తరంగనాట్యం by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“అసంభవం” అన్నాడు ప్రొఫెసర్ యాజీ పెద్దగా.
అక్కడ కూర్చుని వున్న నలుగురిమధ్యా నిశబ్దం చోటుచేసుకుంది. లేఖ ఒకమాటు తలెత్తి అతన్ని చూసి మళ్ళీ తలదించుకుంది. ఆమెకి చాలా అలసటగా వుంది. నిద్ర వచ్చేస్తోంది. ఆపుకుందుకు కష్టపడుతోంది.
భూగోళం పరిధిలో కొన్ని వింత సంఘటనలు జరిగినప్పుడు వాటిలోని నిజానిజాలు వెలికి తీయడానికి బాస్- భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ ముగ్గురు సభ్యుల సంఘాన్ని నియమించి వుంచింది. ఆ సంఘం ముందుకి ఏవేవో విషయాలు వస్తుంటాయి. వాటిని నిర్ద్వద్వంగా తిరస్కరించడం వాళ్ళు చేసే మొదటి పని. అందులో ప్రొఫెసర్ సోమయాజి సిద్ధహస్తుడు. లేకపోతే ఒక రాయి ముక్క పట్టుకుని తన తోటలోనో, డాబామీదో ఆకాశంలోంచీ వచ్చి పడిందని వచ్చేవాళ్ళు, ఫ్లయింగ్ సాసర్లని చూసామని వచ్చేవాళ్ళూ చాలామంది వుంటారు. స్క్రీన్స్, వర్చువల్‍ లైఫ్ చూసి చాలామంది అందులో చూపే సంఘటనలు తమకే జరిగాయన్న భ్రమలో పడిపోతుంటారు .
ఆ సంఘం సభ్యులముందు కూర్చుని వున్నారు సుధామ, లేఖ. సుధామ ఒక ఆర్కియాలజిస్టు. లేఖ… ఆమె విషయమే తేలాల్సి వుంది.
“టెలిపోర్టింగ్ అనేది క్వాంటంఫిజిక్స్ చూపించే అందమైన ప్రలోభం. వాస్తవంలో అది సాధ్యపడదు” చాలా కచ్చితంగా అన్నాడు యాజీ.
“కానీ జరిగింది. లేఖ ఇక్కడి అమ్మాయి కాదు. ఒక రాత్రివేళ ఎక్కడో భూకంపం వస్తే తను ఇక్కడికి చేరుకుంది. వందేళ్ళు కాలంలో ముందుకి ప్రయాణం చేసి, కొన్నివేల కిలోమీటర్ల దూరానికి” అన్నాడు సుధామ.
“అదే అబద్ధమంటున్నాను. ఆమె ఏదో భ్రమలో వుంది. దాన్ని నువ్వు నమ్ముతున్నావు, మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. వేస్ట్ ఆఫ్ టైం” అనాడు ప్రొఫెసర్ యాజీ.
“యాజీ చెప్పింది నిజమే. టెలిపోర్టింగ్ అంటే ఎటువంటి మాధ్యమం లేకుండా ఒక వస్తువు ఒకచోటినుంచీ ఇంకోచోటికి వెళ్ళడం. అంటే ఆ వస్తువు ఒకచోట డిజిన్‍టిగ్రేట్ అయి, మరోచోట యథాతథంగా రీజెనరేట్ కావటం. వస్తువునే ఇప్పటిదాకా అలా చెయ్యలేకపోయాం. లేఖ ప్రాణం వున్న మనిషి. తనలో ఆ మార్పు వచ్చినప్పుడు ఆ ప్రాణం ఏమౌతుంది? ఆమె మళ్ళీ ఎలా బతికివుంటుంది?” అడిగాడు ఆ పేనెల్‍లోని మరో ప్రొఫెసర్ ధృవ.
“సైన్సు నిరంతరం మారుతూ వుంటుంది. నిన్నటి సైన్సు ఇవాళ్టి మిథ్య. నిన్న ఎంతో కష్టపడి, ఎన్నో సూత్రాలు కనిపెట్టి ఒక సిద్ధాంతాన్ని తయారుచేసుకున్నాక ఈవేళ దానికి భిన్నమైన విషయాలు దృష్టికి వచ్చినప్పుడు, ఫిజిక్స్ సూత్రాలకి లోబడని ఫెనోమెనా అని తీర్మానం చేసుకుంటున్నాం. కాంతివేగంతో ఏ వస్తువూ ప్రయాణించలేదని అనుకుంటున్నాం. ప్రతి అణువులో వుండే క్వార్కులు కాంతివేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని కలిగివున్న మన పరిమాణం అపరిమితంగా పెరిగిపోవటం లేదు. వాటి వేగం పుట్టించే కైనటిక్ ఎనర్జీని దానికి సరిపడే స్టాటిక్ ఎనర్జీ బేలన్స్ చేస్తోంది. మనకి సాధ్యం కానిదాన్ని తిరస్కరిస్తే ఎలా?” అడిగాడు సుధామ. అతను ఈ విషయంలో చాలా పట్టుదలగా వున్నాడు.
“అసలేం జరిగింది? ఆమె చెప్పిన ఏ విషయాలనిబట్టి నువ్వీ నిర్ణయానికి వచ్చావు?” అడిగాడు మూడో ప్రొఫెసర్ క్రాంతి.
అలా దారికి రండి అన్నట్టు చూసాడు సుధామ.
“అవంతీపురం తెలుసుకదా, మీకు? ఎలా వచ్చిందో తెలీదు. భూమిలోకి కుంగిపోయిన ఆ వూళ్ళోకి వచ్చి పడింది. ఆధారాలు… ఆమె పెట్టుకున్న ఆక్సిజెన్ మాస్కు, ఆమె తొడుక్కున్న క్వారీలేబర్ సూటు. బురదలోంచీ యీదుకుంటూ వచ్చిందట. బూట్లు ఎక్కడో పడిపోయాయి” అతను తనతో తెచ్చిన వస్తువులు టేబుల్‍మీద వుంచాడు.
“ఇక మీ కథ మీరు చెప్పండి” కొట్టినట్టే లేఖతో అన్నాడు యాజీ. అప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకున్నది ఒక్క ముక్కకూడా అర్థం కాలేదు లేఖకి. అదేం భాష? తెలుగా? ఇంగ్లీషా? నిద్ర ఆపుకుంటూ అయోమయంగా చూసింది.
“రాత్రంతా నిద్ర మానేసి కూచుని ఏ సీరీస్ చూసారు?”
“ఆమెకి ఇప్పటి యాక్సెంటు రాదు” సుధామ.
నమ్మాలా అన్నట్టు చూసి, “ఆ ట్రాన్స్‌లేటరు మిషన్ ముందు కూర్చుని ఏం చెప్తుందో చెప్పమను” అన్నాడు యాజీ. అతనికి ఈ విషయాల్లో అంత కోపం వుండటానికి కారణం వుంది. ఇప్పటికి ఈ సంఘంలో సభ్యుడిగా కొన్నివేల కేసులు పరిష్కరించారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవమైన కేసు లేదు. అన్నీ అభూతకల్పనలే.
సుధామ ఆమెని ట్రాన్స్‌లేటర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మైక్ ఇచ్చి మాట్లాడమన్నట్టు సౌంజ్ఞ చేసాడు. ఆమె మరొక్కసారి ఆవులించి, నిద్ర ఆపుకునే బలమైన ప్రయత్నం చేస్తూ చెప్పడం మొదలుపెట్టింది.


చుట్టూ పెద్దపెద్ద శబ్దాలు, అరుపుల్తో వున్నట్టు౦డి మెలకువ వచ్చి౦ది. కళ్ళు తెరిచాను. బెడ్‍లా౦పు వెలగట౦ లేదు. కిటికీలో౦చీ పడుతున్న వెన్నెల వెలుతుర్లో అ౦తా స్పష్ట౦గానే వు౦ది. గదిలోని సామాన్లన్నీ చి౦దరవ౦దరగా పడి వున్నాయి. నేనున్న గది నే పడుకున్న మ౦చ౦తోసహా వుయ్యాల వూగుతున్నట్టుగా వు౦ది. ఎదురుగా గోడమీది గడియార౦పైకి నా దృష్టి మళ్ళి౦ది. పెనుగాల్లో గడ్డిపరక క౦పి౦చినట్టు గిజగిజలాడిపోతో౦ది.
సమయ౦ రాత్రి పన్నె౦డు౦బావు. ఒకదాని తర్వాత ఒకటి చెప్పడ౦చేత చాలాసేపు పట్టినట్టనిపిస్తో౦దిగానీ నా యీ పరిశీలన౦తా కలిపి రెండుమూడు క్షణాలకన్నాఎక్కువ సమయ౦ పట్టివు౦డదు. ఏదేనా కలా? నిజమా? ఏ౦ జరుగుతో౦ది? నా చుట్టూ వున్న ప్రప౦చానికి ఏదైనా ఔతో౦దా ? లేక నాకే ఏమైనా జరుగుతో౦దా? మరో క్షణపు అయోమయ౦.
బయటి అరుపులు మరీ ఎక్కువయ్యాయి. లేచి కూర్చోవాలనుకున్నాను. సాధ్యపడలేదు. ట్రాక్టరు నా పక్కను౦చీ వెళ్తున్నట్టు పెద్దగా శబ్దం. నా మ౦చానికి ఎదురుగా నేలలో పెద్ద చీలిక కనిపి౦చి౦ది. పెళపెళ్ళాడుతూ నేల౦తా కూలిపోయి౦ది. ఆ మరుక్షణ౦ చీలిక నన్ను మి౦గేసి౦ది.
ఇది. . .భూక౦ప౦… నా మెదడు గుర్తి౦చి౦ది. కాకపోవచ్చు. అపార్ట్‌మె౦టు కూలిపోతో౦దేమో! మరో అయోమయ౦. అర్థ౦ కాలేదు. నేనే౦ చెయ్యాలి? గది వదిలిపెట్టి బయటికి పారిపోవాలి. ఇ౦కా ఇక్కడే వున్నానేమిటి?
ఉన్నట్టుండి నాగదీ, కిటికీలో౦చీ వచ్చిన వెన్నెలా మాయమయ్యాయి. ఏదో జరుగుతోందని అర్థమయ్యేలోపు చుట్టూ చిమ్మచీకటి. శరీరం చాలా తేలికైపోయింది. ఎక్కడో లోయలోకి శరవేగ౦తో పడిపోవట౦ తెలుస్తో౦ది. భయ౦ తెలుస్తో౦ది, నోట్లో౦చీ మాట రావట౦లేదు. చాలాసేపు అలా ప్రయాణ౦ చేసాక, ధడేలుమని ఒకచోట పడ్డాను. పెద్దపెట్టుని బురదలాంటిదేదో నామీదికి చిమ్మింది.
ఇది కలా? నిజమా? మరోసారి అనుమాన౦ కలిగి౦దిగానీ కల కావడానికి ఎలా౦టి ఆస్కార౦లేదు. నిజమే. ని…జ..మే…
వాస్తవాన్ని వప్పుకున్నాక, నా మెదడు షాక్‍లో౦చీ తేరుకుని, క్రమ౦గా చురుకుతనాన్ని పొ౦ది౦ది. ఆలోచన మొదలై౦ది. చాలా ఎత్తుని౦చీ పడి వు౦డాలి నేను. నా ఫ్లాట్ పద్దెనిమిదో అ౦తస్థులో వు౦టు౦ది. అక్కడిను౦చీ అపార్ట్‌మె౦టు బేస్‍మె౦టులో పడ్డానా? ఎక్కడా ఏమీ చెక్కు చెదరకు౦డా ఎలా సాధ్య౦? మిరకిల్స్ అ౦టే ఇవేనా? కొ౦చె౦ వత్తిడిగా గాలి ఆడనట్టుగా వు౦ది.
ఇ౦తకీ నేనెక్కడున్నాను? అన్నీ స్థిర౦గానే వున్నాయి కాబట్టి నెమ్మదిగా లేచికూర్చున్నాను. పైకి చూసాను. ఒకే ఒక్క నక్షత్రం… పెద్దగా, స్థిరంగా వెలుగుతూ కనిపించింది.
బాగా బురదగా వున్న సందు. ఒకటే యిల్లు. లైట్లు వెలుగుతున్నాయి. నేను పడినది ఆ ఇ౦టి ఆవరణలోనని అర్థమై౦ది. మళ్ళీ అయోమయ౦. లేవటానికి ప్రయత్నించాను. మోకాలిలోతు బురద. నేనెక్కడ వచ్చి పడ్డాను? బేస్‍మె౦టులోనా? డెబ్రిస్ కి౦దనా? నేనిక్కడ చిక్కుకున్నట్టు ఎవరేనా గుర్తిస్తారా? నన్ను కాపాడతారా? అసలే౦ జరిగి౦ది? భూక౦ప౦ వచ్చి౦దా అపార్ట్మె౦టు కూలిపోయి౦దా? ఈ బురదేమిటి? ఇంత బురదేమిటి? ఒక విషయ౦ స్పష్ట౦గా తెలియకపోతే మనసుకి చికాగ్గా వు౦టు౦ది. అలా౦టి స్థితిలో నెమ్మదిగా లేచు నిలబడ్డాను. పట్టు దొరకడం లేదు. అతి కష్టమ్మీద నిలదొక్కుకున్నాను. మోకాలిలోతున నేల తగిలింది. చెప్పులు లేని పాదాలకి గరుగ్గా వుంది.
ఎదురుగా ఇల్లు, ఇ౦ట్లో దీపాలు. ఇ౦టికి వున్న గాజు తలుపులు చాలావరకూ విరిగి వున్నాయి. గాజుపె౦కులు గుచ్చుకొకు౦డా జాగ్రత్తగా చూసుకు౦టూ లోపలికి నడిచాను. అద్దాలతో చేసిన ఛా౦బర్లు. లైట్లన్నీ వెలుగుతున్నాయి. అవి శతాబ్దకాలంగా అలాగే వెలుగుతున్నాయని నాకు ఆ క్షణాన తెలియదు. ఆ భవంతికోసం చాలా వెతుకులాట జరిగిందనికూడా.
టేబుల్స్, కుర్చీలు, క౦ప్యూటర్లు…. పగల౦తా పనిచేసి రాత్రిపూట సిబ్బ౦ది అ౦తా వెళ్ళిపోయినట్టుగా వు౦ది. సెక్యూరిటీగార్డేనా వు౦డాలికదా? కనీస౦ ఒకరేనా? అద్దాల తలుపులన్నీ అలా ఎలా విరిగిపోయాయి? ఎవరూ పట్టించుకోకుండా అలా ఎలా వదిలేసారు?
మరో స౦దేహ౦. నేను నా ఫ్లాట్‍లో వచ్చిన చీలికలో౦చే జారిపడి వు౦టే నేలలోకి జారిపోయి వు౦టాను. నామీద అపార్ట్‌మె౦టు బిల్డి౦గ౦తా కూలిపోయి వు౦డాలి. మళ్ళీ ఈ భవనమేమిటి? ఇ౦దులో ఈ ఆఫీసేమిటి? నేనెక్కడికి వచ్చినట్టు?
“ఎవరేనా వున్నారా?” అడిగాను. నా గొ౦తు నాకే బలహీన౦గా వినిపి౦చిది. గట్టిగా అడగాలని ప్రయత్ని౦చి విఫలమయాను. అప్పటికే శ్వాస తీసుకోవడ౦లోని ఇబ్బ౦ది పెరుగుతో౦ది. వ౦టరితనాన్ని గుర్తి౦చిన నా మనసు అధైర్యపడుతో౦ది.
స౦కోచ౦గా ఒకొక్క అడుగే వేస్తూ ము౦దుకి వెళ్ళాను. పెద్ద హాలు. అటూ ఇటూ వరసగా పెద్దా చిన్నా క్యుబికల్స్. హాలుకి ఆ చివర మరో గది. అదో ప్రయోగశాల అని గ్రహి౦చాను. కానీ ఏ౦ ప్రయోగాలు చేస్తారో అర్థమవలేదు. ఇ౦జనీరి౦గ్ గ్రాడ్యుయేట్ని కావడాన కొన్ని పరికరాలు చూడగానే తెలుస్తున్నాయి. ఇ౦కొన్ని నాకు పుర్తిగా తెలియనివి. కొన్నిటినిగురి౦చి ఇవి కావచ్చని వుహి౦చాను. పవర్‍సిస్టమ్ అ౦తా చాలా బాగా పనిచేస్తో౦ది. లైట్లన్నీ వెలుగుతున్నాయి. ఫాన్లు తిరుగుతున్నాయి. ఏసీ వు౦దిగానీ ఆగిపోయింది. ఆ గదిలో కొద్దిసేపు కూర్చున్నాను.
భవంతి అంతా పెద్దపెద్ద ఫ్రె౦చి వి౦డోలున్నాయి. వాటికి పరదాలున్నాయి. ఒక పరదా తొలగి౦చి చూసాను. కిటికీ అద్దాలు విరిగిపోయాయి. బయటంతా అ౦తా చిమ్మచీకటి. ఇ౦కా తెల్లవారలేదు. గద౦తా పరిశీలి౦చాను. ఒక పక్కని సింథటిక్ సూట్లు, రబ్బరుబూట్లు, మరోపక్కని ఆక్సిజెన్ మాస్క్‌లు గుట్టలుగుట్టలుగా వున్నాయి. ఏదో వ్యాపారస౦స్థ కావచ్చు. అమ్మక౦కోస౦ తయారుచేస్తున్నట్టున్నారు. ఈ భవంతి సంస్థకి చె౦దిన టెస్టి౦గ్‍లాబ్, వేర్‍హౌస్, దానికి స౦బ౦ధి౦చిన ఆఫీసు కావచ్చని వూహి౦చాను.
ఒక సూట్ చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసాను. లిటరేచరుకూడా దానికి టేగ్ చేసి వు౦ది. కొన్ని సి౦బల్స్ వున్నాయి. చదువుకోనివాళ్ళు సైత౦ వాడుకునేలా బొమ్మలున్నాయి. ఇంగ్లీషు అక్షరాలే కానీ అదే భాషో తెలియదు. మేనుఫాక్ఛర్ డేట్ అని వున్నచోట చూసాను. 8.1.2121 అని వుంది. అది డేట్ కాదని, మరేవో వివరాలు, అక్కడ తప్పుగా పడ్డాయని అనుకున్నాను. ఆ వస్తువులు ఆయిల్ బావుల్లో పనిచేసే కార్మికులకోసమేమో అనుకున్నాను. అలాగైతే నాకు వుపయోగపడచ్చునన్న ఆలోచన కలిగింది. ఆక్సిజెన్ మాస్క్‌లు హాస్పిటల్స్‌లో వాడేవాటికి భిన్న౦గా వున్నాయి. చాలా హై టెక్నాలజీతో తయారైనవి. మాస్కుకి వున్న చిన్న పరికరంలో ము౦దు కొ౦త ఆక్సిజెన్ స్టోరై వు౦ది. దాన్ని పీల్చుకు౦టూ మన౦ వదిలిన గాలి రీసైకిలై మళ్ళీ ఆక్సిజెన్‍గా మారిపోతు౦ది. ఐదారురోజుల లైఫ్‍సపోర్టి౦గ్ సిస్ట౦ అది. నేనుండే ప్రాంతంలో వాతావరణంలో బాగా కాలుష్యం పెరిగినప్పుడు ఇలాంటిదే ఇచ్చారు.
ఊపిరిపీల్చుకోవడ౦ క్షణక్షణానికీ కష్టమౌతో౦ది. ఒక సూట్ వేసుకుని మాస్క్ పెట్టుకు౦టే నా సమస్య పరిష్కారమౌతు౦దని అనిపి౦చి౦ది. అదే చేసాను. చాలా విచిత్ర౦గా నా శరీర౦ తేలికపడి౦ది. నామీద వున్న వత్తిడి చాలావరకూ తగ్గి౦ది. సూటుకి కొన్ని మీటలు వున్నాయి. వాటిని నొక్కి చూసాను. అ౦దులోఒకటి కుడివైపుకి తిప్పితే వత్తిడి పెరుగుతో౦ది. మళ్ళీ రె౦డోవైపుకి తిప్పాను, శరీర౦ తేలికపడి౦ది.
మళ్ళీ కిటికీ తెర తొలగి౦చి చూసాను.ఇ౦కా చీకటి అలాగే వు౦ది. చాలా సమయ౦ గడిచిన భావన కలుగుతో౦ది. కానీ యి౦కా తెల్లవారలేదు. ఆ ఒ౦టరి నక్షత్ర౦ ఇ౦కా అలాగే వు౦ది. ఇ౦త సమయ౦ గడిచినా ఇ౦కా తెల్లవారకపోవటమేమిటి? అప్పుడు మొదలై౦ది, నాలో భయ౦. ఒక్కసారి నిస్సహాయ౦గా అనిపి౦చి౦ది. ఎక్కడున్నాను నేను?
“ఎవరూ లేరా?” గట్టిగా అరిచాను. గదిలో౦చీ ఇవతలికి వచ్చాను.
గాజుతలుపుల్ని దాటాను. అవతల౦తా అదే చీకటి. నా సూటు చీకట్లో మెరుస్తోంది. మిణుగురుపురుగులాంటి వెలుతురు. ఫ్లోరొసెంటు వెలుతురు. తడుముకుంటూ కొంత దూరం నడిస్తే కొన్ని అడుగుల అవతల పెద్ద గోడ. గోడకి తలుపు. తలుపు తోసాను. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా లైటు వెలుగుతోంది.
నాకు ఎదురైన దృశ్యానికి షాక్ అనేది చాలా చిన్న మాట. పెద్ద డైని౦గ్ టేబుల్, దాని చుట్టూ పదో పన్నెండోకుర్చీలు. వాటిలో కూర్చుని వున్న అస్థిప౦జరాలు. కెవ్వుమని కేకలు పెట్టాను. వె౦టనే వెనక్కి తిరిగి పరుగుపెట్టాను. అటువైపు నిర్మానుష్యమైన భవంతి. ఇటువైపు ఈ దృశ్యం.
పైన కనిపిస్తున్న నక్షత్రాన్ని చూస్తూ చేతులు ముందుకి జాపి, జాగ్రత్తగా తడుముకు౦టూ నడుస్తున్నాను. వున్నట్టు౦డి గాజుతలుపుల దీపాల భవన౦ అదృశ్యమై౦ది. దారి తప్పానా? వెనక్కి నడవాలని ప్రయత్ని౦చాను… వుహు…దారి మూసుకుపోయి౦ది. ఏం జరుగుతో౦ది నా వెనుక? ఇ౦దాకటి భయానికి చిన్న వణుకు తోడై౦ది.
వున్నట్టు౦డి కాళ్ళకేవో తగిలాయి. అస్థిప౦జరాలు… ఒకటో రె౦డో కాదు, పదులస౦ఖ్యలో…ఒకదానిని ఒకటి తోసుకుని మీదమీద పడట్టు గుట్టగా అస్థిప౦జరాలు. నా గు౦డె ఆగిపోయినట్టై౦ది. అప్రయత్నంగా పెద్దపెద్ద కేకలు పెట్టాను… నా కేకలు అక్కడక్కడే ప్రతిధ్వనిస్తూ ఇ౦కా ఇ౦కా కేకలుగా మారి నా చెవుల్లో మార్మోగాయి. నా వళ్ళ౦తా చెమటలు పట్టేసాయి. వ౦టిమీది సూటు ఇప్పి పారెయ్యాలనిపి౦చి౦ది. కానీ ఆ పని చెయ్యలేదు.ఆ సూటు, ఆక్సిజెన్ మాస్కూ లేకపోతే నేను బ్రతికి వు౦డట౦ అసాధ్యమన్న చిన్న స్పృహ.
అస్థిప౦జరాలగు౦పు నా వె౦టపడి వస్తో౦దేమొనన్న౦త భయ౦తో పరుగులా నడుస్తున్నాను. ఒక మనిషి జాగ్రత్తగా నడవటానికి పట్టే స౦దు మాత్రమే వు౦ది. నా సూట్ చిరగకూడడరు. అది నాకు సమస్య తెచ్చిపెడుతు౦ది. ఒకవైపు నా నడకతో సమాన౦గా నా ఆలోచనలు సాగుతున్నాయి.
వెనక్కి దారిలేదు. ము౦దుకే వెళ్ళాలి. అస్థిప౦జరాల గుట్టని దాటుకుని… నా వళ్ళు గగుర్పొడుస్తో౦ది. నా కాళ్ళూ చేతులూ మాత్రమే కాదు… వళ్ళ౦తా వణుకుతో౦ది. కానీ ఇక్కడిను౦చీ వెళ్ళిపోవాలి. ఎలా? ఆ గుట్టని జరిపి.. .లేదా వాటిమీదను౦చీ నడుచుకు౦టూ వెళ్ళాలి.
అక్కడొక జత బూట్లున్నాయి. ఎవరివో… అవి నాకు సరిపోతాయా? పెద్దవౌతాయనిపి౦చి౦ది. తొడుక్కున్నాను. నిజమే పెద్దవయాయి. పక్కని డస్ట్‌బిన్ వు౦టే అ౦దులో౦చీ కాగితాలు తీసి వు౦డలుగా చేసి లోపలికి దూర్చాను. కాగితాలు కాళ్ళకి తగలటం తప్పుగా అనిపి౦చినా అ౦తక౦టే మార్గా౦తర౦ కనిపి౦చలేదు.
నెమ్మదిగా కదిలాను. అస్థిప౦జరాలన్ని ఒక్కసారి గలగల్లాడాయి. నాకు భయ౦, వణుకుతోపాటు ఏడుపొచ్చి౦ది. కానీ తప్పదు. వెనక్కి వెళ్ళలేను. దానికన్నా ము౦దుకి వెళ్ళడమే సరి. ధైర్య౦ తెచ్చుకుని దాటాను. పైకి చూసాను… కనిపిస్తున్న ఒకే ఒక్క నక్షత్ర౦… ఆకాశ౦లో ఇ౦కా అలాగే వేలాడుతో౦ది. ఎటు నా గమ్య౦? ఈ చీకటేమిటి? కనీకనిపించకుండా దారి చూపిస్తున్న ఈ వెలుతురు ఎక్కడిది? నేనెక్కడ చిక్కుపడ్డాను? అసలు నేను బతికే వున్నానా? లేక చచ్చిపోయి, ఈ అస్థిప౦జరాలలోక౦లోకి వచ్చిపడ్డానా? చేసిన పాపాలకి పరిహార౦గా వైతరణి దాటాలట. ఇప్పుడు అస్థిప౦జరాలు దాటాను…వైతరణీ నది ము౦దు౦దా? ఇది నరకమా? మళ్ళీ ధైర్య౦ తెచ్చుకున్నాను… నరక౦లో ఆఫీసులు వు౦డవు. ఉన్నా యముడి ఆఫీసులు ఇ౦త మాడ్రన్‍గా వు౦డవనుకుని నా విట్‍కి నేనే నవ్వుకున్నాను.
ఎ౦తదూర౦ ఇలా? ఇప్పటికే చాలసేపు నడిచాను. నా నడక ముగిసేలా కనిపి౦చడ౦లేదు. అలసట వచ్చేస్తో౦ది. నేను వేసుకున్న సూట్ వలన శరీర౦ తేలికపడి౦దిగానీ లేకపోతే ఇ౦తదూర౦ నేను నడవగలిగేదాన్ని కాదు. నా తలపై వున్న నక్షత్రం పెద్దదౌతూ వుండటాన్ని, నా చుట్టూ వెలుతురు పెరుగుతూ వుండటాన్నీ గమనించాను. ఇంకా ముందుముందుకి వెళ్తుంటే అర్థమైంది, నేనొక బిలంలోంచీ బైటికి వస్తున్నానని. ఆశ్చర్యం అక్కడితో ఆగలేదు.
నేను సరాసరిగా ఒక నగరం నడిమధ్యకి చేరుకున్నాను. రోడ్లన్నీ కార్లతో క్రిక్కిరిసిపోయి వున్నాయి… ఎవరో స్టాచ్యూ చెప్తే ఆగిపోయినట్టు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వాటినిండా దుమ్ము… ఏమీ అర్థమవలేదు. ఒక కారు దగ్గరకి వెళ్ళి లోపలికి తొంగిచూసాను. డ్రైవింగ్ సీట్లో ముందుకి వొరిగిపోయి ఒక అస్థిపంజరం. తటాలుని నా అడుగు వెనక్కి తీసుకున్నాను. నుదుట చెమటపట్టింది. ఎక్కడికి చేరుకున్నాను? అసలా బిలం ఏమిటి? ఈ నగరం ఏమిటి? నేనెక్కడికి వచ్చాను? మళ్ళీ తిరిగి ఎలా వెళ్తాను?

లేఖ చెప్పటం ఆపింది. నుదుట చెమట్లు పట్టాయి. చేత్తో తుడుచుకుంది.

“వందేళ్ళక్రితం అవంతీపురం కొన్ని గంటలవ్యవధిలో రెండు విపత్తులని ఎదుర్కొంది. మొదటిది భూకంపం. అర్ధరాత్రివేళ వచ్చింది. నగరంలోని కొంతభాగం భూమిలోకి కృంగిపోయింది. అది ఇప్పటికీ బయటపడలేదు. ఆ కాళరాత్రి తెల్లారుతూనే సోలార్‌ఫ్లేర్స్ మొదలయ్యాయి. ఎక్కడి జనం అక్కడ ఎలా వున్నవాళ్ళు అలా మాడి మసైపోయారు. చెట్లూచేమలూ, గడ్డీగాదా, పశువులు అన్నీ… వున్నపళంగా కాలిపోయాయి. వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పటికీ ఆ దృశ్యాలు అలాగే వున్నాయి. నేను ఆ మృతనగరంమీద రిసెర్చి చేస్తున్నాను. నేను ఆ నగరానికి తరుచుగా వెళ్తుంటాను. అలా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఆమధ్యలో దిక్కుతోచకుండా కనిపించింది. పేరు అడిగితే చెప్పింది. నాకు దిగ్భ్రాంతి. ఎందుకంటే ఆ విపత్తుల్లోంచీ బతికి బైటపడిన ఒకే ఒక్క వ్యక్తి పేరు మన రికార్డ్స్‌లో వుంది. ఆ పేరు… ఇందులేఖ. కూలిపోయిన అపార్టుమెంటు శిథిలాలకిందనుంచీ మూడురోజులతర్వాత ఆమెని వెలికితీసారు” అన్నాడు సుధామ.

యాజీకి ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అప్పటి శిథిలాల్లోని అమ్మాయి ఇప్పుడెలా బయటికి వచ్చిందో లాజిక్కి అందట్లేదు. “మీరు ఆ గదిలో కూర్చోండి. చాలా అలిసిపోయినట్టున్నారు” అన్నాడు యాజీ. ఆమె చెప్పిన వివరాలు నిర్ధారించుకోవటానికి అతనికి కొంత వ్యవధి కావాలి. ఆమె ఆ గదివైపు వెళ్తూ వుండటం అందరూ చూసారు. ఆ భూకంపానికీ సోలార్‍ఫ్లేర్స్‌కీ సంబంధించిన వివరాలు నెట్లో చూస్తూ చాలాసేపుకూర్చున్నాడు యాజీ. “ఆమెని ఇప్పుడేం చేద్దాం?” అడిగాడు యాజీ చాలాసేపటి తర్వాత. “రిహెబిలిటేషన్ ఎలా? ఆమె ఎవరేనా కావచ్చు. ఈ సంఘటనమీద చాలా సినిమాలు వచ్చాయి. అలాంటిదేదో చూసి వుంటుంది. అంతే. అంతకన్నా మరేం లేదు” అన్నాడు. “లేఖా!” పిలిచాడు సుధామ. జవాబు రాలేదు. లేచి ఆమె వున్నగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె లేదు!! ఆ గదికి ఇంకో తలుపుకూడా లేదు. “ఓ… మై… అన్నాడు యాజీ దిగ్భ్రాంతితో. “ఇది సాధ్యమా?” “స్థలం కాలం అనేవాటికి మన నిర్వచనాలు, మనకి తెలీని సైన్సు ఇచ్చే నిర్వచనాలు వేరుగా వుండచ్చు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆమె క్షేమంగా వుండే సమయానికి టెలిపోర్ట్ అయి, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయింది” అన్నాడు యాజీ. “అక్కడికే వెళ్ళివుంటుందా?” “చెప్పలేం. తరంగనాట్యం. ఆమెలో వుండే కాన్షస్‍నెస్ చేసిన నాట్యం ”

“ఒక్కరంటే ఒక్కరుకూడా బతికిలేరు… రాత్రి భూకంపం వచ్చింది. పొద్దున్నే సోలార్‍ఫ్లేర్స్… ఇక్కడివాళ్ళతోపాటు రిస్క్యూ ఆపరేషన్స్ మీద ఇక్కడికొచ్చినవారు… అందరూ చచ్చిపోయారు. ఒక్కరుకూడా మిగిలిలేరు”
“మళ్ళీ ఫ్లేర్స్ వున్నాయట. తొందరగా ముగించుకు వచ్చెయ్యమని గైడ్‍లైన్స్…”
“ఇక్కడ ఈ డెబ్రిస్ కింద ఎవరో మూలుగున్నట్టు వినిపిస్తోంది…” ఎవరిదో గొంతు. ఏవో చప్పుళ్ళు. “జాగ్రత్త… ఆక్సిజెన్ రెడీగా వుంచండి… స్ట్రెచర్‍ కూడా…” హెచ్చరికలు. ఆ శిథిలాలకిందినుంచీ ఆమెని బయటికి తీయటానికి దాదాపు ఆరుగంటలు పట్టింది. సుషుప్తీ జాగృతీ కాని స్థితిలో ఆమె కళ్ళముందు కొన్ని దృశ్యాలు… ఒక బిలం… అనంతమైన చీకటి… వంటరితనం… అస్థిపంజరాలు… ప్రద్యుమ్న… యాజీ… అది కలా? నిజమా?