పార్థివం by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

(ఇది 2000 సంవత్సరానికి ముందు రాసిన కథ)

“ఆత్మలు ఎక్కడో పెట్టుకుని భౌతికంగా మాత్రమే మనం బతుకుతున్నాము. ముంబైలో ఉన్నప్పుడు నాకు కలిగే సంతోషం అమెరికాలో దొరకదు. మా ఊర్లో ఉండే ఆనందం నాకు ముంబైలో ఎప్పుడూ కలగదు. అయినా నాకు ముంబైలో ఉండకా తప్పదు, ఏడాదికో ఆరునెలలకో అమెరికా వెళ్లకా తప్పట్లేదు” అన్నాడు సూర్యనారాయణ తనని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‍పోర్ట్ కి వచ్చిన కూతురితో. మనోజ్ఞ చిరునవ్వు నవ్వింది.
జెనెటిక్స్‌మీద జరిగిన ఒక సెమినార్‍కి వెళ్లి వస్తున్నాడతను. ఉండేది ముంబైలో. సైంటిస్టు. భార్య అక్కడే డాక్టరు.
మనోజ్ఞే డ్రైవ్ చేసింది. దాదాపు గంట పట్టింది ఇల్లు చేరడానికి. ముంబైలో దూరాలు తక్కువగానీ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. ఇంటికి రాగానే అతనిలో కొత్త ఊపిరేదో నిండినట్టయింది. తన ఇల్లు… తను ఎప్పుడూ పడుకునే గది… కూర్చుని పేపరు చదువుకునే సిట్ అవుట్… అన్నీ ప్రియాతి ప్రియమైనవిగా అనిపించాయి. ఆ వెంటనే తల్లిని చూసి రావాలని కూడా అనిపించింది. ఆవిడ అక్కడెక్కడో వరంగల్ జిల్లాలోని చిన్న పల్లెటూర్లో ఉంటుంది.
” నా ఊరు… నా చిన్నతనమంతా అందంగా గడిపిన ఊరు… అప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. చాలా సరదాగా ఉండేవి ఆ రోజులు” అంటాడు గుర్తు తెచ్చుకుని పరవశంగా.
” బాల్యం కాబట్టి…” అని జవాబిస్తుంది సత్యవతి, ఆ రోజులు అంత అందంగా ఉండటానికి కారణం వెతికి పట్టుకుని.
నిజమే! బతుకు బరువు ఎరుగని బాల్యం. స్నేహితులతో ఆటపాటల మధ్య చదువు, వ్యవసాయ బావుల్లో ఈతలు… ఆ పల్లెటూళ్లోనే హైస్కూలు దాకా చదువు. తర్వాత వరంగల్లో ఎమ్మెస్సీ… పవాయ్‍లో పిహెచ్‍డి… అక్కడే ఉద్యోగం ఇక ఆపైన ముంబైలో నివాసం. తన వూళ్ళోనే చదువు, వుద్యోగం ఎందుకు సాధ్యపడవు? ఆ ప్రశ్న అడిగితే పల్లెటూళ్లలో ఎదుగుదల వుండదనే స్పష్టమైన జవాబు వస్తుంది. మూలప్రశ్న మాత్రం అలాగే వుంటుంది. అభివృద్ది పట్టణాల్లోనే పోగుపడింది.
ఎన్నో మార్పులు జీవితంలో. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తన చదువుకి ఖర్చయింది కాగా కొద్దిపాటి పొలంతో తల్లి మిగిలింది. అది అమ్మేసి తన దగ్గరికి వచ్చెయ్యమన్నాడు. ఆవిడ రాలేదు. తెంచుకోలేని అనుబంధాలు ఆవిడకి అక్కడ. వాటిని వదులుకోలేదు. అందుకని తనే వెళ్లి చూసి వస్తుంటాడు తోచినప్పుడల్లా.
ఆ పల్లెటూరు వెళ్లడమనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సత్యవతికి. ఏముంది అక్కడ? దేనికోసం వెళ్లాలి? ఈ ప్రశ్నలకి జవాబు దొరకదు. పెళ్లయిన ఇన్నేళ్లలో ఏ నాలుగైదుమాట్లో వెళ్లి ఉంటుంది. కాలం ఆగిపోయినట్టు ఉంటుంది అక్కడ. ఎప్పుడెప్పుడు తిరిగొచ్చేద్దామా అనిపిస్తుంది. మళ్లీ రావాలనిపించదు. కానీ వద్దని భర్తకు ఎలా చెప్తుంది? ఆ డిప్లమసీ వల్లనే జెట్‍లాగ్ వదిలీవదలకుండానే ప్రయాణమైతే కాదనలేకపోయింది.
” నేనూ మీతో రానా, నాన్నా?” మనోజ్ఞ అడిగింది. భార్యాభర్తలిద్దర్లో ఆశ్చర్యం. ఒకరి ఆశ్చర్యంలో సంతోషం ఉంటే మరొకరిది అయిష్టతని సూచిస్తోంది.
“పెద్దయ్యాక నేనెప్పుడూ అక్కడికి రాలేదు. నాకు ఆ ఊరూ, అక్కడి ఇల్లూ చూడాలని ఉంది. బామ్మని కూడా”” అంది మనోజ్ఞ.
సూర్యనారాయణ ముందు ఏమీ అనలేక అతడి పరోక్షంలో ఆ పిల్లని అనేక విధాల భయపెట్టింది సత్యవతి, ప్రయాణం మానేస్తుందని.
” అక్కడ నీవయసు పిల్లలు ఎవరూ ఉండరు. తోచదు”
” కొద్దిరోజులేకదమ్మా?”
” బామ్మకి టీవీ కూడా లేదు. పనులు చేసుకుంటూ , పుస్తకాలు చదువుకుంటూ, పద్యాలూ పాటలూ పాడుకుంటూ ఉంటుంది. బీసీనాటి మనిషి ఆవిడ”
“…”
” స్నానానికి సరైన బాత్రూం కూడా లేదు. వాళ్లంటే బావి దగ్గర చేసేస్తారు”
“…”
ఇంకా ఎన్నో విధాల చెప్పింది. ఒక్క నవ్వే సమాధానం మనోజ్ఞ దగ్గర్నుంచి. ఆ అమ్మాయి మరీ చిన్నపిల్లేమీ కాదు. మాస్టర్స్ చదువుతోంది. సాహిత్యంతో పరిచయం ఉంది. రకరకాల మనస్తత్వాలుగల స్నేహితులు ఉన్నారు. కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. దేశంలోని అధిక శాతం జనాభా పల్లెటూర్లలోనే ఉండి, ఆ యిన్ని కోట్లమంది ఆజీవనపర్యంతం బతికే జీవనశైలే అది అయినప్పుడు… కొద్ది రోజులు…. కేవలం కొద్ది రోజులు… తను అలా ఉండలేదా అనేది ఆమె శోధన. సత్యవతి ఇంకా స్పష్టంగా తన అయిష్టాన్ని చెప్పలేకపోయింది.
జర్దోసి పని చేసినవి, ఇంకా వేరేవీ పంజాబీ డ్రెస్సులు, లెహంగాలు మనోజ్ఞ పెట్లో సర్దుకుంటే నవ్వి, చెప్పింది” ఇవి అక్కడ బాగుండవు”.
” బామ్మకి వేసుకుని చూపిద్దామని” అంది మనోజ్ఞ.
ఒక్క క్షణం అవాక్కయింది సత్యవతి. ఒక దగ్గర ఉండకపోయినా కూతురికి బామ్మ అంటే ఎంత ప్రేమో! తనకి ఉన్న అపురూపమైనవన్నీ ఆవిడకి చూపించాలని, ఆవిడ కంటి మెరుపుల్లో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలని ఎంత కోరికో! ఆమె గుండె చెమర్చింది. కూతుర్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది.
తనకి మాత్రం ఆవిడంటే ఇష్టం లేదా? గౌరవం లేదా? సగటు అత్తగార్లలా తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోదు. తమనుంచి ఏదీ ఆశించదు. సూర్యనారాయణని దేనికీ శాసించదు.
ఆవిడకి అతనొక్కడు. చాలా ఆలస్యంగా పుట్టాడట. ఆపైన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లీకొడుకులకి ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తను కూడా అలాగే ప్రేమిద్దామనుకుంటుంది. తాము అనుభవిస్తున్న సౌఖ్యాలన్నింటినీ ఆవిడకి కూడా అమర్చాలనిపిస్తుంది. పెద్దపెద్ద కంచిపట్టుచీరలు కట్టించి, ఒంటినిండా నగలు వేసి అత్తగారిని అందరికీ పరిచయం చేయాలనుకుంటుంది. ఏసీ గదిలో వుంచి కాలు కదపకుండా అన్నీ చూసుకోవాలని కూడా ఉంటుంది. అతనంతటి మేధావిని కన్నతల్లి ఆవిడ. సంస్కారవంతంగా పెంచి తనకి వరంగా ఇచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకోవాలని ఎంత ఉన్నా ఆవిడ ఈ సౌఖ్యాలు వేటికీ ఒప్పుకోదు. అన్నిటినీ కాదనుకుని ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటుంది. అమెరికా వెళ్లడం తేలిక. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అందరికీ కావలసినవీ, అందరూ వేటిని సాధించుకోవాలని జీవితకాలంపాటు కష్టపడతారో అవేవీ ఆవిడకి అక్కర్లేదు… అదే ఎందుకు? సత్యవతిలో ఉక్రోషం. ఎంతో ఎదిగాననుకున్న ఆమె ఆలోచనలు ఈ పరిధిని దాటవు.

తండ్రీకూతుళ్ళు ప్రయాణమయ్యారు. ముంబై నుంచి హైదరాబాదు ఫ్లైటు. అక్కడినుంచి రైల్లో వరంగల్‍కి. వరంగల్‍నుంచి బస్సు పట్టుకుని గంటన్నర ప్రయాణం. సత్యవతి ఆత్రుతకి అంతులేదు. జాగ్రత్తలన్నీ చెప్పింది. పల్లెటూరి వాతావరణం… అక్కడ ఉండే దుమ్మూ, ధూళీ, అపరిశుభ్రత… అక్కడ వచ్చే ఎలర్జీలు, ఇన్ఫెక్షన్ల గురించి చెప్పి, అవసరమైతే వాడమని చిన్న మెడికల్‍కిట్ కూడా ఇచ్చింది.
” నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. మనిషి అంటే స్పిరిట్, డెట్టాలు, ఫినైలు మధ్య ఇంకా ఆరోగ్యవంతంగా మయాసిస్, మైటాసిస్ జరుపుకునే ప్రాణి అని ఆలోచిస్తే ఎలా? దానికి ఏమీ కాదు. నువ్వు ఊరికే కంగారుపడకు. దాన్ని భయపెట్టకు. ఎలా తీసుకెళ్తున్నానో అలాగే తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది” అని కోప్పడ్డాడు సూర్యనారాయణ.

మూడంచెల ప్రయాణం పూర్తయి తమ గమ్యం చేరేసరికి సాయంత్రం అయింది. బస్సు ఊరి చివర రావిచెట్టు దగ్గర ఆగుతుంది. అక్కడినుంచి ఊర్లోకి పావుగంట నడక. వెళ్తుంటే సూర్యనారాయణ మనసు విహ్వలమైంది. ఈతరం వరకు మనిషికి పల్లెటూర్లతో ఎంతో కొంత అనుబంధం ఉంది. స్కూల్ చదువులు అక్కడ చదువుకోవడమో, తాతగారి ఊరనో, బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లకనో, చావులకనో వెళ్లకుండా, తాము రోజూ గడిపే జీవితానికి భిన్నమైన అనుభూతిని గుండె నిండా నింపుకోకుండా లేరు. అంతకిమించి సూర్యనారాయణకిది పుట్టి పెరిగిన ఊరు. మొండిగోడలు, పాడుబడిన ఇళ్లు, ఎండిన చేలతో కళాకాంతీ లేకుండా కనిపిస్తుంటే గుండె ఆక్రోశించింది.
“మా తరంవాళ్ళం పై చదువులకనీ, ఉద్యోగాలకనీ ఈ ఊరు వదిలేసి పట్నాల వైపు పరుగులు తీసాము. జీవన పోరాటంలో తప్పలేదు. మీ బామ్మలాంటివాళ్ళు కొంతమంది ఇంకా ఇక్కడ ఉండటంచేత ఈ కాస్తేనా జీవనఛాయలు మిగిలి ఉన్నాయి. వీరు దాటిపోయాక…” అతని గొంతు వణికింది. మనోజ్ఞ తండ్రి చేతిమీద తన చెయ్యి వేసి నొక్కింది.
“… ఇక్కడ ఒక ఊరు ఉందని ఎవరికీ తెలియదు” పూర్తి చేయకుండా ఉండలేకపోయాడు.
మనోజ్ఞకి ఈ వూరితో అనుబంధాలు ఏమీ లేవు. కానీ తండ్రి పడుతున్న బాధని తను పంచుకుని అనుభవించింది.
ఇంటికి చేరేలోపు దారిలో సూర్యనారాయణని తెలిసినవాళ్లు ఇద్దరు ముగ్గురు కనిపించి పలకరించారు. వీళ్లు బస్సు దిగినట్టు ముందుగానే తెలిసిపోవడంతో అతని తల్లి కృష్ణవేణమ్మ వాకిట్లోనే ఎదురొచ్చింది. నీలం అంచున్న తెల్లటి ఖద్దరుచీర, జాకెట్టు వేసుకుని తెల్లటి జుట్టుని వేలుముడిగా బిగించి చుట్టుకున్న ఆవిడని అపురూపంగా చూసింది మనోజ్ఞ. తన చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఎలా ఉందో, ఫోటోల్లో ఎలా ఉందో అలాగే ఉంది. ఏమీ మారలేదు.
కొడుకుని చూడగానే ఆవిడ కళ్ళు వెలిగాయి.
” ఎలా ఉన్నావమ్మా?” ప్రేమగా అడిగాడు సూర్యనారాయణ.
బావున్నానన్నట్టు తలూపి,” ఇది నీ కూతురు కదూ? పోయినసారి చూసినప్పుడు బాగా చిన్నది. ఎంత పెద్దదైంది!” అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది.” మీ పెళ్లప్పటికి సత్యవతి ఇలాగే ఉండేది. దానికి రామచంద్రుడిలా నువ్వు అమిరావు. ఇహ దీనికోసం ఏ రాజకుమారుడు తపస్సు చేస్తున్నాడో!” అంది.
నవ్వొచ్చింది మనోజ్ఞకి. తల్లీ తండ్రీ పెద్ద అందంగా ఉండరు. ఇద్దరికీ మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలు ఉన్నాయి. అయినా వాళ్లని సీతారాములంది బామ్మ. తమది మధ్యతరగతిలో కాస్త ఎగువ స్థాయి. తనకోసం రాజకుమారుడెవరో తపస్సు చేస్తున్నాడట!
” ఎందుకే నవ్వుతున్నావు?” దూరం జరిపి అడిగింది కృష్ణవేణమ్మ.
” నా రాజకుమారుడికి స్వాగతం చెప్పడానికి నీ రాజ్యం ఎక్కడుంది?” అల్లరిగా అడిగింది మనోజ్ఞ.
ఆవిడ చేత్తో ఇల్లంతా తిప్పి చూపించి,” ఇది చాలదంటావా?” అడిగింది.
” పద లోపలికి. లేకపోతే కూర్చుండ మా ఇంట కుర్సీలు లేవు… అని పద్యం అందుకోగలదు” నవ్వాడు సూర్యనారాయణ.
ముగ్గురూ లోపలికి నడిచారు.
” ఎలా ఉన్నారు, సత్యవతీ కొడుకూను?” అక్కడికి రాని ఇద్దరి గురించీ అడిగింది కృష్ణవేణమ్మ.
” వాళ్లిద్దరూ ఒక పార్టీ. రూపం నీ కోడలిదైనా ఇది నా పార్టీ. పల్లెటూర్లు, డబ్బులు లేకపోవడం, అసౌకర్యంగా ఉండడం… ఇవన్నీ వాళ్లకి నచ్చవు” అన్నాడతను. ఎక్కడో చురుక్కుమంది మనోజ్ఞకి. నాన్న సంతోషంకోసం కనీసం అమ్మేనా రావాల్సిందనిపించింది.
” ఎవరి తత్వం వాళ్లది” మామూలుగా అనేసింది కృష్ణవేణమ్మ.
” స్నానానికి వేణ్ణీళ్ళున్నాయి. చేసేసి రండి. అన్నాలు తిందాం”” అంది తనే మళ్లీ.
వంట సిద్ధంగా ఉంది. ఎక్కడా గ్యాస్, మిక్సీల్లాంటివి కనిపించలేదు మనోజ్ఞకి. వంటింట్లో ఒక మూలన కుంపటి ఉంది. దాంట్లో ఆరీఆరని బొగ్గులమీద నేతిగిన్నె వేడెక్కుతోంది . అదేంటో తెలీక ఆవిడ వంట ఎలా చేసిందా అని ఆశ్చర్యపోయింది. ఆమెకి ఆశ్చర్యం కలిగించేవి ఇంకా చాలా కనిపించాయి.
తను స్నానం చేసి వచ్చి, కూతురికి బాత్రూంలో నీళ్లుపెట్టాడు సూర్యనారాయణ. పేరుకే అది బాత్రూం. నాలుగు నాపరాళ్ళు పరిపించి చుట్టూ తడకలతో దడిలా కట్టించినది. మనోజ్ఞ ఇబ్బంది పడుతూనే వెళ్లి స్నానం ముగించింది.
పీటలమీద కూర్చుని అన్నం తినడం కొత్త అనుభవం ఆమెకి. తిన్నాక కంచాలు తీసి శుద్ధి పెడుతుంటే వింతగా చూసింది. భోజనాలయ్యాక ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ పడుకోవడం మరో గొప్ప అనుభవం. సూర్యనారాయణ ఆమెకి నక్షత్రరాశుల గురించి చెప్పాడు. సప్తర్షి మండలం, కన్య, తుల… అతను చూపుడు వేలితో చూపెడుతుంటే, ” ఇవన్నీ నీకెలా తెలుసు నాన్నా?” ఆశ్చర్యంగా అడిగింది.
“నా చిన్నతనమంతా ఈ ప్లానిటేరియం రూఫ్ కిందే పడుకున్నాను. మా అమ్మ చెప్పేది. తాతయ్య నా చిన్నప్పుడే పోయారు కదా, ఆ లోటు తెలియకుండా ఉండేందుకు చీకటి రాత్రుల ఒంటరితనంలో వీటి గురించి మాట్లాడుకునేవాళ్ళం”
” తాతయ్య ఎలా పోయారు?”
” మశూచితో”
” వైద్యం చేయించలేదా?”
” అప్పట్లో అదొక పెద్ద సవాలు. తర్వాత వ్యాక్సిన్ కనిపెట్టారు”
మనోజ్ఞ కొద్దిసేపు వూరుకుని అడిగింది ” బామ్మ ఇలా ఎందుకుంటుంది? అందర్లా ఎందుకుండదు? ఇంకా ఖద్దరెందుకు కట్టుకుంటుంది?”
సూర్యనారాయణ చిన్నగా నవ్వేడు. “చాలా చరిత్ర చెప్పాలి నీకు. వింటావా? లేక నిద్ర వస్తోందా?”
చెప్పమన్నట్టు సూచించింది ఆమె.
” మా తాత గాంధేయవాది. తెలంగాణా నైజాం పాలనలో వుండేది. నిజాముకి బ్రిటిష్ వారి సహకారం వుండేది . స్వతంత్ర పోరాటం ఛాయలు ఇక్కడికి రాకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరచెయ్యి అడ్డు పెట్టి సూర్యుడిని ఆపినట్టైంది. గాంధీ సిద్ధాంతాల ప్రభావం బాగా వుండేది. మా తాతకి ఆయన సజీవదైవమే. అమ్మానాన్నలు కూడా చాలా ప్రభావితులయారు. ఆపైన చిన్న వయసులోనే నాన్న పోవడం చేత , డబ్బు లేక అమ్మకి అదొక వ్యాపకంగా… క్రమంగా జీవనశైలిగా మారిపోయింది… ఎంత క్లుప్తంగా… అవసరాలని ఎంత మేరకు కుదించుకుంటూ… అయినా కూడా సుఖంగా ఎలా బతకవచ్చు అనేది వెతుకుతూ ఆవిడ బతికింది” అన్నాడు.
“పేదరికం ఒక వాస్తవం. దాన్ని యధాతధంగా స్వీకరించకుండా ఒక సిద్ధాంతం ముసుగులో దాచడం ఎంతవరకు సరైనది నాన్నా? ఆ ముసుగుని తీసేసి చూస్తే ఆవిడ కూడా అందరిలాగే ఆలోచిస్తుంది కదా?” మనోజ్ఞ ప్రశ్న సత్యవతి మనసుని తనముందు పరిచినట్టు అనిపించింది అతనికి.
“నువ్వు మనిషివి. నీకో పేరుంది. కుటుంబం, కులం,మతం,జాతి వున్నాయి. అవన్నీ కలిసి లేదా విడివిడిగా నీకు కొంత విలువని ఇస్తాయి. నీ గురించి చెప్పవలసి వస్తే ఇవన్నీ చెప్తావు. అంతేతప్ప మనిషినని చెప్పి వూరుకోవు. పేదరికం అనుకుంటే విలువలు కొట్టుకుపోతాయి. డబ్బు చాలకపోవడం అనేది దానికి పై స్థాయి. దాన్ని ఒక సిద్ధాంతం వెనుక దాస్తే… గాంధీవాదం, సోషలిజం , కమ్యూనిజం ఏదేనాగానీ వుత్తమమైన జీవనశైలి ఏర్పడుతుంది. పైగా మా నాన్నతో ఆవిడ గడిపింది చాలా కొద్ది కాలం. జీవితాన్ని ఇలా హోల్డ్ చేయడంలో మాత్రమే ఆ కొద్దికాలపు జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి. ఆవిడ మారితే అవన్నీ చెరిగిపోతాయి” జవాబిచ్చాడు.
మనోజ్ఞకి తండ్రి అర్థమయ్యాడు.
ఎన్నోసార్లు తల్లిని అడిగాడు సూర్యనారాయణ తనతో వచ్చేయమని.” నేను, మీ నాన్న కలిసి కలలుగన్న భవిష్యత్తు నీ ఇప్పటి జీవితం. ఆయన లేకుండా ఆ కలల ఫలాలని నేను ఒక్కదాన్నే అందుకోలేను. నువ్వు, నీ తోటి పిల్లలు చదువుకుని పైకి వచ్చారన్న సంతోషం నాకు చాలు” అని స్పష్టంగా చెప్పింది. తనింకా బలవంత పెట్టలేదు. ఆయన వదిలిపెట్టిన వర్తమానంలోనే ఆవిడ ఇంకా బతుకుతోంది.
” మీ నాన్నగారి మరణం తాలూకు షాక్‍లోంచి ఆవిడ ఇంకా బయటికి రాలేదు. వైద్యం చేయిస్తే మంచిది” అంది సత్యవతి…. ఆమెకుగల వైద్య పరిజ్ఞానంతో… ఒకే ఒక్కసారి. అలా అన్నందుకు ఆమెకి బాధ కలిగింది. సూర్యనారాయణ కదిలిపోయాడు.
” ఆవిడ అలా ఉండటం వలన ఎవరికీ ఏ నష్టం లేదు. అలాగే బతకడంలో ఆవిడకి సంతోషం దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి? మనం అనుభవిస్తున్నదాన్ని సంతోషమని ఆవిడ ఒప్పుకోకపోతే?” అని ప్రశ్నించాడు. దానికి ఆమె దగ్గర జవాబు లేదు.
ఇక్కడ ఈ ఊర్లోనే అన్ని సదుపాయాలూ అమర్చాలనుకున్నారు భార్యాభర్తలు. ఆవిడ ఒప్పుకోలేదు.
“నా ఊళ్లోని జనం అందరి జీవితాల్లోనూ ఈ మార్పులు వచ్చినప్పుడు అదొక సహజ పరిణామంలా నేను కూడా స్వీకరిస్తాను. అంతే తప్ప ఎక్కడో సంపాదించి ఇక్కడ కుమ్మరించటాన్ని నేను ఒప్పుకోలేను. మేము అభివృద్ధిని కోరుకున్నది అంచెలంచెలుగా గ్రామాలనుంచి జరగాలనిగానీ గ్రామాలని మినహాయించుకుని కాదు. ఇప్పటికీ ఇక్కడ సరైన వైద్యం లేదు, స్కూలు లేదు, తాగే నీళ్లు దొరకవు. రోడ్లు బాలేవు. మురుగు రోడ్లమీదకి వస్తుంటుంది. ఇవన్నీ మారాలి” ఆవిడ గొంతులో ఉక్రోషం, నిస్సహాయత ఏళ్ల తరబడి కాగి కాగి చల్లారి పోయిన తర్వాత ఉండే నిర్లిప్తత.
ఈ మాటలన్నీ గుర్తొస్తుంటే ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడు. అతను మౌనంగా ఉండటంతో మనోజ్ఞ నిద్రలోకి జారుకుంది. కృష్ణవేణమ్మ ఏం మాట్లాడకుండా ఉండిపోవడంతో ఆవిడా నిద్రపోతున్నట్టే భావించి తనూ నిద్రకి ప్రయత్నించి చాలాసేపటికి సాధించాడు.

రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయాన్నే లేచేసరికి ఎంతో ఉల్లాసంగా అనిపించింది మనోజ్ఞకి. ఆసరికి పెరడు, వాకిలి తుడిచేసి వాళ్ళున్న వైపుకి వచ్చింది కృష్ణవేణమ్మ.
“నేను తుడవనా?” అడిగింది మనోజ్ఞ.
“దుమ్ము లేస్తుంది. తుమ్ములు వస్తాయి. మీ అమ్మతో గొడవ” అంది ఆవిడ. మనోజ్ఞ నవ్వింది. సూర్యనారాయణ బావిలో చేద వేసి తోడి ఇస్తూ ఉంటే ఆవిడ కళ్ళాపి చల్లేసింది. అలా వాళ్ళిద్దర్నీ చూస్తూ తండ్రి బాల్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నం చేసింది మనోజ్ఞ. బామ్మని ఎంతగా మిస్ అవుతున్నాడో నాన్న! తమతో సంతోషంగా ఉన్నా, ఈ అనుభవాలు కూడా కోరుకోదగ్గవేగా? వదులుకోలేడు కదా? అనిపించింది.
స్నానాలు అయ్యేసరికి ఒక అబ్బాయి అరిటాకులో పొట్లం కట్టి వేడిగా ఇడ్లీలు పట్టుకొచ్చాడు. వాడికి పదేళ్లు ఉంటాయి. స్నానం చేసి నున్నగా తల దువ్వుకుని బొట్టు పెట్టుకున్నాడు. వెళ్లిపోయాక వాడి గురించి చెప్పింది కృష్ణవేణమ్మ.
” తండ్రి దుబాయిలో ఉద్యోగానికి వెళ్ళాడు. ఎనిమిదేళ్లయింది. అజా అయిపూ లేడు. వీడి తల్లి చిన్నదే. ముప్పైయేళ్ళు కూడా ఉండవు. ధైర్యం తెచ్చుకుని అత్తమామలని, కొడుకుని తనే చూసుకుంటుంది. మనిషి కనీసవసరం ఏడాదికి బస్తా బియ్యం, రెండు జతల బట్టలు, ఉండటానికి గూడు. అవి ఉంటే అన్నంలోకి కూరా పచ్చడీ కోసం వెతుక్కుంటూ బతకగలడు. వాటికి కూడా కరువే”
ఆ మాటలు మనోజ్ఞ అంతరంగాన్ని ఎక్కడో తట్టి లేపాయి. ఎందుకని మనుషులకి ఉన్నచోట అవకాశాలు ఉండటం లేదు? ఎంతమందికి తమలా జీవితం అన్నీ అమరి వుంటుంది? అలా అమిరి ఉండకపోవటానికి ప్రత్యామ్నాయమా ఇక్కడి ఈ జీవిత శైలి?
ఇల్లంతా కలయతిరిగింది. ఇంట్లో పెద్దగా వస్తువులు ఏమీ లేవు . ఇల్లు పాతబడ్డా అనవసరపు వస్తువులేవీ లేకపోవడంతో చాలా విశాలంగా ఉంది. కూర్చోవడానికి చాపలు, భోజనాలకి పీటలు, పడుకోవడానికి మంచాలు… వేసుకుని ఆ అవసరం తీరాక వాటిని ఎత్తిపెట్టడంతో ఇల్లు, ఏ గదికా గది అవసరానికి తగ్గట్టు మారిపోవడం, అలా మారే ప్రక్రియ నిత్య నూతనంగా అనిపించటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మనిషి అవసరం పడని అనేక వస్తువులను తన చుట్టూ ఎలా పోగుచేసుకుంటాడో ఉండే ఇంటిని ఇరుకు చేసుకుంటాడో అర్థమైంది.
సూర్యనారాయణ తల్లికి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. తన సెల్‍లో ఉన్న భార్యాపిల్లల ఫోటోలు చూపించాడు. వాటన్నిటినీ మరోమాటు అడిగి ఆపేక్షగా చూసింది ఆవిడ.
” నీ దగ్గర పెట్టుకుంటావా అమ్మా? ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. నాతో మాట్లాడవచ్చు” ఆరాటంగా అడిగాడు.
” వద్దురా! ఇంత ఖరీదైనది నాకెందుకు? అవసరం ఉన్నప్పుడు కోమటి కోట్లోనుంచి చేస్తాలే” అంటూ కింద పెట్టి దూరంగా నెట్టేసింది. అతను నిట్టూర్చాడు.
మనోజ్ఞ తనతో తెచ్చుకున్నవన్నీ ఆవిడకి చూపించింది.
“చాలా బావున్నాయమ్మా! మా అప్పుడు ఇన్ని రకాలు ఉండేవి కాదు. తాతయ్య ఉన్నప్పుడు రంగు చీరలు కట్టుకునేదాన్ని. తర్వాత మానేసాను” చెప్పింది ఆవిడ.
” నీకు తాతయ్య అంటే ఇష్టమా?”
” నాకు జీవితాన్ని ఇచ్చిందే ఆయన. నాకన్నా పదేళ్ళు పెద్దవారు. అందుకు గౌరవం కూడా. వండుకుంటూ, తింటూ…చీరలు ,నగలు, ఆస్తులు అమర్చుకుంటూ… ఏదో తక్కువైందనుకుంటూ ఇంకోరకం బతుకు బతికేదాన్ని. అన్ని వ్యామోహాలూ తుంచేసి ఏ సంక్లిష్టతా లేని సులువైన జీవనాన్ని నాకు నేర్పించి వెళ్లారు”
” తాతయ్యంటే ఇష్టమా? పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇష్టమా?”
” ఆయనంటేనే” చాలా స్పష్టమైన జవాబు. సూర్యనారాయణ చిన్నగా నిట్టూర్చాడు.

“ఎవరైనా ఏదీ చెయ్యకుండా ఎలా ఉండగలరు నాన్నా?” మూడోరోజుని అడిగింది మనోజ్ఞ తండ్రిని. కాలం ఆగిపోవటమని తల్లి అన్నదేంటో అర్థమైంది. ఏ మాత్రం మార్పు లేని జీవితాన్ని బామ్మ దశాబ్దాల తరబడి గడపడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
” బోర్ కొడుతోందా? వెళ్లి పోదామా?” అడిగాడు సూర్యనారాయణ. ఆమె తలూపింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని చిన్నపిల్లాడిగా తల్లి ముందు నిలబడ్డాడు.
” వెళిపోదామంటోంది. తోచడంలేదట” అన్నాడు. ఆవిడ తలూపింది.
కొంత డబ్బు ఇవ్వబోయాడు. ఆవిడ వద్దనేసింది. అతను బ్రేకయ్యాడు.
” నీకు డబ్బు అక్కర్లేదు. వస్తువులు అక్కర్లేదు. అదిగో, నేను పుట్టినప్పటినుంచి చూస్తున్న ఆ బల్లలా, కుర్చీలా… ఆ వస్తువుల్లో వస్తువులా బతికేస్తున్నావు. నాతో వచ్చేయ్యవే! నీకు నచ్చినట్టే అక్కడ ఉందువుగాని” అని ఆవిడని పట్టుకుని ఏడ్చేశాడు. ఆవిడ వోదార్చింది తప్ప వస్తాననలేదు. ఉద్వేగపడి, ఏడ్చి, చల్లబడిన తండ్రిలో ఓ కొడుకుని చూసింది మనోజ్ఞ.
తిరుగు ప్రయాణం అయ్యారు. అవే ఎండిపోయిన చేలు. మొండిగోడల ఇళ్లు. వాళ్లకి వీడ్కోలు చెప్పాయి. సూర్యనారాయణ గుండెల్లో బాధ. తల్లినీ, వూరినీ వదిలిపెట్టి వెళ్తున్నందుకు. మనోజ్ఞలో సంతోషం. అమ్మ దగ్గరికి… తనింటికి వెళ్తున్నందుకు. ఈ తేడాని ఆమె గుర్తించింది. ఎంత ఆప్తులైనా ఎవరి ఉద్వేగం, ఆర్తి వాళ్లవే.
” మనిషికి చావుపుట్టుకలు ఉన్నట్టే నాగరికతలకి వుత్థానపతనాలు ఉంటాయి నాన్నా! సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనబడే యుద్ధం కూడా జరుగుతుంటుంది. ఏవి అవసరాలో వాటి చుట్టూ నాగరికతలు బలపడతాయి. అవసరాలు మారినప్పుడు వాటి ఉత్థానపతనాలు జరుగుతాయి. మనిషి చనిపోతుంటే ఎలా చూడలేమో, నాగరికత పతనమవుతూ … పాటించిన విలువలు మారుతుంటే కూడా చూడలేము. కానీ అది అనివార్యం. ఇప్పుడు అంతా పట్టణ నాగరికత. కానీ కొన్నాళ్లు పోయాక ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి పల్లెటూర్లు అవసరమవుతాయి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం” అంది ఈ ఊరు వచ్చే ముందు తండ్రి తనతో అన్నదానికి జవాబుగా.
“ఆ రోజు వస్తే కుటుంబాలు చీలిపోవు. తల్లుల్ని పిల్లలు, పిల్లల్ని తల్లులు కోల్పోరు. ఎక్కడి వాళ్ళు అక్కడ బతక గలుగుతారు. కానీ వస్తుందంటావా అలాంటిరోజు?” ఆశగా అడిగాడు.