తేడా వుంది by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

(ఆంధ్రభూమి 1994, సింధూరి కథల సంపుటి )

శ్రీధర్ ఆఫీసు నుంచి వచ్చేసరికి టీపాయ్‍మీద రెండు యిన్విటేషన్ కార్డులు వున్నాయి. చూసాడు. ఒకటి పెద్దకూతురు శశి దగ్గర్నుంచీ. ఆమె ఆడబడుచు పెళ్లి శుభలేఖ. రెండోది తీసాడు. మొదట్నుంచీ అనుకుంటున్నదే. చిన్నకూతురింట్లో గృహప్రవేశం. తప్పకుండా రావాలని వారంక్రితమే కూతుళ్ళిద్దరూ ఫోన్ చేసి చెప్పారు. రెండు ముహూర్తాలూ దగ్గర దగ్గిరే.
“వారం రోజులుకూడా లేదు. బట్టలు కొనడానికి ఎప్పుడు వెళ్దాము?” అనడిగింది భార్య, సత్యవతి.
“రేపు బేంకునించీ డబ్బు డ్రా చేసి తెస్తాను. సాయంత్రం వెళ్లాం. నేను వచ్చేసరికి రెడీగా వుండు” అన్నాడు శ్రీధర్. తర్వాత యిద్దరూ చిన్నకూతురు కట్టుకుంటున్న ఇంటి గురించి చర్చించుకున్నారు.
“భాస్కర్ ఎంతేనా తెలివైనవాడు. పెద్దగా అప్పులకి పోకుండా వున్నంతలో కుప్తంగా కడుతున్నాడు” అంది సత్యవతి.
“అతని తండ్రి దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. ఆయన మంచి వ్యవహారవేత్త” అన్నాడు శ్రీధర్.
“పెళ్ళయ్యాక చంద్రకి కూడా వద్దిక వచ్చింది” అంది సత్యవతి. చంద్రంటే వాళ్ల చిన్నకూతురు. వాళ్లెప్పుడూ శశి గురించి మాట్లాడుకోరు. మాట్లాడుకుంటే ఏముంది, మనస్తాపమే!
శశి అందం చూసి మోజుపడి కట్నం లేకుండా చేసుకున్నాడు శ్రీకాంత్. అతని తల్లిదండ్రులకి ఇష్టంలేకపోయినా కొడుకుకోసమని వప్పుకున్నారు. పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు చెయ్యమన్నారు. బాగా కలిగిన కుటుంబం. మధ్యతరగతికి అపారమనిపించేంత సిరీసంపదా, వ్యాపారవ్యవహారాలూ వున్నాయి. కట్నం లేదన్న పేరొక్కటే మిగిలిందిగానీ ఖర్చు తడిసి మోపెడైంది శ్రీధర్‌కి. కూతురి పెళ్ళికని ప్లాన్ చేసుకున్న ఎస్టిమేట్ దాటిపోయింది. డబ్బు పోతేపోయింది, ఆ పిల్ల సుఖపడుతుందని ఆశించాడు. అదీ అడియాసే అయింది. శశిని అత్తవారింట్లో ఆరళ్ళేం పెట్టరు. ఆహ్వానించబడని, దిగువస్థాయి అతిథిని ఎలా చూస్తారో అలా చూస్తారామెని. ఏం చెయ్యడానికీ స్వతంత్రం లేదు. ఏం చేసినా ఎవరేమంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారోననే కించపాటు! అలాగని వాళ్లు అవమానంకూడా చెయ్యరు. అన్నీ ఆమె మనసుకే తడతూ ప్రతిక్షణం ఆత్మన్యూనతలో కృంగిపోతుంటుంది. శ్రీకాంత్, భార్య అందాన్ని పట్టించుకున్నట్టు ఆమె మనసుని పట్టించుకోడు. అందమే ఆమె అన్నట్టు అసలామె మనిషే కానట్టూ ప్రవర్తిస్తాడు. ఇప్పుడు మాత్రం శశి ప్రస్తావన అనివార్యంగా వచ్చింది శ్రీధర్ సత్యవతిల మధ్య.
“శశి మరీ నోట్లో నాలికలేనిది. దాన్నంత పెద్ద కుటుంబంలో ఇచ్చాం. కలవలేకపోతోంది. పెళ్ళై నాలుగేళైనా, పిల్ల తల్లైనా దీన్ని వేరుగానే చూస్తారు వాళ్ళు” దిగులుగా అంది సత్యవతి.
“అది సుఖపడుందనే డబ్బుకి చూసుకోకుండా వాళ్లు అడిగినట్టల్లా ఖర్చుపెట్టాను. లక్షల ఆస్తి. ఒక్కడే కుర్రాడు. ఇష్టపడేకదా చేసుకున్నాడు? దీనికి కలుపుగోలుతనం లేకపోతే మనమేం చేస్తాం? చంద్రని ఇటిచ్చి, శశిని అటిచ్చి వుంటే వాళ్ళిద్దరూ, ఇద్దర్తోపాటు మనమూ సుఖంగా వుండేవాళ్ళం” శ్రీధర్ చిరాకుపడి అక్కణ్ణుంచీ లేచి వెళ్లిపోయాడు.
“చంద్రలా బడబడలాడుతూ తిరిగితే లేకీదనే ముద్రకూడా వేసేవారు. అదలా గుంభనగా వుంటోంది కాబట్టే ఆపాటి గౌరవమన్నా ఇస్తున్నారు” అంది సత్యవతి అంతకంటే కోపంగా.
అంత పెద్ద సంబంధం వద్దని తను మొదట్లోనే చెప్పింది. అతను వినలేదు. కట్నం అక్కర్లేదన్న మాట వినటానికి చాలా బావుంటుంది. ఆచరణ చాలా లోతుగా వుంటుంది. కట్నం వద్దన్న పెళ్లికొడుకు సంఘసంస్కర్త కాడు. లేనింటి పిల్లని చేసుకుని వుద్ధరించాలనీ అనుకోడు. చట్టవిరుద్ధమైన ఆ వొక్కటీ వదిలేస్తాడు. అంతకన్నా మార్పేమీ వుండదు. వియ్యానికైనా నెయ్యానికైనా కయ్యానికైనా కూడా సమవుజ్జీలైతేనే బావుంటుంది. ఆ విషయం ఆడపిల్ల తండ్రి వుద్ధేశ్యపూర్వకంగానే విస్మరిస్తాడు. పర్యవసానాలు తగ్గట్టే వుంటాయి.
పెళ్లి అయాక శశి కుటుంబాన్నించీ పూర్తిగా వేరుపడిపోయింది. మరోవైపు తమ ఆర్థికస్థాయి దిగజారింది. అక్కచెల్లెళ్ళిద్దరినీ ఒకే స్థాయిలో హోల్డ్ చెయ్యలేకపోయారు. చంద్రకి మామూలు సంబంధం వచ్చింది.
“ఇల్లు అమ్మేసి నీకూ పెద్ద సంబంధమే చేస్తాం. మాకోసం వప్పుకోనక్కర్లేదు” అంది తను.
“పెళ్లి పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం కాదు. నాకు ఇలా వుండటమే ఇష్టం. ఇద్దరం వుద్యోగాలు చేసి సంపాదించుకోగలం” అంది చంద్ర.అలాగే పైకొస్తున్నారు.


మర్నాడు యిద్దరూ వెళ్లి బట్టలు తీసుకున్నారు. శశిని దృష్టిలో పెట్టుకొని ఖరీదైనవే తీసుకున్నారు. కూతుళ్లిద్దరూ చిన్నబుచ్చుకోకూడదని ఇద్దరికీ రంగు తేడాలో ఒకేలాంటి చీరలు తీసుకుంది సత్యవతి. ముందు చంద్ర ఇంట్లో కానిచ్చుకుని అట్నుంచీ శశి ఇంటికి వెళ్లేందుకు ప్రోగ్రాం నిర్ణయమైంది. తెల్లారి నాలుగు గంటలకి గృహప్రవేశమనగా ముందురోజు మధ్యాహ్నం చంద్ర ఇంట్లో దిగారు శ్రీధర్, సత్యవతి. అప్పటికే చాలామంది చుట్టాలొచ్చేసారు.
“ఏంటమ్మా, చుట్టాలతోపాటా మీరూ రావడం?” అంటూ ఎదురెళ్లి తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకెళ్లింది చంద్ర.
“ఏమండీ! మా అమ్మవాళ్ళొచ్చారు. ఓసారిటు రండీ” అంటూ పెరట్లో ఏవో ఏర్పాట్లు చూస్తున్న భాస్కర్ని కేకేసింది. అతను చేస్తున్న పని వదిలిపెట్టి వచ్చి పలకరించి, వాళ్లు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటించి వెళ్లారు. కాసేపటికి వియ్యంకుడూ, వియ్యపురాలూ వచ్చారు. వాళ్లూ అప్యాయంగా పలకరించి, దగ్గిరుండి స్వయంగా భోజనపు ఏర్పాట్లు చూసారు. వచ్చినవాళ్లందరితోటీ చంద్ర కలివిడిగా మాట్లాడుతూ స్వతంత్రంగా పనులన్నీ చూసుకోవడం చూస్తుంటే శశి గుర్తొచ్చి కలుక్కుమంది సత్యవతికి. ఆ మధ్యలోనే తీరిక చేసుకొని వచ్చి కూర్చుని కబుర్లు చెప్పింది చంద్ర. “
“ఇక్కడ ఫంక్షనైపోగానే శశి దగ్గరకి వెళ్లాలి. వాళ్ల ఆడబడుచు పెళ్లి. వీళ్ళే కన్యాదానం చేస్తున్నారు. వెళ్లకపోతే బావుండదు”” అంది సత్యవతి.
“మాకూ కార్డు వేసారు. గ్రీటింగ్స్ పంపిస్తాను. రావడానికెక్కడ కుదురుతుంది? వెళ్లకపోయినా గుర్తుపెట్టుకునేవారెవరు?” అంది చంద్ర. చురుగ్గా చూసింది సత్యవతి. ఇది అక్కని చూసి అసూయపడుతోందా అన్న అనుమానం కలిగింది ఒక్క క్షణం. మళ్ళీ తనే సర్దుకుంది.
“పెళ్లికి నాన్న వెళ్తారు. నువ్వు మరో రెండు రోజులుండమ్మా!”” అంది చంద్ర .
“అక్కని చూసి చాలారోజులైందే. అతను దాన్ని మనింటికి పంపడు. వచ్చినా ఒక్కపూటో గంటో. అంతకన్నా వుండనివ్వడు. మనం వెళ్లినా వుండే పరిస్థితి కాదు. కనీసం చూస్తేనేనా తృప్తి” సత్యవతి గొంతు రుద్దమైంది. తల్లి బాధ చంద్రకి అర్థమైంది.
“ఊరుకోమ్మా! వాళ్లేం దాన్ని కష్టపెట్టటం లేదు. అదే కలవలేకపోతోంది. అది మరీ సెన్సిటివ్. అంతే” అంటూ వోదార్చి, ఎవరో పిలవడంతో వెళ్లిపోయింది.
పీటలమీద తాము పెట్టిన బట్టలు కట్టుకుని వచ్చి కాళ్లకి దణ్ణం పెట్టినప్పుడు చాలా సంతోషం కలిగింది శ్రీధర్‍కి. అనిర్వచనీయమైన సంతృప్తితో మనసంతా నిండిపోయింది. తల్లిదండ్రులకి తనూ బట్టలుపెట్టింది చంద్ర. ఎంతో యిష్టమైన నెమలికంఠం రంగుచీర చూసి సత్యవతికి సంతోషం కలిగింది . తనిల్లు, తన సంసారం, తన అభిరుచులు. అందులో ఎంత ఆశ, ఎంత ఆనందం ఇమిడివున్నాయి! మరో యింటికి వెళ్లి కొత్త వాతావరణంలోనూ కొత్త కుటుంబంలోనూ ఇమడాలన్న కారణంచేత ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని పుట్టినప్పట్నుంచీ కండిషన్ చేస్తూనే వుంటారు. ఇది నాకిష్టం అనేమాట ఆమె నోటమ్మట వస్తేచాలు, “నీ యిష్టాలన్నీ పెళ్లయ్యాక” అనేస్తారు. తనిల్లూ తన సంసారం అనే కలల్లోకి తోసేస్తారు. పెళ్ళయ్యాక అక్కడ అత్తవారు కూడా, “నీ యిష్టాలన్నీ మీ పుట్టింట్లో. ఇక్కడ నడవ్వు” అనేస్తే?
శశిది ఈ పరిస్థితి. చంద్రది దానికి భిన్నంగా వుంది. శశేనా చంద్రేనా మరో ఆడపిల్లేనా కోరుకునేదేంటీ? భర్త ఇంట్లో భాగస్వామ్యం, అతను తన అభిరుచుల్నీ, తన వాళ్లనీ గౌరవించడం.
చంద్రని చూస్తున్న కొద్దీ సత్యవతి మనసు బరువెక్కుతోంది. శశి గొంతు చేజేతులారా కోసామన్న భావం పిడిబాకులా గుండెల్ని కెలుకుతోంది. దాన్నీ యిలాంటి ఇంట్లో పడేస్తే సుఖంగా వుండేదన్న పశ్చాత్తాపం మనసు రగులుస్తోంది. ఇంత జరిగినా శ్రీధర్ మనసులో ఏ ఆలోచనవుందో ఆమెకి అంతు చిక్కడం లేదు.
ఆరాత్రే శశి దగ్గరకుబయల్దేరారు. అక్కచెల్లెళ్లిద్దరికీ మధ్య పదిగంటల రైలు ప్రయాణం.రాత్రి తొమ్మిది గంటలకి రైలెక్కితే ఉదయం ఏడైంది దిగేసరికి.
“స్నానం, టిఫెననీ కానిచ్చుకుని వెళ్దాం. అక్కడికెళ్తే కాఫీనీళ్లు తాగుతారా అని అడిగే దిక్కుకూడా వుండదు” అంది సత్యవతి అలసటగా. వరసగా రెండు ప్రయాణాలూ, ఆపైన చంద్ర ఇంట్లో ఫంక్షన్‍తో బాగా అలిసిపోయింది. శశిని చూడాలని మనసు పీకుతుంటే ఈ పెళ్లికి బయలైరిందేగానీ వాళ్లింటికి వెళ్లాలంటేనే అయిష్టంగా అనిపిస్తోంది. శ్రీధర్‍కి కోపం వచ్చింది.
“నీ నోట్లోంచీ వూడిపడింది శశి. ఇద్దరూ యిద్దరే! ఎవర్తోటీ కలవరు. వట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనుషులు” అన్నాడు నిరసనగా.
సత్యవతి అతనికి జవాబివ్వకుండా మౌనంగా వెయిటింగ్‍రూమ్‍కేసి దారితీసింది. అతను కోపంగా అనుసరించాడు. బ్రష్ చేసుకుని టిఫిన్ తిని కాఫీ తాగారు. అక్కడే స్నానం చేసాక సత్యవతికి ఫ్రెష్‍గా అనిపించింది. కూతురికీ అల్లుడికీ పెట్టాల్సిన బట్టలు, పెళ్లికూతురు గిఫ్ట్ ఇంకా ముఖ్యమైనవన్నీ జర్నీబేగ్‍లో సర్ది, సూటికేస్ క్లోక్‍రూంలో పెట్టి ఆటో ఎక్కారు.
ఊరిలోకెల్లా ఖరీదైన ఫంక్షన్‍హాల్లో పెళ్లి జరుగుతోంది. ఈవెంట్ మేనేజిమెంటుకి ఇచ్చినట్టున్నారు, ఒకేలాంటి చీరలు కట్టుకున్న అమ్మాయిలు చాలామంది కనిపిస్తున్నారు. పెళ్లిహాల్లో ఎవరెవరో సందడిగా తిరుగుతున్నారు. వాళ్ళలో ఎవరూ సత్యవతికి గుర్తులేదు. చాలామందిని కూతురి పెళ్ళిలో ఒక్కసారి చూసిందంతే. కొంతమందిని అసలే చూడలేదు. ఎవరూ పలకరించనేలేదు. పది నిముషాలదాకా వీళ్ళు వచ్చిన వార్తే అందలేదు శశికి. ఎవరో చెప్పగా విని పరిగెత్తు కొచ్చింది. తల్లి చేతుల్లో వాలిపోయింది.
“కులాసాయేనా శశీ?” గద్గదంగా అడిగింది సత్యవతి.”పాపేదే?” అంది.
“అదా? మేనత్తలతో వుంది” అని వూరుకుంది. ఆ పిల్లకి తల్లికన్నా అత్తల దగ్గరే చనువెక్కువ. శ్రీధర్‍కి కూడా కూతురిపట్ల ప్రేమ పొంగిపొర్లిందిగానీ బైటపడలేదు. ఆమె వంటినిండా వున్న నగలవీ చూస్తూ చంద్రని గుర్తు తెచ్చుకుని అనుకున్నాడు. ఇదెంత అదృష్టవంతురాలు? తన గుమస్తా ఉద్యోగానికి ఇంత గొప్ప సంబంధం తేగలదా? తన తాహతెంతో చంద్రని చూస్తే తెలుస్తునే వుంది!
“కాఫీ టిఫినూ చేద్దురుగాని పదండి నాన్నా!” అని శశి అంటూనే వుంది, “వదినా, నువ్విక్కడుంటే పెళ్లిపనులెలా నడుస్తాయి? పద పద, బ్యుటీషియన్ వచ్చింది. లైట్ టచ్ అప్ యిస్తానంది. లేకపోతే వీడియోలో బావుండవు” అంటూ ఒక ఆడబడుచు ఆమెని తీసుకెళ్లింది.
“మళ్ళీ వస్తానమ్మా!” అంటూ వెళ్లిపోయింది.
సత్యవతీ శ్రీధర్లే వెతుక్కుంటూ వెళ్లి వియ్యపురాలిని పలకరించారు. ఆవిడ పెళ్లికూతురికి కొన్న నగలూ చీరలూ వచ్చినవాళ్లకి చూపిస్తూ చాలా బిజీగా వుంది. క్లుప్తంగా వీళ్లకి బదులిచ్చి మళ్లీ తన పనిలో నిమగ్నమైంది. శ్రీధర్‍కి భార్య ఆవిడతో కొద్దిసేపు కబుర్లు చెప్తే బావుంటుందనిపించింది. పదిపాతికేసివేల ఖరీదైన పట్టుచీరలగురించీ లేటెస్టు నెక్లెస్ డిజైన్లగురించీ ఆమెకి కొంచెం కూడా తెలీదు. అందుకే అక్కణ్ణుంచీ అతన్తోపాటు వచ్చేసింది.
అల్లుడెక్కడున్నాడో!
ఆ తర్వాతేం చెయ్యాలో యిద్దరికీ అర్థంకాలేదు. ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు. అక్కడున్న వాతావరణం ఇబ్బందిగా వుంది. తొందరగా ముగించుకుని బైటపడితే బావుణ్ణనిపించింది ఎవరికి వాళ్లకే. శశికీ పాపం యిలాగే ఉంటుందేమో! అనుకుంది సత్యవతి దిగులుగా. ఇద్దరూ వెళ్లి మేరేజీ హాల్లో కూర్చున్నారు. శశి మళ్లీ కనిపించలేదు. ఎవరెవరో ముందునించీ వెళ్తున్నారు. చూసీ చూడనట్టు చూస్తున్నారు. పదిమందిమధ్యన నిలబడి ఏదో మాట్లాడుతూ శ్రీకాంత్ మధ్యలో ఒకసారి తళుక్కుమన్నాడు. అత్తమామల రాకని అతను గుర్తించలేదు. ముఖ్యమైనవాళ్లని రిసీవ్ చేసుకోవడంలో చాలా బిజీగా వున్నాడు.
ఇదంతా మధ్యతరగతికి భిన్నమైన ప్రపంచం. ప్రాథమిక అవసరాలు తీరిపోయిన వర్గం కాబట్టి డబ్బు సంపాదనే ప్రాథమిక అవసరంగా మారింది. సాఫల్యానికి సంకేతంగా మారింది. డబ్బుతోనే మనుషుల్ని కొలుస్తారు. అంచనా వేస్తారు. అందలం ఎక్కించాలో అగాధంలోకి తొయ్యాలో అక్కడిక్కడే నిర్ణయిస్తారు. ఇదంతా వారివారి అంతరంగాలోనే జరిగిపోతుంది. బైటికి కనిపించని ప్రక్రియ. కావాలని చేసినట్లు అనిపించకుండా వాళ్ల ప్రవర్తనలోనే సహజసిద్ధంగా యిమిడిపోయి వుంటుంది. ఆ ప్రవర్తనవలన వాళ్లలో వాళ్లకి ఎలాంటి సమస్యా వుండదు. ఆ సర్కిల్ బయటవున్నవారికి మాత్రం గిజగిజలాడిపోతుంది.
పెళ్ళికి చాలామంది వచ్చారు. పెద్దపెద్దవాళ్లు, ఒకళ్ళిద్దరు ఫిలిమ్ స్టార్లూ వచ్చారు. వీడియోగ్రాఫర్ల, ఫోటోగ్రాఫర్ల అట్టహాసం బాగావుంది. ప్రతి చిన్న ఘట్టమూ కెమెరా కళ్లలోంచి తప్పించుకోలేకపోతోంది. చదివింపులకి పెద్ద క్యూ. పెళ్లి వేదికమీదంతా జనం.
శ్రీధర్ సత్యవతి నెమ్మదిగా సందు చేసుకుని వెళ్ళి, పీటలమీద కూర్చున్నందుకు కూతురికీ అల్లుడికీ బట్టలు పెట్టి, పెళ్లికూతురికి కానుక ఇచ్చారు. శ్రీకాంత్ వీళ్ళని అప్పుడే చూసినట్టు పలకరింపుగా నవ్వాడు. మనవరాలు అక్కడ కనిపించింది. చేతులు చాపి ఎత్తుకునేలోపు, మళ్ళీ కనిపించకుండా పోయింది. వచ్చిన పని అయిపోయిందనిపించింది సత్యవతికి. కూతురితో మాట్లాడడానికి ఒక్క క్షణమైనా దొరికితే బావుండునని ఎంతో ఆశించింది. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పడానికికూడా ఎక్కడా సందు దొరకలేదు. ఎవరెవరో శశీ శ్రీకాంత్‍ల చుట్టూ ఉన్నారు. శశి భుజాన్ని తట్టి వెళ్తామని తలూపి, వియ్యపురాలిని కలిసి ఆవిడకీ చెప్పింది.
“భోజనం చేసారా? చేసి వెళ్లండి” ఆవిడ అంది.
బావుండదని భోజనాలవైపుకి వెళ్లారు. అప్పటికి బఫే మొదలైంది. తొడతొక్కిడిగా జనం. ఎలాగో తిన్నామనిపించి ఇద్దరూ మ్యారేజ్‍హాల్‍నుంచి ఇవతలకు వచ్చారు. వస్తుంటే ఆపి రిటర్న్ గిఫ్ట్ చేతిలో పెట్టింది ఒకమ్మాయి. గేటుదాకా వచ్చి సాగనంపిన చంద్రా, భాస్కర్ కళ్లముందు మెదిలారు శ్రీధర్‍కి. ఆహ్వానించబడని అతిథుల్లా యిక్కడికొచ్చి తిరిగి వెళ్లడంలో వున్న తేడా ఏదో మొదటిసారి అర్థమై గుండె కలుక్కుమంది. వాళ్లలో కలవలేకపోతోందని భార్యని ఎద్దేవాచేస్తూవచ్చాడు ఇంతకాలం. కానీ తనెందుకు కలవలేకపోయాడు? అల్లుడి వెంటవెంట తిరిగి అన్నీ ఎందుకు చూడలేకపోయాడు? కూతురు కూడా కలవలేక యిలాగే బాధపడుంటుందా? అతని కళ్లలో పల్చటి కన్నీటిపొర కదిలింది. అతని బాధని అర్థం చేసుకున్నట్టు సత్యవతి అతని ముంజేతిని తన చేత్తో పట్టుకుంది.
“ఇంత పెద్ద సంబంధం వద్దని ఆరోజే చెప్పాను. వాళ్లేమీ చెడ్డవాళ్ళు కారు. వాళ్లకి తగ్గట్టు వాళ్లు బతుకుతున్నారు. కానీ… ఆ స్థాయికి మనం ఎగరలేము. అక్కడికీ పెళ్లి చేసినప్పుడు ఒకసారి, యానాళ్ళకి వచ్చినప్పుడు స్టార్ హోటల్లో గదులు బుక్ చేసి ఇంకోసారీ ఎగిరాము. ఇంక ఎగరలేక చతికిలపడ్డాం. శశి? జీవితకాలమంతా ఎగిరే ప్రయత్నం చేస్తునే వుండాలి. చెయ్యలేక తల్లడిల్లుతోంది. మన స్థాయి కాని జీవితం కలిమైనా లేమైనా ఇనపచొక్కాలాంటిది. ఇప్పలేము, వుంచుకోలేము” అంది.