తిరస్కృతులు – 27 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“ఔను వసూ! ఎప్పుడో మారాల్సింది. మారితే జీవితంలో ఇంత సంక్లిష్టత వుండేది కాదు” చిన్నగా నిట్టూర్చాడు. తెల్లారి మూడయ్యేదా ఏవో మాట్లాడుకుంటూనే వున్నాం.
“ఇక పడుకో” అన్నాడు రాజ్ టైమ్ చూసి. ఇద్దరం పిల్లలకి చెరోవైపునీ పడుకున్నాం. చాలా కాలం తర్వాత నా జీవితంలో జరిగిన సహజమైన సంఘటన ఇది. మమ్మల్నిద్దర్నీ యిలా చూసి సుధా సుమలు ఎంతో సంతోషపడతారో! ఆ సంతోషం… శాశ్వతం కాదు. సాధ్యపడేది కాదు.
క్రమంగా నేను నిద్రలోకి జారుకున్నాను. ఒక అనూహ్యమైన సంఘటన నాకోసం ఎదురుచూస్తోంది వుదయం లేచేసరికి. అది రాజ్‍తో వెళ్లకూడదని నేను తీసుకున్న నా నిర్ణయానికి మరింత స్థిరత్వాన్నిచ్చింది.
పొద్దున్నే ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చి లేచి వెళ్లాను. అమ్మమ్మ ఎక్కడో పెరట్లో వుంది. ఇంత పొద్దున్నే ఎవరు? అనుకుంటూ ఎత్తాను.
“మా నాన్న అక్కడున్నారా?” నేనింకా హలో అనకముందే ఒక అబ్బాయి గొంతు. చాలా కోపంగా వుంది. రాజమోహన్ చిన్నకొడుకుదని వూహించడానికి నాకెక్కువ వ్యవధి పట్టలేదు.
అతని నోట్లోంచీ మాటల వర్షం మొదలైంది. “యూ… యూ ఆరే డెవిల్. మా నాన్నని మా దగ్గర్నుంచీ లాక్కున్నావు. మా అమ్మ నీవల్లే చచ్చిపోయిందట. ఏం కావాలి నీకు? గివ్ అజ్ అవర్ పప్పా బేక్… యూ… యూ బీచ్… పిగ్… యాస్… యూ ఆర్… యూ ఆర్ ఎవ్విరిథింగ్ యిఫ్ యూ డోన్ట్ సెండ్ అవర్ పప్పా బేక్”” ఆ అబ్బాయి ఏడుస్తూ ఫోన్ పెట్టేసాడు. అతని మాటలతోపాటుగా వెనకనుంచీ కొన్ని మగగొంతుల నవ్వులు…
నా తల గిర్రుమని తిరిగిపోయింది. రిసీవర్ చేతిలోంచీ జారిపోయింది. నిస్రాణగా కూలబడ్డాను. విన్న మాటలు పదేపదే చెవుల్లో మార్మోగుతూ కంకర్రాళ్లలా వచ్చి మనసుని తాకుతున్నాయి. ఆ అబ్బాయి సుధకన్నా రెండు మూడేళ్లు పెద్ద. వెనకుండి ఎవరో అనిపించినా కానీ అతడి గొంతులో ఎంత ద్వేషం… ఎంత కసి!
జరిగిన ఎన్నో పొరపాట్లతోపాటు ఇంకొకటి నిశ్శబ్దంగా ఎవరూ గుర్తించకుండా జరిగిపోయింది. నేను, ప్రమీలాదేవి, రాజ్… ఎవరూ కూడా గమనించలేదు. మేము ముగ్గురం ఒకరి గురించి ఒకరం ఆలోచించాం, ఆవేశపడ్డాం, ఆందోళనపడ్డాం. మా వుద్వేగాల పరిధిలోకి నా పిల్లల్ని కూడా లాక్కున్నాం. కానీ, ప్రమీలాదేవి పిల్లలు? నా పిల్లలేదో ఔతారని ఆమె ఎద్దేవా చేసింది. ఈరకమైన ఆలోచనాపద్ధతిలో వాళ్లేమౌతారు?
ఒకవైపు తల్లిని కోల్పోయి, మరోవైపు తండ్రిమీద నమ్మకంలేక ఎంత వంటరితనం అనుభవిస్తున్నారో ! తండ్రి తమవాడు కాదనే భావన… అతన్ని వాళ్లనుంచీ నేను వేరుచేసాననే నమ్మకం బహుశః కొన్ని సంవత్సరాల క్రితమే ఏర్పడిపోయి వుంటుంది. ప్రమీలాదేవి అన్నలకి నేనంటే చాలా కోపంవుంది. అది సహజం కూడా. వాళ్లు దాన్ని పిల్లలకి ఎక్కిస్తున్నారు. ఆ మధ్యలోకి నేను అడుగుపెడితే రాజ్ నాకిచ్చిన అధికారాన్ని వాళ్లు కాదనలేకపోవచ్చుగానీ నన్ను సాధించడానికి పిల్లల్ని పావుల్లా వాడుకుంటారనేది నిర్వివాదాంశం. ప్రమీలాదేవి వదిలిపెట్టి వెళ్ళిన రాజ్ కుటుంబానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యతకూడా నామీదే వుందని గ్రహించాను.
రాజ్ నిద్ర లేవగానే చెప్పాను.
“నేను సుధా సుమల్నీ, మా అమ్మా నాన్నల్నీ, యీ అమ్మమ్మనీ కూడా జాగ్రత్తగా చూసుకోగలను. దయచేసి నువ్వు కొంతకాలం మమ్మల్ని మర్చిపో. ఇక్కడికి రాకు. నువ్వు తమకే చెందుతావనే నమ్మకాన్ని ముందుగా నీ పిల్లల్లో కలిగించు”
“ఏం జరిగింది?” అని అడిగాడు, ఎలాంటి వుపోద్ఘాతం లేకుండా నేనలా అనడంతో, అది రాత్రి సంభాషణకి కొనసాగింపులా కూడా లేకపోవటంతో ఏదో జరిగిందని వూహించి. క్లుప్తంగా చెప్పాను. అతని ముఖం కోపంతో ఎర్రబడింది.
“కోపం దేనికి? ఇంతకాలం మనకోసమే మనం బ్రతికాం. వాళ్లని నిర్లక్ష్యం చేసాం. వాళ్లది గుర్తు చేస్తున్నారు””అన్నాను.
రాజ్ నాకేసి సూటిగా చూసాడు. అలాగే చూస్తూ నెమ్మదిగా అన్నాడు. “నీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. మీ ప్రభాకర్ నేర్పాడా?” అలా అంటున్నప్పుడు అతన్లో అసూయని చూసాను.
“ప్రభాకర్ నేను మలిచిన బొమ్మ. అతని దగ్గర నేను నేర్చుకున్నవేవీ లేవు. పరిస్థితులే అన్నీ నేర్పాయి”
“నిజంగానే… నీలో మెచ్యూరిటీ వచ్చింది… చాలా. నాకు తెలిసిన వసంతవికావు. కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నావు” అన్నాడు గొణుగుతున్నట్లు. నేను చిన్నగా నవ్వాను.
“నిన్నటి నీ ప్రశ్నకి సమాధానం… నేనతన్ని చేసుకోనిది నా గతానికీ, వర్తమానానికీ ఎలాంటి పొంతనా వుండదని” అన్నాను. ఆ విషయం చెప్పడానికి యిప్పుడు నాకే అహమూ అడ్డురాలేదు.
“అంటే?”
“ఇంక నీవైపు దారి మూసుకుపోయిందనుకుని… నా జీవితం తెగిన గాలిపటంలా కారాదని… పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడానికి అదికూడా ఒక అస్త్రంలా వుపయోగపడుతుందని అతన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ నా వూహల్లో, జ్ఞాపకాలలో, కోపంలో, ఏడుపులో నువ్వే వున్నప్పుడు… వసూ అనే నీ పిలుపు నన్ను వెంటాడుతున్నప్పుడు మరొకరితో వర్తమానాన్నెలా పంచుకోను? మనం కలిసి వుండటం యిప్పుడింక సాధ్యపడదు. ఏ జీవితసంధ్యలోనో మళ్లీ కలుసుకుందాం. అప్పటిదాకా నువ్వు నీ పిల్లలకీ, నేను నా పిల్లలకీ…” అన్నాను. నా నిశ్చయం ఎంత స్థిరమైనదైనా గొంతు వణికింది.
“నువ్వు ఏవేవో వూహించుకుంటున్నావు. ఒకోసారి అక్కడికి వచ్చావంటే అన్నీ అవే సర్దుకుంటాయి. పిల్లలుకూడా నిన్ను ఇష్టపడతారు” అన్నాడు. వెళ్లాలని నాకెంతమాత్రం అనిపించలేదు.
“ముందు మీపిల్లల విషయం ఆలోచిద్దాం. తర్వాతే ఏదేనా” నిక్కచ్చిగా చెప్పాను. ఎంతసేపో నాతో వాదించి చివరికి విసిగి వెళ్ళిపోయాడు. అతన్నలా పంపించినందుకు అమ్మమ్మకి నామీద చాలా కోపం వచ్చింది.
“కాలిదగ్గరికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నావు. ఏ గుడిలోనో మెళ్ళో పసుపుతాడు కట్టించుకుని అతని వెంట వెళ్తే సరిపోయేది. అక్కడి పరిస్థితులూ చక్కబెట్టేదానివి. బతుకొక ఒకదార్లో పడేది. నీకూ మీ అమ్మకీ నేను చెప్పలేకపోతున్నాను. మీకుగా ఏదీ ఆలోచించే తెలివీ లేదు, నేను చెప్తే బుర్రకీ ఎక్కించుకోరు” అంది కోపంగా.
నేను జవాబు చెప్పలేదు.


మైకేల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లీ చెల్లెళ్ళే లోకంగా బతికిన అతని అతని హృదయంలో అదృశ్యకోణాలు, అవ్యక్తదృశ్యాలు. అతను ప్రభాకర్‍కన్నా నాలుగైదేళ్ళేనా పెద్ద వుంటాడు. ఇద్దరికీ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజిలో పరిచయమట. నోటిఫికేషన్లు వెతుక్కోవటం, పార్ట్‌టైమ్ వుద్యోగం ఏదైనా ఒకరికి వస్తే మరొకరికి సాయం చేసుకోవడం అలా స్నేహంగా మారింది. తర్వాత ఏజి బారై, వుద్యోగాలు దొరకని పరిస్థితిలో అది మరింత చిక్కబడింది.
నేను వెళ్లేసరికి ఆఖరిక్షణాల్లో వున్నాడు. ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటిపక్క నర్సు సెలైన్ పెట్టే ప్రయత్నం చేస్తే అది ఎక్కటం లేదు. దాదాపుగా ఐపోయినట్టే. మైకేల్ తల్లి పిచ్చిదానిలా గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆవిడని ఆపడం ఎవరికీ సాధ్యపడటంలేదు. లూసీ ఏడవడం మర్చిపోయినట్టు వులుకూ పలుకూ లేకుండా కూర్చుంది. ఆ పిల్ల మైకేల్ బహి:ప్రాణం. పెద్ద షాక్‍లో వుంది. ఆమెని కుదుపుతూ ఏడుస్తోంది మేరీ. నాకూ ఏడుపొగలేదు.
“అన్నా! వసంత వచ్చింది చూడు. మనందరికీ తిండి పెట్టిన వసంత… మళ్ళీ కన్సల్టెన్సీ నడుపుతుందట. నీకోసం వచ్చింది. లే అన్నా! ” నన్ను చూడగానే మైకేల్ ముఖంలో ముఖం పెట్టి ఏడుస్తూ చెప్పింది మేరీ.
“ఎందుకిలా చేసాడు?” అప్పటికింకా ఏమీ తెలీక అడిగాను.
“నువ్వూహించలేవు వసంతా! మా చిన్నతనంలో నాన్నతో గొడవపడి అమ్మ మమ్మల్ని తీసుకుని మా తాతదగ్గిరకి హైదరాబాదు వెళ్ళిపోయింది. అక్కడే డిగ్రీ చదివేడు వీడు. అక్కడ ఎవర్నో ప్రేమించాడు. ఆ పిల్లతో చెప్తే అది వాళ్ల అన్నలకి చెప్పింది. వాళ్లు వీడిని నెత్తుటిమూటని చేసి మా యింటి ముందు విసిరేసారు. నేను, అమ్మ, తాత బాగా ముసిలివాడు… లూసీ యింకా చిన్నపిల్ల… వాడిని తెలిసినవాళ్ళ ఆటోలో వేసుకుని తిరగని ఆస్పత్రి లేదు. క్రిమినల్‍కేసని ఒక్క డాక్టరూ తీసుకోలేదు. గవర్నమెంటు ఆస్పత్రిలో చేర్చాం చివరికి. మా అదృష్టంకొద్దీ బతికాడు. తర్వాత ఆమె వూసే ఎత్తలేదు. మర్చిపోయాడని సంతోషించాం. చాలా యేళ్లయిపోయింది. ఇప్పుడిలా చేసాడు.”
“ఎందుకు?” బండగా వుండే మైకేల్ విషయంలో ప్రేమనేదాన్ని జీర్ణించుకోలేక గట్టిగా అడిగాను.
“ఆమెకి ఏక్సిడెంటైంది. చచ్చిపోయింది. పేపర్లో చూసాడు. ఇంత పని చేసాడు. ఎవరం వూహిచలేదు” మేరీ ఏడుపు ఉధృతమైంది. మైకేల్‍ని పిలుస్తూనే వుంది. చాలాసేపటికి అతనికి స్పృహ వచ్చింది. తల దగ్గర కూర్చునివున్న నన్నే మొదట చూసాడు. పెదాలపైన నిస్పృహతో కూడిన చిరునవ్వు…
“ఆమె నన్ను ప్రేమించిందనే నా నమ్మకం. లేకపోతే నా ప్రేమని అంత సీరియస్‍గా తీసుకునేది కాదు. రోడ్డుపై వెళ్లే ఎందర్నో యిగ్నోర్ చేసినట్టే నన్నూ చేసి వుండేది. ఆమె నన్ను ప్రేమించకపోయినా కూడా తనెక్కడో ఒకచోట సుఖంగా వుందనే నమ్మకమే నన్ను బ్రతికించింది. ఇప్పుడింక యీ ప్రపంచం ఒక శూన్యం. అందులో నేను బ్రతకలేను. వెళ్లిపోతున్నాను, సెలవ్. మన చిన్ని పరిచయంలో నువ్వు నాకు పంచిచ్చిన స్నేహానికి కృతజ్ఞతలు. బ్లెస్సెస్” అతికష్టమ్మీద ఆ మాటల్ని నాకోసమే దాచినట్టు ఆ ప్రాణాలని నాకోసమే నిలిపినట్టు అన్నాడు.
అతని చూపులు చుట్టూ వున్న వాళ్లమీద పడ్డాయి. ఒక్కొక్కరినీ చూసుకుంటుండగానే కళ్లు మూతలుపడ్డాయి. ఒక్కసారి అనేక గొంతుల ఏడ్పులతో గదంతా మార్మోగిపోయింది.
నేను తలొంచుకుని ఏడుస్తుంటే ఎవరిదో చెయ్యి నా భుజంమీద పడింది. తలెత్తి చూసాను. ప్రభాకర్ అతని గుండెకి తలానించి ఏడ్చేసాను. నన్నలాగే పొదివి తీసుకెళ్లి కారిడార్లో కూర్చోబెట్టాడు. చాలాసేపు ఏడ్చాను. ఒక కథలా మొదలైన పరిచయాలు ముగింపుని తీసుకుని నిష్క్రమిస్తుంటే తట్టుకోలేకపోయాను.
“ఎవరామె?” సడెన్‍గా తెలుసుకోవాలనిపించింది.
అతను లోపలికి వెళ్లి పాత న్యూస్‍పేపర్తో తిరిగొచ్చాడు… ప్రమీలాదేవి మరణవార్త అందులో వుంది. ఒక విస్ఫోటనంలాంటిది నా మెదళ్లో జరిగింది. ఆమె ప్రవర్తనలో అంత మార్పుకి కారణం అంతఃసంఘర్షణకూడానా?
“రాజ్ మోహన్ నిన్ను లాక్కున్నాడు. ప్రమీలాదేవి వీడిని తీసుకెళ్లి పోయింది. ఇంక నాకెవరున్నారు?” అంటూ ఏడ్చేసాడు ప్రభాకర్.
అంత్యక్రియలకి చాలామంది వచ్చారు. అందులో చాలావరకూ కన్సల్టెన్సీకి పనిచేసినవారే. అంత్యక్రియలయ్యాక రామకృష్ణ, యింకొంతమంది వచ్చారు.
“మేడమ్, మీతో మాట్లాడాలి. ఎక్కడ కలవమంటారు?” అని అడిగారు. మళ్లీ వస్తానని చెప్పాను.
“వాళ్లు గుడ్‍విల్‍తోసహా కన్సెల్టెన్సీని కొందామనుకుంటున్నారు” ప్రభాకర్ చెప్పాడు.
“అమ్మటాలూ కొనటాలూ వద్దు. ఎవరి పేరుమీదికి ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తే వాళ్ల పేరుమీదికి ట్రాన్స్ఫర్ చేస్తాను. పేపర్లు రెడీ చేసుకొమ్మను సంతకాలు పెడతాను”” అన్నాను.
“ఇంక యిక్కడికి రావా వసంతా?” అడిగాడు.
“ఏముందిక్కడ?””
నేనలా అనేసరికి అతని కళ్లలో నీళ్లు నిలిచాయి. గ్లాసెస్ తీసి కళ్లు తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడు.
“ఏంటిది ప్రభాకర్?” అన్నాను మందలింపుగా. అతను నిర్వేదంగా నవ్వాడు.
“నీ మనసంతా అతనిమీదే వుంటుంది కదు, వసంతా? తాత్కాలికమైన ఏవో కోపతాపాలు, గొడవలు మిమ్మల్ని విడగొట్టినా నువ్వతని జ్ఞాపకాల్లో బ్రతుకుతుంటావుకదూ? నా సమక్షంలో నువ్వెప్పుడూ సంతోషంగా లేవు. తప్పదన్నట్టో తప్పు చేసినట్టో వుండేదానివి. దాన్ని నేను దుఃఖమనుకుని నాకు సాధ్యమైనంత సంతోషాన్ని నింపాలనుకునేవాడిని. కానీ నీ సంతోషం అతని జ్ఞాపకాలని నీ పిల్లల్తో పంచుకోవడంలోనే వుందని గ్రహించాను. అందుకే నీ దారిలోంచీ వచ్చేసాను”
“ప్రభాకర్!” అన్నాను విచలితురాలినై. నన్నెంతగా చదివాడితను? ప్రేమ యిలాంటి సూక్ష్మదృష్టిని యిస్తుందా? ప్రేమకిగల మరో కోణాన్ని స్పృశించాను.
ఆ రాత్రికే నేను కొండపల్లి తిరుగు ప్రయాణమ య్యాను. ప్రభాకర్ నాతో స్టేషన్‍దాకా వచ్చి రైలెక్కించాడు.