నాన్నారి చిన్నతనం – ఎ రాస్కిన్ , తెలుగు అనువాదం – ఆర్వీయార్
పరిచయం – యస్. శ్రీదేవి

అలెగ్జాండర్ బొరిసొవిచ్ రాస్కిన్ రష్యను రచయిత. అతని జీవితకాలం 1914-1971. When Daddy Was A Little Boy అనే ఈ పుస్తకం 1968లో Как папа учился в школе పేరుతో రష్యనులో ప్రచురించబడింది.
Fainna glagoleva 1973లో ఇంగ్లీషులోకి అనువదించాడు.
దీనిని ఆర్వీయార్‍గా పరిచితులైన ఆర్ వేంకటేశ్వర్రావుగారు 2012లో దీనిని తెలుగులోకి అనువదించారు. రాదుగ సంస్థ ప్రచురించింది. అప్పటి వెల రూ60/-
1991లో సోవియట్ యూనియన్ పతనమయేవరకూ రష్యను కథల పుస్తకాలు లేని యిల్లు లేదంటె అతిశయోక్తి కాదు. ఒక ప్రత్యేకమైన శైలి, భాష, ఆకట్టుకునే బొమ్మలతో ఎన్నో పుస్తకాలు విశాలంధ్రవారి పుస్తకాలయాలలో దొరికేవి. తరువాతకూడా అంత విస్తృతంగా కాకపోయినా, రాదుగావారి ప్రచురణలు లభిస్తున్నాయి.
ప్రతి వ్యక్తికీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళుగానే పరిచయమౌతారు. ఆ పెద్దవాళ్ళ బాల్యాన్ని గురించి తెలుసుకోవటం ఒక అద్భుతమైన విషయం. రచయిత కూతురికి విపరీతమైన చెవినొప్పి, గొంతువాపు, ఇన్ఫ్లుయెంజా జ్వరం వచ్చి నిద్రపట్టక రాత్రివేళ బాధపడుతూ వుంటుంది. విపరీతంగా ఏడుస్తుంది. ఆమెని మరిపించడానికి తన బాల్యంలోని కొన్ని సంఘటనలు చెప్తాడు. తర్వాత ఆ పాప చెవిపోటు వచ్చినప్పుడల్లా ఆ అనుభవాలని చెప్పమని అడుగుతూ వుంటుంది. తన చిన్నప్పటి వినోదవిషయాలతోపాటు స్నేహితుల విషయాలుకూడా చెప్తాడు. ఇందులో వున్నవన్నీ నాన్నల చిన్నప్పటి విశేషాలు కాబట్టి పిల్లలందరికోసం పుస్తకరుపంలో తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 28 కథలున్నాయి. నాన్న తోటిపిల్లల అసూయమాటలు విని అమాయకంగా కారు కిందికి బంతి విసిరెయ్యడంతో మొదలై ఐదుకాళ్ళ స్టూలు తయారుచెయ్యడంతో ముగుస్తుంది. నాన్న సంగీతం నేర్చుకోవటం, కుక్కని మచ్చిక చెయ్యటం, నాన్న కొక్కిరిబిక్కిరి రాత, పిల్లలకి సహజాతమైన ఎన్నో విషయాలని రచయిత చెప్తూ వుంటే చక్కటి హాస్యం ఫక్కుమని నవ్విస్తుంది.