తిరస్కృతులు – 23 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“పిల్లల్ని నాతో పంపించు వసంతా! నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఫోన్ కాల్ చెయ్యి. నువ్వెక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తాను”
“వాళ్లు జీవితాంతం ఎవరికీ చెందకుండా బ్రతకాలా?”
“మరెలా వసంతా? వాళ్లు నీదగ్గరెలా వుంటారు?”
“ఎందుకుండదు? రెండోపెళ్లి చేసుకుని ఎందరు ఆడవాళ్లు లేరలా?” ఎదురు ప్రశ్నించాను. ప్రభాకర్‍తో బ్రేక్ చేసుకున్నానని చెప్పలేదు. అప్పుడే చెప్పాలనిపించలేదు. ఇంకా చాలా వినాలి ఆమెదగ్గర్నుంచీ.
ఆమె తల పట్టుకుంది. “నీకు పొగరని నేననుకునేదాన్ని. తెలివిలేదని రాజ్ అనేవాడు. రెండూ నిజమే”
“తెలిసిందిగా?” వెటకారంగా అన్నాను.
“చూడు…. నీ జీవితం రాజ్‍వలన పాడైంది. దాన్ని బాగుచేసుకో. అప్పటి ఆ గుర్తులవీ చెరిపేసుకో. అంటే గతాన్ని దాచిపెట్టి మోసం చెయ్యమని నేననను. కానీ ఆ గతాన్ని వర్త మానంతోపాటు మోసుకెళ్తూ చక్కటి భవిష్యత్తు పాడుచేసుకోకు. నీకన్నా పెద్దదాన్ని, లోకానుభవంతో చెప్తున్నాను” అంది. అంతగా దిగి వచ్చి నచ్చచెప్తుంటే నాకు మతిపోతోంది. ఆలోచన… వితరణ… సంఘర్షణ… మనిషిలో ఇంత మార్పుని తెస్తాయా? నమ్మలేకపోతున్నాను.
“నేను వెనకటి వసంతని కాను. మీరు చెప్పినవన్నీ నేనుకూడా ఆలోచించాను. నాదారిన నను వదిలేసి వుంటే నా బతుకు నేను బతికేదాన్ని. అలా వదలకుండా నన్ను వెంటాడి వెంటాడి నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేసాడు. పదేపదే నేను నిర్ణయాలు మార్చుకున్నా అవకాశాలు నాకోసం కాచుక్కూర్చోవు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. పిల్లలు తల్లి బాగుకు అడ్డం కావడమనేది చాలా అసంబద్ధమైన విషయం. అలాంటి బాగుబాగు కాదు. నాకు అవసరం లేదు. వాళ్ల మంచిచెడ్డలు రాజ్‍కి ఎంతవరకూ తెలుసో నాకర్ధమైంది. మీకెంతవరకూ అవసరమో నేను వూహించగలను. నేనెలా బతికినా మీదారికి అడ్డం రాను. సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ చాలామంది వుంటారు. వాళ్లందరాగే వీళ్లూ బతుకుతారు. నా పిల్లలేమీ గాలికీ ధూళికీ పుట్టినవాళ్లు కారు. నవమాసాలూ మోసి కంటే పుట్టారు. నా గుండెలమీద అపురూపంగా పెరిగినవాళ్లు. నాకు బరువు కారు. ఒకవేళ బరువైనా దాన్ని మొయ్యగలిగే స్థయిర్యం నాకుంది. మరొకరిమీదికి నెట్టను” అన్నాను స్పష్టంగా.
“అంటే?” అడిగింది. అర్థమవనట్టు అలాగే చూస్తూ కూర్చుంది. నేనూ ఏమీ మాట్లాడలేదు.
“భోజనం చేద్దామా?””కొద్దిసేపయాక మాటమార్చి అడిగాను.
“వద్దు, నేను వెళ్లిపోవాలి. నేనిక్కడికి వస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు. ఎక్కడికో వెళ్తున్నాననికూడా ఎవరికీ తెలీదు. కంగారుపడతారు” అంది. “ఎన్నింటికి బయల్దేరారు?”
“ఉదయాన్నే… మొదట్లో నిన్ను అవమానించాలని నువ్వని అనేదాన్ని. కానీ చూస్తేంటే నాకన్నా చిన్నదానివి. అందుకే అలాగే అనేస్తున్నాను. ఏమీ అనుకోవుగా?”
“ఫర్వాలేదు” అన్నాను.
“అప్పుడే మధ్యాహ్న మైంది. ఇంటికెళ్లేసరికి ఏ రాత్రో ఔతుంది. రోజంతా తినకుండా ఎలా? రండి. కొద్దిగా తిందాం” అని లేవదీసాను.
సుధకీ ఆమెకీ పెట్టాను. సుమని లేపి తినిపించాను.
“నువ్వు కూడా పెట్టుకో”” అంది.
“వీళ్లు తిన్నాక తింటాను” జవాబిచ్చాను.
“వసంతా! ఎవరిల్లిది?”
“తెలీకుండానే వచ్చారా?”
ఆమె నవ్వింది.
“ఇంత మంచి కుటుంబంలోంచీ వచ్చి యిలాంటి పనెందుకు చేసావు?”
“ప్రేమించడం తప్పని యిప్పటికీ నేననుకోవడంలేదు. ప్రేమికుడిని ఎంచుకోవడంలోనే తప్పు చేసాను.”
పిల్లలు తినేసి, ఆటల్లో పడ్డారు.
“రాజ్ మిమ్మల్ని ఇక్కడికి వెళ్లమని బలవంతం పెట్టాడా?”” అదే ఆమెని అంతగా బాధిస్తున్న విషయం కావచ్చని వూహించి అడిగాను. ఆమె రాక వెనక అతడి ప్రమేయం లేదనే విషయం యిప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను. ఆమె చప్పున తలూపింది. “
“ఎందుకో సుమని చూడాలనిపించింది. దాన్నెత్తుకున్నప్పటి స్పర్శ యిప్పటికీ నా వంటిని చుట్టుకున్నట్టే వుంటుంది. అతను నన్ను పంపలేదు”” అంది. కానీ అది పూర్తి నిజం కాదని ఆమె చూపులు చెప్తున్నాయి. భోజనాలయాయి. ఇంక వెళ్తానని లేచింది.
“ఒక్కరూ మళ్ళీ అంతదూరం ఎందుకు? రాజ్‍కి ఫోన్ చేస్తే వస్తాడుకదా?” అన్నాను.
“వద్దు” అంది క్లుప్తంగా. “అతన్ని నేను డిౙోన్ చేసాను వసంతా! ఆ విషయం చెప్పాలనే ఇంతదూరం వచ్చాను. నువ్వూ, అతనూ, మీపిల్లలు, మీ జీవితం… ఎలా నిర్ణయించుకుంటారో మీయిష్టం. ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా వున్నాయి నాకు. నా పిల్లలు… పెద్దాడు తండ్రిమీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. చిన్నాడు తండ్రిని చూసి పరాయివాడనుకుంటున్నాడు. నా బిజినెస్‍ కూడా దెబ్బతింటోంది. వీటిని నేను సరిదిద్దుకోవాలి” అంది.
చిన్నగా నవ్వాను. మొత్తమ్మీద ఆమె చెప్పదలుచుకున్నది ఇది. రాజ్‍మీద వైముఖ్యం ఏర్పడింది. కాబట్టి నాపట్ల దయ వర్షిస్తోంది. ఇప్పుడిక నా నిర్ణయం చెప్పచ్చు. ఆమె నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంది. కానీ నా విషయంలో ఆ పని ఎప్పుడో జరిగిపోయింది.
“ప్రభాకర్ పెళ్ళి జరిగిపోయింది”
“వసంతా!” తెల్లబోయింది.
“అంతే! నేను, నాపిల్లలు… మీ భర్త, మీపిల్లలు మీయిష్టం. దయచేసి నన్ను వదిలిపెట్టండి యిద్దరూ!” అన్నాను.
ఆమె వెళ్ళిపోయింది.


ప్రమీలాదేవి రాక నన్ను బాగా కదిలించింది. ఆమె చెప్పిన ధర్మాధర్మ వితరణ మనసులో కలవరం రేపుతోంది. ప్రవర్తనకి సంబంధించినది ధర్మం. దానివలన మనం చేసే అనైతికచర్య నేరం. అంతేనా, ఆమె చెప్పినది? చాలా పెద్ద రాజ్యాంగం. ఎన్నో చట్టాలు… ఒక క్రమం లేకుండా పెరుగుతున్న మనుషుల్లో ఎంతో నీతిబాహ్యత… ఎన్నో అనివార్యత్వాలు… అందరూ ఏదో ఒకలా నేరస్తులేనా? న్యాయం జరగాలంటే అన్యాయం జరిగినవారి కుటుంబాలే కూలిపోవాలా? నాన్న ఒకవైపు… రాజ్ మరోవైపు. అమ్మ ఒకవైపు… ప్రమీలాదేవి మరోవైపు. కుటుంబాన్ని ప్రేమించే ఏవ్యక్తేనా తనకి తనే సంకెళ్ళు వేసుకోవాలి. అదే ధర్మమా?
ఎటు మలుపు తిరగబోతోంది నా జీవితం? పిచ్చేక్కేలా వుంది. నేనే యింత బాధపడుతుంటే ఈ అనిశ్చితితో ఆమె యింకెంత బాధపడుతోందో! ఏదో ఒక పరిష్కారం… మళ్లీ ఒకరికొకరం తటస్థపడకుండా వుండేలాంటి దారి వెతుక్కోవాలి. రాజ్‍ని నానుంచీ ముందు దూరం చేయాలి. అతన్ని నా దగ్గరకి రావద్దనాలి. పిల్లలు అతని దగ్గరున్నప్పుడు నేనెలా తపించిపోయానో యిప్పుడతను అలాగే తపిస్తున్నాడు. కానీ విడిపోక తప్పదు. ఒక దారి… ఏదో ఒకదారి… మా యిద్దరి దారులూ విడిపోయేలా… మళ్ళీ కలుకోకుండా వుండేలా…
తల పగిలిపోతున్నట్టుంది. రాత్రంతా ఎడతెరిపి లేని ఆలోచనల్తో నిద్రపట్టలేదు. పొద్దుట లేచేసరికి ఆలస్యమైంది. అమ్మమ్మే లేచి పాలుపోయించుకుని, పనిమనిషితో పనంతా చేయించింది. టెంపరేచరు తగ్గేసరికి కొద్దిగా ఓపిక వచ్చింది ఆవిడకి. లేచి బ్రష్ చేసుకున్నాను. నాకు కాఫీ యివ్వటానికని ఆవిడ లేవబోతుంటే వారించి నేనే వెళ్లి తెచ్చుకున్నాను.
“నన్ను లేపద్దా, అమ్మమ్మా! నువ్వెందుకు చేసావు?” కాఫీ తాగుతూ అడిగాను.
“నీ సమస్యలు నీవమ్మా. నాదొక్క ఆరోగ్యసమస్యే. అదికూడా వయసుమీద పడడడంతో వచ్చింది. కానీ దిగులు నిన్ను తినేస్తోంది వసంతా! ఒక్కసారి అద్దంలో చూసుకో. ఎలా తయారయ్యావో! పెళ్లి చేసుకోకూడదని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా సరైనది. పిల్లలకి న్యాయం జరుగుతుంది. తల్లిని మించి పిల్లల బాగా చూసేవాళ్లు యింకెవరూ వుండరు. పిల్లలు సరిగ్గా పెరిగితే… వాళ్లు వృద్ధిలోకొస్తే అంతకిమించి యింకేం కావాలి? నావంట్లో వోపిక వున్నంతకాలం నీకు నేను తోడుంటాను. నాకు వెనకటి వోపికే వుంటే పిల్లల్ని నా దగ్గిరే పెట్టుకుని పెంచి పెద్ద చేసేదాన్ని. అప్పుడే సమస్యా వుండేది కాదు. వాళ్లని తండ్రొచ్చి చూసుకున్నా ఆక్షేపణ వుండేది కాదు. నీ పిల్లల్ని పెంచటమంటే అతని భార్యకి మాత్రం బాధకాదూ? అమ్మ వరసచూస్తే అలా వుంది. వీళ్లని దానికిస్తే తీసికెళ్లి మీకుమల్లే ఏ హాస్టల్లోనో పడేస్తుంది. ఏదో ఒకలా పెరగడం, ఎలాగో ఒకలా బతికెయ్యడం కాదు. రాజాల్లా బతకాలి. వాళ్లమీద నీ ధ్యాస పెట్టుకో చదివించి వృద్ధిలోకి తీసుకురా. వసూ! చదువు వొక్కటే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపిస్తుంది. దిగులుపడకు తల్లీ” అంది నన్ను దగ్గిరకి తీసుకుని లాలనగా. ఆవిడ వళ్ళో తల దాచుకుని ఏడ్చేసాను. చాలాసేపు ఏడ్చాక మనసు బరువు తగ్గింది.
“ఇడ్లీలు తెప్పించాను. తిని వంట మొదలుపెట్టు. నాకు కళ్లు తిరుగుతున్నాయి. ఈరోజుకి నువ్వు చూసుకున్నావంటే రేపట్నుంచీ నేనే చేసుకుంటాను”” అంది.
నేను లేచి పెరట్లోకెళ్లాను. స్నానం కానిచ్చి టిఫిన్ చేస్తుంటే దాసు వచ్చాడు. “
“రాజ్‍మోహన్‍బాబు పాపల్ని తీసుకురమ్మన్నారమ్మా!” అన్నాడు. అతని ముఖం విచారంగా వుంది.
“ఎందుకు?” అతని విచారం అర్ధంకాక అయోమయం కలిగింది నాకు.
“పేపరు చూడలేదామ్మా?” అడిగాడు. గమ్ముని పేపరందుకుని చూసాను. కాళ్లక్రింది నేల కదిలినట్టైంది. మొదటి పేజీలో ప్రముఖంగా వేసారారు ఆ వార్తని. ప్రమీలాదేవి కారుకి నిన్న సాయంత్రం సిటీ పొలిమేరల్లో ఏక్సిడెంటైంది. ఆగి వున్న లారీని ఢీకొని కారు నుజ్జునుజ్జైపోయింది, అందులోని మనిషితోపాటు.
“తీసుకెళ్లు దాసూ! నీమీది నమ్మకంతో పంపిస్తున్నాను! మళ్లీ జాగ్రత్తగా తీసుకొచ్చి యివ్వు” అన్నాను. నాకింకేమీ ఆలోచించడానికి శక్తి మిగిలిలేదు. పిల్లల్ని పంపించవచ్చో లేదో , వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారో లేదో కూడా ఆలోచించే విచక్షణ చెయ్యలేకపోయాను.
“పంపించమ్మా! తప్పులేదు” అంది అమ్మమ్మ విషయం తెలుసుకుని. పిల్లల్ని తీసుకుని కారు కదిలిపోయింది.
ఆవిడ ఆసరాతో లోపలికి నడిచాను. మనసూ శరీరం బాగా అలిసిపోయాయి. ఏడుపు గొంతుదాకా వస్తోంది కానీ దాటడంలేదు. ఆమె ఎవరని నాకీ బాధ? ఎందుకింత బాధ? నిన్న వెళ్లిపోతూ నిరాశతో వెళ్ళిందా? ఎంత నిరాశని గుండెల్లో పోగుచేసుకుందో! అలా ఎలా లారీని ఢీకొట్టింది? పుట్టినప్పట్నుంచీ చేసిన ఆలోచనలన్నీ ఆమెని ఆ క్షణాన చుట్తుముట్టి బాహ్యస్పృహ లేకుండా చేసాయా? రాజ్ వుమనైజర్. చెడ్డవాడనచ్చు. కానీ ఆ చెడ్డతనానికి నేనూ ఒక కారణమనుకుంటే? పశ్చాత్తాపంతో నా తల వాలిపోయింది. నిస్త్రాణగా కళ్లు మూసుకుంటూ చాపమీద కూలబడిపోయాను. ఎంతసేపలా వున్నానో! ఎన్ని గంటలున్నానో! అమ్మమ్మ ఫోన్ చేసి అమ్మావాళ్లనీ పిలిచింది. వాళ్ళు వచ్చారు. కొద్దిగా చలనం వచ్చింది.
“నిన్న ఆమె యిక్కడికి వచ్చి వెళ్లిందటకదే వసంతా?” అమ్మమ్మ అడిగింది. పిల్లలు చెప్పారేమో! తలూపాను. మంచినీళ్లు తెచ్చిచ్చింది. గటగట తాగేసి గ్లాసు కిందపెట్టాను.
“ఎందుకట?” మళ్ళీ ప్రశ్న. నేనింకా జవాబివ్వలేదు.
“చావుతోసుకొచ్చి వచ్చింది. నయం ఆ ఇంకా యాక్సిడెంటేదో అక్కడ జరిగిందిగానీ లేక పోతే మనమే ఏదో చేసామనేవారు. పోలీసులు కేసు
… ఎంత గొడవయ్యేదో! అసలందులోంచీ బైటపడలేకపోయేవాళ్లం” అమ్మ గొంతు ఖంగుమంది. నేను వులిక్కిపడ్డాను. ఎంత కటువైన వాస్తవం! ఆమె అక్కడెక్కడో పోయింది. అదీ యాక్సిడెంట్‍లో. లేకపోతే నా పరిస్థితి? రాజ్ నా నిర్దోషిత్వాన్ని నమ్మేవాడా? చేతుల్లో ముఖం దాచుకున్నాను. అమ్మమ్మ నా పక్కన వచ్చి కూర్చుని భుజంచుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకుంది. అప్పుడు వచ్చింది కట్టలు తెంచుకున్న వరదపొంగులా పెద్ద దుఃఖం. ఏడ్చేకొద్దీ ప్రవాహం తోసుకొస్తోంది.
“ఎందుకే… ఎందుకు? వసూ? నీకేమైందని? వూరుకోమ్మా” అమ్మమ్మ లాలన నా దుఃఖాన్ని మరింత పెంచింది.