తిరస్కృతులు – 21 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“డబ్బు గురించి బెంగ పెట్టుకోకు వసంతా! ఎలాగో ఒకలా పుట్టిస్తారు. లేకపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఎంత తెచ్చినా ఏముంది, ఆయన తాగుడికే. నీకూ నీపిల్లలకి ఏ లోటూ రాకుండా చూసుకుంటాం. ఏదైనా వుద్యోగం కూడా చూసుకుందువుగాని” అంది అమ్మ.
“నామీద కోపం లేదామ్మా?” అడిగాను. ఆ భయమేకదా, ఇన్నేళ్ళు నన్ను ఇక్కడికి రాకుండా ఆపింది?
అమ్మ దెబ్బతిన్నట్టు చూసింది. “మేము సరైన దార్లో నడిస్తూ మీరు నడపలేదని కోపం తెచ్చుకోవాలి. మేమే తప్పుటడుగులు వేస్తే మా చెయ్యి పట్టుకుని నడుస్తున్న మీరు సరిగా ఎలా వెళ్తారు?” అంది.
అంత సంయమనంతో అమ్మ మాట్లాడినవి ఆ కొద్దిమాటలే. తర్వాతంతా మామూలే! ఆవిడ వున్నంతసేపూ ఏదీ తోచలేదు. అంతా గాభరాగాభరాగా అనిపించింది. మళ్ళీ వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లిపోయాక ప్రశాంతంగా వుంది. పిల్లలు హడిలిపోయారు. వాళ్లని మామూలుగా మార్చేసరికి కొంత వ్యవధి పట్టింది. నామీద మరో కొత్తబాధ్యతకూడా వున్నట్టు గ్రహించాను. పిల్లల్నేకాదు, అమ్మానాన్నల్ని కూడా చూసుకోవాలి.


అమ్మమ్మకి రెండురోజుల్నించీ జ్వరం. మంచం దిగడంలేదు. డాక్టరు వచ్చి చూసి వెళ్ళాడు. ఒకప్పుడు వుండిన ఫామిలీ డాక్టరు కల్చరు యీవూళ్ళో మళ్ళీ మొదలైంది. ఎంబీబియెస్ చదివాడు. ఆరెంపీగా రిజిస్టరై, ఇక్కడ ప్రాక్టీసు పెట్టాడు. ఎవరు పిలిచినా ఇంటికి వస్తాడు. ఇంటిపనీ వంటపనీ నేనే చూసుకుంటున్నాను. పొద్దుటినుంచీ సుమ ఒకటే తిక్కచేస్తోంది. ఇక్కడ పిల్లలకి తోచడంలేదు. స్కూలు లేదు. ఆడుకోవటానికి ఎవరూ లేరు. ఎవరితోనైనా పరిచయం చేసుకోవాలంటే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాలోనని భయం. సుధకూడా డల్‍గానే వుంటోంది. ఎంతకాలం యిక్కడ… యిలా? నిర్వ్యాపరంగా?
నా తదుపరి కార్యక్రమమేమిటనే ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. నాకూ నిరుత్సాహంగానే వుంటోంది. పుస్తకాల్లేవు. టీవీకి కేబుల్ కనెక్షన్ లేదు. అది కూడా ఎప్పటిదో బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎక్కడినుంచీ ఏదని మొదలుపెట్టను? పిల్లలు రాజ్ దగ్గర వున్నపుడు ఎంత దర్జాగా పెరిగారో గుర్తువస్తే మనసంతా బాధతో నిండిపోతోంది.
వంటింట్లో నాదగ్గర బాగా గొడవచేసి యిప్పుడే వదిలిపెట్టి సుధతో ఆడుకోవడానికెళ్లింది సుమ. కొంచెం వూపిరి పీల్చుకుని వంటైందనిపించి అన్నీ సర్ది యివతలికొచ్చాను.
“పెద్దమొచ్చింది” అన్న సుధ గొంతు, పిల్లల పరుగుల శబ్దం వినిపించాయి.
పెదమ్మెవరాని ఆశ్చర్యంగా తొంగి చూసాను. రాగానే ప్రశాంతతో వీడియోకాల్ చేసి మాట్లాడ్డం అయింది. చిన్నప్పటి చనువు తను చూపించలేదు. పొడిపొడిగా మాట్లాడింది. పిల్లలని చూసింది. తన కొడుకుని చూపించింది. నాకన్నా తనో మెట్టు పైనున్నట్టు, ఎక్కడ గట్టిగా పలకరిస్తే అతుక్కుపోతానో అన్నట్టు దూరదూరంగా వున్నాయి తన మాటలు.
ఒకచేత్తో సుమని ఎత్తుకుని మరో చేత్తో సుధని నడిపించుకుంటూ వస్తోంది ప్రమీలాదేవి! స్థాణువయాను.
ఎందుకొచ్చింది? రాజ్ తరఫుని రాయబారానికా? ఆ ఆలోచనలతో నా కోపం చల్లారలేదు. పైగా అతని పురుషాహంకారాన్ని తలుచుకుంటే వళ్లు మండిపోయింది. మా యిద్దర్నీ తన చూపుడువేలి మీద ఆడిస్తున్నానని గర్వపడుతున్నాడేమో! ఐనా, నాతో అంత గర్వంగా మాట్లాడిన ప్రమీలాదేవి యిప్పుడేం ఆశించి వచ్చినట్టు? ఏ మొహంతో వచ్చినట్టు? అలాగే శిలలా నిలబడిపోయాను ఆలోచనల్లో నిమగ్నమై.
“లోపలికి రావచ్చా?”” చిరునవ్వుతో అడిగింది.
“అదేంటి?”రండి” తేరుకుని ఆహ్వానించాను. మొదట్లోలాగే ఆమెని నువ్వనలేకపోయాను. ఆమెకూడా నన్ను కొత్తగా మన్నించలేదు. ఆమె కూర్చోగానే సుమ విడిపించుకుని నా దగ్గరకొచ్చేసింది. సుధమాత్రం ఆమె వొళ్లో ఎక్కి కూర్చుంది. మెడచుట్టూ చేతులు వేసి కబుర్లు చెప్పింది. ఆమె దాని బుగ్గమీద ముద్దుపెట్టుకుని, హేండ్‍బ్యాగ్‍లోంచీ బొమ్మలు, చాక్లెట్లు తీసి యిచ్చింది.
“థాంక్స్ పెద్దమ్మా!”” అంది.
“సుమా! రావే!” అని పిలిచినా చిన్నది వెళ్లలేదు. దాని కళ్లలో ఏదో వెతుకులాట… మరేదో నిరాశ… స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవన్నీ రాజ్ కోసం. ఊబిలో కూరుకుపోతున్నటనిపించింది నాకు. సుమ భావాలని తేలిగ్గా పోల్చేసుకుంది ప్రమీలాదేవి.
“మీ నాన్న“వుంగరం పెడతాను రా!” అంది. కీ యిచ్చిన బొమ్మలా వెళ్లింది సుమ. ఎర్రటి పగడపు వుంగరం తన వేలినుంచీ తీసి దాని వేలికి తీసి తొడిగింది. ఉంగరం జారిపోకుండా వేలు అలాగే నిలబెట్టుకుని వచ్చి మళ్లీ నా వళ్ళో కూర్చుంది.
“రావే, ఆడుకుందాం” అని సుధ పిలిచినా వెళ్లలేదు. సుధ వరండాలోకి వెళ్ళి కొత్త బొమ్మలతో ఆటలలో పడింది. సుమ వుంగరాన్ని చూసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. పడుకోబెట్టి వచ్చాను.
అప్పటిదాకా మా మధ్యన మరే సంభాషణ జరగలేదు. పిల్లలతో ప్రమీలాదేవి చనువూ, ఆప్యాయతా చూస్తుంటే నమ్మకం కలగడం లేదు. ఈమేనా నీ పిల్లల్ని చూస్తుంటే కంపరం పుడ్తోందని ఫోన్లో చెప్పింది! మనిషికి ఎన్ని ముఖాలు! ఎన్ని నాల్కలు!
“చాలా తెలివిగలవాళ్లు. ముఖ్యంగా సుమ”” అంది ప్రమీలాదేవి సంభాషణకి నాందిగా. మామధ్య ఎలాంటి స్పర్ధా లేనట్టే… ఎప్పట్నుంచో మంచి అవగాహన వున్నట్టే మాట్లాడుతోంది. ఆమె అన్నది కూడా నిజమే. సుమకి కీన్ అబ్జర్వేషనూ, యిన్సైటూ వున్నాయి.
నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళూ, కాఫీ తీసుకొచ్చి యిచ్చాను. డ్రైవరుకి కూడా ఇద్దామని బయటికి చూస్తుంటే ఆమే అంది.
“నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను”
ఆమె ఏదో చెప్పాలనుకుంటోంది. చెప్పలేకపోతోంది. మంచినీళ్ళు తాగింది. కాఫీ తాగింది. మేం కూర్చున్న గదంతా పరిశీలనగా చూసింది. కుర్చీలో కదిలి, మళ్ళీ సర్దుకుని కూర్చుంది. ఇంకేం చెయ్యాలో తెలీక చేతిగోళ్ళు పరిశీలించుకుంటూ కూర్చుంది. ఈ మౌనం దుస్సహంగా వుంది. నెమ్మదిగా మొదలుపెట్టింది.
“ఆరోజు నువ్వు అటు వెళ్ళటం, పిల్లలు ఇంటికి రావటం ఇంచుమించు ఒకేసారి జరిగాయి. రాజ్ అక్కడే అదేచోట కూర్చుని వున్నాడు. వీళ్ళు అతన్ని చూసారు. కళ్ళలో ఆశ్చర్యం, అపనమ్మకం. ఆ తర్వాత జరిగింది చెప్పడానికి మాటలు చాలవు. ఇద్దరూ ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిమీదికి ఎక్కేసారు. పోటాపోటీలుగా కబుర్లు… ఎవరిమాట వింటున్నా రెండోవాళ్ళు అతని మొహం తనవైపుకి తిప్పేసుకోవటం… రాజ్ వాళ్ళిద్దర్నీ చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయాడు.
-వీళ్ళని ఎవరిక్కడికి తీసుకొచ్చారమ్మా? ఛ…ఛ… ఫ్రెండ్సందర్లో నాకు ఎంత ఇన్సల్ట్‌గా వుంటుందో ఆయనకి అర్థమవదా? వాళ్ళుంటే నేనిక్కడ వుండను- అని నా పెద్దకొడుకు మా అమ్మావాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు.
పిల్లలొచ్చిన కలకలం విని ఎవరోనని అక్కడికి వచ్చిన నా చిన్నకొడుకు తండ్రిని అలా చూసి మరో అడుగుకూడా ముందుకి వెయ్యకుండా నన్ను చుట్టుకుని నిలబడిపోయాడు. నా కాళ్ళకింది నేల కదిలిపోతున్న భావన. నేను యిన్నాళ్ళూ గుర్తించకుండా వదిలేసిన ఒక పచ్చినిజం నాకళ్ళముందు ఆవిష్కృతమైంది.
ఎందుకు ఇతను నన్నింత తృణీకరించాడు? ఇతనికి నేను, నా పిల్లలూ ఏ ద్రోహం చేసామని, అతని సంతోషపు, పారవశ్యపు ప్రపంచాన్ని మేము లేని మరోచోట నిర్మించుకున్నాడు? అలా ఎలా చెయ్యగలిగాడు? నువ్వు మా బంధాన్ని సవాలు చేసి వెళ్ళిన కాసేపట్లోనే నా నమ్మకాల మూలాలు కదిలినట్టనిపించింది. గిర్రుమని వెనక్కి తిరిగి నా గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డంపడి ఏడుస్తుంటే, రాజ్ తల్లి అంది-
-నువ్వెందుకే పిచ్చిదానా, ఏడుస్తావు? ఆ వసంతని ఎలాగో వెళ్ళగొట్టేసావు. వాడి మనసులో ఒక్క విషపు చుక్క పడేసావంటే ఈ పిల్లవెధవల్ని తనే తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో పడేస్తాడు- అంది. అక్కడితో నాకు అందనిది నాచేతిలోకి వస్తుందా? నా దు:ఖం ఆగట్లేదు. రోజులు నిర్లిప్తంగా నడుస్తున్నాయి. ఏ అజమాయిషీ లేకుండా పనివాళ్ళే నడిపిస్తున్నారు. ఏదీ నేను పట్టించుకోవట్లేదు.
ఉన్నట్టుంది ఒక పొద్దుటివేళ రాజ్ కాస్త నలతగా వుండి నిద్ర లేవలేదు. మిగిలినవాళ్ళ టిఫెన్లు అయాయి. నేను గదిలోకే తెప్పించుకుని తింటున్నాను. అతనికి ఎదురుపడాలని అనిపించటంలేదు. ఉన్నట్టుండి డైనింగ్‍హాల్లోంచీ కెవ్వుమని ఏడుపు వినిపించింది. సుమ పెద్దగా ఏడుస్తోంది. ఏం జరిగిందోనని కంగారుగా వెళ్ళాను. అదొక అసంకల్పిత చర్య. పిల్ల బుగ్గ నల్లగా కమిలిపోయి వుంది. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోంటే సుధ బిత్తరబోయి చూస్తోంది.
టిఫెను కిందంతా చిందరవందరగా పడి వుంది. వంటామె నాకోసం ఏదో సాధించిపెట్టినట్టు నాకేసి గర్వంగా చూసింది. ఏం జరిగిందో అర్థమైంది నాకు. చాచిపెట్టి ఆమె చెంపమీద బలంగా కొట్టాను.
మీకు జీతాలిచ్చి పెట్టుకునేది పని చెయ్యడానికి… పెత్తనాలు చెయ్యడానికి కాదు-కటువుగా అని, అప్పటికప్పుడు జీతం లెక్కపెట్టి యిచ్చి పంపేసాను. ఎక్కెక్కి పడుతున్న పిల్లని అలా వదిలెయ్యలేకపోయాను. ఎత్తుకున్నాను.
మా అమ్మ దగ్గిరకి వెళ్ళిపోతాం. ఎక్కడుందని అడిగితే నాన్న ఏవో చెప్తున్నాడు. మా యింటికి వెళ్ళిపోతాం- సుధకూడా ఏడుపు మొదలుపెట్టింది. అటునించీ రాజ్, ఇటునించీ అతని తల్లీ వచ్చారు. అతన్ని చూడగానే సుమ చేతులు అందించేసింది.
అదుపూ ఆజ్ఞా లేకుండా పనివాళ్ళమీద వదిలెయ్యడానికా తల్లీపిల్లలని విడదీసావు? -అని నన్ను నిలదీసాడు. తల్లిని కూడా అడిగాడు.
అమ్మా! వాళ్ళు పసిపిల్లలు. నా రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు. కనీసం నువ్వేనా కనిపెట్టుకు వుండచ్చుకదా?-అన్నాడు.
నాకేం ఖర్మరా, వీళ్ళని కనిపెట్టుకోవడానికి? బంగారంలాంటి యిద్దరు మగపిల్లలని యిచ్చింది నా కోడలు -అందావిడ గర్వంగా.
రాజ్ కాదు వసంతా! నేను నివ్వెరపోయాను. మగపిల్లలుకాకుండా నాకు ఆడపిల్లలు పుట్టి, వీళ్ళు మగపిల్లలై వుంటే? నా చుట్టూ నేను చుట్టుకున్న పొరలన్నీ విడిపోయాయి.
రాజ్ వీళ్లని హాస్టల్లో వేసాడు. అక్కడా మాయిద్దరిమధ్యా గొడవే వచ్చింది. చాలా పెద్ద స్కూలు వెతికాడు వీళ్ళని వెయ్యడానికి. వాళ్ళు ఉండలేరనిపించింది నాకు. అంత ఖర్చెందుకన్నాను. అదీ గొడవే అయింది. తన మాటే నెగ్గించుకున్నాడు”
ప్రమీలాదేవి చెప్పడం ఆపింది. మళ్ళీ మాయిద్దరిమధ్యా మౌనం చోటు చేసుకుంది. వాళ్ళింట్లో, వాళ్లమధ్యని ఏం జరిగిందో నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎందుకు చెప్తోందో అనేదాని లోతు ఇంకా దొరకడంలేదు.
“సుధ ఎడ్జెస్టైందిగానీ యిది బాగా బెంగ పెట్టుకుంది. మళ్ళీ యిద్దర్నీ ఇంటికి తీసుకొచ్చేసాడు. ఎవర్నైనా ద్వేషించగలంకానీ పసిపిల్లల్ని కాదు. నేను వీళ్లతో కఠినంగా వుండలేకపోయాను. అయిష్టంగానే అయినా దగ్గరకి తీసేదాన్ని. రాజ్ లాలనలో యిది బాగా తేరుకుందిగానీ ఒక్కొక్కసారి భరించరాని గొడవచేసి బాగా ఏడ్చేది. రాజ్ దీన్ని ఎన్నోవిధాల ఏమార్చేవాడు. నా పిల్లల్ని కూడా అతనంత ముద్దు చెయ్యలేదు. వాళ్ళు నాతో అంత సర్కస్ ఎప్పుడూ చేయించలేదు… ఒకరోజు అది అలాగే ఏడుస్తుంటే నీ వుంగరం అని చెప్పి దాని వేలికి వుంగరం పెట్టాడు. దాన్ని చూస్తూ వూరుకుంది”
ప్రమీలాదేవి మాటలు వింటుంటే నాకెక్కడో కలుక్కుమంది. నన్నే ఏమార్చగలిగిన రాజ్‍కి యీ పసిది ఒక లెక్కలోకి రాదు.
“మరోసారి రాజ్ బిజినెస్‍టూర్‍మీద వెళ్లి హెల్డప్ అయ్యాడు. సుమ గొడవ చేస్తుంటే నేనదే ట్రిక్ ప్లేసాను. ఆ తర్వాత మేమిద్దరం వున్నపుడు యిద్దర్నీ అడిగి పెట్టించుకుని ఆ వుంగరాలకేసి తదేకంగా చూస్తూ అమ్మా నాన్నా అని మంత్రంలా జపిస్తూ కూర్చుంది.”
ఆమె చెప్తుంటే నాకు ఏడుపొచ్చింది. పసిపిల్లలని ఎంత క్షోభపెట్టారు! అతికష్టమ్మీద కంట్రోల్ చేసుకున్నాను.