పెళ్లి పిలుపు – 12 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

ఊర్వశి ఒక అప్సరస. ఒకానొక సమయంలో ఆమెకి తను చాలా అందగత్తెనన్న గర్వం ప్రబలింది. దాన్ని అణచడానికి బ్రహ్మదేవుడు ఒక అందమైన ఆడపిల్లని- అహల్యని సృష్టించాడు. ఆమెని పెంచి పెద్దచెయ్యమని గౌతమ మహర్షికి ఇచ్చాడు. ఆయన ఆహల్యని జాగ్రత్తగా పెంచి బ్రహ్మకి తిరిగి అప్పగించాడు. ఆమె అపురూప సౌందర్యం చూసాక ఊర్వశికి గర్వభంగమైంది. ప్రతిగా నిత్యయౌవనమనే వరం అహల్యకి ఇచ్చాడు బ్రహ్మ.
అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. అహల్యని సృష్టించిన పని ముగిసింది. ఇప్పుడామెని ఏం చెయ్యాలి? దేవతలంతా ఆమె సౌందర్యం చూసి మతులు పోగొట్టుకున్నారు. కానీ బ్రహ్మ ఆమెని గౌతముడికిచ్చి వివాహం చేసాడు. గౌతముడికి భార్యెందుకు? అదీ అంత అందమైన యువతి? బ్రహ్మ ఇచ్చాడుగాబట్టి స్వీకరించాడు. వెంట తీసుకెళ్ళాడు. యజ్ఞయాగాదులలో ఆమెని ధర్మపత్నిగా వినియోగించుకున్నాడు. ఆమె కోరుకుంటున్నది అదేనా? ఆమె అలాగే బతకాలనుకుంటోందా? ఆ విషయం ఎవరికీ అక్కర్లేదు. ఒకరోజు ఇంద్రుడు ఆమెని వెతుకుతూ వచ్చాడు.
నేను అహల్యను- అని సంకేతం ఇచ్చింది. ఆమె మనోగతం వ్యక్తమైంది. ఇంద్రుడు ఆమెని అభిగమించాడు. గౌతముడికి విషయం తెలిసింది. శపించాడు. శిలాసదృశంగా ఆమె వంటరి జీవితం గడుపుతుంటే ఒకనాడెప్పుడో శ్రీరాముడు ఆమెని చూసాడు. ఆమెని మన్నించాడు. తిరిగి జీవాన్ని నింపాడు.ఈ కథంతా చెప్పింది కాంతామణి.
“నేనిలా వినలేదు. అహల్యది తప్పని చెప్పింది మా అమ్మ. ఐనా అహల్యని క్షమించగలిగిన రాముడు సీతకెందుకు అగ్నిపరీక్ష పెట్టాడు?” అడిగింది సంయుక్త.
“తార, మండోదరి, శబరి… ఇలా ఇంకో ముగ్గురు స్త్రీలు అతనివలన గౌరవాన్ని పొందినవాళ్ళు కనిపిస్తారు సంయుక్తా! సుగ్రీవుడి భార్యనీ, రాజ్యాన్నీ కాజేసిన వాలిని చంపినా అతడి కొడుక్కి యువరాజ పట్టాభిషేకం చేసాడు. తన భార్యని ఎత్తుకుపోయిన రావణుడికి భార్య మండోదరి. ఆమెని వీరమరణం పొందిన వీరుడి భార్యగానే గౌరవించాడు. ఆటవిక స్త్రీ ఐన శబరి ఎంగిలి తినడానికీ సంకోచించలేదు. ఆఖరికి కైకనికూడా క్షమించాడు. అలాంటివాడి విషయంలో అగ్నిపరీక్ష అనేది ప్రక్షిప్తమై వుంటుంది తప్ప, వాల్మీకం కాకపోవచ్చు” స్పష్టంగా, రాముడిపట్ల వున్న గౌరవంతో చెప్పింది కాంతామణి. ఏదో ముడి విడినట్టైంది సంయుక్తకి. అలాగని తల్లిపట్ల వున్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు.
“సరే, మళ్ళీ నాకథలోకి వద్దాం. గుమ్మంలోపల నిలబడి ఆవిడ నన్ను తిడుతోంది… చాలా అసభ్యంగా… ఇదంతా ఇలా జరగడానికి నేనే కారణమన్నట్టుగా. గుమ్మం ఇవతల నేనున్నాను. పదిమంది పిల్లల్ని కని ఇంకా కనబోతున్న ఆవిడ పురుషస్పర్శే ఎరగని, ప్రేమా ఆదరణా అనేవాటికి నోచుకోని నన్ను… నానా దుర్భాషలూ అంటోంది. జనం మూగిపోయి తమాషా చూస్తున్నారు. తిట్టేవాళ్ళు గొంతు కలుపుతున్నారు. నాలో భయం. అతనేం చెయ్యబోతున్నాడు? నన్ను వదిలేసి నీదారి నువ్వు చూసుకొమ్మంటాడా? ఈ జరిగిందంతా క్షణకాలపు వెలుగేనా? సరిగ్గా అప్పుడు అహల్య నన్ను ఆవహించింది. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. నా నిరాశ… నా భయం… కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటి బొట్లు… ఇవన్నీ అతనికే భాష్యం చెప్పాయో, బిగిసిన నా పట్టు అతనికే సందేశం ఇచ్చిందో అతను అందరినీ వదులుకుని నాకు తోడుగా నిలబడ్డాడు”
“భయపడ్డారా?”
“భయం దేనికి? నీకు తోడుగా నిలబడ్డ మనిషి నువ్వు తప్పుచెయ్యలేదని భరోసా ఇచ్చాక?”
“…”
“ఇద్దరం వెనుదిరిగి వచ్చేసాం. మా పెళ్ళిపెద్ద దగ్గిరకి వెళ్తే ఆయన చెన్నపట్నంలో వుండే ఒక వకీలు దగ్గరికి వుత్తరం ఇచ్చి పంపాడు. నా భర్త ఇవన్నీ ఇలా జరుగుతాయని వూహించినట్టున్నాడు, తన పట్టాలు, కొంత డబ్బు కూడా ముందే తెచ్చుకున్నాడు. ఆయన ప్లీడరు చదివాడు. మేము వెళ్ళిన వకీలు దగ్గిర జూనియరుగా కుదురుకున్నాడు. చిన్న సంపాదన. ఎలా సర్దుకున్నామో మాకే తెలియదు. అమ్మాయ్, అమ్మానాన్నలు ప్రేమించని పిల్లల జీవితాలు చాలా దుర్భరంగా వుంటాయి. వాళ్ళ మనుగడ అత్యంత కష్టం. మాలాంటివాళ్ళని ప్రోత్సహించే సంఘసంస్కర్తలు కొందరు తప్పితే ప్రపంచమంతా మాకు ఎదురుతిరిగిందనే అనిపించింది ఆ రోజుల్లో. ప్రసవాలప్పుడు స్నేహితులే తప్ప ఎవరూ దగ్గర లేరు. పిల్లలు పెరిగాక మన స్కూళ్ళలో చదవనివ్వలేదు. ఏటికి ఎదురీదాం. “
తల్లీ, తండ్రీతో సహా అందరూ తనని దూరంపెట్టడం మనసులో మెదిలింది సంయుక్తకి.
“నేను కోరుకున్నదేమిటి? పదిమంది పిల్లలు, పెద్దాపిన్నా ఇంటినిండా మనుషుల్తో పుచ్చపొదలాంటి ఇంటిని కలగన్నాను. కానీ నాకు లభించినదేమిటి? తనూ, నేనూ… తను బయటికి వెళ్తే రోజంతా బిక్కుబిక్కుమంటూ వంటరిగా నేను. చదువుకొమ్మని ప్రోత్సహించారు. నిరక్షరకుక్షిని… రెండేళ్ళు పట్టింది నాకు మెట్రిక్కి తయారవడానికి. .. నిజం చెప్పొద్దూ… మీకందరికీ ఆ సొగసు తెలీదులే… మనం మాట్లాడుకునే మాటలన్నీ అక్షరాల పంక్తులుగా మారి కళ్ళముందు కనిపిస్తుంటే మనసుకి ఎంత సంతోషం వేసేదో… ఆంధ్రామెట్రిక్ర్ రాసాను. ఆ తర్వాత నేనింక ఆగలేదు. లా పట్టా చేతికి వచ్చేదాకా… ఇంతలో ఇద్దరు పిల్లలు పుట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక, మేము నెమ్మదిగా కదిలి విశాఖపట్టణం వచ్చేసాం”
“చాలా విషయాలు తెలుసును మీకు” ప్రశంసగా అంది సంయుక్త.
“మాకాలంలో జరిగిన విషయాలవి. నాకు ద్వితీయం జరిగాక బైటి ప్రపంచం విశాలమైనదనీ నేనొక కూపస్థ మండూకంలా బతికాననీ అనుకున్నాను చాలారోజులు. కానీ ప్రపంచమే ఒక పెద్ద కూపమనీ దాన్ని విడిచి నేనే బయటికి వచ్చాననీ అర్థమైంది”
” మీవాళ్ళెవరూ మీదగ్గిరకి రాలేదా?”
“నాకు ప్లీడరుగా కొంత పేరు వచ్చాక నా తమ్ముడనేవాడొకడు వచ్చాడు. నేనని వాడికి తెలీదు. శారదాచట్టం గురించి చెప్పానుకదా? అది వచ్చాక మరీ పసిపిల్లలకి మానేసి కాస్త ఈడేరిన పిల్లలకి అంటే వ్యక్తురాలవగానే చేసేసేవారు. మగవాడికి… ముఖ్యంగా మధ్యతరగతి బూటకపు విలువల్లో చాలీచాలని సంపాదనల్తో బతుకుతున్నవాడికి భార్యని మించిన వినోదం మరొకటి అందుబాటులో వుండదు. దాంతో తినడానికి తిండి లేకపోయినా ఏటా పిల్లలు… బాలింతతనం వదలకుండానే మళ్ళీ గర్భాలు… పీల్చి పిప్పి చేసేవారు. అలాగ పిప్పిపిప్పిలా, కళ్ళలో ప్రాణం పెట్టుకుని వున్న వాడి కూతుర్ని తీసుకుని నా దగ్గిరకి వచ్చాడు. పాతికేళ్ళుకూడా వుండవు దానికి. ఆరుగురు పిల్లలట. దాన్ని వదిలేసి భర్త మరో పెళ్ళి చేసుకుందామని చూస్తున్నాట్ట. ఎలాగేనా వాళ్ళ కాపురం నిలబెట్టమని అడిగాడు. ఆ పిల్లకి కూడా చావో రేవో భర్తతోటేగానీ వదిలేసికాదు. మనోవర్తి ఇప్పిస్తాను, నీ బతుకు నువ్వు బతకమని చెప్పాను. నేను చెప్పినది వాళ్ళకి నచ్చలేదు. మరో ప్లీడరు దగ్గిరకి వెళ్ళిపోయారు. వాడు చెప్పిన వివరాలవల్ల తెలిసింది, నాకు తమ్ముడని. అమ్మానాన్నలగురించి అడిగాను. అడగకుండా వుండలేకపోయాను-నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. మమ్మల్ని సాటివాళ్ళంతా వెలివేసారు. నాన్న వాళ్ళ కాళ్ళమీద పడి బతిమాలితే జన్మలో నీ ముఖం చూడనని ఒట్టేయించుకుని, నీకు కర్మకాండ చేసాక మళ్ళీ కలుపుకున్నారు. ఒసేవ్, నీకు యేటా తద్దినం పెడుతున్నాడులే నాన్న- అన్నాడు.
నాకు వళ్ళుమండింది. బతికున్నవాళ్ళకి పిండం పెడితే దాన్ని పిశాచాలు అందుకుని మళ్ళీ జన్మలో పిల్లలుగా పుడతాయని చెప్పు పోరా, ఆయనకి – అని వెళ్ళగొట్టాను”
సంయుక్త ఏమీ మాట్లాడలేదు. ఒక విషాదం ఆమె మనసుని కమ్ముకుంది.
” నాకు ఎలాంటి సిద్ధాంతాలూ తెలీవు. నాకు తెలిసిన ప్రపంచంకూడా చాలా చిన్నది. అమ్మానాన్నలకి ఒక్కదాన్నే. చాలా గారంగా పెంచారు. అది ఒక పార్శ్వం. మా మేనత్తా, బావల దాష్టీకం రెండో పార్శ్వం. నాణానికి రెండు ముఖాల్లా వుండేవి”
“అవసరాలకోసం సిద్ధాంతాలూ, సిద్ధాంతాలకోసం అవసరాలూ పుడతాయి. వాటికి పేర్లు మనమే పెట్టుకోవాలి. నాకు నిన్ను చూసాక చాలా ఉత్తేజం కలిగింది. నీలాగ స్పిరిట్ వున్న పిల్లల్ని ఈమధ్యకాలంలో నేను చూడలేదు. మా పెళ్ళైన కొత్తల్లో వితంతువివాహాలు జరిగేవి. అంతే. తర్వాత ఆగిపోయాయి. అన్యాయానికి బలైపోయాక అయ్యో అని వోదార్చుకోవటాలే చూసాను నా జీవితం అంతా. వరకట్నం చావులు… బలాత్కరిస్తే వాడినే పెళ్ళిచేసుకోవటాలు … యంత్రపుమనుషుల్లా పిల్లల్ని కనికని అలిసిపోవటాలు… ఎన్నని? “
“మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. నేను మీ అందరంత చదువుకోలేదు. ఇలాంటి కుటుంబంలోకి రావటం అదృష్టమనే అనుకుంటాను”
“అలా ఎప్పుడూ అనుకోకు. నీ విలువ నీదే. ఇవన్నీ మనకోసం మగవాళ్ళే సృష్టించి పెట్టిన విలువలు. మనకి కష్టాలు తెచ్చిపెట్టినదీ వాళ్ళే. సంయుక్తా! చిన్న ప్రపంచంలో పెద్ద సమస్యని దాటుకుని వచ్చావు. నీకు పెద్దప్రపంచాన్నీ, ఇంకా పెద్ద సమస్యనీ పరిచయం చేసాను. నా గురించి నీకు ఎంతో కొంత అర్థమై వుంటుంది. నిర్మల తల్లి…కాత్యాయనితో మొదలుకుని శ్రీధర్‍దాకా నాతో అనుబంధం పెంచుకుని పెరిగిన పిల్లలు. మనకి ఒక కష్టం రాగానే అదెంత పెద్దదైనసరే, మనని సమూలంగా మార్చదు. మనం ఎంతో కొంత మిగిలే వుంటాము. ఆ మిగిలిన నువ్వు వీళ్ళని అర్థం చేసుకుని సంతోషంగా వుండు. మేమంతా నీ వెనక వున్నాం. నీ పిల్లలకి కూడా ఎలాంటి లోటూ వుండదు. చక్కగా పెంచుకోండి ” అందావిడ.
సంయుక్త తలూపింది. “ఆ విషయం కూడా అర్థమైంది ఈవేళ” అంది.
“ఈ విషయాలన్నీ ఇంత అర్జెంటుగా మాట్లాడుకునే అవసరం లేదు మామూలుగానైతే. కానీ నా వయసు దృష్టిలో వుంచుకుని దేన్నీ నేను వాయిదా వెయ్యను” అంది కాంతామణి.
ఒక్క క్షణం సంకోచించి అంది సంయుక్త, “నాకు చాలా మామూలు జీవితం… అతనికి వండి పెడుతూ, పిల్లల్ని చూసుకుంటూ అందర్లా బతకాలని వుండేది. అది ఒక తీరని కల అని అర్థమయ్యాక… చచ్చిపోవాలనుకున్నాను. శ్రీధర్ విషయంలో ఇలా స్వతంత్రించవచ్చో లేదో నాకు తెలియదు… తనందించిన చెయ్యి తిరస్కరించలేకపోయాను. తన విషయంలో మీకందరికీ ఏవేనా ఆశలు వున్నాయేమో, వాటిని నేను భంగపరిచానేమో … పెద్దమనసు చేసుకుని క్షమించండి” ఆమె గొంతు వణికింది.