తిరస్కృతులు – 25 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

అమ్మ లీవుపెట్టి యిక్కడే వుంది. నాన్న కొంచెం ఇబ్బందిపడినా పిల్లలతో గడపడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని బయట తిప్పడం, వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళతో ఆడటం… కేరంబోర్డు, చైనీస్ చెక్కర్, ఇంకా ఎన్నో బోర్డుగేమ్స్ కొనుక్కొచ్చారు. సుధ కొంచెం నయంగానీ సుమకి ఇంకా ఈ ఆటలవీ అర్థమవవు. ఏడ్చి గెలుస్తుంది. దొంగాట ఆడి అది వోడించినందుకు సుధ వుక్రోషంతో ఏడుస్తుంది. ఇద్దర్నీ సముదాయించలేక సతమతమైపోతున్నారు. ఎప్పుడో మర్చిపోయిన నవ్వులన్నీ ఆయన పెదాలమీద మళ్ళీ పూస్తున్నాయి. మనిషికి హద్దులనేవి ఎంత అవసరమో అర్థమౌతుంది ఆయన్ని చూస్తుంటే. అమ్మ, తనూ- ఇద్దరే వుంటే పొద్దస్తమానూ లిక్కర్‍తోటే గడిపే వ్యక్తి మా ఎదురుగా తాగలేక తన అలవాటుని నియంత్రించుకుంటున్నారు. డాక్టర్ సలహా తీసుకుంటున్నారు. పిల్లలుకూడా రాజ్‍నుంచీ మర్లుతున్నారు. మరుపు కాదు. రాజ్‍లాగ వాళ్ళతో ప్రవర్తిస్తున్న వ్యక్తి ప్రవేశంతో వచ్చిన మార్పు అది.
ప్రశాంత ఢిల్లీనుంచి మాట్లాడింది. మొదటిసారిలా కాకుండా కొంచెం చనువు చూపించింది. వీలు చూసుకుని వస్తామని చెప్పింది. తన గొంతులోనూ, మాటల్లోనూ కూడా చుట్టుపక్కల పరిస్థితులని అవగాహన చేసుకుని, అందుకు అనువుగా తనని తను మార్చుకున్న పరిణతి కనిపించింది. బహుశ: అది తనగురించి నాకు తెలిసిన విషయాల మాధ్యమంగా నేను తనని చూస్తున్న కోణం కావచ్చు. నాకు మా చిన్నతనం గుర్తొచ్చింది. ఇద్దరికీ రెండేళ్లు తేడా. ప్రతిదానికీ పోటీపడేవాళ్లం. ఎక్కడికెళ్లినా నాన్న చెరో చెయ్యి పట్టుకుని బయల్దేరేవాళ్లం. అలా తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడో పెద్దవాళ్లమయిపోయాం.
సుమ నీళ్లలో ఆడి గౌను తడుపుకుంటే అమ్మ కోప్పడి బట్టలు మారుస్తోంది. వేరే ఫ్రాకు యింకా తన చేతిలోనే వుంది.
“మా నాన్న వచ్చారు” అంటూ విడిపించుకుని పరిగెత్తింది. నిజంగానే రాజ్ కారు పార్క్‌చేసి యింట్లోకి వస్తున్నాడు. ప్రమీలాదేవి మరణం అతన్ని బాగా కృంగదీసింది. ఈ కొద్దిరోజుల్లోనే ఎంతో వయసు పెరిగినట్టు కనిపిస్తున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు.
“నువ్వు… నువ్విక్కడ?!!”” అన్నాడు.
నేను జవాబివ్వలేదు. అతనే లోపలికొచ్చాడు. సుమని వెతుక్కుంటూ వచ్చిన అమ్మ కళ్లప్పజెప్పి అలాగే నిలబడి చూసి ఒక్క క్షణం తర్వాత గిర్రుమని వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. అతన్ని కూర్చోమని నేను వెనకే వెళ్లాను.
“అతనేనా?”” అనడిగింది నన్ను. నా జవాబుకోసం చూడకుండా “”నాకన్నా కూడా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. భార్యాపిల్లలున్నవాడిని ఏం చూసి ప్రేమించావే? నీ చదువెందుకే, చట్టుబండలవను? నీకేం తక్కువ చేసామనే యిలా చేసావు?” గట్టిగా అనేసింది. తన గొంతులో దుఃఖం సుళ్లు తిరుగుతోంది. కళ్లలో నా గురించి కన్న కలలన్నీ విరిగిపడి కనిపించాయి. తన నిరాశని కప్పిపెట్టుకుని దుఃఖాన్ని అణిచిపెట్టడానికి ఎంతో ప్రయత్నించింది.
నేను మళ్లీ వచ్చి రాజ్ ఎదురుగా మోడా లాక్కుని కూర్చున్నాను. అమ్మ మాటల్ని అతను విన్నట్టున్నాడు, ముఖం సీరియస్‍గా వుంది. నేను కట్టుకున్న నేతచీరనీ, కొంగు భుజాల చుట్టూ కప్పుకున్న పద్ధతినీ మార్చిమార్చి చూసి, “నువ్విక్కడ ఎందుకున్నావు? ఆరోజు నీకు నేనేం చెప్పాను?” అనడిగాడు కఠినంగా.
నా దృష్టి అతని పక్కనున్న టీపాయ్‍మీదికి మళ్లింది. నా చూపుల వెంటే అతని చూపులుకూడా. అక్కడున్న శుభలేఖ చేతిలోకి తీసుకున్నాడు.
“ప్రభాకర్ వెడ్స్…”” పైకే చదివాడు. ఇంకా నమ్మకం కలగనట్టు కవర్లోంచీ కార్డు బైటికి లాగబోతుంటే అందులోంచీ ప్రభాకర్ నాకు రాసిన వుత్తరం బైటపడింది. రాజ్ దాని మడతలిప్పుతుంటే నేను నిర్వికారంగా చూస్తూ కూర్చున్నాను.
వసంతా!
నువ్వు మొదట్నుంచీ నన్ను కమేండ్ చేస్తూనే వచ్చావు. ఇప్పుడు కూడా! నువ్వు చెప్పినట్టే నేను మరొకమ్మాయిని చేసుకుంటున్నాను… నీమీది ప్రేమ చంపుకుని కాదు. చెల్లి మరణం నాలో చైతన్యాన్ని చంపేసింది. నువ్వొచ్చి నాలో ఆశల్ని పుట్టించావు. వచ్చినట్టే తిరిగి వెళ్లిపోయావు. నువ్వుగానీ నీ పిల్లలుగానీ వద్దని నేను అనుకోలేదు. అందుకు అమ్మతో పోరాడటానికికూడా ధైర్యాన్ని పోగుచేసుకుంటున్నాను. జీవితపోరాటంలో ఆవిడకూడా దెబ్బ తిన్న మనిషే. అందుకే తెగింపుగా చెయ్యలేకపోయాను. కానీ… నా జీవితంమీద పూర్తి అధికారం నాకో నీకో వుండాలిగానీ మూడోవ్యక్తికి కాదు. అది అర్థం చేసుకునే నానుంచీ దూరంగా వెళ్ళిపోయావనుకుంటాను.
రెండోసారి నాలో ఏర్పడిన యీ శూన్యాన్ని నేను భరించలేక…నాలో క్షణక్షణానికీ పెరిగిపోతున్న వంటరితనాన్నీ నిరాశానిస్పృహలనీ తట్టుకోలేక… ఒకతోడు ఆశించి యీ పెళ్లి చేసుకుంటున్నాను. ఆమెకి నాగురించీ పూర్తిగా తెల్సు. తెలిసే యిష్టపడింది. చెప్పానుకదా, మధ్యతరగతివాళ్ళకి కలలూ అవసరాలూ వుంటాయిగానీ అవి తీరే మార్గం వుండదని. ఆమెకి తల్లిదండ్రులు పెళ్ళి చెయ్యలేరు. చాలా పేద కుటుంబం. మనిషి ప్రాథమిక అవసరాలకి డబ్బు అవరోధం కావటం అనే సవాలు మా చెల్లి తర్వాత ఇక్కడ చూస్తున్నాను. అలాగ మా పెళ్ళి ముడిపడింది. మొదటి కార్డు నీకే పంపాలనిపించింది. పంపిస్తున్నాను. ఇది సమాచారమేగానీ ఆహ్వానం కాదు. ప్లీజ్… నువ్వు యీ పెళ్లికి రాకు. నువ్వొస్తే… నా పక్కని మరో అమ్మాయిని చూసాక క్షణంసేపేనా నీ కళ్లలో కదిలే నిరాశని నేను చూసి తట్టుకోలేను. అలాగే నీ కళ్లలో అలాంటి బాధేదీ కనిపించకపోయినా భరించలేను… నీ మనసులో నాకెలాంటి స్థానం లేదు, నేను నీకు కేవలం ఒక ఆబ్లిగేషన్‍నేనని వప్పుకోవడం నాకు సాధ్యంకాని విషయం…
రాజ్ చదవటం ఆపేసాడు.
“ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు?”” నిశ్చేష్ఠుడై అడిగాడు. “ఈ పరిస్థితుల్లో నిన్ను అర్ధం చేసుకుని పెళ్లి చేసుకునేవారెవరు? పిల్లల్ని నేను తీసికెళ్తానని చెప్పాకకూడా నీకీ పంతమేమిటి? పిల్లలకోసం నీ జీవితం త్యాగం చెయ్యడానికి నేను లేకపోతేకదా? ఐనా అలా చెయ్యటానికి నీ వయసెంతని?” తేరుకుని ఆగ్రహంగా అడిగాడు.
ప్రభాకర్ దగ్గర వీళ్లకి స్థానం వుండదని నన్ను బెదరగొట్టింది యితనే. నిర్ణయం మార్చుకున్నాక అలా ఎందుకు చేసావని నిలదీస్తున్నదీ యితనే! ఇతనికన్నీ తెలుసు. ఏవి ఎలా జరుగుతాయో వూహించగలడు. ఐనా ఏదీ తెలీనట్టు మాట్లాడుతున్నాడు. నాకెంత కోపం వచ్చినా అతని పరిస్థితిని దృష్టిలో వుంచుకుని దాన్ని ప్రదర్శించడానికి యిది సందర్భం కాదని నన్ను నేను నిగ్రహించుకున్నాను.
“నువ్వు మాట్లాడకుండా సాధిస్తే నేనొదిలిపెట్టను. జవాబు చెప్పేదాకా యిక్కడే వుంటాను” పట్టుదలగా అన్నాడు.
కొద్ది సమయం గడిచింది. అమ్మ మాముందునించే నాన్నని తీసుకుని వెళ్లిపోయింది. ఏడ్చేడ్చి తన ముఖం, కళ్లు ఎర్రబారాయి. రాజ్‍మోహన్ తలెటో తిప్పుకున్నాడు. వాళ్లు వెళ్లిపోయాక అన్నాడు.
“సుధనీ, సుమనీ పంపించు. సిటీదాకా తీసికెళ్లి తిప్పుకొస్తాను. ఈ పల్లెటూళ్లో… ఏ ఎంటర్టైన్మెంటూ లేనిచోట వాళ్లని బంధించి ఎంత హింసపెడుతున్నావో తెలుసా? ఎందుకిలా చేస్తున్నావు? నిన్ను నువ్వు బాధపెట్టుకుని వాళ్లని బాధపెట్టి ఏం సాధించాలని? నీకు ద్రోహమంటూ జరిగితే నావలన. నువ్వు నష్టపోయిందేమైనా వుంటే అది నావల్లనే. అందుకు నేను శిక్ష అనుభవిస్తూనే వున్నాను. నీ చేతిలోనూ ప్రమీల చేతిలోనూ కూడా” అన్నాడు.
“నేను నిన్నేం బాధపెట్టాను?” అడిగాను.
అతను మాట్లాడలేదు. పిల్లలిద్దరూ తయారై వచ్చి ఏవో చెప్తుంటే వింటూ కూర్చున్నాడు.
“మీ పిల్లలెలా వున్నారు?” అడిగాను.
అతను దిగ్గుమని తలతిప్పి చూసాడు. ఇప్పటిదాకా నాకు రాజ్ ఇంటిగురించిగానీ ప్రమీలాదేవి పిల్లలగురించిగానీ మాట్లాడే అవసరం రాలేదు. అతనుకూడా తనకి యిద్దరు పిల్లలనీ, ఇద్దరు తమ్ముళ్ళనీ చెప్పాడు తప్ప, మేం కలుసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చెయ్యలేదు. నేను అతని దగ్గరికి వెళ్ళిన కొత్తలో ఇంటిమీదికి ఎవరెవరో వచ్చి దెబ్బలాడేవారు. వాళ్ళని నేను తర్వాతెప్పుడూ కలవలేదు. ఒక పేచప్‍లాంటిది ఎలాంటి స్థాయిలోనూ జరగలేదు. నేనుకూడా వుదాసీనంగా వుండిపోయాను. అందుకే నా ప్రశ్న విని ఆ ఆశ్చరం.
“ప్రమీల తల్లిగారింట్లో వున్నారు. వీళ్ళగురించి ఎంత ఆలోచించాలో వాళ్ళగురించీ అంతే ఆలోచించాల్సి వస్తోంది. క్రమశిక్షణ అన్నది లేకుండా పెరిగారు. విపరీతమైన గారాబం… ఇక్కడ వీళ్ళేమో ఎవరికీ ఏమీ కానట్టు పెరుగుతుంటే అక్కడ వాళ్ళమీద నలుగురు మామలు, ఇద్దరు చిన్నాన్నలు, ఇద్దరు తాతలు… ఇంతమంది ఫోకస్‍… టూ మెనీ కుక్స్‌లాగ. నలుగురూ నా పిల్లలే” అతని గొంతులో ఏదో విషాదం.
అమ్మమ్మ ఇచ్చిన కాఫీ తాగి అతను పిల్లల్తో కలిసి వెళ్లిపోయాడు.
అమ్మమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది. ఒక చేత్తో ఆప్యాయంగా నన్ను దగ్గరకి తీసుకుని అంది, “వసూ! తాడు తెగేదాకా లాగడం ఎటూ ఎవరికీ మంచిది కాదు. నీకోసం, పిల్లలకోసం తపించిపోతున్నాడతను. లేకపోతే యింత దూరం వెతుక్కుంటూ రావల్సిన అవసరం ఏముంది? మీరెవరో నాకు తెలీదు పొమ్మన్నా, పట్టనట్టు వూరుకున్నా ఎవరం ఏమీ చెయ్యలేం. పరిస్థితులు ఎందుకు అదుపు తప్పొయో! తిరిగి అధీనంలోకి తీసుకుంటే మంచిది. అతనెలా చెప్తే అలా విను” అంది. అంటుంటే ఆవిడ గొంతు వణికింది. జవాబుగా నా దగ్గర మిగిలిందేమీ లేదు… మౌనంతప్ప.
బాగా పొద్దుపోయాక వచ్చారు. ఈసారి కావాలనే అలా చేసాడనిపించింది. ముగ్గురికీ భోజనాలు పెట్టాను. సగం తింటూనే సుమ నిద్రపోయింది. సుమని పడుకోబెట్టి, అదే గదిలో రాజ్‍కి కూడా పక్కవేసి వచ్చాను. సుధని ఎత్తుకుని వచ్చాడు. నేనూ అమ్మమ్మా తిన్నాం. వెళ్ళి అమ్మమ్మ దగ్గర పడుకున్నాను. ఇల్లు చాలా పెద్దది. ఒకప్పుడు దాదాపు నలభైమందికి ఆశ్రయమిచ్చింది. అలాంటి ఇల్లు ఈరోజుని తన వైశాల్యంతో చైతన్యాన్ని కోల్పోయింది. ఒకే ఒక్క గది వుండివుంటే అనివార్యంగా మామధ్యని కొంత సంభాషణొ, గమనింపో వుండేది. ఇప్పుడే దుర్భేద్యమైన వంటరితనం దుస్స హంగా వుంది. నిద్ర రావడంలేదు. జరిగినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తున్నాయి. నాకు తెలీకుండానే నా కళ్లలో నీళ్లు కారిపోతున్నాయి. దిండంతా తడిసిపోయింది. ఆపుకున్నా ఆగడంలేదు.
అతని సమక్షంలో పురివిప్పిన నెమలిలా ఆడిన నా చైతన్యం ఇప్పుడు అతన్ని చూసి ముడుచుకుపోతోంది. ఏమైంది నా ప్రేమ? అదొక అశాశ్వతమైన, ఇంద్రియలోలితమైన భావన మాత్రమేనా? నాకూ అతనికీ మధ్యన వున్నదేమిటి? హార్టెటాక్ వచ్చి అతను హాస్పిటల్లో వున్నప్పుడు నేను దగ్గర లేను. ప్రమీలాదేవి వియోగం కేవలం అతనికే పరిమితం. అంటే అతని దుఃఖాలతో నాకెలాంటి సంబంధంలేదు. వాటిల్లో నాకెలాంటి ప్రమేయంలేదు. అతని సమస్యలు అతనివి. అలాంటప్పుడు అతనికి నేనెవర్ని? అతని దుఃఖాల్లో నాకెలాంటి సంబంధం లేనప్పుడు నా బాధల్లో కూడా అతనికి సంబంధం వుండకూడదు. మేము కేవలం సుఖాలకోసమే కలిసున్న వ్యక్తులం. అతనికీ నాకూ మధ్యనున్న అడ్డుగోడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది నాకు. అలాగని పూర్తిగా అతన్ని ద్వేషించడంగానీ ప్రేమించడంగానీ చెయ్యలేకపోతున్నాను. మనిషికి మంచీచెడూ అనే రెండు ముఖాలుంటాయి. అందుకే ఒకే వ్యక్తిని ద్వేషించడం, ప్రేమించడం అనే సంక్లిష్టత వుత్పన్నమౌతోంది. ఆలోచనలు అడ్డదిడ్డంగా సాగుతున్నాయి. తలనొప్పి మొదలైంది.
లేచి హాల్లోకి వచ్చి షెల్లో ఒక వస్తువుకోసం వెతుకుతుంటే రాజ్ స్వరం వినిపించింది.
“ఇదేనా, నువ్వు వెతుకుతున్నది?” చప్పుని తల తిప్పాను. చేతిలో నిద్రమాత్రల స్ట్రిప్‍ని వూపుతూ అడిగాడు. ఇది అతని చేతిలోకెలా వచ్చింది?