తిరస్కృతులు – 28 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

అన్నట్టుగానే మళ్లీ ఆదివారం వరంగల్ బయల్దేరాను. రామకృష్ణకి ఫోన్ చేసి చెప్పాను, మైకేల్ యింటికి వస్తున్నానని, అక్కడికి రమ్మని. మైకేల్ యిల్లు… అతను లేకపోయినా అదతనిల్లే! కానీ స్టేషన్లో నేను రైలు దిగేసరికి ప్రభాకర్ వున్నాడు ప్లాట్‍ఫాం‍మీద.
“ఏమనుకుంటున్నావు నువ్వసలు? మా యింటికి రాకుండా ఎక్కడికో వెళ్లటమేమిటి?” అడిగాడు కోపంగా. పునరుద్ధరింపబడితే యీ అనుబంధాలు… ఎటునించీ ఎటు దారితీస్తాయో! “
“వద్దులే, ప్రభాకర్! లేనిపోని సమస్యలు మొదలౌతాయి. నువ్వు సంతోషంగా వుంటే చాలు”” అన్నాను.
అతని ముఖం చిన్నపోయింది. వెంటనే తమాయించుకుని, “ప్రేమ చంపుకుని పెళ్లి చేసుకున్నానని స్నేహాన్ని కూడా చంపుకోవాలా వసంతా?” అడిగాడు. అడిగి, “గీత అలా అనుకోదులే. తనకన్నీ తెలుసు”” అన్నాడు. నేనింక కాదనలేదు. గీతని చూడాలన్న కూతూహలంకూడా వుంది. మేం వెళ్లేసరికి రుక్మిణమ్మగారు ఇంటిముందే వుంది. ఎదురుపడాలంటే బిడియంగా అనిపించింది. కానీ ఆవిడ చాలా మామూలుగా “ఏమ్మా, వసంతా! బావున్నావా? పిల్లల్ని తీసుకురాలేదా?” అని అడిగింది.
నేను జవాబు చెప్పేలోగా ప్రభాకర్ లోపలికెళ్లి భార్యని వెంటబెట్టుకుని వచ్చాడు. గీత… సన్నగా పొడవుగా అతనికి నప్పినట్టుంది. నన్ను పెళ్లికి రావద్దని అభ్యర్ధించడం గుర్తొచ్చింది. చిన్న గీత పక్కని గీతలు పెద్దగా గీసుకుంటూ వెళ్తే కొంతసేపటికది తన ప్రాధాన్యతని మార్చుకుంటుంది. అనుభవాలూ అంతే. ఒకదానివెనుక మరొకటి తటస్థించి క్రమంగా తమలోని వుద్విగ్నతని కోల్పోతాయి.
“మిమ్మల్ని అప్పట్లో రెండుమూడు పంక్షన్స్‌లో చూసానండీ!” అంది తను చనువుగా నవ్వుతూ.
ఇంట్లో ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది. రెండుపోర్షన్స్‌గా వుండేదల్లా ముందుగదులమధ్య గోడ తీసేయడంతో పెద్దహాలు, రెండు బెడ్రూమ్స్ గల సింగిల్ పోర్షన్‍గా మారిపోయింది. సోఫాలు, డైనింగ్ సెట్, ఫర్నిచర్తో యిల్లంతా నిండిపోయింది. గీత అభిరుచికి అద్దం పడ్తోంది. ఇంటిముందున్న ఖాళీ స్థలంలో గేరేజి, గేరేజీలో రెండు కార్లు – ఒకటి నేను కొన్నది, రెండోది బహుశః గీత తండ్రి యిచ్చి వుండచ్చు. పెళ్ళి చేసే స్థితిలోకూడా లేరు వాళ్ళన్నాడు ప్రభాకర్ మరి! ప్రభాకరే సంపాదిస్తున్నాడేమో.
సందులో పడక్కుర్చీలో ప్రభాకర్ తండ్రి అలాగే వున్నాడు.
గీత టిఫెను, కాఫీ తెచ్చి యిచ్చింది. అవి పూర్తయ్యేసరికి రామకృష్ణావాళ్లూ వచ్చారు. డాక్యుమెంటు సంతకాలు పెట్టి యిచ్చేసాను. వాళ్ల ముఖాల్లో ఎంత సంతోషమో! ఎకౌంట్సన్నీ సెటిల్ చేసేసరికి కొంత టైమ్ పట్టింది. మైకేల్‍కీ ప్రభాకర్‍కీ రావల్సిన డబ్బు కొంత వుంటే వాటికి చెక్కు రాయబోతుంటే ప్రభాకర్ అదంతా మైకేల్‍కే యివ్వమన్నాడు. మేరీ పేర్న చెక్కు రాసి నేను వాళ్లింటికి బయల్దేరుతుంటే తనూ వస్తానన్నాడు. ప్రభాకర్. తప్పిపోయిన తల్లిని కనుగొన్న చిన్నపిల్లాడిలా అతను నన్నొదిలిపెట్టడంలేదు. రుక్మిణమ్మగారి ముఖంలోను గీత ముఖంలోనూ అసహనం కనిపిస్తోంది. ఇక్కడికి రాకుండా వుండాల్సిందనిపించింది. నవ్వుతూ ఆహ్వానించనప్పటి ఆదరం క్రమంగా అదృశ్యమౌతోంది.
“నేను మేరీవాళ్లతో కొద్దిసేపు గడపాలనుకుంటున్నాను ప్లీజ్” అన్నాను. ప్రభాకర్‍కి కోపం వచ్చి ఆగిపోయాడు. నేనొక్కర్తినే వెళ్లిపోయాను.
మైకేల్ తల్లి నన్ను చూసి పెద్దగా ఏడ్చింది. మేరీ సరే సరి. రూసీ యింట్లో లేదు. వాళ్లని వోదార్చి చెక్కు చేతిలో పెట్టి వచ్చేసాను. అంతకంటే ఏం చెయ్యగలను?
ఫోన్ చేస్తే రావుగారు తన ఫ్రీగానే వున్నాననీ రమ్మని చెప్పారు. నేనెక్కడున్నానో చెప్తే కారు పంపిస్తానని కూడా అన్నారు. వద్దని చెప్పి బయల్దేరాను. ముందుగా రావుగారి క్లినిక్‍కి వెళ్లి అక్కడ్నుంచి వాళ్లింటికి వెళ్లాము.
కళావతిగారు నన్ను చూడగానే, “చాలా బలహీనంగా వున్నావు వసంతా! బాగా దిగులదీ పెట్టుకుంటున్నావా? దిగులుపడీ, బాధపడీ, ఏడ్చీ ఏమీ సాధించలేము” అందావిడ. ఆ ఆప్యాయతకి నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
“ఏం చదువుకున్నావు నువ్వు? ఏదేనా ఉద్యోగం వేయించమంటావా? ఐనా యింత బాగా నడుస్తున్న కన్సల్టెన్సీ ఎందుకు వదిలిపెట్టి వెళ్లిపోయావు?” అనడిగారు భార్యాభర్తలు.
“ఇక్కడ నాకేముందాంటీ? అమ్మా నాన్నా విజయవాడలో వుంటారు. వాళ్ళు ఆ వూరు వదిలిపెట్టి రారు. వాళ్లని నేను, నన్ను వాళ్లు బాగా మిస్ చేసామనిపిస్తోంది. కొంతకాలం గడిచాక ఆలోచిస్తాను ఏం చెయ్యాలో!”
“రాజ్‍మోహన్ ఏమంటున్నాడు వసంతా? అతని భార్య పోయిందటగా?” రావుగారు అడిగారు.
చక్రభ్రమణంలా, చర్విత చర్వణంలా ప్రశ్నలు.. మళ్లీ అదే జవాబులు, విని విని, చెప్పి చెప్పి అవేవీ నాకు సంబంధించినవి కాదనిపిస్తోంది.
“చంద్రలేఖ. ఆమె తల్లి నీ గురించి చెడ్డగా చెప్తున్నారు. కొన్ని మాటలుదాకా కూడా వచ్చాయి. వాళ్ళకీ అతనికీ బంధుత్వం వుందట. మాకైతే చాలా బాధనిపించింది. నువ్వెలాంటిదానివో చూడలేదా? జరిగినదాంట్లో అతని తప్పు లేదా? తెలిసో తెలీకో ఒక ఆడపిల్ల అతని వెంటపడిందే అనుకుందాం, నచ్చజెప్పి వెనక్కి పంపే బాధ్యత అతనికి లేదా? అతనూ ఏమీ చొక్కం కాదు. ఇంకా చాలా పరిచయాలుండేవట. జరిగిపోయినవాటి గురించి యిప్పుడెందుకు? జరగబోయేవి సక్రమంగా జరిగేలా చూడాలిగానీ” అంది కళావతిగారు. నేను చిన్నగా నవ్వి వూరుకున్నాను. వీళ్ళలా వాళ్లెందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు తెలుసు.
“మా అమ్మాయీ అల్లుడూ డైవోర్స్ తీసుకున్నారు” బాధపడుతూ చెప్పిందావిడ.
నా కన్సల్టెన్సీకి బ్రేక్ తెచ్చిన పెళ్లి!! నేను చకితురాలినయ్యాను.
“అమెరికా వెళ్లినా, వైట్ కాలర్ తగిలించుకున్నా ఇండియన్ మగవాళ్ల మెంటాలిటీ మారదు. ఇదెవర్తో మాట్లాడినా అతనికి అనుమానమట. ఎవరితోటీ మాట్లాడకుండా వుండటం ఎలా సాధ్యపడుతుంది? ఉద్యోగం మానెయ్యమంటాడు. ఇంట్లోనే కూర్చోమంటాడు. అంతగా అతని జీతంతో సర్దుకోలేకపోతే పుట్టింటినుంచీ తెచ్చుకోమంటాడు. డౌరీ హెరాస్‍మెంటనమాట. విడాకులిచ్చేస్తానమ్మా అంది ఒకరోజు ఫోన్లో. ఎటూ చెప్పలేకపోయాను. ఆ కించపాటుని తట్టుకోలేకపోతున్నాను అని తనే మళ్లీ నా మౌనానికి జవాబు చెప్పింది. విడాకులు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోమన్నాం. ఈ జన్మకి యీ అనుభవం చాలంది. వసంతా! నాకు నువ్వే గుర్తొచ్చావు. దాంతో మాట్లాడుతుంటే…” ఆవిడ గొంతు రుద్ధమైంది.
“నిజంగా ఆడవాళ్లం చాలా తెలివితక్కువవాళ్లం. మాతృస్వామ్యంనించి సమాజం పితృస్వామ్యంవైపుకి ప్రయాణిస్తుంటే చూస్తూ వూరుకున్నాం. అధికారాలూ, హక్కులూ పరహస్తగతమైనా ఏమీ చెయ్యలేకపోయాం. మగవాడు మాత్రం అధికారాలన్నీ తన గుప్పెట్లో వుంచుకుని స్త్రీ సుఖదుఖాలనికూడా తనే నిర్దేశిస్తున్నాడు” అంది కన్నీళ్లతో. ఆవిడలాగా చదువుకున్న స్త్రీకి…వృత్తిపరంగా సమాజాన్ని ఎన్నో కోణాల్లోంచి చూసి, తన కూతురు స్త్రీగా వివక్షతకి గురికారాదని ఎంతో వుదాత్తంగా పెంచాక… ఏదైతే తను వద్దనుకుందో అదే అనుభవం ఎదురవ్వడాన్ని తట్టుకోవడం కష్టమే. ఇప్పటి తరం తిరోగమనానికి వెళ్తోందేమోననే అనుమానం కలుగుతోంది. గుళ్ళచుట్టూ తిరిగేవాళ్ళు, ధర్మశాస్త్రలు వల్లించేవాళ్ళు ఎక్కువౌతున్నారు తప్ప చేసేదాన్నీ, చెప్పేదాన్నీ అవగాహన చేసుకుంటున్నవాళ్ళు లేరు. చదువుకున్నకొద్దీ వాళ్ళ భావప్రపంచం కుదించుకుపోతోంది. ఆవిడనేమని వోదార్చాలో అర్థమవలేదు.
మనం వున్నది సంకెళ్లలోనని తెలినంతవరకూ ఏ బాధా తెలీదు. ప్రపంచం విశాలంగానే కనిపిస్తుంది. అంటే చలనం లేనంతవరకూ. ఎప్పుడైతే మనలో చలనం మొదలౌతుందో అప్పుడు సంకెళ్లు అడ్డుపడి మన స్వేచ్ఛకిగల పరిధులేమిటో తెలుస్తాయి. బాధ అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం చాలామంది ఆడవారికి ఎదురౌతోంది. ఇదే అనుభవం తరాలనుంచీ వున్నా, అప్పుడింత చలనశీలత లేదు. చదువు, వుద్యోగం ఆడవాళ్ళ పరిధిని విశాలం చేస్తున్నాయి. ఆ పరిధి ఈ సంకెళ్ళని దాటిపోతోంది.
“దాని జీవితం దానిష్టం. ఒకసారి ఏదో చెయ్యబోయాం. బెడిసికొట్టింది. ఇక పెళ్లే వద్దనుకుంది. ఆ నిర్ణయం మార్చుకునేదాకా వేచి చూడటమే. అదేం చిన్న పిల్లకాదు, అన్నీ మనమే చెప్పడానికి” తాత్వికంగా అన్నారు రావుగారు. వాళ్లిద్దర్లో నాకు అమ్మానాన్నా కనిపించారు. వాళ్లకి నాలో వాళ్లమ్మాయి కనిపించడంలో ఆశ్చర్యంలేదు. అక్కడినుంచీ సెలవు తీసుకుని వచ్చేసాను.
“పిల్లల్నెప్పుడు చూపిస్తావు?” అడిగారు భార్యాభర్తలిద్దరూ వచ్చేముందు.
“మళ్లీ ఎప్పుడో యిలాగే వస్తాను” అన్నాను. ఏ సహాయం కావాలన్నా మొహమాటపడకుండా అడగమని పదేపదే చెప్పారు.
నేను తిరిగొచ్చేసరికి ప్రభాకర్ లేడు. రక్ష్మిణమ్మగారు వాకిట్లో కూర్చుని వుంది. గీత లోపలెక్కడో వున్నట్టుంది. నేను ఆవిడ దగ్గర కూర్చున్నాను. ఎన్నో చెప్పాలనుందిగానీ మాటలు దొరకలేదు.
“ఏమ్మా?” అడిగిందావిడ. నా మౌనం విడింది.
“మీకు నేను చాలా బాధ కలిగించాను. కానీ, నేను.. నేనెప్పుడూ ప్రభాకర్ని మోసం చేసో, డబ్బు ఆశ చూపించో మరోలాగో పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నాగురించి ఏమీ తెలీకముందే అతను పెళ్ళి చేసుకుందామన్నా నేను వారించడానికే ప్రయత్నించాను. మొదటే అన్నీ ఎందుకు చెప్పలేదనే ప్రశ్న మీరడగవచ్చు. అవసరం లేకుండా అవన్నీ చెప్పి నలుగుర్లో చర్చాంశాన్ని కావటమెందుకని చెప్పలేదు… ప్రభాకర్‍తో పెళ్లికి నా మనసెప్పుడూ సుముఖంగా లేదు. అతనికోసం నా మనసుకి భిన్నంగా ప్రవర్తించాల్సివచ్చేది. ఇప్పుడు… చాలా ప్రశాంతంగా వుంది. నేను నవ్వినా ఏడ్చినా అడిగేవారు లేరు” అన్నాను.
“ఇల్లు, అమ్మానాన్నలు, పరువు- అన్నీ మర్చిపోయి ఇంట్లోంచీ వెళ్లిపోయేంతగా నువ్వు నీ భర్తని ప్రేమించావు. అతనితో గడిపావు. పిల్లల్ని కన్నావు… అతను వెళ్లగొట్టాక కూడా అతన్తో అనుబంధాన్ని తెంచుకోలేదు. నీలో నువ్వు కసితో, కోపంతో రగిలిపోయావు. ఆ కసితోటే ఎదగాలనుకున్నావు. ఏదో సాధించాలనుకున్నావు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలనుకున్నావు. మరి అతను ఇవన్నీ చూస్తూ వూరుకుంటాడా? నీకు ఆటంకాన్ని కలిగించేందుకు తనూ పావుల్ని కదుపుతాడు. ఈ ఆటలో నా కొడుకేమౌతాడోనని భయపడ్డాను”” అందావిడ.
“నా గురించి మీకన్నీ తెలుసా? లేక వూహించారా?”
“తెలుసుకోవాలనుకుంటే మార్గం లేదా? ప్రభాకర్ మాత్రం నాకు పైవాడా?”
ఒకప్పుడు ఆవిడకి ఎదురుపడాలంటే సంకోచంగా వుండేది. ఆవిడ కళ్లలోకి సూటిగా చూడలేకపోయేదాన్ని. ఏం అడుగుతుందో, ఏం చెప్పాలోనని భయపడేదాన్ని. ఇప్పుడలాంటి తెరలన్నీ తొలగిపోయి చాలా సన్నిహితంగా అనిపిస్తోంది. పిల్లలతో సైతంగా నేను బయటికి వచ్చి వుంటే ప్రభాకర్‍కి నామీద మొదటి అభిప్రాయం వేరేగా ఏర్పడి వుండేది. నేనేనా నా కష్టాలు ఆవిడతో చెప్పుకుని, సానుభూతి పొంది వుంటేకూడా పరిస్థితి మరోలా వుండేది. నేనొక గందరగోళంలో వుండి అస్థిమితంగా వున్నప్పుడు ప్రభాకర్ ఈ ప్రకరణం అంతా జరిగింది.
కాసేపటికి లేచి లోపలికెళ్లాను.
గీత బెడ్రూంలో వుంది. నా అలికిడికి యివలికొచ్చింది. ముభావంగా వుంది. ఏడ్చినట్టుంది. కళ్లు కొంచెం ఎర్రబడ్డాయి కూడా. ఇదంతా నాగురించే అయుంటుంది.
“ప్రభాకర్ లేడా?” అడిగాను.
“లేరు” ముక్తసరిగా అంది.
“మరైతే నేను వెళ్తాను. అరగంటలో ట్రయినుంది. వచ్చాక అతనికి చెప్పండి” అన్నాను నా బేగ్ తీసుకుంటూ. నేనింత డిటాచ్డ్‌గా వుండటం చూసి ఆమె తెల్లబోయింది.
“అదేంటి? తనొచ్చేదాకా వుండరా?” అడిగింది.
“పిల్లలు ఎదురుచూస్తుంటారు. గొడవ చేస్తారు, ఉదయం వాళ్లు లేచేసరికి కనబడకపోతే” అన్నాను.
“ఏ ట్రెయినుంది?”
చెప్పాను.
“తెల్లవారుతుందా చేరేసరికి?””
“రెండౌతుందేమో! నాన్న స్టేషన్‍కి వస్తారు” అన్నాను. ప్రభాకర్ రాకముందే వెళ్లిపోవాలనుంది. ఎందుకో తెలీదు… ఏ చిన్న అనుబంధాన్నీ పెంచుకోవాలనిపించడంలేదు. అన్నిటినీ తుంచుకుని నేను నేనుగా మిగిలిపోతే చాలనిపిస్తోంది.
“భోజనంచేసి వెళ్లండి” అంది. మాటవరసకని అర్థమైంది. ఆకలి లేదని చెప్పి, నా బేగ్ తీసుకుని కదిలాను. బైటిదాకా నాతో వచ్చింది.