తిరస్కృతులు – 22 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“మనసుపెట్టి వెతుకుతూ వుంటే కొన్ని నిజాలు అర్థమౌతాయి. ప్రతి విషయానికీ మరో ముఖం కనిపిస్తుంది. అది చెప్పే విషయాలు విన్పిస్తాయి. హిందూ వివాహ చట్టం వచ్చింది. ఆడా మగా ఎవరూ రెండోపెళ్ళి చేసుకోకూడదని ఒక నిర్ణీతతేదీ అనుకుని చట్టం చేసారు. ఆ చట్టం మగవాళ్ళ ప్రవృత్తిలో ఏమీ మార్పు తీసుకురాలేదు. అప్పటిదాకా చట్టబద్ధంగా జరిగిన విషయం వివాహేతరసంబంధంగా ఒక నేరంగా మారింది. దానికి కొనసాగింపుగా ఇంకా ఆ నేరాలు జరుగుతునే వున్నాయి. బిగామీ, అడల్ట్రీ … ఆ చట్టం లేకముందుకూడా యావత్తు హిందూసమాజంలోని ఆడవాళ్ళూ మగవాళ్ళూ అందరూ అదో సిద్ధాంతంలా రెండేసి, మూడేసి పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఎవరో దారితప్పినవాళ్ళే చేసుకున్నారు. మంచీ చెడూ వాళ్ళకి నేర్పకపోవటంతో, వాళ్ళలో వున్న విశృంఖలతని నియంత్రించకపోవటంతో చేసుకున్నారు. అధర్మప్రవర్తనయొక్క ఆఖరి రూపం నేరం. ధర్మార్థకామమోక్షాలలో నీ చెయ్యి విడవనని ప్రమాణం చేసి నిలబెట్టుకోవటం ధర్మం. దాన్ని నిలబెట్టుకోకపోవటం అధర్మం. అధర్మం నేరమైంది. ధర్మం చెయ్యాల్సిన పని చట్టం చెయ్యటంతో మామూలు కుటుంబాల్లోని మనుషులు నేరస్తులయ్యారు. నేనిప్పుడు రాజ్‍మోహన్‍మీద నేరారోపణ చెయ్యాలి. అతన్ని జైలుకి పంపాలి. అతని జీవితం, అతనితో ముడిపడి వున్న అందరి జీవితాలూ అంటే అతని తల్లిదండ్రులవీ, అతనికీ నాకూ పుట్టిన సంతానానివీ తలక్రిందులు చెయ్యాలి. ఒక కుటుంబాన్ని అలా విచ్చిన్నం చేస్తే నాకు జరిగిన అన్యాయం సమసిపోతుందా? శిక్ష తర్వాతేనా ఆ మనిషి సంస్కరించబడతాడా? అదెలాంటి సంస్కారం? దానివలన నాకు జరిగే ప్రయోజనం ఏమిటి? నిరంతరం ఇదే ఆలోచన”
“…”
“ఇలాంటి విషయంగా మా నాయనమ్మ ఒక మాటంది. నీకు బాధ కలిగించేదే. కానీ చెప్తున్నాను.
ఏటా కాన్పులూ… ఎడపిల్లలూ, పెడపిల్లలూ… ఇంటినిండా మనుషులూ చాకిరీతో ఆడవాళ్ళు సతమతమైపోతూ వుంటే రోజూ రాత్రయ్యేసరికి మగవాడు శోభనం పెళ్ళికొడుకులా ఎదురుచూస్తూ కూర్చుంటాడు. వాడిని ఎవరు భరించగలరు?
-అని”
ఆమె దర్శించిన రెండోముఖంయొక్క ఇంకో కోణాన్ని నేను ఇప్పుడు చూసాను. స్త్రీని గౌరవంగా బతకమనే సంఘం చెప్తుంది. అలా బతకను అనే నాలాంటివాళ్ళ కోణం ఇది. రోజులు మారినా మారని సంస్కరించబడని పురుషప్రవృత్తియొక్క కోణం.
ఆమె హఠాత్తుగా లేచివచ్చి నా పక్కన కూర్చుంది.
“వసంతా! నేను నీమీద పెంచుకున్న కసి… నిన్ను సాధించాలని పెట్టుకున్న కక్షా అన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ పసిది అమ్మానాన్నల్ని ఒక్కచోట చూడాలని పడుతున్న తపన మాత్రం కాంక్రీటైన వాస్తవంలా నిలబడిపోయింది. ఆరోజున నేను రాజ్‍తో బాగా పోట్లాడాను. నీకన్నా బాగా చిన్నదైన ఒక ఆడపిల్ల గొంతు కోసావు. కట్టుకున్న నాకూ న్యాయం చెయ్యలేదు. నాది పంతమే. పంతంకోసమే ఇదంతా చేసాను. ఆమెని వెళ్ళగొట్టాను. పిల్లలకోసం నువ్వు పంతం పట్టావు. ఇప్పుడీ పిల్లలు? వీళ్ళనేం చెయ్యబోతున్నావు? వీళ్లు తల్లి లేకుండా బతకలేరు. నీ మమకారాన్ని చంపుకుని ఆమె దగ్గరకి పంపించు. నా కళ్లెదురుగా యిదంతా చూస్తూ ఇంకా ఈ పాపంలో భాగం పంచుకోలేను” అన్నాను.
“…”
“వసంతా! నువ్వు నమ్ము, నమ్మకపో, సుమ ఏడ్చినప్పుడు నా గుండెలమీద పడుకోబెట్టుకుని లాలించాను. నీ కూతురిమీద నాకింద ప్రేమేమిటని ఆశ్చర్యపోయేదాన్ని…”
నేను విస్మయంగా విన్నాను. ప్రమీలాదేవినుంచీ యిలాంటి మాటలు నేనెప్పుడూ ఆశించలేదేమో షాకయ్యాను.
“అది ప్రేమ కాదు, తప్పుచేసిన భావన. పసిపిల్లని పంతానికి తల్లికి దూరంచేసిన బాధ. అదీ ఆశ్చర్యమే. నేను దెబ్బలాడుతుంటే అతను తలదించుకున్నాడు. అంతేగానీ జవాబివ్వలేదు…..నా ఎదురుగా ఎప్పుడూ నీ ప్రసక్తిని అతను తీసుకురాలేదు. కానీ నువ్వెక్కడున్నావో వెతికి పట్టుకోవాలని అతని మనసులో కోరిక. చూడు… గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్లగలంగానీ దానితో బలవంతంగా నీళ్లు తాగించలేము. నిన్ను దూరంగా పంపించెయ్యడంతో… పిల్లల్ని నీనుంచీ లాక్కోవడంతో నా అహం చల్లారిందిగానీ రాజ్ నాకు దగ్గిరవలేదు. మామధ్య దూరం భౌతికమైనది కాదు. ఆంతరంగికమైనది. వ్యవస్థాపరమైనది. నిజానికి నువ్వుకాదు నా ప్రత్యర్ధివి. అతను. అతన్నేమీ చెయ్యలేక నిన్ను నా టార్గెట్‍గా ఎంచుకున్నాను””
“కొన్నేళ్లు అతనితో కలిసున్నాను. మీకు బాధే కలిగించానో… మీరు రాజీయే పడ్డారో… అతని ఆరోగ్యం సరిగా లేని టైమ్‍లో మాయిద్దర్నీ విడదీయాలని ఎందుకనుకున్నారు??” ఆమెని ఆపి సూటిగా అడిగాను. నన్ను చాలా వేధించిన ప్రశ్న.
“అతను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేముందు అడిగిన ప్రశ్న- వసంత వచ్చిందాని, ఆపరేషనయ్యి మెలకువ రాగానే అడిగిన మొదటి ప్రశ్న వసంత రాలేదాని. ఈ యిన్ని సంవత్సరాల నావోపిక చావడానికి ఆ రెండూ చాలవా?”
రాజమోహన్‍పట్ల నాకు ఎక్కడో ఇంకా ప్రేమో, నా మనిషికూడానన్న స్పృహో, కలిసి చేసిన నేరమన్న భావనో వుండి వుంటుంది. అందుకే అతనలా అడిగి, ప్రమీలాదేవి అహాన్ని దెబ్బతీసి, ఆమెని తీవ్రంగా గాయపరిచినందుకు గిల్టీగా అనిపించింది. అసలు మేమిద్దరం యిలా కలుసుకుని వోపెన్‍గా మాట్లాడుకోవడం మాత్రం పెద్ద వింత.
నన్ను తిరిగి వచ్చెయ్యమనా, ఆమె అభిప్రాయం? రాజ్ అభిప్రాయం కూడా అదేనా?
“నా ఎదురుగా తర్వాతెప్పుడూ నీ ప్రసక్తిని తీసుకురాలేదతను. కానీ నీ దిగులతన్ని లోలోపల తినేసేది. పిల్లలు నీ గురించి అడగ్గానే అతని కళ్లలో నైరాశ్యం పరుచుకునేది… ఒక్క విషయాన్ని మాత్రం నీ దగ్గర నిజాయితీగా వప్పుకుని తీరాలి వసంతా! నీతో పరిచయమయ్యాకే అతను మనిషిగా మారాడు. అంతకుముందు అతనొక బీస్ట్. అంతే! అతనికి కల్చర్ లేదు. సంస్కారం లేదు. తినటం, తాగడం, పార్టీలు, అమ్మాయిలు అంతే… అతని లైఫ్. నన్ను పట్టించుకునేవాడు కాదు. తన ప్రవర్తనవల్ల నేను బాధపడుతున్నానేమోనని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. నీతో పరిచయం తర్వాత అతన్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. లవబుల్‍గా తయారయ్యాడు. అప్పటిదాకా అతను పూర్తిగా నాకే చెందినా మా యిద్దరి మధ్యా నువ్వనుకున్న ప్రేమలు లేవు. అంటే ఒకరినొకరం యిష్టపడలేదని కాదు. నువ్వన్నట్టు మా యిష్టాలు కేవలం పరస్పరావసరాలతో కూడుకున్నవి. కానీ మారిపోయిన ఈ ప్రవర్తన మామధ్య వున్న దూరంయొక్క మౌలిక స్వరూపాన్ని మార్చింది. నువ్వెళ్ళిపోయిన రోజు, నీ పిల్లలతో రాజ్ తదాత్మ్యం చూసాకగానీ అది నాకు అర్థమవలేదు”
ఆరోజు నాతో వీటన్నిటికీ వ్యతిరేకంగా వాదించిన వ్యక్తి ఈరోజుని సానుకూలంగా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. ఎందుకీమెలో హఠాత్తుగా యింత మార్పు? ఆమెలో ఎంతో సంఘర్షణ వుండచ్చు. ఎంతో ఆలోచన వుండచ్చు. అవి మనిషిలో మార్పు తెస్తాయి. నిరంతరం ఆలోచించే మనిషిలో మార్పు రాకుండా వుండదు. కానీ అది క్రమక్రమంగా వస్తుందిగానీ యిలా ఒక్కసారి కాదు. నానుంచి ఏదో ఆశిస్తోంది.
“అతనికి నిన్ను దూరం చేసుకునే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదు. ఆ పరిస్థితుల్లో మరో దారిలేక వప్పుకున్నాడు. అంతే. అసలు నువ్వెక్కడికెళ్లావో ఏమైపోయావో తెలీక ఒకరికి తెలీకుండా మరొకరం సతమతమై పోయాం. నీకేదైనా జరగకూడనిది జరిగితే అతనికి నేను జవాబు చెప్పుకోగలనా? అతను నన్ను పైకేమీ అనకపోయినా లోలోపల అసహ్యించుకుంటుంటే కలిసి కాపురం చెయ్యగలమా? జరగకూడనిది జరిగింది. అతని జీవితంలోకి నువ్వు రాకూడదు. వచ్చావు. అతని జీవితాన్ని తద్వారా నా జీవితాన్ని ప్రభావితం చేసావు. జరిగిపోయినదాన్ని చెరిపెయ్యటం సాధ్యపడదు. ఎవరూ నష్టపోని పరిష్కారం చూసుకుని వుంటే బాగుండేదనిపించింది.”
“నా విషయంలో మీరిద్దరూ ఎందుకింత జోక్యం కలిగించుకుంటున్నారో నాకర్ధమవడంలేదు. నేను రాజ్ జీవితంలోకి ప్రవేశించడం మీ యిద్దరికీ యిబ్బందిని కలిగించింది. హక్కులూ అధికారాలూ మీకున్నాయి. వాటిని ఉపయోగించుకుని మీ దార్లోంచీ నన్ను తప్పించారు. నా దారిన నేను వచ్చేసాను. పిల్లలని కూడా పంపించేసారు. నా బతుకేదో నేను బతుకుతున్నాను. ఇంకా నన్ను వెంటాడుతున్నారెందుకని?” కోపంగా అడిగాను.
“నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. అది ప్రేమే అవనీ, ప్రాణాలు తీసేంతటి బలమైనదేకానీ, చట్టబద్ధత లేకపోతే గౌరవం లేదు”
నా ముఖం ఎర్రబడింది.
“ఆ విషయం రాజ్‍మోహన్‍కి కూడా చెప్పండి. నన్ను వదిలిపెట్టడంలేదు. నీడలా వెంటాడుతున్నాడు. అదేమిటంటే పిల్లలమీద ప్రేమంటాడు”

“అందులో అబద్ధమేమీ లేదు. అతనికి పిల్లలంటే చాలా యిష్టం. వాళ్లకి ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేడు. మేమిద్దరం కూడా పిల్లల విషయంలోనే దెబ్బలాడుకునేవాళ్లం. నా పిల్లల చిన్నప్పుడు అతనంత కన్సర్న్ నేను చూపించేదాన్ని కాదు. మగపిల్లలుకదా, దుడుకుగా వుండేవారు. ఎగిరీ దూకీ పడి దెబ్బలు తగిలించుకునేవాళ్ళు. తను నాతో పోట్లాడేవాడు… నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసి అతను షాకయ్యాడు. మళ్లీ స్ట్రోకొస్తుందేమోనని భయపడ్డాను. నిన్ను చంపేస్తానన్నాడు. అతన్ని మర్డర్ చేస్తానన్నాడు. పిల్లల్ని నీ దగ్గిరకి రప్పించుకోవడానికే అలా అంటున్నావనుకుని వాళ్లని నీ దగ్గిరకి పంపించేసాడు. నువ్వు చెప్పింది నిజమేనని తెలిసి అతను పిచ్చివాడయ్యాడు. వసంతా! ఎలాంటి అరమరికలూ లేని ప్రేమన్నావు ఇదేనా నీ ప్రేమలోతు? ఒక సమస్య రాగానే మనసులు విరిగిపోవడమేనా? మరి మా మధ్యని నువ్వనేలాంటి ప్రేమలేకపోయినా, యిన్ని గొడవలొచ్చినా కలిసే వుంటున్నాము?”
“మీకెప్పుడూ అతను రేటుకట్టిచ్చి పొమ్మనుండడు” కూల్‍గా అన్నాను.
“అది రేటని నువ్వెందుకనుకుంటున్నావు? నువ్వు బతకడానికి డబ్బు కావద్దా?”
“ఆ యివ్వటానిక్కూడా ఒక పద్ధతుంటుంది. నా గురించి అతనకి అలాంటి భయమే వుంటే నా భవిష్యత్తు గురించి ముందే ఆలోచించేవాడు. నేను డబ్బొద్దన్నానన్నది ఒక వంక మాత్రమే! నామీద ప్రేమే వుంటే డబ్బు లేకుండా ఎలా వుంచేవాడు?”
“వసంతా! అతని ప్రేమని నువ్వు అనుమానిస్తున్నావా? అలాంటప్పుడు ఎలా కలిసున్నావు?”
“పడితేనేకదా, నొప్పి తెలిసేది?”
“నీ దగ్గర డబ్బులేదంటే నేను నమ్మలేదు. అందుకే అతను బ్లాంక్ చెక్ ఇస్తుంటే నేను ఫిగర్ వేసాను” ఆమె సుదీర్ఘంగా నిశ్వసించింది. ఆమె మనసులో ఏముందో నాకు తెలీడంలేదు. ఆమెనలాగే ఆలోచనకి వదిలిపెట్టి సుమని చూసి వుంగరం ఆమెకి తెచ్చి యిచ్చేసాను. అమ్మమ్మ ఇంకా నిద్ర పోతోంది. లేకపోతే ఎవరే వచ్చిందని అడిగి ఆశ్చర్యాన్ని ప్రకటించి వుండేది.
మరోమాటు బ్రూ కలిపి రెండు కప్పుల్లో పోసాను. ఒకటి ప్రమీలాదేవికిచ్చి రెండోది. నేను తీసుకున్నాను.
“పిల్లల్ని తీసుకెళ్లాలని వచ్చాను” అంది కాఫీ తాగుతూ మధ్యలో. బయటపడింది. కొంతవరకు వూహించినదే, యిలాంటిదేదో వుంటుందని. తనకీ రాజ్‍కీ మధ్యలోకి నేను మళ్లీ రాకుండా వుండేందుకు ఆమె వంతు కృషి ఆమె చేస్తోంది.
“రాజ్ చెప్పమన్నాడా?” కటువుగా అడిగాను. ఆమె తల అడ్డంగా వూపింది. “నేనే చెప్తున్నాను. అతని పిల్లలు మరొకరి దగ్గిర పెరగడం ఏం బావుంటుంది?” మెత్తగా అడిగింది.
“నా పిల్లలు మీ దయాదాక్షిణ్యాలమీద బతకడం నాకూ బాగుండదు.”
“నీకు లోకం పోకడ తెలీదు. ఆడపిల్లలు… వాళ్లు. అర్ధం చేసుకో. రాజ్ బాధపడేదీ అదే.”
“మా గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవల్సిన సమయంలో అతను పట్టించుకోలేదు. ఆరేళ్ళకాలం తక్కువేమీ కాదు. ఇప్పుడు నా తెలివి నాకు వచ్చాక నాదార్లో నేను వెళ్లే స్వేచ్ఛ ఎందుకివ్వడో అర్థం కావడంలేదు.”