
“నేను అలా అడగకుండా వుండాల్సింది” అంది మేఘన, తలదించుకుని.
“ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందామందికదా అత్త? భోజనాలదగ్గిర మంచి విషయాలు చెప్పుకోవాలి. ఏడుస్తూ అన్నం తినకూడదు. వంటపట్టదు” మృదువుగా హెచ్చరించి, “ఇంక తినడం మొదలుపెట్టు” అంది తులసి.
“నువ్వేదో తలంటూ అదీ అన్నావు?” కోపంగా అడిగింది మేఘన. తులసి నవ్వడం మొదలుపెట్టింది.
“నువ్వేంటి, అన్నం తినడం గుడ్లప్పగించి మానేసి చూస్తున్నావు?” ఇందిరని మామూలుగా అనేసింది గీత.
తులసి నవ్వు అందరినీ అంటుకుంది. ఏవేవో మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చారు.
“సుధీర్ ఎప్పుడొస్తున్నాడట?” అడిగింది తులసి. గీత చెప్పింది.
“ఆసరికి బావ డిశ్చార్జైతే వేణుకి అతన్ని అప్పగించి ఇది ఆ బాధ్యతలోంచీ బైటపడుతుంది. ఎలాగా సంబంధం అనుకుంటున్నాంకాబట్టి రమవదిన దీంతో కొద్దిరోజులు గడపాలనుకుంటోంది. కొన్నాళ్ళు ముంబైలో దగ్గిర పెట్టుకుంటారేమో!” అంది తులసి. మహతికి మనసులో ఏదో చురుక్కుమంది.
“మా నాన్నగురించా, మీరు అనేది? మీకు బావెలా?” అడిగింది ఇందిర చప్పుని. ఆ పిల్లకి లోపల్లోపల వుడికిపోతోంది.
“ఔను. మీ నాన్న నాకూ, మా అన్నయ్యకీ బావ. మా వదినకి అన్నయ్య. దీనికి నాన్న. అదుగో, ఆవిడకి ఏమీ కాడు. విడాకులిచ్చిందికాబట్టి. మేమెవ్వరం ఆయనకి విడాకులివ్వలేదు. మా చుట్టరికాలు అలానే వున్నాయి. మీ నాన్న నాకన్నా బాగా పెద్దవాడు. పేరుపెట్టైతే అనలేనుకదా?” తులసి పదునుగా అంది.
భోజనాలౌతూనే చెల్లెలిని గదిలోకి లాక్కెళ్ళి కోప్పడ్డాడు హరి.
“మనకి వాళ్ళు చాలా సాయం చేస్తున్నారు. నువ్వెందుకు, అలా మాట్లాడుతున్నావు? అక్క మనింటికి వచ్చినప్పుడు మనం ఎలా చూసామో గుర్తుతెచ్చుకో. బాగా చదువుకుని, మంచిజాబ్‍లో వుంది తను. వాళ్లమ్మకూడా ఎమ్మే చదువుకుందట. డీటీపీ సెంటరు నడుపుతోందట ముంబైలో. ఐనా అక్క నాన్నకోసం వచ్చి, మనింట్లో పరాయిదాన్లా అన్నిటికీ సర్దుకుపోయేది. తనకి మనమేకదా, ఫోన్ చేసి నాన్న యాక్సిడెంట్ విషయం చెప్పాము? వెంటనే వచ్చింది. తను అడగ్గానే వీళ్లంతా కలగజేసుకుని సాయం చేస్తున్నారు. అమ్మమ్మా, మామయ్యా వస్తే ఎలా వుండేదో ఆలోచించు. మామయ్య తాగి ఇల్లంతా వుమ్ముతాడు. అరుస్తాడు. అమ్మతో వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు చూడలేదు? వీళ్ళెంత కల్చర్డ్‌గా వున్నారో చూడు” అన్నాడు.
“నాకిక్కడ వుండాలని లేదన్నయ్యా! వాళ్ళు చాలా చెడ్డవాళ్ళనీ అర్ధరాత్రి ఆవిడ ఇంట్లోంచీ పారిపోయిందనీ అమ్మ చెప్పింది” అంది ఇందిర ఏడుస్తూ.
“ఇంటికి వెళ్ళిపోదామా? నేను హాస్పిటల్లో వుంటే నువ్వు వంట చేస్తావా? ఒక్కదానివీ ఇంట్లో వుంటావా? హాస్పిటల్లో ఆడపిల్లలు ఉండవద్దనికదా, నాన్న చెప్పింది?”
“వేణు అంకుల్ వున్నాడుగా?”
“అతను మనకెందుకు సర్వీస్ చేస్తాడు? వీళ్ళు చెప్పారుగాబట్టి చేస్తున్నాడు. వీళ్ళకి కోపం వస్తే వద్దనేస్తారు. అర్థంచేసుకో ఇందూ! వీళ్ళలో ఎవరేనా ఎప్పుడేనా మనింటికి వచ్చారా? అక్కకూడా తొందర్లో పెళ్ళి చేసుకుని యూయస్ వెళ్ళిపోతుందట. వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఇంక నీ భయం దేనికి?”
“ఆవిడ చూడు, నాన్నని బావ అంటోంది. వాళ్ళ చుట్టరికాలు అలానే వున్నాయట. నాన్నని వాళ్ళు మార్చేస్తారు. నాన్న మనని యింక పట్టించుకోరు” ఆ పిల్ల ఏవో భయాలతో సతమతమైపోతోంది. ఈ సంఘటనలు ఇలా జరుగుతాయని నరేంద్ర ఎప్పుడూ వూహించలేదు. భార్య పెంపకంలో కూతురు ఇలా తయారౌతోందనికూడా. అతను మేఘనలో చూసిన సంస్కారమే ఇందిరలోనూ వుంటుందనుకున్నాడు.
“అలా జరిగితే అప్పుడు నేనున్నానుకదా, నిన్ను వదిలిపెట్టను. సరేనా? పద. హాల్లోకి వెళ్దాం. వాళ్ళు ఏదేనా అనుకుంటారు” అన్నాడు హరి.
“నువ్వెళ్ళు. నేను పడుకుంటాను”
అతను చెల్లెల్ని వదిలేసి, హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మేఘన కనిపించలేదు. వాసు వున్నాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. మొదట బెరుకుగా మొదలైన సంభాషణ తర్వాత సరదాగా మారిపోయింది. అవతల మరోగదిలో గీత మేఘనని పిలిచి దగ్గిర కుర్చోబెట్టుకుంది. మరోచోట తులసి నిద్రలో వుంది. అనారోగ్యంనించీ కోలుకున్నా, కాస్త నీరసం వుంటోంది. దానికితోడు సమూలంగా మారిపోయిన జీవితం. ఎంతకాదనుకున్నా, లోపలెక్కడో కలుక్కుమంటునే వుంది. మహతి యశోద పక్కన వెళ్ళి చోటుచేసుకుని పడుకుంది.
“బాధపడకు మహీ! నువ్వు చేసినది చాలా మంచిపని. విషయం తెలిసాకకూడా, దిక్కులేనట్టు ఆ పిల్లలని వదిలెయ్యడం తప్పు. అతనికి తగ్గేదాకా వుంచుకుని, పంపించెయ్యండి. ఎవరూ చూడకపోతే పిల్లలు చెడిపోతారు. వాళ్ళు చెయ్యిజారడం ఎంతలో జరుగుతుంది?” అంది యశోద ఆమె తలమీద చెయ్యేసి.
“అర్ధరాత్రి పసిపిల్ల తల్లిని యింట్లోంచీ గెంటేసినప్పుడు, ఇలాంటిరోజు ఒకటి వస్తుందని అనుకుని వుండడు” అన్నాడు రామారావు కోపంగా.
“పోనీలే అన్నయ్యా! గీతా, వాసూ ఎంతమందికి ఎన్నివిధాల సాయం చెయ్యలేదూ? అందులో వీళ్ళొకళ్ళు” అంది లక్ష్మి.
“అతని భార్య పోయిందటకదా? వెళ్ళి ఇల్లూ అదీ చూసుకుంటావా? పెద్దవాళ్ళం ఎవరమేనా వెళ్ళి కదపమంటావా?” అడిగింది యశోద. నరేంద్ర రెండోభార్య పోయిందన్న విషయం తెలిసినప్పట్నుంచీ ఈ ఆలోచన ఆ కుటుంబంలో నడుస్తోంది. ఇప్పటిదాకా ఆమెకి తండ్రి తోడున్నాడు. ఆయన పెద్దవాడయాడు. పెళ్ళి చేసుకుని మేఘన వెళ్ళిపోతోంది. ఇకపై వంటరిగా మిగులుతుంది. తామంతా బతుకుతున్న లెక్క ప్రకారం ఇంకో పాతికేళ్ళు. కనీసం. అందుకే ఈ విషయం మహతి జీవితంలోకి మళ్ళీ తెరుచుకున్న అవకాశంలా అనిపిస్తోంది.
“వద్దత్తా! మేమేం చిన్నపిల్లలం కాదు, మళ్ళీ కలుసుకుని కాపురం మొదలుపెట్టడానికి. నాకింక ఎలాంటి మార్పునీ స్వీకరించే ఓపిక లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి. మేఘన పెళ్ళైతే ఇక్కడికి వచ్చేస్తాను. మీ అందరిమధ్యనీ నాకు చాలా ప్రశాంతంగా వుంటుంది” అంది మహతి.
“మీ నాన్నెలా వున్నాడే?” లక్ష్మి మాట మార్చింది. భార్యాభర్తలమధ్య వచ్చే చీలికలు ఆడవారి మనసుకి ఎంత కష్టాన్ని కలిగిస్తాయో ఆమె స్వయంగా అనుభవించింది. ఆవిడ భర్త పచ్చగా నడుస్తున్న సంసారాన్ని వదిలిపెట్టి వైరాగ్యంలో పడ్డాడు. ఇల్లొదిలేసి వెళ్ళిపోయాడు. వెతికించి తీసుకొచ్చారు. అది వేరే విషయం. ఇక్కడ లోపం జరిగింది, అక్కడ నాకు బాధనిపించిందని ఒక్కమాటుకూడా చర్చించకుండా, అతనితో ముడిపడివున్న ఆమె జీవితాన్ని గురించి ఆలోచించకుండా తనదారిలో తను నడిచాడు. ఎన్నో రాత్రులు అతను వుండీ లేనట్టుండే వంటరితనంలో కన్నీటిధారలు కురిసాయి. శృంగారం ఒకటేకాదు, ముగ్గురుపిల్లల తల్లికి కావలిసినది. అలిసినవేళ ఓదార్పుతోకూడిన మృదుస్పర్శ, ఆనందం మొహంలో తొణికిసలాడుతున్నవేళ అందంగా వున్నావనే ప్రశంస, పిల్లల పెంపకంలో సహకారం. ఈ రెండోమనిషి సహకారం లేకుండానే ఆవిడ జీవితం గడిచింది. అది నిశ్శబ్దంగా ఆ స్త్రీని చంపడం. ఎంత అవమానించినా ఆ మనిషిమీద ఇంకా ప్రేమ వుండచ్చు. వాళ్ళు బావుండాలనే కోరుకోవచ్చు. అదొక మానవప్రవృత్తి. మళ్ళీ దగ్గిరవడానికిమాత్రం అది సరిపోదు. ఒక కప్పుకింద అపరిచితుల్లా ఎన్నో యేళ్ళు కలిసి బతికారు తాము. మహీమాత్రం మళ్ళీ నరేంద్ర దార్లోకి వెళ్ళగలదా?
“బాగానే వున్నారు ఆమ్మా! ఈమధ్యని విపరీతమైన కోపం పెరిగింది. ఎప్పటెప్పటి విషయాలో గుర్తుచేసుకుని ఒకటే తిట్లు తిడుతున్నారు. దీనికి కోపం వచ్చి తీసుకెళ్ళి కొన్నాళ్ళు చూసుకొమ్మని రవళిదగ్గిర వదిలిపెట్టింది” చెప్పింది మహతి.
“అతనికి కోపం లేనిదెప్పుడు? మీ అమ్మకాబట్టి ఓపిగ్గా భరించింది. మధ్యలో కాస్త మారినట్టు కనిపించాడు. అంతే” అంది లక్ష్మి.
“నీతో తీసుకురావలిసింది మహీ! చూసి చాలాకాలమైంది” అంది యశోద.
“నేను గీత విషయం విని వున్నపళంగా బయల్దేరేసాను. ఇక్కడికంటే తనూ సంతోషపడేవారు”
కూతురి పేరు విని రామారావు చెవులు నిక్కబొడుచుకున్నాయి. “ఏమైనా చెప్పిందే, అది? ఆ బుద్ధి ఎందుకు పుట్టిందట?” అడిగాడు.
“లేదు మామయ్యా! సుధీర్ వచ్చాక చెప్తానంది”
“వాడెందుకూ, మధ్యలో? చెప్పేదేదో చెప్పేడవక?”
“ఇంకా వాడూ వీడూయేనా మామయ్యా, నాకు కాబోయే వియ్యంకుడు” అని పకపక నవ్వింది మహతి.
“గుడ్డొచ్చి, పిల్లని వెక్కిరించిందట. ఇప్పుడు మిమ్మల్నందర్నీ ఏమండీ, గారూ అనాలా?” అడిగాడాయన.
“గారూ, గీరూ అనకపోయినా కాస్త పేరుపెట్టి పిలిచి, అతనూ, యితనూ అనండి చాలు. ఇంకా వెనకటి పిల్లాడే అనుకుంటున్నారా? అరవైలకి దగ్గిరపడుతున్నాడు. అందులోనూ అతను మనదగ్గిర వుండట్లేదు. అమెరికా మనిషయాడు. మనం అతన్ని చూసే ఎన్నో ఏళ్లైంది. వాళ్ళ నాన్న పోయినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇటు రానేలేదు. వెళ్ళి ముంబైలో కూర్చుంటాడు. ఆస్తులూ అక్కడే కొన్నాడు. ఇంకా చుట్టరికాలు గుర్తుంచుకుని మహీ కూతుర్ని చేసుకుంటున్నాడంటే గొప్పవిషయమే” అంది యశోద.
“ముంబై వచ్చినప్పుడు సుధీర్ మీదగ్గిరకి ఎప్పుడేనా వచ్చాడే?” అడిగింది లక్ష్మి.
“వాడు ఇండియా వచ్చింది చాలాతక్కువ. ఒకసారో రెండుసార్లో వచ్చాడంతే. వీళ్ళే వెళ్తారు. ఆమ్మమీద కోపం యింకా మెయింటెన్ చేస్తున్నాడు. రమ వచ్చేది. వాళ్ల అమ్మగారింటి దగ్గిరేకదా, నేనుండేది? రెండుమూడుసార్లు కలిసింది. తన అమ్మానాన్నా పోయాక ఇక తనూ రావడం మానేసింది. చాలాకాలమైంది ఇద్దర్నీ చూసి.” జవాబిచ్చింది మహతి.
“మీ పిల్లలే పెళ్ళిళ్లకి వచ్చారు, ఇంకా ఏం కోపాలే? కొడుకన్న ప్రేమ చంపుకోలేక పెద్దనాన్న వున్నప్పుడు వెళ్ళారు. ఆయన పోయాక ఆవిడ వెళ్ళడం మానేసింది. ఆవిడా పెద్దదైందిగా, ఓపిక ఎక్కడినుంచీ వస్తుంది?” అంది యశోద.
“వాళ్ళూ బాగా ఆలోచించుకునే వుంటారు వదినా! ఇప్పుడసలు ఏ పెళ్ళిళ్ళూ నిలవట్లేదు. ఇలా భూమ్యాకాశాలు ఏకం చేసేంత ఆర్భాటంగా చేసేసుకుని పందిళ్ళు తీసేలోగా విడాకులకి పరిగెడుతున్నారు. ఇంట్లో పిల్లైతే బావుంటుందనుకుని వుంటారు. ఎవరికివాళ్ళే లార్డులూ, లారేట్లూ, ఎంప్రెస్‍లూను. దీన్ని కూర్చోబెట్టి నెమ్మదిగా నచ్చజెప్పు మహీ! ప్రతిదానికీ పంతానికి పోవద్దని. భర్తా, అత్తమామలూ, మరిదీ మనవాళ్ళనీ, మనింట్లో మనవాళ్ళమధ్యని కాస్త తగ్గి వుండటం తప్పులేదనీ చెప్పు. వెళ్ళీవెళ్లగానే ఇంటిపెత్తనం అప్పజెప్పి, చేతులు కట్టుకుని ఎవరూ నిలబడరు. ఒకళ్లకొకళ్ళు అనువుగా మారాక ఎవరిది డామినేటింగ్ స్వభావమైతే వాళ్ళ పెత్తనమే ఇంట్లో సాగుతుంది. రమ ఎలాంటి పిల్లో మనకి పెద్దగా తెలీదుగానీ అన్నిటికీ సుధీర్ వున్నాడుకదా? వాడిది అప్పటికీ ఇప్పటికీ ఒకటే స్వభావం. తులసి వైద్యం జరిగినప్పుడు అన్నీ స్వయంగా చూసుకున్నాడు” అంది లక్ష్మి.
“ఇదేనా వెళ్ళి వేరు కాపురం పెట్టడమేగా? ఇల్లూ అదీ కొన్నాడట వ్యాస్. చక్కటి సంబంధం మహీ! మయూ చాలాసార్లు కలిసాడట అతన్ని. మేమంతా వున్నాంకదా అన్నాడు” అంది యశోద.
“నా బలం, ధైర్యం మీరందరూ. మొదట్నుంచీ నిలబడ్డారు. ఇప్పుడుకూడా మీ చేతులమీద ఈ శుభకార్యం జరిగి అది లైఫ్‍లో సెటిలైతే నాకు మరేమీ అక్కర్లేదు” అంది మహతి. ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నా భోజనాలు చేస్తున్నప్పుడు మనసుకి చురుక్కుమనిపించిన విషయం మనసులో ముల్లులా కదుల్తోంది.
ఈ పెళ్ళి జరిగేనా? గీతకి ఇష్టమేనా? దాన్ని ఫోన్లో బెదిరిస్తున్నది ఎవరు? సుధీరే ఐతే అది ఈ పెళ్ళికి ఎలా వప్పుకుంటుంది? తనేనా అలాంటి యింటికి కూతుర్ని ఎలా పంపగలదు? లేచి, గీతని వెతుక్కుంటూ వెళ్ళింది.