పెళ్లి పిలుపు – 1 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

“పిన్నీ! పెళ్లికి రావద్దా నేను?”శుభలేఖలు ఎవరెవరికి పంపాలో, బట్టలు ఎక్కడ తీసుకోవాలో, ఎవరెవరికి చీరలు ఎంతెంతలో పెట్టాలో, ఎవరికి జాకెట్ ముక్కతో సరిపెట్టాలో మొదలైన చర్చలన్నీ వేడివేడిగా సాగుతున్న నేపథ్యంలో సంయుక్త అడిగిన ప్రశ్న అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సంయుక్త తల్లి శారద ముఖం మ్లానమైంది. ఏదో పని ఉన్నట్టు అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. మిగిలినవాళ్లంతా ముఖముఖాలు చూసుకున్నారు. ముందుగా తేరుకున్నది వసంతే. వసంత అంటే శారద చిన్న తోటికోడలు.
“అదేం మాటమ్మా? అన్నయ్య పెళ్లికి నువ్వు రాకుండా ఎలా? అంతా ఎలా వస్తారో నువ్వు కూడా అలాగే వద్దువుగాని “అంది వాత్సల్యంగా. ” థాంక్స్ పిన్నీ! నేనేం రాబోవటం లేదు. పెళ్లి హడావిడి అంతా మా ఇంట్లోనే ఉంది. అత్తయ్యలు, పిన్నిలు… ఇంకా అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరికి వాళ్ళు తమదే బాధ్యతన్నట్టు పనులన్నీ మీదకు ఎత్తుకుని చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా నా ప్రస్తావనే రాలేదు. తెలుగు సినిమాల్లోలా నా ఫోటోకి దండ వేసేసారేమోనని అనుమానం వచ్చి అడిగాను. అంతే” అంది సంయుక్త.
“అవునే, సంయుక్తా! పెళ్లికి పిలవలేదని అంత ఇదౌవుతున్నావు, నువ్వు చేసిన పని ఏమంత బాగుందని? మరొకరూ మరొకరూ అయితే నువ్వన్నట్టే చేసేవారు. మీ అమ్మ నాన్న కాబట్టి నిన్ను ఇంకా ఇంటికి రానిస్తున్నారు. వాళ్ల పిల్లవని చెప్పుకుంటున్నారు” అంది పెద్ద మేనత్త జయలక్ష్మి.
సంయుక్త ఏదో జవాబు ఇవ్వబోయేంతలో ” సంయుక్తా!” అని లోపల్నుంచి తల్లి పిలుపు వినిపించి లేచి వెళ్ళింది. ఆమె గదిలోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది శారద.
” నీ మానాన్ననువ్వు హాయిగా బతుకుతున్నావు. మీ సరదాలేవో నువ్వు చూసుకోక వాళ్లని ఎందుకమ్మా రెచ్చగొడుతున్నావు? పెళ్లికి నువ్వు రాకపోతేనేం?” నచ్చచెప్తున్నట్టుగా అంది.
” నేను వస్తాననే అనుకుంటున్నావా అమ్మా? వద్దామని నాకున్నా వాళ్లు రానిస్తారా? నా ఒక్కదానికే ఎందుకీ శిక్ష? శేషుబావకి ఎందుకు లేదు?” గొంతు దుఃఖంతో పూడుకుపోతుంటే అడిగింది. ఆమె వెనకే వచ్చి తలుపు దగ్గర ఆగిపోయిన వసంత తను కూడా తలుపు తోసుకుని లోపలికి అడుగు పెట్టింది.
“అది అడిగింది నిజమే కదా అక్కయ్యా! శేషుకి మన ఇళ్లలో అన్ని మర్యాదలూ యధాప్రకారం జరుగుతున్నాయి. దీన్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నాము” అంది.
“నువ్వు పిలుస్తావు. తగుదునమ్మా అని ఇది బయలుదేరి వస్తుంది. అక్కడ వాళ్లు దీన్ని తిడితే? హేళన చేస్తే? దీని భర్తని అవమానపరిస్తే? అదంతా వద్దు వసంతా! ముప్పై ఏళ్ళయ్యింది, నేనీ యింటికి కాపురానికొచ్చి. వీళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ ఒక తానులోని ముక్కలే. పల్లెటూరి అహంభావాలు… తెలిసీ తెలియని మూర్ఖత్వాలు… సమ్మూ కాబట్టి మీ బావగారు కొంచెం తగ్గారు. మరెవరైనా అయితే ఆయనా వీళ్ళకి సైదోడే. ఇప్పుడేనా ఆయన దీనితో మాట్లాడరు. ఇది కూడా ఆయనొచ్చే టైముకి వెళ్లిపోతుంది…” అని ఆగింది శారద. వసంత విచలితురాలైంది.
” భూమ్మీద పడ్డ క్షణంనుంచి ఇది ఆ శేషుగాడి భయానికి హడలి చస్తూనే బతికింది. నవ్వన్నది ఎరగదు. ఇప్పుడే… ఏదో కాస్తంత సుఖంగా బతుకుతోంది. ఇలా వదిలేయ్” శారదకి ఏడుపొచ్చేసింది. కళ్ళలో నీళ్ళు నిండాయి. బయటికి తెలియకూడదన్నట్టు కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని నిగ్రహించుకుంది.
” ఇవన్నీ నాకు తెలియనివా అక్కయ్యా? పిల్లి మెడకి ఎవరో ఒకరు గంట కట్టాలి. అదేదో నేనే కడతాను. తప్పుచేసినవాడు నిర్లజ్జగా తిరుగుతుంటే చెయ్యని తప్పుకి ఇది వెలి అయ్యింది. ఎంతకాలం ఇలా?” అడిగింది వసంత.
” అయితే పిన్నీ! నన్ను పెళ్లికి పిలవడం పిల్లి మెడలో గంట కట్టడంలాంటిదన్నమాట!” చురుగ్గా అంది సంయుక్త.
” ఏదో మాటవరసకి అన్నానులేవే”” వసంత విసుక్కుంది.ముగ్గురూ ఇవతలికి వచ్చారు.
” ఏమిటి, తోటికోడళ్ళిద్దరి మంతనాలు?” జయలక్ష్మి అడిగింది.
“మంతనాలకేముంది? పెళ్లికి రానా అని సమ్ము అడగడం మీరూ విన్నారు. వద్దని అక్కయ్య దాన్ని కోప్పడుతుంటే నేనూ వెళ్లాను. అంతే” అంది వసంత ముక్తసరిగా.
కచ్చితంగా ఏదో ఉంది అనుకుంది ఆవిడ. అందుకే చురచుర వసంత కేసి చూస్తూ, ” మగవాళ్ళ అలుసు చూసుకుని ఇంటి కోడళ్ళకి కొమ్ములు వచ్చాయి” అంది. సంయుక్త కేసి పురుగుని చూసినట్టు చూసి ముఖం తిప్పుకుంది. శేషు ఆవిడ కొడుకే. సంయుక్తతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. అతన్నుంచీ విడిపోయి వేరే ఉంటోంది. అదే అందరికీ కోపకారణం….“సంయుక్తని పెళ్లికి రమ్మన్నావట?” చాలా కోపంగా అడిగాడు నారాయణరావు భార్యని. ఆడవాళ్ళ చర్చల్లో వచ్చిన విషయం అంత తొందరగా అతని దాకా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది వసంత.
” తప్పేముంది? మన ఇంటి పిల్ల. మన ఇంట్లో జరిగే పెళ్లికి రాకుండా ఎలా ఉంటుంది? ఎంతకాలం ఇలా వేరుచేస్తాం? మొదట్లో కొత్తగా ఉంటుంది. తర్వాత అదే అలవాటు అవుతుంది” నిదానంగా అంది.
భర్త కోపానికి భయపడటం, లేదా తనూ కోపం తెచ్చుకుని గొడవపడటంలాంటివి చెయ్యదు ఆమె. పెద్ద కుటుంబాల్లో కాపురం కత్తి మీద సాము అని తెలిసి ఏదైనా సాధించాలనుకుంటే సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుంది. సాధ్యాసాధ్యాలు మాత్రం ఆమె చేతిలో ఉండవు. ప్రయత్నం వరకే.ముగ్గురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు ఉన్న ఆ కుటుంబంలో ఎవరి సంసారాలు, ఇళ్లు, ఆస్తిపాస్తులు వాళ్లవే అయినా, ఓవరాల్ గా పెత్తనం మాత్రం జయలక్ష్మిది. అందరిలోకీ పెద్దది. ఆమెని అడగకుండా, ఆమె అనుమతి లేకుండా ఆ ఎనిమిది కుటుంబాల్లోనూ ఎవరూ ఏదీ చెయ్యరు. తన కొడుకుతో కాపురం చేయనని తెగేసి చెప్పి తెంచుకు పోయిన సంయుక్త ఆ ఊళ్లోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఆమె అహానికి పెద్ద దెబ్బ. అదే ఎక్కువ అనుకుంటే తమ్ముడు, మరదలు సంయుక్తని ఇంటికి రానివ్వడం, ఆపైన వసంత పెళ్ళికి రమ్మనడం… ఆమె జ్వలించిపోయింది. వెంటనే వార్త వసంత భర్తకి చేరవేసింది.
భార్య మాటలకి నారాయణ రావు ముఖం భీకరంగా మారింది.” అది మన పిల్లా? మొగుణ్ణి వదిలేసి ఎవరితోటో పబ్లిక్ గా ఉంటోంది… అది చచ్చిందని ఎప్పుడో నీళ్లు వదిలేశాం” అన్నాడు.
” ఎవరు నీళ్లొదిలినది? మీ వదిన దాన్ని ఇంటికి పిలిపించుకుంటోంది. మీ అన్నయ్యగారు చూసీ చూడనట్టు వూరుకుంటున్నారు. మధ్యలో మనమేనా, చెడ్డవాళ్ళం? అదేం దొంగచాటు పని చెయ్యలేదు. నలుగురిలో ధైర్యంగా పెళ్లి చేసుకుందతన్ని. అంతమంది మధ్యని పెళ్లికి రానా అని అడిగితే వద్దనలేకపోయాను”
” అదొస్తే మా అక్కచెల్లెళ్ళెవరూ పందిట్లో అడుగు పెట్టరట. వాళ్లు రాకపోతే నేనూ రాను. మేమెవరం లేకుండా అదీ నువ్వు చేస్తారా, శీను పెళ్లి?”
” ఇంతమందీ కలిసి పసిదాన్ని సాధిస్తున్నారా? సంయుక్త శేషుని వదిలేసిందంటే మొత్తం తప్పంతా దానిదేనా? శేషుది లేదా?”
” మొగుడు కొడితే కాపురం వదులుకుని లేచిపోవడమేనా?”
” కేవలం కొట్టినందుకే వదులుకుందా?”
” లేదు.వళ్ళు కొవ్వెక్కి”
అతను తన భర్తే. అయినా ఇంకా అతనితో ఆ విషయం మాట్లాడడానికి అసహ్యం వేసింది వసంతకి. బురద మధ్యని అందమైన తామర పువ్వు ఉంటుంది. దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే బురద కదిలి కంపు కంపు అవుతుంది. దాంపత్యం కూడా అందమైన పువ్వులా ప్రలోభపెడుతుంది. పెళ్లి చేసుకుని అందులోకి అడుగుపెడితే బురదలో కొట్టుకోవడమే తప్ప తామరపువ్వుని అందుకున్న వాళ్ళు చాలా అరుదు.తొందరపడి సంయుక్తకి మాట ఇచ్చాననిపించింది వసంతకి. శారద ఈ ఇంటి మనుషులని చాలా చక్కగా అంచనా వేసింది. తనకే ఇంకా నమ్మకం చావదు… ఏ మూలో మంచి దాగుందని. మ్లానమైన వదనంతో అక్కడినుంచి వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ శ్రీను జీడిపప్పు కోసం డబ్బాలు వెతుక్కుంటున్నాడు.
” నువ్వూ, కృష్ణా కలిసి శేషుకి సంబంధాలు చూస్తున్నారట?” అడిగింది. తల్లి గొంతు విని చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగాడు శీను.
” లేకపోతే? అదేమో బరితెగించి ఈ ఊళ్లోనే కాపురం పెట్టింది. వీడు చేతులకి గాజులు తొడిగించుకుని కూర్చోవాలా?” అన్నాడు.
” అది ఎవర్రా? నీ చెల్లెలు కాదూ?” మనసు కష్టపెట్టుకుంటూ అడిగింది.
” నా సొంత చెల్లెలే అయితే ఈపాటికి నరికి పోగులుపెట్టేవాడిని. పెద్దనాన్న కూతురై బతికిపోయింది. వాడు… ఆ రాస్కెల్ మామీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు! ఎంత పొగరు!” అతని మాటల్లో కసి.
వసంతకి ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు. సంయుక్తని పెళ్లికి పిలిచే విషయం ప్రస్తావించక మౌనం వహించింది.
” పెళ్లికి వస్తానందట?” తనే అడిగాడు శీను.
నిస్తేజంగా నవ్వింది.
” రానీ! వాడితో కలిసి వస్తుందేమో! బాగా బుద్ధి చెప్తాం. మళ్లీ తలెత్తుకు తిరగకుండా చేస్తాం” అన్నాడు కచ్చగా.
” ఎందుకురా అంత కోపం దానిమీద? మీ అందరిలాగే అదీ పుట్టింది. పెద్దవాళ్ల మాట కాదనకుండా శేషుని చేసుకుంది. అతను తిడితే ఓర్చుకుంది. కొడితే పడింది. ఓపిక ఉన్నంతకాలం మారుతాడేమోనని ఎదురు చూసింది. ఓపిక చచ్చాక కూడా అతన్నేం చెయ్యలేదు. తన ఒంటిమీద కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుంది”
” అయితే? మరొకరితో పోతుందా?”
అర్థమైంది వసంతకి. శేషు చేతిలో తన్నులు తింటూ పడున్నన్ని రోజులూ వీళ్ళందరికీ సానుభూతి ఉంది. అతన్ని కోప్పడటం, ఆమెను ఓదార్చడం, వాళ్ల తగాదాలు తీర్చటం… ఒక వేడుకలా అంతా సాగిపోయింది. అది సాగనిచ్చినంతకాలం సంయుక్త మంచిది. పరిష్కారాన్ని తనే వెతుక్కునేసరికి రంగు మారిపోయింది. ఇదంతా జరిగాక వసంతకి కూడా శారదకిలాగే అనిపించింది, పెళ్లికి సంయుక్త రాకపోతేనేమని.ఆ రాత్రి ఫోన్ చేసి సంయుక్తతో మాట్లాడింది
” నువ్వు రావద్దు సంయుక్తా! అక్కయ్య చెప్పిందే నిజం. వీళ్లు నిన్ను బతకనివ్వరు” అంటూ ఏడ్చేసింది. ఫోన్ పెట్టేస్తుంటే నారాయణ రావు అక్కడికి వచ్చాడు.
” రావద్దని దాన్ని బతిమాలుకుంటున్నావా?” హేళనగా అడిగి,” నిన్ను ఎవరు పిలవమన్నారు, నన్ను అడక్కుండా? బోడి పెత్తనం” అన్నాడు మండిపడుతూ. వసంత అతన్ని తిరస్కారంగా చూసింది. అలాంటి ఎన్ని తిరస్కారాలు అయితే అతని జన్మ ముగుస్తుందో!
( నవ్యలో 2003లో నాలుగు వారాల సీరియల్ గా వచ్చింది)“