ఝరి 71-80 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

ఇంతమంది ప్రేమించి, ప్రాణం పెట్టేవాళ్ళున్నా, ఎండమావిని వెతుక్కుని వెళ్ళినట్టు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళేది మేఘన. అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగొస్తూ ఒకొక్కసారి ఇక్కడికి వచ్చేది. తండ్రిని చూసిరావటం అన్న ఒక్క సంతోషాన్ని మనసంతా నింపుకుని వెలిగిపోతున్న ముఖంతో వచ్చేది. అక్కడ మహతికి ఎంత దు:ఖాన్ని వదిలిందో అని తమకి బాధేసేది.
“అలా చెయ్యడం తప్పని తెలిసిందిగా, ఇకమీదట అలా వుండకండి. మీ నాన్న మేఘనకీ నాన్నేకదా?” అంది. అతను తలెత్తలేదు.
“దానికి ఏవేనా కొనేవాడా ఆయన?”
“లేదు. ఎప్పుడూ ఏమీ కొనిపించుకునేదికాదు. జాబ్ వచ్చాక అక్కే మాకోసం మొదటి జీతంతో ఏవేవో కొని తీసుకొచ్చింది. అలా కొనకూడదని నాన్న గట్టిగా కోప్పడ్డారు”
నెలలపిల్లని తీసుకుని యింట్లోంచీ వచ్చేసింది మహతి. అప్పట్నుంచీ నిర్మలకీ, నారాయణకీ యిచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నమే చేసారు తనూ, వాసూ. తులసికి తక్కువగా ఏమీ చూడలేదు మహతిని. తమకి ఇద్దరూ మగపిల్లలే కావడంతో మేఘనమీద ఎంతో ప్రేమ వుండేది. స్కూలుకి సెలవులివ్వగానే పిలిపించుకునేవారు. ఇక్కడికి పంపడానికి మహతి భయపడేది. నరేంద్ర తమ యిళ్ళవైపు చూడడని అర్థమయ్యాకగానీ పంపించడానికి యిష్టపడలేదు. ఇక్కడున్నప్పుడు ఆ పిల్లకూడా ఎప్పుడూ తండ్రిని చూస్తాననీ కలుస్తాననీ అనలేదు. తల్లితో ఏదో ఒడంబడిక చేసుకున్నట్టే వుండేది. అంత చిన్నవయసులోనే ఎంతో సంయమనం చూపించేది. గీతకి కళ్ళు తడయ్యాయి.
“ఇందుకి ఇంకా తెలీడంలేదు. ఏవేవో అనేస్తుంది”
“మీరేదో అన్నారనో, తనకి బాధ కలిగిందనో నాన్నని వదిలిపెట్టదు మేఘన. నరేంద్రగారు మీకెంతో దానికీ అంతే. ఆయనకి తగ్గేదాకా చూసుకుంటుంది. తర్వాత పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది. ఇంక మీరూ తనూ కలుసుకునే అవకాశమే వుండదు. ఎప్పుడేనా ఫోన్ చేస్తుందేమో! అంతే” ముక్తసరిగా అంది. అందులో కోపం అణుచుకోవడం వుంది. హాస్పిటల్‍నుంచీ వస్తూనే మేఘన ఏడుస్తూ రావడం చేసిన గాయం తాలూకూ బాధ వుంది. ఈ పిల్లలు దారి తప్పకుండా చూడటం వేరు, వీళ్ళమీద ప్రేమ చూపించడం వేరు. ఎంతోమంది పిల్లల్ని తనచేతిమీద పెంచింది. వాళ్ల తల్లిదండ్రులు చెప్పని తప్పొప్పుల్ని సరిదిద్ది సరైన దార్లోకి పంపింది. ఇప్పుడు అంతా మంచిమంచి చదువులు చదివారు, ఇంకా కొందరు చదువుతున్నారు. వీళ్ళూ అంతే.
“ఎక్కువగా ఆలోచించక, వెళ్ళి పడుక్కో” అంది గీత. అతను వెళ్ళిపోయాడు. అంతవరకూ ఆమె వయసులో పెద్దది, మరొకరికి నచ్చజెప్పి సరిదిద్దగలిగేది. ఆ తర్వాత? అక్కడే వుండిపోయింది. మనసులో అలజడి మళ్ళీ మొదలైంది. ఐదునిముషాలుకూడా గడవలేదు. వెనకనుంచీ వాసు గొంతు వినిపించింది.
“ఇక్కడ కూర్చున్నావేమే?” అడిగాడు.
“నిద్ర రావట్లేదు” అంది.
“హరి ఇటు రావటం చూసాను. ఆ పిల్లాడు చాలా డిస్టర్బ్‌డ్‍గా వున్నాడు, ఏ పిచ్చిపని చేస్తాడోనని లేచి రాబోతుంటే నువ్వూ ఇటే వచ్చావు. సరే, ఇద్దరూ మాట్లాడుకుంటారు, నువ్వైతే బావుంటుందని నేను రాలేదు. అతను వచ్చేసి పడుక్కున్నాడు. నీకేమైంది గీతూ? నిద్రెందుకు రావట్లేదు?” వచ్చి పక్కని కూర్చుంటూ ప్రేమగా అడిగాడు. అతనికి దగ్గిరగా జరిగింది.
“చచ్చిపోవాలని మళ్ళీ అనిపిస్తోంది” నెమ్మదిగా అంది. అతను బలంగా నిశ్వసించాడు. పదిహేనురోజులైంది ఆమె ప్రయత్నం విఫలమై. మళ్ళీ ఆ ఆలోచన మొదలైందా? ఎలా బైటికి తీసుకురావటం ఈ ఆలోచనలోంచీ? గిరీష్ అన్నట్టు కౌన్సిలర్ సాయం తీసుకోక తప్పదా?
“అలా ఎలా కుదుర్తుంది?” మృదువుగా అడిగాడు. కళ్ళెత్తి అతనికేసి చూసింది. నిజంగా ప్రశ్నే అది. తను లేకుండా అతను బతకగలడా? చచ్చిపోవడం అతనికి కుదరదనిపించినట్టే బతకడం కుదరదని తనకి అనిపిస్తోంది.
“నేను వుద్యోగం వదిలేశాను. నువ్వూ రిటైర్మెంటుకి దగ్గరగానే వున్నావు. అంటే వుద్యోగపర్వం ముగిసినట్టే. ఫామ్‍హౌస్ అమ్మేసాం. పొలాలు అమ్మేస్తున్నాం. మాధవ్‍వాళ్లతో అంత దెబ్బలాడి ఈ యింటిని నిలబెట్టాం. తన పిల్లలూ, మనపిల్లలూ వెళ్ళి విదేశాల్లో కూర్చున్నారు. ఇంత యిల్లూ ఖాళీగా ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నట్టుగా వుంది. దీనికోసమా, మనం అంత గొడవలు పడ్డది అని ఆలోచిస్తుంటే మనసంతా వెల్తిగా వుంది. అసలు చెయ్యడానికి ఇంకేం మిగిలింది?” అంది.
“పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి. మేఘన పెళ్ళి ముందుంది. కొడుకులూ, కోడళ్ళూ, అల్లుడూ, మనవలూ. ఇంకా చాలా చూడాలికదా?” అన్నాడు.
“పెళ్ళీ, పిల్లలూ అనేవి వాళ్ళ జీవితాలకి సంబంధించిన అంశాలు. మనం చూసి సంతోషపడేవాళ్ళమేకదా?”
“అందుకని వాళ్ళనికూడా దూరం నెట్టేసావా?” అడిగాడు.
ఆమె అదేమీ పట్టించుకోలేదు.
“బావా! స్త్రీ శరీరంలో నిజమైన ఆకర్షణ వుంటుందా? లేక ఆకర్షణ వుంటుంది, వుండితీరాలనే సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నామా? పునరుత్పత్తికోసం జరగాల్సిన కలయిక వినోదంగా ఎప్పుడు, ఎందుకు మారింది? ప్రకృతిలోని సమస్తప్రాణూలూ ఈ సిద్ధాంతానికి కట్టుబడి వున్నాయి. ఒక్క మనుషుల్లోనే ఎందుకిలా? మన జన్యువుల్లోనే ఆ మార్పు వచ్చిందా? ” అడిగింది. ఆమె ఎందుకు అడిగిందో అర్థమైంది వాసుకి. సూటిగా చెప్పలేదు. దారి తప్పించే ప్రయత్నం చేసాడు.
“ఆకర్షణ అనేది అనుబంధంలో వుంటుంది. అందుకే మనుషులు ఒకళ్ళచుట్టూ ఒకళ్ళు తిరుగుతుంటారు. భార్యాభర్తలు కానివాళ్లమధ్యకూడా ప్రేమలు వున్నాయికద?”
“ఉ<హు< అలాంటిదికాదు. అనుబంధం లేనిచోటకూడా కలయిక వుంటోంది. డబ్బుకోసం జరుగుతోంది. అది అత్యంత బాధాకరంగా హింసాత్మకంగా వుంటుంది. ఆ విషయం తెలిసికూడా, ఆడవాళ్ళు పరిచయంలేని మగవాడి భావోద్వేగాలపరిధిలోకి ఎందుకు వెళ్తారు?” సంభాషణ మళ్ళిపోతోంది.
“గీతూ! మర్చిపోకూడదూ, ఆ విషయాన్ని?” అడిగాడు.
“ఎలా మర్చిపోను? భయం వేస్తోంది. పడుక్కుంటే అదే విషయం గుర్తొస్తోంది”
“అందుకు ప్రాణం తీసుకోవాలనుకున్నావా?”
“అంతేకాదు” సంకోచంగా ఆగింది.
“ఇంకో కారణంకూడానా?” నవ్వేసాడు.
“రాణా”
“డివోర్సు కాగితాలు చూసాను”
“ఎప్పుడు?”
“నువ్వేదీ చెప్పట్లేదు. ఏం జరిగితే నువ్విలాంటి పనిచేసావో తెలియాలికదా? నీ వస్తువులన్నీ వెతికాను. నాకు విడాకులిమ్మని రాణా తయారుచేయించి పంపిన కాగితాలు కనిపించాయి. వాడి మాటలకీ, పనులకీ నువ్వు భయపడ్డం ఎప్పట్నుంచీ మొదలుపెట్టావు?”
“వాసు నిన్నూ పిల్లల్నీ సరిగ్గా చూసుకోలేకపోయాడు. నీ ఆస్తినీ కాపాడలేకపోయాడు. కనీసం ఇప్పుడేనా నా దగ్గిరకి వచ్చేస్తావా? చివరిదాకా ప్రశాంతంగా గడపచ్చు-
అన్నాడు చూడు, అది తట్టుకోలేకపోయాను”
“చంపేద్దామా వాడిని? కంఠాణీ తీసుకుని వాడిని పొడిచెయ్యాలనుకున్నావు ఒకప్పుడు. ఏమైంది ఆ తెగింపు?” అడిగాడు వాసు. “రాణా విషయం నేను చూసుకుంటాను. నర్మద కేసుకూడా క్లోజైంది. నువ్వు అన్ని విషయాలూ మర్చిపోయి ప్రశాంతంగా వుండు” అని,
“పిల్లలిద్దరూ వస్తున్నారు. మయూ పెళ్ళికి వప్పుకున్నాడు. ఈ సంవత్సరం వాడికీ, వచ్చే యేడు చిన్నాడికీ చేసేస్తే మన బాధ్యత పూర్తౌతుంది. మేఘనకి చెయ్యాలి. ఈ మూడూ మన చేతిమీద జరగాల్సినవి. మాధవ్ పిల్లలూ, తులసి పిల్లలూ వున్నారు. వాళ్ల బాధ్యతకూడా ఎంతోకొంత మనకీ వుంటుందికదా? నువ్వన్నట్టు ఆ తర్వాత జరిగేవాటన్నిటికీ మనం ద్రష్టలమే. మాధవరావు కొడుకు విజయ్‍ ఒక సమస్యలో వున్నాడు. సాయం చేస్తానన్నాను. అదెలాంటిదో చెప్పలేను. ఒక ఆడపిల్ల జీవితంతో ముడిపడి వుంది. జీవితం ఆఖరికి రావడం అంటూ వుండదు. మేఘన స్థానంలోకి ఇంకో ఆడపిల్ల వచ్చి మనని అల్లుకుంటుందేమో!” అన్నాడు.
“అమృతగురించా, నువ్వనేది?”
“ఔను. జరిగినదాంట్లో ఆ పిల్ల తప్పేం లేదు. బైటపడెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు.”
“నీకు వెంకట్రావు తెలుసా?”
“మాధవ్ క్లాస్‍మేటు అతను. పెద్దగా పరిచయం లేదు. వాళ్లది వేరే గ్రూపు”
“ఆ పిల్లని మనదగ్గరకి తీసుకొద్దామనా?”
“తప్పేముంది? ప్రేమగా చూసుకోలేమా? మనకి పోయేదేముంది? రెండు ఓదార్పుమాటలు, మేమంతా వున్నామనే ధైర్యం”
“ఆలోచన బానే వుంది. పిల్ల బావుంటుందా?”
“విజయ్ కళ్లతో చూడాలి”
“ఓహో!”
“సుధీర్ వస్తే మాట్లాడాల్సినవి చాలా వున్నాయి. నువ్వీమధ్య పట్టించుకోవట్లేదుకానీ రవిమామయ్య అందరం కలిసి ఒకదగ్గిర ఫ్లాట్స్ తీసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. సీనియర్లందరినీ వుంచి వాళ్లకి ఇన్చార్జిల్లాగా ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళం దగ్గిరుండి చూసుకుంటే బావుంటుందని ఆలోచన” పూర్తిగా మాట మార్చేసాడు.
“ఈ ఎంపరర్లూ, ఎంప్రెస్‍లూ వచ్చి వుంటారూ?” అడిగింది గీత అనుమానంగా.
“మనకీ వుపయోగపడతాయి. పెద్దవాళ్ళమౌతున్నాం. ఎప్పటికీ ఇవే వోపికలతో వుండం”
“ఎవరొస్తారు? ఎవరికి వాళ్ళకే స్వంతిళ్ళు వున్నాయి. ఆరేసినెలలు బైట గడుపుతున్నారు. ఇంకో ఆర్నెల్లు. అంతేకదా, ఇక్కడుండేది?”
“ఆ వుండేదేదో ఒకదగ్గిర వుంటే బావుంటుందని”
“వాసూ!” అంది గీత.
“చెప్పు”
“నాన్నా, అత్తలూ కలిసి వున్నా, చిన్నప్పటిలాగ వుండరు. అప్పటి అరమరికలులేనితనం ఇప్పుడుండదు. అసలు కలిసి ఒకదగ్గిర పెరిగినరోజులప్పటిది తప్ప తర్వాతి జీవితం అంతా ఒకరిది మరొకరికి పెద్దగా పరిచయంలేనిదనే చెప్పచ్చు. వాళ్ళమధ్య వచ్చిన దూరానికి కారణం ఏమిటి? వాళ్ళు పొందిన అనుభవాలా? మధ్యలో వచ్చి చేరిన వ్యక్తులా? అలాగే మనం పదకొండుమందిమీకూడా” అంది.
“వైయక్తికమైన అనుభవాలు. అంతే. మనిద్దరం మిగిలినవాళ్ళనుంచీ ఎలా విడివడ్డామో అలా” క్లుప్తంగా అన్నాడు.
ఇద్దరూ కొద్దిసేపు మరేమీ మాట్లాడుకోకుండా కూర్చున్నాక లేచింది గీత. లోపలికి వెళ్ళబోతూ ఆగి, “నా జీవితంలో అంతా శీఘ్రరేఖే. క్రాస్‍రోడ్లూ, రోడ్ నాట్ టేకెన్లూ వుండవు” అంది వెనక్కి చూసి.
తను మహతితో కోపంలో అన్నమాటలు గీతకెలా తెలిసాయాని కంగుతిన్నాడు వాసు. కొద్దిసేపే. అతనికి ఇలాంటి జెర్కులు అలవాటే.
“మహీ చెప్పిందా?” అడిగాడు.
“అదెందుకు చెప్తుంది? మీ యిద్దరూ ఒకటి”
“ఐతే వినేసావా? పాము చెవులు నీవి”
“నేను పుట్టింది నీకోసం, చచ్చిపోయేది నీ చేతుల్లో” అంది.
“పుట్టింది నాకోసం. సరే, బానే వుంది. నా చేతుల్లో చచ్చిపోవడం అనే కొసరు దేనికి? ఇంత వయొలెన్సేమిటే?” అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వెనకే అతనూ వెళ్ళాడు. వెళ్ళి మహతి పక్కని పడుక్కుంది గీత.
“ఇంతరాత్రి ఎక్కడ పెత్తనాలు చేసి వచ్చావు?” అడిగింది ఆమె. పట్టీపట్టనట్టుగా ఇప్పుడే నిద్రపడుతోంది.
“ఊ< రోడ్ నాట్ టేకెన్” అంది గీత.
“వాసు చెప్పాడా?”
“తనెందుకు చెప్తాడు? మీ యిద్దరూ ఒకటి”
“ఐతే వినేసావా? పాము చెవులు నీవి”
“అబ్బ పొల్లుపోకుండా ఒకటే మాట మాట్లాడతారు మీరిద్దరూ. అదేదో కాస్త మార్చి, కుందేలుచెవులు, ఎప్పుడూ నిక్కబొడుచుకుని వుంటాయని అనచ్చుగా?”
“అర్ధరాత్రైనా పడుక్కోరేమే?” కసిరింది యశోద ఇట్నించీ అటు తిరిగి.
“రేప్పొద్దున లేచాక నేను వాళ్ళిద్దర్నీ కోప్పడతాలే, నువ్వు పడుక్కో మామ్మా!” మూడొంతుల నిద్రలో గునిసింది మేఘన. ఈ అలికిడికి ఒక్క కన్ను సగం తెరిచి చూసి మళ్ళీ మూసేసుకుంది ఇందిర.


జీవితంలో కుదుపులంటూ మొదలౌతే మళ్ళీ కుదురు చిక్కడం కష్టం. రోలర్‍కోస్టర్‍లో వున్నట్టుంది అమృత జీవితం. తల్లిదండ్రులు పోయిన దు:ఖం తగ్గలేదుగానీ, ఎలాంటి ఆత్మీయతా లేకపోవడంతో మనిషి బండబారుతోంది. మాధవరావుతో అన్నట్టుగానే శ్యామ్మోహన్ ఆమె పెత్తండ్రులు పొలం అమ్ముతుంటే పకడ్బందీగా వెళ్ళి అడ్డంపడ్డాడు. అమ్మకం ఆగిపోయింది. వారసత్వపు ఆస్తిలో అమృతకి వాటా వుంటుందనీ, అమ్మాలంటే ఆమె సంతకం తప్పనిసరనీ చెప్పేసాడు తాశిల్దారు. చాలా గొడవలయ్యాయి.
తమ్ముడూ మరదలూ పోయాక వాళ్ళ పిల్ల ఎక్కడుందో, ఏమైందోకూడా పట్టించుకోని ఆ యిద్దరు పెద్దనాన్నలూ అప్పుడు అడిగారు.
“అసలు అమృత ఎక్కడుంది? మాయింటి పిల్ల ఎవరింట్లోనో దిక్కూమొక్కూ లేనట్టు వుండటమేమిటి?” అని. శ్యామ్మోహన్ చెప్పాడు.
“వార్త తెలియగానే పిల్ల ఏ ప్రమాదంలో పడుతుందోనని వెంటనే తీసుకొచ్చేద్దామని వెళ్ళాం. హాస్టల్‍నుంచీ వెళ్ళిపోయిందని తెలిసింది. ఎక్కడికెళ్ళిందో తెలీక తల్లడిల్లిపోతున్నాం. ఐతే మాధవరావు తీసికెళ్ళాడా? ఎందుకు? ఏం చెయ్యాలని? వాళ్ల కళ్ళు గర్వంతో ఎప్పుడూ నెత్తిమీదే వుంటాయి. ఇప్పుడీ ప్రేమేమిటో, కొత్తగా? పిల్ల దిక్కులేనిదైంది. రెండుమూడుకోట్ల ఆస్థి వుంది. వాళ్లలో ఎవరికో ముడిపెట్టి దులిపేసుకుంటారేమో!”
“తన నెత్తిమీద నాలుగుకోట్ల అప్పుంది” అన్నాడు శ్యామ్మోహన్ తాపీగా.
“తల్లితండ్రీ చేసిందాంతో పిల్లలకేం సంబంధం?” అనే ఇంకో జవాబొచ్చింది.
“ఇల్లీగల్‍గా చిట్టీలు నడిపించాడు వెంకట్రావు. పబ్లిక్‍ని ముంచాడు. చీటీలడబ్బు ఎక్కడ దాచావని అడగటానికి పోలీసులు రోజూ స్టేషనుకి పిలుస్తున్నారు ఆమెని”
“అదీసంగతి. వాళ్లతో అవంతీపురంవాళ్ళు కుమ్మక్కై వుంటారు. అందరూ కలిసి తిన్నట్టున్నారు డబ్బు. అందుకే పిల్లని ఎవరికీ అంకనివ్వకుండా తీసుకెళ్ళిపోయారు. నేనైతేనా, ఎవరెవరు ఎంత తిన్నారో అంతా లెక్క కక్కించేవాడిని. మర్యాదగా అమృతని మాకు తీసుకొచ్చి అప్పజెప్పండి” ఆవేశపడిపోయాడు అమృత పెద్దపెద్దనాన్న.
“ఆమె మైనరు కాదు. మేజరు. అప్పగించడం అదీ వుండదు. కావాలంటే రమ్మని ఫోన్ చేసి అడగండి. ఈపాటికి అడిగి వుండాల్సింది. నేను తన లాయర్ని. ఆమెకి రావల్సినది ఆమెకి అప్పజెప్తే మీ తమ్ముడూ, మరదలూ చేసిన తెలివితక్కువ పనుల్లోంచీ బైటపడుతుంది. ఆమె జీవితం దార్లో పడుతుంది” అన్నాడు శ్యామ్మోహన్ అప్పటికి యింకా ఇరుపక్షాలవాళ్ళూ సంయమనంగానే వున్నారు.
“ఎందుకిస్తారండీ? మా పిల్లని మాకు అప్పజెప్తే మాయింటి వ్యవహారం ఎలా చూసుకోవాలో అలా చూసుకునేవాళ్లం. మా తమ్ముడి జీతంలోంచీ ఒక్కపైస ఎప్పుడూ మాకు పెట్టనివ్వలేదు ఆ మహాతల్లి, వాడి భార్య. పోయేటప్పుడేమైనా కట్టకట్టుకుని వెంట తీసుకుపోయిందా? లేదే? అందర్నీ నిండా అప్రతిష్ఠలో ముంచి వెళ్ళింది. వాళ్ళు చేసినపనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. ఐనా మా తమ్ముడికి మేమే చదువు చెప్పించాం. అమ్మనీ, నాన్ననీ మేమే చూసుకున్నాం. ఉద్యోగం వచ్చాక వాడి జీతం మాకేమైనా పంపించాడా? వాడిది వాడే తిన్నాడు. మా నాన్నపొలంలో మేమెందుకు వాటా వేస్తాం?” అన్నాడు రెండో ఆయన.
తండ్రి పొలమ్మీదా, ఆదాయంమీదే ముగ్గురు అన్నదమ్ములూ పెరిగి పెద్దయ్యారు. వెంకట్రావు ఇంటరు చదువుకుని వుద్యోగం వెతుక్కున్నాడు, వీళ్ళు అదీ చదవకుండా వ్యవసాయంలో వుండిపోయారు. అతను వుద్యోగం చేసి సంపాదించుకుంటే వీళ్ళు వ్యవసాయం చేసి సంపాదించుకున్నారు. భూములు మంచివి. రేగడినేలలు. పత్తి వేసి బాగా సంపాదించారు. కౌలుడబ్బుగురించి గొడవలుపడేవారని చెప్పింది అమృత. వెంకట్రావుకి ఉద్యోగం వుందిగాబట్టి ఏమీ యివ్వక్కర్లేదని వీళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ అవకాశాలు హక్కుల్ని తొలగించవు. అక్కడికీ తండ్రి స్వార్జితం కాజేశారు. అమృతకి వాటాలేకుండా చేసారు. అందరూ స్థితిమంతులే. ఎవరిమీద ఎవరూ జాలిపడే పరిస్థితి లేదు. అమృతమీదకూడా. హక్కుగా ఆమెకి వచ్చేవన్నీ వస్తే.
బాగా గొడవ జరిగింది. కొనేవాడిదగ్గిర అప్పటికే పదిలక్షలు అడ్వాన్సు తీసుకున్నారు. అతను అడ్వాన్సు వెనక్కి యిచ్చెయ్యమన్నాడు. అమృత పెత్తల్లులుకూడా బయటికి వచ్చి నానా తిట్లూ తిట్టారు. మూడురోజులగొడవ తర్వాత వివాదం సెటిలైంది. పిత్రార్జితంలో అమృతవాటా అమృతకి వచ్చింది. స్వార్జితంలోంచీకూడా వచ్చి వుంటే ఆమె వొడిదుడుకుల్లోంచీ తేలిగ్గా బయటపడేది. కానీ ఆమె పెత్తండ్రులకి అంత వుదారత్వం లేదు. చీటీల డబ్బు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక కేసుతో అమృతకి సంబంధం వుండదని చెప్పాడు పోలీసు ఆఫీసరు. బంగారం అమ్మిందీ, పొలంలోవాటా అందుకు సరిపోయేలా వుంది.
“మా అప్పులేం చేస్తావు?” అని నిలదీస్తున్నారు అప్పులు ఇచ్చినవాళ్ళు.
“నాకు సంబంధం లేదు, మీ దిక్కున్నచోట చెప్పుకోండి” అనిపించవచ్చు అమృత చేత. పేపరు నోటిఫికేషనుకూడా ఇప్పించవచ్చు. ఆ పిల్ల భవిష్యత్తుకూడా దాంతో ముడిపడి వుంటుంది. అప్పులు ఎగ్గొట్టిందన్న నింద మీదపడిన పిల్లని విజయ్‍కి చేసుకోరు. పరపతి వదులుకోవడానికి మాధవరావు ఇంట్లో ఎవరూ వప్పుకోరు. ఇది మాధవరావు, విజయ్‍లకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. వాళ్ళ వుమ్మడికుటుంబం అందరికీ సంబంధించినది. షేర్లలోంచీ వచ్చినంతవరకూ రాబట్టుకుని ఆ యిల్లు సరైన ధరకి అమ్మగలిగితే అప్పులు తీరతాయి. అమృత కట్టుబట్టలతో మిగిలినా మాధవరావు ఇంట్లోవాళ్ళకి అభ్యంతరం వుండదు. కానీ ఈ పరిస్థితుల్లో ఆ యిల్లు ఎవరు కొంటారు?
శ్యామ్మోహన్‍కి అంతుచిక్కట్లేదు. సరిగ్గా అప్పుడే త్రిమూర్తులు ఫోను వచ్చింది. రమ్మని.


వాసు యింట్లో మర్నాడు మామూలుగా అందరూ నిద్రలు లేచారు. కాఫీలు, టిఫెన్లు మొదలైన అవశిష్టాలన్నీ అయ్యాయి. తులసికూడా కాస్త తేలికపడింది. నరేంద్రని చూడటానికి పిల్లలు ముగ్గురూ బయల్దేరారు. మేఘన ఆ విషయంలో అంత వుత్సాహం చూపించకపోవడం గమనించింది మహతి. గీతకూడా. ఎంతలో ఎదుటివాళ్ల మనసు విరిచేస్తారు మనుషులు! ఏళ్ళుగా మహతి పెట్టలేకపోయిన దూరాన్ని ఇప్పుడు తనకి తను నిర్దేశించుకుంది ఆ పిల్ల. కానీ వెళ్ళకుండా వుండలేకపోయింది. బాధ్యతనించీ దూరంగా పోవటం సాధ్యపడలేదు ఆమెకి.
“నేనూ రావాలా? మీరు ముగ్గురూ వెళ్ళొస్తారా?” కారు కీస్ ఇస్తూ అడిగాడు వాసు.
“మేం వెళ్తాంలే” అంది మేఘన. “కారు నాకు ఇస్తే మరి నీకు?” అడిగింది.
“పెద్దగా పనులేం లేవులేవే” అన్నాడతను.
ముగ్గురూ వెళ్ళారు. ఆమె డ్రైవ్ చేస్తుంటే ఆరాధనగా చూసాడు హరి. వెళ్ళీవెళ్లగానే తండ్రి దగ్గిరకి చేరిపోయింది ఇందిర.
“ఎలా వుంది నాన్నా?” అని తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరించి, వేణుతో మాట్లాడింది.
“ఏ ప్రాబ్లం లేదమ్మా! నాకు ఇంటినుంచీ కేరేజి వస్తోంది. సార్‍కి బ్రెడ్ పెట్టచ్చంటే తినిపించాను” అన్నాడతను. తర్వాత డాక్టరుని కలిసి మాట్లాడింది. నరేంద్ర హాస్పిటల్లో ఇంకా వుండాలన్నాడు సర్జన్. కాలు చీరుకుపోయినచోట కుట్లు వేసారు. అవి తీసాక డిశ్చార్జి చేస్తానన్నాడు. మందులూ అవీ చూసుకుంది. కేసుషీటు తీసుకుని చదివింది.
“నేను వెళ్తాను నాన్నా! ఇవాళనుంచీ వర్క్ ఫ్రం హోం. వీడియో కాన్ఫరెన్సుంది. పదింటికల్లా లాగిన్ అవాలి” అంది మరో ఐదునిముషాలు అతనిదగ్గర కూర్చున్నాక. ఆమె ప్రవర్తనలో తేడాని నరేంద్రకూడా గమనించాడు. ఏమైంది? ఇంట్లో ఏమైనా అన్నారా? తమది, అవసరం లేని బాధ్యత వాళ్ళకి. మేఘనకోసం మెహర్బానీగా వచ్చారుగానీ ఎన్నాళ్ళు చూస్తారు? అతని మనసు పరిపరివిధాల పోయింది.
“హరీ! నువ్వూ, ఇందూ రాగలరుకదా? లొకేషన్ షేర్ చేస్తాను. కేబ్ బుక్‍చేసుకుని వచ్చెయ్యండి. సెల్‍లో జీపీఆరెస్ యాక్టివేట్ చేసి పెట్టుకో. ట్రాక్ చేస్తూ వుంటాను” తండ్రికి మరోసారి బై చెప్పి బయల్దేరింది.
“అక్క ప్రిన్సెస్ నాన్నా!” అన్నాడు హరి ఆమె వెళ్తున్నవైపే చూస్తూ. “వాళ్ళింట్లో అందరికీ తనంటే చాలా యిష్టం. కానీ…” ఆగిపోయాడు.
“ఏమైంది?” అడిగాడు నరేంద్ర ఆతృతగా.
వాళ్ళు మాట్లాడుకుంటారని వేణు బైటికి వెళ్ళాడు.
“నిన్న చెల్లి మీతో అన్నమాటలు తను వింది. ఇంటికి వెళ్ళాక చాలా ఏడ్చింది. వాళ్ళంతా బాధపడ్డారు” అన్నాడు. నరేంద్ర ముఖం పాలిపోయింది. ముందురోజు ఇందు అన్నమాటలు తప్పే. ఫోన్ కాల్‍మీద కారిడార్లోకి వెళ్ళిన మేఘన వెంటనే తిరిగొచ్చింది. తను మాట మార్చేసాడు. అలాకాకుండా మేఘన వినేలా ఇందుకి తప్పని సర్దిచెప్పాల్సింది. ఇప్పుడనేకాదు, ఎప్పుడూకూడా తను మేఘన పొజిషన్ని ఎఫర్మేటివ్‍గా ఇంట్లో చెప్పలేదు. వచ్చేది, వెళ్ళేది. అంతే. ఆమె వున్న ఆ ఒక్కరోజో రెండురోజులో, ఇంట్లో ఎలాంటి గొడవా జరక్కుండా చూసుకోవటంతో సరిపెట్టేసాడు.
“ఎవరెవరుంటారు వాళ్ళ ఇంట్లో?” అడిగాడు.
“చాలామందే వుంటారు. మామ్మా, తాతయ్యా అని అక్క ఇద్దర్ని పిలుస్తుంది. ఇంకొకావిడ్ని అమ్మమ్మ అంటుంది. అత్తా, మామయ్య, పెద్దమ్మ, తులసి అనే ఆవిడ, పిన్నిట. ఇందరుంటారు. ఇందు అందరితోటీ రూడ్‍గా మాట్లాడుతోంది” అన్నాడు.
“నాకక్కడ వుండాలని లేదు. మేమిద్దరం మనింటికి వెళ్ళిపోతాం నాన్నా! నాకు అన్నం వండటం వచ్చు. పచ్చళ్ళు వేసుకుని తినేస్తాం. లేకపోతే కర్రీపాయింట్లో కూరలు తెచ్చుకుంటాం” అంది ఇందిర వెంటనే. కళ్లమ్మట నీళ్ళొచ్చేసాయి ఆ పిల్లకి.
“పెద్దవాళ్ళు లేకుండా ఇద్దరమే ఇంట్లో ఎలా వుంటాం ఇందూ? సేఫ్ కాదనికదా, వాళ్ళు మనని తీసుకెళ్ళారు? కొత్తవాళ్లతో పరిచయాలు చేసుకోవద్దని గీతగారు చెప్పారు. కర్రీపాయింట్లకీ వాటికీ తిరుగుదామా?”
“ఐతే అక్కనికూడా మనతో రమ్మను. తను పెద్దదేగా?”
“తనెందుకు వస్తుంది? వాళ్ళెందుకు పంపుతారు?”
“ఎందుకు రాదు? నాన్నకోసంకూడా రాదా?” అని అన్నని నిలదీసి, తండ్రితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. ” నిన్న అన్నయ్య వాసుగారితో
లాంగ్‍డ్రైవ్‍కి వెళ్ళాడు. ఆయన పక్క మంచంమీద పడుకున్నాడు”
“అందరూ ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. ఒక్కడినీ కూర్చుని వుంటే ఆయనే బైటికి వెళ్తూ నన్నూ రమ్మన్నారు నాన్నా! కాదంటే బావుండదని వెళ్ళాను. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఒకదగ్గిర పడుక్కుంటారట. అక్క రమ్మంటే మేమూ వెళ్ళి పడుక్కున్నాం. ఇదేమో వాళ్ళందరితో గదిలో పడుక్కుంటే హాల్లో ఆ తాతయ్య, వాసుగారూ, నేనూ పడుక్కున్నాం” మొహమాటంగా చెప్పాడు హరి. నరేంద్ర ఆలోచనలో పడ్డాడు.
మహతి మళ్ళీ తన జీవితంలోకి రావాలనుకుంటోందా? వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టే వున్నారు. అది సాధ్యమేనా? తనెప్పుడూ పిల్లలకి మహతిగురించి చెప్పలేదు. మేఘన ఏమౌతుందోకూడా పెద్ద వివరంగా చెప్పలేదు. ఆ పిల్ల నాన్నా అని పిలిస్తే వీళ్ళకి ఆశ్చర్యం. అసహనం. ఈ సంఘటనతో హరిలో కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. ఐతే ఒక ప్రశ్న. తను ఆ కుటుంబానికి చెందుతాననే ఫాంటసీలో పడ్డాడా? ఇందు, మహతిని స్వీకరించేలా లేదు. ఇందులో అటువంటి స్పర్థ వుంటే తనూ మహతీ మళ్ళీ కలవడం ఇంకో డిజాస్టర్‍గా మారుతుంది.
“చెల్లీ! గడుస్తున్నరోజులు మనకి నచ్చకపోతే ముందుముందు ఏం చెయ్యచ్చో ఆలోచించుకోవాలి. నాన్న ఇంకో మూడునాలుగురోజులు ఇక్కడే వుండాలి. మనం వాళ్ళింట్లో వుండక తప్పదు. నాన్న డిశ్చార్జై, మనింటికి మనం వెళ్ళాక ఏం చెయ్యచ్చో, ఎలా వుండచ్చో ఇప్పట్నుంచీ ప్లాన్ చెయ్యి” నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు హరి. ఆ మాటలుకూడా అతనివిగా అనిపించలేదు నరేంద్రకి. కొడుకులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తల్లిపోయిన దిగులులో కుంగిపోయి వుండేవాడు. ఆ వయసు పిల్లల్లో వుండే వుత్సాహం అతన్లో పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కరోజులో మార్పు చూసాడు నరేంద్ర.
“అక్కకి పెళ్లట నాన్నా! వాళ్ళ మామయ్యగారబ్బాయట. స్టేట్స్‌లో వుంటారట ఫేమిలీ అందరూ. అక్కావాళ్ల అత్తామామయ్యలు ప్రస్తుతం ముంబైలో వున్నారట. నువ్వు డిశ్చార్జైనతర్వాత వాళ్ళు చూసుకోవడానికి వస్తారట. అంతా ఆ బిజీలో వున్నారు” హరి మాటమార్చాడు.
“ఆవిడ్నికూడా వాళ్ళతో తీసుకెళ్ళిపోతారట” ఠపీమని అంది ఇందిర.
నరేంద్రకి అర్థమవలేదు.
“పెద్దమ్మనికూడా స్టుడెంట్‍వీసామీద తనతో తీసుకెళ్తుందట అక్క” హరి వివరించాడు. ఆమాటల్ని పెద్దగా పట్టించుకోలేదు నరేంద్ర. కానీ పెళ్ళి కుదిరిన విషయం మేఘన తనతో ఇంకా అనలేదు. ఎప్పుడనుకున్నారు, పెళ్ళి విషయం? ఏం పెట్టి అమెరికా సంబంధం చేస్తుంది మహతి? తనకి తెలిసి వాళ్లకి పెద్దగా ఆస్తులేం లేవు. ముంబైలో డీటీపీ సెంటరుమీద ఎంత సంపాదించి వుంటుంది? ఇల్లు గడిచిందేమో! అదీ వాళ్ళ నాన్న సహకారంతో. ఇక్కడ వాసుదేవ్‍‍వాళ్ళూ మంచిచెడులు చూసారేమో! వాసుదేవ్‍వాళ్ళు బాగా స్థిరపడ్డవాళ్ళు, స్థితిమంతులు. వాళ్లతో మేఘనకి పోలికేమిటి? వాళ్ళు తనకి సాయం చెయ్యడంలో ఏమైనా ఆశింపు వుందా? ఇప్పుడీ పెళ్ళికి డబ్బు సర్దాలా తను? మహతికి పెళ్ళిలో పెట్టినవన్నీ తిరిగి తీసేసుకున్నారు. ఇంకా తనకి బాధ్యత వుందా? ఎంతవరకు? అలాంటప్పుడు తన యిష్టాన్నీ స్థాయినీకూడా దృష్టిలోకి తీసుకోవాలికదా? తనని సంప్రదించాలికదా? అతను కణతలు రుద్దుకున్నాడు.
మేఘన తిరిగి ఇంటికి వచ్చేసరికి గీత, మహతి కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“జుగల్బందీ మొదలుపెట్టేసారా? మీకసలు చెప్పుకోవడానికి అన్ని కబుర్లేం వుంటాయి?” అడిగింది.
“అప్పుడే వచ్చేసావేమే?” అడిగింది గీత.
“ఆఫీసుపని వుంది అత్తా!” అందామె.
“ఎలావుంది మీ నాన్నకి?”
“బాగానే రికవరయ్యారు. ఇంకా హాస్పిటల్లో వుండాలట. కుట్లు తీసాక పంపిస్తామన్నారు. నన్నో గంటదాకా ఎవరూ పిలవకండి” చెప్పి, మేఘన వెళ్ళిపోయింది.
“ఆ చివరిగదిలో కూర్చో. ఎవరూ అటు రారు. వర్క్‌స్టేషనవీ వున్నాయి” వెనకనుంచీ కేకేసి చెప్పింది గీత.
“నిన్న మధ్యలో వదిలేసిన విషయాలు మొదలుపెట్టు” అంది మహతి.
“నువ్వు వాళ్లతో వస్తావాని అడుగుతున్నాడు నీ కొడుకు” అంది గీత ఆ మాటలు పట్తించుకోకుండా.
“కొడుకా? కొత్తగా వాడెవరు? నాకున్నది ఒక్క కూతురే” అంది మహతి ఎవర్నిగురించి అంటోందో మొదట అర్థంకాకపోయినా వెంటనే గ్రహించి తొణక్కుండా జవాబిచ్చింది.
“నిజంగానే అడుగుతున్నాను, వెళ్తావా, మహీ?” అడిగింది గీత.
“ఎందుకే, అందరూ ఇలా అడుగుతున్నారు? అతనికి ఒక కష్టం రాగానే జాలికురిసిపోతోందా?” కోపంగా అడిగింది మహతి.
“అతనిమీద జాలికాదు. నీకోసం. జీవితంలో ఏం అనుభవించావు నువ్వు? ఇరవయ్యేళ్ళపైనుంచీ మనిషితోడన్నది లేకుండా వంటరిగా బతుకుతున్నావు. కోరికలు, సరదాలు చంపుకుని కేవలం మేఘనకోసం బతికావు. దాని పెళ్ళయాక ఇంక ఒక్కదానివే వుండాలి. కనీసం చివరిదాకా తోడుగా వుంటాడని” అంది గీత. “పుట్టెడు అనారోగ్యంలోంచీ బైటపడి పసిపాపని ఎత్తుకుని వెళ్ళిన నీతో అప్పట్లో అతని ప్రవర్తనని ఎవరం హర్షించలేదు మహీ! మీ నాన్న తప్పంతా నీదేనన్నట్టు అపరాథభావనని మోసేవాడు. అలాకాకుండా నలుగుర్నీ వెంటబెట్టుకుని వెళ్ళి గట్టిగా నిలదీసి, అతన్నుంచీ నీకు సర్దుకోవడానికి కొంత టైం బార్గెయిన్ చేసి వుంటే బావుండేది. మెత్తగా చెప్తే విననివాళ్ళకి దెబ్బలాడి చెప్పడమే సరైన పని. అతనికి సరిగ్గా చెప్పగలిగేవాళ్ళు లేకపోయారు. అతనింట్లో అందరూ అతన్ని తప్పుదారి పట్టించారు. వాసుతో ట్రెయిన్లో కలిసి మాట్లాడినప్పటికి అతన్లో కొద్దిగా గిల్ట్ కనిపించిందట” ఆగింది గీత.
“అప్పటికే అంతా ఐపోయిందికదూ?”
“ఔను. మళ్ళీపెళ్ళి చేసేసుకున్నాడు. కానీ ఒక సమయంలో పుట్టిన భావోద్వేగం ఎప్పటికీ అలానే వుండదు. అది అనేకవిధాలుగా రూపాంతరం చెందుతుంది. కొంచెం సమయం ఇచ్చి, చిన్నసర్దుబాటు చేసుకుంటే నిలబడే బంధాన్ని చాలా తొందరపడి తుంచుకున్నాడు. అతనికి ఆ బంధం విలువ చెప్పినవాళ్ళు లేరు” అంది గీత. చిన్న నిట్టూర్పు విడిచింది.
“చెప్పినా కొందరికి అర్థం కాకపోవచ్చు గీతూ! ఒక విషయం మనసుకి ఎక్కిందంటే అదంత తొందరగా పోదు. నరేంద్రలో పశ్చాత్తాపం రెండోపెళ్ళిని మొదటిదాంతో పోల్చుకున్నప్పుడు మొదలైవుంటుంది. అంతే. అంతకన్నా మరేం వుండదు. మాయింట్లో మా ముగ్గురిజీవితాలూ చూసాను. ఆడపిల్లలమని అమ్మని చివరిదాకా సాధిస్తునే వుండేవాడు నాన్న. నా విషయం తెలిసిందే. ఇక రవళి. శ్రీనివాస్ దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానంటాడు. ఏదేనా తేడా వస్తేమాత్రం నమ్మి నీకు అన్నీ వదిలేస్తే సరైన నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపిస్తాడు. అన్నీ పాజిటివ్ రిజల్ట్సే తీసుకురావాలి. కత్తి అంచుని నడుస్తున్నట్టుంటుంది దానికి. పట్టించుకోకుండా వదిలేసినదానికి నువ్వు స్వేచ్ఛ అని పేరుపెట్టినంతమాత్రాన నీ మనస్తత్వాన్ని దాచిపెట్టదుకదా? ఇక మాయింటి బైట. మీలో ఎంతమంది పూర్తి అన్యోన్యతతో వున్నారు? ప్రహ్లాద్‍కీ మాధురికీ ఏవో గొడవలు. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళి కూర్చునేదట? కొట్టాడటకదా వాడు ఆమెని? నీలిమగురించి తెలిసిందే. అన్నీ బావుంటే నువ్వెందుకీ ప్రయత్నం చేసావు?” అంది మహతి.
గీత ఆమెకేసి సూటిగా చూసింది. “ఇందులో వాసు ప్రమేయం ఎంతమాత్రం లేదు మహీ! నేనే మనసుని అల్లకల్లోలం చేసుకుని, అందులో చిక్కుపడిపోతూ వుంటాను. అనేక పరిచయాలు. అందులో కొందరు ఏదో దు:ఖంలో కూరుకుపోయి వుంటారు. అది జీవితాన్ని మలుపు తిప్పిన ఒకానొక సంఘటన యిచ్చినా దు:ఖమో, లేక నాలో పుట్టుకనుంచీ వున్న దు:ఖమో తెలీదు. పువ్వునించీ పరిమళం వ్యాపించినట్టు ఈ దు:ఖపరిమళాలుకూడా అందర్నీ తాకుతాయి. కొందరిని ఆవరిస్తాయి. ఇంకొందర్లో ఇంకిపోతాయి. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలని ఈ వయసులో తలుచుకున్నప్పుడు అవి మరోలా జరిగివుంటే బావుణ్ణని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా వాసుతో చెప్తాను. తనెప్పుడూ చెప్పే జవాబు ఒకటే-
జరిగే సంఘటనలు ఎందరివల్లో జరుగుతాయి. వాటిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో వుండేదల్లా నీ స్పందనమాత్రమే- అని.
నా స్పందన నాకు సంతోషాన్నిచ్చేలా ఎందుకు వుండట్లేదు? అక్కర్లేనివి వదిలేసేలా ఎందుకు వుండలేకపోతున్నాను? అది నాలో లోపమా?” అంది. ఆమె తన ధోరణిలోకి తను జారిపోతున్నట్టనిపించింది మహతికి. ఎప్పట్నుంచీ ఇలా? పైకి కనిపించే అల్లరీ, చిలిపితనం, చిన్నపిల్లతనం కాకుండా లోలోపల ఆలోచన, చింతన వుండేవా గీతలో? తామంతా తనని సరిగ్గా అర్థం చేసుకోలేదా? నిశితంగా చూసింది.
కొద్దిగా సంకోచించి మొదలుపెట్టింది గీత. ” నరేంద్రవైపునించీకూడా ఆలోచించాను మహీ! నాకూ వాసుకీ మధ్య చాలా పేషనేట్ లవ్ వుండేది. ఐతే, కాపురానికి వచ్చిన వెంటనే అత్త చెప్పింది.
మాధవ్ అన్నీ తెలిసినవాడు. వాడి దగ్గిర హుందాగా వుండాలి. తులసిది తెలిసీతెలీని వయసు. జాగ్రత్తగా వుండు- అని.
కొత్తగా పెళ్లైన జంట తమమధ్య వుండటాన్ని అలవాటు చేసుకోవడానికి అందరికీ కాస్త టైం పట్టింది. రాత్రి తొమ్మిదయేసరికి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలని కచ్చితమైన నిబంధన పెట్టింది. ఎవరిగదిలోకి వాళ్ళు వెళ్ళినా, మూసిన తలుపులవెనక ఏం జరుగుతుందో తెలిసిన జ్ఞానంగారు, తెలుసుకోవాలనే కుతూహలంగారు చెరోగదిలో వున్న యింట్లో మాగది తలుపులు ఎలా మూతపడతాయి? అదీకాక తులసికి వాసు దగ్గిర చనువు చాలా ఎక్కువ. వచ్చేసి దగ్గిరకూర్చునే పిల్లని పొమ్మని ఎలా చెప్తాడు? ఎప్పుడేనా మేము కలవటం కుదరకపోతే తనకి చాలాకోపం వచ్చేది. ఒక్కోసారి ఆ కోపాన్ని నామీద చూపించేవాడు. కాబట్టి నరేంద్రది పూర్తిగా తప్పని అనలేం. మీ సమస్యని సరిగ్గా పరిష్కరించలేదనిపిస్తుంది. కొద్దిటైమ్ నీకు యిచ్చి, ఇంకో పిల్ల సహజంగా పుడితేనే అనుకుని వుంటే బావుండేది. ఇవిరెండూ ఒకవైపుకి పోలరైజ్ ఐపోయి, సమస్య తీవ్రతని పెంచేసాయి” మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది.
మహతి తలదించుకుంది. అతనంటే పిచ్చి ప్రేమ తనకి. ఎన్ని రాత్రులు అతన్ని తలుచుకుని ఏడ్చిందో! చచ్చిపోవాలనికూడా అనిపించేది. కానీ, అతనికీ అలానే వుండాలి. గీతకూడా చెప్పనే చెప్పింది. ఒకవైపు ఇష్టాన్ని ప్రేమ అనరని. తనది యిష్టం ఔనేమోగానీ తమది ప్రేమకాదు. ఇక ఆలోచించే అవసరంకూడా లేదు.
“మేఘనమీదా నామీదా అతనికేమంత ప్రేమ కురిసిపోవట్లేదు. నిన్న అది ఎలా ఏడుస్తూ వచ్చిందో చూసావుకదా? వెళ్ళి అక్కడ అతుక్కుపోవాలని నాకు లేదు. అదీ అర్థం చేసుకుంటుంది. కలిసి వుండే భార్యాభర్తలు యిష్టమో, కష్టమో విడిపోకుండా వుండే ప్రయత్నాలు చేస్తారు. విడిపోయాక ఇంక ఆ ప్రయత్నం అవసరం లేదు” తుంచేసింది మహతి.
“ఎలాంటి ప్రలోభాలూ లేకుండా చాలా స్పష్టతతో పెరిగాంకదూ, మనందరం?” నవ్వింది గీత. మహతికూడా నవ్వింది.
“ఏమిటి, ఇద్దరూ మీలో మీరే నవ్వుకుంటున్నారు?” వచ్చికూర్చుంది లక్ష్మి. గీత మౌనం వదిలిపెట్టి మాట్లాడుతుంటే అందరికీ మనసులో బరువుతగ్గినట్టుంది. ఆమె ఎందుకు ఆ పనిచేసినా, ముందసలు ఆ ఆలోచనల్లోంచీ బయటపడితే చాలనిపించింది.
“ఏమీ చెయ్యకుండా ఇలా గంటలుగంటలు కబుర్లాడేసుకుంటూ ఎలా కూర్చుంటారు అమ్మమ్మా, మీరంతా?” మేఘన తన కాల్ పూర్తిచేసుకుని వచ్చింది.
“ఏమీ చెయ్యకుండా ఎప్పుడున్నామే? అత్త మొన్నమొన్నటిదాకా వుద్యోగం చేసేది. దానికి కన్న ఇద్దరు పిల్లలతో కలిపి మరో ఇరవైమందిపైగా పిల్లలు. ఎప్పుడూ వచ్చేవాళ్ళూ, వెళ్ళేవాళ్ళూ. మీ అమ్మకి పనెప్పుడు తప్పింది? అది లేకపోతే మీ తాత తిట్లూ, ఏడ్చే పనీ వుంటుంది. ఇక మాకు. ఇప్పుడంటే మిక్సీలూ, గ్రైండర్లూ, వాషింగ్‍మిషన్లూ వచ్చి కాస్త వూపిరిపీల్చుకుంటున్నాంకానీ, వండుకోవడం, రుబ్బుకోవడం, విసురుకోవడం, బట్టలు వుతుక్కోవడం ఎన్ని పనులుండేవే? మేమేదో సుఖపడిపోతున్నామని వూరికే అసూయపడిపోక. నిన్నెవరేనా వుద్యోగం చెయ్యమన్నారా? మానేసి నువ్వూ ఖాళీగా కూర్చో” అంది లక్ష్మి.
“అందరు పిల్లలకి చదువులు ఎలా చెప్పించారు అత్తా? ఫండ్స్ రెయిజ్ చేసారా?” కుతూహలంగా అడిగింది మేఘన.
“లేదమ్మా! ఇద్దరి జీతాలకి ఖర్చులేం వుంటాయి చెప్పు?” అంది గీత.
“ఇప్పుడైతే ఒక్కో కిడ్‍కీ పెంచడానికీ, చదువు చెప్పించడానికీ కోటిరూపాయలని లెక్కవేసుకుంటున్నారు”
“ఔనే. రాజకుమారుల్లా పెరగాలంటే కావాలి. ఇంతన్నం తిని మామూలు స్కూలుకి వెళ్ళి చదువుకోవడానికైతే అక్కర్లేదు”
“నేనూ నీలా చేస్తానత్తా!”
“నువ్వొక్కదానివీ అనుకుంటే చాలదు. వ్యాస్‍కికూడా వుండాలి. అనుకోవడంకూడా కాదు, అదొక పేషన్. నాకూ మామయ్యకీ ఇద్దరికీ వుండేదికాబట్టి చెయ్యగలిగాం. ప్రతీసంవత్సరం ఒకటోతరగతి పిల్లాడిని ఒకడిని చదువు చెప్పించడానికి దత్తత తీసుకునేవాళ్లం. ముందుతరగతుల పిల్లల పుస్తకాలు, బట్టలు, ఇవన్నీ బదిలీ అయ్యేవి. చదువు చెప్పించడం ఒక్కటే ధ్యేయంగా అనుకున్నాం. ఆ పిల్లల తల్లిదండ్రులుకూడా అర్థం చేసుకున్నారు. స్కూలు చాలా మంచిది. ఫీజులు, ఖర్చులు తక్కువ. వూరికే పుస్తకాలు, యూనిఫాం మార్చేవాళ్లు కాదు. చిన్నపిల్లలకి ఇంకా పలకలు వాడే స్కూలు నాకు తెలిసి ఇదొక్కటే. ఇన్ని కలిసొస్తే మేం ఆ పని చెయ్యగలిగాం”
ఆరాధనగా చూసింది మేఘన. “ఇప్పుడింక ఆపేసారా?” అడిగింది.
“గత కొన్నాళ్ళుగా కొన్ని సమస్యల్లో వున్నాం మేఘనా! దాంతో కొత్తపిల్లల్ని తీసుకోవడం ఆపేసాం. పాతపిల్లల్లో చాలామంది ఇప్పుడు వుద్యోగాలు చేస్తున్నారు. బైటకూడా వున్నారు. కొందరికి పెళ్ళిళ్లయాయి. మిగిలినవాళ్ళు ఎవరిళ్ళలో వాళ్ళుండి చదువుకుంటున్నారు. ప్రస్తుతం డబ్బుసాయంమాత్రమే మేం చేస్తున్నది. అందరూ మనింటికి వచ్చి వెళ్తుంటారు. మీలో ఎవరేనా మళ్ళీ మొదలుపెడుదురు. దానం ధర్మం చేసినట్టు కాదు, మనింట్లో పిల్లలని చూసినట్టు చూసుకోవాలి వాళ్ళని “
“ఏం సమస్యలే, మీకిద్దరికీను? ఊళ్ళో గొడవలన్నీ నెత్తిమీదికి ఎత్తుకుంటారు. తిన్నదెక్కువై సమస్యలుగాని. పొలాలు కొన్నారు, పంటలు పండించుకున్నారు. ఇప్పుడేమో అవన్నీ అమ్మేస్తున్నారు. డబ్బు చేసుకుంటున్నారు. పిల్లలిద్దరికీ వాళ్ల సంపాదనలు వాళ్ళకే వున్నాయి. మనుషులమధ్య వున్నాక ఏవో జరుగుతూ వుంటాయి. బావున్నవాళ్ళుగాని, చచ్చిపోయినవాళ్ళుగాని మీకేమీ కారు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎవరికో ఏదో జరిగిందని నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకోవడమేమిటి?” కోపంగా అడిగింది లక్ష్మి.
“అబ్బ. అదేం లేదత్తా!” అంది గీత.
“మరి నీకేం కష్టం వచ్చిందే?”
“కష్టం వస్తేనే చచ్చిపోతారా?”
“తిన్నదరక్కకూడా చచ్చిపోతారని ఇప్పుడు అర్థమైందిలే” విసురుగా లేచి వెళ్ళిపోయింది లక్ష్మి.
“ఏమిటే, మీ గొడవ?” అడిగింది మహతి.
“ఏమీలేదు లేవే” విసుగ్గా అంది గీత. మళ్ళీ ఫోన్ మోగితే మేఘన లేచింది.
“గీతూ! సమస్యేదైనా వుంటే చెప్పాలి. దాచుకుంటే ఎలానే? రాణా పేరు చెప్పావు. వివరం చెప్పవు. అదెవరో పిల్ల చచ్చిపోయిందని బాధపడ్డావు. ఎవరే అంటే చెప్పవు?” అంది మహతి.
“నా ఆలోచనలే నాకు సమస్యగా వున్నాయి. మీ అందర్లా నేను వుండలేకపోతున్నాను. ప్రతీదీ నాకు బాధగానే వుంటుంది. అత్తకి అదే కోపం”
“అందరి బాధలూ నువ్వొక్కదానివీ తీర్చలేవుకదా?”
“అది నాకూ తెలుసు”
“మరింకేం? అన్నీ తెలిసిన పండితురాలివి”
“అబ్బ! ఒకళ్ళ మాటలు మరొకళ్ళు పొల్లుపోకుండా అనేస్తారేం?”
మహతి ఫక్కుమని నవ్వింది. గీత నవ్వకుండా వుండటానికి ప్రయత్నిస్తే ఆ నవ్వు పెదాల చివరల్లోంచీ జారిపోయింది. ఆమె ముఖంలోకి అలాగే చూస్తూ వుండిపోయింది మహతి.
“ఏమిటే, అలా చూస్తున్నావు?” అడిగింది గీత.
“నా మొహంలో కోతులాడుతున్నాయా- అనికూడా అనాలికదా?” అంది మహతి. “మామ్మ, అమ్మమ్మ, అమ్మ, పిన్నులు, పెద్దమ్మలు మనకి భాష నేర్పించిన పండితులు. డబ్బాలోంచీ మరమరాలు కాసిని తీసి పిల్లలముందు చల్లినట్టు ఏవో కొన్ని పదాలు మనముందు పడేసి, వాటికి ముళ్ళు పెట్టేసి, కోపాన్నీ, తాపాన్నీ, అలకనీ, అల్లరినీ అన్నిటినీ వాటిల్లో ఇరికించేసారు” అని నవ్వేసింది. గీత ఆమెకి దగ్గరగా జరిగి కూర్చుంది. మహతి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గిరకి తీసుకుంది. చిన్నప్పుడు ఆడపిల్లలు నలుగురూ అలానే కూర్చునేవారు.
స్నేహం, ప్రేమ, అభిమానం అనేవి వసంతరుతువులో చెట్లకి మొలిచే చిగుళ్ళలాంటివి.
నెమ్మదిగా మొదలుపెట్టింది గీత.
“ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు మన ప్రమేయం లేకుండానే మన జీవితాల్లోకి ఎలా చొరబడి వచ్చేస్తారో ఒక వుదాహరణ చెప్తాను. మయూఖ్ కడుపున పడ్డాడు. అప్పటికి ఆఖరిది పల్లవి పుట్టి ఏడెనిమిదేళ్ళు. ఇంట్లో హడావిడి మొదలైంది. మామ్మ అందరిళ్ళలోంచీ పాతనూలుచీరలు తెప్పించింది. అమ్మ, అత్త చిన్నచిన్న బొంతలు, లంగోటీలు కుట్టేవాళ్ళు. తొమ్మిదినెలలంటే సుదీర్ఘమైన ఎదురుచూపు వాళ్ళకి. ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను. బాహ్యచిహ్నాలు మొదలయ్యాక స్టాఫ్ అందర్లోకూడా కన్సర్న్ పెరిగింది. చిన్న ఆఫీసు మాది. ఇరవైమంది స్టాఫ్. ఒక కుటుంబంలా వుండేవాళ్ళం. అపురూపమైన వస్తువులు ఏవేనా ఇళ్ళలో చేసుకుంటే బాక్సులో తెచ్చి నాకు ఇచ్చేవారు.
మా ఆఫీసరు కూతురుకూడా ప్రెగ్నెంటు. ఇద్దరు కొడుకులమీద అపురూపంగా పుట్టిన పిల్ల ఆమె. నావీ ఆమెవీ ఒకటే నెలలు. ఆమెకి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమట. ఆమెకోసం పళ్ళూ, స్వీట్స్, నట్సూ తెప్పించినప్పుడు నాకూ ఇచ్చేవాడు. నేను తీసుకోవడానికి మొహమాటపడితే,
తినమ్మా- అని చాలా అభిమానంగా చెప్పేవాడు. నేనేం తింటాను, ఇంత చురుగ్గా ఎలా వుంటాను, ఆరోగ్యసమస్యలేం లేవా అని తరచితరచి అడిగి తెలుసుకునేవాడు.
మా పాపకి నీగురించి రోజూ చెప్తాను. వాళ్లమ్మకి ఏవో పట్టింపులు. మీయిద్దరూ కలుసుకోకూడదట. లేకపోతే మా యింటికి నిన్ను తీసుకెళ్లడమో, మా పాపని ఇక్కడికి తీసుకురావడమో చేసేవాడిని- అన్నాడు.
మెటర్నిటీ లీవు అప్పట్లో మూడు నెలలే యిచ్చేవారు. చివరిదాకా చేసి డాక్టరిచ్చిన డేటుకి రెండుమూడురోజులముందునించీ పెట్టుకునేవాళ్ళం. ఆ శనివారం సాయంత్రం రిలీవవ్వాలి నేను. ఇంకో మూడురోజులుంది. బుధవారం ఆఫీసుకి వెళ్ళేసరికి ఆఫీసులో వాతావరణం తేడాగా వుంది. అంతా సీరియస్‍గా వున్నారు. నేను వెళ్లగానే మా సూపరింటెడెంటు ఏవేవో కారణాలు చెప్పి వప్పించి, బుధవారానికి నాచేత లీవులెటర్ మార్పించి వెంటనే రిలీవ్ చేసి పంపించేసాడు.
ఇంటికి వచ్చాక వాసుకి ఫోన్ చేసి చెప్పాను నన్ను రిలీవ్ చేసినట్టు. ఉన్నట్టుండి రిలీవ్ చేసారంటే ఏం కొంపముంచానోనని కంగారుపడుతూ తను వాళ్ళ ఆఫీసులో పర్మిషన్ తీసుకుని మా ఆఫీసుకి పరిగెత్తి నేనేం చెయ్యలేదని నిర్ధారించుకుని వచ్చాడు.
అప్పటికి నేను డెలివరీకోసమని అమ్మావాళ్ళింటికి వచ్చేసి వున్నాను. ఊర్నించీ అమ్మమ్మ వచ్చింది. మామ్మ ఎలాగా వుంది. మూడోది అమ్మ. ఈ ముగ్గురూ రాబోయే సంఘటనకోసం సమాయత్తపడుతున్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా వాసు వాళ్ళమామ్మని తీసుకొచ్చి దింపాడు. ఎందుకో తెలీదు, చాలా భయపడుతున్నట్టు కనిపించాడు. డేటు దగ్గిరపడుతోందని కాబోలు. అతనికి ఆవిడ దగ్గిర గారం. ఆవిడ అతని ధైర్యం.
ఏంట్రా, ప్రపంచంలో నీ భార్య ఒక్కర్తే ప్రసవిస్తున్నట్టు భయపడుతున్నావు? చెట్లంతంత మనుషులం నీ కళ్ళముందు కనిపించట్లేదా? మా అమ్మలు మమ్మల్ని కన్లేదా, మేం మీ అమ్మల్నీ నాన్నల్నీ కనలేదా? వాళ్ళు మిమ్మల్నందర్నీ కనలేదా? అందరూ ఏమన్నా గాల్లోంచీ వూడిపడలేదుకద- అని మామ్మ కోప్పడింది.
నీకు తెలీదులే అమ్మమ్మా- అన్నాడు. ఆమాటకి ఆవిడ పడీపడీ నవ్వింది.
ఎందుకంత భయపడుతున్నావు వాసూ? ఇవి ఆడవాళ్ళ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. గీత ఆరోగ్యంగా వుంది. డాక్టరుకూడా అదే చెప్పింది. పోనీ ఇక్కడుండిపో. ఈ నాలుగురోజులూ ఇక్కడినుంచే ఆఫీసుకి వెళ్ళచ్చు- అంది అమ్మ మృదువుగా.
ఏమక్కర్లేదు. వెళ్లనివ్వు. ఇక్కడే వుంటే వాడు భయపడి, దాన్ని భయపెడతాడు. ఇప్పటి పిల్లలకి ఏమీ తెలీక ఈ తిప్పలు- అంది మామ్మ.
హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు నీకు ఫోన్‍చేస్తాడులే మీ మామయ్య. అమ్మని తీసుకుని వద్దువు- అని నచ్చజెప్పి పంపింది అమ్మమ్మగారు.
మామ్మకి పద్ధెనిమిది దినుసులతో కాయం చెయ్యడం తెలుసు. తాత దగ్గర నేర్చుకుందట. అన్నీ తెప్పించుకుని పెట్టుకుంది. కస్తూరిమాత్రలుకూడా తెచ్చిచ్చాడు నాన్న. వెల్లుల్లిపాయలు, శొంఠిపొడి, తెలగపిండి, నెయ్యి అన్నీ ఒకచోటికి చేర్చుకుంటోంది. నా అలవాటుప్రకారం అన్నిటినీ మనసులోనే లెక్క తూస్తున్నాను. లిస్టు తయారు చేసుకుంటున్నాను. డెలివరీ అయ్యాక పదకొండోరోజుదాకా వీలుపడదని తలంటేసి, కుదుళ్ళనుంచీ జుత్తు బాగా తుడిచి ఫానుకింద ఆరబెట్టి, సాంబ్రాణిపొగ వేసింది అమ్మ.
సుధీర్ దగ్గిర్నుంచి మొదలుపెట్టి పల్లవిదాకా మనందరివీ జుబ్బాలు, గౌన్లు, షర్టులు, బాబాసూట్లు, షిమ్మీలు జాగ్రత్తగా దాచిపెట్టేవారు. అవికాక గిలక్కాయలు, లక్కకాయలు, బొమ్మలు మరో పెట్టెడు. ఉయ్యాల నాన్నప్పటిది. టేకుకర్రతో చేసి, చిలకలు, చిన్నచిన్న గంటలతో వుంటుంది. ఎక్కడెక్కడి సరంజామాకీ కదలికలు మొదలయ్యాయి. మనింట్లో ఆఖరుది పల్లవి. వాళ్ళింట్లో చాలావరకూ ఆగి వున్నాయి. కుసుమ పిన్ని అన్నీ జాగ్రత్తగా దాచిపెట్టింది. అదొక నమ్మకం. ఆరోగ్యంగా పెరిగిన పిల్లల బట్టలు, బొమ్మలు వాడితే కొత్తగా పుట్టినవాళ్ళకి మంచిదని.
ఇచ్చిన డేట్‍కి కాస్త తేడాగా అనిపించగానే నాన్న ఆటో మాట్లాడి అమ్మతో కలిసి హాస్పిటల్‍కి తీసుకెళ్ళారు. మేం వెళ్ళగానే ఇల్లు కృష్ణకి అప్పగించి మరో ఆటో మాట్లాడుకుని పెద్దవాళ్ళు ముగ్గురూ బయల్దేరిపోయారు. అట్నుంచీ వాసు అత్తని తీసుకుని వచ్చాడు. ఈలోగా నాన్న ఎవరెవరికి ఫోన్ చేసారో తెలీదు. మేం హాస్పిటల్‍కి వెళ్ళేసరికి జో, సుమంత్ వున్నారక్కడ. గైనిక్ జోకి తెలుసట. ఆవిడ్ని కలిసి నావిషయం చెప్పి వెళ్దామని వచ్చారు వాళ్ళిద్దరూను.
కమాండర్‍గారు ఒక పయొనీర్‍కి జన్మనివ్వబోతున్నారు- అని అనౌన్స్ చేసాడు జో నన్ను చూసి నవ్వుతూ, రెండుచేతులతో వెల్‍కం చెప్తూ. అది అతను నాకు పెట్టిన పేరులే. సుమంత్ ఎప్పట్లాగే-
వాడు వదినగారి ట్రెయినింగ్‍లో కోతుల బెటాలియన్ని తయారుచేస్తాడు -అని వెక్కిరించాడు.
జో మాటలకి సిగ్గు, వీడిమాటలకి కోపం. రెండూ ఒక్కసారి వచ్చాయి. వదినట, వదిన. ఇద్దరం కలబడి కొట్టుకున్నది మర్చిపోయాడేమో!
“ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పెద్దమ్మలు, ఇద్దరు అమ్మలు, ఇద్దరు సార్లు. ఒక్కామె డెలివరీకి ఇంతమందా? ఇంతేనా, ఇంకా వున్నారా?” అని అడిగింది నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చిన సిస్టరు నవ్వాపుకుంటూ.
ఆ నవ్వు చూసి మామ్మకి కోపం వచ్చి-
పెద్దబస్సు మాట్లాడుకుని వెనకాల ఇంకా వస్తున్నారు- అంది.
చిన్నబస్సుకూడా కాదా పెద్దమ్మా? పెద్దబస్సేనా ఏకంగా- అని నవ్వాపుకోలేక, పైకే నవ్వేసింది. నవ్వుతూనే,
అందరూ ఈ గదిలో కూర్చోండి. పెద్దగా మాట్లాడద్దు. మిగతా పేషెంట్లకి ఇబ్బందైతుంది- అని నన్ను లోపలికి తీసుకెళ్ళింది. గ్లూకోజ్ డ్రిప్ ఇచ్చారు. గంటలో అంతా ఐపోయింది. చాలా తేలిగ్గా అయిందని డాక్టర్ చెప్పింది. నాక్కూడా తేలిగ్గానే వుంది. మూడోరోజుని డిశ్చార్జి చేస్తారట. మయూఖ్‍ మొదటి స్నానం పోసుకుని, ఓమాటు అందరిమధ్యా తిరిగేసి వచ్చి నా పక్కకి చేరాడు. వాసుకీ నాకూ సిగ్గుసిగ్గుగానూ వుంది. ఆశ్చర్యంగానూ వుంది. నాన్నది అవధుల్లేని సంతోషం.
మా నాన్నే మళ్ళీ పుట్టాడు గీతూ! గొప్ప కూతుర్ని కన్నాను. చిన్నప్పుడెప్పుడో పోగొట్టుకున్న తండ్రిని కానుకగా ఇచ్చావు- అన్నారు.
ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాక పిల్లలని తీసుకుని రవి బాబాయ్ వచ్చాడు. కుసుమపిన్ని రాకూడదట. తను రాగానే నాన్న వెళ్ళిపోయాడు.
పల్లవి బుద్ధిగా నా మంచం పక్కనున్న బల్లమీద మఠం వేసుకుని కూర్చుని, మయూఖ్‍ని వొళ్ళో పెట్టించుకుంది. వాడిని ఎగాదిగా చూసింది. అమ్మ వాడిని జాగ్రత్తగా పట్టుకుని పక్కన నిలబడింది. ఇక దాని ప్రశ్నలు మొదలు.
ఇలా వున్నాడేంటి వీడు? ఎలా ఆడుకుంటాడు? నోట్లో పట్టడుకదా? గీత బొజ్జలోకి ఎలా వెళ్ళాడు? ఎలా మింగేసింది? ఇప్పుడెలా వచ్చాడు? మళ్ళీ ఎలా తీసింది గీత- అని.
నోరు ముయ్యవే బాబూ- అని అమ్మ నవ్వాపుకుని విసుక్కుంది. అది వినదే! ఇలాంటి ప్రశ్నలు చిన్నప్పుడు నన్నూ వెంటాడేవి. దాన్ని చూస్తుంటే నిన్నటి నాలా అనిపించింది. సుధీర్, వాసులకి మీసాలు వస్తున్నప్పుడు వాటిగురించి చాలా కుతూహలంగా వుండేది. అవెలా వస్తున్నాయో తెలుసుకోవాలనీ, వాటిని పట్టి లాగి చూడాలనీ అనిపించేది.
ఇన్ని అడుగుతుందనుకోలేదు. ఇంటికెళ్ళాక దాని వయసుకి తగ్గట్టు అర్థమయ్యేలా చెప్తాలే వదినా- అన్నాడు బాబాయ్ కొంచెం మొహమాటంగా. అర్చన మేలు. వాడిని ఎత్తుకుని ఇచ్చేసింది.
ఈ పదిరోజులూ అందరం ఒకదగ్గిర వుంటే సరిపోతుందికదా, రవీ! పుణ్యవచనం అయాక వెళ్ళచ్చు. వచ్చెయ్యకూడదూ- అంది అమ్మ.
కొత్తగా ఎందుకులే, వదినా! ఆయనకి యిష్టం వుండదు. శేఖర్ యింటికి వెళ్ళిపోతాం- అన్నాడు తను. కొంచెంసేపు వుండి వాళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోరు- అమ్మని అడిగాను.
అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. నన్నడుగుతావేంటే? వాళ్ళేనా, చెప్తే వినాలి. లేకపోతే లేదు. పెద్దవాళ్ల విషయాల్లో ఆరాలేంటి నీకు? నిన్ను పిన్నీ బాబాయ్ ఇద్దరు బాగానే చూసుకుంటున్నారు. వాళ్లతో మాట్లాడుతున్నావనీ, వాళ్ళింటికి వెళ్తున్నావనీ నాన్నకి ఎలాంటి ఆక్షేపణా లేదు. ఇంకేంటి? ఐనా ఇప్పుడే ప్రసవం అయిన పిల్లలా లేవు ఎక్కడాను. కళ్ళుమూసుకు పడుక్కో- అని కోప్పడింది.
కడుపులోంచీ ఇవతలికి వచ్చి నా పక్కని చేరిన మయూఖ్‍ని చూసాను.
ఊహ తెలిసినప్పట్నుంచీ నేనూ, వాసూ ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నాం. మానుంచీ మరో ప్రాణి వుద్భవిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పదినెలలక్రితందాకా ఊహల్లోకూడా లేని వీడు, కొద్దిసేపటిక్రితందాకా ఆడో మగో, ఎలా వుంటాడో వూహకికూడా పట్టని వీడు, ఇప్పుడు సాకారంగా కళ్ళముందు కనిపించడం ఎంత వింత! ఎన్నోవేలయేళ్ళు లేదా లక్షలయేళ్ళనుంచీ ఎంతోమంది స్త్రీపురుషులు నిరంతరాయంగా కంటూ వుంటే ఆ పరంపరలో నాకూ వాసుకీ చోటుదొరికింది. ఇది ఇంకా ముందుకి సాగుతునే వుంటుంది. వీడిని జాగ్రత్తగా పెంచాలి. సృష్టి కొనసాగింపుకి ఒక అందమైన కానుకగా తయారుచెయ్యాలి. వీడి తర్వాత మళ్ళీ ఎన్నో తరాలు సాగుతాయి! ఏవో ఆలోచనలు.
వింత, వినోదం, సంతోషం, నవ్వులు ఎంతదూరానికి సాగినా వీటికి ఇంకో కొసని ఎక్కడో మనకి సంబంధలేని దు:ఖం తొంగిచూస్తూ వుంటుంది. దాన్ని మనం ఒకసారి గుర్తించామంటే అతుక్కుపోతుంది. జీవితాంతం వదిలిపెట్టదు. మొహం తిప్పుకుని వెళ్ళిపోగలిగే అవకాశం అందరికీ వుండదు.
మహీ! మనకీ, నిజానికీమధ్య ఒక గోడ వుంటుంది. గోడ అవతల ఏం వుందో మనకి తెలీదు. తెలిసేదాకానే అది గోడ. ఆ నిజం తెలిసాక అదొక మంచుతెరగా మారి, కరిగిపోతుంది. హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు మనకన్నా ముందు ఎవరు వచ్చివుంటారు, లేబర్‍రూంలో ఎవరు నొప్పులు తీసి వుంటారు, వాళ్ళకి ఏమై వుంటుందిలాంటి ప్రశ్నలేవీ మనసుకి రావు. చాలా కేజువల్‍గా గదిలోకి వెళ్ళిపోతాం. అన్నీ మనచుట్టే పరిభ్రమిస్తాయి. మనచుట్టూ ఒక గోడ సహజాతిసహజంగా ఏర్పడిపోతుంది. లేబర్‍రూమ్‍లో పడుక్కుని వున్న నాకు అదే బెడ్‍మీద రెండురోజులకిందట ఒకమ్మాయి కని, తీవ్రమైన గుర్రపువాతంతో చనిపోయిందని తెలీదు. ముందే తెలిసి వుంటే? నేనా విషయాన్ని ఎలా తీసుకునేదాన్ని? ఒక భయం, అధైర్యం నాలో చోటుచేసుకునేవి. డెలివరీ ఇంత తేలిగ్గా అయేది కాదు. ఇంతకీ ఆ అమ్మాయి మా ఆఫీసరుగారి కూతురు. బాబుని కని చనిపోయింది” గీత చెప్పడం ఆపేసింది. గొంతు వణికింది. మహతి ఆశ్చర్యంగా వింది.
“ఆరోజు వుదయం నన్నంత హడావిడిగా రిలీవ్ చెయ్యడానికి కారణం అదే.
గీత ఫుల్‍టర్మ్‌లో వుంది. ఈవార్త విని ఎలా రియాక్టౌతుందో తెలీదు, ఏదో ఒకటి చెప్పి, ముందు రిలీవ్ చేసి పంపించెయ్యండి- అన్నారట మా ఆఫీసరు అంత దు:ఖంలోనూ. వాసుకూడా ఆ వార్త విని భయపడ్డాడు. తనకే అనిపించడంచేతనో ఎవరో చెప్పడంచేతనో కానీ ఆ విషయం నాకు చెప్పలేదు. నేను మళ్ళీ డ్యూటీలో చేరేదాకా తెలీలేదు. ఐతే ఒక గోడవెనక దాగివుందికదా, ఆ నిజం? ఇటువైపు అది వున్నదని తెలీక నేను చేస్తున్న పోరాటం.
డెలివరీకి ముందు అంత అభిమానం చూపించిన వ్యక్తి కనీసం ఫోన్ చేసేనా గ్రీట్ చెయ్యలేదు. బారసాలకి వాసు వెళ్ళి ఆహ్వానిస్తే స్టాపంతా వచ్చారుగానీ, ఆయన రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే లీవులో వున్నారన్న జవాబు.
నాకు చాలా చిన్నతంగా అనిపించింది. నేను క్లర్కునని రాలేదా? కనీసం ఫోన్ చేసి గ్రీట్ చెయ్యడానికి ఎంత టైం పడుతుంది? ఆయన నన్ను తినమని ఇచ్చినవాటి రుచి ఇప్పుడు నోట్లో చేదుగా అనిపించడం. నామీద దయతల్చి అంత అపురుపమైన వస్తువులు నేను కొనుక్కుని తినలేనని అనుకుని ఇచ్చాడా? అనే ప్రశ్నలు. ఎన్ని వ్యాపకాలమధ్య వున్నా చిన్నముల్లులా కదిలేవి”
“ఛ… అదేంటే? నీకేం తక్కువ?” అంది మహతి చప్పుని.
“అదే గోడ మా ఆఫీసరుకీ, మా కుటుంబస్థాయికీ మధ్య కూడా వుందికదూ? ఏదేనా తెలిస్తేనే నిజం”
“అంతేకదూ?”
“బాహ్యదు:ఖాలేకాదు మహీ, అంతర్గతదు:ఖాలుకూడా మనని అంటిపెట్టుకుని వుంటాయి. చాలా కుటుంబాలలో ఇంటికి పెద్దకొడుకు అలవికాని బాధ్యతల్ని నెత్తిమీద మోసి, ఆర్థికంగా చితికిపోవడంతోపాటు, గౌరవాన్నికూడా పోగొట్టుకోవడం చూస్తాము. మనింటోమాత్రం మా నాన్న ఈ తొమ్మిదికుటుంబాలకీ మహరాజు. ఆయన డబ్బుకోసం ఇబ్బందిపడుతున్నారు. తెలుస్తోంది. హాస్పిటల్ బిల్లు ఐదువందలో ఎంతో తనే కట్టారు. వాసు కడతానంటే వప్పుకోలేదు. అక్కడ హాస్పిటల్లో వాదనెందుకని తనూ వదిలేసాడు.
పెళ్ళి, వెంటనే సీమంతం, హాస్పిటల్ ఖర్చులు, బారసాల. నన్ను డెలివరీకి తీసుకొచ్చినప్పట్నుంచీ ఏ రోజూ చేతినిండా నెయ్యి లేకుండా, పండూ కాయా లేకుండా పెట్టలేదు. డబ్బు ఎలా సర్దుబాటుచేసుకుంటారోనని బెంగవేసింది. నాదగ్గిర డబ్బు చాలానే వుంది. కొంతతీసి అమ్మ చేతికి యివ్వబోయాను. తను తీసుకోలేదు.
పెళ్లైనప్పట్నుంచీ నా జీతం నా దగ్గిరే వుంది. వాసు నన్నే దాచుకొమ్మన్నాడు. పెద్దగా ఖర్చవలేదు- అన్నాను.
సరిపోయింది. వాళ్ళేదో నమ్మి నీదగ్గిర వదిలేస్తే నువ్వు మాకు యివ్వడమేమిటి? ఇది మా బాధ్యత. మనింట్లో పుట్టిన ఆడపిల్లలందరికీ చేసారు మీ నాన్న. నీకు చెయ్యలేరా- అంది.
నా జీతం నమ్మి నా దగ్గిర వుంచడమేమిటి? అమ్మ చెప్పిన మాటల్లో ఒక్కముక్కకూడా నాకు అర్థమవలేదు. ఒకసారి చెప్పడమేకానీ వాదించి వప్పించడం నాకు రాదు. ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. వాసుకి చెప్పచ్చని వూరుకున్నాను. సాయంత్రం వచ్చినప్పుడు వాసు నా మనసు చదివినట్టు అన్నాడు.
“మాకు మెడికల్ బిల్స్ తిరిగొస్తాయి మామయ్యా! క్లెయిమ్ చేసుకుంటాం. గీతకి వుద్యోగం లేకపోతే వేరే విషయం. ఇద్దరికీ వుద్యోగాలుండి నువ్వు ఖర్చుపెట్టడమేమిటి? నాకు నచ్చలేదు. ఇది మనింట్లో ఫంక్షను. తులసి, కృష్ణల తర్వాత ఎన్నో ఏళ్లకి జరుగుతోంది. సరదాగా కలిసి చేసుకుందాం. నువ్వు వినకపోతే గీతనీ, బాబునీ మాయింటికి తీసుకెళ్ళిపోయి అక్కడే చేసుకుంటాం” అన్నాడు దెబ్బలాడుతూ. అల్లుడి హోదాకదా, అతనికి కోపం వస్తుందేమోనని నాన్న కాదనలేకపోయారు.
నీ మొగుడేమిటే గీతా, నన్ను దబాయిస్తాడు- అన్నారు నాతో నవ్వుతూ. అందులో గర్వం. అలాంటి అల్లుడు దొరికినందుకు.
నీ అల్లుడయ్యాకేగా, నన్ను చేసుకున్నది_ అన్నాను నేను.
మేం ఖర్చుపెట్టిననదంతా వుజ్జాయింపుగా లెక్కవేసుకుని, కిసాన్ వికాసపత్రాలు తీసుకుంటే ఎప్పుడు రెట్టింపు ఔతుందో లెక్కవేసుకుని, అంతమొత్తం ఆ టైముకి అందేలా మయూఖ్ పేర్న రికరింగ్ డిపాజిట్ అకౌంటు తెరిచి వచ్చారు. అది తెలిసి అత్త నిట్టూర్చింది.
వాడు ఎవరి డబ్బూ వుంచుకోడమ్మా! అవసరమై తీసుకున్నా ఇదుగో, ఇలానే ఇచ్చేస్తాడు- అంది. అంతకుముందు ఎప్పుడోకూడా అలానే జరిగిందని గ్రహించాను. మరోవిషయంకూడా జరిగింది. ఇంటిపక్క వున్న ఖాళీస్థలం నాపేర్న రాసేసారు. గిఫ్ట్‌డీడ్ తెచ్చి బారసాల ముందురోజు నా చేతిలో పెట్టారు. అప్పట్లో ఆ స్థలానికి పెద్ద విలువేమీ లేదుగానీ, అదే స్థలాన్ని అమ్మేస్తే ఆయన కొన్ని ఖర్చుల్లోంచీ బైటపడతారు. నాన్న ఇలా చేస్తారని వాసు, నేను వూహించలేదు. ముందుముందు ఎన్నో ఖర్చులున్నాయి. కృష్ణ చదువు చూసుకోవాలి. అమ్మకి మళ్ళీ బంగారం చేయించలేదు. తను రిటైర్మెంటుకి దగ్గర్లో వున్నారు. అదే అడిగితే-
ఉండనివ్వు గీతా! నేను ఇవ్వగలిగింది ఇదే. నీ పెళ్ళికే అమ్మేసి ఘనంగా చెయ్యాలనుకున్నాను. త్రిమూర్తులు పెద్దనాన్న వద్దన్నారు. అలా మిగిల్చి దాచింది నీదేకదా? నీకు మేమేం చేసామని? మాతోపాటు అన్నిటికీ సర్దుకుంటూనే చిన్నప్పట్నుంచీ పెరిగావు. ఇప్పుడీ వుద్యోగం చేస్తున్నావన్నా, అది నీ ప్రజ్ఞేగానీ మేం చేసిందేముంది-అన్నారు.
అదొక్కటేకాదు, తనని దృష్టిలో వుంచుకునే సుధీర్ని కాదన్నానని ఒక నమ్మకం. సుధీర్ ప్రతిపాదన రావడంకన్నా ముందే వాసుగురించి చెప్పానన్న విషయం పక్కకి పడిపోయింది. నాకు తనేమైనా తక్కువ చేస్తున్నారా అని తరచితరచి చూసుకోవడం. డబ్బున్నవాడు ఎలా బతికాడు, ఏం చేసాడని ఎవరూ అడగరు. లేనివాడుమాత్రం తను ఎవరినుంచీ ఏదీ ఆశించట్లేదని పదేపదే రుజువుచేసుకోవలసి వుంటుంది. అదొక కాంప్లెక్స్.
మహీ! ఆ ఆరుసెంట్ల స్థలం చుట్టూ నా జీవితం తిరగడం మొదలుపెట్టింది. మొదటి నిరసన పద్మత్త దగ్గర్నుంచీ వచ్చింది.
మొత్తానికీ దాచిదాచి గారాలకూతురికి ఇచ్చాడా, ఆ స్థలాన్ని? ఇదీ త్రిమూర్తులు సలహాయేనేమో! అప్పుడే యిల్లు అమ్మేసి వుంటే మా అందరికీ ఇంకాస్త మంచిసంబంధాలు వచ్చేవి. ఆయన ఆ పని చెయ్యకపోవటాన్నే రవికీ, శేఖర్‍కీ పంచుకోవాలనే ఆలోచన వచ్చింది-
మామ్మ వంటింట్లో వున్నప్పుడు ఆవిడ దగ్గిరకి వెళ్ళి అత్త అంటుంటే అదే సమయానికి ఏదో కావలిసి వచ్చి అక్కడికి వెళ్ళాను. నన్ను వాళ్ళు చూడలేదు. అలా మనకి నేరుగా చెప్పని విషయాన్ని వాళ్ళకి తెలీకుండా వినడం తప్పన్న విషయం ఆ క్షణాన్న నేను మర్చిపోయాను. బొమ్మలా నిలబడిపోయాను.
ఏమే, మీరంతా కూడబెట్టి మీమీ పిల్లలకి ఇచ్చుకోరా? అలా ఇవ్వకుండా ఇంకెవరికేనా ఇస్తే చెప్పు, అప్పుడు నేను రాముడితో మాట్లాడతాను-అంది మామ్మ. నన్ను గమనించి అత్త మాటలాపేసి, అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
విన్నావా, మా మాటలు- అడిగింది మామ్మ. తలూపాను.
పట్టించుకోకు. ఎక్కడివి అక్కడే మర్చిపోవడం అలవాటు చేసుకో. నీకేమీ చెయ్యలేకపోయాననే బాధతో ఇచ్చాడు మీనాన్న. నువ్వు నీతోటివాళ్లలో తక్కువగా వుండకూడదని వాడి కోరిక. ఇప్పటికిప్పుడు మీకేం ఇల్లు కట్టుకోవల్సిన అవసరం లేదుగా? అదలా పడుంటుంది. ఉండనీ. కృష్ణ చదువుకి అంతోయింతో సర్దుదువుగాని. లక్ష్మీ, వాసూ కాదనే మనుషులు కాదు- అంది. దానికీ తలూపాను.
రవి ఇంజనీరింగ్ చదువుకుంటానని, ఇల్లమ్మేసి తన వాటా తనకి ఇమ్మన్నాడు. వాడికి డబ్బిచ్చేసి స్థలం తీసుకున్నాడులే, మీనాన్న. అప్పుడు అంత విలువ లేదు భూమికి. అదికూడా వాడి శక్తికి మించిందైపోయింది. అందుకే నీ చిన్నప్పుడు అంత యిబ్బందులు పడ్డారు. శేఖర్ అడిగినప్పటికి ధరలు పెరిగాయి. వాడి వాటా మొత్తం తీసుకునేంత తాహతు లేకపోయింది మీనాన్నకి. కొంత స్థలం తనుంచుకుని, మిగతాది బైటివాళ్ళకి అమ్మాడు. ఇంటిబాధ్యతంతా మీదేసుకున్నాడుకదా, ఇల్లూ స్థలం వాడికి వదిలెయ్యచ్చు వాళ్ళిద్దరూను. కానీ అలా చెయ్యలేదు. ఎవరిని ఎగేసేవాళ్ళు వాళ్ళకే వున్నారు. ఎవరి ఆశలు వాళ్ళకే వున్నాయి. అన్నీ బావున్నప్పుడు మీ తాత రాసిన విల్లు పట్టుకుని, పంపకాలు చేసుకున్నారు. పద్మమాత్రం? కాలేజికి వెళ్ళి ఎమ్మే చదవాలని దాని కోరిక. తనకంత శక్తి లేదన్నాడు మీ నాన్న. అదీ దానికోపం. అంతేనమ్మా! మీ తాతయ్య వున్నా ఇంతకన్నా ఎక్కువగా ఏదీ చెయ్యగలిగేవారు కాదు. ఒక రాముడో కృష్ణుడో నా కడుపున పుట్టి, ఈ భవసాగరాన్ని నాచేత యీదించాడనుకుంటాను. ఆ త్రిమూర్తులు మాత్రం తక్కువా? దేవుడిలా వచ్చి, మీ నాన్న చిటికెనవేలు పట్టుకుని నడిపించినట్టు నడిపించాడు. ఏ జన్మరుణమో మరి- అంది.
నేను ఆశ్చర్యంగా విన్నాను. రవి బాబాయ్‍కీ నాన్నకీ మధ్య మాటల్లేకపోవడానికి గల కారణం తెలిసింది. అదే పని చేసిన శేఖర్ బాబాయ్‍తో మాటలెలా నిలిచాయో తెలీలేదు. మామ్మే చెప్పాలి. ఇంకెవరూ చెప్పరు.
దానికెందుకు, ఆ పెద్దముచ్చట్లన్నీ? గీతా! మేం మా పిల్లలకి పెట్టుకున్నట్టే మీ నాన్న నీకు ఇచ్చాడు. మామధ్య గొడవలు మావి, మీ పిల్లలమధ్య గొడవలు మీవి. మావి మీకొద్దు, మీవి మాదాకా రావద్దు. సరా? పదవే, అక్కడ పీటలమీద ఆలస్యమౌతుంది- అని వచ్చింది అరుణత్త. ఆవిడా కొంత విన్నట్టుంది.
వచ్చి పీటలమీద కూర్చున్నాను.
ఏమీ లేదులేవే! అమ్మతో కాకపోతే ఇంకెవర్తో దెబ్బలాడతాను? బాగా చదువుకోవాలని వుండేది. చదువుకుంటే మంచి వుద్యోగం వస్తుంది, గరువులుదేవుకుంటూ బతకక్కర్లేదనుకున్నాను. రవిని చదివించలేదూ, అలానే నన్నూ చదివించేవాడు మీ నాన్న. ఆ త్రిమూర్తులు పడనివ్వలేదు- అంది పద్మత్త నాపక్కని వచ్చి కూర్చుని.
అర్థమైంది. నవ్వాను. చదువుకోవాలంటే కాలేజికే వెళ్లక్కర్లేదు. ప్రైవేటుగా చదువుకోవచ్చు. వాసు ఒక ఎమ్మే చేసాడు. ఇంకోటి చేస్తున్నాడు. నన్నూ చెయ్యమన్నాడు. ఇద్దరం కలిసి చెయ్యాలన్నది ఆలోచన. ప్రమీలత్తలాగ ఏదో ఒక వుద్యోగం వెతుక్కుంటే ఆర్ధికయిబ్బందుల్నీ దాటచ్చు తను. కానీ ఆవిడ కోరుకున్నది జీవనశైలి మెరుగుపరుచుకోవడం కాదు, అది సమూలంగా మారిపోవడం. అలాంటి అవకాశాలు మనలాంటి యిళ్ళలో దొరకడం కష్టం.
బారసాలకి దాదాపు అందరూ వచ్చారు. మనలో చాలామందిమి ఏదో ఒకలా కలుస్తున్నాం. ఇంకా ఎవరికీ పెళ్ళిళ్లవలేదుకాబట్టి కలుసుకోవడానికి కారణాలూ, వుత్సాహాలూ పుట్టుకొస్తున్నాయి. సుధీర్ రాలేదు. అందర్నీ ఫేస్ చెయ్యలేక కాబోలు. బిజీగా వున్నానని తప్పించుకున్నాడు. రాణా ఏవో సమస్యల్లో ఇరుక్కుని వున్నాడు. తనూ రాలేదు.
క్రియాశీలజీవితాలు ముగిసిన ముగ్గురు పెద్దవాళ్ళకి సన్మానకార్యక్రమంకూడా చేసాడు నాన్న. అమ్మమ్మకి ముత్తవ్వ సన్మానం. మామ్మకీ, అమ్మమ్మగారికీ తాతమ్మ సన్మానం. మునిమనవడు పుట్టినందుకు. ముగ్గురికీ చీరలు పెట్టి, బ్రాహ్మడిచేత ఆశీర్వచనం ఇప్పించాడు. అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయేవి. మూడునాలుగు తరాలు చూసేవారు. మామ్మకి పదహారేళ్లకి నాన్న పుట్టాడట. అంత చిన్నవయసులోనే పిల్లలని కన్నందుకు వాళ్లలో ఎలాంటి విచారంగానీ, ఏదో పోగొట్టుకున్నామన్న బాధగానీ కనిపించలేదు నాకు. జీవితాన్ని పూర్తిస్థాయి సంతోషంతో గడిపారు. తమకి ఏది లభిస్తే దాన్ని ఎలాంటి సంఘర్షణా లేకుండా స్వీకరించారు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వున్నప్పుడేమైనా బాధపడ్డారేమో తెలీదు. నేను చూసిందిమాత్రం మామ్మలో అపరిమితమైన వుత్సాహాన్నీ, శక్తినీ. అమ్మమ్మ కొంచెం అనారోగ్యం మనిషి. ఆస్త్మా వుండేది. చలికాలం బాగా ఇబ్బందిపడేది. వాసూవాళ్ళమామ్మ వీళ్ళిద్దరికన్నా పెద్దావిడ. ఆవిడకూడా తన పనులు తను చేసుకుంటూ, అవంతీపురానికీ కూతురి వూరికీ తిరిగేది.
కార్యక్రమాలన్నీ అయాక అందరం ఒకదగ్గిర చేరాం. ఇరవై కుర్చీలు ప్లస్ జోకి ఒకటి. అతను మనమధ్యని చాలా సరదాగా తిరుగుతున్నాడు. సుమతి పక్కని నిలబడితే ఇద్దరూ ఎంత గ్రేస్‍ఫుల్‍గా అనిపించారో” అంది గీత.
“ఆయనో నవ్వుల మహారాజు, అదో సుకుమారాల సుందరాంగీ” అంది మహతి.
గీత నవ్వేసింది.
“అబ్బో! ఇద్దరివీ బోల్డన్ని కథల్లే. నెలలపిల్ల తుషారని తీసుకుని ఒక్కర్తీ ముంబై వచ్చేసింది నన్ను చూడటానికి. సుమంత్ బోల్డు నొచ్చుకుని-
అయ్యో, బావా! నాకు చెప్తే నేను తీసికెళ్ళేవాడినికదా-అన్నాట్ట.
ఏమీ, పెళ్ళవకముందు మీ అక్క ఏమీ చేసేది కాదా? తనని వుద్యోగం చెయ్యద్దన్నది డబ్బు అవసరం లేక, అంతేగానీ యింట్లో బంధించడానికి కాదు- అని జవాబిచ్చాడట జో.
ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలిగే స్వేచ్ఛ, ఏదంటే అది చెయ్యడానికి ప్రోత్సాహం అన్నీ యిచ్చాడు జో సుమతికి. అతన్ని చూసి సుమంత్‍కూడా నేర్చుకున్నాడు. లత ఫిజీషియను. ఒకటో రెండో పెద్ద హాస్పిటల్స్‌లో గంటారెండుగంటలు వెళ్ళి కూర్చోవడం తప్ప పెద్దగా ప్రాక్టీసదీ వుండేది కాదు. ఆమె తల్లిదండ్రులు బాగా వున్నవాళ్ళు. కంపెనీలూ అవీ వున్నాయి. ఒక్కర్తే కూతురు. నెలతిరిగేసరికి డబ్బొచ్చి ఆ పిల్ల అకౌంట్లో పడిపోయేది. జో, సుమంత్ ప్రాక్టీసుల్లో బిజీగా వుంటే ఈ ఇద్దరూ ఎక్కడెక్కడో తిరిగొచ్చేవారు. ట్రెక్కింగ్, సైట్‍సీయింగ్, బుక్ ఫెస్టివల్స్ ఒకటేంటి? పెద్దపెద్ద గ్రూపులు వాళ్ళవి. ఆ గ్రూపుల్లో తిరిగేవారు. పిల్లలని వెంటబెట్టుకుని కొన్నిచోట్లకీ, ఇద్దరే విడిగా ఇంకొన్నిచోట్లకీ వెళ్ళేవారు. జో, సుమంత్ వీలునిబట్టి ఎక్కడో ఒకచోట వాళ్ళని కలుసుకునేవారు. తనిక్కడ లేనందుకు సుధీర్ భార్య భలే బాధపడేది. నన్నూ రమ్మనేది సుమతి. కానీ అప్పటికి నాదింకా స్ట్రగులే.
పిల్లలని ఇలాకూడా పెంచుతారని నాకు తెలీదు. ఎంతసేపూ చదివేరా, కడుపుకి ఇంత తిన్నారా, ఇంకా ఏమేం పెట్టచ్చాని మాత్రమే చూసేవాళ్ళం- అని పెద్దనాన్న ఆశ్చర్యపోయేవారు. ఆయనకి పిల్లల చదువులకన్నా ఎక్కువ సంతోషం సుమతిని చూస్తే కలిగేది. తను చేసి వచ్చినవన్నీ ఆయనకి వివరంగా చెప్పేది. తీసిన ఫోటోలు చూపించేది” అంది మహతి.
“దాని లైఫ్‍స్టైల్ మారింది. పద్మత్త కోరుకున్నది ఆ మార్పే” క్లుప్తంగా అంది గీత. మహతి ఆమెవంక చూసింది. సుమతితో స్పర్థ లేకపోతే గీతకూడా ఆ ప్రవాహంలో కలిసేదా? సుధీర్ని చేసుకుని వుంటే? ఈ రెండోది విడదీయరాని ఆలోచనగా మారిపోయిందేం అందరికీ?
“నువ్వేం అనుకుంటున్నావో నేను వూహించగలను. ఆ ఆలోచనని మీరంతా మనసుల్లోంచీ చెరిపెయ్యలేరా?” అడిగింది గీత. “మహీ! మనలో చాలామంది ముళ్ళకిరీటాలని మోస్తూ వుంటారు. నచ్చని జీవనశైలి, ఇముడ్చుకోలేని జీవితం, ఇష్టంలేని మనుషుల సహచర్యం, ఆ కిరీటానికి వుండే కొన్ని ముళ్ళు. నేను సుధీర్ని చేసుకుని వుంటే ఒక వికృతమైన ప్రాణిగా మారేదాన్ని. ఆ విలాసం, సరదాలు నాకు అమర్చిపెట్టడానికి నాన్న త్యాగం వుందన్న ఆలోచన నన్ను స్థిమితంగా వుండనిచ్చేది కాదు. నాన్నకీ నాకూ మధ్య ఒక అగడ్తలాంటిది వుండేది. సుధీర్ తల్లిదండ్రులకి నాన్నకి వున్నలాంటి సమస్యలు లేవు. వాళ్ళకోసం అతను చెయ్యాల్సింది ఏదీ లేదు. ఇద్దరికీ ఒకటే మెట్టు తేడా. అది డబ్బు కాదు, జీవనశైలి. కానీ నాన్నతో అలా కాదు. ఆయన నా చేయూత తీసుకోడు. తనుగా బాధ్యతల్లోంచీ బైటికి రాలేడు. ఇల్లు అమ్మేసాక కృష్ణకి ఏమీ మిగిలేదికాదు. ఎక్కడో ఓ చిన్న వుద్యోగం వెతుక్కోవలసి వచ్చేది వాడికి. వాడిని తక్కువస్థాయిలో చూడ్డం నావల్లకాదు. ఇవన్నీ నేను సరిపెట్టుకోగలిగితే,” ఆగింది గీత. కొద్దిక్షణాల మౌనం తర్వాత పూర్తిచేసింది. “నడమంత్రపుసిరితో కళ్ళుమూసుకుపోయి వుండేవి. ఒకవేళ నేను సుధీర్ని ఇష్టపడి చేసుకుని వున్నా, నేను పొందే ఆనందంయొక్క మౌలికతలో మార్పు వుండేదేమోగానీ సాంద్రతమాత్రం మారేది కాదు”
మహతి అలాగే చూస్తూ వుండిపోయింది. గీత సంభాషణ మళ్ళించేసింది.
“చెప్పానుకదా, బారసాలకార్యక్రమం తర్వాత అందరం కలిసి కూర్చున్నామని. ఇరవయ్యోకుర్చీ మయూఖ్‍ది.
మన టీమ్ కొత్తమెంబరేడే- ప్రహ్లాద్ అడిగాడు. వాడిని తీసుకొచ్చాను.
చిన్నబాస్కెట్ తెచ్చి అందులో దుప్పటీ మడిచి వేసి, దాన్ని కుర్చీలో పెట్టి అందులో వాడిని పడుక్కోబెట్టడానికి ఏర్పాటు చేసాడు. పల్లవిదాకా అందరూ అత్తలకీ బాబాయ్‍లకీ పుట్టిన పిల్లలు. వీడు మన తర్వాతితరంవాడు. అందరికీ థ్రిల్‍గా వుంది. ప్రహ్లాద్ ఈ విషయమే చాలా వుద్వేగంగా చెప్తూవుంటే వాడు ఒక్కసారి కంయిమన్నాడు. చూస్తే పాస్ పోసేసుకున్నాడు.
అసలు నీ సమస్యేమిట్రా? నువ్వే పక్కలో టేప్ ఇప్పేస్తావు. బట్టలన్నీ తడిపేసుకుంటావు. పైనుంచీ నేనేదో నిన్ను చేసినట్టు ఇంటి పైకప్పు ఎగిరిపోయేట్టు ఏడుస్తావు- అన్నాను వాడిని పైకి లేవదీస్తూ. వాళ్ళంతా వాడికోసం ఏర్పాట్లు చేసినంతసేపు పట్టలేదు వాడా పనిచెయ్యడానికి. అందరూ నవ్వందుకున్నారు.
వీళ్ళిద్దరికీ ఒక్క క్షణంకూడా పడట్లేదు- వాసు అన్నాడు.
వీడితోకూడా గొడవేనా నీకు? బ్రహ్మరాక్షసింగ్ ప్రాసెస్ పూర్తైపోయింది- వసంత్ నవ్వుతున్నాడు.
ఏంటో చెప్పరా, బాబూ- దబాయించాను. చెప్పడే. నవ్వులు ఆగడంలేదు. ఎంత సరదాగా వుండేవి మహీ, ఆరోజులు? అన్నిటికీ నవ్వే. సిల్లీసిల్లీగా మాట్లాడేసుకుని ఆ విషయాలకికూడా నవ్వేసుకునేవాళ్ళం.
అంతంత నవ్వులేంటి? పిల్లకుంక దడుసుకున్నట్టున్నాడు- మామ్మ వచ్చి అందర్నీ కోప్పడి, వాడిని తీసుకెళ్ళింది. ముగ్గురునలుగురు పెద్దవాళ్ళు నిరంతరం వాడి డిస్పోజల్లో వుండేవారు. ఏడిస్తే చాలు, బుజ్జగింపులూ, వూసులూ. వాడు కుంయ్‍మన్నా కంయ్‍మన్నా వాళ్లకి అందులో ఏవో అర్థాలు దొరికేసేవి. వింతల్లో వింత, ఇంత పెద్దటీమ్‍ని తయారుచేసిన మామ్మకికూడా వాడిని చూస్తే మురిపెమే. మునిమనవల్ని లెక్కపెట్టుకుంటూ సంతోషపడే మోడ్‍లోకి వచ్చేసింది.
సుమతి నాతో పూర్తిగా మాటలు మానేసింది. వాళ్ళ పెళ్ళి తర్వాత మేమిద్దరం కలుసుకోవడం ఇది మూడోసారి.
వాళ్ల పెళ్ళయ్యాక మేం కలుసుకున్న మొదటి సందర్భం నాన్న వెళ్ళి ఇద్దర్నీ భోజనానికి తీసుకొచ్చినప్పటిది. మమ్మల్నీ రమ్మన్నారు. కొత్తగా మన కుటుంబంలోకి వచ్చినవాళ్ళని ఇంటికి ఆహ్వానించి, కుటుంబాలుగా పరిచయం చేసుకోవడం మనింట్లో పద్ధతి. పైవాళ్లం కాకపోయినా మా పెళ్లయాక నన్నూ వాసునీకూడా అలానే పిలిచారు. అందులోనూ సుమతి మామ్మకి ముద్దులమనవరాలు. నాన్నకి పెద్దమేనకోడలు. ఇక అమ్మ విషయం తెలుసుగా? మనలో ఎవర్ని చూసినా తనకి ప్రేమే.
వెళ్ళేముందు వాసు నాతో అన్నాడు-
గీతూ! సుమతిని కలవడం నీకేకాదు, నాక్కూడా ఇష్టంలేదు. స్నేహాలు తుంచుకోగలంగానీ చుట్టరికాలు తుంచుకోలేంకదా? అదీకాక జరిగిన ఒకటో రెండో సంఘటనలు పుట్టినప్పట్నుంచీ వున్న అనుబంధాలని చెడగొట్టకూడదు. వాళ్లకి ఏదో కాస్త బాధగా వుంది. కొన్నాళ్లకి అన్నీ సర్దుకుంటాయి. అందుకని మనం తటస్తంగా వుందాం. ఇంకా రప్చర్స్ వద్దు. మరో విషయం. అది పెళ్ళిచేసుకుని, కొత్తకుటుంబంలోకి వెళ్తోంది. అతను మనకి పూర్తిగా తెలియని మనిషి. మనందరం దాన్ని బాగా చూస్తేనే అతనికి దానిమీద గౌరవం కలుగుతుంది. ఇంతమంది అన్నదమ్ములు నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నారని అనిపిస్తే తనూ తగ్గకుండా చూసుకుంటాడు. మనమధ్య గొడవలున్నాయని బైటపడితే అతనిముందు దాని విలువ తగ్గుతుంది- అని.
తనే అతనికి చెప్తే- అడిగాను.
దానంత తెలివితక్కువది ఇంకొకరు లేనట్టు- అన్నాడు.
మేమిద్దరం ముందుగానే వెళ్ళిపోయాం. ఇల్లంతా చకచక సర్దేసాను. అమ్మ సుమతికోసం కొన్న చీర చూపించింది. పసుపురంగుమీద వూదారంగు ప్రింటున్న వులీ నైలెక్స్ చీర. బావుంది. అతని బట్టలూ చూపించింది. ఫాంటు, షర్టు ముక్కలు. ఐనా మగపిల్లలకి అప్పట్లో పెద్ద వెరైటీలేం వుండేవి? నలుపో, ముదరరంగో ఫాంట్లు, లేతరంగో తెల్లవో షర్టులు. ఉంటే పెద్దవో చిన్నవో గళ్ళు. అంతేకదా?
కాస్తేదైనా తిను. వాళ్ళొచ్చి, కబుర్లు తెమిలి, భోజనాలకి కూర్చునేసరికి ఏవేళౌతుందో- అని మామ్మ తినడానికి ఏవో పెట్టింది. కృష్ణ కాలేజి మానేసి వుండిపోతానన్నాడు.
అరేయ్, నువ్వు చదివేది ఇంటరు. అలా కాలేజి మానకూడదు. మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడు వాళ్ళని చూద్దువుగాని. ఇప్పట్నుంచీ ఇంట్లో వుండి ఏంచేస్తావు- అన్నాడు వాసు. వాడు ముఖం ఇంత చేసుకుని వెళ్ళాడు. నాన్న వెళ్ళి సుమతినీ, జోనీ వెంటబెట్టుకుని వచ్చారు.
అమ్మ వాకిట్లోకి ఎదురెళ్ళి లోపలికి తీసుకొచ్చింది. పలకరింపులూ, మర్యాదమన్ననలు, మొదటివిడత కాఫీలూ అయ్యాయి. మాయిల్లు చూసి జో ఆశ్చర్యపోయాడు. ఎలాంటి భేషజం తెలీని మనిషి.
ఇంతంత పెద్దపెద్ద యిళ్ళు మాకు లగ్జరీయే. చిన్నప్పట్నుంచీ అపార్టుమెంట్స్‌లోనూ, అద్దె యిళ్ళలోనే పెరిగాను. ఎప్పటికేనా రెండొందలగజాలో మూడొందలగజాలో స్థలం కొనుక్కుని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని అంటుంటారు మా నాన్న అపార్టుమెంటులైఫ్‍మీద విసుగొచ్చినప్పుడు. మీది ఫ్యూచరిస్టిక్ జెనరేషనన్నమాట- అన్నాడు.
వాసూ వాళ్ళిల్లు ఇంకా పెద్దది- అంది సుమతి.
వాసుతో మాట్లాడుతోంది. నాతో మాట్లాడట్లేదు. వాసు చెయ్యిపట్టుకుని వదిలిపెట్టట్లేదు. అతిథిని ఇల్లంతా తిప్పి చూపించాము. ఆఖరికి వచ్చి, పెరట్లో జామచెట్టుకింద నిలబడ్డాము. పెద్ద జామకాయ వుంటే వాసు అందుకుని కోసిచ్చాడు. తలుపుసందులో పెట్టి దాన్ని నాలుగుముక్కలు చేస్తుంటే జో ఆశ్చర్యంగా చూసాడు- ఇంత సింపులా, తినడం అన్నట్టు. అల్లుడుకాబట్టి, అతనికి అలా యివ్వకూడదని అమ్మకి ఆ విషయం తెలిసినప్పుడు చెప్పింది. నిజానికి మనకి అలాంటివేం వుండవు. పెద్దవాళ్ళే నేర్పిస్తారు.
వీళ్ళిద్దరూ మాట్లాడుకోరా_ అడిగాడు జో.
వాసు నాకు కళ్ళతో సౌంజ్ఞ చేసాడు.
ఎందుకు మాట్లాడుకోం? మా కబుర్లు ఎప్పుడూ వుండేవే. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే విందామని చూస్తున్నాను- అన్నాను.
మేమిద్దరమూనా? ఇంకా నేను మాట్లాడ్డం మొదలుపెట్టలేదు. మొదటి సంవత్సరమేగా, ఇది- అతను పెద్దగా నవ్వాడు.
పదవే, లోపలికెళ్ళి కూర్చుందాం- అని సుమతి చెయ్యిపట్టుకుని లోపలికి లాక్కెళ్ళాను. ఆ వెళ్ళడంలో, గడప తట్టుకుంటే తను గట్టిగా నా భుజం పట్టుకుని ఆపింది.
కళ్ళు ఎక్కడో పెట్టుకుని నడిస్తే అలానే వుంటుంది- అంది నెమ్మదిగా.
కళ్ళు అక్కడా యిక్కడా పెట్టేస్తున్నావా నువ్వు, పెళ్లైందని- అన్నాను నవ్వు ఆపుకుని.
మామూలుగానైతే ఈ ఒక్క విషయంమీదా అరగంటేనా మాటలు జీళ్ళపాకంలా సాగేవి. కానీ తను జవాబివ్వకపోవడంతో ఆగిపోయాయి. ఇంట్లోకి వెళ్ళాక నాగదిలో కూర్చున్నాం. ఎదురుగా గోడకి మా పెళ్ళిఫోటో తగిలించి వుంది. ఆ ఫోటోనీ నన్నూ ఒకమాటు మార్చి చూసి, చూపులు తిప్పేసుకుంది. తను నాకు కొత్తమనిషిలా అనిపిస్తోంది. మావెనకే వాళ్ళిద్దరూ వచ్చారు. ఒకప్పుడు అదే గదిలో మంచమ్మీద మన నలుగురం ఇరుక్కుని పడుకుని రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం. ఆరోజులు మర్చిపోయినట్టుంది. ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని రెండునిముషాలకి లేచి నాన్న దగ్గిరకి వెళ్ళిపోయింది. నేను లేచి వంటింట్లోకి వెళ్ళాను. అప్పుడే వంటైపోయింది. మామ్మ కొంగుకి చెయ్యితుడుచుకుంటూ దాని వెనకే వెళ్తే నేను ఏవో సర్దుతూ వున్న అమ్మదగ్గిరకి వెళ్ళి వెనక ఆనుకుని, తన భుజంవంపులో ముఖం పెట్టి నిలబడ్డాను. కళ్లమ్మట నీళ్ళు వుబికి వస్తున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నాను. మనసుకి ఎంత సర్దిచెప్పుకున్నా బాధగానే అనిపిస్తోంది.
ఏమ్మా? సుమతి మాట్లాడ్డంలేదనేనా- చేస్తున్న పని ఆపి అడిగింది. నేను జవాబివ్వలేదు.
వాళ్ళన్నయ్యని కాదన్నావన్న కోపం మనసులో వుంటుంది. పైగా అదిప్పుడు నీకు ఆడబడుచుకూడా. వాళ్ళు ఆరుగురక్కచెల్లెళ్లకీ పెద్దకోడలివని నీగురించి చెప్తున్నారు. వదినా అని పిలవాలనేమో, లక్ష్మత్తని అడిగి తెలుసుకుని అలానే పిలువు. ఇంట్లో ఇద్దరు డాక్టర్లు. తనో డాక్టర్ని చేసుకుంది. ఇవన్నీ నువ్వే అర్థం చేసుకుని, జాగ్రత్తగా వుండాలి గీతూ! ఎంతవరకూ అవసరమో అంతవరకూ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంక మీరు చిన్నపిల్లలు కాదు. పెద్దయ్యారు, పెళ్ళిళ్లయ్యాయి. ఎవరి యిళ్ళూ, వాకిళ్ళూ, సంపాదనలూ, హోదాలూ వాళ్ళకే వుంటాయి. అంటే ఎవరి జీవితాలు వాళ్లవి ఇకపైని- అంది మృదువుగా.
నేను కళ్ళు తుడుచుకున్నాను.
అలా అన్నిటికీ బాధపడకూడదు. అందులోనూ ఇలాంటప్పుడు. నువ్వెంత సంతోషంగా వుంటే పుట్టబోయే పాపాయి అంత నవ్వుతూ వుంటుంది. లేకపోతే నీలాగే ఏడుస్తూ వుంటే మరి నువ్వే వోదార్చుకుంటూ వుండాలి- అంది. నవ్వి, దూరం జరిగాను.
నాన్న నీకు మేనరికం చేస్తానంటే భయపడ్డాను గీతూ! ఐదుగురికీ మగపిల్లలున్నారు, ఎవరికిచ్చి చేస్తే ఎవరికి కోపం వస్తుందోనని. అనుకున్నంతా అయింది. అసలువాళ్ళు మీరిద్దరూ గొడవల్లేకుండా వుంటే అదే చాలు మాకు. వాసుకి కోపం రాకుండా చూసుకో. ఈ విషయాల్లో అతనెలా చెప్తే అలా నడుచుకో. సర్లే, మనం ఇద్దరమే ఇక్కడ మాట్లాడుకుంటుంటే బావుండదు. వెళ్ళి వాళ్లదగ్గిర కుర్చో. నేనూ వస్తున్నాను- అంది.
నేను నాన్నదగ్గిరకి వెళ్ళాను. సుమతి లేచి వాసూవాళ్లదగ్గిరకి వెళ్ళింది.
భోజనాల టైముకి కృష్ణ స్కూలునించీ వచ్చాడు. జోని చూసి చాలా థ్రిల్లయాడు. భోజనాలయ్యాయి. మరికాసేపయాక, వెళ్తామని లేచారు వాళ్ళు. రాత్రిదాకా వుండి వెళ్లమని అంతా అన్నారుగానీ వాళ్ళకి ఇంకేవో ప్రోగ్రామ్స్ వున్నాయట.
తన కాళ్ళకి పసుపు రాసుకుని, సుమతికి కాళ్లకి పసుపు రాసి, చలిమిడీ, పసుపూ, కుంకం, చీరా పెట్టింది అమ్మ. అలాగే నాన్న జోకి బట్టలు పెట్టారు. నాకూ రాసింది. వద్దనటాలూ, బొటనవేలిగోరికి పెట్టు చాలు, సూత్రాలకి పెట్టుకుంటాను అనటాలూ వుండవు. మొట్టికాయలు పడిపోతాయి.
ఎందుకండీ, ఇవన్నీ- అతను బట్టలు తీసుకోవడానికి మొహమాటపడ్డాడు. వాళ్ళు వీళ్ల కాళ్లకి దణ్ణం పెట్టారు. మామ్మకికూడా.
ఇది మీ అమ్మకేకాదు, నీకూ పుట్టిల్లే . వచ్చి వెళ్తూ వుండండి ఇద్దరూను- అంది మామ్మ.
నువ్వు నాతో రాకూడదూ, కొన్నాళ్ళు- గారాలుపోతూ అడిగింది సుమతి మామ్మని.
ఇదో, దీనిలాగ నువ్వూ ఓ కొడుకుని కను. వాడిని చూసుకోవలసింది నేనేకదా? అప్పుడొస్తాను- అంది మామ్మ.
గీతకి కొడుకని ఫిక్సైపోయావేమిటి? నాకుమాత్రం వద్దు. ఇంట్లో వాళ్ళిద్దరితోటీ, ఇల్లుదాటితే వీళ్ళు ఐదుగురితోటీ బోల్డు కష్టాలుపడ్డాను. ఆడపిల్లైతే బావుంటుంది- అంది.
మగపిల్లల్తో తిరిగి తిరిగి మీ నలుగురూ సిగ్గూఎగ్గూ వదిలేసారేమిటే-అంది మామ్మ దాని నెత్తిన చిన్నగా మొట్టి.
సిగ్గుపడుతునే వున్నానమ్మమ్మా! మర్చిపోయినా అమ్మ గుర్తుచేస్తుంటుంది- అంది.
నేనుకూడా గుర్తుచేస్తుంటాలే సుమతీ! పక్కనే వుంటాగా!- అన్నాడు జో పెద్దగా నవ్వి. నవ్వాగలేదు నాకు. నవ్వేసాను. వాసు తలపట్టుకున్నాడు.
వీళ్ళు నలుగురు బావా! మహామేథావులని చెప్పుకోదగ్గవాళ్ళు. ఇక్కడ ఇద్దర్ని చూస్తున్నారు. ఇంకో ఇద్దర్ని చూడబోతున్నారు. వీళ్ళ గైడెన్స్‌లో మరో ఆరుగురు తయారౌతున్నారు – అన్నాడు. జో నవ్వుతునే వున్నాడు.
వాళ్ళు వెళ్ళే సమయం వచ్చింది. మామ్మ సుమతిని దగ్గిరకి తీసుకుని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది. బుద్ధులు చెప్పింది. దాన్ని జాగ్రత్తగా చూసుకొమ్మని జోకి చెప్పింది.
ఆ తర్వాత మరోవారానికి మాయింటికి పిలిచాం. వాసు వాళ్ళింటికి వెళ్ళి ఆహ్వానించి వచ్చాడు. వాళ్లంతట వాళ్ళు వచ్చేస్తామన్నారు. వాళ్లకి పెట్టడానికి మేమిద్దరం వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చాం. మాధవ్, తులసి ఇంట్లోనే వున్నారు. అత్త, నేను, తులసీ కలిసి వంట చేసేసాం. వాళ్లకోసం ఎదురుచూస్తుంటే ఇంటిముందు బైక్ ఆగింది. అత్త వెళ్ళింది. వాసూవాళ్ల నాన్నని పలకరించి లోపలికి వచ్చారు.
అవంతీపురంవాళ్ళ ఏడుగురు రాజకుమారుల్లో ఇదుగో, వీడు ఐదోవాడు. సివిల్స్, గ్రూప్స్ రాస్తున్నాడు- అంది సుమతి మాధవ్‍ని పరిచయం చేస్తూ. అమ్మావాళ్ళింట్లో వాసు మన నలుగురినీ మహామేథావులన్నమాట గుర్తుపెట్టుకుని రిపార్టీ ఇచ్చింది. రాజకుమారుడంటే ఏ పనీ చేతకాని సుకుమారుడని మన కోడ్. వాళ్లు నలుగురూ మాట్లాడుకుంటూ వుంటే నాకు వాళ్లమధ్య స్థానం లేదనిపించింది. తులసికూడా వాళ్లతో చేరిపోయింది. అత్తదగ్గిరకి వెళ్ళిపోయాను.
ఏమైందే, అలా వున్నావు- అడిగింది అత్త.
ఏం లేదు. నేనిప్పుడు సుమతిని వదినా అని పిలవాలా- అన్నాను.
ఏమైనా అనుకున్నారా, ఇద్దరూను? సుమతి అలా పిలవమని చెప్పిందా? నీకన్నా పెద్దదికదా, అతనిముందు పేరుపెట్టి పిలిస్తే బావోదని అందేమో! పోనీ అలానే పిలు- అంది.
మా పెళ్లప్పుడు మగపిల్లలందరికీ అలానే చెప్పారు, నేను వాళ్ళకి వదిన్నని. వాళ్ళు గిజగిజలాడారు. వాళ్లంతా వాసుదగ్గిర మొరపెట్టుకున్నారట, ఇంతకన్నా అన్యాయం వుండదని. ఇప్పుడు నావంతా? సుమతి ఒక్కదాన్నేనా, మహీనీ, రవళినీకూడా అలానే పిలవాలా?
ఏమో! నాకేం అర్థం కావట్లేదు- అంటూ అక్కడినుంచీకూడా వెళ్ళిపోయాను. కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగాను. వాసు రమ్మన్నాడని తులసి వచ్చి నన్ను పిలుచుకుపోయింది. అత్తలు ఆరుగురూ కూర్చుని మాట్లాడుకుంటుంటే అమ్మ ఎలా పక్కకిపక్కకి తప్పుకునేదో, వాళ్లమధ్యని పరాయిగా ఫీలయ్యేదో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్లలో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. అమ్మని గౌరవంగా చూస్తారు. ఎప్పుడూ ఒక్కమాటకూడా అనరు. మామ్మకూడా అనదు. ఐనా పరాయితనం. అలాంటిది నాకు అనుభవంలోకి వచ్చింది.
భోజనాలకి లేచినప్పుడు ఇల్లు చూపించింది సుమతి జోకి.
నేను చెప్పానా, వీళ్ళిల్లు చాలా పెద్దదని. చిన్నప్పుడు అందరం ఈ చుట్టుపక్కలే వుండేవాళ్ళం. స్కూలునించీ ఇంటికెళ్తూ ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఆటలు, చదువు అన్నీ ఇక్కడే, ఈ అరుగుమీదే. కనకాంబరాలు, జాజిమొగ్గలు, మరువం తెంపి వుంచేది పిన్ని. అవన్నీ మాలకట్టి పెట్టుకునేవాళ్ళం. పొద్దుపోయేక ఎవరిళ్ళకి వాళ్లం వెళ్ళేవాళ్ళం- అంది. ఆ అరుగూ, దానికి ఎదురుగా బావీ, చుట్టూ మొక్కలూ. చాలా నచ్చాయి జోకి. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే కాలం తెలీలేదు. రాత్రిదాకా వుండిపోయారు. ఆరోజు పౌర్ణమి కావడంతో చాలా థ్రిల్లయ్యాడు.
భార్యాభర్తలిద్దరే ఏకాంతంలో అనుభవించాల్సిన వున్మత్తమైన వెన్నెల అది. మా గదిలో కిటికీ చాలా పెద్దది. అందులోంచీ ప్రవాహంలా దూకుతూ వుంటుంది వెన్నెల. కిటికీ పక్కని జాజితీగ పెట్టాను. అది ఇప్పుడిప్పుడే అల్లుకుంటోంది. రాత్రి భోజనాలుకూడా అయాక వాళ్ళిద్దరు బయల్దేరారు.
ఇలాంటి యిల్లుంటే ఇంకేమీ అక్కర్లేదు. సూర్యుడూ చంద్రుడూ కిటికీకి కట్టేసిన గాలిపటాల్లా వున్నారు- అన్నాడతను.
అప్పుడప్పుడు వస్తుండండి- అంది అత్త.
నాకింకా సుమతిని వదినా అని పిలిచే అవకాశం రాలేదు. పిలిస్తే తన కోపం తగ్గుతుందేమోనన్న ఆశకూడా కలిగింది.
బ్రిటిష్‍వాళ్ళు ఈపాటి యిళ్ళకికూడా కేజిల్సని పేర్లు పెట్టేసుకుంటారు. ఆ లెక్కన మీకు రెండుకోటలున్నాయి. సైన్యం వున్నారు. కమేండర్ అనచ్చు. రింగ్‍లీడర్ అంటే మరీ చిన్నపిల్లలవ్యవహారంలా వుంది- అన్నాడు జో వెళ్ళేముందు నాతో.
తులసికికూడా ఒక కోట వుందికాబట్టి అవంతీపురం రాజకుమారి అనడంలో తప్పులేదని తీర్మానించాడు. అతను సరదాగానే వున్నాడుగాని సుమతి ఆపుతోంది. దానికి ఇష్టంలేనిది అతనెందుకు చేస్తాడు? క్రమంగా దూరం జరిగిపోయారు వాళ్ళు. దూరమా అంటే పూర్తి దూరమూ కాదు.
అందరం కూర్చుని మాట్లాడుకుంటుంటే నువ్వెక్కడికి వెళ్ళావే? వంటంతా పొద్దున్నే చేసేసుకున్నారుకదా? ఇంకేం పెత్తనాలు చేసావు? సమస్యేదైనా వున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి కళ్ళుతుడుచుకోవడం కాదు, ఎదురునిలబడాలి. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు. నాపక్కనే నువ్వు వుండాలి- అన్నాడు వాసు వాళ్ళు వెళ్ళాక.
దాన్ని వదినా అని పిలుస్తానన్నావుకదా? పిలవలేదేం? ఏదో ఒక మిషపెట్టుకుని పిలవాల్సింది. మళ్ళీ వాయిదా ఎందుకు- అడిగింది అత్త.
సుమతి, వదినా- అని అడిగి పగలబడి నవ్వాడు మాధవ్.
సీతాకోకచిలుకలే మీరంతా! రెక్కలాడించేస్తున్నారు. నువ్వేమో మా అందరికీ వదినవి. నీకేమో అది వదినా- అన్నాడు.
మయూ పుట్టాక సుమతికి కొడుకు. వాడిన బట్టలూ అవీ పంపిస్తే అతనేమైనా అనుకుంటాడేమోనని పిల్లల బట్టలు పంపలేదు.
నా కొడుకు మేనమామల బట్టలు తొడుక్కోనక్కర్లేదా? మనింటి వుయ్యాల వాడికి వద్దా- అని అడిగి రప్పించుకుంది. ఇంట్లో సాంప్రదాయంగా వస్తున్నవి ఏవి జరక్కపోయినా మనని వేరుగా చూస్తున్నారనిపిస్తుంది. తనూ అలానే అనుకుంది. బట్టలన్నీ జాగ్రత్తగా మడతలు పెట్టి, ఉయ్యాలతోపాటు ఇస్తే మామ్మ, రవి బాబాయ్ తీసుకెళ్ళి ఇచ్చారు.
ఇంట్లో పెద్దగా ఏవీ కొనే అవసరం లేకపోవడం, ఏ వస్తువు కావాలన్నా ఎవరో ఒకరింట్లో వుండటం, నడకరావటానికి వాడే తోపుడుబండి, మూడుచక్రాల సైకిలు ఇలా పిల్లల వస్తువులు ఒకళ్లదగ్గిర్నుంచీ ఇంకొకళ్ళకి బదిలీఅవడం, అవసరానికన్నా ముందే అవి ఎవరో ఒకరు చేర్చవలసినచోటుకి చేర్చడం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత సుమతి మారింది. చాలా” అంది గీత.
“అది మారింది నిజం. అంతా పైపై మార్పు. దాని స్వభావం మారలేదు. మనందరిమీదా దాని ప్రేమ, అభిమానం చెక్కుచెదరలేదు. నాకోసం అప్పుడు ఎంతో ఆదుర్దాగా ముంబై వచ్చింది. గీతూ! నువ్వు ఎప్పుడు వెళ్ళమన్నావో అప్పుడే వచ్చింది తప్ప స్వతంత్రించలేదు. ఐనా, మా అమ్మ పోయినప్పట్నుంచీ మీరిద్దరూ మాట్లాడుకుంటునే వున్నారుకదా?” అంది మహతి.
“చాలా విషయాలు చెప్పాలని వుంది మహీ! నా యీ ప్రేమలూ, బంధాలూ అన్నీ చిక్కుముళ్ళలా మారిపోయి, ఆలోచనలన్నీ గజిబిజిగా ఐపోతుంటాయి. రాత్రి మంచంమీద పడుక్కుని ఒక్కదాన్నే ఆలోచించుకుంటూ వుంటాను. అన్నీ మా ఇద్దరికీ తెలిసినవేకదా, వాసుకి చెప్పడానికి ఏవీ ప్రత్యేకంగా తోచేవి కాదు. నీతోకూడా ఏమీ చెప్పాలనుకోలేదు. నా దృష్టిలో మనం అందరం ఒకటే. విడిగా ఏం చెప్పాలో తెలీలేదు. కానీ నీతో చెప్పడం మొదలుపెట్టాక అర్థమైంది, ఒకే సంఘటనలో మనం అందరం వున్నా, ఎవరి దృక్కోణం వాళ్ళదని” అంది.
ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని, ప్రేమగా అంది మహతి, “వాసుకూడా ఆ భరోసామీదే వున్నాడు, తనకి చెప్పనివికూడా నాకు చెప్తావని” అని.
“తనకి తెలీనివీ, చెప్పకూడనివీ ఏవీ లేవు. కానీ నాకే ఏదో దు:ఖం. ఎడతెగట్లేదు” కళ్ళుతుడుచుకుంది గీత. మళ్ళీ మొదలుపెట్టింది.
“బారసాల ఐపోయిన మర్నాడు మయూఖ్‍ని చూడటానికి సుధీర్ వచ్చాడు. వాసు ఆఫీసుకి వెళ్ళాడట, ఇద్దరూ కలిసివచ్చాడు. తనలో ఒక్కోసారి చూసినప్పటికీ మార్పు తెలుస్తోంది.
నిన్న రాలేదేరా, అందరూ వచ్చారు. నువ్వూ రాణాతప్ప మీ పిల్లసైన్యంకూడా అందరూ వచ్చారు. నువ్వు లేకపోవటం వెల్తిగా అనిపించింది- అంది మామ్మ.
నిన్న ఓపీలో చాలా రష్ వుంది అమ్మమ్మా! నాతో చేసే మరో డాక్టరు రాలేదు. దాంతో ఎక్కడా వీలు చిక్కలేదు. రాణా ఎందుకు రాలేదట- అడిగాడు. ప్రశ్నకి జవాబుకోసం ఎదురుచూడకుండా కాళ్ళుచేతులూ కడుక్కుని వచ్చి, వుయ్యాల్లోంచీ మయూఖ్‍ని తీసుకున్నాడు. పల్లవితో మొదలుపెట్టి అందరికీకూడా ఎంత చంటిపిల్లల్నేనా ఎత్తుకోవడం బాగా వచ్చు. వాడిని తదేకంగా చూస్తూ వుండిపోయాడు. ఆ మనిషిని అలా చూస్తుంటే గుండెలుపగిలేంత దు:ఖం మోస్తున్నాడనిపించింది. మనింట్లో మగపిల్లలందరికీ నాన్న రోల్‍మోడలు. అత్తలు అలా చెప్పి పెంచారు వాళ్ళని. అతనిది ప్రేమే అనుకున్నా, పోగొట్టుకున్నది నన్నొక్కదాన్నే కాదు, నాద్వారా మాయింట్లో దొరికే శాశ్వతస్థానాన్ని, నాన్నతో ఇంకా బలపడాల్సిన అనుబంధాన్ని, వాసుతో కనీకనిపించని పోటీలో విజయాన్ని.
భోజనం చేద్దువుగాని రారా! ఎప్పుడు తిన్నావోను- అంది మామ్మ.
వాసు పిల్లాడిని తీసుకున్నాడు.
నువ్వు- అడిగాడు సుధీర్.
నాదైపోయిందిరా! అన్నం తినేసే ఆఫీసుకి వెళ్తాను. మధ్యాహ్నం లైటుగా తింటాను- అన్నాడు వాసు.
ఐతే నాతోకూర్చుని ఏదో ఒకటి తిందువుగాని- అని లేవదీసాడు సుధీర్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి.
ఒక్కడివీ వేరే వుండటం దేనికిరా, సుధీర్? అమ్మావాళ్లతోటే వుండచ్చుకదా- అడిగింది మామ్మ.
ఇందులో కొత్తేముంది అమ్మమ్మా? చదువుకుంటున్నప్పట్నుంచీ అలవాటేగా- అన్నాడు.
అదివేరు, ఇదివేరు. పోనీ, వాళ్లనే నీదగ్గిరకి రమ్మనకపోయావా- అడిగింది.
ఇద్దరి ఆఫీసులకీ బాగా దూరమౌతుంది. ఈ వయసులో అంత కష్టపడటం దేనికి- తన జవాబు.
ఇప్పుడింత కష్టపడుతూ ఇప్పుడు నీకీ వుద్యోగం దేనికిరా- అన్న ఆవిడ ప్రశ్నకి,
చదువైపోయాక జాబ్ చెయ్యకుండా ఏం చెయ్యను? ఇల్లమ్మేసాం కదమ్మమ్మా! ఎంతోకొంత సంపాదించి మిగిల్చితే, నాన్న రిటైరయ్యాక ఆ డబ్బుకి కలిపి మరోటేదైనా కొనాలని ఆలోచన- అన్నాడు.
పెద్దకొడుకువి, ఆపాటి ఆలోచించుకోవాల్లే. పోనీ నేనొచ్చి వుండనా, నీతో? వేళకి వండిపెడతాను- అంది.
మావి బేచిలర్స్ క్వార్టర్సు అమ్మమ్మా! నువ్వు వచ్చి వుండటానికి వీలుగా వుండదు. వద్దువుగాని. ఇల్లు కొన్నాక వచ్చి, నీకు తోచినన్నిరోజులు వుందువుగాని- అన్నాడు చిన్నగా నవ్వి.
నాన్న భోజనానికి వచ్చారు. సుధీర్ని చూసి చాలా సంతోషపడ్డారు. మన కుటుంబంలో మొదటి డాక్టరని ఎంతో గర్వం. ఎందరికి చెప్తారో!
ఎలా వున్నావురా? ఉద్యోగం ఎలావుంది? పనిధ్యాసలో పడి తిండీ అదీ మానేసావా, ఇలా చిక్కిపోయావు- అంటూ ప్రశ్నలు అడిగారు. సుధీర్‍కూడా నాన్న తింటున్నంతసేపూ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడు. భోజనాలయ్యాక, నాన్న, వాసు ఆఫీసులకి బయల్దేరారు. సుధీర్‍కూడా వెళ్తానని లేచాడు.
నేను డ్రాప్ చేస్తాను- అన్నాడు వాసు.
ఆటోలో వెళ్ళిపోతాలేరా- అన్నాడు సుధీర్.
మాట్లాడకుండా బైక్ ఎక్కరా- అన్నాడు వాసు.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
సుధీర్ని అలా వదిలెయ్యకండిరా! కాస్త గమనిస్తూ వుండండి- సాయంత్రం వచ్చాక వాసుతో మామ్మ అంది.
ఎందుకొదిలేస్తాం? వాడే నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. ఐనా వీడిగురించి చూసుకోవడానికి సుమంత్ వున్నాడుగా? ఇంక ఈ చుట్టరికాలు తగ్గించుకుంటేనే మంచిదని వాళ్ళ వుద్దేశ్యం కావచ్చు. సుమతి దీంతో మాట్లాడ్డం మానేసింది. అంత తప్పేం చేసింది గీత? ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని చెప్పాం. పెద్దవాళ్ళు నిలబడి పెళ్ళిచేసారు. అందుకు దీన్ని సాధించడమేమిటి- అన్నాడు వాసు.
అలాంటిదేమీ వుండదురా! మీ అమ్మావాళ్ళు ఆరుగురికీ గీతని పెద్దకోడలని చెప్పుకుంటున్నారా, ఇది పెద్దకోడలైనప్పుడు అది పెద్దాడబడుచు కాదా? కాస్త గోటుపోతోందేమో- అంది మామ్మ.
పెద్దాడబడుచైతే మర్యాదలు చేయించుకోవాలి. అక్కడేదైనా తేడా వస్తే దబాయించి అడగాలి. కొత్త ఆట ఆడతాం. అంతేగానీ ఈ మాట్లాడకపోవటం, తప్పుకు తిరగడం, గీత బాధపడటం నాకెందుకో బాలేదు. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన ప్రేమలు అలా పక్కకి పెట్టేస్తే ఎలా- అన్నాడు వాసు చిన్నబుచ్చుకుని. మామ్మ తనని చెయ్యిపట్టుకుని పక్కని కూర్చోబెట్టుకుంది. ఎంతటి కోపాలూ ఈ లాలనలో చల్లారిపోతాయి. వాసూ తగ్గాడు.
ఏవి ఎలా వున్నా, సుధీర్ వచ్చి వెళ్లడం, వాడి ఆకారం నాకు గుండెల్లో ఎక్కడో కదిలించినట్టైంది. ప్రిన్స్‌కదూ, వీడు? సుధీర్ని అలానే చూసేవాళ్ళం అందరం. తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా వుండేవాడు. వాళ్ళ నాన్నకి వాడంటే ఎంత ముద్దో! ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళకి నిజంగా డబ్బులేదా? మిథ్యాగౌరవంతో బతికేవారా? డబ్బుకి మించిన అవసరాలవల్ల ఆ లేనితనం, సరిపోకపోవడం వచ్చాయా? కాదనిపించింది.
జీవితం మనకి పర్యవసానంగానే తప్ప కారణంగా ఎప్పుడూ కనిపించదు. ఒక్కోసారి అది వూహలమీద కట్టుకున్న పేకమేడకూడా. నా పెళ్ళిప్రతిపాదన మరో రెండుమూడేళ్ళు ఆలస్యమై వుంటే వాళ్ళింట్లో అన్నీ సరిగ్గా జరిగి వుండేవి. ఈ మార్పులు వచ్చేవి కాదు. అప్పోసప్పో చేసి ఇతన్నీ చదివించేవారు. ఇతనికికూడా అది పెద్ద అభ్యంతరం అనిపించేదికాదు. నా పెళ్ళివిషయం అత్తకి మోస్తున్న ఆర్థికభారాన్నుంచీ తప్పుకోవడానికి ఒక అవకాశాన్ని చూపించింది. పేకమేడకి కదలికలు వచ్చాయి. మళ్ళీ ఇదీ కారణం కాదు, పర్యవసానమే. వాసు చదువైపోయి వుద్యోగం రావటం నాన్న నా పెళ్ళి చెయ్యాలనుకోవడానికి కారణం. అతనికి అంత వెంటనే వుద్యోగం రాకపోయి వుంటే అందరూ అంత తొందరపడేవారుకాదు. ఇదీ పర్యవసానమే. సుధీర్‍వాళ్ల నాన్నలాగా వాసూ వాళ్ళనాన్న ఇంటిని పట్టించుకోకపోవడం అతను పై చదువులకి వెళ్లకుండా వున్నచోటే వుద్యోగం వెతుక్కోవడానికి కారణం. ఇలా వెతుక్కుంటూ వెళ్తే దేనికీ మూలం దొరకదు మహీ! పైకి కనిపించేదాన్నే కారణం అనేసుకుని కళ్ళెదురుగా వున్నవాళ్లని తప్పుపడతాం. నా విషయంలోనేనా, ప్రమీలత్త విషయంలోనేనా జరిగింది ఇదే” అంది గీత.
మహతి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. నరేంద్ర అకారణద్వేషం వెనక వున్న కారణాన్ని తెలుసుకోగలిగిన తనకన్నా ఇలాంటి విషయాలు మరెవరు అర్థం చేసుకోగలరు?
“మూడునెలల మెటర్నీటీ లీవు పూర్తైంది. మరోనెల ఎక్స్టెండ్ చేసాను. ఈలోగా మయూఖ్ మనుషుల్ని గుర్తుపట్టసాగాడు. నేను ఎటు వెళ్తే అటు తల తిప్పుతున్నాడు. చిన్నచిన్న నవ్వులు ఒలకబోస్తున్నాడు. మెడ నిలుపుతున్నాడు. బోర్లాపడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక చెయ్యిమీద తిరగబడి, ఆ చెయ్యి తీసుకోవడం రాక ఏడుపు. వాడి చెయ్యి తియ్యడానికో అసిస్టెంటు, సదా నీ సేవలో అన్నట్టు. కాస్త ఆలస్యమైందో ఇంటికప్పు లేపేస్తున్నాడు. రోజులు క్షణాల్లా దొర్లిపోయాయి. ఇక ఆఫీసులో చేరాల్సిన సమయం వచ్చింది.
అప్పుడన్నాడు వాసు- ఈరోజు తిథి మంచిదే. మీ ఆఫీసరుగారింటికి వెళ్ళి కలిసి వద్దాం- అని. నాకు నచ్చలేదు. ముఖం చిట్లించి, ఎందుకని అడిగాను.
ఆఫీసులో కలుస్తానుకదా- అన్నాను.
గీతూ! ఆయన కూతురు ప్రసవంలో చనిపోయింది. ఆరోజు నిన్నంత హడావిడిగా రిలీవ్ చెయ్యడానికి అదే కారణం. అక్కడ హాస్పిటల్లో
డెడ్‍బాడీని వుంచుకుని ఆఫీసుకి ఫోన్‍చేసి చెప్పారట. నువ్వు తిరిగి డ్యూటీలో చేరేదాకా ఈ విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదనికూడా స్టాఫ్‍కి స్ట్రిక్ట్‌గా చెప్పారట. అందుకే ఎవరూ నీతో అనలేదు. మీ ఆఫీసుకి వెళ్ళినప్పుడు తెలిసాయి ఈ విషయాలు. వెంటనే వాళ్లింటికి వెళ్ళి చూసి వచ్చాను. నిజానికి వీడు పుట్టేదాకా నాకూ భయంభయంగానే వుండేది- అన్నాడు చప్పుని నా చెయ్యి పట్టుకుని.
నేను నివ్వెరపోయాను. ఒక ఆడపిల్ల, బిడ్డని కనడంలో వున్న రిస్కేమిటో అప్పుడు అర్థమైంది. భయంతో నిలువునా వణికిపోయాను. చావంటే ఏమిటో అర్థమయ్యే వయసుకాదుకదా, అది? నిజం అనేది మంచుతెరల వెనక ఎలా దాగి వుంటుందో, ఆ మంచు కరిగిపోయి బైటపడ్డాక ఎంత కటువుగా వుంటుందో తెలిసింది.
గీతా, ఇది తినమ్మా, బావుంటుంది. బాగా బలం వస్తుంది, మా పాపకోసం తెప్పించాను- అంటూ ఏది కొన్నా నాకూ కొంత వాటా వేసి, ఆయన కన్నకూతురితో సమానంగా నామీదకూడా కన్సర్న్ చూపించిన వ్యక్తిని ఒక చిన్నవిషయం నాముందుకి రాకపోవడంచేత వైమనస్యంతో చూసాను. మహీ! జీవితం నా ముందు ఒకొక్క పొరా ఇప్పుకుంటున్నట్టు కనిపించింది.
బాబా, పాపా? ఎలా వున్నారు- అడిగాను అతికష్టమ్మీద.
బాబు- వాసు జవాబు.
ఏమిటి, మీరిద్దరూ కలిసి చావు పరామర్శకి వెళ్తారా? వద్దు- అంది మామ్మ భయపడుతూ.
గీత పై ఆఫీసరుకద అమ్మమ్మా! వెళ్ళి చూసి రాకపోతే బావుండదు. అదీకాకుండా ఆయన అంతదు:ఖంలో వుండికూడా గీతగురించి ఆలోచించారు- అన్నాడు వాసు.
ఔననుకో, నువ్వెలాగా వెళ్ళి చూసొచ్చావుకదా? తప్పనిసరైతే దీన్ని తీసుకుని నేను వెళ్తాను. చిన్నపిల్ల, ఇదేం వోదార్చుతుంది అంత పెద్దవాళ్లని. ఇక్కడే భయపడిపోతోంది. వెళ్లక తప్పదా – అని మరోసారి అడిగి, నాతో బయల్దేరింది. ఆత్మీయులని పోగొట్టుకున్నవాళ్ళని పరామర్శించడంకూడా ఒక నైపుణ్యమే. తప్పనిసరిగా నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎంత పెద్ద దు:ఖంలోంచేనా తమని తాము ఓదార్చుకుని బైటపడతారనుకుంటాం. అది తప్పు. వాళ్లకీ ఓదార్పు కావాలి. ఆ దు:ఖంలోంచీ బైటపడేసే స్నేహహస్తం కావాలి. లేకపోతే ఆ దు:ఖం వారిని లోలోపల్నుంచీ ఆర్చేస్తుంది. వారి నీడ ఎవరికీ చల్లగా వుండదు.
మయూఖ్‍ని అమ్మకి వదిలి మేమిద్దరం వెళ్ళాము. మొదటిసారి వాడిని వదిలిపెట్టి వెళ్లడం. నా శరీరంలోంచో, మనసులోంచో ఒక భాగాన్ని వుంచేసి వెళ్తున్నట్టనిపించింది. నాకు వాడిమీద అంత ప్రేమ వుందనికూడా అప్పటిదాకా నాకు తెలీదు. ఉద్యోగం చేసే ప్రతి అమ్మా ఎదుర్కోవలసిన పరిస్థితి ఇది. మయూఖ్‍కోసం ప్రాణం పెట్టేవాళ్ళు చుట్టూ వున్నారు. నేను నిశ్చింతగా వెళ్ళచ్చు. ఐనా నాకంతా దిగులుదిగులుగా వుంది. వీడికోసం వుద్యోగం మానేస్తానన్నా వాసుగానీ మరెవరూగానీ వద్దనరేమో! నిర్ణయం తీసుకోవలసింది నేనే. ఇలాంటి సపోర్ట్‌సిస్టమ్ లేనివాళ్ల పరిస్థితి ఏమిటని ఆలోచించుకుంటే చాలా భయం వేసింది. ఆఫీసులో సీట్లో కూర్చున్నా యింట్లోనో ఇంకెక్కడో వదిలిపెట్టి వచ్చిన పిల్లలగురించే ఆలోచించే నా సహోద్యోగులు గుర్తొచ్చారు. వీళ్ళంతా ఆఫీసులో వున్నప్పుడు ఎంతో దిగులుగా, అన్యమనస్కంగా వుంటారు. కీ యిస్తే నడిచే ప్రాణమున్న బొమ్మల్లా వుద్యోగధర్మంచేత నడుస్తుంటారు. ఒకామె పనావిడమీద కూతుర్ని వదిలిపెట్టి వస్తుంది. ఇంకొకావిడ కొడుకుని చెయిల్డ్‌‍కేర్‍లో వుంచుతుంది. పిల్లలకి అక్కడ సరిగ్గా జరుగుతుందా జరగదా అనికాదు, ఏం కావాలో నోరుతెరిచి చెప్పుకునే వయసులేని తమ పిల్లలకి ప్రతినిధులు ఆ అమ్మలు, తాము లేకపోవడంతో ఆ పిల్లలని సరిగా అర్థం చేసుకోవటం జరుగుతోందా లేదా అని.
ఈ వూగిసలాట, దు:ఖం ఇలాగే వుండగా ఈ కొత్త దు:ఖం వచ్చి మీదపడింది.
ఆత్మీయులు పోయిన బాధ ఎంత బలమైనదో కళ్ళారా చూసాను. మేము వెళ్ళేసరికి మా ఆఫీసరుగారింటి వీధితలుపు తీసే వుంది. మా ఆఫీసరు. ఆయన పేరు కమలాకర్‍గారు. హాల్లో కూర్చుని వున్నారు. ఆయన చేతిలో పుస్తకం వుందిగానీ దృష్టి దానిమీద లేదు. పుస్తకాన్ని తెరిచిపట్టుకుని వెనక్కి తలవాల్చి ఏవో ఆలోచనల్లో వున్నారు. ఇస్త్రీ బట్టల్లో చక్కగా టక్ చేసుకుని నవ్వుతూ నవ్వుతూనే ఆఫీసు నడిపిస్తూ, మాకు తెలీనిచోట రూల్సూ రెగ్యులేషన్సూ చెప్తూ, సరిగా ఇంగ్లీషు రానివారికి డ్రాఫ్టింగ్ నేర్పిస్తూ ఎంతో చైతన్యంతో వుండే వ్యక్తి నలిగిపోయిన బట్టలు వేసుకుని, గెడ్డం పెరిగి, ఎముకలపోగులా ప్రాణావశిష్టంగా వున్నారు. ఆయన ఎదురుగా స్టాండువుయ్యాల. పిల్లవాడు కదిలినప్పుడు వూపడానికో తాడు దానికి. అందులో మయూఖ్‍కన్నా రెండురోజులు పెద్దవాడైన బాబు. పక్కంతా తడుపుకుని, వాడుకూడా బోర్లాపడి చెయ్యితీసుకోలేక ఏడుస్తూ. అలా ఆ దృశ్యం చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు.
రాధమ్మా! వీడెందుకో ఏడుస్తున్నాడు చూడు- అంటూ లోపలికి కేకపెట్టి యాదృచ్చికంగా ద్వారంవైపు తలతిప్పిన ఆయన నన్ను చూసి తెల్లబోయారు. నమస్కారం చేసాను.
గీతా! నువ్వామ్మా? రా. జాయినయ్యావా? ఎలా వుంది ఆఫీసు? ఏ బ్రాంచి ఇచ్చారు- మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ అన్నారు. నావెనక వున్న మామ్మని చూసి లేచి నిలబడి ప్రశ్నార్థకంగా చూస్తే పరిచయం చేసాను. ఒకటో రెండో ప్రశ్నలు వాళ్ళిద్దరిమధ్యా అటూ యిటూ నడిచాయి. ఆయన నాపట్ల చూపించిన కన్సర్న్‌కి కృతజ్ఞతలు చెప్పింది.
ఆవిడ లోపలుంది. వెళ్ళండి. పూర్తిగా మంచం పట్టేసింది- అంటూ వుండగా లోపల్నుంచీ రాధమ్మ అన్నావిడ వచ్చి బాబుని వుయ్యాల్లోంచీ తీసి ఎత్తుకుంది.
వీళ్ళని అమ్మగారిదగ్గిరకి తీసుకెళ్ళు- అని ఆమెకి చెప్పారు.
రండమ్మా- అంటూ కమలాకర్‍గారి భార్య వున్న గదిలోకి తీసుకెళ్ళింది. ఆవిడ మంచంమీద పడుక్కుని వుంది. కనుచీకట్లో ఆవిడ ముక్కుకీ చెవులకీ వున్న వజ్రాలు తళుక్కుమంటున్నాయి. కానీ ఎంతటి సంపదాకూడా కడుపుని ఆర్చేసే బాధని తీర్చలేదని సూచనగా కలిగిన స్ఫురణ. అలా త్రుటిలో కలిగే అవగాహనలకి పెద్దగా అనుభవం అవసరం వుండదు.
మావెనకే తనూ వచ్చి, లైటు వేస్తూ-
వసుంధరా! చూడు, గీతని చెప్తూ వుంటానే ఆ అమ్మాయి వచ్చింది. వాళ్ళ మామ్మగారుకూడా వచ్చారు- అన్నారు. ఆవిడ నెమ్మదిగా లేచి కూర్చుంది. పమిటకొంగుతో మొహం, కళ్ళూ తుడుచుకుంది. ఆవిడకీ నమస్కారం చేసాను.
కూర్చోండి- కుర్చీలు చూపిస్తూ అంది.
ఎన్నోరోజుల్నించీ తిండి సరిగా తినక, దు:ఖం నిగ్రహించుకోలేక, కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నట్టు వుందావిడ.
మామ్మ తన వయసుచేత కొంచెం స్వతంత్రం తీసుకుంది. వాళ్ళు ఆ స్వతంత్రాన్నీ, ఆవిడ చూపించిన ఆధిక్యతనీ గౌరవించి ఆమోదించారు.
ఏమిటమ్మా, ఇది? పోయినవాళ్లతో పోతామా? మీ దు:ఖం ఎవరూ తీర్చగలిగేది కాదు. మీరే వోదార్చుకోవాలి. కాస్త లేచి మొహం అదీ కడుక్కుని, ఏదేనా తిని వచ్చి కూర్చోండి, నాలుగు మాటలు చెప్పి వెళ్తాను. మనసులో పెట్టుకోండి – అంది.
వసుంధరగారి కళ్ళు మళ్ళీ నీటిచెలమలయ్యాయి. ఏడుస్తూ కూర్చున్నచోటే ఒరిగిపోయారు. మామ్మ కొంచెం చనువు తీసుకుని లేచి వెళ్ళి ఆవిడ పక్కని కూర్చుంది. వీపుమీద నెమ్మదిగా రాస్తూ, చిన్నపిల్లని బుజ్జగించినట్టు బుజ్జగిస్తుంటే ఆవిడ కాస్త తేరుకుంది. ఈలోగా రాధమ్మ పిల్లవాడిని కడిగి, బట్టలు మార్చి, తెచ్చి నాకిచ్చింది. వాడు ఏడుస్తున్నాడు. అది పూర్తి ఏడుపూ కాదు, వోపికలేనట్టు కీచుమంటూ వుంది. ఎత్తుకుంటే వాడికీ, మయూఖ్‍కీ వున్న తేడా తెలిసింది. అల్పంగా వున్నాడు. బక్కగా పూచికపుల్లలా వున్నాడు. డబ్బాపాలు పోస్తున్నారట. అరగక నిత్యం అనారోగ్యం. గ్రైప్‍వాటరు, వాముకాటునీళ్ళు, ఆముదం. వీటితో ఆ చిన్నిబొజ్జ నిండిపోతోందట. బతుకుపోరాటం వాడి చిన్నిమొహంలో ప్రతిబింబించింది.
వాడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు రాధమ్మా? నాకు వాడితో ఏ బంధాలూ వద్దు. ఇంకో వారమో, నెలో అంతేకదా? ఇంక వాడికోసంకూడా ఏడ్చే శక్తి నాకు లేదు- అంది వసుంధరగారు విసుగ్గా. అందులో నిస్సహాయత. ఆ మాటలు నాకు అర్థం కావటానికి కొన్ని క్షణాలుపట్టింది. నేను అమ్మనికదూ, మహీ? కొత్తగా అమ్మనయాను.
ఇతన్ని వేరేగదిలోకి తీసుకెళ్లచ్చా- ఆవిడని అడిగాను. నా ప్రశ్న ఆవిడకి అర్థంకాలేదుగానీ, రాధమ్మ వెంటనే గ్రహించింది.
రండమ్మా- అని పక్కగదిలోకి తీసుకెళ్ళింది. మామ్మ తెల్లబోయి చూసింది. సరేననిగానీ, వద్దనిగానీ అనడానికి ఆవిడకి నేను అవకాశం ఇవ్వలేదు. కోపం వచ్చివుంటుందని అనుకోను. పిల్లవాడితో నేను తిరిగి ఆ గదిలోకి వచ్చేసరికి వసుంధరగారు నీళ్ళునిండిన కళ్ళతో రెండుచేతులూ ఎత్తి జోడించింది.
ఆశ వదిలేసుకున్నాం- అంది.
నేను మా అమ్మావాళ్ళింట్లో వుంటున్నాను ఇప్పుడు. పొద్దున్నా సాయంత్రం మా యింటికి పంపండి- అన్నాను నెమ్మదిగా.
ఇంక ఏడవకండి. పిల్లవాడికికూడా ఒక పరిష్కారం దొరికిందికదా? కాస్త నిశ్చింత తెచ్చుకోండి- అంది మామ్మ. ఆవిడ లేచి వెళ్ళి, ముఖం కడుక్కుని, బట్టలుకూడా మార్చుకుని వచ్చింది. నిలబడితే తూలిపోతోంది. రెండురోజులైందట, ఆవిడ మంచం దిగి, అన్నం తిని. రాధమ్మ చెప్పింది.
నాకు ఆరుగురు కూతుళ్ళు, ముగ్గురు కొడుకులు. నా మనవరాలు ఇది. రెండోకూతురి కొడుక్కి చేసుకున్నాం- అని మొదలుపెట్టి, మాకుటుంబాన్నిగురించి చెప్పి, మామ్మ ఆవిడ వివరాలన్నీ అడిగింది. ఆవిడ పుట్టిల్లు ఖమ్మం. అత్తవారిల్లు మధిర. బాగా ఆస్థిపరులు. తోటలూ, పొలాలూ వున్నాయి. ఇక్కడ ఫ్లాట్స్ వున్నాయి. అటువైపునీ ఇటువైపునీకూడా వీళ్ళే పెద్దవాళ్ళు. అత్తమామలూ, తల్లిదండ్రులూ చనిపోయారు. ఆవిడకి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఆయనకి ఒక తమ్ముడు. అందరూ వచ్చి కర్మ జరిపించి, సాంప్రదాయాలు పాటించి వెళ్లారట. ఇద్దరు కొడుకులమీద ఇప్పుడీ చనిపోయిన అమ్మాయి. ఒక కొడుకు బెంగుళూర్లోనూ మరోకొడుకు కొచ్చిలోనూ వుంటారు. కర్మంతా అయాక పెద్దకోడలు నెలపాటు వుండి వెళ్ళిందట. రెండోకోడలు వచ్చి మరో నెల వుందట.
ఎవరి కుటుంబాలూ, పిల్లలూ వాళ్లకే. బంధుత్వాలన్నీ గిరిగీసుకున్నట్టే. ఎవరుమాత్రం వచ్చి ఎన్నాళ్ళు వుండగరు? పక్కవాళ్లకోసం చిన్నపాటి ఇబ్బందినికూడా భరించలేనిరోజులు వచ్చాయి. ఐనా వాళ్ళవరకూ వాళ్ళకి పిల్లపోయే నాలుగునెలలైంది, ఇంక అలవాటుపడివుంటామని. పడితీరాలని- అంది. ఆవిడ కళ్ళు నీటిచెలమల్లాగే వున్నాయి.
అంతేనమ్మా. ఈవేళపోతే రేపటికి రెండోరోజు. కాలం ఎవరికోసమూ ఆగదు- అంది మామ్మ.
మీ కూతుళ్ళలాంటిదాన్నే నేనూను. నన్ను మీరనకండి- అందావిడ.
మనవడికిపేరేం పెట్టారు? మొదటిసారి ఇలా చూడటానికి వస్తున్నామని ఏమీ తీసుకురాలేదు. మరోలా అనుకోకండి- అంది మామ్మ.
మా అమ్మాయి పేరు చందన. హరిచందన. హరీ అనీ పిలిచేవాళ్ళం. వీడినీ అలానే అంటున్నారు వారు- ఆవిడ చెప్పింది.
మేము మాట్లాడుకుంటూ వుండగానే ఆవిడకి కంచంలో అన్నం పెట్టి తెచ్చింది రాధమ్మ. మాకు తినటానికి ఏవో పెట్టింది. మామ్మ తినలేదు.
నేను ఇన్నిసార్లు తినను. అరగదు- అని తిరస్కరించింది. నన్ను తినమంటే నేనుమాత్రం తీసుకున్నాను.
పక్కరోజు మాయింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించి, వస్తామని మాటతీసుకుని తిరుగు ప్రయాణం అయాము.
అలా చేసావేమిటే, గీతూ- ఇంటికి రాగానే అంది మామ్మ.
ఆ పిల్లాడు చచ్చిపోతాడని ఆవిడందికదా, మామ్మా? నాకు భయం వేసింది- అని ఆవిడ మెడచుట్టూ చేతులు వేసి బావురుమన్నాను. ఆ విషయం అందరికీ తెలిసినా ఎవరూ దానిగురించి నాతో అనలేదు. ఒక స్త్రీగానూ. అమ్మగానూ నేను తీసుకున్న నిర్ణయాన్నీ నా ప్రైవసీనీ అందరూ గౌరవించారు.
నాలో ఎన్నో ఆలోచనలు. ఎన్నో భయాలు. ఆ అమ్మాయికి బదులుగా నేను చచ్చిపోయివుంటే? మయూఖ్, నా యీచిన్నిప్రాణి ఏమైపోతాడు? హరిలాగే వీడినీ పట్టించుకోరా? ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురుచూసేవారా? వీడు పెరిగి పెద్దయేదాకా నేను బతుకుతానా? చచ్చిపోవడమంటే ఏమిటి? చచ్చిపోతే అసలేం జరుగుతుంది? ఆ అమ్మాయికూడా నాలాగే పిల్లతోనో పిల్లాడితోనో తిరిగొస్తాననే ఆశతో ఆరోజు హాస్పిటల్‍కి వెళ్ళి వుంటుంది. నాకూ తనకీ చెరోలా జరగడానికి కారణం ఏమిటి? ఎవర్నడిగినా కోప్పడతారని వాసుని అడిగాను.
నీకేం కాదు గీతూ! కాలేదుకదా? అందరికీ ఒకేలా జరగదు- అని ఓదార్చాడు. నేను సమాధానపడలేదు. తెలియాల్సింది ఇంకేదో వుందనిపించింది. జీవితమంటే ఈ వెతుకులాటేకదా? కానీ తనుమాత్రం ఎంతవాడు? చిన్నవాడేకదా? తనూ భయాలతో సతమతమైపోయాడు. ఆఖరికి విసుగొచ్చి, వాళ్ళ నాన్నముందుకి తీసుకెళ్ళి కుదేసాడు.
ఎంతసేపటికీ మీరు చదువుకుని మీరే సంతోషాన్ని పొందటం కాదు. దీనికి కాస్త తెలివి మప్పండి నాన్నా! అర్థంపర్థంలేని ప్రశ్నలతో నా ప్రాణం తినేస్తోంది. ఎవరికి ఏం జరిగినా అవన్నీ తనకే జరుగుతాయని భయపడుతోంది- అన్నాడు.
ఆయన తనదైన పద్ధతిలో చెప్పారు.
మనిషి పుట్టాక చనిపోక తప్పదు గీతా! జీవితం అనేది ఒక ప్రయాణం. పుట్టుకకి చావు అనేది గమ్యం. గమ్యం లేని ప్రయాణం వుండదు. ఎవరి కర్మనిబట్టి వాళ్లు జీవిస్తూ, చిట్టచివరి గమ్యాన్ని చేరతారు. ఎలాగా గమ్యం చేరాల్సింది చేరకుండా వుండంకదాని ప్రయాణపు ఏర్పాట్లు మానేసి కూర్చుంటారా ఎవరేనా? నువ్వు మీ నాన్నని చూడటానికి వెళ్ళాలనుకుంటావు. వాసు బైకు ఎక్కుతావు. అది కండిషన్లో వుండాలి. పెట్రోలు పొయ్యాలి. రోడ్డు బావుండాలి. వాన పడకూడదు. ఇవన్నీ చూసుకుంటావా? నాన్నని చూడాలని మనసులో అనేసుకుని ఇంట్లో కూర్చుంటావా? కూర్చోవుకదా? అలా. రోడ్డుమీద వెళ్ళేవాళ్ళకి ఎంతోమందికి యాక్సిడెంట్లౌతాయి. అలాగని అందరికీ ఔతాయా? కావు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకకూడా రోడ్డుమీదికి వెళ్ళిన వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే అది అనేకానేక సంభావ్యతల్లో ఒకటి. అలాగే ప్రపంచంలో వున్న ఆడవాళ్ళంతా పిల్లలు పుట్టేటప్పుడూ, మగవాళ్ళంతా యాక్సిడెంట్లలోనూ చనిపోతున్నారా? లేదుకదా? అదీ సంభావ్యతే. ఈ సంభావ్యతలు లక్షల్లోనూ కోట్లల్లోనూ ఒకటో అరో వుంటాయి. చదువుకున్నావుకదా? అది నువ్వే కావటానికి వున్న అవకాశాలు ఎన్ని వుంటాయి? ఒకొక్కరి జీవితంలో సంఘటనలు ఒక్కోలా జరుగుతాయి. నీకు ఇంత పెద్ద కుటుంబం వుంది. ఇంకొందరికి అపారమైన సంపద వుంటుంది. మరొకళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. అన్నీ ఒకే మనిషికి జరుగుతాయా అంటే అదికూడా ఈ సంభావ్యతల్లో ఒకటి. అలా ప్రతిదానికీ భయపడకూడదు. భయపడితే అడుగుముందుకి వెయ్యలేవు- అన్నారు.
నాకు అర్థమైంది, కాలేదు.
మయూఖ్ ఏడుస్తున్నాడని అత్త వాడిని ఎత్తుకుని మాదగ్గిరకి వచ్చింది. వాడికోసం చేతులు చాపి, మళ్ళీ ఆ చాపిన చేతుల్ని వెనక్కి తీసుకున్నారు మామయ్య.
మూడునెలలు హరిని నేను పెంచాను. ఆరోనెలలో అన్నప్రాశన చేసుకున్నాడు. పోతపాలు పడని పిల్లాడికి అన్నం, పప్పు, నెయ్యి పడ్డాయి. ఆ తర్వాతకూడా రాధమ్మ పొద్దున్నే వాడిని తీసుకుని నేను ఎక్కడింట్లో వుంటే అక్కడికి వచ్చేసేది. వసుంధరగారుమాత్రం ఇల్లొదిలిపెట్టి ఎప్పుడోగానీ బయటికి వచ్చేదికాదు. ఆ రావటం నా దగ్గిరకే.
మా కాళ్ళకి అడ్డంపడుతూ, కాళ్లని చుట్టుకుపోతూ, మయూఖ్‍తో సమానంగా అల్లరిచేస్తూ, గారాలుపోతూ మూడేళ్ళు మామధ్య పెరిగాడు హరి. వాడి నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. మంచి సంబంధమే కుదిరింది. బాగా డబ్బుంది. అందం, చక్కటి వుద్యోగం వున్నాయి. హరిని వీళ్ళు పెంచుకుంటుంటే అతనికి రెండోపెళ్ళి పెద్ద సమస్య కాలేదు.
కమలాకర్‍గారికి అటు నాన్నతోటీ, ఇటు మామయ్యతోటీ స్నేహం కుదిరింది. ముగ్గురికీ వేదాంతచర్చల్లోనూ, సాహిత్యచర్చల్లోనూ పడితే టైము తెలిసేదికాదు. ఆయన వాసుకి డబ్బువిషయాల్లో చాలా సలహాలిచ్చారు. మధ్యతరగతిలో వుంటూ పైకెదగటానికీ, ధనికకుటుంబంలో వుండి ఇంకొంత డబ్బు పోగేసుకోవడానికీ తేడా వుంటుంది. షేర్లలోనూ మ్యుచువల్ ఫండ్స్‌లోనూ ట్రేడ్ చెయ్యడం, అందుకు కావల్సిన క్రమశిక్షణ దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పారు. మాకు ఆయన ఇచ్చిన మరో సలహా-
మీకు వుండటానికి ఇల్లుంది. మీ మామగారు స్థలం ఇచ్చారని చెప్తున్నావు. ఇంక ఇళ్లమీదా, ఫ్లాట్లమీదా పెట్టకండి. బేంకులోన్లూ, కిస్తులూ అవన్నీ లాభసాటి వ్యవహారం కాదు. పొలాలమీద పెట్టండి. ఎకరమైతే ఎకరం, అరెకరమైతే అరెకరం కొనండి చాలా లాభాలొస్తాయి. అదీకాక ఇంటికోసం మందులూ, ఎరువులూ వెయ్యని పంట పండించుకొవడం చాలా అవసరం- అని.
మూడేళ్ళ తర్వాత ఆయనకి ప్రమోషన్‍మీద ట్రాన్స్‌ఫరైంది. వెళ్ళిపోయారు. వెళ్ళేముందు నన్ను ఆవిడ పిలిపించుకుంది.
నాకు నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది గీతా! క్షణాలమీద చక్కటి నిర్ణయాలు తీసేసుకుంటావు. ఇల్లు, పని, ఆఫీసు, బాబు, అటు అమ్మగారిల్లు, ఇంత పెద్దకుటుంబం, అన్నిటిమధ్యా నువ్వు చలాకీగా తిరుగుతుంటే చాలా ఇన్స్పిరేషనల్‍గా వుంటుంది. నా ధైర్యాన్ని ఇక్కడ నీదగ్గిర వదిలిపెట్టేసి వెళ్తున్నాను. ఎప్పుడేనా వచ్చి వెళ్తుంటావుకదూ- అని అడిగింది కన్నీళ్ళతో. నా చేతిని తనచేతిలోకి తీసుకుంది. మామూలుగానే అనుకున్నాను. తన చేతిగాజులు ఒక జతతీసి తొడగబోయింది. చప్పుని చెయ్యి వెనక్కి తీసుకున్నాను.
వద్దండీ! ఇంతంత ఖరీదైన కానుకలు ఇవ్వడానికి మీరు మాకు బంధువులు కాదు- అన్నాను సున్నితంగా తిరస్కరిస్తూ.
నా కూతురివవేకదమ్మా? మనవడిని నాకు భిక్షగా వేసావు. నాకన్నా గొప్పదానివేగా? అంతకన్నా ఇది గొప్ప కానుకా?- అంది.
ఆ ప్రేమ చాలండీ- అన్నాను. ఆవిడ నన్ను బలవంత పెట్టలేదు. మాటలే మర్చిపోయినమనిషి, వాదనేం చేస్తుంది? చాలాసేపు నన్ను వెళ్లనివ్వలేదు. అలా పట్టుకుని కూర్చుంది.
ఇక్కడినుంచీ వెళ్ళాక వసుంధరగారి ఆరోగ్యం ఇంకా పాడైంది. రెండుసార్లు నేనూ వాసూ వెళ్ళి చూసి వచ్చాం. తర్వాత ఆవిడ పోయిందన్నవార్త వచ్చింది. హరి కమలాకర్‍గారిదగ్గిరే పెరిగాడు. రిటైరయ్యాక ఆయన వాడిని తీసుకుని పెద్దకొడుకు దగ్గిరకి వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మాకు ఫోన్ చేసేవారు. హరిచేత మయూఖ్‍కి వుత్తరాలు రాయించేవారు. ఫోన్ చేయించేవారు. ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్ళు ఒక ఫాంటసీలాగ వుండి వుద్యోగాలొచ్చాక కలుసుకుని మళ్ళీ స్నేహాన్ని మొదలుపెట్టారు. కానీ వాడిలో ఒక అస్పష్టమైన దు:ఖరేఖ, దేన్నో పోగొట్టుకుంటానేమోనని ఇంకదేన్నో గట్టిగా వదలకుండా పట్టుకోవాలనిపించే తాపత్రయం. మయూఖ్‍లో లేని ఇంకొన్ని అసహజమైన ట్రెయిట్స్ కనిపిస్తుంటాయి. అలాంటి మనుషులు కదిలే విషాదాలుకదూ?” అంది గీత చెప్పడం ఆపి.
“మనింట్లో వున్నవాళ్ళు చాలక ఊళ్ళోవాళ్ళకోసంకూడా బాధపడ్డం మొదలుపెట్టావా? ఈ ఏడ్చే మనుషులందర్నీ నీచుట్టూ పెట్టుకుని, వాళ్ల దగ్గిర్నుంచీ కొత్త ఏడుపులు నేర్చుకుంటున్నావా? అసలు మయూఖ్‍కి ఇప్పటిదాకా పెళ్లెందుకు చెయ్యలేదే, నువ్వు?” దబాయించింది మహతి అంతా విని. “ఈపాటికి మనవలు పుట్టి, నీకసలు తీరికలేకుండా చేసేవారు” అంది.
గీత జవాబిచ్చేంతలో మేఘన లోపల్నుంచీ వచ్చి కూర్చుంది. ఆ వెనకనే గేటుతీసుకుని, హరీ, ఇందు వచ్చారు.


శ్యామ్మోహన్ వెళ్ళాడు. త్రిమూర్తులు తన అభిప్రాయం చెప్పాడు.
“ఆ యిల్లు నేను తీసుకుంటాను” అన్నాడు. శ్యామ్మోహన్ తెల్లబోయాడు.
“తాతయ్యా! ఇంట్లోవాళ్ళంతా వప్పుకుంటారో లేదో! ప్రస్తుతం దానికి విలువ లేదు. ఎవరూ కొనడానికి ముందుకి రారు. వచ్చినా, సగానికి సగం తగ్గించి అడుగుతారు. అన్నీ సర్దుకుని మళ్ళీ మార్కెట్‍ధర రావడానికి ఎన్నాళ్ళుపడుతుందో! మీకెందుకు ఈ తలనొప్పి? కేసు సెటిలైపోయాక ఎటో ఒకవైపుకి పంపించేద్దాం ఆ పిల్లని” అన్నాడు వారింపుగా.
“కేసులోంచీ ఆ పిల్ల బైటపడుతుంది. ఇంటికి ఈవేళ కాకపోతే రేపేనా విలువ వస్తుంది” అన్నాడు త్రిమూర్తులు.
“అంత డబ్బు నిలిచిపోతుందికద తాతయ్యా!”
“ఇద్దరాడపిల్లల జీవితాలు చక్కదిద్దే అవకాశం నాచేతికి వచ్చిందిరా! భ్రష్టుపట్టించాను. ఇప్పుడీ పిల్లకో దారిచూపించడం ఈ ఆఖరిదశలో దేవుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటున్నాను. తల్లిదండ్రులు తప్పులు చేస్తే పిల్లలు ఫలితం అనుభవించడం ఎక్కడేనా వుందా? ఆ చచ్చేవాళ్ళు ఎక్కడో బైటికి పోయి ఆ పని చేసినా బావుండేది. ఎంత తెలివితక్కువ మనుషులురా!” అన్నాడు త్రిముర్తులు. ఆయన మాటల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఎప్పుడో చూసిన ఆ మనుషుల ముఖాల జ్ఞాపకాలుకూడా సరిగ్గా ముద్రించుకుని లేవు ఆయన మనోఫలకంమీద. తండ్రి పోయాక తమింటికి వచ్చిన ఆ తెల్లటి పిల్లడు, నలభయ్యేళ్ళ మనిషి పక్కని పెళ్ళిపీటలమీద కూర్చున్న తాటాకు బొమ్మలాంటి పిల్ల, లీలగా మనసులో కదిలారు. అంతే. మనసంతా దు:ఖం నిండింది.
మనిషి ఎప్పుడో జరిగిన విషయాలని ఇప్పటి కోణంలోంచీ విశ్లేషిస్తాడు. అప్పుడిలా చేసి వుంటే బావుండేదని ఇప్పటి పరిస్థితులనిబట్టి అనుకుంటాడు. ఇప్పుడున్నన్ని అవకాశాలు ఆరోజుని త్రిమూర్తులికి లేవు. అప్పుడతను చిన్నవాడు. అతని స్వతంత్రత తల్లీమేనమామల చేతుల్లో వుంది. సమాజం మరోలా వుంది. అతని వికాసం ఆకాలానికి తగ్గట్టు వుంది. అలా చేసి వుండకూడదని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడు అనిపించలేదు. అప్పుడు అనిపించని విషయానికి అప్పుడు కలగని బాధ ఇప్పుడు కలగడమేమిటో, అదీ నిలువునా దహించేసేంత తీవ్రంగా వుండటమేమిటో ఆయనకి అర్థమవ్వలేదు. అమృతని చూసి బీజమాత్రంగా వుండిపోయిన అపరాథభావన తలెత్తిందా? తెలీలేదు.
“విజయ్ విషయం మీదాకా వచ్చిందా?” అడిగాడు శ్యామ్మోహన్ సందిగ్ధంగా.
“తప్పేం వుంది అందులో? మా యింటికోడళ్ళెవరూ డబ్బున్న యిళ్ళనుంచీ రాలేదు” అన్నాడు త్రిముర్తులు.
“మాధవకి అలాంటి ఆలోచన వున్నట్టు లేదు”
“ఎందుకు లేదు? ఆ పిల్లకేం తక్కువ? తల్లిదండ్రులు తగలేసిన నాలుగుకోట్ల అప్పు తీరుస్తోంది. చదువుంది, వుద్యోగం వుంది, రూపం వుంది”
“ఈ యింటిదగ్గర తటపటాయిస్తున్నారు”
“నేను కొంటానంటున్నానుకదా?”
“అది మీఅందరి డబ్బేకద తాతయ్యా!”
త్రిమూర్తులు తల అడ్డంగా వూపాడు. “నాది. నావాటా డబ్బులోంచీ కొంటున్నాను. ఉమ్మడిలోంచీ కాదు”
“ఏదైనా వాళ్ళు పంచుకునేదేగా?”
ఆయనకి కోపం వచ్చింది. “ఐతే? నాది కాకుండా పోతుందా? నా వాటాసొమ్ము నేను ఏమైనా చేసుకుంటాను. దారినిపోయే దానయ్యకి యిచ్చుకుంటాను. మిగిలిందే వీళ్ళది. వీళ్ళెవరు అడగడానికి? పేపర్లు సిద్ధం చేయించు” అన్నాడు. శ్యామ్మోహన్ తలూపి అక్కడినుంచీ వచ్చేసాడు. అలాగేనని వాయిదా వేస్తూ ఇంకో మార్గం ఆలోచించాలనేది అతని ఆలోచన. విజయ్ అంత దూరాన్న కనిపించాడు.
“పెద్దతాతయ్యకి ఆ సలహా ఇచ్చింది నేనే. పేపర్స్ తయారుచేయించండి బాబాయ్” అన్నాడు, దగ్గరికి వచ్చి నవ్వుతూ. అందులో అల్లరీ, కొంటెతనం వున్నాయి.
శ్యామ్మోహన్ నవ్వలేదు. ముఖం సీరియస్‍గా పెట్టాడు. “పద, కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరూ కలిసి కేంటిన్‍కి వెళ్ళారు. విజయ్ ఇద్దరికీ టీ తీసుకొచ్చాడు. ఇరవయ్యారేళ్ళో, ఇరవయ్యేడేళ్ళో అతనికి- సరిగ్గా గుర్తురాలేదు శ్యామ్‍మోహన్‍కి. అంత తెలుపూ నలుపూ కాని శరీరచ్ఛాయలో సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఏవో చిన్నాపెద్దా వుద్యోగాలు చేసి, తనకి సరిపోయేది సంపాదించుకుంటాడు. పెద్దగా పెట్టుబడిలేని వ్యాపారం మొదలుపెట్టాలని అతని కోరిక. అది త్రిమూర్తులి రక్తంలోనే వుంది. చీరలకొట్టు తప్పించి మిగతావన్నీ పెద్దగా పెట్టుబడి లేని వ్యాపారాలే. రోటీమిషన్‍ కొని మొదలుమొదలే రోజుకి కనీసం ఐదువేల రొట్టెలు అమ్మాలనేది అతని కోరిక. మడిగలు వాళ్లవే కాబట్టి ఒకదాంట్లో మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నాడు. వత్తిన రొట్టెలు గ్రీజ్ పేపరు మధ్యన చుట్టి ఇస్తే ఇంటికి తీసుకెళ్ళి కాల్చుకునేవాళ్ళు కాల్చుకుంటారనే ఆలోచనకూడా వుంది. ఖర్చులన్నీ పోను నెలకి లక్షాలక్షన్నర లాభాలిచ్చే వ్యాపారం అతని ఆలోచనల్లో సాగుతోందిగానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. బెంగుళూర్లోని రామేశ్వరం కెఫే గురించి విన్నాడు. నెలకి మూడునాలుగు కోట్ల టర్నోవర్‍ట. అలాంటిదేదో చెయ్యాలని కల.
“ఇంట్లో దొరికేంత మంచి ఆహారం బయట దొరకడంలేదు. లాభం అనేది వ్యాపారవిస్తరణలోంచీ రావాలిగానీ నాణ్యత తగ్గించడంలోంచీ కాదు” అంటాడు. యువత ఆలోచనల్లో వస్తున్న మార్పుకి నిదర్శనంలా వుంటాయి అతని మాటలు.
“ఆ చేసే వ్యాపారమేదో చెయ్యచ్చుగా, గాల్లో మేడలు కట్టకుండా? ఖాళీగా వున్నాడని అందరూ వీడిని వాడుకుంటున్నారు” అని రోహిణి బాధపడుతుంది.
“ఇప్పుడు చెప్పరా!” అన్నాడు శ్యామ్‍మోహన్.
“ఏం చెప్పను?” అమాయకంగా అడిగాడు విజయ్.
“రేయ్, నీ నటన చాలుగానీ, ఆ యిల్లు కొని, ఆ పిల్లని అప్పుల్లోంచీ బైటికి లాగి, ఏదో ఒకలా వుద్ధరించాల్సిన అవసరం ఏం వుంది మనకి? ఢిల్లీలో మా పినతల్లి ఒకావిడ వుంది. ఒక్కర్తే వుంటోంది. ఈ పిల్లకీ ఎవరూ లేరు. అక్కడికి పంపిస్తే ఏదో ఒక వుద్యోగం చూసుకుని బతుకుతుంది. ఎవరేనా ముందుకొస్తే పెళ్ళీ చేద్దాం. అంతవరకూ చెయ్యచ్చు” అన్నాడు.
“అంత తప్పూ, నేరం తనేం చేసింది, ఏదో ఒకలా వదిలించుకోవడానికి? మెహర్బానీ చూపించుకోవడానికా, ఆమెని మనం ఇక్కడికి తీసుకొచ్చింది? ఇంట్లో కలుపుకుంటారనుకున్నాను” సూటిగా అన్నాడు విజయ్.
“చిన్నపిల్లాడిలా మాట్లాడకు. ఊరంతా రచ్చరచ్చగా వుంది వాళ్ళు చేసినపనికి. ఆ యిల్లు అమ్ముడుపోవడం ఎంత కష్టమో, అమృతమీద పడ్డ అపఖ్యాతి తొలగిపోవడమూ అంతే కష్టం. ఆడపిల్ల అని, వెంకడితో వున్న స్నేహాన్ని గుర్తుంచుకుని సాయంచేద్దామనుకున్నాం నేనూ, మీ నాన్నా. నువ్విలా చేస్తే లోకంలో ఎవరూ ఎవరికీ సాయపడరు” అన్నాడు శ్యామ్‍మోహన్ కొంచెం కోపంగా.
“ఇప్పటిదాకా మనం తనకి డబ్బేమీ ఇవ్వలేదు. చేస్తున్న సాయమల్లా, వాళ్ళ ఆస్తులు అమ్మి, అప్పులూ, బకాయిలూ తీర్చడమేకదా? కోపం తెచ్చుకోకుండా ఆలోచించండి బాబాయ్! నాన్న ఆశ్రయం ఇచ్చారు. మీరు ప్లీడరుగా సాయం చేస్తున్నారు. మనం కలగజేసుకోకపోతే ఆమె ఇంకో లాయర్ని వెతుక్కునేది. అంతకన్నా ఆమెకి ఇంకో దారిలేదు”
“ముందు పోలీసులు వెంటపడేవాళ్ళు”
“దానికన్నా ముందు టీవీలో వార్తలు చూసి నేను వెళ్ళేవాడిని. వదిలిపెట్టేవాడిని కాదు”
“ఎందుకు విజయ్, నీకు తనంటే అంత యిష్టం? ” విసుగ్గా అడిగాడు శ్యామ్‍మోహన్.
“ఇదంతా జరగకముందు ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. ఇంకా నయం, పెళ్లవలేదనుకుని ఇప్పుడు దులిపేసుకోనా? ఇదేనా బాబాయ్, మీరు మా యూత్‍కి నేర్పించేది?”
కంగుతిన్నాడు శ్యాం‍మోహన్. ఒకరి నిజాయితీగల ప్రవర్తన ఎదుటివాళ్లని ఇంత ఇబ్బందిపెడుతుందా? అర్థమవ్వలేదు. ’
“అమృతని నేను చేసుకోవడంవలన మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. పెద్దతాతయ్య ఎలాగా పెద్దవారయ్యారు. మా తాతయ్యకి ఇంత పెద్ద కుటుంబాన్ని నడపగల శక్తి లేదు. ఎవరికీ ఇంక కలిసి వుండే ఆలోచనకూడా లేదు. ఎవరికివాళ్ళకి బలవంతంగా బళ్ళో కూర్చోబెట్టినట్టో, హాస్టల్లో వున్నట్టో వుందట. ఎవరిది వాళ్ళకి పంచి ఇచ్చేస్తే ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదామనే ఆలోచనలోనూ, ఆతృతలోనూ వున్నారు. వాళ్ళవరకూ వాళ్ళకి అదొక కొత్త వొరవడి. కొత్త జీవితం. మా అకౌంట్లుకూడా ఏ నిముషాన్నేనా ఎవరిదివాళ్ళు తీసుకుని విడిపోవచ్చన్నంత స్పష్టంగా వుంటాయి. ఇన్నాళ్ళు ఓపికపట్టారంటే పెద్దాయనమీద వున్న గౌరవమే అనుకుంటాను. ఆస్తులన్నీ వాటాలేస్తే ఆ యిల్లు మా తాతకీ, ఆయన్నించీ నాన్నకీ, చివరిగా నాకూ వస్తుంది. అలా చేస్తే మిగతావాళ్ళెవరికీ అభ్యంతరం వుండదు. దాని విలువ తాత్కాలికంగా తగ్గచ్చుకానీ, ఎప్పటికీ అలానే వుండిపోదు” స్పష్టంగా అన్నాడు విజయ్.
“మీరు హిందూ అవిభక్త కుటుంబంగా రిజిస్టరవ్వలేదు. పెద్దతాతయ్యనుంచీ నేరుగా నీకు రాదు. మీ తాత ఇప్పుడే పంచనంటే?”
“ఎప్పుడో ఒకప్పుడు పంచుతారుకదా, అప్పుడేనా తీసుకుంటాను”
“అది డెడ్ అసెట్. మిగతా నలుగురూ ఆ కోటిన్నరా పెట్టుబడిగా పెట్టుకుని లాభాలు తీస్తుంటే ఆయన డబ్బు అక్కడ బ్లాకై వుండటాన్ని వప్పుకుంటాడా?”
“అన్ని నష్టాలకీ నేను సిద్ధమయే వున్నాను. నా డబ్బే బ్లాకైందనుకుంటాను. కాదూ, చీటీలడబ్బులన్నీ తిరిగిచ్చేసాక, వచ్చిన ధరకి ఇల్లమ్మేస్తే మిగిలిన అప్పులకి నేను పూచీపడతాను. మనవాళ్లదగ్గిరే తలో ఐదులక్షలో పదిలక్షలో వడ్డీకి తీసుకుంటాను. ఒకొక్కరికీ తీర్చుకుంటాను. వాసుదేవ్‍గారుకూడా సాయం చేస్తానన్నారు. ఆయన భార్య గీతగారు చాలామంచిది. ఎలాంటివాళ్ళనేనా ప్రేమగా దగ్గిరకి తీసే మనస్తత్వంకలది. వాళ్ళదగ్గిర చదువుకున్న పిల్లలు చెప్పారు. వాళ్ల చిన్నకొడుకు విహంగ్ నాకు బాగా పరిచయం. అమృతని వాళ్ళింటికి పంపిద్దామనుకుంటున్నాను. బాబాయ్! మీరెప్పుడేనా ఎడారిలో ఎండలో చుక్క మంచినీళ్ళు లేని అనుభూతి పొందారా? అమృతది ఇప్పుడు ఆ పరిస్థితి. పూర్తిగా తనకి అనుభవంలేని పరిస్థితుల్లో కూరుకుపోయి వుంది. నేను తనతో మాట్లాడ్డం అమ్మకిగానీ, ప్రసూనకిగానీ ఇష్టంలేదు. ప్రసూనైతే నన్ను కాపలాకాస్తోంది. ఎవరూ మాట్లాడకుండా, దగ్గిరకి తీయకుండా వుంటే ఆమె ఏమైపోతుంది? మూడునాలుగేళ్ళకిందట కాలేజిలో అమృతని చూసినప్పుడు నాకు చాలా ఇష్టం కలిగింది. తనెవరో నాకప్పుడు తెలీదు. తరువాత అమ్మ పెళ్ళిప్రస్తావన తెచ్చింది. చేసుకుంటానని చెప్పాను. పెళ్ళి అనేది మామధ్య జరగకుండా ఆగిన లీగల్ ప్రోసెస్ అంతేకదా? అలాంటి ఏ ప్రోసెస్ లేకుండానే మనుషులు కలిసి వుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. అంటే మనసూ, ఇష్టమే ప్రధానం”
“ఆ అమ్మాయికి నువ్వంటే యిష్టం లేకపోతే? తనున్న పరిస్థితినిబట్టి అవకాశం తీసుకుంటున్నావనుకుంటే? ఇంకెవర్నేనా ప్రేమించి వుంటే?”
విజయ్ నవ్వేసాడు. “నా మనసు మార్చడానికి మీరు అన్ని ప్రయత్నాలూ చేసేసారు. ఆమెని నేను ఇష్టపడుతున్నాను, తను నన్ను కాదు. కాబట్టి ఆమె యిష్టంప్రకారమే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె మరొకర్ని ప్రేమించగలగడం అంత తేలిక కాదు. రెక్కలిప్పుకుని ఎగిరిన సీతాకోకచిలుకతనం ఈ కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఇప్పటికే ఎవర్నేనా ప్రేమించి వుంటే అతను సరిగ్గా మీరెలా ఆలోచిస్తున్నారో, అలాగే ఆలోచించి తప్పుకుంటాడు. అలాంటివాడు వుంటే ఈపాటికి ముందుకి రావాలి. కనీసం తనెలా వుందో తెలుసుకోవాలి. అదీ జరగలేదు” అని, “అమృతకి నేనంటే ఇష్టమే. క్లాసులు జరుగుతున్నంతసేపూ ఒకళ్ళనొకళ్ళం చూసుకునేవాళ్ళం” అన్నాడు రహస్యం చెప్తున్నట్టు.
“పోరా!” అని లేచాడు శ్యాం‍మోహన్.
“పిల్లలు అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే మనముందుకి వస్తున్నారు. నీ కొడుకూ అంతే” అని మాధవరావుతో త్రిమూర్తులి నిర్ణయం, తనకీ విజయ్‍కీ మధ్య జరిగిన సంభాషణా చెప్పాడు. తను ఆలోచించాల్సిన విషయాలూ, నిర్ణయాలూ కొడుకు తీసుకున్నందుకు మాధవరావు అహం దెబ్బతింది. రోహిణికీ కొడుకుమీద కోపం వచ్చింది. ఒక తరంలో రామారావు, తర్వాత అదే యింట్లో గీత, ఇప్పుడు ఇక్కడ విజయ్. చాలాకొద్దిమందికి తమకేం కావాలో తెలిసే స్పష్టత వుంటుంది. దాని చుట్టూ ఎలాంటి లౌక్యపు పొరలూ వుండవు. సర్దుబాట్లు, మినహాయింపులూ చేసే వీలూ వుండదు. అందులోని సత్యం నేరుగా కనిపిస్తుంది. సూటిగా తాకుతుంది. తట్టుకోవడం కష్టం.
“ముందూవెనకా చూడకుండా తెచ్చి ఆ పిల్లని నెత్తిన తెచ్చి పెట్టారు. నాకా పిల్లమీద కోపమేమీ లేదు. పుట్టెడు దు:ఖంలో మనిల్లు చేరింది. మిగతావి ఎలా వున్నా తల్లీతండ్రీ ఒక్కసారి పోయారంటే అదేం చిన్నవిషయం కాదు. దాని దు:ఖంలో అది కూరుకుపోయి వుంది. కన్నెత్తి వాడికేసికూడా చూడలేదట. ప్రసూనే చెప్పింది ఆమాట. వీడేమిటి యిలాగ? పెద్దాయనా, మీ అమ్మా వాడిని సమర్ధించడమేమిటి? లేనింటిపిల్లలని తెచ్చి చేసుకున్నారు మీయింట్లో. ఐనా మా పుట్టిళ్ళలో కష్టాలల్లో మిమ్మల్నెవర్నీ ఇరికించలేదు మేమెవ్వరం. వీడిలా చేస్తుంటే ఆ పిల్లమీద నాకు ప్రేమ ఎలా పుడుతుంది? దగ్గిరకి తీసుకుని వోదార్చబుద్ధి ఎందుకు పుడుతుంది? ” అంది రోహిణి భర్తతో విసురుగా.


నిద్రపోవటాలూ, లేవటాలూ, వండుకోవటాలూ, తినటాలూ, ఇవన్నీ మనసుతో పెద్దగా సంబంధం లేకుండా యాంత్రికంగా జరిగిపోతాయి. మనసు తన పని తను చేసుకుంటుంది. జ్ఞాపకాలు నెమరేసుకుంటూనో, బాధలని తవ్విపోసుకుంటూనో ఒక నీడలా దినచర్యతోపాటుగా కదుల్తూ వుంటుంది. ఒక్కోసారి మధ్యాహ్నపు ఎండలోలాగ నీడ అసలే వుండదు. అంటే మనిషి దు:ఖంలోనో, చింతనలోనో పూర్తిగా నిమగ్నమైపోయాడన్నమాట.
తనచుట్టూ అల్లుకుపోయిన చిక్కుముళ్ళలాంటి బంధాలని ఇప్పుకుని, తనని తను వాటిలోంచీ దూరం జరుపుకునే ప్రయత్నం చేస్తునే వుంది గీత. కొన్ని అనుభవాలు మహతితో పంచుకుంది. ఇంకొన్నిటిని బయటికి అనలేదు. కానీ అవి తమకుటుంబంలోని గొడవలుగా అందరికీ తెలుసు. కానీ తనకి? కాళ్ళకింది నేల కదిలినట్టో, సుఖంగా బతక్కుండా ఆటంకాలనో అనిపించాయి. సుమతి పెళ్ళి తర్వాత ప్రహ్లాద్ పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి వాళ్ళ కుటుంబంలో ప్రళయానికి నాందీవాక్యం పలికింది. అది ప్రళయమని చాలాకాలనికిగానీ ఎవరికీ అర్థమవలేదు.