నాకొద్దీ అభ్యుదయం by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

అతనికోసం ఎదురుచూడటంలో రెండుగంటలు గడిచాయి. అప్రయత్నంగా వాచీ చూసుకున్నాను. తొమ్మిదిన్నరైంది. ఉదయకేసి చూశాను. తప్పుచేసినట్టు తలవంచుకుంది. చాలా నిరుత్సాహపడిందని గ్రహించాను.
“సారీ అన్నయ్యా! తప్పకుండా వస్తానని చెప్పాడు. ఎందుచేత రాలేదో! రేపు తనని తీసుకుని మీ ఇంటికి నేనే వస్తాను!”” అంది.
” ఏదైనా అనుకోని పని తగిలివుంటుంది. అతని అడ్రస్సివ్వు, నేను వెళ్లి కలుస్తాను!”” అన్నాను.
ఉదయ రాసిచ్చింది. అతని ఆఫీసు అడ్రసు.
“భోజనం చేసి వెళ్లకూడదూ?” లేస్తుంటే అడిగింది.
“రమ్య ఎదురు చూస్తూంటుంది!” అందామని నాలుక చివరిదాకా వచ్చిన మాటల్ని మింగేశాను. ఉదయకూడా భోజనం చెయ్యలేదు. నేను నాదారిన వెళ్లిపోతే ఇంక తినదు. ఆకలితో అలాగే ఉండిపోతుంది.
“ఐతే పెట్టు!” అన్నాను. తను కిచెన్లోకి వెళ్లింది.
నా ఆలోచనలు అతని చుట్టూ తిరుగుతున్నాయి. భాను ప్రకాశ్. పేరునిబట్టి మనిషిని ఊహించుకుందామని ప్రయత్నించాను. ఉదయ అతన్ని ప్రేమిస్తున్నాననీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననీ చెప్పింది. అతన్ని పరిచయం చేయయాటానికని ఏడున్నరకి ఇద్దర్నీ తన ఫ్లాట్‍కి ఆహ్వానించింది. నేను వచ్చానుగానీ, అతను రాలేదు. ఎందుకు? ఏం జరిగుంటుంది? కనీసం ఎందుకు రాలేదో ఫోన్ చేసి చెప్పాచ్చు. కావాలని తప్పించాడా? అదే నిజమనిపించింది నాకు. ఇలా అనుకోవటానికి కారణాలుందవు. మనసుకి అలా అనిపిస్తుందంతే.
సాధారణంగా ఇలాంటి వూళ్లలో ప్రేమవ్యవహారాలు దాగవు. ఏదో ఒక నోటినుంచీ పుకారుగా బయటపడతాయి. అలాంటిది ఉదయ తనంతట తానుగా చెప్పేదాకా ఈ విషయం నాకు తెలియలేదు. అంత రహస్యంగా ఎలా ఉంచగలిగారు? ఒక ఆడపిల్లా, మగవాడూ పదే పదే కలుసుకుంటే చనువు పెరిగి, ప్రేమకు దారితీస్తుంది. కలిసి తిరిగినందుకు రూమర్స్ రాకుండా ఉండవు. ఇంత సైలెంట్‍గా ఈ వ్యవహారం పెళ్లిదాకా ఎలా వచ్చింది? ఇందులో ఏదో తిరకాసుందనిపించింది.
“వడ్డించాను, రా అన్నయ్యా!” ఉదయ పిలుపుతో నా ఆలోచనలకు బ్రేకు పడింది. లేచి వెళ్లాను. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని నిశ్శబ్దంగా తింటున్నాము. ఒక విధమైన ఉదాసీన వాతావరణం మామధ్య చోటుచేసుకుంది. వంటకాలు చాలా రుచిగా ఉన్నా మస్తిష్కంలోని ఆలోచనలచేత నాలుక వాటి రుచిని గుర్తించలేకపోతోంది
“ఏవైనా కబుర్లు చెప్పన్నయ్యా!”” నిశ్శబ్దాన్ని భరించలేక అనుకుంటా, చిన్నపిల్లలా అడిగింది.
’”ఈ వారంలో నేను పర్కాలవైపు కేంప్‍కి వెళ్లాలి. బహుశాః నాలుగైదురోజులు పడుతుందేమో తిరిగి రావడానికి!”” అన్నాను.
“ “రమ్య ఒక్కర్తీ ఏం ఉంటుందీ? వెళ్తూ వెళ్తూ ఇక్కడ డ్రాప్ చెయ్యకూడదూ?”అడిగింది. రమ్య నా భార్య.
“వాళ్లింటికి వెళ్తుందట. పది రోజులు లీవ్ పెట్టింది. బాగా వీక్‍గా ఉంది. రెస్ట్
తీసుకుంటే బావుంటుందని…!”” సందిగ్ధంగా ఆగిపోయాను.
“ఏమిటి అనారోగ్యం?” ఆతృతగా అడిగింది.
ఈ విషయాలు ఉదయతో చర్చించాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. తను నా స్వంత చెల్లెలు కాదు. చిన్నాన్న కూతురు. నాకన్నా రెండేళ్లు చిన్నది. నా భార్యకన్నా నాలుగేళ్లు పెద్దది. జాబ్ చేసుకుంటూ స్వతంత్రంగా ఉంటోంది. తను ఈ ఊరొచ్చి దాదాపు మూడేళ్లయింది. అంతకుముందు మామధ్య ఓ మోస్తరు పరిచయం ఉండేది. అది తను ఈ ఊరొచ్చాక బలపడింది. తనకి ఏ సమస్య వచ్చినా నాతో చెప్తుంది. నా అభిప్రాయాలని పూర్తిగా మన్నిస్తుందని నేననుకోనుగానీ, మనవాళ్లకి చెప్పుకోవటంద్వారా పొందే రిలీఫ్‍ని తను నాద్వారా పొందుతుంది. ఇప్పుడు తన ప్రశ్నకి జవాబు చెప్పటం ఇబ్బందిపూర్వకమైన విషయమే. ఎందుకంటే రమ్యకి నాలుగో నెల.
“ఏమీ లేదు, జనరల్ వీక్నెస్!” క్లుప్తంగా అన్నాను అసలు విషయం దాచిపెట్టి. వీధిలో వినిపించే పెళ్లి బాజాలకే అప్పెటౌతూంటుంది ఉదయ. అలాంటిది ఈ విషయం తనలో ఎంత సంచలనం రేపుతుందో ఊహించగలు. ఐతే అది జెలసీ మాత్రం కాదు. గుండెలోతుల్లోంచీ ఎగదన్నుకొచ్చే ఆవేదన, తీరని ఆశాభంగం.
“ “రాగానే అతన్ని కలుస్తాను!” చెయ్యి కడుక్కుంటూ అన్నాను. ఉదయ టవల్ తెచ్చిచ్చింది. ఏదో చెప్పాలని నా ముఖంలోకి చూసి ఆగిపోయింది.
“రమ్యని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమను. వాళ్లకి ఆఫీసులో వర్క్ బాగా ఉంటుందట. ఇంటిపనుల్లో నువ్వు కొంచెం సాయం చెయ్యకూడదూ?” అంది. అదంత తటపటాయించి చెప్పే విషయం కాదే? ఏదో చెప్పాలనుంది తనకి. మనసుకీ, వాక్కుకీ మధ్యనున్న ఇనుపతెర.
నావెంట బయట స్కూటర్ దాకా వచ్చింది. “ఈ విషయం మా నాన్నకి తెలియనీకు!” చీకట్లో తన గొంతు వణింకింది
“ఉదయా!” విస్మయంగా అన్నాను.
“జరిగినవన్నీ నాకు తెలుసు. వచ్చిన ప్రతి సంబంధాన్నీ నాన్నే చెడగొట్టాడు. నా సంపాదన కావాలి ఆయనకి. ఈ విషయాలన్నీ నాకు తెలిశాక… వాళ్లకి దూరంగా ట్రాన్సఫర్ చేయించుకుని ఇప్పటికి ప్రశాంతంగా బతుకుతున్నాను. నాకు… నాక్కూడా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనుంది. పెళ్లి చేసుకోకూడనంత తప్పు పని నేనేం చెయ్యలేదుగా?” తన కళ్లల్లో తడి మెరవటాన్ని నేను స్పష్టంగా చూశాను. తనెందుకంత ముభావంగా ఉంటుందో అర్ధమైంది. తల్లిదండ్రుల దగ్గరే దొరకని ప్రేమ బయటివాళ్ల దగ్గర ఎలా దొరుకుతుందని ఆశించి అనుబంధాలు పెంచుకుంటుంది?
ఉదయ తల్లి అమ్మకి కజిన్. ఉదయ తండ్రిగురించి బంధువులందరికీ తెలుసు. స్థిరుడు కాదు. ఏ వుద్యోగం నిలకడగా చెయ్యడు. దమ్మిడీ సంపాదన లేదు. ఉదయకి వుద్యోగం వచ్చేదాకా అసలు ఎలా బతికారో, ఏం తిన్నారో కూడా ఎవరికీ తెలీదు. తనకి వుద్యోగం వచ్చేకే నలుగుర్లోకీ వాళ్ళూ వచ్చినది.
ఆ తర్వాత?
ఉదయ చక్కగా వుంటుంది. ఆపైన గవర్నమెంటు వుద్యోగం. చాలా సంబంధాలొచ్చాయి. కట్నం అక్కర్లేదని ముందుకి వచ్చినవాళ్ళు వున్నారు. ఉదయ తల్లిదండ్రులు చాలా షరతులు పెట్టేవారు. కూతురు తమతోనే వుంటుందని, కష్టపడి పెంచారుకాబట్టి తమ పోషణాభారం ఆమెదేననీ, ఆమె జీతం మీద హక్కు తమదేననీ … ఇలా వుండేవి ఆ షరతులు. అవి చూసి అందరూ తిరిగిపోయేవారు. ఒకరకంగా చెప్పాలంటే అలా చేసి సంబంధాలు రాకుండా ఆయనే జాగ్రత్తపడేవాడు.
మొదట్లో అంటే ఉదయ చిన్నపిల్ల. ఏమీ తెలుసుకునేది కాదు. తరువాత క్రమంగా అర్థమయ్యాయి. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ సంబంధం తనే వెతుక్కుంది.
“జరిగిందేదో జరిగిపోయింది. ఇకమీదట అంతా మంచే జరుగుతుంది. రాగానే వెళ్లి అతన్ని కలిసి అన్నీ మాట్లాడతాను. నువ్వేం వర్రీ అవకు. బై. గుడ్ నైట్!” అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేశాను. దాదాపు పది నిముషాలు పట్టింది ఇల్లు చేరడానికి.
భోజనం చెయ్యకుండా నా కోసం ఎదురుచూస్తోంది రమ్య.
“ఇంత లేటైందేం? రండి, అన్నం పెట్టేస్తాను. నాకు ఆకలి దంచేస్తోంది!” అంది నన్ను చూడగానే.
“ఇంత రాత్రిదాకా తినకుండా ఎందుకు కూర్చున్నావు? లేటవుతుందేమోనని కూడా చెప్పనుకదా!” కోప్పడ్డాను మెత్తగా.
“ఒక్కదానికీ తినాలనిపించలేదు.”
“నా భోజనం అయిపోయింది. ఉదయ ఇంట్లో తిన్నాను. నువ్వు పద. తింటూ అన్నీ మాట్లాడుకుందాం” అన్నాను. తను లోపలకి వెళ్లిపోయింది. నేను బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లాను. ఒక కంచం పెట్టి అందులో పదార్థాలన్నీ వడ్డించాను. ఇంతలో తను అప్పడాలు వేయించి తెచ్చి కంచం ముందు కూర్చుంది.
“ఇలా ఎప్పుడూ చెయ్యకు, రమ్యా! బయటకు వెళ్లాక ఒక్కొక్కసారి మనం అనుకున్నట్లు ఉండదు!” గిల్టీగా అనిపించి మరోసారి మందలించాను.
“అతన్ని చూశారా? ఎలా ఉన్నాడు?” కుతూహలంగా అడిగింది భానుప్రకాష్ గురించి.
“అతను రాలేదు!” అన్నాను.
“అదేమిటీ?” తెల్లబోయి నమ్మలేనట్టు అడిగింది.
“కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ఉదయతో నేనింకాఅనలేదు కానీ, కావాలనే రాలేదేమోననిపిస్తోంది! పాపం చాలా డిసప్పాయింటైంది ” అన్నాను.
“పెళ్లి చేసుకోవాలని ఆమెకి చాలా ఉంది.”
“తప్పా మరి?”“
“తప్పెందుకవుతుంది? మీ మగవారి వైఖరి పెళ్లి విషయంలో ఏమిటోగానీ, అడవాళ్లకిమాత్రం కష్టం సుఖం పట్టించుకునే మనిషాస్తాడని సంతోషం. ఇంత లేటైనా ఇంకా మీరు రాలేదని నేను కంగారుపడుతూ కూర్చున్నాను. ఆకలితో ఉన్నానని మీరొచ్చి నాకోసం బాధపడ్డారు. అంటే తోడూ నీడా అన్నమాట” అంది.
పెళ్లి గురించి ఎంత బాగా చెప్పింది రమ్య! పెళ్లంటే ఒకళ్లకోసం ఒకళ్లు ఆలోచించుకోవటం, ఒకళ్లనొకళ్లు అర్ధం చేసుకుని ఆరాటపడటమన్నమాట.
“వదినకి మీ వయసుంటుందా? చదువుకుంది. జాబ్ చేస్తోంది. అనాకారి కాదు. అసలింతదాకా పెళ్లెందుకవలేదు? మీ బాబాయిగారు పట్టించుకోరెందుకని?” అడిగింది. ఈ విషయాలు మేం ఎప్పుడూ చర్చించుకోలేదు. అలాంటి సందర్భం ఇంకా రాలేదు.
“నాకన్నా చిన్నది. ఉద్యోగం కొంతమంది ఆడవాళ్లకి శాపం. ఆ కొద్దిమందిలో తనూ ఉంది”
“అంటే?!”
“అంతే!”
నేను నాలుగు రోజులనుకున్నది పరకాలలో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. ఊరునుంచి తిరిగి వచ్చి ఇంటి తాళం తీస్తుంటే ఎలాగో అనిపించింది. రమ్య లేని ఇల్లు ఖాళీగా, కళావిహీనంగా కనిపించింది. మా పెళ్ళై రెండేళ్లైందంతే. అప్పుడే మా ఇద్దరిమధ్యా ఎంత అనుబంధం పెరిగింది! ఈ పాటికి తనక్కడ నా కోసం బెంగపెట్టుకుని ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తానని గొడవచేస్తూంటుందేమో బహుశా! నా ఇల్లూ, నావాళ్లూ! ఎంత అందమైన భావన అది! ఇల్లంటే నాలుగ్గోడలు కాదు. మనం నిష్క్రమిస్తే చైతన్యరహితమై, మన పునరాగమనంతో మళ్లీ ఉత్తేజాన్ని పుంజుకునే పరిసరాలు. అలాంటి పరిసరాలతో మమేకం చెందే మనుషులు! ఇలాంటి అనుబంధం భార్యాభర్తలు పిల్లల మధ్యనే సాధ్యపడుతుంది.
నాకు ఇలా ఆలోచిస్తుంటే ఉదయ గుర్తొచ్చింది. ముప్పయ్యేళ్ల ఉదయ… పదేళ్ల సర్వీసూ, ఆరువేల జీతం ఉన్న ఉదయ… పాపం, ఒంటరితనంతో ఒంటరిగా దశాబ్దంగా పోరాడుతోంది.
భానుప్రకాశ్‍కి ఫోన్ చెయ్యాలి. టైమ్ చూసుకున్నాను. ఐదు కావటానికి చాలా వ్యవధి ఉంది. ఫోన్ చేసి, అతనుంటే వస్తానని చెప్పటానికి సరిపడా టైముంది. మాకింకా ఫోన్ రాలేదు. ఇంటెదురుగా పబ్లిక్ బూత్ ఉంది. అక్కణ్ణుంచి అతని ఆఫీసుకి రింగ్ చేశాను. ఎవరో ఎత్తారు. అతను లేడట. లీవు పెట్టాడట. మామగారు పోతే, భార్యాపిల్లల్ని తీసుకుని ఊరెళ్ళాడట. పెద్దగా షాక్ అనిపించలేదు. ఇలా జరక్కుండా ఉంటే బావుండేదని మాత్రం అనుకున్నాను.
ఇప్పుడున్న సమస్యల్లా ఒక్కటే ఉదయనెలా ఫేస్‍చెయ్యాలి? అది రెండు వైపులా పడుసున్న కత్తిలా నాలోకి దిగబడి తన ప్రతాపాన్ని చూపించసాగింది. అతనికి పెళ్లయిన విషయం ఉదయకి ముందే తెలుసా? తెలిసే రెండో భార్యగా ఎడ్జస్టయిపోదామనుకుందా? ఉద్యోగం చేస్తూ ఆడవాళ్లు ఏదైనా సాధించారేమో నాకు తెలియదు కానీ, కొన్ని కొత్త సమస్యలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి అనే చట్రంలో ఇమడలేకపోతున్నారు. స్వతంత్రంగా బతకడానికి అలవాటుపడి, పెళ్లి చేసుకోవటం ద్వారా వచ్చి పడే బాధ్యతలకి భయపడుతున్నారు. ఉదయకిలాగే ఏవో కారణాలచేత పెళ్లవని వాళ్లు కొందరు. ఇలాంటివాళ్లలో చాలామంది వివాహితుణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారట. ”ద్వితీయం అనేది తమ సమస్యలకి ప్రత్యామ్నాయ పరిష్కారంగా భావిస్తున్నారు. అలాంటి కొందర్లో ఉదయకూడా ఉందా? లేక తనకి తెలియదా?
నా ఆలోచనలు ఎటూ తేలక ఉదయని కలవటాన్ని రెండు రోజులు వాయిదా వేశాను. ఇంతలో తనే ఫోన్ చేసింది రమ్మని. వెళ్లాను. నేను వెళ్లేసరికి వంటింట్లో ఉంది.
“కూర్చో, వచ్చేస్తున్నాను!”” అక్కణ్ణుంచే చెప్పింది.
నేను సోఫాలో కూర్చుని టీపాయ్ మీద పేపరు తిరగేయసాగాను. ఈ విషయం ఎలా ప్రస్తావించాలా అనే ఆలోచన నా బుర్రని తినేస్తోంది. ఇంతలో మృదువైన అడుగుల చప్పుడికి తల తిప్పాను. తనే! తెల్లటి దుస్తుల్లో ఉంది. ఆ బట్టలు ఆమె తనకై తను తీసుకున్న ఏదో నిర్ణయాన్ని చూచాయగా తెలియజేస్తున్నాయి.
“ఎప్పుడొచ్చావన్నయ్యా ఊర్నుంచీ?” తనూ కూర్చుంటూ అడిగింది.
“మొన్న”
“రమ్య కులాసాయా? వాళ్లమ్మగారింటినుంచీ తిరిగొచ్చిందా?”
“ఇంకా లేదు”
ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నేనేదీ అడిగే అవకాశం ఇవ్వకుండా జవాబు మాత్రమే చెప్పించుకుంటోంది. అది తనలో చెలరేగే సంఘర్షణని అణచిపెట్టుకునే ప్రయత్నమని నేను గ్రహించేలోపుగా తనే బరస్టయింది.
బ్రహ్మకుమారీ దీక్ష తీసుకుందామనుకుంటున్నాను””అంది. ఒక మంచుతరంగం నా నిలువెల్లా పాకినిట్టయింది. ఈ ఆశ్రమం గురించి నాకు కొద్దిగా తెలుసు. దీక్ష తీసుకున్నవాళ్లు సాంసారికసుఖాలకీ, పెళ్లికీ దూరంగా ఉంటారు. వాళ్ల సిద్ధాంతాలు వైదిక సిద్ధాంతాలకి కొంచెం భిన్నంగా ఉంటాయి. అద్వైతానికీ దూరంగానే ఉంటాయి.
“అదేమిటి ఉదయా?”” అన్నాను ఇంకేమనాలో తోచక.
ఆరోజు వస్తానని భానుప్రకాశ్ రాకపోయేసరికి వాళ్లాఫీసుకి ఫోన్ చేశాను. నాన్నని దృష్టిలో ఉంచుకుని మా అఫైర్ సీక్రెట్‍గా ఉంచమని కోరినది నేనే కాబట్టి అతను జాగ్రత్తలేమీ తీసుకోలేదు. ఆ ఒక్క ఫోన్ కాల్‍తో అతని వ్యవహారం అంతా బయటకొచ్చింది”
“అందుకే కాంప్నుంచీ రాగానే నిన్ను కలవలేకపోయినది. నేనూ అతనికోసం ఫోన్ చేశాను”
“ఈ ఊరొచ్చినప్పట్నుంచీ ఏది చేసినా నీకు చెప్పి చేస్తున్నాను. ఈ విషయంలోకి కూడా నిన్ను తీసుకొచ్చాను. అందుకే నీకు నా నిర్ణయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది”
“నిర్ణయించుకున్నాకా, చెప్పటం?
“ఇల్లు, పెళ్లి, పిల్లలూ అనే వ్యవహారాల్లోకి తల దూరిస్తే ఒక మగవాడి సాహచర్యం అనివార్యమవుతోంది. మగవాడంటే ఎవరు? నిలువెత్తు స్వార్థపు ముద్ద. జనరల్‍గా చెప్తున్నాను”
“సరే గానీ, ఈ నిర్ణయం ఏమిటి?“
“అదే చెప్పబోతున్నాను… తనకెలాంటి స్వార్ధమూ లేనట్టూ మరొకరికోనం
పాటుపడుతున్నట్టూ కనిపించడానికి భార్యా పిల్లలనే కవచం వేసుకుంటాడు. ఆ కవచంలో తను క్షేమంగా ఉంటాడు”
“అందరూ అలాగే ఉంటారా ఉదయా?”” అడిగానుగానీ, నా ప్రశ్న నాకే అసంబద్ధంగా అనిపించింది. ఉదయ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని తీసుకున్న ఇద్దరు మగవాళ్ళు… ఒకరు తండ్రి, మరొకరు ఈ భానుప్రకాశ్… స్వార్థాన్నే చిలికించారు. అలాంటప్పుడు ఆమె అభిప్రాయంలో తప్పు లేదు. తను నా ప్రశ్నని పట్టించుకోలేదు.
“నాన్న గురించి నీకు తెలుసు. బాధ్యతలేని మనిషి. ఏ వుద్యోగమూ నిలకడగా చెయ్యలేదు. ఇప్పటికీ కూడా చెయ్యడు. కుటుంబాన్ని నడపడానికి అమ్మ చాలా ఇబ్బందులు పడింది. ఆవిడ కష్టాలు తీర్చడానికన్నట్టుగా నేను చదువుకుని ఉద్యోగం వెతుక్కున్నాను. మంచి వుద్యోగమే. గవర్నమెంటుది. నాన్నలో స్వార్థం మొదలైంది. అమ్మలోకూడా. నాకు పెళ్ళి చెయ్యాలని వాళ్ళకి లేదు. నా నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలని భానుప్రకాశ్లో కోరిక కలిగింది. అతను నాతో తను విడోయర్ననీ, పిల్లలు లేరనీ చెప్పాడు”
“ఎంత ధైర్యం?”
“అలా నావైపు నుంచి అడిగేవాళ్లు లేరనే అతని ధైర్యం. నిన్ను పరిచయం చేస్తాననగానే తోక ముడిచేశాడు. కానీ, అన్నయ్యా! నాకు చదువూ, వుద్యోగం లేవనుకో, నాన్న తినో, తినకో ఇంత మిగిల్చి నాకు పెళ్లిచేసి పంపించేసేవాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైనా అతనేం చేసినా అదే సంతోషం అనుకుంటూ గడిపేసేదాన్ని”
“పెళ్ళే సుఖాలకి నిర్వచనమా, ఉదయా? పెళ్ళయ్యి కష్టాలు పడుతున్నవాళ్లు ఉన్నారు కదమ్మా!”
“కష్టం, సుఖం, లేక సంతోషం… ఇవి మనిషి అనుభవానికీ వాటినుంచీ వచ్చిన జ్ఞానానికీ, జీవనసరళికీ సంబంధించినవి. పూట గడవటమే కష్టంగా ఉన్నవాడికి పట్టెడన్నం సునాయాసంగా దొరకడం సుఖం. నెహ్రూలాంటి స్కాలర్స్‌కి పుస్తకం చదవలేకపోవటం అనేది సంభవిస్తే దాన్ని మించిన కష్టం మరొకటి ఉంటుందనుకోను. ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్యాయం కూడా న్యాయబద్ధంగానే కనిపిస్తుంది. ఒకవేళ అన్యాయంలాగే తోచినా ఖర్మ అని సరిపెట్టుకుంటారు. ఇప్పటి ఆడవాళ్లు చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా మగవాడి స్వార్ధానికి రకరకాలుగా బలైపోతున్నారు. అలా బలైపోతున్నామని తెలిసీ ఏమీ చెయ్యలేకపోతున్నారు”
“చెప్పు, ఉదయా! ఇన్ని తెలిసినదానివి నిన్ను నువ్విలా శిక్షించుకోవటమేమిటి?”
“ఇది శిక్షించుకోవటమెలా అవుతుంది? పెళ్లి చేసుకోకూడనంత పెద్ద తప్పు నేనేం చేశానని ఆరోజు చీకట్లో నిన్నడిగాను. అమ్మ-నేను, భానుప్రకాశ్ భార్యాపిల్లల కోణంలోంచి ఆలోచిస్తే దానంత పెద్ద తప్పు మరొకటి లేదనిపిస్తోంది. మగవాడితో ప్రవేయం లేని జీవితాన్ని… అర్ధవంతంగా గడపాలనుకుంటున్నాను”
నన్ను నేను శోధించుకున్నాను. ఎందుకంటే, నేనూ మగవాడినే. నాలో కూడా ఎక్కడో ఒకచోట స్వార్థం ఉండే ఉంటుందా? పెళ్లి చేసుకున్నప్పటినుంచీ రమ్యకి సానుకూలంగానే ఉంటున్నాను. తనని ప్రేమగానే చూసుకుంటున్నాను. పెళ్లి… రమ్య… తిరకాసేదో ఇక్కడే ఉందనిపించింది. నాకు కావాల్సినంత కట్నం తెచ్చింది కాబట్టి రమ్యని నేను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే నా భార్య స్థానంలో మరో ఆడపిల్ల ఉండేది. నెలనెలా జీతం తెచ్చి నా చేతికిస్తూ నా అవసరాలు చూస్తోంది. అంటే నా అనుబంధం భార్యస్థానంతోనూ డబ్బుతోనేగానీ, ఆ స్థానంలోని వ్యక్తితో కాదు.
ఉదయ అన్నట్టు కష్టసుఖాలు జీవనసరళికీ, మనోవికాసానికీ చెందినవి. నేనుగానీ, రమ్యగానీ మరో భార్యాభర్తలుగానీ ఒకరినొకరు ప్రేమించటం అనేది ఇలానే నేర్చుకున్నాం. అదే ప్రేమ,అన్యోన్యత అనుకుంటున్నాం. ఇది తప్పని తెలియదు కాబట్టి టేకెన్ ఫర్ గ్రాంటెండ్‍గా భావించాను.
నేను ఆలోచనలో నిమగ్నమై ఉండటం చూసి తనే మళ్లి అంది ఉదయ “నా సమస్యకి ఇది పరిష్కారంగా భావించటంలేదు. కానీ… నాకు అందరికీ దూరంగా వుండాలనుంది. వేరే ఆలోచనల్లో… వేరే జీవనమార్గంలో… డబ్బు సంపాదించగలగటమే ఆడవాళ్లు సాధించిన అభ్యుదయమైతే అలాంటి అభ్యుదయం నా కొద్దు. ఎవరికో సంపాదనా యంత్రాన్ని కాలేను.నా జీతమే, నాలోని ప్రేమాస్పదమైన అంశమని అనుకునే మనుషుల్ని నేను ప్రేమించలేను. నా జీతాన్ని వాళ్ళకి హక్కుగా ఇవ్వను. నాచేత సాయం పొందేవాళ్ళలో వాళ్ళూ ఒకరౌతారు”
ఉదయ నిర్ణయంలోని మంచి చెడులు నిర్ణయించే స్థానంలో నేను లేను. ఆ అర్హత నాకు లేదేమో! కానీ ఒక ప్రశ్న. అభిమానం దెబ్బతిన్న ప్రతి స్త్రీ ప్రత్యామ్నాయ సమాజాన్ని వెతుక్కుంటే?
నేను లేచి నిలబడ్డాను. “నేను నీనుంచి ఏదీ ఆశించలేదు. స్నేహాన్ని మాత్రమే పొందాను. మరోసారి నీ నిర్ణయాన్నిగురించి ఆలోచించుకో. నిర్ణయం మార్చుకుంటే నీకోసం ఏం చెయ్యగలనో నాకు తెలీదు. కానీ ప్రయత్నం చెయ్యగలిగే అవకాశం ఇంకా మిగిలి వుంతుంది. అన్నగానో, స్నేహితుడిగానో నన్ను గుర్తుపెట్టుకో. ఏ అవసరం వచ్చినా ఏది కష్టమనిపించినా నాతో చెప్పుకోవడం మానకు!” అన్నాను.
ఉదయ చిరునవ్వు నవ్వింది. అది బాధాపరితాపాలచేత ప్రక్షాళనమైన, స్వచ్చమైన నవ్వు.
(ఆంధ్రప్రభ, 8 మే 2000, గూడు కథాసంపుటి)