తనువు, మనసు, ఆత్మ by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

ముందురోజు పోస్టులో వచ్చిన శుభలేఖ ఆరాత్రంతా నిద్రలేకుండా చేసింది స్వర్ణకి. ఏ తెల్లవారో కొద్దిగా కునుకు పట్టే సమయానికి తల్లి దగ్గర్నుంచీ ఫోను.
“అమ్మమ్మకి సీరియస్‍గా ఉందటనే. ఆఖరి చూపులన్నట్టే చెప్పాడు పెద్దమామయ్య. మేమంతా క్వాలిస్ తీసుకుని బయల్దేరుతున్నాం. నువ్వూ మాతో రాగలవా? అలా వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. ఒక్కదానివీ విడిగా ఎందుకు?” అంది.
ఆవిడ గొంతులో తల్లి పరిస్థితిపట్ల ఆందోళన ఉంది. స్వర్ణ ఒక్కర్తే విడిగా రావడంపట్ల విముఖత ఉంది. ఈ రెండింటినీ మించినది ఇంకేదో
కూడా ధ్వనిస్తోంది. అదేంటో స్వర్ణకి తెలుసు. తనని నిన్నట్నుంచీ కలవరపరిచినదే ఆవిడనీ కలవరపెడుతోంది.
“ఏంటంట, అమ్మమ్మకి?” తన ఆలోచనలు దాచుకుని అడిగింది. అమ్మమ్మకి సీరియస్‍గా ఉందంటే గుండె చిక్కబట్టినట్టుగా అయింది.
“ప్రత్యేకించి ఏముంటుందమ్మా? పెద్దతనం. ఎనభయ్యేళ్లు ఆవిడకి” చిన్నగా నిట్టూర్చింది స్వర్ణ తల్లి విశాలాక్షి. కొద్దిసేపు ఇద్దరిమధ్యా మౌనం.
“శుభలేఖ మీకూ వచ్చిందామ్మా?” ఆఖరికి అడిగింది స్వర్ణ.
“వచ్చింది. బాధనిపిస్తోంది. నీ పెళ్లి మూణ్ణాళ్లముచ్చటగా మిగిలిపోయినందుకు. విడాకులిచ్చి తొందరపడ్డావేమో, స్వర్ణా! అతనిదేముంది, మగవాడు. ఏడాదయ్యేసరికి మళ్లీ పెళ్లికొడుకయ్యాడు” అంది విశాలాక్షి బాధపడుతూ.
“నాకూ బాధగానే ఉందమ్మా! అతన్ని ద్వేషించి విడిపోలేదు నేను. భరించలేక విడిపోయాను. భరించలేనని కచ్చితంగా నిర్ధారించుకున్నాకే విడాకులిచ్చాను.”
మళ్లీ మాటలు ఆగాయి. మౌనానికి భాష ఉండదు. కానీ భావాలు మాత్రం వెల్లడవుతాయి. ఇద్దర్లోకీ ముందుగా తేరుకున్నది విశాలక్షే. “సరే! అయిందేదో అయింది. నువ్వు కోరుకున్నట్టే జరిగింది. బాధెందుకు? నీ ప్రయాణం మాటేమిటి? మాతో బయల్దేరతావా? ఆఫీసుకెళ్లి సెలవుపెట్టాక వస్తావా?” అనడిగింది.
“ఎన్నింటికి బయల్దేరుతున్నారు?”
“ఇంకో అరగంటకి”
“నేనూ మీతోటే వచ్చేస్తాను. లీవు మేనేజి చేసుకుంటాలే” జవాబిచ్చింది స్వర్ణ. విశాలాక్షి ఫోన్ పెట్టేసింది.
స్వర్ణకి వరంగల్లో ఉద్యోగం. రెండు నెలలైంది ప్రమోషన్‍మీద ఇక్కడికి వచ్చి. తల్లిదండ్రులుండేది ఖమ్మంలో. వాళ్ళక్కడినుంచీ బయల్దేరి రావటానికి ఎంత లేదన్నా రెండు గంటలు పడుతుంది. వచ్చేలోగా ఒక నిద్ర తీద్దామని మళ్ళీ పడుకుందిగానీ ఎంతో అలజడిగా వున్న మనసు సాధ్యపడనివ్వలేదు.
ఎన్నో జ్ఞాపకాలు మనసుని తట్టి తట్టి లేపుతున్నాయి. మంచం దిగి కారిడార్లోకి వచ్చి నిలబడింది. చుట్టూ చీకటి, మనసులో కూడా. ఏం చేస్తుంటాడు శశాంక ఈ సమయంలో? కొత్తభార్యగురించి కలలు కంటుంటాడా? ఉదయాన్నే నిద్ర లేపి శుభోదయాలని అందజేస్తుంటాడా? తల బలంగా విదిల్చింది. అతని జ్ఞాపకాలు తూనీగల్లా ఎగిరిపోయాయి కాసేపు.
అమ్మమ్మ గుర్తొచ్చింది. ఎనభయ్యేళ్ల వృద్దురాలు. ఎనిమిదేళ్లకి పెళ్లై, పధ్నాలుగేళ్ళకి అత్తవారింటికి వచ్చిందట. అప్పట్నుంచీ అరవయ్యైదేళ్ల పైబడి సహచర్యం. తాతయ్యతో. ఎనిమిదిమంది పిల్లలు. మనవలు, మునిమనవలు, పల్లెటూళ్లో పదెకరాల వ్యవసాయం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సంతృప్తికరమైన జీవితం. కొన్ని అపశృతులు ఉండి ఉండవచ్చు. ఆవిడా కన్నీళ్లు పెట్టి ఉండచ్చు.
సరు పిన్ని ఆవిడ సంతానంలో ఆఖరిది. ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అతనికి తండ్రి లేడు. తల్లిది పెత్తనం. పిన్నిని బాగానే చూసుకునేవారు. కోరిన నగ, చీర.. ఏదడిగితే అది కొనిపెట్టారు. రెండేళ్లు గడిచాయి. అతను ఉన్నట్టుండి ఊళ్లోంచీ పారిపోయాడు. అప్పటికింకా పిల్లలు లేరు. పిన్ని ఏడుస్తూ పుట్టింటికొచ్చింది. తాతయ్యా, మామయ్యలూ అతన్ని వెతికించితే రాజమండ్రిలో దొరికాడు. వెళ్లి వెంట పెట్టుకుని వచ్చారు. ఊర్నిండా అప్పులట. తలకి మించి ఉన్నాయి. భయపడి పారిపోయాడు.
“చీరలనీ నగలనీ మగవాళ్లని వేధించకూడదు. తాహతుకి మించి ఖర్చుపెడితే ఫలితం చూశావా?” అని పిన్నిని కోప్పడి, అతనికి ధైర్యం చెప్పి వాళ్ల ఊరు వెళ్లి బంగారం, వెండీ అమ్మి కొన్ని చిన్నచిన్న అప్పులు తీర్చి, కొన్నిటికి తను హామీ ఉండి, ఇంకొన్నిటిని తనమీదికి బదలాయించుకున్నాడు తాతయ్య. పెళ్లైన పిల్లకి మళ్లీ యిదంతా చెయ్యటమేమిటని ఎవరూ అనలేదు. వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా అందరూ కృషి చేశారు.
“మీ అమ్మాయినే ఇల్లు చక్కబెట్టుకొమ్మనండి. మీరు వెనక ఉండి సలహాలివ్వండి” అని తీర్థయాత్రలకి వెళ్లిపోయింది సరు పిన్ని అత్తగారు.
ఈరోజుని సరుపిన్నికి ముగ్గురు కొడుకులు. వాళ్ళలో ఇద్దరికి ఉద్యోగాలు కూడా. ఆరోజుని వాళ్లు కలుసుకునే దిశగా కృషి జరగకుండా ఉండి వుంటే ఈరోజుని ఆ కుటుంబం ఉండేది కాదు. తన కుటుంబంలో సరుపిన్ని నవ్వులూ ఆమె భర్త చమత్కారాలు ఉండేవి కాదు.
అమ్మమ్మ ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది. ఆవిడ పిల్లలూ మనవలూ మనవరాళ్లే కాక అక్కచెల్లెళ్లూ వాళ్ల పిల్లలూ వచ్చేవారు. అసలు అన్ని సంవత్సరాలు ఇద్దరు అపరిచితవ్యక్తులు కలిసి ఉండటం… ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం చిత్రమనిపిస్తుంది స్వర్ణకి. ఇదివరకూ అమ్మమ్మా తాతయ్యా వేరువేరనిపించేవారు కాదు. తన పెళ్లి విఫలమయ్యాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులనీ, మిగిలిన బంధువుల జంటల్నీ అదే విశ్లేషణతో చూస్తోంది. వాళ్లంతా కలిసి ఉండగలిగినప్పుడు తనెందుకు అతన్ని భరించలేకపోయింది? తన వైఫల్యమా?
తాతయ్యలో, తన తండ్రిలో ఇంకా మిగిలిన మగవాళ్లందర్లో ఏవో ఒక లోపాలు లేకుండా లేవు. కనీసం పురుషహంకారం. తాతయ్య ముందుగది దాటి రాడు. చుట్టలు తాగుతాడు. తండ్రి వంటింట్లోకి వెళ్లి మంచినీళ్ళు తెచ్చుకోడం తనెప్పుడూ చూడలేదు. ఐనా అమ్మమ్మ, తన తల్లి, వాళ్లతో సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కడ జరిగింది. తన విషయంలో లోపం? పునశ్చరణ మొదలైంది. కొద్దిసేపటి క్రితం ఎగిరిపోయిన తూనీగల గుంపు మళ్లీ వచ్చి వాలింది.
తన పెళ్లి….
శశాంక, తనూ ఒకే ఆఫీసులో చేసేవారు. మొదట పరిచయమైంది. తర్వాత పరిభ్రమణాలు మొదలయ్యాయి. అతను తన చుట్టూ తిరిగేవాడు. తన కడగంటి చూపుకోసం, కొనగోటి స్పర్శకోసం తపించిపోయేవాడు. తనూ అలాగే అతనితో మాట్లాడాలని ఆరాటపడేది. దాన్నే ప్రేమనుకున్నారు ఇద్దరూ. ఆ భావన ఇద్దర్నీ కలిపే వారధి అయింది. తర్వాతి ప్రకరణం పెళ్లి. పెద్దవాళ్ల వప్పుదలతోనే జరిగింది.
వంటరికాపురం. పగలూ రాత్రి అతనికి తన ధ్యాసే. ఆఫీసులోనూ అతనే. ఇంట్లోనూ అతనే.
“స్వర్ణా! ఈ డ్రాఫ్టెలా ఉందో ఒకసారి చదివి కరెక్షన్సుంటే చేసి మా సెక్షన్‍కి పంపు… ఆ ఫైల్ నువ్వు డీల్ చేస్తున్నావా?… హాట్‍పాక్ ఓపెన్ చెయ్యి… లంచ్ చేద్దాం … రాత్రికి కర్రీ ఏంటి? వచ్చే ముందు పాలు ఫ్రిజ్‍లో పెట్టావా?” ఎక్కడా అతని గొంతే.
తనని ఒక పంజరంలో బంధించేశాడు. ఒక నట్‍షెల్‍లా తనని చుట్టేశాడు. అతనికి స్నేహితుల్లేరు. తల్లిదండ్రులకి ఒక్కడే. వాళ్లు రూర్కెలాలో ఉంటారు. మామగారికి అక్కడ ఉద్యోగం. శశాంక అతని ప్రపంచాన్ని తన చుట్టే నిర్మించుకున్నాడు. ఆ పరిధిని విస్తరించుకోటానికి ప్రయత్నించలేదు.
కానీ తనకి?
తల్లిదండ్రులు.. అక్కాబావలు.. స్నేహితులు.. పెద్ద బంధుబలగం.. సహోద్యోగులు.. పుట్టి పెరిగిన ఊరిది. మొత్తం చదువు, ఉద్యోగం అన్నీ ఇక్కడే. తన కజిన్స్ వచ్చి వెళ్తుండేవారు.
“అన్నయ్య” అని తను పరిచయం చేస్తే-
“పెద్దమ్మ కొడుకు” అని దూరాన్ని నిర్దేశించేవాడు.
తనపట్ల పొసెసినెస్‍తో సతమతమయ్యేవాడు. తనని హోల్డ్ చెయ్యటానికి.. అన్నట్టు ప్రయత్నాలు చేసేవాడు. అతనికదంతా ప్రేమలా ఉండేది. ఒకటిరెండు సంఘటనలు చాలు, అతని ఆలోచనలని పట్టివ్వడానికి. సంక్రాంతికి పిల్లలందరినీ పిలిచి వేడుకచేస్తుంది అమ్మమ్మ. కనీసం అరవై డేబ్భ్హైమందేనా చేరతారు. మనిషి సంతోషంకోసం ఎన్నెన్నో మార్గాలు వెతుకుతాడు. కళ్ళముందు వున్న సులువైన దారిలోకిమాత్రం వెళ్ళడు. కుటుంబం, ప్రేమలు అలాంటి సులువైన దారి.
మొదటేడు సంక్రాంతికి తమని తీసుకెళ్ళడానికి పెద్దమేనమామ వచ్చాడు.
“పండగకి వాళ్ళెవరింటికో వెళ్ళటమేమిటి? వెళ్తే మీఅమ్మావాళ్ళింటికి వెళ్ళాలి, లేకపోతే మనింట్లో జరుపుకోవాలి. ఐనా మీ తాత యింటికి రమ్మని పిలవటానికి ఇంకెవరో రావటమేమిటి? నేను రాను” నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.
“వాళ్ళెవరో పైవాళ్ళు కాదు. అమ్మమ్మ, తాతయ్యలు. మా కుటుంబానికి ఆద్యులు. వాళ్ళు కన్న పిల్లలందరినీ ఒక్కచోట, ఒకేసారి చూసుకోవాలనే కోరికతో సంక్రాంతి అక్కడ జరిపిస్తారు. మనమూ ఆ ప్రవాహంతో సాగే కెరటాలమే. ప్రవాహం లేని కెరటం వుండదు. మీకక్కడ ఎలాంటి అమర్యాదా జరగదు” అని ఎన్ని విధాల చెప్పినా అతను వినలేదు. తమకోసం తల్లీవాళ్ళూ, వాళ్ళు వెళ్ళలేదని అక్కావాళ్ళూ ఆగిపోయారు. అందరికీ మనస్తాపమే మిగిలింది.
అతను బయటపడటం మొదలైంది.
“నీకోసం నేనింత తపించిపోతుంటే నీకు నన్నొదిలిపెట్టి ఇంకెవరితోనో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది?” అని అడిగేవాడు.
అతని తపన.. తనని ఉక్కిరిబిక్కిరి చేసేది. ఊపిరాడనట్టు ఉండేది. తల్లితో, అక్కతో…ఎవర్తో మాట్లాడటానికీ ఏకాంతం ఉండేది కాదు.
ప్రతి బంధాన్నీ తుంచివేయటానికి ప్రయత్నించేవాడు. అంతటా అతనే చొచ్చుకు రావటానికి ప్రయత్నించేవాడు.
“ఏముంటాయి మీకంత కబుర్లు?’ అనేవాడు.
భార్యాభర్తలకి మాత్రం ఏముంటాయి, రోజుకి ఇరవై నాలుగ్గంటలు, సంవత్సరానికి మూడు వందల అరవయ్యైదు రోజులు? తనలో విముఖత మొదలైంది. స్పేస్‍కోసం పోరాటం చేసేది. వాళ్లంతా అతనికన్నా ముఖ్యులని కాదు, కానీ తన జీవితంలో ఒక భాగమని తెలియజెప్పే ప్రయత్నం మొదలైంది. సంఘజీవనం అంటారు. బంధుబలగాన్నీ మించిన సంఘం ఇంకేం వుంటుంది?
భార్యా, భర్తా ఏక వ్యక్తి కారు. ఎవరి వ్యక్తిగత పరిచయాలూ, స్పందనలూ వారికే ఉంటాయి. పెళ్లి వుమ్మడి ఆసక్తి. కలిసి ఉండటంకోసం రాజీ, సర్దుబాటూ తప్పనిసరి. ప్రేమ ఉన్నచోట ఇద్దరి ఆంతరంగిక ప్రపంచం కొంతవరకూ ఏకీకృతమవుతుంది. అర్థనారీశ్వరత్వంలో కూడా శివపార్వతులు సగమే కలుస్తారు. మిగిలిన సగాలవైపు వారి వారి ప్రపంచాలుంటాయి. ఇది భౌతిక దృష్టి.
అతనితో సున్నితంగా చెప్పింది. “పెళ్లవ్వడంతో నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారిపోలేదు. నా పరిచయాలు నాకలాగే ఉంటాయి. వాళ్లతో నాకు అనుబంధాలు కూడా ఏర్పడ్డాయి. వాటిని బలవంతంగా తుంచలేను. ఆ అవసరం లేదు. కాలక్రమాన బలహీనపడాలి” అని.
అతనిది ఒకటే జవాబు, “అవన్నీ పెళ్లికి ముందు. పెళ్లయ్యాక నీకు నేనూ, నాకు నువ్వూ. మన మధ్య ఇంకెవరూ ఉండకూడదు. అంతే” అందులో ఎలాంటి ఫ్లెగ్జిబులిటీ లేదు. రాజీ లేదు. దాన్నతను తలమునకలయ్యే ప్రేమ అంటాడు. గాలికూడా చొరబడకూడనంత గాఢమైన ప్రేమ ఉండాలి మన మధ్య అంటాడు.
అతని ప్రేమ నిజమైనదే కావచ్చు. కానీ భౌతికమైనది. ఏకపక్షమైనది. పెళ్లయిన మొదటేడు నోటితో చెప్పుకోవటందాకా వచ్చిన విముఖత అలిగి పోట్లాడుకునేదాకా వెళ్లింది. పెద్దవాళ్లు కలగజేసుకుని సర్దిచెప్పేవాళ్లు. బంధువుల్లో అందరికీ తెలిసిపోయింది. తనతో ఆడిపాడినవాళ్లంతా దూరమయ్యారు. క్రమంగా తనింటికి ఎవరూ రావటం మానేశారు. ఫోన్లు ఆగిపోయాయి. ఆహ్వానాలు తగ్గిపోయాయి. బాధాకరమైన పరిస్థితి.
“పోన్లేమ్మా! కొంతమందివి ఒంటెత్తు పోకడలు. అతనికి నచ్చినట్టే ఉండు. మేం మీ ఇంటికి రాకపోతే నష్టమేమిటి? నువ్వూ అతనూ సంతోషంగా ఉంటే అదే చాలు” అనే సర్దుబాటు. అది సంతోషమేనా?
అతని ప్రేమ మరింత నిర్దుష్టమైన రూపం ప్రదర్శించసాగింది. “నువ్వు నా స్వంతం.. నాకే స్వంతం..” అనే స్పష్టమైన భావప్రకటన.
“అతన్తో ఎందుకు మాట్లాడావు? పరాయివావాడితో మాట్లాడటానికి ఏం విషయాలుంటాయి? నేనొద్దన్నా నీకీ పరిచయాలేమిటి?” అనే ప్రశ్నలు. ఆ ‘అతను’ ఎవరో కాదు, ఎల్‍కేజీనుంచీ డిగ్రీదాకా తనతో కలిసి చదివినతను. ఉద్యోగం వచ్చిందని చెప్పి కలిసి వెళ్లటానికి వచ్చాడు. శశాంకది అసూయా? అనుమానమా?
“ఇంత పెద్దకుటుంబంలోంచి వచ్చిన నన్ను ఎందుకు చేసుకున్నావు శశీ? ఇక్కడే పుట్టి పెరిగినదాన్ని. తెల్లారి లేస్తే ఎంతోమంది పరిచయస్తులు. వాళ్ళని ఎరగనట్టు మొహం తిప్పుకుని ఎలా వెళ్ళగలను?” విసుగ్గా అడిగింది.
” పెద్దకుటుంబంలోంచీ వచ్చిన అమ్మాయైతే మంచీచెడూ తెలిసి వుంటుందని భ్రమపడ్డాను” అతకని అతని జవాబు.
“అదేమైనా యూనివర్సిటీ డిగ్రీనా, చదివి బైటికి వచ్చి మళ్ళీ పుట్టింటిమొహం చూడకుండా వుండటానికి?”
అతను మాట్లాడలేదు.
అత్తగారూ అంది,” పుట్టిన దగ్గర్నుంచీ అ పల్లెటూరు దాటి ఎక్కడికీ వెళ్ళలేదేమో, నీకు ప్రపంచం తెలీదు. నార్త్‌లో ఒకసారి పెళ్ళైందంటే ఆడపిల్లని జన్మలో మళ్ళీ పుట్టింటికే పంపరు. చావైనా బతుకైనా అత్తింట్లోనే”
ఏం మాట్లాడాలో తనకి తెలీలేదు.
జీవితాన్ని అందంగానూ అర్థవంతంగానూ మలుచుకున్నా అసహ్యంగానూ కంగాళీగానూ చేసుకున్నా అంతా మన చేతుల్లోనే ఉంది. ఆడవాళ్లతో మాట్లాడినా తప్పే. మగవాళ్లతో మాట్లాడినా తప్పే. అసూయతో రగిలిపోయేవాడు. అప్పటికీ అతనివరకూ అతనిది ప్రేమే. తనే అర్థం చేసుకోవటం లేదని అభియోగం.
క్రమంగా తామిద్దరూ కలిసి ఉండగలిగే పరిస్థితులు తప్పిపోవటం మొదలైంది. రోజంతా ఇద్దరే… ఇంటా బైటాకూడా. ఆఫీసుకి తనే తీసుకెళ్తాడు. అక్కడి నుంచీ తనే తీసుకొస్తాడు. చీరల షాపింగూ అతనితోనే టైలరు దగ్గరకి వెళ్లాలన్నా అతనితోనే. కంగన్‍హాలుకీ అతనే కంపెనీ. అన్నిటిమీదా ఆసక్తి తగ్గిపోయింది. ఎలాంటి వైవిధ్యం లేదు. జీవితం రసహీనంగా తయారైంది. తనకి అతనంటే విముఖత ఇంకా పెరిగిపోయింది. దాన్నతను గుర్తించే ప్రయత్నం చేయలేదు. వికర్షించుకోవటం మొదలైంది. అతనికి తనలోని లోపాలు తనకీ తనలోని లోపాలు అతనికీ భూతద్దంలో పెట్టినట్టు కనబడసాగాయి.
ఇతన్నా నేను ప్రేమించినది? అనే విస్మయం తనలో.
ఏం చూసి ఈమెని ప్రేమించాను? ప్రేమని అర్థం చేసుకునే లక్షణం లేనే లేదే? అనే పశ్చాత్తాపం అతన్లో.
ఆ తర్వాత ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. పెద్దవాళ్ల జోక్యం అతనికి నచ్చలేదు. ఫామిలీ కోర్టులో కౌన్సిలింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతను చాలా పట్టుదలగా ఉన్నాడు. తను తగ్గడం అంటే తనలోని జీవాన్నీ స్పందనలనీ వదులుకోవటమే. అలాంటి జీవితం జీవితమేనా? ఎందుకు? ప్రయోజనం ఏమిటి? అనేవి ప్రశ్నలు.
విడిపోయారు.
పంజరంలో బైటపడ్డట్టనిపించింది తనకి. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంది. కొందరు తొందరపడ్డావన్నారు. ఇంకొందరు సర్దుకుపోవల్సిందన్నారు. ఇలాంటివాటికి విడిపోతారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. మూడేళ్ల వైవాహికబంధం తర్వాత ఇప్పటికిలా వంటరిగా మిగిలింది తను. కానీ ఇప్పటికీ సందేహమే, జరిగినదాంట్లో తన తప్పు ఎంతని.
“తయారయ్యావా?” మళ్లీ ఫోను. తల్లి దగ్గర్నుంచీ. ఆలోచనలు కట్టిపెట్టి తనవో రెండు జతలు బేగులో పెట్టుకుంది. లీవు లెటరు రాసి, పక్క
ఫ్లాటులో వాళ్ల అబ్బాయికిచ్చి, తన ఆఫీసులో ఇమ్మని రిక్వెస్టు చేసింది. ఫ్రిజ్‍లో పాలుంటే టీ చేసుకుని తాగింది. అపార్టుమెంటు ముందు క్వాలిస్ ఆగే టైముకి తయారై గేటు దగ్గర నిలబడింది. తల్లి, తండ్రి, అక్కా ఆమె ఇద్దరు పిల్లలు, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ల కొడుకు, కోడలు, ఇంకో పెద్దమ్మ కూతురు భాను.. ఇంతమంది కలిసి బయల్దేరారు. స్వర్ణ ఎక్కుతుంటే అన్నయ్య చెయ్యి అందించాడు. అతని స్పర్శలో వాత్సల్యం, ఓదార్పు ఉన్నాయి. లోపలికి జరిగి పక్కని చోటిచ్చాడు. అతన్ని లేవమని భాను వచ్చి ఆ జాగాలో కూర్చుంది. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నారు. ఒక ఆర్తి. ఒక తపన. కళ్ళలో నీళ్ళు రావు. గుండెల్లో తడి. పుట్టినప్పట్నుంచీ స్నేహితులు తాము. రోజుల తేడా.
భాను భర్త ఆర్మీలో ఆఫీసరు. ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నాడు. కార్గిల్ వార్‍లో అమర సైనికుడయ్యాడు. అప్పటికి వాళ్లకొక బాబు. మళ్లీ పెళ్లి చేసుకొమ్మని ఎవరెంత చెప్పినా వినలేదు బాబుని పెట్టుకుని గడిపేస్తోంది.
“నా మనసు నిండా అతనే ఉన్నాడు. అతను చనిపోయాడన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేను. అతని జ్ఞాపకాలు చాలు నాకు” అనేస్తుంది.
“ముఖం అలా ఉందేమే? రాత్రంతా నిద్రపోలేదా?” అడిగింది స్వర్ణ తల్లి. స్వర్ణ జవాబివ్వలేదు.
క్రమంగా వాళ్ల సంభాషణ ఆఖరి క్షణాల్లో ఉన్న వృద్ధురాలి మీదికి మళ్లింది. ఎన్నో జ్ఞాపకాలు.. ఆవిడ్ని అనుసంధానించుకుని. అందర్లోనూ దుఃఖం ఉందిగానీ అది బహిర్గతమవ్వటం లేదు. అదొక సహజ పరిణామంలా తీసుకున్నారు. తొందరగా వెళ్తే ఆఖరి చూపులేనా దక్కుతాయనే ఆరాటం.


క్వాలిస్ వెంకటాపురం చేరి తిన్నగా ఇంటిముందు ఆగింది. ఇంటిముందు ఊళ్లోవాళ్లు చాలామంది ఉన్నారు. అందరి ముఖాల్లోనూ విషాదం. పక్కకి జరిగి స్వర్ణావాళ్లకి దోవ ఇచ్చారు. వరండాలో చాపమీద పడుకోబెట్టి వుంది రామమ్మగారి పార్థివశరీరం. ఒకమూలకి నిర్వికారంగా కూర్చున్నాడు ఆవిడ భర్త. అల్లుళ్లంతా ఆయన్ని పలకరించి పక్కన కూర్చున్నారు.
ఇద్దరు మేనమామలు తప్ప మిగిలినవాళ్లంతా చుట్టుపక్కల ఊళ్లనించీ రావాలి. విశాలాక్షిదీ ఆమె అక్కదీ అందర్లోకీ దూరం. అప్పటికే మిగిలినవాళ్లంతా వచ్చేసి ఉన్నారు. వీళ్ళు రావటానికి కొద్దిసేపటి ముందే వాళ్ళూ వచ్చారు. వీళ్లని చూసి అంతా ఒక్కసారి గొల్లుమన్నారు. అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న దుఃఖం వీళ్లలోనూ పెల్లుబికి బైటికొచ్చేసింది. కొద్దిసేపు ఏడ్పులతో ఇల్లంతా మార్మోగిపోయింది. తర్వాత నెమ్మదిగా చల్లబడ్డారు.
కొత్తగా ఎవరేనా వచ్చినప్పుడల్లా ఈ ప్రకరణం పునరావృతమవుతునే ఉంది. అది ఒక్కసారితో ఆరిపోయే జ్వాల కాదు. కన్నతల్లిని.. కుటుంబానికి ఆలంబనగా దశాబ్దాలపాటు నిలిచిన వ్యక్తిని పోగొట్టుకోవటమంటే జీవధారలో కొంత పోగొట్టుకోవటమే. అది ఆజీవనపర్యంతం వెంటాడే విషాదం. ఆ కుటుంబంలోని రెండు తరాల పిల్లల్ని ఆవిడ ఎత్తి పెంచింది. వాళ్లకి అనారోగ్యాలొస్తే చేసింది. వేడుకలు జరిపింది. కానుకలిచ్చింది. పసిప్రాయపు కోరికలని తీర్చింది. ఆవిడ లేకపోవటం అందరికీ వెలితే.
ఎప్పుడు పోయిందీ, ఎలా పోయిందనే వాటికి జవాబు చెప్తున్నాడు పెద్ద మేనమామ. తెల్లవారి నిద్రలో పెద్ద కేక పెట్టిందట. డాక్టర్ని పిల్చుకొచ్చేలోపే ప్రాణం పోయిందట. చెప్తుంటే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అంతిమయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తీర్థప్రజలా వెళ్లారు పాడె వెంట జనం. సూర్యాస్తమయమైంది అంతా పూర్తిచేసుకుని, ఏదో కోల్పోయినట్లు తిరిగొచ్చారు.
వస్తూనే రెండు చెంబుల నీళ్లు పోసుకుని పొడి పంచ కట్టుకు తన గదిలోకి వెళ్లి ముసుగుపెట్టి పడుకున్నాడు రామమ్మగారి భర్త. ఒక దిగ్భ్రాంతి ఆయన్ని ఆవహించింది. ఎప్పుడో జ్ఞానం తెలీని వయసులో పెళ్లి చేసుకుని, తనతో అంత సుదీర్ఘ కాలం కలిసున్న వ్యక్తి వెళ్తున్నానని ముందుగా చెప్పకుండా తన దారిన తను ఈ వెళ్లిపోవటమేమిటో అర్థమవ్వలేదు. ఆమె వెళ్లిపోయాక మిగిలి ఉన్న తనేమిటి? తన గమ్యం ఏమిటి? అనేక ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్లింది ఆవిడ? ఆమెని వెతుక్కుంటూ వెళ్లిపోవాలన్న తపన మొదలైంది.
కర్మ పూర్తై బరువెక్కిన హృదయాలతో ఎక్కడివారక్కడికి వెళ్లిపోయారు. పుట్టింటి రుణం తీరిపోయిందన్న భావన విశాలాక్షికీ అమ్మమ్మగారిల్లు… అనే లిజెండ్ కరిగిపోయిందనే ఆవేదన స్వర్ణకీ కలిగాయి.

పదోరోజు రావచ్చని చాలామంది వెళ్ళిపోయారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇంకొందరు వుండిపోయారు. స్వర్ణ తిరిగి వెళ్ళివచ్చేసింది. ఎక్కడా నిలవలేని అశాంతి ఆమెలో.


శశాంకకి మేరేజి గ్రీటింగ్స్ పంపింది స్వర్ణ. ఎంత పట్టనట్టు ఉందామనుకున్నా ఎక్కడో బాధ ముల్లులా కలుక్కుమంటూనే ఉంది. కళ్లల్లో నీటిసుడి తిరుగుతూనే ఉంది. తను తప్పు చేసిందా? ఎక్కడ తప్పు చేసింది? ఎంతలో పుట్టి ఎంతలో కరిగిపోయింది తమ ప్రేమ? నిరంతరం అదే చింతన.
“జరిగిపోయినవాటి గురించి బాధెందుకు? ఒక్కదానివీ ఉంటే ఇలాగే బాధపడుతుంటావు, ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చెయ్” అంది విశాలాక్షి.
“కనీసం ఇంకో ఆరునెలలు చెయ్యాలట ఇక్కడ” జవాబిచ్చింది స్వర్ణ. అంటే ఇంకో వందా ఎనభై వంటరి రోజులు…


రామమ్మగారు పోయిన నెలరోజులకే పోయాడు ఆవిడ భర్త. ఇది ఆ కుటుంబానికి పెద్ద షాక్. అందరూ మళ్లీ వెళ్లారు.
“ఆవిడ పోయాక మామయ్యగారు బాగా బెంగపెట్టేసుకున్నారు. ఇల్లు దాటి ఇవతలికి వెళ్లడం మానేశారు. వీధి వరండాలో పడక్కుర్చీలోనే రోజంతా. నాలుగుసార్లు పిలిచి చెప్తేగానీ కాఫీకూడా తాగేవారు కాదు. ఇంక భోజనం దగ్గర.. పిలవగా పిలవగా ఎప్పటికో వచ్చేవారు. కంచం ముందు కూర్చుని ఒకటో రెండో ముద్దలు నోట్లో పెట్టుకుని కంచం పక్కకి జరిపేసేవారు. ఏదైనా మాట్లాడదామన్నా ధైర్యం చెప్పాలన్నా మన లోకంలో ఉంటేగా?” అంది విశాలాక్షి పెద్ద వదినగారు. స్వర్ణ గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నాయి ఆ మాటలు.
“వాళ్లిద్దరి మధ్యా అంత ప్రేమ ఎక్కడిదమ్మా?” తిరిగొచ్చాక అడిగింది స్వర్ణ తల్లిని.
“ప్రేమేమిటి ప్రేమ?” ఛర్రుమంది విశాలాక్షి. కూతురి పెళ్లి విఫలమయ్యాక ఆవిడకి ఆ మాటంటేనే నచ్చడం లేదు. “హిందూధర్మం ప్రకారం ఆత్మలని కలుపుకున్నారు వాళ్లు. పెళ్లంటే జన్మజన్మల బంధమని నమ్మారు. పెళ్లి చేసుకున్నందుకు కలిసున్నారు. కలిసున్నందుకు మమకారాలు పెంచుకున్నారు. అదంటా జీవనప్రక్రియ. ఒకరు వెలుగు, ఇంకొకరు నీడ. ఎవరు వెలుగు, ఎవరు నీడ అనేది అప్రస్తుతం. ఒకరు లేనిదే ఇంకొకరు లేరు” అంది.
స్వర్ణ మాట్లాడలేదు. ఇంకా ఆలోచనే.
“ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ల కళ్లలోకి ఇంకొకరు చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఊసులు చెప్పుకోవటానికి వాళ్లకి తీరిక లేదు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ గంపెడుమంది పిల్లలు. మేము, మనవలు, మనవరాళ్లు. నాన్నకి బోలెడన్ని వ్యవహారాలు, వచ్చే మనుషులు, వెళ్ళే మనుషులు. అమ్మ ఉండే వంటింటికీ నాన్న ఉండే వీధివాకిలికి మధ్య అనంతమైన సంసార సాగరం. అందుబాటులో లేనిది ఆకర్షణ”
“…”
“స్వర్ణా! పెళ్లంటే ఇల్లంటే భార్యాభర్తలు ఏకాంతంగా గడిపే పడకగదితో పాటు సంఘజీవనాన్ని సూచించే వీధిగది కూడా ఉండాలని తెలియకనే ఇప్పటి పిల్లల పెళ్లిళ్లు ఇంత తొందరగా బ్రేకవుతున్నాయి. ఏం ఉంటాయి, ఇరవైనాలుగ్గంటలూ మాట్లాడుకోవటానికి యిద్దరు మనుషులమధ్య ? వైవిధ్యం లేని జీవితం ఎంతటి ప్రేమనీ చంపేస్తుంది. మనంనుంచీ “మవ్వు – నేనులోకి కుదించుకుపోయిన తర్వాత నేనుగా”’ మిగిలిపోవటానికి ఎంతో కాలం పట్టదు. మేం ఎప్పుడూ బోర్ కొట్టి ఎరగం. చేతినిండా మాకు వ్యాపకాలుంటాయి. మరిప్పుడు? పుట్టిన పిల్ల దగ్గర్నుంచి అందరికీ బోరే. మీకు వ్యాపకమంటే డబ్బు సంపాదించిపెట్టేది మాత్రమే. మరి మాకు? చుట్టరికాలు, చుట్టూ వుండే మనుషులు” అంది విశాలాక్షి తనే మళ్లీ
స్వర్ణకి అర్థమైంది. శశాంక తను అతని కళ్ళెదురుగా వుండాలని మాత్రమే కోరుకున్నాడు. రోజుకి ఇరవై నాలుగ్గంటలూ ‘నేను నువ్వు’ అంటూ మూడేళ్లపాటు విసిగించేశాడు. ఎవరికి వారు అనుకునే స్థితికి తొందరగానే వచ్చేశారు. తామిద్దరూ ఒకరికొకరు సరిపడరు. అతనిలాగ చిన్నకుటుంబంలోంచి వచ్చిన అమ్మాయైతే అతనితో ఎడ్జస్టయ్యేది. నలుగురి మధ్య పెరిగిన వ్యక్తయితే అతనికి అనుబంధాలు తెలిసేవి. తనమీద ఆంక్షలు పెట్టకుండానూ అలాగని ఈ బంధుత్వాలపట్ల ఆసక్తి కనబరచకుండానూ ఉండి తనకి కొంత టైమిచ్చినా కొంత ఈక్విలిబ్రియం వచ్చేది. ఈ ట్రాన్స్ఫర్ అప్పుడూ వచ్చి ఉండేది. కాలక్రమాన ఈ బంధాలూ, బంధుత్వాలూ బలహీనపడేవి. చిన్నగా నిట్టూర్చింది.
ఒక ప్రేమ ఆత్మతో… అది ప్రేమనిపించదు. కర్తవ్యం అంతే. సాంప్రదాయంతో సమ్మిళితమైంది. అవినాభావసంబంధమైంది. అది అమ్మమ్మ తాతయ్యల మధ్య చోటుచేసుకుంది.
ఇంకొక ప్రేమ.. అది త్యాగం అనిపించుకుంటుంది. మనసునిండా నింపుకున్న జ్ఞాపకాల పరిమళాలతో జీవితేచ్చని పొందుతుంది. అలాంటి ప్రేమ భానుది.
ఇంకొక ప్రేమ.. అది జీవాన్నీ మానవసంబంధాలనీ చంపేస్తుంది. అది ప్రేమ కాదు. ప్రేమలా కనిపించే వ్యామోహం. ఆకర్షణ. అందుకే అది చచ్చిపోయింది.

1 thought on “తనువు, మనసు, ఆత్మ by S Sridevi”

  1. ఇందిర

    బాగుంది బంధాలు అనుబంధాల మధ్య పోసాగలేని నేటి యువత సంఘర్షణ అది దాంపత్యం పాత పడినా సంఘర్షణ సమడిపోడు

Comments are closed.